Friday 29 March 2013

తెలుగమ్మాయి కావలెను!


పదహారణాల తెలుగమ్మాయిలు ముగ్గురి కోసం గత రెండు నెలలుగా శతవిధాలా వెతుకుతున్నాము. ఫిలిం మ్యాగజైన్లలో యాడ్స్ ఇవ్వటం నుంచి మొదలెట్టి, ఫేస్‌బుక్ మీదుగా, యూట్యూబ్ లోని షార్ట్ ఫిలింస్ లో నటించిన అమ్మాయిలదాకా...

ఏమాత్రం లాభం లేదు. కనీసం ఒక్క అమ్మాయిని సెలక్టు చేసుకోలేకపోయామంటే మాకే ఆశ్చర్యంగా ఉంది! అంతకు ముందు స్టార్ డైరెక్టర్లంతా తమ ఇంటర్వ్యూల్లో ఈ విషయం మీద ఎన్నోసార్లు వారి అనుభవాల్ని చెప్పారు. అప్పుడు నేను అంతగా పట్టించుకోని ఆ మాటలు ఇప్పుడు ఎంత నిజమో నా వ్యక్తిగత అనుభవంతో తెలుస్తోంది!

ఒకరిద్దరు నిజంగా బాగా ఉన్న అమ్మాయిలు ఆడిషన్‌కి వచ్చినా, చివరికి వాళ్ల పేరెంట్స్ పెట్టిన అర్థంలేని కండిషన్లతో (లేదా, మేం తీర్చలేని కోరికలతో) వారిని వెనక్కి పంపక తప్పలేదు. ఇంకా తెరమీద అరంగేట్రం చెయ్యని ఇంకొక అమ్మాయి ఏకంగా కొన్ని లకారాల రెమ్యూనరేషన్ అడిగింది!  పరిస్థితి ఇలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు.

అయితే - ఇలా ఉన్నట్టుండి తెలుగమ్మాయిల స్పందన లేకపోడానికి, లాజికల్‌గా ఒక కారణం మాత్రం నేను అనుకుంటున్నాను. అది... ప్రస్తుతం పరీక్షల సీజన్ కావటం.

ఏమైనప్పటికీ, ముంబైలో ఓ ముగ్గురు అమాయిల్ని ముందే రిజర్వ్‌లో  పెట్టుకున్నాము కాబట్టి టెన్షన్ లేదు. లేదంటే ఇదొక పెద్ద టెన్షనే అయ్యేది. కొంతవరకు, ఫరవాలేదు అనుకున్న కొందరిని షార్ట్‌లిస్ట్ చేసి ఉన్నాము. అయినా, ఇంకా మా అన్వేషణ కొనసాగుతూనే ఉంది.

నాకు మాత్రం ఇంకా నమ్మకముంది... మా కొత్త సినిమాలో, నేను ఊహించిన స్థాయిలో కనీసం ఒక్క తెలుగమ్మాయి అయినా హీరోయిన్‌గా చేస్తుందని.

***

My Facebook Page: www.facebook.com/onemano
My Direct Email: manutimemedia@gmail.com

Saturday 23 March 2013

చల్లటి "నెగెటివిటీ కమ్ శాడిజమ్!"


అత్యంత తక్కువ సర్క్యులేషన్ ఉన్న మన తెలుగు దినపత్రికల్లో అదొకటి. అందులో ప్రతి వారానికి ఒక రోజు సినిమాపైన ఓ నాలుగు పేజీల సప్లిమెంట్ వస్తుంది. ఆ సప్లిమెంటుకో పేరు కూడా పెట్టారు... చల్లగా, అద్భుతంగా అనిపించే ఒక అందమైన పదంతో. వాస్తవానికి, ఆ నాలుగు పేజీల్లో అత్యధిక భాగం నెగెటివిటీ... లేదంటే, శాడిజం మాత్రమే కనిపిస్తాయి.


అలా మూర్తీభవించిన నెగెటివిటీని, షుగర్ కోటింగ్ ఇచ్చిన శాడిజాన్నీ చదవడం కోసం మన సినిమావాళ్లు కొందరు, సినీ ప్రేమికులు కొందరు... వారం వారం ఆ ఒక్క సప్లిమెంట్ కోసం ఆ దినపత్రికని కొంటారు. ఆ ఒక్క రోజు మాత్రమే ఆ పత్రిక కాపీలు తొందరగా అమ్ముడుపోతాయి న్యూస్ స్టాండ్స్‌లో... విచిత్రంగా! మిగిలిన ఆరు రోజులూ ఆ పత్రికని కనీసం టచ్ చేయరు... అదే మనవాళ్లు, మన సినీ ప్రేమికులూ!!

నా బ్లాగ్ మిత్రుల కోసం రెండే రెండు అంశాలు చర్చించి ఈ బ్లాగ్ పోస్ట్‌ని ముగిస్తాను...

1. ప్రతి వారం విడుదలయ్యే సినిమాలపైన రివ్యూలని, ఆ తర్వాతి వారం ఈ చల్లటి సప్లిమెంటులో పబ్లిష్ చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే - వ్యక్తిగతంగా వీరికి ఉందనుకుంటున్న మేధస్సుకి (!?) బాగా నచ్చిన సినిమాలను అకాశానికి ఎత్తేస్తారు. బయట థియేటర్లలో మాత్రం వాటికి కలెక్షన్లు సున్నా. రివ్యూల్లో వీరు పరమ  చెత్త అని ఉతికి ఆరేసిన సినిమా... అవతల థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటుంది!

అలాగని, అన్ని రివ్యూలూ ఇలాగే ఉంటాయని జెనరలైజేషన్ కాదు. ఎక్కువ భాగం మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి.  అలాగే - వీరు రాసే ప్రతి సినిమా రివ్యూలో వంద తప్పులు చూపిస్తారు. సినిమా అసలు ఎలా తీయాలో సెలవిస్తూ మరో వంద సలహాలనిస్తారు. దురదృష్టవశాత్తూ వీళ్లు ఒక్క సినిమా తీయలేరు. తీసిన జాడ లేదు.

2. పోనీ, ఈ సప్లిమెంటులో రాసే సమీక్షకులు, విశ్లేషకులు ఏమయినా అఖండ మేధావులా అంటే... అదొక పెద్ద కొశ్చన్ మార్కు!

వీరిలో ఒకాయన 'సిడ్ ఫీల్డ్' పుస్తకాలు రెండు చదివుంటాడనుకుంటాను. స్క్రీన్‌ప్లే ఇలా ఉండాలి, అలా ఉండాలి... సిడ్ ఫీల్డ్ ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని ఓ సొద రాసేస్తాడు. ఇంత తెల్సిన ఈ రచయిత ఓ అద్భుతమయిన స్క్రీన్‌ప్లే రాసి మన అగ్రస్థాయి రచయితలను, దర్శకులను ఇంటికి పంపొచ్చుగా!?  అలా చెయ్య లేరు.

చెప్పటం ఎవరయినా ఏదయినా చెప్తారు. చేసి చూపించటమే చాలా కష్టం. ఆ వైపు ప్రయత్నించాలన్నా వీరి వల్ల కాదు. పై ఖర్చుల కోసం వీరు బయట చేసే పనులు వేరే ఉంటాయి. ఆ పనుల్లో బిజీగా ఉంటారు. ఉదాహరణకి, పోస్టు ద్వారా సినీ కోర్సులు పంపించే వ్యాపారం చేసే వ్యక్తులకోసం, ఇంగ్లిష్ పుస్తకాల్లోంచి తెలుగులోకి అనువాదం చేసి - "కోర్సు మెటీరియల్" (!) తయారు చేసివ్వటం. అంటే, "కాపీ" మేస్త్రీ పని అన్నమాట!

ఈ కాపీ మేస్త్రీ పనుల్లాంటి పనులు లేకున్నా - వీరిలో ఏ ఒక్కరయినా - అద్భుతమయిన స్క్రీన్‌ప్లేలురాసి, చిత్రాలు తీసి ఒప్పించగలరా అంటే... అంత సీన్ అక్కడ లేదు.

ఇంకో గ్రేట్ సమీక్షకులవారు ఇలా రాస్తారు:

...సినిమా డైలాగులు ఏవీ "గుర్తుపెట్టుకొనే రీతిలో రాయాలని" సంభాషణల రచయిత (సో అండ్ సో )అనుకున్నట్టు లేదు!... 

అదండీ విషయం. సంభాషణల రచయిత "డైలాగుల్ని గుర్తు పెట్టుకునే రీతిలో" రాయాలట!  ఇవీ సమీక్షలు... వీరంతా సమీక్షకులు, విశ్లేషకులు! వీరంతా వండుతున్న ఈ అద్భుత సప్లిమెంటును మన సినీ జనం, సినీ ప్రేమికులు (కొందరయినా) వారం వారం ఎగబడి కొనడం నిజంగా ఆశ్చర్యకరం.

కూర్చున్న చోటే ఉండి, ఎలాంటి ప్రాథమిక అవగాహన లేకుండా - నెగెటివిటీ ఎగజిమ్ముతూనో, విషం కక్కుతూనో రెండు పేజీల రివ్యూ రాయటం చాలా ఈజీ. లక్షలు, కోట్లు సేకరించి, వందలాదిమందితో కోఆర్డినేట్ అవుతూ ఒక సినిమా తీయటం మాత్రం అంత ఈజీ కాదు.

ఆ శ్రమ పట్ల కనీస అవగాహన ఉన్నవారు రాసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి.
దురదృష్టవశాత్తూ అలాంటి సమీక్షకులు, విశ్లేషకుల సంఖ్య చాలా తక్కువ... 

Sunday 17 March 2013

వదిలేయాల్సింది తెల్సుకుంటే చాలు!


ఈ బ్లాగ్‌లో నేను రాసే ప్రతి టాపిక్ కూడా - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో - అంతిమంగా చేరుకునే గమ్యం క్రియేటివిటీనే.

లెక్కకుమించిన టీవీ చానెళ్లు, ఇంటర్నెట్, గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీలు... ఇవన్నీ సమాచారపరంగా మన మస్తిష్కాలపైన, మన సమయంపైన, మన జీవితాలపైన చేస్తున్న దాడి అత్యంత దారుణమైన స్థాయిలో ఉంది.   దీన్ని గమనిస్తున్నవారు తక్కువ. గమనించి, ఈ ఆధునిక సమాచార విప్లవాన్ని తమకు అనుకూలంగా చేసుకుంటున్నవారు మరీ తక్కువ. వివిధ క్రియేటివ్ ఫీల్డుల్లోనే కాకుండా, వ్యాపార రంగాల్లో కూడా ఉండే అత్యంత తెలివయిన ఈ తక్కువ జనాభానే అనుకున్నది ఏదయినా చేయగలుగుతారు. చిన్నవయినా, పెద్దవయినా ... ఆయా రంగాల్లో వారు అనుకున్న సామ్రాజ్యాల్ని సృష్టించుకోగలుగుతారు.

"నేను ఏదయినా సాధించగలను" అన్న అలోచన చాలా భయంకరమైంది. ఆచరణకు దూరంగా నిలిపే ఈ అలోచన ఒక్కటి చాలు... ఒక మనిషి జీవితం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అసంతృప్తితోనే సమాధికావడానికి.

నాకు తెలుసు. పర్సనల్ డెవెలప్‌మెంట్ థియరీల ప్రకారం - మీరు చదువుతున్నది కొంతవరకు "కాంట్రడిక్టరీ"గా అనిపించవచ్చు. కానీ, క్రియేటివిటీ విషయంలో మాత్రం ప్రాక్టికల్‌గా ఇదే నిజం. మనకి మనం కొన్ని పరిమితులు పెట్టుకోవటం ద్వారానే నిజమయిన స్వతంత్రాన్ని పొందగలుగుతాం. నిజమైన లక్ష్యాల్నీ, విజయాల్నీ కొన్నిటినయినా సాధించగలుగుతాం.

ఒక పెద్ద రచయిత కావాలనుకున్న లక్ష్యం ఉన్నవాళ్లు కనీసం ఒక చిన్న కథానికనయినా ముందు రాసెయ్యాలి. కనీసం ఆ ఆలోచనను పేపర్ మీద పెట్టెయ్యాలి. ఎం ఎఫ్ హుస్సేన్ రేంజ్‌లో ఒక ఆర్టిస్టు కావాలనుకునేవాళ్లు కనీసం సింగిల్ కలర్లోనయినా ఓ చిన్న పెయింటింగ్‌ను ముందు గీసెయ్యాలి. ఇదే విధంగా - ఒక బిజినెస్‌మ్యాన్ కావాలనుకునేవాడు ముందు అసలేమీ పెట్టుబడి లేకుండానే అతి చిన్న స్థాయిలోనయినా ఒక వ్యాపారపరమయిన లావాదేవీ పూర్తి చేసెయ్యాలి.

ఈ మాత్రం చేయడానికి 'అన్నీ' ఉండనక్కర్లేదు. ఏ ఇతర సాకులతోనూ తప్పించుకోలేరు. ఇప్పటికిప్పుడు మీ దగ్గర ఉన్న సమయం, స్థలం, మేధస్సు, మెటీరియల్స్‌తోనే ఈ స్థాయిలో మీ ప్రయాణం ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఒక గైడెడ్ మిస్సైల్‌లాగా మీ  క్రియేటివ్ జర్నీ అదే కొనసాగుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది.

దీనికోసం మొట్టమొదటగా ఎవరయినా చేయాల్సింది ఒక్కటే. 'ఏది కావాలి' అన్నది మీకు తెలుసు. 'ఏది సాధించాలో' మీకు తెలుసు. అది పొందకుండా, అది సాధించకుండా, ఆ దిశలో మీరు ముందుకు కదలకుండా మిమ్మల్ని ఆపుతున్నది, మీ సమయాన్ని తినేస్తున్నది ఎవరో, ఏంటో ముందు మీరు గుర్తించాలి. ఆ వ్యక్తిని లేదా ఆ విషయాన్ని వెంటనే వదిలేయ్యాలి.

పనికిరాని స్నేహాలు కావొచ్చు. అడుగు ముందుకు వేయనీయని శాడిస్టు జీవిత భాగస్వామి కావొచ్చు. వదిలేయక తప్పదు. లేదా, ఏదో ఒక రూపంలో ఒక ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదు. అలాగే - టీవీ చానెళ్లు కావొచ్చు. గమ్యంలేని ఇంటర్నెట్ బ్రౌజింగ్ కావొచ్చు. ఫేస్‌బుక్‌లాంటి ఒక లక్ష్యం లేని సోషల్ నెట్‌వర్కింగ్ కూడా కావొచ్చు. "అన్నీ ఉన్నప్పుడే నేను ఏదయినా చేయగలను" అన్న ఒక అసమర్థపు ఆలోచన కూడా కావొచ్చు. ముందు వీటిని గుర్తించాలి. ఏదో రకంగా, ఆ క్షణమే వీటికి చెక్ పెట్టేసెయ్యాలి.  

అంటే - ఏది వదిలెయ్యాలో ముందు మనం తెలుసుకోవాలి. వెంటనే ఆ పని చేసెయ్యాలి. ఆ తర్వాత ఏది కావాలో అది మనకు తప్పక చేరుతుంది. ఒక అద్భుతం లాగా. ఊహించనత తక్కువ సమయంలో.

Saturday 16 March 2013

యురేకా సకమిక!


"లైఫ్‌లో ఇక సినిమాల జోలికి వెల్లొద్దు" అని ఒక దశలో అనుకున్నవాణ్ణి. ఇప్పుడు మళ్లీ "యురేకా సకమిక" అనక తప్పటంలేదు! సో, ఏప్రిల్ 21 నుంచి మళ్లీ 'యాక్షన్' ప్రారంభం..

సినీ ఫీల్డు నా ప్రధాన వ్యాపకం కాదు. వ్యసనం కూడా కాదు. కానీ, దాదాపు ఒక పదేళ్లుగా ఈ రంగంలో పైపైనయినా నాక్కొంత పరిచయం ఉంది. జస్ట్ రెండు మూడేళ్ల క్రితం నాటి చిత్రపరిశ్రమ వేరు. ఇప్పటి పరిశ్రమ వేరు. ఫిలిం మేకింగ్ లో వచ్చిన ఆధునిక టెక్నాలజీ మొత్తం ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చివేసింది. ఈ మార్పే, ఒక రకంగా మళ్లీ నేను మెగాఫోన్ పట్టడానికి కారణమయింది.

గతంలో ఒక సినిమా తీయాలంటే దానికో ఆఫీసు; రోజుకో వందమంది రావటం పోవటం; అందరికీ కాఫీలు, టీలు; కొందరికయినా టిఫిన్లు; కనీసం ఓ డజనుమందికయినా టైమ్‌కు భోజనాలు ... అంతా ఒక సత్రం వ్యవహారంలా నడిచేది కథంతా. ఆఫీసు మైంటెనెన్సు ఖర్చులో దాదాపు 90 శాతం వృధా ఖర్చు అంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడా అవసరం లేదు. పేరుకు ఒక చిన్న ఆఫీసు ఉంటే చాలు. (అది కూడా లేకుండా సినిమా తీయవచ్చు. అది వేరే విషయం!) టీమ్‌ను సెలెక్టు చేసుకోవటం నుంచి, ఎవరి పనులను వారికి అప్పగించి.. ఆయా పనులను పూర్తి చేయించుకోవటం వరకు.. అంతా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ల్యాండ్ ఫోన్స్ అవసరం అస్సలు లేదు. అసలవి ఎక్కడా కనిపించట్లేదు కూడా! మొబైల్ ఫోన్లలోనే అంతా కట్ షాట్స్ తరహాలో జరిగిపోతోంది. కాల్స్‌ని ఇష్టపడని వారంతా కేవలం ఎస్ ఎం ఎస్ లతోనే దాదాపు అన్ని పనుల్నీ కానిచ్చేస్తున్నారు.

టీం మొత్తం ఒక్క దగ్గర కలిసేది ఇక షూటింగ్ అప్పుడే. అది పూర్తయ్యిందంటే మళ్లీ మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి కూడా సత్రం వ్యవహారం అక్కర్లేదు. ఎవరిపని వాళ్లు ఒక డిసిప్లిన్‌తో చేసుకుంటూ వెళ్లటమే! ఇక్కడ ప్రధానం - సినిమా అనుకున్నది అనుకున్నట్టు పూర్తిచేయగలగటం. భోజనాలు వచ్చాయా లేదా, బొమ్మిడాయిలు తిన్నామా లేదా అన్నది కాదు ముఖ్యం.

"యురేకా సకమిక" ప్రి-ప్రొడక్షన్ పనంతా కూడా దాదాపు ఇదే పధ్ధతిలోనే పూర్తికాబోతోంది... ఎలాంటి ఆటంకాల్లేకుండా!

అదీ ఇదీ అన్న తేడా లేకుండా, ఎడా పెడా కమిషన్లూ తింటూ, నిర్మాతని నిర్దాక్షిణ్యంగా దోచేసే 24 క్రాఫ్టుల్లో ఒక క్రాఫ్టుకు సంబంధించిన మనుషుల ఉనికే ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకమయిపోయింది. "యూనియన్ రూల్స్ తో సంబంధం లేకుండా మీ సినిమా మీరు ఎలాగయినా తీసుకోవచ్చు!" అని TFCC భరోసా ఇవ్వటం ఒక గొప్ప పరిణామం.

దాదాపు 'నో బడ్జెట్' తో ఒక పూర్తి స్థాయి సినిమా తీయటం, తీసి రిలీజ్ చేయటం సాధ్యమేనని నిరూపించే క్రమంలో తీస్తున్న చిత్రం "యురేకా సకమిక". ఒక మైక్రో బడ్జెట్ చిత్రం. చెప్పాలంటే, ఒక కమర్షియల్ ఆర్ట్ సినిమా. కాన్సెప్ట్ స్టేజ్ నుంచి, సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేవరకు... అన్ని ముఖ్యమయిన విషయాలను పొందుపరుస్తూ ఒక పుస్తకం కూడా రాసి పబ్లిష్ చేయాలన్నది నా ఆలోచన.  "ది మేకింగ్ ఆఫ్ యురేకా సకమిక" అన్నమాట! ఇప్పుడు మీరు చదువుతున్న ఈ బ్లాగ్ పోస్ట్ బహుశా ఆ పుస్తకంలో ఒక పేజీ కావచ్చు...

Wednesday 13 March 2013

కొత్త తెలుగు హీరోయిన్లు కావాలి!


ఏప్రిల్ లో నేను ప్రారంభించబోతున్న యూత్ చిత్రం కోసం - ముంబైలో ఉన్న నా కోఆర్డినేటర్ మిత్రుడి సహాయంతో ఆల్రెడీ ముగ్గురు అమ్మాయిల్ని షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోవటం జరిగింది. కానీ, ఎంత కమర్షియల్ చిత్రమయినప్పటికీ, కొన్ని సాంకేతికపరమయిన కారణాలు / ఇబ్బందుల వల్ల, ఇప్పుడు ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలనే హీరోయిన్స్ గా పరిచయం చేయాలనుకుంటున్నాను.

ఈ మధ్యనే నేను పూర్తి చేసిన ఒక చిత్రం లోని హీరోయిన్ ముంబై నుంచి వచ్చిన అమ్మాయే. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక, కొన్ని కారణాలవల్ల ప్రొడ్యూసర్ పాటల్ని షూట్ చేయటం  ఆలస్యం చేశాడు. అప్పటివరకూ దాదాపు ప్రతి రోజూ టచ్ లో ఉన్న ఆ హీరోయిన్ ఉన్నట్టుండి మాయమైపోయింది!

ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో ఎవ్వరికీ తెలియదు. వాళ్ల పేరెంట్స్‌కి కూడా!

మా వాళ్లు ఆరా తీయగా, తీయగా ఆ అమ్మాయి ఫ్రెండ్స్ లో ఒకరి ద్వారా తెల్సింది ఏంటంటే... ఆ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో న్యూజిలాండ్ వెళ్లిపోయిందని! ఆ చిన్న సమాచారం తప్ప, ఇంక ఎలాంటి కాంటాక్టు లేదు. చివరికి ఆ హీరోయిన్ పేరెంట్స్‌కి కూడా ఈ విషయం మా సినిమావాళ్ల ద్వారానే తెలిసింది. అదీ పరిస్థితి.

అయితే - ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఊహించని సమస్యలు ఇంకెన్నో ఉంటాయి. ఇప్పుడు నేను ప్రారంభించబోతున్న మైక్రోబడ్జెట్ సినిమాకి ఈ తంటాలు వద్దంటే వద్దనుకుంటున్నాను.

ఇదివరకులాగా కాకుండా - ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పేరెంట్స్ నుంచి కూడా ప్రోత్సాహం ఉంటోంది. "ఛీ, సినిమాల్లోకా?!" వంటి చెత్త ఎక్స్‌ప్రెషన్ నుంచి... "వావ్! సినిమాల్లోకే!!" లాంటి పాజిటివ్ ఎక్స్‌ప్రెషన్ రేంజ్ కి వచ్చింది పరిస్థితి.

అంతే కాదు. ఇటీవల వచ్చిన కొన్ని హిట్ యూత్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లంతా కూడా తెలుగు అమ్మాయిలే కావటం ఒక మంచి పరిణామం. సో, ఏప్రిల్లో నేను షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ యూత్ చిత్రంలో కూడా తెలుగమ్మాయిలే హీరోయిన్లుగా ఉంటారు...

***

(ఆసక్తి ఉన్న తెలుగు అమ్మాయిలు, నా ఫేస్‌బుక్ పేజ్ లో మెసేజ్ పెట్టడం ద్వారా నన్ను డైరెక్టుగా కాంటాక్టు కావచ్చు.)
www.facebook.com/onemano

Email: mchimmani@gmail.com 

Friday 8 March 2013

కిక్కిస్తున్న టైటిల్ క్రేజ్!


అంతా కొత్త వారితో ఇప్పుడు నేను తీయబోతున్న యూత్ ఎంటర్‌టైనర్ చిత్రం కోసం - మొన్న ఫిబ్రవరి 26 నాడు టైటిల్ ని రిజిస్ట్రేషన్‌కి పంపాను. ఆ తర్వాత సరిగ్గా 6 వ రోజున చాంబర్ (TFCC) నుంచి నాకు కాల్ వచ్చింది - "మీ టైటిల్ ఓకే అయింది. సర్టిఫికేట్ కోసం ఎవరినయినా పంపించండి" అంటూ...

కట్ చేస్తే -

మొన్న మార్చి 4 నాడు మధ్యాహ్నం నాకు తెలీని ఒక నంబర్ నుంచి ఓ కాల్ వచ్చింది. "మీరు 'ఫలానా' టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారట కదా! మేమూ మా సినిమాకి అదే టైటిల్ అనుకుంటున్నాము. మీ టైటిల్ మాకివ్వడానికి ఏమయినా వీలవుతుందా?" అని. నిన్న మధ్యాహ్నం మళ్లీ ఓ కాల్.. అదే టైటిల్ గురించి, అదే టీమ్ నుంచి! ఇదే విషయం మీద మొన్న నాకు ఫోన్ చేసిన వ్యక్తి వాళ్ల డైరెక్టర్ అని చెప్పాడు. "సారీ" చెప్పాను.

నిజానికి, ఈ టైటిల్ ని స్క్రిప్టు దశలోనే అనుకొన్నాన్నేను. "Love Just Happens ..." అనేది ఈ టైటిల్ కి ట్యాగ్‌లైన్. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. అయినా నేను ఈ టైటిల్‌కే ఫిక్స్ అయిపోయాను.

ఈ టైటిల్ లో ఉన్న రెండే రెండు చిన్న పదాలు, సుమారు 30 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సూపర్ హిట్ చిత్రంలోని ఒక పాటలోవి. సృష్టికర్త వేటూరి సుందర రామమూర్తి. నా చిత్రం టైటిల్ కార్డ్స్ లో ముందే ప్రత్యేకంగా వేటూరి గారికోసం వినమ్రతాపూర్వక కృతజ్ఞతగా ఓ కార్డు వేయాలనుకుంటున్నాను. నా తొలి చిత్రం "కల" కోసం వేటూరిగారితో కలిసి పనిచేసే గొప్ప అవకాశం నాకు దొరకడం నేను మర్చిపోలేని ఒక జ్ఞాపకం. "కల" లో వేటూరి గారు అయిదు పాటలు రాశారు.

కట్ చేస్తే -

ప్రస్తుతం ఈ టైటిల్ కోసం కొన్ని లోగోలను డిజైన్ చేస్తున్నాము. కొన్ని రోజుల్లోనే టైటిల్ మీ ముందుంటుంది. ఇక, ఈ టైటిల్‌తో కూడిన మొదటి పాటను రికార్డ్ చేయటం కూడా ఎప్పుడో అయిపోయింది! యమగా ఉన్న ఆ పాట వింటూనే ఈ బ్లాగ్ రాశాను... :)

Saturday 2 March 2013

హెవీ గ్యాంబ్లింగ్!


30-40 కోట్లు చేతిలో పట్టుకొని - అతిరథ మహారథులయిన దిగ్గజాల్లాంటి టెక్నీషియన్స్‌ని పెట్టుకొని - పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ తీస్తున్న సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అలాగని, అంత అనుభవం ఉన్న ఆయా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలకి ఏమీ తెలియదనుకోవాలా? ఇట్సాల్ ఇన్ ది గేమ్! అంతే.

పై పరిస్థితికి పూర్తి వ్యతిరేకంగా - కేవలం అత్యంత తక్కువ స్థాయి మైక్రో బడ్జెట్‌లో సినిమాను ప్రారంభించి, పూర్తి చేసి, రిలీజ్ చేయటం అత్యంత గొప్ప విషయం. ఇంకా చెప్పాలంటే - ఒక పెద్ద సినిమా కథా చర్చల కోసం అయ్యే ఖర్చు అంత ఉండదు ఈ మైక్రో బడ్జెట్ చిత్రాల మొత్తం బడ్జెట్!  ప్రతి స్టేజ్ లోనూ ఎన్నో అవాంతరాలొస్తాయి. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ల లక్ష్యం విజయం మీదే ఉంటుంది. అన్నీ కలిసి రావాలి. కలిసి వచ్చేలా చేసుకోగలగాలి.  దట్ ఈజ్ ది ట్రూ స్పిరిట్! విజయం అదే వస్తుంది.. రాక తప్పదు...

ఒక్క విజయంతో అమాంతం అందలం ఎక్కే అవకాశం ఒక్క సినిమా రంగంలోనే ఉంది! ఉంటుంది..

అందలం అంటే ప్రధానంగా రెండే విషయాలు - ఒకటి ఫేమ్, రెండోది డబ్బు.  మిగిలిన ఏ బిజినెస్‌లలోనూ, ప్రొఫెషన్లలోనూ.. ఎన్నేళ్లు కష్టపడ్డా రానంతటి ఫేమ్ - ఇక్కడ సినీ ఫీల్డులో దాదాపు "ఓవర్‌నైట్" లో వస్తుంది. అలాగే డబ్బు కూడా.

మరే బిజినెస్‌లోనూ సాధ్యంకానంత మనీ రొటేషన్, లాభాలు ఈ బిజినెస్‌లోనే సాధ్యం. అయితే, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టకపోయినా, ఓవర్ కాన్‌ఫిడెన్సుతో మరీ గొప్పలకు పోయి అంచనాలకు మించి ఖర్చు పెట్టినా, ఎవరినయినా గుడ్డిగా నమ్మి డబ్బంతా వాళ్ల చేతుల్లో పెట్టినా .. వ్యవహారం అంతా ఉల్టా పుల్టా అయిపోతుంది.  హెవీ గ్యాంబ్లింగ్! మామూలు మనుషులకు కోలుకోవటం అనేది దాదాపు అసాధ్యం. బిజినెస్‌ని బిజినెస్ గానే చూసి, నిర్ణయాలు తీసుకోగలిగితే మాత్రం.. ముందే చెప్పినట్టు, ఈ బిజినెస్‌లో ఉన్నంత మనీ రొటేషన్, ఆదాయం మరే బిజినెస్‌లోనూ లేదు.

కావల్సిందల్లా ఒక్క సక్సెస్. ఒకే ఒక్క సక్సెస్...

అందుకే చాలా మందికి ఈ ఫీల్డు అంటే అంత ఆసక్తి. ముఖ్యంగా క్రియేటివిటీకి అడిక్ట్ అయినవారికి!

ఫీల్డుకి బయట ఉండి, పది రకాల కామెంట్లు చేయటం, వంద ఉచిత సలహాలివ్వటం, "నేనయితే ఇలా చేసేవాడ్ని" అనడం.. చాలా సులభం. ఫీల్డులోకి దిగినవాళ్లకే తెలుస్తుంది దాని లోతెంతో, దాన్లోని కష్టనష్టాలేంటో, బాధలేంటో...

ఇలాంటి మహనీయులందరితో నేను ఎప్పుడూ ఒక్కటే విన్నపం చేసుకుంటూ ఉంటాను. "ముందు మీరు ఫీల్డులోకి దిగండి. ఆ తర్వాతే దయచేసి ఈ మాటలు మాట్లాడండి! మీ ఉచిత సలహాల్ని, మీలో ఉందనుకుంటున్న మీ సామర్ధ్యాన్ని చేతల్లో చూపించండి!!" అని.

అయితే అదంత సులభం కాదు. దానికి చాలా గట్స్ కావాలి. ఆ సాహసం కొందరే చేయగలరు. ఆ కొందరిలో కూడా అతి కొద్దిమందినే విజయం వరిస్తుంది. దటీజ్ సినిమా! :)