Monday 5 February 2024

గోబెల్స్ ప్రచారం వేరు, ప్రభుత్వాన్ని నడపడం వేరు!



మనకు కనిపించే రాజకీయాలు వేరు, మనకు కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్ర్యం రాకముందటి నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్. 

వంద సంవత్సరాలుగా తన పార్టీ కొనసాగిస్తున్న రాజకీయ సంస్కృతి బాటలోనే నడుస్తూ, ఒక బలమైన యుద్ధతంత్రంతో దూకుడుగా శ్రమించి తను అనుకున్నది సాధించగలిగారు రేవంత్ రెడ్డి. ఆయన పాటించిన ఆ యుద్ధతంత్రం ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా అన్నది వేరే విషయం. ఆ యుద్ధతంత్రానికి ఆక్సిజన్ అందించిన అత్యంత నికృష్టమైన గోబెల్స్ ప్రచారానికి కూడా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరోక్షంగా సహకరించిందన్న విషయం కూడా ఇక్కడ అప్రస్తుతం. ఒక పటిష్టమయిన యుద్ధప్రణాళికతో ఎలాగైతేనేం రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజలు కూడా నిజంగానే అదేదో "మార్పు" అవసరమేమోనని అమాయకంగా నమ్మారు. ఆత్మహత్యాసదృశమైన ఆ మార్పుకి కారణమయ్యారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సంతోషం. ఇక్కడివరకూ ఓకే. ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

కట్ చేస్తే - 

ఒక వ్యక్తిలో ఉండే భాషా పటిమ, వ్యక్తీకరణలే ఆ వ్యక్తిని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి. మనం వాడే భాష మన సంస్కృతిని తెలుపుతుంది, మనమేంటో తెలుపుతుంది. ఫక్తు రాజకీయాలకోసం... ఏమైనాసరే ప్రజల్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవడం కోసం... ఎన్నికలకి ముందు ఏదిపడితే అది మాట్లాడితే చెల్లిందని, ఇప్పుడు కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కుదరదు. అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో జరుగుతున్నది అదే. 

మార్పు మాయలో పడి కొట్టుకుపోతూ... అమాయక తెలంగాణ ప్రజలు బంగారు పళ్ళెంలో అధికారం అందించి, ముఖ్యమంత్రిని చేసినందుకు దాన్ని కాపాడుకోవాలి. ఆ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లెక్కలేనన్ని అంశాల్లో దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ స్థాయి నుంచి మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళే కృషి చెయ్యాలి. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కేసీఆర్ వేసిన ఎన్నో కొత్తదారుల్ని మరిన్ని కొత్తపుంతలు తొక్కించడం మీద దృష్టిపెట్టాలి. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. కాని, దురదృష్టవశాత్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అలా జరగటం లేదు. 

తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. తెల్లారి లేస్తే - ఇంకా కేసీఆర్‌తో, బీఆరెస్ పార్టీతో కొట్లాడుతున్నా అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాను కొనసాగించాల్సిన మహాయజ్ఞం బహుశా ఇదే ఇదే కొట్లాట, ఇదే తిట్ల పర్వం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. 

అందుకేనేమో - ముఖ్యమంత్రి హోదాలో దావోస్ వెళ్ళినా అవే తిట్లు, లండన్ వెళ్ళినా అవే చెత్త మాటలు, ఎక్కడ మైక్ కనిపించినా అవే అరుపులు కేకలు, అవే బూతు పురాణాలు. 

"కేసీఆర్‌కు గోరీ కడతా", "బీఆరెస్‌ను వంద అడుగుల లోతున బొందపెడ్తా", "కేసీఆర్ చార్లెస్ శోభరాజ్", "కేసీఆర్‌కు సిగ్గులేదు", "సోయిలేని సన్నాసి కేసీఆర్", "జేబులు కొట్టేటోడు", "చెయిన్లు పీకెటోడు", "కేసీఆర్ మాఫియా", "బిడ్డా బయటికొస్తే బోన్లేసి బొందపెడ్తం"... అసలేందీ మాటలన్నీ? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడవల్సిన మాటలేనా?         

అడ్డా మీద కూలీస్థాయి నుంచి తర్వాత స్థాయికి ఎదిగిన ఒక గుంపుమేస్త్రీ కూడా కొంచెం ఒద్దికగా ఒక లెవెల్ మెయింటేన్ చేస్తాడు, ఆచి తూచి మాట్లాడుతాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంకెంత జాగ్రత్త పడాలి? తన మీద, తన "మార్పు" ఆయుధం పైన అపారమైన నమ్మకం పెట్టి గెలిపించిన ప్రజల్లో ఇంకెంత గౌరవం పెంపొందించుకోవాలి? కాని, అలా జరగడం లేదు. యథారాజా తథా ప్రజాలా... రేవత్ రెడ్డి ప్రభుత్వంలోనివాళ్ళు, పార్టీలోనివాళ్ళు కూడా "తొడలు కొడ్తే గుండెలు పగుల్తాయ్" అంటూ అదే స్థాయి తిట్ల దండకం, అదే స్థాయి భాషను వాడుతుండటం మరింత శోచనీయం.   

డిసెంబర్ 9 నుంచి అమలు చేసితీరతామని సవాల్ చేసిన 6 గ్యారంటీల అమలు ఎంత కష్టమో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యాక బాగా అర్థమైంది. అరకొరగా అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల కొత్త ఇబ్బందులు, కొత్త నష్టాలు మొదలయ్యాయి. ఆటోవాలాల జీవితం దుర్భరమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుబంధు గురించి అడిగితే చెప్పు దెబ్బలంటున్నారు. కరెంటు కట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఒక రొటీన్ అయిపోయింది. గత పదేళ్ళుగా రాష్ట్రంలో ఎలాంటి అసౌకర్యం, కరెంట్ కోత లేకుండా జెట్ స్పీడ్‌తో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్ళిన పరిశ్రమల అధినేతలంతా ఇప్పుడూ బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని పరిశ్రమలు, కంపెనీలు పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రేవంత్ రెడ్డి దృష్టిపెట్టాల్సింది ఇటువైపు. "కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, అప్పులపాలు చేశాడు" అని తిప్పిందే తిప్పి, అదే పాచిపండ్ల పాట రికార్డును పదే పదే వేయడం పైన కాదు. 

కట్ చేస్తే -

అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశాల్లో పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా... ఆ దేశాల అభివృద్ధి-సంక్షేమ పథకాలు, పనులు ప్రధాన ఎజెండాగా ఉండే బ్లూప్రింట్ మారదు. మరింత బాగా పనిచేస్తూ సొంత పార్టీ ఇమేజ్‌ను ప్రజల్లో పెంచుకొనే ప్రయత్నం చేస్తారు తప్ప, ఎదుటి పార్టీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలను బొందపెట్టరు. మరింత పోటీపడి ప్రజలకోసం, దేశం కోసం కృషి చేస్తారు. అందుకే ఆ దేశాలు అంత శక్తివంతమైన దేశాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేళ్ళలో అలాంటి దృక్పథంతో కృషిచేశారు. తానొక్కడే ఇంకో వందేళ్ళు పాలించాలనుకోలేదు. తన తర్వాతి తరం వాళ్లకు కొత్తదారులు వేశారు. గత 60 ఏండ్లుగా ఎవ్వరూ సాధించలేని ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలను, పనులను కేవలం నాలుగైదేళ్ళలో అత్యంత విజయవంతంగా సాధించి చూపించారు. దేశంలోనే తెలంగాణ ఒక నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడటానికి ఎలా ఆలోచించాలో, ఎంతగా కృషిచేయాలో చూపిస్తూ ఒక కొత్త రెడ్ కార్పెట్ దారి వేసిపెట్టారు కేసీఆర్. 

ఆ రెడ్ కార్పెట్‌పైన హుందాగా నడుస్తూ, ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరెంతో సాధించాలి. తన మీద నమ్మకం పెట్టుకొన్న ప్రజలను మెప్పించాలి, ఆ ప్రజల జీవనస్థాయి మెరుగుపడటం కోసం ఏదైనా చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప, "రేవంత్ రెడ్డి" అనగానే అరుపులు కేకలు, బోన్ల పెడ్తా, బొంద పెడ్తా వంటి మాటలు తప్ప ఏం లేదు అనుకునేలా చేసుకోవడం నిజంగా బాధాకరం. ఇదిలాగే కొనసాగితే మాత్రం - మార్పు కోరిన అదే తెలంగాణ ప్రజలు ఇంకో సిసలైన మార్పుని వీలైనంత త్వరలోనే సాధించుకొంటారు. 

- మనోహర్ చిమ్మని 

(ఈరోజు "నమస్తే తెలంగాణ" ఎడిట్ పేజీలో వచ్చిన నా ఆర్టికిల్.) 

No comments:

Post a Comment