Friday 28 February 2014

365 రోజులూ ఇక సినిమాలే!

తప్పట్లేదు. తప్పించుకోలేను. నా కమిట్‌మెంట్లు, వ్యక్తిగత అవసరాలు అలాంటివి!

కొన్నాళ్లు నగ్నచిత్రంలో పూర్తిగా సినిమాలు, సినిమా సంబంధిత విషయాల్నే ఎక్కువగా రాయాలనుకుంటున్నాను. రాస్తాను.

మధ్య మధ్యలో నా సొంతడబ్బా, ఇతర వ్యక్తిగత విషయాలూ, ఫీలింగ్సూ ఎలాగూ తప్పవనుకోండి. ఎంత రాయొద్దనుకున్నా, ఎవరు వద్దన్నా అవెలాగూ చొచ్చుకొని దూసుకువస్తుంటాయి అప్పుడప్పుడూ. అది వేరే విషయం.

బ్లాగ్‌లో ఉన్నట్టుండి ఈ మార్పుకి ముఖ్య కారణం - మొన్నటి 11 ఫిబ్రవరి.

దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆ రోజు, ఓ 'యూ ఎస్ రిటర్న్‌డ్' జీనియస్ నన్ను కలిశాడు. 1991 సెప్టెంబర్లో వాడ్ని నేను చివరిసారిగా నిక్కర్లో చూశాను. మళ్లీ ఇదే చూడ్డం.

ఇద్దరం ఓ మూడు గంటలు నెక్లెస్ రోడ్లోని "ఈట్ స్ట్రీట్"లో కాఫీ త్రాగుతూ మాట్లాడుకున్నాము. వాడ్ని అలా నా ముందు చూస్తూ చాలా గర్వంగా కూడా ఫీలయ్యాన్నేను.

ఇదంతా ఓకే. వాడన్న ఒక్క మాటే ఇంకా నా మెదడులో గిర్రున తిరుగుతోంది. "సర్.. నేను ఒక్క ట్వీట్ చేసినా అందులో నాకేదో ప్రయోజనం ఉండాలి.. ఉండితీరాలి అనిపిస్తోంది" అన్నాడు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - "నాకేంటి?" అన్నది సారాంశం.

ఇది స్వార్థమే కానక్కరలేదు. ఇంకేదయినా నిస్వార్థ ప్రయోజనం కూడా కావొచ్చు.

ఆ కోణంలో ఆలోచిస్తే - ఇప్పుడు నేను ఫేస్‌బుక్‌లో ఉన్నా, ట్వీట్ చేస్తున్నా, బ్లాగ్ రాస్తున్నా.. ఇవన్నీ నాకు ప్రాక్టికల్‌గా ఏదోరకంగా ఉపయోగపడాలన్నమాట!

సుమారు 17 రోజుల అంతర్మథనం తర్వాత, నా ఫేస్‌బుక్‌కి కొన్నాళ్లు యూజీలోకి వెళ్తున్నానని చెప్పేశాను. చెప్పడమయితే చెప్పాను గానీ.. అది ఎంతవరకు సాధ్యమో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే, ఇప్పుడు నేను చర్చిస్తున్న పాయింటాఫ్ వ్యూలో - అవసరమయితే నా ట్వీట్లను, బ్లాగ్ పోస్టులను, అదీ ఇదీ పోస్ట్ చేయాల్సి రావొచ్చు. చూద్దాం.

ట్వీట్లు, బ్లాగ్ మాత్రం ఓకే. వీటికోసం నేను ఒక్క నిమిషం కెటాయించినా, పది నిమిషాలు కెటాయించినా.. అవి నాకు, లేదా, నా తక్షణ లక్ష్యానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.. విధిగా ఉపయోగపడితీరాలి!

కట్ టూ నా ఇమ్మీడియేట్ గోల్ - 

తెలుగులో ఓ రెండో, మూడో మైక్రో బడ్జెట్ సినిమాలు. కొంత మనీ రొటేషన్. అంతే.

సో, అదన్నమాట విషయం. "నాకేంటీ?" ..

ఒక 365 రోజులూ ఇక ఈ బ్లాగ్‌లో, ట్విట్టర్లో సినిమాలు, సినిమా టాపిక్కులే అన్నమాట. ఇవి కూడా డైరెక్టుగానో, ఇండైరెక్టుగానో నాకు ఏదోవిధంగా ప్రాక్టికల్‌గా ఉపయోగపడేట్టు!  

సినిమా = మేనిప్యులేషన్!

Statutory Warning!:
"మన సినిమావాళ్లు దీన్ని నెగెటివ్ సెన్స్‌లో తీసుకోవద్దని మనవి."

కట్ టూ మన అసలు టాపిక్ - 

ఈ బ్లాగ్ టైటిల్ కొందరికి చికాకు పుట్టించవచ్చు. కొందరికి కోపం తెప్పించవచ్చు. నవ్వు కూడా రావొచ్చు. ఏదొచ్చినా రాకపోయినా .. ఇది మాత్రం నిజం. ఎవరైనా మన సినిమావాళ్లు దీన్ని ఒప్పుకోలేదంటే మాత్రం అది పచ్చి హిపోక్రసీ. ఎందుకంటే - సినిమాలంటే నథింగ్ బట్ "మేనిప్యులేషన్స్" అని టాలీవుడ్ నించి హాలీవుడ్ దాకా ఎందరో బడా బడా ఫిల్మ్‌మేకర్సే ఓపెన్‌గా చెప్పారు!

సరే, ఈ నిజాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా - ఈ మేనిప్యులేటింగ్ క్వాలిటీలేని ఏ క్రియేటివ్ పర్సన్ కూడా ఈ ఫీల్డులో బ్రతకలేడు. పైకి రాలేడు. ఇదే సూత్రం ప్రొడ్యూసర్స్‌కి కూడా 100 శాతం వర్తిస్తుంది.

పై స్టేట్‌మెంట్ నిజం అని చెప్పడానికి, అందరికీ తెలిసిన అతి చిన్న ఉదాహరణలు ఒక నాలుగు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను:

> ఒక దర్శకుడు.. హీరో అపాయింట్‌మెంట్ కోసం మధ్యలో ఉన్న వ్యక్తికి చెప్పే స్టోరీలైన్ వేరే ఉంటుంది. హీరోని కలిశాక అతనికి చెప్పే కథ వేరే ఉంటుంది.

> ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే - ఆ ఇద్దరితోనూ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో చెప్పే మాట ఒక్కటే ఉంటుంది: "నువ్వే మెయిన్ హీరోయిన్‌వి!" అని. నిజంగా ఎవరు మెయిన్ హీరోయిన్ అనేది అంతా అయిపోయాక తెరమీదే తెలుస్తుంది.  

> జేబులో వెయ్యి కాగితం లేకపోయినా - "5 కోట్ల క్యాష్ రెడీగా ఉంది సినిమాకోసం" అని డైరెక్టర్‌ని బకరాచేసి రంగంలోకి దించే ప్రొడ్యూసర్లు కనీసం 70 శాతం మంది ఉంటారు అంటే నమ్మగలమా? మరోవైపు, పాపం.. ఆ డైరెక్టర్ తనే ప్రొడ్యూసర్ని బకరా చేస్తున్నాననుకుంటాడు. అది వేరే మేనిప్యులేషన్ మళ్లీ!

> "మనోహర్‌ని డైరెక్టర్ చేసింది ఎవరనుకున్నావ్?" అని కనీసం ఓ వందమంది సినిమావాళ్లు చెప్తారు. నిజానికి.. మనోహర్‌కి ఈ 100 మంది ఎవరో కూడా తెలియదు! క్రిష్ణానగర్, గణపతి కాంప్లెక్స్ గల్లీల్లో తిరిగే ఇదే 100 మందికి కనీసం ఒక్క సినిమా అయినా పూర్తి చేసిన రికార్డు ఉండదు!

ఇంక ఫిలిం న్యూస్‌లో మనం చూసే ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ - ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్ (నాతోకలిపి), హీరో, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రొటీన్‌గా చెప్పే ఆ సొదంతా ఏంటో మీకే బాగా తెల్సు!

కట్ టూ ఫినిషింగ్ టచ్ -  

మన టాలీవుడ్ నించి బాలీవుడ్ దాక మాత్రమే ఈ చెత్త అబధ్ధాలు, పనికిరాని మేనిప్యులేషన్స్ అనుకున్నాను. హాలీవుడ్‌లోనూ ఇంతే అని మొన్న నా ఫ్రెండ్ స్టానా కెటిక్ చెప్పేటప్పటికి నేను నిజంగానే కొంచెం అవాక్కయ్యాను!    

Thursday 27 February 2014

ఫేస్‌బుక్ ఫేస్ చూడకుండా ఒక నెల!

శంభో శంకర.. హర హర మహాదేవ.. ఓం నమశ్శివాయ.. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు!

కట్ టూ టాపిక్ - 

రాత్రే ట్వీట్ చేశాను. నా ఫేస్‌బుక్ యాక్టివిటీకి సంబంధించి.. కొద్దిరోజులపాటు పూర్తిగా యూజీకి వెళ్లిపోతున్నాన్నేను!

నా 9 నిమిషాల రెగ్యులర్ బ్లాగింగ్‌కీ, అరనిమిషం ట్వీట్స్‌కి మాత్రం ఎలాంటి బ్రేక్ లేదు.  ఎప్పుడో ఒకసారి చేసే వీటితో నాకంత సమస్య లేదు.

నిజానికి నేను ఫేస్‌బుక్ మీద గడిపే సమయం రోజుకి సగటున ఒక 40 నిమిషాలు. ఒక నెల రోజులపాటు ఈ మాత్రం సమయం కూడా నేనిక్కడ గడపదల్చుకోలేదంటే దానికో అర్థముంది. కారణముంది. అవసరముంది.

ముఖ్యంగా - ఫేస్‌బుక్ ని మించిన అతి ముఖ్యమైన పనులు కొన్నున్నాయి నాకు. ఆ పనులను అతి తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం కూడా నాకుంది. అది కూడా ఈ మార్చి 31 లోపే.

సో, ప్రతి నిమిషం నాకు ఎంతో విలువైంది.

ఫేస్‌బుక్ మీద నేను గడుపుతున్న 40 నిమిషాల సమయమే నా పనులకు అడ్డుతగులుతోందా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. నా ఫోకస్ పూర్తిగా నా పనులమీద మాత్రమే ఉండాలన్నది నా ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యంతోనే ఈ చిన్న బ్రేక్.

విష్ మీ బెస్టాఫ్ లక్..  

Tuesday 25 February 2014

ఫిల్మ్ మేకింగ్ మేడ్ ఈజీ !

ఇప్పుడిక సినిమా ఎవరయినా తీయవచ్చు. ఇదివరకులాగా కోటి లేదా కోట్ల రూపాయలు అవసరం లేదు. కొన్ని లక్షలు చాలు. ఇంకా చెప్పాలంటే, కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. అర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అదే టీమ్!

మంచి సినిమా - అనుకున్న కథతో - అనుకున్న విధంగా తీయవచ్చు. రిలీజ్ చేయవచ్చు.

అవును. నమ్మటం కష్టం. కానీ నిజం. ఇప్పుడంతా డిజిటల్ యుగం.  ల్యాబ్ లూ, స్టూడియోలూ, ఫిల్మ్ నెగెటివ్ లూ,  ప్రాసెసింగ్ లూ, పడిగాపులూ ... ఆ రోజులు పోయాయి.

కేవలం 45 రొజుల్లో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చు. మరొక 45 రోజుల్లో - ఆ సినిమాని యే టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు.  మంచి కథతో, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి.  లాభం వూహించనంతగా వుంటుంది.

అయితే ఇది చెప్పినంత సులభం కాదు. సినిమా పుట్టుక నుంచి ఇప్పటిదాకా - ఈ ఫీల్డులో సక్సెస్ రేట్ అనేది ఎప్పుడూ 10 శాతం మించదు. కారణాలు అనేకం. ఇప్పుడు వాటి జోలికి మనం పోవటం లేదు.

2007 లో వచ్చిన 'పేరానార్మల్ యాక్టివిటీ' అనే సినిమా ఈ సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది!

అప్పటి నుంచీ, మనవాళ్లకు యెన్ని రకాలుగా చెప్పినా - యెన్ని వుదాహరణలతో చూపించినా - వినలేదు యెవరూ. చివరికి ఒక పేరున్న దర్శకుడు చేసి చూపించాకగానీ మనవాళ్లకు విషయం అర్థం కాలేదు. ఇక ఇప్పుడంతా అదే దారి. డిజిటల్ ఫిలిం మేకింగ్ .. డిఎస్సెల్లార్  ఫిలిం మేకింగ్!

(ఆసక్తి వున్న కొత్త ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లు / మైక్రో ఇన్వెస్టర్లు మీ ఫోన్ నంబర్ ఇస్తూ, ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. లేదా, మీ ఫోన్ నంబర్ తో నా ఫేస్‌బుక్ పేజ్‌లో  మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. లేదా నేనే ఫోన్ చేస్తాను. email: mchimmani@gmail.com)

Sunday 23 February 2014

9 నిమిషాల్లో ఏం చేయగలం?

1. అదేపనిగా చూస్తున్న టీవీని ఆఫ్ చేసి, పీకలమీదున్న పనుల గురించి ఆలోచించవచ్చు. వాటిని పూర్తిచేసే దిశలో ఆచరణ కూడా ప్రారంభించవచ్చు.

2. ఇంట్లో పనికిరాని చెత్తా చెదారం ఎంతో ఉంటుంది. దాన్లో కనీసం ఒక చిన్న భాగాన్నయినా "వీడ్ అవుట్" చేసేసి, బయట డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు. ఇలా వారానికి ఒకసారి చేసినా ఇల్లు నీట్‌గా ఉంటుంది.

3. మీ పిల్లల స్కూలు డైరీల్లో కొన్ని పేజీలయినా చూడొచ్చు. ఏవయినా సంతకాలు చేయాల్సింది మిగిలి ఉంటే చేసేయొచ్చు.

4. ఎప్పుడూ అలా నాలుగు గోడల మధ్యే కూర్చోకుండా - కాసేపు అలా బయటకెళ్లి ఫ్రెష్ ఎయిర్లో 'వాక్' చేసి రావొచ్చు. అంత ఓపిక లేకపోతే - కనీసం ఇంట్లో ఓ మూలన కళ్లు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చోవచ్చు.

5. ఎడతెగని ఎస్ఎమ్ఎస్‌లు, కాల్స్, వాట్సాప్‌లు, వీడియో గేమ్‌స్ ల మొబైల్ ఫోన్‌ని ఒక 9 నిమిషాలు స్విచాఫ్ చేసి ఊపిరిపీల్చుకోవచ్చు.

6. రొటీన్‌కు భిన్నంగా - మీ జీవిత భాగస్వామికి ఓ కప్పు కాఫీ చేసి ఇవ్వొచ్చు. లేదా చేయించుకొని త్రాగొచ్చు. (ఏది రొటీనో మీకే తెలుసు!)

7. ఫేస్‌బుక్‌లో ఊరికే (నాలాగా) ప్రతి చెత్తా పోస్ట్ చేయడం ఆపి, అద్దంలో ఓసారి ఫేస్ చూస్కోవచ్చు! 'అసలేంటి నువ్వు.. నీ జీవితంలో ఏం జరుగుతోంది?' అని.  

8. ఓ ఆరు నెలలుగా కనీసం పలకరించుకోని మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరికయినా ఒక కాల్ చేయొచ్చు.

9. ఇదుగో.. ఇలా ఓ చిన్న బ్లాగ్ పోస్ట్ కూడా రాయొచ్చు. పనికిరాని ఎన్నో చెత్త పనులకంటే, రాయడం కోసం ఇలా ఓ తొమ్మిది నిమిషాలు వెచ్చించడం నేరం ఏమీ కాదు. రాయడం కూడా ఓ విధమైన మెడిటేషనే!  

Friday 21 February 2014

నా "గరుడ" కష్టాలు! [గెస్ట్ పోస్ట్]

కె.పి.హెచ్.బి. లో గరుడ బస్ ఎక్కి 'ఏమాయ చేసావె' సినిమాలో సమంతని, మధ్య మధ్య లో నాగ చైతన్యని చూస్తూ సాగిస్తున్న నా హైదరాబాద్ టు గుంటూరు ప్రయాణానికి సడన్ గా బ్రేక్ పడింది.

బస్ రిపేర్! .. 

సరే .. బస్ లో సినిమా కూడా అపేశారు కదా అని, నేను కూడా ఆగిన బస్ కిందకి దిగా.

బస్ డ్రైవర్ ఏదో రిపేర్ చేస్తున్నాడు. హెల్ప్ కోసం ఆల్రెడీ కాల్ చేశానని జనాలకి ఓపిగ్గా చెప్తున్నాడు మధ్య మధ్యలో.

"మీరు ముందే చూసుకోవాలి కదా.. నాకు గుంటూరులో అయిదింటి నుంచే పనులు ఉన్నాయి!".. అని ఒకతను రిపేర్ చేస్తున్న డ్రైవర్ మీద అరుస్తున్నాడు.

కొంతమందికి తెలియక ఏదో చిన్న పొరపాటు చేసిన అమాయకుల మీద అరవటానికి వచ్చిన నోరు .. ప్లాన్‌డ్‌గా భారీ నేరాలూ, ఘోరాలు చేసే వెధవల మీద రాదు ఏంటో! ..

ఇంతకీ, డ్రైవర్ మీద అరుస్తున్న హీరో నా పక్క సీట్ పాసెంజరే. సగం బాడీని పక్కనే ఉన్న నా సీట్ లో పడేసి, బస్ ఎక్కిన దగ్గర నుంచి, ఎవరితోనో ఫోన్ లో తెగ సోది చెప్తూనే ఉన్నాడు. అతని గోలకి నేను సమంతని చుస్తున్నా కాని వాయిస్ వినపడటం లేదు.

అయినా చిన్మయి వాయిస్ లేకుండా సమంత కంప్లీట్ ఎలా అవుతుంది? 

ఇప్పుడు డ్రైవర్ మీద అరుస్తున్నది ఎవరో కాదు. నా పక్క సీట్లోని ఆ సేమ్ క్యాండేట్!

ఫ్యూర్ ఇన్‌సెన్సిటివ్‌నెస్. కొన్ని విషయాలు జనాలు ఎవరూ చెప్పకుండా వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి. 

సరే ఓ రెండు గంటల తరువాత రిపేర్ టీమ్ వచ్చింది, బస్ రిపేర్ అయ్యింది. అప్పటివరకు నాకు కంపెనీ ఇచ్చిన కుక్కలకి, దోమలకి 'బాయ్' చెప్పి, అందరితో పాటు బస్ ఎక్కి వెంటనే నిద్రలోకి జారుకున్నా.

ఈ మొత్తం గరుడ ఎపిసోడ్‌కి ఫినిషింగ్ టచ్ ఏంటంటే -  ఈ బ్లాగ్ పోస్ట్ అంతా అరిందం చౌదరి ఇన్స్‌పిరేషన్‌తో, బస్ రిపేర్ జరుగుతున్నప్పుడు, నా ఐఫోన్ నోట్స్ లో టైప్ చేసుకున్నదే ..

-- భరత్ బెల్లంకొండ 

Wednesday 19 February 2014

డిజిటల్ సినిమా బూమ్!

ఒకప్పుడు సినిమా అంటే అదో పెద్ద రహస్యం. రాకెట్ సైన్స్. ఇప్పుడంత సీన్ లేదు. అంతా డిజిటల్‌మయమైపోయింది. చూద్దామన్నా ఇప్పుడు ఎక్కడా ఫిలిం నెగెటివ్ కానీ, ఫిలిం రీలు కానీ కనిపించవు.

ఇప్పుడు ఎవరయినా .. ఎంత రేంజ్ బడ్జెట్లోనయినా ఒక మాదిరి ఫీచర్ ఫిలిం నిర్మించవచ్చు. అయితే అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజయ్యే స్థాయిలో ఉండాలంటే మాత్రం కనీసం ఒక 50 లక్షల వరకు బడ్జెట్ తప్పనిసరి.

సినిమాలో ఏమాత్రం సరుకున్నా, సరయిన సమయంలో దాన్ని రిలీజ్ చేస్తే మాత్రం ఎవరయినా కోట్లు సంపాదించవచ్చు. ఆఫ్‌కోర్స్, ఈ కోట్లు కొల్లగొట్టడం అనేది ఆ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందన్నదానిమీద ఆధారపడి ఉంటుంది.    

ఇప్పటివరకూ చర్చించిందంతా కేవలం అంతా కొత్తవాళ్లతో తీసే యూత్ ఎంటర్‌టైనర్ సినిమాల గురించి. ఉదా: ఈ రోజుల్లో, బస్ స్టాప్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, 3 జి లవ్, ప్రేమ కథా చిత్రమ్ మొదలైనవి.

ఈ రేంజ్ మైక్రో బడ్జెట్ సినిమాలమీద పెట్టే పెట్టుబడి ఎంతమాత్రం రిస్కు కాదు. శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఔట్‌రైట్ సేల్ వంటి రకరకాల రూపాల్లో మనం పెట్టిన పెట్టుబడికి మరింత ఎక్కువగానే మనకు రిటర్న్స్ ఉంటాయి.

ఈ రిటర్న్స్‌కి సినిమా జయాపజయాలతో పనిలేదు. లక్కీగా, సినిమా ప్రేక్షకాదరణ పొంది 'హిట్' టాక్ వచ్చిందంటే చాలు.. ఇంక చెప్పేదేముంది. ఒక్క నైజాం ఏరియాలోనే 10 కోట్ల కలెక్షన్ ఉంటుంది.    

మరో ప్లస్ పాయింట్ ఏంటంటే - ఇదంతా ఒక్క 5 నెలల కాలంలో పూర్తయ్యే విషయం!

అయితే చెప్పినంత సులభం కాదు. దీన్ని సాధించడం కోసం ఒక లైక్‌మైండెడ్ టీమ్, ప్యాషనేట్ ఇన్‌వెస్టర్స్ చాలా అవసరం.

చిన్నమొత్తంలో పెట్టుబడి పెడుతూ ఫిలిం ప్రొడక్షన్‌లోకి ప్రవేశించాలన్న ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈమెయిల్ ద్వారా నన్ను నేరుగా సంప్రదించవచ్చు.    

కట్ టూ సింపుల్ లాజిక్ - 

ఒక్క 10 కోట్ల లాభం కోసం, భారీ హీరోలతో 50 కోట్లు/100 కోట్లు ఖర్చుపెట్టి సంవత్సరాలపాటు సినిమాలు తీస్తూ హెవీ గ్యాంబ్లింగ్ చేయడంతో పోలిస్తే .. కేవలం 50 లక్షల పెట్టుబడితో జీరో రిస్క్ రిటర్న్స్ లేదా కనీసం ఓ 10 కోట్ల ప్రాఫిట్స్ పొందటం చాలా గొప్ప విషయం అన్నది ఎవరయినా ఒప్పుకొని తీరాల్సిన నిజం.

ముఖ్యంగా, కొత్తగా ఈ ఫీల్డులోకి రావాలనుకొనే ఇన్‌వెస్టర్ల విషయంలో మాత్రం ఇదే చాలా తెలివైన నిర్ణయం కూడా. 

Tuesday 18 February 2014

జై తెలంగాణ!

నాకు తెలుసు. కోట్లాది తెలంగాణ ప్రజలకూ తెలుసు. ఈ రోజు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఎలాగయినా పాసయిపోతుందని.

ఎందుకంత నమ్మకం?

"ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణలోనే!" అని మొన్నే చెప్పి వెళ్లారు కేసీఆర్. కానీ, ఎన్నో మలుపులు. ఎంతో టెన్షన్.

అయినా, ఇక "సంబురాలు చేసుకోడానికి సిధ్ధంగా ఉండండి!" అని మాత్రం నిన్ననే చెప్పారు కేసీఆర్.  

కేసీఆర్ చెప్పిన ఆ ఒక్క మాటే అందరి నమ్మకం.

ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి విజన్ నిజమైంది. తెలంగాణ కల సాకారమైంది. మన దేశంలో 29 వ రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ అవతరించింది. 

సుమారు వెయ్యిమందికి పైగా ఈ ప్రాంత విద్యార్థులు, ప్రజల ఆత్మబలిదానం తర్వాత వచ్చిన ఈ తెలంగాణ ఆ అమరవీరులకే అంకితం.

ఎవరు ఎన్ని లాజిక్కులు చెప్పినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా .. చివరికి జరగాల్సింది జరక్క తప్పలేదు. ఈ క్రెడిట్ అంతా ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది, దక్కాలి .. అని నా వ్యక్తిగత అభిప్రాయం. 

అయితే ఈ వాస్తవం ఒప్పుకోడానికి చాలామందికి రకరకాల ఈగోలూ, రాజకీయ కారణాలూ, ఇతర మైలేజీలూ మన్నూ మశానం అడ్డొస్తాయి.

నిజమే. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంటూ, అందులోని కొన్ని భాగస్వామ్య పార్టీలు కావొచ్చు. చివరి నిమిషాల్లో నానా తికమకలు మాట్లాడి, ఎలాగో ఒకలాగా దీనికి ఫినిషింగ్ టచ్ మేమే ఇచ్చాము అని బీజేపీ కూడా అనుకోవచ్చు. 

కానీ, ఇదంతా ఇలాంటి క్లయిమాక్సు చేరుకోడానికి సింగిల్ హ్యాండెడ్‌గా, చెదరని ఫోకస్‌తో ఒక గెరిల్లా ఉద్యమ నాయకుడిగా ఎదుటివారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, చివరకు విజయం సాధించడానికి కారకుడయిన ఏకైక వ్యక్తి నిస్సందేహంగా కేసీఆరే.

ఒక్క మాటలో చెప్పాలంటే - 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమానికి ఒక "గేమ్ చేంజర్" కేసీఆర్. ఫాలోడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిలోకం, తెలంగాణ పొలిటికల్ జేఏసీ, ఇంకా ఇతర ఎన్నో జేఏసీలు. ఆ తర్వాతే మిగిలిన ఎవరైనా. 

కట్ టూ వాట్ నెక్స్‌ట్? 

ఇది ఒకరి విజయం, మరొకరి ఓటమి కానే కాదు. ఏదో ఒకరోజు జరగాల్సిన ఒక పరిష్కారం. దశాబ్దాలుగా రకరకాల దోపిడీ, దురాక్రమణలు, అణచివేత, వెన్నుపోట్లు వంటి ఎన్నో ఆరోపణలు, అపనమ్మకాల మధ్య ఒకే భాష మాట్లాడే ఇద్దరు అన్నదమ్ములు విడిగా బ్రతకడానికి వేరుపడ్డారు. అంతే. 

ఇదంతా ఒక (అ)సాధారణ రాజకీయ ప్రక్రియలో భాగం. ఏర్పడిన కొత్త రాష్ట్రానికి ఎవరు సీఎం అనీ, మంత్రులు ఎవరనీ, నాకేంటీ, నీకేంటీ అని .. మళ్లీ షరా మామూలే.

ఆ రాజకీయం ఒకవైపు. మానవ సంబంధాలు మరోవైపు.

నా ఆత్మీయ మిత్రులు, బంధువులు ఎందరో ఆంధ్రలో ఉన్నారు. రాయలసీమలో ఉన్నారు. దేశమంతా ఉన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్నారు. 

రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎన్నో మార్పులుండొచ్చు. అది సహజం. మన సంబంధాల్లో మాత్రం ఎలాంటి విద్వేషాలుండవని నా నమ్మకం. ఉండకూడదని నా కోరిక. 

Monday 17 February 2014

14 ఫిబ్రవరి నాడు ఏం జరిగింది?

నేను వాలెంటైన్స్ డే గురించి మాట్లాడబోవటం లేదు. నిజానికది వాలెంటైన్స్ డే కాదు. ఒక వేస్ట్ డే.

నిజమైన ప్రేమికులకు 365 రోజులూ వాలెంటైన్స్ డేనే అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది కేవలం ప్రేమికులకే కాదు. ప్రేమికుల్లా జీవించే, జీవించాలనుకొనే భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్ వగైరా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ఒక ప్రచారం ఎక్కువగా జరిగింది మొన్నటి 14 ఫిబ్రవరి నాడు. మన దేశ స్వాతంత్ర్యం కోసం విప్లవాత్మకంగా పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను సుమారు 83 ఏళ్ల క్రితం, 1931 లో, ఇదే రోజు లాహోర్‌లో బ్రిటిష్‌వాళ్లు ఉరితీశారని! కానీ అది నిజం కాదు.

1931 లో, 14 ఫిబ్రవరి నాడు అప్పటి కాంగ్రెస్ ప్రసిడెంట్ మదన్ మోహన్ మాలవీయ ఈ దేశభక్తుల మరణ శిక్షను రద్దుచేయమని అభ్యర్థిస్తూ ఒక మెర్సీ అప్పీల్‌ను లార్డ్ ఇర్విన్ కు సమర్పించాడు. కానీ అది నెరవేరలేదు. ఆ తర్వాత మార్చి 23 నాడు ఈ ముగ్గురినీ ఉరితీయడం జరిగింది.

పోన్లెండి .. ఇదెలా క్రియేట్ అయ్యిందో తెలీదు కాని, మొత్తానికి ఈ వాలెంటైన్స్ డే పుణ్యమా అని .. మనవాళ్లు భగత్ సింగ్‌ను, అతని అనుచరులను  కనీసం గుర్తుకు తెచ్చుకున్నారు!


కట్ టూ వ్యక్తిగతం - 

ఈ ఫిబ్రవరి 14 ను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒక 6 నెలల తర్వాత నేను ప్రారంభించాలనుకొన్న పనుల్ని ఆ రోజునుంచే ప్రారంభించేలా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. ప్రారంభించాను.

అలాంటి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఆ రోజు సృష్టించిన బాబాకు కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలను?

ఆ విధంగా చూస్తే.. ఫిబ్రవరి 14 అనేది నాకు ఎన్నటికీ అత్యంత ప్రియమైన రోజే!

Saturday 15 February 2014

జగనే మాయ!

"ఛాన్స్ దొరికితే ప్రతివాడూ జగనే అవుతాడు మన దేశంలో!"

ఇదేదో నేనన్నది కాదు. విన్నది.

జగన్ ఆరాధకులు, జగన్‌ను విమర్శించడంలో లాజిక్ లేదు అని నమ్మేవాళ్ల అభిప్రాయం ఇది.

నిజంగా ఎంత బాగా చెప్పారు!..

లేటెస్టుగా ఒక "యూఎస్ రిటర్న్‌డ్" జీనియస్ నోట విన్నానీమాట. అతను విన్నది నాకు చెప్పాడు. అది వేరే విషయం.

అయితే, కొంచెం అటూ ఇటూగా, ఇదే అభిప్రాయాన్ని చాలామంది బాగా చదువుకొన్నవాళ్ల నోట, మంచి మంచి హోదాల్లో ఉన్నవాళ్ల నోట కూడా విన్నాను.

ఆదిమానవుడి దశనుంచి, నేటి ఆధునిక మానవుడి దాకా.. ఈ "క్విడ్ ప్రో కో" అనేది ఏదో ఒక రూపంలో ఉందన్నది వీరి వాదన.

పై స్టేట్‌మెంట్ ఎంతవరకు కరెక్టు అని నేనడగట్లేదు. ఎంతవరకు లాజికల్లీ  "ఇన్‌కరెక్టు" అన్నదే నా కొశ్చన్.

ఒకవేళ అది నిజంగా "ఇన్‌కరెక్టు" అయినప్పుడు.. ఎందుకని జగన్ ఇంకా బయటున్నాడు? మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఈ 67 ఏళ్లలో పుట్టిన ప్రతి రాజకీయపార్టీ నుంచి.. ఎన్ని వందలమంది రాజకీయ నాయకులు ఇలాంటి క్విడ్ ప్రో కో ల బారిన పడలేదు? ఎన్నెన్ని స్కాముల్లో ఎంత రచ్చ జరగలేదు? మరి వారంతా కూడా ఎందుకు శిక్షింపబడలేదు?  

రాజకీయాలమీద ఏ మాత్రం ఆసక్తిలేని నాలాంటివాడికి ఇలా ఎన్నో సందేహాలు. అంతా ఒక మాయ అనిపిస్తోంది.

అసలెక్కడ లోపం?
ఉంటే దాన్నెవరు సరిదిద్దాలి?
ఎందుకని దిద్దట్లేదు?

ముచ్చటగా ఈ మూడు ప్రశ్నలూ సంధించి.. విక్రమార్కుడి భుజం మీదున్న భేతాలుడు దయ్యమై మళ్లీ చెట్టెక్కాడు!

Friday 14 February 2014

9 మినిట్ బ్లాగింగ్!


టైమర్ ఆన్..
టిక్..టిక్..టిక్..

నిజంగా 9 నిమిషాల్లో ఒక బ్లాగ్ పోస్ట్ రాయొచ్చా? అంత ఈజీనా?

"అవును" అనే ప్రాక్టికల్‌గా ఇన్‌స్పిరేషన్ ఇస్తున్నాడు పావ్‌లో కోయిల్యూ. సుమారు 67 భాషల్లో ప్రచురితమైన ఈ బ్రెజిలియన్ ఆధ్యాత్మిక రచయిత పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 150 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి!

"4 మినిట్ రీడింగ్" అనీ, "2 మినిట్ ఇన్స్‌పిరేషన్" అనీ తన పుస్తకాల్లోంచి కొన్ని ఆకర్షణీయమైన చిన్న చిన్న భాగాల్నే బ్లాగ్ పోస్టులుగా తన బ్లాగ్‌లో పబ్లిష్ చేస్తున్నాడు పావ్‌లో.

ఈ పాయింట్ గురించి మొన్న భరత్, నేను కూడా అనుకున్నాము. ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచనే ఈ బ్లాగ్ పోస్ట్.

ఇప్పుడున్న మన బిజీ బిజీ లైఫ్‌లో గంటలు గంటలు రాయడానికి నేను టైమ్ క్రియేట్ చేసుకున్నా - ఆ స్టఫ్‌నంతా చదవడానికి పాఠకులకుండాలిగా టైమ్?

సో, ఫర్ ఎ చేంజ్, ఇకనుంచీ నా బ్లాగ్ పోస్టులన్నీ ఇదేలెక్కన కేవలం 9 నిమిషాల్లోనే రాయాలని నిర్ణయించుకున్నాను. సాధ్యమైనంతవరకు అందులోనే నేను చెప్పదల్చుకున్నది చెప్పాలి. చెప్పగలగాలి!


కట్ టూ "9 నిమిషాలే ఎందుకు?" - 

10 నిమిషాలయితే డబుల్ డిజిట్ అవుతుందని నా ఉద్దేశ్యం. అంతకంటే ఏం లేదు.

అన్నట్టు, ఇప్పుడు మీరు చదవటం పూర్తిచేసిన ఈ బ్లాగ్ పోస్ట్ ఈ పధ్ధతిలో నేను రాసిన మొదటి పోస్టు...  

Saturday 8 February 2014

అదరగొట్టిన 'విప్రో' అమ్మాయిలు! [గెస్ట్ పోస్ట్]

ఈమధ్య నా ఫేస్‌బుక్ వాల్ మీద "ఫ్లాష్ మాబ్" వీడియో ఒకటి తెగ హడావిడి చేస్తోంది. కుప్పలు కుప్పలు గా వస్తున్న ఫ్లాష్ మాబ్ వీడియోల్లో ఇదీ ఒకటి అనుకుని లైట్ తీసుకున్నా. కాని జనాలు షేర్ల మీద షేర్లు కొట్టారు.

ఒకరైతే ఏకంగా "నాకు విప్రో లో జాయిన్ అవ్వాలని ఉంది" అని కామెంట్ చేశారు! 

విప్రో గాల్స్ 'సూపర్బ్ డాన్స్.. అల్టిమేట్ డాన్స్' అని జనాలు రాస్తుంటే అసలు విషయం ఏంటో అని ఆ ఫ్లాష్ మాబ్ వీడియో ఓపెన్ చేశా...

ఫస్ట్ పాయింట్.. అది కేవలం అమ్మాయిలు చేసిన డాన్స్ మాత్రమే కాదు, అబ్బాయిలు కూడ సమానంగా చేశారు, అందరూ కలిసి బాగా చేశారు. ఎంతయినా ఆ వీడియో టైటిల్లో "అమ్మాయిలు" అన్న పదం ఉండటం ద్వారా వచ్చిన క్రేజే వేరు కదా అనుకున్నామనసులో.. అది చూస్తూ.. 

ఇక అసలు ఆ ఫ్లాష్ మాబ్ డాన్స్ కి వస్తే... 'కొచ్చి' విప్రో ఎంప్లాయీస్ చాలా రోజుల క్రితం చేసిన ఫ్లాష్ మాబ్ డాన్స్ అది. మరి ఇప్పుడు జనాలు మరలా ఎందుకు మోజు పడ్డారో తెలీదు. 

అయితే ఒక పది నిముషాల పాటు మాత్రం ఉర్రూతలూగించారు విప్రో అమ్మాయిలు.
కాదు కాదు.. 
బ్బాయిలు కూడా!

అప్పుడెప్పుడో ఊర్మిళ డాన్స్ తో దేశాన్ని ఒక ఊపు ఊపిన 'రంగీల' టైటిల్ సాంగ్ నుంచి, ఈ మధ్య ప్రపంచాన్నే ఊపేసిన గంగం స్టయిల్ సాంగ్ వరకు.. మాంచి ఊపున్న సాంగులు, అంతకన్నా ఊపైన స్టెప్పుల తో నిజంగా 
అదగొట్టారు. 

అసలు ఈ "ఫ్లాష్ మాబ్" ల గోల ఏంటా అని ఇంటర్నెట్ లో చూశా.

కథ చాలానే ఉంది..  

టూకీగా... 2003 లో బిల్ వాసిక్ అనే ఒక ప్రఖ్యాత జర్నలిస్టు మొదటిసారిగా ఈ ఫ్లాష్ మాబ్ ని న్యూయార్క్ లో సరదాగా అప్పటి యూత్ మీద ఒక మాల్ లో ప్లాన్ చేశాట్ట. అదీ ప్రారంభం.

ఆ తరవాత, ప్రపంచం అంతా ఈ ఫ్లాష్ మాబ్ 
ను వినోదానికీ సరదాకే కాకుండా, ఒక హచ్ కుక్క లాగా .. ఒక రిన్ మెరుపు లాగా.. జనాలకి అతుక్కునేలా.. అటు పబ్లిసిటీకి, ఇటు ఏదయినా ఓ సోషల్ మెసేజ్ ఇవ్వటానికీ కూడా తెగ వాడేశారు.

ఇవి ఎంత పాపులర్ అయ్యాయంటే.. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో ఫ్లాష్ మాబ్ ల మీద ఆంక్షలు కూడ వచ్చేసేంత! 
 

ఇక్కడ మన విప్రో అమ్మాయిల.. కాదు కాదు.. అబ్బాయిల డాన్స్ కూడా బాగుంది. మొత్తం మీద మనవాళ్ల ఫ్లాష్ మాబ్ అదిరింది.

అయితే - ఇదంతా 
ఏదో డాన్స్ సరదా, ఏవో మెసేజ్‌లు మాత్రమే కాదు. ఈ ఫ్లాష్ మాబ్ వెనక ఇంకో శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉంది. వ్యక్తిగతమైన, వృత్తిపరమైన ఎన్నో రకాల వత్తిళ్లను క్షణంలో మర్చిపోయేలా చేయగల సత్తా ఇలాంటి ఫ్లాష్ మాబ్‌లకు మాత్రమే ఉందని నేననుకుంటున్నాను.     

ఇక మనవాళ్లు 'సేవ్ ఫుడ్' అని చివర్లో ఇచ్చిన మెసేజ్ కూడ బాగుంది. క్యాంటీన్ లొకేషన్ లో డాన్స్ కి, మెసేజ్ కి బాగ సెట్ అయింది.

రోజూ కొన్ని కోట్ల మంది ఆకలితో నిద్రపోతుంటే, మనం ఫుల్లుగా తిని పడుకోగలగటం మన అదృష్టం. అలాంటి వాళ్ళకి డైరెక్టుగా సహాయం చెయ్యలేకపోవటం మన దురదృష్టం. కనీసం ఫుడ్ వేస్టేజ్ తగ్గించుకోవచ్చు అనిపించింది నాకు. ఎక్కువ పడెయ్యకుండా.. అవసరం అయిన దానికన్నా ఎక్కువ తినకుండా! :)

ఏదేమైనా విప్రో వారి డాన్సూ మెసేజూ రెండూ నాకు బాగా నచ్చాయి.

-- 
భరత్ బెల్లంకొండ

Friday 7 February 2014

మొబైల్ ఫోన్‌ను ఇలా కూడా వాడవచ్చు!

నా కుటుంబం తర్వాత, నాకెంతో ప్రియమైన వస్తువులూ విషయాలూ కొన్నున్నాయి. అవి: కాగితం, పెన్ను, నా శామ్‌సంగ్ నోట్‌బుక్, ఇంటర్‌నెట్ కనెక్షన్. అంతే.

మిగిలినవన్నీ, వ్యక్తిగతంగా, నా దృష్టిలో అంత ముఖ్యమైనవి కావు.

"మరి డబ్బో?" అని మీలో కొందరు అడగొచ్చు.

నిజం. డబ్బు చాలా ముఖ్యమైంది. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలంటే, అసలు డబ్బే చాలా ముఖ్యమైంది. ఈ నిజం తెలుసుకొనేటప్పటికే చాలా మంది చేతులు కాల్చేసుకుంటారు. లేదా, అప్పటికే ముసలాళ్లు అయిపోతారు! దీనికి నేను కూడా మినహాయింపేమీ కాదు ..

మళ్లీ పాయింట్‌కి వద్దాం. "మరి డబ్బో?" అన్నది మీ ప్రశ్న.

పైన నేను చెప్పిన ఆ నాలుగూ ఉంటే చాలు. డబ్బు జేబులో ఉన్నట్టేనని నా వ్యక్తిగత నమ్మకం. అనుభవం కూడా.

వృత్తిపరంగా చూసినా, వ్యక్తిగతంగానైనా.. ఆ నాలుగే నాకెంతో ప్రియమైన నేస్తాలు. ముఖ్యంగా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో.

పైన నేను ఇచ్చిన లిస్టులో 'మొబైల్ ఫోన్' లేకపోవడం మీరు గమనించే ఉంటారు. నాకు అత్యంత అయిష్టమైన వస్తువుల లిస్టులో అన్నిటికంటే టాప్ పొజిషన్లో ఉండేది మొబైల్ ఫోనే!

నేను ఖాళీగా ఉన్నంత సేపూ ఒక్క ఫోనూ రాదు. ఏ బ్రేక్‌ఫాస్టుకో, భోజనానికో కూర్చుని మొదటి ముద్ద తింటూ అనుకుంటాను.. "చూడు, ఇప్పుడు ఖచ్చితంగా కాల్ వస్తుంది!" అని. వచ్చితీరుతుంది.

ఇక.. వాష్ రూమ్‌కి వెళ్లొచ్చిన రెండు నిమిషాల్లోనే కనీసం రెండు మిస్స్‌డ్ కాల్స్ ఉంటాయి. వాటిని చూసుకుని నేను మళ్లీ ఫోన్ చేసినప్పుడు అవతల నుంచి నేను వినే డైలాగ్ సాధారణంగా ఇలా ఉంటుంది: " ఫోనెత్తవేంటీ?" అని!

ఈ లెక్కన ఎవరు మనకు ఫోన్ చేస్తారా అని ఎదురుచూసుకుంటూ మనం కనీసం వాష్ రూమ్‌కు కూడా వెళ్లొద్దన్నమాట!


కట్ టూ ఓల్డెన్ డేస్ -

నిజానికి అవి గోల్డెన్ డేస్. మొబైల్ ఫోన్ వచ్చాకే అంతా సర్వనాశనమైపోయింది. ఇప్పుడిక యాండ్రాయిడ్స్, వాట్సాప్‌లు వచ్చి జీవితాన్ని ఊపిరితీసుకోకుండా చేస్తున్నాయి.

అంతకు ముందే నయం. ఎక్కడో, ఎవరింట్లోనో ఒక లాండ్ ఫోన్ ఉండేది. ఆ "పీపీ" నంబర్‌నే అందరికీ ఇచ్చుకునేవాళ్లు. ఆ పీపీ ఫోన్లో ఒక్క రెండు నిమిషాలు మాట్లాడితే అప్పుడు ఎంత ఆనందమో!

ఎందుకంత ఆనందమంటే - అప్పుడు అలా మనకు ఫోన్ చేసినవాళ్లు కేవలం మనవాళ్లో, మన ఆత్మీయులో, లేదంటే.. మన నిజమైన స్నేహితులో. అంతే. ఒకవేళ అది వృత్తి, వ్యాపారపరమైన ఫోన్ అయితే డైరెక్టుగా 'పాయింట్' మాట్లాడ్డం మాత్రమే ఉండేది.

మరిప్పుడో?

చెవికి ఫోన్ పెట్టుకునే రోడ్డు క్రాస్ చేస్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, గోడలు తడుపుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఇంకా అన్నీ చేసేస్తున్నాం.      

అసలు మొబైల్ ఫోన్ లేకుండా బ్రతకలేకపోతున్నాం!


కట్ టూ అరిందం చౌధురి - 

ఐఐపిఎం తో అనుబంధం ఉన్న ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఈయన బిజినెస్‌మేన్, ఎకానమిస్టు, రచయిత, కాలమిస్టు, ఎడిటర్, ఫిలిమ్‌మేకర్ కూడా!

ఎన్నో రంగాల్లో, ఎన్నో వ్యాపారాల్లో మునిగి తేలుతూ క్షణం తీరికలేకుండా ఉండే చౌధురి బిజినెస్ కమ్యూనికేషన్ అంతా కేవలం ఎస్ఎమ్ఎస్ ల ద్వారా చేస్తాడంటే నమ్మగలరా? అంతేకాదు. ఈయన్ రాసిన బెస్ట్ సెల్లర్ పుస్తకం "డిస్కవర్ ద డైమండ్ ఇన్ యూ" ని, కేవలం ఎస్ ఎన్ ఎస్ ల ద్వారానే రాశాడంటే నమ్మగలరా? ఆయన పుస్తకాలు చదవండి. మీకే తెలుస్తుంది.

కొన్ని మినహాయింపు సందర్భాలు తప్పకుండా ఉంటాయి. అది వేరే విషయం. కానీ, మొబైల్ ఉంది కదా అని.. ఫోన్ చేయడం అంటే ఇక ఓ గంటలకొద్దీ సొదపెట్టడం కాదు. అదేపనిగా ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్‌లు కొట్టటం కాదు.

మనం చేసే ప్రతి కాల్‌కీ, ప్రతి ఎస్ఎమ్ఎస్ కీ ఒక విలువ ఉండాలి. అది వృత్తిపరంగా కావొచ్చు. వ్యాపారపరంగా కావొచ్చు. ఫ్రెండ్లీగా కావొచ్చు. రొమాంటిక్‌గానూ కావొచ్చు. ఇంకేదయినా సందర్భం కావొచ్చు.

సుత్తిలేకుండా సూటిగా ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ .. 

Wednesday 5 February 2014

"ఆనందోబ్రహ్మ" నామ సంవత్సరం!

ఐక్యరాజ్యసమితి దాదాపు ప్రతిసంవత్సరానికీ ఏదో ఓ టాగ్ తగిలించి వదుల్తుంది. అలా 2014 ను "అంతర్జాతీయ ఫ్యామిలీ ఫార్మింగ్ సంవత్సరం" గా ప్రకటించింది.

ఇంతకు మించి ఐక్యరాజ్యసమితి ఏదయినా చేస్తుందో లేదో నాకు అంతగా తెలియదు. చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో చదువుకున్నదాని ప్రకారమయితే అది ఎంతో చేయాలి. కానీ, వాస్తవంలో అలా జరగటం లేదన్నది ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోంది.

ప్రపంచమంతా ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు, ఎంత వివక్ష, ఎంత అవినీతి, ఎంత అణచివేత? ...

అదలా వదిలేద్దాం.


కట్ టూ మా "యూ ఎన్ ఓ" --

మొన్నొకరోజు నా యూనివర్సిటీ మిత్రుడు దాము కలిశాడు. "బ్రదర్! తెల్లారి లేస్తే లైఫ్‌లో ఇవన్నీ ఉండేవే.  అందుకే 2014 ను నేను 'ఇయర్ ఆఫ్ ప్లెజర్ అండ్ ఎంజాయ్‌మెంట్' గా ప్రకటించేశాను. అదే చేస్తున్నాను" అన్నాడు!

అంతేనా.. "అన్నీ పక్కనపెట్టాను. దేనిగురించీ అదే పనిగా టెన్షన్ పడిపోవడంలేదు. జస్ట్ ఎంజాయింగ్ 2014. అంతే!!" అని కూడా అన్నాడు నా మిత్రుడు.

ఏదో ఊరికే అలా అనటం మాత్రమే కాదు. అక్కడ ఆ ఆనందం అంతా బ్రహ్మాండంగా కనిపిస్తోంది! నా మిత్రుని ముఖంలోనూ తను చెప్పిన ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

అక్కడి ఆ ఆనందం కాసేపు నేనూ షేర్ చేసుకున్నాక .. నా మిత్రునితోపాటు, అక్కడే పరిచయమైన కొత్త మిత్రుడు ప్రవీణ్‌కు కూడా "బై" చెప్పి అక్కడినుంచి బయటపడ్డాను.


కట్ టూ నా అంతర్మథనం --

కార్లో శివం, యూనివర్సిటీ రోడ్లమీదుగా ఇంటికివస్తూ ఆలోచించసాగాను.

ఏదో ఒక సమస్య అనేది లేకుండా మనిషి జీవితం అనేది ఉండదు. ఒకవేళ, బై మిస్టేక్, అలా ఎవరైనా ఉన్నారంటే.. అదే ఓ పెద్ద సమస్య అయి కూర్చుంటుంది వారికి!

ఎడతెగకుండా మనల్ని వెంటాడే ఏదో ఓ సమస్య గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ బ్రతకడమా? మనకిష్టమైన జీవనశైలిని జీవించడానికి ప్రయత్నిస్తూనో, జీవిస్తూనో ముందుకి వెళ్లడమా?

మొదటి తరహా జీవితంలో నిరంతరం టెన్షనే. ఎప్పుడూ సమస్యల గురించే ఆలోచిస్తే ఇక జీవితం లేదు.

అలా కాకుండా, రెండో తరహా జీవనశైలిలో కనీసం "లైఫ్" అనేది ఉంటుంది. కొంచెం కష్టమయినా, ఎంతో కష్టమయినా.. మనకిష్టమయిన పని చేస్తూ బ్రతుకుతున్నామన్న ఆనందం కొంతయినా ఉంటుంది.

ఆ ఆనందమే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యనీ అర్థవంతంగా పరిష్కరించుకొనే ఆత్మస్థయిర్యాన్ని, శక్తినీ ఇస్తుందన్నది మనం నమ్మితీరాల్సిన ఒక నిజం.

సో, ఆనందోబ్రహ్మ!