Monday 28 February 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 3

"శాశ్వత శాంతి కోసం స్వల్పకాలిక విధ్వంసం కొన్నిసార్లు తప్పదు"
అన్నారెవరో. 

బహుశా ఈ పోస్ట్ 99% మంది మిత్రులకు నచ్చకపోవచ్చు. కాని, నేను రాసిన ముందు రెండు పోస్టుల్లో ఎంత నిజం ఉందో దీన్లోనూ అంతే ఉంది. కాకపోతే, కొన్ని ఒప్పుకోవడానికి మనసొప్పదు. అంతే.  

ఈ పోస్టులో నేను రాస్తున్న దాదాపు ప్రతి చిన్న అంశం ఒక రిసెర్చ్ టాపిక్‌గా ఎక్కడో అక్కడ థీసిస్‌లుగా రాయబడివుంటాయి, పుస్తకాలుగా కూడా వచ్చి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అంత చరిత్ర, నేపథ్యం ఉన్న ఈ అంశం మొత్తాన్ని ఒక బ్లాగ్ పోస్టుగానో, ఒక ఫేస్‌బుక్ పోస్టుగానో రాయటం అసాధ్యం.

ఇదంతా తెలిసినవాళ్ళు సులభంగా అర్థంచేసుకుంటారు. తెలియని మిత్రులు నన్ను క్షమించాల్సిందిగా మనవి.          

ఇవి పూర్తిగా నా వ్యూస్. అందరికీ నచ్చాలని గాని, ఒప్పుకోవాలని గాని రూలేం లేదు. థాంక్స్ ఫర్ యువర్ టైమ్...   

కట్ చేస్తే -  

కొన్ని నిమిషాల క్రితం వరకు యూక్రేన్ రాజధాని కీవ్‌లో, ఇంట్లోనే ఉన్న బంకర్లో తల దాచుకున్న నా ఫ్రెండ్ చెప్పినదాని ప్రకారం త్వరలోనే రష్యా-యూక్రేన్ మధ్య చర్చలు ప్రారంభం కావచ్చు. చర్చల వేదికాస్థలంగా పుతిన్ సూచించిన బెలారస్ జెలెన్‌స్కీకి ఇష్టంలేదు. 

బెలారస్ పూర్తిగా పుతిన్‌కు అనుకూలం కాబట్టి! 

కాని, ఈ పోస్ట్ రాస్తున్న సమయానికి శాంతి చర్చలకు రష్యా బృందం ఆల్రెడీ బెలారస్ చేరుకుంది. యూక్రేన్ బృందం దారిలో ఉంది. అంటే - యూక్రేన్ చివరికి బెలారస్‌లోనే చర్చలకు ఒప్పుకుందన్నమాట!    

యూక్రేన్-బెలారస్ సరిహద్దు ప్రాంతంలో జరుగనున్న ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చేవరకు, యూక్రేన్ మీద రష్యా కొనసాగిస్తున్న బాంబింగ్స్, ట్యాంకర్ దాడుల వేగం కొంత తగ్గవచ్చు కాని, ఆగవు.   

మరోవైపు... మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల్లో ఉన్న నా రష్యన్ ఫ్రెండ్స్‌తో కూడా ఓ 40 నిమిషాలపాటు మాట్లాడాను. 

అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో పెడుతున్న అనేకానేక ఆంక్షల వల్ల గాని, ప్రపంచంలోని ప్రెస్, సోషల్ మీడియా, కోట్లాది ప్రజలంతా పుతిన్‌ను "యుధ్ధ పిపాసి... యుధ్ధోన్మాది" అని అనుకోవడం గురించి గాని వారికేం పెద్ద టెన్షన్ లేదు. 

"ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నది... ఇప్పుడు జరిగింది. అంతే." అన్నారొక ఫ్రెండ్. 

న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌లోనూ, యూరోప్‌లోని ఇతర ఎన్నో నగరాల్లోనూ... పుతిన్‌కు, రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలు ఓకే. అది సహజం. 

కాని... ఈ దాడికి వ్యతిరేకంగా, దీన్ని నిరసిస్తూ రష్యాలోనే జరుగుతున్న ప్రదర్శనలగురించి నా రష్యన్ ఫ్రెండ్స్‌ను అడిగాను. 

"రష్యాలోని ప్రతి 10 మంది పౌరుల్లో 9 మందికి పుతిన్ అంటే అభిమానం, నమ్మకం. అది గుడ్డి నమ్మకం కాదు. గోర్బచేవ్, యెల్త్సిన్‌లు సోవియట్ యూనియన్‌ను ముక్కలు చేసి, రష్యాను మోకాళ్లమీద కూర్చొని అడుక్కునేలా చేసి వెళ్ళిపోతే... మళ్ళీ మేం ప్రపంచం ముందు తలెత్తుకొని బ్రతికేలా చేసింది పుతిన్. అందుకే మా అందరికీ పుతిన్ అంటే నమ్మకం, ఇష్టం" అన్నారు.  

రష్యాలో పుతిన్ దాడికి వ్యతిరేకంగా ఏవైతే ప్లకార్డుల ప్రదర్శనలు , ర్యాలీలు చూస్తున్నామో... అదంతా అతి స్వల్పం, నామ మాత్రం అన్నమాట. పుతిన్ అనుకుంటే, ఆ మాత్రం కూడా కనిపించకుండా చేసేవాడు కదా? 

అవును, రష్యాలో ఈ సమయానికి సోషల్ మీడియా మీద కూడా కొన్ని ఆంక్షలున్నాయి. యుధ్ధ సమయంలో అవి తప్పవు. పెద్దగా అనుకోవల్సిన విషయం కాదు. 

ఎందుకంటే గత నాలుగు రోజులుగా నేను ఈ రెండు దేశాల్లోని నా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తున్నది సోషల్ మీడియా ద్వారానే. మాకెలాంటి ఇబ్బంది కలగలేదు. వాళ్ళు ఫోటోలు పంపిస్తున్నారు, మొబైల్‌లో లైవ్ వీడియో చూపిస్తున్నారు. ఫ్రీగా మాట్లాడుతున్నారు. 

సో, ఇదంతా... మీడియా, సోషల్ మీడియా చేస్తున్న 'అతి' తప్ప మరొకటి కాదు.   

కట్ చేస్తే -   

అమెరికా, సి ఐ ఏ ల శక్తివంతమైన దీర్ఘకాలిక పథకంలో పావుగా మిఖయిల్ గోర్బచేవ్‌కు 1990 లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. గోర్బచేవ్ పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), గ్లాస్‌నస్త్ (బహిరంగత) నినాదాలు అగ్రరాజ్యంగా ఒక వెలుగు వెలిగిన సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి వేసిన పునాదులయ్యాయి. 

1991 క్రిస్టమస్ రోజు, మాస్కోలోని క్రెమ్లిన్ పైన సుత్తి-కొడవలి ఉన్న ఎర్రటి జెండా చివరిసారిగా అవనతమైంది. ఆ మర్నాడు, 26 డిసెంబర్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగ పాత్ర, సోవియట్ యూనియన్ రెండూ పూర్తిగా రద్దయ్యాయి. 

ఆ తర్వాతిరోజుల్లో రష్యాలో మనం చూసిన వందలాది దృశ్యాల్లో కేవలం రెండు దృశ్యాలను ఇక్కడ గుర్తుచేస్తున్నాను:

> మహోన్నతమైన లెనిన్ విగ్రహాన్ని నేలమీద పడేసి, బూటుకాళ్లతో తన్నుతూ ఆనందించిన రష్యన్ పౌరులు.
> ప్రతినగరంలో వేలాదిమంది రష్యన్ పౌరులు ఏరోజుకారోజు తినే బ్రెడ్ కోసం గంటలకొద్ది క్యూల్లో నిల్చొని ఉండటం.      

కట్ చేస్తే -            

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. 

ముఖ్యంగా పూర్వపు సోవియట్ యూనియన్‌లో భాగంగా... ఏళ్ల తరబడి రెండు ప్రపంచయుధ్ధాల్లో పాల్గొని, సుమారు కోటిమందికి పైగా మిలిటరీ సిబ్బందిని, కోటిన్నరకు పైగా సాధారణ పౌరుల ప్రాణాలను కోల్పోయిన ఈ రెండు దేశాల్లో మన దగ్గరున్నంత సినిమా పిచ్చి లేదు. 

కాని, మన తెలుగు సినిమాల ప్రి-రిలీజ్ కారక్రమాల్లో సినిమావాళ్ళు రొటీన్‌గా మాట్లాడే మాటల్లాంటి ఆమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో దేశాల అధినేతలు ఎప్పటికప్పుడు తనతో మాట్లాడిన మాటల్ని నిజమని నమ్మాడు జెలెన్‌స్కీ. 

అదే అతను చేసిన పెద్ద తప్పు. 

నిజానికి ఒక దశలో యూక్రేన్ రష్యాకంటే చాలా శక్తివంతమైన దేశం. పూర్వపు సోవియట్ యూనియన్‌కు సంబంధించిన కనీసం ఒక 5000 న్యూక్లియర్ ఆయుధాల్లు యూక్రేన్‌లోనే ఉండేవి. 1994లో వాటిని నిర్వీర్యం చేయడానికి బిలియన్ల డాలర్లు చెల్లించింది రష్యా. కాని, ఆ డబ్బంతా అప్పటి ప్రెసిడెంట్ యూక్రేన్ అవినీతితో అదృశ్యమైపోయింది తప్ప, యూక్రేన్ అభివృధ్ధికి ఏమాత్రం తోడ్పడలేదు. 

ఈనేపథ్యమంతా జెలెన్‌స్కీకి తెలుసు. చరిత్రంతా జెలెన్‌స్కీకి తెలుసు. ప్రస్తుతం యూక్రేన్ ఆర్థిక పరిస్థితి కూడా జెలెన్‌స్కీకి బాగా తెలుసు. కాని, అతను వీరందరి మాయలో పడిపోయాడు. ఆ మాయలోనే - ఇటీవలివరకూ కూడా జెలెన్‌స్కీ చాలా సందర్భాల్లో రష్యాను, పుతిన్‌ను చాలెంజ్ చేశాడు. తన వెనుక వీళ్లంతా ఉన్నారనుకున్నాడు.

కాని, అదంతా ఒక తెలుగు సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్ లాంటి వ్యవహారం అని తెలుసుకోలేకపోయాడు.    

వ్యూహాత్మకంగా యూక్రేన్ రష్యాకు చాలా ముఖ్యమైన దేశం. యూరోప్ నుంచి ఎవరు రష్యామీద దాడి చేయాలన్నా ముందు యూక్రేన్‌ను దాటుకొనే రావాల్సి ఉంటుంది.  

ఈ నేపథ్యంలో... రష్యా ఎప్పుడూ యూక్రేన్ తనకు మిత్ర దేశంగా ఉండాలని భావించింది. కాని, దురదృష్టవశాత్తూ... భారత్‌కు పాకిస్తాన్ ఎలాగో, రష్యాకు యూక్రేన్ అలా తయారయ్యింది. 

యూక్రేన్ తూర్పు ప్రాంతమైన దాన్‌బాస్‌లోని దొనేత్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లో రష్యన్ జాతీయులున్నారు. అప్పటివరకూ యూక్రేన్‌తో పాటు అధికార భాషగా ఉన్న రష్యన్ భాషను లిస్టులోంచి తీసేశారు. వారిమీద రెండవస్థాయి పౌరులుగా ట్రీట్‌మెంట్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వారు రెండు ప్రత్యేక దేశాలుగా విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. 

ఆ రెండు ప్రాంతాలమీద యూక్రేన్ బలగాలు కాల్పులు జరపని రోజు దాదాపు లేదంటే అతిశయోక్తి కాదు. 

ఈ నేపథ్యంలో 2014లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం దొనేత్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లో విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఒప్పందం జరిగింది. ఇంతవరకు ఆ ఒప్పందం అమలు కాలేదు. అక్కడ కాల్పులు, ఇతర రకాల విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది. 

రష్యా మాట ఇస్తే వెనక్కి పోదు. మనకు ఎన్నోసార్లు ఈ విషయంలో తనేంటో ప్రూవ్ చేసుకుంది రష్యా. యూక్రేన్‌లోని ఈ రెండు ప్రాంతాలకు కూడా అవసరమైన కీలక సహాయం కోసం మాట ఇచ్చింది రష్యా. చివరికి సమయం వచ్చింది... యూక్రేన్ మీద ఈ దాడికి ముందు, ఇప్పుడా రెండు ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ ప్రకటించించింది రష్యా.  

రెండో ప్రపంచ యుధ్ధం తర్వాత ఏర్పడిన నాటో (NATO), దాన్లోని సభ్య దేశాలన్నింటి భద్రతకు ఒక సిండికేట్ లాంటిది. తెరవెనుక దాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడించేది మాత్రం అమెరికా. 

దాని ప్రధాన లక్ష్యాల్లో మొట్టమొదటిది - రష్యాని ఏకాకిని చేయటం. మళ్ళీ అగ్రరాజ్యంగా ఎదగకుండా చేయడం.

తమ దేశ భద్రతకు విఘాతం కల్పించేలా సభ్యత్వాలను ఇంక పెంచవద్దని ఎన్ని సార్లు రష్యా నాటోతో చర్చలు జరిపినా ఎప్పుడూ కాదనలేదు నాటో.

కాని, ఎప్పుడూ తన ప్రధాన లక్ష్యం మర్చిపోలేదు. 

1997 నుంచి ఇప్పటివరకు సుమారు ఇంకో 14 దేశాలను తన కూటమిలో చేర్చుకొంది. వాటిలో పూర్వపు సోవియట్ యూనియన్‌లోని దేశాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ రష్యా సరిహద్దు వెంబడే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో యూక్రేన్ రష్యాతో మిత్ర దేశంగా ఉండటం వ్యూహాత్మకంగా తప్పనిసరి కాబట్టి, రష్యా దిగివచ్చి కనీసం రెండుసార్లు యూక్రేన్‌తో ఈ విషయంలో ఒప్పందాలు చేసుకొంది. 

ఒకటి - నాటోలో చేరకూడదు.  
రెండు - తూర్పు ప్రాంతంలోని దొనేత్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లోని రష్యన్ జాతీయుల మీద నిరంతర ఊచకోతలు మానాలని. 

ఈ రెండూ పెడచెవిని పెట్టింది యూక్రేన్. అసలు ఖాతరు చేయలేదు.

జెలెన్‌స్కీ వచ్చాక ఈ విషయంలో డ్రామా మరింత ఎక్కువైంది.  

2014 నుంచీ ఓపిక పట్టిన రష్యా, ఇప్పుడు దోన్బాస్ ప్రాంతంలోని ఆ రెండు ప్రాంతాల్లో రష్యా జాతీయులమీద నిరంతరం జరుగుతున్న ఊచకోతను సాకుగా తీసుకొంటూ, వారికిచ్చిన మాటనుంచి వెనక్కి పోలేమంటూ... ఎలాగూ తమ దేశ భద్రతకు ఏదో ఒకరోజు ఈ చర్య తప్పదు కాబట్టి నాలుగురోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొంది. 

ఈ దాడి వెనకున్న ఇంకెన్నో కారణాల్లో ఈ రెండు మాత్రం అతి ప్రధానమైనవి. 

యుధ్ధం ఎప్పుడూ విధ్వంసమే... 

అయితే, ఇప్పుడు రష్యా ఈ చర్య తీసుకోకపోతే, ఇంకొన్నేళ్ల తర్వాత ఇదే రకమైన దాడిని అమెరికా, నాటోల ప్రోత్సాహంతో  యూక్రేన్ రష్యామీద తప్పక చేసేది.

ప్రపంచమంతా ఇప్పుడు యూక్రేన్‌ను ఎలాగైతే అయ్యో పాపం అంటోందో, అప్పుడు రష్యా గురించి అనేది. అంతే తేడా. మిగిలిందంతా సేమ్ టు సేమ్.   

గోర్బచేవ్, యెల్త్సిన్ రోజులనాటి బ్రెడ్ కోసం రోడ్డెక్కిన రష్యా తన పూర్వ వైభవం తెచ్చుకొనే దిశలో అభివృధ్ధిచెందాలంటే, పుతిన్ లాంటి నాయకులవల్లనే సాధ్యమవుతుంది. అది చేసి చూపించాడు పుతిన్. ఇంకెంతో చేయాల్సి ఉంది.   

పుతిన్‌ది రాజ్య కాంక్ష కాదు. చచ్చేవరకూ ప్రెసిడెంట్‌గానే ఉండటం ద్వారా, 69 ఏళ్ళ పుతిన్, కొత్తగా ఏదో సంపాదించుకొని అనుభవించడానికి అతనికి నిజంగా సమయం లేదు. 

రష్యాకు త్వరలో తాను ప్రెసిడెంట్ కాబోతున్న విషయం తన భార్యకే చెప్పలేదు. తన కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా సరైన వ్యక్తిని డెలిగేట్ చేసి పంపించి, తను మాత్రమే ఆ సమయంలో అటెండ్ కావల్సిన ఒక ముఖ్యమైన సమావేశానికి వెళ్ళిపోయాడు. 

ఒక ప్రెసిడెంట్‌గా పుతిన్ రాజనీతి నేపథ్యంలో ఎన్నో ఆరోపణలున్నాయి. పనిచేసేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. ఏమీ చేయలేనివాళ్ళు ఇలాంటివి మాత్రమే సృష్టించే పనిలో బిజీగా ఉంటారు.

అతని జీవితం, అతని ప్రాణం కూడా అనేక కోణాల్లో అనుక్షణం అభద్రతామయమే. ఇలాంటి అనుక్షణం ప్రాణభయంతో బ్రతికే జీవితం కోసం జీవితాంతం ప్రెసిడెంట్‌గా ఉండాలనుకోరెవ్వరూ. 

హాయిగా అతనికున్న ఆస్తులు అనుభవిస్తూ, మిగిలిన కొన్నేళ్ళు అతనిమీద ఆల్రెడీ ముద్రపడిన ఒక ప్లేబాయ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యవచ్చు.    

కాని అతని లక్ష్యం, అతని ఎడిక్షన్ వేరు... 

రష్యా. రష్యన్ ప్రజలు.  

యూక్రేన్ మీద ఈ దాడి నేపథ్యంలో పుతిన్‌కు తన దేశ భద్రత ముఖ్యం. కాని, తాను అనుకున్నట్టు జరగకపోతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్నది అందరికంటే పుతిన్‌కే బాగా తెలుసు.   

అందుకే... బెలారస్‌కు తన బృందాన్ని శాంతి చర్చలకు పంపించడానికి కొద్దిసేపటిముందు, రష్యా న్యూక్లియర్ ఆయుధాల వ్యవస్థల్లో పనిచేస్తున్న ఫోర్స్‌ను పూర్తిస్థాయిలో ఎలర్ట్‌గా ఉండాలంటూ ఆదేశాలిచ్చాడు! 

యుధ్ధం ఎప్పుడూ సరైన పరిష్కారం కాదు. కాని, ఒకసారి యుధ్ధంలోకి దిగాక ఏదైనా సాధ్యమే. ఏది ఎక్కడికైనా దారితీయొచ్చు.   

Saturday 26 February 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 2

ఈ పోస్ట్ రాస్తున్న సమయానికి ఒక 45 నిమిషాల ముందు, యూక్రేన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్‌స్కీ ఒక ట్వీట్ పెట్టాడు.

తనకు కాల్స్ రావడం ప్రారంభమైందనీ... సిట్జర్లాండ్ ప్రసిడెంట్, గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇప్పుడే కాల్స్ వచ్చాయనీ... నైతికమైన సపోర్టే కాకుండా, అవసరమైన ఆయుధ సహాయం కూడా చేయడానికి ముందుకువచ్చారని ఆ ట్వీట్‌లో చెప్పాడు. 

ఎంత ఘోరమైన పరిస్థితి అంటే - యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని దేశాల అధినేతలకు, అమెరికాకు, నాటో అధికారులకు గత రెండురోజుల్లో లెక్కలేనన్ని కాల్స్ చేశాడు జెలెన్‌స్కీ.

కనీసం ఒక్కరి నుంచి కూడా అతను ఆశించిన సపోర్ట్ రాలేదు.  

ఈ ఉదయం తన దేశ ప్రజలకు జెలెన్‌స్కీ పెట్టిన రెండు మూడు చిన్న వీడియో సందేశాలను చూస్తే ఎవ్వరికైనా బాధకలుగక మానదు.

వాటి సారాంశం క్లుప్తంగా ఇది:

"యూరోపియన్ యూనియన్, అమెరికా, నాటో లకు కనీసం ఒక 30 కాల్స్ చేశాను. వారికి చెప్పాను, సజీవంగా ఇదే మీకు నా చివరి కాల్ అని!"

"యూక్రేన్ లోని చాలా ప్రాంతాలను రష్యా తన గుప్పిట్లోకి తీసుకుంది. ఇప్పుడు వారి బలగాలు రాజధానిలోకి ప్రవేశించాయి. కీవ్‌ను స్వాధీనం చేసుకోడం అంత సులభం కాదు. అందుకే, ఇప్పుడు వారి సర్వశక్తుల్నీ కేంద్రీకరిస్తారు. ఈ రాత్రి మనందరికీ చాలా పెద్ద పరీక్షా సమయం."

"పుతిన్  టార్గెట్ నంబర్ వన్ యూక్రేన్ దేశాధ్యకుడినయిన నేను. రెండవ టార్గెట్ నా కుటుంబం. నేనెక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నాను. నా పక్కనే యూక్రేన్ ప్రైమ్ మినిస్టర్, ఇతర మంత్రులున్నారు!" 

చివరి సందేశం అతనే రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో బైట్ కావడం విశేషం.

కేవలం మూడు నాలుగేళ్ల క్రితం వరకు, 2019లో కూడా... యూక్రేన్‌లో అతనొక పాపులర్ సినీ హీరో, టీవీ హీరో, కమెడియన్, డాన్సర్, స్క్రీన్ రైటర్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్.  

ఒక నాలుగేళ్ల తర్వాత... యూక్రేన్ ప్రెసిడెంట్‌గా... తన పరిస్థితి ఒకరోజు ఇలా ఉంటుందని బహుశా అతను కలలో కూడా ఊహించి ఉండడు. 

దీన్ని ఫేట్ అందామా? 

కానే కాదు. 

అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో చెప్పిన కల్లబొల్లి మాటలు విని అతను తీసుకొన్న అత్యంత దారుణమైన తప్పుడు నిర్ణయాల ఫలితం ఇది. 

పుతిన్‌కు అనుకూలంగా, పుతిన్ చెప్పినట్టు వినే తోలుబొమ్మ లాంటి అంతకు ముందటి యూక్రేన్ ప్రెసిడెంట్‌ను తుక్కుగా ఓడించించిన తన విజయం వెనుక... అమెరికా, సి ఐ ఏ ల వ్యూహం, కృషి చాలా ఉందని... బహుశా జెలెన్‌స్కీకి కూడా ముందు తెలిసే అవకాశం ఉండదు.

కట్ చేస్తే -   

యూక్రేన్ మీద రష్యా దాడి ప్రారంభమై ఇది మూడవ రోజు.

యూక్రేన్‌లో ఉన్న నా ఫ్రెండ్ ఒకరు... యుధ్ధం జరుగుతున్న ఈరోజు, ఈ సమయంలో కూడా... ఒక బాధ్యతాయుతమైన యూక్రేన్ సిటిజెన్‌గా, వాలంటరీగా... యూక్రేన్ రాజధాని కీవ్‌లోని ఒక హాస్పిటల్లో తన డ్యూటీ నిర్వహిస్తూ (అది తన వృత్తి కాదు!), నాతో చెప్పిందేంటంటే - 

"ఇంకో 48 గంటల్లో అంతా అయిపోవచ్చు. రష్యా కీవ్‌ను ఆక్రమించుకుందంటే అంతా అయిపోయినట్టే. అయితే, ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని ప్రాణాలతో పట్టుకోరు. ప్రాణాలతో వదిలిపెట్టరు. ఆయనకు ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదు." 

అవును, ఇది యుధ్ధం. ఏదైనా జరగవచ్చు. 

శాటిలైట్స్ వచ్చాయి. యాండ్రాయిడ్‌లొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది, మెటావర్స్ వచ్చింది... ఇంకేవేవో వచ్చాయి, వస్తున్నాయి. మనిషి జీవితం, జీవనశైలి ఆధునికంగా ఎంతో ఎంతో మారిపోయింది అని మనం అనుకుంటున్నాం. 

కాని, అదంతా వుట్టిదే. పచ్చి అబధ్ధం. 

వందల, వేల ఏళ్ళక్రింద రాజులు రాజ్యాలు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడూ అంతే. ప్రజాస్వామ్యం, ఎన్నికలు వంటివి అదనంగా వచ్చిన కొన్ని కొత్త అలంకరణలు, అంతే.  

ఏ దేశాధినేతకైనా, ఏ దేశానికైనా... ముందు అధికారం, ఆ తర్వాత - ఆ దేశ సంక్షేమం, అభివృధ్ధి, భద్రత ముఖ్యం. దానికోసం ఎవరైనా ఎక్కడిదాకైనా వెళ్తారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి హద్దులు ఉండవని మనం రాసుకున్న చరిత్రే చెబుతోంది.  

యూక్రేన్‌లో ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని ఊహించి అమెరికా జెలెన్‌స్కీకి నిన్ననే సమాచారం పంపింది: "మిమ్మల్నీ, మీ కుటుంబాన్ని ముందు కీవ్ నుంచి లిఫ్ట్ చేస్తాము. రెడీగా ఉండండి" అని. 

కాని, "దేశ ప్రజలతోపాటే నేను" అని అమెరికా అందించిన సహాయాన్ని తిరస్కరించాడు జెలెన్‌స్కీ. 

ఈ ఒక్క మాటతో... నిజమైన వార్ హీరోగా, వార్ టైమ్ ప్రెసిడెంట్‌గా... చరిత్రపుటల్లో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నాడు జెలెన్‌స్కీ. 

అసలు పుతిన్ ఎందుకు ఇంత విధ్వంసానికి పూనుకున్నాడు? 

రేపు నా ఇంకో బ్లాగ్ పోస్టులో...  

Friday 25 February 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 1

ఒకప్పుడు అమెరికానే వణికించిన రష్యన్ గూఢచర్య వ్యవస్థ 'కె జి బి' లో 16 ఏళ్లపాటు అత్యంత కీలకమైన అసైన్‌మెంట్స్‌లో ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేసిన చరిత్ర ఇప్పటి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు ఉంది.    

అలాగే, 'కె జి బి' లో ల్యూటినెంట్ కల్నల్ ర్యాంక్ దాకా చేరుకున్న కొద్దిమందిలో పుతిన్ ఒకరు. 

తర్వాత రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్విసెస్‌లో, ఆ తర్వాత రష్యన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కలిపి ఇంకో దశాబ్దం పాటు పనిచేశాడు. ఆ తర్వాతే, తన ఉద్యోగానికి రిజైన్ చేసి పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు పుతిన్.   

అప్పుడు అన్నేళ్లపాటు పుతిన్ 'కె జి బి'లో పనిచేసినా, ఇతర ఉన్నత స్థాయి రష్యన్ భద్రతా వ్యవస్థల్లో పనిచేసినా,  రష్యాకు ప్రెసిడెంట్ అయ్యాక ఇప్పుడు ఆ పదవిలో కదలకుండా పాతుకుపోయినా కారణం ఒక్కటే - అతనిలో దేశభక్తి. 

పుతిన్ గురించి బయట ప్రొజెక్ట్ అవుతున్నది వేరు. లోపల రష్యాలో ఆ దేశ పౌరులకు తెలిసింది, అతనిపట్ల వారికున్న అభిప్రాయం వేరు.    

ఇప్పుడు పుతిన్ వయస్సు 69.

కట్ చేస్తే - 

మరోవైపు... యూక్రేనియన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్స్‌కీ ముందు నటుడు, డాన్సర్, కమెడియన్, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా!  

ఆ తర్వాతే పొలిటీషియన్.

కనీసం ఒక డజన్ రొమాంటిక్ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాడు జెలెన్స్‌కీ.  


లవ్ ఇన్ ద బిగ్ సిటీ, లవ్ ఇన్ వేగాస్, 8 ఫస్ట్ డేట్స్ మొదలైనవి జెలెన్స్‌కీ హీరోగా నటించిన యూక్రేన్ సినిమాలు. 

డాన్సింగ్ విత్ ద స్టార్స్ అనే టీవీ డాన్స్ షోలో డాన్సర్‌గా పోటీలో పాల్గొన్నాడు. సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనే టీవీ కామెడీ షోలో కమెడియన్‌గా కూడా నటించాడు జెలెన్స్‌కీ. 

తనకున్న ఈ నేపథ్యంతోనే యూక్రేన్‌లో ఒక పాపులర్ ఫిల్మ్ ఆర్టిస్ట్‌గా పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు జెలెన్స్‌కీ. 

అన్నట్టు... జెలెన్స్‌కీ భార్య ఒలెనా కియాష్కో ఆర్కిటెక్ట్, స్క్రీన్ రైటర్ కూడా!   

ఇంకో గొప్ప విషయమేంటంటే - తను నటించిన కామెడీ సీరియల్ "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" పేరుతోనే 2018 లో పార్టీ స్థాపించి, కేవలం 3 నుంచి 4 నెలల్లోనే అప్పటివరకు ఉన్న ప్రెసిడెంట్ పిత్రో పరషెంకోను చిత్తుగా ఓడించి యూక్రేన్‌కు 6 వ ప్రెసిడెంట్ అయ్యాడు జెలెన్స్‌కీ! 

పాలిటిక్స్‌లో, "తక్కువ సమయం ఉంది .. ఇది సాధ్యం కాదు" అనుకోడానికి వీళ్లేదని చెప్పే మరొక గొప్ప ఉదాహరణ ఇది.  

ఇప్పుడు జెలెన్స్‌కీ వయస్సు 44.

కట్ చేస్తే - 

ఒకప్పటి సోవియట్ యూనియన్ ముక్కలవకముందే రష్యన్ భాషలో డిగ్రీతో సమానమైన మూడేళ్ల అడ్వాన్స్‌డ్ డిప్లొమాను ఓయూలో యూనివర్సిటీ టాపర్‌గా చదివినవాణ్ణి నేను. రష్యన్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం నాకు. 

అంత ఇష్టం ఆ భాష మీద, వాళ్ళ సాహిత్యం, సంస్కృతుల మీద నాకు కలగడానికి కారణం - నేను చిన్నప్పటినుంచీ రెగ్యులర్‌గా చదివిన సోవియట్ లాండ్, స్పుత్నిక్ పత్రికలు.

మంచి తెలుగులోకి అనువదించి, అద్భుతంగా ప్రచురితమైన ఆ మ్యాగజైన్స్, వారి కథల పుస్తకాలు, నవలలు నన్ను చిన్నప్పుడే సోవియట్ యూనియన్‌కు తిరుగులేని అభిమానిని చేశాయి. దస్తయేవ్‌స్కీ, పవుస్తోవ్‌స్కీ, గోర్కీ, పుష్కిన్, చెఖోవ్ మొదలైనవారందరి రచనలు ఎన్నో కొన్ని చదివాను.

రష్యన్ భాష నేర్చుకున్నాక నేరుగా రష్యన్‌లోనే చాలా సినిమాలు చూశాను, రష్యన్ షార్ట్ స్టోరీ కలెక్షన్స్ నాకిష్టమైనవి కొన్ని చదివాను. కొన్ని షార్ట్ స్టోరీస్ నేరుగా రష్యన్ నుంచి తెలుగులోకి అనువదించాను. అవన్నీ విపుల, ఆంధ్రజ్యోతి వీక్లీ, ఉజ్వల వంటి పత్రికల్లో పబ్లిష్ అయ్యాయప్పుడు. 

1987-88 లో ఇండియాలో సోవియట్ ఫెస్టివల్ జరిగినప్పుడు వచ్చిన వందలాది నేటివ్ రష్యన్ డెలిగేట్స్ ముందు, కోఠి వుమెన్స్ కాలేజ్ దర్బార్ హాల్లో ఒక రష్యన్ నాటిక రాసి, అందులో నటించిన బృందంలో నేనూ ఒకణ్ణి. 

ఆ సందర్భంగానే ఇండియా వచ్చిన రష్యన్ పాప్ సింగర్ అల్లా పుగచేవాను కలిసి గంట సేపు మాట్లాడాను. పుగచేవా తన ఆటోగ్రాఫ్‌తో గిఫ్ట్‌గా ఇచ్చిన తన పాప్ సాంగ్స్ క్యాసెట్టు, గ్రాంఫోన్ రికార్డ్ ఇప్పటికీ నాదగ్గర భద్రంగా ఉన్నాయి.  

నేను ఓయూలో స్టుడెంట్‌గా ఉన్నప్పుడే, తార్నాకలోని నేషనల్ జియో ఫిజిక్స్ రిసెర్చ్ సెంటర్ (NGRI) కి మిఖెయిల్ లెర్మెంతోవ్ అని రష్యన్ సైంటిస్ట్ ఒకరు వచ్చినప్పుడు అతనికి 4 రోజులపాటు ఇంటర్‌ప్రీటర్‌గా పనిచేశాను. అప్పుడు NGRI నాకిచ్చిన రోజుకి 100 రూపాయల రెమ్యూనరేషన్, సర్టిఫికేట్ నాకింకా గుర్తుంది.         

ఇప్పటికీ రష్యాలో నాకు ఆ దేశపు మిత్రులున్నారు. ఆ మధ్య నేను డైరెక్ట్ చేసిన ఒక హారర్ సినిమాలో ఒక పాట కోసం యూక్రేన్ మోడల్, డాన్సర్, నా ఫ్రెండ్ కాత్యా ఐవజోవా నటించింది.      

నా తర్వాతి సినిమాల్లో ఎలాగైనా వీలు చేసుకొని... రష్యాలో, యూక్రేన్‌లో కనీసం ఒకటి రెండు సీన్స్ అయినా షూట్ చెయ్యాలన్న లాంగ్ పెండింగ్ కోరిక కూడా ఉంది.    

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... రష్యా, యూక్రేన్ ఒకప్పుడు కలిసే ప్రపంచ యుధ్ధాల్లో పోరాటం చేశాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఈ రెండూ సోదర రాష్ట్రాలే. ఇప్పుడు దేశాలుగా మారినా... ఇక్కడా అక్కడా, రెండు దేశాల్లో, దాదాపు అందరికీ మిత్రులూ, బంధువులూ ఉన్నారు. 

దురదృష్టవశాత్తు ఇప్పుడు, ఈ రెండు దేశాలూ  శత్రు దేశాలుగా మారి, ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఉండటం అనేది అత్యంత బాధాకరం. 

ఒకప్పటి సూపర్ పవర్ 'అగ్ర రాజ్యం' సోవియట్ యూనియన్ అభిమానిగా నా ఫీలింగ్ కూడా అదే. 

ఇదే ఫీలింగ్‌తో, ఈరోజు ఉదయం నుంచీ... మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల్లో ఉన్న నా ఫ్రెండ్స్‌తో కనీసం ఓ రెండు గంటల పాటు మాట్లాడాను. యూక్రేన్‌ను ఆనుకునే ఉన్న సరిహద్దు దేశం రుమేనియాలో ఉన్న నా ఇంకో ఫ్రెండ్‌తో కూడా మాట్లాడాను.         

అయితే - మీకు బాగా బోర్ కొట్టించిన ఈ నేపథ్యంలో... అసలు యూక్రేన్ పైన పుతిన్ చేసిన ఈ దాడి ఎంతవరకు కరెక్టు అన్నది రేపు నా ఇంకో బ్లాగ్ పోస్టులో రాస్తాను. 

Wednesday 23 February 2022

ఒక దార్శనిక కార్యశీలి విజయం!

పాతాళం నుంచి శిఖరాగ్రానికి ఎగిసి ప్రవహించిన గోదావరి జలాలతో... తెలంగాణలోని 13 జిల్లాల దాహార్తిని తీరుస్తూ, 11.29 లక్షల ఎకరాల సాగుకు నీరు అందించబోతున్న 50 టిఎంసిల మల్లన్నసాగర్ జలాశయం ఒక మహాద్భుతం. 

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళదశల ఎత్తిపోతల నీటిప్రాజెక్టు - కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి కేంద్రం నుంచి ఒక్క పైసా సహకారం లేదు.

రాష్ట్రంలోని ప్రతిపక్షాల నుంచి, అభివృద్ధి నిరోధకుల నుంచి ప్రతి దశలో దీన్ని ఆపడానికి వందల కేసులు, వెయ్యి రాజకీయాలు. 

అయినాసరే, పూనుకొని, అన్నిటినీ ఎదుర్కొంటూ, ముందుకే ఉరికించి, కేవలం నాలుగేళ్ళలో ప్రాజెక్టుని పూర్తిచేసి చూపించటం అనేది నభూతో నభవిష్యతి!    

ఈ మల్లన్నసాగర్ ఇంజినీరింగ్ మహాద్భుతాన్ని నేడు జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా... తెలంగాణ ఉద్యమశక్తి, తెలంగాణ సాధకుడు, దార్శనిక కార్యశీలి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్దిక శుభాకాంక్షలు! 

ప్రాజెక్టు కోసం అహోరాత్రులు శ్రమించిన ప్రభుత్వ యంత్రాంగానికి, సిబ్బందికి, శ్రామికులకు, తెలంగాణ ప్రజలకు శుభాభినందనలు. 

ముఖ్యంగా... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కలిసివచ్చిన ఈ సందర్భానికి జయహో!!  

Tuesday 22 February 2022

బ్లాగింగ్ అంటే నాకెందుకంత ఇష్టం?

మనం ఎంత వద్దనుకొన్నా - చాలాసార్లు మనం రాసుకోకూడని, రాసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు, మరీ వ్యక్తిగతమైన కొన్ని సెన్సిటివ్ ఆలోచనలు కూడా మన బ్లాగ్ పోస్టుల్లో బాహాటంగా వచ్చేస్తుంటాయి. 

తర్వాతెప్పుడో ఒక 2, 3 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు - నేను ఇలా రాశానా? అసలు ఇదెందుకు రాశాను? ఇది రాయాల్సింది కాదు... ఇలా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని బ్లాగుల విషయంలో మరీ సిల్లీగా అనిపిస్తుంది. 

కాని - అదంతే. 

ఏం తప్పుకాదు. బ్లాగ్ ఇలాగే రాయాలని కాని, బ్లాగ్‌లో ఇవి మాత్రమే రాయాలని కాని ఎలాంటి రూల్స్ లేవు. 

మనవాళ్ళు ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? బయటివారైనా సరే, చదివి ఏమనుకుంటారో... అనే ఇలాంటి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. 

"అసలు అలాంటి ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను అసలు ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్. 

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన టూ మచ్ పర్సనల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని మరీ ఓపెన్ సెల్ఫ్ ప్రమోషన్స్!

అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మన జీవితంలోని మంచి, చెడుల గురించి... సుఖ సంతోషాల గురించీ మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చాలా ఉంటుంది. 

ఇలాంటి "ఫ్లో రైటింగ్" వల్ల శాస్త్రీయంగా చాలా లాభాలున్నాయి.  

ఈ లాభాలు పొందటం కోసం నాకు దొరికిన ఒక అద్భుత సాధనం - బ్లాగింగ్. 

అన్నిటికంటే ముందు, మనకున్న రాసే అలవాటును మర్చిపోకుండా చేస్తుంది. 

మనల్ని ఆరోగ్యంగా ఉండనిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది.

ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా, జీవిత పర్యంతం మనం ఇష్టంగా ఫీలయ్యి, అన్నీ పంచుకోగలిగిన ఒకటి రెండు అద్భుత స్నేహాలను కూడా అందిస్తుంది.  

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.”
- James Altucher

Saturday 19 February 2022

వాదనలు, తర్కాలు వృధా!

ఒక చిన్న నిర్ణయం... ఒక చిన్న కదలిక... ఫ్రీగా ఊపిరి పీల్చుకొనే స్వతంత్రం...

ఎప్పుడు, ఎలా అనేది ఇంకా అస్పష్టం. కాని, అతి త్వరలోనే ఉంటుంది. 

వరుసగా సినిమాలు చేసే పనిలో, మొట్టమొదటిసారిగా భీభత్సమైన కన్విక్షన్‌తో ఉన్నాను. ఆ దిశలో పనులు ఒక్కొక్కటీ కదులుతున్నాయి. త్వరలోనే ఆ న్యూస్ కూడా పోస్ట్ చేస్తాను.   

కట్ చేస్తే - 

నా సత్వర బాధ్యతలు, కమిట్‌మెంట్స్, లక్ష్యాల గురించి తప్ప... ఇప్పుడు ఇంక వేటి గురించీ, ఎవరి గురించీ ఆలోచించటం లేదు నేను. 

పని, పని, పని.   

చేసుకుంటూపోవడమే. 

అదే చేస్తున్నాను.

దాదాపు రెండేళ్లుగా వేధిస్తున్న కోవిడ్ ఎఫెక్ట్, కొత్త జీవితపాఠాల్ని నేర్పింది. 

అంతా మనచేతుల్లోనే ఉందనుకుంటాం. ఇంకెంతో టైమ్ ఉంది మనకు అనుకుంటాం. "మీకంత సీన్ లేదు" అని మొన్నటి ఫస్ట్, సెకండ్ వేవ్‌లు చెప్పాయి. కళ్ళముందే పిట్టల్లా రాలిపోయిన ఎందరో నాకంటే చిన్నవారి జీవితాలు, నాకు అతి దగ్గరివారి ముగిసిన జీవితాలు చెప్పాయి. 

థర్డ్ వేవ్‌కు అంత సీన్ లేదని అర్థమైంది. మొత్తానికి అంతా ఒక ముగింపుకి వచ్చినట్టుగా అర్థమవుతోంది. 

అయినా సరే  - ఇలాంటి పరిస్థితుల్లో, దేని దారి దానిదే అనుకుంటూ, జాగ్రత్తలు తీసుకొంటూ, ముందుకే వెళ్ళాలి తప్ప అసమర్థంగా ఆగిపోకూడదు. మన అసమర్థతకు... దీన్నో, ఎవరినో, ఇంకే పరిస్థితులనో సాకుగా తీసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. 

ప్రతి గంటకు, ప్రతి రోజుకూ ఎంతో కొంత ముందుకు కదలాలి. 

గడిచిపోయే సమయం మనకోసం మళ్లీ వెనక్కి రాదు. పెరుగుతున్న వయస్సు మనమేదో అర్థంలేని స్టకప్‌లో ఉన్నామని మనకోసం ఆగదు. 

బాధ్యతల విలువ ఏంటో తెలిసినవాడెవ్వడూ రోజూ ఓడిపోవాలనుకోడు. ఆ ఎడిక్షన్‌లో కొట్టుకుపోడు. దాన్ని సమర్థించుకోడానికి కారణాలు వెతుక్కోడు. 

సమయం విలువ, ప్రొడక్టివిటీ విలువ తెలిసిన పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ వ్యక్తులు మనచుట్టూ ఉన్నప్పుడు... అలాంటి పాజిటివ్‌లీ అగ్రెసివ్, ప్రొయాక్టివ్‌లీ పవర్‌ఫుల్ వ్యక్తులతో నిండిన పీర్‌గ్రూప్‌ మధ్య మనం ఉన్నప్పుడు... ఎలాంటి సమస్యలు, స్టకప్‌లు కూడా మనల్ని ఏం చేయలేవు. మనం ముందుకే కదుల్తుంటాం. 

అలా కదలటమే ఎవరికైనా కావల్సింది. అదే చాలా ముఖ్యం.

సమర్థించుకోడానికి మనం చూపే అనేక సాకులు... చేసే అనేక వాదనలు, తర్కాలు వృధా. 

When it comes to getting it done – there are no excuses. Just Fucking Do It.

ఒక దేశం అభివృద్ధిచెందాలంటే...

అది 1993 అనుకుంటాను... 

సింగపూర్‌లో, 18 ఏళ్ల ఒక అమెరికన్ టీనేజర్ స్టూడెంట్ చేసిన ఓ చిన్న నేరానికి అతన్ని జైలుకి పంపారు. ఆ కుర్రాడు చేసిన నేరం ఏంటంటే - దొంగతనంగా ఓ నాలుగయిదు కార్లకి రెడ్‌కలర్ పెయింట్‌ను స్ప్రే చేయడం!  

ఆ అమెరికన్ కుర్రాడి పేరు పీటర్ ఫే. 

పీటర్ చేసిన నేరానికి సింగపూర్ ప్రభుత్వం ఆ దేశ చట్టాల ప్రకారం 4 నెలల జైలు, సుమారు 2 వేల డాలర్ల జరిమానా, ఓ 6 బెత్తం దెబ్బల శిక్ష విధించింది.

1993-94 ల్లో ప్రపంచమంతా ఈ సంఘటనపైనే కొన్ని రోజులపాటు హెడ్‌లైన్సూ, బ్రేకింగ్ న్యూస్‌లు! అమెరికా ఈగో తట్టుకోలేకపోయింది. "ఇది చాలా అతి" అని అభివర్ణించింది అమెరికా.

చివరికి, అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సింగపూర్ గవర్నమెంటుకు ఒక లేఖ రాస్తూ, ఆ బెత్తం దెబ్బలయినా మినహాలించాలని కోరాడు. క్లింటన్ కోరికను మన్నించి, సింగపూర్ ప్రభుత్వం పీటర్ ఫే శిక్షను 6 బెత్తం దెబ్బల నుంచి 4 బెత్తం దెబ్బలకు తగ్గించింది! జైలు శిక్ష, జరిమానా మాత్రం యథాతథం!! 

దటీజ్ సింగపూర్!

సింగపూర్‌లో కనీసం త్రాగునీరు లేదు. దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో ఉన్న సహజవనరుల్లో కనీసం ఒక్క శాతం వనరులు కూడా లేవక్కడ. కాని, ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ఆ దేశ వైశాల్యం కేవలం 274 చదరపు కిలోమీటర్లు. జనాభా 54 లక్షలు. అయినాసరే, ఒక దశలో అమెరికా జీడీపీని కూడా అధిగమించింది. ప్రపంచపు 10వ ధనిక దేశంగా ఎదిగింది.  

అమెరికా అప్పులు ట్రిలియన్ డాలర్లలో ఉన్నాయి. మన దేశానికి సుమారు 541 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. సింగపూర్‌కు అసలు అప్పు అనేదే లేదు. 

సింగపూర్ ఆదాయమంతా ఎలక్ట్రానిక్స్ మెషినరీ ఎగుమతులు, టూరిజం, కోస్టల్ కార్గో నుంచి వస్తోందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 

భూవైశాల్యంలోనూ, జనాభాలోనూ, వనరుల్లోనూ మనకంటే అత్యంత కనిష్టస్థాయిలో ఉన్న సింగపూర్‌కు మనకన్నా 18 సంవత్సరాల తర్వాత 1965లో స్వాతంత్రం వచ్చింది. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆదేశపు పౌరులు గాని, పాలకులు గాని ఆకాశం నుంచి ఊడిపడ్దవాళ్ళు కాదు కదా?

సింగపూర్ తొలి ప్రధానమంత్రి లీ క్వాన్ యూ చేసిన కృషికి ఫలితం, ప్రతిరూపం ఇప్పటి సింగపూర్. మనిషి మనుగడకు, అభివృద్ధికి ఏ విధంగానూ పనికిరాని విషయాలను పక్కనపెట్టి... ఏం చేస్తే ఒక దేశం అభివృద్ధిపథంలో ముందుకు ఉరుకుతుందో అది మాత్రమే చేస్తూ, ఒక బ్లూప్రింట్ సృష్టించాడు లీ క్వాన్ యూ. లీ క్వాన్ యూ లిఖించిన ఆ బ్లూప్రింట్ పునాదులమీదే సింగపూర్ ఒక ధనికదేశంగా ఇంకా ఇంకా అభివృద్ధి సాధిస్తోంది. 

కట్ చేస్తే - 

మనదేశంలో ఉన్నన్ని సహజవనరులు, మానవవనరులు బహుశా ప్రపంచంలోని ఇంకే దేశంలోనూ లేవు. మనం వినియోగించుకోలేకపోతున్నాం.  అమెరికా వంటి దేశాల్లోని అగ్రస్థాయి కంపెనీల్లో 70 శాతం కంపెనీలను నడిపిస్తున్నది భారతీయులే అన్నది మనం రోజూ చూస్తున్నాం. అంతే కాదు - అమెరికా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అనేక కీలక పదవుల్లో ఉన్నది కూడా మన భారతీయులే, భారత సంతతివారే.     

మనకు స్వతంత్రం వచ్చి 74 ఏళ్లయినా మనం ఎందుకని ఇంకా ఒక 'అభివృధ్ధిచెందుతున్న దేశం' గానే ఉన్నాం? 

ఎందుకంటే... ఇప్పటివరకు ఢిల్లీలో ఏలినవాళ్లంతా రెండే అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు: ఒకటి వ్యక్తిగత కీర్తి కండూతి. రెండోది మనిషి మనుగడకు, అభివృద్ధికి ఏరకంగానూ ఉపయోగపడని అంశాలమీదే ఏదో ఒకరూపంలో ఎప్పటికప్పుడు అగ్గిరాజేయటం, ఆజ్యంపోయడం. 

ఒకరిద్దరెవరైనా నిజంగా ఏదైనా చేయాలని ప్రయత్నించినా, వాళ్ళు ఆధారపడి ఉన్న ఇతర రాజకీయగణం అంతా ఇదే మైండ్‌సెట్‌తో ఉన్నప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు? 

ఇప్పటివరకూ జరిగింది అదే. 

ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న ఒక లేయర్‌కి లేయరే ఎగిరిపోతే తప్ప మనదేశంలో అభివృధ్ధి సాధ్యం కాదు, మనం కూడా ఒక ధనికదేశం కాలేము. కాని, అదంత సులభంగా సాధ్యం కాదు అని నిన్నమొన్నటి పరిణామాలు కూడా మనకు సూచిస్తుండటం బాధాకరం. 

2014లో నరేంద్రమోదీ విజయం తర్వాత, ఈ దేశానికి ఆయనెంతో చేస్తాడని చాలామంది ఆశించారు. మనదేశ ప్రధానిగా నరేంద్రమోదీ అద్భుతాలు సృష్టించవచ్చునని ఆశిస్తూ నేను కూడా ఆసమయంలో ఒక బ్లాగ్ రాశాను.

"గుజరాత్ విధానసభలోకి నరేంద్రమోదీ తొలిసారిగా ప్రవేశించింది ముఖ్యమంత్రిగానే. అలాగే, పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి కూడా తొలిసారిగా మోదీ ప్రవేశించింది ఒక  ప్రధానమంత్రిగానే" అని మీడియా కూడా మోదీని ఆకాశానికెత్తింది. 

ఈ విషయంలో నిజంగా నరేంద్రమోదీది ఒక పెద్ద సక్సెస్ స్టోరీనే. కాని, దురదృష్టవశాత్తు ఈ విజయం నాణేనికి ఒక వైపే. నాణేనికి మరోవైపు, దేశంకోసం ఆయన సాధించింది దాదాపు శూన్యం.  

ఎవరికైనా సరే, పదవి సాధించడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. ఆ పదవి ఇచ్చే బలంతో, అంతకు వందరెట్లు ఈదేశం కోసం ఎంతైనా చెయ్యగలగాలి. 

కాని, గత ఎనిమిదేళ్లలో అలా జరుగలేదు. మన సహకారంతో పుట్టిన బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు కూడా కొన్ని అంశాల గణాంకాల్లో ఇప్పుడు మన దేశాన్ని బీట్ చేస్తున్నాయంటే, మనవాళ్ల పాలన ఏ దిశగా వెళ్తోందో అర్థంచేసుకోవచ్చు.    

రెండు సార్లు ఒక దేశాన్ని పరిపాలించే అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? చరిత్రలో తమ పేరు చిరస్థాయిగా ఉండిపోయేలా అనుక్షణం ప్రజలకోసం ఆలోచిస్తారు. ఇంకో వందేళ్ళయినా ఆ దేశ ప్రజల మనస్సుల్లో గుర్తుండిపోయే మంచి పనులు చేస్తారు. కాని, అలాంటివేమీ చెయ్యకుండా, తెలంగాణ ఏర్పడ్డ ఏడేండ్ల తర్వాత కూడా అదే తెలంగాణ ఏర్పాటు అంశాన్నే పట్టుకొని రోదించడం వెనుక ఆంతర్యం ఏమిటి? 

ఇందుకే కదా గత ఎనిమిదేళ్ళుగా దేశంలో అసలెలాంటి అభివృద్ధి లేదు. ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఇంకో ఎనిమిదేళ్ళు వెనక్కివెళ్ళింది. 

కేవలం 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ 'ప్రపంచపు బిజీయెస్ట్ కార్గో' నడిపిస్తూ ధనికదేశంగా కాలర్ ఎగరేస్తోంటే, 7000 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న మనదేశం మాత్రం ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తోందంటే కారణం సుస్పష్టం.      

కట్ చేస్తే - 

ఒక్క కేసీఆర్...  

ఆరు దశాబ్దాల క్రితంనాటి తెలంగాణ వేరు, ఇప్పుడు కళ్లముందు మనం చూస్తున్న తెలంగాణ వేరు అనేది స్పష్టంగా మన కళ్లముందు కనిపించేలా ఆవిష్కరిస్తున్నారు. 

తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఉండదు అన్న చోటే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. గత ఆరున్నర దశాబ్దాలుగా నీటికి నోచుకోని ఎన్నో ఊళ్ళు, గ్రామాల ప్రజలు ఇప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్ళు త్రాగుతున్నారు. 

తెలంగాణ మరొక బీహార్ అయిపోయి ఐటి మాయమైపోతుంది అన్నారు. ఊహించని స్థాయిలో ఐటి అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే తన అతిపెద్ద గ్లోబల్ ఆఫీస్ క్యాంపస్‌ను హైద్రాబాద్‌లో నిర్మించుకొంది అమెజాన్. ప్రపంచపు టాప్ టెన్ కంపెనీలన్నీ ఇప్పుడు హైద్రాబాద్‌లో ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లతో పాటు... ఇప్పుడు ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఆదిలాబాద్‌ జిల్లాకు కూడా తెలంగాణ ఐటి సామ్రాజ్యం విస్తరిస్తోంది. 

క్రిడిట్ గోస్ టు కేటీఆర్ అండ్ టీమ్... అసలు ఆయనలాంటి డైనమిక్ మంత్రి మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండు అని చాలా రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు. సాక్షాత్తు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటివారు ఈ విషయంలో కేటీఆర్‌ను సభాముఖంగా మెచ్చుకొని అభినందించారు. 

"నీరు పల్లమెరుగు" అన్న సామెత చెప్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక ఆంధ్ర నాయకుడు ఎంత ఎగతాళిగా మాట్లాడాడో మనకు తెలుసు. "నీరు వెనక్కి కూడా వెళ్తుంది, ఎత్తుకు కూడా ఎక్కి, మళ్లీ మనం కోరుకున్న అన్ని పల్లాలకు ప్రవహిస్తుంది" అని కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం నాలుగున్నరేళ్లలో విజయవంతంగా పూర్తిచేసి, నిరూపించి చూపించారు కేసీఆర్.  

మిషన్ కాకతీయ, హరితహారం, ఆసరా పెన్షన్, కల్యాణలక్ష్మి, రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు భీమా, దళితబంధు, టెక్స్‌టైల్ పార్క్, ఫార్మా సిటీ, యాదాద్రి పునర్నిర్మాణం... ఇలా చెప్పుకుంటూపోవడానికి ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ క్రిడిట్‌లో ఇంకో వంద అంశాలున్నాయి. ఇంకెన్నో రాబోతున్నాయి.        

పదవి మాత్రమే ముఖ్యం కాదు. ఆ పదవి ఇచ్చే బలం, బాధ్యతతో ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేయడం ముఖ్యం. అభివృధ్ధి-సంక్షేమం మధ్య ఈ సమతూకం పాటించే విషయంలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  

రాజకీయ పార్టీల మధ్య స్పర్థలు, విమర్శలు, రాజనీతి వ్యూహాలు ఇవన్నీ మామూలే. ఎక్కడైనా ఉంటాయి. కాని, "ప్రజల సంక్షేమం, అభివృధ్ధి వేరు. రాజకీయాల వల్ల అది ఆగిపోకూడదు. నిరంతరం కొనసాగుతూనే ఉండాలి" అని ఆలోచించగలిగిన రాజకీయ నాయకులే నిజమైన రాజకీయ నాయకులు. వారు మాత్రమే ప్రజల కోసం, దేశం కోసం ఏమైనా చేయగలుగుతారు. ఎంత త్యాగానికైనా సిధ్ధపడతారు. అలాంటివారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. 

జార్జ్ వాషింగ్‌టన్ (అమెరికా), డెంగ్ సియాపింగ్ (చైనా), లీ క్వాన్ యూ (సింగపూర్) వంటి నాయకులు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారంటే వారి కృషి అలాంటిది. ఆ స్థాయిది.

ఇప్పుడు దేశంలో అలాంటి లక్షణాలున్న ఏకైక విలక్షణ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ లాంటి సిసలైన ఉద్యమ శక్తి, నిరంతర అధ్యయనశీలి అయిన నాయకుడు ఇప్పుడు పూనుకొని దేశం కోసం కూడా చేయాల్సింది చాలా ఉంది. 

ఏదీ అంత సులభం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదని చెప్తూ ప్రపంచ చరిత్రలో, మన దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కూడా సాక్ష్యాలున్నాయి. 

***

(Published in Namasthe Telangana on 19th Feb 2022)       

Friday 18 February 2022

తప్పిపోయిన థంబ్‌నెయిల్ బ్యాచ్!

ఈమధ్య ఒక ట్రెండ్ బాగా నడుస్తోంది... 

ఒక పెద్ద డిజిటల్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే. దానిలో ఏదో ఒక న్యూస్‌పేపర్ పేజీలు చూపిస్తూ, వాటిలో కొన్ని వార్తలు చూపిస్తూ, వాటిని (చదవటం సరిగ్గా రాకపోయినా) చదువుతూ విమర్శించటం. లేదా విషం కక్కటం. 

లేదంటే - ఏదో అర్థం కాని, అర్థం లేని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తూ, దాన్ని ప్రెజెంట్ చేస్తున్నామనుకొని శునకానందపడటం. నిజానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఆర్ట్. దాని బేసిక్స్ కూడా తెలియకుండా ఏదో చేస్తున్నాం, కొలంబస్‌లా ఏదో కొత్త విషయం కనుక్కున్నాం, అదే జరగబోతోంది అని అంకెల గారడీ చూపించడం. 

ఈ రెండిటి ట్రెండు ఇప్పుడు బాగా నడుస్తోంది. 

ఈ రెండూ కాకుండా - హోదాలతో సంబంధం లేకుండా, వ్యక్తులను కూడా నోటికొచ్చినట్టు అసభ్య పదజాలం వాడుతూ, ఏవేవో ఆరోపణలలతో ప్రతిరోజూ వీడియోలను అప్‌లోడ్ చెయ్యటం అనే ఇంకో చెత్త ట్రెండ్ కూడా నడుస్తోంది. కాని, ఆ స్థాయికి కూడా వెళ్లి, దాని గురించి రాయడం నాకిష్టం లేదు. 

ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థమయ్యేదేంటంటే - వీళ్లందరినీ జాగ్రత్తగా గమనిస్తే, ఒక కామన్ లక్షణం కనిపిస్తుంది. 

అదేంటంటే... ఏదో ఒక పొడవాటి పేరున్న మానసిక వ్యాధి. వీళ్లందరినీ వేధిస్తోంది! 

ఇలాంటివారితో మాత్రమే అలాంటి వీడియోలు, వార్తలు, థంబ్‌నెయిల్స్ తయారవుతాయి. సో... ఈ పాయింటాఫ్ వ్యూలో, వీరిని ఎన్నికచేసుకొన్న 'బిహైండ్ ద సీన్స్' మేధస్సును అభినందించాల్సిందే! 

కట్ చేస్తే - 

వీరి థంబ్‌నెయిల్స్, బ్రేకింగ్ న్యూసుల్లో ఒక చిన్న ఉదాహరణ. ఇది నిన్ననే చూశాను...

"కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నీళ్ళు ఎవరికోసం... కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కోసం!" 

దీన్ని బట్టే మొత్తం అర్థం చేసుకోవచ్చు... వాళ్ల తెలివి, గిలివీ, వెనుక ఎవరు సపోర్ట్... ఏంది కథ. 

240 టిఎంసి నీటి లక్ష్యంతో, వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు "కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కు నీళ్ల కోసం" అని చెప్పే వ్యక్తికి ఏదైనా మానసిక రుగ్మత ఉంటే ఉండొచ్చు.

కాని, అలాంటి చెత్తను విని లైకులు కొట్టి, కామెంట్ చేసి, వాట్సాపుల్లో షేర్ చేసే విద్యాధికులకు కూడా అంతకంటే ఎక్కువ మానసిక రుగ్మతలు ఉండితీరాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, 60 ఏళ్లలో, తెలంగాణలో ఇప్పటివరకు నీటి తడి చూడని ప్రాంతాలకు నీరు వచ్చింది, మంచి నీళ్లకు నోచుకోని గ్రామాల్లో ఇంటింటికీ త్రాగే మంచినీళ్ళు వచ్చాయి వంటి ఎన్నో నిజాల్ని అలా పక్కనపెడదాం.

అవన్నీ వీరికి కనిపించవు. 

కాని... 

రాష్ట్రంలోని, దేశంలోని ఎన్నో మంత్రిత్వ శాఖలకు, క్లియరింగ్ వ్యవస్థలకు, ఆడిటింగ్ వ్యవస్థలకు ఈ ప్రభుత్వం ఎన్నో దశల్లో జవాబుదారి అన్నది కామన్ సెన్స్. 

ఏదో ఒక్క ఫార్మ్ హౌజ్‌కు నీళ్ల కోసం, వేల కోట్లు ఖర్చుపెడుతుంటే అవన్నీ చూస్తూ ఊరుకోవు. అవి ఎవ్వరికీ చుట్టాలు కాదు అన్నది మరింత బేసిక్ కామన్ సెన్స్. 

ఈమాత్రం కామన్ సెన్స్ లేకుండా - భారీ డిజిటల్ డిస్‌ప్లేలతో అంత భీభత్సమైన బిల్డప్పులు! 

యస్... ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా విమర్శలు చెయ్యాల్సిందే. అయితే, అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. కొంచెమైనా అర్థం ఉండాలి.   

కట్ చేస్తే - 

సోషల్ మీడియాలో 90 శాతం ఇలాంటి అర్థంలేని చెత్తనే ఉంటుంది. మిగిలిన 10 శాతంలోనే ఎంతో కొంత పనికొచ్చే విషయం ఉంటుంది. 

వ్యక్తిగతంగాను, సామాజికంగాను, వినోదపరంగాను... పనికొచ్చే ఆ 10 శాతం స్టఫ్‌ను పట్టించుకుందామా? ఇలాంటి ఏ ఎర్రగడ్డ నుంచో తప్పిపోయిన థంబ్‌నెయిల్ బ్యాచ్ ఎక్కించే 90 శాతం స్టఫ్‌ను పట్టించుకుందామా?  

Thursday 17 February 2022

డిజిటల్ యుగంలో కూడా... (7 ట్వీట్లు)

అందుకే నేను న్యూస్‌పేపర్స్‌కు నా ఆర్టికిల్స్ పంపించడానికి ఇష్టపడను. 

మనమేదో ఉత్సాహంలో హాట్-హాట్‌గా రాస్తాము. వాళ్ళు ఎప్పుడో తప్పకుండా వేస్తారు. 

వాళ్ళ పాలసీలు వాళ్లకుంటాయనుకోండి. కాని, మనం రాసిన సంతోషం మనకుండదు. ఎప్పుడో వాళ్ళు వేసేటప్పటికి దాని ప్రభావం పోతుంది. మనం మర్చేపోతాం!

***

హాయిగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశామా... హాప్పీగా ఫీలయ్యామా... అంతే!

ఇలాంటి పరిస్థితివల్ల అసలు రాయాలన్న ఉత్సాహం కూడా పోతుంది. అది అసలు ప్రమాదం. 

న్యూస్‌పేపర్స్... కనీసం "ఫలానా డేట్‌కు మీది ప్రింటవుతుంది" అని చిన్న మెసేజ్‌తో చెప్పగలగాలి. 

ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇంత అస్పష్టతా?!

***

మొన్నటి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ప్రస్తావించిన లీక్వాన్ యూ, డెంగ్ సియాపింగ్ ల గురించి ఉదాహరిస్తూ, కేసీఆర్ గారి మీద 10 రోజుల క్రితమే నేనొక ఆర్టికిల్ రాసి, పంపించాను. 

2, 3 సార్లు కాల్ చేశాను. వాళ్ల బాధలు వాళ్ళు చెప్పారు. తప్పక వేస్తున్నాం అన్నారు. వేస్తారు కూడా.

***

అంతకుముందు నావి ఎన్నో వచ్చాయి. అలా వేసుకునే స్థాయిలోనే నేను రాస్తాను.  

నిజంగానే ప్రింట్ చేస్తారు. 

కాని, ఎప్పుడు అన్నది తెలియదు. 

ఇలాంటి అస్పష్టత నాకు ఇష్టముండదు. సో, ఇకనుంచీ... ఏం చేస్తానో... నాకే తెలీదు. 🙏

***

నిజానికి దీంతో మనకు కొత్తగా వచ్చే పేరు ఏమీ ఉండదు. మరే లాభాలుండవు. పారితోషికం అసలుండదు. రాసేది కూడా వాటికోసం కాదు. 

బాధ్యతగా ఫీలయ్యి కొన్ని సార్లు, మన సంతోషం కోసం కొన్నిసార్లు ఏదేదే రాస్తుంటాం. 

***

జనరల్ నాన్సెస్‌ కోసం ఎలాగూ మన ఫేస్‌బుక్కులు, బ్లాగులున్నాయి.

ఎడిట్ పేజి స్థాయి ఆర్టికిల్స్ రాసి పోస్ట్ చేసినప్పుడే... ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కాల్ చేసి చెప్తారు... "అలా పోస్ట్ చెయ్యొద్దు. ఫలానా న్యూస్ పేపర్‌కు పంపండి. అందరికీ రీచ్ అవుద్ది కదా" అని. 

***

వారన్నది నిజం. చెప్పినట్టే చేస్తాం. మంచి ఉత్సాహంతో ఇంకోటి రాసి ఈసారి డైరెక్ట్‌గా న్యూస్‌పేపర్‌కే పంపిస్తాం.  

కాని, తర్వాత జరిగేది ఇలా వుంటుంది! 🙏🙂

Monday 14 February 2022

పుల్వమా విధ్వంసం మూలాలెక్కడ?

చాలామందికి తమకిష్టమైన నాయకుల మీద ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాని అది గుడ్డి ప్రేమ కాకూడదు. 

చరిత్రను పక్కనపెట్టే ప్రేమ, నిజాల్ని పట్టించుకోలేని ప్రేమ కాకూడదు. 

కట్ చేస్తే -

అప్పుడు భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని చితక్కొడుతోంది. అడుగడుగునా గెలుస్తూ ముందుకెళ్తోంది. ఇంకొంచెం ఓపిక పడితే పని పూర్తయ్యేది. కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకొన్న పాక్ పూర్తిగా చావుదెబ్బ తిని లొంగిపోయేది. ఆక్రమించుకొన్న కాశ్మీర్ మన అధీనంలోకి వచ్చేది. 

యుధ్ధంలో స్పష్టంగా మనదే పైచేయిగా ఉంది. మరోవైపు - అప్పటి రెండు అగ్రరాజ్యాలు అమెరికా, సోవియట్ యూనియన్ కూడా మనవైపే మాట్లాడాయి, మద్దతు పలికాయి. 

మనకు స్వతంత్రం ఇచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం పాక్ వైపు మాట్లాడింది. గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్‌ను అడ్డం పెట్టుకొని, అప్పటి ప్రధాని నెహ్రూ మీద ఒత్తిడి పెంచింది. మౌంట్ బాటన్ మాట కాదనలేకపోయాడు నెహ్రూ. 

కాశ్మీర్ సమస్యను తీసుకెళ్ళి ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడు...

కేవలం మౌంట్ బాటన్, బ్రిటిష్ గవర్నమెంట్, ప్రపంచం దృష్టిలో మంచి పేరు కోసం. 

1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఐక్యరాజ్యసమితికి పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో, ఆ రోజునుంచీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమూకలతో భూతలస్వర్గం కాశ్మీర్ ఈనాటికీ రగులుతూనే ఉంది.

1947 నుంచి, మొన్నటి 14 ఫిబ్రవరి '2019 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా, ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని ఒప్పుకోడానికి మనలో చాలామంది ఏమాత్రం ఇష్టపడకపోవచ్చు. కాని, కాశ్మీర్ విషయంలో అప్పటి తన నిర్ణయం తప్పు అని తర్వాత స్వయంగా నెహ్రూనే తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 

ఇది చరిత్ర చెప్తున్న నిజం. ఫిక్షన్ కాదు. 

ఈ నిజం చాలామందికి ఇష్టం ఉండదు. నెహ్రూ మీద, ఆ కుటుంబం మీదున్న అభిమానం అడ్డొస్తుంది. 

ఆ తర్వాత సుమారు అర్థ శతాబ్దం పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యామోహం, అధికారంలో ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఆ పార్టీ ప్రభుత్వాలు, ప్రధానులు తీసుకొన్న మరిన్ని తప్పుడు నిర్ణయాలు, రూపొందించిన పాలసీలు, చట్టాలు కాశ్మీర్‌ను ఎప్పటికప్పుడు ఒక అశాంతిమయమైన రాష్ట్రంగానే మిగిల్చాయి తప్ప ఒక పరిష్కారం దిశగా తీసుకెళ్లలేకపోయాయి.

ఫలితంగా - అప్పటి నుంచీ ఇప్పటి దాకా బలయ్యింది మాత్రం సుమారు 40 వేలమంది సైనికులు, వారి కుటుంబాలు. 

సరిగ్గా మూడేళ్ళ క్రితం నాటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ కూడా అలాంటిదే. 

ఇంకో 40 మంది వీరజవాన్ల ప్రాణ త్యాగం. 

ఊ అంటే అటు చైనా, ఇటు పాకిస్తాన్ బూచిని చూపిస్తూ ఓట్లు కొల్లగొట్టుకొని, తిరుగులేని మెజారిటీతో ఢిల్లీ గద్దెనెక్కిన నరేంద్రమోదీ కూడా ఈ ఎనిమిదేళ్లలో ఈదిశలో కూడా ఏమీ సాధించి చూపించలేకపోవడం అనేది వారి మాటలకు, చేతలకు అసలు సంబంధం లేదు అన్నది స్పష్టం చేసింది. 

శాశ్వత శాంతి కోసం స్వల్పకాలిక విధ్వంసం కొన్నిసార్లు తప్పదు. ఆ ధ్వంసరచన ఇప్పటికే జరిగి ఉండాల్సింది. అలాంటి అవకాశాలు మనకు ఎన్నోసార్లు వచ్చాయి. కాని కేవలం మాటలు, వాటివెనుక ఏమీ చేయలేని ఒక అసమర్థపు నిరాసక్తతే మనవాళ్ల నిర్ణయమైంది. ఇప్పటివరకు ఢిల్లీలో కూర్చొని ఏలినవారి రొటీన్ పాలసీ అయింది. 

ఈ రొటీన్‌ను మార్చగలిగే సత్తా ఉన్న ప్రభుత్వం, ప్రధానమంత్రి ఢిల్లీలో వచ్చినప్పుడే దశాబ్దాలుగా పట్టించుకోని ఎన్నో సమస్యలతో పాటు, ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 

ఇప్పుడు దేశంలో అలాంటి లక్షణాలున్న ఏకైక రెనగేడ్ రాజకీయ నాయకుడు ఎవరు?       

అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకే వెళ్ళాలన్న రూలేం లేదు. కాని...

ఇవ్వాటి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ప్రస్తావించిన లీక్వాన్ యూ, డెంగ్ సియాపింగ్ ల గురించి ఉదాహరిస్తూ, కేసీఆర్ గారి మీద నాలుగురోజుల క్రితమే నేనొక ఆర్టికిల్ రాశాను.

బహుశా అది త్వరలోనే ఒక న్యూస్‌పేపర్లో పబ్లిష్ కావచ్చు. 

కట్ చేస్తే -

అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకే వెళ్ళాలన్న రూలేం లేదు. అలా సాధ్యం కాదు. కాని, మన దైనందిన జెవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తున్న రాజకీయాలను తప్పకుండా పట్టించుకోవాల్సిన అవసరం మాత్రం ఇప్పుడుంది. 

నాలాంటి క్రియేటివ్ పీపుల్‌కి మరీ ఎక్కువగా ఉంది. ఎందుకు అన్నది నా తర్వాతి బ్లాగుల్లో, ఆర్టికిల్స్‌లో వివరంగా చర్చిస్తాను. 

మొన్నటివరకూ ఈ విషయంలో కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న నేను, మళ్ళీ ఈవైపు యాక్టివ్ కావడానికి వెనకున్న కారణం ఇది కూడా. 

కేసీఆర్ కంటే బెటర్ పొలిటీషియన్ తెలంగాణలో ఇంకొకరు నాకయితే కనిపించడం లేదు. ఉంటే వారే తెలంగాణ సాధించడానికి ఉద్యమించేవారు. తెలంగాణ సాధించేవారు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ చేసి చూపిస్తున్న అభివృద్ధిని గత 60 ఏళ్లలో వారే చేసి చూపించేవారు. కాని అలా జరగలేదు. కనీసం అలాంటి ఆలోచనలేదు. 

రాజకీయాల్లో ఎవరికిష్టమైన పార్టీకి వారు మద్దతునివ్వొచ్చు. ఎవరికి నచ్చిన లీడర్‌కు వారు సపోర్ట్ చేయవచ్చు. అది వ్యక్తిగతం.

కాని, "ఎవడెటన్నా పోనీ... మనం తటస్థంగా ఉందాం, తమాషా చూద్దాం" అనుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఆ నష్టం తెలంగాణకు మంచిది కాదు. 

వ్యక్తిగతంగా, ఒక తెలంగాణ పౌరుడిగా అది నాక్కూడా మంచిది కాదు. 

Sunday 13 February 2022

ఆకాశవాణి, కర్నూలు ఎఫ్ ఎం...

చిన్నప్పటినుంచే నాకు బాగా చదివే అలవాటుండేది. అదొక్కటే అప్పట్లో నాకున్న ఇష్టం, ఎడిక్షన్.

తర్వాత ఇంకో రెండు మూడు ఇలాంటి ఇష్టాలు, ఎడిక్షన్లు యాడ్ అయ్యాయి...  

చందమామ, బాలమిత్ర, సోవియట్ ల్యాండ్, స్పుత్నిక్, సాక్షి వ్యాసాలు, విశ్వనాథ, బుచ్చిబాబు, చలం, లత సాహిత్యం, యధ్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కొమ్మూరి వేణుగోపాలరావు, ఆర్కే నారాయణ్, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య వంటివారి రచనలు ఎంత బాగా చదివేవాన్నో... విశ్వప్రసాద్, మధుబాబుల డిటెక్టివ్‌లు కూడా అంతే బాగా చదివేవాన్ని. 

రమణి, రసికప్రియ, కాగడా, విజయచిత్ర, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, స్క్రీన్ పత్రికలు కూడా వదల్లేదు.    

వీటన్నిటికి పూర్తి వ్యతిరేక ధృవం అయిన కమ్యూనిస్ట్ సాహిత్యం, రష్యన్ సాహిత్యం, అరుణతార, సృజన పత్రికలు కూడా రెగ్యులర్‌గా చదివేవాణ్ణి. దీని ప్రభావమే నా మీద ఎక్కువగా ఉండి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో చేరినప్పుడు నేను ఆర్ యస్ యు (రాడికల్ స్టుడెంట్స్ యూనియన్) వైపు ఉండటానికి కారణమైంది. 

ఓయూలో పీజీలో చేరడానికి ముందు నేను ఒక మూడేళ్ళపాటు హెచ్ ఎం టి లో మెషినిస్ట్‌గా పని చేశాను. అప్పుడు - సీతాఫల్ మండి నుంచి హెచ్ ఎం టి దాకా కంపెనీ బస్‌లో వెళ్లే ఆ 45 నిమిషాల సమయంలో, బస్ ఎక్కగానే నిద్రపోకుండా, ఇంగ్లిష్ నవలలు చదవడం నాకు బాగా అలవాటయ్యింది.  

అప్పట్లో సీతాఫల్ మండి, తార్నాకాల్లో ఇంగ్లిష్ నవలలు అద్దెకిచ్చే షాపులుండేవి. రోజూ ఒకే సమయానికి వెళ్ళి, అద్దెకు నవల్స్ తెచ్చుకొని చదవటం అప్పట్లో అదొక క్రేజ్.    

సిడ్నీ షెల్డాన్, హెరాల్డ్ రాబిన్స్, ఫ్రెడ్రిక్ ఫోర్సైత్, జెఫ్రీ ఆర్చర్‌ల ఫిక్షన్ బుక్స్ దాదాపు అన్నీ నేను చదివాను అన్న విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. 

తర్వాత ఒక రెండేళ్ళు... నా ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం... నవోదయ విద్యాలయ (గుంటూరు) లో పనిచేశాను. కాని, అది రెసిడెన్షియల్ సెటప్ కాబట్టి ఎక్కువగా చదివే అవకాశం అక్కడ నాకు ఉండేది కాదు. 

అక్కడి కొలీగ్స్, స్టుడెంట్స్, పరిచయాలు, పని, సాయంత్రం మద్దిరాల వాగులో ఫిషింగ్... అదంతా వేరే ఇంకో అద్భుత జ్ఞాపకం.   

కట్ చేస్తే - 

వీటన్నిటికి దూరంగా... అప్పటివరకు నాకు తెలియని-లేదా- నేను పట్టించుకోని ప్రపంచ సాహిత్యంతో, ప్రపంచస్థాయి నో-హిపోక్రసీ సాహిత్యంతో, సీరియస్ సాహిత్యంతో నాకు బాగా పరిచయమైంది... ఆలిండియారేడియో లైబ్రరీలో!

ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ ఎం లో నేను దాదాపు ఒక పదేళ్ళు పనిచేశాను. ఆ టెన్-టూ-ఫైవ్ ఉద్యోగంలో, నాకు జస్ట్ ఒక రెండు మూడు గంటలకంటే అసలు పని ఉండేది కాదు. మిగిలిన టైమంతా లైబ్రరీలోని పుస్తకాలతో గడిపేవాణ్ణి. 

షేక్స్‌పియర్, విక్టర్ హ్యూగో, దస్తయేవ్‌స్కీ, మిల్టన్, జేన్ ఆస్టిన్, జేమ్స్ జాయ్స్, జార్జ్ ఆర్వేల్, నీషే, మిలన్ కుందేరా, కుశ్వంత్ సింగ్, సాల్మన్ రష్దీ, అగాథా క్రిస్టీ, అరుంధతీ రాయ్, నాన్సీ ఫ్రైడే, శోభా డే, డానియెల్ స్టీల్, మారియో పుజో, పావ్‌లో కోయిల్యూ, గోర్కీ, పవుస్తోవ్‌స్కీ, మార్క్ ట్వేన్, బెర్నార్డ్ షా, ఆల్బర్ట్ కామస్, ఐన్ రాండ్, రారా, కొకు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్, పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, డాక్టర్ సినారె, తాపీ ధర్మారావు వంటి ఎంతో మంది రచనల్ని నేను కర్నూల్లోనే చదివాను.

నా జీవితం మొత్తంలో నేను ఎక్కువగా పుస్తకాలను చదివింది కూడా కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే. 

థాంక్స్ టూ ఎస్ పి గోవర్ధన్ గారు... అప్పటి మా స్టేషన్ డైరెక్టర్... ఆయనకు కూడా బాగా చదివే అలవాటుండేది. వొరేషియస్ రీడర్! దాదాపు ప్రతి రెండు నెలలకొకసారి మా లైబ్రరీకి కొత్త బుక్స్ ఆర్డర్ పెడుతుండేవారు.

గోవర్ధన్ గారు నాకు ఎప్పుడూ "ఇది చదువు, అది చదువు" అని అసలేం సజెస్ట్ చేసేవాడు కాదు. కాని, ఆయన పెట్టే పుస్తకాల ఆర్డర్‌లో మాత్రం నా టేస్టును బట్టి కూడా బుక్స్ బాగానే కనిపించేవి. 

అప్పట్లో సికింద్రాబాద్ "బుక్ సెలక్షన్ సెంటర్" నుంచి మాకు రెగ్యులర్‌గా "న్యూ అరైవల్స్" క్యాటలాగ్స్ వచ్చేవి. మా సర్ నన్ను కూడా సెలక్ట్ చెయ్యమనేవారు. ఇంకేముంది... పండగే!  

స్వయంగా నేనే ఎన్ని బుక్స్ సెలక్టు చేశానో, ఎన్ని చదివానో చెప్పలేను.   

అప్పటి మా ఫార్మ్ రేడియో ఆఫీసర్ లక్ష్మి రెడ్డి గారు, మా ఎనౌన్సర్ శాస్త్రి, స్టెనోగ్రాఫర్ లక్ష్మి కూడా... అప్పుడప్పుడూ, వారి ఫ్రీ టైమ్‌లో, ఏదో ఒక పుస్తకం చదువుతుండేవారు. 

ఇంజినీరింగ్ అసిస్టెంట్ మిత్రుడు అపోలిన్ డిసౌజా మాతృభాష కొంకణి. మంగళూరు నేటివ్ కాబట్టి సహజంగానే అతనికి కన్నడ కూడా తెలుసు. కన్నడ లిపి, తెలుగు లిపి చాలా దగ్గరగా ఉంటాయి. తెలుగు లిపికి సంబంధించి డిసౌజాకు కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పాను. అంతే. తన మాతృభాష తెలుగు కాకపోయినా, తెలుగు నేర్చుకొని, దాదాపు లైబ్రరీలో ఉన్న పాపులర్ తెలుగు నవల్స్ అన్నీ చదివేశాడు!

ఇక రాయడం విషయానికొస్తే - 

యూనివర్సిటీలో స్టుడెంట్‌గా ఉన్నప్పుడే నేను రాయడం ప్రారంభించాను. బాగా అలవాటయ్యింది కూడా క్యాంపస్‌లోనే. నేను రాసినవి న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్స్‌లో అచ్చయ్యేవి. 150, 200, 250... పారితోషికం మనీయార్డర్స్ రూపంలో వచ్చేది.

అయితే - కథలు రాయడం సీరియస్‌గా ప్రారంభించిందీ, ఎక్కువగా రాసిందీ కూడా నేను కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే!   

ఆ సమయంలోనే నేను రాసిన ఒక కథ పబ్లిష్ అయినప్పుడు, అది అన్నలకు కోపం తెప్పించి, ఒక విరసం రచయిత ద్వారా నాకు మైల్డ్‌గా వార్నింగ్ పంపించేదాకా వచ్చింది. 

పబ్లిష్ అయిన నా ఇంకో కథ... నాకు మద్రాస్ నుంచి కాల్ చేయించి, సినిమారంగానికి కనెక్ట్ చేసింది. 

కర్నూల్ ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే నేను "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తం రాశాను. దానికి నంది అవార్డు ప్రకటించింది కూడా నేను అక్కడ ఉన్నప్పుడే.      

కర్నూలు ఎఫ్ ఎం లో పనిచేస్తున్నప్పుడు నేను కొన్ని ఫీచర్స్, నాటికలు కూడా రాశాను. ప్రసారం అయ్యాయి.  బహుశా ఆ స్పూల్ టేప్స్ ఇంకా అక్కడి టేప్స్ లైబ్రరీలో ఉండే ఉంటాయి. 

మొన్న డిసెంబర్‌లో బెంగుళూరు నుంచి హైద్రాబాద్‌కు కార్లో వస్తున్నప్పుడు కొన్ని గంటలు కర్నూల్లో ఆగాను. అప్పుడు నేనున్న క్రిష్ణారెడ్డి నగర్‌కు వెళ్ళి, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అప్పటి మా నైబర్స్‌ను కలిశాను. అదొక గొప్ప అనుభూతి. 

మా రేడియో స్టేషన్‌కు కూడా వెళ్లాలనుకున్నాను కాని, కుదర్లేదు. కేవలం కర్నూలు ఆలిండియా రేడియో స్టేషన్‌ను మళ్ళీ ఒకసారి తనివితీరా చూడ్డం కోసమే, ఈసారి స్పెషల్‌గా, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. 

మర్చిపోయాను... నేను కర్నూలు రేడియోలో పనిచేస్తున్నప్పుడే మా ఎనౌన్సర్ శ్యామసుందర శాస్త్రితో కలిసి, ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్‌ను మా స్టుడియోలో ఇంటర్వ్యూ చేశాను. బహుశా ఆ స్పూల్ టేప్ కూడా ఇప్పటికీ ఉండే ఉంటుందక్కడ. 

ఇలాంటి ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చిన కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎం లో నేను పనిచేసిన రోజులను గుర్తుచేసుకోడానికి కారణమైన ఇవాళ్టి "వరల్డ్ రేడియో డే" కి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? 

అప్పటి నా రేడియో కొలీగ్స్‌కు, ఇప్పుడు రేడియోలో పనిచేస్తున్నవారందరికీ... వరల్డ్ రేడియో డే సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు!        

Friday 11 February 2022

FUNDING PARTNER SUCCESS WEEK

శుక్రవారం. 

ఫిలిం ఇండస్ట్రీలో శుక్రవారానికి చాలా పవరుంది. 

వారం వారం జాతకాలు మారిపోయేరోజు. సినిమాలు రిలీజయ్యే రోజు. డబ్బులు బాగా వచ్చే రోజు.

ఏదైనా ప్రారంభించడానికి కూడా, ఇండస్ట్రీలో దాదాపు అందరూ ఒక సింటిమెంట్‌గా ప్రిఫర్ చేసే రోజు. 

11th Feb to 18th Feb' 2022. 

అంటే - ఈరోజు నుంచి, వచ్చే శుక్రవారం 18 ఫిబ్రవరి వరకు, నాతో అసోసియేట్ అయ్యే ఒక లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్ కోసం ఈ వారం మొత్తం అగ్రెసివ్ క్యాంపెయిన్ చేస్తున్నాను.

ఈ విషయంలో వంద శాతం సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది. 

ఇంతకు ముందు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి కాని, వారి టర్మ్స్ ఫిలిం ఇండస్ట్రీ బిజినెస్‌కు కుదిరేవి కావు. 

సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల కూడా కొంతైనా ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్ దొరకడం నాకు ముఖ్యం. 

ఒక అవగాహనతో ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్‌లో చాలా మంచి అవకాశాలున్నాయి. మంచి లాభాలున్నాయి.  ఓటీటీల కోసమే చేసే సినిమాలు, వెబ్ సీరీస్‌లు కూడా మంచి లాభాలనిస్తున్నాయి.

మార్చి చివరివారం, లేదా, ఏప్రిల్ మొదటివారం నుంచి షూటింగ్‌కు వెళ్లాలంటే ఇవన్నీ ఈవారంతో పూర్తిచేసుకోవాలి. సో, ఇంకా ఆలస్యం జరగకుండా ఉండటం కోసమే - నాకు నేనుగా పూర్తిగా దీనికోసం ఒక్క వారం సమయం పెట్టుకున్నాను.

ఈనెల 18 శుక్రవారం నాటికి కనీసం ఒక్క డీల్ అయినా పాజిటివ్‌గా క్లోజ్ చేయబోతున్నాను. 

ఈ ప్రపోజల్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఈ లింక్‌లో చదవ్వొచ్చు:  

https://nagnachitram.blogspot.com/2022/02/blog-post.html    

మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ విషయంలో నాకు 3 విధాలుగా సహాయపడవచ్చు:

1. ఆసక్తి వుంటే మీరే, మీకు వీలైన చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో ఫండింగ్ పార్ట్‌నర్‌గా నాతో అసోసియేట్ అయిపోవచ్చు. 

2. మీకు తెలిసినవారిలో ఈవైపు ఆసక్తి ఉన్నవారికి... లేదా, ఈ పని చేసిపెట్టగల సమర్థులైన మీడియేటర్లకు ఈ లింక్‌ను ఫార్వార్డ్ చేయడం ద్వారా కూడా మీరు నాకు సహాయపడవచ్చు.

3. మీరే స్వయంగా ఎవరైనా ఇన్వెస్టర్‌ను కనెక్ట్ చేసి, డీల్ సక్సెస్ చేయవచ్చు. మీకు అఫీషియల్ కమిషన్ ఉంటుంది. తెరపైన మీ పేరుకొక థాంక్స్ కార్డ్ కూడా గ్యారంటీ. 

Thanks in advance.    

ఈ విషయంలో వేగంగా, పాజిటివ్‌గా పని పూర్తికావడానికి మీ విలువైన సలహాలకు స్వాగతం.

Whatsapp & Call: +91 9989578125

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ వందనాలు.  

మీ,

Wednesday 9 February 2022

ఎమ్మే-పీహెచ్‌డీలు చదివిన వ్యక్తులు కూడా...

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. 

ఒక్క దేవుడనే కాదు... ఏ విషయంలో ఐనా అంతే. 

మనం కన్వీనియెంట్‌గా ఫీలైన విషయాలతోనే మనం కనెక్ట్ అవుతాం. మనుషుల విషయంలో కూడా అంతే. మనం కంఫర్ట్‌గా ఫీలైన వ్యక్తులే ఎక్కువగా మన జీవితంలో ఉంటారు. 

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు! 

అంటే - అందులో ఏదో ఆనందమో, ఓదార్పో, ఇంకేదో మనకు అవసరమైన పాజిటివ్ ఫీలింగో ఉంది.  

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి. అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్. 

కట్ చేస్తే - 

ప్రపంచంలోని చాలా అభివృధ్ధిచెందిన దేశాల్లో - మతం గురించి పెద్దగా పట్టించుకోవడం అనేది అత్యంత వేగంగా తగ్గిపోతోంది. 

ఈమధ్యే నేను ఎక్కడో చదివిన ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం - అత్యధికశాతం అభివృధ్ధి చెందిన దేశాల్లో మతాన్ని పట్టించుకొనేవారి సంఖ్య సరాసరి 40 శాతానికి పడిపోయింది అంటే నమ్మశక్యం కాదు. (It was also tweeted by: @ValaAfshar, Boston, couple of months back.).   

మనం గమనించాల్సిన ఇంకో నిజం ఏంటంటే - మతం నేపథ్యంలో ఇప్పటికీ గొడవల్లో ఉన్న దేశాల్లో, దాదాపు అన్ని దేశాలు అన్నివిధాలుగా వెనుకబడి ఉన్నవే. ఇంకా వెనక్కిపోతున్నవే.  

మతం ఒక నమ్మకం. పూర్తిగా వ్యక్తిగతం. 

అది మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే సాధనం కావాలి కాని, ఇంకొకరిని బాధించే ఆయుధం కాకూడదు. 

దురదృష్టవశాత్తు, మన చుట్టూ జరుగుతున్నది మాత్రం అలా లేదు. 

నాకు వ్యక్తిగతంగా తెలిసిన కొందరు ఎమ్మే-పీహెచ్‌డీలు చదివిన వ్యక్తులు కూడా కనీసం ప్రాథమికస్థాయి ఆలోచన లేకుండా, చాలా గుడ్డిగా, ఏవేవో వాట్సాప్ మెసేజ్‌లు ఫార్వార్డ్ చేస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. 

ఇలాంటివి కళ్ళముందు చూస్తుంటేనే అనిపిస్తుంది... మన దేశానికి ఫ్రీడం వచ్చి 74 ఏళ్ళు దాటినా, మనం ఇంకా ఒక 'అభివృధ్ధి చెందుతున్న దేశం' గానే ఉన్నామంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు.          

Monday 7 February 2022

మిస్టర్ ప్రవచన్!

ఒక మీటింగ్ కోసం వెయిట్ చేస్తూ, ఇంకో గంట టైమ్ పడుతుందని తెలిసి, నేనూ నా మిత్రుడు రోడ్డుమీద అలా నడవసాగాం. 

పక్కనే ఉన్న ఆడిటోరియం దగ్గర - అడ్డంగా ఉన్న మైకు రాడ్డు పట్టుకున్న ఒక పెద్దమనిషి ఫోటోతో ఒక ఫ్లెక్సీ బ్యానర్ కనిపించింది.

'కొంపమునిగిందిరా అయ్యా' అనుకున్నాను. 

మావాడు ప్రవచనాల బ్యాచ్... చూసేశాడు. అంతే.

కట్ చేస్తే - 

కిక్కిరిసివున్న ఒక హాల్లోకి నన్ను దాదాపు లాక్కెళ్ళాడు నా మిత్రుడు. 

మావాడితో ఇలాంటి అనుభవాలు నాకు ఇంతకు ముందు కూడా ఉన్నాయి కాబట్టి, నేను చెయ్యగలిగింది ఇంక ఏం లేక, మావాడి పక్కనే కూర్చున్నాను. 

వాడు ప్రవచనాల్లో లీనమైపోయాడు. నేను ఏం తోచక - ఎవరెవరొచ్చారు, ఎలాంటివారొచ్చారు, ఏ వయస్సువాళ్లెక్కువున్నారు గట్రా స్టడీ చేయసాగాను. 

నేను ఇష్టపడే 'ఫేసినేటింగ్ సెగ్మెంట్' అక్కడ ఒక్కరు కూడా కనిపించలేదు. కొంచెం సంతోషమేసింది. 

వాళ్లకు కూడా ఇలాంటివి అంటుకుంటే ఇంక మన నిత్యజీవితంలో ఎట్రాక్షన్ ఏం మిగుల్తుంది?  

ఏమైనా, ఈ సాయంత్రం నా టైమ్ ఇలా వృధా అవుతున్నందుకు మాత్రం కాస్త బాధ అనిపించింది.

సరే, పక్కన నా మిత్రుడు మైకులో మాట్లాడుతున్న ఆ పెద్దమనిషి మాటల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి, వాడి ఆనందం కోసం నేనూ అలాగే కూర్చుని అడ్జస్టయిపోయాను. 

ఏదైనా మితిమీరితే చీప్ అయిపోతుంది. ఈయన ఉపదేశాలు నా బచ్‌పన్ నుంచి చూస్తున్నాను. నా అంచనా ప్రకారం - ఆయన బుర్రలో ఉన్న ఆ కంటెంట్ ఎప్పుడో స్టాగ్నేట్ అయిపోయింది. 

తన ఎదురుగా కూర్చున్న అమాయక ప్రాణులను ప్రతి రెండో వాక్యానికి నవ్వించాలి కాబట్టి... ఈ మధ్య ఊ అంటే సినిమాలు, ఉ ఊ అంటే సినిమావాళ్ల ఉదాహరణలు తీసుకొని, నాన్-స్టాప్‌గా ఉపన్యాసాలు బాగా దంచికొడుతున్నాడు. 

జీవితంలో ఏదో జరిగిపోద్ది, ఏమో అయిపోతాం అని వచ్చి, అక్కడ ఆయన ఎదురుగా కూర్చొనే ఆ అమాయక ప్రాణులకు కూడా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుందనుకుంటాను. అలవాటైపోయారు. 

వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, అనేక ఉద్గ్రంధాలు, వాటి సారం, సారాంశం... అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆయనకు ప్రవచనాలంటే జస్ట్ ఏదో ఒక ముచ్చట చెప్పి నవ్వించామా లేదా అన్నదే పాయింట్. 

ఇంకా చెప్పాలంటే - ఊళ్ళల్లో పనిలేనోళ్ళంతా ఓ రచ్చబండ దగ్గర చేరినప్పుడు, వాళ్ళల్లో కొంచెం నాన్-స్టాప్ అతివాగుడు ఉన్నోడు ఏదో ఒక చెత్త చెప్తూనే ఉంటాడు... చుట్టూ చేరినవాళ్ళు ఆ చెత్తను ఎంజాయ్ చేస్తూ వింటూనే ఉంటారు...  అది అంతకు ముందు పది సార్లు చెప్పిందైనా సరే! 

ఈ మేధావి పుణ్యమా అని ఒక మంచి కార్యక్రమం చివరికి ఇలా తయారైంది. 

ప్రభుత్వం ఈయన సేవలకు మెచ్చి ఏదో గుర్తింపు కూడా ఇచ్చినట్టుంది ఈమధ్యే.

ఇలా ఆలోచించుకొంటూ, ఎప్పుడు లేద్దామా అని టైమ్ చూసుకుంటున్నాను. ఇంతలో మిస్టర్ మహోపన్యాసకుడు తన పిట్టకథల మధ్య కొత్తగా ఇంకో సినిమా టాపిక్ తెచ్చాడు. 

ఈసారి - బాలీవుడ్‌లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యి, వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమాను ఒకదాన్ని పిక్ చేశాడు మిస్టర్ టైమ్‌పాస్. 

ఆయన సువచనాల ప్రకారం ఆ సినిమా సినిమా కాదు... సినిమా అలా తీయకూడదు... విలన్‌ను హీరో చేయడమేంటి?..."తగ్గేదేలే" అని ఆ హీరోకు ఆ డైలాగ్ ఎట్లా పెడతారసలు?... ఆ హీరో, ఆ డైరెక్టర్ నాకు కనిపిస్తే చెప్తాను ఉండండి... అంటూ మిస్టర్ పూనకం అయిపోయాడు.   

అమాయక భక్తులు నవ్వులే నవ్వులు. 

మిషన్ ఎకంప్లిష్‌డ్!... మిస్టర్ వాగ్గాయ్‌లో పిచ్చి సంతృప్తి!! 

పక్కకి తిరిగి చూశాను. ఆయన డైహార్డ్ ఫ్యాన్ అయిన నా ఫ్రెండ్ నవ్వటం లేదు, ఆశ్చర్యంగా!

నేను వాడినే చూస్తున్నది చూసి, మరింత సీరియస్ అయిపోతూ లేచాడు. 

ఇద్దరం బయటకు నడిచాం.    

"ఏంట్రా తొందరగా లేచావ్... ఇంకో అరగంటుందిగా?!" నా మిత్రున్ని అడిగాన్నేను.

"ఆ తొక్కలే... ఆయనేంట్రా సినిమాలెట్లా తియ్యాలో చెప్తున్నాడు?" 

"గొర్రెల్లా మనం వినటానికి రెడీగా ఉంటే, ప్రతివాడూ చెప్పేవాడేగా!... ఆ లిస్టులో ఈయన కూడా చేరిపోయాడు" అన్నాను. 

"ఆల్రెడీ ఏ వర్గం ఏమనుకుంటుందో, ఎవడు ఏ కేసు పెడ్తాడో అని సినిమాలకు కథలు రాసుకోడానికి చస్తున్నాం... టైటిల్ పెట్టుకోడానికీ చస్తున్నాం!... ఇప్పుడీయనొచ్చి హీరో ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఆడికి ఏ డైలాగ్ ఉండాలో, ఏ డైలాగ్ ఉండకూడదో చెప్తున్నాడు!... ఎట్లా చచ్చేదిరా వీళ్లతో?!"      

"అంటే మనం, మన ప్రొడ్యూసర్లు ఇల్లూ-జాగలు అమ్ముకొని, అప్పులు చేసి డబ్బు తెచ్చుకొని... ఈయన దగ్గరకెళ్ళి, "సినిమా ఎలా తీయమంటారు" అని, ఈయన సలహా తీసుకొని, సినిమాలు తీయాలా ఇకనుంచీ?!" 

"అలాగే ఉంది" అన్నాను. 

నన్ను కిందామీదా కోపంగా చూశాడు మావాడు... అదేదో నేనే మిస్టర్ ప్రవచన్ అన్నట్టుగా.

"ముందు కొంచెం బానే ఉండేది ఈయన చెప్పేది. పోను పోను మన డైరెక్టర్స్ స్టాగ్నేట్ అయినట్టు, ఈయన కూడా స్టాగ్నేట్ అయిపోయాడు" అన్నాన్నేను. 

"స్టాగ్నేట్ అయిపోతే మాత్రం... మనమే దొరికామా?! ఏ పాలిటిక్సో, క్రికెట్టో తీసుకోవచ్చుగా ఏదో ఓ సొల్లు చెప్పి నవ్వించడానికి?!" దాదాపు అరిచినంత పని చేశాడు మావాడు. 

"అవును" అన్నాను, ఇంకేమనాలో తోచక.  

"అంటే... ఈయన థియరీ ఆఫ్ ప్రవచన్స్ ప్రకారం... సినిమా పుట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా... దాదాపు ఏ ఒక్క సినిమా రిలీజ్ కావడానికి వీళ్లేదు కదరా?!" తను ఆల్రెడీ ఓ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అన్న విషయం మర్చిపోయి, అమాయకంగా లాజిక్ మాట్లాడాడు మావాడు. 

"అంతే కదరా" నేనూ అన్నాను.

"అంతే మరి... హీరో లాంటి విలన్ లేకుండా, విలన్ లాంటి హీరో లేకుండా... అసలు హీరో విలనా, విలన్ హీరోనా అన్న కన్‌ఫ్యూజనే లేని హీరోలు విలన్లు లేకుండా... ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సినిమాలు తీశారా?... వాళ్ళకు ఊతపదాలు, పంచ్ డైలాగుల్లేకుండా సినిమాలు ఎప్పుడైనా ఆడినయా?" ఆవేశంతో ఊగిపోతున్నాడు మావాడు. 

"కరెక్టే" అన్నాను వినిపించీ వినిపించనట్టు. 

"ఇంకా నయం... అప్పట్లోనే ఈయనుంటే - వాల్మీకి, వ్యాసుడు, నన్నయ్య, తిక్కన్న, పెద్దన్న... అసలు వీళ్లంతా ఏమైపోయేవాళ్ళురా?" 

"ఏమైపోయేవాళ్ళు?"  

"వాళ్ళు ఆ తాళపత్రాలు బయటికి తీసెటోళ్లు కాదు, ఆ గంటం పట్టుకొని ఏం రాసెటోళ్ళు కూడా కాదు!.... ఇంక ఈయనే గాని అప్పట్లో లండన్‌లో పుట్టుంటేనా... షేక్స్‌పియర్ అనే పేరే వినెటోళ్లం కాదు!!... అసలు లిట్రేచర్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే ఉండేది కాదు" ఊగిపోతున్నాడు మావాడు.

"మరీ అంత తీసెయ్యకురా... నీ ఫేవరేట్ గురువు, మొన్నీ మధ్యే ధర్మశ్రీ కూడా వచ్చింది..." అంటూ ఏదో లైటర్వీన్‌లో వాడి ఆవేశం తగ్గించబోయాను. 

"చాల్లే... రేపు ఆ సినిమా 2.0 'ద రూల్' కథాచర్చల్లో, రోజూ ఈయన్ని గుర్తుకుతెచ్చుకొని తిట్టుకోవాల్సిందేగా పాపం ఆ డైరెక్టరూ, ఆయన టీమ్!?" ఆవేశంతో ఊగిపోతున్నాడు నా ఫ్రెండు.  

"ఒక్క ఆ డైరెక్టరే కాదు... అందరు డైరెక్టర్లూ అంతే! స్టోరీ సిట్టింగ్స్‌లో ఈయన్ని రోజూ గుర్తుకుతెచ్చుకుంటారు... 'మిస్టర్ ప్రవచన్ దీనికేమంటాడో, దానికేమంటాడో' అని!" నవ్వాన్నేను.  

"అరేయ్... నువ్వట్లా నవ్వి, నాకింకా ఎక్కియ్యకురా బై! నాకసలే మండుతోంది" అని వార్నింగ్ ఇస్తూ ఓ పక్కకెళ్ళి, జేబులోంచి క్లాసిక్ మైల్డ్స్ బయటికి తీసి వెలిగించాడు నా ఫ్రెండు. 

గట్టిగా ఒక పఫ్ పీల్చి, మెల్లిగా అలా రెండు రింగులు వదిలాడు. 

తర్వాత, కాసేపు పఫ్ మీద పఫ్‌ గుంజాక..."ఉఫ్" అని నిట్టూర్చి కొంచెం రిలీఫ్ ఫీలైపోతూ, మళ్ళీ నావైపు చూశాడు. 

"రెండేళ్ళ కరోనా లాక్‌డౌన్ల స్టకప్ తర్వాత... ఏదో ఇంక రెగ్యులర్‌గా సినిమాలు చేద్దాం అనుకొంటూ నానా తిప్పలు పడుతుంటే... ఇట్టాంటోళ్ళు బయదేరారేంట్రా?" అన్నాడు వాడు.  

వాడి బాధలో న్యాయముందనిపించింది నాకు. 

సడెన్‌గా వాడి మైండ్‌లో ఏం మెరిసిందో... ఉన్నట్టుండి టక్కున పైకి ఆకాశంలోకి చూశాడు.

ఏముందా అక్కడ అని, నేనూ పైకి చూశాను. 

"ఇప్పుడు... ఈయన కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ప్రవచన్స్ ప్రకారం... అక్కడ చచ్చి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ 'దానవీర శూర కర్ణ' సినిమా తీసినందుకు ఏమైపోవాలి? విలన్ దుర్యోధనున్ని హీరోగా చేసి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినందుకు ఇంకేమైపోవాలి? ఆ దుర్యోధనునికి "అయ్యారే" అని డైలాగ్ పెట్టిన పాపానికి ఎంత బాధపడాలి?... అదే దుర్యోధనునికి 'చిత్రం, భలారే విచిత్రం' అని ఒక డ్యూయెట్ కూడా పెట్టినందుకు ఇంకెంత కుమిలిపోవాలి?!" 

తన డౌటనుమానాన్ని పైకే అనేసి, అలాగే పైకి చూస్తూ పఫ్ మీద పఫ్ లాగుతున్నాడు నా ఫ్రెండు.

వాడికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక... నా జీన్స్ ప్యాంటు రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని, అలా నడుస్తూ ముందుకెళ్ళిపోయాను. 

***

డిస్‌క్లెయిమర్:
ఈ కథానిక ఎవ్వర్నీ ఉద్దేశించి గాని, దృష్టిలో పెట్టుకొని గాని రాసింది కాదు. పూర్తిగా కల్పితం. 
- మనోహర్ చిమ్మని

నా మొదటి సినిమా లేటెస్ట్ జ్ఞాపకం!

మొదటి సినిమా అంటే ఎవరికైనా కొంచెం ఎక్కువ మమకారం ఉంటుంది. నాకు మరీ ఎక్కువ. ఎందుకంటే - దానితో నాకున్న జ్ఞాపకాలు అలాంటివి.  

4 జూన్ 2004 నాడు, అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంతటా భారీగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నాకు మంచి పేరు తెచ్చింది. ఇండస్ట్రీలో కొన్ని మంచి పరిచయాలు పెరిగాయి. అదంతా ఓకే. 

నాకూ, మా ప్రొడ్యూసర్‌కూ అది మొదటి సినిమా. మా టీమ్‌లో నాతో పనిచేసిన సీనియర్లు ఒకరిద్దరు మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. 

అతి పెద్ద పొరపాటు ఏంటంటే, ఆ సినిమా కాపీ ఫిలిం ప్రింట్ కాని, బేటా టేప్స్ కాని మేము ఒక్క కాపీ కూడా మాతో పెట్టుకోలేదు. ప్రొడ్యూసర్ దగ్గర బేటా టేప్స్ ఉన్నాయనుకున్నాను. అక్కడ కూడా లేవు. 

జెమిని చానెల్లో 100+ సార్లు వచ్చినప్పుడు కూడా కనీసం రికార్డు చేసుకోలేదు. 

ఇప్పటికీ తరచూ జెమినీలో వస్తోంది. కాని, రికార్డ్ చెయ్యలేను. అదో పెద్ద పని. 

రియల్ ఎస్టేట్ లాగా, మా సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఎవరో 'థర్డ్ పార్టీ' అప్పట్లోనే ఇద్దరికి అమ్మారట! ఆ ఇష్యూ ఇంకా తెగలేదు. తెగదు. 

అందుకని మా సినిమా డీవీడీలు మార్కెట్లోకి రాలేదు. ఈ ఇష్యూ వల్లనేనేమో, మా సినిమా యూట్యూబ్‌లోకి కూడా అప్‌లోడ్ కాలేదు.  

అప్పట్లో ఒకసారి నా మిత్రుడు, నటుడు దశరథ్ జెమిని వాళ్లకు కాల్ చేసి స్పెషల్‌గా ఈ సినిమా టెలికాస్ట్ చేయించాడు... రికార్డ్ చేద్దామని. 

సినిమా టెలికాస్ట్ అయింది. ఎక్కడో బళ్ళారిలో రికార్డ్ చేశారు. ఎందుకో మాకు మాత్రం కాపీ రాలేదు. కారణం నా మిత్రుడికి కూడా తెలీదనుకుంటాను.         

కట్ చేస్తే - 

మొన్నొక రోజు పాత డీవీడీలు తిరగేస్తుంటే 'క్యామ్ ప్రింట్' అని మాత్రం రాసి ఉన్న ఒక కవర్ కనిపించింది.    

ప్లే చేసి చూశాను.

అది, నా మొదటి సినిమా... కల.  

ఆ సినిమా విడుదలైన మొదట్లో ఒకసారి సారథిలో ఎవరికోసమో వేసినప్పుడు పక్కనుంచి ఈ ప్రింట్ కూడా తీశారని తర్వాతెప్పుడో ఎవరో అంటూంటే విన్నాను. ఆ డీవీడీలు నాదగ్గరికి ఎలా వచ్చాయో నాకు తెలీదు. 

క్యామ్ ప్రింట్ కదా... క్లారిటీ లేదు. అయినా సరే, మొత్తానికి ఒకటంటూ అవశేషం దొరికింది.

నాలుగు పార్ట్‌లు గా ఉంది. దాన్ని ఒకే ఫైల్ చెయ్యమని ఇప్పుడే పంపాను.

బిగ్ కొశ్చన్ ఏంటంటే, రైటర్-డైరెక్టర్‌గా ఇప్పుడు నా మొదటి సినిమా క్యామ్ ప్రింట్‌ను నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చట్టరీత్యా నేరమా?  

అయితే అయింది. మీరంతా ఉన్నారుగా... నాకేమన్నా అయితే బయటికి తేవడానికి!😊   

Friday 4 February 2022

When Politics Decides Your Future...

రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సెన్సేషనల్ ప్రెస్‌మీట్ చూసిన తర్వాత వెంటనే ఏదో ఒక పోస్ట్ పెట్టాలనిపించింది.

కాని, ఎందుకో ఆ పని వెంటనే చేయలేకపోయాను. 

ఈమధ్య న్యూస్‌పేపర్ల ఎడిట్ పేజేలకు పొలిటికల్ ఆర్టికిల్స్ గాని, సోషల్ మీడియాలో పొలిటికల్ పోస్టులుగానీ అసలు రాయటం లేదు నేను. 

గత కొంతకాలంగా ప్రొఫెషనల్‌గా ఒక నమ్మశక్యం కాని స్టకప్‌లో ఉండిపోయి, ఊపిరాడని స్ట్రెస్‌లో గిలగిలా కొట్టుకొంటూ చాలా పనులు చేస్తున్నాను. దానికి తోడు, కరోనా కూడా ఇంకో రెండేళ్ళు మింగేసింది. 

కొంచెం ఫ్రీ అయి, ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ ప్రారంభించి, ఫ్రీ మైండ్‌తో మళ్ళీ ఈవైపు పూర్తిస్థాయిలో వద్దామనుకొన్నాను. అందుకే పొలిటికల్ కంటెంట్ ఏదీ ఈమధ్య అసలు రాయలేదు నేను. 

అయితే - మొన్నటి తన ప్రెస్‌మీట్ ద్వారా కేసీఆర్ గారు ఒక చాలెంజ్ విసిరినట్టనిపించింది... "రాయకుండా ఉండగలవా?" అని.

కట్ చేస్తే - 

రాత్రికి రాత్రే లేచి కూర్చొని సింగిల్ ఫ్లోలో ఓ ఆర్టికిల్ రాసేసి పడుకొన్నాను. మధ్యాహ్నం ఎప్పుడో నా ఫేస్‌బుక్ వాల్ మీద పోస్ట్ చేశాను. కొన్ని గంటల తేడాతో, అదే వ్యాసం ఇవాళ నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయ్యింది. 

ఆర్టికిల్‌ను మెచ్చుకొంటూ సౌతాఫ్రికా నుంచి, యూయస్ నుంచి, యూకే నుంచి, ఢిల్లీ నుంచి, జైపూర్ నుంచి, ఔరంగాబాద్ నుంచి, షోలాపూర్ నుంచి, ఏపీలోని కొన్ని జిల్లాల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి కాల్స్ వచ్చాయి. లోకల్‌గా హైద్రాబాద్, వరంగల్ నుంచి కూడా... నేను ఊహించని కొందరు పెద్దవారి నుంచి, అంతకుముందు నాకెప్పుడూ వ్యక్తిగతంగా పరిచయం లేని ఇంకొందరు స్పెషల్ పీపుల్ నుంచి, తెలిసిన మిత్రులనుంచి... "చాలా బాగా రాశావు" అంటూ అభినందనలు వచ్చాయి. 

Credit goes to KCR!

వివిధ కారణాల వల్ల వీరిలో చాలామంది పేర్లు ఇక్కడ నేను ప్రస్తావించడం సాధ్యం కాదు. సో, నేనా పని చేయటం లేదు.  

అయితే - మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మిత్రులు, 78 ఏళ్ల వెటరన్ ఒకరు మిర్యాలగూడ నుంచి కాల్ చేసి నాతో ఒక 20 నిమిషాలు మాట్లాడ్దం ఒక గొప్ప అనుభూతి. అలాగే, కరీంనగర్ నుంచి ఒక రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి కాల్ చేసి మాట్లాడ్డం నన్ను బాగా ఇన్‌స్పయిర్ చేసింది. 

వీరందరికీ కేసీఆర్ గారి తర్వాతి స్టెప్ పట్ల ఒక క్లియర్ విజన్ ఉంది. అది నాకు బాగా నచ్చింది.

అందరికీ ధన్యవాదాలు. 

పనులు పనులే. సినిమాలు సినిమాలే. 

మెడమీదున్న ఒకటీఅరా ప్రొఫెషనల్ టెన్షన్స్ నుంచి కూడా చాలా చాలా త్వరలో ఫ్రీ అవదల్చుకున్నాను. అవుతాను. 

Mission will continue till the goal is reached. 

రాస్తూ ఉంటాను. 

ఎందుకంటే - కేసీఆర్ గురించి రాస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా!

Thursday 3 February 2022

ఒక్క కేసీఆర్, వంద వ్యూహాలు!

అమెరికాలోని సి ఐ ఏ వంటి సంస్థల దగ్గర 5, 10, 20, 25... ఆఖరికి 100 సంవత్సరాల ప్లాన్స్ కూడా ఉంటాయట! 

అమెరికాలో పార్టీలు, ప్రభుత్వాలు మారతాయి. కాని, ఈ ప్లాన్స్ మారవు. పార్టీలకతీతంగా - దేశం, దేశ భద్రత, దేశాభివృద్ధి వారికి అన్నిటికన్నా ప్రధానం. 

అంతే కాదు. ప్రపంచ రాజకీయపటం పైన ఒక పెద్దన్నగా, ఒక గాడ్‌ఫాదర్‌గా అమెరికా పవర్ ఏ స్థాయిలో ఉంటుందో, ఏ స్థాయిలో ఉండాలో కూడా సి ఐ ఏ రూపొందించే ఈ ప్లాన్స్ నిర్దేశిస్తాయి. 
   
ఒకనాటి సూపర్ పవర్స్‌లో ఒకటైన సోవియట్ యూనియన్ ముక్కలవ్వటానికి కారణం ఆ దేశ అంతర్గత సమస్యలు, ఆర్థిక సమస్యలు, సోషలిజం గట్రా అని ప్రపంచం అంతా అనుకుంటారు. కాని, అవన్నీ అలా కలిసిరావడానికి, కమ్ముకురావడానికి తగిన ప్లాన్ చేసి వెనుక నుంచి ఆ ప్లాన్‌ను పక్కాగా నడిపించింది అమెరికా. 

అలాగే, యూరప్‌లోని ఈస్టర్న్ (కమ్యూనిస్ట్) బ్లాక్ అంతా ఒక్కసారిగా మాయమైపోయి, ఆ దేశాలన్నీ డెమొక్రాటిక్ కంట్రీలుగా మారడానికి, రెండు జర్మనీల మధ్య గోడ కూలడానికి కూడా కారణమైన సీక్రెట్ బ్లూప్రింట్స్ అమెరికాలోని సి ఐ ఏ రహస్య సమావేశాల్లో రూపొందినవే. 

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఎవరు దేశాధినేత కావాలో కూడా పరోక్షంగా నిర్ణయించేది అమెరికా, సి ఐ ఏ వంటి ఆ దేశపు అత్యంత శక్తివంతమైన వ్యవస్థలు అంటే నమ్మశక్యం కాదు. కాని, నిజం.

దీనికోసం ప్రపంచ రాజకీయాలు, అమెరికన్ పాలిటిక్స్ చదవాల్సిన అవసరం లేదు. సిడ్నీ షెల్డాన్ "విండ్‌మిల్స్ ఆఫ్ ది గాడ్స్" వంటి మామూలు పల్ప్ ఫిక్షన్ చదివినా ఇది నిజం అన్న విషయం అర్థమైపోతుంది. 

కట్ చేస్తే - 

తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఇలాంటి ఎన్నో శక్తివంతమైన బ్లూప్రింట్స్‌ను అనేక రకాల కార్యక్రమాలు, పథకాల రూపంలో రూపొందిస్తున్నారు... మన తెలంగాణ ఉద్యమ నేత, మన ముఖ్యమంత్రి కేసీఆర్. 

కేసీఆర్ ప్లాన్ చేసి రూపొందిస్తున్న ఈ బ్లూప్రింట్స్‌ను ఇంకో పదేళ్ల తర్వాతో, పాతికేళ్ల తర్వాతో మరే ఇతర రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చలేదు. మార్చడానికి వీలుకాదు. వాటికి అంత శక్తి ఉంది. 

కాదు, కూడదు అని ఎవరైనా మార్చాలనుకుంటే, తెలంగాణ ప్రజలు వారిని మార్చేస్తారు. అంత పటిష్టమయిన పద్ధతిలో ప్రతి ఒక్కటీ పక్కాగా సెట్ చేస్తున్నారు కేసీఆర్.  

24 గంటల నాణ్యమైన కరెంటు, రైతులకు ఉచిత కరెంటు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, కళ్యాణ లక్ష్మి, షి టీమ్స్, పేకాట క్లబ్బుల నిషేధం, కేసీఆర్ కిట్, కంటివెలుగు, డిగ్నిటీ హౌజింగ్ స్కీమ్, రైతు బంధు, దళిత బంధు వంటి 101+ కార్యక్రమాలు, పథకాలు ఈ బ్లూప్రింట్‌లో భాగమే. 

రాజనీతికి సంబంధించిన తెలియని ప్లాన్లు, వ్యూహాలు ఇంకెన్నో ఉంటాయి. అది పూర్తిగా వేరే విషయం.  

తెలంగాణ కోసం, తెలంగాణ శ్రేయస్సు కోసం ఏదైనా చేయటానికి సిద్ధం అని టీఆరెస్ పార్టీ స్థాపించిన రోజు నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాకా, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేదాకా... ఒక్కో దశలో ఒక్కో స్థాయిలో తన పవరేంటో నిరూపించుకొన్నాడు కేసీఆర్. 

ఇది అర్థం కావాలంటే - తెలంగాణ మీద స్వచ్చమైన ప్రేమ ఉండాలి. తెలంగాణలోని అణువణువు తెలిసిన కేసీఆర్ ఆలోచనలను ఆవగింజంతయినా అర్థం చేసుకోగల మనసుండాలి. మానవీయ కోణం ఉండాలి. 
     
తెలంగాణ విషయంలో కేసీఆర్ అంటే - ఒక వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా. ఒక వ్యవస్థ. ఒక వారియర్. ఒక లోడెడ్ గన్, ఒక గైడెడ్ మిసైల్. 

తెలంగాణకు ఎవరితోనయినా ఏదైనా సమస్య ఉంది, ఉంటుంది అనుకుంటే... కేసీఆర్ వేయగల ఎత్తులను ఎవ్వరూ అసలు ఊహించలేరు. 

ఒక టి ఎం సి అంటే ఏమిటి, ఒక మెగావాట్ అంటే ఎంత, తెలంగాణలో ఏ చెరువులు ఎక్కడున్నాయి, ఏ కాలువలు ఎటుపోతున్నాయి, ఏ నది ఏవైపు పారుతోంది, ఎన్ని ఎకరాల్లో పంట పండుతోంది, ఏ పంట దిగుబడి ఎంతుంది, దేశంలో దాని స్థానం ఎక్కడ... ఇలాంటి మైక్రో ఇన్‌ఫర్మేషన్‌ను అలవోకగా ఆశుకవిత్వం చెప్పినట్టు, డెసిమల్ నంబర్స్‌లో, కేసీఆర్ చెప్పగలిగినట్టుగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఇంకో నాయకుడెవరైనా చెప్పగలడని నేననుకోను.  

ఇలా చెప్పాలంటే తెలంగాణను అమితంగా ప్రేమించగలగాలి. తెలంగాణే శ్వాసగా బ్రతకడం రావాలి. తెలంగాణ పదమే ఒక జీవనవిధానంగా జీవించగలగాలి. మొత్తంగా తన ఉనికే తెలంగాణకు ఒక పర్యాయపదం కావాలి. 

మూడంటే మూడు అక్షరాల్లో ఈ శక్తి ఉంది... 

కే. సీ. ఆర్. 

జలదృశ్యంలో పార్టీ స్థాపన నుంచి, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యేదాకా... తెలంగాణ ముఖ్యమంత్రి అయి, ఏదేది మనవల్ల కాదు అని ఎగతాళి చేశారో వాటి జేజమ్మల్ని కూడా చాలెంజ్ చేస్తూ చేసి చూపించేదాకా... గత ఇరవై ఏళ్ళ నా జీవిత కాలంలో నా కళ్ళారా నేను చూసిన ఒక అద్భుతమైన ప్రపంచస్థాయి సక్సెస్ స్టోరీ అయిన కేసీఆర్‌కు నేను ఫ్యాన్‌ను అని చెప్పుకోడానికి నేనేమాత్రం వెనుకాడను.    
 
ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకే వెళ్లాల్సిన అవసరం లేదు. కాని, మన జీవితంలోని ప్రతి చిన్న పార్శ్వాన్ని ప్రభావితం చేస్తున్న రాజకీయాలను మనం పట్టించుకోవడం ఇప్పుడు చాలా అవసరం. అలా పట్టించుకోకుండా నిరాసక్తంగా ఉండిపోవడమంటే, మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేస్తున్నట్టే అనుకోవచ్చు. 

కట్ చేస్తే - 

చెదలుపట్టిన చెత్తగా మారిన సోషల్ మీడియాలోని కొంత భాగం, కనిష్ట స్థాయి ప్రామాణికత పాటించలేని కొన్ని యూట్యూబ్ చానల్స్... కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న అత్యంత ఘోరమైన ప్రాపగాండాలో వాడుతున్న భాష, పెడుతున్న థంబ్‌నెయిల్స్ కేసీఆర్‌ను గాని, టీఆరెస్ పార్టీని గాని, తెలంగాణను కాని ఏమీ చేయలేవు. 

ఈ ప్రాపగాండా వెనకున్న కుట్రల సారాంశం మొత్తాన్ని కేవలం రెండే రెండు పదాల్లో చెప్పవచ్చు... కేసీఆర్‌ను దించాలి!   

మొన్నటి రెండున్నర గంటల ప్రెస్‌మీట్‌ ద్వారా కేసీఆర్ మెరిపించిన మెరుపులకి దిమ్మతిరిగిన ఈ నెగెటివ్ ప్రాపగాండా శక్తులు ఏం చేయలేక మరింతగా రెచ్చిపోతాయి. అంటే, వారి అధమాధమ స్థాయినే కొనసాగిస్తూ, మరింత పాతాళంలోకి వెళ్తాయన్నమాట!    
 
అంతే తప్ప, ఆ రెండున్నర గంటల ప్రెస్‌మీట్‌లో - కేంద్ర బడ్జెటా్‌ను ఉతికి ఆరేస్తూ, కేసీఆర్ లేవనెత్తిన నూటొక్క పాయింట్స్‌లో ఏ ఒక్క పాయింట్‌కైనా వీళ్ళు సరైన సమాధానం ఇవ్వగలరా? 

వారివల్ల కాదు. వారికేం తెలియదు.  

ఇంకేం చేయగలరు? షరా మామూలే. (మమ్మల్ని) కుక్కలు అన్నాడు, ఊర కుక్కలన్నాడు, పిచ్చి కుక్కలన్నాడు. దిమాక్ లేదన్నాడు. ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు సబ్జెక్టు మాత్రం శూన్యం. 

కేసీఆర్ అభిమానులు, నిఖార్సయిన తెలంగాణవాదులు, తెలంగాణ బిడ్దలు, తెలంగాణ ప్రేమికులు... రాష్ట్రంలోని రాజకీయాలతో పాటు, దేశంలోని రాజకీయాలను కూడా కొంతయినా పట్టించుకోవల్సిన సమయం వచ్చేసింది. 

ముఖ్యంగా ఒక భారీ లక్ష్యంతో, ఢిల్లీలో జెండా ఎగురవేసే దిశగా, మన కేసీఆర్ అడుగులు ముందుకు కదులుతున్న ఈ తరుణంలో - నిరాసక్తంగా ఉన్న తెలంగాణ ప్రేమికుల కలాలు, గళాలు అన్నీ మేల్కొని, ఏకమై, జూలు విదిలించాల్సిన అవసరం చాలా ఉంది.  

When politics decides your future, decide what your politics should be. 

జాగో తెలంగాణ!

***

(Published in Namasthe Telangana on 4th Feb 2022)