Friday 29 November 2013

ఒక ఆర్టిస్టు డైరీ

టైటిల్ వెరైటీగా ఉంది కదూ?

మరిసా గురించి ఇప్పుడే చదివాను. తనొక రచయిత్రి, ఆర్టిస్టు, టెక్స్‌టైల్ డిజైనర్. ఇంకా ఎన్నో కళల్లో ప్రవేశముంది. మొత్తంగా, మరిసా.. ఒక క్రియేటివ్ వుమన్.

మొదట్లో మామూలుగా అందర్లాగే 9-5 ఉద్యోగం చేస్తుండేది మరిసా. ఇలా జాబ్ చేస్తున్న సమయంలో, తనలోని క్రియేటివిటీని ఏ విధంగానూ బయటకు తెచ్చుకొనే అవకాశం దొరికేదికాదు మరిసాకి. ఈ రోటీన్ లైఫ్‌స్టైల్ ఇలాగే కొనసాగితే, తనలోని సృజనాత్మకత పూర్తిగా అదృశ్యమయిపోయే ప్రమాదముందన్న విషయాన్ని గ్రహించింది మరిసా.

9-5 జాబ్ ఓకే. బ్రతకాలి కాబట్టి. కానీ, తనలోని క్రియేటివిటీ విషయమేంటి?

వన్ ఫైన్ మార్నింగ్ మరిసాకి ఓ ఆలోచన వచ్చింది. దాదాపుగా వారం మధ్యలో వచ్చే గురువారాన్ని (థర్స్‌డే) సంపూర్ణంగా తనలోని క్రియేటివిటీ కోసమే కెటాయించాలని నిర్ణయం తీసుకొంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా తన జాబ్‌లోని పనిదినాల్ని, మిగిలిన ఇంటివిషయాల్ని అడ్జస్ట్ చేసుకొంది.

కట్ టూ క్రియేటివ్ థర్స్‌డే -

గురువారం. ఆ రోజు తను ఏ పని చేసినా అది తనలోని క్రియేటివిటీని ప్రదర్శించేది అయిఉండాలి. అది ఆర్ట్ కావొచ్చు. రచన కావొచ్చు. టెక్స్‌టైల్ డిజైన్ కావొచ్చు. వారంలో ఒక రోజు.. ఆ గురువారం మాత్రం పూర్తిగా క్రియేటివిటీనే.

మరిసా జీవితంలో ఆ నిర్ణయం ఒక అందమైన మలుపు..

ఇది జరిగింది సుమారు ఆరేళ్ల క్రితం. అప్పుడు తను తీసుకొన్న ఆ ఖచ్చితమైన నిర్ణయం తన జీవన శైలినే మార్చివేసింది. క్రమంగా తన రొటీన్ 9-5 జాబ్‌ను కూడా వదిలేసింది.

ఇప్పుడంతా మరిసా ఇష్టం. ప్రతిరోజూ థర్స్‌డేనే. ఒక థర్స్‌డేతో ప్రారంభించిన తన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు ఫుల్‌టైమ్ బిజినెస్ అయింది! కావల్సినంత ఆదాయం. చెప్పలేనంత సంతృప్తి. ఇంకేం కావాలి?

ఇది చదువుతోంటే మీ మైండ్‌లో కూడా ఏవో కొత్త ఆలోచనలు వస్తూ ఉండాలి ఇప్పటికే. కదూ?  

తన ఈ చిన్ని క్రియేటివ్ జర్నీని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడానికి ఓ వెబ్‌సైట్‌ని కూడా రూపొందించుకొంది మరిసా. ఆ వెబ్‌సైట్ పేరు ఏమయిఉంటుందో వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను.

క్రియేటివ్ థర్స్‌డే! 

Tuesday 26 November 2013

"1" వారం, 50 కోట్లు!

ఇప్పుడే తెలిసింది..

మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "1" (నేనొక్కడినే!) బడ్జెట్ అంచనాలకు మించి చేయిదాటిపోయిందని.

అది ఏ రేంజ్‌లో చేయిదాటిపోయిందంటే - దాన్ని కవరప్ చేయటం కోసం "1" నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్‌కు మరో చిత్రం చేయడానికి మహేష్ ఒప్పుకున్నాడని! ఇది నిజం అని నమ్మలేకపోతున్నాను. కానీ, ఇంటర్‌నెట్టంతా, ఇండస్ట్రీ అంతా ఇదే న్యూస్ ఫ్లోట్ అవుతున్నప్పుడు.. కొంచెం కష్టంగానైనా నమ్మక తప్పడం లేదు.

ఒకవైపు కేవలం లక్షల్లోనే యూత్ ఎంటర్‌టయినర్ సినిమాలు తీస్తూ, 12-20 కోట్ల లాభాల్ని తెచ్చిపెడుతున్నారు కొత్త దర్శకులు. దర్శకుడు మారుతి క్యాంపు నుంచి ఇదే పధ్ధతిన ఏకంగా 7 సినిమాలు తయారవుతున్నాయి ఇప్పుడు! సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది.

మరోవైపు పెద్ద సినిమాల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. లెక్కల విషయంలో.      

కట్ టూ బ్రేక్ ఈవెన్ -

మహేష్-సుకుమార్ ల "1" కోసం పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగి రావాలన్నా (బ్రేక్ ఈవెన్), ఆ చిత్రం కనీసం 70 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా! ఇది జరగాలంటే - రిలీజయిన మొదటి వారంలోనే, ఈ చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది!! అది జరిగినప్పుడే, మిగిలిన 20 కోట్లు (బ్రేక్ ఈవెన్ కోసం) కూడా వచ్చే అవకాశం ఉంటుంది.      

ఈ మధ్య కలెక్షన్ల వర్షం కురిపించి, వసూళ్ల సంచలనం సృష్టించిన పవన్-త్రివిక్రమ్ ల "అత్తారింటికి దారేది" సినిమా తొలివారంలో 40 కోట్లు సంపాదించింది. మహేష్-సుకుమార్ ల "1" మీద కూడా భారీ అంచనాలున్నాయి. సెన్సేషనల్ సక్సెస్ అవొచ్చు అని నేనూ నమ్ముతున్నాను. అయితే - "హిట్" టాక్ వచ్చిందంటే ఫరవాలేదు. కానీ.. ఏమాత్రం కిందా మీదా అయినా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.

హెవీ గ్యాంబ్లింగ్ అంటే ఇదే!

మార్కెట్ రేంజ్‌ని పట్టించుకోకుండా ఖర్చుపెట్టి, చివరికి బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా అని ఎదురుచూడ్డం ఒక్క సినీ ఫీల్డులోనే సాధ్యం.  

Friday 22 November 2013

రన్.. 2013 అయిపోవస్తోంది!

మన పెద్దలు చాలా తెలివయినవాళ్లు. ఒకవైపు "నిదానమే ప్రదానం" అన్నారు. మరోవైపు, "ఆలస్యమ్ అమృతమ్ విషమ్" అని కూడా అన్నారు!

దేన్ని ఫాలో కావాలి?

అవసరాన్నిబట్టి, సందర్భాన్ని బట్టి.. ఈ రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ డెసిషన్ మాత్రం మనదే. ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన సమయంలో తీసుకొన్నవాడే విజేత. ఎందులోనయినా.

దీన్నే ఇంగ్లిష్‌లో "డెసిషన్ మేకింగ్" అంటారు అందంగా. రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ తీసుకొన్నవాడే కింగ్! విషయం ఏదయినా కావొచ్చు. ఫీల్డు ఏదయినా కావొచ్చు. ఆ విజయం కోసమే అందరి తపన.

కట్ టూ 'సెల్ఫ్ మోటివేషన్' -

నేను బ్లాగ్ పోస్ట్ రాసి కనీసం 6 రోజులయింది. ఇంతకంటే నిదానం ఉండదనుకుంటా! అలాగని, ఇక్కడి ఈ ఆలస్యం వల్ల ఎక్కడా ఏ అమృతం విషమయిపోదు. కాని, దీని ప్రభావం మాత్రం ఇండైరెక్టుగా నేను చేసే చాలా పనులమీద తప్పక ఉంటుంది.

కారణాలు ఏవైనా కావొచ్చు. ఇదే అలసత్వం, ఇదే ఉదాసీనత, ఇదే నిదానం.. నేను చేయాల్సి ఉన్న ఎన్నో ఇతర ముఖ్యమైన పనులమీద కూడా తప్పక ప్రభావం చూపుతుంది. ఈ 6 రోజుల్లో, కొంతయినా చూపించేవుంటుంది.

సో, ఈ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా నాకోసం నేను రాసుకుంటున్నాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను ఈ బ్లాగ్ రాయడం ద్వారా.

కట్ బ్యాక్ టూ డెసిషన్ మేకింగ్ -

ఒక స్టడీ ప్రకారం - ఖచ్చితంగా, ప్రతి ముగ్గురిలో ఇద్దరు  "చెత్త నిర్ణయాలు తీసుకోవటం"లో స్పెషలిస్టులుట! దీన్నే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు.. మంచి నిర్ణయాన్ని చెత్త సందర్భంలో తీసుకొంటారు. లేదా, చెత్త నిర్ణయాన్ని మంచి సందర్భంలో తీసుకుంటారు. లేదా, పరమ చెత్త నిర్ణయాన్ని అత్యంత చెత్త టైమ్‌లో తీసుకుంటారు! ఫలితం ఎవరైనా ఊహించవచ్చు. ఏమీ జరగదు. లేదా, జరగాల్సినంత నష్టం జరుగుతుంది!

కట్ టూ కౌంట్ డౌన్ -

ఇందాకే చదివిన ఇంకో పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది..

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట! అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు..

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా చాలా వేల రోజులున్నాయి. కాని, ఏంటి గ్యారంటీ?  

ఏ ట్రాఫిక్ లేని సమయంలో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాకయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు.

గ్యారెంటీ ఏదీ లేదు. దేనికీ లేదు.

ఆ అంకెలు, ఆ లెక్క.. కళ్లముందే కనిపిస్తోంది నాకు.    

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం. కాని, చూస్తోంటే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి.

సో, ఇప్పుడు మీకూ అర్థమయ్యే ఉంటుంది. నా భయం నా చావు గురించి కాదు. చచ్చేలోపు నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలను, పనులను ఎక్కడ అసంపూర్ణంగా వదిలిపెడ్తానోనని! అదీ నా భయం..

ఇంకా ఏం చదువుతున్నారు?

మీరూ, నేనూ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం తొందరపడకపోతే, నిజంగా ఆలస్యమ్ అమృతమ్ విషమే..  

Saturday 16 November 2013

లివింగ్ మై ట్రూత్!

సినిమాల్లోకి నేనెప్పుడూ పూర్తి స్థాయిలో దిగలేదు. అంతకంటే ముందు - అసలీ ఫీల్డులోకి రావాలని కూడా నేనెప్పుడూ అనుకోలేదు.

నేను సినిమాల్లోకి రావడం చాలా యాదృఛ్ఛికంగా జరిగింది. అప్పుడు కూడా సినిమాల్లోకి నేను వచ్చిన ఉద్దేశ్యం వేరు. తర్వాత జరిగిందీ, జరుగుతోందీ వేరు.

ఇప్పుడు కూడా నేనేదో మణిరత్నం, భన్సాలీ కావాలనుకోవడం లేదు..

జస్ట్ కొన్నాళ్లు.. ఒక తాత్కాలిక ప్లాట్‌ఫాం. కొంత మనీ రొటేషన్.. నాకూ, ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్‌కీ. అంతే. అంతకు మించి సినీ ఫీల్డు గురించి నేను ఎక్కువగా ఆలోచించడం లేదు. అంత ఆసక్తి లేదు. ఆ అవసరం లేదు.

వందమంది నిర్ణయాలు. క్రియేటివిటీతో ఏ మాత్రం సంబంధం లేని మరో వందమంది లోపలి వ్యక్తుల, బయటి శక్తుల దయాదాక్షిణ్యాలు. అడ్డంకులు. వీటికోసం మన పడిగాపులు..

వీటన్నిటితో పనిలేని, ఏ మేనిప్యులేషన్స్ అవసరం లేని సిసలైన క్రియేటివిటీ ఫీల్డు బయట ఇంక చాలా ఉంది. నా చూపు, నా ఆలోచన, నా అతి చిన్న లక్ష్యం అదే.

నా స్వేఛ్ఛకు ఎలాంటి అడ్దంకులు, ఆంక్షలు ఉండని ఆ "క్రియేటివిటీ" పైనే నా దృష్టంతా. ఆ స్వేఛ్ఛ కోసమే ఈ కష్టమంతా.  

కట్ టూ మై ట్రూత్ -

నాకిష్టమైన అంశాల్లో ప్రధానమైంది క్రియేటివిటీ. చదవటం, రాయటం, ఆర్ట్, సినిమాలు.. ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ క్రియేటివిటీతో ముడిపడినవే. ఈ మధ్యకాలంలో నన్ను బాగా ఆలోచింపజేస్తున్న మరో ప్రధాన అంశం, నేను ఎక్కువ సమయాన్ని కెటాయిస్తున్న అంశం.. స్పిరిచువాలిటీ!

ప్యాషనే అనుకోండి.. ఎట్రాక్షనే అనుకోండి. ఈ రెండు అంశాలే ఇప్పుడు నాకెంతో ప్రియమైన అంశాలు. నన్ను కట్టిపడేస్తున్న అంశాలు. నా జీవిత వాస్తవాలు.

ఈ వాస్తవాల్ని కాదనే మరింకేవో స్వల్పమయిన ప్రయోజనాల మీద నాకు ఆసక్తి లేదు. నాకు సంబంధించని, నా వ్యక్తిత్వానికి సరిపడని అవాస్తవాల్ని వాస్తవాలుగా "మాస్కు" వేసుకోవటం పట్ల కూడా నాకు ఆసక్తి లేదు.

ఒక్కముక్కలో చెప్పాలంటే.. "అంత సీన్ లేదు!"

^^^

ఈ పోస్టు నిన్నటి పోస్టుకి కొనసాగింపు అన్న విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, మరొక్కసారి.. నా మిత్రులూ, శ్రేయోభిలాషులూ.. థాంక్ యూ వన్ అండ్ ఆల్!

Friday 15 November 2013

సారీ, ప్రభుత్వం కోమాలో ఉంది!

ఈ టైటిల్‌తో రాత్రి ఒక బ్లాగ్‌పోస్ట్‌ని రాశాను. టాపిక్ "పాలిటిక్స్" అని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.

"నాకస్సలు ఇష్టం లేదు" అని నేనెప్పుడూ అనుకునే పాలిటిక్స్ పైన కూడా ఏమంత కష్టపడకుండానే, చాలా ఈజీగా రాశాను. రాయగలిగాను.

హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా రాసే నిజం ఏదయినా సులభంగా రాయవచ్చు, బాగా రాయవచ్చు అని నా వ్యక్తిగత నమ్మకం.

ఇంతకుముందు కూడా, ఒకటీ అరా, పాలిటిక్స్‌ని టచ్ చేస్తూ బ్లాగ్‌లో రాశాను. కానీ, ఇంత సీరియస్‌గా రాయటం మాత్రం ఇదే మొదటిసారి.

సో, పై టైటిల్‌తో నా మొట్టమొదటి సిసలైన రాజకీయ వ్యాసాన్ని (బ్లాగ్ పోస్ట్) ఇలా అనుకోగానే అలా రాసేశాను. వ్యాసాన్ని మొదలెట్టడం మామూలుగా లైటర్‌వీన్‌లోనే మొదలెట్టాను. పూర్తయ్యేటప్పటికి మాత్రం.. వ్యాసంలో చర్చించిన అంశాల తీవ్రత ఎంత శిఖరాగ్రం చేరిందంటే.. ఈ ఒక్క పోస్టుతోనే నా బ్లాగ్‌మీదున్న "విజిట్ మీటర్" ఈజీగా లక్షను దాటేయవచ్చుననిపించింది.

ఈ స్టేట్‌మెంట్‌లో అతిశయోక్తి ఒక్క శాతం కూడా లేదు..

కట్ టూ అసలు నేపథ్యం -

నిన్న రాత్రే రాయటం పూర్తి చేసిన ఈ పోస్ట్‌ని బ్లాగ్‌లో పబ్లిష్ చేయలేదు. ఇవాళ పబ్లిష్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో పెట్టాను (వయా ట్విట్టర్!).

రెండ్రోజులముందు, "ఏదయినా పొలిటికల్ పార్టీలోకి అఫీషియల్‌గా చేరాలనుకుంటున్నాను!" అని కూడా ఓ టీజర్ ఇచ్చాను సరదాగా.

ఫేస్‌బుక్‌లో - బయట కొన్ని లైక్‌లు, కొన్ని కామెంట్లు (చాలా తక్కువ) వచ్చాయి. పర్సనల్‌గా మాత్రం 41 మెసేజ్‌లు వచ్చాయి! నిజంగానే షాకయ్యాను నేను.

వాటిల్లో కొన్ని మెసేజ్‌లని బాహాటంగా, బయట కామెంట్స్‌లో పోస్ట్ చేసినట్లయితే నేను కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యేవాడ్ని. నా ఫీలింగ్స్ తెలిసినవాళ్లు కాబట్టి మెసేజ్‌లు పెట్టి బ్రతికించారు! బ్లాగ్ ముఖంగా వారికి నా ధన్యవాదాలు..

ఇంతకీ ఆ మెసేజ్‌ల మెజారిటీ సారాంశం ఇది:

"ఇప్పటికే నీ శాల్తీకి పడని ఊబి లాంటి ఓ ఫీల్డులోకి దూకేసి, లోపల ఉండలేక .. బయటికి రాలేక గింజుకుంటున్నావు. కొత్తగా ఈ రొచ్చులోకి ఎందుకు బాబూ!?"

అదీ విషయం..

నిన్న రాసిన పొలిటికల్ బ్లాగ్ పోస్ట్‌ని వెంటనే "షిఫ్ట్ డిలీట్" చేసేశాను. వాళ్లంతా చెప్పారని కాదు. నా ఉద్దేశ్యం కూడా అదే. (దీని గురించి మరింత వివరంగా రేపు ఇంకో పోస్టులో రాస్తాను.)

ఫేస్‌బుక్, నా బ్లాగ్ - నా ఆలోచనల్ని షేర్ చేసుకొనే నా ఆంతరంగిక మిత్రులుగానే కాకుండా.. నా ప్రయోగశాలలుగా, "సర్వే మంకీ"లుగా కూడా నాకు బాగానే సహకరిస్తున్నాయన్నమాట!

నా మిత్రులు, శ్రేయోభిలాషులు.. థాంక్ యూ వన్ అండ్ ఆల్.. 

Thursday 14 November 2013

రెండే దారులు - 2

టు డూ ఆర్ నాట్ టు డూ, చెయ్యటమా వద్దా.. ఏదయినా సాధిద్దామా, అలా వదిలేద్దామా.. జీవితాన్ని అనుక్షణం అనుభవించడమా, లేదంటే.. "ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది" అనుకొని చేతులెత్తెయ్యడమా?

రెండూ వేర్వేరు దారులు. ఏది బెటర్?

జీవితం ఎప్పుడూ మనల్ని నడిపించే అవకాశం ఇవ్వకూడదు. మనమే మన అభిరుచికి, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా మన జీవితాన్ని నడిపించాలి. ఒకటి అన్నీ గాలికి వదిలేసే మొదటి దారి. ఇంకోటి స్టీరింగ్ మన చేతుల్లోకి తీసుకొన్న రెండో దారి. ఏది బెటర్? 

ఓకే. రెండో దారిని ఎంచుకోడానికి మీకేదయినా అడ్డు తగులుతోందా? మరేదయినా సమస్య ఉందా? అంత వర్రీ కావల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు తక్కువలో తక్కువ ఒక నాలుగు పరిష్కారాలుంటాయి. కావల్సిందల్లా.. సమస్యను భూతద్దంలో చూడకుండా, దాని పరిష్కారం గురించి కొన్ని క్షణాలు ఆలోచించడం.

సంస్యలకు భయపడకూడదు. వాటిని మించి మనం ఎదగాలి.    

ఉదాహరణకు - 1 నుంచి 10 వరకు ఉన్న "స్కేలు"లో మీ మీ సామర్థ్య స్థాయి 2 దగ్గర ఉందనుకుందాం. అదే స్కేలులో మీకు ఎదురయిన సమస్య 5 దగ్గర ఉంది. అంటే మీ సమస్య మీ కంటే కొంచెం పెద్దది. మీరు ఇంకొంచెం కష్టపడి మీ వ్యక్తిగత విలువను, సామర్థ్య స్థాయిని 10 వరకు తెచ్చుకున్నారనుకోండి. ఇందాక మనం చెప్పుకున్న లెవెల్ 5 సమస్య ఇప్పుడు మీ ముందు చాలా చిన్నదయిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. మీ ముందు అదసలు సమస్య కానే కాదు.   

 ఎప్పుడయినా, మీకేదయినా "అతి పెద్ద సమస్య ఎదురయింది" అన్న ఫీలింగ్ వచ్చిందనుకోండి. అలాంటి పరిస్థితిలో కుంగిపోకూడదు. "నేనీ సమస్యని ఎదుర్కోగలను. సమస్యలెప్పుడూ నా ముందు చిన్నవే" అని కాన్‌ఫిడెంట్‌గా అనుకోవాలి. ఆలోచించాలి. పరిష్కారమార్గాల్ని అన్వేషించి ముందుకు కదలాలి.

ఎందుకంటే - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో - చాలావరకు మన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యల అసలు క్రియేటర్స్ మనమే!   

మనలోని క్రియేటివిటీ మన సమస్యల పరిష్కారం కోసం కూడా ఉపయోగపడాలి.  ఉపయోగపడేలా చేసుకోవాలి. ఇది నా వ్యక్తిగత అనుభవంతో నేర్చుకున్నది. నేర్చుకుంటూ ఆచరిస్తున్నదీ.

Tuesday 12 November 2013

రెండే దారులు - 1

ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా .. వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే - ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు.

"నా దారి రహదారి!" అని రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్టు - "నాది ఈ దారి" అన్న ఎంపిక కొంతమంది విషయంలో తెలిసి జరగొచ్చు. కొంతమంది విషయంలో తెలియక జరగొచ్చు.

ఎలా జరిగినా, ఉన్న ఆ రెండే రెండు దారుల్లో ఏదో ఒకదానిలోనే ఎవరైనా వెళ్లగలిగేది. వారు ఎన్నుకున్న ఆ ఒక్క దారే .. అతడు/ఆమె "ఎవరు" అన్నది నిర్వచిస్తుంది.

ఇంతకీ ఆ రెండు దారులేంటో ఊహించగలరా?

మొదటి దారి - మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని "ఏదో అలా" అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం.

రెండో దారి - మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని జీవితంగా అనుక్షణం ఎంజాయ్ చేయడం.

కట్ టూ మొదటి దారి -

మొదటి దారిలో - మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఎదో ఒక ప్రత్యేకత, లేదంటే ఎంతో కొంత 'విషయం' ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము.  

"నాకు రాదు", "నాకు లేదు", "ఇలా వుంటే చేసేవాణ్ణి", "అలాగయితే సాధించేదాణ్ణి" .. వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. తక్కువపని చేయటం, తక్కువ సంపాదించటం, సంతృప్తి లేకపోయినా ఉన్నామన్న భ్రమలో బ్రతకటం, ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రయత్నించకపోవడం, వ్యక్తి వికాసానికి సంబంధించి గానీ, హాబీగా గానీ ఏమీ చదవకపోవడం, అసలు ఆలోచించకపోవడం  .. ఇదీ మొదటి దారిని ఎంచుకున్నవాళ్ల బతుకుబాట.

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. దీనికి కారణాలు అనేకం.

కట్ టూ రెండో దారి -

ఈ దారిలో .. ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. "ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?" అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి "తలతిక్క"గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం .. ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

అంతేకాదు. ఎప్పుడూ పని రాక్షసుల్లా కాకుండా, కుటుంబంతో, స్నేహితులతో తగినంత సమయం గడుపుతూ, ఆ సమయానికి ఒక గొప్ప విలువని తీసుకురావడం; చిన్నవి పెద్దవి ఎన్నో లక్ష్యాల్ని సాధించడం, బాగా సంపాదించడం, (అప్పుడప్పుడూ బాగా కోల్పోవడం కూడా!) ప్రతిక్షణం సంపూర్ణ జీవితాన్ని గడపడం .. ఇవన్నీ కూడా ఈ రెండవ దారిని ఎంచుకొన్న వాళ్ల జీవనశైలిలో ఒక భాగం.

ఇంతకీ మనది ఏ దారి?  

Friday 8 November 2013

ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్, ఒక 500 నోటు!

ఇవాళ సాయంత్రం టీవీలో సీనియర్ హీరోయిన్ జయసుధ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్‌వ్యూలో తను చెప్పాలనుకున్న చాలా విషయాల్ని ఆమె చెప్పలేకపోయింది. చెప్పిన ఆ కొన్ని విషయాల్ని కూడా ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా చెప్పడానికి చాలా ఇబ్బంది పడింది. ఎంతో చెప్పాలనుకున్నా, చెప్పలేకపోతున్న ఆమె ఇబ్బంది చూస్తుంటే నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది.

అదొక రాజకీయ ఇంటర్‌వ్యూ. ఒక పొలిటీషియన్‌గా ఆమె నుంచి కొన్ని పచ్చి నిజాలు రాబట్టిన ఇంటర్వ్యూ అది.

ఒక "శివరంజని", ఒక "మేఘసందేశం" చాలు ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోడానికి. సహజనటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుని, సుమారు 40 ఏళ్లుగా సినీ ఫీల్డులో చాలా డిగ్నిఫైడ్‌గా ఉందా నటి. తన పేరు చెడగొట్టుకొనే ఎలాంటి వివాదాలు దాదాపు ఆమెకు తెలియవు.

కొన్నేళ్లక్రితం తన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక అనుభవాలవల్ల, ఆసక్తివల్ల ఎలాంటి సంకోచం లేకుండా మతం కూడా మారిందామె. ఆ విషయాన్ని కూడా ఎన్నోసార్లు, ఎన్నో ఇంటర్వ్యూల్లో చాలా డిగ్నిఫైడ్‌గా చెప్పుకోగలిగిందామె. అది ఎవరికీ అభ్యంతరం ఉండకూడని విషయం.

నిజానికి మతం అనేది మానవసృష్టి. నా దృష్టిలో అది పూర్తిగా వ్యక్తిగతం.

వ్యక్తిగతమైన ఈ విషయాన్ని కూడా చాలా మంది పిచ్చి రాజకీయం చేస్తారు. అలాంటి రాజకీయం, కామెంట్లు జయసుధ మీద చేయలేకపోయారెవ్వరూ. అదీ జయసుధ సంపాదించుకున్న పేరు.

అలాంటి జయసుధ.. బై మిస్టేక్.. రాజకీయాల్లోకి ఎంటరయింది. కాదు, వైయెస్సార్ రప్పించాడు. "ఏదో ప్రజలకు సేవ చేయొచ్చు కదా" అని అమాయకంగా అనుకుని ఉంటుంది జయసుధ. ఆమె చేసిన పెద్ద తప్పు అదే, బహుశా.

"ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు" అని ఇవాళ తనే చెప్పింది. జయసుధ చెప్పింది వంద శాతం నిజం.

భాష, ప్రవర్తన, కనీస మర్యాద, చాలా సందర్భాల్లో కనీస మానవత్వం .. ఇవన్నీ ఏవీ  తెలియని, తెలుసుకోవడం అవసరం లేని.. 'బాగా డబ్బు, బలగం ఉన్న వ్యక్తుల  మెజారిటీ'నే నేటి రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ  అని చాలా ఇబ్బంది పడుతూ చెప్పింది జయసుధ.

"ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్, ఒక 500 నోటు.. ఇదే నేటి రాజకీయం! ఈ కల్చర్ పోవాలి రాజకీయాల్లో".. అందామె ఎంతో బాధగా. ఇంతకంటే సింపుల్‌గా, స్పష్టంగా ఇంకా ఏం చెప్పాలి?

వ్యక్తిగత ఎజెండాలు, ప్రతిదాన్లోనూ పర్సనల్ ఐడెంటిటీ కోసం కుట్రలు, ఎంత ఖర్చు పెట్టాం.. ఎంత లూటీ చేద్దాం.. ఇదే ప్రస్తుతం మనదేశంలో ఉన్న రాజకీయం.

ఈ రాజకీయం ఇప్పటిది కాదు. స్వతంత్రం వచ్చిన ఆరంభంలోనే ఈ కల్చర్‌కు పునాదులు పడ్దాయి. ఆ పునాదులమీదే 66 ఏళ్లుగా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి.

సహజ నటి జయసుధ ఊహించిన రాజకీయాలు ఇవికావు, బహుశా. చివరికి, ఈ దేశంలోని రాజకీయాలు చూస్తుంటే "అసలు దేశమే వదిలి వెళ్లిపోవాలనిపిస్తోంది" అంది జయసుధ.

వద్దని జయసుధని ఆపగలమా? ఆపడానికి మనదగ్గర ఏ లాజిక్స్ ఉన్నాయి? ఇవాళ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన చేదు నిజాల్ని అబద్దం అని ఎలా చెప్పగలం? అన్నీ నిజాలే ..      

Thursday 7 November 2013

సినిమా అంతిమ లక్ష్యం డబ్బే!

నేను ఆర్ట్ సినిమాల గురించి మాట్లాడ్డం లేదు. వాటి ఉద్దేశ్యం, దారి వేరు. డబ్బు గురించి మర్చిపోతే చాలు. శాశ్వతంగా చరిత్రలో నిల్చిపోయే కళాఖండాలు ఎన్నయినా తీయవచ్చు. ఈ సెక్షన్ గురించి, దీన్లోనూ ఉండే నానా రాజకీయాల గురించీ మరోసారి, మరో బ్లాగ్ పోస్ట్ రాస్తాను.

ఫీల్డు గురించి, దాన్లో మునిగి తేలుతున్నవాళ్లు అనుభవించే అప్స్ అండ్ డౌన్స్ గురించి తెల్సినవాళ్లు మాత్రం "సినిమా అంతిమ లక్ష్యం" డబ్బు తప్ప మరొకటి కాదు అన్న నిజాన్ని ఒప్పుకుంటారు. సెలెబ్రిటీ హోదా, ఫేమ్, ఇతర ఆకర్షణలు వగైరా.. ఈ సిస్టమ్‌లో ఒక చిన్న భాగం మాత్రమే.

ఇదంతా తెలియనివాళ్లు, తెలిసినా పట్టించుకోనివాళ్ళు - యథాప్రకారం ఏవో నీతి సూత్రాలు చెప్తుంటారు. "ఇలా ఉండాలి.. అలా తీయాలి" అని. ఈ చెత్తంతా ప్రాక్టికల్స్‌కి పనిచేయని థియరీ లాంటిదన్నమాట. దాన్నలా వదిలేద్దాం.
 
కట్ టూ "టు బి ఆర్ నాట్ టు బి" -

నిన్ననే ఒక గుడ్ న్యూస్ తెలిసింది. నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్ర లలిత్ (ముంబై) దర్శకుడయ్యాడు. తనే కెమెరామన్‌గా, దర్శకుడుగా ఒక హిందీ-ఇంగ్లిష్ బైలింగువల్ చిత్రం అతి త్వరలో ఫ్లోర్స్ మీదకి వెళ్లబోతోంది. డిల్లీ, ఇంకా హర్యానాలోని మోర్నీ హిల్స్‌లో షూటింగ్. "టు బి ఆర్ నాట్ టు బి" ఆ చిత్రం వర్కింగ్ టైటిల్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్.

సుమారు మూడేళ్లక్రితం లలిత్, నేను పార్ట్‌నర్స్‌గా ఒక ఇంగ్లిష్ చిత్రం చేయాలనుకున్నాం. హిమాలయ అడవులు బ్యాక్‌డ్రాప్‌గా కథాగమనం ఉంటుంది. ఒక మిస్టిక్ థ్రిల్లర్. నటీనటులు కూడా దాదాపు ఎక్కువ భాగం అమెరికా, ఇంకా ఇతర యూరోపియన్ దేశాల వాళ్లే.

అయితే, నా వ్యక్తిగత వ్యవహారాలు, కమిట్‌మెంట్ల కారణంగా ఆ ఆలోచన అలా సా..గిపోతూ ఇంకా ఆలోచన స్టేజిలోనే ఉంది. కాకపోతే ఆ స్క్రిప్టు మీద, ఆ చిత్రం ప్రమోషన్, మార్కెటింగ్‌లమీద నాతోపాటు మరో నాలుగు దేశాల క్రియేటివ్ టెక్నీషియన్లు/ఆర్టిస్టు మిత్రులు గత కొద్ది నెలలుగా పనిచేస్తున్నాం. 2014 చివర్లో ఆ చిత్రం ఉంటుంది.  

కట్ టూ ఇప్పటి నా తెలుగు చిత్రాల నేపథ్యం -

ఇప్పుడు నేను పని చేస్తున్న ప్రాజెక్టు - ఒక మూడు మైక్రో బడ్జెట్ చిత్రాల సీరీస్. ఈ సీరీస్ కౌంట్ డౌన్ డిసెంబర్ చివర్లోనే ప్రారంభం కాబోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రతి అడుగూ వేయాల్సివస్తోంది. దీన్ని ఇంకా సాగదీసే అవకాశం లేదు. ఎందుకంటే, దీనికోసం నేను పెట్టుకొన్న నా వ్యక్తిగత డెడ్‌లైన్ కూడా చాలా దగ్గర్లో ఉంది. 

ఈ మూడు చిత్రాలూ పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే, ఒక రకమైన "నట్స్ అండ్ బోల్ట్స్" సిస్టమ్‌లో రూపొందిస్తున్నవి. శాటిలైట్ రైట్స్ వాళ్లు, అవుట్‌రైట్ బయ్యర్స్, ఫైనాన్సియర్స్.. ఇలా ఒక్కొక్కరి వ్యాపార దృక్పథాల్ని, సలహాల్ని బట్టి ఒక్కో నట్టూ, బోల్టూ ఫిట్ చేసుకుంటూ కథలు అల్లాల్సిఉంటుంది. పైగా ఆర్టిస్టులంతా కొత్తవాళ్లు!  

కాదన్నామా - రాత్రికి రాత్రే దర్శకుడు మనోహర్ స్థానంలో ఎవరో "మల్లన్న" వచ్చేస్తాడు! ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అంత రిస్క్ అవసరం లేదన్న నిజాన్ని మీరూ ఒప్పుకుంటారనుకుంటాను.

ఈ యాంగిల్ పక్కన పెడితే - ఏ కొంచెం రిస్కు తీసుకున్నా, నన్ను నమ్మి డబ్బు పెట్టినవాళ్లు కష్టాలపాలవుతారు. వారి సేఫ్టీ, వారి లాభాల గురించి కూడా ఆలోచిస్తూ, "ఇక్కడ ఇంతే" అనుకొని ముందుకు వెళ్లాల్సిందే. నాలుగు డబ్బులు రొటేషన్ చేసుకొని బయట పడాల్సిందే.

ఇప్పడు నేను చేస్తున్నది అదే.
^^^
(My direct email for aspiring Investors : mfamax2015@gmail.com)

Sunday 3 November 2013

ఇప్పుడు సినిమా అంటే ఒక కార్పొరేట్ బిజినెస్!

నిన్న మొన్నటివరకూ సినిమా అంటే ఒక పెద్ద జూదం. హెవీ గ్యాంబ్లింగ్.

ఈ కారణంగానే - ఎవరైనా సరే, సినీ ఫీల్డులో పెట్టుబడి అంటే తెగ భయపడేవారు. పక్కవాళ్లు ఎవరైనా ఫీల్డులో పెట్టుబడి పెడుతున్నారన్నా "వద్దురా బాబూ" అని వారించేవారు.

ఇప్పుడు సీన్ మారింది.

ఇంతకు ముందులా, సినిమా వ్యాపారం అంటే గుప్పిట్లో మూసిన రహస్యం కాదు. ఫిలిం మేకింగ్‌లో - కాన్‌సెప్ట్ స్టేజ్ నుంచి, సినిమా రిలీజ్ అయి, డబ్బుల లెక్కలు పూర్తయ్యే వరకు.. ప్రతి  స్టేజిలోనూ జరిగే వ్యవహారం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలుసు. అంతా "ఓపెన్" అయిపోయింది.

ఇప్పటిదాకా - ఎవరో "కొందరు" మాత్రమే సినిమాలు తీయగలరు.. కొందరివల్ల మాత్రమే అవుతుంది ఈ వ్యాపారం అన్న అపోహ ఇప్పుడు హుష్ కాకి అయిపోయింది. అన్ని వ్యాపారాల్లాగే ఈ వ్యాపారం కూడా అన్న ఆత్మవిశ్వాసం, అవగాహన ఇప్పుడు దాదాపు అందర్లోనూ వచ్చింది.

అంతే కాదు. సినిమా రంగంలో వచ్చే సెలెబ్రిటీ హోదా ఎన్నో చోట్ల ఎంతగానో పనికొస్తుంది. చాలాచోట్ల రెడ్‌కార్పెట్ వెల్‌కమ్ లభిస్తుంది. మరెన్నో ఉపయోగాలున్నాయి. 

ఇదివరకులాగా సినిమా అంటే కోట్లు పెట్టి, భారీ హీరోలతోనే తీయాలన్న రూల్స్‌కి కూడా కాలం చెల్లింది. 30 నుంచి 60 కోట్లు పెట్టి భారీ హీరోలతో అత్యంత భారీగా తీసిన సినిమాలు ఎంత లాభాల్ని అయితే సంపాదించిపెడుతున్నాయో.. కేవలం 40-50 లక్షల్లో, అంతా కొత్తవాళ్లతో తీసిన సినిమాలూ అంతే లాభాల్ని తెచ్చిపెడుతున్నాయి.

ఇదంతా కూడా అందరూ గుర్తిస్తున్నారు.

సినిమా రంగంలో ఉన్నట్టుండి ఇంత భారీ మార్పు రావడానికి ప్రధాన కారణాలు రెండు: మొదటిది.. ఫిలిం మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ. రెండోది.. ఏ ఫీల్డులోనయినా, ప్రతి లేటెస్ట్ సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండకుండా దాచిపెట్టగలిగే కాలం కనుమరుగు కావటం. "థాంక్స్ టూ ఇంటర్‌నెట్!" అన్నమాట ..

ఈ బిజినెస్‌లో ఉన్న 'ప్లస్' ఏంటో గుర్తించారు కాబట్టే, ఇప్పుడు రిలయెన్స్ వంటి కార్పొరేట్ కంపనీలు కూడా ఈ రంగంలోకి ఎంటరయి, భారీ సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్నాయి.

కట్ టూ కొత్త ప్రొడ్యూసర్స్ -

అతి చిన్న పెట్టుబడితో కూడా మీరు సినీ ఫీల్డులోకి ఎంటర్ కావొచ్చు. కో-ప్రొడ్యూసర్ హోదాలో నేరుగా ఫిలిం మేకింగ్‌లోని ప్రతి స్థాయిలోనూ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పాల్గొంటూ తెలుసుకోవచ్చు.

మీరంతా నమ్మలేని ఫినిషింగ్ టచ్ ఏంటంటే - మీ పెట్టుబడి ఎంతయినా కానీ, అది 100% రిస్క్-ఫ్రీ!

ఈ గ్యారంటీ భారీ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రం నిల్! ఇది మీరంతా గమనించాల్సిన నిజం. ఇంక ఆలస్యం దేనికి?

రండి, సినిమా తీద్దాం!

ప్రొడ్యూసర్‌గా/కో-ప్రొడ్యూసర్‌గా "రాత్రికి రాత్రే సెలెబ్రిటీ హోదాతోపాటు - డబ్బుకి డబ్బు, మరెన్నో ఆకర్షణలు .. ఒక్క సినీ ఫీల్డులోనే సాధ్యం" అన్న విషయం మీరే ప్రత్యక్షంగా తెలుసుకోండి..
^^^

నిజంగా, సీరియస్‌గా .. ఫీల్డులోకి ఎంటరవ్వాలన్న ఆసక్తి ఉన్న ఔత్సాహిక / కొత్త ఇన్వెస్టర్లు, కో-ప్రొడ్యూసర్లు, యువ బిజినెస్ మాగ్నెట్లు (మీ ఫోన్ నంబర్‌తో) నన్ను నేరుగా సంప్రదించవచ్చు:  mfamax2015@gmail.com

Saturday 2 November 2013

ఈ గోల్డెన్ లెగ్ రెమ్యూనరేషన్ 2 కోట్లు!

"అత్తారింటికి దారేది" సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆ టీమ్‌లో పనిచేసిన చీఫ్ టెక్నీషియన్లకు, ముఖ్యమయిన ఆర్టిస్టులకూ ఒక్కసారిగా రెమ్యూనరేషన్లు పెరిగిపోయాయి. ఇది సహజం. ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులొస్తాయి. డిమాండ్ లేకపోతే అంతే. నువ్వెవరో నేనెవరో!

అందుకే ఇక్కడందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటారు.  అలా యెవరైనా జాగ్రత్త పడలేదంటే తర్వాత బ్రతుకు బస్టాండే ..

ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు చాలా విలువిస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ (మూఢ) నమ్మకాన్ని ఎక్కువగా పాటిస్తారు.

ఉదాహరణకి మొదట్లో శృతిహాసన్‌కు హిట్లు లేవు. ఐరన్ లెగ్ అన్నారు. హీరోయిన్‌గా ఆమె గ్రాఫ్ పాతాళానికెళ్లింది. తర్వాత "గబ్బర్ సింగ్" హిట్టయ్యింది. సెంటిమెంట్ ఠక్కున తల్లకిందులైపోయింది. గ్రాఫ్ పైపైకి ఎగిసింది. బోలెడన్ని సినిమాలు ఇప్పుడామెకి. ఒక్క తెలుగులోనే కాదు. హిందీలో కూడా. ఇప్పుడు ఏ ఐరన్ లెగ్గూ గుర్తుకురాదు..

సేమ్ టు సేమ్ విత్ ప్రణీత. ఐరన్ లెగ్ అని ఆమెని అస్సలు ఎవ్వరూ  పట్టించుకోలేదు ఈ మధ్య. సపోర్టింగ్ కంటే కాస్తంత ఎక్కువగా ఉండే పాత్రలో "అత్తారింటికి దారేది" చిత్రంలో తనని ఎలాగో ధైర్యం చేసి తీసుకున్నారు. (సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా తీసుకునే సాహసం చేసేవాళ్లు కాదు!).

సినిమా హిట్టు. కట్ చేస్తే ఒక అరడజన్ సినిమాలు ఆమె బుట్టలో పడిపోయాయి. రెమ్యూనరేషన్ చెప్పనక్కర్లేదు. ఆమె డిమాండ్ మేరకు.. ఆమె ఎంత చెప్తే అంత! ఇప్పుడు ఐరన్ లెగ్ అసలు గుర్తుకు రాదు..

కట్ టూ మన గోల్డెన్ లెగ్ -

"ఏ మాయ చేసావె" నుంచి ఇప్పటి వరకూ సమంత సినిమాలన్నీ హిట్లే. ఏదో ఒకటీ అరా తక్కువ రేంజ్‌లో నడవ్వొచ్చు. కానీ మొత్తంగా చూస్తే సమంత సినిమాలన్నీ హిట్లనే చెప్పొచ్చు. ఇంకేముంది.. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా ఎస్టాబ్లిష్ అయిపోయింది.

ఎక్కువమంది భారీ హీరోలందరితో నటించిన ఈ స్టార్ హీరోయిన్‌కు లేటెస్టుగా వచ్చిన భారీ హిట్టు "అత్తారింటికి దారేది." దీంతో ఒక్కసారిగా టాప్ రేంజ్‌కు చేరిన ఈ గోల్డెన్ లెగ్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ అక్షరాలా 2 కోట్లని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

"ఏంటి.. అంతనా!?" అనుకోకండి. అదీ ఇండస్ట్రీ.

స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అందులో లిప్‌లాక్ సీన్లు కూడా ఉన్నట్టు వినికిడి. ఆ లెక్కన సమంతకిస్తున్న 2 కోట్ల రెమ్యూనరేషన్ పెద్ద ఎక్కువేం కాదు.

సో, బి రెడీ ఫర్ ది నెక్‌స్ట్ స్పైసీ లిప్‌లాక్ సీన్ ఆఫ్ సమంత ఆన్ స్క్రీన్ ..  

Friday 1 November 2013

స్మార్ట్ ఫోనే సర్వస్వం!

ఇప్పుడంతా ఫేస్‌బుక్కులూ ట్విట్టర్ల యుగం. అది కూడా, షార్ట్‌కట్‌లో రెండు వాక్యాలు. కుదిరితే ఒక బొమ్మ. అంతకు మించి ఎవరికీ ఏదీ పోస్ట్ చేసే ఓపికల్లేవు. చదివే ఓపికలు అసల్లేవ్!

ప్రాణ స్నేహితులయినా సరే, అతి దగ్గరి ఆత్మీయులయినా సరే.. వ్యక్తిగతంగా కలవటాలు, ఫోన్ చేసుకోవటాలు పూర్తిగా తగ్గిపోయాయి. అంత టైమ్ అసలు ఉండట్లేదు ఎవ్వరికీ! ఫేస్‌బుక్కుల్లో లైక్ చేసి, కామెంట్లు చేయడానికి మాత్రం మస్త్ టైమ్ ఉంటోంది ..

ఈ మధ్యే ఓ హిందీ సినిమా చూశాను. బ్యాచ్‌లర్ రూమ్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ ఇలా ఉంది:

"నా అండర్‌వేర్ ఎక్కడయినా కనిపించిందిరా?"
"గూగుల్ సెర్చ్ చెయ్ .. దొరుకుద్ది!"

అదీ పరిస్థితి!

గూగుల్ సెర్చ్ అనగానే సుమారు రెండేళ్లకిందటి ఇంకో సంఘటన కూడా నాకిప్పుడు గుర్తొస్తోంది..

కట్ టూ హైద్రాబాద్‌లోని చిలకలగూడాలో ఓ సందు -

అతనొక ఛోటా పొలిటికల్ గల్లీ లీడర్. ఏదో పనిమీద నేను కొన్ని నిమిషాలు అక్కడ ముళ్లమీద కూర్చున్నట్టుగా వెయిట్ చేయాల్సి వచ్చింది.

అప్పుడు వాళ్లేదో రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. సడెన్‌గా ఉన్నట్టుండి వాళ్ల చర్చల్లో తమిళనాడులోని ఏదో ఒక ఏరియా పేరు ముందుకొచ్చింది.

అనుచరులు "అక్కడ .. ఇక్కడ" అని చెప్తున్నారు. వినీ వినీ, ఆ లీడర్ ఒక్కటే మాట అన్నాడు:

"అరే .. ఆ "గొల్ల" కొట్రా బై.. ఒక్క సెకన్ల తెలుస్తది!"

ముందు ఈ "గొల్ల" కొట్టడమేంటో నాకర్థం కాలేదు. తర్వాత తెలిసింది. ఆ లీడర్ ఉద్దేశ్యం: "గూగుల్లో కొట్టు" అని!

కట్ టూ స్మార్ట్ ఫోన్ -

ఏది లేకపోయినా బ్రతకొచ్చుగానీ, స్మార్ట్ ఫోన్ లేని బ్రతుకు అసలు బ్రతుకు కాకుండా పోయింది.

డెస్క్‌టాప్‌లూ, ల్యాప్‌టాప్‌లు వాడ్డం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గరా ఇవే ఫోన్లు! ఈమెయిళ్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్.. అన్నీ దాన్లోనే చూసుకుంటున్నారు. అన్నీ దాన్లోనే చేసేసుకుంటున్నారు. 'అంతా' దాంట్లోనే అయిపోతోంది. ఇంతకు మించి విడమర్చి చెప్పాల్సిన అవసరముందంటారా?

నామటుకు నాకు.. సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఇంటర్‌నెట్ లేకుండా - కేవలం ఒక్కటంటే ఒక్క రోజు చాలా ప్రశాంతంగా ఎక్కడయినా గడపాలని ఉంది.

కానీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదు.