Saturday 17 December 2016

ఫోటోల పండుగ!

హైద్రాబాద్ బుక్‌ఫెయిర్‌ను "ఫోటోల పండుగ"గా మార్చిన ఘనుడు మరేవరో కాదు .. సీనియర్ జర్నలిస్టు, బిజినెస్‌మాన్, ఉస్మానియా యూనివర్సిటీలో నా సీనియర్, నా హాస్టల్ మేట్, నా మిత్రుడు .. షేక్ సాదిక్ అలీ.

"తోపుడుబండి" కాన్‌సెప్ట్‌తో పుస్తకాలపట్ల, వాటిని చదవటం పట్ల .. దాదాపు పూర్తిగా అంతరించిపోతున్న మనలోని సాహిత్య స్పృహను మళ్లీ తట్టిలేపిన మార్కెటింగ్ గురు మన సాదిక్ భాయ్.

అసలు తోపుడుబండి మీద పుస్తకాలమ్ముతారా ఎవరైనా?

అమ్మి చూపించాడు సాదిక్.

అదీ వేలల్లో!

సరదాగా "పి టి బర్నమ్ ఆఫ్ ఇండియా" అనీ, "బోధివృక్షం" అనీ నేను పిల్చుకొనే ఈ మార్కెటింగ్ జీనియస్, తన తోపుడుబండి ఆలోచనతో వేలాదిమందిని ప్రభావితం చేయగలిగాడు.

తోపుడుబండి ఆలోచనకు కొనసాగింపుగా, కేవలం సిటీలోనే కాకుండా, '100 రోజుల్లో 1000 కిలోమీటర్ల దూరం' తన తోపుడుబండితో ఊరూరా తిరిగి పుస్తకాలమ్మిన రికార్డు సాదిక్‌కు ఉంది. ఈ కొనసాగింపులో భాగంగానే, "ఊరూరా గ్రంథాలయం" కాన్‌సెప్ట్‌తో ఇప్పటికే వందలాది గ్రంథాలయాల్ని గ్రామాల్లో స్థాపించాడు, పునరుజ్జీవింపచేశాడు సాదిక్‌.


కట్ టూ ఫోటోల పండుగ - 

హైద్రాబాద్ బుక్‌ఫెయిర్‌లో అన్ని వందల స్టాల్స్ ఉన్నా, ఒక్క తోపుడుబండి స్టాల్ దగ్గర మాత్రమే ఒక హైరేంజ్ సందడి ఉంటుంది. ఒక ఆత్మీయమైన పండుగ వాతావరణం ఉంటుంది.

స్టాల్‌కు వచ్చిన ప్రతి కస్టమర్‌తోనూ, ప్రతి ఫ్రెండ్‌తోనూ, ప్రతి సెలబ్రిటీతోనూ, ప్రతి వి ఐ పి తోనూ అక్కడ స్టాల్ లోపలా బయటా ఫోటోలే ఫోటోలు!

ఆ ఫోటోలన్నీ ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవుతుంటాయి. వైరల్‌గా ఎఫ్ బి ని దున్నేస్తుంటాయి.

సో, దటీజ్ సాదిక్!

ఎన్ టి ఆర్ స్టేడియంలో ఇప్పుడు జరుగుతున్న హైద్రాబాద్ బుక్‌ఫెయిర్‌కు మీరింకా వెళ్లనట్లయితే, ఇవాళే వెళ్లండి.

తోపుడుబండి స్టాల్ నంబర్ 28.

ఈ సారి తోపుడుబండి స్టాల్ లో ప్రత్యేక ఫోకస్ ఒక ఎన్ ఆర్ ఐ సెంట్రిక్ ఇంగ్లిష్ నవల కావడం విశేషం. అది నా స్టుడెంట్ భరత్‌కృష్ణ రాసిన "The Guy On The Sidewalk" కావడం మరింత విశేషం!

Friday 9 December 2016

"సింహా"వలోకనం!

ఒక్క తప్పు నిర్ణయం అంతకుముందు మనం తీసుకొన్న 1000 మంచి నిర్ణయాలను సింగిల్ స్ట్రోక్‌లో తుడిచిపారేస్తుంది.

తెలంగాణవాదానికి సంబంధించినతవరకు, రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల కమిటీ సిఫార్సులు నా దృష్టిలో అలాంటి తప్పే అవుతుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ఏర్పాటుచేసిన నంది అవార్డుల స్థానంలో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగాక, తెలంగాణలో "సింహ" అవార్డులు కొత్తగా ఏర్పాటుచేస్తుండటం ఆహ్వానించదగ్గదే.


కట్ టూ కన్‌ఫ్యూజన్ -  

ఎన్‌టీఆర్, రఘుపతి వెంకయ్యల పేరిట అవార్డులు తెలంగాణ రాష్ట్రం ఎలా ఇస్తుంది? దీని జస్టిఫికేషన్ ఏంటి?

విధిగా తెలంగాణకు చెందిన వ్యక్తుల పేరిటనే అవార్డులు ఉండాలి. అవి జాతీయస్థాయి సినీప్రముఖులకిచ్చే అవార్డులయినా సరే.

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు.

చర్చించాలంటే ఇది చాలా పెద్ద టాపిక్. అందుకే దీన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను.

ఈ విషయంలో ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారనే నా నమ్మకం.


కట్ టూ క్లారిటీ - 

మరో పెద్ద విషయంలో తగినంత క్లారిటీ అవసరం. అదేంటంటే, రాష్ట్రంలో రూపొందిన తెలుగు చిత్రాలకు ఈ సింహ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు సిఫార్సుల్లో.

ఈ విషయంలో చాలా క్లారిటీ అవసరం.

ఎందుకంటే ..  అన్ని తెలుగు సినిమాలూ ఇక్కడే రూపొందుతున్నాయి. అలాంటప్పుడు అవార్డులన్నీ ఎవరికి వెళ్తాయన్నది ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

ఇప్పటివరకూ ఇండస్ట్రీని ఏలుతున్నవారికే అన్ని అవార్డులూ అలవోగ్గా అలా వెళ్ళిపోతాయి. వాళ్లకే మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకూడా అవార్డులుంటాయి. అంటే, డబుల్ ధమాకా అన్నమాట!

ఈ విషయంలో చాలా చాలా స్పష్టత అవసరం.

తెలంగాణకు చెందిన నిర్మాత/దర్శకులు, అత్యధిక రేషియోలో తెలంగాణ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో, తెలంగాణలో రూపొందించిన చిత్రాలను మాత్రమే సింహ అవార్డులకోసం పరిశీలనకు తీసుకోవాలి.

అవార్డులకు అప్లై చేసుకోడానికి ముందు ఇది ఖచ్చితంగా ఒక ప్రాధమిక అర్హత అయిఉండాలి.

లేదంటే, అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సింహ అవార్డులకే అర్థం ఉండదు.

అవసరంలేదు కూడా.

Sunday 4 December 2016

ఒక చరిత్ర!

తెలంగాణ వస్తే అదైపోద్ది, ఇదైపోద్ది అని ఓ నానారకాల కథలు చెప్పారు.

ఇప్పుడేమైంది?

కరెంటు లేక రాష్ట్రం మొత్తం అంధకారమైపోతుందన్నాడొకాయన.

ఇంత వెలుగులో  అసలు కంటికి కనిపించకుండాపోయిన అతనెక్కడ?

రాయాలంటే ఇదో పెద్ద లిస్ట్ అవుతుంది.


కట్ చేస్తే - 

30 కి పైగా పథకాలు.
30 వేల కోట్ల నిధులు.

నిరంతరం కరెంటు.
నిండిన చెరువులు.
పారుతున్న నీళ్లు.

అనుక్షణం తెలంగాణ కోసం తపన.
ఎవరి ఊహకు సైతం అందని ఆలోచనలు.
అమితవేగంతో ఆచరణ.

విజయవంతమైన ఈ రెండున్నరేళ్లలో ఇవీ మనం చూసిన, చూస్తున్న నిజాలు.

అంతెందుకు..

మొన్నటికి మొన్న ప్రధాని తీసుకొన్న పాత 500, 1000 నోట్ల రద్దు చర్య వల్ల ఏర్పడ్ద అత్యంత తీవ్రమైన ఆర్థిక ప్రతిష్టంభనను కూడా రాష్ట్ర ఆదాయానికి అనుకూలం చేసుకోగలిగిన చాకచక్యం .. తద్వారా మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఈ విషయంలో ఒక మార్గదర్శి కావడం.

అదే ప్రధాని మెప్పు పొంది, పరిస్థితిని చక్కబెట్టే క్రమంలో రాజకీయాలకతీతంగా ఆయనకవసరమైన సలహాలనివ్వగల స్నేహ సౌశీల్యం.

దటీజ్ కె సి ఆర్.

కె సి ఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సి ఎం మాత్రమే కాదు. కె సి ఆర్ అంటే తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదం. తెలంగాణకు పర్యాయపదం. మూర్తీభవించిన మానవత్వానికి పర్యాయపదం.

కె సి ఆర్ అంటే .. ఒక చరిత్ర. 

Wednesday 30 November 2016

మోదీ ఎఫెక్టు .. చిన్న సినిమాలకు గిఫ్టు!

నిజంగా 500, 1000 నోట్ల రద్దు తర్వాతి పరిణామాలు ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో తెలీదు కానీ, ఒక్కటిమాత్రం నిజం.

ఇది ఖచ్చితంగా సినీ ఫీల్డులో చిన్న సినిమాల నిర్మాణం ఊపందుకోడానికి బాగా ఉపయోగపడుతుంది.

అల్రెడీ ఒక టాప్ స్టార్ చెప్పనే చెప్పింది. నేను నా పారితోషికం అంతా వైట్‌లోనే తీసుకుంటాను అని!

కోట్ల బడ్జెట్‌లతో భారీ సినిమాలు తీసేవాళ్లకు ఇప్పుడు చాలా విషయాలు 'మేనేజ్' చేయడం అంత ఈజీకాదు.

చిన్న బడ్జెట్ సినిమాలకు అలా మేనేజ్ చేయాల్సిన అవసరమే లేదు!


కట్ టూ మన టాపిక్ - 

ఇలాంటి పరిస్థితుల్లో సత్తా ఉన్న చిన్న బడ్జెట్ సినిమాల హవానే బాగా నడుస్తుంది. బడ్జెట్ కోటిలోపే కాబట్టి నో వర్రీ. పెద్ద రిస్క్ కాదు.

నేను చెప్తున్న "కోపరేటివ్ ఫిల్మ్ మేకింగ్" పధ్ధతిలో అయితే బడ్జెట్ + రిస్క్ శాతం ఇంకా తగ్గుతుంది.

కేవలం ఒక 90 రోజుల్లో, ఒక సత్తా ఉన్న నీట్ కమర్షియల్ సినిమా తీసి రిలీజ్ చేయొచ్చు. సక్సెస్ రేంజ్‌నుబట్టి కోట్లలో లాభాలు పొందొచ్చు.

సినిఫీల్డుపైన ప్యాషన్ ఉన్న కొత్త నిర్మాతలకు, ఇన్వెస్టర్స్‌కు ఇదే రైట్ టైమ్! బడ్జెట్ అంతా ఒక్కరే పెట్టాల్సిన అవసరంకూడా లేదు ..

నా ఫేస్‌బుక్/ట్విట్టర్/బ్లాగ్ ఫ్రెండ్స్‌లో ఈవైపు ఆసక్తి ఉండి, వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నవారెవరైనా .. నా మెసేజ్ బాక్స్‌కు మీ వివరాలు, మొబైల్ నంబర్ పంపండి. నేనే కాల్ చేస్తాను.

తక్కువ ఇన్వెస్ట్‌మెంట్.
ఎక్కువ లాభాలు.
ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ హోదా, ఫేమ్!

ఇంకేం కావాలి? :) 

Tuesday 29 November 2016

దీక్షా దివస్!

"తెలంగాణ తెచ్చుడో, కె సి ఆర్ సచ్చుడో!"

ఈమాటనడానికి ఎన్ని గుండెలుండాలి? ఎంత ఆత్మ విశ్వాసం కావాలి? ఎంత సంకల్పబలం తోడవ్వాలి?

ఒక కమిట్‌మెంట్.
ఒక కన్విక్షన్.
ఒక కంపల్షన్.

ఒక్కటే గోల్.

అది తెలంగాణ సాధన.

ఎన్నో వెటకారాలు, వెక్కిరింపులు, తిట్లు, శాపనార్థాలు, ఛీత్కరింపులు, కుట్రలు, కుతంత్రాలు. ఒకటా రెండా ..

ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఇంటా బయటా నానా ప్లాన్లు.  

అన్నీ ఒకవైపే గురి. ఒక్కడిపైనే గురి.

కె సి ఆర్.

అయితే - ఆ రాళ్లతోనే తనచుట్టూ ఒక శత్రునిర్భేద్య దుర్గం నిర్మించుకోగలిగిన వ్యక్తి, ఉద్యమశక్తి కె సి ఆర్. ఆ దుర్గాన్ని ఛేదించి, కె సి ఆర్ దరిదాపుల్లోకి కూడా ఏ శత్రువూ చేరుకోలేకపోయాడు.

ఆ దుర్గం మరేదో కాదు.

యావత్ తెలంగాణ ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆ జేయేసీలూ, ఈ జేయేసీలూ, సోషల్ మీడియా .. అన్నీ.

అదంతా ఒక డైనమిక్ స్ట్రాటజీ.

ఎవరెన్ని చెప్పినా, ఏం చెప్పినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా .. చరిత్ర సాక్షిగా బంగారు అక్షరాలతో చెక్కిన నిజం ఒక్కటే.

కె సి ఆర్ లేకపోతే మొన్నటి తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ వచ్చేది కాదు.

జయహో కె సి ఆర్! 

Monday 28 November 2016

ఇ-ఆఫీస్ కు స్వాగతం!

తెలంగాణ రాష్ట్రంలో "పేపర్‌లెస్" బోర్డు సమావేశాన్ని నిర్వహించిన తొలి సంస్థ రాష్ట్ర ఖనిజాభివృధ్ధి సంస్థ (TSMDC).

అది మొన్న నవంబర్ 22వ తేదీనే విజయవంతంగా జరిగింది.


కట్ చేస్తే - 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి పొలిటికల్ సెక్రెటరీ, TSMDC ఛైర్మన్ కూడా అయిన శేరి సుభాష్ రెడ్డి, ఇదే TSMDC వేదికగా అతిత్వరలో మరో సంచలనానికి తెరలేపనున్నారు.

అది డిసెంబర్ 1, 2016.

ఆరోజునుంచీ, తెలంగాణ రాష్ట్రంలో తొలి పేపర్‌లెస్ "ఇ-ఆఫీస్" గా TSMDC కార్యాలయం పనిచేయబోతోంది!

రాష్ట్ర పరిశ్రమలు, ఐ టి శాఖ మంత్రి కె టి ఆర్ గారి ఆదేశాలమేరకు ఈ విషయంలో ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి.

కొత్తగా రూపాంతరం చెందనున్న ఈ "ఇ-ఆఫీస్" ప్రక్రియ వల్ల ప్రధానంగా ఆఫీసుల్లో ఉండే రెడ్‌టేపిజం పోయి, పనివేగం పెరుగుతుంది. ఎక్కడ ఏ ఫైల్ ఉందీ, ఎక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతోందీ ఒకే ఒక్క క్లిక్‌తో తెలిసిపోతుంది. పారదర్శకత, జావాబుదారీతనం, సిబ్బంది పనితీరు మరింతగా మెరుగుపడతాయి.

ఆఫీస్ కార్యకలాపాల నిర్వహణలో ఆధునికమైన ఒక సెన్సేషనల్ మార్పు దిశగా తొలి అడుగు వేస్తున్నTSMDC ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి గారికీ, వారి సిబ్బందికీ ఈ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.

వెల్‌కమ్ డిజిటల్ తెలంగాణ! 

Thursday 24 November 2016

విజయీభవ!

ఆయనే ఒక ఉద్యమం, ఉద్యమస్పూర్తి, ఉద్యమశక్తి.

చెక్కుచెదరని ఏకాగ్రత, కట్టిపడేసే వాగ్ధాటి.

ప్రతి విషయంపైన సాధికారిక పరిజ్ఞానం.

పట్టుదల, ఓర్పు, చాకచక్యం, చాణక్యం.

తెలంగాణ సాధన అనే జీవితలక్ష్య సాకారం. 

బంగారు తెలంగాణకోసం నిరంతర తపన.

అనుక్షణం అలోచన, అహరహం అధ్యయనం.

అవిశ్రాంత కృషి, అద్వితీయ రాజనీతి.

రాజకీయనాయకునిలో మనం చూడని మహోన్నత మానవీయ కోణం.

జనహితం కోసం ఎవ్వరూ ఊహించని కార్యక్రమాలు.

బృహత్ పథకాలు, భగీరథ ప్రయత్నాలు, వేగంగా సత్ఫలితాలు.

ప్రజలకోసం ఇంకెన్నో చేయాలన్న ఆరాటం.

పెద్దల పట్ల గౌరవం, మర్యాద.

మనం మర్చిపోకూడని మన సంస్కృతిపట్ల మమకారం.

ఒక్కడు - 

మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ..

"ప్రగతి భవన్", నూతన అధికారిక గృహప్రవేశం సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు!                                                                         

Tuesday 22 November 2016

భజన వెర్సస్ అభిమానం!

"కె సి ఆర్ కు, టి ఆర్ ఎస్ కు నువ్వు భజన చేయకు!" అని మొన్నొక మిత్రుడు నాతో చెపాడు, కార్లో వెళ్తుండగా.

నేను సూటిగా చెప్పాను:

"క్రియేటివిటీ వేరు. రాజకీయాలు వేరు .. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. నేను చేయాలనుకున్నది చేస్తాను. నా ఫేస్‌బుక్, నా వాల్, నా బ్లాగ్, నా ట్విట్టర్, నా ఫీలింగ్స్, నా రాతలు, నా ఇష్టం."

"నీకో, ఇంకొకరికో నచ్చడంకోసం నేను రాయడంలేదు. పోస్ట్ చేయడంలేదు. ఆ సమయంలో నాకు తోచింది నేను రాస్తున్నాను. నీకు నచ్చితే లైక్ కొట్టు. నచ్చకపోతే సింపుల్‌గా ఒకే ఒక్క క్లిక్‌తో నన్ను అన్‌ఫ్రెండ్ చెయ్యి!" అని కూడా చెప్పాను.

"అంతేనంటావా?" అన్నాడు నా మిత్రుడు.

"అంతే. అంతకంటే ఈ టాపిక్ మీద డిస్కషన్ పెంచి నీ విలువైన టైమ్‌నీ, నా విలువైన టైమ్‌నీ నేను వృధా చేయలేను!" అన్నాను.

నా మిత్రుని దగ్గర సమాధానం లేదు.

ఎలా ఉంటుంది?

మిగిలినవారెవరి విషయమో నాకు తెలియదు. కానీ, నా విషయంలో మటుకు .. భజన వేరు. అభిమానం వేరు.

భజన ఒక భ్రమ. అభిమానం ఒక రియాలిటీ.

భజన వెనుక ఆశలు, కోరికలు, అవసరాలుంటాయి. అభిమానం వెనుక కేవలం ఫీలింగ్స్ ఉంటాయి.

ఈ రెండింటి మధ్య తేడాని గుర్తించలేనివాళ్లే నానా కామెంట్స్, నానా సౌండ్స్ చేస్తుంటారు.  అదే అసలైన భజన అని నా ఉద్దేశ్యం.

Thursday 17 November 2016

ది లీడర్

సుమారు 130 కోట్ల జనాభా ఉన్న ఒక దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఏదో ఆదరా బాదరాగా రాత్రికి రాత్రే ఓ చెత్త నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ అనుకోరు.

ఒకవేళ దాని వెనుక ఏదైనా చిన్న రాజకీయ అవసరం ఉన్నా, దేశ ప్రయోజనం అనే గట్టి బేస్ లేకుండా ఇలాంటి నిర్ణయం మోదీ తీసుకోలేడు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండనక్కరలేదు.

కానీ, ఏ నల్లకుబేరులనైతే టార్గెట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారో, వారి సంఖ్య మొత్తం దేశ జనాభాలో కేవలం 2 శాతాన్ని మించి ఉండదని ఒక అంచనా.

ఈ 2 శాతం మేనిప్యులేటర్స్‌ను ట్రాక్ చేసి పట్టుకొనే ఒక పటిష్టమైన సిస్టమ్‌ను రూపొందించలేనంత బలహీనమైందా మనదేశ ఆర్థిక యంత్రాంగం ? అంత సామర్థ్యం లేనిదా? నిజంగా నమ్మశక్యం కాదు.

ఆ 2 శాతం బ్లాక్‌మనీ వాళ్లకోసం మిగిలిన 98% మంది దైనందిన జీవితం రాత్రికి రాత్రే ఊహించనివిధంగా తల్లకిందులు కావల్సిందేనా?

ఈ స్థంభన, ఈ గందరగోళం ఇంకెన్నాళ్లు అంటే ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేకపోవడం నిజంగా విచారకరం.


కట్ టూ కె సి ఆర్ -    

ఏరంగంలోనైనా సరే, ఊహించకుండా వచ్చే ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలం చేసుకొని ముందుకుపోగలిగినవాడే తిరుగులేని నాయకుడవుతాడు.

మన తెలగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ అలాంటి నాయకుడు. ఇదే లక్షణాన్ని మన IT మినిస్టర్ KTR కూడా పుణుకిపుచ్చుకున్నాడు.

ముందు నవంబర్ 11 వరకు అని, తర్వాత నవంబర్ 14 వరకు అని, ఇప్పుడు నవంబర్ 24 వరకు అని .. ఇదే అదునుగా, ఏళ్లుగా బకాయిలున్న టాక్స్‌లన్నిటినీ ఒక్క దెబ్బతో మోదీ చెల్లు చెప్పిన ఆ పాత 500, 1000 నోట్లతోనే కట్టించేసుకున్నారు మనవాళ్లు.

ఒక్క బకాయిలేకాదు, ఫ్యూచర్ టాక్స్‌లు కూడా ఇప్పుడే కట్టించుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన టాలెంట్!

కేంద్రాన్ని ఒప్పించి మనవాళ్లు తీసుకొన్న ఈ చొరవ వల్ల, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఇది మంచి లాభదాయకమైంది. వాళ్లూ మనల్నే ఫాలో అవుతున్నారు.

ముందు దేశం. తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు. ఇది కె సి ఆర్ కు బాగా తెలుసు.

ఇది తెలుసు కాబట్టే - దేశంలోని మిగిలిన అందరు CM ల లాగా మందలో కలిసిపోయి గందరగోళం చేయటంలేదు.

ఇప్పుడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో కూడా మన రాష్ట్ర ఎం పి లకు ఈ విషయంలో ఖచ్చితమైన ఆదేశాలిచ్చాడు కె సి ఆర్:

"ఈ చర్య వల్ల మనకు రాష్ట్రంలో ఎదురవుతున్న తీవ్రమైన అసౌకర్యం గురించీ, ప్రతిరోజూ భారీస్థాయిలో కోల్పోతున్న మన ఆదాయం గురించీ వివరంగా చెప్పండి. కానీ, సమావేశాలు మాత్రం సజావుగా జరుగనివ్వండి" అని.

రేపు నవంబర్ 24వ తేదీన ప్రధాని ఇచ్చే వివరణ పూర్తిగా విన్నతర్వాతే దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాలన్నది కె సి ఆర్ ఉద్దేశ్యం.

కేవలం రాజకీయం కోసమో, మొహమాటానికో గుంపులో గోవిందా అనే రకం కాదు మన కె సి ఆర్.

మన దేశం. మన రాష్ట్రం. మన ఐడెంటిటీ. మన ఆలోచన.

వెరసి - ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఒక సిన్సియర్ స్టేట్స్‌మన్. ఒక రియల్ లీడర్.

అది .. మన కె సి ఆర్.   

Tuesday 15 November 2016

న్యూ-ఏజ్ లైఫ్‌స్టయిల్!

దేశంలో ఇప్పుడున్న కరెన్సీ కన్‌ఫ్యూజన్ సిచువేషన్‌తో ఎలాటి సంబంధంలేకుండా .. తన పనినీ, తన లైఫ్‌నీ సంపూర్ణ స్వేఛ్ఛతో లీడ్ చేయగలుగుతున్నవాడే సిసలైన మగాడు.

ఇలాంటోన్ని అనొచ్చు ..

"ఆడు మాగాడ్రా బుజ్జీ" అని!

అలాగని చెప్పి, వాడు బాగా బ్లాక్‌మనీ ఉన్నవాడనికాదు నా ఉద్దేశ్యం.

ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ మస్త్‌గా ఉన్నోడని!

ఫైనాన్షియల్‌గా ఇలాంటి స్థితప్రజ్ఞ దశకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. నూటికి 90% మందికి ఇది అస్సలు చేతకాదు.

ఈ 10% ఆర్థిక స్థితప్రజ్ఞులను ఇకనుంచైనా ఫాలో అయ్యి, వారి మైండ్‌సెట్‌ను, లైఫ్‌స్టయిల్‌ను బాగా అధ్యయనం చేసి బాగుపడటం అనేది చాలా అవసరం.

మన జీవితంలో చెప్పాపెట్టకుండా ఇలా సడెన్‌గా వచ్చే చిన్న చిన్న సునామీలకు ఏమాత్రం ఎఫెక్టు కాకుండా, ఈ స్థాయిలో బాగుపడటాన్నే నా దృష్టిలో సిసలైన "ఫ్రీడమ్" అందురు. :) 

సినిమా చూపించాడు మోదీ!

ఒక్క దెబ్బకు దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 90% సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

మిగిలిన 10% కొంచెం ఎక్కువ ముందు జాగ్రత్తపరులై ఉంటారు. అంతే తేడా.

ఇండస్ట్రీలో "సినిమా తీస్తున్నాం" అని అనుకొన్న రోజు నుంచి, ప్రతిరోజూ డబ్బు పెట్టటమే ఉంటుంది కాని ఎలాంటి రొటేషన్ ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, కలెక్షన్లు వచ్చినతర్వాతే .. మళ్లీ డబ్బు వెనక్కిరావడం చూస్తారు సినిమావాళ్లు.

ఈ నేపథ్యంలో - ప్రతిరోజూ షూటింగ్‌లో ట్రాన్స్‌పోర్ట్, భోజనం, ఇక్విప్‌మెంట్ రెంట్లు, ఇతర రోజువారీ రెంట్లు, డీజెల్, టీమ్‌లో కిందిస్థాయి వర్కర్స్ కు ఇవ్వాల్సిన రోజువారీ భత్యాలు .. ఇవ్వన్నీ ఏరోజుకారోజు తప్పనిసరి. వీటిల్లో దాదాపు మొత్తం క్యాష్ రూపంలోనే అవసరం.

మోదీజీ పుణ్యమా అని ఒక్క దెబ్బతో సీన్ మారిపోయింది.

నో క్యాష్! నో షూటింగ్!!

దేశాన్ని మోదీ ఏదో చేద్దామనుకొంటోంటే నీ సినిమాలెవడిక్కావాలయ్యా అనొచ్చు.

కరెక్ట్. అదే నెక్స్‌ట్ కొష్చన్. నాకు తెలుసు.

ఇక్కడ సినిమాలా, టీవీలా అన్నది కాదు ముఖ్యం. ఇదొక అతిపెద్ద ఇండస్ట్రీ. దేశానికి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న ఒక ప్రధాన పరిశ్రమ. ఈ పరిశ్రమ మీద ఆధారపడి దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి.

ఆ లక్షల కుటుంబాల్లో 90% మంది సినిమా నిర్మాణంలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో రోజు కూలీకి పనిచేసే కార్మికులు. సినిమా భాషలో ఏరోజుకారోజు వీరికిచ్చే డబ్బుని "డైలీ బేటా" అంటారు. తెలుగులో దిన భత్యం. ఇదిలేకుండా వారికి దినం గడవదు.

ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు. ఇలాంటి డైలీ వేజెస్‌కు కార్మికులు పనిచేసే ఇండస్ట్రీలు, వ్యాపారాలు దేశంలో ఇంకెన్నో ఉన్నాయి.  

వీళ్లంతా ఎన్నిరోజులు అప్పులు చేస్తారు? ఎన్నాళ్లని అప్పు దొరుకుతుంది? అసలెవరిస్తారు?

మనం మనం అనుకోవడం కాదు. కేంద్రంలో ఎన్నో కసరత్తులు 24 గంటలూ జరుగుతుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సమస్య తొందరగానే ఒక కొలిక్కివస్తుందని ఆశిద్దాం.

ఎందుకంటే ..

మనిషి రోడ్డునపడ్డాడు.       

Sunday 13 November 2016

ఈరోజు నుంచే, ఈక్షణం నుంచే .. అనుక్షణం!

జీవితంలో ఎవరైనా, ఏ దశనుంచైనా ఒక కొత్త అధ్యాయం ప్రారంభించవచ్చు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇప్పటికే ప్రూవ్ చేసి ఉన్నారు.

చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ, కొత్త రిజల్టు రావాలనుకోవడంకన్నా ఫూలిష్‌నెస్ మరొకటుండదు.

డబ్బు, ఆస్తులు ఎంత నష్టపోయినా ఫర్వాలేదు. కానీ, చూస్తూ చూస్తూ కాలాన్ని నష్టపోకూడదు. నోటినుంచి మాటను జారవిడుచుకోకూడదు.

కాలం వెనక్కి రాదు. మాటని వెనక్కి తీసుకోలేం.

ఇలాంటి పరిస్థితుల్లో రిలేషన్‌షిప్పే నాకు చాలా ముఖ్యం తప్ప వేరే ఏ విషయం కాదు.

ఆ మరేదో విషయం మన బేసిక్ కమ్యూనికేషన్‌నే దెబ్బతీస్తున్నప్పుడు, ఆ మరేదో విషయాన్ని వదులుకోవడమే అన్నివిధాలా మంచిది. అన్నివిధాలా ఉత్తమం కూడా.

కనీసం ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌లోని ఆ పరస్పర అభిమానం, ఆ గౌరవమైనా మిగుల్తాయి.


కట్ టూ గట్స్ -  

కాన్‌ఫిడెన్స్, గట్స్ ఉంటే చాలు. ఏదయినా సాధించవచ్చు.

ఈరోజే, ఈక్షణమే .. ఒక అతి చిన్న గోల్ పెట్టుకొని, దాన్ని పూర్తిచేసి పడుకోవడంతో ప్రారంభించినా చాలు. తర్వాత లక్ష్యం ఎంత పెద్దదయినా సరే, సాధించడం అనేది  అలవాటయిపోతుంది.

మళ్లీ ఆ ట్రాక్ ఎక్కుతాం. ట్రాక్‌లో ఉంటాం.

అయితే .. 'మన నమ్మకాలకు, మన నిర్ణయాలకు మనమే బాధ్యులం' అనే వాస్తవాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు.

అలా మర్చిపోనంతవరకు ఏదయినా సాధ్యమే. 

Saturday 12 November 2016

బ్లాక్ మనీవాళ్లా, సామాన్యప్రజలా .. ఎవరు టార్గెట్?

> ఇవాళ ఉదయం 10.30 నుంచి, మధ్యాహ్నం 2.30 వరకు నా చీఫ్ టెక్నీషియన్ ఒకరు 2 ATM లు మారి, 4 గంటల్లో 2 వేలు డ్రా చేసుకోగలిగాడు!

> కొంపల్లిలో కూరగాయలమ్మే ఒక వృధ్ధురాలు తనదగ్గరున్న ఎనిమిది 500 నోట్లను మార్చుకోడానికి పని మానుకొని, ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో 3 గంటలు నిల్చోవాల్సివచ్చింది. తర్వాత ఆమె ఆధార్ కార్డును కూలంకషంగా పరిశీలించి, ఆమెకు 4 వేలిచ్చారు బ్యాంకువాళ్లు.  

> కొత్త 2000 కాగితంతో పక్కనే ఉన్న కిరాణాషాపుకు వెళ్లిన మా వాచ్‌మన్ నిత్యావసర వస్తువులు ఏవీ కొనుక్కోకుండా వెనక్కి రావాల్సి వచ్చింది. కారణం .. అక్కడ 2000 లకు చిల్లర లేదు!

> సంవత్సరంలో 365 రోజులూ కస్టమర్లు ఎప్పుడూ వెయిటింగ్‌లో ఉండే "మినర్వా" లాంటి హోటల్‌లో నిన్న సాయంత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురున్నారు!

> చికెన్ షాపులు, పాన్ షాపులు, ఇరానీ హోటళ్లు, చిన్న స్థాయి నుంచి బడా షాపింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు .. అన్నీ గత నాలుగురోజులుగా దాదాపు నిర్మానుష్యమైపోయాయి. ప్రతిచోటా గిరాకీ లేక ఎవ్వరూ ఊహించని ఒకరకమైన స్మశాన వైరాగ్యం!

ఇలాంటి లైవ్ ఉదాహరణలు కనీసం ఇంకో 2 డజన్లు ఇవ్వగలను ..

ఎందుకు ..  అసలెందుకిలా జరిగింది?


కట్ టూ మన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక యంత్రాంగం -

బ్లాక్‌మనీ వెలికి తీయాల్సిందే, ఆర్థిక నేరస్థులను శిక్షించాల్సిందే. నాలుగు రోజులక్రితం ప్రధాని మోదీజీ తీసుకొన్న నిర్ణయం హర్షించదగిందే.

కానీ, ఇంత పెద్ద స్టెప్ తీసుకొంటున్నప్పుడు ఎంతదూరం ఆలోచించాలి? ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఉండాలి?

నాదగ్గరున్న సమాచారం ప్రకారం గతంలో RBI మొత్తం 17.5 లక్షల కోట్ల కరెన్సీ ముద్రించింది. దీన్లో 86% కేవలం 500, 1000 నోట్లు.

అంటే, మనదేశం మొత్తం కరెన్సీలో కేవలం 14% మాత్రమే 100, 50, 20, 10 నోట్లన్నమాట!

ఈ కరెన్సీ రేషియో నేపథ్యంలో - మోదీజీ ప్రకటించిన రోజు అర్థరాత్రినుంచే 500, 1000 నోట్లు చెల్లవు అన్నప్పుడు .. తెల్లారినప్పట్నుంచి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం.

ప్రధాని తీసుకొనే ఒక పెద్ద నిర్ణయం వెనుక ఎంత కసరత్తు ఉంటుంది? .. ఉండాలి?

ప్రధాని నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాల్సిన మన దేశ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఫైనాన్స్ సెక్రెటరీ శక్తికాంత్ దాస్, ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ .. ఈ ఆర్థిక దిగ్గజాల సమగ్ర దేశవ్యాప్త యంత్రాంగం అసలేం చేసినట్టు? .. చేస్తున్నట్టు? 


కట్ టూ ది రియాలిటీ టుడే - 

నల్లధన కుబేరులైన బడా బడా ఇండస్ట్రియలిస్టులు, క్రికెట్ స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, రియాల్టర్స్ ఎట్సెట్రా ఎవరైనా పనులు మానుకొని, లైన్లల్లో నిల్చుని, ఏ చిన్న ఇబ్బందయినా పడుతున్న విజువల్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా?

కానీ, మరోవైపు .. కష్టపడి అంతో ఇంతో సంపాదించుకొని కూడబెట్టుకొనే వ్యవసాయదారులు, గ్రామీణ మహిళలు, మధ్యతరగతివాళ్లు, ఔత్సాహిక చిన్న పారిశ్రామికవేత్తలు, డైలీ వేజర్స్ ..
ఏ బ్యాంక్ దగ్గర చూసినా, ఏ ATM ల దగ్గర చూసినా వందల సంఖ్యలో పనులుమానుకొని వీళ్లే కనిపిస్తున్నారు.

ప్రతి చిన్నా పెద్దా వ్యాపారం దాదాపు పూర్తిగా స్థంభించిపోయింది.

ఈ పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లోనూ ఇంతే.

ఫలితం .. వృధ్ధిరేటులో మరింత పతనావస్థ!

నిజంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే - అసలు ఇన్‌కమ్ టాక్స్ పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యవసాయదారులు, మహిళలు, నిరంతరం ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యే వివిధ రంగాల ప్రొఫెషనల్స్, ఔత్సాహిక చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, ఇతర సామాన్య ప్రజలే బాధపడుతున్నారు.

అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని జీవితంలో మొట్టమొదటిసారిగా .. భయపడుతున్నారు.

తెలిసో తెలియకో 2.5 లక్షలకు మించి ఏ కొంచెం డిపాజిట్ లేదా, ట్రాన్సాక్షన్ చేసిన చాలామంది వ్యవసాయదారులు, మహిళలు, సామాన్య ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఎక్కడ ప్రాసిక్యూట్ చేసి, శిక్షించబడతామేమోనని!

ఇదంతా ఒకెత్తయితే - చేతిలోనో, బ్యాంకులోనో ఉన్న ఆ కొంచెం డబ్బుని కూడా తీసి ఖర్చుపెట్టడానికి ఎవ్వరూ ధైర్యం చేయడంలేదు. రేపేం జరగబోతోందో అన్న భయంతో!

సో, బయట మనీ రొటేషన్ పూర్తిగా స్థంభించిపోయింది.

ఒకే ఒక్క దెబ్బతో మనదేశ ఆర్థిక వ్యవస్థ విశ్వరూపం, సామర్థ్యం, బలం, బలహీనతలు బట్టబయలయిపోయాయి. అది కూడా సామాన్య ప్రజానీకానికి కూడా కూలంకషంగా అర్థమయ్యే స్థాయిలో!

ఒక సదుద్దేశ్యంతో మోదీజీ చేపట్టిన ఈ చర్య ఎందుకని ఇంత ఆర్థిక విధ్వంసానికి కారణమైంది? మన దేశ ఆర్థిక యంత్రాంగం ఏం చేస్తున్నట్టు?

ఈ మొత్తం పిక్చర్ చూస్తున్న ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలు ఏం చేస్తున్నారు? ఎందుకని మౌనంగా ఉన్నారు?

ఎందుకీ మౌనం?

అసలెవరికీ శిక్ష?!  

Friday 11 November 2016

మన రూట్స్ మర్చిపోవద్దు!

చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ జర్నీ ఒక సక్సెస్ స్టోరీగా నాకు చాలా ఇష్టం.

అదంత సులభమైన జర్నీ కాదు. అందరికీ సాధ్యం కాదు.

ఇక్కడ రాష్ట్రంలో నేను పక్కా
కె సి ఆర్, తెరాస అభిమానిని.

కానీ, ఈ దేశపౌరుడిగా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా - ఆ పార్టీ, ఆ ప్రభుత్వం ఉండాల్సిన అయిదేళ్ళూ బలంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొంటాను.

ముందు మన దేశం కాబట్టి.

మోదీజీ విషయంలో అయితే ఇదే మరింత మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.


కట్ టూ 500, 1000 'బ్లాక్' బ్యాక్ - 

భారత్‌ను ఒక అవినీతిరహిత దేశంగా, అత్యుత్తమస్థాయిదేశంగా మార్చాలని మోదీజీ ఆశ, ఆశయం. అదే దిశలో బాగా కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలించాలని ఆశిద్దాం. ఆ కృషి వివరాల్లోకి నేనిప్పుడు వెళ్లటం లేదు.

500, 1000 రూపాయల చలామణికి సంబంధించి - మొన్న మోదీజీ ఇచ్చిన షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ విషయం గురించే ఈ బ్లాగ్ పోస్టు.

బ్లాక్‌మనీ విషయంలో ఈ చర్య చాలా మంచిదే.

కానీ, కోట్లాదిమంది మిడిల్ క్లాస్, అంతకంటే తక్కువస్థాయి ప్రజల నిత్యజీవితంలో రూపాయి రూపాయితో ఉండే అవసరం విస్మరించడం కరెక్టు కాదు.

"ఒక గొప్ప నిర్ణయం తీసుకొన్నప్పుడు కొన్నిరోజులు కొంతమంది ఇబ్బంది పడాలి తప్పదు" అనే వాదన బహుశా ఈ విషయంలో సరికాదు.

కొన్నిరోజులయినా సరే, కొన్ని గంటలయినా సరే .. ఇబ్బంది పడాల్సింది ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్లే పడాలి తప్ప, బ్లాక్ మనీకి సంబంధించి ఏ పాపం ఎరుగనివాళ్లు కాదు.  

19 ఆగస్టు 2014 నాడు తెలంగాణ రాష్ట్రమంతా ఒకే రోజు "ఇంటింటి సర్వే" అని కె సి ఆర్ అన్నప్పుడు ఎంతోమంది విమర్శించారు. అసాధ్యం అంటూ అపహాస్యం కూడా చేశారు.

కానీ ఒక్క రోజులో సర్వే 100% గ్రాండ్ సక్సెస్ చేసి చూపించారు కె సి ఆర్, ఆయన దళం.

ఆ సక్సెస్ వెనుక ఎంత ప్లానింగ్, ఎంతమంది ఉద్యోగులు, కార్యకర్తలు, వాలంటీర్ల సిన్సియర్ శ్రమ ఉండి ఉంటుంది?

అలాంటివే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎట్సెట్రా.

వీటన్నిటి గురించి కూడా ప్రతిపక్షాలనుంచి అన్నీ అనుమానాలూ అపహాస్యాలే. కానీ, అంచెలంచెలుగా వాటి విజయాలెలా ఉన్నాయి?

60 ఏళ్లుగా ఎవ్వరూ కనీసం ఆలోచించని పనులు అలవోకగా అయిపోతుంటే దిమ్మ తిరిగిపోవటంలేదూ?

దటీజ్ కె సి ఆర్.

మరోవైపు .. బ్లాక్‌మనీకి సంబంధించి మోదీజీ ఆలోచన చాలా మంచిదే. కానీ, దాని ఆచరణే మిస్‌ఫైర్ అయిందని నేననుకుంటున్నాను.

సడెన్‌గా వచ్చిన ఈ సమస్యవల్ల, నాలుగు 500 నోట్లు మార్చుకోడానికి కొంపల్లిలో ఉన్న నా మిత్రుడొకరికి బ్యాంకులో మూడున్నర గంటలు పట్టింది. చివరికి ఆ మొత్తం ఒక 2000 రూపాయల గులాబి నోటు రూపంలో ఇచ్చారు. దానికి చిల్లర బయట దొరకదు!

ఏం చేయాలతను?

టార్గెట్ చేసిన మనుషులు మాత్రం కూల్‌గా ప్లాన్ చేసుకొంటూ వాళ్ల మార్పిడి పనుల్లో వాళ్లున్నారు.

ఈ బ్లాగ్ రాస్తున్న సమయానికి కూడా సిటీలోనే 70%  ATM లు ఇంకా పనిచేయడం లేదు.

ఎన్ని వ్యాపారాలు ఎంత నష్టపోయుంటాయి?

ఎంతమంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతుంటారు?

ఫలితం ..

ఒకే ఒక్కరోజులో మూడున్నర లక్షలమంది ట్విట్టర్‌లో మోదీజీ ని "అన్‌ఫాలో" అయ్యారు! 

దీని ప్రభావం ముందు ముందు ఇంకెన్ని చోట్ల ఇంకెలా ఉండబోతోందో ఎవరికి తెలుసు?

బ్లాక్‌మనీవాళ్లను టార్గెట్ చేయాల్సిందే. కానీ .. చాయ్‌వాలా కష్టాన్ని మర్చిపోతే ఎలా?  

Wednesday 9 November 2016

కొత్త రూ 500/2000 .. రేపే విడుదల!

20 లక్షల నుంచి 2 కోట్ల దాకా .. ఓపెన్ ఆఫర్!

ఏదైనా అడ్జస్ట్‌మెంట్స్‌కు ఇది మంచి అవకాశం.

మోదీజీ బ్లాక్ మనీకి చెక్ పెట్టి 24 గంటలు దాటింది.

చూస్కోండి మరి.

సినిమాలైనా సరే. ఫ్యూచర్‌ను ఏలబోతున్న వెబ్ సీరీస్‌లైనా సరే.

నేనున్నాను!


కట్ టూ ఎతిక్స్ - 

దీనికోసం మనం దేశాన్ని మోసం చెయ్యనవసరం లేదు. టాక్స్‌లను ఎగ్గొట్టనవసరం లేదు. ఎక్కడి వ్యవహారాలు అక్కడుంటాయి.

ఉన్న కొంచెం టైమ్‌లో టెన్షన్ ఫ్రీ అయిపోవడం ముఖ్యం.

"విన్ విన్" అన్నమాట!

ఫినాన్షియల్ ఇంటలిజెన్స్‌లో ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్న పాఠాల్ని బట్టి నాకు అర్థమయ్యిందేంటంటే - బిగ్ ఫిష్‌లన్నీ కూల్‌గా అంతా ముందే  సర్దేసుకున్నాయి.

మోదీజీ ఇచ్చిన, మీడియా మొత్తుకొంటున్న "సర్‌ప్రైజ్" అంటూ నిజంగా ఏదన్నా ఉందంటే .. అది కేవలం కింది స్థాయివాళ్లకే.

అక్కడ ట్రంప్, ఇక్కడ మోదీ. వీళ్లే మన ఇన్స్‌పిరేషన్.

స్ట్రాటజీ.

విజయం.

నా ఇన్‌బాక్స్‌లోకి రండి. మాట్లాడుకుందాం.  

Tuesday 8 November 2016

ఫ్యూచర్ అంతా ఇక "వెబ్ సీరీస్" లదే!

జనాలకు ఇప్పుడసలు దేనికీ టైమ్‌లేదు. అన్నిటికీ మొబైల్ ఫోన్, అందులో ఉన్న యాప్‌లే!

కనీసం టాయ్‌లెట్‌కు వెళ్ళినా మొబైల్ వదిలి వెళ్లలేని పరిస్థితి.

చెవికీ మెడకూ మధ్య మొబైల్ పెట్టుకొని, ఒక చేత్తో అటు ఆ పనికానిస్తూ, విచిత్రంగా ఇంకో చేతిలో సిగరెట్ ఎంజాయ్ చేస్తున్న మహానుభావుల్నికూడా చూస్తున్నాం మనం.

వాటే బిజీలైఫ్!

అసలు ఈ మొబైల్ ఫోన్ లేనప్పుడు వీళ్లంతా ఎట్లా బ్రతికారా అనిపిస్తుంది చూస్తుంటే.


కట్ టూ మన వెబ్ సీరీస్ టాపిక్ -

ఇంత బిజీలైఫ్‌లో, క్రమంగా, థియేటర్‌కెళ్లి సినిమాలు చూసేంత తీరికా ఓపికలు ఎవ్వరికీ ఇక ఉండవు. అన్‌లెస్ .. అదేదో పెద్ద స్టార్ సినిమానో, థియేటర్లో మాత్రమే చూడాల్సిన ఏ మాగ్నమ్ ఓపస్ సినిమానో అయితే తప్ప!

వాటిని పక్కనపెడితే  .. ఇంక ఏ ఇతర సినిమాలకూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేంత సీన్ ఉండదు. అన్నీ .. అయితే డైరెక్ట్ టూ హోమ్ (DTH) .. లేదంటే వెబ్‌లో. అంతే.

ఇంక ఇంట్లో మన టీవీ అనేది కంప్లీట్‌లీ అవుట్‌డేటెడ్ అన్నమాటే!

ఇంట్లో ఉండే నలుగురికీ నాలుగు చానెళ్లు కావాలన్నది పాత స్టోరీ. ఇకముందు టీవీకి అంత సీన్లేదు.

అందరి చేతుల్లో యాండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి. ఎవరికిష్టమైన వెబ్‌సీరీస్ వాళ్లు చూసుకుంటూ ఎవరిలోకంలో వాళ్లుంటారు.

పిచ్చ బిజీగా.

పిచ్చోళ్లలా.

ఆల్రెడీ బాలాజీ టెలి ఫిలింస్ వంటి కార్పొరేట్స్ టీవీ సీరియల్స్ పక్కనపెట్టి, వెబ్ సీరీస్ మీద పడ్డాయంటే విషయం అర్థం చేస్కోవచ్చు. ఇక్కడ మనమే లేటు ..

వెబ్ సీరీస్ అంటే మరేంటో కాదు. టీవీ సీరియల్స్ లాంటివేకానీ .. మరీ తమలపాకులు, పూతరేకులు లాంటి సీరియల్స్ కావు.

వెరీ ట్రెండీ ఎంటర్‌టైనర్స్. లేదా, వెరీ ఎట్రాక్టివ్ టాక్ షోస్. రియాలిటీ షోస్.

వీటన్నిటినీ ప్రధానంగా యూట్యూబ్, వీమియో, ఐట్యూన్స్ వంటివాటిల్లోకి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అందరూ డౌన్‌లోడ్ చేస్కొనో, లైవ్‌గానో మొత్తానికి హాయిగా ఎక్కడపడితే అక్కడ మొబైల్‌లో చూస్కోవచ్చు.  

వెబ్ సీరీస్‌లు అప్పుడే తెలుగులో కూడా ఊపందుకున్నాయి.

లేటెస్ట్‌గా "పోష్ పోరీస్" ఒక ఉదాహరణ.

ఇక వెబ్ టాక్‌షోల్లో "రాన్‌డేవూ విత్ సిమి గరేవాల్", "కాఫీ విత్ కరణ్" హిందీలో బాగా పాపులర్. "రాముఇజం", "డైలాగ్ విత్ ప్రేమ", "ఫ్రాంక్లీ విత్ టి ఎన్ ఆర్", "ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే" ఎట్సెట్రాలు తెలుగులో బాగా పాపులర్.


కట్ టూ ఫినిషింగ్ టచ్ -

హిట్ సినిమా "నచ్చావులే" హీరోయిన్ మాధవీలత కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో .. తనే ప్రధాన పాత్రలో, "తింగర బుచ్చి" అని ఒక వెబ్ సీరీస్ అతి త్వరలో రాబోతోంది. దీన్లో మాధవీలతకు జంటగా, నేను సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసిన గౌతమ్ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేస్తున్నాడు.

ఈ వెబ్ సీరీస్‌కు మ్యూజిక్ మణిశర్మ అందిస్తుండటం విశేషం.

వెబ్ సీరీస్ కంటెంట్‌కు సంబంధించి నాదగ్గర వెరీ ఎట్రాక్టివ్ అండ్ ట్రెండీ ఫిక్షన్, నాన్ ఫిక్షన్, రియాలిటీషోస్ ఎట్సెట్రా కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి.

నిజంగా వెబ్ ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఉండి, వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న డైనమిక్ ఎంట్రప్రెన్యూర్స్ మాత్రమే, ఫేస్‌బుక్ / ట్విట్టర్ ఇన్‌బాక్స్ ద్వారా మీ మొబైల్ నంబర్ ఇస్తూ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.

"వారం తర్వాత మళ్లీ కలుద్దాం. జనవరిలో చూద్దాం .." లాంటి క్లోజింగ్‌లు ఇచ్చేవాళ్లు దయచేసి మీ సమయం కాపాడుకోండి. నా సమయం కూడా వృధాకాదు.

నాకు సినిమాలు సినిమాలే. వెబ్ సీరీస్‌లు వెబ్ సీరీస్‌లే. దేని ట్రాక్ దానిదే.

ఫైనల్‌గా .. "మరి ఆదాయం ఎలా" అంటారా?

వెబ్ చానెల్స్, యాడ్స్.

తక్కువ ఇన్వెస్ట్‌మెంట్, ఎక్కువ ఇన్‌కమ్.

లెక్కలు వేస్తే మతిపోతుంది ..

PS: ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ మోడీజీ బ్లాక్ మనీకి చెక్ పెట్టారు. చూస్కోండి  మరిక. ఏదైనా అడ్జస్ట్‌మెంట్‌లకు ఇదో మంచి అవకాశం.

ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొట్టాల్సిన పనిలేదు. అనవసరపు టెన్షన్స్ అసలొద్దు. దేని లెక్కలు దానికుంటయ్.

సినిమాలైతే ఏంటి .. వెబ్ సీరీస్‌లయితే ఏంటి?

టైమ్ అస్సలు లేదు. టేక్ యాక్షన్.

నేనున్నాను! :)

Monday 7 November 2016

యస్. నేను కె సి ఆర్ ఎడిక్ట్‌నే! .. సో వాట్?!

సిగరెట్, మందు, మగువ, డ్రగ్స్ వంటి వాటికి ఎడిక్ట్ కావడం పెద్ద విషయం కాదు. తన మెదడు మీద తనకు కంట్రోల్ లేని ఎవడైనా అవుతాడు.

ఒక ఎడిక్షన్ రేంజ్‌లో సినిమా హీరోలకు ఫ్యాన్స్ కావడం అనేది కూడా ఒకటుంది.

అదింకా చిల్లర విషయం.

ఆ హీరోలు కోట్లు సంపాదిస్తుంటారు వీళ్ల డబ్బుతో.

వీళ్లు మాత్రం .. దినమంతా కష్టపడో, అప్పులు చేసో, ఇంట్లో దొంగతనం చేసో .. ఫస్ట్ డే, ఫస్ట్ షో సినిమాకోసం ఎగబడతారు. ఫ్లెక్సీలు కడుతూ, ఆడియో ఫంక్షన్‌లకెళ్తూ చచ్చిపోతుంటారు.

నా దృష్టిలో ఇదంతా ఒక బాధ్యతారాహిత్యమైన నాన్సెన్స్. వీటి గురించి పేపర్‌లలో, టివీల్లో వచ్చే న్యూస్‌ను నేను అసలు చదవను, చూడను.  


కట్ టూ ది రియల్ ఎడిక్షన్ - 

రెండ్రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో నేనీ ఫోటో చూశాను. నంబర్ ప్లేట్ క్లియర్‌గా ఉంది కాబట్టి .. ఆ కారు ఎవరిదో కనుక్కోవడం ఈజీ. (నేనిక్కడ ఇమేజ్ కట్ చేశాను.) అయినా నేనా పని చేయలేదు. చేయాలనిపించలేదు.

"Dear Drugs, No Thanks! I Already Addicted To KCR!"

కారు మీద ఈ స్టేట్‌మెంట్ చూసాక ఇంక వేరే వివరాలేవీ నాకు అక్కర్లేదు.

ఆ స్టేట్‌మెంట్‌లో అంత దమ్ముంది.

అదే నాకు బాగా నచ్చింది. ఇవాళ ఈ పోస్ట్ రాయడానికి నన్ను అంతలా ఇన్స్‌పైర్ చేసింది.

60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేని ఒక మహోత్కృష్ట కార్యాన్ని దిగ్విజయంగా సాధించిన ఒక మహోజ్వల శక్తి కె సి ఆర్.

విజయమే లక్ష్యంగా - వందలాది నాయకుల్ని, వేలాది గ్రూపుల్నీ సంఘాల్నీ, కోట్లాది ప్రజలను సమన్వయం చేసుకొంటూ - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ, పరుగెత్తిస్తూ - ఉద్యమాన్ని ఉరకలెత్తించి గమ్యం చేర్చిన కె సి ఆర్ గత పద్నాలుగేళ్ల జీవితం, నా జీవితకాలంలో నేను స్వయంగా నా కళ్లముందు చూసిన ఒక విజయ గాథ.

"తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, అంధకారమైపోతుంది .. నక్సలైట్లు చెలరేగిపోతారు, మళ్ళీ వాళ్ల రాజ్యం వస్తుంది .. మరో బీహార్ అయిపోతుంది .. అదైపోతుంది ఇదైపోతుంది" అని తెగ స్టేట్‌మెంట్స్ ఇచ్చినవాళ్లంతా ఇప్పుడెక్కడ పెట్టుకుంటారు వాళ్ల తలల్ని?

కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె సి ఆర్ తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్నీ, ప్రతి పథకాన్నీ ఇతర రాష్ట్రాలు అనుసరించక తప్పని పరిస్థితి. మరోవైపు కేంద్రం మెచ్చుకొంటోంది. అధ్యయన సంస్థలు నంబర్ వన్ స్థానాన్ని ఇచ్చేశాయి.

తను స్వప్నిస్తున్న బంగారు తెలంగాణను నిజం చేసే క్రమంలో వడివడిగా అడుగులువేస్తున్న కె సి ఆర్ కు అన్‌కండిషనల్‌గా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నిజమైన తెలంగాణవాది మీద ఉంది.

ప్రజల్ని మోసం చేసి కోట్లు వెనకేసుకోవాల్సిన అవసరం ఇప్పుడాయనకుందా? ఏం చేసుకుంటాడని?!

ఒక ఉద్యమశక్తిగా తను సాధించిన తెలంగాణను దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకుపోవాలన్నది ఒక్కటే ఆయన ఆశయం. ఆ బంగారు తెలంగాణ ఆశయసాధనలో మొక్కవోని దీక్షతో అహర్నిశలు కృషి చేయడం తప్పా?

తప్పులు ఏవైనా జరిగితే ఎత్తిచూపే అధికారం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది. నిర్మాణాత్మకంగా ఆ పని చేయడంలో ఎలాంటి తప్పు లేదు.

కానీ, లేని తప్పుల్ని వెతకడమే పనిగా పెట్టుకున్నవాళ్లు అక్కడే ఆగిపోతారు. కళ్లముందే కాలగర్భంలో కలిసిపోతారు. అంతకంటే ఏం లేదు.

బట్ .. తెలంగాణ ఉన్నన్నాళ్లూ కె సి ఆర్ బ్రతికుంటారు.  

ఇప్పుడు దేశమే కాదు, ప్రపంచమంతా తెలంగాణవైపు చూస్తోంది.

అండ్ ద క్రెడిట్ గోస్ టూ వన్ అండ్ ఓన్లీ కె సి ఆర్.

అలాంటి కె సి ఆర్ కు నేను హార్డ్‌కోర్ ఫ్యాన్‌ను, ఎడిక్ట్‌ను అని చెప్పుకోవడంలో తప్పులేదు. తప్పుకాదు.

అదొక స్టేటస్ సింబల్‌గా గర్వంగా చెప్పుకొనే స్థాయిని తెచ్చింది కూడా కె సి ఆరే.

ఇప్పుడు చెప్పండి ..

యస్. నేను కె సి ఆర్ ఎడిక్ట్‌నే! .. సో వాట్?! 

Friday 4 November 2016

అసలేందీ కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్?!

ఈ సెటప్‌లో .. పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు.

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు!

దీనికి ఒప్పుకున్నవాళ్లే మా సినిమాలో పనిచేస్తారు.

మా సినిమా బడ్జెట్ 50 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  సో .. ఉన్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు. ఆర్ జి వి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్‌తో సినిమాలు చేశాడు.

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

సినిమాలకు "టాక్" వచ్చేదాకా మంచి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి, ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. అయినా హిట్టో, ఫట్టో ముందే ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రొడ్యూసర్‌ను కొంతయినా బ్రతికించుకోవాలంటే ఇదే మంచి పధ్ధతి.

టీమ్ వర్క్.
కంటెంట్.
ప్రమోషన్.

ఈ తరహా సినిమాలు తీయాలంటే ఈ మూడే చాలా ముఖ్యమైనవి.


కట్ టూ మనోహర్ చిమ్మని -

ఫిలిం ప్రొడక్షన్‌కు సంబంధించి దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో అతి త్వరలో నేను, ఈ మధ్యే నేను పరిచయం చేసిన నా కో-చీఫ్ టెక్నీషియన్‌ ప్రదీప్‌చంద్రతో కలిసి, మా సొంత బ్యానర్‌లో, కొన్ని నాన్-రొటీన్ అండ్ వెరీ ట్రెండీ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.

ఆసక్తి, అనుభవం ఉన్న కొత్త/పాత/అప్‌కమింగ్ హీరోలు, హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఫేస్‌బుక్/ట్విట్టర్ మెసేజ్ ద్వారా నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. మా కోపరేటివ్ ఫిలిం మేకింగ్ టీమ్‌తో కలిసి ఓ పిక్‌నిక్‌లా హాయిగా ఎంజాయ్ చేస్తూ పనిచేయవచ్చు.

చిన్నమొత్తంలోనయినా సరే పెట్టుబడి పెడుతూ, ఫీల్డులోకి రావాలనుకొనే ప్యాషనేట్ ఇన్వెస్టర్‌లకు, ఇన్వెస్టర్-హీరోలకు కూడా ఇదే నా ఆహ్వానం.  

నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.

"కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం."

ఇదే మా కాన్సెప్ట్. 

Thursday 3 November 2016

శభాష్ అన్నా!

పార్టీలో అందరికీ ఆయన ఆప్తుడు. కల్మషంలేని నిర్మల హృదయుడు. గ్రౌండ్ టూ ఎర్త్ సింప్లిసిటీ.

టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి, కె సి ఆర్ వెంట ఆయనకు అతిదగ్గరగా ఉన్న అతి కొద్దిమంది ప్రధానవ్యక్తుల్లో ఆయన ఒకరు.

ఆయనే శేరి సుభాష్ రెడ్డి.

ముఖ్యమంత్రి కె సి ఆర్ పొలిటికల్ సెక్రెటరీ.

ఈ మధ్యే తెలంగాణ స్టేట్  మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSMDC) చైర్మన్‌గా కూడా నియమితులయ్యారు.


కట్ టూ సుభాషన్న -

కార్యకర్తలనుంచి అత్యున్నతస్థాయి పార్టీనాయకులదాకా, చాలామంది "సుభాషన్నా!" అని ప్రేమగా పలకరించే సుభాష్ రెడ్డి కూడా రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. వారి తండ్రి అంతకుముందు సమితి ప్రసిడెంట్‌గా పనిచేశారు. మెదక్ జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు.

పొలిటికల్ సెక్రెటరీగా తన దగ్గర అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి, ఇటీవలే ఆయనను TSMDC చైర్మన్‌ను కూడా చేశారు మన ముఖ్యమంత్రి కె సి ఆర్.

ఎన్నికల్లో టి ఆర్ ఎస్ ఘనవిజయం వెనుక వివిధ స్థాయిల్లో టి ఆర్ ఎస్ కార్యకర్తలు, అభిమానుల సోషల్ మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, కె సి ఆర్ బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కోసం చేస్తున్న వేస్తున్న ప్రతి అడుగుకీ, చేస్తున్న ప్రతి పనికీ సంపూర్ణ మద్దతుగా, ఉద్యమం నాటి దూకుడే ఇప్పుడు కూడా మన TRS సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుండటం నిజంగా ఒక గొప్ప విషయం.

దీన్నంతటినీ ఎప్పటికప్పుడు ఒక కంట గమనిస్తూ, అవసరమైన చోట సలహాలనిస్తూ దిశానిర్దేశం చేసే మొదటి వ్యక్తీ, ఏకైక వ్యక్తీ సుభాష్ రెడ్డి.

ఇదంత చిన్నవిషయం కాదని నా ఉద్దేశ్యం.

మొన్న సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు అమెరికాలో జరిగిన "ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్‌పో"లో TSMDC చైర్మన్ హోదాలో మన రాష్ట్రం తరపున పాల్గొనివచ్చారు సుభాష్ రెడ్డి.

అంతర్జాతీయంగా భూగర్భవనరుల వెలికితీతలో అనుసరిస్తున్న విధానాలు, వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఈ ఎక్స్‌పో ద్వారా బాగా అధ్యయనం చేసిన సుభాష్ రెడ్డి, మన తెలంగాణ మైనింగ్ రంగంలో కూడా ఆధునిక సాంకేతికతను జోడించి, చరిత్ర తిరగరాసే అత్యధిక ఆదాయం మన ప్రభుత్వానికి సమకూరేలా చేయాలన్న గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు.


కట్ టూ సుభాషన్న ఏకైక లక్ష్యం - 

కె సి ఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో - అనుక్షణం ఆయనను కంటికి రెప్పలా చూసుకున్న వ్యక్తిగా సుభాష్ రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయి. సుమారు 14 సంవత్సరాల ఉద్యమంలో వ్యక్తిగత జీవితాన్ని దాదాపు త్యాగం చేసిన సుభాష్ రెడ్డి, సి ఎం కు పొలిటికల్ సెక్రెటరీగా ఉన్నా, TSMDC చైర్మన్ అయినా .. ఇప్పటికీ ఎప్పటికీ .. ఆయన లక్ష్యం ఒక్కటే:

"బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కె సి ఆర్ వెంటే నడవడం, కె సి ఆర్ ఆలోచనలను ప్రజలవద్దకు తీసుకెళ్లడం, ఉద్యమ సమయంలో ఎంతటి దీక్షతో అయితే కె సి ఆర్ వెంట పనిచేయడం జరిగిందో, అంతే దీక్షతో కె సి ఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ కోసం కూడా పనిచేయడం."

హాట్సాఫ్ సుభాషన్నా!   

Tuesday 1 November 2016

షార్ట్ ఫిల్మ్ మేనియా!

"ఆ గ్యాంగ్ రేపు!"

ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు.

ఇదొక షార్ట్ ఫిల్మ్ టైటిల్.

'ఐక్లిక్ చానెల్' ద్వారా  రిలీజై, యూట్యూబ్‌లో కోటి పద్దెనిమిది లక్షలకుపైగా వ్యూస్‌తో రికార్డులు బద్దలుకొట్టిన షార్ట్ ఫిల్మ్ ఇది.

మంచి కాన్సెప్ట్. ఆట సందీప్ లాంటి యాక్టర్స్. నా మిత్రుడు సురేష్ లాంటి కెమెరామన్.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యోగీ డైరెక్షన్.

అదీ రిజల్ట్!


కట్ టూ షార్ట్ ఫిల్మ్ మేనియా -  

ఫిల్మ్ మేకింగ్ అనేది నెగెటివ్ నుంచి పూర్తిగా డిజిటల్‌కు మారిన తర్వాత వచ్చిన ఒక పెద్ద సంచలనమంటే ఇదే.

షార్ట్ ఫిల్మ్ మేకింగ్!

ఇప్పుడు ఎక్కడ చూసినా షార్ట్ ఫిల్మ్ షూటింగ్సే జరుగుతున్నాయి. ఒక్క హైద్రాబాద్‌లోనే కాదు. ప్రతి చిన్న టౌన్లో కూడా.

5డి కెమెరా మాత్రమే కాదు. ఐఫోన్ వంటి మొబైల్స్‌తో కూడా అద్భుతమైన షార్ట్ ఫిలింస్ తీస్తున్నారు కొంతమంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు.

ప్రతి శని ఆదివారాల్లో, ప్రసాద్ ల్యాబ్‌లోని ప్రివ్యూ థియేటర్లు రెండూ దాదాపు పూర్తిగా ఈ షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూలకే అంకితమైపోయాయిప్పుడు.

ఈ లెక్కన ప్రతినెలా ఎన్ని షార్ట్ ఫిలింస్ మన దగ్గర తయారవుతున్నాయో ఈజీగా అంచనా వేయొచ్చు.  


కట్ టూ యోగీ - 

బాగా పేరు తెచ్చుకొన్న షార్ట్ ఫిలింస్‌లో నటించిన యాక్టర్స్‌కూ, డైరెక్టర్స్‌కూ ఫీచర్ ఫిలింస్‌లో అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నాయిప్పుడు. అంతెందుకు .. ఒకప్పుడు హిట్ ఫీచర్ ఫిలింస్‌లో నటించిన మాధవీలత వంటి హీరోయిన్స్ కూడా ఇప్పుడు వెబ్ సీరీస్‌కు మళ్లుతున్నారు!

షార్ట్ ఫిలింస్ వల్ల ఇదొక మంచి పరిణామం.

"ఆ గ్యాంగ్ రేపు" డైరెక్టర్ యోగీ కుమార్ ముత్యాల ఇప్పుడు 'తెలుగు వన్' ద్వారా తన తర్వాతి షార్ట్ ఫిల్మ్ "పాప" రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు. యూట్యూబ్‌లో ఈ "పాప" కూడా వ్యూస్ విషయంలో మరో సంచలనం సృష్టించవచ్చు.

"ఆ గ్యాంగ్ రేపు" తర్వాత ఫీచర్ ఫిల్మ్ కోసం కొన్ని ఆఫర్స్ వచ్చినా, అవి తను ఆశించిన రేంజ్‌లో లేకపోవడంతో స్వతహాగా ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన యోగీ వాటిని  ఒప్పుకోలేదు.

"స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా నేను సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయం చేసిన మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ బ్రాహ్మిణి మురాల ప్రధాన పాత్రలో నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ "పాప" రిలీజ్ తర్వాత, ఆమెకు బోల్డన్ని ఆఫర్స్ వస్తాయి. తనొక రేంజ్‌కు వెళ్తుంది. డైరెక్టర్ యోగీకి కూడా ఆయన ఆశించిన రేంజ్‌లో ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ ఆఫర్ వస్తుందని నా గట్టి నమ్మకం.

ఆల్ ది బెస్ట్ టూ యోగీ అండ్ హిజ్ టీమ్ .. 

Sunday 30 October 2016

హ్యాపీ దీపావళి!

జనవరి ప్రారంభంలో న్యూ ఇయర్, సంక్రాంతిల నుంచి .. సంవత్సరం చివర్లో దీపావళి, క్రిస్‌మస్ దాకా కనీసం ఒక డజన్ పండుగలూ పబ్బాలూ గట్రా వస్తాయి.

ఇంతకుముందులా ఫోన్ కాల్స్ ద్వారానో, లేదంటే పర్సనల్‌గా కలిసి మొహం మీదనో గ్రీటింగ్స్ చెప్పుకోవడం అనేది ఇప్పుడు దాదాపు అవుట్‌డేటెడ్ అయిపోయింది.

ఇప్పటి స్టయిల్ పూర్తిగా వేరే.

టెక్‌స్ట్ మెసేజ్‌లు. వాట్సాప్‌లు. ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్‌లు, స్కయిప్ కాల్స్ .. ఎట్సెట్రా.

ఏదైతేనేం - పైనచెప్పుకున్న ప్రతి పండగ సందర్భంలోనూ "హ్యాపీ అండ్ ప్రాస్పరస్" అనే రెండు ముఖ్యమైన పదాల్ని మర్చిపోకుండా ప్రిఫిక్స్ చేసి, నానారకాలుగా గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం మనం.

అలా చెప్పినంత మాత్రానో, "సేమ్ టూ యూ" అని చెప్పించుకున్నంత మాత్రానో, ఉట్టి పుణ్యానికే ఎవ్వరికీ సంతోషాలూ డబ్బులూ రావు.

వాటికోసం ఏంచేయాలో అది చేస్తేనే అవి వస్తాయన్నది జస్ట్ కామన్ సెన్స్.

కానీ, ఆశించడంలో తప్పులేదు. అదో ఆనందం. అదో తుత్తి.

ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇలాంటి కొన్ని ఫార్మాలిటీస్ నుంచి అంత ఈజీగా తప్పించుకోలేం.

బికాజ్ ..

అప్పుడెప్పుడో అరిస్టాటిల్ చెప్పినట్టు "మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్". (ఆఫ్‌కోర్స్, వుమన్ కూడా!)

కాబట్టి కొన్ని తప్పవు.

ఆక్రమంలోనే ఇప్పుడు నా తుత్తికోసం ..

విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దీపావళి .. :) 

Monday 24 October 2016

మూడు ముక్కలాట!

అవును. జీవితం మూడు ముక్కలాటే.

"ఆశ, కోరిక, అవసరం .. ఈ మూడే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి" అంటూ బులెట్ షాట్‌లా ఒకే ఒక్క మాటతో జీవిత సారాంశాన్ని చెప్పేశాడు నా మిత్రుడు శ్రీనాథ్.

ఎంత నిజం!

ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ మూడింటి అర్థం, పరమార్థం, లక్ష్యం .. అన్నీ ఒక్కటే!

మనం అనుకున్నది పొందటం.

ఆశలు, కోరికలు ఒక స్థాయివరకే. తర్వాత ఈ రెంటికీ అంత విలువుండదు. జస్ట్ బుల్‌షిట్. చాలా లైట్ తీసుకుంటాం.

నామటుకు నేను ఇప్పటికే ఈ మూడు ముక్కల్లో మొదటి రెండు ముక్కల్ని పడేశాను. ఇంక నా చేతిలో మిగిలిన ముక్క ఒక్కటే.

అవసరం.

నిజానికి ఈ చివరి ముక్కకే ఎంతో పదును ఉంటుంది. మొదటి రెండు ముక్కల అనుభవం తర్వాత!

ఈ ముక్కతో అనుకున్నది ఏదైనా సాధిస్తాం.

అవసరం కాబట్టి ..  

Wednesday 19 October 2016

బోట్ ప్రమాదాలెందుకు జరుగుతాయి?

26 ఫిబ్రవరి 1990.
నాగార్జునసాగర్ ఎక్స్‌కర్షన్.

దాదాపు 26 సంవత్సరాలు కూడా గడిచింది కాబట్టి .. చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఎట్‌లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్‌కు, స్టాఫ్‌కు గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నాను.
ఇక్కడ విషయం మన ఎక్స్‌కర్షన్ కాదు.

నదుల్లో, కాలువల్లో బోట్ ప్రమాదాలు ఎలా జరుగుతాయో నేను చాలా లైవ్‌గా గుర్తించాను.

సుమారు 300 ప్లస్ స్టూడెంట్స్, స్టాఫ్ కు ఆరోజు అక్కడున్న ఒక్క బోట్ సరిపోదు. రెండు ట్రిప్స్ వేయడానికి లేదు. మామూలుగా ఎక్కువమంది ఉన్నప్పుడు అదే బోట్‌కు పక్కన ఫ్లాట్‌గా పెద్దగా ఉండే ఒక చెక్క బల్లని తాళ్లతో కడతారు. ఆరోజు వాళ్లు అదే చేశారు. అందరం ఎక్కాం.

సరిగ్గా మధ్యలోకి వెళ్లాక ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్‌తో బోట్ ఆగిపోయింది!

నీళ్లలో బోట్ వెళ్తున్నప్పుడు ఏంకాదు కానీ, అదే బోట్ నది మధ్యలో ఉండి ఆగినప్పుడు పరిస్థితి పిచ్చి డేంజెరస్‌గా ఉంటుంది. మన బోట్ విషయంలో కూడా అదే జరిగింది.

సాగర్ మధ్యలో ఆగిన బోట్ నీళ్ల ఊపుకి ఒక ఉయ్యాలలాగ ఊగుతోంది. దానికి తోడు పక్కన తాళ్లతోకట్టిన చెక్క బల్ల. దానిమీద ఇంకో 100 మంది స్టూడెంట్స్! దాని పరిస్థితి మరింత దారుణం.

ఏ చిన్న షేక్ వచ్చినా .. జరగరానిది జరిగిపోతుంది. మొత్తం ఓవర్ క్రౌడెడ్ బోట్, దానికి తాళ్లతో కట్టిన మరో అదనపు బరువు ఆ చెక్క బల్ల .. దానిమీద మరో 100 మంది!

అంతా తళ్లకిందులవ్వడానికి ఒక్క క్షణం చాలు.

ఎవరికివాళ్లు పైకి మామూలుగానే వున్నా, లోపల్లోపల మాత్రం భయంగానే వున్నాం మేము.
అప్పుడు సెల్ ఫోన్స్ కూడా లేవు ఇలాంటి సిచువేషన్‌లో ఉన్నాం అని ఎవరికైనా చెప్పడానికి. ఒకవేళ చెప్పగలిగినా, అప్పటికప్పుడు అక్కడికొచ్చి 300 మందిని కాపాడగలిగేంత సీన్ అక్కడ లేదు. అది వేరే విషయం.

సుమారు 40 నిమిషాల టెన్షన్ తర్వాత బోట్ రిపేర్ అయ్యి కదిలింది.

అందరం హాప్పీగా ఇంకో చివరనున్న నాగార్జునకొండకెళ్లాం. అన్నీ చూసాం. ఎంజాయ్ చేసాం. అక్కడ క్యాంటీన్‌లో తిన్నాం. మళ్లీ తిరిగి అదే బోట్ ప్లస్ చెక్కబల్లపైన మళ్లీ అదే 300 + మంది సేఫ్‌గా వెనక్కి వచ్చేశాం.

ఆల్ హాపీస్ ..

సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే .. కెపాసిటీని మించి ఎప్పుడూ బోట్ ఎక్కవద్దు. అక్కడ బోట్ నిర్వాహకులకు అది మామూలే కావచ్చు. ఏదైనా జరగరానిది జరిగితేనే కష్టం.
మన విషయంలో .. కెపాసిటీకి డబుల్ కంటే ఎక్కువమందిమి ఎక్కాం. అది కూడా చాలా రిస్కీ పధ్ధతిలో.
^^^
(This was actually posted by me yesterday night in Jawahar Navodaya Vidyalaya, Maddirala, Closed Facebook Group. Just copy pasted here to share it on my blog.)

Monday 17 October 2016

కవిత, బతుకమ్మకు ప్రతీక!

ఎం పి గా పార్లమెంట్‌లో అది తన తొలి స్పీచ్.

అయినా ..

వెరీ కాన్‌ఫిడెంట్, డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్.

ఎలాంటి తడబాటు లేకుండా మంచి ఇంగ్లిష్‌లో దడదడలాడించేశారు. స్పీచ్‌లో అక్కడక్కడా ఓ రెండు మూడుసార్లు హిందీకూడా తనకు బాగా వచ్చునని చెప్పకనే చెప్పారు.

తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని, కె సి ఆర్ గారిని, అటు సోనియా గాంధీని, ఇటు సుష్మా స్వరాజ్‌ను గురించీ ప్రస్తావించారు.

ప్రైమ్ మినిస్టర్‌ను, పార్లమెంట్‌లోని ఇతర పెద్దలనందర్నీ గౌరవిస్తూనే, అదే స్పీచ్‌లో అంటించాల్సిన చురకలన్నీ వరసపెట్టి అంటించారు కూడా:  

ప్రెసిడెంట్ తన స్పీచ్‌లో కొత్తగా ఏర్పడిన 29 వ రాష్ట్రం అయిన తెలంగాణకు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదన్నారు.

పోలవరం గురించీ .. ఆర్డినెన్స్ ద్వారా ఏపిలో కలిపిన 7 మండలాల్లోని ఆదివాసీల సంక్షేమం కోసం చెయ్యాల్సిన దానిగురించి కూడా చెప్పారు.


కట్ టూ కష్మీరీ పండిట్స్ - 

మరోసారి అదే పార్లమెంట్‌లో .. తన ఇంకో స్పీచ్‌లో .. కష్మీరీ పండిట్స్ గురించి దడదడలాడించేశారు ఇదే ఎం పి గారు.

నాకు తెలిసి .. ఏపీ, తెలంగాణలకు సంబంధించిన ఎం పి లెవరూ పార్లమెంట్‌లో ఇప్పటివరకూ ఈ అంశం మీద అసలు మాట్లాడి ఉండరు అనుకుంటున్నాను. ఒకవేళ మాట్లాడి ఉన్నా, ఖచ్చితంగా ఇంత లోతుగా సమస్యను అధ్యయనం చేసి ఉండరని నా గట్టి నమ్మకం.

ఈ విషయంలో ఇంత నమ్మకంగా నేను చెప్పగలగడానికి కారణం కూడా ఒకటుంది.

సీనియర్ మోస్ట్ ది గ్రేట్ అద్వానీ గారు లేచి, ఇదే అంశం గురించి తర్వాత మాట్లాడుతూ, అప్పటిదాకా మాట్లాడిన ఈ ఎం పి ని ఒకటికి నాలుగుసార్లు మెచ్చుకున్నారు.

దటీజ్ ఎం పి.

ఆ ఎం పి ఎవరో కాదు.

కల్వకుంట్ల కవిత.

తెలంగాణ జాగృతి సారథి. ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి కూతురు.


కట్ టూ మన బంగారు బతుకమ్మ -

ఒకప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించారు. తెలాంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను ఎగతాళి చేశారు. ఆ బతుకమ్మ ఆడే తెలంగాణ ఆడబిడ్డల్ని అవహేళన చేశారు.

అదిప్పుడు చరిత్ర.

తెలంగాణ అవతరణకు ముందు కథ.

తెలంగాణ జాగృతి ఏర్పాటుకు ముందు కథ.

మరిప్పుడో?

ఎక్కడ విన్నా "జై తెలంగాణ!" .. "జై కె సి ఆర్!"

ఎక్కడ చూసినా .. బంతిపూలు, చామంతులు, నందివర్ధనాలు, తంగేడుపూలు, రంగులద్దిన గునుగు పూలు. ఆ పూలతో పేర్చిన బతుకమ్మలు. ఆ బతుమకమ్మలను ఆనందంగా ఆడే ఆడబిడ్డలు.

అది కూడా ఏదో ఆషామాషీగా కాదు. గిన్నిస్ రికార్డు బద్దలయ్యేలా!

అంతేనా .. నో.

ఒక్క తెలంగాణలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరిలోనూ అంబరాన్నంటిన ఇదే ఆనందం.

ఒక్క రాజకీయంగానే కాదు. సాంస్కృతికంగా కూడా.

దుబాయ్ నుంచి డెన్మార్క్ దాకా .. 17 రోజులు, 9 దేశాలు. అవిశ్రాంత తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ సంకల్ప యాత్ర.

ఎక్కడికెళ్లినా తెలంగాణకు జేజేలు, మన బంగారు బతుకమ్మకు హార్దిక ఆహ్వానాలు.

ది రినైజెన్స్ ఆఫ్ బతుకమ్మ ..

మన బతుకమ్మకు మళ్లీ కళ వచ్చింది.

ఈ కళ ఏ స్థాయిలో వచ్చిందంటే .. ఇప్పుడు ప్రతి తెలంగాణ ఆడబిడ్డ గర్వంగా బతుకమ్మను పేర్చుతోంది. ఆడుతోంది. పాడుతోంది. పోటీలుపడి సెల్ఫీలు దిగుతూ ఫేస్‌బుక్ నిండా తన ఆనందాన్ని ఆవిష్కరిస్తోంది.

మొన్నటి బతుకమ్మ పండుగకు ఫేస్‌బుక్ నిండా, బతుకమ్మలతో ఎన్ని లక్షల సెల్ఫీలు పోస్ట్ చేశారో ఒక్కసారి అలా గుర్తుకుతెచ్చుకోండి.

"వావ్!" అని జకెర్‌బర్గే జెర్క్ తినుంటాడు.

క్రెడిట్ గోస్ టూ ..

కవిత, మన బతుకమ్మకు ప్రతీక.

రియల్లీ హాట్సాఫ్ ..   

Wednesday 12 October 2016

నిర్ణయం విలువెంత?

నాకత్యంత ప్రియమైన ప్రపంచస్థాయి నవలారచయితల్లో బుచ్చిబాబు ఒకరు.

ఆయన రాసిన ఒకే ఒక్క నవల .. "చివరకు మిగిలేది".

"గడ్డిపోచ విలువెంత?" అన్న సింపుల్ వాక్యంతో ఆ నవల ప్రారంభమవుతుందని  నాకింకా గుర్తుంది. అదిక్కడ కోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నిర్ణయమో చివర్లో చూద్దాం.


కట్ టూ మన నిర్ణయాలు -
 

జీవితంలోని ప్రతిదశలోనూ ఎప్పటికప్పుడు వందలాది నిర్ణయాలు తీసుకుంటూవుంటాం మనం.

ఇష్టమైన పెన్ కొనుక్కోవడం నుంచి, పెళ్లిదాకా.
ఏదో ఓ కోర్స్ చదివి, మరేదో ఉద్యోగంలో చేరేదాకా.
ఏదో ఓ లోపల్లోపలి అతిచిన్న గోల్‌తో మరేదో ఇష్టంలేని ప్రొఫెషన్‌లో చేరి ఇరుక్కునేదాకా.

జీవితమంతా ఎన్నో నిర్ణయాలు.

చిన్నవీ, పెద్దవీ.

కానీ, మనం తీసుకొన్న ఒక నిర్ణయం తప్పని తర్వాత తెలిసినా .. వెంటనే దాన్ని సరిచేసుకొనే మరో కొత్త నిర్ణయం తీసుకోలేనప్పుడే అసలు చిక్కంతా!


కట్ బ్యాక్ టూ మన గడ్డిపోచ - 

ఎవరో ఏదో అనుకుంటారనో, లేదా అందరి దృష్టిలో బాగుండాలనో .. ఇష్టం లేకపోయినా, ఈగో అడ్డొచ్చినా, ఎంత కష్టమయినా .. ముందు తీసుకున్న ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండటం అనేది ఓ పెద్ద తప్పుడు నిర్ణయం!

విషయం చిన్నది కావొచ్చు, పెద్దది కావొచ్చు. ఫలితాల్నిబట్టి ఎప్పటికప్పుడు తన నిర్ణయాల్ని మార్చుకోలేనివారు ఎవరైనా సరే వారి జీవితంలో చాలా కోల్పోతారు. లేదా జీవఛ్చవంలా బ్రతుకుతుంటారు. పరోక్షంగా మరెందరి జీవితాలో ప్రభావితం కావడానికి కారణమవుతారు.
ఈలోగా జీవితం తెల్లారిపోతుంది.

ఇలా జీవితాల్ని తెల్లార్చుకొనేవారు సమాజంలో 99% ఉంటారు. మిగిలిన ఆ ఒక్క శాతం మంది మాత్రమే ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని మార్చుకొంటూ సిసలైన గట్స్‌తో ముందుకెళ్తుంటారు. అనుకున్న జీవితాన్ని అనుభవిస్తుంటారు.

అదీ తేడా.

ఈలెక్కన మనం తీసుకొనే ఒక నిర్ణయం విలువెంత?

ఒక గడ్డిపోచంత.     

Friday 7 October 2016

ఆనందోబ్రహ్మ!

ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది.. "మైండ్ చేంజెస్ లైక్ వెదర్!" అని.

ప్రారంభంలోనే ఎందుకీ సామెత చెప్పానో ఈ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా చదివాక మీకు తెలుస్తుంది.

నేను సినిమాల్లో ఉన్నన్ని రోజులు కొన్ని పనులు చేయలేను అని మొన్నటివరకూ అనుకొనేవాణ్ణి. కానీ అది నిజం కాదని నేనే ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను.

ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకోవడం ఉట్టి అవివేకం.

మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్.

ఈ యాంగిల్లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!

సో, నా మైండ్‌సెట్ పూర్తిగా మార్చేసుకున్నాను.

ఎవరైనా, ఎన్ని పనులైనా, ఏకకాలంలో చేయొచ్చు. అది ఆయా వ్యక్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచస్థాయిలో సక్సెస్‌పీపుల్ అంతా ఏకకాలంలో ఎన్నోరకాల పనుల్లో, వృత్తుల్లో, వ్యాపకాల్లో, వ్యాపారాల్లో మునిగితేలుతున్నవాళ్లే!  

మన ప్రయారిటీలనుబట్టి, ఏయే పనులు ఎప్పుడు చేయాలో, అప్పుడు అలా వాటికవే జరుగుతూపోతుంటాయి. అలా చేయడానికి మనం అతి సహజంగా అలవాటుపడిపోతాం.

ఇప్పుడు నేనీపనిని అత్యంత ఈజీగా, విజయవంతంగా చేయగలుగుతున్నాను. నేను చేస్తున్న ఏపనీ నా మరోపనికి అడ్డురావడంలేదు. విచిత్రంగా అన్ని పనులూ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి.       


కట్ టూ ఆధ్యాత్మికమ్ - 

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ .. ఈ రెండూ నాకత్యంత ఇష్టమైన అంశాలు. ఈ రెండూ చూడ్డానికి విభిన్నధృవాల్లా అనిపిస్తాయి. కానీ, రెండింటి సోల్ ఒక్కటే.

ఆనందం.

కమర్షియల్ సినిమాలు చేసే ఒక దర్శకునిలో ఆధ్యాత్మిక చింతన ఉండకూడదా? ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక ఆర్టిస్ట్ బొమ్మలువేసి ఎగ్జిబిషన్ పెట్టకూడదా? భారీ వ్యాపారాల్లో మునిగితేలే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక చిత్రం నిర్మించకూడదా?

ఎవరు ఏదైనా చేయొచ్చు. ఏమైనా కావొచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. కానీ, చివరికి అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే అవుతుంది. ఆ మార్పు తప్పదు.

ఒక అలెగ్జాండర్ కావొచ్చు. ఒక చలం కావొచ్చు. ఒక మహేష్‌భట్ కావొచ్చు. అందరూ అంతిమంగా అక్కడికి చేరినవాళ్లే.

ఈ నిజాన్ని చరిత్ర పదేపదే రుజువుచేసింది.

నిజానికి ఈరెండూ కలిసినప్పుడే మనం ఊహించని అద్భుతవిజయాలు మనల్ని వరిస్తాయి. మనం కోరుకున్న స్వేఛ్చ, ఆనందం మన సొంతమవుతాయి.

ఈ నిజాన్ని కూడా చరిత్ర పదేపదే రుజువు చేసింది.

అంతే తప్ప, అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు .. కాకూడదు. 

Sunday 2 October 2016

ఆ ఒక్కటీ అడగొద్దు!

అది హాలీవుడ్ కావొచ్చు. బాలీవుడ్ కావొచ్చు. మన తెలుగువుడ్డు కూడా కావొచ్చు.

కేవలం 2-5 శాతం లోపు  సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటాయి. 'హిట్' అనిపించుకుంటాయి.

సినిమా పుట్టినప్పటినుంచీ ఇదే వ్యవహారం.

పెట్టుబడిని మించిన కలెక్షన్లతో ప్రేక్షకాదరణ పొందిందే హిట్. అంతేగానీ, ఎవరో ఒక పది మంది మేధావి క్రిటిక్స్‌కు వ్యక్తిగతంగా నచ్చినంతమాత్రాన అది హిట్ కాదు.

ఈ ప్రాక్టికల్ నిజాన్ని పక్కనపెట్టి, ఆయా సినిమాలని తీయడంలో వాళ్లు పడ్ద శ్రమని, వాళ్లు అనుభవించిన కష్టనష్టాలనీ, ఆ సినిమాల నిర్మాణ నేపథ్యాన్నీ కనీసం ఆలోచించకుండా .. ఎవరెవరో సినిమాల గురించి ఏదేదో రాస్తారు.

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతివాడూ క్రిటిక్కే. సినిమా చూసినవాడూ, చూడనివాడూ కూడా ఏదో ఒకటి గిలికి కడిగిపారేస్తున్నారు.

ఫేస్‌బుక్ ఫ్రీ కదా! :)

ఇంకొందరేమో ఉచిత సలహాలనిస్తారు.

వాళ్లే క్రిటిక్స్. మేధావులు. అది వారి ప్రొఫెషన్. వారి హాబీ.

వీళ్లలో చాలామంది నాకు మిత్రులు. బాగా తెలిసినవాళ్లు. గౌరవ సీనియర్లు. అందరూ నాకిష్టమైనవాళ్లు.

మరి అవన్నీ అంతబాగా తెలిసిన వీళ్లంతా, వరసపెట్టి, హిట్టు మీద హిట్టు, ఎంతో ఈజీగా, ఎన్నో సినిమాలు తీయొచ్చుకదా?!

ఆ ఒక్కటీ అడగొద్దు వాళ్లను.

ఏదో ఒకటి రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం చాలా ఈజీ. దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చుకాదు. కానీ .. లక్షలు, కోట్లు ఖర్చయ్యే సినిమా తీయడం మాత్రం అంత ఈజీ కాదు.

అది వాళ్లకూ తెలుసు. అందుకే, బై మిస్టేక్ కూడా వాళ్లా పని చేయరు.

కానీ, చేస్తే బాగుండునని నాబోటివాళ్ల సరదా.  జస్ట్ ఫర్ ఎ చేంజ్ .. :) 

Friday 30 September 2016

ది బిగ్ బిజినెస్!

ఒక కళ.
ఒక ఆకర్షణ.
ఒక మాండ్రెక్స్ మత్తు.
ఒక మాయ.
ఒక జూదం.
ఒక జీవితం.

సినిమా గురించి పైన చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షరాలా నిజం.

కాకపోతే .. ఒక్కో సినిమా సెటప్‌ని బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి, ఆయా వ్యక్తుల అనుభవాలను బట్టి ఈ నిర్వచనాలు మారుతుంటాయి.

నలభై కోట్లు పెట్టి - ఓ బ్రాండెడ్ హీరోతో, మరో బ్రాండెడ్ డైరెక్టర్ ఏడాదిపాటు చెక్కిన ఒక తెలుగు సినిమాను రెండే రెండు గంటల్లో ప్రేక్షకుడు "చెత్త సినిమా" అనో, "వేస్ట్" అనో ఒక్క మాటలో తేల్చిపడేయొచ్చు.

మరోవైపు .. కేవలం ఓ నలభై లక్షల్లో కొత్తవాళ్లతో తీసిన ఒక మైక్రో బడ్జెట్ సినిమాను చూసి, అదే ప్రేక్షకుడు "బాగుంది" అని దాన్ని హిట్ చేయొచ్చు.

ఈ రెండు సినిమాల నిర్మాణంలో ప్రాసెస్ ఒకటే. రేంజ్ మాత్రమే వేరు.

ఒక సినిమా కంటెంట్ ఆ క్షణం ప్రేక్షకులకు నచ్చలేదు. మరొక సినిమా కంటెంట్ నచ్చింది. అంతే.


కట్ టూ ది బిగ్ బిజినెస్ -

పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు .. ఈ మూడు లేకుండా మన దేశంలో మనుషులు బ్రతకలేరు. టీవీ చానెల్స్ అస్సలు బ్రతకలేవు.

సినిమాకున్న పవర్ అది!

ఎవరు ఎన్ని చెప్పినా ఇదే నిజం. సినిమా ప్యూర్‌లీ ఒక పెద్ద బిజినెస్.

క్రియేటివ్ బిజినెస్.

"నాకసలు డబ్బు అక్కర్లేదు. మంచి సినిమా తీసిన పేరు, సంతృప్తి చాలు" అని చెప్పగలవాళ్లు నిజంగా ఎంతమందున్నారు? ఎంతమంది అంత సింపుల్‌గా, అంత భారీ రేంజ్‌లో డబ్బులు కోల్పోడానికి ఇష్టపడతారు?

ఒకవేళ ఎవరయినా అలా చెప్పి, డబ్బులు అసలే వచ్చే అవకాశంలేని ఒక అద్భుతమయిన ఆర్ట్ సినిమా తీసినా .. అందులో కూడా పెద్ద బిజినెస్ ఉంది.

తన పేరు, సంతృప్తికోసం సినిమా తీస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా నథింగ్ బట్ బిజినెస్!

సో, కమర్షియల్ సినిమాలు తీసినా, ఆర్ట్ సినిమాలు తీసినా .. ఎవరికయినా ముందు కావల్సింది సినిమా మీద ప్యాషన్.

ఆ ప్యాషన్‌తోనే ఇప్పుడు మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిలో ఫీల్డులోకి దిగాన్నేను. 

పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్‌తో, తక్కువ రోజుల్లో ఎక్కువ సినిమాలు తీయడమే నా ప్రధాన లక్ష్యం.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు.

భారీ స్థాయిలో డబ్బూ, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా.

ఒక బిగ్ బిజినెస్.   

Thursday 29 September 2016

ఇప్పుడు కావల్సింది ఒక్క హిట్!

డబ్బు, సెలెబ్రిటీ హోదా, నానా ఆకర్షణలు, వివిధ రంగాల్లోని వి ఐ పి స్థాయి వ్యక్తులతో పరిచయాలు, పవర్‌ఫుల్ నెట్‌వర్క్ ..

ఇంకేం కావాలి?

సినీ ఫీల్డులో ఇవన్నీ ఉన్నాయి.

ఎవరెన్ని చెప్పినా, ఎన్ని నీతులు వల్లించినా .. సినిమా అనేది ఓ పెద్ద క్రియేటివ్ బిజినెస్.

మాగ్నెట్‌లా జివ్వున లాగే గ్లామర్ ఫీల్డ్. పట్టుకుందంటే వదలని ఓ పెద్ద అడిక్షన్.


కట్ టూ ది పాయింట్ - 

నిద్రపోతావో, నిశాచరుడివవుతావో ..  కష్టపడతావో, కన్నీళ్లే పెడతావో .. పరుగెడతావో, పరిగెత్తిస్తావో .. హార్డ్ వర్కో, స్మార్ట్ వర్కో .. అంతా నీ ఇష్టం.

మొత్తానికి నువ్వొక పని రాక్షసుడివి అయిపోవాలి.

నీ ఫోకస్ అంతా నీ ఏకైక లక్ష్యం మీదే ఉండాలి.

అప్పుడే .. ఈ మార్కెట్ స్టడీలు, హిట్ ఫార్ములాలు, సక్సెస్ సూత్రాలు, ఓపెనింగ్ ఫంక్షన్లు, క్లోజింగ్ పార్టీలు, ప్రెస్ మీట్లు, ఫ్లెక్సీలు, అదృష్ట సంఖ్యలు, సెంటిమెంట్లూ, తొక్కా .. ఇవేవీ నీకు వినిపించవు. కనిపించవు.

అప్పుడు .. అప్పుడు మాత్రమే, ఒకే ఒక్కటి .. నిన్ను వెదుక్కుంటూ వస్తుంది. నీ వెంటబడి వేధిస్తుంది. నిన్ను వరిస్తుంది.

హిట్!

ఆ ఒక్క హిట్‌తోనే, రాత్రికి రాత్రే .. నువ్వూహించని రేంజ్‌లో నీ జీవితం మారిపోతుంది.
ఎప్పటినుంచో నువ్వు కోరుకొంటున్న స్వేఛ్చ నీ సొంతమవుతుంది.

ఇక నీ జీవితం నీ ఇష్టం. నీ క్రియేటివిటీ నీ ఇష్టం.

ఏం సాధిస్తావో సాధించు.

ఏం జీవిస్తావో జీవించు.  

'ఒక్క ఛాన్స్' రోజులు పోయాయి!

'ఒక్క ఛాన్స్' అనేది ఇప్పుడు గతం.

ఆ రోజులు పోయాయి.

ఇప్పుడు ఎవరైనా యాక్టర్ కావొచ్చు. డైరెక్టర్ కావొచ్చు. సినీఫీల్డులో తనుకోరుకున్న ఇంకేదయినా కావొచ్చు.

ఫిలిం మేకింగ్‌లో వచ్చిన అత్యంత ఆధునిక డిజిటల్ టెక్నాలజీ .. ఊహించని వేగంతో ఎప్పటికప్పుడు అందులో వస్తున్న కొత్త డెవలప్‌మెంట్స్ మతిపోగొడుతున్నాయి.

అవన్నీ ఇప్పుడు .. మొత్తం సినిమా సీన్ నే మార్చేశాయి.

ఒక్క ఛాన్స్ అన్న ఈ పాతకాలం కాన్‌సెప్ట్‌ను ఒకే ఒక్క దెబ్బతో పూర్తిగా స్ట్రయికాఫ్ చేసేశాయి.


కట్ టూ కరెంట్ రియాలిటీ - 

కొంచెం లౌక్యం. మరికాస్త మానిప్యులేషన్. ఇంకాస్త డైనమిజమ్.

ఈ మూడు చాలు. మీలో ఉన్న ఏ కొంచెం టాలెంట్‌నయినా టార్గెట్ రీచ్ అయ్యేలా చేయడానికి!

సింపుల్‌గా చెప్పాలంటే .. గూగుల్ సెర్చ్ తెలిసిన ప్రతి ఒక్కరికీ, ఫేస్‌బుక్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ .. తను కోరుకున్నది ఏదైనా సాధించేసుకోగల ఛాన్స్ ఉన్న రోజులివి.

ఒక్క ఛాన్స్ అన్నది అసలు లెక్కే కాదు.


కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఐఫోన్‌లో సినిమాలు తీసి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు రివార్డులు కొడుతున్న ఈ రోజుల్లో .. మనకు ఆ "ఒక్క ఛాన్స్" వేరే ఎవరో ఇవ్వాలా?  

ఆలోచించండి ..    

Tuesday 27 September 2016

చెరువుతో సెల్ఫీ

60 ఏళ్లుగా, ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కలలో కూడా ఊహించని ప్రాజెక్టు "మిషన్ కాకతీయ".

మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మానస పుత్రిక.

"మన ఊరు, మన చెరువు" ఈ ప్రాజెక్టు ట్యాగ్‌లైన్!

ఊ అంటే 'టైటిల్స్, ట్యాగ్‌లైన్స్' అంటూ నానా కంగాళీ చేసే మా సినిమావాళ్లు కూడా పెట్టలేని మంచి ట్యాగ్‌లైన్ ఇది అని చెప్పడానికి నేనేం సంకోచించడంలేదు.

గత 12 మార్చి 2015 నాడు ప్రారంభమైన ఈ మిషన్ కాకతీయ, చూస్తుండగానే కేవలం 18 నెలల్లో ఒక నమ్మలేని నిజమైంది.

ఈ ప్రాజెక్ట్ ఇంత వేగంగా, ఇంత సమర్థవంతంగా సఫలమైందంటే కారణం ఒకే ఒక్కడు - తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు.

ప్రజలను, రైతులను, దాతలను, వివిధ శాఖల్లో పనిచేసే అధికారులను .. వారూ వీరూ అనికాకుండా, అందరినీ కలుపుకుపోతూ, కార్యోన్ముఖుల్ని చేస్తూ, అత్యంత వేగంగా, సమర్థవంతంగా, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ .. పనుల్ని పూర్తికావించారు హరీష్ రావు.

మిషన్ కాకతీయ ఫలితాల్ని ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నాం.

హృదయం ఉప్పొంగే ఆ ఫీలింగ్‌ను మనసారా అనుభవిస్తున్నాం.

మంత్రి హరీష్ రావు గారి గురించి, వారి సామర్థ్యం గురించి మరోసారి మరో బ్లాగులో వివరంగా రాస్తాను.


కట్ టూ మిట్టా సైదిరెడ్డి -   

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ సోషల్ మీడియా పాత్ర అద్భుతం. రాష్ట్ర అవతరణ తర్వాత కూడా ఆ అద్భుతం సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతోంది.

రెట్టించిన ఉత్సాహంతో.

ఎక్కడో ఒకటీ అరా పొరపొచ్చాలుంటాయి. అది సహజం. అలా లేకపోతేనే కష్టం, నష్టం కూడా. ఒక విధంగా స్వేఛ్చ లేదని అర్థం.

కానీ, మనకా సమస్య లేదు.

సంపూర్ణ స్వేఛ్చ ఉంది.

ధరణి కులకర్ణి, సుశీలా రెడ్డి, మహాలక్ష్మి, శ్రీదేవి, రవి కాంత్, రాథోడ్, అసాంజే, సాదిక్, తుమ్మల, భండారీ, సంపత్ పరీక్, కరుణాకర్ దేశాయ్ అన్న, కట్పల్లి, వినయ్, నవీన్, ఏ ఎస్ ఆర్, బాచి, అంబటి, ధాము, భరత్, నవీద్, ఫయాజ్, కొత్తపల్లి, ఓరుగంటి, రవి, చేగో, గాంధీ  .. ఇలా నాకు తెలిసినవే కనీసం ఒక 100 పేర్లు చెప్పగలను. తెలియనివి లెక్క లేదు.  (అందరి పేర్లూ రాయడం కష్టం. సో, ఇక్కడ పేర్లు మెన్షన్ చేయని సోషల్ మీడియా మిత్రులు నన్ను మన్నించాలి.)  

కేవలం తెలంగాణ కోసం, టి ఆర్ ఎస్ కోసం, కె సి ఆర్ కోసం పనిచేసిన ఈ సోషల్ మీడియా మిత్రులందరిదీ నిజంగా నిస్వార్థ సేవ.

అలాంటి సోషల్ మీడియా మిత్రుల్లో ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడి రాతలు గెరిల్లా దాడుల్లా, రెనగేడ్ ఎటాక్‌ల్లా ఉండేవి. రాష్ట్ర అవతరణ తర్వాత ఈ రకమైన సోషల్ మీడియా ఎటాక్ ఒక తప్పనిసరి అయింది.

ఏ వార్నింగ్‌లకూ బెదరకుండా, ఈ ఖాళీని పూర్తిచేసిన ఆ సోషల్ మీడియా యోధుడే నా మిత్రుడు మిట్టా సైదిరెడ్డి. ప్రస్తుతం మన ప్రియతమ సి ఎం, కె సి ఆర్ గారి పి ఆర్ ఓ.

ఇప్పుడీ బ్లాగ్ నేను రాయడానికి ఇన్స్‌పిరేషన్ .. ఇవాళ్టి ఆయన పోస్టు: "చెరువుతో సెల్ఫీ".

తెల్లారి లేస్తే ఎక్కడ చూసినా సెల్ఫీలే. పనికొచ్చేవి. పనికిరానివి. ప్రమాదకరమైనవి. ఎన్నో ..

ఇన్ని సెల్ఫీలు తీసుకొనే మనం .. మనకు దగ్గర్లోని, లేదా మన ఊరిలో ఈ వర్షాలకు నిండిన మన చెరువుతో ఒక సెల్ఫీ తీసుకొని ఎందుకు పోస్ట్ చేయకూడదు?

మనం రోజూ పోస్ట్ చేసే ఏ సెల్ఫీతో పోల్చుకున్నా .. ఈ సెల్ఫీకుండే విలువ, ప్రయోజనం, స్పూర్తి, సంతోషం, సంతృప్తి వేరు.  

చిన్న ఐడియా. మంచి ఐడియా.

అతి తక్కువకాలంలోనే మన తెలంగాణ  రాష్ట్రం సాధించిన విజయాల్లో ఒక ప్రముఖమైన విజయాన్ని ప్రపంచానికి తెలిపే ఐడియా.

ఈ అద్భుతమైన ఆలోచన మదిలో మెదలడంతోనే పోస్ట్ చేసిన మన మిట్టా సైదిరెడ్డి అన్నకు నా హార్దిక అభినందనలు.

ఇలా పోస్ట్ చేయడం ఆలస్యం .. చెరువుతో సెల్ఫీలను చకచకా పోస్ట్ చేస్తున్న మన తెలంగాణ సోషల్ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు ..


కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఈ సెల్ఫీల్లో .. నేను, నా కొత్త సినిమా టీమ్ మెచ్చిన  "చెరువుతో ది బెస్ట్ 3 సెల్ఫీ" లకు, నా సినిమా ఆడియో ఫంక్షన్‌లో, వేదిక మీద ఆహూతులైన మన గౌరవ అతిథుల చేతులమీదుగా .. మా టీమ్ తరపున నగదు బహుమతి, మొమెంటోలను అందజేస్తాము.

ఇంక ఆలస్యం దేనికి?

మన ఊళ్లోని మన చెరువుతో సెల్ఫీ దిగండి. పోస్ట్ చేయండి.

బెస్ట్ విషెస్ ..

Thursday 22 September 2016

"సెల్యులాయిడ్ సైంటిస్ట్" సింగీతం!

పుష్పక విమానం, విచిత్ర సోదరులు, సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, మైఖేల్ మదన కామ రాజు, భైరవద్వీపం, ఆదిత్య 369, మేడమ్, మయూరి  ..

ఇవి మచ్చుకే.

ఇంకెన్నో సినిమాలు ..

కొన్నయితే అసలు మనం ఊహించని సబ్జక్టులు!

ఎన్నో అవార్డులు, రివార్డులు.

ఒక్క డైరెక్షనే కాదు. రచయిత, సంగీతజ్ఞుడు, నిర్మాత .. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఇవన్నీ ఒక ఎత్తయితే, ఫిలిం మేకింగ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతి కొత్త ఆవిష్కరణతో ఆయనకు పరిచయం ఉంటుంది. అంతటి నిరంతర అధ్యనశీలి ఆయన.

అయినా, నిగర్వి. నిరాడంబరుడు.

వారే సింగీతం శ్రీనివాసరావు గారు.

ఒక పదేళ్లక్రితం అనుకుంటాను.

చెన్నైలోని సింగీతం గారి ఇంట్లో వారి ఇంటర్వ్యూ తీసుకున్నాన్నేను. దాదాపు ఒక రెండున్నర గంటల ఇంటర్వ్యూ అది. దానికోసం రోజంతా ఎంతో ఓపిగ్గా నాతో కూర్చున్నారు. 

నేను రాయాలనుకుంటున్న ఒక పుస్తకం కోసం నాకవసరమైన సమాచారాన్ని సేకరిస్తూ, అందులో భాగంగా, సింగీతం గారిని కూడా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. 

సోనీ వాక్‌మాన్‌లో నేను రికార్డ్ చేసిన ఆ క్యాసెట్స్ ఇప్పటికీ నాదగ్గర భద్రంగా ఉన్నాయి.


కట్ టూ రామానాయుడు గెస్ట్ హౌజ్ -   

ఒకరోజు పొద్దున్నే సింగీతం గారి నుంచి నాకు కాల్ వచ్చింది. తను హైద్రాబాద్ వచ్చిందీ, వచ్చి ఎక్కడున్నదీ చెప్పారు. వీలు చూసుకొని రమ్మన్నారు.

నేను వెంటనే బయల్దేరి వెళ్లాను.

ఫిల్మ్ నగర్‌లో అది రామానాయుడు గెస్ట్ హౌజ్.

నేను వెళ్లేటప్పటికి చాలా సింపుల్‌గా తన బ్యాగ్‌లోంచి బట్టల్ని తీసి ఇస్త్రీకోసం అనుకుంటాను .. ఒక కుర్రాడికిస్తున్నారు. ఆ కుర్రాడికి సింగీతం గారు ఎవరో ఏం తెలుసు? చాలా కేర్‌లెస్‌గా ఆ బట్టల్ని అక్కన్నుంచి తీసుకెళ్లాడు.

ఇంతలో గదిలోకి ఇంకో బాయ్ వచ్చాడు ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌తో. ఆ కుర్రాడికి కూడా తెలీదనుకుంటాను, సింగీతం గారు ఎవరో. చాలా నిర్లక్ష్యంగా ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న నన్ను చూసి చిరునవ్వు నవ్వారాయన.

ఆయన ఇవన్నీ పట్టించుకోరు.

తన పని గురించి మాత్రమే ఆయన ఆలోచనంతా.

ఒక తపస్సులా.


కట్ టూ పుష్పక్ స్టోరీ బోర్డు - 

చెన్నైలో సింగీతం గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారి  "పుష్పకవిమానం" సినిమా స్టోరీబోర్డులోంచి ఒక సీన్ అడిగితీసుకున్నాన్నేను. నా పుస్తకంలో దాన్ని అలాగే స్కాన్ చేసి ప్రింట్ చేయడానికి.

సింగీతం గారు వారి సినిమాలకు వారే స్వయంగా స్టోరీబోర్డు వేసుకుంటారు. దర్శకులు బాపు గారిలాగే.

(బాపు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారి దగ్గర కూడా "పెళ్లిపుస్తకం" సినిమాలోని ఒక పూర్తి సీన్ స్టోరీబోర్డు అడిగితీసుకున్నాను. అది వేరే విషయం. ఆ జ్ఞాపకం గురించి మరోసారి రాస్తాను.)

సింగీతం గారు ఆరోజు నాకిచ్చిన స్టోరీబోర్డు, తన షూటింగ్ టైమ్‌లో తనకోసం స్పీడ్‌గా వేసుకున్నది కాబట్టి అంత క్లారిటీ లేదని వారి ఉద్దేశ్యం. నా పుస్తకం కోసం దాన్ని స్కాన్ చేసి, ప్రింట్‌చేసినప్పుడు టెక్నికల్‌గా అదంత బాగా రాకపోవచ్చునని వారికి తెలుసు.

అంతకు రెండువారాల క్రితం, "పుష్పకవిమానం" సినిమాలోని నాకిచ్చిన అదే సీన్ స్టోరీబోర్డును వారు మళ్లీ ఫ్రెష్‌గా వేసి తీసుకొచ్చారు. అది నాకివ్వడం కోసం ఆరోజు నాకు ఫోన్ చేసి పిలిచారు!

దటీజ్ సింగీతం గారు.

అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు, పుష్పకవిమానం లాంటి అద్భుతాలు క్రియేట్ అయ్యాయంటే ఎందుక్కావు మరి?

85 ఏళ్ల వయస్సులోనూ పాతికేళ్ల కుర్రాడాయన. ఆలోచనలోనూ, ఆవిష్కరణలోనూ నిత్య యవ్వనుడాయన.

ఇవాళ సింగీతం గారి పుట్టినరోజు.

వారికివే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ..

ఈ సందర్భంగా, వారినుంచి మరెన్నో క్లాసిక్ సినిమాలు రావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే .. వారి క్రియేటివిటీ విషయంలో నాబోటివాళ్లకింకా దాహం తీరలేదు. 

Wednesday 14 September 2016

ఒక్క ట్వీట్ .. సీరీస్ ఆఫ్ సినిమాలు!

అంత ఈజీ కాదు.

ఎంత మైక్రో బడ్జెట్ సినిమా అయినా సరే, ఎంత కోపరేటివ్ సినిమా అయినా సరే .. బడ్జెట్ అంటూ దానికి ఒకటుంటుంది. కోట్లు కాకపోయినా, ఒక సినిమా పూర్తిచేయడానికి కొన్ని లక్షలయినా అవుతుంది.

అందులోనూ సీరీస్ ఆఫ్ సినిమాలంటున్నాం.

నిజంగా అంత ఈజీ కాదు. అయినా కమిట్ అవుతున్నాం.

ఇవి పిట్టలదొరల మాటలు కావు. మితిమీరిన ఆత్మ విశ్వాసం అంతకన్నా కాదు.

మామీద మాకున్న నమ్మకం.

మాతో కలిసిన, కలుస్తున్న, కలవబోతున్న మా లైక్‌మైండెడ్ టీమ్ మీద మాకున్న నమ్మకం. సినిమా ప్రియులయిన మీ అందరి శుభాశీస్సులు కూడా మాకుంటాయన్న నమ్మకం.


కట్ టూ హిందీ -

ఈ సీరీస్‌లో మా మొదటి సినిమా ఎనౌన్స్ చేసిన రోజునుంచి, తర్వాతి 365 రోజుల్లో ఒక నాలుగు సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయాలన్నది మా ప్రాధమిక లక్ష్యం.

వీటిలో కనీసం ఒకటి హిందీ ఉంటుంది.

మేం ప్లాన్ చేస్తున్న హిందీ సినిమా కూడా పక్కా ట్రెండీ కమర్షియల్ సినిమానే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రిప్రొడక్షన్ పనులు ప్రారంభమై కూడా చాలా రోజులైంది.

తెలుగు సినిమాలకు ఎలాగూ కష్టపడుతున్నాము. అంతే కష్టంతో హిందీలో  కూడా సినిమాలు చెయ్యొచ్చునని మా ఉద్దేశ్యం. అసలు హిందీ సినిమాపైన నా ప్యాషన్ గురించి మరోసారి వివరంగా రాస్తాను. ఇప్పటికి దాన్నలా వదిలేద్దాం.

మా హిందీ సినిమాల ప్రమోషన్, మార్కెటింగ్, రిలీజ్ వగైరాలు చూసుకోడానికి ముంబైలో మా నెట్‌వర్క్ మాకుంది. అది వేరే విషయం.


కట్ టూ ఎనౌన్స్‌మెంట్ - 

ఈమాత్రం దానికి  .. ఏదో భారీ కర్టెన్‌రెయిజర్‌లా ఇంత సీన్ అవసరమా .. అని చాలా మందికి అనిపిస్తుందని మాకు తెలుసు. కానీ, మాకిదంతా అవసరం.

మాకు సంబంధించినంతవరకు ఈ మొత్తం ప్రాజెక్టు, ఈ ప్రయత్నం, ఈ సందర్భం, దీని ఎనౌన్స్‌మెంట్ ఒక కిక్ .. ఒక లాండ్‌మార్క్!

మేం ప్రారంభిస్తున్న ఈ సీరిస్ ఆఫ్ సినిమాలు మా దృష్టిలో ఒక భారీ ప్రాజెక్టు. ఒక మహాయజ్ఞం. ఎన్ని ఇబ్బందులెదురైనా సరే సంతోషంగా ఎదుర్కొంటాం.

ప్యాషన్‌లో పెయిన్ ఉండదు. అంతా ప్లెజరే.

ఇప్పడున్న మా స్థాయికి ఒక మహాయజ్ఞం లాంటి ఈ మొత్తం ప్రాజెక్టులో నాతో కలిసి ప్రయాణం చేస్తున్న నా సహచరుడు మరెవరో కాదు. నా చీఫ్ టెక్నీషియన్స్‌లో ఒకరు, స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను పరిచయం చేసిన నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర!

మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యతతోపాటు, ప్రదీప్ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

ఈ నెల్లోనే, మరి కొద్దిరోజుల్లోనే, ఎవరూ ఊహించనివిధంగా, కొంచెం వెరైటీగా దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఉంటుంది. ఆ ఎనౌన్స్‌మెంట్ ప్రదీప్ ఇస్తాడు.

సో, ఓవర్ టూ మై ట్వీట్ .. మరొక్కసారి:

"365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన."

అండ్ నౌ .. ఓవర్ టూ మై డియర్ ప్రదీప్ .. 

Tuesday 13 September 2016

అసలేంటా ప్రొడక్షన్ కంపెనీ? ఎందుకు?

> మేం అనుకున్నట్టు .. ఎలాంటి బయటి వత్తిళ్ళు లేకుండా, ఎలాంటి మూసధోరణులకు బలవంతంగా లొంగకుండా, ఇండిపెండెంట్‌గా సినిమాలు చేసుకోడానికి.

> మేం అనుకున్నట్టు ప్లాన్ చేసిన టైమ్‌లోనే సినిమా పూర్తిచేయడానికి.

> మేం అనుకున్నట్టు కోపరేటివ్ సిస్టమ్‌లో సినిమాలు చేసుకోడానికి.

> మేం అనుకున్నట్టు గెరిల్లా/రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్ పధ్ధతుల్లో సినిమాలు చేసుకోడానికి.

> ఇండస్ట్రీలో ఎన్నాళ్లుగానో బూజుపట్టి పాతుకుపోయి ఉన్న పనికిరాని ఎన్నో బుల్‌షిట్ రూల్స్‌ను పట్టించుకోకుండా, మా సొంతరూల్స్‌తో మా సినిమాలు మేము చేసుకోడానికి.

> ఫిల్మ్ నెగెటివ్ వాడిన రోజుల్లోనే సంవత్సరానికి డజన్ సినిమాలు చేసి నిరూపించుకొన్న "దర్శకరత్న"లున్న ఇండస్ట్రీలో, ఇప్పుడీ డిజిటల్ యుగంలో కూడా సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా కూడా ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పడానికి.

> 365 రోజుల్లో కనీసం ఒక 4 సినిమాలైనా చేసి, రిలీజ్ చేసి, చూపించడానికి. తద్వారా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఎక్కువ పని కల్పించడానికి.

> ఎంత మైక్రో బడ్జెట్ అయినా, సినిమాలు తీయడానికి డబ్బు చాలా అవసరం. డబ్బుతోపాటు లైక్‌మైండెడ్‌నెస్ ఉన్న ఒక మంచి టీమ్ కూడా అవసరమని నిరూపించడానికి.

> మొత్తంగా .. మా క్రియేటివ్ లిబర్టీ కోసం మాకంటూ ఒక ప్రొడక్షన్ కంపెనీ అవసరం అనుకున్నాం. ఆ పని చేసేశాం.


కట్ టూ మా ప్రొడక్షన్ బ్యానర్ - 

ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. కాకపోతే, ఈ బ్యానర్ కేవలం సెకండరీ.

ఇంకో ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా అతి త్వరలో చేయించబోతున్నాము. ఈ నెల్లోనే ప్రకటించబోతున్న మా కొత్త సినిమా రూపొందుతున్న సమయంలో ఈ పని పూర్తిచేస్తాము.

అదే మా మెయిన్ బ్యానర్.

సో, అదీ మ్యాటర్:

"365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన."

ఎవరా ఇద్దరు టెక్నీషియన్‌లు?

కొన్ని చాలా విచిత్రంగా జరుగుతుంటాయి.

"ఈసారి అలా జరగదులే" అనుకుంటాం. కాని, ఊహించని విధంగా అది అలాగే మళ్ళీ జరిగితీరుతుంది!

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఇదెప్పుడూ ఉండేదే.

సినిమా అనుకున్నప్పటినుంచి, షూటింగ్ పూర్తయ్యి, కాపీ వచ్చేవరకు .. ప్రొడ్యూసర్ డైరెక్టర్ నుంచి, అఫీస్ బాయ్ వరకు అంతా చాలా కష్టపడతారు.

"ఇది మన ప్రాజెక్టు .. ఏదో సాధించబోతున్నాం" అన్న పాజిటివ్ ట్రాన్స్‌లో పనిచేసుకుంటూ పోతుంటారు.

కాపీ వచ్చేసిందా .. ఖతమ్.

ఎంటర్ ది డ్రాగన్!

ఉన్నట్టుండి ఎంటరవుతాయి కొన్ని కొత్త ముఖాలు, కొత్త క్యారెక్టర్‌లు.

అలా చివర్లో, రిలీజ్‌కు ముందు ఎంటరైన ఆ ఒకరిద్దరివల్ల, వారి క్రెడెన్షియల్స్ ఏంటో తెల్సుకోకుండా, వారి ఉచిత సలహాలను వినడంవల్ల .. మొత్తం సీనే మారిపోతుంది.    

జరక్కూడని నష్టానికి అప్పుడే, అక్కడే పునాదులు పడిపోతాయి. ప్లానింగ్‌లో ఊహించని మార్పులొచ్చేస్తాయి.

అంతా నిస్తబ్దత. నిరాసక్తత.

ఏం జరగబోతోందో టీమ్ మొత్తానికి ముందే తెలిసిపోతుంది.


కట్ టూ  ఆ ఇద్దరు టెక్నీషియన్‌లు -  

నెలలకొద్దీ ఒక ప్రాజెక్టును ప్రాణంగా తీసుకొని పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లంతా ఒక్కసారిగా హతాశులైపోతారు.

ప్రాజెక్ట్ సక్సెస్ అయితే  ప్రొడ్యూసర్ ఒక్కడికే కాదు .. అందరికీ బాగుంటుందని, డైరెక్టర్‌తో సహా మరొకరిద్దరు చీఫ్ టెక్నీషియన్‌లు కూడా తమ జేబుల్లోంచి ఖర్చుపెట్టుకొంటూ, అప్పులు చేసుకొంటూ పనిచేస్తుంటారు

ఇంతచేసినా ఫలితం మళ్లీ అదే.

చివరికి చేతులెత్తేసే పరిస్థితి రావడం.  

ఎంత పనికిరాని ప్రాజెక్టునయినా నిలబెట్టి హిట్ చేసే సత్తా ప్రమోషన్‌కుంటుంది. చెప్పాలంటే, కేవలం మంచి ప్రమోషన్ వల్లనే హిట్టయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి.

కానీ అదే మాకు లేదు.

"ఇంక చాలు" అనుకున్నాన్నేను. "అవును. ఇంక చాలు సర్" అన్నాడు నా టీమ్‌లోని ఇంకో చీఫ్ టెక్నీషియన్.


కట్ చేస్తే -

ప్రమోషన్, రిలీజ్, మార్కెటింగ్ లకు విధిగా బడ్జెట్‌లో తగినంత ఉండాలనుకొన్నాం. ఉండితీరాలనుకొన్నాం.

మేమనుకున్న సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేసి, అనుకున్న రేంజ్‌లో ప్రమోట్ చేసి మరీ రిలీజ్ చెయ్యాలనుకొన్నాం.

రిజల్ట్ హిట్టా, ఫట్టా అన్నది కానేకాదు విషయం.

సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా మైక్రోబడ్జెట్‌లో చేసిన సినిమాలకు ఎలాంటి నష్టం ఉండదు.

కాకపోతే, అనుకున్న రేంజ్‌లో ఫిలిమ్‌ను ప్రమోట్ చేసుకొని, ఒక స్ట్రాటజీ ప్రకారం బిజినెస్ చేసుకొని రిలీజ్ చేయడం అన్నది చాలా చాలా అవసరం.     

అలా చేసినప్పుడే ఎవరికయినా ఒక బ్రాండ్ అంటూ క్రియేట్ అవుతుంది. సినిమా హిట్ అయితే, అదే బ్రాండ్ ఎస్టాబ్లిష్ కూడా అవుతుంది.

ఒక ఆర్టిస్టుకయినా, టెక్నీషియన్‌కయినా కావల్సింది అదే.

నేనూ, నా చీఫ్ టెక్నీషియన్ ఒకరు "ఓకే" అనుకున్నాం. కష్టపడాలనుకొన్నాం. గత కొద్ది నెలలుగా కష్టపడుతూనే ఉన్నాం.

ఆ ఇద్దరు టెక్నీషియన్స్‌లో ఒకరు నేనే అనేది సుస్పష్టం.

ఇంకొకరెవరు అన్నది మాత్రం ఇప్పుడంత ముఖ్యం కాదు. రెండ్రోజుల్లో మీకే తెలుస్తుంది. ఇప్పటికే మీలో చాలామంది గెస్ చేసుంటారు కూడా.

ఏమయితేనేం .. మా ఇద్దరి ఆ కష్ట ఫలితమే ఇది:

"365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన."