Wednesday 30 June 2021

ఒక్క పవర్‌ఫుల్ పోస్ట్, ఒక్క సెన్సేషనల్ ట్వీట్ చాలు...

టైమ్‌పాస్‌కో, ఎవర్ని ఎప్పుడు విమర్శిద్దామా అన్న ఐడియాతోనో సోషల్ మీడియాలో గడపటం వేరు. అది ఆయా వ్యక్తుల ఇష్టం. 

అలా కాకుండా, దినచర్యలో ఉండే రకరకాల వత్తిళ్ళ నుంచి కాస్తంత రిలాక్సేషన్ కోసం... కాసేపు సరదాగా సోషల్ మీడియాలో గడపడం ఇంకో హాబీ. తప్పేం లేదు.

ఈ కోణంలో, ఎంతో మందికి గుండెపోటు తప్పించిన క్రెడిట్ సోషల్ మీడియాకుంది. 

వ్యక్తిగత ప్రమోషన్ కోసం, వృత్తివ్యాపారాల్లో ప్రోగ్రెస్ కోసం కూడా సోషల్ మీడియా అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఇది చాలా గొప్ప విషయం. 

అంతేకాదు, సామాజిక సేవా కార్యక్రమాలు నడపటం కోసం కూడా ఇప్పుడు సోషల్ మీడియాను వాడటం అనేది తప్పనిసరి అయింది.  

ఎందరో అతి చిన్నస్థాయి నుంచి, అత్యున్నత స్థాయి పొలిటీషియన్స్ వరకు... కేవలం సోషల్ మీడియా చలవ వల్లనే ఎంతో ఎత్తులకు ఎదిగినవాళ్ళున్నారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ లేకుండా ఇపుడు ఫీల్డులో ఏ సినిమా హీరోయిన్ ఉండలేదు.  

సెలబ్రిటీలకు, పేజ్ 3 పీపుల్స్‌కు ఇప్పుడు సోషల్ మీడియానే శ్వాస అయింది. హీరోలకయితే ఎవరికి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ఎవరి పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎవరి టీజర్లు ఏ స్థాయిలో ట్రెండవుతున్నాయి... తెల్లారితే ఇదొక తప్పనిసరి ప్రమోషన్ - aka - పి ఆర్ వ్యవహారం అయింది.    

అంతదాకా ఎందుకు... ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వల్ల ఏ వ్యక్తికి ఆవ్యక్తే ఒక మీడియా మొగుల్ అయ్యాడు.

ఒక్క పవర్‌ఫుల్ పోస్ట్, ఒక్క సెన్సేషనల్ ట్వీట్ చాలు... రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు. నోటోరియస్ కూడా అయిపోవచ్చు. 

With that said - 

సోషల్ మీడియా ఒక మంచి శక్తివంతమైన సాధనం. దాన్నెలా ఉపయోగించుకొంటామన్నది పూర్తిగా మనమీదే ఆధారపడి ఉంది. 

హాపీ సోషల్ మీడియా డే!

Tuesday 29 June 2021

బ్లాగింగ్ ఒక థెరపీ!

వైజాగ్‌లో ఉన్న నాకత్యంత ప్రియమైన ఒక ఫ్రెండ్‌కు పొద్దున్నే "Have a Wonderful Day!" అని వాట్సాప్ మెసేజ్ పెట్టాను. 

బ్లూ టిక్ వచ్చింది.

"సేమ్ టూ యూ" లేదు, రిప్లై లేదు.

ఇది అనుకున్నదే. మా ఇద్దరి మధ్యా ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. 

జీవితంలోని ఏదో ఒక దశలో ఇలాంటి జెర్క్‌లు ఎవరికైనా కొన్ని తప్పవనుకుంటాను...

కట్ టూ బ్లాగర్స్ బ్లాక్ - 

వ్యక్తిగతమయిన, వృత్తిగతమైన అనేక టైమ్‌బౌండ్ కమిట్‌మెంట్‌ల వత్తిడిలో అస్సలు సమయం లేక, సమయం మిగుల్చుకోలేక .. ఈమధ్య నేను ఎక్కువగా బ్లాగింగ్ చెయ్యలేకపోతున్నాను. ఎప్పుడైనా ఏదో ఒకటి రాద్దామని లాపీ ఓపెన్ చేసినా, అసలేం కదలట్లేదు. 

'రైటర్స్ బ్లాక్' లాగా 'బ్లాగర్స్ బ్లాక్' అన్నమాట! 

థాంక్స్ టూ మై ఫ్రెండ్... ఈ బ్లాగర్స్ బ్లాక్‌ను బ్రేక్ చేయడం కోసం తనని గుర్తుతెచ్చుకొంటూ ఈ పోస్టు రాయడం మొదలెట్టాను. ఇప్పుడు కదిలింది...

బ్యాక్ టూ మై బ్లాగింగ్ -

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయటం లేదు ఈమధ్య. 

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం .. నిజంగానే పెద్ద నేరం. 

ఏదో రాసి, ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. కరోనా లాక్ డౌన్  సమయంలో నేను ఎదుర్కొన్న ఎన్నో ఊహించని సంఘటనల నేపథ్యంలో నన్ను నేను ఉధ్ధరించుకోవడంకోసం మాత్రం ఇది నాకు నిజంగా తప్పనిసరి. 

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకూ... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్.

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు. 

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నాకు సంబంధించినంతవరకు నిజంగా నేరమే. ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను. 

ఇదో పెద్ద జోక్. 

అయితే - జీవితంలో ఏవైనా ఊహించని జెర్క్‌లు వచ్చినప్పుడు నిజంగా నన్ను కాపాడేది ఈ థెరపీనే. ఈ యోగానే. 

నేను రాయాలనుకున్న కొన్ని పుస్తకాల గురించి, స్క్రిప్టుల గురించి, ఇంకెన్నో క్రియేటివ్ థింగ్స్ గురించి నాకు మొట్టమొదటగా ఐడియా ఫ్లాష్ అయ్యేది కూడా... ఇలా బ్లాగింగ్ చేస్తున్నప్పుడే.  

ఇదేం అతిశయోక్తి కాదు. 

బై ది వే, మొన్న నాకు కరోనా వచ్చినప్పుడు కూడా, ఎలాంటి భయం లేకుండా నేను బయటపడటానికి నాకు ఎక్కువగా ఉపయోగపడింది కూడా ఈ థెరపీనే.  

Friday 25 June 2021

Make Movies That Make Money

లాక్‌డౌన్ నుంచి విముక్తి తర్వాత - నేను ప్లాన్ చేసుకున్నట్టుగానే, నా కొత్త ఫిలిం ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చకచకా ప్రారంభమయ్యాయి. 

రెండు సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ జరుగుతోంది.

మళ్ళీ మూడో వేవ్, నాలుగో వేవ్ అని ఎవరికి తోచినవిధంగా వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు. టీవీ చానెల్స్, ప్రెస్ కూడా ఈ విషయంలో ఇతోధికంగా, సాధ్యమైనంత ఎక్కువ పనికిరాని చెత్తనే "బ్రేకింగ్ న్యూస్"లుగా ప్రచారం చేస్తున్నాయి. ఇక, యూట్యూబ్ చానెల్స్ విషయం చెప్పే అవసరం లేదు. ప్రతివాన్నీ కోవిడ్ స్పెషలిస్టును చేసేశాయి ఈ యూట్యూబ్ చానెళ్ళు! వారి ఖర్మ, చూసేవాళ్ళ ఖర్మ.  

ఇక ముందు ఏ వేవ్ వచ్చినా ఇంతకుముందులా లాక్‌డౌన్లు ఉండకపోవచ్చు. అన్ని వృత్తులు, వ్యాపారాలు మామూలుగా కొనసాగుతాయి. మరోవైపు, కోవిడ్ దారి కోవిడ్‌దే. దేని ట్రాక్ దానిదే. లేదంటే ప్రజలు కోవిడ్‌తో కాదు, ఆకలితో పోయే ప్రమాదముంది. 

ఇదంతా ఎలా ఉన్నా, మళ్లీ ప్రభుత్వం/అధికారిక సంస్థలు వద్దని ప్రకటించేదాకా...  Let's all wear mask, maintain social distance & vaccinate! 

కట్ చేస్తే - 

ప్రత్యేకంగా ఓటీటీలను దృష్టిలో పెట్టుకొనే నేను చేస్తున్న సీరీస్ ఆఫ్ సినిమాల ప్రాజెక్టుకు వెంటనే ఫండింగ్ చేసే విషయంలో ఆసక్తి ఉన్నవారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. తగినంత ఇన్వెస్ట్‌మెంట్‌తో కోప్రొడ్యూసర్స్‌గా వెంటనే కొలాబొరేట్ అవ్వాలన్న ఆసక్తి ఉన్నవారు కూడా నన్ను వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు. 

నన్ను కాంటాక్ట్ చేసే ముందు ఒకసారి ఈ లింక్ క్లిక్ చేసి చదవండి: 
https://manoharam.in/sponsored-article/manutime-movie-mission/

కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం! 

వాట్సాప్: +91 9989578125
ఈమెయిల్: mchimmani10x@gmail.com

Sunday 20 June 2021

నాన్న జ్ఞాపకమ్...

అమ్మ ప్రాముఖ్యం అమ్మదే. 
కాదనలేం.
కాని-

అమ్మతో పోల్చినపుడు- 
కనీస గుర్తింపుకు కూడా నోచుకోని,
ఏదీ పట్టించుకోని-
పిచ్చివాడు, 
కష్టజీవి, 
త్యాగమూర్తి, 
మౌని, 
ప్రేమి...
నాన్న.
 
తన చివరి నిమిషం వరకూ 
పిల్లలూ కుటుంబం కోసమే 
ఆలోచించే వ్యక్తి, 
శ్రమించే శక్తి... 
నాన్న.

తరతరాలుగా అమ్మకు వచ్చిన గుర్తింపు 
ఎందుకనో నాన్నకు రాలేదు.

మరో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే -
చాలా మంది విషయంలో...
తండ్రి విలువ తెలుసుకునేటప్పటికి 
ఆ తండ్రి ఉండడు!
ఇది మగపిల్లలకు ఇంకో శాపం... 

కట్ చేస్తే - 

"అసలు ఈ ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు ఏంటి?... మన కల్చర్ కాదు... మనం తల్లిదండ్రుల్ని ప్రతిరోజూ గుర్తుంచుకోవాలి... గుర్తు చేసుకోవాలి... వారిపైన ప్రేమను వర్షించాలి... వారిని 365 రోజులూ పూజించాలి... అదీ మన సంస్కృతి" అని కొందరు అంటుంటారు. 

వారి భావనలు వారివి. గౌరవిస్తాను. 

నా ఉద్దేశ్యంలో  మాత్రం ఇలాంటి 'డే' లు ఉండాలి. ఉండి తీరాలి.  

మన హిపోక్రసీ పక్కన పెట్టి, రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలు. మొత్తం కళ్లముందు కనిపిస్తుంది. 

ఒకే ఇంట్లో కళ్ళముందున్న ముసలి తల్లిదండ్రుల వైపు కళ్ళెత్తి కూడా చూడలేని కొడుకులున్న కాలం ఇది... ఎక్కడో ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి సంవత్సరానికి ఒక్కసారో, రెండుసార్లో చుట్టపుచూపుగా కొడుకులు వెళ్తున్న కాలం ఇది... విదేశాల్లో ఉండి, తండ్రి చనిపోయినా రాలేకపోతున్న రోజులు ఇవి... నిజంగా మనసులో ప్రేమ ఉన్నా, పట్టించుకోనీయని వత్తిళ్ల మధ్య పిల్లలు నలుగుతున్న కాలం ఇది...

కేవలం 1% మాత్రమే ఇందుకు బహుశా మినహాయింపు అనుకుంటాను. వారికి మాత్రం హాట్సాఫ్... 

ఇలాంటి పరిస్థితుల్లో - సంవత్సరానికి ఒక రోజు 'ఫాదర్స్ డే' అనో, 'మదర్స్ డే' అనో ఉంటే తప్పేంటి? 

కనీసం ఆ ఒక్క రోజైనా నిజమైన ప్రేమతో కొందరు, సమాజం కోసం కొందరు, ఫేస్‌బుక్ పోస్టుల కోసం కొందరు... వారి తల్లిదండ్రులను కొంతసేపైనా ఖచ్చితంగా గుర్తుచేసుకుంటారు.

ఒక ఫోన్ చేస్తారు. వెళ్ళి కలుస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెడతారు. జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. అర్థరాత్రి పూట ఇలా బ్లాగులు రాసుకొంటూ గతించిపోయిన నాన్నని గుర్తు తెచ్చుకుంటారు. 

అసలు పూర్తిగా మర్చిపోయేకంటే, ఇది మంచిదే కదా! 

Happy Father's Day to All Awesome Sons and Daughters, and Their Fathers !! 

Saturday 19 June 2021

సినిమా తీయడానికి కావల్సింది డబ్బు ఒక్కటే కాదు...

అవును. సినిమా తీయడానికి కావల్సింది డబ్బు ఒక్కటే కాదు. గట్స్ కూడా!

ఈ గట్స్ అందరికి ఉండవు. అందరివల్లా అయ్యే పని కూడా కాదు. 

అయితే, ఈ గట్స్‌ను మించిన శక్తులు కూడా కొన్నుంటాయి. వీటిని తప్పించుకోవడం అన్నది ఇండస్ట్రీలో అందరివల్లా కాదు. ఈ శక్తుల్లో ఏ శక్తి ఎప్పుడు ఏ రూపంలో ఎలా దాడిచేస్తుందో కూడా ఎవరూ ఊహించలేరు.

ఈ శక్తులు టీమ్‌లో ఉంటాయి. టీమ్ బయటా ఉంటాయి. అసలు టీమ్‌తో, సినిమాతో సంబంధంలేని రూపంలో అనూహ్యంగా ఇంటా బయటా కూడా ఉంటాయి. కొన్నిసార్లు అసలు సినిమా పూర్తయ్యేదాకా కనిపించని ఈ శక్తులు, సినిమా పూర్తయ్యాక సడెన్‌గా ఆఫీసులో దర్శనమిస్తాయి.

ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలోని వ్యక్తుల్లో ఎన్ని స్లంప్‌లైనా రావొచ్చు, ఎన్ని మార్పులైనా రావొచ్చు. ఈ శక్తులు మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీనే.   

ఈ శక్తుల ప్రభావం వల్ల అనుకున్న సినిమాలు ప్రారంభం కావు... ప్రారంభమైన సినిమాలు ఆగిపోతాయి... పూర్తయిన సినిమాలు రిలీజ్ కావు... రిలీజయి కమర్షియల్‌గా బాగా ఆడుతున్న సినిమాల మీద "ఏం బాగా లేదు... చూడ్డం దండగ... ఫస్టాఫ్ పడుకుంది... సెకండాఫ్ సాగింది" అంటూ చెత్త రివ్యూలు వస్తాయి... టీమ్‌లో అప్పటిదాకా నమ్మకంగా ఉన్నవాడు ఏదో కుట్ర చేస్తాడు... ఉన్నట్టుండి  డైరెక్టర్ లైఫ్ ఫుట్‌పాత్ ఎక్కుతుంది... ఇట్లా ఎన్నో, ఎన్నెన్నో. 

ఇప్పుడైనా, ఎప్పుడైనా - ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని నిలదొక్కుకున్న ప్రతి ప్రొడ్యూసరూ, డైరెక్టరూ, ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ... ఇలాంటి ఎన్నో శక్తులను, ఎన్నెన్నోసార్లు, ఎన్నో రూపాల్లో ఎదుర్కొని పడిలేచిన కెరటంలా బయటపడ్దవాళ్లే.  

కట్ చేస్తే - 

మరోసారి లాక్‌డౌన్ ఎత్తేశారు. సినిమా హాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. షూటింగ్స్ తిరిగి ప్రారంభమవుతున్నాయి. కొత్త సినిమాలు లాంచ్ అవుతున్నాయి. 

బిగ్ బిజినెస్ మళ్ళీ ఊపందుకోబోతోంది. 

లాక్‌డౌన్ నేర్పిన ఎన్నో పాఠాల నేపథ్యంలో... ఇకనుంచీ ప్రతి నిముషం, ప్రతి రోజూ ఎంతో విలువైంది. ఎక్కడా ఎవ్వరూ ఏ చిన్న చాన్స్ తీసుకోడానికి వీల్లేదు. 

ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు అందరూ అన్ని విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరిపనుల్లో వారు బిజీ అయిపోతారు. తర్వాత ఇంకో వేవ్ వస్తుందో రాదో తెలియదు కాని... వస్తే మాత్రం, కొంతవరకయినా సరే, అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఏ బిజినెస్‌లో అయినా, ఏ ప్రొఫెషన్‌లో అయినా ఇకనుంచీ ప్లానింగ్స్ అన్నీ అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఎట్‌లీస్ట్ ఆ స్థాయి ప్రయత్నం చేస్తారు. 

నా కొత్త ప్రాజెక్టు పనులు కూడా, 'డే వన్' నుంచే, అంతే సీరియస్‌గా ప్రారంభం కాబోతున్నాయి... 

Thursday 17 June 2021

నాకు నచ్చిన సత్యజిత్ రే కొటేషన్!

చాలా ఏళ్ల క్రితం నేనో ఇంటర్వ్యూ చదివాను. అది తమ్మారెడ్డి భరద్వాజ గారిది. ఆ ఇంటర్వ్యూలో నేను చదివిన ఒక ఆసక్తికరమైన విషయం నాకిప్పటికీ గుర్తుంది.

"తెల్లవారితే సినిమా ఓపెనింగ్. జేబులో వంద కాగితం మాత్రమే ఉంది!"

నమ్ముతారా?

నమ్మితీరాలి.

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా భరద్వాజ గారు సుమారు 30 సినిమాలు తీశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సార్లు ఎన్నో పదవుల్ని చేపట్టారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటారు.

ఇంతకూ ఏమయింది? తెల్లవారిందా మరి??

తెల్లవారింది. అన్నీ వాటంతటవే సమకూరాయి. ఆ సినిమా ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. 

ఈ బ్లాగ్ రాస్తున్నప్పుడు ఆ సినిమా పేరు నాకు గుర్తుకురాలేదు. 

"భరద్వాజ గారి ఆ సినిమా పేరు... 'ఊర్మిళ'. మాలాశ్రీ తో చేశారు" అని తర్వాత చందు తులసి గుర్తుచేశారు. బహుశా అది హిట్ అయ్యే ఉంటుంది. 

చాలా ఏళ్లక్రితం మరో ఇంటర్వ్యూలో, సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే నా ఫేస్‌బుక్‌లో, బ్లాగ్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.

అలా ఒకసారి నా బ్లాగ్‌లో కోట్ చేసినప్పుడు... నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అంటూ.

ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే - "సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.

భరద్వాజ గారి సంకల్పమే ఆరోజు వారి సినిమా ఓపెనింగ్ సాఫీగా జరిగేట్టు చేసిందన్నది నా వ్యక్తిగత నమ్మకం.

సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా... అది చిన్న పనైనా, పెద్ద పనైనా... సంకల్పం అనేది చాలా ముఖ్యం. 

అయితే ఇది ఈ బ్లాగ్ రాసినంత సింపుల్ కాదు. ఎన్నో అవాంతరాలొస్తాయి. ఊహించని దెబ్బలు తగుల్తాయి. అది వేరే విషయం. దాని గురించి మరోసారి చర్చిద్దాం.  

కట్ టూ మై న్యూ ప్రాజెక్ట్స్ -  

అప్పుడప్పుడూ ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా - నేనిప్పటివరకూ ఓ రెండు మూడు సినిమాలు మాత్రమే చేశాను.

లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలు చేయబోతున్నాను.  

నా ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఒక్కటే. లేటెస్ట్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయొచ్చు. ఊహించనంత వేగంగా కూడా సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయొచ్చు. మరోవైపు ఓటీటీ,  ఏటీటీల్లో వస్తున్న సినిమాలు కూడా బాగా టెంప్ట్ చేస్తున్నాయి. 

అన్నిటినీ మించి, ఈ కరోనా లాక్ డౌన్  వల్ల నాకు కలిగిన జ్ఞానోదయం కూడా తక్కువేం కాదు. సో, అర్జెంట్‌గా ఇప్పుడు ఓటీటీ కోసం ఒక రెండు సినిమాలు చెయ్యాలనుకొంటున్నాను. 

తప్పకుండా ఈ నేననుకొంటున్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రారంభిస్తాను. ఫాస్ట్‌గా పూర్తిచేసి ఓటీటీలో రిలీజ్ చేస్తాను.    

'సినిమాలొద్దు' అని నన్ను వెనక్కిలాగే ఉద్యోగం సద్యోగం, ఇతర బాదరబందీలు కూడా ఇప్పుడేం లేవు నాకు.  

ఏక్ నిరంజన్!  

Wednesday 16 June 2021

వాట్సాప్ వెడ్డింగ్స్!

ఇవ్వాళ పొద్దున 4.30 కే ఒక పెళ్ళిపత్రిక వాట్సాప్‌లో వచ్చింది. 

నా మిత్రుని కొడుకు పెళ్ళి.

20 నాడు పెళ్ళి కడపలో, 22 నాడు రిసెప్షన్ కొడంగల్‌లో.

వాడి మొబైల్లో ఉన్న మొత్తం 269 మంది కాంటాక్ట్స్‌ను ఒక గ్రూప్ చేసి, ఒకే ఒక్క క్లిక్‌తో వెడ్డింగ్ కార్డ్ అందరికీ చేరవేశాడు నా మిత్రుడు.

కరోనా టైమ్‌లో ఇంతకంటే ఏం చెయ్యగలరు ఎవరైనా... 

తప్పు పట్టడానికేం లేదు.

వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కార్డులిచ్చే రోజులు పోయాయి. అది అస్సలు కుదరదు. అలాగని, వాట్సాప్‌లో కూడా ఒక్కొక్కరికి మెసేజ్ పంపాలన్నా కష్టం. అంత టైమ్ ఇప్పుడు ఎవరికుంది?  

సో, నేను కూడా ఆ 269 మంది 'గ్రూపులో గోవిందా' అవక తప్పలేదు! 🙂

నాకేం పనిలేదు కాబట్టి - వాట్సాప్‌లో ఆ 269 గ్రూపుకు, పర్సనల్‌గా నా మిత్రుని నంబర్‌కూ వాట్సాప్‌లోనే నా శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ పంపించాను.  

కట్ చేస్తే -

చాలా ఏళ్ళ తర్వాత - నిన్న రాత్రి అనుకోకుండా నా క్యాంపస్ మిత్రుడొకరితో కాసేపు ఫోన్లో మాట్లాడాను. 

మాటల మధ్య తెలిసింది ఏంటంటే - నేను చాలా ఇష్టపడే నా ఇంకో అతి దగ్గరి ఆత్మీయ మిత్రుడు అతని ఏకైక కూతురి పెళ్ళి చేశాడు. ఇది దాదాపు రెండేళ్ళక్రితం జరిగిందట. మా ఫ్రెండ్స్ అంతా కలిశారట. మరి, ఆ పెళ్ళికి నాకు వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ కూడా రాలేదు... 

అనేక కారణాల నేపథ్యంలో, మనం మన ఆత్మీయ మిత్రులు అనుకున్నవారితోకూడా కొద్దిరోజులు టచ్‌లో లేము అంటే, మనమూ మన కాంటాక్టూ జస్ట్ 'షిఫ్ట్ డిలీటే' అన్నమాట! 😊😊  

Saturday 12 June 2021

"పగలే వెన్నెల" కాయించిన మన సినారె

'నన్ను
 దోచుకొందువటే' అంటూ ఆరంభించి, 'పగలే వెన్నెల' కాయించి, 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం' అని తేల్చేసిన జ్ఞానపీఠం మన 'సినారె' ఇక లేరు.

సరిగ్గా నాలుగేళ్ళ క్రితం, ఇదే రోజు, నేను పెట్టిన చిన్న ట్వీట్ అది.

సోషల్ మీడియా సంప్రదాయం ప్రకారం, దీన్ని కూడా యధావిధిగా కొందరు మహానుభావులు 'కాపీ పేస్ట్' చేశారు. అది వేరే విషయం. 

అయితే... డైనమిక్ మినిస్టర్ 'కె టి ఆర్' గారు నా ట్వీట్‌ను రీట్వీట్ చేయడం విశేషం.

కట్ చేస్తే - 

కవి, సినీ గేయరచయిత, విమర్శకుడు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఎన్ టి ఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా అయిన సినారె గారి గురించి .. ఆయన జీవితం, జీవనశైలి గురించి .. ఆయనే రాసిన 'కర్పూరవసంతరాయలు' లాంటి ఒక రసాత్మాక కావ్యమే రాయొచ్చు. 

సినారె గారి కవిత్వం, ఇతర పుస్తకాలు కొన్ని, కనీసం ఒక డజన్ దేశవిదేశీ భాషల్లోకి ఆనువదించబడి ప్రచురితమయ్యాయి. 
 
కేవలం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ హాల్లోనే - ఆయన చేతులమీదుగా, నాకు తెలిసి, ఎలాంటి అతిశయోక్తి లేకుండా, కొన్ని వందల పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి. వాటిలో నావి కూడా రెండు పుస్తకాలుండటం నా అదృష్టం. 

వారి చేతులమీదుగా శాలువా కప్పించుకొన్న అదృష్టం కూడా నాకు కలిగినందుకు గర్విస్తున్నాను. 

అంతే కాదు, ఒక సందర్భంలో, సినారె గారితో కూర్చొని రోజూ రెండు గంటల చొప్పున కొన్నిరోజులపాటు గడిపిన అద్భుత అనుభవం నేనిప్పటికీ మర్చిపోలేను. 
      
తెలుగు సాహితీలోకంలో తెలంగాణ నిలువెత్తు సంతకం సినారె గారికి, వారి వర్ధంతి సందర్భంగా, ముకుళిత హస్తాలతో ఇదే నా నివాళి. 

Friday 11 June 2021

కెమికల్ ఇంజినీరింగ్‌లో కరోనా!

సుమారు ఒక నెల క్రితం అనుకుంటాను... ఒక ఇంగ్లిష్ కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఒక డాక్టర్, పేషెంట్ మధ్య సంభాషణ ఇలా ఉంటుంది:

పేషెంట్: డాక్టర్, ఈ కరోనా ఇంకెప్పుడు పోతుందంటారు?
డాక్టర్: సారీ, నేను జర్నలిస్టును కాదు. నాకు తెలియదు!

నిజంగా ఇప్పుడు అలాగే ఉంది మీడియాలో పరిస్థితి. 

సుమారు ఒక సంవత్సరం క్రితం ఒక ప్రముఖ స్వామీజీ కూడా "మే 5 వ తేదీ కల్లా కరోనా పూర్తిగా ఈ భూమ్మీదే లేకుండా మాయమైపోతుంది" అని జోస్యం చెప్పాడు. 

అప్పటి మే పోయింది, ఇంకో మే కూడా మొన్ననే పోయింది. కరోనా మాత్రం ఇంకా అలాగే ఉంది! 

ఇక సోషల్ మీడియాలో, వాట్సాపుల్లో చెప్పే అవసరం లేదు. కరోనా రాకుండా మనం ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యద్దో... వేలకొద్దీ సలహాలు, సూచనల లిస్టులూ, సందేశాలూ!  

కట్ చేస్తే - 

ఆమధ్య ఎంపిసిలో బయాలజీ అని, బయాలజీలో ఫిజిక్స్ అని పాలిటిక్స్‌లో ఒక మంచి సెటైర్ కొద్దిరోజులు మనందరినీ బాగా నవ్వించింది. 

ఈ కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో - ఇప్పుడు అలాంటిదే ఇంకో కొత్త "సెటైర్ వేరియెంట్" తాజాగా ఎంట్రీ ఇచ్చింది.  

కోవిడ్‌తో ప్రత్యక్షంగా పోరాడుతున్న డాక్టర్లు, దాని మీద నిరంతరం పరిశోధనలు చేస్తున్న వైరాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, సంబంధిత ఇతర సైంటిస్టులు ఏం మాట్లాడటం లేదు కాని - వీటన్నింటితో ఎలాంటి సంబంధంలేని కెమికల్ ఇంజినీర్లు, ఇంకొందరు నిత్యం 'వాగేడిక్ట్స్' మాత్రం కరోనా వైరస్ 101 వేరియెంట్స్ గురించి చెప్తున్నారు. అవన్నీ ఇండియా మీద దాడిచేస్తాయంటున్నారు. WHO కి, ICMR కి సలహాలిస్తున్నారు. చివరకు,  థర్డ్ వేవ్ వచ్చి 'ఇంటికొక్కరు చచ్చిపోతారు' అని ప్రజల్ని ప్యానిక్ చేస్తున్నారు!  

అసలు వీళ్లంతా ఏ అధారిటీతో ఇంత బాహాటంగా నోటికొచ్చినవి చెప్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు? 

ఇలాంటి చెత్తను వాగించడానికి టీవీ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ పోటీపడుతుండటం ఒక పెద్ద విషాదం. 

అధారిటీ లేని వ్యక్తులు ఇలాంటి నానా చెత్త వాగి, ప్రజల్ని ప్యానిక్‌కు గురిచేస్తుంటే వెంటనే యాక్షన్ తీసుకొనే చట్టాలు, యంత్రాంగం మన దేశంలో లేకపోవటం మరింత పెద్ద విషాదం. 

Wednesday 9 June 2021

ది బిగ్ బిజినెస్!

“Meanwhile, back at reality!"
- Robert Asprin 

సినిమా బేస్ క్రియేటివిటీనే. కాని, దాని టార్గెట్ మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే!  

ఇక్కడ నేను మాట్లాడుతున్నది కమర్షియల్ సినిమా గురించి... 

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. చూస్తుండగానే 30 కోట్ల నుంచి 100 కోట్లకు, 300 కోట్ల నుంచి 1000 కోట్లను అందుకొనే దాకా వెళ్ళింది బిజెనెస్! 

కట్ చేస్తే -

గత 15 నెలలుగా కొనసాగుతున్న కరోనావైరస్ లాక్ డౌన్ దెబ్బకు సినిమా బిజినెస్ చిన్నబోయింది. చిన్నబోవడం కూడా కాదు, పూర్తిగా చిన్నదైపోయింది! 

ఈ నేపథ్యంలో - అంతకు ముందటి  OTT ప్లాట్‌ఫామ్సే ఇప్పుడొక చిన్న ట్విస్ట్‌తో  ATT లయిపోయాయి. ATT లంటే  Any Time Theater లన్నమాట! "Pay Per View" పధ్ధతిలో పాపులర్ అయిపోయిన ఈ ఏటీటీ ల్లో ఇప్పుడు చిన్నవీ పెద్దవీ అని లేకుండా, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్క సినిమా 10 భాషల్లో కూడా రిలీజవుతోంది! 

వీటిలో ఎక్కువ సినిమాలు మైక్రో బడ్జెట్ సినిమాలు. వీటికి వందల కోట్ల బడ్జెట్, స్టార్స్ అక్కర్లేదు. చిన్న బడ్జెట్, కొత్త టాలెంట్ చాలు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం!  

ఈ ఓటీటీలు, ఏటీటీల కోసం - అందరూ ఆర్జీవీ లానో, ఇంకొకరిలానో హాట్, క్రైమ్ కంటెంట్ ఉన్న సినిమాలనే తీయాలన్న రూలేంలేదు. మంచి క్లాసిక్ కథలకు కూడా కొద్దిగా రొమాంటిక్ టచ్ ఇచ్చి హాటెస్ట్‌గా  కూడా తీయొచ్చు. ఆడియన్స్‌ను అంతకంటే ఎక్కువగా ఆకట్టుకోవచ్చు. ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఇంకెన్నో జోనర్స్‌లో కూడా సినిమాలు తీయొచ్చు. 

క్రియేటివిటీకి, బిజినెస్‌కు ఆకాశమే హద్దు.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు. 

మంచి రిస్క్ ఫ్రీ బిజినెస్ మోడల్ కూడా! 

దాదాపు 15 నెలల కోవిడ్ లాక్‌డౌన్ నిజంగా చుక్కలు చూపించింది. ఇప్పుడదంతా కవర్ చేయాలి. ఎంతో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ తప్పదు.  ఆల్రెడీ ముంబైలో 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరిచారు. ఇక అన్నిచోట్లా నెమ్మదిగా థియేటర్స్ తెరుస్తారు. అన్ని "వుడ్స్"లో షూటింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో... కేవలం ఓటీటీ, ఏటీటీల్లో రిలీజ్ కోసమే ఫీచర్ ఫిలిమ్స్ ప్లాన్ చేశాను. నా టీమ్‌తో కలిసి ప్రీప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాను. చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది.  


కట్ చేస్తే - 

ఈ బిగ్ బిజినెస్‌లో ఒక్క డబ్బే కాదు, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్... అన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా!
దటీజ్ న్యూ బిగ్ బిజినెస్!! 

Friday 4 June 2021

నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే...

Maniratnam @ 65
"నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి."
- మణిరత్నం 


మొన్న మణిరత్నం బర్త్‌డే నాడు ఒక ఆర్టికిల్ చూస్తున్నపుడు అతను చెప్పిన ఈ మాట కనిపించింది. 

ఇంటా బయటా ఎన్నో అనుభవించకపోతే, మణిరత్నం ఇంత గొప్ప వాస్తవం చెప్పేవాడు కాదు అని నాకనిపించింది. 

అంతదాకా ఎందుకు... మణిరత్నం డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్న రోజుల్లో సుహాసిని డేట్స్ అడిగితే ఇవ్వలేదు. మణిరత్నం అప్పుడు అంత పెద్ద డైరెక్టర్ కాదు. సుహాసిని మాత్రం అప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్!  

1987లో అనుకుంటాను... మణిరత్నం 'నాయకుడు' సినిమాతో డైరెక్టర్‌గా ఇండియాలోనే టాప్ రేంజ్‌కి ఎదిగిపోయాడు. 1988లో సుహసిని  అతన్ని పెళ్ళిచేసుకుంది. 

దటీజ్ సినిమా. :-)   

కట్ చేస్తే - 

ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, కొత్త కొత్త కథాంశాలతో మణిరత్నం ఇంకా సినిమాలు తీస్తున్నాడు. ప్రేక్షకులను అతని సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు. "ఇంకా మణిరత్నం సినిమాలెందుకు తీస్తున్నాడు?" అని విశ్లేషకులు రాస్తున్నది పట్టించుకోకుండా - మొన్న మొన్నే "ఓకే బంగారం" సినిమా తీసి, అడ్వాన్స్‌డ్ ట్రెండీ సబ్జెక్టులను కూడా తనెంత బాగా తీయగలడో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 

సుధ కొంగర, గౌతమ్ మీనన్, సుహాసిని, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకులుగా మొన్నీమధ్యే "పుతం పుదు కాలై" పేరుతో ఒక 5 అద్భుత కథల యాంథాలజీ సినిమాను నిర్మాతగా తీశాడు!  

తన మద్రాస్ టాకీస్ బ్యానర్‌లో ఇంకెన్నో కొత్త సినిమాల పనుల్లో ఇప్పటికీ బిజీగా ఉన్న లివింగ్ లెజెండ్ మణిరత్నం విషయంలో 'Age is just number' అన్నది వంద శాతం నిజం.