Saturday 29 February 2020

జీవితంలో ఆ స్వేచ్ఛ ముఖ్యం!

77 ఏళ్ల "మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యాన్" అండ్ నా ఫేవరేట్ ప్రొఫెసర్ ఒకరు పొద్దున లేస్తే ఫేస్‌బుక్‌లో ఒక రష్యన్ బ్యూటీ ఫోటో పెడతారు. ఛీర్స్ అంటూ ఒక స్కాచ్ బాటిల్ బొమ్మ పెడతారు.

విషయం ఇక్కడ ఆయన ఏం పోస్ట్ చేస్తున్నారన్నది కాదు.

ఆయన అనుకున్నది చేస్తున్నారు!

ఒక కొడుకుగా, ఒక విద్యార్థిగా, ఒక ఉద్యోగిగా, ఒక లవర్‌బాయ్‌గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక మామగా, ఒక తాతయ్యగా, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ... మా ప్రొఫెసర్ ప్రతి దశలోనూ తను అనుకున్నది చేశారు. అందరినీ మెప్పించారు. అందరి దృష్టిలో ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ మోస్ట్ కంప్లీట్ మ్యాన్‌గా ముద్రవేసుకున్నారు.

ఇప్పుడు ఆయన కొత్తగా సాధించాల్సిందీ, నిరూపించుకోవాల్సిందీ ఏమీ లేదు. కాబట్టే ఇంత స్వేచ్ఛగా తను అనుకున్నది చేయగలుగుతున్నాడు అనుకుంటాం మనందరం. 

కానీ, అది నిజం కాదు.

సుమారు గత 34 ఏళ్లుగా ఆయన నాకు బాగా తెలుసు. అప్పుడూ ఇప్పుడూ ఆయనలో ఎలాంటి మార్పు లేదు.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌లో తన డిపార్ట్‌మెంట్ ముందు కారిడార్‌లో ఎలాంటి సంకోచం లేకుండా సిగరెట్ కాల్చేవారు. తనకంటే కనీసం పాతికేళ్లు చిన్నవారైన స్టుడెంట్స్‌తో రష్యన్ అమ్మాయిల అందం గురించి, మాస్కో యూనివర్సిటీ క్యాంపస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చేసుకొనే పార్టీల గురించి, చదువు గురించి, చదివే పద్ధతి గురించి, ఉద్యోగాల గురించీ... యూనివర్సిటీలో గొడవల గురించి, డిపార్ట్‌మెంట్‌లో రాజకీయాల గురించీ... చాలా ఫ్రీగా, ఎలాంటి హిపోక్రసి లేకుండా మాట్లాడేవారు.

ఏ నిజమైనా నిర్మొహమాటంగా మొహం మీదే చెప్పేవారు.

ఇలాంటి సంభాషణ యూనివర్సిటీలోని మా ఇతర ప్రొఫెసర్స్ దగ్గర జాడకైనా కనిపించేదికాదు. ప్రతి చిన్న విషయానికి నానా కవరింగులు, నానా మాస్కులు వేసి మాట్లాడేవాళ్లు. 

బహుశా తను అనుకున్నది మాట్లాడ్దం, అనుకున్నట్లే చేయడం అనే ఈ మైండ్‌సెట్టే, ఈ జీవనశైలే ఆయన అంత సంపూర్ణమైన మనిషిగా, అంత సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా రూపొందడానికి కారణమైందనుకుంటాను.

ఏదేమైనా, ఒక కంప్లీట్ మ్యాన్ అంటే నాకు ఠక్కున కళ్లముందు ఒక ఫ్లాష్‌లా మెరిసేది మా ప్రొఫెసరే.

ప్రాణం కంటే విలువైనది స్వేచ్ఛ.

ఎవరికైనా సరే, జీవితంలో ఆ స్వేచ్ఛ ముఖ్యం.

స్వేచ్ఛ ఒకరిస్తే వచ్చేది కాదు... ఎవరికివారు సంపాదించుకోవాల్సిందే. 

2 comments:

  1. స్వేచ్ఛ గురించి బాగుగా చెప్పారు.

    newsgita.com

    ReplyDelete
  2. స్వచ్ఛమైన స్వేచ్ఛంటే...
    ...................

    ఎవరో ఇచ్చేదికాదు
    సులభంగా వచ్చేది కాదు
    మనకు మాత్రమే నచ్చేదికాదు

    ఇతరులమనసునొచ్చేది కారాదు
    కొందరిమనసులనైనా గెలిచేది
    కావాలి

    గాదిరాజు మధుసూదన రాజు

    ReplyDelete