Friday 7 February 2014

మొబైల్ ఫోన్‌ను ఇలా కూడా వాడవచ్చు!

నా కుటుంబం తర్వాత, నాకెంతో ప్రియమైన వస్తువులూ విషయాలూ కొన్నున్నాయి. అవి: కాగితం, పెన్ను, నా శామ్‌సంగ్ నోట్‌బుక్, ఇంటర్‌నెట్ కనెక్షన్. అంతే.

మిగిలినవన్నీ, వ్యక్తిగతంగా, నా దృష్టిలో అంత ముఖ్యమైనవి కావు.

"మరి డబ్బో?" అని మీలో కొందరు అడగొచ్చు.

నిజం. డబ్బు చాలా ముఖ్యమైంది. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలంటే, అసలు డబ్బే చాలా ముఖ్యమైంది. ఈ నిజం తెలుసుకొనేటప్పటికే చాలా మంది చేతులు కాల్చేసుకుంటారు. లేదా, అప్పటికే ముసలాళ్లు అయిపోతారు! దీనికి నేను కూడా మినహాయింపేమీ కాదు ..

మళ్లీ పాయింట్‌కి వద్దాం. "మరి డబ్బో?" అన్నది మీ ప్రశ్న.

పైన నేను చెప్పిన ఆ నాలుగూ ఉంటే చాలు. డబ్బు జేబులో ఉన్నట్టేనని నా వ్యక్తిగత నమ్మకం. అనుభవం కూడా.

వృత్తిపరంగా చూసినా, వ్యక్తిగతంగానైనా.. ఆ నాలుగే నాకెంతో ప్రియమైన నేస్తాలు. ముఖ్యంగా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో.

పైన నేను ఇచ్చిన లిస్టులో 'మొబైల్ ఫోన్' లేకపోవడం మీరు గమనించే ఉంటారు. నాకు అత్యంత అయిష్టమైన వస్తువుల లిస్టులో అన్నిటికంటే టాప్ పొజిషన్లో ఉండేది మొబైల్ ఫోనే!

నేను ఖాళీగా ఉన్నంత సేపూ ఒక్క ఫోనూ రాదు. ఏ బ్రేక్‌ఫాస్టుకో, భోజనానికో కూర్చుని మొదటి ముద్ద తింటూ అనుకుంటాను.. "చూడు, ఇప్పుడు ఖచ్చితంగా కాల్ వస్తుంది!" అని. వచ్చితీరుతుంది.

ఇక.. వాష్ రూమ్‌కి వెళ్లొచ్చిన రెండు నిమిషాల్లోనే కనీసం రెండు మిస్స్‌డ్ కాల్స్ ఉంటాయి. వాటిని చూసుకుని నేను మళ్లీ ఫోన్ చేసినప్పుడు అవతల నుంచి నేను వినే డైలాగ్ సాధారణంగా ఇలా ఉంటుంది: " ఫోనెత్తవేంటీ?" అని!

ఈ లెక్కన ఎవరు మనకు ఫోన్ చేస్తారా అని ఎదురుచూసుకుంటూ మనం కనీసం వాష్ రూమ్‌కు కూడా వెళ్లొద్దన్నమాట!


కట్ టూ ఓల్డెన్ డేస్ -

నిజానికి అవి గోల్డెన్ డేస్. మొబైల్ ఫోన్ వచ్చాకే అంతా సర్వనాశనమైపోయింది. ఇప్పుడిక యాండ్రాయిడ్స్, వాట్సాప్‌లు వచ్చి జీవితాన్ని ఊపిరితీసుకోకుండా చేస్తున్నాయి.

అంతకు ముందే నయం. ఎక్కడో, ఎవరింట్లోనో ఒక లాండ్ ఫోన్ ఉండేది. ఆ "పీపీ" నంబర్‌నే అందరికీ ఇచ్చుకునేవాళ్లు. ఆ పీపీ ఫోన్లో ఒక్క రెండు నిమిషాలు మాట్లాడితే అప్పుడు ఎంత ఆనందమో!

ఎందుకంత ఆనందమంటే - అప్పుడు అలా మనకు ఫోన్ చేసినవాళ్లు కేవలం మనవాళ్లో, మన ఆత్మీయులో, లేదంటే.. మన నిజమైన స్నేహితులో. అంతే. ఒకవేళ అది వృత్తి, వ్యాపారపరమైన ఫోన్ అయితే డైరెక్టుగా 'పాయింట్' మాట్లాడ్డం మాత్రమే ఉండేది.

మరిప్పుడో?

చెవికి ఫోన్ పెట్టుకునే రోడ్డు క్రాస్ చేస్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, గోడలు తడుపుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఇంకా అన్నీ చేసేస్తున్నాం.      

అసలు మొబైల్ ఫోన్ లేకుండా బ్రతకలేకపోతున్నాం!


కట్ టూ అరిందం చౌధురి - 

ఐఐపిఎం తో అనుబంధం ఉన్న ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఈయన బిజినెస్‌మేన్, ఎకానమిస్టు, రచయిత, కాలమిస్టు, ఎడిటర్, ఫిలిమ్‌మేకర్ కూడా!

ఎన్నో రంగాల్లో, ఎన్నో వ్యాపారాల్లో మునిగి తేలుతూ క్షణం తీరికలేకుండా ఉండే చౌధురి బిజినెస్ కమ్యూనికేషన్ అంతా కేవలం ఎస్ఎమ్ఎస్ ల ద్వారా చేస్తాడంటే నమ్మగలరా? అంతేకాదు. ఈయన్ రాసిన బెస్ట్ సెల్లర్ పుస్తకం "డిస్కవర్ ద డైమండ్ ఇన్ యూ" ని, కేవలం ఎస్ ఎన్ ఎస్ ల ద్వారానే రాశాడంటే నమ్మగలరా? ఆయన పుస్తకాలు చదవండి. మీకే తెలుస్తుంది.

కొన్ని మినహాయింపు సందర్భాలు తప్పకుండా ఉంటాయి. అది వేరే విషయం. కానీ, మొబైల్ ఉంది కదా అని.. ఫోన్ చేయడం అంటే ఇక ఓ గంటలకొద్దీ సొదపెట్టడం కాదు. అదేపనిగా ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్‌లు కొట్టటం కాదు.

మనం చేసే ప్రతి కాల్‌కీ, ప్రతి ఎస్ఎమ్ఎస్ కీ ఒక విలువ ఉండాలి. అది వృత్తిపరంగా కావొచ్చు. వ్యాపారపరంగా కావొచ్చు. ఫ్రెండ్లీగా కావొచ్చు. రొమాంటిక్‌గానూ కావొచ్చు. ఇంకేదయినా సందర్భం కావొచ్చు.

సుత్తిలేకుండా సూటిగా ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ .. 

2 comments:

  1. మనోహర్ గారూ, నమస్కారం. సొసైటీలకు పనికొచ్చే సినిమాలు అనే మీ పోస్ట్ మీద శ్రీరామ్ అనే వ్యక్తి చేసిన విమర్శలకు మీరు కూల్‌గా సమాధానం ఇవ్వటం బాగుంది. కానీ, చందు తులసి అనే ఆవిడ విమర్శలకు మీరు ఎందుకనో సమాధానం ఇవ్వలేదు. మీరు వాటిని చూడలేదేమో. వాటిని చూసి సహేతుకమైన చర్చను కొనసాగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. నమస్కారం! తేజస్వి గారూ, చందు తులసి గారి కామెంట్స్‌కి తప్పకుండా నేను సమాధానం ఇస్తాను. పనుల వత్తిడివల్ల వెంటనే ఇవ్వటం కుదర్లేదు. రేపు ఆదివారం కదా.. ఆ పని పూర్తిచేస్తాను. :)

      ఈ విషయ్మ్ గురించి నాకు తెలియజేసినందుకూ, ముందటి నా రెస్పాన్స్‌ను మెచ్చుకున్నందుకూ మీకు ధన్యవాదాలు, తేజస్వి గారూ! ..

      Delete