Thursday 14 August 2014

సారే జహాసె అఛ్ఛా ..

రాష్ట్రం రెండు ముక్కలు కావడం, గోల్కొండపైన పంద్రాగస్టు .. తెలుగువారికి సంబంధించి ఈ రెండూ ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ఓ కొత్త ఊపునిస్తున్నాయి.

కట్ టూ ఆనాటి పంద్రాగస్టు -

నా చిన్నతనంలో పంద్రాగస్టు అంటే నిజంగా ఒక పండగే. కనీసం ఒక మూడు రోజులు వరంగల్‌లోని మా ఇంటిచుట్టూ పెద్ద సందడి. చెప్పలేనంత హడావిడి.

జెండాగద్దె సరిగ్గా మా ఇంటిముందే!

సలేందర్, ప్రతాప్, స్వామి, శంకర్, భిక్షపతి .. ఇంకో పదిమంది యువతరం ఒక గ్రూప్. వయసులో వీళ్లకంటే కొంచెం చిన్నవాడయినా.. మా అన్న దయానంద్ కూడా ఇదే గ్రూపు.

ఈ గ్రూపంతా కలిసి వారం ముందునుంచే చందాలు వసూలుచేసేవాళ్లు. రాత్రి పొద్దుపోయేవరకూ మా ఇంటిముందున్న అరుగులపైన కూర్చుని - కనీసం వారం ముందునుంచే "ఈసారి జెండావందనం కొత్తగా ఎలా చేయాలి" అన్నదానిమీద ఈ గ్రూపంతా చర్చలు జరిపేవాళ్లు. నేనూ, నా చిన్న గ్రూపు కూడా అక్కడే వాళ్ల చుట్టూ నిల్చుని అవన్నీ ఆసక్తిగా వింటూవుండేవాళ్లం.

మా వీధి మొత్తంలో అప్పుడు మా ఇల్లే చాలా పెద్దది. జెండాను ఎగురవేసే గద్దె కూడా సరిగ్గా మా ఇంటిముందే ఉండటంతో దానికి సంబంధించిన ప్రతి పనీ, ప్రతి సడీ మాకూ తెలిసేది. జెండావందనం కోసం కొనుక్కొనివచ్చిన రంగురంగుల జెండా కాగితాలు, ఇతర వస్తువులన్నీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టేవాళ్లు. కొబ్బరికాయలు, పండ్లు, చాక్లెట్లతోసహా!  

వీధి ఈ చివరినుంచి ఆ చివరిదాకా - ఎన్నో వరుసలు సుతిలితాడు కట్టి, మైదాపిండితో చేసిన "లై"తో, చిన్నపిల్లలం మేము అందిస్తుంటే, ఈ పెద్దవాళ్లు జెండాలు అతికించేవాళ్లు. తర్వాత ఈ జెండాల్నే వీధంతా తోరణాలుగా కట్టేవాళ్లు.

జెండావందనం రోజు నిజంగా పెద్ద పండగే. ముందురోజు రాత్రే ఫ్రెష్‌గా తెచ్చిన మట్టితో అప్పటికప్పుడు మూడు అంచెల్లో గద్దె తయారయ్యేది. ఎర్రమట్టితో దానికి కోటింగ్ కూడా!

తెల్లవారకముందునుంచే మైకులో గ్రామఫోన్ రికార్డ్ పాటలు. దేశభక్తి పాటలు, భగవద్గీత.

గ్రూపులో ఒక్కో సంవత్సరం ఒక్కోరు జెండా ఎగురవేసేవారు. తర్వాత స్వీట్లు, కొబ్బరి, చాక్లెట్లు అక్కడున్న మా అందరికేకాదు..ఇంటింటికి వెళ్లి మరీ పంచేవాళ్లు.

కట్ టూ ప్రెజెంట్ - 

అప్పటి ఆ యువతరం గ్రూపులో కొందరు ఇప్పుడు లేరు. ఉన్నవాళ్లు ముసలివాళ్లయిపోయారు. ఆనాటి ఆ మట్టి జెండాగద్దె ప్లేస్‌లో ఇప్పుడు ఒక పర్మనెంట్ సిమెంట్ గద్దె ఉంది. ఎలా చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఆనాటి సీరియస్‌నెస్ మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా లేదని మాత్రం చెప్పగలను.

అప్పటి దేశభక్తి వేరు. అప్పటి స్వఛ్ఛత వేరు. అప్పటి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలు.. అన్నీనిజంగా వేరే.

ఎన్నో ఏళ్లతర్వాత, ఈరోజు, ఇలా .. పంద్రాగస్టు గురించి నెమరేసుకుంటున్నానంటే .. నిశ్చయంగా క్రెడిట్ గోస్ టూ
కె సి ఆర్.

కాకతీయులు కట్టిన గోల్కొండ కోటపైన తొలిసారిగా జెండావందనం అంటూ ఒక అలజడికి తెరలేపారు కె సి ఆర్. అయితే అది కొందరు అనుకుంటున్నట్టు అర్థంలేకుండా కాదు. అర్థవంతంగా.

ఆ అర్థం - ఒక మార్పు. ఒక ఉనికి. ఒక నాస్తాల్జియాకి స్పూర్తి.  

2 comments:

  1. ఒక దేశ పంద్రాగస్టు పండగలాగ జరిగిన మొట్టమొదటి రాష్ట్ర పంద్రాగస్టు మన తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే జరిగింది...... గోల్కొండ కోటలో .... ఎర్రకోటలో చూస్తున్నట్టుగానే వుంది ....మనందరం తలలు ఎత్తి గోల్కొండను చూస్తూ .... తలలు ఎత్తుకునేలా చేసిన కే సి ఆర్ కు .... ఏం చెప్పాలె.. జై తెలంగాణ తప్ప ... ఆయనకు అదేగా కావాలి

    ReplyDelete
  2. durga గారూ, క్లుప్తంగా అయినా చెప్పాల్సింది చాలా బాగా చెప్పారు. జై తెలంగాణ!

    ReplyDelete