Friday 30 September 2016

ది బిగ్ బిజినెస్!

ఒక కళ.
ఒక ఆకర్షణ.
ఒక మాండ్రెక్స్ మత్తు.
ఒక మాయ.
ఒక జూదం.
ఒక జీవితం.

సినిమా గురించి పైన చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షరాలా నిజం.

కాకపోతే .. ఒక్కో సినిమా సెటప్‌ని బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి, ఆయా వ్యక్తుల అనుభవాలను బట్టి ఈ నిర్వచనాలు మారుతుంటాయి.

నలభై కోట్లు పెట్టి - ఓ బ్రాండెడ్ హీరోతో, మరో బ్రాండెడ్ డైరెక్టర్ ఏడాదిపాటు చెక్కిన ఒక తెలుగు సినిమాను రెండే రెండు గంటల్లో ప్రేక్షకుడు "చెత్త సినిమా" అనో, "వేస్ట్" అనో ఒక్క మాటలో తేల్చిపడేయొచ్చు.

మరోవైపు .. కేవలం ఓ నలభై లక్షల్లో కొత్తవాళ్లతో తీసిన ఒక మైక్రో బడ్జెట్ సినిమాను చూసి, అదే ప్రేక్షకుడు "బాగుంది" అని దాన్ని హిట్ చేయొచ్చు.

ఈ రెండు సినిమాల నిర్మాణంలో ప్రాసెస్ ఒకటే. రేంజ్ మాత్రమే వేరు.

ఒక సినిమా కంటెంట్ ఆ క్షణం ప్రేక్షకులకు నచ్చలేదు. మరొక సినిమా కంటెంట్ నచ్చింది. అంతే.


కట్ టూ ది బిగ్ బిజినెస్ -

పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు .. ఈ మూడు లేకుండా మన దేశంలో మనుషులు బ్రతకలేరు. టీవీ చానెల్స్ అస్సలు బ్రతకలేవు.

సినిమాకున్న పవర్ అది!

ఎవరు ఎన్ని చెప్పినా ఇదే నిజం. సినిమా ప్యూర్‌లీ ఒక పెద్ద బిజినెస్.

క్రియేటివ్ బిజినెస్.

"నాకసలు డబ్బు అక్కర్లేదు. మంచి సినిమా తీసిన పేరు, సంతృప్తి చాలు" అని చెప్పగలవాళ్లు నిజంగా ఎంతమందున్నారు? ఎంతమంది అంత సింపుల్‌గా, అంత భారీ రేంజ్‌లో డబ్బులు కోల్పోడానికి ఇష్టపడతారు?

ఒకవేళ ఎవరయినా అలా చెప్పి, డబ్బులు అసలే వచ్చే అవకాశంలేని ఒక అద్భుతమయిన ఆర్ట్ సినిమా తీసినా .. అందులో కూడా పెద్ద బిజినెస్ ఉంది.

తన పేరు, సంతృప్తికోసం సినిమా తీస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా నథింగ్ బట్ బిజినెస్!

సో, కమర్షియల్ సినిమాలు తీసినా, ఆర్ట్ సినిమాలు తీసినా .. ఎవరికయినా ముందు కావల్సింది సినిమా మీద ప్యాషన్.

ఆ ప్యాషన్‌తోనే ఇప్పుడు మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిలో ఫీల్డులోకి దిగాన్నేను. 

పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్‌తో, తక్కువ రోజుల్లో ఎక్కువ సినిమాలు తీయడమే నా ప్రధాన లక్ష్యం.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు.

భారీ స్థాయిలో డబ్బూ, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా.

ఒక బిగ్ బిజినెస్.   

Thursday 29 September 2016

ఇప్పుడు కావల్సింది ఒక్క హిట్!

డబ్బు, సెలెబ్రిటీ హోదా, నానా ఆకర్షణలు, వివిధ రంగాల్లోని వి ఐ పి స్థాయి వ్యక్తులతో పరిచయాలు, పవర్‌ఫుల్ నెట్‌వర్క్ ..

ఇంకేం కావాలి?

సినీ ఫీల్డులో ఇవన్నీ ఉన్నాయి.

ఎవరెన్ని చెప్పినా, ఎన్ని నీతులు వల్లించినా .. సినిమా అనేది ఓ పెద్ద క్రియేటివ్ బిజినెస్.

మాగ్నెట్‌లా జివ్వున లాగే గ్లామర్ ఫీల్డ్. పట్టుకుందంటే వదలని ఓ పెద్ద అడిక్షన్.


కట్ టూ ది పాయింట్ - 

నిద్రపోతావో, నిశాచరుడివవుతావో ..  కష్టపడతావో, కన్నీళ్లే పెడతావో .. పరుగెడతావో, పరిగెత్తిస్తావో .. హార్డ్ వర్కో, స్మార్ట్ వర్కో .. అంతా నీ ఇష్టం.

మొత్తానికి నువ్వొక పని రాక్షసుడివి అయిపోవాలి.

నీ ఫోకస్ అంతా నీ ఏకైక లక్ష్యం మీదే ఉండాలి.

అప్పుడే .. ఈ మార్కెట్ స్టడీలు, హిట్ ఫార్ములాలు, సక్సెస్ సూత్రాలు, ఓపెనింగ్ ఫంక్షన్లు, క్లోజింగ్ పార్టీలు, ప్రెస్ మీట్లు, ఫ్లెక్సీలు, అదృష్ట సంఖ్యలు, సెంటిమెంట్లూ, తొక్కా .. ఇవేవీ నీకు వినిపించవు. కనిపించవు.

అప్పుడు .. అప్పుడు మాత్రమే, ఒకే ఒక్కటి .. నిన్ను వెదుక్కుంటూ వస్తుంది. నీ వెంటబడి వేధిస్తుంది. నిన్ను వరిస్తుంది.

హిట్!

ఆ ఒక్క హిట్‌తోనే, రాత్రికి రాత్రే .. నువ్వూహించని రేంజ్‌లో నీ జీవితం మారిపోతుంది.
ఎప్పటినుంచో నువ్వు కోరుకొంటున్న స్వేఛ్చ నీ సొంతమవుతుంది.

ఇక నీ జీవితం నీ ఇష్టం. నీ క్రియేటివిటీ నీ ఇష్టం.

ఏం సాధిస్తావో సాధించు.

ఏం జీవిస్తావో జీవించు.  

'ఒక్క ఛాన్స్' రోజులు పోయాయి!

'ఒక్క ఛాన్స్' అనేది ఇప్పుడు గతం.

ఆ రోజులు పోయాయి.

ఇప్పుడు ఎవరైనా యాక్టర్ కావొచ్చు. డైరెక్టర్ కావొచ్చు. సినీఫీల్డులో తనుకోరుకున్న ఇంకేదయినా కావొచ్చు.

ఫిలిం మేకింగ్‌లో వచ్చిన అత్యంత ఆధునిక డిజిటల్ టెక్నాలజీ .. ఊహించని వేగంతో ఎప్పటికప్పుడు అందులో వస్తున్న కొత్త డెవలప్‌మెంట్స్ మతిపోగొడుతున్నాయి.

అవన్నీ ఇప్పుడు .. మొత్తం సినిమా సీన్ నే మార్చేశాయి.

ఒక్క ఛాన్స్ అన్న ఈ పాతకాలం కాన్‌సెప్ట్‌ను ఒకే ఒక్క దెబ్బతో పూర్తిగా స్ట్రయికాఫ్ చేసేశాయి.


కట్ టూ కరెంట్ రియాలిటీ - 

కొంచెం లౌక్యం. మరికాస్త మానిప్యులేషన్. ఇంకాస్త డైనమిజమ్.

ఈ మూడు చాలు. మీలో ఉన్న ఏ కొంచెం టాలెంట్‌నయినా టార్గెట్ రీచ్ అయ్యేలా చేయడానికి!

సింపుల్‌గా చెప్పాలంటే .. గూగుల్ సెర్చ్ తెలిసిన ప్రతి ఒక్కరికీ, ఫేస్‌బుక్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ .. తను కోరుకున్నది ఏదైనా సాధించేసుకోగల ఛాన్స్ ఉన్న రోజులివి.

ఒక్క ఛాన్స్ అన్నది అసలు లెక్కే కాదు.


కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఐఫోన్‌లో సినిమాలు తీసి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు రివార్డులు కొడుతున్న ఈ రోజుల్లో .. మనకు ఆ "ఒక్క ఛాన్స్" వేరే ఎవరో ఇవ్వాలా?  

ఆలోచించండి ..    

Tuesday 27 September 2016

చెరువుతో సెల్ఫీ

60 ఏళ్లుగా, ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కలలో కూడా ఊహించని ప్రాజెక్టు "మిషన్ కాకతీయ".

మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మానస పుత్రిక.

"మన ఊరు, మన చెరువు" ఈ ప్రాజెక్టు ట్యాగ్‌లైన్!

ఊ అంటే 'టైటిల్స్, ట్యాగ్‌లైన్స్' అంటూ నానా కంగాళీ చేసే మా సినిమావాళ్లు కూడా పెట్టలేని మంచి ట్యాగ్‌లైన్ ఇది అని చెప్పడానికి నేనేం సంకోచించడంలేదు.

గత 12 మార్చి 2015 నాడు ప్రారంభమైన ఈ మిషన్ కాకతీయ, చూస్తుండగానే కేవలం 18 నెలల్లో ఒక నమ్మలేని నిజమైంది.

ఈ ప్రాజెక్ట్ ఇంత వేగంగా, ఇంత సమర్థవంతంగా సఫలమైందంటే కారణం ఒకే ఒక్కడు - తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు.

ప్రజలను, రైతులను, దాతలను, వివిధ శాఖల్లో పనిచేసే అధికారులను .. వారూ వీరూ అనికాకుండా, అందరినీ కలుపుకుపోతూ, కార్యోన్ముఖుల్ని చేస్తూ, అత్యంత వేగంగా, సమర్థవంతంగా, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ .. పనుల్ని పూర్తికావించారు హరీష్ రావు.

మిషన్ కాకతీయ ఫలితాల్ని ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నాం.

హృదయం ఉప్పొంగే ఆ ఫీలింగ్‌ను మనసారా అనుభవిస్తున్నాం.

మంత్రి హరీష్ రావు గారి గురించి, వారి సామర్థ్యం గురించి మరోసారి మరో బ్లాగులో వివరంగా రాస్తాను.


కట్ టూ మిట్టా సైదిరెడ్డి -   

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ సోషల్ మీడియా పాత్ర అద్భుతం. రాష్ట్ర అవతరణ తర్వాత కూడా ఆ అద్భుతం సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతోంది.

రెట్టించిన ఉత్సాహంతో.

ఎక్కడో ఒకటీ అరా పొరపొచ్చాలుంటాయి. అది సహజం. అలా లేకపోతేనే కష్టం, నష్టం కూడా. ఒక విధంగా స్వేఛ్చ లేదని అర్థం.

కానీ, మనకా సమస్య లేదు.

సంపూర్ణ స్వేఛ్చ ఉంది.

ధరణి కులకర్ణి, సుశీలా రెడ్డి, మహాలక్ష్మి, శ్రీదేవి, రవి కాంత్, రాథోడ్, అసాంజే, సాదిక్, తుమ్మల, భండారీ, సంపత్ పరీక్, కరుణాకర్ దేశాయ్ అన్న, కట్పల్లి, వినయ్, నవీన్, ఏ ఎస్ ఆర్, బాచి, అంబటి, ధాము, భరత్, నవీద్, ఫయాజ్, కొత్తపల్లి, ఓరుగంటి, రవి, చేగో, గాంధీ  .. ఇలా నాకు తెలిసినవే కనీసం ఒక 100 పేర్లు చెప్పగలను. తెలియనివి లెక్క లేదు.  (అందరి పేర్లూ రాయడం కష్టం. సో, ఇక్కడ పేర్లు మెన్షన్ చేయని సోషల్ మీడియా మిత్రులు నన్ను మన్నించాలి.)  

కేవలం తెలంగాణ కోసం, టి ఆర్ ఎస్ కోసం, కె సి ఆర్ కోసం పనిచేసిన ఈ సోషల్ మీడియా మిత్రులందరిదీ నిజంగా నిస్వార్థ సేవ.

అలాంటి సోషల్ మీడియా మిత్రుల్లో ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడి రాతలు గెరిల్లా దాడుల్లా, రెనగేడ్ ఎటాక్‌ల్లా ఉండేవి. రాష్ట్ర అవతరణ తర్వాత ఈ రకమైన సోషల్ మీడియా ఎటాక్ ఒక తప్పనిసరి అయింది.

ఏ వార్నింగ్‌లకూ బెదరకుండా, ఈ ఖాళీని పూర్తిచేసిన ఆ సోషల్ మీడియా యోధుడే నా మిత్రుడు మిట్టా సైదిరెడ్డి. ప్రస్తుతం మన ప్రియతమ సి ఎం, కె సి ఆర్ గారి పి ఆర్ ఓ.

ఇప్పుడీ బ్లాగ్ నేను రాయడానికి ఇన్స్‌పిరేషన్ .. ఇవాళ్టి ఆయన పోస్టు: "చెరువుతో సెల్ఫీ".

తెల్లారి లేస్తే ఎక్కడ చూసినా సెల్ఫీలే. పనికొచ్చేవి. పనికిరానివి. ప్రమాదకరమైనవి. ఎన్నో ..

ఇన్ని సెల్ఫీలు తీసుకొనే మనం .. మనకు దగ్గర్లోని, లేదా మన ఊరిలో ఈ వర్షాలకు నిండిన మన చెరువుతో ఒక సెల్ఫీ తీసుకొని ఎందుకు పోస్ట్ చేయకూడదు?

మనం రోజూ పోస్ట్ చేసే ఏ సెల్ఫీతో పోల్చుకున్నా .. ఈ సెల్ఫీకుండే విలువ, ప్రయోజనం, స్పూర్తి, సంతోషం, సంతృప్తి వేరు.  

చిన్న ఐడియా. మంచి ఐడియా.

అతి తక్కువకాలంలోనే మన తెలంగాణ  రాష్ట్రం సాధించిన విజయాల్లో ఒక ప్రముఖమైన విజయాన్ని ప్రపంచానికి తెలిపే ఐడియా.

ఈ అద్భుతమైన ఆలోచన మదిలో మెదలడంతోనే పోస్ట్ చేసిన మన మిట్టా సైదిరెడ్డి అన్నకు నా హార్దిక అభినందనలు.

ఇలా పోస్ట్ చేయడం ఆలస్యం .. చెరువుతో సెల్ఫీలను చకచకా పోస్ట్ చేస్తున్న మన తెలంగాణ సోషల్ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు ..


కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఈ సెల్ఫీల్లో .. నేను, నా కొత్త సినిమా టీమ్ మెచ్చిన  "చెరువుతో ది బెస్ట్ 3 సెల్ఫీ" లకు, నా సినిమా ఆడియో ఫంక్షన్‌లో, వేదిక మీద ఆహూతులైన మన గౌరవ అతిథుల చేతులమీదుగా .. మా టీమ్ తరపున నగదు బహుమతి, మొమెంటోలను అందజేస్తాము.

ఇంక ఆలస్యం దేనికి?

మన ఊళ్లోని మన చెరువుతో సెల్ఫీ దిగండి. పోస్ట్ చేయండి.

బెస్ట్ విషెస్ ..

Thursday 22 September 2016

"సెల్యులాయిడ్ సైంటిస్ట్" సింగీతం!

పుష్పక విమానం, విచిత్ర సోదరులు, సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, మైఖేల్ మదన కామ రాజు, భైరవద్వీపం, ఆదిత్య 369, మేడమ్, మయూరి  ..

ఇవి మచ్చుకే.

ఇంకెన్నో సినిమాలు ..

కొన్నయితే అసలు మనం ఊహించని సబ్జక్టులు!

ఎన్నో అవార్డులు, రివార్డులు.

ఒక్క డైరెక్షనే కాదు. రచయిత, సంగీతజ్ఞుడు, నిర్మాత .. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఇవన్నీ ఒక ఎత్తయితే, ఫిలిం మేకింగ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతి కొత్త ఆవిష్కరణతో ఆయనకు పరిచయం ఉంటుంది. అంతటి నిరంతర అధ్యనశీలి ఆయన.

అయినా, నిగర్వి. నిరాడంబరుడు.

వారే సింగీతం శ్రీనివాసరావు గారు.

ఒక పదేళ్లక్రితం అనుకుంటాను.

చెన్నైలోని సింగీతం గారి ఇంట్లో వారి ఇంటర్వ్యూ తీసుకున్నాన్నేను. దాదాపు ఒక రెండున్నర గంటల ఇంటర్వ్యూ అది. దానికోసం రోజంతా ఎంతో ఓపిగ్గా నాతో కూర్చున్నారు. 

నేను రాయాలనుకుంటున్న ఒక పుస్తకం కోసం నాకవసరమైన సమాచారాన్ని సేకరిస్తూ, అందులో భాగంగా, సింగీతం గారిని కూడా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. 

సోనీ వాక్‌మాన్‌లో నేను రికార్డ్ చేసిన ఆ క్యాసెట్స్ ఇప్పటికీ నాదగ్గర భద్రంగా ఉన్నాయి.


కట్ టూ రామానాయుడు గెస్ట్ హౌజ్ -   

ఒకరోజు పొద్దున్నే సింగీతం గారి నుంచి నాకు కాల్ వచ్చింది. తను హైద్రాబాద్ వచ్చిందీ, వచ్చి ఎక్కడున్నదీ చెప్పారు. వీలు చూసుకొని రమ్మన్నారు.

నేను వెంటనే బయల్దేరి వెళ్లాను.

ఫిల్మ్ నగర్‌లో అది రామానాయుడు గెస్ట్ హౌజ్.

నేను వెళ్లేటప్పటికి చాలా సింపుల్‌గా తన బ్యాగ్‌లోంచి బట్టల్ని తీసి ఇస్త్రీకోసం అనుకుంటాను .. ఒక కుర్రాడికిస్తున్నారు. ఆ కుర్రాడికి సింగీతం గారు ఎవరో ఏం తెలుసు? చాలా కేర్‌లెస్‌గా ఆ బట్టల్ని అక్కన్నుంచి తీసుకెళ్లాడు.

ఇంతలో గదిలోకి ఇంకో బాయ్ వచ్చాడు ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌తో. ఆ కుర్రాడికి కూడా తెలీదనుకుంటాను, సింగీతం గారు ఎవరో. చాలా నిర్లక్ష్యంగా ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న నన్ను చూసి చిరునవ్వు నవ్వారాయన.

ఆయన ఇవన్నీ పట్టించుకోరు.

తన పని గురించి మాత్రమే ఆయన ఆలోచనంతా.

ఒక తపస్సులా.


కట్ టూ పుష్పక్ స్టోరీ బోర్డు - 

చెన్నైలో సింగీతం గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారి  "పుష్పకవిమానం" సినిమా స్టోరీబోర్డులోంచి ఒక సీన్ అడిగితీసుకున్నాన్నేను. నా పుస్తకంలో దాన్ని అలాగే స్కాన్ చేసి ప్రింట్ చేయడానికి.

సింగీతం గారు వారి సినిమాలకు వారే స్వయంగా స్టోరీబోర్డు వేసుకుంటారు. దర్శకులు బాపు గారిలాగే.

(బాపు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారి దగ్గర కూడా "పెళ్లిపుస్తకం" సినిమాలోని ఒక పూర్తి సీన్ స్టోరీబోర్డు అడిగితీసుకున్నాను. అది వేరే విషయం. ఆ జ్ఞాపకం గురించి మరోసారి రాస్తాను.)

సింగీతం గారు ఆరోజు నాకిచ్చిన స్టోరీబోర్డు, తన షూటింగ్ టైమ్‌లో తనకోసం స్పీడ్‌గా వేసుకున్నది కాబట్టి అంత క్లారిటీ లేదని వారి ఉద్దేశ్యం. నా పుస్తకం కోసం దాన్ని స్కాన్ చేసి, ప్రింట్‌చేసినప్పుడు టెక్నికల్‌గా అదంత బాగా రాకపోవచ్చునని వారికి తెలుసు.

అంతకు రెండువారాల క్రితం, "పుష్పకవిమానం" సినిమాలోని నాకిచ్చిన అదే సీన్ స్టోరీబోర్డును వారు మళ్లీ ఫ్రెష్‌గా వేసి తీసుకొచ్చారు. అది నాకివ్వడం కోసం ఆరోజు నాకు ఫోన్ చేసి పిలిచారు!

దటీజ్ సింగీతం గారు.

అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు, పుష్పకవిమానం లాంటి అద్భుతాలు క్రియేట్ అయ్యాయంటే ఎందుక్కావు మరి?

85 ఏళ్ల వయస్సులోనూ పాతికేళ్ల కుర్రాడాయన. ఆలోచనలోనూ, ఆవిష్కరణలోనూ నిత్య యవ్వనుడాయన.

ఇవాళ సింగీతం గారి పుట్టినరోజు.

వారికివే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ..

ఈ సందర్భంగా, వారినుంచి మరెన్నో క్లాసిక్ సినిమాలు రావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే .. వారి క్రియేటివిటీ విషయంలో నాబోటివాళ్లకింకా దాహం తీరలేదు. 

Wednesday 14 September 2016

ఒక్క ట్వీట్ .. సీరీస్ ఆఫ్ సినిమాలు!

అంత ఈజీ కాదు.

ఎంత మైక్రో బడ్జెట్ సినిమా అయినా సరే, ఎంత కోపరేటివ్ సినిమా అయినా సరే .. బడ్జెట్ అంటూ దానికి ఒకటుంటుంది. కోట్లు కాకపోయినా, ఒక సినిమా పూర్తిచేయడానికి కొన్ని లక్షలయినా అవుతుంది.

అందులోనూ సీరీస్ ఆఫ్ సినిమాలంటున్నాం.

నిజంగా అంత ఈజీ కాదు. అయినా కమిట్ అవుతున్నాం.

ఇవి పిట్టలదొరల మాటలు కావు. మితిమీరిన ఆత్మ విశ్వాసం అంతకన్నా కాదు.

మామీద మాకున్న నమ్మకం.

మాతో కలిసిన, కలుస్తున్న, కలవబోతున్న మా లైక్‌మైండెడ్ టీమ్ మీద మాకున్న నమ్మకం. సినిమా ప్రియులయిన మీ అందరి శుభాశీస్సులు కూడా మాకుంటాయన్న నమ్మకం.


కట్ టూ హిందీ -

ఈ సీరీస్‌లో మా మొదటి సినిమా ఎనౌన్స్ చేసిన రోజునుంచి, తర్వాతి 365 రోజుల్లో ఒక నాలుగు సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయాలన్నది మా ప్రాధమిక లక్ష్యం.

వీటిలో కనీసం ఒకటి హిందీ ఉంటుంది.

మేం ప్లాన్ చేస్తున్న హిందీ సినిమా కూడా పక్కా ట్రెండీ కమర్షియల్ సినిమానే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రిప్రొడక్షన్ పనులు ప్రారంభమై కూడా చాలా రోజులైంది.

తెలుగు సినిమాలకు ఎలాగూ కష్టపడుతున్నాము. అంతే కష్టంతో హిందీలో  కూడా సినిమాలు చెయ్యొచ్చునని మా ఉద్దేశ్యం. అసలు హిందీ సినిమాపైన నా ప్యాషన్ గురించి మరోసారి వివరంగా రాస్తాను. ఇప్పటికి దాన్నలా వదిలేద్దాం.

మా హిందీ సినిమాల ప్రమోషన్, మార్కెటింగ్, రిలీజ్ వగైరాలు చూసుకోడానికి ముంబైలో మా నెట్‌వర్క్ మాకుంది. అది వేరే విషయం.


కట్ టూ ఎనౌన్స్‌మెంట్ - 

ఈమాత్రం దానికి  .. ఏదో భారీ కర్టెన్‌రెయిజర్‌లా ఇంత సీన్ అవసరమా .. అని చాలా మందికి అనిపిస్తుందని మాకు తెలుసు. కానీ, మాకిదంతా అవసరం.

మాకు సంబంధించినంతవరకు ఈ మొత్తం ప్రాజెక్టు, ఈ ప్రయత్నం, ఈ సందర్భం, దీని ఎనౌన్స్‌మెంట్ ఒక కిక్ .. ఒక లాండ్‌మార్క్!

మేం ప్రారంభిస్తున్న ఈ సీరిస్ ఆఫ్ సినిమాలు మా దృష్టిలో ఒక భారీ ప్రాజెక్టు. ఒక మహాయజ్ఞం. ఎన్ని ఇబ్బందులెదురైనా సరే సంతోషంగా ఎదుర్కొంటాం.

ప్యాషన్‌లో పెయిన్ ఉండదు. అంతా ప్లెజరే.

ఇప్పడున్న మా స్థాయికి ఒక మహాయజ్ఞం లాంటి ఈ మొత్తం ప్రాజెక్టులో నాతో కలిసి ప్రయాణం చేస్తున్న నా సహచరుడు మరెవరో కాదు. నా చీఫ్ టెక్నీషియన్స్‌లో ఒకరు, స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను పరిచయం చేసిన నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర!

మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యతతోపాటు, ప్రదీప్ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

ఈ నెల్లోనే, మరి కొద్దిరోజుల్లోనే, ఎవరూ ఊహించనివిధంగా, కొంచెం వెరైటీగా దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఉంటుంది. ఆ ఎనౌన్స్‌మెంట్ ప్రదీప్ ఇస్తాడు.

సో, ఓవర్ టూ మై ట్వీట్ .. మరొక్కసారి:

"365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన."

అండ్ నౌ .. ఓవర్ టూ మై డియర్ ప్రదీప్ .. 

Tuesday 13 September 2016

అసలేంటా ప్రొడక్షన్ కంపెనీ? ఎందుకు?

> మేం అనుకున్నట్టు .. ఎలాంటి బయటి వత్తిళ్ళు లేకుండా, ఎలాంటి మూసధోరణులకు బలవంతంగా లొంగకుండా, ఇండిపెండెంట్‌గా సినిమాలు చేసుకోడానికి.

> మేం అనుకున్నట్టు ప్లాన్ చేసిన టైమ్‌లోనే సినిమా పూర్తిచేయడానికి.

> మేం అనుకున్నట్టు కోపరేటివ్ సిస్టమ్‌లో సినిమాలు చేసుకోడానికి.

> మేం అనుకున్నట్టు గెరిల్లా/రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్ పధ్ధతుల్లో సినిమాలు చేసుకోడానికి.

> ఇండస్ట్రీలో ఎన్నాళ్లుగానో బూజుపట్టి పాతుకుపోయి ఉన్న పనికిరాని ఎన్నో బుల్‌షిట్ రూల్స్‌ను పట్టించుకోకుండా, మా సొంతరూల్స్‌తో మా సినిమాలు మేము చేసుకోడానికి.

> ఫిల్మ్ నెగెటివ్ వాడిన రోజుల్లోనే సంవత్సరానికి డజన్ సినిమాలు చేసి నిరూపించుకొన్న "దర్శకరత్న"లున్న ఇండస్ట్రీలో, ఇప్పుడీ డిజిటల్ యుగంలో కూడా సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా కూడా ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పడానికి.

> 365 రోజుల్లో కనీసం ఒక 4 సినిమాలైనా చేసి, రిలీజ్ చేసి, చూపించడానికి. తద్వారా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఎక్కువ పని కల్పించడానికి.

> ఎంత మైక్రో బడ్జెట్ అయినా, సినిమాలు తీయడానికి డబ్బు చాలా అవసరం. డబ్బుతోపాటు లైక్‌మైండెడ్‌నెస్ ఉన్న ఒక మంచి టీమ్ కూడా అవసరమని నిరూపించడానికి.

> మొత్తంగా .. మా క్రియేటివ్ లిబర్టీ కోసం మాకంటూ ఒక ప్రొడక్షన్ కంపెనీ అవసరం అనుకున్నాం. ఆ పని చేసేశాం.


కట్ టూ మా ప్రొడక్షన్ బ్యానర్ - 

ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. కాకపోతే, ఈ బ్యానర్ కేవలం సెకండరీ.

ఇంకో ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా అతి త్వరలో చేయించబోతున్నాము. ఈ నెల్లోనే ప్రకటించబోతున్న మా కొత్త సినిమా రూపొందుతున్న సమయంలో ఈ పని పూర్తిచేస్తాము.

అదే మా మెయిన్ బ్యానర్.

సో, అదీ మ్యాటర్:

"365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన."

ఎవరా ఇద్దరు టెక్నీషియన్‌లు?

కొన్ని చాలా విచిత్రంగా జరుగుతుంటాయి.

"ఈసారి అలా జరగదులే" అనుకుంటాం. కాని, ఊహించని విధంగా అది అలాగే మళ్ళీ జరిగితీరుతుంది!

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఇదెప్పుడూ ఉండేదే.

సినిమా అనుకున్నప్పటినుంచి, షూటింగ్ పూర్తయ్యి, కాపీ వచ్చేవరకు .. ప్రొడ్యూసర్ డైరెక్టర్ నుంచి, అఫీస్ బాయ్ వరకు అంతా చాలా కష్టపడతారు.

"ఇది మన ప్రాజెక్టు .. ఏదో సాధించబోతున్నాం" అన్న పాజిటివ్ ట్రాన్స్‌లో పనిచేసుకుంటూ పోతుంటారు.

కాపీ వచ్చేసిందా .. ఖతమ్.

ఎంటర్ ది డ్రాగన్!

ఉన్నట్టుండి ఎంటరవుతాయి కొన్ని కొత్త ముఖాలు, కొత్త క్యారెక్టర్‌లు.

అలా చివర్లో, రిలీజ్‌కు ముందు ఎంటరైన ఆ ఒకరిద్దరివల్ల, వారి క్రెడెన్షియల్స్ ఏంటో తెల్సుకోకుండా, వారి ఉచిత సలహాలను వినడంవల్ల .. మొత్తం సీనే మారిపోతుంది.    

జరక్కూడని నష్టానికి అప్పుడే, అక్కడే పునాదులు పడిపోతాయి. ప్లానింగ్‌లో ఊహించని మార్పులొచ్చేస్తాయి.

అంతా నిస్తబ్దత. నిరాసక్తత.

ఏం జరగబోతోందో టీమ్ మొత్తానికి ముందే తెలిసిపోతుంది.


కట్ టూ  ఆ ఇద్దరు టెక్నీషియన్‌లు -  

నెలలకొద్దీ ఒక ప్రాజెక్టును ప్రాణంగా తీసుకొని పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లంతా ఒక్కసారిగా హతాశులైపోతారు.

ప్రాజెక్ట్ సక్సెస్ అయితే  ప్రొడ్యూసర్ ఒక్కడికే కాదు .. అందరికీ బాగుంటుందని, డైరెక్టర్‌తో సహా మరొకరిద్దరు చీఫ్ టెక్నీషియన్‌లు కూడా తమ జేబుల్లోంచి ఖర్చుపెట్టుకొంటూ, అప్పులు చేసుకొంటూ పనిచేస్తుంటారు

ఇంతచేసినా ఫలితం మళ్లీ అదే.

చివరికి చేతులెత్తేసే పరిస్థితి రావడం.  

ఎంత పనికిరాని ప్రాజెక్టునయినా నిలబెట్టి హిట్ చేసే సత్తా ప్రమోషన్‌కుంటుంది. చెప్పాలంటే, కేవలం మంచి ప్రమోషన్ వల్లనే హిట్టయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి.

కానీ అదే మాకు లేదు.

"ఇంక చాలు" అనుకున్నాన్నేను. "అవును. ఇంక చాలు సర్" అన్నాడు నా టీమ్‌లోని ఇంకో చీఫ్ టెక్నీషియన్.


కట్ చేస్తే -

ప్రమోషన్, రిలీజ్, మార్కెటింగ్ లకు విధిగా బడ్జెట్‌లో తగినంత ఉండాలనుకొన్నాం. ఉండితీరాలనుకొన్నాం.

మేమనుకున్న సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేసి, అనుకున్న రేంజ్‌లో ప్రమోట్ చేసి మరీ రిలీజ్ చెయ్యాలనుకొన్నాం.

రిజల్ట్ హిట్టా, ఫట్టా అన్నది కానేకాదు విషయం.

సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా మైక్రోబడ్జెట్‌లో చేసిన సినిమాలకు ఎలాంటి నష్టం ఉండదు.

కాకపోతే, అనుకున్న రేంజ్‌లో ఫిలిమ్‌ను ప్రమోట్ చేసుకొని, ఒక స్ట్రాటజీ ప్రకారం బిజినెస్ చేసుకొని రిలీజ్ చేయడం అన్నది చాలా చాలా అవసరం.     

అలా చేసినప్పుడే ఎవరికయినా ఒక బ్రాండ్ అంటూ క్రియేట్ అవుతుంది. సినిమా హిట్ అయితే, అదే బ్రాండ్ ఎస్టాబ్లిష్ కూడా అవుతుంది.

ఒక ఆర్టిస్టుకయినా, టెక్నీషియన్‌కయినా కావల్సింది అదే.

నేనూ, నా చీఫ్ టెక్నీషియన్ ఒకరు "ఓకే" అనుకున్నాం. కష్టపడాలనుకొన్నాం. గత కొద్ది నెలలుగా కష్టపడుతూనే ఉన్నాం.

ఆ ఇద్దరు టెక్నీషియన్స్‌లో ఒకరు నేనే అనేది సుస్పష్టం.

ఇంకొకరెవరు అన్నది మాత్రం ఇప్పుడంత ముఖ్యం కాదు. రెండ్రోజుల్లో మీకే తెలుస్తుంది. ఇప్పటికే మీలో చాలామంది గెస్ చేసుంటారు కూడా.

ఏమయితేనేం .. మా ఇద్దరి ఆ కష్ట ఫలితమే ఇది:

"365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన."

Monday 12 September 2016

365 రోజుల మహాయజ్ఞం

మైక్రో బడ్జెట్‌లో కేవలం 12 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి, నేను రూపొందించిన రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్" రిలీజయి నిన్నటికి సరిగ్గా 365 రోజులు.

షూటింగ్ చేసిన 12 రోజుల్లో కూడా - దాదాపు ప్రతిరోజూ ఎదో ఒక కారణంతో సుమారు 40% సమయం వృధా అయ్యేది.

అయినా, ప్లాన్ చేసిన అదే 12 రోజుల్లోనే నేను షూటింగ్ పూర్తిచేయగలిగాను.

క్రెడిట్ గోస్ టూ మై డీ ఓ పి. మై మ్యూజిక్ డైరెక్టర్. మై అదర్ టెక్నీషియన్స్. మై ఆర్టిస్ట్స్. మై ప్రొడ్యూసర్.

"చిన్న సినిమాలు పూర్తికావు, ఆగిపోతాయి. పూర్తయినా రిలీజ్ కావు" అని బాగా ప్రచారంలో ఉన్న ఒక అవగాహనా రాహిత్యపు ఆలోచన నిజం కాదని స్విమ్మింగ్‌పూల్ సినిమాను ఇక్కడా, ఎబ్రాడ్‌లోనూ రిలీజ్ చేయడం ద్వారా నేను నిరూపించాను.

రిలీజ్ డేట్‌ను కూడా "సెప్టెంబర్ 11" అని కనీసం 40 రోజులముందే ప్రకటించాను. పోస్టర్స్ పైన ప్రింట్ చేయించాను. అదే సెప్టెంబర్ 11 నాడు రిలీజ్ చేశాను.

అదే సమయంలో, అప్పట్లో, చాలా సినిమాల రిలీజ్ డేట్స్ కనీసం ఒకటికి 4 సార్లు వాయిదా పడ్డాయి.

చిన్న సినిమాలే కాదు.పెద్దవి కూడా.

వాటిల్లో 3 కోట్లకుపైగా పెట్టి ఒక హిట్ డైరెక్టర్ తీసిన సినిమా కూడా ఒకటుంది. ఆ సినిమా రిలిజ్ డేట్ కనీసం ఒక అరడజన్ సార్లు ప్రకటించినా, ఇంతవరకూ, ఈ రోజుకీ అది విడుదల కాకపోవడం విచిత్రం! పైగా, ఆ సినిమా మెయిన్ లీడ్‌లో .. సౌత్‌లో, హిందీలో అప్పటికే బాగా పేరుతెచ్చుకున్న ఒక టాప్ ట్రెండీ హీరోయిన్ కూడా ఉండడం విశేషం.

ఈ విషయాలన్నీ రికార్డులు చూసుకోవచ్చు.  

కోట్లరూపాయల బడ్జెట్‌తో రూపొంది, అదే రోజు రిలీజైన మరో సీనియర్ డైరెక్టర్ చిత్రం కలెక్షన్లకన్నా స్విమ్మింగ్‌పూల్ చిత్రం కలెక్షన్లు చాలా చోట్ల ఎక్కువని రికార్డయ్యాయి.

ఆ సినిమాకు సూపర్ ప్రమోషన్ ఉంది. మా సినిమాకు అసలు ప్రమోషన్ లేదు!

సినిమా హిట్టా, ఫట్టా అన్నదానికి నానా కారణాలుంటాయి. అవన్నీ ఇప్పుడిక్కడ నేను చర్చించడంలేదు.


కట్ టూ మా మహాయజ్ఞం -

గత సెప్టెంబర్ 11 నుంచి, ఈ సెప్టెంబర్ 11 వరకు ఎంతో అంతర్మథనం.

ఎంతకష్టపడ్దా మళ్లీ అంతే.

సినిమా వచ్చిందీ, పోయిందీ తెలియకుండా జరగడం.

మంచి కంటెంట్ మాత్రమే కాదు. ఏదో సినిమా తీశామా అంటే తీశాం అన్నది కూడా కాదు. మంచి ప్రమోషన్ ఉండాలి. మంచి ఓపెనింగ్స్ రావాలి. నిజంగా సినిమాలో దమ్ముంటే మంచి మౌత్ టాక్ రావాలి. సినిమా హిట్ కావాలి.

ఇలా ఎన్నో కలిసిరావాలి. కలిసొచ్చేలా చేసుకోవాలి. చేసుకోగలగాలి.

ఇది చెప్పినంత ఈజీ కూడా కాదు.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకూ .. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, ఎక్కడైనా సరే .. సినిమా సక్సెస్ రేటు కేవలం 2% మాత్రమే.

అయినా సరే సినిమాని హిట్ చెయ్యాలి.

ఈ 365 రోజుల అంతర్మథనంలో మరో ముఖ్య భాగం .. మా సినిమా కష్టాలు!

నానా తిప్పలు, బాధలు, మాటలు, ఫండ్స్ కోసం ప్రయత్నాలు, వైఫల్యాలు.

అప్పుడే చిటికెలో కోట్లరూపాయల పని అయిపోయిందన్నట్టు మాటిచ్చే "పిట్టల దొరలు" కొందరు మా సమయంతో, మా జీవితాలతో ఆడుకోడాలు.

వాట్ నాట్ .. అన్నీ!

ఈ సినిమా కష్టాలు బయటివారికి తెలియవు. అర్థం కావు. అర్థం చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు కూడా.

ఈ మహాయజ్ఞం చివరిరోజుల్లోనే నేనూ, నా మరో చీఫ్ టెక్నీషియన్ ఒక మహా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అదే ఇది, ఈ ట్వీట్ రూపంలో:

365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన.

Thursday 8 September 2016

ఏదో ఉందా .. అసలేం లేదా?!

రాజకీయంగా ఒక భారీ మార్పు తర్వాత, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులొస్తాయని చాలామంది ఇక్కడి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఒక్క తెలంగాణవాళ్లే కాదు .. ఇండస్ట్రీలోని అవ్యవస్థకు బలవుతున్న రెండువైపులవాళ్లూ అలాగే అనుకొన్నారు.

బికాజ్ క్రియేటివిటీకి, రాజకీయాలకు సంబంధం లేదు. ఎక్కడివాళ్లయినా హాయిగా ఇక్కడే ఉండొచ్చు. పనిచేసుకోవచ్చు. అది సమస్య కానే కాదు.

కానీ ఇక్కడ పాతుకుపోయిన పధ్ధతులు, వ్యవస్థలు కొన్నిటిని సమూలంగా మార్చాలసిన అవసరం మాత్రం చాలా ఉంది.

సదరు అవ్యవస్థ అలాగే కొనసాగడానికి, పరిశ్రమ తమ గుప్పెట్లోంచి జారిపోగూడదని ఎప్పటికప్పుడు సి ఎం లను, మంత్రులను మంచిచేసుకొనే కొన్ని శక్తులకు చెక్ పెట్టాల్సిన  అవసరం ఇంక చాలా ఉంది.

చాలామంది ఆశించింది ఈ మార్పునే. కానీ, అలాంటి మార్పు కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు.

క్షణక్షణం సినిమాలో పరేశ్‌రావల్ డైలాగ్‌లా, విచిత్రంగా "అంతా ఫ్రెండ్స్ అయిపోయారు!"  

నిజానికి ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్న ఆ అవ్యవస్థ ఇప్పుడు మరింత బాగా గట్టిపడింది. ఈ రెండేళ్లలో ఏదైనా మార్పు వచ్చిందంటే ఇదే!

కట్ టూ కె సి ఆర్ - 

అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌నంతా నేను అంత ఉదాసీనంగా తీసుకోవడంలేదు. బిగ్ బాస్ మనసులో ఏదో ఉంది. ఊహించని ఒక మెరుపులా అదెప్పుడో సక్‌మంటూ బయటికొస్తుందని నాలో, నాలాంటి ఇంకెందరిలోనో ఒక ఆశ. ఒక నమ్మకం. ఒక ప్రగాఢ విశ్వాసం.          

Saturday 3 September 2016

ఆ 1% మాత్రమే!

ఒక మాతాజీ ఉవాచ ఇప్పుడే చదివాను.

మన కష్టాలు ఎవరితోనూ చెప్పుకోవద్దట. చెప్పుకున్నా లాభం ఉండదట. ఒకవేళ చెప్పుకున్నా .. 20% మంది అసలు పట్టించుకోరట. 80% మంది "వీడికి బాగా అయ్యిందిలే" అని ఎంజాయ్ చేస్తారట. ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోవడం బెటర్.. అంతా ఆయనే చూసుకుంటాడు అని.

"మతం అనేది మానవ సృష్టి" అనేది నేను బాగా నమ్ముతాను.

అలాగని నేను నాస్తికున్ని కాదు.

ఎదుటివాడిని బాధపెట్టనంతవరకు, అందరి వ్యక్తిగత నమ్మకాలను నేను విధిగా గౌరవిస్తాను. అదొక క్రమశిక్షణ. అదొక సంస్కారం. అంతే.


కట్ బ్యాక్ టూ మాత ఉవాచ -  

ఇందాక మాత చెప్పినదాంట్లో .. "ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోండి. అంతా ఆయనే చూసుకుంటాడు" అన్న చివరి వాక్యం గురించి నాకంత తెలీదు. కానీ, ఆమె చెప్పిన అసలు పాయింట్‌లో మాత్రం చాలావరకు వాస్తవం ఉందని నేననుకుంటున్నాను.

లెక్కలోనే చిన్న తేడా.

మన కష్టాలు విని 80% ఎగతాళి చెయ్యొచ్చు. 19% అసలు కేర్ చెయ్యకపోవచ్చు. కానీ 1% మాత్రం స్పందిస్తారు. కనీసం వింటారు.

ఆ 1% మాత్రమే మన మిత్రులు, శ్రేయోభిలాషులు .. మన నిజమైన దైవాలు.  

పిట్టలదొరలుంటారు జాగర్త!

కొంతమంది (స్వయంప్రకటిత) మేధావులు, మహానుభావులు, మహాత్ములు, వీఐపిలుంటారు.

చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా, 'ఆత్మీయంగా' వీరిచ్చే హామీలు మనల్ని ఎక్కడో ఎవరెస్ట్ మీదకెక్కిస్తాయి.

ఉదాహరణకు:

> "ఆఫ్‌కోర్స్ .. అయామ్ ది ప్రొడ్యూసర్! వారంలోపే కోటిన్నరతో సినిమా స్టార్ట్ చేసేద్దాం!"

> "చీప్‌గ .. గా 60 లక్షలేందన్న .. సిన్మా అంటే కమ్ సే కమ్ .. ఓ రెండు కోట్లన్న పెట్టాలె. ఒక్క రెండ్రోజులాగు. నేనే పెట్టిస్త!"

> నీక్కావల్సిందెంత .. కోటేగా .. నాకొదిలెయ్! జనవరి 25కు వచ్చి డబ్బు తీసెళ్లు. మరిప్పుడు .. లైట్‌గా ఓ పెగ్గేస్తావా?!"

> మాస్టారూ! మీకు బ్లాక్ అయినా ఓకేనా .. ఓకే అంటే చెప్పండి. ఎల్లుండికల్లా ఒక 5 (కోట్లు) మీకు చేరుతుంది."


కట్ టూ పిట్టలదొర - 

పైన చెప్పిన 4 ఉదాహరణలు కేవలం శాంపిల్స్ మాత్రమే. వాళ్లు చెప్పిన ఆ రెండ్రోజులు .. ఆ వారం .. ఆ నెల .. ఆ జనవరి 25 ఎన్నటికీ రావు.

వాళ్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మనల్ని, మన లైఫ్‌ల్ని అలా అలవోగ్గా వాడుకొని ఆడుకుంటారు.

నిర్దాక్షిణ్యంగా.

వాళ్లకదో హాబీ. ఆనందం.

వాళ్లంతా మహానుభావులు. వారికున్న కొన్ని ప్రత్యేక టాలెంట్‌ల విశ్వరూపం రకరకాలుగా ప్రదర్శిస్తూ పాపులర్ ఫిగర్స్‌గా చలామణి అయ్యేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటారు. అది వారి జీవనశైలి.  

తప్పు వాళ్లది కాదు. మనది.

సో, మనమే జాగ్రత్త పడాలి.

ఆశపెట్టి, మాట ఇచ్చి, ఆ మాటకు కట్టుబడే దొరలెవరో, పిట్టలదొరలెవరో వెంటనే గ్రహించలేకపోతే, చివరికి మనమే పిట్టల్లా రాలిపోతాం.

తస్మాత్ జాగర్త!