Sunday 1 December 2019

జీవితం ఏమిటి?

నా టీనేజ్‌లో ఈ పేరుతో ఒక అద్భుతమైన నవల చదివినట్టు నాకింకా గుర్తుంది.

రైటర్ 'కకుభ' అనుకుంటాను.

ఇప్పుడీ టైటిల్ గుర్తుకురావడానికి కారణం, ఒక గంట క్రితమే నేను విన్న ఒక వార్త...

ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయం మీద నిన్న రాత్రి ఒంటిగంటవరకూ నేనూ, నా మిత్రుడూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం.

ఇవాళ ఉదయం మా షెడ్యూలు ప్రకారం తను నాకు ఫోన్ చెయ్యాల్సింది. చెయ్యలేదు.

అప్పుడప్పుడూ ఇది మామూలేకదా అనుకున్నాను.

తర్వాతెప్పుడో మధ్యాహ్నం నుంచి నా మిత్రుడు రెండుసార్లు ఫోన్లో టచ్‌లోకి వచ్చాడు కాని, తనున్న బిజీలో ఎక్కువగా మాట్లాడలేకపోయాడు.

అలా అని నేననుకున్నాను...

కానీ, ఇప్పుడే. ఓ గంటక్రితమే చెప్పాడు నా మిత్రుడు... ఇవ్వాళ ఉదయం తన భార్య చనిపోయిందని!

ఎంతో క్యాజువల్‌గా చెప్పడానికి ప్రయత్నించాడు నా మిత్రుడు. కానీ, గొంతులో ఆ విషాదపు తడిని పూర్తిగా తుడిచేయలేకపోయాడు. 

చావు మనచేతిలో ఉండకపోవచ్చు. మనం అస్సలు ఊహించనివిధంగా జరగొచ్చు. కానీ, ఇలాంటివి జరిగిన సమయంలో కూడా మనం మనంగా ఉండలేకపోతున్నాం. జీవితంలోని విషాదాన్ని కూడా తనివితీరా అనుభవించలేకపోతున్నాం.

ఇదింకా పెద్ద విషాదం.

ఈ షాక్ నుంచి నేనింకా కోలుకోలేదు.

సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా మిత్రున్ని పర్సనల్‌గా కలిసి మాట్లాడేవరకూ బహుశా ఈ షాక్ నుంచి నేను బయటకురాలేకపోవచ్చు.

నా మిత్రుడు, తన భార్య... వాళ్లిద్దరిదో పెద్ద ప్రేమకథ.

మరి నా మిత్రుడెలా ఈ విషాదం నుంచి బయటపడతాడో... బయటపడ్డట్టు ఏ మాస్కు వేసుకుంటాడో...

ఆ రెండోదే జరుగుతుంది... నాకు తెలుసు.  

Wednesday 27 November 2019

Age is just a number!

సుమారు 13 నెలల తర్వాత నిన్న మళ్లీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లాను...

చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషుల పలకరింపు కొంత ఆనందాన్నిచ్చింది. ఈ ఆనందం కోసమేనేమో, బహుశా, చాలారోజుల తర్వాత ఫేస్‌బుక్‌ను మళ్లీ రీ-యాక్టివేట్ చేయాలనిపించింది.

నిన్న నా పుట్టినరోజు సందర్భంగా నా టైమ్‌లైన్ మీద మొట్టమొదటి గ్రీటింగ్ మా రష్యన్ ప్రొఫెసర్ మురుంకర్ సర్ ది కావడం విశేషం.

దాదాపు 77 ఏళ్ల వయస్సులో మురుంకర్ సర్ ఉండేంత యాక్టివ్‌గా చాలా తక్కువమంది ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన లాంబ్రెట్టా స్కూటర్ మీద నేను వెనక కూర్చున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. మొన్నటి నా హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్"లో ఆయన నటించిన ఆ రెండు హాడావిడి రోజులు కూడా గుర్తుకొస్తున్నాయి.

థాంక్యూ సర్...

ఇక్కడివాళ్లతోపాటు - కెనడా, యూ ఎస్, యూకే ఎట్సెట్రా దేశాల్లో ఉన్న ఎన్నారై మిత్రులు కూడా కొందరిని చాలా గ్యాప్ తర్వాత కలుసుకోవడం ఒక అద్భుతమైన ఫీలింగ్.

నిన్న నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రియాతిప్రియమైన నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతాభివందనాలు.

Age is just a number. Forget fucking number and live your life fullest.

ఇకనుంచీ ప్రతిరోజూ, ప్రతి గంటా విలువైందే నాకు.

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొన్ని కమిట్‌మెంట్‌లు, బరువులు, బాధ్యతలు తీర్చేసుకోవాలి.

సో మచ్ టు డూ, సో లిటిల్ టైమ్...

Monday 18 November 2019

నా అభిమాన రేఖ

ఉత్సవ్, సుహాగ్, ముకద్దర్ కా సికందర్, మిస్టర్ నట్వర్‌లాల్, సిల్‌సిలా, ఫూల్ బనే అంగారే, ఖూన్ భరీ మాంగ్, కలియుగ్, కామసూత్ర, దో అన్‌జానే, సావన్ భాదో, ఇజాజత్, ఖూబ్‌సూరత్, ఉమ్రావ్ జాన్...

ఇలా కనీసం ఇంకో ఇరవై సినిమాల పేర్లు నేను ఆగకుండా చెప్పగలను.

ఇవన్నీ రేఖ నటించిన చిత్రాలు.

వరంగల్ ఏవివి హైస్కూల్లో నేను చదివినప్పటి రోజులనుంచి నాకు రేఖ సినిమాలతో పరిచయం.

మా హైస్కూలుకు సరిగ్గా ఎదురుగా... కుడిపక్కన శ్రీనివాస్ థియేటర్, ఎడమపక్కన జెమిని. అలాగే కుడివైపు ఇంకాస్త దూరం హన్మకొండవైపు వెళితే... క్రిష్ణ టాకీస్, అలంకార్, విజయ, అశోక థియేటర్లు. కుడివైపు ఇంకాస్త ముందుకు మా ఇంటివైపు వెళ్తుంటే దుర్గా థియేటర్, కాకతీయ 70 ఎం ఎం, మినీ కాకతీయ, సీతారామ, నవీన్, రామా టాకీస్, సరోజ, రాజరాజేశ్వరి, వెంకట్రామా థియేటర్‌లు. 

అన్నీ ఇప్పటికీ నాకింకా గుర్తున్నాయి. దాదాపు వీటిల్లో ప్రతి థియేటర్‌లో కనీసం ఒక్కటయినా రేఖ నటించిన సినిమా చూసుంటాను.

అప్పట్లో నేను హిందీ సినిమాలు చూడటంలో నాకు కంపెనీ - నా హైస్కూల్ మిత్రుడు ఆకుతోట సదానందం, మా మేనబావ కూచన రమేశ్.

రేఖ నటించిన సుహాగ్ సినిమా కోసం క్రిష్ణ టాకీస్‌లో మూడుగంటలముందే టికెట్స్ కోసం లైన్‌లో నిల్చున్న జ్ఞాపకం నాకిప్పటికీ ఫ్రెష్‌గానే గుర్తుంది. 

అప్పట్లో హిందీ నటీమణుల్లో రేఖ నా ఫేవరేట్.

ఒక ఉత్సవ్, ఒక మిస్టర్ నట్వర్‌లాల్, ఒక సిల్‌సిలా. దేనికదే ప్రత్యేకమైన జోనర్‌లు.

కాని, అన్నిట్లో కామన్‌గా ఒక్కటే అద్భుతం.

రేఖ.

ప్రఖ్యాత నటీనటులు జెమిని గణేశణ్, పుష్పవల్లిల కుమార్తె రేఖ మన తెలుగు అమ్మాయే.

'పద్మశ్రీ' రేఖకు ఇప్పుడు 65 ఏళ్లంటే నమ్మలేం. 

చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో అందంగా, ధారాళంగా మాట్లాడే రేఖ నిన్నటి ఏఎన్నార్ అవార్డ్ ఫంక్షన్‌లో, మన తెలుగువాళ్లు కూడా మాట్లాడలేనంత చక్కటి తెలుగులో మాట్లాడటం నేను ఊహించని ఒక అందమైన అనుభవం.

ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా నా అభిమాన రేఖకు హార్దిక శుభాకాంక్షలు...      

Wednesday 13 November 2019

ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఏదైనా సాధ్యమే!

ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక ఆలోచనకు ఇప్పుడు ఒక రూపం తెచ్చాను. ఆచరణలో పెట్టాను.

ప్రతిస్పందన కూడా బాగుంది.

థాంక్స్ నాకు నేనే చెప్పుకోవాలి. ఇప్పటికయినా ఈ విషయంలో పూనుకున్నందుకు! :)

సో, నాకెంతో ఇష్టమైన ఇంకోపనిని ఇవ్వాళే, కొంచెం సీరియస్‌గా, పూర్తి కమిట్‌మెంట్‌తో మొదలెట్టాను:

ఫిల్మ్ స్కూల్ ఆన్‌లైన్!

పెద్ద పెద్ద కోర్సులు, ప్రాజెక్టుల్నే ఇప్పుడు చాలా సింపుల్‌గా ఆన్‌లైన్‌లో విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. అలాంటిది ఫిల్మ్ కోచింగ్ ఎందుకు సాధ్యం కాదు?

ఆల్రెడీ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీ లాంటివి యూ యస్ లో ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే వాటి నేపథ్యం, శిక్షణాపధ్ధతి వేరు. మన తెలుగు ఇండస్ట్రీకి అవసరమైన శిక్షణ పూర్తిగా వేరు.

ఈ పాయింటాఫ్ వ్యూలోనే ప్రధానంగా నేను కొత్తవారికి కోచింగ్ ఇవ్వదల్చుకున్నాను.

ఫిల్మ్ కోచింగ్ పట్ల ఆసక్తి ఉన్నా, ఫిల్మ్ స్కూల్‌కు వెళ్లడానికి సమయం లేని విద్యార్థులకు, వర్కింగ్ పీపుల్‌కు, హైద్రాబాద్‌కు రాలేనివారికి, ఆల్రెడీ ఇండస్ట్రీలో తిరుగుతూ అక్కడి వాస్తవాలు తెలుసుకుంటున్నవారికి, వెంటనే సినీ ఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఔత్సాహికులు ప్రతి ఒక్కరికీ... నా కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుందని నా నమ్మకం.

ఈ ఆన్‌లైన్ కోచింగ్‌లో అత్యధికభాగం ఈమెయిల్స్, వీడియో కాలింగ్, ఫోన్ కాల్స్ ద్వారా ఉంటుంది కాబట్టి చాలా తక్కువమంది స్టుడెంట్స్‌ను మాత్రమే తీసుకోగలుగుతాను.

'Manohar Chimmani Film School Online' కు సంబంధించిన నా యాడ్‌ / బ్లాగ్ పోస్టులో చెప్పినట్టు... ఈ అవకాశం నేను "ఎన్నిక చేసిన కొద్దిమందికి మాత్రమే!"

పూర్తి వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి:  https://tinyurl.com/y3om9ca5

బెస్ట్ విషెస్... 

Tuesday 12 November 2019

వన్ వే

నాకు తెలిసి 'సినిమా కష్టాలు' పడకుండా ఇండస్ట్రీలో పైకివచ్చినవారు లేరు!

ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంతో టాలెంట్ ఉండి మరెంతో టాప్ రేంజ్‌లోకి వచ్చినా సరే .. ఏదో ఒక టైమ్‌లో, ఏదో ఒక రూపంలో ఈ సినిమా కష్టాలనేవి ఈ రంగంలో ఉండేవాళ్లను తప్పక ఎటాక్ చేస్తాయి.

ఈ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఉండదు.

ఒక టాప్ రేంజ్ హీరోగా తన సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించిన ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నివసించే ఇంటిని బ్యాంక్ వాళ్లు వేలానికి పెట్టే పరిస్థితి వచ్చింది ఒక దశలో.

అప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, బాగా సంపాదించి, ఇంకా అదే రేంజ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ సుమారు 85 కోట్లు పోగొట్టుకొని ఆర్థికంగా ఒక్కసారిగా మైనస్‌లోకి వెళ్లిపోయాడు. మొన్నీమధ్యకూడా "ఇస్మార్ట్ శంకర్" కు ముందు, పూరీ దగ్గర యాభై వేలుకూడా లేని పరిస్థితి గురించి కొన్నిరోజులక్రితం ఆయన పుట్టినరోజునాడు ఒక కార్యక్రమంలో ఛార్మి ఎంతో ఎమోషనల్‌గా చెప్పింది. 

భాయ్‌జాన్ బజ్‌రంగ్, బాహుబలి వంటి భారీ హిట్స్‌తో చరిత్ర సృష్టించిన రచయిత విజయేంద్రప్రసాద్, అప్పట్లో చదివించే స్థోమతలేక తన కొడుకు రాజమౌళి చదువుని ఇంటర్‌మీడియట్‌తోనే ఆపేశారు.

ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చి చరిత్ర సృష్టించిన తర్వాత కూడా, ఒక మేవరిక్ దర్శకుడు, ఆయన టీమ్ .. తమ సొంత బేనర్లో మరో సినిమా చేస్తున్న సమయంలో .. లంచ్‌కి డబ్బుల్లేక బండిమీద రేగుపళ్లు కొనుక్కుని తిన్నారంటే నమ్ముతారా?

ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వగలను.

దీన్నిబట్టి అసలు సక్సెస్‌లు లేనివారి కష్టాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఎవరైనా చాలా ఈజీగా ఊహించవచ్చు.

సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే -

సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!

సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు!!

ఇది నిజం... నేనెప్పుడూ సినిమాఫీల్డులోకి పూర్తిస్థాయిలో దిగలేదు. అయినా సరే, దీన్లోంచి బయటపడాలంటే ఇప్పుడు నాకు జేజమ్మ కనిపిస్తోంది.

దటీజ్ సినిమా.

ఇక... పైనరాసిన మొత్తానికి ఒక పాజిటివ్ ఎపిలోగ్ ఏంటంటే ...

సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే మాత్రం ఏ కష్టాలూ ఉండవు.

బాగా సంపాదించొచ్చు కూడా! 

స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్.'

అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అందరివల్ల కూడా కాదు.

ఒక సరైన గైడ్ లేదా మెంటర్ ఉంటే తప్ప...    

Friday 8 November 2019

50 ఏళ్ల 'అమిత్ జీ' కి శుభాకాంక్షలు!

మన క్రిష్ణానగర్, ఫిలిమ్‌నగర్ వీధుల్లో పోర్ట్‌ఫోలియో ఫోటోలు పట్టుకొని తిరిగే వందలాదిమంది ఔత్సాహిక కొత్త హీరోల్లాగే, అమితాబ్ బచ్చన్ కూడా ముంబైలో సినిమా ఆఫీసులచుట్టూ ఫోటోలు పట్టుకొని తిరిగాడు.

సినిమా ఇండస్ట్రీలో ఆయనకెవరూ చుట్టాల్లేరు. తెలిసినవాళ్లు లేరు. ఎవరి రికమండేషన్ లేదు.

బక్కగా పొడుగ్గా ఉన్న అమితాబ్‌ను చూసి, "నువ్వు హీరో ఏంటి?" అని చాలామంది ఆయన ముఖం మీదే అన్నారు.

అమితాబ్ గొంతును "ఇదేం గొంతు?" అని అసలెవ్వరూ నచ్చలేదు.

1968లో, ఇప్పుడీ బ్లాగ్‌లో మీరు చూస్తున్న ఫోటోతో, ఒక హిందీ సినిమాలో అవకాశంకోసం మొదటిసారిగా వెళ్లిన అమితాబ్‌ను రిజెక్ట్ చేశారు.

50 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు, అదే ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్‌గా అత్యున్నత పురస్కారం "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు"ను అందుకుంటున్నాడు అమితాబ్.

ఒక్క భారతదేశంలోనే కాదు, అమితాబ్‌కు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉన్నారు.

తన అభిమాన హీరో అమితాబ్‌ను కలవడంకోసం,  ఒక రష్యన్ యువతి 27 ఏళ్లు ఓపిగ్గా డబ్బు కూడబెట్టుకొని, ఇండియా వచ్చి అమితాబ్‌ను కలిసివెళ్లింది. డబ్బుకోసం అన్నేళ్లు ఓపిక పట్టలేని ఇంకో రష్యన్ యువతి ఏకంగా డ్రగ్స్ డీల్ చేస్తూ పట్టుపడింది. విషయం తెలిసిన అమితాబ్ ఆ అమ్మాయిని ఓదారుస్తూ మెసేజ్ పంపాడు.

Nothing but Spiritual Connection.

రజనీకాంత్, చిరంజీవి లాంటివాళ్లు స్వశక్తితో సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారంటే అమితాబ్ బచ్చనే ఇన్స్‌పిరేషన్.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అమితాబ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో పెద్ద ఆశ్చర్యంలేదు.

76 ఏళ్ల వయసులో, ఇప్పటికీ యాక్టివ్‌గా తన స్థాయి తగ్గకుండా సినిమాల్లో నటిస్తూ, "కౌన్ బనేగా కరోడ్‌పతి" వంటి టీవీ ప్రోగ్రాంలు చేస్తూ, వందలాది యాడ్స్ చేస్తూ రోజూ యమ బిజీగా ఉంటున్న 'బిగ్‌ బీ' కి  వయస్సు అంటే ఒక అంకె మాత్రమే!

సరిగా 50 ఏళ్ల క్రితం, 7 నవంబర్ 1969 నాడు, అమితాబ్ నటించిన "సాత్ హిందుస్థానీ" రిలీజ్ అయింది.

నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బిగ్ బీ కి శుభాకాంక్షలు.   

Tuesday 5 November 2019

ఒకటికి నాలుగుసార్లు ఎందుకు ఆలోచించాలి?

"One stupid mistake can change everything."

అప్పటిదాకా సాఫీగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా ఒక్క కుదుపుతో ఆగిపోతుంది.

అలాంటి కుదుపుని మనం కలలో కూడా ఊహించం. కానీ, అదలా జరుగిపోతుంది. ఏం చెయ్యలేం. ఏం చేసినా ఆగినచోటనుంచి కదలలేం. లాజిక్కుండదు. మనకే నమ్మశక్యం కాకుండా ఉంటుంది. వందకి వంద శాతం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అసలిలా ఎలా జరిగిందన్నది అర్థంకాదు.

చిన్నదయినా, పెద్దదయినా... ఏదైనా ఒక పని గురించి ఏ ఒక్కరిమీదనో, ఒకే ఒక్క సోర్స్ మీదనో నమ్మకం పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ఆ వ్యక్తిగాని, ఆ సోర్స్ గానీ అత్యంత నమ్మకమైనవే కావచ్చు.

కాని, అనుకున్న విధంగా ఆ ఒక్క సోర్స్ పనిపూర్తిచెయ్యలేకపోతే? ఆ వ్యక్తి సామర్థ్యం ఆ సమయానికి పనికిరాకుండాపోతే?

పని కాదు.

జీవితంలో అత్యంత విలువైన సమయం ఎంతో వృధా అయిపోతుంది.

అప్పుడు నువ్వొక్కడివే కాదు బాధపడేది. అప్పటిదాకా నీమీద నమ్మకం పెట్టుకొన్న, నీమీద ఆధారపడివున్న ఎన్నో సంబంధాలు దెబ్బతింటాయి. 

వ్యక్తిగతంగా ఒక విషయంలో, వృత్తిపరంగా మరొకవిషయంలో ఇలాంటి కుదుపుని నేననుభవించాను. జీవితంలోని ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరూ అనిభవిస్తారు.

కొంచెం ముందూ వెనకా. అంతే. 

అందుకే... కాలిక్యులేటెడ్ రిస్కులు కూడా అప్పుడప్పుడు లెక్కకు అందకుండా దెబ్బకొడతాయన్న నిజం మనం గుర్తుపెట్టుకోవాలి.   

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు, ఒక్కోసారి ఒక్క ఐడియానే జీవితాని అల్లకల్లోలం చేస్తుంది.

ఐడియా ఏదైనా సరే, దాన్ని ఆచరణలో పెట్టేముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి. మనకు నమ్మకం ఉన్న నలుగురితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే తర్వాత బాధపడటానికి కూడా వీల్లేనన్ని కష్టాలలో మునిగితేలాల్సి రావచ్చు.

"If you do 99 things correct, and 1 thing incorrect, people will ignore the 99, and spread the 1 mistake." 

Sunday 3 November 2019

జీవితంలో ఏం జరిగినా జాంతానై

మనల్ని అన్‌కండిషనల్‌గా సరెండర్ చేయించగలిగే శక్తి ఈ ప్రపంచంలో రెండే రెండు విషయాలకు ఉంది:

ఒకటి దేవుడు.

రెండోది డబ్బు.

జీవితంలో ఏం జరిగినా జాంతానై... డబ్బు డబ్బే!

ఈ ఒక్కవిషయంలో ఎలాంటి ఫీలింగ్స్‌కు తావులేదు. బంధువులైనా, మిత్రులైనా, శత్రువులైనా, శ్రేయోభిలాషులైనా.

ఎవరైకైనా సరే, అనుభవిస్తేనేకానీ తెలీని నిజం మన జీవితంలో ఇదొక్కటే.

డబ్బుదగ్గర ఏ లాజిక్కులూ, ఏ నమ్మకాలూ, ఏ వ్యక్తిత్వాలూ, ఏ రిలేషన్లు పనిచేయవు. నిలవవు.

మన అనుభవంలోకి వచ్చేవరకూ ఈ నిజాన్ని మనం అస్సలు నమ్మలేం.

అద్భుతమైన స్నేహసంబంధాలు, బంధుత్వాలు, ప్రేమలూ, వ్యామోహాలు కూడా కేవలం డబ్బుదగ్గరే చిన్న పరీక్షకు కూడా నిలబడవు. నిలువునా కూలిపోతాయి.

ఈ రేంజ్‌లో మనుషుల మధ్య పరీక్షలు పెట్టే శక్తి ఒక్క డబ్బుకి మాత్రమే ఉంది. 

'డబ్బుదేముందిరా బై' అంటారు కొందరు.

చాలా ఉంది.

దేవుడి గుడికి వెళ్లాలన్నా డబ్బు కావాలి. ఆధ్యాత్మికానందంలో మునిగితేలాలన్నాడబ్బు కావాలి.  ప్రశాంతంగా ఒక స్థాయిలో జీవితం గడపాలన్నా డబ్బు కావాలి. కప్పు చాయ్ త్రాగాలన్నా డబ్బు కావాలి. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలన్నా డబ్బుకావాలి.

దటీజ్ ద పవరాఫ్ డబ్బు!

ఈ వాస్తవాలు తెలుసుకొనేటప్పటికి చాలామంది విషయంలో చాలా లేటయిపోతుంది.

జీవితంలో తనకు కావాల్సిన డబ్బుకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్వచనం, ప్రయోజనం, పరిథి ఉన్నప్పుడే మనిషి మనిషిగా ఉంటాడు.

అలా కానప్పుడే, మనిషి యంత్రమవుతాడు. 

విచిత్రమేంటంటే - ఇలా ఒక యంత్రంగా మారిన మనిషికి కూడా, పొద్దునలేస్తే దండం పెట్టుకోడానికి ఒక దేవుడు కావాలి!   

అందుకే ఈ రెండుచోట్లా అన్‌కండిషనల్‌గా సరెండరైపోతాడు మనిషి.   

Saturday 2 November 2019

ఎడిక్టెడ్ టూ బ్లాగింగ్

బ్లాగింగ్ బంద్ చేద్దామని ఒక అయిదారుసార్లు ఇంతకుముందు అనుకున్నాను.

లేటెస్టుగా ఈమధ్యే మొన్న ఆగస్టులో కూడా అనుకున్నాను. ఈ బ్లాగ్‌కు గుడ్‌బై చెప్తూ ఒక బ్లాగ్ పోస్ట్ కూడా పెట్టాను.

అయితే... అప్పటి నా ఆలోచన, నా నిర్ణయం తర్వాత విరమించుకున్నాను. కనీసం ఇంకో సంవత్సరం వరకూ నా ఈ బ్లాగింగ్ హాబీని కొనసాగించాలనుకొంటున్నాను. ఆ తర్వాత విషయం ఇప్పుడే చెప్పలేను.

ఇప్పుడయితే, రోజుకో పదిహేను నిమిషాలయినా ఇట్లా రాయకుండా ఉండలేను.

పనికొచ్చేదో, పనికి రానిదో... ఏదో ఒకటి రోజూ కాసేపు ఇలా రాయడం చాలా అవసరం నాకు. అంతలా ఎడిక్టయ్యాను.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడం కోసం మాత్రం నాకు నిజంగా తప్పనిసరి.

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకు... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్.

ఇంకో కొత్త బ్లాగ్ కూడా ప్రారంభించాను. నిన్నటివరకూ కొన్ని పోస్టులు కూడా రాశాను అందులో. కాని, నాకెందుకో నచ్చలేదు. ఇందాకే డిలీట్ చేసేశాను.

మనోహర్ చిమ్మని రాసే బ్లాగ్ ఒక్కటే ఉండాలి.

నగ్నచిత్రం.

Friday 1 November 2019

ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను!

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

ఈ మాటల్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను.

నీ నమ్మకమే నీ బలం. కొన్ని బలహీన క్షణాల్లో అదే నిన్ను కాపాడుతుంది. కార్యోన్ముఖున్ని చేస్తుంది.

నీ నమ్మకం నీ ఇష్టం. అది ఇంకొకరిని అనుసరించి ఉండాల్సిన పనిలేదు. దాన్ని ఇంకొకరు ఎండార్స్ చెయ్యాల్సిన అవసరం అసలు లేదు. 

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు!

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా.

ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్. 

Sunday 18 August 2019

The Seven-Year Itch ..

ఆగస్టు, 2012 - ఆగస్టు, 2019.

సుమారు 7 సంవత్సరాల సహచర్యం తర్వాత, నాకెంతో ప్రియమైన నా బ్లాగ్ "నగ్నచిత్రం"కు ఈరోజు నిజంగా గుడ్‌బై చెప్తున్నాను.

దస్విదానియా. సయొనారా. గుడ్‌బై. సెలవు.

కట్ చేస్తే - 

"మైండ్ చేంజెస్ లైక్ వెదర్" అన్నారు.

ఇంతకుముందు కూడా బ్లాగింగ్‌కు గుడ్‌బై చెప్పాలని రెండు మూడుసార్లు చాలా గట్టిగా అనుకొన్నాను. కానీ, అంత సులభంగా ఆ పని చేయలేకపోయాను.

కొన్ని అలవాట్లు అంత ఈజీగా వదలవు.

అయితే .. ఇప్పుడు మాత్రం ఏదో ఊరికే అనుకోవడం కాదు. ఈ విషయంలో నిర్ణయం తీసేసుకున్నాను.

అంతా ఒక్క క్షణంలో జరిగింది.

ఇలా అనుకున్నాను .. వెంటనే బ్లాగులో ఈ చివరి పోస్టు రాస్తున్నాను!

హాబీలను మించిన పనులు, ప్రాధాన్యాలు ప్రస్తుతం నాకు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటికి నా బ్లాగ్ కూడా ఉపయోగపడొచ్చు. కానీ .. ఆ పని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌ వంటి సమయం ఎక్కువగా తీసుకోని సోషల్‌మీడియా ద్వారా కూడా సాధ్యమే.

చెప్పాలంటే ట్విట్టర్ ఒక్కటి చాలు.

ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్ లతో పోల్చినప్పుడు దీనికి పట్టే సమయం ఇంకా చాలా చాలా
తక్కువ.

వివిధరంగాల్లో ఉన్న ఎంతోమంది స్టాల్‌వార్ట్స్ ఈ మినీ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎంతో అద్భుతంగా వాడుతున్నారు. నెమ్మదిగా నేనూ అలవాటు చేసుకొంటున్నాను.

కట్ టూ 'సెలెక్టివ్ మెమొరీ' - 

ఈ బ్లాగ్‌లోని కొన్ని ఎన్నికచేసిన బ్లాగ్ పోస్టులతో "నగ్నచిత్రం" పేరుతో తీరిగ్గా, ఒక ఏడాది తర్వాత ఒక పుస్తకం పబ్లిష్ చేసే ఆలోచన ఉంది.

అది కేవలం వ్యక్తిగతంగా నా జ్ఞాపకం కోసం.

దాని పీడీఎఫ్ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పెడతాను. బ్లాగ్ రీడర్స్ ఎవరైనా కావాలనుకొంటే దాన్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.

నా ఇప్పటి అత్యవసర ప్రాధాన్యాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత, మళ్ళీ నా ఆనందం కోసం, నా అలవాటు కోసం, నా ఆరోగ్యం కోసం... మరో కొత్త బ్లాగ్ ప్రారంభిస్తాను.

సో, ఇకనుంచీ ఓన్లీ ట్విట్టర్. 

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. :)

Saturday 17 August 2019

ఈ మత్తు, ఈ హై, ఈ కిక్ .. నాకిష్టం!

యూనివర్సిటీరోజుల నుంచి కథానికలు బాగా రాసేవాన్ని నేను.

అవన్నీ ఆంధ్రభూమి, స్వాతి మొదలైన వీక్లీల్లో ఎక్కువగా వచ్చేవి. దినపత్రికల ఆదివారం అనుబంధం పుస్తకాల్లో కూడా వచ్చేవి. విపుల, రచన వంటి మాసపత్రికల్లో కూడా బాగానే అచ్చయ్యాయి.

నాకు రష్యన్ భాష వచ్చు. రష్యన్ భాష నుంచి నేను నేరుగా తెలుగులోకి అనువదించిన ఎన్నో రష్యన్ కథలు కూడా నావి ప్రచురితమయ్యాయి. అవి ఎక్కువగా విపుల, ఆంధ్రజ్యోతి వీక్లీల్లో వచ్చేవి.

ఆంధ్రభూమిలో కొందరు సీనియర్ రచయితలతో కలిసి ఒక 'చెయిన్ సీరియల్' కూడా రాశాను.

బోలెడన్ని వ్యాసాలు, ఫీచర్లు, నాటికలు వంటివి కూడా రేడియోకు, పత్రికలకు రాశాను.

కొన్ని మాసపత్రికల్లో 'కాలమ్' కూడా రాసాను.

చాలా తక్కువే అయినా కొన్ని కవితలు కూడా రాశాను. అన్నీ వివిధ పత్రికల సాహితీపేజీల్లో వచ్చాయి.

వాటిల్లో ఒకటి, నా ఎమ్మే రోజుల్లో, ఓయూ ఆర్ట్స్‌కాలేజ్ మేగజైన్ లో కూడా అచ్చయింది.

రెండు పుస్తకాలు జర్నలిజం మీద రాశాను. అందులో ఒకటి కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మే స్థాయిలో విద్యార్థులకు రికమండెడ్ బుక్స్ లో ఉంది. ఈ విషయం, అదే యూనివర్సిటీలో పీహెచ్ డీ ఇంటర్వ్యూ కోసం నేను వెళ్లినప్పుడు, నన్ను ఇంటర్వ్యూ చేసిన ప్రొఫెసర్స్ లో ఒకరు చెబితే తెలిసింది.

సినిమా స్క్రిప్ట్ రైటింగ్ మీద ఒక పుస్తకం రాశాను. దానికి నంది అవార్డు వచ్చింది.

ఒక ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ కు సుమారు 700 పేజీల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ రాశాను.

నాకు బాగా తెలిసిన ఇంకో ఫిల్మ్ ఇన్స్ టిట్యూట్ కు కొన్ని ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించిన కోర్సులు రాసిచ్చాను.

ఘోస్ట్ రైటర్ గా సినిమాలకు కనీసం ఒక ఇరవై స్క్రిప్టులు రాశాను. నా సినిమాలకోసం ఇంకో డజన్ స్క్రిప్టులు రాసుకున్నాను.

ఇవన్నీ నేను ఏమాత్రం శ్రమపడకుండా ఆడుతూ పాడుతూ చేశాను.

24 గంటల డెడ్ లైన్ లో కూడా ఒక పూర్తి స్క్రిప్ట్ వెర్షన్ రాత్రికి రాత్రే రాసిచ్చాను. ఎలాంటి వత్తిడి లేదు.

అప్పుడు నాతోపాటు పనిచేసిన కొందరు ఘోస్ట్ రైటర్ మిత్రులు ఇప్పుడు నాలాగే ఫిల్మ్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు, అప్పుడప్పుడూ, పార్ట్ టైమర్లుగా.   

ఇదంతా.. పూర్తిగా నా 'రాత'కు సంబంధించిన రాత.

బైదివే, నా బ్లాగింగ్ హాబీ కూడా రాయడమే! అయితే .. తాత్కాలికంగా ఇప్పుడు బ్లాగింగ్ నుంచి కూడా కొన్నాళ్ళు శెలవ్ తీసుకొనే ఆలోచనలో ఉన్నాను.

బహుశా నా తర్వాతి బ్లాగ్ పోస్టు దాని గురించే ఉండొచ్చు .. 

ఇంక లిస్టు చాలా ఉంది కానీ, ఈ శాంపుల్ చాలు నాకు.

ఏం రాశామన్నది కాదు. ఏం సాధించావన్నది ఇక్కడ పాయింటు.

ఎప్పుడైనా, ఎక్కడయినా చర్చకు నిలిచే పాయింట్ ఇదొక్కటే.

ఒక ఇంట్రాస్పెక్షన్.
ఒక సెల్ఫ్ రియలైజేషన్.
ఒక అంతర్మధనం.
ఒక అవలోకనం ..

కట్ టూ మై ఎడిక్షన్ -

రాయడం నాకిష్టం. చాలా ఇష్టం.

ఎంత ఇష్టమంటే .. ఒక ఎడిక్షనంత ఇష్టం.

ఒక మాండ్రెక్స్ మత్తంత ఇష్టం.

అంత వ్యామోహం. అంత పిచ్చి. అంత ఆనందం.

నేను రాస్తున్నది టిడ్ బిట్స్ లాంటిది కావొచ్చు. ఎందుకూ పనికిరాని చెత్తాచెదారం కావొచ్చు. ఎక్కడో ఏ కొంచెమో కాస్త పనికొచ్చే ఏదైనా మంచి విషయం కూడా కావొచ్చు.

కానీ, అలా రాస్తున్నంత సేపూ నన్ను నేను మర్చిపోతాను. నా పీకలమీదున్న ఎన్నో కష్టాల్ని, వత్తిళ్లని కూడా పూర్తిగా మర్చిపోతాను.

ఒక మత్తులో మునిగిపోతాను.

ఆ మత్తు అలాగే ఉండిపోతే బాగుండు అనిపించేంత ఆనందంలో మునిగిపోతాను...

దురదృష్టవశాత్తు, ఈ ఆనందాన్ని నేనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఈ పొరపాటు చేయకపోయుంటే తప్పకుండా నేనొక మంచి పాపులర్ రైటర్ అయ్యుండేవాన్ని.

కానీ, ఎందుకో అలా అనుకోలేదెప్పుడూ.

కట్ టూ మై ఫస్ట్ లవ్ -

నాకెంతో ప్రియమైన ఈ రాసే అలవాటుని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ అలవాటు మాత్రం నన్నెప్పుడూ కంటికిరెప్పలా చూసుకొంది.

ఒక నిజమైన స్నేహితునిలా, ఒక ప్రేయసిలా, ఒక తల్లిలా.

కనీసం ఓ రెండు సార్లు .. చావు అంచులదాకా వెళ్లిన నన్ను కాపాడి బ్రతికించింది.

అనుక్షణం నా వెంటే ఉంది.

ఇప్పటికీ.

Friday 16 August 2019

ఎలైట్ సోషల్ మీడియా .. ఏం రాసినా 280 క్యారెక్టర్స్‌లోనే!

నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక దాదాపు అర్థ దశాబ్దం దాటింది.

దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.

నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.

క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!

నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను గతంలోలాగా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.

టీవీ, న్యూస్‌పేపర్‌లను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నవారిలో కూడా ఎక్కువశాతం మంది వాటిని ఎక్కువగా మొబైల్స్‌లోనే చూస్తున్నారు, చదువుతున్నారు.   

సో, ఇప్పుడంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే...

ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే.

కట్ చేస్తే -

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్... నాకు తెలిసి ఈ మూడే సోషల్‌మీడియాలో టాప్.

ఫేస్‌బుక్ మొదట్లో ఎంతో కొంత ఇష్టంగానే అనిపించేది నాకు. రోజుకి ఓ ఇరవై, ముప్పై నిమిషాలు ఎఫ్ బీ మీద గడిపేవాణ్ణి.

ఇప్పుడది నాకొక ఫిష్‌మార్కెట్‌లోని కాకిగోలలా అనిపిస్తోంది.

గత అక్టోబర్ నుంచి FB వైపు వెళ్లటంలేదు నేను.

ట్విట్టర్ బాగుంది...

'ట్వీటిన'తర్వాత మళ్లీ అటువైపు మనం చూడాలనుకొంటేనే  చూస్తాం. లేదంటే లేదు.

మనం ఏ చెత్త రాసినా, ఏ మంచి రాసినా 280 క్యారెక్టర్స్‌లోనే రాయాలి.

మెదడుకి మేత...

అన్నిటినీ మించి, నిజంగా మనలో సత్తా ఉంటే... ప్రపంచంలో ఏ రంగంలోనయినా, ఏ స్థాయి వ్యక్తితోనయినా ట్విట్టర్ ద్వారా కాంటాక్ట్ చాలా సులభం.

ఎక్కువ సమయం వృధా కాదు.

ఓ పది ట్వీట్లు పెట్టినా పది నిమిషాలకంటే పట్టదు.

ఇలాంటి కొన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ట్విట్టర్‌ను "ఎలైట్ సోషల్ మీడియా" అన్నారు.

ఇన్నిరోజులూ పట్టించుకోలేదుగానీ, ట్విట్టర్ నాకు బాగా నచ్చింది.     

Thursday 15 August 2019

మట్టితో గద్దెకట్టిన నాటి పంద్రాగస్టురోజులేవీ?

నా చిన్నతనంలో పంద్రాగస్టు అంటే నిజంగా ఒక పండగే.

కనీసం ఒక మూడు రోజులు వరంగల్‌లోని మా ఇంటిచుట్టూ పెద్ద సందడి.

చెప్పలేనంత హడావిడి ..

జెండాగద్దె సరిగ్గా మా ఇంటిముందే!

పంద్రాగస్టుకు, చబ్బీస్ జనవరికి ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫ్రెష్‌గా రాగడిమట్టి తెచ్చి తడితడిగా గద్దె కట్టాల్సిందే.

తర్వాత ఎర్రమట్టితో అలకాల్సిందే ..

సలేందర్, ప్రతాప్, స్వామి, శంకర్, భిక్షపతి .. ఇంకో పదిమంది ఆనాటి యువతరం ఒక గ్రూప్. వయసులో వీళ్లకంటే కొంచెం చిన్నవాడయినా.. మా అన్న దయానంద్ కూడా ఇదే గ్రూపు.

ఈ గ్రూపంతా కలిసి వారం ముందునుంచే చందాలు వసూలుచేసేవాళ్లు.

రాత్రి పొద్దుపోయేవరకూ మా ఇంటిముందున్న అరుగులపైన కూర్చుని - కనీసం వారం పదిరోజుల ముందునుంచే "ఈసారి జెండావందనం కొత్తగా ఎలా చేయాలి" అన్నదానిమీద ఈ గ్రూపంతా చర్చలు జరిపేవాళ్లు.

నేనూ, నా చిన్న గ్రూపు కూడా అక్కడే వాళ్ల చుట్టూ నిల్చుని అవన్నీ ఆసక్తిగా వింటూవుండేవాళ్లం.

మా వీధి మొత్తంలో అప్పుడు మా ఇల్లే చాలా పెద్దది.

జెండాను ఎగురవేసే గద్దె కూడా సరిగ్గా మా ఇంటిముందే ఉండటంతో దానికి సంబంధించిన ప్రతి పనీ, ప్రతి సడీ మాకూ తెలిసేది.

జెండావందనం కోసం కొనుక్కొనివచ్చిన రంగురంగుల జెండా కాగితాలు, ఇతర వస్తువులన్నీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టేవాళ్లు. కొబ్బరికాయలు, పండ్లు, చాక్లెట్లతోసహా! 

వీధి ఈ చివరినుంచి ఆ చివరిదాకా - ఎన్నో వరుసలు సుతిలితాడు కట్టి, మైదాపిండితో చేసిన "లై"తో, చిన్నపిల్లలం మేము అందిస్తుంటే, ఈ పెద్దవాళ్లు జెండాలు అతికించేవాళ్లు. తర్వాత ఈ జెండాల్నే వీధంతా తోరణాలుగా కట్టేవాళ్లు.

జెండావందనం రోజు నిజంగా పెద్ద పండగే.

ముందురోజు రాత్రే ఫ్రెష్‌గా తెచ్చిన మట్టితో అప్పటికప్పుడు మూడు అంచెల్లో గద్దె తయారయ్యేది. ఎర్రమట్టితో దానికి కోటింగ్ కూడా!

తెల్లవారకముందునుంచే మైకులో గ్రామఫోన్ రికార్డ్ పాటలు. దేశభక్తి పాటలు, భగవద్గీత.

గ్రూపులో ఒక్కో సంవత్సరం ఒక్కోరు జెండా ఎగురవేసేవారు.

తర్వాత స్వీట్లు, కొబ్బరి, చాక్లెట్లు అక్కడున్న మా అందరికేకాదు..ఇంటింటికి వెళ్లి మరీ పంచేవాళ్లు.

కట్ టూ ప్రెజెంట్ - 

అప్పటి ఆ యువతరం గ్రూపులో కొందరు ఇప్పుడు లేరు. ఉన్నవాళ్లు ముసలివాళ్లయిపోయారు.

ఆనాటి ఆ మట్టి జెండాగద్దె ప్లేస్‌లో ఇప్పుడు ఒక పర్మనెంట్ సిమెంట్ గద్దె ఉంది.

ఎలా చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఆనాటి సీరియస్‌నెస్ ఇప్పుడు లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

అప్పటి దేశభక్తి వేరు. అప్పటి స్వఛ్ఛత వేరు. అప్పటి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలు.. అన్నీనిజంగా వేరే.

ఎన్నో ఏళ్లతర్వాత, ఈరోజు, ఇలా .. వరంగల్లోని నా చిన్ననాటి పంద్రాగస్టు గురించి ఇట్లా నెమరేసుకుంటున్నానంటే .. నిశ్చయంగా క్రెడిట్ గోస్ టూ కేసీఆర్ ..

మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదు. మంచి వాతావరణం, మంచి జ్ఞాపకాలు కూడా! 

Wednesday 14 August 2019

ఒక సంచలన నిశ్చలత్వం

కొన్ని ఊహించం మనం.

నిజంగా.

ఏదో చిన్న అసైన్‌మెంట్ అనుకున్నదీ, అంతకు ముందు ఎన్నోసార్లు అలవోగ్గా చేసిందీ ... ఏకంగా ఓ రెన్నెళ్ళపాటు ఇలా సాగుతుందని నిజంగా ఎన్నడూ అనుకోలేదు నేను.

అదీ ఇంటికి దూరంగా.

హైదరాబాద్‌కు దూరంగా.

వ్యక్తిగతం, వృత్తిగతం, భౌతికం, సామాజికం, ఆర్థికం, ఆధ్యాత్మికం ... అన్నిటినీ ప్రభావితం చేస్తూ, ఒక రెండునెలలపైనే.

ఎంత రొటీన్ జాబ్ అయినా, నా వృత్తిలో భాగమే అయినా ..  ఏరకంగా చూసినా, ఇదంత చిన్న విషయం కాదు.

గత ఏడెనిమిది నెల్లలోనే, ఇలాంటి ఊహించని ఆలస్యాలు జరగటం ఇది మూడోసారి అంటే .. నేనే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది నాకు.       

కట్ చేస్తే - 

ఇదంతా నాణేనికి ఒకవైపే.

రెండోవైపు ఇంకో పెద్ద ఊహించని సెన్సేషన్ ...

ఇన్ని దశాబ్దాల నా అనుభవంలో ఎన్నడూ ఎదుర్కోని ఓ అతి చిన్న సాంకేతిక సమస్యలో కదల్లేనంతగా నేను ఇరుక్కుపోవడం!

నాకు నేను ఏం చెప్పుకొన్నా, నమ్మలేని విధంగా రోజులు, వారాలు గడుస్తుండటం ..

ఇలా .. ఇంత నిస్తేజంగా .. ఇంత చలనరహితంగా .. వస్తూ పోతూ .. వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ .. ఒక 70 రోజులు నింపాదిగా, నిస్తేజంగా గడచిపోవడం అనేది నిజంగా ఒక జీర్ణించుకోలేని నిజం.

మరోవైపు, ఇంకో 41 రోజుల్లో నా కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఆ పనులు చకచకా ముందుకు కదుల్తున్నాయి. ఆ ప్రిప్రొడక్షన్ పనుల్లోనే నేనూ, నా టీమ్ తలమునకలై ఉన్నాము.

ఇంక మిగిలిన పనులు అవే ఊపందుకొంటాయి.

ఈరోజునుంచీ ... 

సో, వాటిగురించి ఎలాంటి బెంగలేదు.

కట్ టూ జీవితం -

ప్రవాహం దాని సహజ లక్షణాన్ని ఎప్పుడూ మర్చిపోదు ..

మనమే ఎక్కడో పొరపాటుపడతాం. మన నిర్ణయాలే ఎక్కడో తడబడతాయి.

ఎక్కడో ఏదో చిన్న లాజిక్ మిస్ అవుతుంది.

అదే జీవితం.

ఏకోణంలో చూసినా, అప్పుడప్పుడూ ఇలాంటి ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ రియలైజేషన్ చాలా అవసరం.

ముఖ్యంగా నాలాంటివాడికి ... 

Wednesday 5 June 2019

బ్లాగర్స్ బ్లాక్‌ను బ్రేక్ చేయడం ఎలా?

వైజాగ్‌లో ఉన్న నాకత్యంత ప్రియమైన ఒక ఫ్రెండ్‌కు పొద్దున్నే "ఈద్ ముబారక్" మెసేజ్ పెట్టాను. ఏదో ఒక సందర్భంలాంటి సాకు దొరికింది కాబట్టి.

బ్లూ టిక్ వచ్చింది.

"సేమ్ టూ యూ లేదు" లేదు. రిప్లై లేదు.

ఇది అనుకున్నదే.

జీవితంలోని ఏదో ఒక దశలో ఇలాంటి జెర్క్‌లు ఎవరికైనా తప్పవనుకుంటాను...

కట్ టూ రైటర్స్ బ్లాక్ - 

వ్యక్తిగతమయిన, వృత్తిగతమైన అనేక టైమ్‌బౌండ్ కమిట్‌మెంట్‌ల వత్తిడిలో అస్సలు సమయం లేక, సమయం మిగుల్చుకోలేక .. ఈమధ్య నేను నా బ్లాగ్‌ని దాదాపు పూర్తిగా మర్చిపోయాను.

ఎప్పుడైనా ఏదో ఒకటి రాద్దామని లాపీ ఓపెన్ చేసినా, అసలేం కదలట్లేదు. 

'రైటర్స్ బ్లాక్' లాగా 'బ్లాగర్స్ బ్లాక్' అన్నమాట! 

థాంక్స్ టూ మై ఫ్రెండ్ .. ఈ బ్లాగర్స్ బ్లాక్‌ను బ్రేక్ చేయడంకోసమే పైన ఈద్ ముబారక్ టాపిక్‌తో ఈ పోస్టు రాయడం మొదలెట్టాను.

ఇప్పుడు కదిలింది...

బ్యాక్ టూ మై బ్లాగింగ్ -

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయలేదీ మధ్య.

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం .. నిజంగా పెద్ద నేరం.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడంకోసం మాత్రం ఇది నాకు నిజంగా తప్పనిసరి.

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకూ .. ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్.

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు.

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నాకు సంబంధించినంతవరకు నిజంగా నేరమే.

ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను.

అదో పెద్ద జోక్.

అయితే - జీవితంలో ఏవైనా ఊహించని జెర్క్‌లు వచ్చినప్పుడు నిజంగా నన్ను కాపాడేది ఈ థెరపీనే. ఈ యోగానే.

ఇది మాత్రం జోక్ కాదు... 

Tuesday 4 June 2019

ఇంకేం కావాలి?

గత 48 గంటల్లో సుమారు 20 గంటలు ప్రయాణం చేశాను.

మళ్లీ పొద్దున్నే 6 గంటలకు అలార్మ్ పెట్టుకొని లేచి బయటపడ్డాను.

చాలా ముఖ్యమైన పని. ఎన్నోరోజులుగా సాగుతోంది. ఎదుటివారెవ్వరూ నమ్మలేనంత సిల్లీగా, అసహ్యకరంగా, అతి చెడ్డగా ఆ పని అలా సా....గు...తూ....నే ఉంది.

ఇవ్వాళ ఖచ్చితంగా ఆ పనికి ఫుల్‌స్టాప్ పడుతుందని తెలుసు. అయితే - గత కొద్దినెలల రొటీన్ ప్రకారం, చివరి నిముషంలో రాకూడని ట్విస్ట్ ఏదో ఒకటి వచ్చి, పని ఆగిపోవచ్చునని కూడా తెలుసు.

నేను రెండింటికీ ప్రిపేర్ అయి ఉన్నాను.

సో నో వర్రీస్. 

ఇవాళ కాకపోతే రేపు.

రేపు రంజాన్ హాలిడే కాబట్టి ఇంకొక్కరోజు. బస్, అంతే.

ఈ పనికి ఖచ్చితంగా ఫుల్‌స్టాప్ పెడుతున్నాను.

ఇంకో రెండుమూడురోజుల్లో ఇంకెన్నో పనికిమాలిన, కోరితెచ్చుకొన్న, నానారకాల తలనొప్పులన్నిటికీ పూర్తిగా గుడ్‌బై చెప్తున్నాను. 

కట్ చేస్తే - 

నేను. నా ఇష్టం.

ఎలాంటి డిజిటల్ డిస్టర్బెన్సులు లేని సింపుల్ లైఫ్. 

ముఖ్యంగా నో వాట్సాప్. నో ఫేస్‌బుక్.

ఇంకేం కావాలి?  

Monday 13 May 2019

ఒక నిర్ణయం విలువెంత?

నాకత్యంత ప్రియమైన ప్రపంచస్థాయి నవలారచయితల్లో బుచ్చిబాబు ఒకరు.

ఆయన రాసిన ఒకే ఒక్క నవల .. "చివరకు మిగిలేది".

"గడ్డిపోచ విలువెంత?" అన్న సింపుల్ వాక్యంతో ఆ నవల ప్రారంభమవుతుందని  నాకింకా గుర్తుంది. అదిక్కడ కోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నిర్ణయమో చివర్లో చూద్దాం.

కట్ టూ మన నిర్ణయాలు - 

జీవితంలోని ప్రతిదశలోనూ ఎప్పటికప్పుడు వందలాది నిర్ణయాలు తీసుకుంటూవుంటాం మనం.

ఇష్టమైన పెన్ కొనుక్కోవడం నుంచి, పెళ్లిదాకా.
ఏదో ఓ కోర్స్ చదివి, మరేదో ఉద్యోగంలో చేరేదాకా.
ఏదో ఓ లోపల్లోపలి అతిచిన్న గోల్‌తో మరేదో ఇష్టంలేని ప్రొఫెషన్‌లో చేరి, అందులోంచి బయటికి రావాలనుకొన్నా రాలేనంత 'పీకల లోతు' ఇరుక్కునేదాకా.

జీవితమంతా ఎన్నో నిర్ణయాలు.

చిన్నవీ, పెద్దవీ.

కానీ, మనం తీసుకొన్న ఒక నిర్ణయం తప్పని తర్వాత తెలిసినా .. వెంటనే దాన్ని సరిచేసుకొనే మరో కొత్త నిర్ణయం తీసుకోలేనప్పుడే అసలు చిక్కంతా!

కట్ బ్యాక్ టూ మన గడ్డిపోచ - 

ఎవరో ఏదో అనుకుంటారనో, అందరి దృష్టిలో బాగుండాలనో, ఇంకెవరిలాగానో ఉండాలనో .. ఇష్టం లేకపోయినా, ఈగో అడ్డొచ్చినా, ఎంత కష్టమయినా .. ముందు తీసుకున్న ఒకానొక నిర్ణయానికే కట్టుబడి ఉండటం అనేది ఓ పెద్ద తప్పుడు నిర్ణయం!

విషయం చిన్నది కావొచ్చు, పెద్దది కావొచ్చు. ఫలితాల్నిబట్టి ఎప్పటికప్పుడు తమ నిర్ణయాల్ని మార్చుకోలేనివారు ఎవరైనా సరే వారి జీవితంలో చాలా కోల్పోతారు. లేదా జీవఛ్చవంలా బ్రతుకుతుంటారు. పరోక్షంగా మరెందరి జీవితాలో ప్రభావితం కావడానికి కారణమవుతారు.
ఈలోగా జీవితం తెల్లారిపోతుంది.

ఇలా జీవితాల్ని తెల్లార్చుకొనేవారు సమాజంలో 99% ఉంటారు. మిగిలిన ఆ ఒక్క శాతం మంది మాత్రమే ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని మార్చుకొంటూ సిసలైన గట్స్‌తో ముందుకెళ్తుంటారు. అనుకున్న జీవితాన్ని అనుభవిస్తుంటారు.

అదీ తేడా.

ఈలెక్కన మనం తీసుకొనే ఒక నిర్ణయం విలువెంత?

ఒక గడ్డిపోచంత.     

Sunday 12 May 2019

హాపీ బర్త్‌డే, ప్రియతమ్!

ఈ బ్లాగ్ రాయడం పూర్తిచేసి, పోస్ట్ చేసేటప్పటికి మా అపార్ట్‌మెంట్స్ ముందు ఈ అర్థరాత్రిపూట మస్త్ అల్లరి ఉంటుంది.

మా చిన్నబ్బాయి ప్రియతమ్ పుట్టినరోజు రేపు.

వాడి క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ అంతా వచ్చి వాన్ని కిందకు తీసుకెళ్తారు.

ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఈ అర్థరాత్రి "బర్త్‌డే బంప్స్" పేరుతో వాడి వీపు విమానం మోత మోగించటం వగైరా అంతా తెలిసిందే.

కట్ చేస్తే -

మా ఇద్దరబ్బాయిల్లో ప్రియతమ్ చిన్నోడు.

ఈసారి వాడి బర్త్‌డే రోజు నేను గుంటూరులో ఉన్నాను. ఈ బర్త్‌డేకు వాడికి ప్రామిస్ చేసినవాటిని సమయానికి సమకూర్చలేకపోయాను.

ఇందాకే ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను, "ఫైన్ కింద డబల్" ఇస్తానని.

సరే అన్నాడు.

సుమారు ఏడేళ్ళక్రితం ఒక యాక్సిడెంట్లో నేను తీవ్రంగా గాయపడ్డాను. ఒక ఎనిమిది నెలలపాటు బెడ్ పైనే రెస్ట్ తీసుకోవాల్సివచ్చింది.

ఫిజియోథెరపిస్ట్ ఇంటికొచ్చి సర్జరీ అయిన నా కాలుని వంచడానికి కొన్ని ఎక్సర్‌సైజులు చేయించేవాడు. ఆ ఫిజియోథెరపిస్ట్ చెప్పినట్టుగా ప్రియతమ్ మిగిలిన రెండుపూటలూ చాలా ఓపిగ్గా నాచేత ఎక్సర్‌సైజులు చేయించేవాడు.

అప్పుడు వాడి వయసు పన్నెండేళ్లే.

చిన్నప్పటినుంచీ నేనంటే వాడికి చాలా కన్సర్న్.

ఇప్పుడు పంతొమ్మిది దాటి, ఇరవైలోకి ప్రవేశిస్తున్నా వాడిలో నాపట్ల అదే కన్సర్న్, అదే ప్రేమ.

ఏం మారలేదు.

బహుశా దూరంగా ఉన్నాననేమో, వాడికి సంబంధించిన ఇంకెన్నో విషయాలతోపాటు, వాడి బర్త్‌డే రోజు, అప్పటి ఈ జ్ఞాపకం కూడా నెమరేసుకొంటున్నాను.

బర్త్‌డే గిఫ్ట్‌గా, ప్రియతమ్ కోసం ఈరోజే ఆన్‌లైన్‌లో నేనొక యాక్టివిటీ ప్రారంభించాను. దాన్ని పూర్తిస్థాయిలో సెటప్ చేసేసి, ఈ నెలాఖరుకి వాడికి అప్పగిస్తాను.

ఇంకో 90 రోజుల తర్వాతనుంచి నేను వాడికి పాకెట్ మనీ ఇవ్వాల్సిన పనుండదు. అవసరమైతే వాడే నాకెప్పుడయినా అడ్జస్ట్ చేయొచ్చు.

వాడి చదువుకి ఇది ఏమాత్రం అడ్దంకి కాదు. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వారానికో నాలుగు గంటల సమయం దీనికి కెటాయిస్తే చాలు.

తన ఇరవయ్యవ పుట్టినరోజునాటికే మా ప్రియతమ్ ఒక "ఇన్‌ఫొప్రెన్యూర్" అవుతుండటం నాకు ఆనందంగా ఉంది.              

హాపీ బర్త్‌డే చిన్నూ...   

Sunday 28 April 2019

ఓయూ అనగానే ఒక ఆనందం

ఓయూ .. ఒక మధురస్మృతుల మాలిక. ఒక ఉద్వేగం. ఒక ఆనందం.

ఫ్రేమ్ బై ఫ్రేమ్ .. ఎన్నో జ్ఞాపకాలు చక చకా అలా నా కళ్లముందు కదిలిపోతుంటాయి.

ఫోటో తీసుకున్నప్పుడల్లా ఒక కొత్త అందంతో కనిపించే ఆర్ట్స్ కాలేజి. అందులో నేను చదివిన ఎం ఏ, ఎం ఎల్ ఐ ఎస్సీ. సాధించిన రెండు గోల్డ్ మెడల్స్ ..

పార్ట్ టైమ్‌గా అదే ఆర్ట్స్ కాలేజ్‌లో నేను ఎంతో ఇష్టంగా చదివిన మూడేళ్ల రష్యన్ డిప్లొమా. అందులోనూ నేనే యూనివర్సిటీ టాపర్ కావడం ..

ఎమ్మేలో నా గురువులు నాయని కృష్ణకుమారి, కులశేఖరరావు, గోపాలకృష్ణారావు, ఎస్వీ రామారావు, కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, సుమతీ నరేంద్ర, గోపి గార్లు ..

టైపిస్ట్ శశికళ, అటెండర్ ఫక్రుద్దిన్ ..

లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లో నా గురువులు ఎ ఎ ఎన్ రాజు, వేణుగోపాల్, లక్ష్మణ్ రావు, జనార్ధన్ రెడ్డి, జగన్ మోహన్, సుదర్శన్‌రావు గార్లు ..

రష్యన్ డిప్లొమాలో నా గురువులు మురుంకర్, కల్పన, ప్రమీలాదేవి గార్లు ..

నా క్లాస్‌మేట్స్, నా ఫ్రెండ్స్ ..

రష్యన్ డిప్లొమాలో తెలుగు మాట్లాడని నార్తిండియన్ సిటీ అమ్మాయిలు ..

నేనున్న ఏ హాస్టల్, మంజీరా హాస్టళ్లు ..

ఏ హాస్టల్లో రూమ్ నంబర్ 6, రూమ్ నంబర్ 55 ..

నా ఆత్మీయ మిత్రులు "బిగ్ ఫైవ్", మా యాకూబ్, మా గుడిపాటి, మా కాముడు ..

ఏ హాస్టల్ మెస్, పుల్లయ్య, పొద్దున చపాతీలు, ఆమ్‌లెట్, మధ్యహ్నం భోజనంలో అన్ని కూరలతోపాటు చిన్న ప్లేట్‌లో మటన్ ముక్కలు, సండే స్పెషల్, సంవత్సరానికోసారి 'మెస్ డే' రోజు కోడికి కోడి తినడాలు .. చివర్లో స్వీట్ పాన్‌లు ..

క్యాంపస్‌లో మెయిన్ క్యాంటీన్, ఆర్ట్స్ కాలేజ్‌ వెనుక చెట్లకింది క్యాంటీన్ ..

రాత్రిళ్లు హాస్టల్ వెనకాల బండలమీద నర్సిమ్మ తడికల క్యాంటీన్‌లో ఆమ్‌లెట్ తిని చాయ్‌లు తాగడం, అర్థరాత్రి దాటేదాకా అవే బండలమీద కూర్చొని సిగరెట్లమీద సిగరెట్లు కాలుస్తూ కవిత్వాలూ, కబుర్లూ, చర్చలూ, కొట్లాటలు, తిట్టుకోడాలు ..

గంటలకొద్దీ కూర్చొని గడిపిన ఆర్ట్స్ కాలేజ్ లాన్స్, మెయిన్ లైబ్రరీ మెట్లు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్ చెట్లనీడలు ..

టాగోర్ ఆడిటోరియంలో ఫంక్షన్లు, సినిమాలు ..

ఆడిటోరియం వెళ్లేదారిలో సన్నని గోడపైన సర్కస్ చేస్తూ నడిచిన రాత్రులు ..

క్యాంపస్ గోడ దూకి వెనకే వున్న ఆరాధన థియేటర్లో వారం వారం సినిమాలు, ఈలలు, పెడబొబ్బలు ..

తెరమీద "అచ్చా అచ్చా .. బచ్చా బచ్చా" పాట వస్తున్నప్పుడు రెచ్చిపోయి లేచి ఎగరడాలు ..

టికెట్ దొరకనప్పుడు మేనేజర్ రూమ్‌లోకి వెళ్లి గొడవపడటాలు .. 

స్టుడెంట్ యూనియన్‌ల మీటింగులు, గొడవలు, తలలు పగిలి రక్తాలు కారే కొట్లాటలు, తపంచాలతో కాల్పులు ..       

ఒరిస్సా, వైజాగ్, అరకు, బెంగుళూరు, మైసూరు, ఊటీ, కొలనుపాక .. విహార యాత్రలు ..

కోర్సులు పూర్తయ్యాక, ఒక్కో మిత్రుని వీడ్కోలు అప్పుడు ఆగని కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడ్వటాలు .. 
ఇంకా ఎన్నో .. ఎన్నెన్నో .. అన్నీ .. ఈరాత్రి గుర్తుకొస్తున్నాయి.

మిత్రులారా నేనిక్కడ. మరి .. మీరెక్కడ? 

Friday 26 April 2019

ఇది బయోపిక్‌ల సీజన్

ఏదో తీయాలని చెప్పి బయోపిక్ తీయడం వేరు. 

ఒక తక్షణ తాత్కాలిక అవసరమో, మార్కెట్‌నో దృష్టిలో పెట్టుకొని బయోపిక్ తీయడం వేరు. 

కోట్లాదిమంది ప్రజల ఆలోచనలను, జీవితాలను అమితంగా ప్రభావితం చేసిన ఒక వ్యక్తి జీవితాన్ని తెరపైన ఆవిష్కరించడం వేరు.           

ఈమధ్య ఒక్క ఎన్ టి ఆర్ మీదనే ఏకకాలంలో మూడు బయోపిక్‌ సినిమాలు తయారయ్యాయి. 


క్రిష్ దర్శకత్వంలో, ఎన్ టి ఆర్ మీద .. ముందు ఒక్క సినిమాకే ప్లాన్ చేసి, తర్వాత దాన్ని రెండు సినిమాలుగా రూపొందించారు.

భారీ అంచనాలతో అవి విడుదలయ్యాయి. పోయాయి. 


మరోవైపు, దర్శకుడు ఆర్జీవీ "లక్ష్మీస్ NTR" అనే టైటిల్‌తో, అదే ఎన్ టి ఆర్ మీద ఇంకో భారీ బయోపిక్ తీశాడు.

ఆర్జీవీ మార్కు రకరకాల సంచలనాల మధ్య చివరికి ఆ బయోపిక్‌ ఎన్నికలకు ముందు ఎక్కడైతే విడుదలకావాలని టార్గెట్ చేశారో, ఆ ఏపీలో తప్ప అంతటా విడుదలైంది. ఎన్‌టీఆర్ మీద క్రిష్ తీసిన రెండు సినిమాలకంటే ఈ బయోపిక్ మంచి టాక్ తెచ్చుకొంది. మంచి బిజినెస్ కూడా చేసింది.   


సుమారు రెండు నెలలముందు, ఫిబ్రవరి 8వ తేదీనాడు, వైయస్సార్ బయోపిక్ 'యాత్ర' రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకొంది.  

ఇంక హిందీలో అయితే లెక్కలేనన్ని బయోపిక్‌లు వచ్చాయి. ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా హిందీలో ఏదో ఒక బయోపిక్ రూపొందుతూనే ఉంటుంది.  

త్వరలోనే మన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మీద కూడా ఒక బయోపిక్ రాబోతోందని ఆమధ్య ఒక న్యూస్ ఐటమ్ చదివాను.

కట్ చేస్తే - 

"టైగర్ కేసీఆర్" పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బయోపిక్ తీస్తున్నట్టు ఎనౌన్స్ చేసి మరో సంచలనానికి తెరతీశాడు ఆర్జీవీ. ఆర్జీవీ ఆంధ్రాలో పుట్టిపెరిగినవాడు, గతంలో ఉద్యమసమయంలో ఇదే కేసీఆర్ మీద రకరకాల ట్వీట్లు పెట్టినవాడు కూడా కావటంతో ఈ బయోపిక్ మీద సహజంగానే మరింత ఫోకస్ ఉంటుంది. 

అతి త్వరలో, దీనికి వైస్ వెర్సా, మరో దర్శకుడి ద్వారా ఇంకో భారీ బయోపిక్‌కు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ రాబోతోందని తెలిసింది. మరో రెండు మూడు రోజుల్లో ఆ న్యూస్ కూడా రావొచ్చు. 

Sunday 14 April 2019

ఎమ్మెల్సీ సుభాషన్న!

పార్టీలో అందరికీ ఆయన ఆప్తుడు.

కల్మషంలేని నిర్మల హృదయుడు.

గ్రౌండ్ టూ ఎర్త్ సింప్లిసిటీ.

టీఆరెస్ ఆవిర్భావం నుంచి, కేసీఆర్ వెంట ఆయనకు అతిదగ్గరగా ఉన్న అతి కొద్దిమంది ప్రధానవ్యక్తుల్లో ఆయన ఒకరు.

ఆయనే శేరి సుభాష్ రెడ్డి.

ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ సెక్రెటరీ.

కట్ టూ సుభాషన్న -

కార్యకర్తలనుంచి అత్యున్నతస్థాయి పార్టీనాయకులదాకా, చాలామంది "సుభాషన్నా" అని ప్రేమగా పలకరించే సుభాష్ రెడ్డి కూడా రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. వారి తండ్రి అంతకుముందు సమితి ప్రసిడెంట్‌గా పనిచేశారు.

మెదక్ జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు.

పొలిటికల్ సెక్రెటరీగా తన దగ్గర అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి, ఆయనను TSMDC చైర్మన్‌ను కూడా చేశారు మన ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ స్టేట్  మినరల్ డెవలప్‌మెంట్  కార్పొరేషన్ (TSMDC) చైర్మన్‌గా, ఆ పదవిలో కూడా విజయవంతంగా పనిచేస్తూ కార్పొరేషన్ రికార్డులు తిరగరాశారు సుభాష్ రెడ్డి.

ఎన్నికల్లో టీఆరెస్ ఘనవిజయం వెనుక వివిధ స్థాయిల్లో టీఆరెస్ కార్యకర్తలు, అభిమానుల సోషల్ మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, కేసీఆర్ బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కోసం చేస్తున్న వేస్తున్న ప్రతి అడుగుకీ, చేస్తున్న ప్రతి పనికీ సంపూర్ణ మద్దతుగా, ఉద్యమం నాటి దూకుడే ఇప్పుడు కూడా మన TRS సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుండటం నిజంగా ఒక గొప్ప విషయం.

మొన్ననే పూర్తయిన తెలగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మన సోషల్‌మీడియా సైన్యం దూకుడు ఇంక చెప్పాల్సిన పనిలేదు. విశ్వరూపం చూపించారు.

దీన్నంతటినీ ఎప్పటికప్పుడు ఒక కంట గమనిస్తూ, అవసరమైన చోట సలహాలనిస్తూ దిశానిర్దేశం చేసే మొదటి వ్యక్తీ, ఏకైక వ్యక్తీ సుభాష్ రెడ్డి.

ఇదంత చిన్నవిషయం కాదని నా ఉద్దేశ్యం.

ఆమధ్య అమెరికాలో జరిగిన "ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్‌పో"లో TSMDC చైర్మన్ హోదాలో మన రాష్ట్రం తరపున పాల్గొనివచ్చారు సుభాష్ రెడ్డి.

అంతర్జాతీయంగా భూగర్భవనరుల వెలికితీతలో అనుసరిస్తున్న విధానాలు, వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఈ ఎక్స్‌పో ద్వారా బాగా అధ్యయనం చేసిన సుభాష్ రెడ్డి, మన తెలంగాణ మైనింగ్ రంగంలో కూడా ఆధునిక సాంకేతికతను జోడించి, చరిత్ర తిరగరాసే అత్యధిక ఆదాయం మన ప్రభుత్వానికి సమకూరేలా చేయాలన్న గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు.

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన విజయవంతమైన సేవలను గుర్తించి, ఇటీవలే సుభాష్ రెడ్డికి ఎమ్మెల్లే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా అవకాశం ఇచ్చారు కేసీఆర్. 

కట్ టూ సుభాషన్న ఏకైక లక్ష్యం - 

కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో - అనుక్షణం ఆయనను కంటికి రెప్పలా చూసుకున్న వ్యక్తిగా సుభాష్ రెడ్డికి కూడా పార్టీలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయి.

సుమారు 14 సంవత్సరాల ఉద్యమంలో తన వ్యక్తిగత జీవితాన్ని దాదాపు త్యాగం చేసిన సుభాష్ రెడ్డి, సి ఎం కు పొలిటికల్ సెక్రెటరీగా ఉన్నా, TSMDC చైర్మన్ అయినా, ఎమ్మెల్సీ అయినా .. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన లక్ష్యం ఒక్కటే:

"బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడవడం, కేసీఆర్ ఆలోచనలను కార్యకర్తలవద్దకు, ప్రజలవద్దకు తీసుకెళ్లడం, ఉద్యమ సమయంలో ఎంతటి దీక్షతో అయితే కేసీఆర్ వెంట పనిచేయడం జరిగిందో, అంతే దీక్షతో కేసీఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ కోసం కూడా పనిచేయడం."

దటీజ్ సుభాషన్న!

ఎమ్మెల్సీగా ఎన్నికయినతర్వాత .. రేపు ఏప్రిల్ 15, సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీ హాల్లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా - శేరి సుభాషన్న గారికివే నా హార్దిక శుభాకాంక్షలు.  

Friday 12 April 2019

ఫిలాసఫీ "30/30/40"

అమెరికన్ బీచ్ వాలీబాల్ స్టార్, ఫ్యాషన్ మోడల్, నటి, స్పోర్ట్స్ ఎనౌన్సర్, టీవీ హోస్ట్, ప్రేయసి, తల్లి, భార్య, (క్రమం అదే!) అథ్లెట్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, బెస్ట్ సెల్లర్ రైటర్, మొత్తంగా ప్రపంచం మెచ్చిన ఒక సెలబ్రిటీ ..

ఇవన్నీ కలిస్తే ఒక గాబ్రియెలె రీస్!

ఫ్లారిడా స్టేట్‌కు వాలీబాల్ ఆడుతున్నప్పుడే రీస్ లుక్స్‌కి పడిపోయి ఫాషన్ మోడలింగ్ ఆమెని ఆహ్వానించింది. తర్వాత, "సెరెండిపిటీ" వంటి చిత్రాల్లో నటిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తర్వాత స్పోర్ట్స్ అనౌన్సర్‌గా, టీవీ హోస్ట్‌గా  ESPN, NBT, MTV Sports, Fit TV/Discovery వంటి పాప్యులర్ చానెల్స్‌లో వద్దంటే అవకాశాలు.

తర్వాత.. తనకు నచ్చిన స్నేహితునితో సహజీవనం చేసింది. ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయింది. ఆ తర్వాతే తన సహజీవన నేస్తాన్ని పెళ్లి చేసుకొని భార్య అయింది. తర్వాత అథ్లెట్ అయింది. ఫిట్‌నెస్ ట్రైనర్ అయింది. మధ్యలో గోల్ఫ్‌ని కూడా వదల్లేదు. రెండు పుస్తకాలు రాసి బెస్ట్ సెల్లర్ రైటర్ కూడా అయింది రీస్.

ఇవి చాలవూ.. రీస్ ప్రపంచస్థాయి సెలెబ్రిటీగా పాప్యులర్ కావడానికి?

ఇవి చాలవూ.. నైక్ లాంటి సంస్థ రీస్‌ని తన "గాళ్ పవర్" కేంపెయిన్‌కు "ఐకాన్"గా కాంట్రాక్టుమీద సంతకం పెట్టించుకొని మిలియన్ల డాలర్లివ్వడానికి?

దటీజ్ గాబ్రియెలె రీస్ ..

తను ఎన్నుకున్న ప్రతిరంగంలోనూ సక్సెస్ సాధించింది. తన మనస్సాక్షినే నమ్మింది. తను అనుకున్నది చేసుకుంటూపోయింది. తను కోరుకున్న జీవనశైలినే ఎంజాయ్ చేస్తూ హాయిగా సంతృప్తిగా జీవిస్తోంది రీస్.

మనకు తెలిసి, మనకున్న ఈ ఒక్క జీవితానికి అంతకన్నా ఏం కావాలి?

కట్ టూ రీస్ ఇంటర్వ్యూ -

ఈ మధ్యే రీస్ గురించి ఒక పాప్యులర్ అమెరికన్ యోగా గురు చెప్తే విన్నాను. తర్వాత ఆమే (యోగా గురు) పంపిస్తే రీస్ ఇంటర్వ్యూ ఒకటి విన్నాను.

ఆ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట ఇది:

"మన జీవితంలోని ఏ దశలోనైనా, మన చుట్టూ ఉన్నవారిలో..  30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు. 30 శాతం మంది మనల్ని ద్వేషిస్తారు. మిగిలిన 40 శాతం మంది అసలు మన గురించి పట్టించుకోరు!"

రీస్ విజయాలు, విజయాల పరంపర వెనకున్న అసలు ఫిలాసఫీ ఇదన్నమాట!

సమాజంతో ముడిపడ్డ, సమాజంపట్ల మన "మైండ్‌సెట్"తో ముడిపడ్ద ఒక గొప్ప జీవితసత్యాన్ని చాలా సింపుల్‌గా చెప్పింది రీస్.

ఈ సత్యం - ప్రపంచంపట్ల, నా చుట్టూ ఉన్న మనుషులపట్ల నా దృక్పథాన్నే సంపూర్ణంగా మార్చివేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను.

కానీ నిజం.

మనకు సంతోషాన్నివ్వని వ్యక్తులను గానీ, వాతావరణాన్ని గానీ ఎంత తొందరగా వదిలించుకొంటే అంత మంచిది.

జస్ట్ బ్లాక్ దెమ్!

అంతకు మించిన పనులు, ప్రపంచం మనకు చాలా ఉంది.  

Wednesday 10 April 2019

వొక మానసిక వైకల్యం

కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. సైకియాట్రీలో దానికి తప్పక ఏదో ఒక శాస్త్రీయనామం ఉండే ఉంటుందని నా నమ్మకం.

అసలిలాంటి అంశంపైన ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, రాయడం అవసరం అనిపించి రాస్తున్నాను.

కట్ టూ పాయింట్ - 

బ్లాగ్ అనేది ఆ బ్లాగర్ వ్యక్తిగత ఆలోచనలకు మిర్రర్.

బ్లాగర్ రాసే అంశం ఏదైనా కావొచ్చు, ఖచ్చితంగా అది ఆ బ్లాగర్ వ్యక్తిగత దృక్పథాన్ని, ఆలోచనాధోరణిని తెలుపుతుంది.

అది పర్సనల్ కావొచ్చు. పబ్లిక్ లైఫ్‌కు సంబంధించినది కావొచ్చు. ఒకసారి ఆ అంశం పబ్లిక్‌లోకి వచ్చిందంటే దానిమీద కామెంట్ చేసే స్వేఛ్ఛ ప్రతి బ్లాగ్ రీడర్‌కు ఉంటుంది.

ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఉంటుందని నేననుకోను.

అయితే, కామెంట్ అనేది ఆ నిర్దిష్టమైన బ్లాగ్ పోస్ట్‌లో చర్చించిన అంశంపైనే సూటిగా ఉండాలి. నిర్మాణాత్మకంగా, డిగ్నిఫైడ్‌గా ఉండాలి.

అంతే తప్ప, బ్లాగ్‌లో రాసిన అంశాన్ని పక్కనపెట్టి, దాని మీద చర్చించే సామర్థ్యం/జ్ఞానం లేక, ఏదో ఒక అర్థంలేని చెత్త కామెంట్ పెట్టడం ఆయా వ్యక్తుల మానసిక వైకల్యాన్నే తెలుపుతుంది.

బ్లాగ్‌లో రాసిన విషయం అబధ్ధం .. అసలు నిజం ఇది అని చెప్పగలగాలి. విశ్లేషణ చేయగలగాలి. ఏదైనా డేటా ఉంటే ఇవ్వగలగాలి. అలా, బ్లాగ్‌లో రాసిన టాపిక్‌పైన ఎంతైనా చీల్చి చెండాడవచ్చు. ఆ హక్కు కామెంటర్‌కు ఉంటుంది.

కాని, అది నిర్మాణాత్మకంగా ఉండాలి. 

అంతే తప్ప, టాపిక్‌ను పక్కనపెట్టి వ్యక్తిగతంగా ఏదో అసంబధ్ధమైన కామెంట్ చేయడం, లేదా ఏదో ఒక సంబంధం లేని  విషయాన్ని కామెంట్‌గా పెట్టడం అనేది సరైన పధ్ధతి కాదు. 

ఇలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారు.

నా ఇన్నేళ్ల బ్లాగింగ్ లైఫ్‌లో ఇలాంటివాళ్లు కూడా కొందరు నాకు ఎదురయ్యారు.

నేను చాలా ఓపికగా వీరి కామెంట్స్‌కు కూడా జావాబిస్తాను. కాని, ఒక పరిధి దాటిన తర్వాత ఏం చేయలేం.

అదొక మానసిక వైకల్యం అనుకొని వారినలా వదిలివేయటం, బ్లాక్ చేయటం తప్ప. 

Monday 8 April 2019

కౌంట్ డౌన్ .. 18 గంటలు!

ప్రచారపర్వం ముగియడానికి ఇంకా కేవలం 18 గంటలు మాత్రమే ఉన్నది.

ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో. 

ఈ క్షణం నుంచి ప్రతి క్షణం విలువైనదే.

ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు కాగా, ఇప్పటినుంచి 11 వ తేదీనాడు పోలింగ్ ముగిసేదాకా చేసే కసరత్తు, పడే శ్రమ, తీసుకొనే జాగ్రత్తలు ఒక ఎత్తు.

టఫ్ ఫైట్ ఉండే అవకాశముందనుకునే కొన్ని స్థానాల్లో, ఎవ్వరూ ఊహించని విధంగా, అంచనాలు పూర్తిగా తల్లకిందులు కావడానికి ఈ కొద్ది సమయమే కారణమవుతుంది.

తెలంగాణలో అలాంటి ప్రమాదం దాదాపు లేదు. కాని, ఆంధ్రలో మాత్రం చాలా ఉంది. ఉంటుంది.

ఏపీలో రాజకీయంగా ఒక పెనుమార్పుకి కారణం కాబోతున్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్‌తో పాటు, ఆ పార్టీ అతిరథమహారథుల నుంచి, క్రింది స్థాయి కార్యకర్త దాకా ఈ కొద్ది సమయం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలను ప్రభావితం చేయగల ప్రతి చిన్నా పెద్దా విషయం మీద తగినంత ఫోకస్ పెట్టాలి.

అవతల ఉన్నది 40 యియర్స్ ఇండస్ట్రీ.

ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలడు. చివరి నిమిషం వరకూ కొత్త అవకాశాల్ని సృష్టించుకొని దెబ్బదీసే ప్రయత్నంలోనే ఉంటాడు.

తస్మాత్ జాగ్రత్త! 

కౌంట్ డౌన్ ... 2

ఎన్నికల ప్రచారపర్వానికి ఇంక మిగిలింది 2 రోజులే.

ఇందాకే ఒక యూకే మిత్రునితో మాట్లాడుతుంటే ఈ విషయం మా మాటల్లో వచ్చింది.

ఖచ్చితంగా చెప్పాలంటే జస్ట్ ఒక 39 గంటల్లో ఈ ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తుంది. తెలంగాణలో, పక్కన ఏపీలో కూడా.

కేసీఆర్ రాజకీయ వ్యూహం పుణ్యమా అని తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల గురించి పెద్దగా చర్చించడానికి ఏమీ లేకుండాపోయింది.

నల్లేరు మీద నడక.

వన్ సైడ్ వార్.

16 సీట్లు పక్కా.

ఎక్జైట్‌మెంట్, చర్చా గిర్చా ఏదైనా ఉందంటే - అది మెజారిటీ ఎక్కడ ఎంత అన్నదానిమీదే తప్ప ఇంక వేరే ఏమీ లేదు.

అలాగని దేన్నీ ఎవ్వరూ లైట్ తీసుకోలేదు.

టీఆరెస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో 20 మంది స్టార్ కాంపెయినర్లు బాగా పనిచేస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, టీఆరెస్ ట్రబుల్ షూటర్ హరీష్‌రావు ఉన్నారు. ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రెటరీ, టీయస్ఎమ్‌డీసీ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కూడా ఉన్నారు. 

ఒకవైపు కేసీఆర్ ప్రచార సభలు, మరోవైపు కేటీఆర్ సభలూ రోడ్ షోలు, ఇంకా ప్రతి ఒక్క ఎంపీ స్థానంలో ఆయా అభ్యర్థుల సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు, వివిధ సంఘాలు, సమూహాలతో ప్రత్యేక మీటింగ్స్ .. అన్నీ భారీ స్థాయిలో, యమ సీరియస్‌గా జరుగుతున్నాయి.

ఇవన్నీ ఇంకో 39 గంటల్లో ముగియనున్నాయి.

తెలంగాణలో టెన్షన్ ఏం లేదు. టీఆరెస్ "మిషన్ 16" సక్సెస్ కాబోతోంది.

ఇక మిగిలింది .. మే 23 నాడు ఫలితాలు అఫీషియల్‌గా చూడ్డమే.

కట్ టూ ఏపీ పాలిటిక్స్ - 

సర్వేలన్నీ చంద్రబాబు పరాజయాన్ని, తిరుగులేని జగన్ వేవ్‌ను చెప్తున్నాయి.

అయినా సరే, చంద్రబాబు 2014 తరహాలో చివరి నిమిషంలో వేవ్‌ను తనవైపు తిప్పుకొని విజయం సాధిస్తాడని కూడా కొన్నివర్గాల అభిప్రాయం.

జగన్ శిబిరం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటోందనే అనుకుంటున్నాను.   

Tuesday 2 April 2019

మన అంతరంగంతో మనం

వ్యక్తిగతంగా, నా దృష్టిలో ఏకాంతాన్ని మించిన సహచరి లేదు!

అలాగని నన్ను తప్పుగా అనుకోకండి.

నాకత్యంత ప్రియమైన నా ఫ్రెండ్స్ తో గడపడం నాకెంతో ఇష్టం. నా పిల్లలతో కలిసి ఆటలాడ్డం, వాళ్ల వయస్సుకి దిగిపోయి పోట్లాడ్డం నాకిష్టం.

ఫ్రెంచి ఆర్టిస్టులతో కలిసి పాండిచ్చేరి బీచుల్లో గంటలకొద్దీ నడుస్తూ స్పిరిచ్యువాలిటీ గురించి మాట్లాడ్డం నాకిష్టం. ఇలాంటి ఇష్టాలు కనీసం వంద ఉన్నాయి నాకు.

కానీ.. వీటన్నింటిని మించి నాకత్యంత ఇష్టమైంది నా ఏకాంతం. అందుకే అన్నాను, ఏకాంతాన్ని మించిన సహచరి లేదు నాకు అని. 

ఏకాంతాన్ని సృష్టించుకోడానికి ఎవరూ అన్నీ వొదులుకొని మునిపుంగవులు కానక్కర లేదు. ఇరవై నాలుగ్గంటల్లో ఇరవై గంటలూ ఈ ఏకాంతం కోసమే కెటాయించనక్కర్లేదు.

కేవలం ఒక్క అరగంట! వీలయితే ఇంకో పది నిమిషాలు ... 

మనతో మనం, మన అంతరంగంతో మనం, మన ఆలోచనలతో మనం, మన ఆత్మతో మనం, మన మనసుతో మనం ... ప్రశాంతంగా రోజుకి కనీసం ఒక్క అరగంట కెటయించుకోగలిగితే చాలు. ఆ ఆనందం వేరు. ఆ ఎనర్జీ వేరు.

ఏకాంతంలో ఉన్నప్పుడే మనల్ని మనం పలకరించుకోగలుగుతాం.సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అందాన్ని ఆనందించగలుగుతాం.

ప్రపంచంలో ఏఅత్యుత్తమ కళ అయినా పుట్టేది ఇలాంటి ఏకాంతంలోంచేనంటే అతిశయోక్తి కాదు. ఏకాంతంలోనే ఏ సృజనాత్మకత అయినా వెల్లివిరిసేది.

సముద్రాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు, బాల్కనీలో నిల్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు, ఏకాగ్రతతో ఏదయినా రాస్తున్నప్పుడు.. మనం అనుభవించేది ఏకాంతమే.

ఏ కళాకారుడయినా తనలోని క్రియేటివిటీని ఆవిష్కరించేది ముందు ఏకాంతంలోనే. అది ఆర్ట్ కావచ్చు. సైన్స్ కావచ్చు. కొత్త ఆలోచన ఏదైనా సరే ఏకాంతం నుంచే పుడుతుంది. అదొక రూపం సంతరించుకొని భౌతిక ప్రపంచానికి పరిచయమయ్యేది ఆ తర్వాతే!

ఏకాంతం లేకుండా ఏ సృజనాత్మకత  లేదు. ఏ కళ లేదు. దాన్ని మనం విస్మరిస్తున్నాం. నిజానికి, ఈ ఆధునిక జీవితంలో ఏకాంతాన్ని విస్మరించి మనం సాధిస్తున్నది కూడా ఏదీ లేదు. కోల్పోతున్నదే ఎక్కువ.

అంతేకాదు ...

మన నిత్యజీవితంలోని కొన్ని సమస్యలకు మామూలు పరిస్థితుల్లో దొరకని పరిష్కారం కూడా మనకు ఏకాంతంలోనే దొరుకుతుంది.

ఒక్కసారి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. కానీ, అలా ఆలోచించాలన్నా మీకు ఏకాంతం కావాలి!

కట్ టూ సమ్ యాక్షన్ - 

ఓ పని చేయొచ్చు ...

మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటినీ 'ఆఫ్' చేసేసి, మీ ఇంట్లోనే మీకిష్టమయిన గదిలోనో, మీకిష్టమయిన ఏదో ఒక మూలనో కేవలం ఒక్క అరగంట ఒంటరిగా కూర్చుని చూడండి.

లేదంటే ఏ తెల్లవారుజామునో, సాయంత్రమో.. మొబైల్ జేబులో పెట్టుకోకుండా, ట్రాఫిక్ లేని చోట ఒక అరగంట మీరొక్కరే వాకింగ్ కు వెళ్లండి.

ఏకాంతం ఎంత అందంగా, ఆనందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీరేం కోల్పోతున్నారో తెలుస్తుంది. అందుకోసం, ఇకనుంచయినా మీరేం చేయాలో మీకు తెలుస్తుంది.

అన్నట్టు ... ఈ బ్లాగ్ పోస్టు పుట్టింది కూడా 'ఏకాంతం' లోంచే!

Monday 1 April 2019

FB లో లేని ఆ 154 రోజులు!

ఏం ఫరవాలేదు.

ఫేస్‌బుక్ వదిలేసి 154 రోజులైంది.

ఏం కాలేదు. ఇంకా బ్రతికే ఉన్నాను. హాయిగా ఉన్నాను.

కట్ చేస్తే - 

ఫేస్‌బుక్ అంటే నాకు చాలా ఇష్టమే. అది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం కాదు.

మంచి మిత్రులనిచ్చింది. మంచి కాంటాక్ట్స్‌ను కూడా ఇచ్చింది.

నిజానికి ఇప్పటికి కూడా .. ఏ విషయంలోనైనా, గ్లోబ్ మీదున్న ఏ ప్రాంతం నుంచయినా మనకేదైనా కాంటాక్ట్ కావాలంటే ఫేస్‌బుక్కే ఒక మంచి టూల్.

కాకపోతే, ఈమధ్య ఫేస్‌బుక్ ఒక ఫిష్ మార్కెట్ అయిపోయింది.

ఎవరికి తోచిన చెత్త వారు పోస్ట్ చేసుకొనే ఫ్రీడం ఉన్నది కాబట్టి ఎవర్నీ తప్పుబట్టటానికి వీల్లేదు.

నేను ఫేస్‌బుక్ వాడినప్పుడు రోజుకి మొత్తంగా ఒక 30-40 నిమిషాలు దానిమీద గడిపేవాన్ని. నా పోస్టుల్లోకూడా కనీసం ఒక 60 శాతం పనికిరాని చెత్తనే.

అదంతే.

నాణేనికి మరోవైపు.

మన నంబర్ 2 అన్నమాట.

ప్రతిమనిషిలోనూ ఉండే ఈ నంబర్ 2 బయటకు కనిపించదు. ఫేస్‌బుక్‌లో మాత్రం విశ్వరూపం చూపిస్తుంది.

ఎక్కడా ఏం చేయలేనివాడు ఇక్కడ అన్నీ చేస్తాడు. చెప్తాడు.

ఒక ఫాంటసీ.

ఒక మాయ.

ఇప్పుడు నేను ట్విట్టర్‌ను బాగా ఇష్టపడుతున్నాను.

ఇది ఫిష్ మార్కెట్ కాదు. ఒక ఎలైట్ సోషల్ మీడియా. ఎంతవాగినా, ఏం చెప్పినా దానికొక పరిమితుంది. 

జస్ట్ 280 క్యారెక్టర్స్!          

Sunday 31 March 2019

ఏపీ రాజధాని జిల్లా ఎటువైపు?

గుంటూరుజిల్లాతో నాకు చాలా మంచి జ్ఞాపకాలున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీలో నా రెండో పీజీ చదువుతుండగానే నాకిక్కడి నవోదయ విద్యాలయ, మద్దిరాలలో కేంద్రప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ రెండేళ్లు పనిచేశాక, ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు ఆలిండియా రేడియోలో వచ్చింది. అప్పుడు అతి కష్టమ్మీద ఇక్కడి జాబ్‌కు రిజైన్ చేసి ఆలిండియా రేడియోకి వెళ్లాను.

గుంటూరు జిల్లాతో అప్పటి నా జ్ఞాపకాలు ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి ...

వృత్తిగతంగా ఒక అతిముఖ్యమైన పనిమీద నాలుగురోజులక్రితం గుంటూరొచ్చాను. పని టెన్షన్ ఒకవైపు వెంటాడుతున్నా, ఇంకో రెండు మూడు రోజుల్లో ఎలాగైనా ఆ పని పూర్తిచేసుకొని వెళ్లగలనన్న నమ్మకంతో ఉన్నాను. పూర్తిచేసుకొనే వెళ్తాను.

కట్ టూ గుంటూరు పాలిటిక్స్ - 

ఇక్కడ నేను రోజూ ఏదోవిధంగా టచ్‌లో వుండే మిత్రులు, వ్యక్తులు రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్నవాళ్లు.

నాటుగా చెప్పాలంటే .. తోపులు.

రాబోయే 9 రోజుల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, ఇక్కడి రాజకీయాలను నేను ప్రత్యక్షంగా గమనించే అవకాశం నాకు అనుకోకుండా ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో -

నా వ్యక్తిగత అధ్యయనం కావొచ్చు, నా దగ్గరున్న సమాచారం కావొచ్చు .. గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి: 

జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నుంచి 13 స్థానాలను వైసీపీ గెలవబోతోంది.

సిటీలోని గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ .. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీనే గెలవబోతోంది.

జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే-ఉరఫ్-ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవబోతున్నారు.   

గుంటూరు, నర్సారావుపేట, బాపట్ల .. గుంటూరుజిల్లాలోని ఈ మూడు పార్లమెంటరీ స్థానాలను వైసీపీనే స్వీప్ చేయబోతోంది.

ఒక్క గుంటూరులో మాత్రం గల్లా జయదేవ్ టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు.

ఏపీ అంతటా ఉన్నట్టే, జగన్ వేవ్ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

రాజకీయాల్లో మునిగితేలే ఇక్కడి నా మిత్రుల అంచనా ప్రకారం ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 110 నుంచి 120 స్థానాలను వైసీపీ స్వీప్ చేయబోతోంది.

రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 20 నుంచి 22 స్థానాలను వైసీపీ గెల్చుకోబోతున్నది.

శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఎడ్జ్ కొంచెం బాగానే కనిపిస్తోంది.

ఏదేమైనా, మే 23 నాడు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. దానికి కర్త, కర్మ, క్రియ అయిన వైసీపీ అధినేత వైయెస్ జగన్‌కు ముందస్తు శుభాకాంక్షలు.  

Tuesday 26 March 2019

రిటర్న్ గిఫ్ట్‌కు ఇంత పవరుంటుందా?!

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 101 ప్రయత్నాలు చేశాడు.

తెలంగాణలో బిస్కట్లకు ఆశపడే ప్రతి చిన్నా పెద్దా రాజకీయపార్టీలు, నాయకులతో కలిపి ఒక మహాకూటమి ఏర్పాటు చేశాడు.

ఏపీ నుంచి వెయ్యి కోట్ల ఫండ్స్ కూడా హైదరాబాద్‌కు తరలించాడని న్యూస్‌పేపర్లు, టీవీ ఛానెల్స్‌తోపాటు, సోషల్ మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి.

చివరికి అన్నీ విఫల ప్రయత్నాలయ్యాయి.

తెరాస స్వీప్ చేసింది.

బాబు, అతని గ్యాంగ్ బ్యాక్ టూ పెవిలియన్.

కట్ చేస్తే - 

ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి.

అక్కడ తెరాస పోటీ చేయడంలేదు. తెరాసకు లోక్‌సభ ఎన్నికలున్నాయి.

ఏపీలో ఫలానా వారికే వోటెయ్యండి తెరాస అని చెప్పటంలేదు.

ఏపీకి వెళ్లి బాబును ఓడించడానికి, బాబులాగా ఏదో ఒక చెత్తకూటమిని అక్కడేదీ ప్లాన్ చేయలేదు.

ఎవ్వరూ తెరాస నుంచి అక్కడికి ప్రచారానికి వెళ్లలేదు.

కానీ అక్కడ జరుగుతున్నది వేరే ...

అదేదో కేసీఆర్ డైరెక్టుగా ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళి .. అక్కడ ఏపీ మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఫీలింగ్‌ని చంద్రబాబు, పవన్ కళ్యాన్ అండ్ కో ఇస్తూ .. 24 గంటలూ కేసీఆర్ జపం చేస్తుండటం నిజంగా ఆశ్చర్యకరం!

కేసీఆర్ అక్కడ పోటీనే చేస్తలేడు. "కేసీఆర్, రా చూస్కుందాం. దమ్ముందా?" అంటున్నారు.

కేసీఆర్ ఒకే ఒక్కసారి ఒక ప్రెస్‌మీట్‌లో (చంద్రబాబుకు) "రిటర్న్ గిఫ్ట్ ఇస్తా" అన్నాడు.

ఆ ఒక్క మాటను ఏపీ ఎన్నికల్లో బాబుతోసహా, మరో వంద మంది గల్లీ పొలిటీషియన్లు లక్షసార్లు పలవరిస్తున్నారు.

ఇంతకు కేసీఆర్ ఇచ్చే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి?

దానికంత పవరుందా?!

సీన్ చూస్తుంటే ఉందనే అనిపిస్తోంది.  

Thursday 21 March 2019

గుంటూరు వెస్ట్ నుంచి "నచ్చావులే" మాధవీలత!

"చాలా మంది సినీ ఫీల్డులో - తాము అనుకున్న గోల్ రీచ్ కావడానికి ఎంతటి మూల్యాన్నయినా చెల్లిస్తారు. దేన్నయినా వొదులుకుంటారు. స్నేహాలు, ప్రేమలు, బంధాలు, అనుబంధాలు.. ఏవయినా కావొచ్చు. తమ కెరీర్ కోసం వాటిని తృణప్రాయంగా వొదిలేస్తారు. అది నేను చేయలేను. బహుశా అదే నా బలహీనత. అదే నా బలం కూడా. నా తొలి సినిమా మంచి హిట్టయినా నేను దాన్ని క్యాష్ చేసుకోలేకపోడానికి ఇది కూడా ఒక కారణం"

సుమారు ఓ అయిదేళ్లక్రితం నాతో ఈ మాటలన్నదెవరో కాదు .. నాకు మంచి మిత్రురాలు, కవయిత్రి, యూత్ హృదయాల్ని కొల్లగొట్టిన హిట్ సినిమా "నచ్చావులే" హీరోయిన్ మాధవీలత.

కట్ టూ ఎమ్మెల్లే అభ్యర్థి మాధవీలత - 

"సార్, మీ మాధవీలత గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్లేగా పోటీచేస్తోంది .. తెలుసా?"

నాలుగురోజులక్రితం మా ప్రదీప్‌చంద్ర చెప్తే తెలిసిందీ న్యూస్ నాకు.

మాధవీలత వ్యక్తిత్వానికీ సినిమాలకే సింకవ్వలేదు. ఇంక పాలిటిక్స్‌లో ఏం చేస్తుందబ్బా అనుకున్నాను.

వెంటనే కాల్ చేశాను.

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్రచారం, సమావేశాలతో ఫుల్ బిజీగా ఉంది!

పది నిమిషాల్లో కొంచెం ఫ్రీ చేసుకొని కాల్ చేసింది మాధవీలత.

సుమారు ఓ అరగంట మాట్లాడుకొన్నాం.

అదే స్వఛ్చమైన  భాష, భావుకత్వం, వ్యక్తీకరణ, స్వీయ విశ్లేషణ.

ఏం మారలేదు!

డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చాను.

"అసలు మాధవీలతేంటి, ఈ పాలిటిక్స్ ఏంటి?" అడిగాను.

"కొన్ని కొన్ని అలా జరుగుతుంటాయి. మీరు రైటర్, డైరెక్టర్ .. మీకు చెప్పాలా?" నవ్వింది మాధవీలత.

నిజమే.

జీవితంలోని ఏ మజిలీలో ఎలాంటి ట్విస్టులొస్తాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటామో, అప్పటివరకూ అనుకోని ఏ దిశలో ప్రయాణం కొనసాగిస్తామో ఎవ్వరం చెప్పలేము.

మాధవీలత స్వస్థలం ప్రకాశం జిల్లాలో ఓ చిన్న గ్రామం. నాన్న రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఒక్క చిన్నన్నయ్య మాత్రం ఉద్యోగరీత్యా 'ఆర్మీ'లో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నారు.

ఎమ్మే సోషియాలజీ (మైసూర్ యూనివర్సిటీ), ఎమ్మెస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ (UK) చేసిన మాధవీలత పుట్టింది హుబ్లీలో. అక్టొబర్ 2 ఆమె పుట్టిన రోజు కావడం మరొక విశేషం.

సోషల్ సర్వీస్‌లో చిన్నతనం నుంచి చాలా ఆసక్తివున్న మాధవీలత రాజకీయ రంగప్రవేశం అనుకోకుండా జరిగింది. ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్లే అభ్యర్థిగా బరిలో ఉంది.

ఒక జాతీయపార్టీగా బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, ఆయన పనితీరు అంటే మాధవీలతకు చాలా ఇష్టం.   

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కాంపిటీషన్ ఇప్పుడు నాలుగుస్థంబాలాటలాగుంది. అధికార తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ రంగంలో ఉన్నాయి.

గెలుపు అంత సులభం కాదు. చాలా చాలా కష్టపడాల్సివుంటుంది. 

ఈ వాస్తవం మాధవీలతకు బాగా తెలుసు.

అందుకే, ఒక్క క్షణం వృధాచేయకుండా, నామినేషన్ వెయ్యడానికి ముందే నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకోవడంలో యమ బిజీగా ఉంది మాధవీలత. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యదర్శి వల్లూరి జయప్రకాశ్ నారాయణ్ వంటి సీనియర్ల సలహాలు తీసుకొంటూ పూర్తిస్థాయిలో తన పనిలో తను ముందుకు దూసుకుపోతోంది.

అంతకుముందు ఎన్నో పార్టీలనుంచి ఎంతోమంది ఎమ్మెల్లేలు, ఎంపీలుగా గెలిచినా ఇప్పటివరకు గుంటూరు వెస్ట్‌లో ఉన్న అతి ప్రాధమికమైన డ్రైనేజ్, గార్బేజ్ సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అంటుంది మాధవీలత.

"నియోజకవర్గంలోని రైతులతో సహా అంతా బాగా చదువుకున్నవారే. వారందరితో కలిసి మాట్లాడటం ద్వారా కూడా ఇక్కడి అనేక సమస్యలను గురించి తెలుసుకున్నాను. నన్ను గెలిపించండి. హైదరాబాద్ నుంచి నా మకాం పూర్తిగా గుంటూరుకే మార్చేసి, అందరినీ కలుపుకుపోతూ, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను" అంటుంది మాధవీలత.

ఎన్నో విషయాలను, ఎంతో అలవోకగా నాతో మాట్లాడిన మాధవీలతలో కొన్ని(పాజిటివ్) బలహీనతల్ని కూడా నేను మాటల మధ్యలో గుర్తించాను. అయితే, ఆ బలహీనతలే ఒక రకంగా తన బలం అంటుందామె.

"నేను బయటికి ఎంతో గర్విష్టిలా కనిపిస్తాను చాలా మందికి. కానీ - నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ ఎమోషనల్, నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ సెంటిమెంటల్ బహుశా ఎవరూ ఉండరు. అలాగే, నేను ఎంత సున్నితమైనదాన్నో అంత గట్టిదాన్ని కూడా" అంటుంది మాధవీలత.

"ఇప్పుడు రాజకీయాలంటే పాతపద్ధతిలోనే ఉండాల్సిన పనిలేదు. దేవేంద్ర ఫడ్నవీస్, కేటీఆర్, కవిత, సచిన్ పైలట్ లాంటి ఎందరో యువ రాజకీయనాయకులు పనిచేస్తున్నవిధానాన్ని కూడా మనం గమనించాలి. రాజకీయాలంటే ముందు మనల్ని నమ్మి మనకు వోటేసిన ప్రజలకు శక్తివంచనలేకుండా సేవచేయడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం. ఆ తర్వాతే ఇంకేదైనా" అంటుంది మాధవీలత.

పాలిటిక్స్‌లోకి వచ్చేముందు తన మైండ్‌ను స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకొని వచ్చిన మాధవీలత ఫోకస్ అంతా ఇప్పుడు తనముందున్న ఈ ఏకైక లక్ష్యం మీదే ఉంది.

ఇతర పార్టీల అభ్యర్థులను, మాధవీలతను చక్కగా బేరీజు వేసుకొని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం వోటర్లు సరైన నిర్ణయం తీసుకుంటారనీ, మాధవీలత విజయం సాధిస్తుందనీ నా నమ్మకం.

ఆల్ ది బెస్ట్ టూ మాధవీలత! 

Wednesday 20 March 2019

ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు!

నా మొదటి సినిమాలో ఒక మంచి విలన్‌ను ఫుల్ లెంగ్త్ రోల్‌లో పరిచయం చేశాను.

అతను నిజంగా చాలా మంచి యాక్టర్. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు.

నేననుకున్న కథ ప్రకారం, సినిమా చివర్లో కూడా, హీరోకంటే ఎక్కువ వెయిటేజ్ ఆ విలన్ కేరెక్టర్‌కే ఇచ్చాను.

ఇలా చేయడం వల్ల నేను ఆ విలన్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని అప్పట్లో ఆ చిత్రంలోని హీరో అనుకోవడం, టీమ్‌లో కొందరిదగ్గర అనటం కూడా జరిగింది.

హీరో నేనూ గుడ్ ఫ్రెండ్స్. అది వేరే విషయం.

కట్ చేస్తే -

ఇప్పుడా విలన్ మంచి పొజిషన్‌లో ఉన్నాడు.

నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు కాబట్టి నాకు నిజంగానే సంతోషంగా ఉంటుంది.

ఆ నటునిపట్ల, అతని నటనపట్ల నా అలోచన మారదు. ఒక మనిషిగా అతని పట్ల నా ప్రవర్తన, నా యాటిట్యూడ్ మారవు. ఈరోజుకీ మారలేదు.

ఇంతకు మించి నేను ఆలోచించను. వేరే ఇంకేదీ ఆశించను.

మొన్నొక మిత్రుడు చెప్పాడు ... ఆ నటుని ఇంటర్వ్యూ ఒక దినపత్రిక ఆదివారం ఎడిషన్లో వచ్చింది. ఎవరెవరి గురించో చెప్పాడు కానీ, తొలి అవకాశం ఇచ్చి, ఇండస్ట్రీకి పరిచయం చేసి, అంత పూర్తిస్థాయి విలన్ రోల్ ఇచ్చిన నీ పేరు చెప్పలేదు ఆ నటుడు అని.

నేను నవ్వాను.

ఇదంతా ఉట్టి ట్రాష్. అసలు పట్టించుకోకూడదు.

ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు.

'అసలు సినిమా' ఇలాగే ఉంటుంది.

అసలు సినిమా అంటేనే ఇది!   

Monday 18 March 2019

వొక ఆధ్యాత్మిక క్షణమ్

"ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.
ఏవో కొన్ని జ్ఞాపకాలను వదిలి..
ఎలాగు పోయేవాళ్ళమే ..
కాస్త.... వెనుక ముందూ..
ఈ లోగానే
విద్వేషాలు..విషం చిమ్ముకోవడాలు అవసరమా?"

ఆమధ్య, అనుకోకుండా ఒకసారి, సీనియర్ జర్నలిస్టు కె ఎన్ మూర్తి గారి ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద ఇది చదివాక చాలా ఆలోచించాను.

బాగా డిస్టర్బ్ అయ్యాను.

మొన్నీమధ్యే నా చిన్న తమ్మున్ని కోల్పోయాను. అంతకు రెండేళ్లక్రితం మా అమ్మ మాకు దూరమైపోయింది.

చావు, పుట్టుకలు మనచేతిలో ఉండకపోవచ్చు. మనం అస్సలు ఊహించనివిధంగా జరగొచ్చు. కానీ, ఇవి జరిగిన సమయంలో నేను నేనుగా లేను. అది నన్ను ఇంకా ఇంకా బాధిస్తుంది.

ఏవేవో గుర్తుకొస్తున్న ఈ క్షణం,  అంతా ఒక మాయలా అనిపిస్తుంది. నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలిలా జరిగిందా అనిపిస్తుంది.

కానీ, అన్నీ జరిగాయి.

అదే జీవితం.

జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా .. అందరూ చివరికి ఏదో ఒక శక్తికి సరెండర్ అవ్వాల్సిందే.

ఆ శక్తికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. కానీ, సరెండర్ అవ్వక మాత్రం తప్పదు.

అదే జీవితం. అదే ఆధ్యాత్మికమ్.

ఆధ్యాత్మికంలో ఉండే ఆ నిరాడంబరత వేరు. ఆ ఆనందం వేరు.

ఆ నిశ్చలత్వం .. ఆ నిశ్శబ్దం .. అసలా కిక్కే వేరు.

అందుకే, 1920 ల్లోనే మహా అగ్రెసివ్ రచయిత అయిన చలం లాంటివాడు కూడా చివరికి రమణమహర్షి ఆశ్రమం చేరక తప్పలేదు.

అలాగని ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేయటం కూడా కాదు.

కాకూడదు.

Sunday 17 March 2019

రాక్షస రాజకీయం!

తెలంగాణలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 'పొలిటికల్ సీజన్' మంచి వూపులో ఉన్నప్పుడు నాలుగు మాటలనుకుంటారు. నాలుగు ఆరోపణలు చేసుకుంటారు.

అది సహజం.

మళ్లీ ఎక్కడయినా ఎదురైనప్పుడో, లేదా .. ఏదో పనిమీదో, ఫంక్షన్‌లోనో కలిసినప్పుడు "ఆన్నా, బాగున్నావే" అని మర్యాదగా, ప్రేమగా పలకరించుకుంటారు.

రాజకీయాలు వేరే. స్నేహాలు, బంధుత్వాలు వేరే.

అన్నిటికంటే ముందు మానవత్వం ఇక్కడ పరిమళిస్తుంది.

కట్ చేస్తే - 

ఈ మధ్య నేను ఎక్కువగా ఆంధ్రలో నా వ్యక్తిగత, వృత్తిగత పనులమీద ఎక్కువగా తిరుగుతున్నాను.

నా వృత్తిగత పనులు కొన్ని డైరెక్టుగా రాజకీయాలతోనే ముడిపడి ఉన్నందువల్ల .. చాలా దగ్గరినుంచి ఆంధ్ర రాజకీయాలను, రాజకీయనాయకులను, బేసిగ్గా అక్కడి రాజకీయరంగాన్ని బాగా స్టడీ చేసే అవకాశమొచ్చింది.

తప్పయితే క్షమించండి, కానీ, వ్యక్తిగతంగా నాకయితే నచ్చలేదు.

చెప్పే మాట వేరు. చేసేది పూర్తిగా దానికి ఉల్టా ఉంటుంది. లేదా అసలేం జరగదు. ఇంచ్ కదలదు.

ప్రామిస్‌లకు విలువ అస్సలు లేదు.

ఒక అభ్యర్థిని ఒక ఎమ్మెల్లేనో, పార్లమెంటు స్థానానికో ఎన్నిక చేసినట్టు చెబుతారు. అన్ని పేపర్లు, వివరాలు తీసుకుంటారు. నామినేషన్స్ కూడా వాళ్లే ఫిలప్ చేసి, సంతకాలు తీసుకొని రెడీగా పెడతారు. తెల్లారితే "జాబితా ప్రకటన .. ఇంకేం మార్పుల్లేవ్ .. ఉండవ్" అనుకుంటాము. వాళ్లూ అదే చెబుతారు.

తెల్లారుతుంది. జాబితాలో పేరుండదు!

2019 లో, ప్రపంచం అంతా ఒక మంచి "న్యూ ఏజ్" పాజిటివ్ మార్పుకోసం తపిస్తోంటే, ఇక్కడ మాత్రం 65 దాటిన, మృదుస్వభావి అయిన, ఒక పొలిటికల్ లీడర్‌ను అతి కిరాతకంగా నరికేస్తారు.

శరీరంపైన కత్తి గాట్లు, గొడ్డలివేట్లున్నా - దాన్ని ముందు "కార్డియాక్ అరెస్ట్" అంటారు. తర్వాత హత్య అంటారు.

రోజంతా పొలిటికల్ డ్రామా నడుస్తుంది.

తెల్లారి రెండు పార్టీలవారు ఎవరి ఎన్నికల ప్రచారానికి వారు హెలికాప్టరేసుకొని ఎగిరిపోతారు.

వారి మాటలను నమ్మి లక్షలు, కోట్లు ఖర్చు చేసి అన్ని కోల్పోయినవారు వీధినపడతారు. అప్పటిదాకా 'ఆహా ఓహో' అన్నవారు అసలు పట్టించుకోరు. అలా సర్వం కోల్పోయినవాడు పైస పైసకు వెతుక్కుంటూ చావలేక బ్రతుకుతుంటాడు.

ఇదే ఉదాహరణ తెలంగాణలో అయితే - ఏకంగా కేసీఆర్ మీదే పోటీచేసి సర్వం కోల్పోయిన లీడర్‌ను అతని పార్టీ పట్టించుకోలేని పరిస్థితిలో, టీఆరెస్సే ఆహ్వానించి అక్కునచేర్చుకొంది. ఆదుకొంది.

కట్ టూ ఇంకో చిన్న ఉదాహరణ -

నామినేషన్ వేయకముందే అధికారపార్టీ బెదిరింపులు, కాల్స్ మొదలౌతాయి. ఇంటికి పోలీసులొస్తారు. యస్పీ స్వయంగా ఆ అభ్యర్థికి కాల్ చేస్తాడు. ఇంకొకడు కాల్ చేసి "చావాలనుందా" అని టెర్రరైజ్ చేస్తాడు.

ఇన్నీ ఎదుర్కొని, నానా కష్టాలు పడ్ద తర్వాత - ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం టిక్కెటుండదు!

తెలంగాణలో రాజకీయాల్లేవని కాదు. కానీ, ఇంత ఘోరంగా మాత్రం లేవు.

నరుక్కొవడాలు, చంపుకోవడాలు అస్సల్లేవ్.

అంతెందుకు .. ఉద్యమసమయంలో విద్యార్థులను వెంబడించి కొట్టినవారిని, కేసీఆర్‌ను, టీఆరెస్‌ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టినవారిని కూడా .. రాష్ట్రం ఏర్పడ్ద తర్వాత గతమంతా మర్చిపోయి, పార్టీలోకి తీసుకొన్నారు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

ఏం చేసినా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే.

అలాగే - పార్టీలు మారినా, ఏం చేసినా రక్తపాత రహితంగా.

అన్ని కోట్లమందితో, అంత సెన్సిటివ్ తెలంగాణ ఉద్యమాన్ని సహితం నడిపి సాధించింది కూడా రక్తపాత రహితంగానే.

హాట్సాఫ్ టూ కేసీఆర్!

రాజకీయాలు ప్రజలకు సేవచేయడానికే తప్ప ఇట్లా నిలువెత్తు  రాక్షసత్వం చూపడానికి మాత్రం కాదు.