Tuesday 31 October 2017

కులం ఒక సామాజిక నిజం!

ఈదేశంలో కులం నేపథ్యంలోనే ప్రతీదీ నడుస్తోంది అన్న ఉద్దేశ్యంలో, నాకత్యంత ప్రియమైన విద్యార్థుల్లో ఒకడు, "Guy On The Saidewalk" నవలా రచయిత కూడా అయిన భరత్‌కృష్ణ ఈమాట ఒకసారి నాతో అన్నాడు. 

నిజంగా ఇది నిజమే. 

పరిచయాలు, స్నేహాలు, వ్యాపారాలు, లాబీలు, రౌడీయిజాలు, రాజకీయాలు .. అన్నిటికీ మన దేశంలో కులమే నేపథ్యం.

అలాగని, ప్రతిచోటా ఈ కులం కార్డు పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.

ఉదాహరణకు, బాగా ఉన్న ఒక కులంవాడు, ఏమీలేని తన కులంవాడిని అసలు పట్టించుకోడు!  

వాస్తవానికి ఈ ప్రపంచంలో ఉన్నవి, ఉండేవి, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ..  రెండే రెండు కులాలు: 

ఉన్న కులం. లేని కులం.

అయితే డబ్బు! లేదంటే పవర్!!

ఈ రెంటిలో .. ఏదో ఒకటి 'ఉన్న కులం' ఒకటి. ఏదీ 'లేని కులం' ఒకటి.  

మళ్లీ ఈ రెండింటికీ కూడా విడదీయరాని అనుబంధం ఉంటుంది. అది వేరే విషయం.   

ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, ఇదే నిజం.


కట్ టూ నా అనుభవం - 

నాకేమాత్రం ఇష్టం లేని ఈ కులం నేపథ్యంగా, నేను దారుణంగా నష్టపోయిన ఒకే ఒక్క ఎపిసోడ్ గురించి మరో బ్లాగ్ పోస్టులో రాస్తాను. 

బహుశా రేపే. 

Friday 20 October 2017

టాలెంట్ ఒక్కటే కాదు .. ఇంక చాలా ఉంది!

హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ డ్రీమ్‌స్' అంటారు.

అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా వస్తారు.

ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ.

వాళ్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.

ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ బ్రోకెన్ డ్రీమ్‌స్' అని తిట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు. 


కట్ టూ మన టాలీవుడ్ - 

పైనచెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.

మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే.

ఇకముందు కూడా అంతే.

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 శాతం లోపే.

ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే సక్సెస్‌లో ఉంటారు.

ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ.

మిగిలినవాళ్లంతా ఏదోవిధంగా వెనుదిరగాల్సిందే.

ఈ వాస్తవాన్ని గ్రహించినవాళ్లు జాగ్రత్తపడతారు. భ్రమలో బతికేవాళ్లు మాత్రం అలాగే సినిమాకష్టాలుపడుతూ కొనసాగుతుంటారు. ఈలోగా జీవితం కొవ్వత్తిలా కరిగిపోతుంది.

ఇండస్ట్రీ మంచిదే. కానీ దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.

ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి.

వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి:

లాబీయింగ్.

మనీ.

మానిప్యులేషన్స్.

పైన చెప్పిన మూడింటిలో కనీసం ఏ రెండింటిలోనయినా ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ బతికి బట్టకడతాడు. సక్సెస్ సాధిస్తాడు.      

Tuesday 17 October 2017

క్రియేటివిటీ అన్‌లిమిటెడ్!

సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రతో కలిసి, నేను ప్రారంభించిన కొత్త వెంచరే ఈ 'మాప్రాక్స్ ఇంటర్నేషనల్'.

సినిమాలు సినిమాలే.

ఈ విషయంలో, ఆల్రెడీ 'నమస్తే హైదరాబాద్' ట్రాక్ మీద ఉంది.

నేను ఇంతకుముందు తీసిన సినిమాలతో పోలిస్తే ఇదొక పెద్ద సినిమా. ఈ సినిమా బడ్జెట్, షూటింగ్ డేస్ వగైరా అన్నీ ఎక్కువే. ఈ ప్రొడక్షన్ దాని దారిలో అది అలా నడుస్తూ ఉంటుంది.

మరోవైపు -

ఈవెంట్స్, ప్రమోషన్స్, మ్యూజిక్ వీడియోస్, ఇండిపెండెంట్ ఫిలింస్, ఫిలిం ఆడిషన్ ఈవెంట్స్, షార్ట్ ఫిలింస్, షార్ట్ ఫిలిం ప్రీమియర్స్, బుక్స్ .. ఇలా మరెన్నో క్రియేటివ్ యాక్టివిటీస్‌లో నేనూ, ప్రదీప్ మునిగితేలాలనుకొంటున్నాం.

ఒక క్రమపద్ధతిలో ఆయా సృజనాత్మకరంగాల్లో దేశాల సరిహద్దులు కూడా దాటేయాలనుకొంటున్నాం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - మాప్రాక్స్ ఇంటర్నేషనల్ అనేది - మా ఇద్దరి విషయంలో - హద్దులులేని ఒక సృజనాత్మక తృష్ణ. 

మేం కోరుకొంటున్న సృజనాత్మక స్వేఛ్చకు ఒక రాచబాట.    

Monday 16 October 2017

బ్యాక్ టు బ్లాగ్!

'బ్యాక్ టు స్కూల్' లాగా, 'బ్యాక్ టు బ్లాగ్' అన్నమాట!

నేననుకొన్న నా కొత్త బ్లాగ్ ప్రారంభించడానికి ఇంకా  సమయం ఉంది.

బహుశా 'నమస్తే హైదరాబాద్' షూటింగ్ పూర్తయిన తర్వాతనుంచి ప్రారంభించవచ్చు.

సో, బ్యాక్ టు మై నగ్నచిత్రం.

ఎట్‌లీస్ట్ ఇంకొన్నాళ్ళు. 


కట్ టూ ది గ్యాప్  - 

సరిగ్గా నాలుగు నెలల ఈ గ్యాప్‌లో చాలా జరిగాయి.

కలలో కూడా ఊహించలేని స్థాయిలో పెద్ద షాకింగ్ జెర్క్ ఇచ్చిన ఒక ఆరోగ్య సమస్య. అదుపు తప్పిన ఆర్థిక సమస్యలు. ఇంటా బయటా, ఒక్క క్షణం గుర్తుతెచ్చుకోడానికి కూడా బాధించే ఎన్నో అనుభవాల గాయాలు. నమ్మించి మోసాలు. నమ్మకద్రోహాలు.

ఇలాంటి ఎంతో నెగెటివిటీ మధ్య అక్కడక్కడా, అప్పుడప్పుడూ, వేళ్లమీద లెక్కించగలిగిన ఏవో కొన్ని అద్భుత అనుభవాలు, జ్ఞాపకాలు. స్నేహ సుగంధాలు, సౌరభాలు.  

జీవితం ఒక ఆట ఆడుకుంది నాతో.

ఇప్పుడు నేను చూపించదల్చుకున్నాను జీవితానికి. అసలు ఆటంటే ఎలా ఉంటుందో.

సరిగా నాలుగు నెలల క్రితం, ఈ 'నగ్నచిత్రం'లో ఇదే నా చివరి బ్లాగ్ పోస్ట్ అంటూ గుడ్‌బై చెప్పాను. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చాను. కొత్త బ్లాగ్ ప్రారంభించేదాకా ఎప్పట్లా నాకు తోచిన ఏదో ఒక నాన్సెన్స్ ఇక్కడ రాసి పోస్ట్ చేస్తుంటాను.

వ్యక్తిగతంగా నాకు సంబంధించినంతవరకూ - బ్లాగింగ్ అనేది ఒక హాబీ. ఒక మెడిటేషన్. ఒక థెరపీ.

అన్నిటినీ మించి, చాలాసార్లు, నాలోని అంతస్సంఘర్షణకు ఒక ఔట్‌లెట్.