Wednesday 31 December 2014

థాంక్ యూ, ఫేస్‌బుక్!

నాకు నచ్చని విషయం, నేను ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ రాయలేని విషయం .. నేనస్సలు ఈ బ్లాగ్‌లో రాయలేను.

అది అబధ్ధమయినా సరే. ముందు నాకు నచ్చాలి. నేను ఇష్టపడాలి. ఎట్‌లీస్ట్, ఆ క్షణం .. అది నాకు కిక్ ఇవ్వాలి.

ఆ రాతల కోసమే ఈ నగ్నచిత్రం బ్లాగ్.

ఏ హిపోక్రసీ లేదు. ఏ ఇన్‌హిబిషన్స్ లేవు. నేను రాయాలనుకున్నది రాస్తాను. నచ్చినవాళ్లు చదువుతారు. నచ్చనివాళ్లు ఒకే ఒక్క క్లిక్‌తో ఇంకో బ్లాగ్‌లోకో సైట్ లోకో వెళ్లిపోతారు. అంతే.

ఇప్పుడు నేను చేస్తున్న రొమాంటిక్ హారర్ చిత్రం షూటింగ్, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర వ్యక్తిగతమయిన కమిట్‌మెంట్‌ల వత్తిడిలో అస్సలు సమయం లేక, సమయం మిగుల్చుకోలేక .. అసలీమధ్య నేను నా బ్లాగ్‌ని దాదాపు మర్చేపోయాను.    

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయలేదీ మధ్య.

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం .. నిజంగా పెద్ద నేరం.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం.

రాయడం ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్.

ఇది అందరకీ రాదు. అందరివల్లా కాదు.

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నిజంగా నేరమే.

ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను. అదో పెద్ద జోక్!

కట్ టూ ఫేస్‌బుక్ - 

ఈ బ్లాగ్ పోస్ట్‌ని నేను "థాంక్ యూ 2014" అని రొటీన్‌గా రాయాలనుకున్నాను. అందరికోసం. కానీ, అది పచ్చి అబధ్ధం. హిపోక్రసీ.

నేను థాంక్స్ చెప్పాల్సింది ఫేస్‌బుక్ కి. దాని రూపశిల్పి మార్క్ జకెర్‌బర్గ్‌కి.

ప్రపంచం నలుమూలల్లో ఎక్కడెక్కడో ఉంటున్న నా స్నేహితులతో, శ్రేయోభిలాషులతో ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. నాకంతకుముందు అస్సలు పరిచయంలేని, నా భాషకాని, నా సంస్కృతికాని అద్భుతమయిన సృజనశీలురు ఎందరితోనో కూల్‌గా హస్కులు వేయగలుగుతున్నాను.

నేను కలలోకూడా ఊహించని ప్రపంచస్థాయి వ్యక్తులతో ఎన్నెన్నో విషయాల్లో ఎంతో సులభంగా సంభాషించగలుగుతున్నాను.

అయితే ఇదంతా ఉట్టి టైమ్‌పాస్ కాదు. వైరుధ్యాలమయమైన అంతరంగాన్ని ఆవిష్కరించుకొనే ఒక అవుట్‌లెట్. ఒక అద్భుతం. అవధులు లేని ఒక జీవితం.

ఇప్పుడు, ఇవాళ .. అనుకోకుండా కుదిరిన ఒక మంచి అవకాశం ఇది.

అవధులు లేని ఒక కొత్త జీవితాన్ని అద్భుత రూపంలో అందించిన ఫేస్‌బుక్ కి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను?

సో, థాంక్ యూ, ఫేస్‌బుక్!

2014 లో నీ తోడుని నేనెన్నటికీ మర్చిపోలేను. నీతో కలిసే ఇప్పుడు 2014 కి వీడ్కోలు చెబుతున్నాను. 2015 కి స్వాగతం పలుకుతున్నాను.       

Sunday 21 December 2014

అరుణ్‌కుమార్ స్టయిలే వేరు!

హోటల్ బసేరా - టూ - యాత్రి నివాస్ - టూ - రొమాంటిక్ హారర్ సినిమా!

అర్థం కాలేదు కదూ?

రెండే రెండు మీటింగ్స్. కట్ చేస్తే సినిమా లాంచ్. అదీ అరుణ్‌కుమార్ వ్యవహార శైలి.

అరుణ్‌కుమార్ ఎవరో కాదు. మై ప్రొడ్యూసర్.. ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్.

కట్ టూ ది ప్రొడ్యూసర్ -

నాలుగు ఈమెయిల్స్ కమ్యూనికేషన్ తర్వాత అరుణ్‌కుమార్, నేను మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ లోని బసేరా హోటల్లో కలిశాం. అక్కడ మా సిట్టింగ్ ఎందుకో కమ్‌ఫర్టబుల్‌గా అనిపించలేదు.

షిఫ్ట్ టూ యాత్రి నివాస్.

చిన్నా, పెద్దా మీటింగ్స్ ఏవయినా - యాత్రి నివాస్‌లో నాకు చాలా కమ్‌ఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ మీటింగ్స్ పర్సనల్‌వి కావొచ్చు. బిజినెస్‌వి కావొచ్చు. మొత్తానికి యాత్రి నివాస్‌ ఓ గుడ్ ప్లేస్.

అరుణ్‌కుమార్ మెకానికల్ ఇంజినీర్. యు కె లో ఎం ఎస్ చేశారు. చాలా చిన్న వయసులోనే యు కె లో స్వంతంగా బిజినెస్ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపిస్తున్న ట్రాక్ రికార్డ్ ఆయనకుంది.

నా దృష్టిలో ఇదేమంత చిన్న విషయం కాదు.

కట్ టూ ది స్టయిల్ - 

అరుణ్‌కుమార్ లో నాకు బాగా నచ్చిన మొదటి అంశం ఆయన పలకరింపు.

" హలో అండి! ఎలా ఉన్నారు?"

ఎక్కడో యు కె నుంచి .. అనవసరపు మాస్కులు లేని ఇలాంటి పలకరింపు ఈ రోజుల్లో దాదాపు మృగ్యం.

అరుణ్‌కుమార్ లో నాకు నచ్చిన రెండో అతి ముఖ్యమైన అంశం - క్లారిటీ!

ఉదాహరణకు, నేనొకదానికి 100 రూపాయలు ఖర్చవుతుందంటే - అది ఎలా ఖర్చవుతుందో క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో తెల్సుకుంటారు. అది ఖర్చు చేస్తున్న సమయంలో జరిగే పని, ఆ పనిలోని వివిధ దశలు, ప్రతి దశలోనూ ఉండే కనిపించని రిస్కులు .. ఇలా ప్రతి చిన్న అంశం గురించీ చాలా క్లియర్‌గా మన వెర్షన్ తీసుకుంటారు అరుణ్.

అయితే ఇది అక్కడితో అయిపోదు.

దీనికి సంబంధించి, తన వైపు నుంచి బోలెడంత రిసెర్చ్ చేస్తారు. తన వెర్షన్ మనకు డీటెయిల్డ్‌గా ఈమెయిల్లో పంపిస్తారు. స్టెప్ బై స్టెప్ .. అవసరమయితే ఎక్సెల్ షీట్‌లో చాలా క్లియర్‌గా ఉంటుందా ఇన్‌ఫర్మేషన్.

అరుణ్‌కుమార్ ఇచ్చే ఇన్‌ఫర్మేషన్ ఎంత క్లియర్‌గా ఉంటుందంటే, అది మనకు ముందే తెలిసిన బేసిక్ ఇన్‌ఫర్మేషనే అయినా - ఒక బిజినెస్‌మ్యాన్ యాంగిల్ లో, ఎక్సెల్ లో ఆయన ఇచ్చే ఆ ప్రజెంటేషన్‌కు మనమే ఆశ్చర్యపోతాం!

తను చేయాలనుకొంటున్న పనికి సంబంధించిన ప్రతి విషయంలోనూ స్పష్టత పట్ల ఆయన చూపించే శ్రధ్ధ, ఆయన ఆలోచనా విధానం .. ఇవే ఆయన్ను ఓ సక్సెస్‌ఫుల్ ఎంట్రెప్రెన్యూర్‌ను చేశాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

కట్ టూ మన రొమాంటిక్ హారర్ - 

మేం కలిసి సినిమా చేద్దాం అనుకున్న తర్వాత ఆయన నన్ను కోరిన ఒకే ఒక్క విషయం సినిమా జోనర్.

హారర్ తీద్దామని!

మాట్లాడకుండా ఓకే అన్నాను. అదే ఇప్పుడు మేము షూటింగ్ పూర్తి చేసిన రొమాంటిక్ హారర్. బహుశా ఎల్లుండి ఈ సినిమా టైటిల్ చాంబర్ నుంచి అఫీషియల్‌గా మాకు అందుతుంది.

సినిమా బిజినెస్ పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న అరుణ్‌కుమార్‌కు - కాన్‌సెప్ట్ స్టేజ్ నించి ఫిలిం రిలీజ్ అయ్యేవరకూ - ప్రతి స్టేజ్ లోనూ, ప్రతి విషయం తెలిసేలా చేయడమే నేను పర్సనల్‌గా తీసుకున్న బాధ్యత. ఈ అవగాహనే, తర్వాతి ప్రాజెక్టుల ప్లానింగ్‌లో ఆయనకు చాలా ఉపయోగపడుతుంది.

చిన్నదయినా, పెద్దదయినా - జరగాల్సిన పనిని ఎంత బాగా, ఎంత సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేయాలో అరుణ్‌కుమార్ కు తెల్సినంతగా ఎవ్వరికీ తెలియదు.

ఈ లక్షణం సహజంగా రావాల్సిందే. లేదంటే ఒక ప్యాషన్‌తో స్వయంగా నేర్చుకోవాల్సిందే.

అలాకాకుండా - ఒకరిని చూసి నేర్చుకున్నా, ఒకరిని ఫాలో అయినా .. అది రాదు కాక రాదు. నాకు తెలిసి ఈ గిఫ్ట్ అరుణ్‌కుమార్ కే సొంతం.

షూటింగ్ సమయంలో కొన్ని రోజులు అరుణ్‌కుమార్ లేనప్పటి లోటు మా టీమ్ మొత్తం మందికీ తెలిసింది.  ఆ లోటుని మేమంతా నిజంగా ఫీలయ్యాం. అలా ఫీలయ్యేలా చేయగల శక్తి ఆయనకుంది.

ఇలాంటి ఔత్సాహిక యువ ప్రొడ్యూసర్ మిత్రులు ఇండస్ట్రీలో ఎక్కువమంది రావాలని నా అభిలాష.

బిజినెస్ పరంగా అరుణ్‌కుమార్ కు సంబంధించి - ఇప్పుడు మేము చేస్తున్న ఈ రొమాంటిక్ హారర్ కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. ఈ పైలట్ ప్రాజెక్టుకు చాలా ప్రత్యేకతలున్నాయి. టైటిల్ లోగో రిలీజ్ తర్వాత, అవన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తాయి.

టైటిల్ లోగో ఆవిష్కరణ తర్వాతే మా అసలైన ప్రమోషన్ ఆరంభమవుతుంది.

ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్ అనుభవంతో అరుణ్ భవిష్యత్ ప్రాజెక్టుల ప్రణాళికలు కొంచెం భారీగానే ఉంటాయి.

అన్నీ అనుకూలం చేసుకొని, సరిగ్గా ప్లాన్ చేసుకొని, త్వరలో మా ఇద్దరి కాంబినేషన్లో మేం ప్రారంభించబోయే మా రెండో చిత్రం ఒక రేంజ్‌లో సంచలనం సృష్టించగలదని నా నమ్మకం.

ఆ నమ్మకాన్ని నిజం చేయగల శక్తి అరుణ్‌కుమార్ కు ఉంది.

అదే ఆయన స్టయిల్.  

Monday 15 December 2014

హాట్ హీరోయిన్ ప్రియ వశిష్ట!

కొన్ని అరంగేట్రాలు అనుకోకుండా జరిగిపోతాయి.

నా ఈ రొమాంటిక్ హారర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా గ్లామర్ ఫీల్డులోకి ప్రియ వశిష్ట అరంగేట్రం కూడా అలాంటిదే.

ఆల్‌రెడీ ప్రియాంకలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. గుంపులో గోవిందా లాగా ఎందుకు అనిపించి, మొన్న నవంబర్ 26 నాడు, తన పేరును "ప్రియ వశిష్ట"గా మార్చి, మొట్టమొదటగా మా టీమ్ వాట్సాప్ గ్రూప్‌లో ఎనౌన్స్ చేశాను. తర్వాత ప్రెస్‌లో వచ్చింది.

ఇకనుంచీ అదే తన స్క్రీన్ నేమ్, రియల్ నేమ్ కూడా అన్నమాట.

కట్ టూ హాట్ హీరోయిన్ - 

ఇప్పుడు నేను చేస్తున్న రొమాంటిక్ హారర్ సినిమాలో కొత్త హీరోయిన్ కోసం చివరి నిమిషం వరకూ హంటింగ్ బాగానే జరిగింది.

చెప్పాలంటే అదొక పెద్ద హంగామా!

ముందు నాకెంతో బాగా నచ్చిన కొత్త హీరోయిన్ వేరు. దాదాపు అగ్రిమెంట్ పైన సంతకం చేయాల్సిన రోజే, తను అప్పటికే సైన్ చేసిన ఓ తమిళ చిత్రం డేట్స్ కన్‌ఫర్మ్ అయ్యాయి. ఆ డేట్స్‌కీ, నా షూటింగ్ డేట్స్‌కీ కుదరక ఆ హీరోయిన్‌ను అలా వదులుకోవాల్సి వచ్చింది. ఆ హీరోయిన్ కూడా అలాగే ఫీలయింది.

నిన్న రాత్రి కూడా తను ఫోన్లో మాట్లాడినప్పుడు మరోసారి ఈ టాపిక్ మా మధ్య వచ్చింది. అది వేరే విషయం.

ఆ తర్వాత చాలా మందిని ఆడిషన్ చేసి, చివరికి ఓ క్యూట్ గాళ్‌ను ఫైనల్ అనుకొని, అగ్రిమెంట్ సైన్ చేయించాము. మళ్లీ ఇలాంటి డేట్స్ కారణాలవల్లనే ఆ అగ్రిమెంట్ కూడా కాన్సిల్ అయింది.  

అయితే - ముందు నేను బాగా నచ్చిన హీరోయిన్ మిస్సవడం నుంచి, ఈ క్యూట్ హీరోయిన్ అగ్రిమెంట్ కాన్సిల్ అవడం వరకూ - ప్యారలల్‌గా నా మైండ్‌లో మెదులుతున్న హీరోయిన్ వేరు. చివరికి తనే నా సినిమాకి హీరోయిన్ అవుతుందని కూడా ఎందుకో అనిపించింది అప్పుడప్పుడూ. ఇదీ అని కారణం లేదు.

కాని, చివరికి అలాగే జరిగింది.

లాస్ట్ మినిట్‌లో ప్రియను పిలిపించి సంతకం చేయించాను.

ప్రియ నాన్న వశిష్ట యూనివర్సిటీలో నా సీనియర్. ఇప్పుడో ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్. ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మేము తరచూ కలుస్తున్నపుడు, ప్రియ గురించి చెబుతూ, "హీరోయిన్ కావాలన్నదే తన జీవితాశయం" అని ఒకటి రెండు సార్లు నాతో అన్న విషయం నాకు బాగా గుర్తుండిపోయింది.

ఆ జ్ఞాపకమే ప్రియను ఈ సినిమా ద్వారా హీరోయిన్‌ను చేసింది. సో, అలా ప్రియ నా ఫైండింగ్ అన్నమాట.

సిల్వర్ స్పూనో, గోల్డెన్ స్పూనో అంటారు. అలాంటి నేపథ్యం ప్రియకుంది. సినిమామీద పిచ్చి ప్యాషన్ ఉంది. హీరోయిన్ కావాలన్న తపన ఉంది. లేటెస్ట్ ట్రెండ్స్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. "నేనిది చేయను .. అది చేయను" అన్న హిపోక్రసీ లేదు.

ఒక కంప్లీట్ హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి.

వాటిని సద్వినియోగం చేసుకొని, ఒక మంచి ఆర్టిస్టుగా ఎదిగి, తన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టడం అనేది పూర్తిగా ఇక ప్రియ చేతుల్లోనే ఉంది.

మరోవైపు - కథ ఎంత డిమాండ్ చేసినా, డైరెక్టర్ ఎంత చూపించాలనుకున్నా, హీరోయిన్ ఎంత చూపించినా .. మధ్యలో సెన్సార్ అనే కత్తెర ఒకటుంది. ఆ కత్తెర పరిమితుల్లోనే ఒక హీరోయిన్‌గా ప్రియ తన ఫస్ట్ సినిమాలోనే బెస్ట్ మార్క్స్ సంపాదించుకుంది.  

అందుకే ప్రియను "హాట్ హీరోయిన్" అన్నాను.

ప్రియకు మంచి ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ తన చేతుల్లోనే ఉంది.    

Thursday 11 December 2014

హీరో "అఖిల్ కార్తీక్" కథేంటి?

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్, డబ్బు లేకుండా సినీ ఫీల్డులో హీరోగా అసలు ఎంట్రీనే కష్టం.

కానీ, ఏ సపోర్ట్ లేకుండానే - కేవలం తన యాక్టింగ్ టాలెంట్స్‌ని ప్రదర్శించి -  ఓ మంచి దర్శకుడి సినిమాలో, భారీ బ్యానర్‌లో ఎలాగో హీరోగా అవకాశం దొరికించుకున్నాడు ఓ కుర్రాడు.

ఆ సినిమా హిట్ అవలేదు.

కట్ చేస్తే, ఎవరయినా సరే "పీఛే ముడ్" అనక తప్పదు. లేదంటే, ఏ చిన్నా చితక పాత్రలకో పరిమితం కాక తప్పదు. లేదా.. ట్రాన్స్‌ఫర్ టూ టీవీ!

అయితే ఈ కుర్రాడి విషయంలో జరిగింది వేరు.

ఎలాంటి సపోర్ట్ లేకుండానే ఈ కుర్రాడు 9 సినిమాలు హీరోగా చేశాడు. ప్రత్యేక సహాయ పాత్రల్లో మరో 3 సినిమాలు చేశాడు. అన్నీ రిలీజయ్యాయి. రావల్సిన హిట్ మాత్రం ఇంకా రాలేదు.

అయినా ఎనర్జీ తగ్గలేదు. ఎయిమ్ మారలేదు.

అతనే అఖిల్ కార్తీక్.

కట్ టూ అఖిల్ కార్తీక్ ఎంట్రీ - 

వైజాగ్ సత్యానంద్ ఇన్స్‌టిట్యూట్ నుంచి నేరుగా మొదటిసారిగా హైద్రాబాద్ వచ్చాడు కార్తీక్. ఏ రోడ్డూ, ఏ ఏరియా తెలియదు. ఎవరు ఎక్కడుంటారో తెలియదు.

తెలిసింది ఒక్కటే. ఎలాగయినా హీరో కావాలి.

తెచ్చుకున్న కొంచెం డబ్బుతో పంజాగుట్టలో ఉన్న ఒక చిన్న హోటల్లో దిగిపోయాడు కార్తీక్. ఇప్పటికీ అక్కడే ఉన్న ఆ హోటల్ పేరు -  బాలాజీ లాడ్జ్.

అప్పట్లో ఒక ప్రముఖ దర్శకుని పిలుపుతో అలా హైద్రాబాద్‌కు వచ్చిన తర్వాత కార్తీక్‌కు కథ అడ్డం తిరిగింది. ఏదో ఒక సంవత్సరం కదా అని బాండ్ అగ్రిమెంట్‌కు ఓకే చెప్తే, ఆ ప్రముఖ దర్శకుడు దాన్ని చివరి నిమిషంలో ఐదేళ్లకు పెంచాడు!

ఆలోచించాడు కార్తీక్. సింపుల్‌గా "నో" అనుకున్నాడు.

తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్న టైమ్‌లో పంజాగుట్ట హోటల్ నుంచి మకాం మధురానగర్ గల్లీలోని బ్యాచ్‌లర్ రూమ్‌లోకి మారింది.

అప్పుడొచ్చిందొక అవకాశం.

ముప్పలనేని శివ కొత్తవాళ్లతో తీస్తున్న చిత్రం ఆడిషన్స్‌లో అదరగొట్టాడు కార్తీక్.

అంతే.

తన సినిమాలోని ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా ఎన్నిక చేశారు ముప్పలనేని శివ. ఆ తర్వాత అక్కడకూడా ఎన్నో ట్విస్టులు తట్టుకొని, చివరికి ముప్పలనేని శివ దర్శకత్వంలోనే హీరోగా నటించాడు కార్తీక్.

అలా తొలిసారిగా కార్తీక్ హీరోగా నటించిన ఆ చిత్రం పేరు "దోస్త్!"

2004 నుంచి 2014 వరకు పదేళ్లు గడిచినా, కార్తీక్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులేదు. అనవసరపు చెత్త సినిమాటిక్ మాస్కులు లేవు. నా రెండో చిత్రం "అలా"లో నటించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు కార్తీక్.

అదే అతని ఎసెట్. అదే అతనికి శ్రీరామ రక్ష.    

జస్ట్ ఎ గుడ్ గై.

కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఆనాటి "దోస్త్" నుంచి, మొన్నటి "తీయని కలవో" వరకు - 9 చిత్రాల్లో హీరోగా చేసినా, తనకు రావల్సిన రేంజ్‌లో ఒక హిట్ ఇంకా కార్తీక్ ఖాతాలో పడలేదు.

అయితే 2015 వస్తోంది మాత్రం ఆ లోటు తీర్చడానికే. అదెలాగో వివరంగా చెప్పటం అవసరమని నేననుకోవటం లేదు.

ఇట్ జట్ హాపెన్స్ ..  

Sunday 7 December 2014

ఒక రొమాంటిక్ హారర్ సినిమా!

ఇప్పుడంతా తెలుగులో హారర్ సినిమాల హవా  నడుస్తోంది.

ఈ ట్రెండ్‌ను ఫాలో కావాలని నేనేం అనుకోలేదు కానీ, నా ప్రొడ్యూసర్ మిత్రుడు అరుణ్‌కుమార్ "హారర్ సినిమానే తీద్దాం" అన్నారు.

మరింకేం ఆలోచించకుండా నేను "ఓకే" అనేశాను.

ఈ నిర్ణయం తీసుకోవడంలో మా ప్రొడ్యూసర్ పాయింటాఫ్ వ్యూ, నా పాయింటాఫ్ వ్యూ వేర్వేరు కావొచ్చు. అది సహజం. కానీ, అంతిమంగా మా ఇద్దరి గోల్ మాత్రం ఒక్కటే. తర్వాత నేను ఎన్నిక చేసిన నా టీమ్ లక్ష్యం కూడా అదే.

సక్సెస్.

చాలా చిన్న బడ్జెట్ కాబట్టి "హారర్" ఒకరకంగా బెటర్. లొకేషన్స్ తక్కువగా ఉంటాయి. కేరెక్టర్లూ తక్కువగా ఉంటాయి. అయితే - మేకింగ్ పరంగా ఒక స్థాయి స్టాండర్డ్ లేకపోతే చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. అందుకే ఈ విషయంలో మేమెక్కడా కాంప్రమైజ్ కాలేదు.

ఇక హారర్ కథలన్నీ దాదాపు ఒకేలా అనిపించినా, స్క్రీన్ ప్లే దగ్గర కొంతయినా కష్టపడాల్సివస్తుంది. మిగిలిన సినిమాల్లో లేని "ఇంకేదో" కొత్త అంశం ఒకటి చొప్పించాల్సి ఉంటుంది.

ఈ సినిమా విషయంలో ఆ పని నేను చేయగలిగాను.

స్క్రీన్ ప్లే తర్వాత హారర్ సినిమాకు కెమెరా, సౌండ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ముఖ్యం. కెమెరా దగ్గర మా ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ కాలేదు. కెమెరామన్ దగ్గర నేను కాంప్రమైజ్ కాలేదు.

కట్ టూ "లోకం చుట్టిన వీరుడు" -  

రెడ్ ఎం ఎక్స్, స్టెడీకామ్ లను మస్త్‌గా ఉపయోగించి షూట్ చేసిన ఈ సినిమా "డి ఓ పి" కి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అంటే పిచ్చి ప్యాషన్. ఎక్కువగా అంతర్జాతీయస్థాయిలో పనిచేసే ఈ టెక్నీషియన్ పాస్‌పోర్టులు బుక్కులు బుక్కులుగా అయిపోతుంటాయి. షూటింగ్ పనిలో ఈయన ఇప్పటికే 90 దేశాలకి పైగా తిరిగాడు. సుమారు ఇంకో 90 దేశాలు తిరిగితే చాలు.. లోకం చుట్టిన వీరుడవుతాడు!

సినిమాటోగ్రఫీ కళ పట్ల ఇంత ప్యాషన్ ఉన్న ఈ డి ఓ పి, సినీ ఇండస్ట్రీలో నేను వేళ్లమీద లెక్కపెట్టుకొనే నాకున్న అతికొద్దిమంది మిత్రుల్లో మొదటివాడు.

ఇతని పారితోషికాన్ని ఈ సినిమా బడ్జెట్ ఏమాత్రం భరించలేదు. అయినా కేవలం నాకోసం ఈ చిత్రానికి పనిచేశాడు ఈ మిత్రుడు.  ఇంకా చెప్పాలంటే - ఈ మిత్రుడు ఉన్నాడు కాబట్టే ఈ సినిమా షూటింగ్‌ని ఇంత వేగంగా, ఇంత క్వాలిటీతో, 2 పాటలతో కలిపి కేవలం 13 రోజుల్లో చాలా కూల్‌గా పూర్తిచేయగలిగాను.

ఈ ఆత్మీయ మిత్రుని పేరు వీరేంద్ర లలిత్.  

Friday 5 December 2014

ఒక ఐడియా ..

"ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది" అన్నది కొంచెం స్టయిలిష్‌గా చెప్పేమాట. "ఒక ఐడియా ఏకంగా కొంపలు ముంచుతుంది" అన్నది ముఖం మీద గుద్దినట్టు చెప్పేమాట.

మొదటిది పాజిటివ్ భావన. రెండోది పక్కా నెగెటివ్ ఎఫెక్టు. రెండూ అనుభవపూర్వకంగా తెలిసేవే.

ఈ రెండు రకాల ఐడియాల ప్రభావాన్ని వివిధ దశల్లో వ్యక్తిగతంగా చవిచూసినవాణ్ణి కాబట్టి నాలో ఒకరకమైన స్థితప్రజ్ఞత క్రమంగా అలవడింది.

థాంక్స్ టూ మై ఐడియాస్. గుడ్ ఆర్ బ్యాడ్. బెటర్ ఆర్ వరస్ట్ ..

కట్ టూ మై లేటెస్ట్ ఐడియా -

ప్రస్తుతం నేను చేస్తున్న తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా కోసం ఒక టైటిల్ అనుకున్నాము. అయితే అఫీషియల్‌గా ఆ టైటిల్ మాకు రావడానికి ఇంకో రెండు వారాలు పడుతోంది. అంతదాకా నో ప్రెస్‌మీట్! అవసరమయితే ప్రెస్‌నోట్ ఒకటి మాత్రం రిలీజ్ చేస్తాం.

సినిమా షూటింగ్ అయిపోయిందనీ, ప్లస్ ఇంకా కొన్ని విశేషాలతో.

ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ యమ ఫాస్ట్‌గా చేస్తూనే - ఈ సినిమా అనుకున్న రోజునుంచి ఇప్పటివరకూ, ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ వరకూ .. అన్ని విశేషాలతో, రోజూ కనీసం ఓ 15 నిమిషాలు కెటాయించి బ్లాగింగ్ చేయాలనుకుంటున్నాను.

ఇది మాత్రం చెత్త ఐడియా కాదని నా నమ్మకం. ఏమో .. ఈ బ్లాగ్ పోస్టులతోనే రేపు "ది మేకింగ్ ఆఫ్ .." అని ఓ పుస్తకం కూడా పబ్లిష్ చేయొచ్చు! ఎవరికి తెలుసు ..  

Wednesday 3 December 2014

సిల్క్ స్మిత చాలా సాధించింది!

చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశాను.

అదీ రికార్డ్ టైమ్‌లో.

సుమారు 30 రోజులయినా పట్టే ఒక తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా షూటింగ్‌ని కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాను.

నిజానికి షూటింగ్ 12 రోజులే ప్లాన్ చేశాను. కానీ.. రకరకాల ఆలస్యాలు, ఆటంకాల వల్ల ఒక రోజు పెరక్క తప్పలేదు. అయినప్పటికీ క్వాలిటీదగ్గర ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా - రెడ్ ఎమ్ ఎక్స్ కెమెరాతో, స్టెడీకామ్ కూడా ఉపయోగిస్తూ, 2 పాటలతో, రాత్రీ పగలూ టీమ్‌ని ఉత్సాహపరుస్తూ 13 రోజుల్లో షూటింగ్ పూర్తిచేయడం అంత చిన్న విషయమేం కాదు. థాంక్స్ టూ మై టీమ్ అండ్ ప్రొడ్యూసర్! 

అసలు కథ ముందుంది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, బిజినెస్. వీటి విషయంలో కూడా షూటింగ్ అప్పటి ఊపునీ, ఫోకస్‌నీ కొనసాగించగలమనే నా నమ్మకం.

రేపో, ఎల్లుండో తెలిసే టైటిల్ కన్‌ఫర్మేషన్ కోసం చాలా ఎక్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాము. నేనూ, నా టీమంతా.

కట్ టూ సిల్క్ స్మిత -

ఎన్నో ప్రత్యేకతలున్న నా ఈ రొమాంటిక్ హారర్ సినిమా షూటింగ్ పుణ్యమా అని చాలారోజులుగా మర్చిపోయిన నా బ్లాగ్‌ని ఇవాళ అనుకోకుండా విజిట్ చేశాను. ఏదయినా రాద్దామని.

ఆశ్చర్యంగా, నేనెప్పుడో చాలాకాలం క్రితం రాసి మర్చిపోయిన నా పాత బ్లాగ్ పోస్ట్ "సిల్క్ స్మిత ఏం సాధించింది?" పాపులర్ పోస్టుల్లో టాప్ పొజిషన్‌లో కనిపించింది!

అది చూశాక, ఆ క్షణం నాకు అనిపించిన భావనే ఈ బ్లాగ్ పోస్ట్‌కు టైటిల్ అయి కూర్చుంది.

హేయ్ స్మితా! హెవెన్‌లోనూ దుమ్మురేపుతున్నావా లేదా? నీ పేరుతో విద్యా బాలన్ ఇక్కడ ఆల్రెడీ దుమ్ములేపింది మరి ..