Saturday 12 November 2016

బ్లాక్ మనీవాళ్లా, సామాన్యప్రజలా .. ఎవరు టార్గెట్?

> ఇవాళ ఉదయం 10.30 నుంచి, మధ్యాహ్నం 2.30 వరకు నా చీఫ్ టెక్నీషియన్ ఒకరు 2 ATM లు మారి, 4 గంటల్లో 2 వేలు డ్రా చేసుకోగలిగాడు!

> కొంపల్లిలో కూరగాయలమ్మే ఒక వృధ్ధురాలు తనదగ్గరున్న ఎనిమిది 500 నోట్లను మార్చుకోడానికి పని మానుకొని, ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో 3 గంటలు నిల్చోవాల్సివచ్చింది. తర్వాత ఆమె ఆధార్ కార్డును కూలంకషంగా పరిశీలించి, ఆమెకు 4 వేలిచ్చారు బ్యాంకువాళ్లు.  

> కొత్త 2000 కాగితంతో పక్కనే ఉన్న కిరాణాషాపుకు వెళ్లిన మా వాచ్‌మన్ నిత్యావసర వస్తువులు ఏవీ కొనుక్కోకుండా వెనక్కి రావాల్సి వచ్చింది. కారణం .. అక్కడ 2000 లకు చిల్లర లేదు!

> సంవత్సరంలో 365 రోజులూ కస్టమర్లు ఎప్పుడూ వెయిటింగ్‌లో ఉండే "మినర్వా" లాంటి హోటల్‌లో నిన్న సాయంత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురున్నారు!

> చికెన్ షాపులు, పాన్ షాపులు, ఇరానీ హోటళ్లు, చిన్న స్థాయి నుంచి బడా షాపింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు .. అన్నీ గత నాలుగురోజులుగా దాదాపు నిర్మానుష్యమైపోయాయి. ప్రతిచోటా గిరాకీ లేక ఎవ్వరూ ఊహించని ఒకరకమైన స్మశాన వైరాగ్యం!

ఇలాంటి లైవ్ ఉదాహరణలు కనీసం ఇంకో 2 డజన్లు ఇవ్వగలను ..

ఎందుకు ..  అసలెందుకిలా జరిగింది?


కట్ టూ మన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక యంత్రాంగం -

బ్లాక్‌మనీ వెలికి తీయాల్సిందే, ఆర్థిక నేరస్థులను శిక్షించాల్సిందే. నాలుగు రోజులక్రితం ప్రధాని మోదీజీ తీసుకొన్న నిర్ణయం హర్షించదగిందే.

కానీ, ఇంత పెద్ద స్టెప్ తీసుకొంటున్నప్పుడు ఎంతదూరం ఆలోచించాలి? ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఉండాలి?

నాదగ్గరున్న సమాచారం ప్రకారం గతంలో RBI మొత్తం 17.5 లక్షల కోట్ల కరెన్సీ ముద్రించింది. దీన్లో 86% కేవలం 500, 1000 నోట్లు.

అంటే, మనదేశం మొత్తం కరెన్సీలో కేవలం 14% మాత్రమే 100, 50, 20, 10 నోట్లన్నమాట!

ఈ కరెన్సీ రేషియో నేపథ్యంలో - మోదీజీ ప్రకటించిన రోజు అర్థరాత్రినుంచే 500, 1000 నోట్లు చెల్లవు అన్నప్పుడు .. తెల్లారినప్పట్నుంచి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం.

ప్రధాని తీసుకొనే ఒక పెద్ద నిర్ణయం వెనుక ఎంత కసరత్తు ఉంటుంది? .. ఉండాలి?

ప్రధాని నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాల్సిన మన దేశ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఫైనాన్స్ సెక్రెటరీ శక్తికాంత్ దాస్, ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ .. ఈ ఆర్థిక దిగ్గజాల సమగ్ర దేశవ్యాప్త యంత్రాంగం అసలేం చేసినట్టు? .. చేస్తున్నట్టు? 


కట్ టూ ది రియాలిటీ టుడే - 

నల్లధన కుబేరులైన బడా బడా ఇండస్ట్రియలిస్టులు, క్రికెట్ స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, రియాల్టర్స్ ఎట్సెట్రా ఎవరైనా పనులు మానుకొని, లైన్లల్లో నిల్చుని, ఏ చిన్న ఇబ్బందయినా పడుతున్న విజువల్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా?

కానీ, మరోవైపు .. కష్టపడి అంతో ఇంతో సంపాదించుకొని కూడబెట్టుకొనే వ్యవసాయదారులు, గ్రామీణ మహిళలు, మధ్యతరగతివాళ్లు, ఔత్సాహిక చిన్న పారిశ్రామికవేత్తలు, డైలీ వేజర్స్ ..
ఏ బ్యాంక్ దగ్గర చూసినా, ఏ ATM ల దగ్గర చూసినా వందల సంఖ్యలో పనులుమానుకొని వీళ్లే కనిపిస్తున్నారు.

ప్రతి చిన్నా పెద్దా వ్యాపారం దాదాపు పూర్తిగా స్థంభించిపోయింది.

ఈ పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లోనూ ఇంతే.

ఫలితం .. వృధ్ధిరేటులో మరింత పతనావస్థ!

నిజంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే - అసలు ఇన్‌కమ్ టాక్స్ పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యవసాయదారులు, మహిళలు, నిరంతరం ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యే వివిధ రంగాల ప్రొఫెషనల్స్, ఔత్సాహిక చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, ఇతర సామాన్య ప్రజలే బాధపడుతున్నారు.

అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని జీవితంలో మొట్టమొదటిసారిగా .. భయపడుతున్నారు.

తెలిసో తెలియకో 2.5 లక్షలకు మించి ఏ కొంచెం డిపాజిట్ లేదా, ట్రాన్సాక్షన్ చేసిన చాలామంది వ్యవసాయదారులు, మహిళలు, సామాన్య ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఎక్కడ ప్రాసిక్యూట్ చేసి, శిక్షించబడతామేమోనని!

ఇదంతా ఒకెత్తయితే - చేతిలోనో, బ్యాంకులోనో ఉన్న ఆ కొంచెం డబ్బుని కూడా తీసి ఖర్చుపెట్టడానికి ఎవ్వరూ ధైర్యం చేయడంలేదు. రేపేం జరగబోతోందో అన్న భయంతో!

సో, బయట మనీ రొటేషన్ పూర్తిగా స్థంభించిపోయింది.

ఒకే ఒక్క దెబ్బతో మనదేశ ఆర్థిక వ్యవస్థ విశ్వరూపం, సామర్థ్యం, బలం, బలహీనతలు బట్టబయలయిపోయాయి. అది కూడా సామాన్య ప్రజానీకానికి కూడా కూలంకషంగా అర్థమయ్యే స్థాయిలో!

ఒక సదుద్దేశ్యంతో మోదీజీ చేపట్టిన ఈ చర్య ఎందుకని ఇంత ఆర్థిక విధ్వంసానికి కారణమైంది? మన దేశ ఆర్థిక యంత్రాంగం ఏం చేస్తున్నట్టు?

ఈ మొత్తం పిక్చర్ చూస్తున్న ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలు ఏం చేస్తున్నారు? ఎందుకని మౌనంగా ఉన్నారు?

ఎందుకీ మౌనం?

అసలెవరికీ శిక్ష?!  

2 comments:

 1. మీరు మరీ ఓవర్. ప్రభుత్వం వాళ్ళు ఎన్నో ఆప్షన్స్ చూసే ఇటువంటి వాటికి దిగుతారు. వాళ్ల కన్నా మీకేదో ఎక్కువ తెలిసినట్లు రాస్తున్నారు. 120కోట్ల దేశం లో ఎన్నో ఊహించ లేని విషయాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఆర్థిక విధ్వంసం ఎమిటి? నాలుగు గంటలు క్యు లో నిల్చున్నందుకు ఓ అని వాపోతున్నారు. ఇదే చిరంజీవి,రజనీకాంత్ సినేమాకు బారులు తిరిన క్యూ లో ఉంటే అదేదో చాలా గొప్ప అచివ్ మెంట్ అయినట్లు రాస్తారు. ఆ క్యు లో ఎవరైనా చస్తే దానిని హీరో సినేమా చూడటానికి అభిమానులు చేసిన త్యాగంలా, ఆ హీరొ కి ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నట్లు ఊదరగొడతారు.

  ప్రభుత్వ నిర్ణయం పై మీ ఓవర్ యాక్షన్ ఆపి పని చూసుకోండి.

  ReplyDelete
  Replies
  1. 1. నా పని నేను చూసుకోడానికివీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టే ఇది రాశాను.

   2. సినీ హీరోల ఫ్యాన్స్ విషయం నా ఉద్దేశ్యంలో ఒక పెద్ద నాన్సెన్స్. ఈ ఫ్యాన్స్ విషయంలో నేనెప్పుడూ మీరనుకున్నట్టు రాయలేదు. రాయను.

   3. నేనూ మోదీ అభిమానినే కానీ, నా అభిప్రాయం చెప్పడానికి నేను మీలా భయపడను. ఒక "అన్‌నోన్" గా కామెంట్ పెడుతూ!

   థాంక్స్ ఫర్ ది కామెంట్ .. :)

   Delete