Thursday 27 October 2022

మనం కూడా వీడియోలు చేసేద్దామా ?!


గేరీ వేనర్‌చక్...

వైన్ టేస్ట్ చూసి చెప్పే స్పెషలిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ ఫీల్డులోనే ముందు మిలియనేర్ అయ్యాడు. తర్వాత తన సామ్రాజ్యం విస్తరించాడు. ఓ నాలుగైదు బెస్ట్ సెల్లర్ బుక్స్ కూడా రాశాడు. 

ఇప్పుడీ వేనర్‌చక్ ప్రసక్తి ఎందుకొచ్చిందంటే - 

సోషల్ మీడియా నుంచి గేరీ పాడ్‌కాస్ట్ కెళ్ళాడు. అట్నుంచి అటు మెల్లిగా వీడియో పాడ్‌కాస్ట్ కెళ్ళాడు. ఎక్స్‌పర్ట్ అయ్యాడు. 

ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఏదిపడితే అది చెప్తూనే ఉంటాడు. దాన్లోంచి మనకు అవసరమైన ఆణిముత్యాల్ని వెతుక్కోవడం మన బాధ్యత. 

ఇక్కడ విషయం ఏంటంటే - గేరీ అంత గొప్పగా ఏం ఉండడు. కావల్సినంత డీగ్లామరస్‌గా కనిపించే ప్రయత్బం చేస్తాడనుకుంటాను. ఎందుకంటే - ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తాడు. నానారకాల క్యాప్స్ పెడతాడు. జుట్టు రకరకాలుగా కత్తిరించి ఉంటుంది. మాస్ జోక్స్, సెటైర్స్ వేస్తుంటాడు. ఇంగ్లిష్‌లో నాలుగక్షరాల బూతుపదాన్ని అలవోకగా వాడుతుంటాడు. 

అసలతని మాటలు అంత వినసొంపుగా ఉండవు. కాని, పనికొచ్చే స్టఫ్ మాత్రం చాలా ఉంటుంది. 

అ-యి-నా ... గేరీ వేనర్‌చక్ వీడియోల్ని వేలల్లో లక్షల్లో చూస్తారు. సుమారు 3 మిలియన్లమంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. 

రాయటం, చదవటం తప్ప - ఆడియో, వీడియో పాడ్‌కాస్టులు పెద్దగా ఇష్టపడని నేను - అప్పుడప్పుడూ "మనం కూడా వీడియోలు చేసేద్దామా?!" అని టెంప్ట్ కావడానిక్కారం మెయిన్‌గా ఈ గేరీనే! 

వీడియోలు చేయాలన్న ఆలోచన ఉండీ, ఏదో ఒక సంకోచంతో ఆగిపోతున్నవాళ్ళు Gary Vaynerchuk వీడియోల్ని ఒకసారి చూస్తే సరిపోతుంది. 

అయితే - ఒక్కటి మాత్రం మనం మర్చిపోకూడదు. వీడియోలు చేసినా ఏది చేసినా - ప్రత్యక్షంగానో పరోక్షంగానో - ఒక ఖచ్చితమైన ప్రయోజనం ఉండితీరాలి.  

Tuesday 25 October 2022

ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అంటే నష్టం వస్తే రిఫండ్ అడగటమా?!


ఒక సినిమాను దాని మార్కెట్ వాల్యూను బట్టి, అది క్రియేట్ చేస్తున్న హల్‌చల్‌ను బట్టి డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని ఒక అంచనాతో ప్రొడ్యూసర్ నుంచి ఒక రేటుకు, ఒక ఏరియాకు కొనుక్కుంటారు. 

ఆ సినిమా డిమాండ్‌ను బట్టి - డిస్ట్రిబ్యూటర్స్‌లో కూడా పోటీ ఉంటుంది. ఒక్కోసారి దాదాపు "ఆక్షన్" లాగా ఎగబడి కొనుక్కుంటారు. 

ఇక్కడ ఎవరి బలవంతం లేదు. ఎలాంటి హామీలుండవు. 

ఎంతో కొంత లాభంతోనే అమ్మేస్తారు కాబట్టి ప్రొడ్యూసర్స్ హ్యాప్పీ. 

ఇక్కడివరకు ఓకే. 

కట్ చేస్తే - 

సినిమాకు బ్రేక్ ఈవెన్ కూడా రాకుండా భారీ నష్టం వచ్చినపుడు - కొందరు హీరోలు, నిర్మాతలు, దర్శకులు నైతికంగా ఒక బాధ్యత ఫీలై - వారికివారే ఆయా డిస్ట్రిబ్యూటర్స్‌ను పిలిచి ఎంతో కొంత వారికి రిఫండ్ ఇస్తున్నారు. కొందరు తర్వాతి సినిమాల్లో అడ్జస్ట్ చేసుకునేలా మాట్లాడుకుంటున్నారు. 

అయితే - ఇది తప్పనిసరి కాదు. 

కాకపోతే - ఏ వైపు అయినా మళ్ళీ చూసుకోవాల్సింది అవ్వే డజన్ ముఖాలు కాబట్టి ఇలాంటి నైతికమైన ఆనవాయితీ ఒకటి అలవాటయిపోయింది. 

ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే - అదే సేమ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలు వచ్చినప్పుడు - ఆ లాభాల్లోంచి ఒక్క పైసా నిర్మాతలకివ్వరు! 

పైన మనం చెప్పుకున్న నైతికత ఇక్కడెందుకు ఉండదు అంటే - ఉండదంతే.     

కట్ చేస్తే - 

రేపు 27 వ తేదీ నాడు, 83 మంది డిస్ట్రిబ్యూటర్స్ "లైగర్" నష్టాల విషయంలో పూరి జగన్నాధ్ ఇంటికి ధర్నా చెయ్యడానికి వెళ్తున్నట్టు ఆన్‌లైన్‌లో వార్తలు చూస్తున్నాం. 

డిస్ట్రిబ్యూటర్స్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేసుకున్న మెసేజ్ ఒకటి కూడా క్లియర్‌గా ఈ విషయం గురించి చెప్తోంది. 

"ఎంతో కొంత నేను ఇస్తానని చెప్పాను. కాని మీరిట్లా నా పరువుతీసేలా ధర్నాలు పెడితే ఒక్క పైసా ఇవ్వను" అని పూరి చెప్తున్నట్టు తెలిసింది. 

నిజమే కదా? 

అసలు పూరి ఎందుకివ్వాలి? 

బలవంతంగా అతనేం నా సినిమా కొనుక్కోండని చెప్పలేదే? 

"నాకు పోకిరి నుంచి మొన్నటి ఇస్మార్ట్ శంకర్ దాకా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బకాయిలు ఇంకా రావాలి. అవన్నీ వసూలు చేసుకురండి. మొత్తం మీకే ఇచ్చేస్తాను" అంటున్నారు పూరి.

ప్రేక్షకున్ని కాలర్ పట్టుకొని నువ్వు సినిమా చూడు అని ఎవ్వడూ అడగడు.

డిస్ట్రిబ్యూటర్‌ను ఇన్నిరెట్లు రేట్ పెంచేసి ఎగబడి కొనుక్కో అని ఎవ్వడూ అడగడు. 

అంతా అనుకున్నట్టు జరిగితే - ఆల్ హాపీస్. 

కొంచెం కిందా మీదా అయిందా... ఖతమ్! ప్రేక్షకులు వెయ్యి రివ్యూలు రాస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు వెనక్కిమ్మంటారు.

ఎవరో ఒకరిద్దరు తప్ప, ఈ విషయంలో హీరోలకి పెద్దగా సంబంధం ఉండదు. ఎటొచ్చీ నిర్మాతలు, డైరెక్టర్సే చచ్చేది.  

సినిమా ఎంత పెద్ద కార్పొరేట్ బిజినెస్‌గా ఎదిగినా... తన పాతకాలపు గాంబ్లింగ్ వాసనల్ని ఇంకా వదిలించుకోలేకపోతోందని ఇలాంటి సంఘటనల వల్ల మనకు ఇంకా స్పష్టంగా తెలుస్తోంది. 

సమస్య ఏదైనా కావచ్చు... సినిమా అనేది ఎప్పుడూ ఒక యుద్ధభూమి లాంటిదే! 

Monday 24 October 2022

జీవితమ్ యుద్ధమ్!


నటి, డాన్సర్, ఇంటర్నేషనల్ మాడల్, కొన్నేళ్ళ క్రితం నాతో పాటు నా టీమ్‌లో పనిచేసిన నా ఫ్రెండ్... ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యూక్రేనియన్ వార్‌లో (Russia-Ukrainian war) వైద్యబృందంలో సహాయకురాలిగా, సోల్జర్‌గా పనిచేస్తోంది! 

కాత్యా ఇప్పుడు జీవిస్తోందీ, యుద్ధం చేస్తోందీ యూక్రేన్‌లోని ఆమె స్వస్థలం కార్ఖీవ్‌లో.

కొన్ని నెలల క్రితం ఇదే కార్ఖీవ్ నగరాన్ని రష్యా 70% నేల మట్టం చేసి, బూడిద మిగిల్చింది. 

విల్ పవర్, దేశభక్తి. రిటార్ట్ అంటే ఇలా ఉంటుంది! 

"నాకేది చాతనవుతలేదు. ఎంత ప్రయత్నించినా ఒక్క పని అవుతలేదు. అయినంక చెప్తా. కొత్తగా అలోచిస్తున్నా..." ఇలా అనుకుంటుంటే యుగాలు గడిచిపోతాయి. 

నేను ఎందుకు చేయలేను, అందర్లా నేనూ మనిషినే కదా అనుకుంటే అన్నీ అవే కదుల్తాయి. ఎదురుదాడి కూడా చేయొచ్చు. 

ఈ యువతి కూడా మనలాంటి మనిషే కదా...కట్ చేస్తే - 

యుద్ధానికి ముందు ఒకవైపు దేశాలు తిరుగుతూ ఇంటర్నేషనల్ మాడలింగ్ చేస్తూ, మరోవైపు కుటుంబాన్ని పోషిస్తూ చదువుకొంది కాత్యా. 

సంవత్సరకాలంగా యుద్ధంలో పాల్గొంటూ దేశం కోసం పనిచేస్తుండటం, ఒకవైపు యుద్ధం జరుగుతుండగానే సుమారు 1200 కిలోమీటర్లు కారు డ్రైవ్ చేస్తూ తన కుటుంబాన్ని దేశ సరిహద్దులు దాటించి సురక్షితంగా చేరవేయటం, యుద్ధం జరుగుతుండగానే ఒక కోర్స్ కూడా పూర్తిచేయడం... ఇవన్నీ కూడా కాత్యా చేసింది. 

కాత్యా మనలాంటి మనిషే.


యుద్ధం ప్రారంభమైన కొత్తలో ఒకసారి నేను అడిగాను తనని: "యుద్ధం ఎప్పటికి అయిపోవచ్చని నీ అంచనా?" 

కాత్యా సమాధానం: "ఇది యుద్ధం. అంత సులభంగా చెప్పలేం. అంత త్వరగా ముగియదు."   

కాత్యాలో ఉన్న సిసలైన పోరాట పటిమలో కనీసం ఒక్కశాతమైనా నాలో ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా దగ్గర సమాధానం లేదు.    

Sunday 23 October 2022

హ్యాపీ దీపావళి!


జనవరి ప్రారంభంలో వచ్చే న్యూ ఇయర్, సంక్రాంతిల నుంచి... సంవత్సరం చివర్లో వచ్చే దీపావళి, క్రిస్టమస్‌ల దాకా కనీసం ఒక డజన్ పండుగలూ పబ్బాలూ వస్తాయి.

ఇంతకుముందులా ఫోన్ కాల్స్ ద్వారానో, లేదంటే పర్సనల్‌గా కలిసి గ్రీటింగ్స్ చెప్పుకోవడం అనేది ఇప్పుడు మొత్తానికే అవుట్‌డేటెడ్ అయిపోయింది. 

ఇప్పటి స్టయిల్ పూర్తిగా వేరే.

వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్‌లు, ఇన్‌స్టా పోస్టులు, ఇన్‌బాక్స్ మెసేజ్‌లు, వీడియో కాల్స్... ఎట్సెట్రా. 

ఏదైతేనేం - పైనచెప్పుకున్న ప్రతి పండగ సందర్భంలోనూ "హ్యాపీ అండ్ ప్రాస్పరస్" అనే రెండు ముఖ్యమైన పదాల్ని మర్చిపోకుండా ప్రిఫిక్స్ చేసి, నానారకాలుగా గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం మనం.

అలా చెప్పినంత మాత్రానో, "సేమ్ టూ యూ" అని చెప్పించుకున్నంత మాత్రానో, ఉట్టి పుణ్యానికే ఎవ్వరికీ సంతోషాలూ డబ్బులూ రావు.

వాటికోసం ఏంచేయాలో అది చేస్తేనే అవి వస్తాయన్నది జస్ట్ కామన్ సెన్స్.

కానీ, ఆశించడంలో తప్పులేదు. 

అదొక ఆనందం. ప్రేమ. సోషల్ ఫార్మాలిటీ. సంస్కృతి. సంస్కారం కూడా. 

ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇలాంటి కొన్ని ఫార్మాలిటీస్ నుంచి మనం అంత ఈజీగా తప్పించుకోలేం. తప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 

బికాజ్... 

అప్పుడెప్పుడో అరిస్టాటిల్ చెప్పినట్టు "మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్". (ఆఫ్‌కోర్స్, వుమన్ కూడా!) 

కనీసం ఆరోజైనా కొందరిని గుర్తుచేసుకుంటాం... 

కుటుంబసభ్యులు,  మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మనతో కలిసి  పనిచేసేవాళ్ళు, మనం ఇంకా కలవని మనకిష్టమైన మన సోషల్ మీడియా మిత్రులు...

అల్టిమేట్‌గా మనల్ని ఫాలో అయ్యేవీ, మనకు ఆనందం ఇచ్చేవీ మన జ్ఞాపకాలే అనుకున్నప్పుడు... ఈ విషయంలో లాజిక్స్ కూడా అనవసరం.

ఆ క్రమంలోనే... ఇప్పుడు నా తృప్తి కోసం. 

నా ఆనందం, నా ప్రేమ, నా స్నేహం. అన్నీ కలగలిపి - 

నా ప్రియమైన మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు!  

కట్ చేస్తే - 

ఈ సంవత్సరంలో జస్ట్ ఇంకో 69 రోజులే మిగిలుంది. 

ఇప్పటివరకూ గడచిన 2022 ను ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఇంకేమైనా సాధించవచ్చో ఆలోచిద్దాం. పనిచేద్దాం. సాధిద్దాం.

మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలతో...

Sunday 16 October 2022

ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టినంత ఈజీ కాదు...


ఎంతసేపూ పక్క భాషల సినిమాలను పొగుడుతూ, తెలుగు సినిమాలను తిడుతూ కొంతమంది సూడో మేధావులు, సోషల్ మీడియా రైటర్స్ అతి చెత్త పెస్సిమిస్టిక్ రాతలు రాస్తుంటారు. 

రీమేక్స్ కూడా - పింక్ ను పింక్‌లా తీయలేదని, లూసిఫర్‌ను లూసిఫర్‌లా తీయలేదని ఓ తెగ బాధపడిపోతుంటారు. 

తెలుగు సినిమాల్లో అది ఉండదనీ, ఇది ఉండదనీ నానా రకాల ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు. 

ఫిలిం మేకర్స్ ఎలా తీయాలనుకుంటారో అలా తీస్తారు సినిమాని. అది ప్రొడ్యూసర్-డైరెక్టర్స్ ఇష్టం. ఎలా తీస్తే డబ్బులొస్తాయని వాళ్ళు భావిస్తారో అలా తీస్తారు. వాళ్ల అంచనాలు ఫెయిలైతే పోయేది కూడా వాళ్ళ డబ్బే, వాళ్ళ పేరే. 

వాళ్ళ డబ్బు, వాళ్ళ పేరుని రిస్క్ చేస్తూ వాళ్లకిష్టమైనట్టు సినిమాలు తీసుకుంటారు. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. 

ప్రేక్షకులకు, సోకాల్డ్ సూడో మేధావులకు, సెల్ఫ్ డిక్లేర్డ్ రివ్యూయర్స్‌కు, సోషల్ మీడియా రైటర్స్‌కు ఆప్షన్ ఉంది. చూడొద్దు అనుకుంటే చూడకుండా ఉండటానికి. 

కట్ చేస్తే -

సినిమా తీయడం అంటే ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టినంత ఈజీ కాదు.

ఇలా సోషల్ మీడియాలో తెలుగు సినిమాలు బాగుండవు అని వాపోయేవారి సంఖ్య చాలా చాలా తక్కువ. చెప్పాలంటే ఒక వందకి మించదు. 

ఇలాంటి వారి ద్వారా తెగే టికెట్స్ సంఖ్య కూడా తక్కువే. అసలా సంఖ్య లెక్కలోకే రాదు. 

ఏ తెలుగు సినిమానయితే వీరంతా తక్కువచేసి లాజిక్ లేని రాతలు రాస్తున్నారో, ఇప్పుడు బాలీవుడ్‌తో సహా...  దేశంలోని అన్ని భాషల ఫిలిం ఇండస్ట్రీలు  తెలుగు సినిమా వైపే చూస్తూ చాలా నేర్చుకుంటున్నాయని వీరికి తెలుసా? 

At the end of the day, filmmaking is a business. Big business. 

Wednesday 12 October 2022

గెస్ట్ పోస్ట్ / డైరెక్టర్ బాబ్జీ


(Father of Telugu Cinema "రఘుపతి వెంకయ్య నాయుడు" సినిమా దర్శకుడు, మిత్రుడు శ్రీ బాబ్జీ గారు నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" గురించి రాసిన నాలుగు వాక్యాలు.)

***    

రేపటి  సూర్యుడి  కోసం  రాత్రంతా  ప్రసవ వేదన  పడేదే 
అసలైన ప్రజా కళారూపం  అంటాడు  మాక్సిం గోర్కి.....!
రచనా వ్యాసంగం కూడా  కళారూపమే ....
పుస్తకం కూడా కళా
రూపకమే  అంటాను నేను....!
మిత్రులు , సోదరులు , మౌన మేధావి  శ్రీ  మనోహర్ చిమ్మని గారి 
ఆలోచన  అవలోచన  కూడా అదే....!
అందుకే  పుస్తకాన్ని  కూడా 
ఒక సంచలనాత్మక  సినిమాకు  చేసినంత  సంచలనాత్మకంగా 
ప్రమోషన్  చేశారు....చేస్తున్నారు..!
పుస్తకాన్ని  కూడా  యింత గొప్పగా,  యింత  విభిన్నంగా, 
జనబాహూళ్యం లోకి  తీసుకెళ్ళవచ్చు  అనే  రుజువు చేసి చూపించారు....!
మరిన్ని  గ్రంధాలు పురుడుపోసుకోవడానికి మార్గ దర్శకత్వం  వహించారు....!
ఈ పుస్తకం  ఒక సంచలనం....
ఈ పుస్తకం  ఒక  సమ్మోహనం....
మీరిచ్చిన  స్ఫూర్తి  వృధా కాదు....
ఎంతోమంది  రచయిత లకు  కొత్త స్ఫూర్తినిస్తుంది....!
ఇకనుంచి  పుస్తకానికి కూడా  సినిమా  పద్దతిలో  ఫంక్షన్ లు జరుగుతాయి....!
ఒక్కో  పుస్తకం  ఒక్కో  సినిమా  అవుతుంది.....!
ఇది అక్షర సత్యం....!!
                          ........  మీ
                                  బాబ్జీ 
                              సినీ దర్శకుడు 

***

ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగి ఈరోజుకి సరిగ్గా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ పోస్టు! 

అప్పటినుంచీ ఆదివారం, హాలిడేలు అని ఏదీ లేకుండా, ప్రతిరోజూ ఈ పుస్తకం సేలవుతూనే ఉంది...  

Tuesday 11 October 2022

పుస్తకానికి శతదినోత్సవం!


నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆవిష్కరణ జరిగి ఇవాళ్టికి సరిగ్గా 99 రోజులు. 

రేపు వందవ రోజు.

డైనమిక్ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జులై 5 వ తేదీనాడు ఈ పుస్తకాన్ని ప్రగతిభవన్‌లో లాంచ్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు... ఆదివారంతో కలిపి, ప్రతిరోజూ, నిరంతరం సేల్స్‌లోనే ఉందీ పుస్తకం.

థాంక్స్ టు:

> నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ 
> పాలపిట్ట బుక్స్, సుందరయ్య పార్క్, బాగ్‌లింగంపల్లి 
> స్వర్ణసుధ పబ్లికేషన్స్, రామ్స్ ఎంక్లేవ్, ఎర్రగడ్డ

ఈ నాలుగు పాయింట్స్ నుంచి ఈ పుస్తకం సేల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.   

మా బుక్ సెల్లర్స్‌కు ఇప్పటివరకు వచ్చిన బల్క్ ఆర్డర్స్‌లో కొన్ని - లండన్‌లో ఉన్న భువనగిరి నవీన్ నుంచి రావడం విశేషం. నవీన్ లండన్ నుంచి బల్క్‌గా బుక్స్ ఆర్డర్ చేసి, ఇక్కడ లోకల్‌గా రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది కేసీఆర్ ఫ్యాన్స్, తెలంగాణ ప్రేమికులకు బుక్‌ని గిఫ్ట్‌గా పంపించడం అన్నది నిజంగా గొప్ప విషయం.    

మా పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ఇంకా అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని పెట్టలేదు. పెట్టుంటే, ఈ బుక్ సేల్స్ కనీసం ఇంకో నాలుగు రెట్లు జరిగుండేది. 

వచ్చే "హైద్రాబాద్ బుక్ ఫేర్" పూర్తయ్యేటప్పటికి పదివేల కాపీల అమ్మకాలు అత్యంత కూల్‌గా జరుపగలమన్నది మా పబ్లిషర్స్ నమ్మకం. 

కట్ చేస్తే - 

"కేసీఆర్ -ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం కొనుక్కొన్న ప్రతి ఒక్కరూ, ఒక వారం రోజుల్లోనే మళ్ళీ ఇంకో రెండు కాపీలు (కనీసం!) కొనుక్కెళ్ళి - వాటిని తమ ఫ్రెండ్స్‌కో, తెలిసినవారికో గిఫ్ట్‌గా ఇస్తుండటం నేను గమనించిన ఇంకో గొప్ప విషయం.  

ప్రఖ్యాత సౌండ్ ఇల్యూజనిస్టు మిమిక్రీ శ్రీనివాస్ గారు ఈ పుస్తకం చదివాక తన అద్భుతమైన రివ్యూను ఒక వీడియో బైట్ రూపంలో పంపించడం మరొక మంచి అనుభూతి. వీరితోపాటు ఇంకా చాలామంది తమ రివ్యూలను వీడియో బైట్ రూపంలో పంపించారు.   

"రఘుపతి వెంకయ్య నాయుడు" చిత్ర దర్శకులు, అభ్యుదయ రచయిత, నా మిత్రుడు బాబ్జీ గారు ఈ పుస్తకం చదివాక రాసిన రివ్యూ నన్ను బాగా ఆలోచింపజేసింది. బాగా ఇన్‌స్పయిర్ చేసింది. దాన్ని ఉన్నదున్నట్టుగా - ఈ మధ్యే నా ఫేస్‌బుక్ వాల్ మీద పోస్ట్ చేశాను. ఒక జ్ఞాపకంగా భద్రపర్చుకోవడం కోసం, ఒక గెస్ట్ పోస్టుగా - రేపు నా బ్లాగ్‌లో కూడా పోస్ట్ చేస్తున్నాను.              

పుస్తకం ఆవిష్కరణ జరిగిన 'డే వన్' నుంచి, దాదాపు పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ... పుస్తకం గురించి వారి అభిప్రాయాన్ని - అయితే ఒక ఫేస్‌బుక్ పోస్టుగా పెడుతున్నారు. లేదంటే డైరెక్ట్‌గా నాకు పంపిస్తున్నారు. 

వీరిలో - వీయస్పీ తెన్నేటి వంటి ప్రముఖ రచయితలు, స్పిరిచువల్ మెంటర్స్ కూడా ఉండటం నాకు మరింత ఆనందాన్నిచ్చింది.

ఇక, #PhotoWithKCRBook విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియమైన పాఠక మిత్రుల నుంచి ఇప్పటికే వందలాది అద్భుతమైన ఫోటోలు అందుకున్నాను. ఇంకా అందుకుంటున్నాను. వీలైనన్ని నా టైమ్‌లైన్ మీద పోస్ట్ చేస్తున్నాను. 

అయితే - నేను అనుకున్న కొంతమంది ప్రముఖులకు, కొందరు నా శ్రేయోభిలాషులకు ఒక బాధ్యతగా నేనే వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి నా పుస్తకం అందించాలనుకున్నాను. ఉద్యోగ బాధ్యతలు, ఇతర దైనందిన జీవితపు వొత్తిళ్ళ కారణంగా సమయం కుదరలేదు. వచ్చే వారం పదిరోజుల్లో ఆ పని కూడా పూర్తిచేయడానికి ప్లాన్ చేసుకున్నాను.    

కట్ చేస్తే - 

జాతీయ పార్టీ "బీఆరెస్"తో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపుతున్న ఈ సందర్భంలో - కేసీఆర్ అభిమానులకు, బీఆరెస్ లోని వివిధస్థాయిల్లోని నాయకులకు, కార్యకర్తలకు నా పుస్తకం ఒక మంచి ఇన్‌స్పైరింగ్ టూల్‌గా ఉపయోగపడుతోందని చాలామంది చెబుతున్నారు. 

అలా ఉపయోగపడాలన్నదే నా కోరిక అని పుస్తకం ప్రోలోగ్‌లోనే స్పష్టంగా రాశాను.

రేపు - "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం ఆవిష్కరణ శతదినోత్సవం సందర్భంగా... స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత బైరి పరమేశ్వర్ రెడ్డి గారు పాఠకులకు ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అదేంటన్నది రేపు తెలుస్తుంది.  

ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.  

Wednesday 5 October 2022

"TELUGU CONTENT WRITING SERVICES" MADE EASY!

థాంక్స్ టు ఇంటర్‌నెట్… ఇప్పుడు "కంటెంట్ రైటింగ్" చాలా ఈజీ అయింది. డెడ్‌లైన్‌కు ఒక గంట ముందు చెప్పినా సరే... రాసి, ఈమెయిల్ చెయ్యొచ్చు. వాట్సాప్ చెయ్యొచ్చు. 

సినిమాలకు, సీరియల్స్‌కు, వెబ్‌సీరీస్‌లకు, వెబ్‌సైట్స్‌కు, ఇతర టీవీ & వెబ్ ప్రోగాములకు అవసరమయిన స్క్రిప్టులను ఎప్పటికప్పుడు రాసిచ్చేదే – ఈ కంటెంట్ రైటింగ్. 

యు యస్, యు కె వంటి అభివృద్ధిచెందిన దేశాల్లో కంటెంట్ రైటర్స్‌కు మంచి డిమాండ్ ఉంది, ఆదాయం ఉంది. ఇప్పుడు ఇండియాలో, మన దగ్గర కూడా నెమ్మదిగా పాపులర్ అవుతోంది.

కట్ చేస్తే –

ఒక రచయిత తన రచనలకు తన పేరు కాకుండా – ఇంకొకరి పేరు పెట్టుకొనే పద్ధతిలో ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌తో రాసే పద్ధతే “ఘోస్ట్ రైటింగ్”.

ఈ ఘోస్ట్ రైటింగ్ అనేది ఎప్పటినుంచో ఉంది. దీనికున్న పరిమితులవల్ల ఏ ఘోస్టు ఎవరికి రాశారు అన్నది బయటివారికి తెలియదు. 

అమెరికా వంటి దేశాల్లో ఘోస్ట్ రైటింగ్ సర్విసెస్ బాహాటంగా ఉంటాయి. అదొక భారీ ప్రొఫెషన్ అక్కడ. “I’m a Ghost Writer” అని బాహాటంగా చెప్పుకుంటారక్కడ. ఇక్కడ మాత్రం తెరవెనుకే.

నిజాని ఆ అవసరం లేదు. ఇదీ ఒక ప్రొఫెషనే. రెమ్యూనరేషన్ తీసుకొని రాసివ్వడమే.

తేడా ఒక్కటే... మన పేరుతో రాసిచ్చే క్రియేటివ్ కంటెంట్‌కు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. “మీరు ఎవరి పేరయినాపెట్టుకోవచ్చు” అని రాసిచ్చే కంటెంట్‌కు మామూలుగా డబుల్ రెమ్యూనరేషన్ ఉంటుంది.

ఇది రెండువైపులా అంగీకారంతో జరిగే ఒక అతి మామూలు ప్రక్రియ.

విన్ – విన్!

మనోహర్ చిమ్మని   కంటెంట్ రైటింగ్స్ -
నేనూ, నా పర్యవేక్షణలో నా క్రియేటివ్ టీమ్ – ఫ్రీలాన్స్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్ కూడా ప్రారంభించాము. 

తెలుగులో - సినిమా స్క్రిప్టులు, వెబ్ సీరీస్ స్క్రిప్టులు, సీరియల్స్, ఫిక్షన్, నాన్-ఫిక్షన్, బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలూ, ఆర్టికిల్స్, స్పీచ్‌లు, వెబ్ కంటెంట్, బులెటిన్స్, ఇన్-హౌజ్ న్యూస్ లెటర్స్… ఏదైనా – ఎలాంటి కంటెంట్ అయినా – మానవ సాధ్యమయిన ఎలాంటి డెడ్‌లైన్‌కయినా అందించగలం.

కంటెంట్, రెమ్యూనరేషన్ స్టాండర్డ్‌గా ఉంటాయి.  

పైన చెప్పినవాటిల్లో – మీ కంటెంట్ అవసరాలకు సంబంధించిన ఆర్డర్ ఏదైనా సరే, మేం స్వీకరిస్తాం. మంచి స్టాండర్డ్‌లో అనుకున్న టైమ్‌కు అందిస్తాం.

కంటెంట్ వర్క్ ఆర్డర్ మాకివ్వండి.
మీ ఇతర పనులపైన ఫోకస్ పెట్టండి. 
మీకు టైమ్‌కు కంటెంట్ అందించే బాధ్యత మాది.  

ఇంకెందుకు ఆలస్యం? 

వాట్సాప్/ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి.

Nandi Award Winning Writer, Blogger, Film Director
MD, Swarnasudha Projects Private Limited

Whatsapp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

ABOUT MANOHAR CHIMMANI: 
Short Intro AV on Manohar Chimmani: 

మనోహర్ చిమ్మని గురించి (తెలుగు):

About Manohar Chimmani (English): 

Tuesday 4 October 2022

కేసీఆర్... ఒక చారిత్రక అవసరం!


"ఎప్పటికప్పుడు మన చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్‌డేట్‌గా ఉంటే దేశమైనా సమాజమైనా చక్కగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటేనే సమాజం పెద్ద దెబ్బ తింటుంది" అని మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఈ మాటలు ఏదో పొద్దుబోక చెప్పిన మాటలు కావు. ఒక పెనుప్రమాదపు అంచున ఉన్న దేశాన్ని, దేశ సంపదను, సంస్కృతిని కాపాడుకొనే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యం.    

అసలెందుకు ఇప్పుడీయనకు కొత్తగా ఈ తలనొప్పి? తెలంగాణ సాధించింది చాలదా? ముఖ్యమంత్రిగా సంచలనాత్మక స్థాయిలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నది చాలదా? తెలంగాణ ఉన్నన్నాళ్ళు ఆయన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది కదా - ఇంకెందుకు ఈ ఆరాటం?... అని కొందరికి సహజంగానే అనిపిస్తుంది.

ముఖ్యమంత్రి పదవి సరిపోలేదు, ఇప్పుడిక ప్రధానమంత్రి పదవి మీద ఆశ పుట్టింది అని ఇంకొందరు అల్పజీవులు అనుకుంటారు.

కాని, నిజం వేరు. 

పని అయిపోయింది కదా అని చేతులు ముడుచుకొని కూర్చుండే వ్యక్తి కాదు కేసీఆర్. నా రాష్ట్రం బాగుంది చాలు, దేశం ఏమైపోతే నాకెందుకు అనుకునే వ్యక్తిత్వం కాదు కేసీఆర్. 60 ఏళ్ళుగా తెలంగాణలో ఎవ్వరూ చేయలేని పనుల్ని కేవలం ఎనిమిదేళ్ళలో ప్రపంచస్థాయి వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు మెచ్చుకునేంతగా సాధించిన తన అనుభవం, కృషి జాతీయస్థాయిలో దేశం కోసం కూడా ఉపయోగించాలన్నది ఆయన తపన.

ఈ తపనను తప్పుపట్టేవాళ్ళు 75 ఏళ్ళుగా అంతకుముందూ ఏం చెయ్యలేకపోయారు, ఇప్పుడూ ఇక ముందూ కూడా ఏమీ సాధించలేరన్నది నగ్నసత్యం.

లోకం అంతగా తెలియని యువత ఒక్కటే కాదు, విద్యావంతులు మేధావులు అనుకున్నవారు కూడా ఒకరకమైన ఎడిక్షన్‌కు లోనవుతున్నారు. అది త్రాగుడో, మత్తుమందులో కాదు... దైనందిన జీవితంలో బ్రతకడానికి బుక్కెడు బువ్వ పెట్టని అతి సున్నితమైన వ్యక్తిగత నమ్మకాలతో ఆడుకునే విషసంస్కృతికి బానిసలవుతున్నారు.

ఎనిమిదేళ్ళుగా దేశంలో జరిగిన అభివృద్ధిని గురించి గాని, సాధించిన విజయాలను గాని నిర్దిష్టమైన అంకెల్లో చూపించలేరు, చెప్పలేరు. "ప్రపంచంలో భారతదేశం వెలిగిపోయేలా చేశాం ఇంకేం కావాలి" అంటారు. వెలిగిపోవడం కాదు, పరువు పోతోందన్నది కనిపిస్తున్న సత్యం. ఇది నమ్మటం ఇష్టం ఉండదు.

బాహాటంగా నేషనల్ మీడియాలో కేసీఆర్ లాంటి నాయకుడు స్టాటిస్టిక్స్‌తో కలిపి సంధించే ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం ఉండదు. అర్థంలేని అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో మరింత విషాన్ని కక్కడం ఒక్కటే వారు చేయగలిగింది. అదే చేస్తున్నారు.

సమాజశ్రేయస్సుకు ఏరకంగానూ ఉపయోగపడని ఈ విషసంస్కృతిని విస్తరింపజేయడమే పనిగా పెట్టుకొని రాజకీయంగా ఎదిగే ఈ శక్తులు విచ్చలవిడిగా బుసలుకొడుతున్నాయి.   

ఇలాంటి ప్రమాదకరమైన ధోరణి నుంచి దేశాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఇప్పుడు ప్రజలందరి ముందున్న ప్రథమ కర్తవ్యం.

ఎన్నిక చేసుకున్న ఒకరిద్దరు బడా కార్పొరేట్లకే దేశంలోని ప్రభుత్వ సంస్థలను, సంపదను కట్టబెడుతూ రైతులను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ శాడిస్టిక్ ధోరణికి ఇప్పటికిప్పుడు చెక్ పెట్టాలి. దీనికోసం సమర్థుడైన ఒక నాయకుడు కావాలి.

దేశంలోని రైతులందరూ ఇప్పుడు కేసీఆర్‌లో అలాంటి నాయకున్ని చూస్తుండటం ఒక శుభపరిణామం. క్రమంగా దేశంలోని యువత, ఎంట్రప్రెన్యూర్స్, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాలవారందరు కూడా కేసీఆర్ వైపే చూస్తున్నారన్నది ఇప్పుడు మనం చూస్తున్న ఇంకో అద్భుత పరిణామం.   

ఇప్పటిదాకా తెలంగాణలోని అణువణువు గూర్చి ఆశువుగా గణాంకాలతో చెప్పిన కేసీఆర్, ఇప్పుడు యావత్ దేశం గురించి కూడా అంతే లోతైన అధ్యయనంతో ప్రతి ఒక్క అంశం పైన స్పష్టంగా, ఆశువుగా వివరిస్తుంటే నేషనల్ మీడియాతో పాటు యావత్ దేశం సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది.

తెలంగాణలో సాధ్యమైన రైతుకి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా వంటివి యావత్ దేశంలోనూ ఎందుకు సాధ్యం కాదు అని కేసీఆర్ విసురుతున్న సవాల్‌కు ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వం నడిపిస్తున్నవారివద్ద జవాబు లేదు. వారి ఫాలోయర్స్ దగ్గర కూడా - మతిస్థిమితం తప్పిన ఒకానొక మందమెంటాలిటీ ఉపయోగించే వాట్సాప్ ఆయుధం తప్ప ఇంకేం లేదు.  

ఎంతసేపూ రాజకీయాలే కాదు. ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువకాకుండా అన్నిరకాల వనరులుండి కూడా, సిగ్గుచేటైన విధంగా 75 ఏళ్ళుగా ఇంకా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం"గానే ఉన్న మన దేశాన్ని ఒక ధనికదేశంగా అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల సరసన చేర్చగల సత్తా ఉన్న నాయకుడు ఇప్పుడు మన దేశంలో ఉన్నది కేసీఆర్ ఒక్కరే.   

ఇది డిజిటల్-సోషల్ యుగం. మనిషి జీవితంలోని అన్ని కోణాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పు మన దేశంలోని రాజకీయాల్లో కూడా రావాల్సిన సమయం వచ్చేసింది. ఆ మార్పు కోసం మరోసారి మరొక మహోజ్వల ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్న నాయకుడు మన కేసీఆర్ కావడం మనం గర్వించాల్సిన విషయం.

కేసీఆర్‌కు అవసరమైన స్థాయిలో మెదళ్లను ఉపయోగించి, ఈ మహాయుద్ధం విషయంలో ఆయనకు అవసరమైన తోడ్పాటుని అందించగల విద్యావంతులు, రచయితలు, మేధావులు ఆయన పిలుపు కోసం యుద్ధక్షేత్రంలో సైనికుల్లా సర్వదా సిధ్ధంగా ఉన్నారు.         

జాతీయ పార్టీ ప్రకటనతో ఈ విజయదశమికి సమరశంఖం పూరిస్తూ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న మన కేసీఆర్‌కు శుభస్వాగతం పలుకుదాం. ఈ ఉద్యమం కూడా దిగ్విజయం అయ్యేలా వారికి అన్నివిధాలా తోడ్పడుదాం. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణతో పాటు, ఇప్పుడు మన దేశం కూడా సంచలనాత్మక అభివృద్ధి-సంక్షేమ పథకాల మేళవింపుతో ఒక ధనిక దేశంగా ఎదగటం మన కళ్లారా చూద్దాం. 
^^^
(నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈరోజు నా వ్యాసం)