Saturday 19 February 2022

ఒక దేశం అభివృద్ధిచెందాలంటే...

అది 1993 అనుకుంటాను... 

సింగపూర్‌లో, 18 ఏళ్ల ఒక అమెరికన్ టీనేజర్ స్టూడెంట్ చేసిన ఓ చిన్న నేరానికి అతన్ని జైలుకి పంపారు. ఆ కుర్రాడు చేసిన నేరం ఏంటంటే - దొంగతనంగా ఓ నాలుగయిదు కార్లకి రెడ్‌కలర్ పెయింట్‌ను స్ప్రే చేయడం!  

ఆ అమెరికన్ కుర్రాడి పేరు పీటర్ ఫే. 

పీటర్ చేసిన నేరానికి సింగపూర్ ప్రభుత్వం ఆ దేశ చట్టాల ప్రకారం 4 నెలల జైలు, సుమారు 2 వేల డాలర్ల జరిమానా, ఓ 6 బెత్తం దెబ్బల శిక్ష విధించింది.

1993-94 ల్లో ప్రపంచమంతా ఈ సంఘటనపైనే కొన్ని రోజులపాటు హెడ్‌లైన్సూ, బ్రేకింగ్ న్యూస్‌లు! అమెరికా ఈగో తట్టుకోలేకపోయింది. "ఇది చాలా అతి" అని అభివర్ణించింది అమెరికా.

చివరికి, అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సింగపూర్ గవర్నమెంటుకు ఒక లేఖ రాస్తూ, ఆ బెత్తం దెబ్బలయినా మినహాలించాలని కోరాడు. క్లింటన్ కోరికను మన్నించి, సింగపూర్ ప్రభుత్వం పీటర్ ఫే శిక్షను 6 బెత్తం దెబ్బల నుంచి 4 బెత్తం దెబ్బలకు తగ్గించింది! జైలు శిక్ష, జరిమానా మాత్రం యథాతథం!! 

దటీజ్ సింగపూర్!

సింగపూర్‌లో కనీసం త్రాగునీరు లేదు. దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో ఉన్న సహజవనరుల్లో కనీసం ఒక్క శాతం వనరులు కూడా లేవక్కడ. కాని, ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ఆ దేశ వైశాల్యం కేవలం 274 చదరపు కిలోమీటర్లు. జనాభా 54 లక్షలు. అయినాసరే, ఒక దశలో అమెరికా జీడీపీని కూడా అధిగమించింది. ప్రపంచపు 10వ ధనిక దేశంగా ఎదిగింది.  

అమెరికా అప్పులు ట్రిలియన్ డాలర్లలో ఉన్నాయి. మన దేశానికి సుమారు 541 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. సింగపూర్‌కు అసలు అప్పు అనేదే లేదు. 

సింగపూర్ ఆదాయమంతా ఎలక్ట్రానిక్స్ మెషినరీ ఎగుమతులు, టూరిజం, కోస్టల్ కార్గో నుంచి వస్తోందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 

భూవైశాల్యంలోనూ, జనాభాలోనూ, వనరుల్లోనూ మనకంటే అత్యంత కనిష్టస్థాయిలో ఉన్న సింగపూర్‌కు మనకన్నా 18 సంవత్సరాల తర్వాత 1965లో స్వాతంత్రం వచ్చింది. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆదేశపు పౌరులు గాని, పాలకులు గాని ఆకాశం నుంచి ఊడిపడ్దవాళ్ళు కాదు కదా?

సింగపూర్ తొలి ప్రధానమంత్రి లీ క్వాన్ యూ చేసిన కృషికి ఫలితం, ప్రతిరూపం ఇప్పటి సింగపూర్. మనిషి మనుగడకు, అభివృద్ధికి ఏ విధంగానూ పనికిరాని విషయాలను పక్కనపెట్టి... ఏం చేస్తే ఒక దేశం అభివృద్ధిపథంలో ముందుకు ఉరుకుతుందో అది మాత్రమే చేస్తూ, ఒక బ్లూప్రింట్ సృష్టించాడు లీ క్వాన్ యూ. లీ క్వాన్ యూ లిఖించిన ఆ బ్లూప్రింట్ పునాదులమీదే సింగపూర్ ఒక ధనికదేశంగా ఇంకా ఇంకా అభివృద్ధి సాధిస్తోంది. 

కట్ చేస్తే - 

మనదేశంలో ఉన్నన్ని సహజవనరులు, మానవవనరులు బహుశా ప్రపంచంలోని ఇంకే దేశంలోనూ లేవు. మనం వినియోగించుకోలేకపోతున్నాం.  అమెరికా వంటి దేశాల్లోని అగ్రస్థాయి కంపెనీల్లో 70 శాతం కంపెనీలను నడిపిస్తున్నది భారతీయులే అన్నది మనం రోజూ చూస్తున్నాం. అంతే కాదు - అమెరికా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అనేక కీలక పదవుల్లో ఉన్నది కూడా మన భారతీయులే, భారత సంతతివారే.     

మనకు స్వతంత్రం వచ్చి 74 ఏళ్లయినా మనం ఎందుకని ఇంకా ఒక 'అభివృధ్ధిచెందుతున్న దేశం' గానే ఉన్నాం? 

ఎందుకంటే... ఇప్పటివరకు ఢిల్లీలో ఏలినవాళ్లంతా రెండే అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు: ఒకటి వ్యక్తిగత కీర్తి కండూతి. రెండోది మనిషి మనుగడకు, అభివృద్ధికి ఏరకంగానూ ఉపయోగపడని అంశాలమీదే ఏదో ఒకరూపంలో ఎప్పటికప్పుడు అగ్గిరాజేయటం, ఆజ్యంపోయడం. 

ఒకరిద్దరెవరైనా నిజంగా ఏదైనా చేయాలని ప్రయత్నించినా, వాళ్ళు ఆధారపడి ఉన్న ఇతర రాజకీయగణం అంతా ఇదే మైండ్‌సెట్‌తో ఉన్నప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు? 

ఇప్పటివరకూ జరిగింది అదే. 

ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న ఒక లేయర్‌కి లేయరే ఎగిరిపోతే తప్ప మనదేశంలో అభివృధ్ధి సాధ్యం కాదు, మనం కూడా ఒక ధనికదేశం కాలేము. కాని, అదంత సులభంగా సాధ్యం కాదు అని నిన్నమొన్నటి పరిణామాలు కూడా మనకు సూచిస్తుండటం బాధాకరం. 

2014లో నరేంద్రమోదీ విజయం తర్వాత, ఈ దేశానికి ఆయనెంతో చేస్తాడని చాలామంది ఆశించారు. మనదేశ ప్రధానిగా నరేంద్రమోదీ అద్భుతాలు సృష్టించవచ్చునని ఆశిస్తూ నేను కూడా ఆసమయంలో ఒక బ్లాగ్ రాశాను.

"గుజరాత్ విధానసభలోకి నరేంద్రమోదీ తొలిసారిగా ప్రవేశించింది ముఖ్యమంత్రిగానే. అలాగే, పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి కూడా తొలిసారిగా మోదీ ప్రవేశించింది ఒక  ప్రధానమంత్రిగానే" అని మీడియా కూడా మోదీని ఆకాశానికెత్తింది. 

ఈ విషయంలో నిజంగా నరేంద్రమోదీది ఒక పెద్ద సక్సెస్ స్టోరీనే. కాని, దురదృష్టవశాత్తు ఈ విజయం నాణేనికి ఒక వైపే. నాణేనికి మరోవైపు, దేశంకోసం ఆయన సాధించింది దాదాపు శూన్యం.  

ఎవరికైనా సరే, పదవి సాధించడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. ఆ పదవి ఇచ్చే బలంతో, అంతకు వందరెట్లు ఈదేశం కోసం ఎంతైనా చెయ్యగలగాలి. 

కాని, గత ఎనిమిదేళ్లలో అలా జరుగలేదు. మన సహకారంతో పుట్టిన బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు కూడా కొన్ని అంశాల గణాంకాల్లో ఇప్పుడు మన దేశాన్ని బీట్ చేస్తున్నాయంటే, మనవాళ్ల పాలన ఏ దిశగా వెళ్తోందో అర్థంచేసుకోవచ్చు.    

రెండు సార్లు ఒక దేశాన్ని పరిపాలించే అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? చరిత్రలో తమ పేరు చిరస్థాయిగా ఉండిపోయేలా అనుక్షణం ప్రజలకోసం ఆలోచిస్తారు. ఇంకో వందేళ్ళయినా ఆ దేశ ప్రజల మనస్సుల్లో గుర్తుండిపోయే మంచి పనులు చేస్తారు. కాని, అలాంటివేమీ చెయ్యకుండా, తెలంగాణ ఏర్పడ్డ ఏడేండ్ల తర్వాత కూడా అదే తెలంగాణ ఏర్పాటు అంశాన్నే పట్టుకొని రోదించడం వెనుక ఆంతర్యం ఏమిటి? 

ఇందుకే కదా గత ఎనిమిదేళ్ళుగా దేశంలో అసలెలాంటి అభివృద్ధి లేదు. ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఇంకో ఎనిమిదేళ్ళు వెనక్కివెళ్ళింది. 

కేవలం 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ 'ప్రపంచపు బిజీయెస్ట్ కార్గో' నడిపిస్తూ ధనికదేశంగా కాలర్ ఎగరేస్తోంటే, 7000 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న మనదేశం మాత్రం ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తోందంటే కారణం సుస్పష్టం.      

కట్ చేస్తే - 

ఒక్క కేసీఆర్...  

ఆరు దశాబ్దాల క్రితంనాటి తెలంగాణ వేరు, ఇప్పుడు కళ్లముందు మనం చూస్తున్న తెలంగాణ వేరు అనేది స్పష్టంగా మన కళ్లముందు కనిపించేలా ఆవిష్కరిస్తున్నారు. 

తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఉండదు అన్న చోటే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. గత ఆరున్నర దశాబ్దాలుగా నీటికి నోచుకోని ఎన్నో ఊళ్ళు, గ్రామాల ప్రజలు ఇప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్ళు త్రాగుతున్నారు. 

తెలంగాణ మరొక బీహార్ అయిపోయి ఐటి మాయమైపోతుంది అన్నారు. ఊహించని స్థాయిలో ఐటి అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే తన అతిపెద్ద గ్లోబల్ ఆఫీస్ క్యాంపస్‌ను హైద్రాబాద్‌లో నిర్మించుకొంది అమెజాన్. ప్రపంచపు టాప్ టెన్ కంపెనీలన్నీ ఇప్పుడు హైద్రాబాద్‌లో ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లతో పాటు... ఇప్పుడు ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఆదిలాబాద్‌ జిల్లాకు కూడా తెలంగాణ ఐటి సామ్రాజ్యం విస్తరిస్తోంది. 

క్రిడిట్ గోస్ టు కేటీఆర్ అండ్ టీమ్... అసలు ఆయనలాంటి డైనమిక్ మంత్రి మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండు అని చాలా రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు. సాక్షాత్తు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటివారు ఈ విషయంలో కేటీఆర్‌ను సభాముఖంగా మెచ్చుకొని అభినందించారు. 

"నీరు పల్లమెరుగు" అన్న సామెత చెప్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక ఆంధ్ర నాయకుడు ఎంత ఎగతాళిగా మాట్లాడాడో మనకు తెలుసు. "నీరు వెనక్కి కూడా వెళ్తుంది, ఎత్తుకు కూడా ఎక్కి, మళ్లీ మనం కోరుకున్న అన్ని పల్లాలకు ప్రవహిస్తుంది" అని కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం నాలుగున్నరేళ్లలో విజయవంతంగా పూర్తిచేసి, నిరూపించి చూపించారు కేసీఆర్.  

మిషన్ కాకతీయ, హరితహారం, ఆసరా పెన్షన్, కల్యాణలక్ష్మి, రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు భీమా, దళితబంధు, టెక్స్‌టైల్ పార్క్, ఫార్మా సిటీ, యాదాద్రి పునర్నిర్మాణం... ఇలా చెప్పుకుంటూపోవడానికి ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ క్రిడిట్‌లో ఇంకో వంద అంశాలున్నాయి. ఇంకెన్నో రాబోతున్నాయి.        

పదవి మాత్రమే ముఖ్యం కాదు. ఆ పదవి ఇచ్చే బలం, బాధ్యతతో ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేయడం ముఖ్యం. అభివృధ్ధి-సంక్షేమం మధ్య ఈ సమతూకం పాటించే విషయంలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  

రాజకీయ పార్టీల మధ్య స్పర్థలు, విమర్శలు, రాజనీతి వ్యూహాలు ఇవన్నీ మామూలే. ఎక్కడైనా ఉంటాయి. కాని, "ప్రజల సంక్షేమం, అభివృధ్ధి వేరు. రాజకీయాల వల్ల అది ఆగిపోకూడదు. నిరంతరం కొనసాగుతూనే ఉండాలి" అని ఆలోచించగలిగిన రాజకీయ నాయకులే నిజమైన రాజకీయ నాయకులు. వారు మాత్రమే ప్రజల కోసం, దేశం కోసం ఏమైనా చేయగలుగుతారు. ఎంత త్యాగానికైనా సిధ్ధపడతారు. అలాంటివారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. 

జార్జ్ వాషింగ్‌టన్ (అమెరికా), డెంగ్ సియాపింగ్ (చైనా), లీ క్వాన్ యూ (సింగపూర్) వంటి నాయకులు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారంటే వారి కృషి అలాంటిది. ఆ స్థాయిది.

ఇప్పుడు దేశంలో అలాంటి లక్షణాలున్న ఏకైక విలక్షణ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ లాంటి సిసలైన ఉద్యమ శక్తి, నిరంతర అధ్యయనశీలి అయిన నాయకుడు ఇప్పుడు పూనుకొని దేశం కోసం కూడా చేయాల్సింది చాలా ఉంది. 

ఏదీ అంత సులభం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదని చెప్తూ ప్రపంచ చరిత్రలో, మన దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కూడా సాక్ష్యాలున్నాయి. 

***

(Published in Namasthe Telangana on 19th Feb 2022)       

5 comments:

  1. ప్రధానైనా, ఇంకొకరైనా.. దేశం కంటే మతమే ముఖ్యమనుకున్నప్ప్పుడూ, దురదృష్టవశాత్తూ.. మెజారిటీ ప్రజలు.. ఆమత్తులో జోగుతున్నప్పుడు లేదా అలా ఉంచబడుతున్నప్పుడు.. అభివృద్ది జరగడమనేది పక్కనబెడితే, అది ఎలా తిరోగమిస్తుందో మిగితా దేశాలకి ఒక పాఠంగా నిలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు జరుగుతున్నది అదే!

      Thanks for your comment.

      Delete
  2. ఇది కూడా చదవండి...
    135 కోట్ల మంది ప్రజలతో ఏం చెయ్యాలి?
    https://bonagiri.wordpress.com/2018/08/15/135-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%8f%e0%b0%82-%e0%b0%9a%e0%b1%86%e0%b0%af/

    ReplyDelete
    Replies
    1. చదివాను, కామెంట్ పెట్టాను.

      Thanks for the link.

      Delete
    2. ధాంక్సండి.

      Delete