Monday 30 June 2014

ఫేస్‌బుక్ పనికిరానిదని ఎవరన్నారు?

అంతరించిపోతున్న తెలుగు కవిత్వాన్ని బ్రతికిస్తూ, ఇంకెందరో కొత్త కవులు పుట్టడానికి కారణం అవుతూ.. "కవి సంగమం" గ్రూప్‌తో ఫేస్‌బుక్‌ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చో నిరూపించిన 'కవి యాకూబ్' నా మిత్రుడు అని చెప్పుకోడానికి నేను గర్వపడతాను.

యూనివర్సిటీ రోజుల్లో మేం క్లాస్‌మేట్స్, హాస్టల్‌మేట్స్ కూడా.

యాకూబ్ మత నేపథ్యం ముస్లిం అయినా .. అద్భుతమయిన తెలుగు కవిత్వం వాడి చిరునామా. యాకూబ్ రాసిన కవితా సంకలనాలు కొన్ని ఇంగ్లిష్, ఇంకా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి!

కట్ టూ పాయింట్ - 

ఫేస్‌బుక్‌లో "మణిమాలిక" అని ఓ చిన్న క్లోజ్‌డ్ గ్రూప్ ఉంది. అదీ కవిత్వానికి సంబంధించిందే. కాకపోతే.. వాళ్లు పెట్టుకున్న కొన్ని రూల్స్ ప్రకారం కేవలం రెండు లైన్లలోనే చెప్పాల్సిన భావం చెప్పాల్సి ఉంటుంది. ఆ రెండు పాదాల కవిత్వం పోస్టులకు పెట్టే కామెంట్స్ నిజంగా ఒక హైలైట్! చాలాసార్లు ఆ కామెంట్స్ కూడా మళ్లీ మణిమాలిక కవిత్వం అవుతుంది!

ఇలా రాసిన కవితల్లోని ది బెస్ట్ మణిమాలికల్ని ఎన్నిక చేసి, ఆ గ్రూప్ కూడా ఈ మధ్యనే ఓ పుస్తకం పబ్లిష్ చేసింది! ప్రముఖ కవి శివారెడ్ది, తణికెళ్ల భరణి, సుద్దాల అశోక్‌తేజ ముఖ్య అతిథులుగా జరిగిన ఈ ఫేస్‌బుక్ గ్రూప్ బుక్ రిలీజింగ్ ఫంక్షన్ భారీ సక్సెస్‌కి ఆ గ్రూప్ సభ్యుడు (ఇప్పుడు అడ్మిన్ కూడా!), నా ఇంకో మిత్రుడు దయానంద్ రావ్ మూలకారణం. అంతకు ముందే నా మిత్రుడురావ్ మంచి భావుకుడు. యూనివర్సిటీ రోజుల్లోనే ఈ మిత్రుని భావుకత్వం నాకు బాగా తెలుసు. ఇప్పుడు కవిగా కూడా నిరూపించుకున్నాడు.

గ్రూప్ చీఫ్ అడ్మిన్  ప్రసాద్ అట్లూరి గారికి కుడిభుజమై, అంతా తానై, ఆ పుస్తకాన్ని సమయానికి అచ్చు వేయించి, యాకూబ్ ద్వారా సమావేశాన్ని అద్భుతంగా సక్సెస్ చేసాడు నా మిత్రుడు.

ఈ బుక్ ఫంక్షన్ విషయంలో యాకూబ్, యాకూబ్ జీవన సహచరి, కవయిత్రి శిలాలోలిత ల సహకారాన్ని, ప్రోత్సాహాన్ని మర్చిపోకూడదని .. యాకూబ్ ఇంట్లోనే ఓ చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశాడు నా మిత్రుడు రావ్. ప్రతాప్ రెడ్డి, సైది రెడ్ది, రాందాస్, విజయ్ కుమార్ వంటి నా ఇతర యూనివర్సిటీ మిత్రులు వచ్చిన ఆ మీట్‌కి నేనూ వెళ్లాను.  

ఆ మీట్ కూడా మరో మంచి సక్సెస్. మళ్లీ .. క్రెడిట్ గోస్ టూ మిస్టర్ రావ్, నా మిత్రుడు.

ఆ మీట్‌లో జరిగిన ఎన్నో చర్చలు నన్ను మరోమారు నా జీవితగమనాన్ని పునరాలోచించుకునేలా చేశాయి. సంవత్సరాలుగా నేనేం కోల్పోతున్నానో, ఎందుకు కోల్పోతున్నానో నన్ను నేను విశ్లేషించుకునేలా చేసింది. పార్టీలో పాల్గొంటూనే అంత అంతర్మథనం నాలో!

కొత్త ఆలోచనలు. కొత్త యాక్షన్ ప్లాన్‌లు. కొత్త వేగం. అన్నిటి సారాంశం.. ఇంక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నేను కోల్పోయిన ఫ్రీడమ్‌ని వెనక్కి తెచ్చుకోవడం!

ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. అదొక్కటే పనిలో ఉన్నాను.

ఆ మీట్‌కి, నా మిత్రులకు, మీట్‌కి కారణమైన ఆ "మణిమాలికలు" పుస్తకానికి, ఆ పుస్తకం ఆవిర్భావానికి కారణమైన ఫేస్‌బుక్‌కీ.. థాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాను?  

Wednesday 25 June 2014

తెలుగు ఫిలిం ఛాంబర్ Vs తెలంగాణ ఫిలిం ఛాంబర్!

చాలా మేథావులు ..

కేవలం ఒక్క పదం మార్పుతో మళ్లీ ఇక్కడివాళ్లందరినీ బకరాలు చేసి, మునుపటి ఆధిపత్యం, మునుపటి దోపిడీనే కొనసాగించొచ్చని వాళ్ల ఐడియా. స్ట్రాటజీ.

తెలంగాణ సినీ దర్శకులు, ప్రొడ్యూసర్లు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకొని, ఎవరికి తోచిన విధంగా వాళ్లు పది రోజులకు ఒక్కసారి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్తున్నారు. ఈ ఒక్క సంకేతం చాలు అవతలివాళ్లకి.. విడగొట్టి ముందటి పబ్బమే కొనసాగించడానికి!

అత్యధికశాతం మంది సీమాంధ్రులు ఉన్న ఎ పి ఫిలిం ఛాంబర్ పేరును ఇప్పుడు "తెలుగు" ఫిలిం ఛాంబర్ అని మార్చటం అవసరమా? ఎ పి ఫిలిం ఛాబర్ ను ఎవ్వరూ ఇక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పడం లేదే! ఎందుకంత భయం?

అక్కడ సెక్రెటేరియట్ రెండుగా ఎలా విడిపోయిందో.. అసెంబ్లీ ఎలా రెండుగా విడిపోయిందో.. అదే విధంగా ఇక్కడ ఫిలిం ఛాంబర్ కూడా విడిఫోక తప్పదు. ఎవరి ఛాంబర్ వారిది. ఎవరికి తోచినవిధంగా వాళ్లు పని చేసుకుంటారు. అంత సింపుల్ విషయాన్ని మొన్న తమ్మారెడ్ది భరధ్వాజ, నిన్న మురళీమోహన్ చాలా విచిత్రంగా రకరకాల స్టయిల్స్‌లో చెప్తున్నారు!  

అంత అవసరం లేదు. ఒక్కసారి విడిపోయాక అన్నీ విడిపోక తప్పదు. ముఖ్యంగా ఈ ఫీల్డులో ఉన్నంత ఆధిపత్యం, అణచివేత మరెక్కడా లేదు. ఇంకా ఎందుకీ ముసుగులు?

రాష్ట్రాలే విడిపోయాయి. ఇంక ఈ ఫిలిం ఛాంబర్లు ఎంత? విడిపోక తప్పదు.

ఎవరి సినిమాలు వాళ్లు ఎవరితోపడితే వాళ్లతో తీసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవచ్చు. ఎవరూ కాదనరు. ఆధిపత్యం దగ్గరే అసలు సమస్య. ఇదంతా అనుభవించినవారికి తెలుస్తుంది. బయటినుంచి ఎవరు ఎన్నయినా నీతులు చెప్పొచ్చు. అది చాలా ఈజీ.

ఇదొక్కటే కాదు. విడిపోవటమంటూ జరిగితే బయటికి వచ్చే ఛాంబర్ లెక్కలు, భూములు, ఫ్లాట్లు, ఇళ్ల కేటాయింపులూ.. చాలా ఉన్నాయి. దాన్నించి తప్పించుకోడానికే ఇదంతా. ఎన్నడూ లేని ఈ హడావిడి.
ఈ "తెలుగు" స్ట్రాటజీ.

కనీసం క్రియేటివిటీ దగ్గరయినా చెత్త పాలిటిక్స్, కల్మశం లేకుండా విడిపోయి స్వఛ్ఛంగా బ్రతుకుదాం. స్వేఛ్ఛగా బ్రతుకుదాం. 

Tuesday 24 June 2014

గడ్డాలు, మీసాలు ఉంటేనే ఆధ్యాత్మికతా?

ఎప్పుడో యుగాల కిందటి ఋషులు, గురువులు సరే. మన ఆధునిక స్పిరిచువల్ గురువులు కొందరిని చూస్తే మాత్రం నవ్వొస్తుంది. లేటెస్ట్ "లైఫ్ పాజిటివ్" మ్యాగజైన్‌లో ఒక ఆర్టికిల్ చదివాక వెంటనే రాస్తున్న పోస్ట్ ఇది.

గడ్డాలూ, మీసాలూ బాగా పెంచుకొని.. అయితే కాషాయ వస్త్రాలో, లేదంటే తెల్ల దుస్తులో వేసుకొని చిద్విలాసంగా నవ్వడం స్పిరిచువాలిటీ ఎంతమాత్రం కాదు.

కొందరు ఆధ్యాత్మిక గురూజీలు నున్నటి గుండుతో కూడా ఉంటారు. ఇంకొందరయితే దాదాపు ఒంటిమీద ఏమీలేకుండా కూడా ఉన్న దాఖలాల గురించి విన్నాను. చదివాను. (నా అదృష్టం కొద్దీ నేను వారిని చూళ్లేదు!)

స్పిరిచువాలిటీ అంటే పైకి కనిపించే గెటప్ ఎంతమాత్రం కాదు. అదంతా ఉట్టి "షో".

నిజానికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు కూడా టిప్ టాప్‌గా టక్ చేసుకోవచ్చు. టై కూడా కట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే - సౌకర్యం కోసం జీన్స్‌లు, టీషర్టులు, మిడ్డీస్, మినీస్ కూడా వేసుకోవచ్చు. నిత్యజీవితంలోని రొటీన్ పనులన్నీ చేసుకోవచ్చు. వీళ్లు ఇలాంటి దుస్తులే ధరించాలి.. ఇలాగే ఉండాలని రూల్స్ ఏమీ లేవు.

ఆధ్యాత్మికత అనేది మన మనసుకు సంబంధించింది.

ఎవరి బోధనలు విన్నాము, ఎవరిని ఫాలో అవుతున్నాము, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, ఎన్ని ప్రాచీన గ్రంథాలు చదివాము, ఎన్ని ఆధునిక పుస్తకాలు చదివాము అన్నది కాదిక్కడ ప్రశ్న. వాటన్నిటి ద్వారా తెలుసుకున్నదానితో నిన్ను నువ్వు ఏం తెలుసుకున్నావన్నదే సిసలైన స్పిరిచువాలిటీ.

ఈ జ్ఞానోదయానికున్న పవర్ ముందు మరింకే శక్తీ నిలవదంటే అతిశయోక్తి కాదు. 

Saturday 21 June 2014

తొలి తెలుగు "100 క్రోర్స్ క్లబ్" సినిమా!

సినీ ప్లానెట్ దగ్గరున్న ఓ రెస్టారెంట్లో నేనూ, ఓ డిస్ట్రిబ్యూటర్ మిత్రుడు కూర్చున్నాము. మేం ఏదో మాట్లాడుకుంటూ ఉండగా - నా మిత్రుడి మొబైల్‌కు ఓ ఎస్ ఎం ఎస్ వచ్చింది.

అది రాజమౌళి మాగ్నమ్ ఓపస్ "బాహుబలి"కి సంబంధించింది.

నైజాంలో 27 కోట్ల ఆఫర్ వచ్చిందిట బాహుబలికి! అంటే.. మిగిలిన ఆంధ్రా, సీడెడ్‌లలో (అదే, ఇప్పుడు బాగా పాపులర్ అయిన "సీమాంధ్ర") కలిపి ఇంకో 40 కోట్లు కళ్లుమూసుకొని వస్తుంది. ఇక శాటిలైట్స్ రైట్స్ విషయానికొస్తే.. అది 55 కోట్లకి ఫిక్స్ అయినట్టు సమాచారం!

ఇందులో నిజానిజాలెంతో తెలీదుగానీ - ఒక తెలుగు సినిమా బిజినెస్, దాని రిలీజ్‌కు ముందే 120 కోట్లు దాటేసిందన్నమాట!

ఇదేగాని నిజమయితే - బాహుబలి సినిమానే తెలుగులో తొలి "100 క్రోర్స్ క్లబ్" సినిమాగా చరిత్రలో నిల్చిపోతుంది.

అయితే.. ఆ చరిత్ర చూడ్డం కోసం కూడా మనం 2015 వరకు.. ఇంకో ఏడాది ఆగాలి! 

Saturday 14 June 2014

"ధరణి" సిర్ఫ్ హమారా!

చేసే ప్రతి చిన్న పని వెనక ఏదో ఆశించి పని చేయడం ఒక సంస్కృతి. తను నమ్మిన ఒక సిధ్ధాంతం గురించి, వ్యక్తి గురించి.. ఏమీ ఆశించకుండా.. యుధ్ధభూమిలో ఒక సైనికునిలా తను అనుకున్నదే చేస్తూ ముందుకు దూసుకెళ్లడం ఇంకో సంస్కృతి.

మిత్రుడు ధరణి కులకర్ణి ఈ రెండో కల్చర్‌కు చెందినవాడని నా వ్యక్తిగత నమ్మకం. నిజం కూడా అదే.

టీవీ ఛానెళ్లలో, న్యూస్‌పేపర్లలో, ఇంటర్‌నెట్‌లో తప్ప - ధరణి ఎప్పుడూ కె సి ఆర్ ని కలవలేదు. చూడలేదు. పోనీ, ధరణి టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తా అంటే అది కూడా కాదు. జస్ట్ ఒక తెలంగాణ బిడ్డ.

కె సి ఆర్ ని, అతని నాయకత్వంలో టి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమాన్నీ.. మనసా వాచా కర్మణా నమ్మాడు ధరణి. ఒక తెలంగాణ బిడ్డగా, ఉడతా భక్తిగా, తనూ ఉద్యమానికి కొంతయినా ఉపయోగపడాలనుకున్నాడు. అంతే.

హైదరాబాద్‌లోనే తనకున్న చిన్న వ్యాపారం చేసుకుంటూనే, ఫేస్‌బుక్ మీద ఓ కన్నేశాడు ధరణి.

కట్ టూ ఒక ఫ్లాష్  - 

"హైదరాబాద్ సిర్ఫ్ హమారా!" పేరుతో ఒక ఓ ఫేస్‌బుక్ గ్రూప్‌ని క్రియేట్ చేశాడు. కేవలం కొద్ది రోజుల్లోనే వేలాదిమంది సభ్య్లులు స్వఛ్ఛందంగా చేరేలా ఆ గ్రూప్‌ని యమ అగ్రెసివ్ టోన్ లో తీర్చిదిద్దాడు. వయస్సు, చదువు, ఉద్యోగం, వృత్తి, వ్యవహారాలతో సంబంధం లేకుండా ఎందరో ఆ గ్రూప్‌లో సభ్యులయ్యారు. ఈ ఒక్క గ్రూప్‌ని ప్లాట్‌ఫామ్ చేసుకొని, తర్వాత మరెన్నో లైక్‌మైండెడ్ గ్రూపుల్లో తన భయం లేని పోస్టింగులతో చొచ్చుకుపోయాడు.

కేవలం ఒక 25 వేలమంది నెట్‌వర్క్ అలా లక్షలాదిమందిని రీచ్ అయ్యింది. అయ్యేలా చేశాడు.

ఎన్ని చేసినా - ఒకే ఒక్క సింగిల్ లక్ష్యం పైనే అతని దృష్టి. ఒక్క అంశానికే అతని మద్దతు.

అది.. తెలంగాణ. దానికోసం పోరాడుతున్న కె సి ఆర్, అతని సేన.

ఎందరినుంచో ఎన్నో బెదిరింపులు. అయినా భయపడలేదు ధరణి. ఉట్టుట్టి టైమ్‌పాస్ కోసమే కాదు. ఉద్యమం కోసం కూడా ఫేస్‌బుక్ ని ఉపయోగించి లక్షలాదిమందిని ప్రభావితం చెయ్యొచ్చని నిరూపించాడు ధరణి.

ధరణి చేసిన ఆ ఆన్‌లైన్ కృషి ప్రభావం చెప్పలేనంత. ఇంకా చెప్పాలంటే - స్వయంగా అతనే ఊహించనంత!

తెలంగాణ వచ్చింది ..

వన్ ఫైన్ మార్నింగ్ కె సి ఆర్ పొలిటికల్ సెక్రెటరీ శేరి సుభాష్ రెడ్డి దగ్గర్నుంచి ధరణికి కాల్ వచ్చింది. అది కె సి ఆర్ నుంచి వచ్చిన పిలుపు!

కట్ టూ ఆ 10 నిమిషాలు - 

ఒక ముఖ్యమంత్రి, అంతకు ముందు ఒక ఉద్యమ నాయకుడయిన కె సి ఆర్ ని కలవడానికి ఆయన ఆఫీసులో ఎమ్మెల్లేలు, ఎమ్‌పీలు, పార్టీ లీడర్లు, పారిశ్రామికవేత్తలు మొదలైన వి ఐ పి లు ఎందరితోనో అక్కడ ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే - అక్కడ కె సి ఆర్ గడిపే ప్రతి నిమిషానికీ ఎంతో విలువ ఉంటుందన్న విషయం కూడా ఎవరయినా ఇట్టే ఊహించవచ్చు.

అలాంటి పరిస్థితుల్లోనూ, ధరణి ఒక్కడితోనే, పది నిమిషాలకి పైగా .. అన్ డివైడెడ్ అటెన్షన్‌తో గడిపాడు కె సి ఆర్.

"ధరణీ, యువర్ పోస్ట్స్ ఆర్ వెరీ గుడ్! ఫేస్‌బుక్ ద్వారా మీరు చేసిన, చేస్తున్న శ్రమ నేను మర్చిపోలేను. చాలా బాగా చేసిన్రు! అయాం విత్ యూ బ్రదర్!! మీ ఫేస్‌బుక్ గ్రూప్ మిత్రులందరితోనూ ఒకరోజు డిన్నర్ ప్లాన్ చేస్తాను. మనమందరం తప్పక కలుద్దాం!"

ధరణితో గడిపిన ఆ పది నిమిషాల్లో కె సి ఆర్ మాటల సారాంశం అది.

కె సి ఆర్ నుంచి తనకి వచ్చిన ఆ రెడ్ కార్పెట్ వెల్‌కమ్ కే ఇంకా తేరుకోని ధరణి, కె సి ఆరే స్వయంగా ఫేస్ టూ ఫేస్ ఈ మాటల్తో మెచ్చుకోనేటప్పటికి అసలు కలా నిజమా తేల్చుకోలేకపోయాడు.

ఇప్పటికి కూడా, అప్పుడప్పుడూ.. ఆ రోజు జరిగింది, తను కె సి ఆర్ ని కలిసింది.. అసలు కలా, నిజమా అనిపిస్తుంది మిత్రుడు ధరణికి.

నిజమే అని తెలిసినా - ఆనాటి ఆ మధురసృతిని అలాగే పదిలంగా నిలుపుకోవాలనుకుంటున్నాడు ధరణి. అవకాశం ఉన్నా.. మళ్లీ వచ్చినా.. కె సి ఆర్ ని మళ్లీ మళ్లీ కలవాలనుకోవడం లేదు ధరణి.

కె సి ఆర్ తో ఆ ఆత్మీయ ఆలింగనంలో అంత శక్తి ఉంది. ఇప్పటివరకూ, కె సి ఆర్ కూడా బహుశా అంత అభిమానంతో ఎవరితోనూ ఫోటోలు తీసుకోలేదు.

"అందరూ ఆడిపోసుకుంటున్నట్లుగా - కె సి ఆర్ నిజంగా ఒక "దొర ఫీలింగ్" ఉన్నవాడయినట్లయితే - ఓ అతి మామూలు పౌరుడినయిన నన్ను గుర్తించి, పిలిపించి ఇంత ప్రేమ చూపించేవాడా?" అంటాడు ధరణి.

కె సి ఆర్ ని ఉద్దేశించి "దొరల పాలన" అనే మాటని పదే పదే ఉపయోగించేవాళ్లే చెప్పాలి దీనికి సమాధానం.

కట్ టూ వాట్ నెక్స్‌ట్? - 

"తెలంగాణ రన్" పేరుతో మన కళలు, మన సంప్రదాయాలే ప్రధాన టాపిక్‌గా మరో గ్రూపుని ఇటీవలే ప్రారంభించాడు మిత్రుడు ధరణి.  రేపు (15 జూన్) గన్ పార్క్ దగ్గర "కె సి ఆర్ అభిమాన సంఘం" కూడా ప్రారంభిస్తున్నాడు. తన నమ్మకమే తన ఇష్టంగా ఇవన్నీ చేసుకుపోతున్న ధరణిని.. వ్యక్తిగత స్వార్థంతో, ఏదో ఆశించి చేస్తున్నాడని ఎవరయినా అనగలమా?  

కట్ టూ మన జకెర్‌బర్గ్ ఫేస్‌బుక్ - 

తోచిన ప్రతి చెత్తా పోస్ట్ చేస్తూ, జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయడమొక్కటేకాదు. "ఉద్యమాలకు మద్దతుగా కూడా ఫేస్‌బుక్‌ని అత్యంత విజయవంతంగా ఉపయోగించవచ్చు" అని నిరూపించిన మన హైదరాబాద్  ధరణి కులకర్ణి ని అభినందించకుండా ఎలా ఉండగలం?   

Wednesday 11 June 2014

అసలు ఏ యుగంలో ఉన్నాం మనం?

గత నాలుగు రోజులుగా నన్ను అత్యంత దారుణంగా హాంట్ చేస్తున్న సంఘటన ఇది.

ఎన్ని వార్తలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని లైవ్ వీడియోలు, ఎంత దుఖం..

24 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల నిండు ప్రాణాలు చూస్తుండగా బియాస్ వరదలో కొట్టుకుపోయాయి.

అయితే ఇదేదో ఊహించని ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు. మానవ తప్పిదం వల్ల. అజాగ్రత్త వల్ల. బాధ్యతా రాహిత్యం వల్ల.

రెగ్యులర్‌గా ఆ ప్రాంతమంతా టూరిస్టులు తిరిగే ప్రాంతం. మధురస్మృతులుగా దాచుకోవడం కోసం ఫోటోలు తీసుకొనే ప్రాంతం.

ఈ మాత్రం కామన్ సెన్స్ అక్కడి డామ్ అధికారులకు ఉండదని ఎలా అనుకోగలం?

"లేదు" అని నిరూపణ అయ్యింది కాబట్టి ఇప్పుడు అనుకోక తప్పదు.

అంత భారీ స్థాయిలో డామ్ నుంచి క్రిందకి నీరు వదులుతున్నారంటే - దానికి ఎన్ని గైడ్ లైన్స్ ఉంటాయి? పైగా, ప్రవాహం అంత వేగాంగా కిలోమీటర్లకొద్దీ దూకుతోందీ అంటే.. ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?

కనీసం కొన్ని గంటల ముందయినా ప్రమాద హెచ్చరికల్ని పలువిధాలుగా చేయాల్సి ఉంటుంది.

కానీ, అదేదీ లేదు.

ఏదో.. "పని చేశామా, జీతం తీసుకున్నామా".. అంతే.

క్షమించరాని ఈ మానవ తప్పిదం వల్ల 24 నిండు ప్రాణాలు పోయాయి. ఆ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న తల్లిదండ్రుల కలలు ఛిద్రమైపోయాయి. కళ్లముందు ఇంక తమ పిల్లలు శాశ్వతంగా కనిపించని దయనీయమైన స్థితిలోకి తోయబడ్డారు వారి తల్లిదండ్రులు.

దీనికంతటికీ కారణమైన ఆ డామ్ అధికారుల బాధ్యతారాహిత్యానికి ఏ శిక్ష విధిస్తారు? వారికి ఏ శిక్ష విధించినా - పోయిన ఆ 24 మంది విద్యార్థుల ప్రాణాలు వెనక్కి తీసుకురాగలమా?

ప్రతి రోజూ, ప్రతి క్షణం ఎంత టెక్నాలజీ వృధ్ధి అవుతోంది? ఊహించని స్థాయిలో ఎన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు, సేవలు అందుకుంటున్నాం మనం? ఇన్ని ఉన్నా.. ఎన్ని మానవ తప్పిదాలు..ఎలాంటి ఘోరాలు..?

అసలు ఏ యుగంలో ఉన్నాం మనం? ఏ యుగంలోకి వెళ్తున్నాం??   

Sunday 8 June 2014

పాజిటివ్ పాలిటిక్స్ దిశగా!

"ప్రజల్లో ఇప్పుడు చాలా అవేర్‌నెస్ వచ్చింది" అనేది చాలా పాత మాట. ప్రజల్లోకంటే ఇప్పుడు రాజకీయనాయకుల్లో బోల్డంత అవేర్‌నెస్ వచ్చింది. కాకపోతే ఎప్పట్లాగే.. ఒక జీవితకాలం లేటు!

అయినా సరే.. ఇది ఒక విధంగా మనస్పూర్తిగా మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు రాజకీయ పార్టీలకు, నాయకులకూ అందరికీ ఒక్కటే గోల్.

"బాగా.. చాలా బాగా పనిచేయాలి!"

ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రెస్‌మీట్లు కాకుండా.. నిజంగా పని చేసి చూపించాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇవ్వని ఇంకెన్నో హామీలను కూడా నెరవేర్చి, తమని గెలిపించినందుకు ప్రజలకు సర్‌ప్రయిజ్ గిఫ్టులు ఇవ్వాలి. ఇక మీదట ఇది తప్పదు.

వేలకోట్ల, లక్షల కోట్ల స్కాముల ద్వారా డబ్బు సంపాదించుకున్నవాళ్లంతా కూడా ఒక్క క్షణం ప్రశాంత జీవితం కొనసాగించలేకపోతున్నారన్న వాస్తవం గుర్తించాలి.

పని చేయండి. మీకు వోటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అయిదేళ్ల తర్వాత కూడా కుర్చీ మీదే. చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోతారు.

కేవలం డబ్బే కావాలనుకుంటే మాత్రం తొందరలో గద్దె దిగిపోడానికి కూడా సిధ్ధంగా ఉండాలి. తప్పదు. మరోసారి ఇక ఈ వైపు కూడా చూడలేరు. ఇదే నిజం.

ఈ నిజాన్ని ఇప్పుడు మన పొలిటీషియన్లు కూడా గుర్తించారు. 

Friday 6 June 2014

అసలెవరు? ఎలా కనుక్కోవడం? ఎక్కడ కలవడం?

పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైపోయింది.  ఆ రాజకీయాలు, ఆ హడావిడి కాస్త చల్లబడింది. ఎవరి ప్రభుత్వం, ఎవరి ప్రాంతం గొడవల్లో వారున్నారు.

కట్ టూ మన పాయింట్ - 

మూడు చిత్రాలు రూపొందించిన దర్శకునిగా నాకు (కలిసి ఉన్న ఎ పి లోని) తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌లో లైఫ్ మెంబర్‌షిప్ ఉంది. అయితే.. అంకె రీత్యా, ఆధిపత్యం రీత్యా అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ దర్శకుల అసోసియేషన్. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఈ స్టేట్‌మెంట్‌లో ఎలాంటి నెగెటివిటీ లేదు. జస్ట్ మనం ఒప్పుకోవాల్సిన రియాలిటీ తప్ప.

రాష్ట్రం ఎలాగూ విడిపోయిందికదా అని.. తెలంగాణ దర్శకుల సంఘంలోనూ మెంబర్‌షిఫ్ తీసుకుందామనుకున్నాను. ఎక్కడా ఎవరి అడ్రసూ దొరకలేదు. పేపర్లలో వీరి స్టేట్‌మెంట్లు, ప్రెస్‌నోట్లు మాత్రం కోకొల్లలుగా వస్తున్నాయి!

ఒకరిద్దరు తెలంగాణ దర్శక మిత్రులకి ఫోన్ చేశాను. ఏం తెలీదన్నారు వాళ్లు.

రాష్ట్ర విభజన జరిగాక - ఒక సీనియర్ తెలంగాణ దర్శకుని అధ్వర్యంలో.. తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వ్యవహారాలపైన ఒక కొత్త సిస్టమ్‌ని రూపొందిస్తున్నట్టుగా అప్పట్లో పేపర్లలో చదివాను.

మళ్లీ ఈ మధ్య - ఇంకో తెలంగాణ సీనియర్ దర్శకుడిచ్చిన ప్రెస్‌నోట్లు వరుసగా రెండు చదివాను. ఆయన కూడా తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడని ఆ ప్రెస్‌నోట్స్ ద్వారానే తెలిసింది నాకు!

"కూడా" అని పైన ఎందుకన్నానంటే - ఇలా ఎవరికి వాళ్లు ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకుంటున్నారని తెలిసి!

వెంటనే ఆయా సంఘాల నంబర్లు, అడ్రసులూ తీసుకుందామని తెలంగాణ ఫిలిం చాంబర్‌కు ఫోన్ చేశాను.

" సార్! ఒక్కటి కాదు. ఇలా చాలా ఉన్నాయి. ఎవరికివాళ్లు ఏదో చేస్తున్నారు.. లేదా చేసేస్తున్నాం అనుకుంటున్నారు. దీనిగురించే మా చాంబర్ మీటింగ్‌లో వచ్చే వారం చర్చించబోతున్నాం. అంతే తప్ప.. వాళ్ల నంబర్లు, ఆఫీస్ అడ్రస్‌లూ మాదగ్గరేం లేవు!" అన్నారు తెలంగాణ చాంబర్ వాళ్లు.

శుభం. ఆ చాంబర్ మీటింగేదో తొందరగా జరిగి, ఏదయినా సరే.. అంతా ఓ పధ్ధతిలో జరిగేట్టుగా స్ట్రీమ్‌లైన్ చేసేస్తే బావుంటుంది.

నాకు సంబంధించిన అసోసియేషన్స్‌లో నేనూ చేరతాను. ఉడతా భక్తిగా నేను చేయగలిగిందేదో నేనూ చేస్తాను. 

కథ చెప్పడానికే 6 నెలలా?

నాకు బాగా దగ్గరగా తెలిసిన ఓ వర్ధమాన దర్శకుడు తన తొలి చిత్రాన్ని పేరున్న హీరోతోనే చేయాలని డిసైడ్ అయ్యాడు. తప్పేం లేదు.

తొలిచిత్రంతో కాస్తంతయినా గుర్తింపు వస్తేనే ఏ దర్శకుడయినా ఇండస్ట్రీలో బ్రతకగలుగుతాడు. తర్వాత అవకాశాలకి పెద్ద సమస్య ఉండదు. సో, మనవాడి నిర్ణయం మంచిదే.

తొలిచిత్రం సూపర్ డూపర్ హిట్ ఇచ్చి, మరికొన్ని చెప్పుకోదగ్గ హిట్లు కూడా ఖాతాలో ఉండి, ఇటీవలికాలంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న ఓ కుర్ర హీరోని కలిసి కథ చెప్పడానికి..చాలా కష్టపడి.. ఎలాగో "రూట్" సంపాదించాడు మన దర్శకుడు.

అదీ ప్రారంభం ..  

గత 6 నెలలుగా ఆ హీరో, హీరో తాలూకు మనుషులు, వందిమాగధులు వగైరా.. వరుసగా కథ వింటూనే ఉన్నారు. మనవాడు చెప్తూనే ఉన్నాడు. అది ఎప్పటికి ముగుస్తుందో ఎవరికీ తెలీదు. ఎలా ముగుస్తుందో కూడా తెలీదు. ఇంకో ఆర్నెల్లు ఇలాగే తిప్పి, చివరికి, "నో" అన్నా ఆశ్చర్యం లేదు.

నాకు తెలిసి, 99% చివరికి జరగబోయేది అదే!

అసలు కథ "చెప్పడమేంటి?"

అదికూడా.. సంబంధం లేని ఇంతమందికి ఇన్నేసి నెలలుగా చెప్పడమేంటి? ఈ చెత్త సంస్కృతి ఇంకెన్నాళ్లు?

కట్ టూ మన దర్శకుడు - 

చాలా ఏళ్ల క్రితం.. గుంటూరులోని ఓ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో (నవోదయ విద్యాలయ) నేను పని చేసినప్పుడు, ఈ వర్ధమాన దర్శకుడు అక్కడ నాకు స్టూడెంటు.

టాలెంట్ ఉంది. ఫిలిం మేకింగ్‌కు సంబంధించి టెక్నికల్‌గా చాలా తెలుసు. కెమెరామెన్‌గా కూడా చేశాడు. బోల్డన్ని యాడ్స్ చేశాడు. ఊరికే "కథ చెప్పడం" కాదు.. బౌండెడ్ స్క్రిప్టులు, స్టొరీ బోర్డులు పూర్తిచేసుకొని మరీ తిరుగుతాడు.
అయినా ఏమీ కదలట్లేదు. కదలదు అంత తొందరగా. దానికి కొన్ని లెక్కలుంటాయి.

అంతా పెద్ద మేనిప్యులేషన్. మాయ.  

ఇప్పటికే, ఇంకా దర్శకుడు అవకముందే.. ఇండస్ట్రీ ఏంటో 90 శాతం అర్థం చేసుకోగలిగాడు మన దర్శకుడు. మిగిలిన 10 శాతం మాత్రం చచ్చినా అర్థం కాదు. కానీయరు. అదే మన ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఓ చెత్త సంస్కృతి.

ఏమైనా, ఐ విష్ అవర్ డెబ్యూ డైరెక్టర్ ఆల్ సక్సెస్.. వెరీ సూన్!

***

(ఎడిట్, 22 ఆగస్ట్ 2014: నా బెస్ట్ విషెస్ ఫలించలేదు. ఇంకా పెళ్లికూడా చేసుకోని ఈ యువ దర్శకుడు, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆకస్మికంగా నిన్నరాత్రి మరణించాడు.)