Wednesday 28 February 2024

స్వేఛ్చా విహంగం


జీవితంలో ఒక స్థాయికి వచ్చాక - ఒక వ్యక్తిగాని, ఒక వస్తువు కాని, ఒక అంశం కాని మన జీవితంలో లేవు అంటే ఇంక లేనట్టే. ఇంకా వాటి గురించే మనకున్న సమయం వృధా చేసుకోకుండా ముందుకు సాగాల్సిందే. 

ఒక విషయంలో మనం అనుకున్నది అనుకున్నట్టు కనీస స్థాయిలోనయినా జరగటం లేదంటే దానర్థం మనం అసమర్థులం అని కాదు. అంతకు మించింది ఇంకేదో మనం చెయ్యాల్సి ఉంది. 

మన ఫోకస్ అటు మరల్చాలి. 

కట్ చేస్తే -

జీవితం చాలా చిన్నది. మన ఖాతాలో మనకున్న సమయం ఎంతో మనకు తెలీదు.

ఉన్నన్నాళ్ళూ ఇంకా ఏం చేయగలం, ఎంత ఇష్టంగా చేయగలం, ఎంత ఆనందంగా, ఎంత ఆరోగ్యంగా గడపగలమన్నదే మన ఆలోచన కావాలి. 

అలాంటి జీవితం గడపడానికి అవసరమైన ఫ్రీడం మనం ఎంత తొందరగా తెచ్చుకోగలం అన్నదొక్కటే ఇప్పుడు మన ప్రధాన లక్ష్యం కావాలి. 
    
Remember that all is a gift, but the most precious of all gifts is Life. 

- మనోహర్ చిమ్మని 

Saturday 24 February 2024

ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి!


వేల ఏళ్ళుగా వస్తున్న రాచరికానికి ఆధునిక రూపం డెమోక్రసీ. 

ఒక్క మనదేశంలోనే కాదు. ప్రపంచమంతా ఇంతే. అంతకంటే ఏం లేదు. కొంచెం హిపోక్రసీ పక్కన పెట్టి, రెండు నిమిషాలు ఆలోచిస్తే, ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 

కట్ చేస్తే - 

మన అభిరుచికి, మన ఇష్టాలకు ఎంతో కొంత దగ్గరగా ఉండే పొలిటీషియన్స్‌ను, వారి పార్టీలను వీలైనంత సపోర్ట్ చెయ్యాటాన్ని మించి ఈవైపు అతిగా ఆలోచించడం వృధా.

అందుకే,  నేనెప్పుడూ ప్రత్యక్షరాజకీయాల వైపు ఆసక్తి చూపలేదు. ఒకటి రెండు మంచి అవకాశాలు వచ్చినా సవినయంగా 'నో' చెప్పాను. 

రాజకీయాల మీద ఆసక్తి ఉన్న సమర్థులు చాలామంది ఉన్నారు. 

ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. 

- మనోహర్ చిమ్మని 

Wednesday 21 February 2024

నిజంగా మనం సినిమాను అంత సీరియస్‌గా తీసుకున్నామా?


చాలారోజుల తర్వాత నిన్న త్వరగా పడుకున్నాను. 

అంటే, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నానన్నమాట.        

కట్ చేస్తే -  

టీమ్ ఇంత నత్త నడక నడుస్తున్నదంటే లోపం ఎక్కడో నాలోనే ఉందని నాకర్థమైంది. సరిగ్గా ఇన్‌స్పయిర్ చెయ్యలేకపోతున్నాను. అసలా ఫైర్ ఉండట్లేదు. నా చాంబర్‌లోంచి బయటకు వెళ్ళగానే అంతా మళ్ళీ సేమ్ రొటీన్ అయిపోతోంది. చాలా కూల్ అయిపోతున్నారు.

ఇప్పటివరకూ సినీఫీల్డులో విజయం సాధించిన ఏ ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా, సినిమాను ఒక తపస్సులా తీసుకున్నవారే. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. సినిమానే శ్వాసించారు. జీవించారు. 

నిజంగా మనం సినిమాను అంత సీరియస్‌గా తీసుకున్నామా? 

కేవలం డబ్బు ఒక్కదాని గురించే ఆలోచిస్తే సినిమా సక్సెస్ కాదు. సక్సెస్‌ఫుల్ సినిమా ఇస్తేనే డబ్బు వస్తుంది. అలాంటి సినిమా కోసం నిజంగా మనం ఎంత కష్టపడుతున్నాం? ఎంత ఆలోచిస్తున్నాం?         

సినిమా బడ్జెట్ చిన్నదయినా, పెద్దదయినా, దాని కోసం పడే శ్రమ ఒక్కటే. మన ప్రతి నిమిషానికి, ప్రతి గంటకీ వాల్యూ ఉంటుంది. ఎందుకని మనం ఆ వాల్యూని గుర్తించలేకపోతున్నాం? అసలు సినీఫీల్డు యాంబియెన్స్ కాని, మూడ్ గాని మనం ఫీలవుతున్నామా? 

లైఫ్ స్టైల్, థింకింగ్ ఒకటి కంటిన్యూ చేస్తూ, దానికి ఎలాంటి సంబంధం లేని ఇంకొకటి సాధించాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? అలా మనం ఏదైనా సాధించగలుగుతామా అసలు?   

ఈ ఒక్క విషయంలో మన మైండ్‌సెట్ మారినప్పుడు అన్నీ అవే బాగుంటాయి...

కావల్సినన్ని ఫండ్స్ వస్తాయి, 
వస్తూనే ఉంటాయి.
స్క్రిప్టులు బాగా చేసుకుంటాం.
మంచి యాక్టర్లు, టెక్నీషియన్స్‌తో
కలిసి పనిచేస్తాం.
బాగా సినిమాలు చేస్తాం.
బ్లాక్‌బస్టర్ హిట్సూ ఇస్తాం. 

గతంలోనే ఉండిపోదామా,
మనకిష్టమైన మన ఫ్యూచర్‌కి వెల్దామా?

... మన చేతుల్లోనే ఉంది.

Friday 16 February 2024

నువ్వు రెండో పెళ్ళి చేసుకో !!


61 ఏళ్ళ ఆశిష్ విద్యార్థి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఈమె పేరు, రూపాలి బారువా. ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్. 

ఆశిష్ నిజంగా చాలా ధైర్యవంతుడి కిందే లెక్క! 

నాకు గాని అలాంటి అవకాశమొస్తే, ఏక్ నిరంజన్‌గా ఎంజాయ్ చేస్తా తప్ప మళ్ళీ పెళ్ళి చేసుకోను. 

కట్ చేస్తే -

ఆశిష్ విద్యార్థి మొదటి భార్య రాజోషి, ఆశిష్ కొన్నాళ్ళ క్రితం ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. 

"ఇప్పటిదాకా, పిల్లల్ని-నిన్ను పట్టించుకున్నాను. నా వ్యక్తిగత జీవితం, అభిరుచులు, ఇష్టాలు అలా మిగిలిపోయాయి. ఇక నుంచి నా జీవితం నేను నా ఇష్టప్రకారం జీవించాలనుకొంటున్నాను. సో, మనం డివోర్స్ తీసుకుందాం. నువ్వు రెండో పెళ్ళి చేసుకో. కావాలంటే నీకు సరిపోయే అమ్మాయిని నేనే చూసిపెడతా" అని ప్రపోజ్ చేసింది రాజోషి. 

ఇంకేముంది, ఓకే అన్నాడు ఆశిష్.

ఎంటర్... ది రూపాలి బారువా! 

ఇప్పుడు ఆశిష్ లక్కీ ఫెలోనా, అన్‌లక్కీ ఫెలోనా? దటీజ్ ద బిగ్ కొశ్చన్... 

Thursday 15 February 2024

పక్కా కమర్షియల్


కొన్నాళ్ళు పూర్తిగా సినిమాలకు అంకితం అవుతున్నాను. ఆ జర్నీ ఆల్రెడీ మొదలైంది. 

పక్కా కమర్షియల్.  

కట్ చేస్తే -

ఇక్కడ ఫేస్‌బుక్‌లో గాని, నా ఇతర సోషల్ మీడియా టైమ్‌లైన్స్ మీద గాని, నా బ్లాగ్‌లో గాని... పూర్తిగా సినిమా కంటెంటే ఉంటుంది. 

క్లాస్, మాస్, ఊరమాస్, క్లాసికల్లీ మాస్. 

నాకు నచ్చిన కంటెంట్. నాకు నచ్చకపోయినా ప్రొఫెషనల్లీ నేను పోస్ట్ చెయ్యాలనుకున్న కంటెంట్. ఔత్సాహికులకు పనికొచ్చే కంటెంట్. పనికిరాని కంటెంట్. అన్నీ ఉంటాయి.

నా అశేష మేధావి మిత్రబృందంలో చాలామందికి ఈ కంటెంట్ నచ్చకపోవచ్చు.

నా పోస్టుల మీద, నా బ్లాగ్-పోస్టుల మీద, నిర్మాణాత్మక విమర్శలు ఓకే. హిపోక్రసీ రాతలు మాత్రం వద్దని మనవి. దానికంటే నన్ను అన్‌ఫ్రెండో, బ్లాకో చెయ్యటం బెటర్.

Peace. 

- మనోహర్ చిమ్మని 

Monday 12 February 2024

సగం సగం ఏదీ సక్సెస్ కాదు


సినిమాల్లో కెరీర్ కోసం వచ్చి - చిన్న చిన్న రూముల్లో ఉంటూ, ఏదో ఒకటి తింటూ, పస్తులుంటూ ఏళ్ళకి ఏళ్ళు ఒక తపస్సులా కష్టపడ్డవాళ్ళలో కూడా అతి కొద్దిమందికే ఆ "ఒక్క ఛాన్స్" వరం లభిస్తుంది. 

కొందరికి (నేను నమ్మని) అదృష్టం కలిసొచ్చి ఛాన్స్ దొరకొచ్చు. 

కాని, ఛాన్స్ దొరికినవాళ్ళలో అత్యధిక శాతం మందికి మాత్రం అది వారి స్వయంకృషి వల్లనే సాధ్యమై ఉంటుంది.

ఇప్పుడు ఫీల్డులో ఉన్న చాలామంది డైరెక్టర్స్, హీరోలు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ అలా కష్టపడివచ్చినవాళ్ళే. 

సోషల్ మీడియా & ఇప్పుడున్న అత్యంత ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో - ఈ కష్టం చాలావరకు తగ్గింది. కాంటాక్ట్స్, నెట్‌వర్కింగ్ ఈజీ అయ్యాయి. డెమో షూట్‌లు, పైలట్ షూట్స్, శాంపిల్ షూట్స్ ఇప్పుడు అసలు కష్టం కాదు. మొబైల్ ఫోన్‌తో కూడా చెయ్యొచ్చు. 

కావల్సింది ఒక్కటే. మీ సామర్థ్యం మీరు తెలుసుకోగలగటం, ఒకే లక్ష్యంతో ఒక తపస్సులా కష్టపడటం. 

నాలుగు పడవల మీద కాళ్ళుపెట్టి ప్రయాణం చేస్తూ ఇక్కడ ఏదీ ఎవ్వరూ సాధించలేరు.  

సినిమాల్లోనే కాదు, ఎక్కడైనా సరే, సగం సగం ఏదీ సక్సెస్ కాదు.

- మనోహర్ చిమ్మని 

రోమ్‌కు వెళ్ళినప్పుడు...


సినీ ఫీల్డులో నీ కెరీర్ అనేది నిజంగా ఒక గోల్డ్ మైన్. ఒక మెకన్నాస్ గోల్డ్. దాన్నుంచి నువ్వు ఎంతైనా తవ్వి తీసుకోవచ్చు. ఎన్నెన్నో సాధించొచ్చు. మరెక్కడా సాధ్యం కాని ఎన్నో అనుభవాలను మూటకట్టుకోవచ్చు. దేనికీ లిమిట్స్ లేవు. 

ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకపోతే మాత్రం నువ్వేం సాధించలేవు. జస్ట్ నీ సమయం వృధా అయిపోతుంది. దాంతోపాటు నీ డబ్బు, నీ పేరు, నీ రిలేషన్‌షిప్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి.  

కట్ చేస్తే -

రోమ్‌కు వెళ్ళినప్పుడు ఒక రోమన్‌లా ఉండు. లేదంటే అసలు రోమ్‌కు వెళ్ళకు. 

- మనోహర్ చిమ్మని    

Monday 5 February 2024

రాజకీయాలు వేరు, రిలేషన్‌షిప్స్ వేరు!


మన చదువులు, మన ప్రొఫెషన్స్, మన బిజినెస్‌లు, మన అబ్రాడ్ ఉద్యోగాలు, మనలో మరింత మంచి సంస్కారాన్ని పెంచాలి. 

కట్ చేస్తే -

రాజకీయాలు వేరు, మన వ్యక్తిగత స్నేహాలు, రిలేషన్‌షిప్స్ వేరు.

ఒకరి అభిప్రాయాలపై మరొకరు... విమర్శలు ఎవరు ఎలా అయినా చేసుకునే హక్కు ఉంటుంది. కాని, అవి మరీ చిల్లర స్థాయిలో ఉండకపోతే బెటర్. 

ఆయా నాయకుల పైన, పార్టీల పైన, పాలనా పద్ధతుల పైన... ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండటం సహజం. దానికి బీపీలు పెంచుకోనవసరం లేదు. 

బాగా పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకులను గుర్తించాలి, ప్రోత్సహించాలి అన్నదొక్కటే రాజకీయాలకు సంబంధించి నా కనెక్షన్. అంతకు మించి రాజకీయాలపైన నాకసలు ఆసక్తి లేదు. నన్ను ఇలా రాయమని, అలా రాయమని చెపే హక్కు ఎవ్వరికీ లేదు. అది పూర్తిగా నా ఇష్టం.

నా వాల్. నా ఇష్టం. 

అలాగే, నువ్విలా రాయకూడదు అని నాకు చెప్పే హక్కు కూడా ఎవ్వరికీ లేదు. 

ఒకవేళ నా రాతలు నచ్చకపోతే నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. తప్పేం లేదు.

మొత్తంగా అసలు నా వ్యూ పాయింటే నచ్చనివాళ్ళు నా వాల్ మీదకి రాకపోవడం బెటర్. బ్లాక్ చేస్తే ఇంకా బెటర్. 

నా వాల్ మీదకొచ్చే చదువుకున్న కుసంస్కారులను బ్లాక్ చేస్తాను తప్ప, నా సమయం వృధా చేసుకోను.  

బయటికి కనిపించే రాజకీయాలు వేరు. మనకు కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ప్రతిదానికీ ఊరికే బీపీలు పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యాలే పాడైపోతాయి. మరెన్నో రకాలుగా నష్టపోయేదీ మనమే.  

ముందే చెప్పినట్టు - మన చదువులు, మన ప్రొఫెషన్స్, మన బిజినెస్‌లు, మన అబ్రాడ్ ఉద్యోగాలు, మనలో మరింత మంచి సంస్కారాన్ని పెంచాలి తప్ప, మనల్ని సంస్కార హీనులను చేయొద్దు. 

- మనోహర్ చిమ్మని 

గోబెల్స్ ప్రచారం వేరు, ప్రభుత్వాన్ని నడపడం వేరు!మనకు కనిపించే రాజకీయాలు వేరు, మనకు కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్ర్యం రాకముందటి నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్. 

వంద సంవత్సరాలుగా తన పార్టీ కొనసాగిస్తున్న రాజకీయ సంస్కృతి బాటలోనే నడుస్తూ, ఒక బలమైన యుద్ధతంత్రంతో దూకుడుగా శ్రమించి తను అనుకున్నది సాధించగలిగారు రేవంత్ రెడ్డి. ఆయన పాటించిన ఆ యుద్ధతంత్రం ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా అన్నది వేరే విషయం. ఆ యుద్ధతంత్రానికి ఆక్సిజన్ అందించిన అత్యంత నికృష్టమైన గోబెల్స్ ప్రచారానికి కూడా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరోక్షంగా సహకరించిందన్న విషయం కూడా ఇక్కడ అప్రస్తుతం. ఒక పటిష్టమయిన యుద్ధప్రణాళికతో ఎలాగైతేనేం రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజలు కూడా నిజంగానే అదేదో "మార్పు" అవసరమేమోనని అమాయకంగా నమ్మారు. ఆత్మహత్యాసదృశమైన ఆ మార్పుకి కారణమయ్యారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సంతోషం. ఇక్కడివరకూ ఓకే. ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

కట్ చేస్తే - 

ఒక వ్యక్తిలో ఉండే భాషా పటిమ, వ్యక్తీకరణలే ఆ వ్యక్తిని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి. మనం వాడే భాష మన సంస్కృతిని తెలుపుతుంది, మనమేంటో తెలుపుతుంది. ఫక్తు రాజకీయాలకోసం... ఏమైనాసరే ప్రజల్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవడం కోసం... ఎన్నికలకి ముందు ఏదిపడితే అది మాట్లాడితే చెల్లిందని, ఇప్పుడు కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కుదరదు. అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో జరుగుతున్నది అదే. 

మార్పు మాయలో పడి కొట్టుకుపోతూ... అమాయక తెలంగాణ ప్రజలు బంగారు పళ్ళెంలో అధికారం అందించి, ముఖ్యమంత్రిని చేసినందుకు దాన్ని కాపాడుకోవాలి. ఆ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లెక్కలేనన్ని అంశాల్లో దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ స్థాయి నుంచి మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళే కృషి చెయ్యాలి. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కేసీఆర్ వేసిన ఎన్నో కొత్తదారుల్ని మరిన్ని కొత్తపుంతలు తొక్కించడం మీద దృష్టిపెట్టాలి. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. కాని, దురదృష్టవశాత్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అలా జరగటం లేదు. 

తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. తెల్లారి లేస్తే - ఇంకా కేసీఆర్‌తో, బీఆరెస్ పార్టీతో కొట్లాడుతున్నా అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాను కొనసాగించాల్సిన మహాయజ్ఞం బహుశా ఇదే ఇదే కొట్లాట, ఇదే తిట్ల పర్వం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. 

అందుకేనేమో - ముఖ్యమంత్రి హోదాలో దావోస్ వెళ్ళినా అవే తిట్లు, లండన్ వెళ్ళినా అవే చెత్త మాటలు, ఎక్కడ మైక్ కనిపించినా అవే అరుపులు కేకలు, అవే బూతు పురాణాలు. 

"కేసీఆర్‌కు గోరీ కడతా", "బీఆరెస్‌ను వంద అడుగుల లోతున బొందపెడ్తా", "కేసీఆర్ చార్లెస్ శోభరాజ్", "కేసీఆర్‌కు సిగ్గులేదు", "సోయిలేని సన్నాసి కేసీఆర్", "జేబులు కొట్టేటోడు", "చెయిన్లు పీకెటోడు", "కేసీఆర్ మాఫియా", "బిడ్డా బయటికొస్తే బోన్లేసి బొందపెడ్తం"... అసలేందీ మాటలన్నీ? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడవల్సిన మాటలేనా?         

అడ్డా మీద కూలీస్థాయి నుంచి తర్వాత స్థాయికి ఎదిగిన ఒక గుంపుమేస్త్రీ కూడా కొంచెం ఒద్దికగా ఒక లెవెల్ మెయింటేన్ చేస్తాడు, ఆచి తూచి మాట్లాడుతాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంకెంత జాగ్రత్త పడాలి? తన మీద, తన "మార్పు" ఆయుధం పైన అపారమైన నమ్మకం పెట్టి గెలిపించిన ప్రజల్లో ఇంకెంత గౌరవం పెంపొందించుకోవాలి? కాని, అలా జరగడం లేదు. యథారాజా తథా ప్రజాలా... రేవత్ రెడ్డి ప్రభుత్వంలోనివాళ్ళు, పార్టీలోనివాళ్ళు కూడా "తొడలు కొడ్తే గుండెలు పగుల్తాయ్" అంటూ అదే స్థాయి తిట్ల దండకం, అదే స్థాయి భాషను వాడుతుండటం మరింత శోచనీయం.   

డిసెంబర్ 9 నుంచి అమలు చేసితీరతామని సవాల్ చేసిన 6 గ్యారంటీల అమలు ఎంత కష్టమో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యాక బాగా అర్థమైంది. అరకొరగా అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల కొత్త ఇబ్బందులు, కొత్త నష్టాలు మొదలయ్యాయి. ఆటోవాలాల జీవితం దుర్భరమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుబంధు గురించి అడిగితే చెప్పు దెబ్బలంటున్నారు. కరెంటు కట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఒక రొటీన్ అయిపోయింది. గత పదేళ్ళుగా రాష్ట్రంలో ఎలాంటి అసౌకర్యం, కరెంట్ కోత లేకుండా జెట్ స్పీడ్‌తో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్ళిన పరిశ్రమల అధినేతలంతా ఇప్పుడూ బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని పరిశ్రమలు, కంపెనీలు పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రేవంత్ రెడ్డి దృష్టిపెట్టాల్సింది ఇటువైపు. "కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, అప్పులపాలు చేశాడు" అని తిప్పిందే తిప్పి, అదే పాచిపండ్ల పాట రికార్డును పదే పదే వేయడం పైన కాదు. 

కట్ చేస్తే -

అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశాల్లో పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా... ఆ దేశాల అభివృద్ధి-సంక్షేమ పథకాలు, పనులు ప్రధాన ఎజెండాగా ఉండే బ్లూప్రింట్ మారదు. మరింత బాగా పనిచేస్తూ సొంత పార్టీ ఇమేజ్‌ను ప్రజల్లో పెంచుకొనే ప్రయత్నం చేస్తారు తప్ప, ఎదుటి పార్టీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలను బొందపెట్టరు. మరింత పోటీపడి ప్రజలకోసం, దేశం కోసం కృషి చేస్తారు. అందుకే ఆ దేశాలు అంత శక్తివంతమైన దేశాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేళ్ళలో అలాంటి దృక్పథంతో కృషిచేశారు. తానొక్కడే ఇంకో వందేళ్ళు పాలించాలనుకోలేదు. తన తర్వాతి తరం వాళ్లకు కొత్తదారులు వేశారు. గత 60 ఏండ్లుగా ఎవ్వరూ సాధించలేని ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలను, పనులను కేవలం నాలుగైదేళ్ళలో అత్యంత విజయవంతంగా సాధించి చూపించారు. దేశంలోనే తెలంగాణ ఒక నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడటానికి ఎలా ఆలోచించాలో, ఎంతగా కృషిచేయాలో చూపిస్తూ ఒక కొత్త రెడ్ కార్పెట్ దారి వేసిపెట్టారు కేసీఆర్. 

ఆ రెడ్ కార్పెట్‌పైన హుందాగా నడుస్తూ, ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరెంతో సాధించాలి. తన మీద నమ్మకం పెట్టుకొన్న ప్రజలను మెప్పించాలి, ఆ ప్రజల జీవనస్థాయి మెరుగుపడటం కోసం ఏదైనా చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప, "రేవంత్ రెడ్డి" అనగానే అరుపులు కేకలు, బోన్ల పెడ్తా, బొంద పెడ్తా వంటి మాటలు తప్ప ఏం లేదు అనుకునేలా చేసుకోవడం నిజంగా బాధాకరం. ఇదిలాగే కొనసాగితే మాత్రం - మార్పు కోరిన అదే తెలంగాణ ప్రజలు ఇంకో సిసలైన మార్పుని వీలైనంత త్వరలోనే సాధించుకొంటారు. 

- మనోహర్ చిమ్మని 

(ఈరోజు "నమస్తే తెలంగాణ" ఎడిట్ పేజీలో వచ్చిన నా ఆర్టికిల్.)