Saturday 29 February 2020

జీవితంలో ఆ స్వేచ్ఛ ముఖ్యం!

77 ఏళ్ల "మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యాన్" అండ్ నా ఫేవరేట్ ప్రొఫెసర్ ఒకరు పొద్దున లేస్తే ఫేస్‌బుక్‌లో ఒక రష్యన్ బ్యూటీ ఫోటో పెడతారు. ఛీర్స్ అంటూ ఒక స్కాచ్ బాటిల్ బొమ్మ పెడతారు.

విషయం ఇక్కడ ఆయన ఏం పోస్ట్ చేస్తున్నారన్నది కాదు.

ఆయన అనుకున్నది చేస్తున్నారు!

ఒక కొడుకుగా, ఒక విద్యార్థిగా, ఒక ఉద్యోగిగా, ఒక లవర్‌బాయ్‌గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక మామగా, ఒక తాతయ్యగా, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ... మా ప్రొఫెసర్ ప్రతి దశలోనూ తను అనుకున్నది చేశారు. అందరినీ మెప్పించారు. అందరి దృష్టిలో ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ మోస్ట్ కంప్లీట్ మ్యాన్‌గా ముద్రవేసుకున్నారు.

ఇప్పుడు ఆయన కొత్తగా సాధించాల్సిందీ, నిరూపించుకోవాల్సిందీ ఏమీ లేదు. కాబట్టే ఇంత స్వేచ్ఛగా తను అనుకున్నది చేయగలుగుతున్నాడు అనుకుంటాం మనందరం. 

కానీ, అది నిజం కాదు.

సుమారు గత 34 ఏళ్లుగా ఆయన నాకు బాగా తెలుసు. అప్పుడూ ఇప్పుడూ ఆయనలో ఎలాంటి మార్పు లేదు.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌లో తన డిపార్ట్‌మెంట్ ముందు కారిడార్‌లో ఎలాంటి సంకోచం లేకుండా సిగరెట్ కాల్చేవారు. తనకంటే కనీసం పాతికేళ్లు చిన్నవారైన స్టుడెంట్స్‌తో రష్యన్ అమ్మాయిల అందం గురించి, మాస్కో యూనివర్సిటీ క్యాంపస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చేసుకొనే పార్టీల గురించి, చదువు గురించి, చదివే పద్ధతి గురించి, ఉద్యోగాల గురించీ... యూనివర్సిటీలో గొడవల గురించి, డిపార్ట్‌మెంట్‌లో రాజకీయాల గురించీ... చాలా ఫ్రీగా, ఎలాంటి హిపోక్రసి లేకుండా మాట్లాడేవారు.

ఏ నిజమైనా నిర్మొహమాటంగా మొహం మీదే చెప్పేవారు.

ఇలాంటి సంభాషణ యూనివర్సిటీలోని మా ఇతర ప్రొఫెసర్స్ దగ్గర జాడకైనా కనిపించేదికాదు. ప్రతి చిన్న విషయానికి నానా కవరింగులు, నానా మాస్కులు వేసి మాట్లాడేవాళ్లు. 

బహుశా తను అనుకున్నది మాట్లాడ్దం, అనుకున్నట్లే చేయడం అనే ఈ మైండ్‌సెట్టే, ఈ జీవనశైలే ఆయన అంత సంపూర్ణమైన మనిషిగా, అంత సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా రూపొందడానికి కారణమైందనుకుంటాను.

ఏదేమైనా, ఒక కంప్లీట్ మ్యాన్ అంటే నాకు ఠక్కున కళ్లముందు ఒక ఫ్లాష్‌లా మెరిసేది మా ప్రొఫెసరే.

ప్రాణం కంటే విలువైనది స్వేచ్ఛ.

ఎవరికైనా సరే, జీవితంలో ఆ స్వేచ్ఛ ముఖ్యం.

స్వేచ్ఛ ఒకరిస్తే వచ్చేది కాదు... ఎవరికివారు సంపాదించుకోవాల్సిందే. 

Friday 21 February 2020

మనం బ్రతికేది ఎన్నిరోజులో ఒకసారి లెక్కేసుకుందామా?

మన పెద్దలు చాలా తెలివయినవాళ్లు. ఒకవైపు "నిదానమే ప్రదానం" అన్నారు. మరోవైపు, "ఆలస్యమ్ అమృతమ్ విషమ్" అని కూడా అన్నారు!

అవసరాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి... ఈ రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ నిర్ణయం మాత్రం మనదే.

ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన సమయంలో తీసుకొన్నవాడే విజేత. అది ఏ విషయంలోనయినా కావొచ్చు. సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం అనేది మాత్రం చాలా ముఖ్యం.

ఇందాకే చదివిన ఇంకో పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది...

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట!

అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు...

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా చాలా వేల రోజులున్నాయి.

కాని, ఏంటి గ్యారంటీ?

ఏ ట్రాఫిక్ లేని సమయంలోనో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాక్ అయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు.

గ్యారెంటీ ఏదీ లేదు.

దేనికీ లేదు.

అలాగని, ఇది నా నెగెటివ్ థింకింగ్ కాదు.

రియాలిటీ.

అయినా సరే... ఆ అంకెలు, ఆ లెక్కలే కళ్లముందు కనిపిస్తున్నాయి నాకు.

ఈ ఊహించని ప్రమాదాలు, రిస్కుల మధ్య ఇంకో పదేళ్లు బ్రతుకుతాము అనుకొంటే... అది జస్ట్ ఇంకో 3650 రోజులే!

లేదు, "అయిదేళ్లకంటే కష్టం" అనుకొంటే... అది జస్ట్ ఇంకో 1825 రోజులే!!

అంటే... ఇంక కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్టేగా?!

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం.

ఏదైనా కష్టం వస్తే భగవంతునిమీద భారం వేస్తాం. సుఖాల్లో ఉన్నప్పుడు అసలావైపే చూడం.

కాని... చూస్తుండగానే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి.

అసలు ఈ కోణంలో ఆలోచించడమే కష్టం...

అయితే ఇది భయం మాత్రం కాదు.

ఒకవేళ భయం అనుకున్నా, ఆ భయం నా చావు గురించి కాదు. చచ్చేలోపు నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలను, పనులను ఎక్కడ అసంపూర్ణంగా వదిలిపెడతానో అన్న ఆందోళన.

ఒకవేళ దీన్ని భయం అనుకుంటే, ఈ భయం ఎవరికైనా సరే చాలా అవసరం.

నా విషయంలో అయితే... నిజంగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి...

నా జీవితంలో మొట్టమొదటిసారిగా, పూర్తిచేయాల్సిన నా బాధ్యతల గురించి ఇప్పుడు నేను బాగా ఆలోచిస్తున్నాను.

ఈ విషయంలో ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకెప్పుడొస్తుంది నాకు?

ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే, నిజంగా ఆలస్యమ్ అమృతమ్ విషమే!

Thursday 20 February 2020

థాంక్ గాడ్!

పోస్టు పాతదే...

ఇదే బ్లాగ్‌లో కొన్ని నెలలక్రితం రాశాను. సందర్భం వచ్చి, ఇప్పుడు మళ్లీ  రాయాలనిపించింది.

కట్ చేస్తే -  

ఆమధ్య ఒక మాతాజీ ఉవాచ చదివాను.

మన కష్టాలు ఎవరితోనూ చెప్పుకోవద్దట. చెప్పుకున్నా లాభం ఉండదట.

ఒకవేళ చెప్పుకున్నా .. 20% మంది అసలు పట్టించుకోరట. 80% మంది "వీడికి బాగా అయ్యిందిలే" అని ఎంజాయ్ చేస్తారట.

ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోవడం బెటర్.. అంతా ఆయనే చూసుకుంటాడు అని.

"మతం అనేది మానవ సృష్టి" అనేది నేను బాగా నమ్ముతాను.

అలాగని నేను నాస్తికున్ని కాదు.

ఎదుటివాడిని బాధపెట్టనంతవరకు, అందరి వ్యక్తిగత నమ్మకాలను నేను విధిగా గౌరవిస్తాను.

అదొక క్రమశిక్షణ.

అదొక సంస్కారం.

అంతే.

ఇందాక మాత చెప్పినదాంట్లో .. "ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోండి. అంతా ఆయనే చూసుకుంటాడు" అన్న చివరి వాక్యం గురించి నాకంతగా తెలీదు. కానీ, ఆమె చెప్పిన అసలు పాయింట్‌లో మాత్రం చాలావరకు వాస్తవం ఉందని నేననుకుంటున్నాను.

లెక్కలోనే నాకు తోచిన ఒక చిన్న సవరణ...

మన కష్టాలు విని 80% ఎగతాళి చెయ్యొచ్చు. 19% అసలు కేర్ చెయ్యకపోవచ్చు.

కానీ 1% మాత్రం స్పందిస్తారు. కనీసం వింటారు. సహాయం చెయ్యకపోయినా ఒక నైతికబలాన్నిస్తారు. నీ ఇబ్బంది గురించి తెల్సిన నేనొకర్ని ఉన్నాను. నువ్వేం ఒంటరివి కాదు. పోరాడు. సమస్యను పరిష్కరించుకో. అది నీకు సాధ్యమే అన్న ఒక భరోసాని వారి ఉనికి ద్వారానే తెలియజేస్తారు.

ఇది నిజంగా చాలా పెద్ద సహాయం.

ఈ 1% మాత్రమే మన మిత్రులు, శ్రేయోభిలాషులు.

కంటికి కనిపించే మన నిజమైన దైవాలు. 

Wednesday 19 February 2020

'30:30:40' ... ది రీస్ ఫిలాసఫీ!

"మన జీవితంలోని ఏ దశలోనైనా,
మన చుట్టూ ఉన్నవారిలో.. 
30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు.
30 శాతం మంది మనల్ని ద్వేషిస్తారు.
మిగిలిన 40 శాతం మంది
అసలు మన గురించి పట్టించుకోరు!"

గాబ్రియెలె రీస్ ఎంత సింపుల్‌గా చెప్పింది!

అమెరికన్ బీచ్ వాలీబాల్ స్టార్, ఫ్యాషన్ మోడల్, నటి, స్పోర్ట్స్ ఎనౌన్సర్, టీవీ హోస్ట్, ప్రేయసి, తల్లి, భార్య, (క్రమం అదే!) అథ్లెట్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, బెస్ట్ సెల్లర్ రైటర్, మొత్తంగా ప్రపంచం మెచ్చిన ఒక సెలబ్రిటీ ...

ఇవన్నీ కలిస్తే ఒక గాబ్రియెలె రీస్.

ఫ్లారిడా స్టేట్‌కు వాలీబాల్ ఆడుతున్నప్పుడే రీస్ లుక్స్‌కి పడిపోయి ఫాషన్ మోడలింగ్ ఆమెని ఆహ్వానించింది. తర్వాత, "సెరెండిపిటీ" వంటి చిత్రాల్లో నటిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తర్వాత స్పోర్ట్స్ అనౌన్సర్‌గా, టీవీ హోస్ట్‌గా  ESPN, NBT, MTV Sports, Fit TV/Discovery వంటి పాప్యులర్ చానెల్స్‌లో వద్దంటే అవకాశాలు.

తర్వాత.. తనకు నచ్చిన స్నేహితునితో సహజీవనం చేసింది. ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయింది. ఆ తర్వాతే తన సహజీవన నేస్తాన్ని పెళ్లి చేసుకొని భార్య అయింది. తర్వాత అథ్లెట్ అయింది. ఫిట్‌నెస్ ట్రైనర్ అయింది. మధ్యలో గోల్ఫ్‌ని కూడా వదల్లేదు. రెండు పుస్తకాలు రాసి బెస్ట్ సెల్లర్ రైటర్ కూడా అయింది రీస్.

ఇవి చాలవూ.. రీస్ ప్రపంచస్థాయి సెలెబ్రిటీగా పాప్యులర్ కావడానికి?

తను ఎన్నుకున్న ప్రతిరంగంలోనూ సక్సెస్ సాధించింది. తన మనస్సాక్షినే నమ్మింది. తను అనుకున్నది చేసుకుంటూపోయింది. తను కోరుకున్న జీవనశైలినే ఎంజాయ్ చేస్తూ హాయిగా సంతృప్తిగా జీవిస్తోంది రీస్.

మనకు తెలిసి, మనకున్న ఈ ఒక్క జీవితానికి అంతకన్నా ఏం కావాలి?

దటీజ్ గాబ్రియెలె రీస్ ...

కట్ టూ రీస్ ఇంటర్వ్యూ - 

ఈ మధ్యే రీస్ ఇంటర్వ్యూ ఒకటి విన్నాను. ఆ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట ఇది:

"మన జీవితంలోని ఏ దశలోనైనా, మన చుట్టూ ఉన్నవారిలో..  30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు. 30 శాతం మంది మనల్ని ద్వేషిస్తారు. మిగిలిన 40 శాతం మంది అసలు మన గురించి పట్టించుకోరు!"

ఈ జీవితవాస్తవం తెలిసినవాళ్లు అసలు దేన్నీ పట్టించుకోరు. తాము చేయాలనుకొన్నది చేసుకొంటూ వెళతారు.

కంప్లీట్ ఫ్రీడమ్! 

రీస్ విజయాల పరంపర వెనకున్న అసలు ఫిలాసఫీ ఇదన్నమాట!

సమాజంతో ముడిపడ్డ, సమాజంపట్ల మన మైండ్‌సెట్‌తో ముడిపడ్ద ఒక గొప్ప జీవితసత్యాన్ని చాలా సింపుల్‌గా చెప్పింది రీస్.

ఇంటాబయటా రకరకాల వత్తిళ్లతో, తీవ్రమైన స్ట్రెస్‌లో నేనున్న ఈ సమయంలో... ఈ సత్యం... ప్రపంచంపట్ల నా దృక్పథాన్నే సంపూర్ణంగా మార్చివేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను.

కానీ నిజం.

Tuesday 18 February 2020

ఏదీ ఆగిపోకూడదు!

కుదిరితే పరిగెత్తు,
లేకపోతే నడువు.
అదీ చేతకాకపోతే,
పాకుతూ పో...
అంతేకానీ ఒకే చోట అలా
కదలకుండా ఉండిపోకు...
- శ్రీశ్రీ

గతకొద్దిరోజులుగా పూర్తిగా ఒకే ఒక్క లక్ష్యం ఫోకస్డ్‌గా పనిచేసుకొంటూ వెళ్తున్నాను.

స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా, మరోవైపు సర్జరీ అయిన నా ఎడమకాలు ఊహించని సమయాల్లో స్టక్ అవుతూ, నడవనీయకుండా ఇబ్బందిపెడుతున్నాపెద్దగా పట్టించుకోవడంలేదు.

నా కొత్త సినిమా, కొత్త ఆఫీసు ప్రారంభించేదాకా వేటినీ పట్టించుకొనే మూడ్‌లో నేను లేను. నా టీమ్ లేదు. 

ఆ అవకాశం కూడా మాకు లేదు.

సుమారు పదిరోజులుగా సోషల్ మీడియాను పూర్తిగా మర్చిపోయాను.

'వ్రాయడం' నా ఫస్ట్ లవ్ కాబట్టి... ఒక స్ట్రెస్ బస్టర్‌లా, ఒక యోగాలా, ఒక థెరపీలా నాకు ఉపయోగపడుతుంది కాబట్టి... అప్పుడప్పుడూ ఏదో ఒకటి ఇలా బ్లాగ్‌లో స్క్రిబిల్ మాత్రం చేస్తున్నాను.

ఒక వారం పడుతుందో, నెల పడుతుందో తెలీదుగాని, ఒక నిర్మాణాత్మకమైన పర్పస్ లేకుండా  ఊరికే ఏవో టైమ్‌పాస్ పోస్టులు, ట్వీట్లు ఈ సమయంలో నాకస్సలు ఇష్టం లేదు. 

ఇప్పటిదాకా సెకండరీగా తీసుకొని, నేను పెద్దగా పట్టించుకోని సినిమాను ఇప్పుడు కొంతకాలం నా ప్రైమరీ ప్రొఫెషన్‌గా తీసుకొంటున్నాను. వరుసగా సినిమాలు చేసుకొంటూపోవడమే పని.

మధ్యలో కేసీఆర్ మీద నేను రాసి పబ్లిష్ చేస్తున్న పుస్తకం, నా సినిమాస్క్రిప్టు రచనాశిల్పం రివైజ్‌డ్ సెకండ్ ఎడిషన్ పుస్తకం... వరుసగా విడుదలకు లైన్లో ఉన్నాయి.

ఇంకా... ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ డాక్యుమెంటరీ, యాడ్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సీరీస్‌లు, ప్రమోషన్ ఈవెంట్స్, ఫ్యాషన్‌షోలు, అవార్డ్ ప్రోగ్రాములూ, చారిటీ యాక్టివిటీ...  ఎట్సెట్రా ఎట్సెట్రా...       

సో మచ్ టు డు, సో లిటిల్ టైమ్...

“What you focus on expands. So focus on what you want, not what you do not want.”
― Esther Jno-Charles

Sunday 16 February 2020

గాయం ఏదైనా కానీ...

మనిషన్నాక మనసంటూ ఒకటి ఉండక తప్పదు. మనసంటూ ఉన్నాక అది ఏదో ఒకరోజు గాయపడకా తప్పదు.

కారణం ఏదైనా కానీ, భరించేవారికే ఆ నొప్పి తెలుస్తుంది.

ఈ భూమ్మీద ఏదైనా ఒక మనసు బాధపడుతోందంటే ప్రధానంగా రెండే రెండు కారణాలుంటాయి:

ఒకటి మానవ సంబంధాలు. రెండోది ఆర్థిక సంబంధ కారణాలు.

ఇవి వ్యక్తిగతం.

కులాలు, మతాలు, జాత్యహంకారం, భౌతికపరమైన హింస... ఇలాంటివన్నీ మూడో కారణం  అనుకోవచ్చు.

ఇవి సాంఘికం లేదా సామాజికం.

గాయం ఏదైనా కానీ, అది మనకు బాధకలిగిస్తుంది.

కొన్ని సందర్భాల్లో ఆ పెయిన్ ఊహించలేనంత స్థాయిలో ఉంటుంది.

అయితే ఈ నొప్పి మనకు కలిగేది బాధపడటానికో, విచారపడడానికోకాదు... 'ఊహించనివిధంగా ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి జీవితంలో' అని మనల్ని అలర్ట్ చేయడానికి!

మనం ఎంత పెయిన్‌లో ఉన్నా, ఇంత పాజిటివ్‌గా ఆలోచించడం కూడా మనకు చాలా అవసరం.

ఎక్కన్నించో ఒక పదునైన బాణం ఏదో ఒక రూపంలో వచ్చి, సూటిగా గుండెల్లోకి దిగి, లోతైన గాయంచేసినప్పుడే కదా... నిజంగా మనం బాధపడేదీ, అలర్ట్ అయ్యేదీ...

"మనం అడవిలో ఉన్నాం అనుకొని ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు, ఏవైపునుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలీదు!"

కొన్ని నిజాల్ని పూరి జగన్నాథ్ చెప్పినంత బాగా మరొకరు చెప్పలేరు.     

Saturday 15 February 2020

నేను బాగా ఇష్టపడే అందం

ఓ ఆరునెలల క్రితం అనుకుంటాను, ఈ బ్లాగ్‌లోనే, ఇదే టాపిక్ మీద ఒక పోస్ట్ రాశాను...

వైజాగ్, సముద్రం...

అవి నన్ను ఇంకా హాంట్ చేస్తున్నాయి. అందుకే మళ్లీ రాయాలనిపించింది. రాస్తున్నాను.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను.

వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తోంది. ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను.

వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం.

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను.

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను. ఈ బ్లాగ్ రాయడానికి కొన్ని నిమిషాల ముందువరకూ కూడా నేను చేసిందదే.

ఒక వారం రోజుల ఘోస్ట్ రైటింగ్ వర్క్ వుంది. ఈసారి ఆ పనిని వైజాగ్‌లో పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నాను.

తర్వాత నా సినిమాకోసం కూడా స్క్రిప్ట్ రైటింగ్ పూర్తిచేయాల్సివుంది. ఈ పని కూడా వైజాగ్‌లోనే ప్లాన్ చేస్తున్నాను.

సముద్రం అంటే నాకంత ఇష్టం.

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను.

సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను.

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్... 

Friday 14 February 2020

ఈ రివ్యూకి ఎన్ని చుక్కలివ్వొచ్చు?

> సెకండాఫ్‌లో డైరెక్టర్‌ పూర్తిగా తేలిపోయాడు.
> కథను ఏ కోణంలో రక్తికట్టించలేకపోయాడు.
> బోరింగ్‌, సాగదీత సీన్లు థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటాయి.
> కొన్ని ఎమోషన్‌ సీన్లు కట్టిపడేసేలా ఉంటాయి.
> 'ప్రీ క్లైమాక్స్‌కు ముందు విజయ్‌ ఇచ్చే స్పీచ్‌ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుంద'నుకున్న తరుణంలో.. అర్జున్‌రెడ్డి క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగిస్తాడు.
> కథ కొత్తగా, వినూత్నంగా ఉంది.
> సీన్లు కూడా బాగున్నాయి.
> విజయ్‌ దేవరకొండ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.
> అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్‌ కాలేదు.
> దర్శకుడు తన ప్రతిభను, మ్యాజిక్‌ను తెరపై పర్‌ఫెక్ట్‌గా చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. 

> సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
> హీరో, హీరోయిన్లను చాలా అందంగా చూపించారు.
> స్క్రీన్‌ ప్లే గజిబిజీగా కాకుండా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది.
> ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది.
> పాటలు ఓ మోస్తారుగా ఉన్నాయి.
> బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొన్ని చోట్ల మె​స్మరైజ్‌ చేసేలా ఉంటుంది.
> క్రాంతి మాధవ్‌ అందించిన మాటలు ఆకట్టుకుంటాయి.
> ‘కలం కాగితం లేకుండా ప్రపంచ చచ్చిపోతుంది, రాయడం అంటే రచయిత తన ఆత్మను పంచడం' అంటూ చెప్పే డైలాగ్‌లు ఆలోచించే విధంగా ఉంటాయి. 
> నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
> నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమాను తెరపై చూస్తే అర్థమవుతుంది.
> చివరగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాకపోయినా విజయ్‌ దేవరకొండ కనెక్ట్‌ అయ్యాడు.

కట్ చేస్తే - 

పైన మీరు చదివిందంతా ఇప్పుడే ఆన్‌లైన్లో నేను చదివిన ఒక రివ్యూలోని చివరి రెండు పేరాగ్రాఫులు. క్లారిటీ కోసం వాక్యం కింద వాక్యం పెట్టాను. 

"కథ కొత్తగా వినూత్నంగా ఉంది. దర్శకుని స్క్రీన్‌ప్లే బాగుంది. అతను రాసిన మాటలు బాగున్నాయి. సీన్లు కట్టిపడేసేలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిచోట్ల మెస్మరైజ్ చేస్తుంది. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు. హీరో విజయ్ దేవరకొండ నటన సినిమాకు ప్రాణంపోసేవిధంగా ఉంది..."

ఒక సినిమా విజయానికి ఇవన్నీ అతిముఖ్యమైనవి. మరి సినిమాకు మాత్రం రెండుంపావు చుక్కలే! అదే స్టార్స్...

ఒక వాక్యంలో ఒకటి బాగుందని చెప్తూ, ఇంకో వాక్యంలో ఒకటి బాగాలేదని చెప్తూ, ఇంత గొప్ప "బ్యాలెన్సింగ్" టోన్‌లో రాసిన ఈ రివ్యూ చదివిన ప్రేక్షకులు అసలు సినిమా బాగుందనుకోవాలా బాగాలేదనుకోవాలా?   

ఇదిలా వుంటే -

"వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాకపోయినా విజయ్‌ దేవరకొండ కనెక్ట్‌ అయ్యాడు" ... ఈ చివరివాక్యం నాకు అస్సలు అర్థంకాలేదు!

సరదాగా... రివ్యూలకి కూడా చుక్కలిస్తే ఎలా ఉంటుంది?
Just kidding...   :)
^^^

Disclaimer:
ఈ సినిమా హీరోగానీ, దర్శకుడుగానీ, నిర్మాతగానీ నాకు చుట్టాలు కాదు. 

The Show Must Go On ...

ఇవ్వాళ పొద్దున్నే ఒక ట్వీట్ చూసి కళ్ళల్లో నీళ్లొచ్చాయి నాకు.

గత కొద్దిరోజులుగా ఒక అతిముఖ్యమైన లక్ష్యం మీద పనిచేస్తూ, సోషల్ మీడియాను అసలు పట్టించుకోలేదు. పొద్దున అనుకోకుండా ట్విట్టర్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేశాను.

చూస్తే ఈ ట్వీట్...

గత పదిహేనేళ్లుగా ఫిబ్రవరి 13 అర్థరాత్రి క్రమం తప్పకుండా ఒక గ్రీటింగ్ అందుకొంటున్న నా మిత్రుడికి నిన్నరాత్రి ఆ గ్రీటింగ్ రాలేదు.

బహుశా ఒక రెండునిమిషాలైనా తన టెక్స్‌ట్ మెసేజెస్ ఇన్‌బాక్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ల ఇన్‌బాక్సులను పిచ్చిగా చెక్ చేసుకొని ఉంటాడు. అంతకుముందు మెసేజెస్ ఏవైనా ఉంటే మళ్లీ చదువుకొనుంటాడు.

అవును... 'ప్రేమ పుట్టింనంత ఈజీ కాదు, అది లేనప్పుడు తట్టుకోవడం.'

నిజంగా నిన్నరాత్రి నా మిత్రునికి ఎంత బాధాకరమైన రాత్రో నేనూహించగలను. పదిహేనేళ్లుగా ఎప్పుడూ మిస్ కాని ఆ మెసేజ్ ఈ సారి మిస్అయింది.

రాలేదు.

ఇక ఎన్నటికీ రాదు కూడా...

కొన్ని నెలలక్రితం ఆమె మరణవార్తను నా మిత్రుడు నాకు ఫోన్‌లో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఇప్పటికీ అది నిజం కాకపోతే బాగుండు అనుకుంటున్నాను. నిజం కాదనే అనుకుంటున్నాను.

కానీ, అదే నిజం.

అదే జీవితం.

తప్పదు... ది షో మస్ట్ గో ఆన్...

Happy Valentines Day! 

Thursday 6 February 2020

చాలామందికి ఇది 'వన్ వే!'

నాకు తెలిసి 'సినిమా కష్టాలు' పడకుండా ఇండస్ట్రీలో పైకివచ్చినవారు లేరు!

ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంతో టాలెంట్ ఉండి మరెంతో టాప్ రేంజ్‌లోకి వచ్చినా సరే .. ఏదో ఒక టైమ్‌లో, ఏదో ఒక రూపంలో ఈ సినిమా కష్టాలనేవి ఈ రంగంలో ఉండేవాళ్లను తప్పక ఎటాక్ చేస్తాయి.

ఈ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఉండదు.

ఒక టాప్ రేంజ్ హీరోగా తన సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించిన ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నివసించే ఇంటిని బ్యాంక్ వాళ్లు వేలానికి పెట్టే పరిస్థితి వచ్చింది ఒక దశలో.

అప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, బాగా సంపాదించి, ఇంకా అదే రేంజ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ సుమారు 85 కోట్లు పోగొట్టుకొని ఆర్థికంగా ఒక్కసారిగా మైనస్‌లోకి వెళ్లిపోయాడు. మొన్నీమధ్యకూడా "ఇస్మార్ట్ శంకర్" కు ముందు, పూరీ దగ్గర యాభై వేలుకూడా లేని పరిస్థితి గురించి కొన్నిరోజులక్రితం ఆయన పుట్టినరోజునాడు ఒక కార్యక్రమంలో ఛార్మి ఎంతో ఎమోషనల్‌గా చెప్పింది.

భాయ్‌జాన్ బజ్‌రంగ్, బాహుబలి వంటి భారీ హిట్స్‌తో చరిత్ర సృష్టించిన రచయిత విజయేంద్రప్రసాద్, అప్పట్లో చదివించే స్థోమతలేక తన కొడుకు రాజమౌళి చదువుని ఇంటర్‌మీడియట్‌తోనే ఆపేశారు.

ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చి చరిత్ర సృష్టించిన తర్వాత కూడా, ఒక మేవరిక్ దర్శకుడు, ఆయన టీమ్ .. తమ సొంత బేనర్లో మరో సినిమా చేస్తున్న సమయంలో .. లంచ్‌కి డబ్బుల్లేక బండిమీద రేగుపళ్లు కొనుక్కుని తిన్నారంటే నమ్ముతారా?

ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వగలను.

దీన్నిబట్టి అసలు సక్సెస్‌లు లేనివారి కష్టాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఎవరైనా చాలా ఈజీగా ఊహించవచ్చు.

సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే -

సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!

సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు!!

ఇది నిజం... నేనెప్పుడూ సినిమాఫీల్డులోకి పూర్తిస్థాయిలో దిగలేదు. అయినా సరే, దీన్లోంచి పూర్తిగా బయటపడాలంటే ఇప్పుడు నాకు జేజమ్మ కనిపిస్తోంది.

దటీజ్ సినిమా.

సో, ఇప్పుడు నా వ్యూహం మార్చుకొన్నాను... ఒక స్పష్టమైన లక్ష్యంతో, సినిమాల్లో కూడా నా ప్రొఫెషన్‌ను ఇప్పుడు పూర్తిస్థాయిలో కొనసాగిస్తున్నాను.

కట్ చేస్తే - 

పైనరాసిన మొత్తానికి ఒక మంచి పాజిటివ్ ఎపిలోగ్ ఏంటంటే ...

సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే మాత్రం ఏ కష్టాలూ ఉండవు.

బాగా సంపాదించొచ్చు కూడా!

స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్.'

అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అందరివల్ల కూడా కాదు.

ఒక సరైన గైడ్ లేదా మెంటర్ ఉంటే తప్ప...  

Tuesday 4 February 2020

ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం.

'బ్లాగింగ్' అనేది ఒక ఎడిక్షన్‌లా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడూ.

అలాగని దీనికోసం నేనెప్పుడూ గంటలు గంటలు నా సమయాన్ని వృధా చేయలేదు.

రాయాలనుకున్నది రాస్తాను. లేదంటే... బ్లాగ్ ఓపెన్ చేశాకనే, "ఏం రాయాలా" అనుకుంటూనే మొదలెట్టి, రాయడం ముగించేస్తాను నిమిషాల్లో.

ఇదిగో, ఇప్పుడలాగే మొదలెట్టాను...

నా బ్లాగింగ్ ఒక ఫ్లో.

ఈ ఫ్లోలో ఏ హిపోక్రసీ, ఏ ఇన్‌హిబిషన్స్ ఉండవు. నేను రాయాలనుకున్నది రాస్తాను. నచ్చినవాళ్లు చదువుతారు. నచ్చనివాళ్లు ఒకే ఒక్క క్లిక్‌తో ఇంకో బ్లాగ్‌లోకో, సైట్ లోకో వెళ్లిపోతారు. అంతే.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడం కోసం మాత్రం నాకు ఈ బ్లాగ్ నిజంగా తప్పనిసరి.

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకు... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్. ఒక పిచ్చి.

ఇదంతా చాలావరకు నా వ్యక్తిగతం.

అంతకుముందు రాజకీయాలు, అవీ ఇవీ ఈ బ్లాగ్‌లోనే రాశాను. ఇప్పుడు మాత్రం వాటిని కేవలం నా ట్విట్టర్‌కు పరిమితం చేశాను. 

దాన్నలా పక్కన పెడితే - వైజాగ్ కేంద్రంగా, త్వరలో నేను ప్రారంభించబోతున్న నా కొత్త సినిమా నేపథ్యంలో మాత్రం ప్రొఫెషనల్‌గా ఇప్పుడు ఈ బ్లాగ్ అవసరం నాకు చాలా ఉంది.

కాని... సినిమాలు సినిమాలే, బ్లాగింగ్ బ్లాగింగే.

నామట్టుకు నాకు, బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం. ఒక అద్దం.

ఈ అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నాను. నాలో ఉన్న నన్ను ని విశ్లేషించుకుంటున్నాను. 

Saturday 1 February 2020

ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు!

ఎన్‌బిఏ లెజెండ్, బాస్కెట్ బాల్ దిగ్గజం కోబే బ్రయాంట్ తన కూతురితో  సహా అలా హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడని ఎవరైనా ఊహించారా?

అంతకుముందు హీరోయిన్ సౌందర్య?

అంతే.

కొన్ని మన చేతిలో ఉండవు.

జననమరణాలే కాదు. వ్యక్తిగత, వృత్తిగత విషయాల్లో కూడా మనం కలలో కూడా ఊహించని సంఘ్టనలు కొన్ని జరుగుతాయి. తర్వాతి పరిణామాలు కూడా ఊహించనిస్థాయిలో ఉంటాయి.

జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు... 

ఈ భూమి మీదకు
ఇదొక చిన్న ప్రయాణం.
ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.
ఏవో కొన్ని జ్ఞాపకాలను వదిలి
ఒక్కొక్కరుగా అందరం
ఎలాగూ పోయేవాళ్ళమే.
కాస్త ముందూ వెనకా, అంతే.

ఈ లోగానే...
అర్థంలేని ఈ ఉరుకులు పరుగులు
ఇన్ని తలకు మించిన భారాలు
ఎన్నో కష్టాలు
ఇన్ని విద్వేషాలూ
ఇంత విషం చిమ్ముకోవడం
నిజంగా అవసరమా?

కొంచెం సంతోషం కూడా పంచుకుందాం...

సంవత్సరం క్రితం నా చిన్న తమ్మున్ని కోల్పోయాను. అంతకు రెండేళ్లక్రితం మా అమ్మ మాకు దూరమైపోయింది.

చావు, పుట్టుకలు మనచేతిలో ఉండకపోవచ్చు. మనం అస్సలు ఊహించనివిధంగా జరగొచ్చు. కానీ, ఇవి జరిగిన సమయంలో నేను నేనుగా లేను. జీవితంలోని విషాదాన్ని కూడా తనివితీరా అనుభవించలేకపోయాను. అది నన్ను ఇంకా ఇంకా బాధిస్తుంది.

ఏవేవో గుర్తుకొస్తున్న ఈ క్షణం,  అంతా ఒక మాయలా అనిపిస్తుంది. నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలిలా జరిగిందా అనిపిస్తుంది.

కానీ, అన్నీ జరిగాయి.

మంచీ, చెడూ. ఆనందం, విషాదం.

అదే జీవితం.

జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా .. అందరూ చివరికి ఏదో ఒక శక్తికి, ఒక నమ్మకానికి సరెండర్ అవ్వాల్సిందే.

ఆ శక్తికి, ఆ నమ్మకానికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. కానీ, సరెండర్ అవ్వక మాత్రం తప్పదు.

అప్పుడే అంతా బాగుంటుంది.

ఆనందమైనా, కన్నీళ్లయినా.

అదే జీవితం.

అదే ఆధ్యాత్మికమ్.

అదే హిప్పీస్. అదే ఓషో. అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అదే ఇష యోగా... ఇంకో వంద రూపాలు, వంద పేర్లు.

లక్ష్యం ఒక్కటే... ఆనందం.

ఈ క్షణం సంతోషంగా ఉండగలగడం. అనుక్షణం జీవించగలగటం. 

ఆధ్యాత్మికంలో ఉండే ఆ నిరాడంబరత వేరు. ఆ నిర్మలత్వం వేరు.

దీనికోసం ముసలాళ్లు అయ్యేదాకా ఆగనక్కర్లేదు. వయసులోనే ఆధ్యాత్మికాన్ని ఆలింగనం చేసుకోవచ్చు. జీవితం ఇచ్చే అన్ని ఆనందాలనూ హద్దులు లేకుండా అనుభవించవచ్చు.

Being spiritual does not mean giving up everything. The true test is to have everything and yet not to attached to them.