Thursday, 30 March 2023

ఏదైనా సాధించాలనుకొనేవారికి ఎవరికైనా కావాల్సింది అదే!


ఎవరైనా, ఎప్పుడైనా, ఏదైనా ప్రారంభించవచ్చు, సాధించవచ్చు. మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నంతవరకు ఎలాంటి వయోపరిమితి కూడా లేదు. ఇప్పటికే ఎందరో దీన్ని నిరూపించి చూపారు.  

ఉచిత సలహాదారులు, "నే సేయర్స్" మాటలు అస్సలు పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రయత్నం ఫెయిలయినా, అనుకున్నట్టు జరక్కపోయినా చింతించాల్సింది ఏమీ లేదు. ఒకటి కాకపోతే ఇంకొకటి. ఆగే పనిలేదు.  

అంతే తప్ప - చేతులు ముడుచుకొని నాలుగు గోడల మధ్య కూర్చొని, ఎవరెవరికో ఉచిత సలహాలిచ్చే బదులు... ఏదో ఒక పని చేస్తూవుండటం చాలా మంచిది. అనవసరంగా వయసులోనే ముసలితనం రాదు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం.  

ఈ సందర్భంగా... పలు సమయాల్లో, పలు విధాలుగా... సాంఘికంగా, ఆర్థికంగా నాకు సహకరించిన కొందరు ప్రియాతిప్రియమైన నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 

“Gratitude is the fairest blossom which springs from the soul.”
– Henry Ward Beecher.  

కట్ చేస్తే - 

ఏదైనా ఒక పనిని సగం సగం అనుకున్నప్పుడు... రెండు మూడు పడవల మీద కాళ్ళు పెట్టినప్పుడు... మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. ఫలితాలు కూడా సగం సగమే ఉంటాయి. 

అలా కాకుండా... పూర్తి స్థాయిలో ఒక పనిలోకి దిగినప్పుడు, ఏది అడ్డమొచ్చినా కొట్టేసుకుంటూ ముందుకే వెళ్తుంటాం. 

చిన్నదైనా పెద్దదైనా... ఏదైనా సాధించాలనుకొనేవారికి ఎవరికైనా కావల్సింది అదే. 

ఫోకస్. ఏకాగ్రత. ఒక్కటే చూపు.

ఒక్కవైపే చూపు.     

Tuesday, 28 March 2023

ఏమైనా సరే, సినీ ఫీల్డులోకి నేను ప్రవేశించి తీరాలి!


మా సొంత ప్రొడక్షన్ హౌజ్ Manutime Movie Mission (MMM) ద్వారా, నా ఇతర సినిమాల ద్వారా... ఇప్పటివరకు... కనీసం ఒక 55+ మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. 

ఆర్టిస్టులు: 
విలన్ అమిత్ కుమార్ (అమిత్ తివారి); హీరోయిన్స్ నయన హర్షిత, విదిశ శ్రీవాస్తవ, ప్రియ వశిష్ట; గౌతమ్, మాధవ్ మురుంకర్... ఎట్సెట్రా. త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో అమిత్ తివారి తప్పనిసరిగా ఉంటాడు. నేను పరిచయం చేసిన హీరోయిన్స్ తర్వాత తెలుగుతో పాటు వివిధ భాషల్లో చేశారు. బిజినెస్ మాగ్నెట్స్ అయ్యారు, ఇంటర్నేషనల్ మోడల్స్ అయ్యారు. హిందీ సీరియల్స్ కూడా చేస్తున్నారు. 

టెక్నీషియన్స్: 
మ్యూజిక్ డైరెక్టర్స్ ధర్మతేజ, కేపీ, ప్రదీప్ చంద్ర; డాన్స్ మాస్టర్స్ శాంతి మాస్టర్, రాజేష్ మాస్టర్; ఎడిటర్ భాస్కర్... ఎట్సెట్రా. నేను పరిచయం చేసిన శాంతి మాస్టర్ తర్వాత మణిరత్నం సినిమాల్లో చేసింది, పవన్ కళ్యాణ్ సినిమాలకు చేసింది. ఇంకో మాస్టర్ వందలాది సినిమాలకు కోరియోగ్రఫీ చేశాడు. త్వరలో డైరెక్టర్ కాబోతున్నాడు.   

ఇట్లా ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే చాలా ఉంది... ఈ ఒక్క పోస్టులో సాధ్యం కాదు. They're all gems!  

కట్ చేస్తే -   

"ఏమైనా సరే, సినీ ఫీల్డులోకి నేను ప్రవేశించి తీరాలి" అనుకొనే - బాగా కసి వున్న - 'Go-Getter' ఔత్సాహికుల కోసం ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేశాను. 

పరిచయం కావాలనుకొనే/టీమ్ లోకి రావాలనుకొనే/కలిసి పనిచేయాలనుకొనే  ఔత్సాహికులు క్రిందివారు ఎవరైనా కావచ్చు: 

"కొత్త" -

ఆర్టిస్టులు
టెక్నీషియన్లు
అసిస్టెంట్ డైరెక్టర్స్ (ADs)
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ (AD)
యూట్యూబర్స్ (AD)   
రైటర్స్ 
లిరిక్ రైటర్స్
సింగర్స్
మ్యూజిక్ కంపోజర్స్
డాన్స్ మాస్టర్స్ 
డీఓపీలు
స్టిల్ ఫోటోగ్రాఫర్స్
గ్రాఫిక్ ఆర్టిస్టులు
&
ఇన్వెస్టర్స్/ఫండర్స్
ప్రొడ్యూసర్స్
కో-ప్రొడ్యూసర్స్
ఫండర్స్/ఫైనాన్షియర్స్
ఫండింగ్ మీడియేటర్స్ 
మార్కెటింగ్ లీడర్స్
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ 
స్పాన్సర్స్
ఇన్-ఫిలిం బ్రాండింగ్ ఎగ్జిక్యూటివ్స్...
 
So, My Dear Aspirants... 
మీ వివరాలు, మొబైల్ నంబర్ తెలుపుతూ నాకు ఇన్‌బాక్స్ చేయండి. 

IMP: 
గ్రూప్‌లో చేర్చుకోవడం అంటే సినిమాలోకి, సినిమా టీమ్‌లోకి తీసుకోవడం కాదు. తర్వాత ప్రాసెస్ చాలా ఉంటుంది. 

See you in the Group!... All the best!!

- మనూ  

బరిలో ఉండటం అవసరం!


ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి టైమ్ పడుతుంది. రాకపోవచ్చు కూడా.

తాజాగా ఒక హిట్ ఇస్తే పరిస్థితి వేరు అనుకోండి. అది వేరే విషయం. 

సో, ఇలాంటి నేపథ్యం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి నాలాంటి చాలామందికి ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ తప్పదు. 

అంటే కొత్తగా మన ఇన్వెస్టర్స్‌ను మనమే వెతుక్కోవాలి. మన ప్రొడ్యూసర్స్‌ను మనమే కొత్తగా తయారుచేసుకోవాలి. 

చిన్నదో పెద్దదో... ఒక సినిమా చేయటం అనేది అంత కష్టం కాదు. పెద్ద పని కాదు. 

అయితే - సినిమా కోసం - మన కోర్ టీమ్‌లో - మనతో అసోసియేట్ అయ్యే ముఖ్యమైన ఒకరిద్దరిని ఎన్నుకోడం మాత్రం చాలా కష్టం. 

ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాం... అన్నీ పర్‌ఫెక్ట్‌గా అనుకున్నాం... "ఇతను నాకు కుడి భుజం", "ఇతను నాకు బ్యాక్ బోన్" గట్రా అని చాలా అనుకుంటాం. అంతా ఓకే, అందరూ ఓకే అనుకుంటాం. కాని, పొరపాటు జరుగుతుంది.  

అదంతే. 

"క్వయిట్ న్యాచురల్" అనుకొని ముందుకుపోవాల్సిందే. 

కట్ చేస్తే - 

మొన్న సాయంత్రం మిత్రుడు, డైరెక్టర్ బాబ్జీ మా ఆఫీసుకి వచ్చారు. చాలా సేపు మాట్లాడుకున్నాం. 

మా మాటల మధ్య ఆయన అన్న ఒక్క మాటే నాలో ఇంకా లైవ్‌గా ఉంది. నా మైండ్‌లో ఇంకా అదే తిరుగుతోంది. 

వ్యక్తిగత కారణాలో, ఇంకే కారణాలో గాని - ఫీల్డులో ఉండాలనుకునేవాళ్ళు ఎవరైనా సరే - గ్యాప్ తీసుకోవద్దు. గ్యాప్ తెచ్చుకోవద్దు. 

చిన్నదో పెద్దదో... ఏదో ఒక సినిమా తప్పక చేస్తుండాలి. 

బరిలో ఉండాలి.

ఉండి తీరాలి...   

ఈ నేపథ్యంలో ఒక రెండు ముఖ్యమైన గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను. వాటి గురించి ఇంకో పోస్టులో చెప్తాను. ఆసక్తి వున్న లైక్‌మైండెడ్ కనెక్ట్ అవచ్చు.   

"It’s cool for me because I’m a director, but I’m also a teacher. I’m a lover of cinema, and I love working with people who are hungry and have the energy to really do better work." 
~John Singleton 

Monday, 27 March 2023

విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం...


కొన్ని నిముషాల క్రితం నేను చూసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్... నా గురించి, నా ఆలోచనాశైలి గురించి నేను మరింత బాగా ఆలోచించుకునేలా చేసింది. 

ఆ పోస్టు రాసిన వ్యక్తి అంటే నాకు చాలా అభిమానం. వారు మంచి రచయిత. మంచి వ్యక్తి. అత్యంత బాధ్యతాయుతమైన మంచి పోస్టులో కూడా ఉన్నారు.   

పోస్టు ద్వారా - ఒక విషయంలో - వారిచ్చిన జడ్జ్‌మెంట్‌కు మాత్రం నేను వ్యతిరేకం. 

అభిప్రాయ భేదాలు సర్వ సహజం... 

అలాగని నేనిప్పుడు నా వాదన చెప్తూ, విషయాన్ని రచ్చ రచ్చ చేయలేను.

ఈ ఒక్క కారణంతోనే నేను మొదట్లోనే ఈ అంశం పైన ఒక బ్లాగ్ రాయాలనుకొని విరమించుకొన్నాను. 

అప్పుడే రాయాల్సిందని ఇప్పుడు నేను అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. అలాగని, ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తూ నా వాదనను చెప్పడం నాకిష్టం లేదు. 

ఓవరాల్‌గా అది మనల్ని మనమే, మనవాళ్లను మనమే తక్కువచేసుకోవడం అవుతుంది కాబట్టి. 

"The aim of argument,
or of discussion,
should not be victory,
but progress." 

- Joseph Joubert        

Sunday, 19 March 2023

The Best Politics Is Right Action !!


నిజం సాదాసీదాగా ఉంటుంది. అసలు పట్టించుకోరు. 

అబద్ధం ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. వెంటనే పడిపోతారు, వెంటపడతారు.   

కట్ చేస్తే -

తెలిసో, తెలియకో, అశ్రద్ధ వల్లనో, ఆత్మవిశ్వాసం వల్లనో... 2 విషయాల్లో తెలంగాణకు ఎంతో కొంత నష్టం జరుగుతూ వస్తోంది.   

#1.
బీజేపీ & ఇతర తెలంగాణ వ్యతిరేక శక్తుల పచ్చి అబద్ధాల ప్రచారం వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్‌లో, మీడియాలో రోజురోజుకూ ఊహించని పరిమాణంలో పెరిగిపోతోంది. గోబెల్స్ ప్రచారం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. 

దీని ఎదుర్కోడానికి - కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో  ఎవరో ఒక 20 మంది యాక్టివ్ సోషల్ మీడియా వారియర్స్ మాత్రమే పోరాడితే సరిపోదు. అవతలి గోబెల్స్ ప్రచారానికి కనీసం 10 రెట్ల స్థాయిలో, వివిధ పద్ధతుల్లో, వివిధ మీడియాలపై అత్యంత దూకుడుగా పనిచేస్తూ, అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే వ్యవస్థ ఒకదాన్ని వెంటనే క్రియేట్ చేసి యాక్షన్‌లో పెట్టకపోతే ప్రమాదం. 

#2.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో - ఎవ్వరైనా సరే - నయాపైసంత పనిచేస్తే 1000 రూపాయల పని చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడి దొంగ ఫోటోలో తెచ్చిపెట్టి "మేం చేశాం!" అని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. 

ఇక్కడ తెలంగాణలో ఎన్నో రంగాల్లో ఎన్నెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో మెచ్చుకుని గుర్తిస్తున్న అనేక ప్రాజెక్టులు, పనులు పూర్తిచేసి కూడా - వాటన్నిటి గురించి 10% కూడా పబ్లిసిటీ చేసుకోకపోవడం చాలా సీరియస్‌గా తీసుకొని ఆలోచించాల్సిన అంశం. వెంటనే ఈ దిశలో 10X స్పీడ్‌లో చర్యలు తీసుకోవడం చాలా అవసరం. 

ఇంకో ఏడెనిమిది నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో - ఈ 2 విషయాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో, వ్యూహాలతో... మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంత త్వరగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే అంత మంచిది. 

"The best politics is right action." 
- Mahatma Gandhi 
       

Friday, 17 March 2023

జస్ట్... ఒకే ఒక్క నిర్ణయం దూరంలో... మీ "ఒక్క ఛాన్స్!"


ఒక ఆర్టిస్టుకు తెరమీద కనిపించే ఆ "ఒక్క ఛాన్స్" రావడానికి పదేళ్ళు పట్టింది. ఒక రైటర్‌కు అవకాశం దొరికి స్క్రీన్ మీద టైటిల్ కార్డు చూసుకోడానికి పన్నెండేళ్ళు పట్టింది. ఒక డైరెక్టర్‌కు అన్నీ అనుకూలించి డైరెక్టర్ కావడానికి 16 ఏళ్ళు పట్టింది...   

ఫిలింనగర్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడా, గణపతి కాంప్లెక్స్, ఇప్పుడు మణికొండ... ఈ ఏరియాల్లోని సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ... 10-20 ఏళ్లయినా ఇంకా ఆ "ఒక్క ఛాన్స్" దొరకనివాళ్ళు ఎప్పుడూ వేలల్లో ఉంటారు! 

సాంకేతికంగా, సామాజికంగా, సమాచారపరంగా ఎన్నో మార్పులు వచ్చిన ఈ డిజిటల్ యుగంలో కూడా ఇప్పుడు మీరు అంత సమయం, డబ్బు వృధా చేసుకోనవసరం లేదు.    

ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి, బిజీ కావడానికి మీకు నిజంగా పనికొచ్చే శిక్షణ, ఎన్నో ఏళ్ళు వృధా చేసుకుంటే తప్ప మీకు దొరకని ఆ "ఒక్క ఛాన్స్", సిల్వర్ స్క్రీన్ పైన మీ టైటిల్ కార్డు... ఇవన్నీ కేవలం 6 నెలల్లో! 

ఈ అవకాశం కొద్ది మందికే. 

ఎగ్జయిటింగ్‌గా లేదూ?   

"ఒక్క ఛాన్స్" కోసం
సంవత్సరాల తరబడి
ఫిలిం ఆఫీసుల చుట్టూ తిరిగే
ట్రెడిషనల్ పద్ధతికి
ఈరోజే గుడ్‌బై చెప్పండి!

Get connected: 9989578125 

మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు, మన మైండ్‌సెట్!


"Uncertainty is the only certainty in Cinema. In a world of uncertainty everything is possible."  

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు... కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు! 

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట...

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని బయటివాళ్ళ అభిప్రాయం. ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం. 

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది. కాని ఇక్కడంతా బీటెక్‌లు, ఎంబిఏలు, పీజీలు, డబుల్ పీజీలు... కామన్.  

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్. 

కట్ చేస్తే - 

తాడిచెట్టు కిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు. పాలు తాగుతానంటే కుదరదు. ప్రిన్సిపుల్స్, పాపడ్స్ అనుకుంటూ కూర్చుంటే ఏం జరగదు. జస్ట్ టైమ్ అలా కరిగిపోతుంటుంది. 

అయితే మన ప్యాషన్‌తో, మన సినిమా ప్రొఫెషన్‌తో సంబంధం లేని అవతలి వాళ్లను ఎంత చిన్నస్థాయిలోనయినా సరే ఇబ్బంది పెట్టకూడదు అనేది సినీఫీల్డులో పనిచేసే ఎవరైనా విధిగా గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి రూల్. కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో... ఇంకా కొన్ని వ్యక్తిగత ప్రామిస్‌ల విషయంలో. 

తప్పు ఎప్పుడూ ఫీల్డుది కాదు. 

మన కామన్ సెన్స్, మన నిర్ణయాల తప్పే ఎక్కువగా ఉంటుంది. 

ఫీల్డులో మనం కలిసి ప్రయాణం చేయాల్సిన వ్యక్తుల ఎన్నిక విషయంలో కూడా సరిదిద్దుకోలేని తప్పులు జరుగుతాయి. వీటిని రియలైజ్ అయిన మరుక్షణమే ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. ఆలస్యం చేశామా... ఊహించలేనంత నష్టపోతాం.       

బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో మాస్కులు వేసుకోవచ్చు. ఇంకెన్నో చెప్తుండవచ్చు. అయితే... పూర్తి మెటీరియలిస్టిక్‌గా... ఒక జాబ్‌లా, ఒక కెరీర్‌లా, ఒక మంచి ఆదాయమార్గంగా, ఒక బిజినెస్‌లా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే అన్నీ బావుంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఏ గొడవా ఉండదు.

బై డిఫాల్ట్... ఫీల్డుకున్న గ్లామర్, సెలెబ్ స్టేటస్ ఎలాగూ ఒక డ్రైవ్‌లా ఎప్పుడూ పనిచేస్తాయి. 

అది తిరుగులేని బోనస్. 

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్. 

స్పెషల్ అప్పియరెన్స్‌లాగా ఎప్పుడో పుష్కరానికి ఒక సినిమా చేయడం కాదు. చిన్నదో, పెద్దదో... ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూ ట్రాక్‌లో ఉండటం చాలా ముఖ్యం.   

మిగిలినవన్నీ అవే ఫాలో అవుతాయి... డబ్బూ దస్కం, పేరూ గీరూ, ఇంకా ఎన్నో. 

ఎన్నాళ్లని ఒక చెస్ పీస్‌లా ఉంటావ్... ఒక్క సారి చెస్ ప్లేయర్ అయ్యి చూడు... తెలుస్తుంది మజా! 

And don't forget...
Cinema can fill in the
empty spaces of your life
and your loneliness! 

Wednesday, 15 March 2023

ఒక అవగాహన, గట్స్ ఉన్నవారికి ఇప్పుడు ఏదైనా సాధ్యమే!


ఇంతకు ముందైనా, ఇప్పుడైనా... నేను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను. 

దాదాపు ఎవరి విషయంలోనైనా ఇదే నిజం. కాకపోతే, వెర్షన్స్ వేరేగా ఉంటాయి... షుగర్ కోటింగ్‌తో. 

అది వేరే విషయం.    

ఇంతకు ముందు నాకు కొన్ని పరిమితులుండేవి. ఏవేవో పనులు, బాధ్యతలుండేవి. సో, సినిమాను పెద్దగా పట్టించుకోలేదు నేను. అదెప్పుడూ ఒక సెకండరీ ఆప్షన్‌గానే ఉండేది నాకు. ఎప్పుడో ఒకసారి నాకు కుదిరిన సినిమా చేశాను. కాని, ఇప్పుడలా కాదు. 

ఇప్పుడు నేను పూర్తిగా ఫ్రీ అయ్యాను.

ఇండస్ట్రీ కూడా బాగా టెంప్ట్ చేస్తోంది. కోట్లల్లో ఆదాయం. కోట్లల్లో రెమ్యూనరేషన్స్... 

బులెట్ షాట్‌లో చెప్పాలంటే - ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్... బిగ్ బిజినెస్... ఆదాయమార్గాలు భారీ లెవెల్లో  పెరిగాయి. 

ఇంతకు ముందు థియేటర్ ఎగ్జిబిషన్ మార్కెట్ ఒక్కటే ఉండేది. తర్వాత శాటిలైట్ రైట్స్ వచ్చాయి. ఇప్పుడు కరోనా తర్వాత - ఓటీటీ రైట్స్ వచ్చాయి. కొత్తగా మళ్ళీ ఆడియో రైట్స్, ఇన్-ఫిలిం బ్రాండింగ్ వంటివి పుంజుకుంటున్నాయి. ఇన్‌కమ్ అవెన్యూస్ పెరిగాయి.  

Content is the king.
Big money is the ultimate goal.   

ఒక అవగాహన, గట్స్ ఉన్నవారికి ఇప్పుడు ఏదైనా సాధ్యమే. 

అపశకున పక్షులకు, నెగెటివ్ థింకర్స్‌కు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఏదీ సాధ్యం కాదు. అది వేరే విషయం.

కట్ చేస్తే -

ఒక చిన్న గ్యాప్ తర్వాత - ఇప్పుడు - నేనొక 2 ఫీచర్ ఫిల్మ్స్ ప్రారంభించాను. 

రెండూ పక్కా ట్రెండీ కమర్షియల్ సినిమాలు. 

అంతకు ముందు నేను చేసిన సినిమాలతో పోలిస్తే - వీటి బడ్జెట్ చాలా ఎక్కువ.   

ఒక స్థాయి సీజన్డ్ హీరోయిన్స్, ఆర్టిస్టులు ఉంటారు. న్యూ అండ్ అప్‌కమింగ్ న్యూ అండ్ అప్‌కమింగ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. 

ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. క్రియేటివిటీపరంగా - ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా - ఈ రెండు సినిమాలు చేయబోతున్నాను. అంతా నా ఇష్టం. 

ఏ రిజల్ట్ అయితే నాకు అవసరమో - ఆ ఒక్కటే లక్ష్యంగా, ప్రతి చిన్న-పెద్ద అంశానికి నేనే రెస్పాన్సిబిలిటీగా, టెన్షన్-ఫ్రీగా, కూల్‌గా, ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాలు చేయబోతున్నాను.

ఇంతకుముందులా సినిమా అనేది బ్యాటిల్ గ్రౌండ్ కాదు.

"బిగ్ బిజినెస్" ప్లాట్‌ఫామ్... ఓవర్‌నైట్‌లో "సెలెబ్రిటీ స్టేటస్‌"ను ఇచ్చే ప్యాషనేట్ ప్లేస్. 

ఏ బడ్జెట్‌లో సినిమా తీస్తున్నామన్నది కాదు ఇప్పుడు పాయింట్... ఏ రేంజ్‌లో డబ్బు సంపాదించబోతున్నామన్నదే అసలు పాయింట్! 

ఈ బ్లాగ్ ప్రారంభంలో చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను...  

ఇంతకు ముందైనా, ఇప్పుడైనా... నేను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను. 

అయితే - సినిమా హిట్ అయితేనే డబ్బు వస్తుంది. అలా డబ్బు వచ్చినప్పుడే ఆటొమాటిగ్గా పేరు కూడా వస్తుందన్నది మిలియన్ డాలర్ రియాలిటీ. 

ఇప్పుడు నా గోల్ అదే.  

బాక్ బస్టర్ హిట్. 

"If you want to get in the film business, get in the film business." - Daniel Craig

Tuesday, 14 March 2023

మీ అమ్మాయి ఫిలిం డైరెక్టర్ కావాలనుకుంటోందా?


భానుమతి, సావిత్రి, విజయనిర్మల, మీరా నాయర్, అపర్ణా సేన్, దీపా మెహతా, సుచిత్ర చంద్రబోస్, శ్రీప్రియ, నందితా దాస్, ఫర్హా ఖాన్, మేఘనా గుల్జార్, కంగనా రనౌత్, జోయా అఖ్తర్, గురిందర్ చద్దా, బి జయ, సుధా కొంగర, నందిని రెడ్డి, లక్ష్మీ సౌజన్య, గౌరి రోణంకి, కార్తీకి గాన్‌సాల్‌వ్స్...

వీళ్ళల్లో 70 శాతం మంది సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వుమెన్ ఫిలిం డైరెక్టర్సే. 

మొన్న ఆస్కార్ సాధించిన "ది ఎలిఫెంట్ విష్పరర్స్" డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ & ప్రొడ్యూసర్ కార్తీకి గాన్‌సాల్‌వ్స్, గునీత్ మోంగా కూడా మహిళలే! 

ఇదొక చిన్న లిస్ట్. 

కొంచెం టైం తీసుకొని అధ్యయనం చేస్తే కనీసం ఇంకో వంద మంది వుమెన్ ఫిలిం డైరెక్టర్స్ లిస్ట్ తయారవుతుంది. 

ఎప్పుడో 60-70 ఏళ్ళ క్రితమే భానుమతి లాంటివాళ్లు ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా భారీ విజయాలు సాధించారు. 

అలాంటిది... ఒక అమ్మాయి డైరెక్టర్ కావాలని ప్యాషన్‌తో ముందుకొచ్చినప్పుడు, ప్రోత్సహించాల్సింది పోయి, ఇప్పుడు 2023 లో కూడా "అందరు ఏమనుకుంటారో" అని భయపడటం నిజంగా విచారకరం. 

ఇప్పుడు ఏ కారణాలనైతే చూపిస్తూ భయపడుతున్నారో, ఆ కారణాలు, ఆ పరిస్థితులు అప్పుడు కూడా తప్పకుండా ఉండే ఉంటాయి. అయినా - వాటన్నిటినీ ఫేస్ చేస్తూ అద్భుత విజయాలను సాధించిన, సాధిస్తున్న నారీమణుల లిస్టు పైనే ఉంది. 

కట్ చేస్తే - 

అరుదుగా ఎవరో ఒకరిద్దరు చేసే నాన్సెన్స్‌ను కామన్ చేయడం అనేది కరెక్టు కాదు. ప్రతి ఫీల్డులోను అలాంటి కొన్ని పరిస్థితులుంటాయి. అలాంటి ఎవరో కొందరుంటారు. 

చట్టం అంటూ ఒకటుంటుంది. లా ఆఫ్ ద లాండ్‌కు ఎవరూ అతీతులు కారు.       

నిజానికి వేరే ఏ ఫీల్డులో లేనంత ఇబ్బందికరమైన పరిస్థితులు సినీఫీల్డులో ఉండవు. 

ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి బయట కథలు కథలుగా చెప్పుకుంటారు. సినిమా వార్తల మీదే బ్రతికే అనేకమంది క్రియేట్ చేసే చెత్త గాసిప్స్, మరింత చెత్తరకం థంబ్‌నెయిల్స్ అసలు నిజాలు కావు. 

సినీ ఫీల్డు ఇప్పుడు క్రమంగా ఒక కార్పొరేట్ శైలిలోకి రూపాంతరం చెందుతోంది. అమ్మాయిలే నిర్మాతలుగా భారీ బడ్జెట్ సినిమాల్ని నిర్మించి అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో - ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో - ఏవేవో భయాలు పెట్టుకొని ప్యాషన్‌ను చంపుకోవడం అనేది సరైన నిర్ణయం కాదు. కాబోదు. 

యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్ కావాలన్న ప్యాషన్‌తో సినీఫీల్డులోకి వెళ్ళాలనుకొనే అమ్మాయిలను, మహిళలను ఎవరైనా భేషుగ్గా... భయం లేకుండా ప్రోత్సహించవచ్చు. 

"మా అమ్మాయి సినీ ఫీల్డులో పనిచేస్తోంది", "మా అమ్మాయి యాక్టర్", "మా అమ్మాయి ఫిలిం డైరెక్టర్ కాబోతోంది"... అని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకొనే స్థాయికి, సోషల్ స్టేటస్‌కు ఎప్పుడో ఎదిగింది సినీ ఫీల్డు.                       

సాఫ్ట్‌వేర్, రియల్ ఎస్టేట్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్... వంటి ఇతర ఎన్నో రంగాలను ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేనొక విషయం గట్టిగా చెప్పగలను... 

సినీఫీల్డులోనే అమ్మాయిలకు, మహిళలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. వారి భద్రత గురించి పట్టించుకొంటారు. 

Monday, 13 March 2023

ఒక ‘డిజిటల్ నోమాడ్’ జీవనశైలి


సుమారు 7 ఏళ్ల క్రితం, ఒక డెహ్రాడూన్ అమ్మాయి… సింగపూర్ టూరిజమ్ బోర్డులో తన ఉద్యోగాన్నీ, ఇంటినీ వదిలిపెట్టి, ప్రపంచాన్ని చుట్టివచ్చే ‘నోమాడ్’ జీవితాన్ని ఎంచుకుంది.

అప్పుడు ఆమె వయస్సు 23.

ఇప్పటివరకు చాలా దేశాలు తిరిగింది. ఎక్కువ భాగం ఒంటరిగా… సోలో ట్రావెలర్‌గానే.

మొదట్లో తను అనుకున్న దేశాలకు వెళ్లడానికి ఫ్లయిట్ జర్నీ చేసేది. ఇప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు – దేశాల మధ్య కూడా రోడ్డు ప్రయాణమే ఎంచుకుంటోంది.

ఒకసారి దేశంలోకి ప్రవేశించాక, అంతా అతి మామూలు జీవనవిధానమే ఆమెది.

కాలినడకన నడవగలిగినంత దూరం నడవటం, అవసరాన్నిబట్టి అతి తక్కువ ఖర్చుతో కూడిన లోకల్ ప్రయాణ సౌకర్యాలను వాడటం, శుభ్రమైన శాఖాహారం ఎక్కడ ఏది దొరికితే అది తినడం, లోకల్‌గా ఎవరి ఇంట్లోనైనా ఉండటం, లేదంటే – ఎయిర్ బి ఎన్ బి నివాసాల్లో ఉండటం, నిర్ణీత సమయాల్లో పుస్తక పఠనం, లాపీలో తన పర్యటనలకు సంబంధించిన బ్లాగింగ్, ఇతర కమ్యూనికేషన్ చూసుకోవటం… ఇదీ ఆమె జీవనశైలి.

ఈ జీవనశైలి నుంచే ఆమెకు ఆదాయం, ఆనందం రెండూ లభిస్తాయి.

బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, నేషనల్ జాగ్రఫిక్, టెడెక్స్, రెస్పాన్సిబుల్ ట్రావెల్, హఫింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ స్థాయి మీడియా ఆమె ప్రయాణాలను, జీవనశైలిని ఎప్పటికప్పుడు కవర్ చేస్తాయి.

The Shooting Star పేరుతో ఆ అమ్మాయి రాసిన పుస్తకం ప్రఖ్యాత పెంగ్విన్ బుక్స్ సంస్థ పబ్లిష్ చేసింది. అది బెస్ట్ సెల్లర్ కూడా.

ట్రావెల్ బ్లాగర్, ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఫ్రీలాన్స్ ట్రావెల్ రైటర్‌గా – వివిధరకాల అసైన్‌మెంట్స్ ఎప్పటికప్పుడు ఆమెను వెతుక్కుంటూ వస్తుంటాయి. వివిధ దేశాల టూరిజమ్ శాఖలు, ఎయిల్ లైన్స్, కార్పొరేట్ కంపెనీలు ప్రమోషన్ కోసం ఆమెతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.

ఇవన్నీ ఆమెకు ఆదాయం తెచ్చేవే.

ఈ ఆదాయమంతా ఆమెకెంతో ఇష్టమైన ‘జీవనశైలి’ ప్రయాణంలో, ఆమెతోపాటు వెంటపడి వచ్చేదే.

తనకిష్టమైన ఇదే జీవనశైలితో నిరంతరం ప్రయాణం చేస్తూ, భూగోళం చుట్టేస్తున్న ఈ యువతి వేసుకొనే దుస్తులు, బుక్స్, లాపీ, పెన్నూ, పేపర్లూ అంతా కలిపి, ఆమె లగేజ్ మొత్తం… జస్ట్ వీపుకు తగిలించుకొనే ఒకే ఒక్క బ్యాక్ ప్యాక్.

అంతే.

నమ్మశక్యం కాని ఈ మినిమలిస్ట్ డిజిటల్ నోమాడ్,  ట్రావెల్ బ్లాగర్ పేరు - శివ్య నాథ్.

Just a girl who travels.

కట్ చేస్తే –

2019 లో ఒకసారి తను సౌతాఫ్రికాలో ట్రెక్కింగ్ చేస్తూ, ఒక అందమైన వాటర్ ఫాల్స్ దగ్గర స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు – తన శరీరానికి, శరీరాకృతికి సంబంధించిన ఒక వాస్తవాన్ని గురించి, మొట్టమొదటిసారిగా, తనను తనే ప్రశ్నించుకొంది. అర్థంచేసుకొంది. అర్థమయ్యాక ఆ అనుభూతిని ఆలింగనం చేసుకొంది. అక్షరాల్లో ఆవిష్కరించింది.

అదేంటో, క్లుప్తంగా శివ్య మాటల్లోనే –


“బాడీ పాజిటివిటీకి సంబంధించి నా మైండ్‌సెట్‌ను ప్రశ్నించడానికి, అర్థంచేసుకోడానికి నాకు చాలా సమయమే పట్టింది…

మనం ఎదుగుతున్న దశలో, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, మన పెంపకాన్ని బట్టి – అందానికి సంబంధించి మన మనసుల్లో, ఆలోచనల్లో కొన్ని స్టాండర్డ్స్ ఫిక్స్ అయిపోతాయి.

మ్యాగజైన్స్‌లో కనిపించే మోడల్స్… హాలీవుడ్, బాలీవుడ్‌లో కనిపించే హీరోయిన్స్… అందరూ ఎలాంటి మచ్చలేని తెల్లటి చర్మంతో, పర్‌ఫెక్ట్ హెయిర్‌తో, సన్నగా, నాజూగ్గా, ఒక లెక్కతో కూడిన ఎత్తుపల్లాల అవయవాకృతితో కనిపిస్తారు.

రకరకాల డైట్స్ గురించి, బ్యూటీ ట్రీట్‌మెంట్స్ గురించి, శరీరంలో అక్కడక్కడా ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాట్స్ తొలగించుకొనే పద్ధతుల గురించీ, ఎవరెవరు ఎలా ఉన్నారో జడ్జ్ చేయటం గురించీ… మనచుట్టూ ఉన్న స్త్రీల మాటలు కూడా ఎప్పుడూ వింటుంటాం.

వీటన్నిటితో వచ్చిన ఒక అవగాహన ఆధారంగా, మన శరీరాల్ని మనమే “ఇలా వుంది” అని నిర్ధారించుకుంటాం. విశ్లేషించుకుంటాం. చాలాసార్లు అసహ్యించుకుంటాం కూడా.

మన మానసిక, శారీరక ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా – మనముందున్న అద్దం చూపిస్తున్నదే నిజమని నమ్ముతాం.

చాలా కాలంగా ఈ విషయంలో నా ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి.

నా థండర్ థైస్ అంటే నాకు చాలా కోపం. నేను ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా, ఎంత తక్కువ తిన్నా అవి ఎంతకూ సన్నబడవు. నా భుజాల్లో ఉన్న కొవ్వుని నా డ్రెస్ స్లీవ్స్ కింద దాచిపెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఫ్రీగా ఉండి, హాయిగా ఊపిరి పీల్చుకోనీయకుండా నా నడుముభాగాన్ని ఎప్పుడూ టక్ చేస్తుంటాను. ఎవరైనా చూస్తారేమో అని, నా పిరుదుల్ని తొందర తొందరగా నా వన్ పీస్ స్విమ్‌సూట్‌లోకి తోసేసి కవరప్ చేసేస్తుంటాను.

ఒకసారి, 2019 లో సౌతాఫ్రికా వెళ్ళినప్పుడు – అక్కడ ట్రెక్కింగ్, వైల్డర్ స్విమ్మింగ్ కోసం వెళ్లే సమయంలో చూసుకున్నాను… 

నా స్విమ్‌సూట్ రిపేర్ చెయ్యడానికి వీల్లేనంతగా చినిగిపోయింది. వెంటనే అప్పటికప్పుడు ఇంకో స్విమ్‌సూట్ తీసుకోవాల్సివచ్చింది.

కాని, అక్కడ దగ్గర్లో ఉన్న స్టోర్‌లో బికినీలు మాత్రమే ఉండటంతో, ఇక తప్పనిసరై ఒక బికినీ తీసుకున్నాను.

ఇండియాలో – మనం స్విమ్ చేస్తున్నప్పుడు… స్విమ్‌సూటో, బికినీనో వేసుకున్నాసరే – ఒడ్డున ఉన్నవారికి ఏదీ కనిపించకుండా నీళ్లల్లోనే మన శరీరంలోని కొంతభాగాన్ని ఎప్పుడూ దాచి ఉంచుతాం. అలాంటప్పుడు ఇంక బికినీ ఎందుకో నాకర్థమయ్యేది కాదు!

కాని, నా 31వ యేట, సౌతాఫ్రికాలోని ఆ అద్భుత వాటర్ ఫాల్స్‌లో చల్లటి నీరు నా శరీరంలోని ప్రతిభాగాన్నీ స్పృశిస్తూ ఆలింగనం చేసుకుంటున్నప్పుడు – మొట్టమొదటిసారిగా అంతా మారిపోయింది.

ఉన్నట్టుండి… బికినీ వేసుకోవడంలో ఉన్న ఆ ఫ్రీడమ్‌తో ప్రేమలోపడిపోయాను. దానికంటే ముందు, అసలు నా బాడీ విషయంలో నేను ఎందుకని ఎప్పుడూ అంత నెగెటివ్‌గా ఫీలయ్యేదాన్నో నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.

నా శరీరం “పర్‌ఫెక్ట్” సౌష్టవంతో లేకపోవచ్చు. కాని, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్సర్‌సైజ్ చేస్తాను. మంచి ఆహారం తీసుకుంటాను. ఉండాల్సినంత బరువే ఉన్నాను. మానసికంగా కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాను.

నిజంగా ఒక్కసారిగా అంతా మారిపోయింది…

నా బాడీకి సంబంధించి, అంతకుముందటి నా అన్ని నెగెటివ్ ఆలోచనల్ని జస్ట్ అలా ఎడంచేత్తో పక్కకి తోసేశాను.

ఆ తర్వాత ఎప్పుడు ఏ వాటర్ ఫాల్స్ కిందకెళ్ళినా… ఏ సముద్రపు అలల్లో ఆడుకున్నా… చల్లటి ఆ నీళ్ళు నా శరీరాన్ని స్పృశించినప్పుడల్లా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను. పరవశంలో మునిగితేలుతున్నాను.

F*ck perfection! 

ఇప్పుడు నాకు క్యూరియస్‌గా ఉంది… మీ బాడీ గురించి మీరేం ఫీలవుతున్నారు?”

Sunday, 12 March 2023

"నాటు నాటు" పాటకి ఆస్కార్... కొన్ని గంటలే!


డిస్నీ-హాట్‌స్టార్‌లో రేపు ఉదయం 5.30 నుంచి లైవ్ ప్రారంభం కాబోతోంది.  

మన దేశంలోని సినిమా ప్రియులు, మన ఎన్నారై సినిమా ప్రియులు కూడా... కోట్ల సంఖ్యలో... రేపుదయం లైవ్ చూడబోతున్నారు. 

కట్ చేస్తే -

దీనికి సంబంధించి ఒక సీనియర్ నిర్మాత-దర్శకుడు ఒక కామెంట్ చేశారు. వారు మాట్లాడుతున్న వేదిక మీద నుంచి ఒక ఉదాహరణ ఇస్తున్న సమయంలో బహుశా ఇది స్ట్రయిక్ అయ్యి అలా అని ఉండవచ్చు. ఆ కాంటెక్స్‌ట్ పరంగా వారి దృష్టిలో అది కరెక్టే కావచ్చు. 

కాని - కాంటెక్స్‌ట్ ఏదైనా - ఏ రకంగా చూసినా - ఈ సమయంలో అదొక వివాదాస్పదమైన కామెంట్ అని నా హంబుల్ ఒపీనియన్.     

ఫిలిం ఇండస్ట్రీ ఒక బిగ్ బిజినెస్. 

వివిధ దశల్లో ప్రమోషన్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం సహజం. అది ఆ నిర్మాత, ఆ ప్రొడక్షన్ కంపెనీ, ఆ దర్శకుడు, ఆ టీమ్ ఇష్టం. 

ఎవరి లక్ష్యాలు వారికుంటాయి. 

తెలుగు సినిమాను అంతర్జాతీయంగా హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్న ఈ సమయంలో - వివిధ హాలీవుడ్ అవార్డులతో పాటు, ఆస్కార్ అవార్డు కూడా మనకు అవసరమైన బజ్ క్రియేట్ చేస్తుంది. 

కొత్తగా మన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఎన్నో ఆఫర్స్ వస్తాయి. డీల్స్ సెట్ అవుతాయి. బిజినెస్ విస్తరిస్తుంది.  

హాలీవుడ్ సర్కిల్స్‌లో అలాంటి బజ్ క్రియేట్ చెయ్యటం కోసం ఖర్చుపెట్టక తప్పదు. అదంతా పార్టాఫ్ ది బిజినెస్. 

రేపు వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తూ, అంతర్జాతీయంగా పాపులారిటీని ఆశిస్తూ సినిమాలు తీయబోతున్న ఈ సమయంలో - ప్రమోషన్ కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టడం అనేది నథింగ్. 

లంచాలిచ్చో, రికమెండేషన్ చేయించుకొనో తీసుకునేది కాదు... ఆస్కార్ అవార్డు. 

అవసరమైన ప్రమోషన్ ద్వారా, ఆయా సర్కిల్స్‌లో బజ్ క్రియేట్ చెయ్యటం ద్వారా మన తెలుగు సినిమా, నామినేట్ అయి వున్న మన "నాటు నాటు" పాట ఆస్కార్ వోటర్స్ దృష్టిలో పడతాయి. 

ఆ ప్రయత్నాల వల్లనే కదా స్పీల్‌బర్గ్ అయినా, కెమెరాన్ అయినా RRR సినిమా చూసిందీ, రాజమౌళితో, టీమ్‌తో మాట్లాడిందీ?

సో, ఈ సందర్భంలో ఆ కామెంట్ చాలా ఇబ్బందికరమైనది. ఒక రకంగా మనల్ని మనమే కించపర్చుకోవడం కూడా.  

తర్వాత కొందరు సినీ ప్రముఖులు ఆ మాటను పట్టుకొని నానా మాటలు అనటం మరింత రచ్చకు దారితీసింది. వీరంతా అలా అనడానికి కారణం కూడా ఆస్కార్ అవార్డు అందుకోబోతున్న తెలుగు సినిమా మీద అభిమానమే తప్ప ఎవరిమీదా వ్యక్తిగత ద్వేషం కాకపోవచ్చు. 

దీన్నిక్కడితో వదిలేసి, అందరం రేపటి 95వ ఆస్కార్ అవార్డ్స్ లైవ్ కోసం ఎదురు చూద్దాం. 

జస్ట్ కొన్ని గంటలే ఉంది...   

By the way, దీని మెద బెట్టింగ్ కూడా మస్త్ నడుస్తోందని విన్నాను! 

కట్ చేస్తే -

హాలీవుడ్ పరిధిలో ఆల్రెడీ 2 అవార్డులు సాధించిన "నాటు నాటు" పాటకు తప్పక ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని నా గట్టి నమ్మకం. 

Best wishes to Director S S Rajamouli, Producer D V V Danayya, Junior NTR, Ram Charan, Music Director Keeravani, Lyricist Chandrabose, Singers Rahul Sipliganj, Kalabhairava & Team!

Friday, 10 March 2023

కొత్త ADs (అప్రెంటిస్‌లు), సోషల్ మీడియా కోసం!


సోషల్ మీడియా విభాగంలో కొత్తగా ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్‌ (అప్రెంటిస్) లను తీసుకొంటున్నాను. 

డైరెక్టర్‌గా నా సూచనలు, మా ప్రొడక్షన్ హౌజ్ అవసరాల మేరకు  సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేస్తూ, బజ్ క్రియేట్ చేస్తూ డైనమిక్‌గా ఉండే ఇద్దరు అసిస్టెంట్స్ కావాలి. 

ఫీల్డులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్తవారికోసమే ఈ ప్రకటన. 

వీరికి సినీఫీల్డులో పనిచేయాలన్న ప్యాషన్ ఉండాలి. సోషల్ మీడియా మీద, దాని ఎఫెక్టివ్‌నెస్ మీద తగినంత అవగాహన ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో టీమ్ ఇచ్చిన కంటెంట్ పోస్ట్ చేయగాలి.  

ఇప్పుడందరూ సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్‌లే కాబట్టి - దీనికోసం చాలామంది అప్లై చేస్తారనుకుంటున్నాను.

Strictly For FRESHERS ONLY. 
And... Strictly NO CALLS Plz. 

Whatsapp your resume with latest selfie immediately: 
9989578125 

Thursday, 9 March 2023

అసలు నిన్ను సినిమాల్లోకి ఎవడు పొమ్మన్నడ్రా బై ?


మైండ్‌సెట్ కోణంలో తప్ప ఈ పోస్టును మరోవిధంగా నెగెటివ్‌గా భావించవద్దని మిత్రులకు మనవి.

కట్ చేస్తే - 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచీ ఒక ప్రాంతం వాళ్లే ఎక్కువగా రావడానికి, ఉండటానికి, ఎక్కువగా సక్సెస్ అవడానికి కారణం... వాళ్లకు ఆ ప్రాంతం వాళ్ళిచ్చే సపోర్ట్! 

ఒక్క డబ్బు పరంగా అనే కాదు. సోషల్‌గా కూడా సినిమా ఫీల్డుకు వాళ్ళిచ్చే రెస్పెక్ట్ వేరే. 

"మావాడు రామానాయుడు స్టూడియోలో బాయ్‌గా పనిచేస్తున్నాడు" అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటారు అక్కడ. 

డిగ్నిటీ ఆఫ్ లేబర్! తప్పేం లేదు... 

 "మావాడు డైరెక్టర్" అని చెప్పుకోడానిక్కూడా ఫీలవుతారు ఇక్కడ. 

స్వయంగా ఆ డైరెక్టరే "నేను ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా చేస్తున్నాను" అని చెప్పుకోడానికి ఇబ్బంది పడుతుంటాడు. కొన్ని చోట్ల "ఏదో ప్రయివేట్ జాబ్ చేస్తున్నాలే" అని అబద్ధమే చెప్పేస్తాడు! 

ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్‌లో హెల్ప్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

అక్కడ - ఒక కాల్ చేస్తే చాలు. ముందు డబ్బు అందుతుంది. అనుకున్న డీల్ ప్రకారం తర్వాత తీసుకుంటారు. డీల్‌లో కొందరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కాని, పని మాత్రం అవుతుంది. చేస్తారు. 

బిజినెస్ ఈజ్ బిజినెస్. 

ఇక్కడ కథ వేరు. చాలా చాలా అరుదుగా ఎవరో ఒకరిద్దరు మహానుభావులు తప్ప... అసలా చాన్స్ ఇవ్వరు. బై మిస్టేక్ సిగ్గు విడిచి అడిగామా... అంతే. "అసలు నిన్ను ఆ సినిమాల్లోకి ఎవడు పొమ్మన్నడ్రా? ఇట్లైతదని నీకు ముందే చెప్పలే?! పైసల్ ఎక్కన్నుంచి వస్తయ్?..." 

చెయ్యాల్సిన హెల్ప్ చెయ్యరు. మీద నుంచి క్లాసులు, ఉచిత సలహాలు, తిట్లు. 

పని కాదు. ప్రచారం మాత్రం ఫుల్! 

ఒక్క దెబ్బకి చులకనైపోతాం. అప్పటిదాకా "మీరు", "సార్" అన్నవాడు సింపుల్‌గా ఏకవచనంలోకి దిగుతాడు. పని మాత్రం చెయ్యడు!    

దీనికి ఆయా ప్రాంతాల సాంఘిక, ఆర్థిక నేపథ్యం ఎట్సెట్రా కారణాలు చెప్తారు కొందరు మేధావులు. 

కరెక్టే కావచ్చు.

కాని, శతాబ్దాలైనా అంతేనా? 

ఇలాంటి నేపథ్యం నుంచి ఎవరైనా ఫీల్డులో నెగ్గుకొచ్చి పైకొచ్చారంటే కారణం... నేను చెప్పను...  

Tuesday, 7 March 2023

కాపిటలిస్టే కమ్యూనిస్టు కూడా కావచ్చు!


కేజీయఫ్ ఇండియా యూట్యూబ్ చానెల్ ద్వారా - వారం వారం చేస్తున్న ఇంటర్వ్యూలు దేనికదే అద్భుతంగా ఉంటున్నాయి. ముందుగా నా మిత్రులు మిట్టా సైదిరెడ్డి, భువనగిరి నవీన్ టీమ్‌కు నా అభినందనలు. 

కట్ చేస్తే -

ఇదే చానెల్లో తాజాగా నేను మొన్న చూసిన ఇంటర్వ్యూ శాంతా బయోటెక్ స్థాపకులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఫిలాంత్రపిస్టు కె ఐ వరప్రసాద్ రెడ్డి గారిది మరొక లెవెల్లో ఉంది. 

వరప్రసాద్ రెడ్డి గారి ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు తెలియని వాస్తవాలు కొన్ని కొత్తగా తెలుసుకున్నాను. 

ప్రపంచస్థాయిలో వందల కోట్ల మందికి లాభాపేక్ష లేకుండా వాక్సీన్లను అందిస్తూ, మన దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిన శాంతాబయోటెక్ లాంటి ఒక సంస్థకు - 28 ఏళ్ళపాటు - తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందున్న ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నీటివసతిని కల్పించలేకపోయారు అన్న వాస్తవం నన్ను సిగ్గుపడేలా చేసింది. 

సేవా దృక్పథమే తన బ్రాండ్‌గా చేసుకున్న వరప్రసాద్ రెడ్డి గారు కాబట్టి... ఆయా ముఖ్యమంత్రులను, ప్రభుత్వాల్ని పెద్దగా పట్టించుకోకుండా... రోజుకు 250 లారీలతో నీళ్ళు తెప్పించుకొంటూ శాంతా బయోటెక్‌ను విజయవంతంగా నడిపి, ఎన్నో విజయాలను సాధించగలిగారు.

కాని, వేరే ఇంకొక ఇండస్ట్రియలిస్టు ఎవరైనా అయితే - "నాకు నీటి వసతే అందించని ఇక్కడ నేనెందుకు ఇంత కష్టపడాలి" అనుకొని తన సంస్థను మూసేసేవారు, లేదా అన్ని సౌకర్యాలూ అందించే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయేవారు. 

28 ఏళ్ళపాటు ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోని ఈ సమస్యను... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా పట్టించుకొని... వారం వారం స్వయంగా కేసీఆర్ గారే వరప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా అప్‌డేట్ అందిస్తూ... కేవలం కొన్ని రోజుల్లోనే శాంతాబయోటెక్‌కు పైప్ లైన్ వేయించి నీటి సమస్యను పరిష్కరించడం ఒక రికార్డు.

ఈ నిజాన్ని ఇంటర్వ్యూలో వరప్రసాద రెడ్డి గారు చెప్పినప్పుడు నేను నిజంగా షాకయ్యాను. ఒళ్ళు గగుర్పొడిచింది. 

దటీజ్ కేసీఆర్!

ఒక ఇండస్ట్రియలిస్టుగా, ఒక ఫిలాంత్రపిస్టుగా, ఒక సంగీతసాహిత్యాభిమానిగా వరప్రసాద్ రెడ్డి గారి అత్యున్నత స్థాయి ఆలోచనలకు, కృషికి నేను అభిమానిని. 

హెపటైటిస్ బి వాక్సీన్‌తో పాటు, ఇంకో డజనుకు పైగా లాభాపేక్ష లేని వాక్సీన్ల సృష్టికర్తగా ఆయన రంగంలో ఆయనొక లెజెండ్. 

అలాంటి వరప్రసాద్ రెడ్డి గారు... ఇంకో లివింగ్ లెజెండ్, మన కళ్ళముందు మనం చూసిన 'ప్రపంచస్థాయి సక్సెస్ స్టోరీ' ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనను ఒక స్వర్ణయుగం అని చెప్పడం చాలా గొప్ప విషయం. 

కట్ చేస్తే - 

ఒకవైపు శాంతా బయోటెక్ ద్వారా ఎన్నో ప్రపంచ స్థాయి విజయాలు సాధించిన తర్వాత - ఇప్పుడు విశ్రాంత దశలో కూడా - సమాజం కోసం, తన చుట్టూ ఉన్న మనుషుల కోసం ఏదైనా చేయాలన్న నిరంతర ఆలోచనలతో ఇప్పటికీ నిరంతరం పనిచేస్తూ ఉండటం వరప్రసాద్ రెడ్డి గారొక్కరికే సాధ్యం. 

తన ఆధ్వర్యంలోని ఒక ఫౌండేషన్ ద్వారా... ఇప్పటికే 25 కి పైగా పుస్తకాలను వరప్రసాద్ రెడ్డి గారు ప్రచురించారన్న విషయం ఎంతమందికి తెలుసు?

హాస్యం, సంగీతం, సాహిత్యం వంటివి మనిషిని మనిషిలా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయని ఆయన గట్టిగా నమ్ముతూ,  ఆ దిశలో ఇప్పటికీ తనకు తోచింది ఏదో ఒకటి చేస్తుంటారంటే నమ్మశక్యంగా ఉంటుందా ఎవరికైనా? 

కాని... వారింకా ఇవన్నీ చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. 

"పెట్టుబడిదారుడు కూడా సంపద పెంచవచ్చు, సంపద పంచవచ్చు" అని బాగా నమ్మటమే కాదు, చేసి చూపించిన "ఆచరణాత్మక కమ్యూనిస్టు" వరప్రసాద్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం రాకపోతుందా అని అప్పుడప్పుడూ అనుకునేవాణ్ణి.

కేజీయఫ్ ఇండియా యూట్యూబ్ చానెల్‌లో చూసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత - వరప్రసాద్ రెడ్డి గారిని ఎలాగైనా ఒకసారి కలవాలని... కొన్ని నిముషాలైనా వారితో ముచ్చటించాలనీ ఇప్పుడు గట్టిగా అనుకుంటున్నాను. 

Sunday, 5 March 2023

ENTER FILM INDUSTRY EASY


ఇంతకుముందులా
ఈ డిజిటల్ యుగంలో కూడా 
Acting | Script Writing | Direction లో -
 
మీ శిక్షణ కోసం కొన్నేళ్ళు,
మీ "ఒక్క ఛాన్స్" కోసం కొన్నేళ్ళు,
సిల్వర్ స్క్రీన్ మీద
మీ టైటిల్ కార్డు కోసం కొన్నేళ్ళు...
వృధా చేసుకోనవసరం లేదు! 

ఒక రన్నింగ్ కమర్షియల్ సినిమా -
కాన్సెప్ట్ స్టేజి నుంచి రిలీజ్ దాకా -
నాతోనే నా టీమ్‌లో ఉండి,
జరుగుతున్న పని చూస్తూ,
మీరు కూడా పని చేస్తూ -
ఆన్-సైట్‌లో శిక్షణ పొందే
అద్భుత అవకాశం. 

ఇలాంటి ప్రోగ్రాం
ఇండియాలో ఇదే మొదటిసారి!

మీ శిక్షణ,
సినిమాలో మీ ఒక్క ఛాన్స్,
స్క్రీన్ మీద మీ టైటిల్ కార్డ్...
అన్నీ ఏకకాలంలో ఒక్కసారే -
ఒకే సినిమాతో... 
6 నెలల్లో! 

ఈ అవకాశం
కొద్దిమందికి మాత్రమే!

Get connected... If you're really serious about your Film Industry Entry... And ready to join the Personal Coaching Program immediately.. 

Whatsapp/Call: 9989578125 

మీ కళ్ళు వర్షించకపోతే ఒట్టు !!


మనం మర్చిపోయిన 
మన బాంధవ్యాల విలువను, 
మనకే తెలీయకుండా వర్షించే
మన కన్నీళ్ల సాక్షిగా 
మనకు గుర్తుచేసే  
మన తెలంగాణ ఆత్మ చిత్రం - 
బలగం!

వెళ్లండి... 
"బలగం" సినిమా చూడండి.
మీ ఊరిని, మీ బాల్యాన్ని, 
మీ తోబుట్టువుల్ని, 
మీ కుటుంబాన్నీ, మీవాళ్లనీ 
గుర్తుకు తెస్తూ _
కనీసం ఒక్కసారయినా 
మీ కళ్ళు వర్షించకపోతే ఒట్టు!! 

యువ ప్రొడ్యూసర్ ద్వయం
హన్షిత, హర్షిత్ రెడ్డిలకు,
దర్శకుడు వేణు వెల్దండికి, 
ఆర్టిస్టులు, టెక్కీస్ టీమ్‌కు; 
ఈ అద్భుతమైన ప్రాజెక్టుకు 
తిరుగులేని ఛీర్ లీడర్ -
దిల్ రాజు గారికి... 
హాట్సాఫ్ ... 

- మనోహర్ చిమ్మని 

Friday, 3 March 2023

"శ్యామ్ సింఘరాయ్" సత్యదేవ్ జంగా!


ఒక నేషనల్ మీడియా సంస్థలోని మ్యూజిక్ విభాగంలో డివిజనల్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఓ సిన్సియర్ ఉద్యోగి మీద ఉన్నట్టుండి ఒక భారీ కాపీరైట్ నేరం మోపబడింది. అంత భారీ కేసు అతని మీద వేసింది - ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్. 

తీవ్రమైన మానసిక వత్తిడితో ఒక మూడునాలుగు రోజులు అతను అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు. అయితే - తనకున్న క్రెడిబిలిటీతో, పరిచయాలతో కలవాల్సిన ఒకరిద్దరిని కలిశాడు. అతనేం తప్పు చేయలేదు కాబట్టి లీగల్‌గా ఆ కేసు నుంచి ఎలాగో బయటపడ్డాడు.  

సదరు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆ కేసును అతని మీద వేసింది కేవలం ఒక నెగెటివ్ బజ్ కోసం!... తద్వారా వీలైతే ఆ మీడియా సంస్థ నుంచి ఒక ఐదారు కోట్లు నష్టపరిహారం అప్పనంగా పొందటం కోసం!!   

ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. కాని, జరిగింది. 

ఉన్నట్టుండి - అతనిలో ఎప్పటినుంచో నిద్రాణంగా ఉన్న రచయిత మళ్ళీ లేచాడు. 

ఒక ఫిలిం డైరెక్టర్, అతనికి ఎలాంటి సంబంధం లేకుండా - అతను చేయని నేరానికి - తప్పించుకోలేని విధంగా కాపీరైట్ చట్టం కింద బుక్ అయితే ఏంటి పరిస్థితి? అతని జీవితంలో తర్వాతేం జరుగుతుంది?.... ఈ ప్రశ్నలకు - తాను బలంగా నమ్మే పూర్వజన్మ సిద్ధాంతాన్ని కూడా జోడించి - ఒక మంచి సినిమా కథ అళ్ళుకున్నారు. 

ఆ కథే... రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని, సాయిపల్లవిల బ్లాక్ బస్టర్ సినిమా... "శ్యామ్ సింఘరాయ్."
 
ఆ కథారచయిత... సత్యదేవ్ జంగా.  

కట్ చేస్తే -  

సుమారు పాతికేళ్లపాటు ఆదిత్య మ్యూజిక్‌లో సీనియర్ మేనేజర్‌ స్థాయి వరకు పనిచేసిన సత్యదేవ్... ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమా మ్యూజిక్ ఈవెంట్‌కు, ఆ కంపెనీ తరపున వేదికనెక్కేవారు. అలా టాలీవుడ్‌లో సత్యదేవ్ దాదాపు అందరికీ బాగా తెలుసు. 

అయితే - సత్యదేవ్‌లో ఒక అద్భుతమైన కథారచయిత కూడా ఉన్నాడన్న విషయం శ్యామ్ సింఘరాయ్ వచ్చేవరకు ఇండస్ట్రీలో చాలామందికి తెలియదు.    

శ్యామ్ సింఘరాయ్ కంటే చాలా ముందు - 2005 లోనే "ఏ ఫిలిం బై అరవింద్" సినిమాకు కథ అందించిన నేపథ్యం సత్యదేవ్ జంగాకు ఉంది. 

మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకంత గ్యాప్? ఎందుకని కథారచయితగా పూర్తిస్థాయిలో దిగలేదు? 

"ఏది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది" అంటూ నవ్వేస్తారు కర్మ సిద్ధాంత ప్రేమి సత్యదేవ్ జంగా. 

కట్ చేస్తే - 

నెల్లూరు జిల్లాలోని కావలి నుంచి తన తల్లిదండ్రులతో ఏడో ఏట హైద్రాబాద్‌కు వచ్చిన సత్యదేవ్‌కు తెలంగాణ మట్టి వాసన బాగా నచ్చింది. బాగానే అచ్చివచ్చింది. 

అలాగని సత్యదేవ్ తన మూలాల్ని మర్చిపోలేదు.

"I respect Andhra, I admire Telangana" అని సిన్సియర్‌గా చెప్పగలిగిన హంబుల్ ఓపెన్‌నెస్ సత్యదేవ్ సొంతం. 



ప్యారడైజ్ చౌరస్తాలో ఉన్న "సంగీత్ సాగర్"లో 1993 లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి -  ఒక నేషనల్ మీడియా సంస్థలో ఓ మూడేళ్ళు పనిచేసి - ఆదిత్య మ్యూజిక్‌లో రెండేళ్ల క్రితం వరకు సీనియర్ మేనేజర్‌గా తన ఉద్యోగ జీవితం వదిలేసేవరకు... కేవలం మ్యూజిక్‌లోనే "30 ఇయర్స్ ఇండస్ట్రీ" సత్యదేవ్‌ది! 

స్వయంగా తనే కంపోజర్‌గా ఒక పాతిక ఆల్బమ్స్‌తో కలిపి - ప్రొడ్యూసర్‌గా మొత్తం ఒక 250 వరకు భక్తిసంగీతం ఆల్బమ్స్ చేసిన రికార్డ్ సత్యదేవ్‌కుంది. 

ఈ జర్నీలో - బాలమురళీకృష్ణ, యస్ పి బాలు వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేసి, వారితో పాడించిన మధుర జ్ఞాపకాలు సత్యదేవ్ జీవితంలో చాలా వున్నాయి. 

అలాగే పార్థసారథి వంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌ను... నిహాల్, నిత్యసంతోషిని, మాళవిక వంటి ఎందరో కొత్త తరం సింగర్స్‌ను పరిచయం చేసిన క్రెడిట్ కూడా సత్యదేవ్‌కుంది.   

కట్ చేస్తే - 

మా ఇద్దరిదీ దాదాపు 20 ఏళ్ళ పరిచయం. దర్శకుడిగా నేను చేసిన నాలుగు సినిమాల ఆడియోల విషయంలోనూ నాతో జర్నీలో ఉన్నారు సత్యదేవ్. 

ఈ జర్నీలోనే - సుమారు ఏడేళ్ళ క్రితం - మా బోయిన్‌పల్లి ఆఫీసులో కూర్చొని, సత్యదేవ్ నాకు చెప్పిన ఒక అద్భుతమైన కథ నాకింకా గుర్తుంది. ఇదే జర్నీలో - మా ఇద్దర్నీ మరింత దగ్గర చేసింది మా ఇద్దరిలోనూ ఉన్న ఆధ్యాత్మిక స్పృహ. ఈ గుళ్ళూ గోపురాలకి అవతలి ఆధ్యాత్మిక లోకం గురించి మేం ఎంతసేపైనా మాట్లాడుకోగలం! 

సత్యదేవ్ జంగా కథతో - మా ఇద్దరి కోంబోలో కూడా ఒక సినిమా ఎందుకు చెయ్యకూడదు అని మొన్నే అనుకున్నాం. అంతా అనుకున్నట్టు జరిగితే - ఆ ప్రాజెక్టు ఒక పెద్ద బ్యానర్‌లోనే ఉంటుంది. అది వేరే విషయం.    


సత్యదేవ్, భార్య, ఇటీవలే ISB లో సీట్ తెచ్చుకున్న ఒక అబ్బాయితో కలిపి వారిది చిన్న కుటుంబం. వాళ్ల అన్నగారి కుటుంబంతో కలిసి వారిది ఉమ్మడి కుటుంబం కూడా కావడం విశేషం.   

శ్యామ్ సింఘరాయ్ వంటి పెద్ద హిట్ తర్వాత - సత్యదేవ్ నుంచి వచ్చే కథను అదే స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేయటం సహజం. అలాంటి వత్తిడిని తట్టుకొంటూ - తనదైన శైలిలో దేనికదే విభిన్నమైన కథలను తయారుచేసుకొంటూ - తన ప్యాషనేట్ కథాప్రపంచంలో బిజీగా ఉన్నారు సత్యదేవ్.

బ్లాక్ బస్టర్ "శ్యామ్ సింఘరాయ్" తర్వాత "వాట్ నెక్‌స్ట్" అంటే - 

"ఒక సూపర్ న్యాచురల్ యాక్షన్ డ్రామా, కాశీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పీరియాడిక్ లవ్‌స్టోరీ, రోమోకామ్స్, థ్రిల్లర్స్... అన్నీ కలిపి ఒక 10 నుంచి 15 వరకు కథలున్నాయి. త్వరలోనే నా కథతో ఒక పెద్ద ప్రాజెక్టు కూడా ఎనౌన్స్ అవబోతోంది" అన్నారు సత్యదేవ్.  

నిజానికి - "శ్యామ్ సింఘరాయ్" తర్వాత - సత్యదేవ్‌కు ముంబై నుంచి, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్స్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. కథలు వినిపించారు, ఒప్పించారు. అయితే - భారీ కమర్షియల్ సినిమా అంటే బేసిగ్గా కాంబినేషన్స్‌తో భారీ వ్యాపారం కాబట్టి - అవన్నీ సరిగ్గా కుదరాలి. ప్రస్తుతం  ఆ దిశలోనే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. 

సో... ఆ కాంబినేషన్స్, బడ్జెట్స్ అన్నీ కుదిరి... శ్యామ్ సింఘరాయ్‌ని మించిన కథతో అతి త్వరలోనే సత్యదేవ్ జంగా సినిమా ఎనౌన్స్ అవుతుందని ఈ అంతర్జాతీయ రచయితల దినోత్సవం రోజు ఒక మిత్రుడిగా నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. 

"శ్యామ్ సింఘరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు కథ ఇచ్చారు కదా - మాతో చేస్తారో లేదో" అని అనుకొనే అవకాశం ఇండస్ట్రీలో కొందరిలో ఉంటుంది. అది సహజం. నిజానికి చిన్న పెద్దా, సీనియర్ జూనియర్ అనే భేషజాల్లేకుండా - టేస్ట్ ఉన్న దర్శకులు-ప్రొడ్యూసర్స్ ఎవరితోనైనా కలిసి మంచి సినిమా చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సత్యదేవ్ జంగాకు మంచి ప్రాజెక్ట్సే లభిస్తాయని ఆయన మనసు తెలిసిన మిత్రునిగా నా నమ్మకం... నా ఆకాంక్ష. 

Happy International Writers' Day!  

Thursday, 2 March 2023

అట్లుంటది "కేటీఆర్" తోని!


ఇప్పటిదాకా "బలగం" ప్రి-రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్‌లో చూశాను. మొన్న చూళ్ళేదు. 

ఏదో ఇంకో రెండు పక్కా కమర్షియల్ సినిమాలు చేసేసి, నాలుగు డబ్బులు సంపాదించుకొని, ఆ రకంగా కొంచెం ఫ్రీడం తెచ్చుకొని, సినిమాలకు గుడ్‌బై చెప్పి, ఉన్న నాలుగు రోజులు నా ఇష్టమున్నట్టు లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని మొన్ననే డిసైడ్ అయినవాన్ని... ఇప్పుడు మనసు మార్చుకున్నాను.

అసలు సిసలు మెయిన్‌స్ట్రీమ్‌ లోకి  ఎంటరవుదామనుకుంటున్నా ఇప్పుడు! 

నా ఆలోచనలో ఇలాంటి మార్పు రావడానికి కారణం "బలగం" సినిమా, దిల్ రాజు, దాని దర్శకుడు వేణు & టీమ్, డీజే టిల్లూ ఎట్సెట్రా గెస్టులు మాత్రమే కాదు. 

చివరలో మాట్లాడిన సెకండ్ జెనరేషన్ నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిల్లో హన్షిత మాట్లాడిన రెండు మాటలు నాకు బాగా నచ్చాయి... 

ఎంత భారీ దర్శకుడినయినా, ఎంత భారీ హీరోనయినా తెచ్చుకోగల నేపథ్యం ఉన్నా - వాటిని పక్కనబెట్టి, తెలంగాణ ఆత్మను వారి తొలి సినిమాగా అందిస్తున్న ఈ ఇద్దరికీ నా శుభాభినందనలు. 

"సెకండ్ జెనరేషన్ ఐకాన్" కేటీఆర్ గారు వాళ్ళిద్దరికీ చెప్పిన రెండు మాటలు ఈ మొత్తం ఈవెంట్‌కే హైలైట్. 

కట్ చేస్తే - 

"తెలంగాణ సినిమాకు చాలా చెయ్యాల్సి ఉంది, చేస్తాం" అని కేటీఆర్ గారు ఈ వేదిక మీద నుంచి చెప్పటం ఒక గొప్ప ఫినిషింగ్ టచ్. 

ఎందుకంటే - సిరిసిల్లలో కేటీఆర్ చెప్పింది చేశారు. చెప్పినదానికంటే వందరెట్లు ఎక్కువ చేశారు. 

అదే సిరిసిల్ల నుంచి ఆయనే స్వయంగా చెప్పిన ఈ మాటకు చాలా విలువుందని నాకు తెలుసు. కేటీఆర్ గారి గురించి తెలిసిన అందరికీ బాగా తెలుసు. 

ట్విట్టర్‌లో - "ఆస్క్ కేటీఆర్" ద్వారా - నాకిచ్చిన మాటను మర్చిపోకుండా, నన్ను ప్రగతి భవన్ పిలిపించుకొని, నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"ను ఆవిష్కరించి, నాతో ముచ్చటిస్తూ కేటీఆర్ గారు గడిపిన ఆ విలువైన సమయం నాలో ఇంకా ఫ్రెష్‌గానే ఉంది.      

మరోవైపు, ఎన్నో అంశాల్లో హైద్రాబాద్‌ను ఇంటర్నేషనల్ స్థాయి సిటీల్లో ఒకటిగా మనం చూస్తూండగా చేసి చూపించారు కేటీఆర్.

ఈ దిశలో కేటీఆర్ సారథిగా, వారి టీమ్ సాధిస్తున్న విజయాలు నిజంగా ఎపిక్! 

వారంలో దాదాపు ప్రతిరోజూ - కనీసం ఒక భారీ ఇన్వెస్ట్‌మెంట్ అయినా తెలంగాణకు తీసుకురాని రోజు లేదు. 

ఇన్నిన్ని పనుల్లో నిరంతరం బిజీగా ఉంటూ - ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా కోసం - సిరిసిల్లలో కేటీఆర్ గారు రెండు మూడు గంటలు కెటాయించడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. 

That is KTR... The Future Perfect of Telangana.    

Monday, 27 February 2023

తెలంగాణకు పట్టిన గోబెల్స్!


జొన్నకలి, జొన్న యంబలి
జొన్నన్నము, జొన్నపిసరు జొన్నలె తప్పన్ 
సన్నన్నము సున్న సుమీ 
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్ 

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు 
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు 
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు 
పలనాటి సీమ పల్లెటూళ్ళు

రసికుడు పోవడు పల్నా 
డెసగంగా రంభ యైన నేకులె  వడుకున్
వసుధేశు డైన దున్నును 
కుసుమాస్త్రుండైన జొన్న కూడె కుడుచున్ 

👆పైవన్నీ మహాకవి శ్రీనాథుని చాటు పద్యాలు. గ్రంథాల్లో ఉన్నాయి. కల్పితాలు కావు! 

శ్రీనాథుడు ఆ ప్రాంతంలో నిజంగా అన్నం దొరక్క ఎంత బాధపడివుండకపోతే ఈ విషయాన్ని పద్యాలకెక్కిస్తాడు?   

పల్నాటిసీమ వాళ్ళు నన్ను మన్నించాలి.  కోట్ చెయ్యాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి సరదాగా కోట్ చేశాను తప్ప మరొక ఉద్దేశ్యం నాకు లేదు. పల్నాడు ప్రాంతం వాళ్ళు నాకు ఎందరో అత్యంత అత్మీయులైన మిత్రులు, బంధువులు ఉన్నారు. అది వేరే విషయం. 

కట్ చేస్తే - 

ఒక వీడియో బైట్‌ను కోట్ చేస్తూ - "మీరు మారరు కాక మారరు!" అని - నిన్న సాయంత్రం - తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పెట్టిన ట్వీట్ ఒకటి చూశాను. ఆయన సహజ స్వభావం లాగే చాలా మెత్తగా, డిగ్నిఫైడ్‌గా ఆ ట్వీట్‌లో తిట్టారాయన. 

బీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ అయితే దంచుకున్నారు.   

దిలీప్ భాయ్ కోట్ చేసిన ఆ వీడియో బైట్‌లో మాట్లాడిన వ్యక్తి మీద నాకు కోపం రాలేదు. జాలి అనిపించింది.  

తెలుగుదేశం పార్టీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు మాత్రమే తినేవారట. తెలుగుదేశం పార్టీ వచ్చి, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రజలు మొట్టమొదటిసారిగా అన్నం వండుకుని తినడం ప్రారంభమైందట. ఆ ఘనత తెలుగుదేశం పార్టీదట... 

ఇట్లా చరిత్రలో ఓనమాలు తెలియని మూర్ఖులు రాజకీయనాయకులైతే దేశం ఇలాగే ఉంటుంది. ఇంకో 75 ఏళ్లయినా ఇలాగే శాశ్వతంగా "అభివృద్ధి చెందుతున్న దేశం" గానే మిగిలిపోతుంది. 

తెలిసి అబద్ధాలాడ్డం నీచం. మేమే గొప్ప అన్న అహంకారంతో ఇలాంటి పచ్చి అబద్ధాలాడ్డం ఇంకా నీచాతినీచం. 

రాజకీయాల్లో వంద మాట్లాడవచ్చు. కాని, మరీ ఇంత నీచ స్థాయి అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వటం అత్యంత అసహ్యకరం. జుగుప్సాకరం. 

ఈయన వయస్సుని గుర్తిస్తూ - ఈయన పట్ల నాలో మిగిలివున్న అంతో ఇంతో గౌరవం కూడా పాతాళానికి పోయింది.    

నా చిన్నతనం నుంచే మసూరి, జడసాంబలు బియ్యం నెల నెలా బస్తాల్లో - వరంగల్లో బొడ్రాయిలోని - మా తోట రామచంద్రం దుకాణం నుంచి తెచ్చుకొనేవాళ్లం. ఆ బియ్యం బస్తాలపైనే మేం పిల్లలం ఎగురుతూ దునుకుతూ ఆడుకొనేవాళ్ళం. 

అలాగని మేం ధనవంతులం కాదు. మా అమ్మ ఇంట్లో కుట్టుమిషన్ మీద పనిచేసేది. మా నాన్న మగ్గం నేసేవాడు. ఇంట్లో ఇంకో నాలుగైదు మగ్గాలుండేవి. వాళ్ళిద్దరూ చదువుకోలేదు. పెద్ద బాలశిక్ష కొనుక్కొని - ఉత్తరం రాయడం చదవటం వరకు - సొంతంగా నేర్చుకున్నారు. 

ఇటుకలతో కట్టిన విశాలమైన ప్రహరీ గోడతో 14 దర్వాజాల పెంకుటిల్లు మాది. ఆ ఇంటికి - ఏ తెల్లవారుజామునో - అప్పుడప్పుడు  అన్నలొచ్చి అన్నం తినిపోయేవారు. మా ఇంటికి దగ్గరున్న సంఘం బడిలో జననాట్యమండలి కార్యక్రమాలు, సభలు జరిగినప్పుడు - పాటలు పాడటానికి, మాట్లాడ్డానికి - ఎందరో అక్కడికి వచ్చేవాళ్లు.

అలా వచ్చినవాళ్లకు భోజనం మా ఇంట్లోనే పెట్టేవాళ్లం. 

బాలగోపాల్, వరవర రావు, గద్దర్ వంటి వాళ్ళను నేను మొట్టమొదటగా చూసింది మా ఇంటి వాకిట్లో ఉన్న గద్దెలమీద కూర్చొని వాళ్ళు అన్నం తింటున్నప్పుడే.

ఇదంతా - సుమారు ఐదు దశాబ్దాల క్రితం నాకు ప్రత్యక్షంగా తెలిసిన నిజం. అంతకు యాభై ఏళ్ళ క్రితమే మా తాతలు అన్నం, పప్పుచారు తిన్నారు. వేడి వేడి అన్నంలో గోలిచ్చిన కారం-నూనె కలుపుకొని రుచిగా తిన్నారు.

ఇక హైద్రాబాద్ బిర్యానీకైతే వందల ఏళ్ల చరిత్ర ఉంది. 

మరి... తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది? 

ఇదంతా పక్కన పెడితే - అసలిప్పుడు ఆరోగ్యం కోసం బాగా ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తింటున్నది ఈ జొన్నలు, రాగులు, సజ్జలే కదా!

ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా ఇంత అహంకారం ఎందుకు?

కట్ చేస్తే -

ఈయనొక్కడే కాదు. అంతాకలిపి ఇంకో అరడజన్ మంది వున్నారు... 

ఇవే తెలివిలేని మాటలు, అహంకారపు అబద్ధాలు. 

ఇవన్నీ ఏదో ఆషామాషీగా జరుగుతున్నవి కాదు. పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. వీరందరి లక్ష్యం ఒక్కటే. 

తెలంగాణలో అలజడి సృష్టించడం, తెలంగాణను అతలాకుతలం చేయడం.     

కాని, ఇక్కడున్నది కేసీఆర్. 

బ్లైండ్-ఫోల్డ్ ఆడుతున్న అనతోలి కార్పోవ్‌లా - వీళ్లందరికీ కలిపి - ఒకేసారి చెక్ పెట్టగల సమర్థుడు. 

అది కూడా మనం చూస్తాం. 

కొంచెం ఇష్టం, కొంచెం ఆనందం!


ఒక విషయంలో మనం అనుకున్నది అనుకున్నట్టు కనీస స్థాయిలోనయినా జరగటం లేదంటే దానర్థం మనం అసమర్థులం అని కాదు. అంతకు మించింది ఏదో మనం చెయ్యాల్సి ఉంది. మన ఫోకస్ అటు మరల్చాలి. 

ఒక వ్యక్తిగాని, ఒక వస్తువు కాని, ఒక అంశం కాని మన జీవితంలో లేవు అంటే లేనట్టే. వాటి గురించే ఉన్న సమయం వృధా చేసుకోకుండా ముందుకు సాగాల్సిందే. 

కట్ చేస్తే -

జీవితం చాలా చిన్నది. మన ఖాతాలో మనకున్న సమయం ఎంతో కూడా మనకు తెలీదు.

ఉన్నన్నాళ్ళూ ఇంకా ఏం చేయగలం, ఎంత ఇష్టంగా చేయగలం, ఎంత ఆనందంగా గడపగలమన్నదే మన ఆలోచన కావాలి. అలాంటి జీవితం గడపడానికి అవసరమైన ఫ్రీడం మనం ఎంత తొందరగా తెచ్చుకోగలం అన్నదొక్కటే మన ప్రధాన లక్ష్యం కావాలి.   

"Remember that all is a gift,
but the most precious of all gifts is
life and love."
- Debbie Teeuwen 

Saturday, 25 February 2023

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!


యూక్రేన్‌లో ఉన్న నా స్నేహితురాలు, ఆర్టిస్టు, ఇంటర్నేషనల్ మోడల్ కాత్యా ఐవజోవాను రష్యా-యూక్రేనియన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన కొత్తలో క్యాజువల్‌గా ఒక ప్రశ్న అడిగాను...

"మీ రెండు దేశాల మధ్య ఈ గొడవ ఎన్ని రోజులుండొచ్చు?" అని.  

"ఇది యుద్ధం... యుద్ధం ముగియడానికి సంవత్సరాలు కూడా పడుతుంది. చెప్పలేం!" అందామె. 

కాత్యా మాటల్ని నేను అంత సీరియస్‌గా తీసుకోలేదప్పుడు. కాని, చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై అప్పుడే సంవత్సరం దాటింది!

ఇప్పుడు నా స్నేహితురాలు కాత్యా నేరుగా యుద్ధ క్షేత్రంలో పాల్గొంటోంది. యుద్ధ సమయంలో పైనుంచి రష్యన్ బాంబింగ్స్ జరుగుతుండగానే - వందల కిలోమీటర్లు తానే కారు డ్రైవ్ చేస్తూ - తన కుటుంబాన్ని యూక్రేన్ సరిహద్దులు దాటించి, యూరోప్‌లో దించి, వెనక్కి వచ్చింది.

కట్ చేస్తే - 

యూక్రేనియన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్స్‌కీ ప్రెసిడెంట్ కాకముందు... నటుడు, డాన్సర్, కమెడియన్, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా!  

ఆ తర్వాతే పొలిటీషియన్. 


కనీసం ఒక డజన్ రొమాంటిక్ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాడు జెలెన్స్‌కీ.  

"లవ్ ఇన్ ద బిగ్ సిటీ", "లవ్ ఇన్ వేగాస్", "8 ఫస్ట్ డేట్స్" మొదలైనవి జెలెన్స్‌కీ హీరోగా నటించిన యూక్రేన్ సినిమాలు. 

"డాన్సింగ్ విత్ ద స్టార్స్" అనే టీవీ డాన్స్ షోలో డాన్సర్‌గా పోటీలో పాల్గొన్నాడు. "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" అనే టీవీ కామెడీ షోలో కమెడియన్‌గా కూడా నటించాడు జెలెన్స్‌కీ. 

తనకున్న ఈ నేపథ్యంతోనే యూక్రేన్‌లో ఒక పాపులర్ ఫిల్మ్ ఆర్టిస్ట్‌గా పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు జెలెన్స్‌కీ. 

అన్నట్టు... జెలెన్స్‌కీ భార్య ఒలెనా కియాష్కో ఆర్కిటెక్ట్, స్క్రీన్ రైటర్ కూడా!   


ఇంకో గొప్ప విషయమేంటంటే - తను నటించిన కామెడీ సీరియల్ "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" పేరుతోనే 2018 లో పార్టీ స్థాపించి, కేవలం 3 నుంచి 4 నెలల్లోనే అప్పటివరకు ఉన్న ప్రెసిడెంట్ పిత్రో పరషెంకోను చిత్తుగా ఓడించి యూక్రేన్‌కు 6 వ ప్రెసిడెంట్ అయ్యాడు జెలెన్స్‌కీ! 

తర్వాతంతా చరిత్రే. 


కట్ చేస్తే - 

పాలిటిక్స్‌లో, "తక్కువ సమయం ఉంది .. ఇది సాధ్యం కాదు" అనుకోడానికి వీళ్లేదని చెప్పే ఒక  గొప్ప ఉదాహరణ ఇది.  

ఇలాంటి ఉదాహరణలు మన దేశంలో కూడా ఉన్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో కూడా... 

సో - అసెంబ్లీ ఎన్నికలుగాని, పార్లమెంట్ ఎన్నికలు గాని - వీటిలో ఏదైనా సరే, సాధించాలనుకునేవారికి సమయం లేదనుకోవద్దు. ఇప్పుడు చాలా సమయం ఉంది. 

Friday, 24 February 2023

కుక్కలున్నాయి జాగ్రత్త!


విషపూరితమైన ఒక పాము మన ఇంట్లోకొచ్చింది. దాంతో ప్రాణాలకే ప్రమాదం. ఏదో నంబర్ వెతికి, ఎవరికో ఫోన్ చేసి, వాళ్ళొచ్చి దాన్ని పట్టుకొని వెళ్లేలోపు జరగరాని ఘోరం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? 

ఎక్కన్నుంచో ఒక చిరుతపులి జూబ్లీ హిల్స్‌లోని జనావాసాల్లోకి వచ్చింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. ఎవరో వచ్చి దాన్ని పట్టుకొని, సేఫ్‌గా దాన్ని జూకి తీసుకెళ్లేదాకా జరిగే ప్రమాదాల్ని ఎవరు ఆపుతారు? 

పట్టపగలే పిచ్చి కుక్కలు మనుషుల్ని వెంటపడి చంపుతుంటే ఏ చట్టాలు కాపాడతాయి? ఆ చట్టాల పునాదుల మీద అద్దాల మేడల్ని కట్టుకుని బ్రతికే సోకాల్డ్ సోషల్ యాక్టివిస్టులు ఇప్పుడెక్కడున్నారు? ఎందుకు బయటికి రారు? 

"నోరు లేని జీవులకు ఎలాంటి హాని తలపెట్టొద్దు" అనే ఈ పనికిరాని చట్టాలన్నిటినీ మూటగట్టి బంగాళాఖాతంలో కలిపెయ్యాలి. 

అసలు వాటికి హాని తలపెట్టే ఆలోచన, తీరిక ఏ మనిషికుంది?   

అలాంటి ఏ చట్టమైనా అడవులవరకే పరిమితం కావాలి తప్ప జనారణ్యాల్లో మనుషులు చావడానికి కారణం కావద్దు.  

ఆఖరికి సినిమా షూటింగ్స్‌లో కూడా "మేం ఏ ప్రాణికి హాని కలిగించలేదు..." అంటూ స్క్రీన్ మీద ఒక కార్డు వేయాలి. షూటింగ్‌కు ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దానికో అబ్జర్వర్ టీమ్! 

ప్రత్యక్షంగానో పరోక్షంగానో - మన దేశంలో ఇలాంటి చెత్త చట్టాలు కొన్ని మొదలవ్వడానికో, ప్రాముఖ్యం సంతరించుకోడానికో కారణమైన ఆ మేనక ఇప్పుడెక్కడ? ఊర కుక్కలతో కరవబడి ప్రాణం వదిలిన ఆ చిన్నారిని వెనక్కి తెచ్చిస్తుందా?

హైద్రాబాద్‌లో కూడా ఉన్న సెలబ్రిటీ సోషల్ యాక్టివిస్టులు బయటికొచ్చి కనీసం ఒక వీడియో బైట్ అయినా ఇచ్చారా? 

జరిగిన సంఘటనకు ఏం సంజాయిషీ ఇస్తారు ఈ యాక్టివిస్టులంతా?         

కట్ చేస్తే - 

ఇలాంటి చట్టాలున్నాయి కాబట్టే - సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎలాంటి అగ్రెసివ్ యాక్షన్ తీసుకోలేకపోవడం అన్నది కామన్ సెన్స్. 

ఇలాంటి ఘోరం జరగటం ఎవరికి సంతోషం?  

సిటీలోని దాదాపు ప్రతి కాలనీలో ఇలాంటి ఊర కుక్కల సమస్య ఉంది. అయినాసరే - మున్సిపాలిటీవాళ్ళు వాటిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు - "వాటిని తీసుకెళ్ళొద్దు" అని అడ్డుపడే యాక్టివిస్టులు మా కాలనీలో కూడా ఉన్నారన్నది నా కళ్ళారా చూసిన వ్యవహారం! 

అయినా సరే - తప్పనిసరి అయిన కొన్ని అరుదైన సందర్భాల్లో ఎన్‌కౌంటర్స్ జరిగినట్టే - ఇలాంటి విషయాల్లో కూడా ఒకే ఒక్క రోజు రాష్ట్రమంతా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి, వాటన్నిటినీ లిఫ్ట్ చేసి, పని ముగించాలి. 

లేదంటే - ఒకవైపు ప్రపంచం గుర్తిస్తున్న వెయ్యి మంచి పనులు రాష్ట్రంలో జరుగుతున్నా - అరుదుగా జరిగే ఇలాంటి బాధాకరమైన సంఘటనల వల్ల కొద్దిమంది ప్రజల దృష్టిలోనైనా ప్రభుత్వం పట్ల నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయి. 

మరోవైపు - పని లేని సోషల్ మీడియా ఊరకుక్కలు కొన్ని కేటీఆర్ మీదా, మేయర్ మీదా, ప్రభుత్వం మీదా రేబిడ్ డాగ్స్‌లా అదేపనిగా మొరుగుతుంటాయి.  

Thursday, 23 February 2023

ఎవరైనా చదివితే ఏమనుకుంటారు?


ఈ పోస్టులో నేను చర్చిస్తున్నది ప్రొఫెషనల్, టెక్నికల్ బ్లాగుల గురించి కాదు. అది పూర్తిగా వేరే లోకం. 

కట్ చేస్తే - 

బ్లాగ్ అంటేనే వ్యక్తిగతం. పర్సనల్. చాలావరకు సొంత గొడవ ఉంటుంది. సొంత అభిప్రాయాలుంటాయి. 

అప్పుడప్పుడూ సొంత డబ్బా కొట్టుకోవడం కూడా ఉంటుంది. ఈ సెల్ఫ్ డబ్బానే "మార్కెటింగ్" అని కూడా ముద్దుగా పిల్చుకుంటాం.

ఎంత వద్దనుకొన్నా - చాలాసార్లు మనం రాసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగతమైన కొన్ని సెన్సిటివ్ ఆలోచనలు కూడా మన బ్లాగ్ పోస్టుల్లో బాహాటంగా రాసేసుకుంటుంటాం. తర్వాతెప్పుడో ఒక 2, 3 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు - నేను ఇలా రాశానా? అసలు ఇదెందుకు రాశాను? ఇది రాయాల్సింది కాదు కదా... అనిపిస్తుంది. 

ముఖ్యంగా కొన్ని బ్లాగ్ పోస్టుల విషయంలో మరీ సిల్లీగా అనిపిస్తుంది. 

కాని - అదంతే. 

ఫ్లో రైటింగ్. 

ఫ్లోలో అలా వచ్చేస్తుంది. 

ఏం తప్పుకాదు. 

బ్లాగ్ ఇలాగే రాయాలని కాని, బ్లాగ్‌లో ఇవి మాత్రమే రాయాలని కాని ఎలాంటి రూల్స్ లేవు.  

మనవాళ్ళు ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? బయటివారైనా సరే, చదివి ఏమనుకుంటారో... అనే ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. 

"అసలు, అలాంటి ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్. 

కట్ చేస్తే - 

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన - టూ మచ్ పర్సనల్ థింగ్స్ - 'సినిమాలో అతిథిపాత్రల్లా' అప్పుడప్పుడూ కొన్ని కనిపిస్తుంటాయి. 

కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని సెల్ఫ్ ప్రమోషన్స్, కొన్ని మరీ డైరెక్ట్ సెల్లింగ్స్ కూడా.    
అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మనకు నచ్చిన జీవనశైలిలో, మనకిష్టమైన స్థాయిలో, మనకు అవసరమైన మార్కెటింగ్ ఎలాగూ తప్పదు.

కాని...  మన జీవితంలోని మంచి, చెడుల గురించి... సుఖ సంతోషాల గురించీ... మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎప్పటికప్పుడు మనకు చాలా ఉంటుంది. 

ఆ అవసరాన్ని తీర్చే అద్భుత సాధనమే... "బ్లాగింగ్".   

రిలాక్స్ కోసమో రిలీఫ్ కోసమో నాకు మందు, సిగరెట్లు అవసరం లేదు.

నాకున్న అతి పెద్ద స్ట్రెస్ బస్టర్...

నా బ్లాగ్ ఒక్కటి చాలు.   

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.” 
- James Altucher

Wednesday, 15 February 2023

రేపు మా వరంగల్‌కి వెళ్తున్నా... చాలా రోజుల తర్వాత!


కొన్ని నిముషాల క్రితం ఈ వాక్యం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడానికి ఎంత ఆనందపడిపోయానో చెప్పలేను.

ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఎన్నేళ్లయినా ఆ ప్రేమ పోదు. 

ఉర్సు చెరువు, దాన్లో ఈతలు, ఫిషింగ్... 
ఉర్సు గుట్ట, ఆ గుట్టెక్కి చింతపల్క పండ్లు తెచ్చుకొన్న రోజులు...
ఉర్సు గుట్ట చుట్టూ బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు...
ఉర్సు వాటర్ ట్యాంక్ చుట్టూ ఆడిన రేస్ ఆటలు...
ఒకసారి అదే వాటర్ ట్యాంక్ కాంపౌండ్‌లో నేనూ, జయదేవ్ ఇంకో ఫ్రెండ్‌తో కల్సి దొంగతనంగా కల్లు తాగడం...
ఉర్సులో మా సంఘం బడి అని పిల్చే శ్రీ వేంకటేశ్వర అప్పర్ ప్రైమరీ స్కూలు...
ఆ స్కూల్లో మా సార్లూ, గంట కొట్టే మా కొమ్మాలు..
7వ తరగతిలో నేనే స్కూల్ టాపర్ అయినందుకు ఆనవాయితీ ప్రకారం మా సార్లు, టీచర్లందరికీ నేను తెప్పించి తాగించిన పది పైసల చాయ్‌లు...  
ఏడాదికోసారి వచ్చే ఉర్సు తీర్థంలో తప్పకుండా కొనుక్కొనే కెలీడియోస్కోపులూ... (అప్పుడు దాని పేరు అది అని తెలీదు!)
ఉర్సు పోస్టాఫీసు... అప్పటి పోస్ట్ మాస్టరు... మేం ఉరుక్కుంటూ వెళ్ళి కొనుక్కొచ్చిన పోస్ట్ కార్డులూ, ఇన్‌లాండ్ లెటర్లూ...
చెట్లోళ్ల గడ్డ... కుంకుమ దుకాండ్లు...
కరీంబాద బుచ్చన్న హోటల్లో మేం తిన్న పూరీ, ఖారాలు...
ఆ పక్కనే సందులో మా చిన్నమ్మ ఇల్లు...
సాకరాశి కుంట దాటి, రైల్వే గేటు దాటి, బట్టల బజారు మీదుగా, చమన్ దాటి రోజూ నడుచుకుంటూ వెళ్ళి నేను చదివిన నా ఏవీవీ జూనియర్ కాలేజి హైస్కూలు... 
హైస్కూల్లో మా సార్లు... నాకు అంతో ఇంతో ఇంగ్లిష్ మీద ఇష్టం కలగటానికి కారణమైన మా రాజమౌళి సారు... 
హైస్కూల్లో నా క్లాస్‌మేట్ ఆకుతోట సదానందంతో కలిసి చూసిన ఎన్నో ఫస్ట్ డే మార్నింగ్ షోలు...
అంతకుముందు నా ఇంకో క్లాస్‌మేట్ రాముడుతో కలిసి నేను చూసిన నోము సినిమా... ఇంకెన్నో సినిమాలు... 
అప్పటి నా ఫేవరేట్ ఇంగ్లిష్ సినిమాల అలంకార్ టాకీస్, అశోకా, నవీన్, రామా, దుర్గా, కాకతీయ 70 ఎమ్మెమ్, మినీ కాకతీయ, వెంకట్రామా, క్రిష్ణా టాకీసులు...
బాంబే స్వీట్ హౌజ్‌లో మేం తిన్న కలాకంద్, తర్వాత ఇచ్చే శాంపిల్ కారా...
ఫస్ట్ టైమ్ మా మేన బావ రమేశ్‌తో కలిసి సవేరా బార్‌కెళ్ళి తాగిన బీరు, తిన్న బిర్యానీ...
కరీంబాదలో ఓ పెళ్ళి బారాత్ అప్పుడు, మా ఇంకో బావ రమేశ్ పక్కనే ఉన్న వైన్ షాపుకు తీస్కెళ్ళి, ఐదు నిమిషాల్లో నిలబడే ఒక బీరు ఖతం చేయించిన తీరు... 
ఉర్సు, ప్రతాప్‌నగర్‌లో మాపెద్ద అరుగుల ఇల్లు... 
రాత్రైతే చిన్నా పెద్దా అందరికీ ఆ అరుగులే అడ్డాగా పొద్దుపోయేదాకా ముచ్చట పెట్టుకోడాలు...
పనిమనుషులు తెలియని ఆరోజుల్లో, మా అమ్మ ఒక్కతే ఆ 14 దర్వాజాల పెంకుటింటి చుట్టూ రోజూ ఊడ్చి, చల్లి, ముగ్గులేసిన ఆ రోజులు... 
మా ఇంట్లో నాకిష్టమైన రెండు చెక్క అల్మారాలు, వాటిలోని మా అన్న కొనుక్కున్న లెక్కలేనన్ని పుస్తకాలు...
మా నాయిన కొనుక్కున్న శంకర్ నారాయణ డిక్షనరీ... 
రంగశాయిపేట, బొడ్రాయి, మామునూరు క్యాంపులో గోడమీద ఆదివారం ఫ్రీ సినిమాలు... 
కాకతీయుల ద్వారతోరణాలు, శిథిలాలు... 
ఇట్లా రాసుకుంటూపోతుంటే ఎన్నెన్నో ఎడతెగని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్...

కట్ చేస్తే - 

బాల్యంలో నాకెన్నో అద్భుత జ్ఞాపకాలనందించిన నా వరంగల్‌కు నేనెప్పుడు వెళ్ళినా నాకు బాధగానే ఉంటుంది. 

నన్ను అమితంగా ప్రేమించిన అమ్మా నాన్న లేరు. 

పదో తరగతితోనే చదువు మానేసి, మెషినిస్టుగా ఎక్కడో ఫాక్టరీలో పనిచేసుకుంటూ బతకాల్సిన నేను - మళ్ళీ చదువుకోడానికి, డైరెక్టుగా యూనివర్సిటీలోకే ప్రవేశించి పీజీలు, గోల్డ్ మెడల్స్ సాధించడానికి కారణమైన ఇన్‌స్పిరేషన్‌ను ఒకే ఒక్క మాటతో అందించిన మా అన్న దయానంద్ లేడు.   

నేను కనిపించగానే నవ్వుతూ పలుకరించే నా చిన్న తమ్ముడు వాసు లేడు. 

నా చిన్ననాటి జిగ్రీ దోస్త్ ఓంప్రకాశ్ లేడు... 

ఎందరికో ఆశ్రయమిచ్చి, మాకెన్నో అద్భుత జ్ఞాపకాలనిచ్చిన అప్పటి మా ఇల్లు లేదు. 

కన్నీళ్ళు తన్నుకుంటూ వచ్చే ఇలాంటి జ్ఞాపకాలు ఇష్టం లేకే నేను వరంగల్ వెళ్లడానికి తప్పించుకొంటుంటాను.

అయినా సరే, కొన్నిసార్లు తప్పదు. ఇలా పొద్దున బయల్దేరి వెళ్లి, రాత్రికి వచ్చేస్తుంటాను.  

ఒకసారి ఫ్రీగా ఒక వారం రోజులు మా వరంగల్లో అడ్డా వెయ్యాలని ఉంది. అక్కడే ఉన్న నా ఇద్దరు తమ్ముళ్ళు శ్రీధర్, రమేశ్‌లతో కలిసి నాకిష్టమైన అప్పటి అన్ని జ్ఞాపకాలని మనసారా చూస్తూ తిరగాలని ఉంది. నన్ను నేను పరిచయం చేసుకుంటూ, అప్పటి నా బంధుమిత్రులందరినీ కలిసి పలకరించాలని ఉంది. 

ఎప్పుడో ఆ పని తప్పక చేస్తాను.     

ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఆ ప్రేమ పోదు. 

Friday, 10 February 2023

రాజకీయాలు వేరు, సంకుచిత ఆలోచనలు వేరు!


అందరూ కాదు గాని... 

అక్కడక్కడా కొంతమంది ఛోటా నాయకులు, గల్లీ లెవల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎంతో గొప్పగా ఊహించుకుంటుంటారు. 

ఊహించుకోవచ్చు. అది వారిష్టం. తప్పు లేదు. 

కాని, ఎంత సేపూ ఎవరో ఏదేదో చేసేస్తున్నారు, వాళ్ళకి అనవసరంగా ఏదో పేరొచ్చి కొంపలంటుకుపోతున్నాయి అన్నట్టు చాలా సంకుచితంగా ఆలోచిస్తుంటారు. పైకే అంటుంటారు. అదేపనిగా చెప్తుంటారు. 

ఎంతసేపూ ఇంకొకరెవరితోనో పోల్చుకుంటుంటారు. 

"నేను ఫలానా ఆమె/అతని కంటే ఏం తక్కువ... నాకెందుకు ఫలానా పోస్టు రాలేదు?"... అని ఓ తెగ బాధపడిపోతుంటారు. 

ఇలాంటివాళ్ల భాష కూడా సోషల్ మీడియాలో సూపర్ పాలిష్డ్‌గా ఉంటుంది. బయట మాటలు మాత్రం యమ చెత్తగా ఉంటాయి. వాళ్ళ గెటప్‌కు, వారి నోటి నుంచి వచ్చే భాషకు అసలు సంబంధమే ఉండదు!   

ఇలాంటివాళ్లంతా ఒక క్యాటగిరీ. ఎన్నాళ్లయినా అక్కడక్కడే ఉంటారు. ఉన్నచోటే ఉండిపోతారు. 

కట్ చేస్తే - 

అసలైన పొలిటీషియన్స్‌కు ఖచ్చితమైన లక్ష్యాలుంటాయి. వారి ఫోకస్ మొత్తం వారి లక్ష్యం మీదే ఉంటుంది. ఇంకొకరి గురించి ఆలోచించే అంత సమయం వారికుండదు. 

స్పష్టమైన వారి లక్ష్యం, వారి నిరంతర కృషి, వారి సంకల్పం, వారిలోని ఆత్మవిశ్వాసం... వారి చుట్టూ ఒకరకమైన 'ఆరా' క్రియేట్ చేస్తాయి. ఒక శక్తినిస్తాయి. 

ఇంకొకరెవరో వారిని దాటిపోతున్నారనో, తొక్కేస్తున్నారనో అనుకోరు. ఆ ఇంకొకరెవరూ తమ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేనంతగా పనిచేస్తూ లక్ష్యంవైపు దూసుకెళ్తుంటారు. 

చిన్నదో పెద్దదో... ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారు. అనుకున్నది సాధిస్తారు. అలా ఒక్కో లక్ష్యం సాధించుకుంటూ ముందుకెళ్తుంటారు. 

ఇదంతా కూడా రాజకీయమే. సిసలైన రాజకీయం ఇదే. 

ఇలాంటి రాజకీయం చేసేవాళ్లనే... అన్నీ వాటికవే ఎదురొచ్చి వరిస్తాయి. 

ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేసే వీరికీ... ఎలాంటి లక్ష్యం లేకుండా, కృషి లేకుండా, కనీస సామర్థ్యం లేకుండా ఎంతసేపూ ఇంకొకరితో పోల్చుకొనేవారికీ, అర్థంపర్థం లేకుండా అందర్నీ విమర్శించేవారికీ, ఏదేదో ఆశించి పనిచేసేవారికీ... జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది.  

ఇంకొకరి గురించి కుళ్ళుకోవడమో, చెత్తగా మాట్లాడటం ద్వారానో... ఎవ్వరూ ఏదీ సాధించలేరు.  

ఆశించటం తప్పు కాదు. కాని, ఆ స్థాయి సామర్థ్యం లేకుండా ఆశించడం మాత్రం ఒప్పు కాదు. 

"Politics is not a game. It's a task." 
- KTR

Thursday, 9 February 2023

మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు!


"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. 

ఒక్క దేవుడనే కాదు... ఏ విషయంలో ఐనా అంతే. 

మనం కన్వీనియెంట్‌గా ఫీలైన విషయాలతోనే మనం కనెక్ట్ అవుతాం. మనుషుల విషయంలో కూడా అంతే. మనం కంఫర్ట్‌గా ఫీలైన వ్యక్తులే ఎక్కువగా మన జీవితంలో ఉంటారు. 

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది... 

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు! 

అంటే - అందులో ఏదో ఆనందమో, ఓదార్పో, ఇంకేదో మనకు అవసరమైన పాజిటివ్ ఫీలింగో ఉంది.  

తప్పకుండా ఉంది. 

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్... అని నేననుకుంటున్నాను...  

Saturday, 4 February 2023

సంప్రదాయ సరియలిజమ్!


"ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు!" 

తాను నిమ్న కులానికి చెందినదాన్ని, ఈ బ్రాహ్మణుల ఇంట తాను వంట చేయొచ్చునో లేదో అన్న భావనతో తులసి పాత్రలో మంజుభార్గవి సందేహిస్తుంటే, శంకర శాస్త్రి పాత్రలో జె వి సోమయాజులు ఆమెతో  చెప్పే డైలాగ్ ఇది. 

బ్రాహ్మణవాది అని, సాంప్రదాయవాది అని అక్కడక్కడా వినిపించే మాటలకు ఆయన చిత్రంలోనే ఒక పాత్ర ద్వారా అంత సరళంగా, క్లుప్తంగా, సూటిగా జవాబిచ్చిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు.

తెలుగు సినిమా చరిత్రలో "శంకరాభరణం" చిత్రంతో ఒక కొత్త మలుపుని తీసుకువచ్చి, భారతీయ సంగీత నాట్య సంస్కృతీ సాంప్రదాయాలను తన వరుస చిత్రాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన పయొనీర్ దర్శకులు విశ్వనాథ్ గారు. భారత ప్రభుత్వం తరపున ఆస్కార్ ఎంట్రీకి 1986 లోనే పంపించబడిన తొలి తెలుగు సినిమా "శంకరాభరణం" అన్న విషయం చాలామంది మర్చిపోయివుంటారు.

విశ్వనాథ్ శంకరాభరణం సినిమా చూసిన తర్వాతే మన ఇళ్ళల్లోని వీణలు, ఫిడేళ్ళు, ఫ్లూట్లు అటకల మీద నుంచి మళ్ళీ కిందకు దిగాయి. ఇష్టమైన వాయిద్యాలను కొత్తగా కొనుక్కొని సంగీతం క్లాసులకు వెళ్ళటం మళ్ళీ ఊపందుకొంది. 

అప్పటివరకూ ఆకాశవాణి, దూరదర్శణ్‌లకు మాత్రమే పరిమితమైపోయి, "నాకు శాస్త్రీయ సంగీతం వచ్చు" అని బయటకు చెప్పుకోడానికి కూడా ఇబ్బందిపడినవాళ్లంతా, శంకరాభరణం తర్వాత సెలబ్రిటీలయిపోయారు. ప్రపంచమంతా ప్రదర్శనలిస్తూ పాపులర్ అయిపోయారు. సామాజికంగా ఇంత పెనుమార్పుకు ఒక్క సినిమా కారణమయ్యిందంటే అంత సులభంగా నమ్మలేం. శంకరాభరణం రూపంలో మన కళ్లముందే జరిగింది. దాని సృష్టికర్త కె విశ్వనాథ్.  

ఆ శాస్త్రీయ సంగీతం పాటల్ని నేను పాడను మొర్రో అని ఎంత తప్పించుకున్నా, తన పట్టువదలకుండా పాడించుకొని, "యస్ పి బాలు మాత్రమే అంత బాగా పాడగలడు, బాలు పాడారు కాబట్టే శంకరాభరణంలోని ఆ పాటలు అంత ఎఫెక్టుని ఇవ్వగలిగాయి" అని అంతకుముందు బాలుతో వద్దు అన్నవారితోనే శహభాష్ అనిపించగలిగిన గట్స్ కూడా విశ్వనాథ్ గారికే ఉన్నాయి. సిరిసిరిమువ్వ సినిమాతో వేటూరి సుందరరామమూర్తి రూపంలో, సిరివెన్నెల సినిమాతో సీతారామశాస్త్రి రూపంలో ఇద్దరు అద్భుత సినీ గేయరచయితలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత కూడా విశ్వనాథ్ గారికే దక్కుతుంది.        


బియస్సీ తర్వాత - మద్రాసులోని వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీరంగంలో ప్రవేశించిన విశ్వనాథ్ గారు, "పాతాళభైరవి" సినిమా ద్వారా 1951లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదటిసారిగా దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు. 1965లో దర్శకుడిగా తన తొలి సినిమా "ఆత్మగౌరవం"కు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సాధించిపెట్టారు. తర్వాత వారు తీసిన చెల్లెలికాపురం, శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి వంటి సినిమాలన్నీ అంతర్లీనంగా ఆధునిక స్త్రీవాదానికి ఆ కాలపు ప్రతీకలుగా చెప్పవచ్చు. సిరిసిరిమువ్వ నుంచి విశ్వనాథ్ సినిమాలకు సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి కళల నేపథ్యం ఆత్మగా నిలిచింది.   

సాంప్రదాయికవాది అని కొందరు అనుకొనే విశ్వనాథ్ గారే అత్యధికమైన సంఖ్యలో సామాజిక స్పృహవున్న సినిమాల్ని తీశారన్న వాస్తవం బహుశా చాలామందికి తెలియదు. సప్తపది, సిరివెన్నెల, సూత్రధారులు, శుభలేఖ, శృతిలయలు, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, స్వర్ణకమలం వంటి సినిమాలన్నీ సామాజిక సమస్యల నేపథ్యం ఉన్నవే.

ఒకరకంగా చెప్పాలంటే - కేవలం ప్యారలల్ సినిమాల్లో మాత్రమే చెప్పగలిగే సీరియస్ సబ్జక్టులకు - భారతదేశపు కళలు, సంస్కృతీ సంప్రదాయాల వన్నెలు అద్ది, అద్భుత సినిమాలుగా రూపొందించి మెప్పించిన సరియలిస్టిక్ సాంప్రదాయవాది దర్శకులు విశ్వనాథ్. 

విశ్వనాథ్ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే - ఆయన అద్భుత కళాఖండం "సాగర సంగమం" ఒక ఎత్తు. ఈ ఒక్క సినిమా మీదనే వివిధకోణాల్లో థీసిస్‌లే రాయవచ్చు. అన్ని సినిమాల్లో జయప్రద ఒక ఎత్తు అయితే - ఈ ఒక్క సినిమాలో జయప్రద వేరు. ఇదే కమలహాసన్‌కు కూడా వర్తిస్తుంది. "సాగర సంగమం సినిమాకు ముందు కమలహాసన్, సాగరసంగం తర్వాత కమలహాసన్" అని చెప్పవచ్చు.  

సుమారు ఆరు దశాబ్దాల తన చలనచిత్ర జీవితంలో - విశ్వనాథ్ గారు సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా, వీటిలో 9 సినిమాలు హిందీలో కూడా చేయడం విశేషం. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, ఫిలిమ్‌ఫేర్ అవార్డులు పుష్కళంగా అందుకున్న విశ్వనాథ్ గారు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్ని కూడా అందుకున్నారు. దర్శకుడుగా విరామం తీసుకున్న తర్వాత నటుడిగా కూడా చాలా సినిమాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు.  

సినిమా ప్రధానంగా ఒక వినోదాత్మక మాధ్యమం. అంతర్లీనంగా ఏవైనా సందేశాలుండొచ్చు కాని, సందేశాల కోసమే సినిమాలు తీయడానికి పదులు, వందల కోట్లు ఎవ్వరూ ఖర్చుపెట్టలేరు. ఆర్ట్ సినిమా-లేదా-ప్యారలల్ సినిమా వేరు. ఈ సినిమాల్లో సందేశం ఉండొచ్చు, సామాజిక స్పృహ ఉండొచ్చు. ఈ సినిమాలకు లాభనష్టాల లెక్కలు పెద్దగా ఉండవు. వీటి నిర్మాణ బడ్జెట్లు కూడా చాలా తక్కువే. ప్రేక్షకులూ తక్కువే. 

ఈ కోణంలో చూస్తే - ఎన్నో సీరియస్ సామాజిక సమస్యలను కథాంశంగా తీసుకొని, వాటికి నేపథ్యంగా భారతీయ సాంప్రదాయిక కళల్ని ఒక షుగర్‌కోటింగ్‌లా సదుపయోగం చేసుకొని, కమర్షియల్ వయబిలిటీతో అద్భుత సినీకళాఖండాలను అందించిన విశ్వనాథ్ గారే నిజమైన రెనగేడ్ డైరెక్టర్.  

బహుశా అందుకేనేమో... రామ్‌గోపాల్‌వర్మ లాంటి విశృంఖలవాది దర్శకుడు కూడా ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా తన మీద కూడా చాలా విధాలుగా ప్రభావం చూపింది అని స్వయంగా ఒప్పుకొన్నాడు. శంకరాభరణం క్లయిమాక్స్‌లో శంకరశాస్త్రి చెప్పిన ఒక పూర్తి డైలాగ్‌ను అప్పటికప్పుడు తడుముకోకుండా చెప్పాడు.

అలాంటి శంకరాభరణం సినిమా 43 ఏళ్ల క్రితం రిలీజైన రోజు ఫిబ్రవరి 2 నాడే విశ్వనాథ్ గారు నిష్క్రమించడం విశేషం. 

***

(ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన నా వ్యాసం.)