Friday 29 August 2014

హాఫ్ గాళ్‌ఫ్రెండ్!

ఇండియాలో పదిలక్షల కాపీలు అమ్మిన మొట్టమొదటి ఇంగ్లిష్ పుస్తకం "ఫైవ్ పాయింట్ సమ్ వన్". 2004 లో పబ్లిష్ అయిన ఈ నవలే 2009 లో "త్రీ ఇడియట్స్" బ్లాక్‌బస్టర్ సినిమాగా హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  

"ఫైవ్ పాయింట్ సమ్ వన్" నవల రాయడానికి ఆ రచయితకు సుమారు మూడు నాలుగు ఏళ్లు పట్టింది. హాంకాంగ్‌లోని తన ఆఫీసులో కూర్చుని కొంత, ఇంటికొచ్చాక ఫ్రీటైమ్‌లో కొంత.. వీలున్నప్పుడల్లా, రాయాలనిపించినప్పుడల్లా.. చాలా.. ఆరామ్‌గా.. రాసిన నవల అది.

అది అతని తొలి నవల. ఎలాంటి డెడ్‌లైన్స్ లేవు అప్పుడు.

కట్ చేస్తే - 

ఒకే ఒక్క సంవత్సరం తర్వాత, 2005 లోనే, తన తన రెండో నవల "వన్ నైట్ @ కాల్ సెంటర్" రాశాడా రచయిత.

మళ్లీ ఎందుకో ఓ మూడేళ్ల గ్యాప్. బహుశా ఉద్యోగమా, రచనా అన్న సంఘర్షణ అయ్యుంటుంది.

2008 లో "ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్", 2009 లో "2 స్టేట్స్", 2011 లో "రెవల్యూషన్ 2020", 2012 లో "వాట్ యంఘ్ ఇండియా వాంట్స్" (ఇది నాన్ ఫిక్షన్) చక చకా రాసేయాల్సిన డిమాండ్ ఆ రచయితకు క్రియేట్ అయింది.

ఇప్పుడు, వచ్చే అక్టోబర్ 1 న, ఇదే రచయిత సరికొత్త నవల "హాఫ్ గాళ్‌ఫ్రెండ్" రిలీజ్ అవబోతోంది. కనీసం ఓ
5 మిలియన్ల కాపీలయినా ఈ పుస్తకం సేల్స్ ఉంటాయని "రూపా" పబ్లిషర్స్ అంచనా.

మరోవైపు, అక్టోబర్ 1 నాటికి, దేశవ్యాప్తంగా ఈ పుస్తకాన్ని ఆయా గమ్యాలకు చేర్చడం కోసం "ఫ్లిప్‌కార్ట్" అప్పుడే వేలాది కార్టన్ బాక్సులు, ట్రక్కుల లెక్కల్లో యమ బిజీగా ఉంది.

కట్ టూ సినిమా కిక్ - 

తన తొలి నవల ఫైవ్ పాయింట్ సమ్ వన్ (త్రీ ఇడియట్స్) ఒక్కటే కాదు.. ఆ తర్వాత కూడా ఇదే రచయిత రాసిన వన్ నైట్ @ కాల్ సెంటర్ "హలో" గానూ, ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ "కాయ్ పొ చే" గానూ, "2 స్టేట్స్" అదే పేరుతోనూ హిందీలో సినిమాలుగా రూపొందటం నిజంగా గొప్ప విషయం.        

ఇలా ఉంటే - ఇటీవలి సాల్మన్ ఖాన్ "కిక్" సినిమాకి స్క్రీన్‌ప్లేని కూడా అందించిన ఈ రచయిత .. ఎప్పుడైనా లైఫ్‌లో కిక్ కావాలనిపించినప్పుడు ఫిలిం డైరెక్షన్ కూడా చేస్తానంటున్నాడు.

టైమ్ మేగజైన్ "వరల్‌డ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుఎన్షియల్ పీపుల్ 2010" లిస్టులోకి కూడా ఎక్కిన ఈ రచయిత పంజాబ్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, డిల్లీ లో పెరిగాడు. ఐ ఐ టి లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాక, ఐ ఐ ఎం లో మేనేజ్‌మెంట్ కూడా చదివాడు. (అక్కడే తన క్లాస్‌మేట్, తమిళ అమ్మాయి, అనూషని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ రచయిత. ఆ కథని కూడా ఓ నవలగా రాయొచ్చు. అది వేరే విషయం.)

ఆ తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా హాంగ్‌కాంగ్ లో పనిచేశాడు. ఆ సమయంలోనే అప్పుడప్పుడూ ఏదో రాస్తూ, చివరికి రాయడమే సీరియస్‌గా తీసుకుని 30 ఏళ్లకే బెస్ట్‌సెల్లర్ రచయితయ్యాడు.

క్యాండీ క్రష్, వాట్సాప్ లాంటివి తప్ప నాకు మరే రచయితా కాంపిటీషన్ అని నేను ఫీలవడంలేదు అని చాలా సింపుల్‌గా చెప్పే ఈ 40 ఏళ్ల రచయిత ఎవరో మీకు తెలుసు.

ఇక ఫ్లిప్‌కార్ట్ ద్వారా, ఓ నెలతర్వాత, నా చేతుల్లో వాలబోతున్న ఈ రచయిత "హాఫ్ గాళ్‌ఫ్రెండ్" ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

ఇదంతా ఎలా ఉన్నా .. సక్సెస్ సైన్స్‌కు సంబంధించిన ఒకే ఒక్క అంశం ఈ సాయంత్రం నేనీ బ్లాగ్ పోస్ట్ రాయడానికి కారణమైంది.  అదేంటంటే.. సరిగ్గా 9 ఏళ్లక్రితం ఎలాగయినా ఇండియా టుడే కవర్ పేజీకి ఎక్కాలని ఈ రచయిత కలగన్నాడు. ఇప్పుడు ఎక్కేశాడు.

దటీజ్ చేతన్ భగత్.     

Tuesday 26 August 2014

అసలేందీ సింగపూర్, కె సి ఆర్?

"ప్రపంచంలోని 193 దేశాల్లో ఈ సింగపూర్ ఒక్కటే దొరికిందా వీళ్లిద్దరికీ?" అనుకుంటూ నా లిస్ట్ లోంచి సింగపూర్‌ని కొట్టేశాను. ఇంచుమించు ఇదే అర్థంలో సరదాగా ఓ ట్వీట్ కూడా పెట్టాను ఈ ఉదయమే.

కానీ, ఇప్పుడు ఈ బ్లాగ్‌లో రాస్తున్నది మాత్రం సరదాగా కాదు.

సుమారు రెండు దశాబ్దాలనుంచీ ఈ సింగపూర్ జపం వింటూనే ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని వివిధకోణాల్లో సింగపూరూ, ఆయన పేరూ దాదాపు పర్యాయపదాలయిపోయాయి.

రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తానని పదే పదే అనడం ఒక కోణం కాగా, ఆయనకు సింగపూర్లో ఓ పెద్ద హోటల్, బోల్డన్ని ఆస్తులున్నాయని ఆరోపణలుండటం ఇంకో కోణం. నిజానిజాల విషయం పక్కనపెడితే - ఇవన్నీ వినీ వినీ సింగపూర్ అంటేనే ఒక రకమైన విరక్తి ఏర్పడింది. నా ఒక్కడికే కాదు .. చాలా మందికి!


కట్ టూ కె సి ఆర్ సింగపూర్ విజిట్ -  

ఇంతకు ముందెన్నడూ విదేశీయానం చేయని కె సి ఆర్ కు, సి ఎం గా తొలి విదేశీ పర్యటన సింగపూర్ కావటం కేవలం యాదృచ్చికం. సింగపూర్‌లోని ఐ ఐ ఎం "అలుమ్ని" నుంచి అలా ఆహ్వానం రావడం, ఇలా ఓకే అని వెళ్లడం చకచకా జరిగిపోయాయి.

పనిలో పనిగా పక్కనే ఉన్న మలేషియా కూడా ఒక రౌండ్ వేసి వచ్చారు కె సి ఆర్.

అయితే, అందరూ అనుకుంటున్నట్టుగా - ఏదో సింగపూర్ అనగానే చంకలు గుద్దుకుంటూ ఫ్లైట్ ఎక్కలేదు కె సి ఆర్.

సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ రాసిన "సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వర్‌ల్డ్ టూ ఫస్ట్" పుస్తకాన్ని సుమారు 20 ఏళ్లక్రితమే చదివారు కె సి ఆర్. మామూలు నిరుపేద మూడో ప్రపంచదేశం స్థాయి నుంచి, ప్రపంచంలో ప్రథమశ్రేణి దేశంగా ఆ దేశం ఎలా ఎదిగిందో ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఆయనకు. ఈ నేపథ్యంలోనే, బహుశా, సింగపూర్ విజిట్‌కు వెంటనే ఓకే చెప్పి చెప్పుంటారు కె సి ఆర్.  

అది 1993 అనుకుంటాను. అప్పుడు నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నాను ..

18 ఏళ్ల ఒక అమెరికన్ టీనేజర్ స్టూడెంట్ సింగపూర్‌లో చేసిన ఓ చిన్న నేరానికి అతన్ని జైల్లో పెట్టారు. ఆ కుర్రాడు చేసిన నేరం ఏంటంటే - దొంగతనంగా ఓ నాలుగయిదు కార్లకి రెడ్‌కలర్ పెయింట్‌ను స్ప్రే చేయడం!  

ఆ అమెరికన్ కుర్రాడి పేరు పీటర్ ఫే.

పీటర్ చేసిన నేరానికి సింగపూర్ ప్రభుత్వం ఆ దేశ చట్టాల ప్రకారం 4 నెలల జైలు, సుమారు 2 వేల డాలర్ల జరిమానా, ఓ 6 బెత్తం దెబ్బల శిక్ష విధించింది.

1993-94 ల్లో ప్రపంచమంతా ఈ సంఘటనపైనే కొన్ని రోజులపాటు హెడ్‌లైన్సూ, బ్రేకింగ్ న్యూస్‌లు! అమెరికా ఈగో తట్టుకోలేకపోయింది. "ఇది చాలా అతి" గా అభివర్ణించింది అమెరికా.

చివరికి అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సింగపూర్ గవర్నమెంటుకు ఒక లేఖ రాస్తూ, ఆ బెత్తం దెబ్బలయినా మినహాలించాలని కోరాడు. క్లింటన్ కోరికను మన్నించి, సింగపూర్ ప్రభుత్వం పీటర్ ఫే శిక్షను 6 బెత్తం దెబ్బల నుంచి 4 బెత్తం దెబ్బలకు తగ్గించింది! జైలు శిక్ష, జరిమానా మాత్రం యథాతథం!!

దటీజ్ సింగపూర్!

అమెరికా అయినా, అంగోలా అయినా సింగపూర్‌కు ఒక్కటే. వారి చట్టాలు మారవు. అవి ఎవరికీ చుట్టం కావు. అంత క్రమశిక్షణ, చిత్తశుధ్ధి ఉన్నాయి కాబట్టే .. వైశాల్యంలో ఎంతో చిన్న దేశమయినా 'పర్ క్యాపిటా'లో ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని కూడా చేరుకోగలిగింది.

తన తొలి విదేశీ పర్యటనలోనే సింగపూర్‌ని అధ్యయనం చేసే అవకాశం కె సి ఆర్ కు రావడం కాకతాళీయమే అయినా ఒక రకంగా సందర్భోచితం. తెలంగాణ తొలి సి ఎం గా, తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్న ఈ దశలో సింగపూర్‌ను ఒక మోడల్‌గా తీసుకొని, ప్రణాలికల్ని వేసుకొని పనిచేయడం, చేయించడం కె సి ఆర్ కు తప్పక ఉపయోగపడుతుంది.

కనీసం త్రాగు నీరు కూడా దొరకని సింగపూర్‌లో, మిగిలిన వనరుల లభ్యత కూడా అతి స్వల్పం. ఒక్కోదానికి ప్రపంచంలోని ఒక్కో దేశంపైన ఆధారపడిన దేశం సింగపూర్. కేవలం 276 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశ జనాభా 54 లక్షలు మాత్రమే. అయినా - ఒక స్పష్టమైన విజన్‌తో, డెడ్‌లైన్‌లతో కూడిన లక్ష్యాలతో ఎంతో వేగంగా అభివృధ్ధి చెందింది సింగపూర్.

మరి వైశాల్యంలోనూ, జనాభాలోనూ, వనరుల్లోనూ ఎన్నోరెట్లు అధికంగా ఉన్న మన దేశంలో ఈ అభివృధ్ధి ఎందుకు సాధ్యం కాలేదు?

కనీసం ఇప్పుడు మన తెలంగాణలో ఈ అభివృధ్ధి ఎందుకు సాధ్యం కాదు?

చేస్తే అవుతుంది. అయితీరుతుంది.

మనకంటే 18 ఏళ్లు ఆలస్యంగా, 1965 లో స్వాతంత్ర్యం సంపాదించుకున్న సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ చేసిన కృషికి ఫలితం, ప్రతిరూపం ఇప్పటి సింగపూర్.

తెలంగాణ తొలి సిఎం కె సి ఆర్ ఇప్పుడలాంటి బాధ్యతను, ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిధ్ధమయ్యారు. సాక్షాత్తూ ఇప్పటి ప్రధాని లీ సీన్ లూంగ్ తోనే తన మంత్రులకు, ఎమ్మెల్లేలకు, ఎమ్‌పీలకు, అధికారులకు శిక్షణ ఇప్పించడానికి పూనుకున్నారు కె సి ఆర్.

సింగపూర్ ఐ ఐ ఎం అలుమ్ని కార్యక్రమంలో సిఎం కె సి ఆర్ చేసిన ఒకే ఒక్క ప్రసంగంతో, అప్పటికప్పుడు 3 అంతర్జాతీయ కంపెనీలు తమ మెగా ప్రాజెక్టులతో ముందుకు వచ్చాయి. వందలాది ఇతర కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి. వాటిల్లో కనీసం 10 శాతం సక్సెస్ అయినా అది కె సి ఆర్ కు గొప్ప విజయమే!

ఉద్యమం అయిపోయింది .. తెలంగాణ వచ్చింది.. అని ఊరుకోకుండా, అదే ఉద్యమ స్పూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం విషయంలోనూ తెలంగాణ ప్రజలంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

ఊరికే విజన్ అంటూ దశాబ్దాలు మాటలతోనే వృధా చేయకుండా - అవసరమయితే తెలంగాణ పునర్నిర్మాణాన్ని కూడా ఒక ఉద్యమంలా మలచగల శక్తియుక్తులు దళపతి కె సి ఆర్ కున్నాయి. ఆయన అలా తప్పక చేస్తారని ఆశిద్దాం.

చేస్తారు కూడా! 

Sunday 24 August 2014

"శిలా శాసనం" మరొక్కసారి!

మొన్న దిలీప్ మరణం తర్వాత ..
ఎందుకో దీన్ని మళ్లీ ఒకసారి పోస్ట్ చేయాలనిపించింది.


***

సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా.. ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు.

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం.. ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలకి వేలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది.

ఈ విషయంలో కేవలం ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు! అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. అది వేరే విషయం.

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి.

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి.

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా.. తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

సో, బి కేర్‌ఫుల్ ..

***

దిలీప్, వి మిస్ యూ.. 

Tuesday 19 August 2014

క్యా సర్వే హై సర్ జీ!

దశాబ్దాల నా హైదరాబాద్ జీవితంలో మొట్టమొదటిసారిగా పండుగకాని ఓ పెద్ద పండుగ వాతావరణాన్ని చూశాను. ఏ సంక్రాంతి, దసరాలకు కూడా ఇలాంటి సందడి, ఇంత చర్చ నేను చూళ్లేదు.

మా సాదిక్ భాయ్ దీన్ని "సర్వే పండుగ" అన్నాడు అందుకేనేమో!

రోడ్లు పూర్తిగా ఖాళీ. ఆఫీసులు, షాపులు, హోటళ్లు, పాన్ షాపులు, మందు షాపులు.. అన్నీ బంద్!

ప్రతి ఇంటిదగ్గరా పండుగ సందడి. ఎన్నడూ లేనివిధంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే సమయంలో ఇంత ఫ్రీగా ఉండటం, ఎవరో ఓ ముఖ్యమైన అతిథి కోసం ఎదురుచూస్తున్నట్టుగా కూర్చోవడం, ఇరుగూ పొరుగూ మనసువిప్పి మాట్లాడుకోవటం..  

ఇదే సీన్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఉందని నేను మాట్లాడిన కొన్ని ఫోన్లు, బ్రౌజ్ చేసిన సోషల్ మీడియా చెప్పకనే చెప్పాయి.

కట్ టూ నెగెటివిటీ - 

కె సి ఆర్ దగ్గినా, తుమ్మినా అందులో తప్పే కనిపిస్తుంది. మాటనే కాదు.. ఆయన తీసుకొనే ప్రతి నిర్ణయాన్నీ, వేసే ప్రతి అడుగునీ పనిగట్టుకొని విమర్శించాలి.

కొందరికి అదొక ఆనందం. కొందరికి అదొక అవసరం. కొందరికి వొట్టి అపనమ్మకం.

"ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అర్హులకే అందేలా చూసే క్రమంలో భాగంగానే ఈ సర్వే జరుపుతున్నట్టు" ప్రభుత్వ వర్గాలు ముందే ప్రకటించాయి.

అదేం కాదు, "ఈ సర్వే ద్వారా సీమాంధ్రులను ఏరివేస్తారని" కొంతమంది అపోహ విన్నాను. నిజంగా అదే చేయాలనుకొంటే కె సి ఆర్ కి ఈ సర్వే అవసరమా? సింపుల్ లాజిక్..

నిజానికి ఈ అపోహకి సంబంధించిన ప్రశ్న ఈ సర్వేలో నాకు ఒక్కటీ కనిపించలేదు. పది నిమిషాలలోపే మా ఇంట్లో సర్వే పూర్తయిపోయింది. కనీసం నా జన్మస్థలం విజయవాడా, వరంగలా అని కూడా అడగలేదు. ఇంక ఈ సర్వే ద్వారా సీమాంధ్రుల ఏరివేత ఎలానో.. నాకైతే అర్థం కాలేదు.

ఏది ఎలాఉన్నా.. కె సి ఆర్ ఒక సర్వే చేయాలనుకున్నారు. యావత్ దేశం ఆశ్చర్యపోయేట్టుగా అది అత్యంత విజయవంతంగా పూర్తయింది.

విజయశాంతి, పవన్ కల్యాణ్ వంటి సెలెబ్రిటీలు సర్వేకు అంగీకరించలేదని విన్నాను. జూనియర్ ఎన్ టి ఆర్ సంపూర్ణంగా సహకరించాడనీ విన్నాను. ఆలోచనలు, అపనమ్మకాలు, నిర్ణయాలు వ్యక్తిగతం.

సిస్టమ్ ఏ ఒక్కరికోసం కాదు. ఒక వర్గం కోసం కాదు. అది ఎవ్వరికోసం ఆగదు.

కె సి ఆర్ ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఈ సర్వేని ప్లాన్ చేశారో అది తప్పక నిజమవుతుంది. నో డౌట్.

ఇది నా గుడ్డి నమ్మకం కాదు. ప్రాక్టికల్ రియాలిటీ. అది ఆయన బ్రాండ్!

ఆయన రుజువు చేసుకున్నారు. చేసుకుంటున్నారు. చేసుకుంటూనే ఉంటారు.

వాట్ నెక్‌స్ట్ సర్ జీ?   

Saturday 16 August 2014

దీపం ఉండగానే .. హీరోయిన్!

కత్రినా కైఫ్, దీపికా పడుకొనేల పారితోషికం అక్షరాలా 15 కోట్లు! నమ్మగలరా?

నమ్మితీరాలి.

కత్రినా, దీపిక నిజంగా ఒక సినిమాకి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు!

నిజానికి ఈ స్థాయి రెమ్యూనరేషన్ బాలీవుడ్‌లో కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఏ ముగ్గురో నలుగురో టాప్ హీరోలకు తప్ప మరెవ్వరికీ లేదు.

ఇప్పుడే చదివాను ..

ఈ మధ్య ఓ హిట్ థ్రిల్లర్ బ్యాగులో వేసుకున్న ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ - మాంచి ఊపులో దాని సీక్వెల్ కూడా తీయాలని డిసైడ్ అయిపోయాడు.  డబ్బుకూడా బాగానే వచ్చిందిగా అని - ఏకంగా అయితే కత్రినా, లేదంటే దీపికను బుక్ చేసేద్దామనుకున్నాడు.

తీరా వాళ్లని కాంటాక్ట్ చేస్తే తెల్సిన విషయం ఆ ప్రొడ్యూసర్‌ను షాక్‌కు గురి చేసింది.

ఆ సీక్వెల్లో హీరోయిన్‌గా చెయ్యడానికి 15 కోట్ల పారితోషికం అడిగారిద్దరూ.

కట్ చేస్తే - 

మరుక్షణం ఓ కొత్త నిర్ణయం తీసేసుకున్నాడు మన ప్రొడ్యూసర్. తను అత్యుత్సాహంతో అనుకున్న ఇద్దరు
హై ప్రొఫైల్ హీరోయిన్లు ఇచ్చిన షాక్‌తో శ్రధ్ధాకపూర్, అలియాభట్ రేంజ్ చాలనుకున్నాడు.

ప్రాబ్లం సాల్వ్‌డ్.

సో, ఇప్పుడు ఆ సీక్వెల్లో .. అయితే శ్రధ్ధాకపూర్, లేదంటే అలియాభట్ కానీ ఓకే అవొచ్చునన్నమాట! అయితే - ఇంకో హిట్టు ఖాతాలో పడితే చాలు. ఈ ఇద్దరు కూడా హై ప్రొఫైల్లోకి వెళ్లికూర్చుంటారన్నది అత్యంత సహజమైన విషయం.

డిమాండ్ ఉన్నప్పుడే అన్నీ చక్కదిద్దుకుంటారు ఎవరైనా. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ఓ స్టెప్ ముందున్నారనుకోవచ్చా? 

Thursday 14 August 2014

సారే జహాసె అఛ్ఛా ..

రాష్ట్రం రెండు ముక్కలు కావడం, గోల్కొండపైన పంద్రాగస్టు .. తెలుగువారికి సంబంధించి ఈ రెండూ ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ఓ కొత్త ఊపునిస్తున్నాయి.

కట్ టూ ఆనాటి పంద్రాగస్టు -

నా చిన్నతనంలో పంద్రాగస్టు అంటే నిజంగా ఒక పండగే. కనీసం ఒక మూడు రోజులు వరంగల్‌లోని మా ఇంటిచుట్టూ పెద్ద సందడి. చెప్పలేనంత హడావిడి.

జెండాగద్దె సరిగ్గా మా ఇంటిముందే!

సలేందర్, ప్రతాప్, స్వామి, శంకర్, భిక్షపతి .. ఇంకో పదిమంది యువతరం ఒక గ్రూప్. వయసులో వీళ్లకంటే కొంచెం చిన్నవాడయినా.. మా అన్న దయానంద్ కూడా ఇదే గ్రూపు.

ఈ గ్రూపంతా కలిసి వారం ముందునుంచే చందాలు వసూలుచేసేవాళ్లు. రాత్రి పొద్దుపోయేవరకూ మా ఇంటిముందున్న అరుగులపైన కూర్చుని - కనీసం వారం ముందునుంచే "ఈసారి జెండావందనం కొత్తగా ఎలా చేయాలి" అన్నదానిమీద ఈ గ్రూపంతా చర్చలు జరిపేవాళ్లు. నేనూ, నా చిన్న గ్రూపు కూడా అక్కడే వాళ్ల చుట్టూ నిల్చుని అవన్నీ ఆసక్తిగా వింటూవుండేవాళ్లం.

మా వీధి మొత్తంలో అప్పుడు మా ఇల్లే చాలా పెద్దది. జెండాను ఎగురవేసే గద్దె కూడా సరిగ్గా మా ఇంటిముందే ఉండటంతో దానికి సంబంధించిన ప్రతి పనీ, ప్రతి సడీ మాకూ తెలిసేది. జెండావందనం కోసం కొనుక్కొనివచ్చిన రంగురంగుల జెండా కాగితాలు, ఇతర వస్తువులన్నీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టేవాళ్లు. కొబ్బరికాయలు, పండ్లు, చాక్లెట్లతోసహా!  

వీధి ఈ చివరినుంచి ఆ చివరిదాకా - ఎన్నో వరుసలు సుతిలితాడు కట్టి, మైదాపిండితో చేసిన "లై"తో, చిన్నపిల్లలం మేము అందిస్తుంటే, ఈ పెద్దవాళ్లు జెండాలు అతికించేవాళ్లు. తర్వాత ఈ జెండాల్నే వీధంతా తోరణాలుగా కట్టేవాళ్లు.

జెండావందనం రోజు నిజంగా పెద్ద పండగే. ముందురోజు రాత్రే ఫ్రెష్‌గా తెచ్చిన మట్టితో అప్పటికప్పుడు మూడు అంచెల్లో గద్దె తయారయ్యేది. ఎర్రమట్టితో దానికి కోటింగ్ కూడా!

తెల్లవారకముందునుంచే మైకులో గ్రామఫోన్ రికార్డ్ పాటలు. దేశభక్తి పాటలు, భగవద్గీత.

గ్రూపులో ఒక్కో సంవత్సరం ఒక్కోరు జెండా ఎగురవేసేవారు. తర్వాత స్వీట్లు, కొబ్బరి, చాక్లెట్లు అక్కడున్న మా అందరికేకాదు..ఇంటింటికి వెళ్లి మరీ పంచేవాళ్లు.

కట్ టూ ప్రెజెంట్ - 

అప్పటి ఆ యువతరం గ్రూపులో కొందరు ఇప్పుడు లేరు. ఉన్నవాళ్లు ముసలివాళ్లయిపోయారు. ఆనాటి ఆ మట్టి జెండాగద్దె ప్లేస్‌లో ఇప్పుడు ఒక పర్మనెంట్ సిమెంట్ గద్దె ఉంది. ఎలా చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఆనాటి సీరియస్‌నెస్ మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా లేదని మాత్రం చెప్పగలను.

అప్పటి దేశభక్తి వేరు. అప్పటి స్వఛ్ఛత వేరు. అప్పటి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలు.. అన్నీనిజంగా వేరే.

ఎన్నో ఏళ్లతర్వాత, ఈరోజు, ఇలా .. పంద్రాగస్టు గురించి నెమరేసుకుంటున్నానంటే .. నిశ్చయంగా క్రెడిట్ గోస్ టూ
కె సి ఆర్.

కాకతీయులు కట్టిన గోల్కొండ కోటపైన తొలిసారిగా జెండావందనం అంటూ ఒక అలజడికి తెరలేపారు కె సి ఆర్. అయితే అది కొందరు అనుకుంటున్నట్టు అర్థంలేకుండా కాదు. అర్థవంతంగా.

ఆ అర్థం - ఒక మార్పు. ఒక ఉనికి. ఒక నాస్తాల్జియాకి స్పూర్తి.  

Wednesday 13 August 2014

మైక్రోబడ్జెట్ టూ స్టీవెన్ స్పీల్‌బర్గ్!

ప్రపంచస్థాయి ఫిలిమ్‌మేకర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ మొదటిసారి ఒక సినిమా చూసి భయపడ్దాడు. మధ్యలోనే చూడ్డం ఆపేసి డివీడి ని ప్యాక్ చేశాడు. తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని - ఇంటికెళ్లి తన బెడ్‌రూమ్ తలుపుకు ఉన్న లాక్‌ని పర్‌ఫెక్ట్‌గా సెట్ చేయించడం!

ఆ సినిమా పేరు -
పారానార్మల్ యాక్టివిటీ (2007).

అంతవరకూ ఉన్న హారర్ చిత్రాల మూసను ఛేదించిన ఓ కొత్త తరహా హారర్ చిత్రం.

రిలీజ్ కోసం కష్టాలుపడుతున్న సమయంలో అనుకోకుండా స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఈ చిత్రాన్ని చూడ్డం జరిగింది. ఆ తర్వాత స్పీల్‌బర్గ్ చొరవతో పారానార్మల్ యాక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది.

ఒక్క అమెరికాలోనే విడుదలకాని 100 సెంటర్ల నుంచి "మా ఏరియాలో కూడా వెంటనే రిలీజ్ చేయండి" అని ప్రేక్షకులనుంచి డిమాండ్ తెప్పించుకుంది ఈ సినిమా.

మికా, కేటి లు లీడ్ పెయిర్ గా నటించిన ఈ హారర్ చిత్రానికి  రచయిత, దర్శకుడు, నిర్మాత, కెమెరామాన్ అన్నీ ఒక్కడే - ఒరెన్ పేలి. విచిత్రమేంటంటే - తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోడానికి కొన్నాళ్ళపాటు "డెమనాలజీ" చదివాడు పేలి. ఆ తర్వాత అతనికి వచ్చిన ఆలోచనే ప్రపంచాన్ని భయపెట్టిన ఈ వెరైటీ హారర్ చిత్రం!

కేవలం రెండే రెండు ప్రధానపాత్రలతో ఈ చిత్రం క్రియేట్ చేసిన థ్రిల్ లేదా ఛిల్ .. ఈ చిత్రానికి 560,000 రెట్లు లాభాల్ని  అందించింది. ఇది ఇప్పటికీ రికార్డే!

అప్పటినుంచీ - పారానార్మల్ యాక్టివిటీ చిత్రం ప్రభావంతో, ఇన్స్‌పిరేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో "రెండే రెండు ప్రధాన పాత్రలు"గా హారర్ సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇటీవలే విడుదలైన రామ్‌గోపాల్‌వర్మ "ఐస్‌క్రీమ్" కూడా అలాంటిదే.    

పారానార్మల్ యాక్టివిటీ సీరీస్‌లో .. తర్వాత మరో 3 సినిమాలు వచ్చాయి. పారానార్మల్ యాక్టివిటీ-5 ఇంకో రెండేళ్ల తర్వాత 2016 లో రాబోతోంది.

కట్ టూ అర్థం లేని "పెద్ద కెమెరా మైండ్ సెట్" - 

పారానార్మల్ యాక్టివిటీ చిత్రాన్ని కేవలం 5 లక్షల లోపు బడ్జెట్‌లో (2007 లో 11,000 డాలర్లు!), చేత్తోపట్టుకుని తీసే అతి తక్కువ ధర "కామ్‌కార్డర్"తో .. జస్ట్ 7 రోజుల్లో షూట్ చేసి రూపొందించారు అన్నది ఇక్కడ అందరూ గమనించాల్సిన నిజం. ముఖ్యంగా - మన తెలుగు పరిశ్రమలో "5D తో తీసిన చిత్రాల"ను చిన్నచూపు చూసే మన సోకాల్డ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, శాటిలైట్ రైట్స్ మీడియేటర్లు, అలాంటి మైండ్ సెట్టే ఉన్న మరికొంత మంది సినీ మేధావులు, అలా అనుకొనే ఇతర జీవులూ .. 

Wednesday 6 August 2014

జీవితం సప్తసాగర మథనం!

ప్రతి మనిషి జీవితంలో ఒక అత్యంత క్లిష్టమైన సమయం వస్తుంది. ఏ పనీ జరగదు. జరిగినట్టే అనిపించినా.. మనం కలలో కూడా ఊహించని విధంగా అన్నీ ఎదురుకొడుతుంటాయి. దెబ్బ మీద దెబ్బ ఏదో ఒక రూపంలో పడుతూనే ఉంటుంది.

ఊపిరి తీసుకోలేం. ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పలేం. మనకి మనం కూడా ఒప్పుకోలేం.

ఇలాంటి సమయాలు నీ అనాలోచిత పాత నిర్ణయాల పరిణామాలేకావొచ్చు. నువ్వు కొత్తగా తీసుకొన్న మంచి నిర్ణయాల చెడు ఫలితాలు కూడా కావొచ్చు.

ఇలాంటి క్లిష్ట సమయాలు కేవలం నిన్ను పరీక్షించడానికే వచ్చాయనుకోవద్దు. ఈ స్థాయి పరీక్షలను తట్టుకొనే శక్తి నీకుందని నిరూపించడానికి కూడా వస్తాయి.

"నో.. ఇంక నావల్లకాదు" అనుకుంటున్నావా?

అవసరంలేదు.

నీమీద నాకు నమ్మకముంది. నీగురించి నువ్వు ఆలోచిస్తున్నదానికంటే శక్తివంతమైనవాడివని.

నీమీద నాకు నమ్మకముంది. నీ కలల్ని నువ్వు తప్పక నిజం చేసుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది. నువ్వు చేరాల్సిన గమ్యం చేరుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది. నువ్వు కూడా నీమీద నమ్మకం పెంచుకోగలవని. 

Sunday 3 August 2014

కొటేషన్లకో నమస్కారం!

ఎందుకో ఈ మధ్య నాకు అలా అనిపించింది.

ఫేస్‌బుక్ నిండా ఈ కోటేషన్లు చూసీ చూసీ, నాకు నచ్చిన ప్రతి చెత్తా పోస్ట్ చేసీ చేసీ బహుశా ఇలా విరక్తి వచ్చిందేమో అనుకున్నాను.

కానీ కారణం అది కాదు.  ఇంకేదో ఉంది అనిపించింది.

ఆ ఇంకేదో గురించి నేనలా అనుకుంటున్న ఈ పదిరోజుల్లో సహజంగానే ఫేస్‌బుక్‌లో నా యాక్టివిటీ కూడా బాగా తగ్గిపోయింది.

మొన్నొకరోజు అనుకోకుండా ఓ రచయిత ట్వీట్ చూశాను. ఇంగ్లిష్‌లో ఉన్న ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే - మనం చదివేవి గానీ, పోస్ట్ చేసేవిగానీ కొటేషన్లు దాదాపు అన్నీ మనకు ఏదో విధంగా కనెక్ట్ అవుతాయి. కానీ, అవన్నీ మన మైండ్‌సెట్ కు కానీ.. మనదేశపు నేపథ్యానికి కానీ కుదరనివి..అని!  

చాలావరకు నిజం అది.

కట్ టూ మనదైన కొటేషన్ల గని -  

ప్రపంచంలోని ఏ ఒక్క కొటేషనూ మన భగవద్గీతను దాటిపోలేదు. అందులో లేనిది లేదు. దాన్ని మించిన సక్సెస్ సైన్స్ కూడా మరొకటి ఉండబోదు.

ఆ ఒక్క భగవద్గీత చాలదా?

భగవద్గీతను టేబుల్ మీద పెట్తుకుంటే చాలు. మనకు తోచినప్పుడు ఏ పేజీ తిప్పినా మనకు, మన జీవితానికీ ఏదోవిధంగా అన్వయించేదే కనిపిస్తుంది. అదే విచిత్రం. అదే జీవితం.

నువ్విప్పుడు ఏ దశలో ఉన్నా, నువ్వు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నా.. ఈ క్షణం నుంచి, ఇక్కడినించే ఆ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఆ గమ్యం చేరుకోవచ్చు.

అంతా నీ చేతుల్లోనే ఉంది.   

Saturday 2 August 2014

ఇప్పుడు ఏ బడ్జెట్‌లోనయినా సినిమా తీయవచ్చు!

మొన్న "దొంగల ముఠా"తో, నిన్న "ఐస్‌క్రీమ్" తో ఈ వాస్తవాన్ని రుజువు చేశాడు వర్మ. కంటెంట్ విషయం ఎలా ఉన్నా, ప్రొడక్షన్ విషయంలో ఇదివరకటి భారీతనాలూ, అనవసరపు హంగులూ అవసరం లేకుండానే ఏం చేయవచ్చో (ఏం చేయకూడదో కూడా) ఈ సినిమాల ద్వారా తెలిసిపోయింది.

అయితే, వర్మ కంటే చాలా ముందే.. హాలీవుడ్‌లో ఇలాంటి ప్రయత్నాలూ, ప్రయోగాలూ కమర్షియల్ సినిమాలోనే చాలా జరిగాయి.  వాటిలో కొన్ని లో-బడ్జెట్. కొన్ని నో-బడ్జెట్! అవన్నీ బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టి కనకవర్షం కురిపించాయి.

వాటిల్లో కనీసం ఓ రెండు మూడు సినిమాల గురించయినా నేను మళ్లీ విడిగా పోస్టులు రాస్తాను.

కట్ టూ మన టాపిక్ - 

కేవలం కొన్ని లక్షలు ఉంటే చాలు. ఇప్పటివరకే మారిన, మారుతున్న లేటెస్ట్ ఫిలిం మేకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అంతా కొత్త వాళ్లతో ఒక మాదిరి సినిమా తీసి రిలీజ్ చేయవచ్చు. 30 నుంచి 50 లక్షలవరకయితే - సినిమా నిర్మాణంలోని ఏ దశలోనూ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా - ఒక మంచి యూత్ ఎంటర్‌టైనరో, థ్రిల్లరో చాలా బాగా తీయవచ్చు. కనీసం ఓ 40 థియేటర్లలో రిలీజ్ కూడా చేయొచ్చు. ఈ రేంజ్ బడ్జెట్లో అయితే నిర్మాత పెట్టిన డబ్బుకి రిస్క్ చాలా చాలా తక్కువ. అసలు ఉండదు అనే చెప్పొచ్చు.

టెక్నాలజీ, బిజినెస్ మోడల్స్ అంతగా మారిపోయాయి. ఇంకా ఎన్నో మార్పులు రానున్నాయి. అదీ ఇప్పటి సినిమా!