Monday 28 December 2020

బుక్ పబ్లిషింగ్ 'స్పాన్సర్స్' ‌కి ఆహ్వానం!

నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఘోస్ట్ రైటర్‌గా అప్పట్లో కొంతమంది ప్రముఖ దర్శకులకు పనిచేసిన అనుభవంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రిప్ట్ రైటింగ్ పైన నేనొక పుస్తకం రాశాను. 

పుస్తకం పేరు "సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం". 

అప్పట్లో అదొక బెస్ట్ సెల్లర్ పుస్తకం. రెండు ప్రింట్లు వేశాను. హాట్‌కేక్స్‌లా 5 వేల కాపీలు సేలయ్యాయి.

తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఆ రెండు సినిమాల అనుభవాన్ని కూడా చేర్చి, పుస్తకం కొంత రివైజ్ చేసి ప్రింట్ చేద్దామనుకొన్నాను. నా రెగ్యులర్ ఉద్యోగం, ఇతరత్రా కారణాలవల్ల ఆ పని అలా అలా పెండింగ్‌లో పడిపోయింది.

విశాలాంధ్ర, నవోదయ వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను ఈ పుస్తకం రీప్రింట్ చెయ్యలేకపోయాను.

ఈ పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రముఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు వాళ్ల స్టుడెంట్స్‌కు సిలబస్‌లో భాగంగా ఇచ్చేవారు. కాపీలు మార్కెట్లో దొరక్క, ఫిలిం నగర్‌లోని ఒక జిరాక్స్ సెంటర్లో ఈ పుస్తకం జిరాక్స్ కాపీలు స్పైరల్ బైండ్ చేసి అమ్ముతున్నట్టు విని నేనొకసారి అక్కడికి వెళ్ళాను. అనామకుడుగా నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను. అదొక విచిత్రమైన ఫీలింగ్!

కట్ చేస్తే –

కరోనా లాక్‌డౌన్ నాలో, నా ఆలోచనాపరిధిలో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. ఎన్నెన్నో విషయాల్లో ఎంతో అంతర్మథనానికి తెరలేపింది. ఎంత రియలిస్టిక్ కండిషన్స్‌లో అయినా సరే, కొన్ని రిస్కీ నిర్ణయాలు తీసుకొనే ముందు ఎందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించాలో కళ్ళముందు సినిమావేసి చూపించినట్టు తెలిసేలా చేసింది. మొత్తంగా ఈ లాక్‌డౌన్ నాలో ఒక మహాజ్ఞానోదయానికి కారణమైంది.

ఈ నేపథ్యంలో – ఇంతకుముందు నేను చాలా తేలికగా, అసలు పట్టించుకోకుండా ఏ రెండు ముఖ్యమైన అంశాలనైతే బాగా లైట్ తీసుకొన్నానో, అవే నాకు చాలా ముఖ్యమైనవి అని తెలుసుకున్నాను.

ఆ రెంటిలో ఒకటి నా రైటింగ్.

నేను రాసిన “సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం” పుస్తకం Best Book on Films కేటగిరీలో నాకు నంది అవార్డు సాధించిపెట్టింది. నేను రాసిన “ఆధునిక జర్నలిజం” పుస్తకం, కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మే స్థాయిలో రిఫరెన్స్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. ఈ విషయం, అదే యూనివర్సిటీలో నేను PhD ఇంటవ్యూకెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో నాకు చెప్పారు!

నేను రాసి, పబ్లిష్ చేసి, బాగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ 2 పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో లేవు. ఎంతోమంది నుంచి నాకు డైరెక్టుగా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. కర్టెసీ – సోషల్ మీడియా!

నవోదయ అధినేతలు, విశాలాంధ్ర వాళ్ళు ఇంక నాకు చెప్పడం మానేశారు.

ఇప్పుడు నేను ఈ 2 పుస్తకాలు రీప్రింట్ చేస్తున్నాను. ఈవైపు ఆసక్తి ఉండి, నన్ను ప్రోత్సహిస్తూ “Sponsors” గా సహకరించాలనుకొనే మిత్రులు, శ్రేయోభిలాషులు, పుస్తకాభిమానులు ఎవరైనా నాకు ఈమెయిల్-లేదా-వాట్సాప్ చేయగలిగితే సంతోషిస్తాను.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్.

నా ఈమెయిల్: mchimmani10x@gmail.com
వాట్సాప్ నంబర్: +91 9989578125    

Friday 25 December 2020

"మనోహరమ్" బేటా-టు-కంప్లీట్ వెర్షన్!

అల్ఫా, బేటా స్థాయిలను దాటేసిన మనోహరమ్ వెబ్ మ్యాగజైన్ ఈ నెల 31 అర్థరాత్రి దాటాక తన కంప్లీట్ వెర్షన్ లుక్‌తో ప్రారంభం కాబోతోంది. 

అంటే - జనవరి 1, 2021 నుంచి మనోహరమ్ ఎలైట్ వెబ్ మ్యాగజైన్‌ను దాని పూర్తిస్థాయిలో ఇకనుంచీ మీరు చూడబోతున్నారన్నమాట!

న్యూ ఇయర్ ప్రారంభం నుంచి - ఆర్టికిల్స్ విషయంలో రెగ్యులర్‌గా అప్‌డేట్ ఉంటుంది. ఇంటర్వ్యూలు, సక్సెస్ స్టోరీలు వంటివి ప్రతి వీకెండ్‌కి అప్‌డేట్ అవుతాయి.    

సక్సెస్ సైన్స్-సినిమాలు-సరదాలు (Mindset-Movies-Masti)... ఈ మూడే ప్రధాన విభాగాలుగా నేను ప్లాన్ చేసిన ఈ మ్యాగజైన్ పూర్తిగా ఒక బిందాస్ పాజిటివ్ మ్యాగజైన్. పాలిటిక్స్, హేట్రెడ్ ఇందులో మచ్చుకైనా ఉండవు. 

ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్ కంటెంట్‌లో సక్సెస్ సైన్స్ తర్వాత స్థానం సినిమాదే. 

సినిమారంగానికి సంబంధించినంతవరకు ‘మనోహరమ్‌’లో వంద శాతం పాజిటివ్ రైటప్‌లే వుంటాయి. ఎలాంటి సందర్భంలో అయినా వంద శాతం సినీఫీల్డువైపే పాజిటివ్‌గా వుంటుంది మనోహరమ్.

'మనోహరమ్‌’లో సినిమా రివ్యూలకోసం ప్రత్యేకంగా కాలమ్ లేదు. కాని, రివ్యూలు కూడా వుంటాయి. మళ్లీ వెనుకటి సినిమారంగం, విజయచిత్ర పత్రికల రోజులు గుర్తుకువచ్చేలా .. మనోహరమ్‌లో సినిమా రివ్యూలు పూర్తి విభిన్నంగా, నిర్మాణాత్మకంగా వుంటాయి. అలాగే - మనోహరమ్’లో హీరోహీరోయిన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, వారి గురించి రైటప్స్ కూడా ఉంటాయి.  

ఏ రంగంలోంచి ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినా-లేదా- అతడు/ఆమె గురించి ఒక స్టోరీ రాసినా, అది సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలోనే ఉంటుంది.  


కథలు, కవితలు కూడా ఇలాగే ఉండాలన్న రూల్ లేదు. క్రియేటివిటీ అనేది ఎలాంటి తూనికలకు లొంగాల్సిన అవసరంలేదు. ఇంకొక వ్యక్తినో, వర్గాన్నో బాధపెట్టకుండా ఉంటే చాలు. జీవితం పట్ల, జీవనశైలిపట్ల పాజిటివ్ దృక్పథమే ప్రధానం. 

కట్ చేస్తే - 

నా బ్లాగింగ్ ప్యాషన్‌కు ఎక్స్‌టెన్షనే మనోహరమ్ మ్యాగజైన్. నా వర్కింగ్ టైమ్‌లో సగం సమయం మ్యాగజైన్‌కే కెటాయిస్తున్నాను. మిగిలిన సగం సమయం నా ఇతర వ్యాపకాలకు కెటాయిస్తున్నాను. 

ప్రారంభం కాబట్టి తప్పటడుగులుంటాయి. మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే నాకు కొండంత బలం. ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు!  

Saturday 19 December 2020

2021 కి కౌంట్ డౌన్ షురూ...

కొత్త సంవత్సరం అనేది ఒక మైలు రాయి. ప్రతి మనిషి జీవితంలో ఒక కొత్త అధ్యాయం. అది ఇంగ్లిష్ న్యూ ఇయర్ కావచ్చు. తెలుగు ఉగాది కావచ్చు. 

ఇలాంటి సందర్భాలే కావాలా అనే ఒక లాజిక్ వస్తుంది. కాని తప్పక కావాలి, ఆ అవసరం ఉంది అని బాగా ఆలోచించే మనవాళ్ళు ఇవి క్రియేట్ చేశారని నాకనిపిస్తోంది. 

కనీసం ఇలా అయినా కొన్ని నిమిషాలో, కొన్ని గంటలో మొత్తం అసలేం జరుగుతోంది అన్నది రివ్యూ చేసుకొంటారు. వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మనిషి జీవనయానంలోని ఇంకో అరడజను ప్రధాన అంశాల్లో కావచ్చు. ఈ స్వీయ విశ్లేషణ చాలా అవసరం. 

కట్ చేస్తే - 

మానవజాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా - ప్రపంచం మొత్త ఒక ఆరు నెలలపాటు మూసుకొనేలా చేసిన కోవిడ్19 ఎటాక్ నేపథ్యంలో, 2020 మనకు నేర్పిన ఎన్నో పాఠాల్ని కొన్ని నిమిషాలైనా గుర్తుకుతెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. 

2020లో మనం ఊహించని ఎన్నో అనుభవాల నేపథ్యంలో ఇకనుంచీ మన జీవనశైలిలో, మన ఆలోచనల్లో, మనం చేసే పనుల్లో ఎంత మార్పు అవసరమో కూడా ఒక ఖచ్చితమైన రివ్యూ అవసరం అని నాకనిపిస్తోంది.

ఇంకో 12 రోజుల్లో 2021 రాబోతోంది. మనం మర్చిపోయిన పెన్నూ, పేపర్ తీసుకొని ఒక అరగంటయినా దీనికోసం కెటాయిస్తే ఎలావుంటుంది?         

Thursday 17 December 2020

కౌంట్‌డౌన్ టు కరోనా, 2020!

ఇందాకే చదివిన ఒక పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది...

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట! అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు...

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా కొన్ని వేల రోజులున్నాయి. కాని, ఏంటి గ్యారంటీ?

ఏ ట్రాఫిక్ లేని సమయంలో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాకయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు. 

గ్యారెంటీ ఏదీ కాదు. దేనికీ లేదు.

ఆ అంకెలు, ఆ లెక్క... కళ్లముందే కనిపిస్తున్నాయి నాకు.    

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం. కాని, చూస్తోంటే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి. నేను అసలు ఊహించని ఎందరో నా కళ్ళముందే పోయారు. 

కరోనా గురించి ఎవరైనా కలగన్నారా? దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రపంచాన్నే వణికిస్తోంది. లక్షలమంది చచ్చారు. లక్షలమంది చావు అంచులవరకు వెళ్ళొచ్చారు. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. 

ఇప్పుడా కరోనా కూడా క్లయిమాక్సుకు చేరింది.

ఎందరో తిట్టుకొన్న 2020 - తన తప్పేం లేకపోయినా...  గిల్టీగా, నిశ్శబ్దంగా నిష్క్రమిస్తోంది. 

నేను పూర్తిచేయాల్సిన పనులు, బాధ్యతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నేను మాత్రం 2020 కి చాలా థాంక్స్ చెప్తున్నాను. లాక్‌డౌన్లో ఒక కొత్త జీవనశైలిని నాకు అలవాటు చేసింది. నాలో ఎన్నెన్నో కొత్త ఆలోచనలకు తెరలేపింది. మొత్తంగా ఒక మహా జ్ఞానోదయానికి కారణమైంది. 

థాంక్యూ 2020, నేను ఆల్రెడీ 10X స్పీడ్‌లో వున్నాను. 2021 లో. 

Wednesday 16 December 2020

నువ్వు లేకుండా అప్పుడే రెండేళ్ళు!

బ్రతికుండటానికి కూడా చాలా శక్తి, చాలా విల్‌పవర్ కావాలని నువ్వు వెళ్ళిపోతూ మా అందరికి తెలియజెప్పాకే తెలిసింది. 

నేను కొంచెం చొరవతీసుకున్నా, నువ్వు "అన్నా, మా సమస్యను పరిష్కరించు" అని నాతో ఒక్క ముక్క గట్టిగా చెప్పినా ఇవ్వాళ నేనిది రాసుకొంటూ ఇలా బాధపడేవాణ్ణి కాదు. మానవసంబంధాల విలువ ఏంటో కూడా నువ్వు వెళ్ళిపోతూ చెప్పావు. 

సమాజంలో ప్రతి వ్యవస్థ కూడా కాలగమనంలో ఎంతో మారిపోతూవస్తోంది. నువ్వూ మారాల్సింది. సమస్యను ఏవైపునుంచయినా పరిష్కరించుకోవాల్సింది. సమస్యే మూలం కాని, సమస్యకు నువ్వు మూలం కాదు అన్న చిన్న ఆలోచన చెయ్యలేకపోయావు. నేను బాగుంటే నువ్వు బ్రతికుండేవాడివి. అన్నగా ఏం చేయలేకపోయాననే బాధ నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నన్ను ఏడిపిస్తుంది. నీ పదేళ్ళ కొడుకు కార్తీక్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా కళ్ళుచెమ్మగిల్లుతాయి. వాడిని కలిసి హత్తుకున్నప్పుడు వదిలిపెట్టలేనంత దుఃఖం. 

నువ్వొక్కడివే స్నేహితుడిగా, తమ్ముడిగా, నీతోనే పెరిగిన శ్రీధర్‌కు ఇప్పుడు వరంగల్‌లో ఎవ్వరున్నారు మనసు విప్పి మాట్లాడుకోడానికి? వాడెంత నీకోసం తపనపడ్డాడు? వాడితోనైనా గట్టిగా చెప్పాల్సింది కదా - అన్నతో చెప్పి, నువ్వూ అన్నా కలిసి నా సమస్యను వెంటనే ఇప్పుడే పరిష్కరించండి అని.  

నీ చివరిరోజుల్లో నువ్వు నన్ను కలిసిన ప్రతిసారీ, నీ జీవితం ఎలాపోతోందో తెలుసుకోవడం ద్వారానైనా నేను చాలా తెలుసుకోవాల్సింది. ఇలాంటి ముగింపు నేనూహించలేదు. నేనెలా ఉన్నా సరే, అన్నగా నేను పూనుకోవాలన్న ఆలోచన ఆ మూడేళ్ళలో ఒక్కసారి నాకు వచ్చినా ఇవ్వాళ నాకింత బాధ వుండేదికాదు. 

ఇప్పుడు శ్రీధర్, నేనూ ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకొన్నా నీ గురించే. చెట్టుకు, పుట్టకు ఒక్కొక్కరై మర్చిపోయిన మానవసంబంధాలగురించే. నీ జీవితాన్ని ఒక పాఠంగా మార్చి నువ్వు నిష్క్రమిస్తే తప్ప మాకు తెలియలేదు మానవసంబంధాల విలువేంటో.  

ఎందుకు వాసూ, ఇలా చేశావు? "అన్నా" అని ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడిన నీ జ్ఞాపకాలూ, ఆవెంటనే వచ్చే కన్నీళ్ళే కదా ఇప్పుడు నాకు మిగిలింది?

మానవసంబంధాలు చాలా ముఖ్యం. మనసువిప్పి మాట్లాడుకోడానికి ఒక మనిషి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండూ ఉన్నప్పుడే మిగిలినవి ఏవైనా సరే బాగుంటాయి. 

నా చిన్న తమ్ముడు వాసు లేడు అన్న నిజాన్ని నేనింకా నమ్మడానికి ఒప్పుకోలేకపోతున్నా. కాని, నిజాన్ని ఎలా కాదనగలను? నీ ఫోన్ కాల్ ఏది? మొన్న వరంగల్ వచ్చినపుడు నువ్వు లేవే? 

మిస్ యూ వాసూ... 

Tuesday 15 December 2020

బాపుగారి బొమ్మ

బాపుగారి బొమ్మ అంటే మామూలుగా అయితే రెండర్థాలు స్పురిస్తాయి: బాపు గీసిన బొమ్మ, బాపు సినిమా.

ఈ రెండూ కాకుండా, సుమారు 15 ఏళ్ళక్రితం చెన్నైలోని వారి ఇంట్లో బాపుగారిని కలిసినప్పటి సంగతులు ఇప్పుడు నేను రాస్తున్నాను.

అప్పట్లో నేను రాయదల్చుకున్న ఒక పుస్తకం కోసం కొంతమంది నేను ఎన్నికచేసుకొన్న దర్శకులను కలవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఒక మధ్యాహ్నం వారి టైమ్ తీసుకొని బాపుగారి ఇంటికి వెళ్లాను. నాతోపాటు నా మిత్రుడు, కోడైరెక్టర్ వేణుగోపాల్ కూడా వచ్చాడు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి, సాయంత్రం 7 మధ్యలో – సుమారు 3 గంటలపాటు బాపుగారితో మాట్లాడుతూ, వారి ఇంటర్వ్యూను ఆడియో రికార్డు చేశాను.

అసలు బాపుగారితో పక్కపక్కనే ఒకే సోఫా మీద కూర్చొని, వారితో అన్ని గంటలపాటు ముచ్చటించటం, వారి ఇంటర్వ్యూని రికార్డ్ చేయటం అనేది నిజంగా అదొక గొప్ప అనుభవం.

బాపుగారు కేవలం ఒక చలనచిత్ర దర్శకుడే కాదు… ఒక అంతర్జాతీయ స్థాయి పెయింటర్, ఇల్లస్ట్రేటర్, కార్టూనిస్ట్, స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఆర్టిస్ట్, డిజైనర్ కూడా.

1964 లోనే యునెస్కో స్పాన్సర్ చేసిన ఒక అంతర్జాతీయ సెమినార్లో చిల్డ్రెన్స్ బుక్స్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన మేధావి. వాల్టర్ థామ్సన్, ఎఫిషియెంట్ పబ్లిసిటీస్, ఎఫ్ డి స్టీవార్ట్స్ వంటి అంతర్జాతీయ స్థాయి యాడ్ ఏజెన్సీలకు గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న బహుముఖప్రజ్ఞాశాలి. 1960 ల్లోనే ఫోర్డ్ ఫౌండేషన్‌ తరపున ది సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కు ఆర్ట్ కన్సల్టెంట్‌గా పనిచేశారాయన. అదంతా కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వంటివి లేని కాలం అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి.

అప్పట్లో పబ్లిష్ అయిన ప్రతి తెలుగు నవలమీద, ప్రతి కథా సంకలనం మీద, వీక్లీల కవర్లపైన, మ్యాగజైన్ల వార్షిక సంచికలమీద… బాపు గారి ముఖచిత్రం మాత్రమే ఎక్కువగా ఉండేది. అలాంటి ముఖచిత్రాలు ఎన్ని వందల పుస్తకాలకు వేశారన్నది చెప్పటం కష్టం. బహుశా ఆ సంఖ్య వేలల్లోనే ఉండొచ్చు.

దర్శకుడిగా బాపు చేసిన దాదాపు 48 సినిమాల్లో 10 హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా కూడా ఉంది. వారి సినిమాలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. అవార్డులు, రివార్డులు గెల్చుకొన్నాయి.

బాపు గారికి కూడా 2013లో పద్మశ్రీ అవార్డుతో పాటు అంతకు ముందే ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఒక దశలో హిందీలో ఒక టాప్ హీరోగా వెలిగిన అనిల్ కపూర్‌ను, తెలుగులో వంశవృక్షం చిత్రం ద్వారా మొట్టమొదటగా వెండితెరకు పరిచయం చేసింది బాపుగారే అవటం ఒక గమ్మత్తైన విశేషం.


బాపుగారు షూటింగ్‌కు ముందే తాను తీయబోయే ప్రతి షాట్‌నూ స్టోరీబోర్డ్ రూపంలో గీసుకుంటారు. సినిమాల్లో వారి ఫ్రేమ్స్ అన్నీ వారు గీసిన స్టోరీబోర్డులో బొమ్మల్లాగే ఉండటంలో ఎలాటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా వారి సినిమాల్లో హీరోయిన్స్… వారి కళ్ళు, క్లోజప్స్, చీరెకట్టు, నడుము వొంపులు, వాలు జడ, కాళ్ళు, పాదాలు…

వారి చాలా సినిమాల స్టోరీబోర్డులను వారి ఇంట్లోనే స్వయంగా చూసిన అతికొద్దిమందిలో నేనూ ఒకన్ని.

అప్పట్లో తెలుగు కాస్త బాగా రాయగలిగిన దాదాపు ప్రతి యువకుడూ, ప్రతి కవీ, ప్రతి రచయితా తమ చేతి వ్రాతను బాపుగారి స్టయిల్లో రాసే ప్రయత్నం చేసేవారంటే అతిశయోక్తికాదు. బాపు రైటింగ్ శైలి ప్రభావం నామీద కూడా బోలెడంత వుంది. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ వెబ్ మ్యాగజైన్ “మనోహరమ్” లోగో బ్రష్‌స్ట్రోక్‌లో నేను రాసిందే. కర్టెసీ… బాపుగారి శైలి ప్రభావం!

కట్ చేస్తే –

నేను బాపుగారింటికి వెళ్ళినరోజు ఇంట్లో ఎవరూ లేరనుకొంటాను. ఒకసారి వాళ్ల అబ్బాయి, మరొకసారి స్వయంగా బాపుగారే అందించిన కాఫీ త్రాగటం మర్చిపోలేని జ్ఞాపకం.

వారి ఇంట్లో కూర్చున్న ఆ 5 గంటలూ నన్ను “మీరు” అని, “మనోహర్ గారు” అని పిలవటం నేను చాలా ఇబ్బందిపడిన విషయం. నాకు తెలిసి, బాపుగారు వారి అసిస్టెంట్స్‌ను కూడా “మీరు” అనే పిలుస్తారట.


ఇంటర్వ్యూ నడుస్తుండగా, 90 నిమిషాల ఆడియో క్యాసెట్ సరిపోదన్న విషయం ముందే గుర్తించిన నా మిత్రుడు వేణుగోపాల్ బయటకెళ్ళి వేగంగా ఇంకో క్యాసెట్ కొనుక్కొచ్చిన విషయం నాకింకా గుర్తుంది.

వీటన్నిటినీ మించి బాపుగారికి సంబంధించి నేను చెప్పదల్చుకొన్న మరొక అద్భుత విషయాన్ని గురించి ఇప్పుడు చివరగా చెప్తున్నాను. అది… బాపుగారి “వర్క్‌రూమ్-కమ్-స్టడీరూమ్.”

బాపు గారి వర్క్‌రూమ్ ఒక పెద్ద హాల్ సైజులో ఉంటుంది. దానికి రెండువైపులా ద్వారాలుంటాయి. చుట్టూ వున్న నాలుగు గోడలు పూర్తిగా నిలువెత్తు ర్యాక్స్‌తో ఫిక్స్‌చేసివుంటాయి. వందలాది పుస్తకాలు.

హాల్ మధ్యలో వేర్వేరుచోట్ల కూర్చొని పనిచేసుకోడానికి అక్కడక్కడా రెండు బీన్ బ్యాగులు, చిన్న చిన్న పీటల్లాంటి కుషన్లు. ఎక్కడ కూర్చొంటే అక్కడే ఆర్ట్, రైటింగ్ సెటప్… బ్రష్షులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇంకులు, రంగులు, ప్యాలెట్లు…

అంటే – ఆయన ఎక్కడ కూర్చోవాలనుకొంటే అక్కడే కూర్చొని ఆర్ట్ వేయటమో, రాసుకోవడమో, చదవటమో చేస్తారన్నమాట!

నేనొక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, ఒక 30 నిమిషాలపాటు స్పెల్‌బౌండ్ అయి చూసిన బాపుగారి వర్క్‌రూమ్-కమ్-స్టడీని ఇప్పటికీ అడుగు అడుగూ వర్ణించగలను!

సృజనశీలి అయిన ఒక అద్భుత వ్యక్తికి అంతకు మించిన ఆస్తి ఏముంటుంది?

వెళ్తూ వెళ్తూ ప్రచురణకోసం వారి ఫోటో అడిగాను. తర్వాత మనసు మార్చుకొని – సిగార్‌తో వున్నదీ, ఆయనే స్వయంగా వేసుకొన్న ‘బాపుగారి బొమ్మ’ కావాలన్నాను. “నేను మీకోసం కొత్తగా ఒకటి వేసి మీకు పోస్ట్ చేస్తాను” అని నా అడ్రెస్ తీసుకొన్నారు. మాట ఇచ్చినట్టే సరిగా వారం రోజుల్లో బాపుగారినుంచి పోస్టులో ‘సిగార్‌తో బాపుగారి బొమ్మ’ వచ్చింది!

ఆ బొమ్మ, ప్లస్, వారిదగ్గర నేను అడిగి తీసుకొన్న ‘పెళ్ళిపుస్తకం’ సినిమాలోని ఒక సీన్‌కు వారు వేసుకొన్న మొత్తం స్టోరీబోర్డు కాపీ ఇప్పటికీ ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెలో నాదగ్గర భద్రంగా ఉన్నాయి.

వారికి సెలవు చెప్పి బయటికి వస్తోంటే ఇంటిముందు విశాలమైన ఆవరణలో ఒక ఊయల. ఎదురుగానే హీరో మమ్ముట్టి ఇల్లు. గేట్ దాటి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగిచూస్తే – ఇంకా బయటే మాకు చేయి ఊపుతూ బాపు గారు!

ఇన్ని అద్భుత జ్ఞాపకాలనిచ్చిన బాపుగారికి వారి జయంతి సందర్భంగా ఇదే నా వినమ్ర నివాళి.

^^^^^
Read this and more articles on 'Manoharam' Elite Web Magazine:
https://manoharam.in/movies/bapu-gari-bomma 

Saturday 12 December 2020

నా ట్విట్టర్ "లాక్"‌ అయిన వేళ!

గత కొన్నేళ్ళుగా ఫేస్‌బుక్‌ను తిట్టుకొంటూ, ట్విట్టర్‌ను మెచ్చుకొంటూ ఉండేవాన్ని. రెండురోజుల క్రితం  జరిగిన ఒకే ఒక్క సంఘటనతో నేను మళ్ళీ ఫేస్‌బుక్ మూలపురుషుడు మార్క్ జకెర్‌బర్గ్ ఫ్యాన్ అయిపోయాను. 

సోషల్‌మీడియాలో వెరిఫికేషన్‌కోసం మధ్యలో అప్పుడప్పుడూ మన ఈమెయిలూ, మన మొబైల్ నంబరూ అడుగుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. 

పొరపాటున మనం ఫోన్ నంబర్ మార్చుకొన్నపుడు, సెట్టింగ్స్‌కు వెళ్ళి అది వెంటనే అప్‌డేట్ చేసు కోవాలి. లేదంటే - ఏదో ఒకరోజు ఈ చిన్నపొరపాటుతో లాక్ అయిపోవాల్సివస్తుంది.  

ఫేస్‌బుక్ అయితే ఇంక చాలా అడుగుతుంది: పుట్టిన ఊరు, అమ్మమ్మ పేరు, చిన్నప్పటి ఫ్రెండు, నాన్న పుట్టిన ఊరు... ఎట్సెట్రా. అయితే, ఏదో చేసి మొత్తానికి ఫేస్‌బుక్ వాడు తన యూసర్‌ని నిలబెట్టుకొంటాడు తప్ప వదులుకోడు. 

ట్విట్టర్ అలా కాదట! ఫోరమ్స్‌లో చదివాను: 

బై మిస్టేక్... మన మారిన మొబైల్ నంబర్ మార్చకుండా - వెరిఫికేషన్ సమయంలో "సెండ్ కోడ్ టు మై మొబైల్ నంబర్" నొక్కామా... కథ కంచికే! 

ఆ కోడ్ మనం తెచ్చుకోలేం, ట్విట్టరోడు మనల్ని పట్టించుకోడు. ఎన్ని సార్లు లాగిన్ అయినా "ఎంటర్ కోడ్" అనే వస్తుంది తప్ప, అసలు ఎంటర్ కానీడు! సపోర్ట్‌కు మెయిల్ పంపినా ఏం లాభం ఉండదు. ఏదో ముందే సెట్ చేసిన చెత్త ఆన్సర్ ఏదో వస్తుంది - కొన్ని రోజుల్లో చెప్తాం అని. 

ఫేస్‌బుక్ అలా కాదు. అప్పటికప్పుడు 101 ఆప్షన్స్ ఇస్తుంది. సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. 

సోషల్ మీడియాలో ట్విట్టర్ టాప్‌కు రీచ్ కాలేదు అంటే ఎలా అవుద్ది?!

కట్ చేస్తే - 

ఎవరైనా ట్విట్టర్ ఎక్స్‌పర్ట్ మిత్రులు సొల్యూషన్ తెలిస్తే చెప్పగలరు అని మనవి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్! :-) 

ట్విట్టర్ వాడుతున్నవాళ్ళు... ఒకవేళ మీ నంబర్ మారినట్లైతే ముందు సెట్టింగ్స్‌కు వెళ్ళి నంబర్ అప్‌డేట్ చేసుకోండి. లేదంటే ఏదో ఒక టైమ్‌లో ఇరుక్కుపోతారు! ఇది చెప్పడానికే ఈ పోస్టు.   

Monday 7 December 2020

నా బ్లాగింగ్‌కి కొనసాగింపే... మ్యాగజైన్!

‘మనోహరమ్’ డిజిటల్ మ్యాగజైన్ నా రైటింగ్, బ్లాగింగ్ ప్యాషన్‌లో భాగమే.

ఈ లాక్‌డౌన్ ఇంకాస్త రిలీఫ్ ఇచ్చాక, డైరెక్టర్‌గా కూడా ఇకనుంచీ గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. అన్నీ అనుకున్నట్టు సెట్ చేసుకోగలిగితే, బహుశా జనవరి చివరి వారంలో నా కొత్త సినిమా ప్రారంభం వుంటుంది. 

కట్ చేస్తే –

సక్సెస్ సైన్స్, సినిమాలు, సరదాలే (Mindset, Movies, Masti) ప్రధానంగా – ‘మనోహరమ్’ ఒక బిందాస్ పాజిటివ్ డిజిటల్ మ్యాగజైన్. ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్ కంటెంట్‌లో సక్సెస్ సైన్స్ తర్వాత స్థానం సినిమాదే. ఈ నేపథ్యంలో… సినీ జర్నలిస్టులు, పీఆర్వో మిత్రులతో వ్యక్తిగతంగా క్రింది విషయాలను షేర్ చేసుకోడానికి సంతోషిస్తున్నాను:

1. సినిమారంగానికి సంబంధించినంతవరకు ‘మనోహరమ్‌’లో వంద శాతం పాజిటివ్ రైటప్‌లే వుంటాయి. ఎలాంటి సందర్భంలో అయినా వంద శాతం సినీఫీల్డువైపే పాజిటివ్‌గా వుంటుంది మనోహరమ్.

2. 'మనోహరమ్‌’లో సినిమా రివ్యూలకోసం ప్రత్యేకంగా కాలమ్ లేదు. కాని, రివ్యూలు కూడా వుంటాయి. మళ్లీ వెనుకటి సినిమారంగం, విజయచిత్ర పత్రికల రోజులు గుర్తుకువచ్చేలా .. మనోహరమ్‌లో సినిమా రివ్యూలు పూర్తి విభిన్నంగా, నిర్మాణాత్మకంగా ఉండేలా రాయాలన్నది నా ఆలోచన. ఈ సౌకర్యాన్ని దర్శకనిర్మాతలు వినియోగించుకొనేలా చేయగలరని సవినయ మనవి.

3. అలాగే – చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలవరకు… కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, పోస్ట్ రిలీజ్ దాకా – ‘మనోహరమ్’ మ్యాగజైన్‌లో విభిన్నమైన Conceptual and Customized Promotion Plans పరిచయం చేసే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్-డైరెక్టర్లు ఈ సౌకర్యం కూడా వినియోగించుకొనేలా చేయగలరని సవినయ మనవి. ఈ విషయంలో మీ అమూల్యమైన సలహాలు, సూచనలకు స్వాగతం.

4. 'మనోహరమ్’లో హీరోహీరోయిన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, వారి గురించి రైటప్స్ కూడా ఉంటాయి. ఈ విషయంలో ఫిలిం జర్నోస్, పీఆర్వో మిత్రులు నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. 

థాంక్యూ సో మచ్! 

My whatsapp: 9989578125
My email: mchimmani10x@gmail.com

“ఈ ప్రపంచంలో
అత్యంత అసాధ్యమైన పని ఒక్కటే.
మనం ఎన్నటికీ ప్రారంభించని పని!”

Wednesday 2 December 2020

లిరిక్ రైటర్ 'లోరా'

సుమారు 7 ఏళ్ల క్రితం అనుకుంటాను... ఒక యువ లిరిక్ రైటర్ నా బేగంపేట ఆఫీసుకొచ్చాడు. తాను రాసిన పాటలు చూపించాడు. ఒక సిచువేషన్ ఇస్తే, దానికి ఓ గంటసేపట్లో ఆఫీసులోనే కూర్చుని పాటరాసి చూపించాడు. 

అంతా బాగానే ఉంది. కొత్త రైటర్ కాబట్టి ప్రొఫెషనల్ రైటింగ్, సినిమా లిరిక్స్ రైటింగ్‌కు సంబంధించిన కొన్ని బేసిక్స్ ఇంకా పూర్తిగా తెలియదని అర్థమైంది. తర్వాత, నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ టైమ్‌లో కూడా నా ఆఫీసుకొచ్చాడు. షరా మామూలే. రాసి వున్న పాటలు చూపించాడు. అప్పటికప్పుడు ఒక సిచువేషన్‌కు రాసి చూపించాడు. కొంచెం గైడెన్స్‌తో బాగా రాయగలడు. అయితే, హీరో నేపథ్యంలో వున్న ఒక ఆబ్లిగేషన్ కారణంగా మొత్తానికి ఆ కొత్త లిరిక్ రైటర్‌ను పరిచయం చెయ్యలేకపోయాను. 

కట్ చేస్తే - 

ఈమధ్య ఈ లిరిక్ రైటర్‌కు, నాకు మధ్య కొంచెం కమ్యూనికేషన్ పెరిగింది. చాలా విషయాలు తెలిశాయి అతని గురించి...

> ఒక వెబ్‌పోర్టల్ నిర్వహించాడు.
> యూట్యూబ్ చానెలుంది.
> మ్యూజిక్ వీడియోలు చేస్తుంటాడు.
> కొన్ని షార్ట్ ఫిల్మ్స్/మ్యూజిక్ వీడియోల్లో యాక్ట్ కూడా చేశాడు.
> స్క్రిప్ట్/డైలాగ్ రైటింగ్‌మీద కూడా ఆసక్తి వుంది.
> ఈమధ్య కొత్తగా మీమ్స్ చేస్తున్నాడు.
> ఒక షార్ట్ ఫిల్మ్ రచించి డైరెక్ట్ చేశాడు. (నేను చూసింది ట్రయలర్.) 
> ఒకటి రెండు సినిమాలకు కూడా లిరిక్స్ రాశాడు కాని, అవి ట్రాక్ ఎక్కలేదు.  

వైజాగ్‌లో ఉద్యోగం చేస్తూనే, ఇలా చాలావాటిల్లో తన స్కిల్ నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నాడీ యువకుడు. 

జాక్ ఆఫ్ ఆల్...
కాని, మాస్టర్ ఆఫ్ నన్ కాకూడదు.  

మంచి కమ్యూనికేషన్, చొచ్చుకుపోయే గుణం సినిమా ఫీల్డులోనే కాదు, మరే ఫీల్డులోనైనా చాలా ముఖ్యం. తన స్కిల్స్‌తో పాటు ఈ యువకుడు ఈ రెండు చిన్న విషయాల్లో కూడా కొంత శ్రధ్ధపెడితే చాలు... తన లక్ష్యం చాలా సులభంగా చేరుకోగలుగుతాడు. 

2021 ప్రారంభంలో నా కొత్త చిత్రం ద్వారా ఈ యువకున్ని నేను లిరిక్ రైటర్‌గా పరిచయం చేస్తున్నాను. ఈలోపే, ఇంకో సినిమా ద్వారా ఇంకెవరైనా డైరెక్టర్ పరిచయం చేసినా ఆశ్చర్యం లేదు.

రాజేశ్ లోకనాథం అతని పేరు. 'లోరా' ఎంటర్‌టైన్‌మెంట్ అతని యూట్యూబ్ చానెల్ పేరు. 

ఐ విష్ హిమ్ బెస్టాఫ్ లక్.