Saturday 27 February 2016

'వంగవీటి' వర్మ!

ఒక సినిమా స్క్రిప్టు కూడా రెడీ అవకముందే, కేవలం దాని కాన్సెప్ట్‌తోనే ఒక రేంజ్ సంచలనం క్రియేట్ చేసి, తద్వారా ఆ సినిమా బిజినెస్ కూడా భారీరేంజ్‌లో జరిగేలా గేమ్ ఆడ్డం అనేది అంత ఆషామాషీ విషయం కాదు.

అదొక పెద్ద ఆర్ట్. ఒక పెద్ద బిజినెస్ జిమ్మిక్. ఒక పెద్ద ప్రమోషన్ ప్లాన్.  

నా ఉద్దేశ్యంలో, ఈ ఆర్ట్ రామ్‌గోపాల్‌వర్మలో ఉన్నంతగా ప్రస్తుతం మరే ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్‌లోనూ లేదు.

కొందరికి ఇది నచ్చకపోవచ్చు. తప్పుగా అనిపించవచ్చు. అది వేరే విషయం.

బట్ .. అన్ని వ్యాపారాల్లాగే సినిమా అనేది కూడా ఒక వ్యాపారమే. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్. లేదా క్రియేటివ్ బిజినెస్.

బిజినెస్ అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎవరి స్టయిల్లో వారు తమ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకుంటారు. ఏ స్టయిల్ కరెక్ట్ అన్నది ఒక్కొక్కరి వ్యక్తిగత ఆలోచనావిధానాన్నిబట్టి ఉంటుంది. వీటిల్లో ఎవరి స్టయిల్ కరెక్ట్ అన్నది పాయింట్ కాదు. టార్గెట్ రీచ్ కావడమే పాయింట్.

కోట్లు కుమ్మరించిన నిర్మాతకు తిరిగి డబ్బులు వచ్చేలా చెయ్యడమే ఇక్కడ ప్రధాన టార్గెట్.

ఇప్పటి సినిమా బిజినెస్, ఒకప్పటి సినిమా బిజినెస్ పూర్తిగా వేరు .. ఏ యాంగిల్‌లో చూసినా.

సినిమా మేకింగ్ నుంచి, దాని ప్రమోషన్, ఎగ్జిబిషన్ విషయాల్లో ఆధునికంగా ఎన్నో ఊహించని మార్పులు వచ్చాయి. ఊహించనంత వేగంగా మరెన్నో మార్పులొస్తున్నాయి.

ఇదివరకటిలాగా - సినిమా ఎలా ఉన్నా, ఓపిగ్గా దాన్ని మూడు గంటలపాటు కూర్చొని చూసే ప్రేక్షకులెవ్వరూ లేరిప్పుడు. చెప్పాలంటే, ఫిలిం మేకర్స్ కంటే వ్యూయర్స్‌కే ఇప్పుడు చాలా విషయాలు చాలా బాగా తెలుసు.    

ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడొద్దు అనేది క్షణంలో నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడే టెక్నాలజీ ఇప్పుడు వ్యూయర్ చేతుల్లో ఉంది.

అన్నింటికంటే ముఖ్యంగా .. ఇప్పుడు సినిమా అంటే ఒక వారం, లేదా రెండు వారాలే! 50 రోజులు, 100 రోజులు అని తమ సినిమా గురించి ఎవరైనా అన్నారు అంటే .. వారి గురించి కొంచెం కిందా మీదా చూసి ఆలోచించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో - సినిమా ప్రమోషన్ అనేది అసలు సినిమా కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవాల్సిన అంశంగా మారింది.

కట్ టూ వర్మ -

సింగిల్ పైసా ఖర్చులేకుండా మీడియాను ఎలా తనవైపు తిప్పుకోవాలో వర్మకు తెలిసినంతగా మరొక డైరెక్టర్‌కు తెలియదు:

> నా తర్వాతి సినిమా "వంగవీటి" అన్నాడు వర్మ. సెన్సేషన్ స్టార్టెడ్.
> తెలుగులో ఇది నా చివరి సినిమా అన్నాడు. ఇదింకో సెన్సేషన్.
> కమ్మ .. కాపు సాంగ్ రిలీజ్ చేశాడు. ఇదో పెద్ద రగడ.
> నాకు తెలిసినంతగా విజయవాడ గురించిగానీ, అక్కడి రౌడీయిజం గురించి గానీ ఇంకెవ్వరికీ తెలీదు అన్నాడు. ఇలాంటి మరెన్నో ట్వీట్ల వర్షం కురిపించాడు. ఇదో పెద్ద క్యూరియాసిటీ. 
> ఈలోపు ఆయనకు బెదిరింపులు! అవి నిజం కావొచ్చు. జిమ్మిక్ కావొచ్చు. కానీ, సెన్సేషన్!
> ఆ వార్నింగులకు వర్మ కౌంటర్ వార్నింగులు!! అది కూడా .. ఫ్లైట్ టికెట్, హోటల్ రూం  వగైరా పూర్తి వివరాలిస్తూ.

కట్ చేస్తే - 

ఇంతకుముందెన్నడూ లేని విధంగా .. ఒక ఫాక్షనిస్ట్ సినిమాను మించి పెద్ద కాన్వాయ్. వందలాది బైకులు. వేలాదిమంది జనం.

ఇంతకంటే పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుంది?

ఒక సినిమా స్క్రిప్టు, షూటింగ్ కంటే ముందే దాని ప్రమోషన్, బిజినెస్ ఒక రేంజ్‌కెళ్లిపోయాయి.

సినిమా ఇండస్ట్రీ భాషలో .. 'వంగవీటి' హిట్టా ఫట్టా ఇక అనవసరం.

టార్గెట్ రీచ్‌డ్.

ఇప్పుడు కూల్‌గా తన రిసెర్చ్ పూర్తి చేసుకొని, తను అనుకున్నవిధంగా సినిమా తీసేస్తాడు వర్మ. ఈలోపు మరెన్నో సంచలనాలుంటాయి. ట్వీట్ల ద్వారా. వాటి రియాక్షన్ ద్వారా.

ఇలా చాలామంది డైరెక్టర్లు చేయాలనుకుంటారు. కానీ చేయలేరు. దానిక్కావల్సింది గట్స్. నా ఇష్టం అనుకొనే ఒక మైండ్‌సెట్. అదంత ఈజీ కాదు.

దటీజ్ వర్మ! 

Wednesday 17 February 2016

హాపీ బర్త్‌డే, కె సి ఆర్!

రాష్ట్ర అసెంబ్లీలో ఒకప్పుడు తెలంగాణ పదాన్నే నిషేధించారు అని విన్నప్పుడు రక్తం మరుగుతుంది.

అదే అసెంబ్లీలో - తమ పార్టీ అధినేతలకు చెంచాగిరీ చేస్తూ, నోరెత్తక కూర్చున్న అనేకమంది ‘సన్నాసి’ తెలంగాణ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్లేలను గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గనిపిస్తుంది.

ఇలాంటి నేపథ్యంలో - దశాబ్దాలుగా లేస్తూ, పడిపోతూ .. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి, నింగిని అంటుకునేలా రగల్చడానికి ఒక ఉద్యమ నాయకుడు అవసరమయ్యాడు.

ఆ అవసరాన్ని గుర్తించి - తెలంగాణ సాధనే తన జీవితాశయంగా, జీవితంగా మార్చుకొని - తిరుగులేని ఉద్యమనాయకుని అవతారమెత్తిన ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు .. ఉరఫ్ .. కె సి ఆర్.

తన తిండి, తిప్పలు, గాలి, నీరు, నిద్ర .. అన్నీ తెలంగాణగా పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో నానా విన్యాసాలు చేశాడు కె సి ఆర్.

ఎన్నో అడ్డంకులు. అవమానాలు. ఎదురుదెబ్బలు. ఎగతాళి. తిట్లు. శాపనార్థాలు.

అయినా చెక్కు చెదరని ఏకాగ్రతతో - ఎదుటివారికి ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్టులు ఇస్తూ, తికమకపెడుతూ, అవేశం రగిలినప్పుడు తిడుతూ, అవసరమైనచోట అణకువ పాటిస్తూ, అందరిని కలుపుకుపోతూ - ఉద్యమాన్ని ముందుకే నడిపాడు తప్ప .. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జ్వాల ఆరిపోనివ్వలేదు.

ఏం మేధస్సు .. ఎంతటి వాగ్ధాటి .. అసలు ఏమిటా జ్ఞాపక శక్తి ..

ఎంత పట్టుదల .. ఎంత ఓర్పు .. ఎంత శక్తి .. ఎంత మానవత్వం .. ఎంత చాకచక్యం .. ఎన్ని ఎత్తులు .. ఎన్ని జిత్తులు ..

అన్నీ ఒకే ఒక్క లక్ష్యం కోసం.

అది .. తెలంగాణ సాధన.

ఈ ఒక్క లక్ష్యమే కె సి ఆర్ నోటివెంట విసరడానికి సిధ్ధంగా ఉన్న గ్రెనేడ్ లాంటి ఒక మాటగా వేలాదిసార్లు వినిపించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించింది:

"తెలంగాణ తెచ్చుడో .. సచ్చుడో!"

ఎంత ఆత్మ విశ్వాసం .. ఎంత తెగింపు .. ఎంత లేజర్ ఫోకస్ ..

చివరికి ఒక రోజు - "ఆంధ్రప్రదేశ్ నుంచి డిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణ గడ్డమీదనే!" అని చెప్పిమరీ వెళ్లాడు కె సి ఆర్.

చెప్పినట్టుగానే, నాలుగురోజుల తర్వాత .. డిల్లీ నుంచి తెలంగాణ గడ్డమీదనే మళ్ళీ కాలుపెట్టాడు కె సి ఆర్.

దటీజ్ కె సి ఆర్!

విజయమే లక్ష్యంగా - వందలాది నాయకుల్ని, వేలాది గ్రూపుల్నీ సంఘాల్నీ, కోట్లాది ప్రజలను సమన్వయం చేసుకొంటూ - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ, పరుగెత్తిస్తూ - ఉద్యమాన్ని ఉరకలెత్తించి గమ్యం చేర్చిన కె సి ఆర్ గత పద్నాలుగేళ్ల జీవితం, నా జీవితకాలంలో నేను స్వయంగా నా కళ్లముందు చూసిన ఒక విజయ గాథ.

కాగా - ఈ గమ్యం చేరుకోవడం కోసం ఆయన వేసుకున్న బ్లూప్రింటు, అనుసరించిన వ్యూహం, నడిపించిన డిప్లొమసీ, కూడగట్టిన లాబీయింగ్, వేసిన ఎత్తులు, చేసిన జిత్తులు, ఆవేశంలో అరచిన అరుపులు, పడిన తిట్లు, పాటించిన మౌనం, పెట్టిన చెక్‌లు .. అదంతా ఒక యుధ్ధ తంత్రం.

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన అంతటి ఒక వ్యక్తికి, ఉద్యమశక్తికి .. రేపటి మన బంగారు తెలంగాణ రూపశిల్పికి, దాని సాధనకోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిపోతున్న సిసలైన రెనెగేడ్ కార్యసాధకునికీ .. ఒక రచయితగా, ఒక చలనచిత్ర దర్శకుడిగా,  ఒక అభిమానిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఇవే నా హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 

Monday 15 February 2016

గై ఆన్ ది సైడ్‌వాక్

ఈ బెస్ట్ సెల్లర్ ఇంగ్లిష్ నవల వచ్చే మార్చి 10 నాడు  ప్రపంచమంతా విడుదల కాబోతోంది.

భరత్‌కృష్ణ తొలి నవల ఇది. అయినా, ముందే 'బెస్ట్ సెల్లర్' అని గర్వంగా చెప్పగలుగుతున్నానంటే .. అది నా నమ్మకం. రేపు కాబోయే నిజం.

చెప్పాలంటే .. ఈ నవలా రచయితకు నేను ఫ్యాన్‌ని!

కట్ టూ భరత్‌కృష్ణ - 

గుంటూరులోని ఓ కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలో సుమారు పాతికేళ్లక్రితం ఓ రెండేళ్లు పనిచేశాన్నేను.

ఆ రెండేళ్లలో, నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థులెందరి పేర్లో నేనిప్పుడు కూడా చెప్పగలను:  రాజశేఖర్ బాబు, సి హెచ్ వి కె ఎన్ ఎస్ ఎన్ మూర్తి, బోడా సాంబశివరావు, సజ్జా సాంబశివరావు, కొల్లూరి వీరరాఘవ, సురేష్‌బాబు, ఎన్ వి ఎస్ ఆర్ కె ప్రసాద్, దిలీప్, దుర్గారామ్, మోహన్‌రావు, మస్తాన్, సత్యంబాబు, ముత్తయ్య, నాగరాజు, లక్ష్మీకుమార్; లక్ష్మీకవిత, సౌజన్య, మమత, బేబి, ఉషారాణి, రమాదేవి, వీణ, విద్య, చైతన్య, సూరం మాధవి, సుష్మ,  వాగ్దేవి, లీల .. ఇలా కనీసం ఇంకో 100 మంది విద్యార్థుల పేర్లు నేను చాలా ఈజీగా చెప్పగలను.

వీళ్లంతా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నాకు గుర్తుండిపోయారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం. ఏదో ఒక ప్రత్యేకత.            

అప్పటి ఆ విద్యార్థుల్లో ఇప్పుడు కొందరు ఐ ఎ యస్ లయ్యారు. ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లయ్యారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, లెక్చరర్లు అయ్యారు. మరెందరో మంచి బిజినెస్‌మేన్‌లయ్యారు. ఇంకెందరో రకరకాల ఫీల్డుల్లో, వివిధహోదాల్లో, విదేశాల్లో కూడా ఉన్నారు.

ప్రస్తుతం తమిళనాడులోని మధురై జిల్లా కలెక్టర్ అప్పటి మా విద్యార్థి కొల్లూరి వీరరాఘవ! మొన్న ఫిబ్రవరి 2 నాడే ప్రెసిడెంట్స్ అవార్డ్ కూడా తీసుకున్నాడు.

అప్పుడు, అలా నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థుల్లో కొందరితో నాకిప్పటికీ మంచి కమ్యూనికేషన్, మరెంతో మంచి అనుబంధం ఉంది. వాళ్లను నేను అభిమానిస్తాను. చెప్పాలంటే .. వారికి నేను ఫ్యాన్‌ని.

అదిగో, అలా .. నేను భరత్‌కృష్ణకు కూడా ఫ్యాన్‌ని!

భరత్ నవలను, దాని మాన్యుస్క్రిప్ట్ దశలోనే చదివిన క్రెడిట్, ఆనందం, గర్వం నాకున్నాయి. గర్వం ఎందుకంటే .. నేను చూస్తుండగా, నా కళ్లముందు ఎదిగిన నిలువెత్తు వ్యక్తిత్వం భరత్.

భరత్ ఈ నవల కాన్‌సెప్ట్‌ను అనుకున్న క్షణం నుండి, దాన్ని తను రాయడం పూర్తిచేసేవరకు ప్రతి స్టేజ్ నాకు తెలుసు. ప్రతి స్టేజ్‌లో తన భావాల్ని నాతో పంచుకున్నాడు. నిర్మొహమాటంగా తన ఉద్దేశ్యాల్ని నాకు చెప్పాడు.

బేసిగ్గా నేనూ రచయితనే కాబట్టి - నాకు తోచిన ప్రతి చిన్న అంశాన్నీ అతనితో చర్చిస్తూ, ప్రతి జాగ్రత్తనీ వివరిస్తూ, ఈ నవలను చాలా తొందరగా రాయమని భరత్‌ని బాగా పోరుపెట్టింది నేనే. అది బయటికి రావడం ఆలస్యమౌతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయిన మొదటి సాక్షిని కూడా నేనే.

కట్ టూ మార్చి 10 -

ఇప్పుడు .. అన్ని అవాంతరాలను అధిగమించి, భరత్‌కృష్ణ రాసిన "గై ఆన్ ది సైడ్‌వాక్" నవల ఈ మార్చి 10 నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ ఎక్జైట్‌మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న మొదటి వ్యక్తినీ, మొదటి పాఠకుడినీ నేనే కావడం నాకు మరింత ఆనందంగా ఉంది. 

Tuesday 9 February 2016

ఒక అంతశ్శోధన

కొత్త సినిమా స్టార్ట్ చేసే వరకూ ఇంక బ్లాగ్ వైపు చూడొద్దనుకున్నాను.

నగ్నచిత్రం ఏదో ఒకటి రాయడానికి కాదు. నేను రాసింది కనీసం ఒక్కరికైనా నచ్చాలి. ఆనందం ఇవ్వాలి. ఎట్‌లీస్ట్ ఆ క్షణం ఆలోచింపచేయాలి.

ఇంక ఈ బ్లాగ్ ద్వారా నేను ఆశించే మరో ప్రయోజనం .. నా సినిమాల ప్రమోషన్.

నా సినిమా జరుగుతున్నంతసేపూ - ఆ ప్రాసెస్‌లో .. నాకు తోచిన, రాయాలనిపించిన ప్రతి చిన్న అంశం మీద కూడా ఏదో ఒకటి రాస్తాను. ఇంక ఆ చిత్రానికి పనిచేస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో కూడా దాదాపు ప్రతి ఒక్కరి గురించీ రాస్తాను.

కట్ టూ అసలు పాయింట్ - 

నిన్ననే ఒక ట్వీట్ పెట్టాను. "ఫెబ్ ఈజ్ ఫర్ ఫ్రీడమ్" అని.

అంటే, ఈ ఫిబ్రవరి నెలలోనే ఎప్పటినుంచో నేను కోరుకొంటున్న ఫ్రీడమ్ తెచ్చుకోబోతున్నాను. కోరితెచ్చుకొన్న కొన్ని తలనొప్పుల్లోంచి ఫ్రీ అయిపోవాలనుకొంటున్నాను. కనీసం ఆ ప్రాసెస్ అయినా ప్రారంభం కావాలి. ప్రారంభిస్తాను.

అదీ, ఈ ఫిబ్రవరిలోనే!

మరోవైపు నా కొత్త సినిమాలు కూడా  ప్రారంభించబోతున్నాను. అందులో మొదటిది నా ఆత్మీయ మిత్రునితో కలిసి చేస్తున్నాను. నిజంగా అదొక చాలెంజింగ్ ప్రాజెక్ట్ అవుతుంది నాకు.

ఇదంతా ఎలా ఉన్నా .. అన్నిటికంటే ముందు, అసలు ఈ బ్లాగ్ నా కోసం నేను క్రియేట్ చేసుకున్నది. కాబట్టి, ఏదో క్షణికావేశంలో అర్థంలేని నిర్ణయాలను తీసుకోవడం ఫూలిష్‌నెస్ అవుతుంది.

సినిమాల దారి సినిమాలదే. బ్లాగింగ్ బ్లాగింగే.

నామట్టుకు నాకు .. బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం.

నా ఈ నగ్నచిత్రం లో నన్ను నేను చూసుకుంటున్నాను. నాలో ఉన్న నన్ను ని విశ్లేషించుకుంటున్నాను.