Monday 27 February 2023

తెలంగాణకు పట్టిన గోబెల్స్!


జొన్నకలి, జొన్న యంబలి
జొన్నన్నము, జొన్నపిసరు జొన్నలె తప్పన్ 
సన్నన్నము సున్న సుమీ 
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్ 

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు 
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు 
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు 
పలనాటి సీమ పల్లెటూళ్ళు

రసికుడు పోవడు పల్నా 
డెసగంగా రంభ యైన నేకులె  వడుకున్
వసుధేశు డైన దున్నును 
కుసుమాస్త్రుండైన జొన్న కూడె కుడుచున్ 

👆పైవన్నీ మహాకవి శ్రీనాథుని చాటు పద్యాలు. గ్రంథాల్లో ఉన్నాయి. కల్పితాలు కావు! 

శ్రీనాథుడు ఆ ప్రాంతంలో నిజంగా అన్నం దొరక్క ఎంత బాధపడివుండకపోతే ఈ విషయాన్ని పద్యాలకెక్కిస్తాడు?   

పల్నాటిసీమ వాళ్ళు నన్ను మన్నించాలి.  కోట్ చెయ్యాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి సరదాగా కోట్ చేశాను తప్ప మరొక ఉద్దేశ్యం నాకు లేదు. పల్నాడు ప్రాంతం వాళ్ళు నాకు ఎందరో అత్యంత అత్మీయులైన మిత్రులు, బంధువులు ఉన్నారు. అది వేరే విషయం. 

కట్ చేస్తే - 

ఒక వీడియో బైట్‌ను కోట్ చేస్తూ - "మీరు మారరు కాక మారరు!" అని - నిన్న సాయంత్రం - తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పెట్టిన ట్వీట్ ఒకటి చూశాను. ఆయన సహజ స్వభావం లాగే చాలా మెత్తగా, డిగ్నిఫైడ్‌గా ఆ ట్వీట్‌లో తిట్టారాయన. 

బీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ అయితే దంచుకున్నారు.   

దిలీప్ భాయ్ కోట్ చేసిన ఆ వీడియో బైట్‌లో మాట్లాడిన వ్యక్తి మీద నాకు కోపం రాలేదు. జాలి అనిపించింది.  

తెలుగుదేశం పార్టీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు మాత్రమే తినేవారట. తెలుగుదేశం పార్టీ వచ్చి, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రజలు మొట్టమొదటిసారిగా అన్నం వండుకుని తినడం ప్రారంభమైందట. ఆ ఘనత తెలుగుదేశం పార్టీదట... 

ఇట్లా చరిత్రలో ఓనమాలు తెలియని మూర్ఖులు రాజకీయనాయకులైతే దేశం ఇలాగే ఉంటుంది. ఇంకో 75 ఏళ్లయినా ఇలాగే శాశ్వతంగా "అభివృద్ధి చెందుతున్న దేశం" గానే మిగిలిపోతుంది. 

తెలిసి అబద్ధాలాడ్డం నీచం. మేమే గొప్ప అన్న అహంకారంతో ఇలాంటి పచ్చి అబద్ధాలాడ్డం ఇంకా నీచాతినీచం. 

రాజకీయాల్లో వంద మాట్లాడవచ్చు. కాని, మరీ ఇంత నీచ స్థాయి అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వటం అత్యంత అసహ్యకరం. జుగుప్సాకరం. 

ఈయన వయస్సుని గుర్తిస్తూ - ఈయన పట్ల నాలో మిగిలివున్న అంతో ఇంతో గౌరవం కూడా పాతాళానికి పోయింది.    

నా చిన్నతనం నుంచే మసూరి, జడసాంబలు బియ్యం నెల నెలా బస్తాల్లో - వరంగల్లో బొడ్రాయిలోని - మా తోట రామచంద్రం దుకాణం నుంచి తెచ్చుకొనేవాళ్లం. ఆ బియ్యం బస్తాలపైనే మేం పిల్లలం ఎగురుతూ దునుకుతూ ఆడుకొనేవాళ్ళం. 

అలాగని మేం ధనవంతులం కాదు. మా అమ్మ ఇంట్లో కుట్టుమిషన్ మీద పనిచేసేది. మా నాన్న మగ్గం నేసేవాడు. ఇంట్లో ఇంకో నాలుగైదు మగ్గాలుండేవి. వాళ్ళిద్దరూ చదువుకోలేదు. పెద్ద బాలశిక్ష కొనుక్కొని - ఉత్తరం రాయడం చదవటం వరకు - సొంతంగా నేర్చుకున్నారు. 

ఇటుకలతో కట్టిన విశాలమైన ప్రహరీ గోడతో 14 దర్వాజాల పెంకుటిల్లు మాది. ఆ ఇంటికి - ఏ తెల్లవారుజామునో - అప్పుడప్పుడు  అన్నలొచ్చి అన్నం తినిపోయేవారు. మా ఇంటికి దగ్గరున్న సంఘం బడిలో జననాట్యమండలి కార్యక్రమాలు, సభలు జరిగినప్పుడు - పాటలు పాడటానికి, మాట్లాడ్డానికి - ఎందరో అక్కడికి వచ్చేవాళ్లు.

అలా వచ్చినవాళ్లకు భోజనం మా ఇంట్లోనే పెట్టేవాళ్లం. 

బాలగోపాల్, వరవర రావు, గద్దర్ వంటి వాళ్ళను నేను మొట్టమొదటగా చూసింది మా ఇంటి వాకిట్లో ఉన్న గద్దెలమీద కూర్చొని వాళ్ళు అన్నం తింటున్నప్పుడే.

ఇదంతా - సుమారు ఐదు దశాబ్దాల క్రితం నాకు ప్రత్యక్షంగా తెలిసిన నిజం. అంతకు యాభై ఏళ్ళ క్రితమే మా తాతలు అన్నం, పప్పుచారు తిన్నారు. వేడి వేడి అన్నంలో గోలిచ్చిన కారం-నూనె కలుపుకొని రుచిగా తిన్నారు.

ఇక హైద్రాబాద్ బిర్యానీకైతే వందల ఏళ్ల చరిత్ర ఉంది. 

మరి... తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది? 

ఇదంతా పక్కన పెడితే - అసలిప్పుడు ఆరోగ్యం కోసం బాగా ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తింటున్నది ఈ జొన్నలు, రాగులు, సజ్జలే కదా!

ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా ఇంత అహంకారం ఎందుకు?

కట్ చేస్తే -

ఈయనొక్కడే కాదు. అంతాకలిపి ఇంకో అరడజన్ మంది వున్నారు... 

ఇవే తెలివిలేని మాటలు, అహంకారపు అబద్ధాలు. 

ఇవన్నీ ఏదో ఆషామాషీగా జరుగుతున్నవి కాదు. పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. వీరందరి లక్ష్యం ఒక్కటే. 

తెలంగాణలో అలజడి సృష్టించడం, తెలంగాణను అతలాకుతలం చేయడం.     

కాని, ఇక్కడున్నది కేసీఆర్. 

బ్లైండ్-ఫోల్డ్ ఆడుతున్న అనతోలి కార్పోవ్‌లా - వీళ్లందరికీ కలిపి - ఒకేసారి చెక్ పెట్టగల సమర్థుడు. 

అది కూడా మనం చూస్తాం. 

కొంచెం ఇష్టం, కొంచెం ఆనందం!


ఒక విషయంలో మనం అనుకున్నది అనుకున్నట్టు కనీస స్థాయిలోనయినా జరగటం లేదంటే దానర్థం మనం అసమర్థులం అని కాదు. అంతకు మించింది ఏదో మనం చెయ్యాల్సి ఉంది. మన ఫోకస్ అటు మరల్చాలి. 

ఒక వ్యక్తిగాని, ఒక వస్తువు కాని, ఒక అంశం కాని మన జీవితంలో లేవు అంటే లేనట్టే. వాటి గురించే ఉన్న సమయం వృధా చేసుకోకుండా ముందుకు సాగాల్సిందే. 

కట్ చేస్తే -

జీవితం చాలా చిన్నది. మన ఖాతాలో మనకున్న సమయం ఎంతో కూడా మనకు తెలీదు.

ఉన్నన్నాళ్ళూ ఇంకా ఏం చేయగలం, ఎంత ఇష్టంగా చేయగలం, ఎంత ఆనందంగా గడపగలమన్నదే మన ఆలోచన కావాలి. అలాంటి జీవితం గడపడానికి అవసరమైన ఫ్రీడం మనం ఎంత తొందరగా తెచ్చుకోగలం అన్నదొక్కటే మన ప్రధాన లక్ష్యం కావాలి.   

"Remember that all is a gift,
but the most precious of all gifts is
life and love."
- Debbie Teeuwen 

Friday 24 February 2023

కుక్కలున్నాయి జాగ్రత్త!


విషపూరితమైన ఒక పాము మన ఇంట్లోకొచ్చింది. దాంతో ప్రాణాలకే ప్రమాదం. ఏదో నంబర్ వెతికి, ఎవరికో ఫోన్ చేసి, వాళ్ళొచ్చి దాన్ని పట్టుకొని వెళ్లేలోపు జరగరాని ఘోరం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? 

ఎక్కన్నుంచో ఒక చిరుతపులి జూబ్లీ హిల్స్‌లోని జనావాసాల్లోకి వచ్చింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. ఎవరో వచ్చి దాన్ని పట్టుకొని, సేఫ్‌గా దాన్ని జూకి తీసుకెళ్లేదాకా జరిగే ప్రమాదాల్ని ఎవరు ఆపుతారు? 

పట్టపగలే పిచ్చి కుక్కలు మనుషుల్ని వెంటపడి చంపుతుంటే ఏ చట్టాలు కాపాడతాయి? ఆ చట్టాల పునాదుల మీద అద్దాల మేడల్ని కట్టుకుని బ్రతికే సోకాల్డ్ సోషల్ యాక్టివిస్టులు ఇప్పుడెక్కడున్నారు? ఎందుకు బయటికి రారు? 

"నోరు లేని జీవులకు ఎలాంటి హాని తలపెట్టొద్దు" అనే ఈ పనికిరాని చట్టాలన్నిటినీ మూటగట్టి బంగాళాఖాతంలో కలిపెయ్యాలి. 

అసలు వాటికి హాని తలపెట్టే ఆలోచన, తీరిక ఏ మనిషికుంది?   

అలాంటి ఏ చట్టమైనా అడవులవరకే పరిమితం కావాలి తప్ప జనారణ్యాల్లో మనుషులు చావడానికి కారణం కావద్దు.  

ఆఖరికి సినిమా షూటింగ్స్‌లో కూడా "మేం ఏ ప్రాణికి హాని కలిగించలేదు..." అంటూ స్క్రీన్ మీద ఒక కార్డు వేయాలి. షూటింగ్‌కు ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దానికో అబ్జర్వర్ టీమ్! 

ప్రత్యక్షంగానో పరోక్షంగానో - మన దేశంలో ఇలాంటి చెత్త చట్టాలు కొన్ని మొదలవ్వడానికో, ప్రాముఖ్యం సంతరించుకోడానికో కారణమైన ఆ మేనక ఇప్పుడెక్కడ? ఊర కుక్కలతో కరవబడి ప్రాణం వదిలిన ఆ చిన్నారిని వెనక్కి తెచ్చిస్తుందా?

హైద్రాబాద్‌లో కూడా ఉన్న సెలబ్రిటీ సోషల్ యాక్టివిస్టులు బయటికొచ్చి కనీసం ఒక వీడియో బైట్ అయినా ఇచ్చారా? 

జరిగిన సంఘటనకు ఏం సంజాయిషీ ఇస్తారు ఈ యాక్టివిస్టులంతా?         

కట్ చేస్తే - 

ఇలాంటి చట్టాలున్నాయి కాబట్టే - సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎలాంటి అగ్రెసివ్ యాక్షన్ తీసుకోలేకపోవడం అన్నది కామన్ సెన్స్. 

ఇలాంటి ఘోరం జరగటం ఎవరికి సంతోషం?  

సిటీలోని దాదాపు ప్రతి కాలనీలో ఇలాంటి ఊర కుక్కల సమస్య ఉంది. అయినాసరే - మున్సిపాలిటీవాళ్ళు వాటిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు - "వాటిని తీసుకెళ్ళొద్దు" అని అడ్డుపడే యాక్టివిస్టులు మా కాలనీలో కూడా ఉన్నారన్నది నా కళ్ళారా చూసిన వ్యవహారం! 

అయినా సరే - తప్పనిసరి అయిన కొన్ని అరుదైన సందర్భాల్లో ఎన్‌కౌంటర్స్ జరిగినట్టే - ఇలాంటి విషయాల్లో కూడా ఒకే ఒక్క రోజు రాష్ట్రమంతా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి, వాటన్నిటినీ లిఫ్ట్ చేసి, పని ముగించాలి. 

లేదంటే - ఒకవైపు ప్రపంచం గుర్తిస్తున్న వెయ్యి మంచి పనులు రాష్ట్రంలో జరుగుతున్నా - అరుదుగా జరిగే ఇలాంటి బాధాకరమైన సంఘటనల వల్ల కొద్దిమంది ప్రజల దృష్టిలోనైనా ప్రభుత్వం పట్ల నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయి. 

మరోవైపు - పని లేని సోషల్ మీడియా ఊరకుక్కలు కొన్ని కేటీఆర్ మీదా, మేయర్ మీదా, ప్రభుత్వం మీదా రేబిడ్ డాగ్స్‌లా అదేపనిగా మొరుగుతుంటాయి.  

Thursday 23 February 2023

ఎవరైనా చదివితే ఏమనుకుంటారు?


ఈ పోస్టులో నేను చర్చిస్తున్నది ప్రొఫెషనల్, టెక్నికల్ బ్లాగుల గురించి కాదు. అది పూర్తిగా వేరే లోకం. 

కట్ చేస్తే - 

బ్లాగ్ అంటేనే వ్యక్తిగతం. పర్సనల్. చాలావరకు సొంత గొడవ ఉంటుంది. సొంత అభిప్రాయాలుంటాయి. 

అప్పుడప్పుడూ సొంత డబ్బా కొట్టుకోవడం కూడా ఉంటుంది. ఈ సెల్ఫ్ డబ్బానే "మార్కెటింగ్" అని కూడా ముద్దుగా పిల్చుకుంటాం.

ఎంత వద్దనుకొన్నా - చాలాసార్లు మనం రాసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగతమైన కొన్ని సెన్సిటివ్ ఆలోచనలు కూడా మన బ్లాగ్ పోస్టుల్లో బాహాటంగా రాసేసుకుంటుంటాం. తర్వాతెప్పుడో ఒక 2, 3 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు - నేను ఇలా రాశానా? అసలు ఇదెందుకు రాశాను? ఇది రాయాల్సింది కాదు కదా... అనిపిస్తుంది. 

ముఖ్యంగా కొన్ని బ్లాగ్ పోస్టుల విషయంలో మరీ సిల్లీగా అనిపిస్తుంది. 

కాని - అదంతే. 

ఫ్లో రైటింగ్. 

ఫ్లోలో అలా వచ్చేస్తుంది. 

ఏం తప్పుకాదు. 

బ్లాగ్ ఇలాగే రాయాలని కాని, బ్లాగ్‌లో ఇవి మాత్రమే రాయాలని కాని ఎలాంటి రూల్స్ లేవు.  

మనవాళ్ళు ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? బయటివారైనా సరే, చదివి ఏమనుకుంటారో... అనే ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. 

"అసలు, అలాంటి ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్. 

కట్ చేస్తే - 

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన - టూ మచ్ పర్సనల్ థింగ్స్ - 'సినిమాలో అతిథిపాత్రల్లా' అప్పుడప్పుడూ కొన్ని కనిపిస్తుంటాయి. 

కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని సెల్ఫ్ ప్రమోషన్స్, కొన్ని మరీ డైరెక్ట్ సెల్లింగ్స్ కూడా.    
అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మనకు నచ్చిన జీవనశైలిలో, మనకిష్టమైన స్థాయిలో, మనకు అవసరమైన మార్కెటింగ్ ఎలాగూ తప్పదు.

కాని...  మన జీవితంలోని మంచి, చెడుల గురించి... సుఖ సంతోషాల గురించీ... మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎప్పటికప్పుడు మనకు చాలా ఉంటుంది. 

ఆ అవసరాన్ని తీర్చే అద్భుత సాధనమే... "బ్లాగింగ్".   

రిలాక్స్ కోసమో రిలీఫ్ కోసమో నాకు మందు, సిగరెట్లు అవసరం లేదు.

నాకున్న అతి పెద్ద స్ట్రెస్ బస్టర్...

నా బ్లాగ్ ఒక్కటి చాలు.   

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.” 
- James Altucher

Wednesday 15 February 2023

రేపు మా వరంగల్‌కి వెళ్తున్నా... చాలా రోజుల తర్వాత!


కొన్ని నిముషాల క్రితం ఈ వాక్యం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడానికి ఎంత ఆనందపడిపోయానో చెప్పలేను.

ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఎన్నేళ్లయినా ఆ ప్రేమ పోదు. 

ఉర్సు చెరువు, దాన్లో ఈతలు, ఫిషింగ్... 
ఉర్సు గుట్ట, ఆ గుట్టెక్కి చింతపల్క పండ్లు తెచ్చుకొన్న రోజులు...
ఉర్సు గుట్ట చుట్టూ బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు...
ఉర్సు వాటర్ ట్యాంక్ చుట్టూ ఆడిన రేస్ ఆటలు...
ఒకసారి అదే వాటర్ ట్యాంక్ కాంపౌండ్‌లో నేనూ, జయదేవ్ ఇంకో ఫ్రెండ్‌తో కల్సి దొంగతనంగా కల్లు తాగడం...
ఉర్సులో మా సంఘం బడి అని పిల్చే శ్రీ వేంకటేశ్వర అప్పర్ ప్రైమరీ స్కూలు...
ఆ స్కూల్లో మా సార్లూ, గంట కొట్టే మా కొమ్మాలు..
7వ తరగతిలో నేనే స్కూల్ టాపర్ అయినందుకు ఆనవాయితీ ప్రకారం మా సార్లు, టీచర్లందరికీ నేను తెప్పించి తాగించిన పది పైసల చాయ్‌లు...  
ఏడాదికోసారి వచ్చే ఉర్సు తీర్థంలో తప్పకుండా కొనుక్కొనే కెలీడియోస్కోపులూ... (అప్పుడు దాని పేరు అది అని తెలీదు!)
ఉర్సు పోస్టాఫీసు... అప్పటి పోస్ట్ మాస్టరు... మేం ఉరుక్కుంటూ వెళ్ళి కొనుక్కొచ్చిన పోస్ట్ కార్డులూ, ఇన్‌లాండ్ లెటర్లూ...
చెట్లోళ్ల గడ్డ... కుంకుమ దుకాండ్లు...
కరీంబాద బుచ్చన్న హోటల్లో మేం తిన్న పూరీ, ఖారాలు...
ఆ పక్కనే సందులో మా చిన్నమ్మ ఇల్లు...
సాకరాశి కుంట దాటి, రైల్వే గేటు దాటి, బట్టల బజారు మీదుగా, చమన్ దాటి రోజూ నడుచుకుంటూ వెళ్ళి నేను చదివిన నా ఏవీవీ జూనియర్ కాలేజి హైస్కూలు... 
హైస్కూల్లో మా సార్లు... నాకు అంతో ఇంతో ఇంగ్లిష్ మీద ఇష్టం కలగటానికి కారణమైన మా రాజమౌళి సారు... 
హైస్కూల్లో నా క్లాస్‌మేట్ ఆకుతోట సదానందంతో కలిసి చూసిన ఎన్నో ఫస్ట్ డే మార్నింగ్ షోలు...
అంతకుముందు నా ఇంకో క్లాస్‌మేట్ రాముడుతో కలిసి నేను చూసిన నోము సినిమా... ఇంకెన్నో సినిమాలు... 
అప్పటి నా ఫేవరేట్ ఇంగ్లిష్ సినిమాల అలంకార్ టాకీస్, అశోకా, నవీన్, రామా, దుర్గా, కాకతీయ 70 ఎమ్మెమ్, మినీ కాకతీయ, వెంకట్రామా, క్రిష్ణా టాకీసులు...
బాంబే స్వీట్ హౌజ్‌లో మేం తిన్న కలాకంద్, తర్వాత ఇచ్చే శాంపిల్ కారా...
ఫస్ట్ టైమ్ మా మేన బావ రమేశ్‌తో కలిసి సవేరా బార్‌కెళ్ళి తాగిన బీరు, తిన్న బిర్యానీ...
కరీంబాదలో ఓ పెళ్ళి బారాత్ అప్పుడు, మా ఇంకో బావ రమేశ్ పక్కనే ఉన్న వైన్ షాపుకు తీస్కెళ్ళి, ఐదు నిమిషాల్లో నిలబడే ఒక బీరు ఖతం చేయించిన తీరు... 
ఉర్సు, ప్రతాప్‌నగర్‌లో మాపెద్ద అరుగుల ఇల్లు... 
రాత్రైతే చిన్నా పెద్దా అందరికీ ఆ అరుగులే అడ్డాగా పొద్దుపోయేదాకా ముచ్చట పెట్టుకోడాలు...
పనిమనుషులు తెలియని ఆరోజుల్లో, మా అమ్మ ఒక్కతే ఆ 14 దర్వాజాల పెంకుటింటి చుట్టూ రోజూ ఊడ్చి, చల్లి, ముగ్గులేసిన ఆ రోజులు... 
మా ఇంట్లో నాకిష్టమైన రెండు చెక్క అల్మారాలు, వాటిలోని మా అన్న కొనుక్కున్న లెక్కలేనన్ని పుస్తకాలు...
మా నాయిన కొనుక్కున్న శంకర్ నారాయణ డిక్షనరీ... 
రంగశాయిపేట, బొడ్రాయి, మామునూరు క్యాంపులో గోడమీద ఆదివారం ఫ్రీ సినిమాలు... 
కాకతీయుల ద్వారతోరణాలు, శిథిలాలు... 
ఇట్లా రాసుకుంటూపోతుంటే ఎన్నెన్నో ఎడతెగని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్...

కట్ చేస్తే - 

బాల్యంలో నాకెన్నో అద్భుత జ్ఞాపకాలనందించిన నా వరంగల్‌కు నేనెప్పుడు వెళ్ళినా నాకు బాధగానే ఉంటుంది. 

నన్ను అమితంగా ప్రేమించిన అమ్మా నాన్న లేరు. 

పదో తరగతితోనే చదువు మానేసి, మెషినిస్టుగా ఎక్కడో ఫాక్టరీలో పనిచేసుకుంటూ బతకాల్సిన నేను - మళ్ళీ చదువుకోడానికి, డైరెక్టుగా యూనివర్సిటీలోకే ప్రవేశించి పీజీలు, గోల్డ్ మెడల్స్ సాధించడానికి కారణమైన ఇన్‌స్పిరేషన్‌ను ఒకే ఒక్క మాటతో అందించిన మా అన్న దయానంద్ లేడు.   

నేను కనిపించగానే నవ్వుతూ పలుకరించే నా చిన్న తమ్ముడు వాసు లేడు. 

నా చిన్ననాటి జిగ్రీ దోస్త్ ఓంప్రకాశ్ లేడు... 

ఎందరికో ఆశ్రయమిచ్చి, మాకెన్నో అద్భుత జ్ఞాపకాలనిచ్చిన అప్పటి మా ఇల్లు లేదు. 

కన్నీళ్ళు తన్నుకుంటూ వచ్చే ఇలాంటి జ్ఞాపకాలు ఇష్టం లేకే నేను వరంగల్ వెళ్లడానికి తప్పించుకొంటుంటాను.

అయినా సరే, కొన్నిసార్లు తప్పదు. ఇలా పొద్దున బయల్దేరి వెళ్లి, రాత్రికి వచ్చేస్తుంటాను.  

ఒకసారి ఫ్రీగా ఒక వారం రోజులు మా వరంగల్లో అడ్డా వెయ్యాలని ఉంది. అక్కడే ఉన్న నా ఇద్దరు తమ్ముళ్ళు శ్రీధర్, రమేశ్‌లతో కలిసి నాకిష్టమైన అప్పటి అన్ని జ్ఞాపకాలని మనసారా చూస్తూ తిరగాలని ఉంది. నన్ను నేను పరిచయం చేసుకుంటూ, అప్పటి నా బంధుమిత్రులందరినీ కలిసి పలకరించాలని ఉంది. 

ఎప్పుడో ఆ పని తప్పక చేస్తాను.     

ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఆ ప్రేమ పోదు. 

Friday 10 February 2023

రాజకీయాలు వేరు, సంకుచిత ఆలోచనలు వేరు!


అందరూ కాదు గాని... 

అక్కడక్కడా కొంతమంది ఛోటా నాయకులు, గల్లీ లెవల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎంతో గొప్పగా ఊహించుకుంటుంటారు. 

ఊహించుకోవచ్చు. అది వారిష్టం. తప్పు లేదు. 

కాని, ఎంత సేపూ ఎవరో ఏదేదో చేసేస్తున్నారు, వాళ్ళకి అనవసరంగా ఏదో పేరొచ్చి కొంపలంటుకుపోతున్నాయి అన్నట్టు చాలా సంకుచితంగా ఆలోచిస్తుంటారు. పైకే అంటుంటారు. అదేపనిగా చెప్తుంటారు. 

ఎంతసేపూ ఇంకొకరెవరితోనో పోల్చుకుంటుంటారు. 

"నేను ఫలానా ఆమె/అతని కంటే ఏం తక్కువ... నాకెందుకు ఫలానా పోస్టు రాలేదు?"... అని ఓ తెగ బాధపడిపోతుంటారు. 

ఇలాంటివాళ్ల భాష కూడా సోషల్ మీడియాలో సూపర్ పాలిష్డ్‌గా ఉంటుంది. బయట మాటలు మాత్రం యమ చెత్తగా ఉంటాయి. వాళ్ళ గెటప్‌కు, వారి నోటి నుంచి వచ్చే భాషకు అసలు సంబంధమే ఉండదు!   

ఇలాంటివాళ్లంతా ఒక క్యాటగిరీ. ఎన్నాళ్లయినా అక్కడక్కడే ఉంటారు. ఉన్నచోటే ఉండిపోతారు. 

కట్ చేస్తే - 

అసలైన పొలిటీషియన్స్‌కు ఖచ్చితమైన లక్ష్యాలుంటాయి. వారి ఫోకస్ మొత్తం వారి లక్ష్యం మీదే ఉంటుంది. ఇంకొకరి గురించి ఆలోచించే అంత సమయం వారికుండదు. 

స్పష్టమైన వారి లక్ష్యం, వారి నిరంతర కృషి, వారి సంకల్పం, వారిలోని ఆత్మవిశ్వాసం... వారి చుట్టూ ఒకరకమైన 'ఆరా' క్రియేట్ చేస్తాయి. ఒక శక్తినిస్తాయి. 

ఇంకొకరెవరో వారిని దాటిపోతున్నారనో, తొక్కేస్తున్నారనో అనుకోరు. ఆ ఇంకొకరెవరూ తమ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేనంతగా పనిచేస్తూ లక్ష్యంవైపు దూసుకెళ్తుంటారు. 

చిన్నదో పెద్దదో... ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారు. అనుకున్నది సాధిస్తారు. అలా ఒక్కో లక్ష్యం సాధించుకుంటూ ముందుకెళ్తుంటారు. 

ఇదంతా కూడా రాజకీయమే. సిసలైన రాజకీయం ఇదే. 

ఇలాంటి రాజకీయం చేసేవాళ్లనే... అన్నీ వాటికవే ఎదురొచ్చి వరిస్తాయి. 

ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేసే వీరికీ... ఎలాంటి లక్ష్యం లేకుండా, కృషి లేకుండా, కనీస సామర్థ్యం లేకుండా ఎంతసేపూ ఇంకొకరితో పోల్చుకొనేవారికీ, అర్థంపర్థం లేకుండా అందర్నీ విమర్శించేవారికీ, ఏదేదో ఆశించి పనిచేసేవారికీ... జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది.  

ఇంకొకరి గురించి కుళ్ళుకోవడమో, చెత్తగా మాట్లాడటం ద్వారానో... ఎవ్వరూ ఏదీ సాధించలేరు.  

ఆశించటం తప్పు కాదు. కాని, ఆ స్థాయి సామర్థ్యం లేకుండా ఆశించడం మాత్రం ఒప్పు కాదు. 

"Politics is not a game. It's a task." 
- KTR

Thursday 9 February 2023

మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు!


"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. 

ఒక్క దేవుడనే కాదు... ఏ విషయంలో ఐనా అంతే. 

మనం కన్వీనియెంట్‌గా ఫీలైన విషయాలతోనే మనం కనెక్ట్ అవుతాం. మనుషుల విషయంలో కూడా అంతే. మనం కంఫర్ట్‌గా ఫీలైన వ్యక్తులే ఎక్కువగా మన జీవితంలో ఉంటారు. 

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది... 

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు! 

అంటే - అందులో ఏదో ఆనందమో, ఓదార్పో, ఇంకేదో మనకు అవసరమైన పాజిటివ్ ఫీలింగో ఉంది.  

తప్పకుండా ఉంది. 

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్... అని నేననుకుంటున్నాను...  

Saturday 4 February 2023

సంప్రదాయ సరియలిజమ్!


"ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు!" 

తాను నిమ్న కులానికి చెందినదాన్ని, ఈ బ్రాహ్మణుల ఇంట తాను వంట చేయొచ్చునో లేదో అన్న భావనతో తులసి పాత్రలో మంజుభార్గవి సందేహిస్తుంటే, శంకర శాస్త్రి పాత్రలో జె వి సోమయాజులు ఆమెతో  చెప్పే డైలాగ్ ఇది. 

బ్రాహ్మణవాది అని, సాంప్రదాయవాది అని అక్కడక్కడా వినిపించే మాటలకు ఆయన చిత్రంలోనే ఒక పాత్ర ద్వారా అంత సరళంగా, క్లుప్తంగా, సూటిగా జవాబిచ్చిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు.

తెలుగు సినిమా చరిత్రలో "శంకరాభరణం" చిత్రంతో ఒక కొత్త మలుపుని తీసుకువచ్చి, భారతీయ సంగీత నాట్య సంస్కృతీ సాంప్రదాయాలను తన వరుస చిత్రాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన పయొనీర్ దర్శకులు విశ్వనాథ్ గారు. భారత ప్రభుత్వం తరపున ఆస్కార్ ఎంట్రీకి 1986 లోనే పంపించబడిన తొలి తెలుగు సినిమా "శంకరాభరణం" అన్న విషయం చాలామంది మర్చిపోయివుంటారు.

విశ్వనాథ్ శంకరాభరణం సినిమా చూసిన తర్వాతే మన ఇళ్ళల్లోని వీణలు, ఫిడేళ్ళు, ఫ్లూట్లు అటకల మీద నుంచి మళ్ళీ కిందకు దిగాయి. ఇష్టమైన వాయిద్యాలను కొత్తగా కొనుక్కొని సంగీతం క్లాసులకు వెళ్ళటం మళ్ళీ ఊపందుకొంది. 

అప్పటివరకూ ఆకాశవాణి, దూరదర్శణ్‌లకు మాత్రమే పరిమితమైపోయి, "నాకు శాస్త్రీయ సంగీతం వచ్చు" అని బయటకు చెప్పుకోడానికి కూడా ఇబ్బందిపడినవాళ్లంతా, శంకరాభరణం తర్వాత సెలబ్రిటీలయిపోయారు. ప్రపంచమంతా ప్రదర్శనలిస్తూ పాపులర్ అయిపోయారు. సామాజికంగా ఇంత పెనుమార్పుకు ఒక్క సినిమా కారణమయ్యిందంటే అంత సులభంగా నమ్మలేం. శంకరాభరణం రూపంలో మన కళ్లముందే జరిగింది. దాని సృష్టికర్త కె విశ్వనాథ్.  

ఆ శాస్త్రీయ సంగీతం పాటల్ని నేను పాడను మొర్రో అని ఎంత తప్పించుకున్నా, తన పట్టువదలకుండా పాడించుకొని, "యస్ పి బాలు మాత్రమే అంత బాగా పాడగలడు, బాలు పాడారు కాబట్టే శంకరాభరణంలోని ఆ పాటలు అంత ఎఫెక్టుని ఇవ్వగలిగాయి" అని అంతకుముందు బాలుతో వద్దు అన్నవారితోనే శహభాష్ అనిపించగలిగిన గట్స్ కూడా విశ్వనాథ్ గారికే ఉన్నాయి. సిరిసిరిమువ్వ సినిమాతో వేటూరి సుందరరామమూర్తి రూపంలో, సిరివెన్నెల సినిమాతో సీతారామశాస్త్రి రూపంలో ఇద్దరు అద్భుత సినీ గేయరచయితలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత కూడా విశ్వనాథ్ గారికే దక్కుతుంది.        


బియస్సీ తర్వాత - మద్రాసులోని వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీరంగంలో ప్రవేశించిన విశ్వనాథ్ గారు, "పాతాళభైరవి" సినిమా ద్వారా 1951లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదటిసారిగా దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు. 1965లో దర్శకుడిగా తన తొలి సినిమా "ఆత్మగౌరవం"కు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సాధించిపెట్టారు. తర్వాత వారు తీసిన చెల్లెలికాపురం, శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి వంటి సినిమాలన్నీ అంతర్లీనంగా ఆధునిక స్త్రీవాదానికి ఆ కాలపు ప్రతీకలుగా చెప్పవచ్చు. సిరిసిరిమువ్వ నుంచి విశ్వనాథ్ సినిమాలకు సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి కళల నేపథ్యం ఆత్మగా నిలిచింది.   

సాంప్రదాయికవాది అని కొందరు అనుకొనే విశ్వనాథ్ గారే అత్యధికమైన సంఖ్యలో సామాజిక స్పృహవున్న సినిమాల్ని తీశారన్న వాస్తవం బహుశా చాలామందికి తెలియదు. సప్తపది, సిరివెన్నెల, సూత్రధారులు, శుభలేఖ, శృతిలయలు, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, స్వర్ణకమలం వంటి సినిమాలన్నీ సామాజిక సమస్యల నేపథ్యం ఉన్నవే.

ఒకరకంగా చెప్పాలంటే - కేవలం ప్యారలల్ సినిమాల్లో మాత్రమే చెప్పగలిగే సీరియస్ సబ్జక్టులకు - భారతదేశపు కళలు, సంస్కృతీ సంప్రదాయాల వన్నెలు అద్ది, అద్భుత సినిమాలుగా రూపొందించి మెప్పించిన సరియలిస్టిక్ సాంప్రదాయవాది దర్శకులు విశ్వనాథ్. 

విశ్వనాథ్ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే - ఆయన అద్భుత కళాఖండం "సాగర సంగమం" ఒక ఎత్తు. ఈ ఒక్క సినిమా మీదనే వివిధకోణాల్లో థీసిస్‌లే రాయవచ్చు. అన్ని సినిమాల్లో జయప్రద ఒక ఎత్తు అయితే - ఈ ఒక్క సినిమాలో జయప్రద వేరు. ఇదే కమలహాసన్‌కు కూడా వర్తిస్తుంది. "సాగర సంగమం సినిమాకు ముందు కమలహాసన్, సాగరసంగం తర్వాత కమలహాసన్" అని చెప్పవచ్చు.  

సుమారు ఆరు దశాబ్దాల తన చలనచిత్ర జీవితంలో - విశ్వనాథ్ గారు సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా, వీటిలో 9 సినిమాలు హిందీలో కూడా చేయడం విశేషం. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, ఫిలిమ్‌ఫేర్ అవార్డులు పుష్కళంగా అందుకున్న విశ్వనాథ్ గారు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్ని కూడా అందుకున్నారు. దర్శకుడుగా విరామం తీసుకున్న తర్వాత నటుడిగా కూడా చాలా సినిమాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు.  

సినిమా ప్రధానంగా ఒక వినోదాత్మక మాధ్యమం. అంతర్లీనంగా ఏవైనా సందేశాలుండొచ్చు కాని, సందేశాల కోసమే సినిమాలు తీయడానికి పదులు, వందల కోట్లు ఎవ్వరూ ఖర్చుపెట్టలేరు. ఆర్ట్ సినిమా-లేదా-ప్యారలల్ సినిమా వేరు. ఈ సినిమాల్లో సందేశం ఉండొచ్చు, సామాజిక స్పృహ ఉండొచ్చు. ఈ సినిమాలకు లాభనష్టాల లెక్కలు పెద్దగా ఉండవు. వీటి నిర్మాణ బడ్జెట్లు కూడా చాలా తక్కువే. ప్రేక్షకులూ తక్కువే. 

ఈ కోణంలో చూస్తే - ఎన్నో సీరియస్ సామాజిక సమస్యలను కథాంశంగా తీసుకొని, వాటికి నేపథ్యంగా భారతీయ సాంప్రదాయిక కళల్ని ఒక షుగర్‌కోటింగ్‌లా సదుపయోగం చేసుకొని, కమర్షియల్ వయబిలిటీతో అద్భుత సినీకళాఖండాలను అందించిన విశ్వనాథ్ గారే నిజమైన రెనగేడ్ డైరెక్టర్.  

బహుశా అందుకేనేమో... రామ్‌గోపాల్‌వర్మ లాంటి విశృంఖలవాది దర్శకుడు కూడా ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా తన మీద కూడా చాలా విధాలుగా ప్రభావం చూపింది అని స్వయంగా ఒప్పుకొన్నాడు. శంకరాభరణం క్లయిమాక్స్‌లో శంకరశాస్త్రి చెప్పిన ఒక పూర్తి డైలాగ్‌ను అప్పటికప్పుడు తడుముకోకుండా చెప్పాడు.

అలాంటి శంకరాభరణం సినిమా 43 ఏళ్ల క్రితం రిలీజైన రోజు ఫిబ్రవరి 2 నాడే విశ్వనాథ్ గారు నిష్క్రమించడం విశేషం. 

***

(ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన నా వ్యాసం.) 

Thursday 2 February 2023

ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ కావడం ఎలా?


సినిమాలంటే ఇష్టం... ఫిలిం ప్రొడక్షన్‌ పట్ల ఆసక్తి... సెలెబ్రిటీ హోదాపైన ప్యాషన్... మొత్తంగా, ఎలాగైనా సరే ఫిలిం ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వాలన్న కోరిక... ఇవన్నీ మీలో ఉన్నాయా? 

చిన్న స్థాయిలో ఏదైనా ఒక మంచి నో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా?

మీరు ఎన్నారైలా?... డాక్టర్సా?... ఇతర ప్రొఫెషనల్సా?... వెండితెర మీద మీ కలలు నిజం చేసుకోవాలనుకొంటున్న మహరాణులా?... పదవీ విరమణ పొందిన ప్యాషన్ ప్రియులా?

అయితే, ఈ పోస్ట్ మీకోసమే!    

ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం బిజినెస్, ఫిలిం మేకింగ్ స్టయిల్స్... అన్నీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.

ఒకప్పుడు సినిమాలు వేరు, 
ఇప్పుడు సినిమాలు వేరు.

Content is the king. 
Money is the ultimate goal. 

మీరు హీరో కావాలనుకుంటున్నారా? హీరోయిన్ కావాలనుకొంటున్నారా? ఒక మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ కావాలనుకొంటున్నారా? ఒక పాపులర్ విలన్ కావాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో మీరనుకొంటున్నది ఏదైనా సాధ్యమే. 

24 క్రాఫ్ట్స్‌లో ఏదైనా ఒక మంచి స్కిల్ మీలో ఉండి కూడా, మీకు ఇండస్ట్రీలో ఎంట్రీ దొరకడం లేదా?... ఓవర్‌నైట్‌లో ఇది కూడా సాధ్యమే. 

ఆల్రెడీ మీరు ఇతర వృత్తి-వ్యాపారాల్లో స్థిరపడి ఉండి, ఒక కో-ప్రొడ్యూసర్‌గా చేరి, అసలు ఫిలిం బిజినెస్ ఎలా ఉంటుందో స్టడీ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో మీకు ఇది కూడా సాధ్యమే.

ఇవన్నీ కాదు... జస్ట్ ఒక సోషలైట్‌గానే ఉండి, ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యమయ్యే ఫోకస్, ప్రమోషన్, సెలెబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో ఇది కూడా సాధ్యమే. 

యస్... నిజంగా, ఎలాంటి అతిశయోక్తిలేకుండా, ఇవన్నీ ఓవర్‌నైట్‌లో సాధ్యమే!   

అయితే - అందరిదగ్గర సాధ్యం కాదు. అన్ని చోట్లా సాధ్యం కాదు. అన్ని వేళలా సాధ్యం కాదు.  

లాక్‌డౌన్ ప్రభావం నేపథ్యంలో - ప్రపంచవ్యాప్తంగా ఫిలిం బిజినెస్‌లో కొత్తగా వచ్చిన అనేక క్రియేటివ్ & ఇన్‌కమ్ అవెన్యూస్ నేపథ్యంలో - అనుభవం ఉన్న ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా మైక్రో బడ్జెట్‌లోనే నా సొంత ప్రొడక్షన్ హౌజ్ నుండి 2 ట్రెండీ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేసి, వాటి ప్రి-ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాను. 

ఒక లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్‌గా, పైన లిస్ట్ చేసిన ఎవరైనా సరే, 10 లక్షలకు తక్కువకాని మీకు సాధ్యమయిన ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో, "లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్‌" గా నాతో కొలాబొరేట్ అవండి... మీ కల నిజం చేసుకొని, ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీ అయిపోండి. 

పైన చెప్పినవాటిల్లో మీ డ్రీమ్ ఏదైనా సరే, నిజం చేసే బాధ్యత నాది. 

మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి: 
https://www.manoharchimmani.blog/p/new-artists.html

నిజంగా ఆసక్తి వుండి, వెంటనే ఇన్వెస్ట్ చేయగల సౌకర్యం ఉన్నవారు నన్ను వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు: 

Whatsapp & Call: +91 9989578125. 

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.

Welcome to Film Industry! 

Film Director, Nandi Award Winning Writer
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors' Association

ABOUT MANOHAR CHIMMANI: 

మనోహర్ చిమ్మని గురించి (తెలుగు):

About Manohar Chimmani (English): 

SHORT AV ON MANOHAR CHIMMANI:

PS:
ఇలాంటి నేపథ్యం ఉన్న ఇన్వెస్టర్స్‌ను పరిచయం చేసి, వెంటనే డీల్ క్లోజ్ చేయించగల మీడియేటర్స్ కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు. మంచి కమిషన్ ఉంటుంది.