Friday 14 February 2020

ఈ రివ్యూకి ఎన్ని చుక్కలివ్వొచ్చు?

> సెకండాఫ్‌లో డైరెక్టర్‌ పూర్తిగా తేలిపోయాడు.
> కథను ఏ కోణంలో రక్తికట్టించలేకపోయాడు.
> బోరింగ్‌, సాగదీత సీన్లు థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటాయి.
> కొన్ని ఎమోషన్‌ సీన్లు కట్టిపడేసేలా ఉంటాయి.
> 'ప్రీ క్లైమాక్స్‌కు ముందు విజయ్‌ ఇచ్చే స్పీచ్‌ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుంద'నుకున్న తరుణంలో.. అర్జున్‌రెడ్డి క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగిస్తాడు.
> కథ కొత్తగా, వినూత్నంగా ఉంది.
> సీన్లు కూడా బాగున్నాయి.
> విజయ్‌ దేవరకొండ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.
> అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్‌ కాలేదు.
> దర్శకుడు తన ప్రతిభను, మ్యాజిక్‌ను తెరపై పర్‌ఫెక్ట్‌గా చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. 

> సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
> హీరో, హీరోయిన్లను చాలా అందంగా చూపించారు.
> స్క్రీన్‌ ప్లే గజిబిజీగా కాకుండా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది.
> ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది.
> పాటలు ఓ మోస్తారుగా ఉన్నాయి.
> బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొన్ని చోట్ల మె​స్మరైజ్‌ చేసేలా ఉంటుంది.
> క్రాంతి మాధవ్‌ అందించిన మాటలు ఆకట్టుకుంటాయి.
> ‘కలం కాగితం లేకుండా ప్రపంచ చచ్చిపోతుంది, రాయడం అంటే రచయిత తన ఆత్మను పంచడం' అంటూ చెప్పే డైలాగ్‌లు ఆలోచించే విధంగా ఉంటాయి. 
> నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
> నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమాను తెరపై చూస్తే అర్థమవుతుంది.
> చివరగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాకపోయినా విజయ్‌ దేవరకొండ కనెక్ట్‌ అయ్యాడు.

కట్ చేస్తే - 

పైన మీరు చదివిందంతా ఇప్పుడే ఆన్‌లైన్లో నేను చదివిన ఒక రివ్యూలోని చివరి రెండు పేరాగ్రాఫులు. క్లారిటీ కోసం వాక్యం కింద వాక్యం పెట్టాను. 

"కథ కొత్తగా వినూత్నంగా ఉంది. దర్శకుని స్క్రీన్‌ప్లే బాగుంది. అతను రాసిన మాటలు బాగున్నాయి. సీన్లు కట్టిపడేసేలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిచోట్ల మెస్మరైజ్ చేస్తుంది. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు. హీరో విజయ్ దేవరకొండ నటన సినిమాకు ప్రాణంపోసేవిధంగా ఉంది..."

ఒక సినిమా విజయానికి ఇవన్నీ అతిముఖ్యమైనవి. మరి సినిమాకు మాత్రం రెండుంపావు చుక్కలే! అదే స్టార్స్...

ఒక వాక్యంలో ఒకటి బాగుందని చెప్తూ, ఇంకో వాక్యంలో ఒకటి బాగాలేదని చెప్తూ, ఇంత గొప్ప "బ్యాలెన్సింగ్" టోన్‌లో రాసిన ఈ రివ్యూ చదివిన ప్రేక్షకులు అసలు సినిమా బాగుందనుకోవాలా బాగాలేదనుకోవాలా?   

ఇదిలా వుంటే -

"వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాకపోయినా విజయ్‌ దేవరకొండ కనెక్ట్‌ అయ్యాడు" ... ఈ చివరివాక్యం నాకు అస్సలు అర్థంకాలేదు!

సరదాగా... రివ్యూలకి కూడా చుక్కలిస్తే ఎలా ఉంటుంది?
Just kidding...   :)
^^^

Disclaimer:
ఈ సినిమా హీరోగానీ, దర్శకుడుగానీ, నిర్మాతగానీ నాకు చుట్టాలు కాదు.