Thursday 26 January 2017

ఒక ఇంగ్లిష్ సినిమా

ఎప్పట్నుంచో .. చాలా రోజులుగా అనుకుంటున్న ఒక ఆలోచనను 2017 లో ఆచరణలో పెట్టబోతున్నాను.

ఒక ఇంగ్లిష్ సినిమా.

హైదరాబాద్ బ్లూస్, డాలర్ డ్రీమ్‌స్ లాంటి పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్. అది కూడా సంపూర్ణంగా మన "టింగ్లిష్" యాక్సెంట్‌లో! :)

వచ్చే ఒకటి రెండు నెలల్లో మొత్తానికి నా కొత్త సినిమా ఒకటి ప్రారంభం కాబోతోంది.

అది తెలుగు సినిమానా, ఇందాక చెప్పిన ఇంగ్లిష్ సినిమానా .. ఏది ముందు ప్రారంభిస్తానో కూడా ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం.

కాకపోతే, ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల కోసం ప్రి-ప్రొడక్షన్ వర్క్ మాత్రం యమ సీరియస్‌గా జరుగుతోంది.

ఈ మధ్య ఒక మీటింగ్‌లో ఉన్నట్టుండి నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కూడా తన ఆలోచనను చెప్పాడు: "మనమొక ఇంగ్లిష్ సినిమా తీద్దాం సార్!" అని.

ఎప్పటినుంచో నాలో ఉన్న ఈ ఆలోచనను ఇంక ఆలస్యం చేయకుండా పూర్తిచేయాలన్న నిర్ణయానికొచ్చేశాను.

ప్రదీప్‌కు మాటిచ్చేశాను.

డాలర్ డ్రీమ్‌స్, హైద్రాబాద్ బ్లూస్ లాగా కాకుండా .. ఒక బ్లాక్ కామెడీ తరహాలో, పూర్తి నేటివిటీతో ఈ సినిమా తీయాలన్నది నా సంకల్పం.

అదే చేస్తాను ...  

Sunday 22 January 2017

ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు!

"ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.
ఏవో కొన్ని జ్ఞాపకాలను వదిలి..
ఎలాగు పోయేవాళ్ళమే..
కాస్త.... వెనుక ముందూ..
ఈ లోగానే
విద్వేషాలు..విషం చిమ్ముకోవడాలు అవసరమా?"

కె ఎన్ మూర్తి గారి ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద ఇది చూశాక మరోసారి ఫిక్స్ అయిపోయాను.

మరోసారి అని ఎందుకంటున్నానంటే, మొన్నీమధ్యే నాకు నేనుగా ఫిక్స్ అయిపోయాను. నా కుటుంబంలో ఒక అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోయాక.

ఇంతకీ ఏంటా ఫిక్స్ అయింది?
 
ఉన్న ఒక్క జీవితానికి ఇంక చాలు ఈ టెన్షన్లు. ఇంక ఒక్క రోజు, ఒక్క గంట కూడా వేస్ట్ కావడానికి వీల్లేదు. కానివ్వను.

ఎంత కష్టమైనా పడతాను. ఎన్ని ఇష్టంలేని పనులైనా చేస్తాను.

వెంటనే బయటపడటం కోసమే.

నాక్కావల్సిన ఫ్రీడం కోసమే.    

ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా .. నాకున్న కొన్ని కమిట్‌మెంట్లు, బాధ్యతలు పూర్తిచేసుకొని .. ఉండే ఈ నాలుగు రోజులూ హాయిగా బ్రతకాలి.

అది కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా. ఎవ్వరిమీదా ఆధారపడకుండా. అన్నిటికంటే ముఖ్యంగా .. నా పనిలో ఇంకొకరి నిర్ణయాలతో సంబంధం లేకుండా.

నాకత్యంత ఇష్టమైన రైటింగ్‌తోనే రొమాన్స్ చేసుకుంటూ. నాకిష్టమైన సముద్రతీరాల అలల అందాలను ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ. 

Wednesday 18 January 2017

ఫేస్‌బుక్ తమాషా బంద్!

నా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కు, పేజ్‌కీ ట్విట్టర్‌ను లింక్ చేశాను.

ఇకనుంచీ నేను చేసే ప్రతి ట్వీట్ నా ఫేస్‌బుక్ పేజ్‌లోనూ, ప్రొఫైల్లోనూ ఆటోమాటిగ్గా కనిపిస్తుంది.

బస్ .. రోజుకి ఓ నాలుగు ట్వీట్లు. కుదిరితే ఇంకో మూడు. నా మూడ్‌ని బట్టి!

నడుస్తూ, కూర్చొని, పడుకొని .. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా ట్వీట్ చేయొచ్చు. జస్ట్ కొన్ని సెకన్లలో!

వీటికోసం ప్రత్యేకంగా టైమ్ ఏమాత్రం వేస్ట్ కాదు. వరుసగా ఒక డజన్ ట్వీట్లు పెట్టినా మొత్తం మీద ఒక 10 నిమిషాలు పట్టదు.

తప్పనిసరిగా అవసరమైతేనే ఫేస్‌బుక్‌లో కామెంట్లు. అప్పుడప్పుడూ ఒక బ్లాగ్. అంతే.

ట్విట్టర్‌ ఒక ఎలైట్ సోషల్ మీడియా టూల్. దీన్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఎడిక్ట్ కావాలి.

సో, నో మోర్ వేస్ట్ ఆఫ్ టైమ్.

అబ్ బహుత్ పని మాంగ్‌తా హై ...  పైసా మాంగ్‌తా హై ... 

Tuesday 17 January 2017

స్నేహితుడా!

ఫేస్‌బుక్ పుణ్యమా అని ఫ్రెండ్ అనే గొప్ప పదం ఒక రొటీన్ మాట అయిపోయింది.

ఫేస్‌బుక్‌లో నాకు 5 వేలమంది ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరన్నా అన్నారంటే .. ఆ 5 వేలమంది సోకాల్డ్ ఫ్రెండ్స్ జస్ట్ FB ఫ్రెండ్స్ మాత్రమే!

అంతకు మించి ఏం లేదు.


కట్ టూ స్నేహితుడు - 

ప్రతి మనిషికీ కొందరు నిజమైన ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లు కేవలం వేళ్లమీద లెక్కించగలిగేంతమంది మాత్రమే ఉంటారు.

వీళ్లతో మాత్రమే మనం మన కష్టసుఖాలూ, ఇతర ఆంతరంగిక విషయాలూ ఎలాంటి ముసుగులు లేకుండా చెప్పుకోగలుగుతాం.

ఈ స్నేహితులు మాత్రమే మన గురించి కొన్ని నిమిషాలయినా ఆలోచిస్తారు. మనం ఆ క్షణం బాధపడినా సరే, నిర్మొహమాటంగా మన తప్పుల్ని ఎత్తిచూపుతారు. ఏంచేయాలో, ఎలాచేయాలో చెప్తారు. నిర్ణయం మనకే వదిలేస్తారు.

ఈ స్నేహితులు మాత్రమే మన సంతోషాలనూ, దుఖాలనూ పంచుకుంటారు.  'నేనున్నాను' అన్న ధైర్యాన్నిస్తారు.

నా స్నేహితుల్లో వయసులో నాకంటే చిన్నవాళ్లున్నారు. పెద్దవారున్నారు.

నిజానికి, స్నేహానికి వయసుతో పనిలేదు. ఆడా మగా అన్నదాంతో కూడా పనిలేదు. అన్‌కండిషనల్‌గా మన మనసుకి నచ్చడం ముఖ్యం. ఆ ఫీల్ ఉండటం ముఖ్యం.

ఇలాంటి స్నేహితుల సంఖ్య దురదృష్టవశాత్తూ ఈరోజుల్లో చాలా తక్కువ.

కానీ, స్నేహానికి నిర్వచంగా నిలిచే ఇలాంటి నిజమైన స్నేహితులు కొందరయినా నాకున్నారని నేను గర్వంగా చెప్పుకోగలను. ఈ స్నేహితుల స్నేహానికి నేనెప్పుడూ రుణపడే ఉంటానని చెప్పుకోడానికి కూడా నాకు ఎలాంటి ఈగో లేదు.

అదీ నా స్నేహితుల గొప్పతనం.

థాంక్ యూ ఫ్రెండ్స్ ...  

Tuesday 10 January 2017

రెండు పుట్టినరోజులు. ఒక మహానిష్క్రమణం.

ఫీజు పేమెంట్‌కు సంబంధించి, దాదాపు అసాధ్యమైన ఒక అతిపెద్ద సమస్యతో మొన్న 25 నవంబర్ రాత్రి 8 గంటలకు జె బి ఎస్ నుంచి బెంగుళూరు బస్సెక్కాము నేనూ, ప్రణయ్.

ప్రణయ్ మా పెద్దబ్బాయి. బి టెక్ సెకండియర్ ఇప్పుడు. ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటో ఆ బస్సులో కూర్చుని మేం తీసుకున్న సెల్ఫీనే.

తెల్లవారితే 26 నవంబర్. నా బర్త్‌డే.

నా బర్త్‌డే విషయంలో నేనెప్పుడూ అంత ప్రత్యేకంగా ఫీలవ్వను. అదేమంత గొప్ప విషయంగా అనిపించదు నాకు. ఏదైనా నా మనసుకు నచ్చే పని నేనారోజు చేస్తే తప్ప!

ఏంటా మనసుకు నచ్చే పని అని నన్నిప్పుడు అడక్కండి. అదంత ముఖ్యమైన విషయం కాదు.


కట్ టూ 26 నవంబర్, నా పుట్టినరోజు -  

పొద్దున 7 గంటలకే మేమెక్కిన 'ఐరావత' మమ్మల్ని బెంగుళూరు మెజెస్టిక్‌లో దించేసింది. క్యాబ్ మాట్లాడుకొని, అక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రణయ్ కాలేజీకి బయల్దేరాము.

దారిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర పది నిమిషాలు క్యాబ్ ఆపి, బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేశాం ఇద్దరం.

నో బ్రషింగ్ ఆఫ్ టూత్. నో స్నానం.

బ్రేక్‌ఫాస్ట్ ముగించి, ముఖం మాత్రం ఫ్రెష్‌గా కనిపించేలా ఫేస్‌వాష్ చేసుకొని కాలేజ్‌కెళ్లాం. ఎక్కడైనా రూం తీసుకొని, ఫ్రెష్ అయి, తీరిగ్గా వెళ్లేంత సీన్‌గానీ సమయంగానీ లేదు.  

కాలేజీలో హెచ్ ఓ డి నుంచి డైరెక్టర్ దాకా - కనీసం ఒక అరడజను మందితో నానా డిస్కషన్‌లు చేసి, రిక్వెస్టులు చేసి, చివరికెలాగో తాత్కాలికంగా గండం గట్టెక్కించాను. ప్రణయ్ చేతిలో కొంచెం పాకెట్‌మనీ పెట్టి, అదే క్యాబ్‌లో తిరిగి మెజెస్టిక్‌కు బయల్దేరాను.

క్యాబ్‌లో తిరిగివస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాను. ఫ్లయిటా, మళ్ళీ బస్సేనా అని. మోదీ డిమానెటైజేషన్ ఎఫెక్టు గుర్తుకొచ్చి మళ్లీ బస్సుకే డిసైడైపోయాను.

మధ్యలో బెంగుళూర్లో ఉన్న ఒక ఫ్రెండ్‌ని కలిసి, వాళ్ల ఇంట్లోనే ఓ రెండు గంటలు గడిపాను. తర్వాత కెంపెగౌడ బస్టాండ్ చేరుకొని, కంఫర్ట్ గురించి ఆలోచించకుండా, అక్కడ రెడీగా ఉన్న
జె బి ఎస్, సికింద్రాబాద్ బస్సెక్కాను.

బస్ దాదాపు అనంతపురం దాటుతున్న సమయంలో వరంగల్లో ఉన్న మా చిన్నమ్మ (పిన్ని) దగ్గర్నుంచి అంత రాత్రి సమయంలో నాకు కాల్!

75 ప్లస్ ఉన్న మా అమ్మకు అంతకు ముందురోజు కంటి ఆపరేషన్ చేశారు. అంతంత మాత్రమే కనిపించే మా అమ్మ చూపు ఆ మధ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. దానికోసం ఆపరేషన్.

గంట క్రితమే కంటిమీద బ్యాండేజ్ తీసేసి చెక్ చేశారట. ఆపరేషన్ సక్సెస్. మళ్లీ మా అమ్మ మునుపటిలా చూడగలుగుతోంది.

నా పుట్టినరోజునాడు ఇది రెండో గుడ్ న్యూస్ నాకు!

మా ప్రణయ్ ఫీజు విషయంలో ఆరోజు ఉదయం తాత్కాలికంగానైనా గండం గట్టెక్కించగలగడం మొదటి గుడ్ న్యూస్.

నా పుట్టినరోజునాడు నేను బ్రష్ చేయలేదు. స్నానం చేయలేదు. కొత్తబట్టలు వేసుకోలేదు. గుడికెళ్లలేదు. దేవుడికి దండం పెట్టుకోలేదు. ఉదయం కేవలం ఒక ఇడ్లీ, ఒక వడ తిన్నాను. వచ్చేటప్పుడు దారిలో నా ఫ్రెండ్ ఇంట్లో తినమన్నా తినకుండా ఒక కాఫీ మాత్రం తాగాను. కెంపెగౌడ బస్టాండ్‌లో బస్ ఎక్కేముందు ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకొని తాగాను.

అయితేనేం ...

నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్, మెసెంజర్, వాట్సాప్, టెక్స్‌ట్ మెసేజ్‌ల రూపంలో వందలాది బర్త్‌డే విషెస్‌తో నాకింక ఆకలి అనిపించలేదు. వాటినికూడా, బస్‌లో నా ఫోన్ చార్జింగ్ పెట్టుకున్నాక, జర్నీలో అర్థరాత్రినుంచి మాత్రమే చూడగలిగాను!

అదీ మొన్నటి నా బర్త్‌డే కథ.

మా ప్రణయ్ కాలేజీలో అసాధ్యమైన పనొకటి తాత్కాలికంగానైనా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను. మా అమ్మ కంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. వందలాది నా ప్రియాతిప్రియమైన మిత్రులూ, శ్రేయోభిలాషులు నాకు గ్రీటింగ్స్ చెప్పారు.

బర్త్‌డే రోజున ఏ కేక్ కట్ చేసి, ఏ మందు తాగితే వస్తుంది ఇంత మంచి కిక్?


కట్ టూ 10 జనవరి, ప్రణయ్ పుట్టినరోజు -   

సరిగ్గా 45 రోజుల తర్వాత, ఇవాళ ప్రణయ్ పుట్టినరోజు. వరంగల్లో ఉన్న మా అమ్మ చనిపోయి ఇవాళ్టికి సరిగ్గా 15 రోజులు.

సెమిస్టర్ పరీక్షలైపోయి, సెలవులకి ప్రణయ్ ఇంట్లోనే ఉన్నాడు, కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌చేసుకొన్న ఏదో సీరియల్ చూస్తూ.

పొద్దున్నే మా చిన్నబ్బాయి ప్రియతమ్ కాలేజీకెళ్లాడు. నా భార్య సుజాత ఏదో పని చేసుకుంటోంది. వాయిదాపడిన నా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ఆన్‌లైన్‌లో, ఫోన్‌లో ఫాలో అప్ చేస్తూ నేను నా గదిలో బిజీగా ఉన్నాను.

ఎన్ని చేస్తున్నా ... నా జ్ఞాపకాల్లో అనుక్షణం మా అమ్మ.

అమ్మ జ్ఞాపకాలను ఓవర్‌టేక్ చేస్తూ నా సత్వర అవసరాలు, పనులు, ఇతర వత్తిళ్ళు.

వెరసి ... 45 రోజుల్లో రెండు పుట్టినరోజులు. ఒక మహానిష్క్రమణం.

దటీజ్ లైఫ్.

అండ్ ది షో మస్ట్ గో ఆన్ ...

Saturday 7 January 2017

అమ్మ

నాలో ఏ కొంచెం మంచితనం, పాజిటివిటీ ఉన్నా అందుకు కారణం మా అమ్మ.

తన 75 ఏళ్ల జీవితంలో ఎవ్వరినీ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా పొరపాటునైనా అనలేదు మా అమ్మ. ఎవరైనా ఏదైనా అపోహతోనో, ఆవేశంతోనో ఎప్పుడైనా తనని నాలుగు మాటలు అన్నా .. మౌనంగా భరించి క్షమించిందే తప్ప, వాటిని కూడా ఎన్నడూ మనసులో పెట్టుకోలేదు.

మా అమ్మ తన అత్తామామలను వారి అంతిమ క్షణాలవరకూ కంటికిరెప్పలా చూసుకుంది. తన జీవితపర్యంతం ఎంతోమందికి ఎన్నోరకాలుగా సహాయపడింది. కానీ, మా అమ్మకు ఆ పుణ్యఫలం దక్కలేదు.

అదే విధి విచిత్రం.

రకరకాల కారణాలతో తనే అందరికీ బరువైంది అని చెప్పడానికి నేనేం సిగ్గుపడటంలేదు. అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను.

తన కోడళ్లకు ఆమె కొడుకులే తప్ప, వారి తల్లి బరువు అని తెలిసినా ఎన్నడూ బాధపడలేదు మా అమ్మ. పరిస్థితిని ఎప్పుడూ కోడళ్ళవైపునుంచి చూసే మాట్లాడేది. 'కోడళ్లని బాగా చూసుకోండి, వాళ్లను ఏమాత్రం బాధపెట్టొద్దు' అని పదే పదే చెప్పేది. మరోవైపు తన కొడుకుల్లోని ఏ చిన్న తప్పునూ ఏనాడూ మొహమాటానికైనా సమర్ధించలేదు మా అమ్మ.

తను ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినా .. మొదటి సగం సమయం నా భార్యా పిల్లలగురించే. నా పిల్లలు ప్రేమగా పెంచుకొంటున్న మా ఇంట్లోని చిన్న కుక్కపిల్ల లక్కీ గురించే. ఆ తర్వాతే నా గురించి. నా మంచిచెడ్డల గురించి.

మొన్న 27 డిసెంబర్ మధ్యాహ్నం ఒకటిన్నరకు చివరిసారిగా నాతో ఫోన్లో మాట్లాడింది మా అమ్మ. తర్వాత కొన్ని నిమిషాల్లోనే అంతా అయిపోయింది.

మా అమ్మ ఇక లేదు.

నా కాంటాక్ట్స్‌లో ఇక ఆ నంబర్‌కు ఫోన్ చేయలేను అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నిజం.

రెండు రోజులుగా ఆ నంబర్‌కు నేను ఫోన్ చేయలేదు.

ఏదీ మా అమ్మ?

అమ్మకు గుర్తుగా, మా అమ్మ మొబైల్ ఫోన్ నా వెంట తెచ్చుకున్నాను.

వేళ్లమీద లెక్కించే ఒకరిద్దరికి తప్ప ఈ వార్త నేను ఎవ్వరికీ చెప్పలేకపోయాను.

మా పెద్దబ్బాయికి నానమ్మ అంటే చాలా ఇష్టం. నోరారా వాడు "నానమ్మా" అని పిలుస్తుంటే అమ్మకంటే ఎక్కువ ఆనందిచేవాణ్ణి నేనే. ఎక్కడో 700 కిలోమీటర్ల అవతలున్న వాడికి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ వార్త తెలిసి వాడు, వాడి చదువు డిస్టర్బ్ కాకూడదని నా స్వార్థం. పరీక్షలొదిలేసి వస్తాడేమోనని నా భయం.

అన్నిటినీ మించి, ఈ దుఖాన్ని నాలో నేనే మౌనంగా, తనివితీరా అనుభవించాలనుకుంటున్నాను.

అందుకే ఎక్కడా బయటపడలేదు నేను.

ఈ బ్లాగ్ ఇప్పుడయితే ఇలా రాస్తున్నా కానీ, 4వ తేదీ మధ్యాహ్నం వరకూ బహుశా దీన్ని పోస్ట్ చేయ్యలేను.

నిజంగా నాలో ఏ ఒక్క శాతం మంచితనం, మానవత్వం, సంస్కారం ఉన్నా .. అందుక్కారణం మా అమ్మే. ఇంక వందసార్లయినా, వెయ్యిసార్లయినా నాగురించి నేను గర్వంగా చెప్పుకోగలిగే  నిజం ఇదొక్కటే.

మిగిలిందంతా ఉట్టి ట్రాష్.

ఇది మా అమ్మమీద నేను రాస్తున్న ఎలిజీ కాదు.

ప్రతి పనికిరాని టాపిక్ మీదా ఏ చెత్తో రాసి పోస్ట్ చేసే నేను .. మా అమ్మ గురించి మనస్పూర్తిగా రాయలేకపోతున్నానన్న బాధ.

ఏ ఒక్కరూ లేని ఏ సముద్రపు ఒడ్డుకో దూరంగా వెళ్లి, గొంతెత్తి బిగ్గరగా "అమ్మా" అని అరవాలన్న ఆవేదన.

(29/12/2016)