Monday 12 April 2021

అందరికీ 'ప్లవ' ఉగాది శుభాకాంక్షలు 🙏

మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రియమైన నా బ్లాగ్ పాఠకులందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 

ఈ తెలుగు సంవత్సరం ఆరంభం నుంచీ మనందరిలో ఆనందం ఇండెక్స్ పైపైకే ఎగరాలనీ, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరగాలనీ, ఆ దిశలో రెట్టించిన ఉత్సాహంతో మనమందరం తగిన కృషి చేయాలనీ, ఇప్పటికే చేయాల్సినవన్నీ చేసేసి హాయిగా రిటైరయి విశ్రాంతి తీసుకుంటున్నవాళ్ళు కూడా మరింత బిందాస్‌గా, ఆరోగ్యంగా ఉండాలనీ, దూరమైన మిత్రులూ బంధువులూ అన్ని ఈగోలూ, గొడవలూ పక్కనపెట్టి ఎప్పట్లా కలిసిపోవాలనీ... మనందరినీ వదలకుండా టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్ వెంటనే పత్తాలేకుండా పోవాలనీ... మనస్పూర్తిగా కోరుకొంటూ...

నా బ్లాగ్ పోస్టులన్నీ ఆయా సందర్భాల్లో నా మూడ్ తీసుకెళ్ళినట్టుగా కదిలి రాసినవి. అత్యధిక భాగం నా వ్యక్తిగత అభిప్రాయాలే. ఆలోచనలే. అనుభవాలే.

తెలియక, ఏ పోస్టులోనైనా ఎవరినైనా లేశమాత్రంగా బాధపెట్టినా మన్నించగలరని మనవి. 

కట్ చేస్తే - 

బ్లాగింగ్ మీద నాకున్న అపరిమిత వ్యామోహానికి పొడిగింపే నా కొత్త వెబ్ మ్యాగజైన్ Manoharam.in.

సినిమాలైనా, సక్సెస్ సైన్స్ అయినా, వ్యక్తిగత అనుభవాలూ ఫీలింగ్స్ అయినా... ఇకనుంచీ నా బ్లాగింగ్ అంతా ఈ మ్యాగజైన్‌లోనే. 

ఎందరో మహానుభావులు... అందరికీ ఉగాది శుభాకాంక్షలతో - 
మీ
- మనోహర్ చిమ్మని 🙏

Friday 9 April 2021

వకీల్ సాబ్ ఎలా ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు?

 
కొంతమంది మేథావులప్పుడే మొదలెట్టారు… పింక్‌లో అమితాబ్ అట్లా చెయ్యలేదు, అమితాబ్ ఇట్లా చెయ్యలేదు అంటూ.

రీమేక్ కథాచర్చల్లో వీళ్లను కూర్చోబెట్టాల్సింది. పాపం దిల్ రాజుకు తెలియదు.

‘సినిమా బాగుంది’, ‘బాగాలేదు’, ‘చెత్తగా ఉంది’… అని చెప్పే హక్కు – టికెట్ కొని సినిమా చూసే ఎవరికైనా ఉంటుంది. కాని, కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళకు “మీరు సినిమా ఇలా తీయాలి, ఇ-లా-గే తీయాలి” అని చెప్పే హక్కు మాత్రం ఎవరికీ ఉండదు.

అలాంటివాళ్లు నిరభ్యంతరంగా వారికిష్టమైన సినిమాలు మాత్రమే చూసుకోవచ్చు… తీసుకోవచ్చు… తీసుకొని చూసుకోవచ్చు. మీరు సినిమా ఇలా తీశారేంటి అని అడగడానికి ఒక్కరు కూడా ఆ వైపు రారు.

Cut back to Pink –

బోనీ కపూర్, దిల్ రాజు, శ్రీరామ్ వేణు, తమన్, పవన్ కళ్యాణ్, నివేతా థామస్, అంజలి, అనన్య… నాకేం చుట్టాలు కారు. సినిమా మాత్రం నాకు చుట్టమే!

అదొక పరిశ్రమ. ఒక కార్పొరేట్ బిజినెస్. కోట్లతో వ్యాపారం.

కమర్షియల్ సినిమాకు మొదటి లక్ష్యం డబ్బు. రెండో లక్ష్యం, మూడో లక్ష్యం కూడా డబ్బే. క్రియేటివిటీ, వినోదం దాని ముడిసరుకు.

పింక్ రీమేక్ పింక్‌లాగే ‘మక్కీ కి మక్కీ’ ఉండాలి అంటే, పింకే మరోసారి చూస్తే చాలు. వకీల్ సాబ్ సినిమా చూసి అది పింక్‌లా లేదు అనటం కమర్షియల్ సినిమా లాజిక్‌కు చాలా దూరం.

అమితాబ్ హిందీ సినిమాను, పవన్ కల్యాణ్ తెలుగు సినిమాను ఒకే మీటర్‌తో ఎలా కొలుస్తారు?

బాలీవుడ్‌లో అమితాబ్‌కు ఉన్న ఇమేజ్ వేరు. అక్కడి మార్కెట్ వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు, మార్కెట్ వేరు.

పింక్ దర్శకుడు ఆ సినిమా తీసేటప్పటి ఆలోచన వేరు. అది హిందీలో హిట్ అయ్యాక – అదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్‌తో రీమేక్ చెయ్యాలన్న నిర్మాతల ఆలోచన వెనకుండే వినోదాత్మక వ్యాపార ఆలోచన వేరు.

పింక్ కమర్షియల్ సినిమానే. వకీల్ సాబ్ కూడా కమర్షియల్ సినిమానే. దేని నిర్మాణ నేపథ్యం దానిది.

పింక్‌లో చర్చించిన వ్యక్తుల ఇండివిడ్యువాలిటీ, సాంఘిక ప్రయోజనం అనే ఆత్మ ఎక్కడికీ పోదు. పోలేదు. మిగిలిన వ్యాపార హంగులన్నీ మాత్రం తప్పవు… తప్పనిసరి కూడా. అలా చేశారు కాబట్టే – వకీల్ సాబ్ ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

పక్కా కమర్షియల్ సినిమాలను సీరియస్ సినిమా దృక్కోణంతో, మేథోపరమైన తూనికరాళ్లతో తూచటం ఏమాత్రం కరెక్టు కాదు.

కట్ చేస్తే –

ఈ సోకాల్డ్ కొంతమంది మేథావుల ఆలోచనలకు అనుగుణంగా సినిమా తీస్తే – థియేటర్ క్యూబ్‌లకు కట్టిన డబ్బులు కూడా రావు. 🙂 🙂

Understand cinema. Enjoy cinema.

Saturday 3 April 2021

నెగెటివిటీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది!

కొన్ని రోజుల క్రితం ఒక బ్లాగ్ రాశాను... ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉంటుంది అని. 

నేను అనుకున్న అంశాన్ని బహుశా ఆ బ్లాగ్ పోస్టులో నేను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయానేమో అనిపించింది.

ఎందుకంటే - స్వతహాగా ఒక శాంతమూర్తి అయిన ఒక బ్లాగర్, బ్లాగ్ కామెంటర్, పెద్ద మనిషి చాలా బాధాకరంగా రియాక్టయ్యారు. నిజానికి అంత అవసరం లేదు. 

ఆ కామెంట్‌ను పోస్ట్ చెయ్యటం కూడా నాకు నచ్చలేదు. నేను రాసిన అంశాలకు, నేను రాసిన దృక్కోణానికీ, ఆ కామెంట్‌లో రాసిన అంశాలకూ అసలు సంబంధం లేదు. నిజానికి అంత సీన్ అక్కడ లేదు. :-)         

నేను ఎవరిని ఉద్దేశించి రాశానో, ఎవరితో నా భావాలు షేర్ చేసుకోవాలని రాశానో - వాళ్ళనుంచి మాత్రం నాకు కావల్సిన, నేను ఊహించిన పాజిటివ్ రియాక్షనే వచ్చింది. 

సినిమాలమీద విశ్లేషణలు చేసేవాళ్ళు చేస్తుంటారు. చీల్చి చెండాడి రాసేవాళ్ళు రాస్తుంటారు... సినిమాలు తీసేవాళ్ళు తీస్తుంటారు.

ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఎవరి ప్రొఫెషన్ వారిది. ఎవరి ఆసక్తి వారిది. 

డబ్బులు పెట్టి సినిమా చూసే ప్రేక్షకునికి - తాను చూసిన ఆ సినిమా బాగుందో, బాగాలేదో చెప్పే హక్కు తప్పకుండా ఉంటుంది. అలా చెప్పవద్దు అని నేనెప్పుడూ చెప్పలేదు, చెప్పను. 

విశ్లేషకుల విషయంలో కూడా అంతే... వారి ప్రొఫెషన్ వారిది. వారి ఆసక్తి వారిది. రాయొద్దు అని ఎలా చెప్తాం? 

సినిమా కథ వెనుక కథలకూ వీరికీ ఎలాంటి సంబంధం లేదు. అయితే - ఈ నేపథ్యం తెలిసినవారు మాత్రం ఇవన్నీ చూసి నవ్వుకుంటారు, జాలిపడతారు, బాధపడతారు. 

ఒక సినిమా హిట్టూ ఫట్టుల విషయంలో ఇంత బాగా విశ్లేషించగలిగే వీరికి విజయాలు చిటికెలో పని. మరి ఎందుకని వీరు ఒక్కటైనా సినిమా తీయలేరు? తీసి అందరి మన్ననలు పొందొచ్చు కదా? కోట్లలో డబ్బు సంపాదించొచ్చుకదా? 

కట్ చేస్తే - 

నా బ్లాగ్ 100% 'నో-హిపోక్రసీ' బ్లాగ్. మాస్కులుండవు. 

ఈ రాతలన్నీ నాకోసం రాసుకుంటున్నాను. నాలాంటి ఆలోచనా దృక్పథం ఉన్న లైక్‌మైండెడ్ మిత్రులకోసం రాస్తున్నాను. 

నెగెటివిటీ, మాస్కులు, హిపోక్రసీ... వీటికి నేను చాలా దూరం.  

జీవితం చాలా చిన్నది. వీలైనంత పనిచేద్దాం. సంతోషంగా ఉందాం. అనుభవిద్దాం. 

ఒడ్డున ఉండి సలహాలు, సూచనలు ఇవ్వడం... సామెతలు, కొటేషన్స్ పోస్ట్ చేయడం చాలా సులభం. అప్పుడప్పుడూ అది నేనూ చేస్తుంటాను. 

కాని, దిగినప్పుడే తెలుస్తుంది అసలు లోతెంతో.  

ఈ చిన్న లాజిక్ మనం మర్చిపోవద్దు. 

"I don't dream at night, I dream at day, I dream all day; I'm dreaming for a living."
- Steven Spielberg 

Make Movies That Make Money!