Sunday 9 June 2013

లారెన్స్ విజయ రహస్యం మీకు తెలుసా? ('కల' ట్రివియా-4)

"జెంటిల్‌మేన్" సినిమాలో "చికుబుకు చికుబుకు రైలే" పాట మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో.. ప్రభుదేవాకి వెనకాల గ్రూప్ డ్యాన్సర్‌గా చేసిన వాళ్లలో ఓ కుర్రాడి పేరు రాఘవ మురుగయ్యన్.

అలా గ్రూప్ డ్యాన్సర్‌గా అప్పటికే ఎన్నో సినిమాల్లో చేసిన ఆ కుర్రాడు క్రమంగా ఒక టాప్ రేంజ్ కోరియోగ్రాఫర్ అయ్యాడు. తనదంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్‌ను క్రియేట్ చేసుకుని, సౌత్‌లో ప్రతి అగ్ర హీరోతోనూ "హ్యాటాఫ్" అనిపించే స్టెప్పులు వేయించాడు. ఆ తర్వాత యాక్టర్ అయ్యాడు. డైరెక్టర్ అయ్యాడు. సింగర్ కూడా అయ్యాడు. అన్నిట్లోనూ తన రేంజ్ చూపించుకున్నాడు.

అతనే లారెన్స్ రాఘవేంద్ర ..

లారెన్స్ నా తొలి చిత్రం "కల" లోని ఒక పాటలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు.

అదంత సింపుల్ విషయం కాదు. కానీ, చాలా సింపుల్‌గా, అనుకోకుండా జరిగిపోయింది. కేవలం వేళ్లమీద లెక్కించగలిగే కొంతమంది అగ్రశ్రేణి హీరోల చిత్రాల్లో మాత్రమే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన లారెన్స్.. ఒక కొత్త దర్శకుడినయిన నా చిత్రంలోని ఒక పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వటం అనేది ఇండస్ట్రీలో చాలా మందికి మింగుడుపడని విషయం. హంబుల్‌గానే అయినా.. నేను గొప్పగా చెప్పుకొనే విషయం.

లారెన్స్ అసిస్టెంట్ శాంతిని నేను "కల"లో కోరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. నా చిత్రం చేశాక, శాంతికి వెంటనే మణిరత్నం "యువ" లో ఒక పాట చేసే ఆఫర్ వచ్చింది! ఆ తర్వాత పవన్ కల్యాణ్ "గుడుంబా శంకర్"లో .. ఇలా చాలా మంచి చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి శాంతికి. క్రమంగా తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చి ఇక అక్కడే కోరియోగ్రాఫర్‌గా స్థిరపడిపోయింది శాంతి.

శాంతి, నేను ఒక రోజు ఒక పాట గురించి డిస్కస్ చేస్తూ అనుకున్న ఐడియా అది. వెంటనే లారెన్స్‌ని కలవటం, ఆయన్ని అడగటం, ఆయన ఓకే అనటం చకచకా జరిగిపోయాయి.

పాటలో తన స్పెషల్ అప్పియరెన్స్ కోసం.. ఆ రోజు రాత్రి పద్మాలయా స్టుడియోకి,  సరిగ్గా తను చెప్పిన టైమ్‌కంటే గంట ముందుగానే వచ్చాడు లారెన్స్. కాసేపు నాతో, మా టీమ్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత, నిమిషాల్లో తన పార్ట్ డ్యాన్స్ చేసేసి వెళ్లిపోయాడు.

మామూలుగా లారెన్స్ స్పెషల్ అప్పియరెన్స్ అంటే.. ఆయన అడక్కపోయినా భారీగానే పారితోషికం అందుతుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో మీరూ ఊహించవచ్చు. అలాంటిది..

నా చిత్రంలో తన స్పెషల్ అప్పియరెన్స్‌కు పారితోషికంగా ఒక్క పైసా తీసుకోలేదు లారెన్స్. ఏదయినా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. అదీ వద్దని వారించాడు.

ముంబైలో ఉన్న నా మోడల్ కోఆర్డినేటర్-కమ్-క్రియేటివ్ డైరెక్టర్ మిత్రుడు వంశ్ తో..  ఒకసారి ఫోన్లో మాట్లాడాను. తను ఈ మధ్యే లారెన్స్ కోసం కాస్టింగ్ చేశాట్ట. "నేను ఎందరో గొప్ప గొప్ప హిందీ, తెలుగు, తమిళ డైరెక్టర్లని చూశాను. కాని.. ఎంతో పేరున్నా, ఇంత సింపుల్‌గా, ఇంత బాగా ఉండే డైరెక్టర్ని ఇతన్ని మాత్రమే చూసాను!" అన్నాడు. వంశ్ చెప్పినదాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

లారెన్స్ ఒక మంచి స్నేహశీలి. క్రమశిక్షణ ఉన్న టెక్నీషియన్, ఆర్టిస్టు కూడా. అనవసరపు ఫోజులు, ఈగోలు ఆయనకు లేవు. తన రూట్స్ మర్చిపోడు. వీటన్నింటినీ మించి.. హృదయం ఉన్న మనిషి లారెన్స్. ఆ హృదయమే ఆయన విజయ రహస్యం.      

2 comments:

  1. అప్పుడెప్పుడో వార్త ఆదివారం మ్యాగజైన్ లో వ్యక్తిత్వ వికాసంపై రాసిన మనోహర్, మీరు ఒకరేనా? ఒకవేళ అది మీరే అయితే, ఆ వ్యాసాలకు నా అభినందనలండి. అవి చాలా స్ఫూర్తిప్రదాయకంగా ఉండేవండి. వీలైతే వాటిని బ్లాగులో పోస్ట్ చేయకూడదూ!

    ReplyDelete
    Replies
    1. అవును. ఆ మనోహర్ నేనూ ఒకరే. మీ సజెషన్ బాగుంది. నాక్కూడా పోస్ట్ చేయాలనే ఉంది. కానీ, చాలా టైమ్ పడుతుంది వాటిని టైప్ చేయడానికి. అయినా వీలు చూసుకుని ఆ పని కూడా చేస్తాను. ఎలాగూ ఈ బ్లాగ్‌లో - పుస్తకాలు, సినిమాలు, స్పిరిచువాలిటీతోపాటు.. పర్సనల్ డెవలప్‌మెంట్ మీద కూడా కొత్తగా చాలా రాయడానికి ప్లాన్ చేసుకున్నాను. నెమ్మదిగా ప్రారంభిస్తాను. థాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్.

      Delete