Sunday 30 June 2013

అంతా ఏమనుకుంటారో!

ఈ ఒక్క వాక్యం.. ఈ ఒక్క ఆలోచన.. ఈ ఒక్క మూర్ఖపు సందిగ్ధత - ఈ భూమ్మీద ఎన్నో వేల లక్షల జీవితాలు 'బ్రతుకు'లుగా మారిపోడానికి కారణమౌతుందంటే నమ్మగలరా? నమ్మాలి. నిజం కాబట్టి.

వృత్తి కావొచ్చు, వ్యక్తిగతం కావొచ్చు.. కష్టమైనా, ఇష్టంగా మనం కోరుకున్నట్టు ప్రయాణం సాగించేది జీవితం. ఎవరో ఏదో అనుకుంటారని ఎక్కడికక్కడ రాజీపడిపోతూ లాగించేది బ్రతుకు.

నేను చెప్పను. స్టేట్‌మెంట్లివ్వను. ఎవరికివారే ఒక అరవై సెకన్లపాటు ఆలోచిస్తే చాలు. మనతోసహా, మన చుట్టూ ఉన్న ప్రతి వందమందిలో ఎంతమంది నిజంగా జీవిస్తున్నారు? ఎంతమంది జీవిస్తున్నామన్న మాస్క్ వేసుకొని బ్రతుకు లాగిస్తున్నారు?

మనకో పదిమంది స్నేహితులు, వందమంది బంధుగణం ఉండొచ్చు. ఫేస్‌బుక్‌లో ఓ అయిదువేలమంది, ట్విట్టర్లో వెయ్యిమంది, బ్లాగ్‌లో ఇంకో రెండువేలమంది.. మన నెట్‌వర్క్‌లో ఉండొచ్చు. మన ఇంటి పక్కవాళ్లు, పైనవాళ్లు, కాలనీవాళ్లు.. మరో వందమంది ఉండొచ్చు.

వీళ్లంతా ఏమనుకుంటారో అని మీరు చేయాలనుకుంటున్నది, చిన్నదయినా పెద్దదయినా, దాన్ని చేయకుండా  ఆపకండి. తొక్కిపెట్టకండి. మహా అయితే ఫెయిలవుతారు. అంతేగా? దాన్ని పట్టించుకునే తీరికలు ఎవరికీ లేవు. ఎవరి గొడవలు వారికున్నాయి. ఎవరి సందిగ్ధతలు వారికున్నాయి. ఎవరి జీవితాలు, బ్రతుకులు వారికున్నాయి.

కనీసం ఈ ఒక్కరోజయినా - మీరు ఎప్పటినుంచో అనుకుంటూ, ఎవరో ఏదో అనుకుంటారని దాటవేస్తూవస్తున్న ఏదయినా ఒక చిన్న పనిని వెంటనే చేసెయ్యండి.

అది ఎవరినయినా కలవటం కావొచ్చు. ఎవరికయినా కాల్ చెయ్యటం కావొచ్చు. ఒక ఈమెయిల్ పెట్టటం కావొచ్చు. ఒక బ్లాగ్ రాయటం కావొచ్చు. మీరెప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తున్న ఒక నవల రాయటం ప్రారంభించటం కావొచ్చు. మీకిష్టమయిన ఒక చిన్న వస్తువు ఏదయినా కొనటం కావొచ్చు. సింపుల్‌గా ఒక "నో" చెప్పటం కావొచ్చు. మీ ఫ్రెండుకో, జీవిత భాగస్వామికో ఒక "సారీ" చెప్పటం కావొచ్చు. ఇంకేదయినా చెప్పటం కావొచ్చు. వెంటనే ఆ పని చేసెయ్యండి.

ఈ ఒక్క చిన్న స్టెప్ మీరు వేయగలిగితే చాలు. రేపు మరో స్టెప్ ఈజీగా వేయగలుగుతారు. ఆ తర్వాత ఇంకో స్టెప్. అదే జీవితం. వేలు, లక్షలు అన్నే ఆ తర్వాతే.. అవే వస్తాయి.

పీ ఎస్:
అంతా ఏమనుకుంటారో అని నేనూ గత కొద్దిరోజులుగా వాయిదావేస్తూ వచ్చిన ఒక 
చిన్నవెబ్‌సైట్‌ని, వీబ్లీలో ఫ్రీగా అప్పటికప్పుడు రెండు గంటల్లో  క్రియేట్ చేశాను. దాన్ని నా బ్లాగ్‌కి తగిలించేశాను కూడా. ఆ తర్వాతే ఈ బ్లాగ్ రాశాను! :)  

Friday 28 June 2013

కొన్నిట్లోంచి బయటికి రావటం అంత సులభం కాదు!

రేసులూ, పేకాటలాగే సినిమా ఒక జూదం. ఇంకా చెప్పాలంటే - హెవీ గ్యాంబ్లింగ్! ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. ఇదే నిజం. ఈ నిజాన్ని స్వయంగా ఒకచోట మహా కవి శ్రీ శ్రీ నే బాహాటంగా చెప్పాడు. దీన్ని నా పుస్తకం "సినిమా స్క్రిప్టు రచనా శిల్పం"లో కోట్ చేశాను కూడా.

ఇప్పుడు నేను చేస్తున్న "యురేకా సకమిక"తోపాటు - ఫాస్ట్ ట్రాక్ మేకింగ్‌లో, మరో మైక్రో బడ్జెట్ సినిమాకు కూడా నేనిప్పుడు పని చేస్తున్నాను. ఈ రెండో సినిమా టైటిల్ ఇంకా రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ రెంటిలో, తర్వాతదే ముందుగా పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

కట్ టూ హిట్ సినిమా -

ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కావడానికి చాలా విషయాలు కలిసిరావాలి. తోడ్పడాలి. "డబ్బు/నిర్మాత " ఒక్కటే ప్రధానం కాదు. వాటిని మించిన లైక్‌మైండెడ్ టీమ్ అనేది చాలా అవసరం. టీమ్‌లో అందరి గోల్ ఒక్కటిగానే ఉండాలి. కనీసం చేస్తున్న ప్రాజెక్టు విషయంలో నయినా.. ఆ కొద్ది సమయానికయినా.. అందరి లక్ష్యం  ఒకే వైపుండాలి. ఒక్కటిగానే ఉండాలి. అయితే - ఇది అనుకున్నంత సులభం కాదు. దిగినవారికే తెలుస్తుంది లోతెంతో!

మంచి పవర్‌ఫుల్ సినిమా నెట్‌వర్క్ బేస్, అన్‌కండిషనల్ సపోర్టుతోపాటు, స్వయంగా తనలోనే ఫిలిం మేకింగ్ పట్ల ఒక డైహార్డ్ ప్యాషన్ ఉన్నప్పటికీ - నాలుగు కమర్షియల్ ఫ్లాప్‌ల తర్వాతే "మౌనరాగం"లాంటి హిట్ ఇవ్వగలిగాడు మణిరత్నం.

అన్నీ తనకు అనుకూలం చేసుకుని, తన ఇష్ట ప్రకారం సినిమా చేసి ఒక హిట్ ఇవ్వడానికి మణిరత్నంకు కనీసం నాలుగు సినిమాల సమయం పట్టిందంటే ఎవరూ నమ్మలేరు! కానీ నిజం.

కట్ టూ నేనూ నా సినిమాలూ -

నేనేదో ఇప్పుడున్న యూత్ సినిమాల ట్రెండ్‌ని కాస్త క్యాష్ చేసుకుంటూ, మైక్రో బడ్జెట్లో ఓ మూడు సినిమాలు చక చకా పూర్తి చేసేసి, నా ఈ పార్ట్ టైం ఫిలిం మేకింగ్ ప్రొఫెషన్‌కు ఇంక ఇక్కడితో "బై" చెప్పేద్దామనుకున్నాను.

కానీ, పరిస్థితి చూస్తే నేననుకున్నది అంత సులభంగా జరిగేట్టులేదు.

విసిగిస్తున్న ఈ ఆలస్యం, ఏకంగా ఓ ఫ్యాక్టరీనే పెట్టేలా నన్ను ఉసిగొల్పుతోంది. ఈ డిసెంబర్ లోపు కమిటయ్యే మూడు సినిమాలా.. లేదంటే, ఆ తర్వాత కూడా కొనసాగించే మైక్రో బడ్జెట్ సినిమాల ఫ్యాక్టరీనా?

ఓ నెలాగితే అదే తెలుస్తుంది. టెన్షన్ ఎందుకు?

Thursday 27 June 2013

5డి ఏం పాపం చేసింది?

సినిమా ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌మయమైపోయింది. అవక తప్పదు. ఫిలిం నెగెటివ్ తయారు చేసే కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా మూతపడిపోతున్నాయి. తప్పదు. అయిదారేళ్ల క్రితం వరకూ మనం ఫొటోలు తీసుకోడానికి ఒక అరవయ్యో, డెభ్భయ్యో పెట్టి "కొనికా" రీల్ కొనుక్కొనేవాళ్లం. ఇప్పుడు కొంటున్నామా? ఇదీ అంతే. ఇప్పుడంతా డిజిటల్ యుగం.

ఇదిలా ఉంటే - ఇండస్ట్రీలో కొన్ని ప్రచారాలు గమ్మత్తుగా ఉన్నాయి. అవి కొందరిని బెంబేలెత్తిస్తున్నాయి కూడా. 5డి కెమెరాతో తీసిన సినిమాలను శాటిలైట్ రైట్స్ కు తీసుకోవటం లేదని! ఎంత బాగున్నా.. ఆ సినిమాలని ఎవరూ కొనరనీ, రిలీజ్ చేయరనీ, చూడరనీ!!

ఎంత నాన్సెన్స్?

5డి తో తీసినా, రెడ్ తో తీసినా, యారీ అలెక్సా తో తీసినా.. మరో కెమెరాతో తీసినా, ఇవన్నీ డిజిటల్ కెమెరాలే అన్నది కామన్ సెన్స్.

హిట్టు మీద హిట్టు కొడుతూ, కోట్లు కొల్లగొడుతున్న ఇటీవలి యూత్ కథా చిత్రాలన్నీ ఏ కెమెరాలతో తీస్తున్నారో, ఎంత బడ్జెట్లో తీస్తున్నారో వీళ్లంతా ఒకసారి స్టడీ చేస్తే బాగుంటుంది.

ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా, దాదాపు అందరు డైరెక్టర్లూ తమ సినిమాలని డిజిటల్లోనే తీస్తున్నారు. తాజాగా, ఎస్ ఎస్ రాజమౌళి "బాహుబలి"ని యారీ అలెక్సా ఎక్స్‌టీ తో పూర్తిగా డిజిటల్లోనే తీస్తున్నాడు. "లేదు, మీరు కొడాక్ ఫిలిం లోనే తీయండి" అని రాజమౌళికి ఎవరైనా చెప్పగలరా?

ఇంతకు ముందయినా, ఇప్పుడయినా, ఎప్పుడయినా, ఏ ఇండస్ట్రీలో అయినా - అసలు సినిమాలో దమ్మెంత అన్నదే మ్యాటర్ అవుతుంది తప్ప కెమెరా కాదు.

నాకు తెలిసి, ఇదంతా, క్రిష్ణానగర్-ఇందిరానగర్ గొందుల్లో, గణపతి కాంప్లెక్స్ గల్లీలో.. పనీపాటా లేకుండా గంటలకొద్దీ  హస్కులు వేస్తూ జీవితం గడిపే కొన్ని పరాన్నజీవులు చేస్తున్న ప్రచారం తప్ప మరొకటి కాదు.

ఆధునికంగా టెక్నాలజీలో వస్తున్న అడ్వాన్స్‌మెంట్స్‌ని ఉపయోగించుకోకుండా ఎవరూ ఎవర్ని ఆపలేరు.  

Tuesday 25 June 2013

అన్నింటికంటే పెద్ద లక్ష్యం!

లైఫ్ అనేది చాలా సింపుల్. మనమే దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం ..

జీవితంలో అన్ని నిర్ణయాలూ మనం ఆలోచించి తీసుకోలేం. మనం ఉన్న పరిస్థితులు, మన మానసిక స్థితి, మనం ఎదుర్కొంటున్న వత్తిళ్లు.. ఇవన్నీ మనం తీసుకొనే నిర్ణయాల మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి.

నేపథ్యం ఏమైనప్పటికీ, మనం తీసుకొన్న కొన్ని అనాలోచిత నిర్ణయాల ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. దీన్నే కొంచెం పాజిటివ్‌గా చెప్పాలంటే, ఆ నిర్ణయాల ఫలితాల్ని, పరిణామాల్ని విధిగా మనం ఎదుర్కొని తీరాలి. ఆ క్రమంలోనే మన జీవితాన్ని వీలయినత సింప్లిఫై చేసుకోవాలి.

ప్రతిరోజునీ మనకిష్టమైన పధ్ధతిలో జీవిస్తూ, మనకిష్టమైన పని చేస్తూ, ఆ పనిలోనే ఆనందాన్ని అనుభవించగలగాలి. ఎలాంటి "మాస్క్"లు లేని మనకిష్టమైన జీవన శైలిని ఎంజాయ్ చేయగలగాలి. అయితే, ఇది ఈ బ్లాగ్‌లో ఏదో నాలుగు మాటల్లో రాసినంత సులభం కాదు.  

మన ఆధునిక జీవనశైలి పూర్తిగా "మాస్క్"లమయమైపోయింది. ఎవరినో సంతృప్తి పర్చడానికి ఏదేదో చేస్తున్నాం. ఎవరో ఏదో అనుకుంటారని మనకు ఇష్టంలేని నిర్ణయాలు తీసుకుంటున్నాం. నిజంగా, నిజం మాట్లాడలేని అత్యంత దయనీయమైన పరిస్థితిలో జీవిస్తున్నాం. ఈ నిజాన్ని బయటికి ఒప్పుకోలేని ఈగోతో సహవాసం చేస్తున్నాం.

ఆ పరిస్థితికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో ఒక అతి ముఖ్యమైన కారణం - భయం. సమాజంలో నేను "ఇలా ఉండాలి" అని ఎవరితోనో పోల్చుకోవటం.. అలా నేనూ ఉండకపోతే అందరూ ఏమనుకుంటారన్న భయం. ఆత్మన్యూనతా భావం. ఈ భయంతోనే - అందంగా, ఆనందంగా గడపాల్సిన ఈ  చిన్ని జీవితానికి ఎన్నో బలవంతపు లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. వాటిని నిజం చేసుకోడానికి జీవితాన్ని ఎన్నోరకాలుగా ఉరుకులు పెట్టిస్తున్నాం.  అనుక్షణం మనశ్శాంతి కోసం తపిస్తున్నాం. 

మన ఆధునిక జీవనశైలిలో, మనం ఏదయినా సాధించాము.. లేదా సాధిస్తున్నాము అనుకుంటే - అది ఇదే!  

సో, నామటుకు నాకు 'ఇంక చాలు' అనిపిస్తోంది. నా లెస్ ఫిలాసఫీ ప్రకారం 'లెస్ ఈజ్ మోర్!' .. ఇంకా చెప్పాలంటే - అసలు గోల్స్ లేకపోవడమే ఒక పెద్ద గోల్!

ఎలాంటి మానసిక వత్తిడి ఉండదు. ప్రతి క్షణాన్నీ మన ఇష్ట ప్రకారం ఎంజాయ్ చేస్తుంటాము. అప్పుడు, అలాంటి స్థితిలో, నిజంగా మనకేం కావాలో అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సులభంగా వస్తాయి. మనతోనే ఉంటాయి.  

Wednesday 19 June 2013

దీపికా పడుకొనే 'పిచ్చి యవ్వనం!'

ఇప్పుడు నేనున్న బిజీలో - రిలీజయిన రెండు వారాలకి గాని "యే జవానీ హై దివాని" (YJHD) సినిమా చూళ్లేకపోయాను! రణబీర్ కపూర్-దీపిక కెమిస్ట్రీ, అయన్ ముఖర్జీ స్క్రీన్‌ప్లే-డైరెక్షన్, కరణ్ జోహార్ టేస్టు.. ఈ మూడూ కలిసి ఈ సినిమాని టాప్ హిట్ చేశాయి.

ఈ సాయంత్రానికి, ఈ సినిమా సాధించిన రికార్డుల్లో కొన్ని చూద్దాం:

> ఓపెనింగ్ నాడే 19.5 కోట్లు వసూలు చేయటం.

> ఫస్ట్ వీక్ లోనే 100 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేయటం.

> రెండో వారంలో 40 కోట్లు క్రాస్ చేసిన రెండో సినిమా కావటం (మొదటిది "3 ఇడియట్స్").

> విడుదలైన 3 వ శుక్రవారం రోజు కూడా 3.5 కోట్లు వసూలు చేయటం.

> ఈ సినిమా రిలీజయి 19 రోజులయింది. తర్వాత ఇంకో 4 భారీ సినిమాలు కూడా రిలీజయ్యాయి. అయినా, 940 స్క్రీన్స్‌లో ఇంకా హౌజ్‌ఫుల్స్ తో నడుస్తుండటం! .. ఇలా, ఇంకా చాలా ఉన్నాయి ..

కట్ టూ దీపికా పడుకొనే -

దీపిక నటించిన చిత్రాల్లో, 2007 లో వచ్చిన దీపిక తొలి చిత్రం "ఓం శాంతి ఓం" ఒక్కటే చూశాను. ఆ సినిమాలో తన నటనతో పోలిస్తే - YJHD లో దీపిక నటన అద్భుతం. నిజానికి అది దీపిక నటన కాదు. సింపుల్‌గా నయన కేరెక్టర్లో దీపిక జీవించింది.

ఒకప్పుడు తన హృదయాన్ని గెల్చుకొన్న రణబీర్‌తో కల్సి మళ్లీ నటించినందుకో ఏమో .. సినిమా అంతా దీపిక ముఖంలో ఒక నిండైన నవ్వు, ఒక ప్రత్యేకమైన వెలుగు, ఒక ఆరా .. అన్నీ కలిపి ఒక "నయన"గా మ్యాజిక్ చేసింది దీపిక.

కట్ టూ "ది రష్యన్ కనెక్షన్" -

సినిమా హిట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న రణబీర్ కపూర్ ప్రస్తుతం ఎక్సయిట్ అవుతున్న విశేషం ఇంకొకటుంది. 1950 ల్లో తన చిత్రాలతో అప్పటి సోవియట్ రష్యాని ఉర్రూతలూగించిన తాత రాజ్ కపూర్ తర్వాత ఇన్నాళ్లకి..
వచ్చే నెల్లో, ఆయన మనవడు రణబీర్ కపూర్ YJHD సినిమా రష్యాలో యమ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది!

రష్యన్ భాషతో, రష్యన్ సాహిత్యంతో, రష్యన్ ఫ్రెండ్స్‌తో అంతో ఇంతో కనెక్షన్ ఉన్న నాకూ ఇది ఆనందంగానే ఉంది. ఛీర్స్, రణబీర్! 

Tuesday 18 June 2013

భయం లేని బ్లాగింగ్!

ఇది అనుకోకుండా జరిగింది..

నా మిత్రుడు కామేశ్వర రావు (కవి, రచయిత) కోసం ఒక బ్లాగ్‌ని నేను అప్పటికప్పుడు క్రియేట్ చేశాను. ఆ సందర్భంలో "హృదయనాదాలు" అని దాని టైటిల్‌ని తెలుగులో టైప్ చేయాల్సి వచ్చింది. గూగుల్ సెర్చ్ చేశాను. విషయం తెల్సింది.

ఎప్పట్నుంచో అనుకుంటూ, యేళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టుకుంటూ వస్తూ, అలా తెల్సుకున్నాను మొదటిసారిగా.. నెట్ రైటింగ్‌లకి అసలు తెలుగుని ఎలా టైప్ చేస్తారన్నది!

అంతకు ముందు మామూలుగా పత్రికలు, మేగజైన్ల కోసం తెలుగులో డి టి పి చేస్తున్నప్పుడు చూశాను. కానీ, యునికోడ్‌లో తెలుగులో టైప్ చేయటం ఇంత ఈజీ అని మాత్రం పైన చెప్పిన సందర్భంలోనే తెలుసుకున్నాను. తర్వాతెప్పుడయినా కూడా ఈ విషయం తెలుసుకొనే అవకాశమో, సందర్భమో వస్తే రావొచ్చు గాక.. కానీ, గత ఆగస్టులో దీని గురించి తెలుసుకొనే అవకాశం మాత్రం, నా మిత్రుడికి "బ్లాగ్ క్రియేట్ చేయాల్సి రావడం" వల్లనే వచ్చింది. సో, థాంక్స్ టూ కాముడు!

తెలుగులో టైపింగ్ ఇంత ఈజీ అయితే ఇంకేం.. అని, ఆ రాత్రే, ఒక బ్లాగ్‌ని నాకోసం క్రియేట్ చేసుకున్నాను. అదే ఈ నగ్నచిత్రం.

సినిమాలూ, షికార్లూ, వ్యక్తిగత గొడవలూ, పర్సనల్ డెవలప్‌మెంట్, స్పిరిచువాలిటీ అంటూ.. ప్రతి "నాన్సెన్స్"నీ ఈ బ్లాగ్‌లో రాయడం మొదలెట్టాను. ఎంతో కాలం తర్వాత.. అసలు "రాయడం" అన్న నాకత్యంత ప్రియమైన హాబీని మళ్లీ కంటిన్యూ చేస్తూ, ఈ బ్లాగింగ్‌ని బాగా ఎంజాయ్ చేయటం మొదలెట్టాను.  

సైట్ మీటర్ తగిలించిన గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 42,000 "పేజ్ వ్యూస్"ని రికార్డ్ చేసిన ఈ బ్లాగ్ మీద 100,000 అంకెని కూడా అతి త్వరలో చూడాలన్నది నా కోరిక. ఖచ్చితంగా, వచ్చే రెండు మూడు నెలల్లోనే  చూడగలనని నా నమ్మకం కూడా!

తెలుగులో టైపింగ్ మీద నాకున్న భయం పోయింది కాబట్టి, అదంత పెద్ద కష్టం కాదు ..

అన్నట్టు, నగ్నచిత్రంలో ఇది నా వందో పోస్టు! 

Thursday 13 June 2013

"హాట్ కేక్" అంటే ఏంటో అప్పుడు తెలిసింది! ('కల' ట్రివియా-6)

"కల"లో నేను పరిచయం చేసిన జూనియర్ నాగార్జునని మా స్టిల్స్ ఆల్బమ్‌లలో చూసి చాలా మంది రియల్ 'నాగ్' అనే అనుకున్నారు! ఈ చిత్రంలోనే నేను ఇంకొందరు కొత్తవారిని పరిచయం చేశాను. అప్పటివరకూ జూనియర్ ఆర్టిస్టులుగా చేస్తున్నవారు కొందరిని కూడా ముఖ్యమైన సపోర్టింగ్ పాత్రల్లో ఇంట్రొడ్యూస్ చేశాను.

అలా నేను పరిచయం చేసినవాళ్లలో చాలా మంది ఇప్పుడు.. అయితే  సినిమాల్లో, లేదా టీవీలో చాలా బిజీగా ఉన్నారు.

ఉదాహరణకి - అంజు అస్రాని ని సునీల్ కాంబినేషన్లో ఒక ఫుల్ ఎపిసోడ్లో పెట్టాను.  చాలా సినిమాలు చేశాక, ఇప్పుడామె సీరియల్స్‌లో యమా బిజీగా ఉంది. టీవీ చానెల్స్‌లో ప్రోగ్రాం ప్రజెంటర్‌గా చేస్తూ, పెద్ద పెద్ద స్టార్స్‌ని కూడా ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది హీరో చెల్లెలుగా నేను పరిచయం చేసిన మంజూష.  ఇక, హీరోయిన్ చెల్లెలుగా నేను పరిచయం చేసిన కరుణ, తర్వాత హీరోయిన్ కూడా అయి ఎన్నో చిత్రాలు చేసింది. "కాల్ సెంటర్", "మంత్ర" వంటి సినిమాల్లో కరుణని అంత ఈజీగా మర్చిపోలేము. టీవీలో "విహారి" ప్రోగ్రాం ప్రజెంటర్‌గా దాదాపు ప్రపంచమంతా చుట్టివచ్చింది కరుణ.

అప్పుడు హీరోయిన్ అన్నయ్యగా నేను పరిచయం చేసిన కృష్ణ కౌశిక్ ఇప్పుడు సీరియల్స్‌లో పిచ్చి బిజీ. కౌషిక్ నాన్న శంకర్‌గారిని కూడా ఇదే సినిమాలో కౌషిక్ తండ్రిగా చూపించగలగటం ఒక విశేషం. మరొక విశేషం ఏంటంటే - ఇప్పుడు టీవీలో ఒక రేంజ్‌లో ఉన్న ప్రభాకర్ అప్పుడు హీరో రాజాకి డబ్బింగ్ చెప్పాడు!

ఇలా రాసుకుంటూపోతే ఈ ట్రివియా ఓ పెద్ద పుస్తకమే అవుతుంది. సో, ఈ పోస్టుతో ఆ జ్ఞాపకాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నాను.

కట్ టూ హాట్‌కేక్ -    

"కల" సినిమా చేసిన ప్రొడ్యూసర్ కొత్తవాడు. బ్యానర్ కొత్తది. డైరెక్టర్‌గా నేనూ కొత్తవాణ్ణే. మా సినిమాలో హీరో రాజా అప్పటికే మూడు చిత్రాలు చేసినా, ఇంకా పేరు లేని హీరోనే. హీరోయిన్ కొత్త హీరోయినే. అయినా - మార్కెటింగ్ విషయంలో ఈ చిత్రానికి చాలా రికార్డులున్నాయి.

> ప్రసాద్ ల్యాబ్‌లో ప్రివ్యూ వేసినప్పుడు, సీట్లన్నీ నిండిపోయి.. హాల్‌కు రెండుపక్కలా, వెనకా చాలా మంది కిక్కిరిసిపోయి నిల్చుండి మరీ చూశారీ సినిమాని! అలా నిల్చుని చూసిన వాళ్లలో నేనిక్కడ పేర్లు రాయకూడని సీనియర్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. జనరల్‌గా ప్రివ్యూలకి ఇలా ఎగబడి చూడటం అనేది ఉండదు. దీనికి కారణం, నాకు తెలిసి, ఆ ప్రాజెక్టుకి నేను క్రియేట్ చేసిన పబ్లిసిటీ "హైప్" అంటే అతిశయోక్తికాదు.

> అంతకు ముందే.. ఈ సినిమా ఆడియో రైట్స్‌ను "సుప్రీమ్" కంపెనీ మంచి రేటిచ్చి కొనుక్కుంది. ఇప్పుడసలు చిన్న సినిమాలకి ఆడియో రైట్స్ అనేవే లేవు!

> పోస్టర్ రైట్స్ కూడా ఒక చిన్న సినిమాకి ఊహించని రేంజ్‌లో అమ్మటం జరిగింది.

> మా సినిమా "శాటిలైట్ రైట్స్" కొనడం కోసం థర్డ్ పార్టీ మీడియేటర్లు పోటీపడ్డారు.

> ప్రివ్యూ వేసిన ఆ రాత్రికి రాత్రే మా సినిమాకు మంచి అవుట్‌రైట్  బిజినెస్ ఆఫర్లు వచ్చాయి.

> సౌత్‌లో హిందీ సినిమాలను రిలీజ్ చేసే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా సినిమా నైజాం ఏరియా హక్కులకోసం, మా ఆఫీసు చుట్టూ కనీసం నాలుగుసార్లు తిరిగాడు. అప్పుడు - ప్రొడ్యూసర్, బయ్యర్ 80:20 రేషియోలో  నైజామ్‌కి ఆయన ఆఫర్ 20 లక్షలు! తొమ్మిదేళ్లక్రితం ఒక చిన్న సినిమాకి.. ఒక్క నైజాం ఏరియాకే 20 లక్షల ఆఫర్ వచ్చిందంటే మీరు గెస్ చేయొచ్చు మిగిలిన ఏరియాల్లో ఆ సినిమాకి అయ్యే బిజినెస్‌ని! అదీ 80/20 రేషియోలో! ఇప్పటికీ ఆ హిందీ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ అక్కడే క్లాక్ టవర్ దగ్గరి నవకేతన్ బిల్డింగులో ఉంది.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. అతి చిన్న బడ్జెట్లో నిర్మించిన "కల" సినిమాకు ఎలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ నేను అప్లై చేసానో. ఎంత మంచి బిజినెస్‌ని తేగలిగానో. స్వయంగా నేనొక ఆర్టిస్టును (పెయింటింగ్) కావటం, పోస్టర్ డిజైనింగ్, యాడ్స్ పట్ల నాకొక స్పష్టమైన అవగాహన ఉండటం, ఫొటోగ్రఫీ నా హాబీ కావటం, ప్రెస్ నోట్స్, ప్రెస్ మీట్స్.. ఇలా ప్రమోషన్‌కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్నీ నేను యమ సీరియస్‌గా తీసుకోవడం బాగా పనిచేసింది.

అప్పట్లో కొత్తవాళ్లతో తీసిన సినిమాలకి అసలు బిజినెస్ అనేదే లేదు. అయినా, నేను ప్లాన్ చేసుకున్నట్టుగానే - భారీ రేంజ్‌లో బిజినెస్ తేగలిగాను. దీన్ని, ఖచ్చితంగా, నేను సాధించిన తొలి విజయంగా ఇప్పటికీ భావిస్తాను.

ఇక, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలోనే, నాకు ఒక ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమాకి అవకాశం వచ్చింది. మా ప్రొడ్యూసర్ మిత్రుడు, టీమ్‌లోని ఇంకో ఇద్దరు సీనియర్లు నన్ను ఆ అవకాశాన్ని వదులుకునేలా ఉచిత సలహాలిచ్చి అందులో సక్సెస్ అయ్యారు!  ఇప్పుడు అది గుర్తుకు వస్తే, నన్నునేనే తిట్టుకుంటాను. నవ్వుకుంటాను. ఇవన్నీ నగ్నచిత్రాలు.. నూరు శాతం నిజాలు ..

ఒక చిన్న ఫినిషింగ్ టచ్‌తో ఈ ట్రివియా ముగిస్తాను..

కేవలం ఒక్క నెల తేడాతో రూపొందిన రాజా ఇంకో సినిమా అసలు ఎన్ని ప్రివ్యూలు వేసినా బిజినెస్ కాలేదు! వాళ్లు పడ్డ కష్టాలు ఇండస్ట్రీ అంతా తెలుసు. చివరికి ఆ సినిమా ఎలాగో విడుదలయింది. మంచి ప్రమోషన్ చేశారు. హిట్టయింది. మా సినిమాకు ఎంతో మంచి రేంజ్ బిజినెస్ వచ్చినా మా ప్రొడ్యూసర్ దాన్ని సరైన సమయంలో, సరైన విధంగా క్యాష్ చేసుకోలేకపోయాడు. సినిమాని సొంతంగా విడుదల చేశాడు. అసలు ప్రమోషన్ చేయలేదు. ఫ్లాపయింది. అదీ విచిత్రం ..

ఒక సినిమా తీయటంలో ఉన్న కష్టనష్టాలూ, ఇప్పటిదాకా చెప్పుకున్న నిజాలన్నీ తెలియని మనవాళ్లు ఒడ్డున కూర్చుని "అది బాగా లేదు, ఇది బాగా లేదు" అని ఎన్నయినా అనొచ్చు. అలా అనే హక్కు వారికుంది. వెన్నెల్లో విహరిస్తూ ఏదో సోది రాసే కొందరు సినిమా రివ్యూయర్స్‌లాగా వాళ్లు చేయగలిగింది కూడా అదొక్కటే.

అయితే, అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా, వొళ్లు దగ్గర పెట్టుకుని ముందుకు పయనించాల్సింది మాత్రం ప్రొడ్యూసర్లూ, డైరెక్టర్లే!        

Tuesday 11 June 2013

అప్పటి డాన్స్‌మాస్టర్ ఇప్పుడు డైరెక్టర్! ('కల' ట్రివియా-5)

నిక్సన్ మంచి డాన్స్ మాస్టర్, మంచి ఫ్రెండు కూడా. "కల" తర్వాత, మా టీమ్‌లో ఎక్కడివాళ్లక్కడ గప్‌చిప్ అయిపోయారు. టీమ్‌లో నన్ను గుర్తుపెట్టుకొని వచ్చి మరీ నాతో సమయం గడిపింది ఎవరన్నా ఉన్నారంటే.. అది నిక్సన్ ఒక్కడే!

ఆ సాయంత్రం నాకింకా గుర్తుంది. మా ఇంటికి వచ్చి, తాజ్ ట్రైస్టార్ లో ఉన్న "బ్లాక్‌బస్టర్" పబ్‌కు నన్ను తీసుకెళ్లాడు నిక్సన్. అక్కడే కెమెరామన్ సెంథిల్ పరిచయమయ్యాడు. ముగ్గురం కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. నిక్సన్ నన్ను ఆ రోజు బయటికి తీసుకెళ్లిన పర్పస్ కూడా అదే. కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయటం ..

ప్రారంభంలో మాతో గొడవ పెట్టుకుని డాన్సర్స్ యూనియన్ దాకా వెళ్లాడు నిక్సన్. తర్వాత అతనే మంచి ఫ్రెండయ్యాడు. చివరికి, అతన్నే మూడు పాటలు చేయటానికి మారిషస్ తీసుకెళ్లాం. మారిషస్ షూటింగ్‌లో ఉన్న ఆ రెండు వారాల్లో - అక్కడ అన్నిరకాలుగా బాగా ఎంజాయ్ చేసిన ఒకే ఒక్కడు నిక్సన్ మాత్రమే! మారిషస్‌లో మేము  షూటింగ్ ఎప్పుడు ఎక్కడ చేస్తున్నా.. ప్యాకప్ సమయానికి, ప్రతిరోజూ ఎవరో ఒక లోకల్ మారిషస్ అమ్మాయి నిక్సన్ కోసం కాచుకుని ఉండేది. ఇలా ప్యాకప్ చెప్పటం ఆలస్యం.. ఇద్దరూ క్షణంలో మాయమైపోయేవాళ్లు!

అంతకు ముందే నిక్సన్ కొన్ని సినిమాలు చేసినా - అవి బయటికి వచ్చి, అతనికి బాగా పేరు తెచ్చిన సినిమాల్లో "కల" కూడా ఒకటి. ఆ తర్వాత - హీరో రాజా నుంచి, సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు దాదాపు అందరు హీరోలకి డాన్స్ మాస్టర్‌గా పని చేశాడు నిక్సన్.

అప్పటి ఆ నిక్సన్ ఇటీవలే డైరెక్టర్ కూడా అయ్యాడు.     

Sunday 9 June 2013

లారెన్స్ విజయ రహస్యం మీకు తెలుసా? ('కల' ట్రివియా-4)

"జెంటిల్‌మేన్" సినిమాలో "చికుబుకు చికుబుకు రైలే" పాట మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో.. ప్రభుదేవాకి వెనకాల గ్రూప్ డ్యాన్సర్‌గా చేసిన వాళ్లలో ఓ కుర్రాడి పేరు రాఘవ మురుగయ్యన్.

అలా గ్రూప్ డ్యాన్సర్‌గా అప్పటికే ఎన్నో సినిమాల్లో చేసిన ఆ కుర్రాడు క్రమంగా ఒక టాప్ రేంజ్ కోరియోగ్రాఫర్ అయ్యాడు. తనదంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్‌ను క్రియేట్ చేసుకుని, సౌత్‌లో ప్రతి అగ్ర హీరోతోనూ "హ్యాటాఫ్" అనిపించే స్టెప్పులు వేయించాడు. ఆ తర్వాత యాక్టర్ అయ్యాడు. డైరెక్టర్ అయ్యాడు. సింగర్ కూడా అయ్యాడు. అన్నిట్లోనూ తన రేంజ్ చూపించుకున్నాడు.

అతనే లారెన్స్ రాఘవేంద్ర ..

లారెన్స్ నా తొలి చిత్రం "కల" లోని ఒక పాటలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు.

అదంత సింపుల్ విషయం కాదు. కానీ, చాలా సింపుల్‌గా, అనుకోకుండా జరిగిపోయింది. కేవలం వేళ్లమీద లెక్కించగలిగే కొంతమంది అగ్రశ్రేణి హీరోల చిత్రాల్లో మాత్రమే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన లారెన్స్.. ఒక కొత్త దర్శకుడినయిన నా చిత్రంలోని ఒక పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వటం అనేది ఇండస్ట్రీలో చాలా మందికి మింగుడుపడని విషయం. హంబుల్‌గానే అయినా.. నేను గొప్పగా చెప్పుకొనే విషయం.

లారెన్స్ అసిస్టెంట్ శాంతిని నేను "కల"లో కోరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. నా చిత్రం చేశాక, శాంతికి వెంటనే మణిరత్నం "యువ" లో ఒక పాట చేసే ఆఫర్ వచ్చింది! ఆ తర్వాత పవన్ కల్యాణ్ "గుడుంబా శంకర్"లో .. ఇలా చాలా మంచి చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి శాంతికి. క్రమంగా తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చి ఇక అక్కడే కోరియోగ్రాఫర్‌గా స్థిరపడిపోయింది శాంతి.

శాంతి, నేను ఒక రోజు ఒక పాట గురించి డిస్కస్ చేస్తూ అనుకున్న ఐడియా అది. వెంటనే లారెన్స్‌ని కలవటం, ఆయన్ని అడగటం, ఆయన ఓకే అనటం చకచకా జరిగిపోయాయి.

పాటలో తన స్పెషల్ అప్పియరెన్స్ కోసం.. ఆ రోజు రాత్రి పద్మాలయా స్టుడియోకి,  సరిగ్గా తను చెప్పిన టైమ్‌కంటే గంట ముందుగానే వచ్చాడు లారెన్స్. కాసేపు నాతో, మా టీమ్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత, నిమిషాల్లో తన పార్ట్ డ్యాన్స్ చేసేసి వెళ్లిపోయాడు.

మామూలుగా లారెన్స్ స్పెషల్ అప్పియరెన్స్ అంటే.. ఆయన అడక్కపోయినా భారీగానే పారితోషికం అందుతుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో మీరూ ఊహించవచ్చు. అలాంటిది..

నా చిత్రంలో తన స్పెషల్ అప్పియరెన్స్‌కు పారితోషికంగా ఒక్క పైసా తీసుకోలేదు లారెన్స్. ఏదయినా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. అదీ వద్దని వారించాడు.

ముంబైలో ఉన్న నా మోడల్ కోఆర్డినేటర్-కమ్-క్రియేటివ్ డైరెక్టర్ మిత్రుడు వంశ్ తో..  ఒకసారి ఫోన్లో మాట్లాడాను. తను ఈ మధ్యే లారెన్స్ కోసం కాస్టింగ్ చేశాట్ట. "నేను ఎందరో గొప్ప గొప్ప హిందీ, తెలుగు, తమిళ డైరెక్టర్లని చూశాను. కాని.. ఎంతో పేరున్నా, ఇంత సింపుల్‌గా, ఇంత బాగా ఉండే డైరెక్టర్ని ఇతన్ని మాత్రమే చూసాను!" అన్నాడు. వంశ్ చెప్పినదాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

లారెన్స్ ఒక మంచి స్నేహశీలి. క్రమశిక్షణ ఉన్న టెక్నీషియన్, ఆర్టిస్టు కూడా. అనవసరపు ఫోజులు, ఈగోలు ఆయనకు లేవు. తన రూట్స్ మర్చిపోడు. వీటన్నింటినీ మించి.. హృదయం ఉన్న మనిషి లారెన్స్. ఆ హృదయమే ఆయన విజయ రహస్యం.      

Saturday 8 June 2013

విలన్ అమిత్ కుమార్ ఎలా పరిచయమయ్యాడు? ('కల' ట్రివియా-3)

ఇంకో రెండు లేదా మూడు పోస్ట్‌లతో ఈ "కల ట్రివియా"ని ముగిస్తాను. లారెన్స్ సహృదయం గురించీ, నేను పరిచయం చేసిన ఇంకొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించీ, దాదాపు అంతా కొత్తవాళ్లతో చిత్రం రూపొందించిన ఒక కొత్త డైరెక్టర్ తొమ్మిదేళ్ల క్రితమే సినిమాకు మంచి బిజినెస్‌ని ఎలా అట్రాక్ట్ చేయగలిగాడు.. ఇవన్నీ తర్వాతి రెండు, మూడు పోస్టుల్లో మీతో షేర్ చేసుకుంటాను.

ఆ తర్వాత మాత్రం, చాలావరకు, నా బ్లాగ్ పోస్టులన్నీ షార్ట్ కట్ గా ఉండేట్టుగా, ఇంకా చెప్పాలంటే, టిట్‌బిట్స్ సైజులోనే రాస్తాను.

ప్రస్తుతం నేను చేస్తున్న 3 మైక్రో బడ్జెట్ సినిమాలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. ఈ బిజీలో టైమ్ అసలు ఉండట్లేదు. అలాగే, మీ టైమ్ విలువ కూడా నాకు తెలుసు.

కట్ టూ విలన్ అమిత్ కుమార్ -  

"కల" చిత్రం కోసం కొత్త నటీనటులు కావాలంటూ అప్పుడు "సూపర్ హిట్", "సంతోషం", "టైమ్‌స్ ఆఫ్ ఇండియా"ల్లో ఇచ్చిన మా ప్రకటనలకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. జూబ్లీ హిల్స్ లోని ప్రశాసన్ నగర్లో ఉన్న మా ఆఫీసుకి సగటున రోజుకి ఓ వందమందికి పైనే ఆర్టిస్టులు వచ్చేవారు, ఆడిషన్‌కి. అలా ఎంటరయిన వాడే మన విలన్ అమిత్ కుమార్.

ముంబైలో పుట్టి పెరిగిన అమిత్ కుమార్ తెలుగువాడే. ఒకరోజు ఉదయం అతని ఫోటోల్ని చూశాను. వాటిల్లో ఒక ఫోటో చూడగానే ఇంక అతనే "కల విలన్" అని డిసైడయిపోయాను. వెంటనే పిలిపించాను. ఆడిషన్, సెలక్షన్, అగ్రిమెంట్లు చకచకా జరిగిపోయాయి.  

అమిత్‌లో అద్భుతమైన నటుడున్నాడు. అంతకు మించి "ఇంకా..ఇంకా..ఇంకా నేను బాగా చెయ్యాలి" అన్న తపన ఉంది. ఆ తపనే అతన్ని నటుడిగా నిలబెట్టింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు - అమిత్ యాక్టింగ్‌ను నేను, మా కెమెరామన్ శంకర్, టీమ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.

అమిత్ నటనను చూసే, సినిమాలో అతని విలన్ రోల్‌కి క్లయిమాక్స్‌లో కొత్తగా చిన్న ట్విస్ట్ ఇచ్చాము. అతను నటించిన విలన్ పాత్రను "శుభం"తో క్లోజ్ చేయకుండా, హాస్పిటల్లోంచి పారిపోయినట్టు చూపించాము.  

అయితే ఇలా ఒక సీన్‌ని కొత్తగా క్రియేట్ చేయడం, విలన్‌గా అమిత్ బాగా యాక్ట్ చేయడం వంటివి సినిమాలో అతని ప్రజెన్స్ కొట్టొచ్చినట్టుగా కంపించడానికి పరోక్షంగా కారణమయ్యాయనుకుంటాను. టీమ్‌లోని కొందరు దీన్ని నేనేదో అమిత్‌కి "స్పెషల్ ట్రీట్‌మెంట్" ఇస్తున్నట్టుగా భావించారు. కొందరయితే అమిత్ నాకు 'డబ్బు ఇచ్చాడు' అని కూడా నిర్మొహమాటంగా అనేశారు! కానీ, అది నిజం కాదు.

టు బి ఫ్రాంక్, తనని తెరకు పరిచయం చేసినందుకు డబ్బు కాదుకదా.. కనీసం ఒక 'యూజ్ అండ్ త్రో' పెన్ను కూడా నేను గిఫ్టుగా అందుకోలేదు.

అప్పుడు నేను పరిచయం చేసిన అమిత్ కుమార్ తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో  ఇప్పటికి కనీసం ఓ రెండొందలకి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. తెలుగులో, మళయాళంలో హీరోగా కూడా చేశాడు. ఎక్కువగా మాత్రం, విలన్ లేదా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్నే చేశాడు.

ఇదంతా ఎలా ఉన్నా.. ఒక్కటి మాత్రం నిజం. తన తొలి చిత్రం లోనే, ఒక ఫుల్ రేంజ్ విలన్‌గా "కల"లో అద్భుతంగా నటించాడు అమిత్. అలా అతని నుంచి నటనని నేను రాబట్టుకోగలిగాను. చెప్పాలంటే, ఆ కేరెక్టర్లో అతను జీవించాడు!

నాకు తెలిసి, 'కల' లోని "శంకర్ భాయ్"ని మించిన కేరెక్టర్‌ను అమిత్ మరో సినిమాలో ఇప్పటికీ చేయలేకపోయాడు. నటనాపరంగా కూడా అమిత్ కెరీర్లో "ది బెస్ట్" అదే!

ఈ నిజాన్ని బహుశా అమిత్ కూడా ఒప్పుకుంటాడు ..  

Friday 7 June 2013

బెంగళూరు బ్యూటీ ఇప్పుడేం చేస్తోంది? ('కల' ట్రివియా-2)

హీరోయిన్ సెలెక్షన్స్ చాలా గమ్మత్తుగా జరుగుతాయి. "కల" చిత్రం కోసం హీరోయిన్ ఆడిషన్లు హైదరాబాద్, ముంబైల్లో జరిగాయి. చివరికి, బెంగళూరులోని కనిష్క హోటల్లో, చాలా యాక్సిడెంటల్‌గా, శ్రీదేవి అనే ఒక కోఆర్డినేటర్ ద్వారా మమ్మల్ని కలిసింది ఈ అమ్మాయి. అప్పటికే బాగా విసిగిపోయి ఉన్న మా ప్రొడ్యూసర్, నేను, మా కెమెరామన్.. ఈ అమ్మాయితో మాట్లాడిన అయిదు నిమిషాల్లోనే ఒకే చేసేశాము. అగ్రిమెంట్ సైన్ చేసి, అడ్వాన్స్ చెక్కుతో వెళ్లిపోయిందా అమ్మాయి.

ఆ అమ్మాయే నవ్య. కల చిత్రం కోసం "నయన హర్షిత" అని స్క్రీన్ నేమ్ తనే పెట్టుకుంది. వ్యక్తిగతంగా నాకు మాత్రం తనను నవ్య అని పిలవటమే అలవాటయింది.

నవ్యతో షూటింగ్ చాలా హాప్పీగా జరిగిపోయింది. ఎలాంటి సమస్యలు లేవు. ఈగోలు అస్సలు లేవు. తనవైపు నుంచి దాదాపు ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగనీయలేదు. షూటింగ్ సమయంలో అనుకోకుండా వచ్చే నానా ఇబ్బందుల్లో, కనీసం ఓ రెండుసార్లు కళ్లల్లో నీళ్లు పెట్టుకొనే పరిస్థితి వచ్చినా చాలా టఫ్‌గా ఎదుర్కొంది నవ్య. ఆ రెండు సందర్భాల్లోనూ ప్రాజెక్టు గురించే ఆలోచించి మరుక్షణం మామూలయిపోయింది.

అది నా మొదటి సినిమా. సినీ ఫీల్డులో ఉండే అనవసరపు ఈగోల విషయం నాకు తెలియదు. మేము మారిషస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు.. ఒక అర్థంలేని అతి చిన్న ఈగో సమస్య, మరొక అతి పెద్ద అర్థం లేని గొడవకు కారణమయింది. ఆ ఒక్కటే జరగాల్సింది కాదు. అలాంటి పరిస్థితిలో కూడా నవ్య ప్రాజెక్టు గురించే ఆలోచించింది.

జూబ్లీహిల్స్‌లోని అమెరికన్ హౌజ్‌లో షూటింగ్ చేసినప్పుడు, ఒక సీన్లో నవ్య వేసుకున్న ఆరెంజ్ కలర్ డ్రెస్, ఆ డ్రెస్‌లో తన ఫేసినేటింగ్ లుక్ నాకిప్పటికీ గుర్తుంది.

కల ఫలితం తారుమారయినా - తర్వాత తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేసింది నవ్య. ఆ మధ్య జగపతి బాబు తో తెలుగులో "బ్రహ్మాస్తం" లో కూడా నటించింది. ఈ మధ్యే తను ఒక మళయాళ చిత్రం కూడా చేసినట్టు త్రివేండ్రంలో ఉన్న ఒక డాక్టర్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది.

ఒకవైపు హాబీగా తనకు ఇష్టమైన సినిమాల్లో నటిస్తూనే - మరోవైపు, బెంగళూరులో బిజినెస్‌వుమన్‌గా మంచి పొజిషన్‌కి ఎదిగింది నవ్య. ఒక చెయిన్ ఆఫ్ బ్యూటీ క్లినిక్స్ అనుకుంటాను.. చాలా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది నవ్య.

సుమారు కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్‌లో తనతో చాట్ చేశాను. తన నంబర్ ఇచ్చి మాట్లాడమంది. ఇన్నేళ్లయినా, తన పలకరింపులో నా పట్ల ఎలాంటి మార్పూ లేదు. అదే గౌరవం, అదే ఫ్రెండ్లీనెస్ ..        

Wednesday 5 June 2013

ఆ జ్ఞాపకాలింకా పదిలంగానే ఉన్నాయి! ("కల" ట్రివియా-1)

"కల" సినిమా రిజల్టు విషయం పక్కన పెడితే.. ఆ సినిమా నేపథ్యంగా నేను దాచుకున్న మధుర స్మృతులు అనేకం. తొమ్మిదేళ్లయినా ఆ జ్ఞాపకాల ఫ్రెష్‌నెస్‌ని ఈ రోజుకూడా నేను ఫీలవుతూనే ఉన్నాను.

ఒక్క బ్లాగ్ పోస్టులో అవన్నీ రాయటం చాలా కష్టం కాబట్టి.. ఈ పోస్టుతోపాటు, కనీసం ఇంకో రెండు పోస్టుల్లో "కల" తాలూకు ఆ ట్రివియాని కొంతయినా మీతో పంచుకోవాలనిపిస్తోంది.

కట్ టూ హీరో రాజా -

ఇప్పుడు మా మధ్య అంత క్లోజ్‌నెస్ లేకపోయినా - కల ప్రీప్రొడక్షన్ సమయంలోనూ, షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ, ఆ తర్వాత సినిమా రిలీజయ్యేవరకూ.. హీరో రాజా తో ముఖ్యంగా నాకు, మా టీమ్ కి ఎన్నో మంచి మెమొరీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని..

> మారుతీ వ్యాన్‌లో మౌంట్ ఒపెరాకు వెళుతూ/వెళ్లాక (డాన్స్ మాస్టర్ నిక్సన్ తో కలిసి) నేను, రాజా పార్టీ చేసుకోవటం.
> ప్యారడైజ్ చౌరస్తా నుంచి  నేను, రాజా అలా నడుచుకుంటూ వెళ్లి ఒక హోటల్లో లంచ్ చేయటం. అప్పటికే రాజా మూడు సినిమాలు చేసి ఉన్నాడు! (ఓ చినదానా, అప్పుడప్పుడు, విజయం)
> షూటింగ్ కోసం మారిషస్ కు రెండు వారాలు వెళ్లినప్పుడు, ఒక టీం మెంబర్‌గా ఎలాంటి ఈగో లేని అతని కోపరేషన్.
> కెమెరా లెన్సులున్న బరువైన బాక్స్‌ని తన తలమీద పెట్టుకొని, టీమ్‌తో పాటు కనీసం ఒక మైలు దూరం సముద్రం అంచులవెంట రాళ్లమీద నడవటం.
> కాల్షీట్ టైమింగ్స్ లేకుండా, మారిషస్‌లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ షూటింగ్‌లో పాల్గొనటం, అందర్నీ ఉత్సాహపర్చటం.
> షూటింగ్ సమయంలో, బీచుల్లోని వేడికి బాగా నల్లబడిన నా ముఖానికి తనదగ్గరున్న కాస్మెటిక్స్ ఏవేవో పూసి, రాజా స్వయంగా ఫేషియల్ చేయటం.
> "మనోహర్ గారూ.. డైరెక్టర్ గారూ" అంటూ, ఇంగ్లిష్ యాక్సెంటుతో కూడిన తనదైన వాయిస్‌తో గౌరవంగా పిలవటం.
> అన్నపూర్ణ స్టూడియోలో ఒక మంచి ఎమోషనల్ సీన్  చేస్తున్నపుడు చనిపోయిన వాళ్ల అమ్మగారు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవటం. ఆ ఉద్వేగంలోనే, సెట్లో ఒక మూలన ఉన్న నా దగ్గరకు వచ్చి  "మీతో ఇంకో సినిమా తప్పకుండా చేస్తాను" అని చెప్పటం.
> దాదాపు ప్రతి షాట్‌నీ సింగిల్ టేక్‌లో చేయాలన్న తపనతో ఎప్పుడూ ఉండటం, అలా చేయటం.
.. ఇలా ఇంకో వంద చెప్పగలను రాజా గురించి .

నాకు యాక్సిడెంట్ జరగడానికి ముందు, సుమారు ఏడాదిన్నర  క్రితం, ది సేమ్ రాజాని మణికొండలోని తన కొత్త ఇంట్లో కలిశాను. అదే పలకరింపు. అదే మర్యాద. అదే చిరునవ్వు. కానీ, ఏదో చిన్న గ్యాప్. అదెలా క్రియేటయ్యిందో నాకయితే గుర్తు లేదు.

"సినిమాల్లో నేను డబ్బు సంపాదించలేదు. పోగొట్టుకున్నాను. ఇప్పుడు సినిమాలు చేయాలన్న అవసరం కూడా  లేదు నాకు. లైఫ్ చాలా హాయిగా ఉంది.." అన్నాడు క్రైస్తవ మత ఉపన్యాసకుడుగా ప్రస్తుతం బిజీగా ఉన్న రాజా. రాజాకు సేవాభావం ఎక్కువ. ఈ మధ్యే ఒక ఫౌండషన్ కూడా ప్రారంభించాడు.

ఐ విష్ హిమ్ ఎవ్రీ సక్సెస్ అండ్ ఆల్ హాప్పినెస్ ఇన్ లైఫ్ ..     

Tuesday 4 June 2013

జూన్ 4 .. తొమ్మిదేళ్ల క్రితం ఏం జరిగింది?

సునామీలు లేవు. భూకంపాలు లేవు. ప్రపంచం ప్రశాంతంగానే ఉంది. జూన్ 4, ఇదే రోజు, తొమ్మిదేళ్ల క్రితం ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం. అంతకు ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకు మాత్రం ఫిలిమ్‌నగర్ పెద్ద షాక్‌కు గురయింది.

జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రముఖ హీరో ఇంట్లో కాల్పులు జరిగాయి. ఒక పెద్ద ప్రొడ్యూసర్, మరొక ప్రముఖ సినిమా సిధ్ధాంతి ఆ కాల్పుల్లో దారుణంగా గాయపడి, చావుబతుకుల మధ్య హాస్పిటల్‌కు తరలించబడ్డారు.

ఆ అగ్ర హీరో పేరు నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. ఆ ప్రొడ్యూసర్ పేరు బెల్లంకొండ సురేష్. ముందే చెప్పినట్టు, ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన ఇండస్ట్రీకి ఓ పెద్ద షాక్!

కట్ చేస్తే -

జూన్ 4, శుక్రవారం ఉదయం నారాయణగూడలోని వెంకటేష్ థియేటర్లో రాజా హీరోగా నటించిన నా తొలి చిత్రం "కల" విడుదలైంది. నేనీ బ్లాగ్ రాస్తున్న సమయానికి (ఉదయం 9 గంటలు), ఆ రోజు, నా ప్రొడ్యూసర్ మిత్రుడు రామచంద్రారెడ్డి "కల" సినిమా ఫిలిం రీళ్లను చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ, సంప్రదాయబధ్ధంగా, సినిమా విజయాన్ని కాంక్షిస్తూ పూజ చేయించాక, ఆ రీళ్లని వెంకటేష థియేటర్లో ప్రదర్శనకి తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాపయింది.

ఫెయిల్యూర్‌కి వంద రీజన్స్ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకుని, నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నం చేయటం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. అంతిమ ఫలితమే నాకు ముఖ్యం.

రికార్డ్ స్థాయిలో - ఇప్పటివరకు - జెమిని, తేజ చానెల్స్‌లో సుమారు వందసార్లు టెలికాస్ట్ అయిన నా తొలి చిత్రం "కల" అంతిమ ఫలితం కమర్షియల్ ఫెయిల్యూర్. అది మాత్రమే నాకు గుర్తుంటుంది. దాన్ని నేనెప్పుడూ మర్చిపోను.

***

("కల" trivia .. తర్వాతి బ్లాగ్‌లో!)      

Monday 3 June 2013

మనుషులు ఇలా కూడా ఉంటారు - 2

ఇలాంటి పోస్టులు బ్లాగ్‌లో రాసినప్పుడల్లా నా బిగ్ 5 మిత్రుల్లో ఒకరు "ఇది జీవితం మాస్టారూ.. ఇవన్నీ మామూలే!" అంటారు. అసలు ఇలాంటి నెగెటివిటీకి ఎంత దూరం ఉందామన్నా, అది ఏదో ఒక పనికిరాని చెత్త రూపంలో నాకు దర్శనమిస్తూనే ఉంది. నా మిత్రుడన్నట్టు, దిస్ ఈజ్ లైఫ్!

ఈ మధ్యే ఒక సినిమా ప్రపోజల్ విషయంలో సహనిర్మాతలుగా ఫీల్డులోకి ఎంటర్ కావాలన్న ఆసక్తితో ఓ ఇద్దరు మహాశయులు పరిచయమయ్యారు. ఆ ఇద్దరూ స్వయంగా అన్నాదమ్ములే. ఇక్కడ "మహాశయులు" అన్న పదం వాడుతున్నాను అంటే.. దాన్నిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్లు చాలా గొప్పవాళ్లు అని వాళ్ల వ్యక్తిగత భావన. కాకపోతే, వాళ్ల ఆ గొప్పతనం రంగు పాజిటివ్‌దా, నెగెటివ్‌దా అన్నది ఈ బ్లాగ్ చదివాక మీరే నిర్ణయించాలి.

 ఈ ఇద్దరు మహాశయుల్లో మొదటి వ్యక్తి సరిగ్గా మొన్న ఉగాది నాడు మొదటిసారిగా ఫోన్ చేశాడు. కో ప్రొడ్యూసర్ విషయంలో నా రిక్వైర్‌మెంట్ చాలా చిన్నది. కేవలం కొన్ని లక్షలు మాత్రమే. కొత్తగా పరిచయం చేసుకున్న మన వాడు మాత్రం ఓ తెగ రెచ్చ్చిపోయాడు. వాళ్ల జిల్లాలో వారికున్న పేరు ప్రఖ్యాతుల గురించి చెప్పాడు. ఒక్క ఫోన్ కాల్‌తో లక్షలు కాదు.. కోట్లు తెచ్చిపెట్టేవాళ్లు, ఇచ్చేవాళ్లు తనకు లెక్కలేనంతమంది ఉన్నట్టు చెప్పాడు!

ఇవన్నీ పక్కా కోతలు అని నాకు తెలుసు. నిజంగా ఆ రేంజ్‌లో ఉన్నవాడయితే నాకెందుకు ఫోన్ చేస్తాడన్నది కామన్‌సెన్స్!

కట్ చేస్తే -

తామిద్దరూ చేస్తున్న రెండు బిజినెస్‌ల గురించి మహా గొప్పగా, ఇంకా చెప్పాలంటే, నోటికి అప్పుడు ఏదొస్తే అది చెప్పాడు. అవి నిజంగా అంత టర్నోవర్ ఉన్న బిజినెస్‌లు కావని చిన్న పిల్లాడు కూడా చెప్తాడు.

మరొక విషయం ఏంటంటే.. ఎవరయినా బిజినెస్ విషయాలు మాట్లాడ్డానికి తమకున్న బిజినెస్ ప్లేస్‌కి తీసుకెళ్తారు. కానీ, వీళ్లు నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అలా వీళ్లు నన్ను ఎప్పుడయితే ఇంటికి తీసుకెళ్లారో అప్పుడే నాకు అర్థమైపోయింది. అంతా ఉట్టి డొల్ల అని.

ఇక ఈ ఇద్దరు మహాశయుల్లో రెండో వ్యక్తి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అంతా సోది, సుత్తి తప్ప అసలు విషయం డైరెక్టుగా మాట్లాడే సత్తా లేదు ఈయనకి. అసలు డబ్బే చేతిలో లేనప్పుడు విషయం ఎలా మాట్లాడగలడు?

నన్నూ, నా సినిమా ప్రాజెక్టును ఎరగా చూపి, ఏమేమో చేయడానికి ఈ ఇద్దరు మహాశయులు ప్లాన్లయితే వేశారు. అతి చిల్లరగా, నాకు రకరకాల ఎరలు వేయడానికి కూడా ప్రయత్నించారు. నేనెక్కడా రియాక్టవలేదు.

నేను ఎప్పుడు వాళ్లతో మాట్లాడినా, నాకు వాళ్లతో ఏ విషయం గురించి అవసరమో ఆ ఒక్కటే మాట్లాడాను. అదీ చాలా స్పష్టంగా మాట్లాడాను. మరే విషయం నేనసలు పట్టించుకోలేదు.

కట్ టూ నిజస్వరూపం -  

ఎప్పటికప్పుడు "మహాశయుడు నెంబర్ 1" ని నేను చాలా గట్టిగా అడిగేవాణ్ణి. "ఒకవేళ మీ వల్ల కాకపోతే ఇప్పుడే చెప్పండి. నేను ప్యారలల్‌గా వేరే ప్రయత్నాలు కూడా చేసుకుంటాను. లేదంటే, చివరికి మీరు చేతులెత్తేస్తే, మళ్లీ నేను మొదట్నుంచీ ప్రయత్నాలు చేసుకోవాల్సి ఉంటుంది" అని.

దానికి నెంబర్ 1 గాని, నెంబర్ 2 గాని, "మొత్తం డబ్బు మా దగ్గర ఉంది. అసలు డబ్బు గురించి మీరు ఆలోచించే అవసరమే లేదు. ఒక రోజు అటూ ఇటూ అంతే!" అనేవాళ్లు.

అయితే, ఆ "ఒక్క రోజు అటూ ఇటూ" కాస్త 50 రోజులు ఆడింది. విషయం శూన్యం.  

వాళ్లకు ఆ శక్తి లేదు. అంత సీన్ కూడా లేదు. అత్యంత అధమ స్థాయిలో డ్రామా ఆడిన ఆ మహాశయులిద్దరూ చివరికి నా ఫోన్ ఎత్తలేకపోయారు. నా మెసేజ్‌లకి రిప్లై కూడా ఇవ్వలేకపోయారు!

ఇలా - ఒక క్రియేటివ్ పర్సన్ కెరీర్‌తో ఆడుకోవటం ద్వారా వాళ్లు సాధించిందేమిటో నాకర్థం కాలేదు. వాళ్లల్లో ఉన్న శాడిజాన్ని బయటపెట్టుకోవటం తప్ప!

నాకు తెలుసు. బయటనుంచి డబ్బు ఫ్రీగా సేకరించడానికి వాళ్లు నానా ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కటీ కాలేదు. ఏం చేస్తారు పాపం? నాకు కొత్తగా స్టోరీలు చెప్పడానికి కూడా ఏమీ మిగల్లేదు. ఇంక నా ఫోన్ ఎలా ఎత్తగలరు? నా మెసేజ్‌లకి రెప్లై ఎలా ఇవ్వగలరు?

ఇట్లాంటి వాళ్లకోసం నా విలువైన సమయం కోల్పోడానికీ, వాళ్లను అంతగా భరించడానికీ కారణం ఒక్కటే. వాళ్లల్లో సినిమా పట్ల, సినిమా ఫీల్డు పట్ల ఉన్న ఆసక్తి, వ్యామోహం. కానీ, నేనిచ్చిన స్నేహ హస్తాన్ని, సపోర్టుని వాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. పరోక్షంగా నేనెంతో సమయం, డబ్బు నష్టపోడానికి కారణమయ్యారు. ఈ నిజాన్ని వాళ్లు గుర్తిస్తే చాలు.

ఫీల్డులోకి ఎంటర్ కాకముందే ఇంత గొప్ప డ్రామా ఆడిన ఈ మహాశయులిద్దరికీ నా బెస్ట్ విషెస్ చెప్పటం తప్ప నేనేం చేయగలను? 

Sunday 2 June 2013

మనుషులు ఇలా కూడా ఉంటారు - 1

చెత్తని ఊడ్చివేసే సఫాయీ వాళ్లంటే నాకెంతో గౌరవం. మనమందరం చేయలేని పనిని చేస్తూ, మనకు మంచి పరిశుభ్రమయిన వాతావరణాన్ని అందిస్తారు వాళ్లు.

అది మనకు కనిపించే చెత్త.

కాగా, మన కళ్లకు "కనిపించని చెత్త" కూడా మన చుట్టూరా, మన పక్కనే ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఈ బ్లాగ్ చదవండి. మీకే తెలుస్తుంది.    

ఒక లోక్ సభ స్పీకర్‌తో కలిసి టిఫిన్ చేశాను, భోజనం చేశాను. మాట్లాడాను. రవీంద్రభారతిలో ఆయన చేతులమీదుగా సన్మానం అందుకున్నాను. ఒక కేంద్రమంత్రితో కలిసి పని చేశాను. ఆయన  ఎన్నోసార్లు నన్ను మెచ్చుకున్నారు. ఒక ఫంక్షన్‌లో స్వయంగా ఆయనే నాకు వడ్డించారు. ఒక రాష్ట్ర మంత్రి, ఒక జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత నాకు సన్మానం చేశారు. ఇంక.. ఐ ఏ ఎస్ ఆఫీసర్లు, ఐ ఆర్ ఎస్ ఆఫీసర్లతో నయితే నాకున్న మంచి అనుభవాలు, కమ్యూనికేషన్ విషయం చెప్పాల్సిన పని లేదు. నార్త్‌లో, ఒక హైకోర్టు డిప్యూటీ అడ్వొకేట్ జనరల్ నాకు చాలా దగ్గరి ఫ్రెండు. ఒక అంతర్జాతీయ స్థాయి బెస్ట్ సెల్లర్ రైటర్ నాకు కనీసం ఒక "హాయ్" చెప్పకుండా ఒక్కరోజు ఉండలేదు.  ఇలా.. ఇంకా ఎన్నో చెప్పగలను.

ఇదంతా నేనేదో గొప్పవాడినని చెప్పడానికి కాదు..

పైన చెప్పిన వారందరికీ, అంతంత పెద్ద హోదాల్లో, స్థాయిల్లో, బాధ్యతల్లో ఉన్నా కమ్యూనికేషన్‌కి టైమ్ ఉంది. అయితే ఫోన్‌లో మాట్లాడతారు. మెసేజ్ లు పెడతారు. షెడ్యూల్ మరీ టైట్ గా ఉన్నప్పుడు అదే విషయం ఒక ఈమెయిల్ అయినా పెడతారు. లేదంటే, వేరేవాళ్లతోనయినా విషయాన్ని చేరవేస్తారు. కమ్యూనికేషన్‌కు, మాటకు అంత విలువ, ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే వాళ్లు ఆయా రంగాల్లోకి వెళ్లగలిగారు. ఆ స్థాయికి చేరుకోగలిగారు.

కట్ టూ పాయింట్ -

మనం ఒక పని అనుకున్నాం. ఆ పనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ విషయం ఇద్దరికీ తెలుసు. దానికి ఒక డెడ్‌లైన్ కూడా ఉంది.  

అలాంటప్పుడు కమ్యూనికేషన్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? ఆ పని ఆలస్యం అవుతుంది అనుకున్నా, అసలు "ఇంక మా వల్ల కాదు.. మేం ఉట్టి చేతకాని వాళ్లం" అని డిసైడ్ అయిపోయినా.. ఆ విషయం  మనం అవతలివాళ్లకు చెప్పాలి. చెప్పడానికి అహం అడ్డొస్తే .. ఒక మెసేజ్ పెట్టాలి. ఒక ఈమెయిల్ పెట్టాలి. లేదా ఇంకొకరి ద్వారానయినా ఆ విషయం తెలియజేయాలి. మినిమమ్ మేనర్స్ పాటించాలి.  అప్పుడు అవతలి వాళ్లు వారి జాగ్రత్తలు వాళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది.

అలా కాకుండా, ఎప్పుడో ఒకసారి.. "నేను కొంచెం బిజీగా ఉన్నాను.. నాకు టైమ్ లేదు.. చిన్న ప్రాబ్లం వచ్చింది.. రాత్రికి కాల్ చేస్త.." వంటి సొల్లు కాల్స్ లేదా మెసేజ్‌లతో రోజులు, వారాలు, నెలలు గడిపే వాళ్లని ఏమనాలి?

కమ్యూనికేషన్ కోసం, అంతంత పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్లకు ఉండే సమయం వీరికి లేదా? అసలు ఎదుటివాళ్లని ఇలాంటి వాళ్లు ఏమనుకుంటారు? దానికంటే ముందు.. అసలు వీళ్లగురించి వీళ్లు ఏమనుకుంటారు?

ఈ టాపిక్‌ని ఇంకో బ్లాగ్‌లో కంటిన్యూ చేద్దాం.

నిజానికి ఇలాంటి వాళ్లగురించి నేను బ్లాగ్ రాయటం, మీరు చదవటం.. మనం ఇంత టైం వేస్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. కానీ, ఇలాంటి వాళ్ల ద్వారా మరొకళ్లు నష్టపోకుండా ఉండటం కోసమే  నా ఈ ప్రయత్నం.