Wednesday 13 January 2021

నా బ్లాగింగ్ ఇకనుంచీ మ్యాగజైన్ రూపంలోనే!

ఇంతకుముందే ఒకటిరెండుసార్లు వేర్వేరు పోస్టుల్లో చెప్పాను... నా బ్లాగింగ్ ప్యాషన్‌కి ఎక్స్‌టెన్షన్ లాంటిది 'మనోహరమ్' వెబ్ మ్యాగజైన్ అని.   

గత కొన్ని వారాలుగా బేటా రూపంలో వస్తున్న మనోహరమ్ డిజిటల్ మ్యాగజైన్, ఈ ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో రాబోతోంది. 

జనవరి 28 నాడు మనోహరమ్ మ్యాగజైన్ అఫీషియల్ ప్రాంభం ఉంటుంది. 

మ్యాగజైన్ ఫైనల్ వెర్షన్ రూపం జనవరి 28 నాడు లాంచ్ చేస్తున్న మనోహరమ్ ఫిబ్రవరి సంచిక నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్‌గా ప్రతి నెలా 1వ తేదీ నాడు 00.10 గంటలకు పబ్లిష్ అవుతుంది. 

కట్ చేస్తే - 

ఇక నుంచీ ప్రత్యేకంగా నేను నగ్నచిత్రం బ్లాగ్‌లో బ్లాగింగ్ చేయటం ఉండదు. బహుశా ఇదే ఈ బ్లాగ్‌లో చివరి పోస్టు. 

సక్సెస్ సైన్స్, సినిమాలు, సరదాలు - ఈ మూడే (మైండ్‌సెట్, మూవీస్, మస్తి) ప్రధాన విభాగాలుగా - మనోహరమ్ మ్యాగజైన్‌లో నా బ్లాగింగ్ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. 

ప్రధాన అగ్రిగేటర్ అయిన మాలిక, మొదలైన వాటిల్లో మనోహరమ్ అప్‌డేట్స్ ఉంటాయి. 

సమస్యల్లా ఒక్కటే. మంత్లీ అప్‌డేట్స్ కాబట్టి అగ్రిగేటర్లలో రెగ్యులర్‌గా మనోహరమ్‌లోని ఆర్టికిల్స్ ఎట్సెట్రా కనిపించే ఆస్కారం ఉండదు. ఈ లోటుని ఎట్లా భర్తీ చేయొచ్చో ఆలోచించాలి.  

మిత్రులు, శ్రేయోభిలాషులు... మీ అభిప్రాయాలు, సలహాలను నాకు మనోహరమ్ ద్వారా కూడా అందించగలరని సవినయ మనవి. 

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో,
- మీ... మనోహర్ చిమ్మని
Editor, 'Manoharam', Elite Web Magazine

Sunday 10 January 2021

ప్రణయ్ పుట్టినరోజు

ఉదయం 10.45...

సరిగ్గా 24 ఏళ్ళక్రితం... ఇదే సమయానికి నేను కర్నూలు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్‌లో ఉన్నాను. 

పొద్దున 6 గంటలకే నా భార్య సుజాతను హైద్రాబాద్‌లోని ధరమ్ కరణ్ రోడ్‌లో ఉన్న వాళ్ల అమ్మవాళ్లింటినుంచి బేగంపేటలో ఉన్న డాక్టర్ సవితాదేవి గారి స్వప్న నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్ళారు. 

ఎర్రమంజిల్ నుంచి సుజాత వాళ్ళ అక్కవాళ్ళు వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళారు. 

వాళ్ళంతా చాలా బాగా చూసుకుంటారు అన్న విషయం నాకు తెలుసు. అయినా సరే, చాలా టెన్షన్...  

నేనప్పుడు కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎమ్ లో పనిచేస్తున్నాను. ఆఫీసుకెళ్ళి, లీవ్ పెట్టి హైద్రాబాద్ బయల్దేరాను. 1997 అది. ఇప్పట్లా మొబైల్ ఫోన్స్ అప్పుడు లేవు. గౌలిగూడ బస్ స్టాండ్‌లో దిగాకనే పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చెయ్యాలి. 

కట్ చేస్తే - 

నేను మధ్యాహ్నానికి ఎర్రమంజిల్ చేరుకున్నాను. అక్కడినుంచి బేగంపేట స్వప్న నర్సింగ్ హోమ్ కి వెళ్ళాను. 

అప్పుడే డాక్టర్స్ సుజాతను లోపలికి సిజేరియన్ కోసం తీసుకెళ్తున్నారు. డాక్టర్ సవితాదేవి నాకు 2 నిమిషాలు అంతా వివరంగా చెప్పారు. పేపర్స్ పైన నా సంతకాలు తీసుకున్నారు. స్ట్రెచర్ మీద సుజాత ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళారు స్టాఫ్. 

కట్ చేస్తే - 

3 గంటల 15 నిమిషాలకు డాక్టర్స్ బయటకొచ్చి చెప్పారు:

"అబ్బాయి పుట్టాడు. ఇద్దరూ బాగున్నారు" అని. 

ఓ గంట తర్వాత రూమ్‌కి - ఒక తెల్లటి కోన్‌లో పింక్ కలర్ ఐస్‌క్రీమ్‌ను చుట్టి తీసుకొచ్చినట్టు - మా ప్రణయ్‌ని తీసుకొచ్చారు నర్స్‌లు. 

అప్పుడే పుట్టిన చిన్న పిల్లలను అంత దగ్గరగా చూడటం నాకు అదే మొదటిసారి. అదొక అద్భుతమైన ఫీలింగ్...

చూస్తుంటే 24 ఏళ్ళు గడిచాయి.

నిజంగా ఒక్క కంప్లయింట్ లేదు...

సెయింట్ పీటర్స్ నుంచి-ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి-బెంగుళూరు జైన్ యూనివర్సిటీ వరకూ... ప్రతి దశలోనూ... చదువులో ఎప్పుడూ టాప్.

త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నాడు.  

నేనే మంచి తండ్రిని కాలేకపోయాను... 

హాప్పీ బర్త్‌డే ప్రణయ్!

Saturday 9 January 2021

మనోహరమ్ ఎలైట్ వెబ్ మ్యాగజైన్

సాంకేతికంగా, కంటెంట్ పరంగా కూడా మనోహరమ్ మ్యాగజైన్ బేటా వెర్షన్‌లో అన్ని ప్రయోగాలూ పూర్తయ్యాయి.

మొన్న జనవరి 1 నుంచే మ్యాగజైన్ పూర్తి వెర్షన్‌ను ప్రారంభిద్దామని అనుకున్నాను. కొన్ని ప్రొఫెషనల్ కారణాలవల్ల, ఇంకా, నా శ్రేయోభిలాషులైన కొందరు పెద్దవాళ్ల సలహా అనుసరించి కూడా ఆ పని చేయలేదు. 

మనోహరమ్ మ్యాగజైన్ పూర్తి వెర్షన్ అఫీషియల్‌ లాంచ్‌ ఈ నెల 28 వ తేదీనాడు ఉంటుంది.

ఎవరు లాంచ్ చేస్తారన్నది 2, 3 రోజుల ముందు తెలియజేస్తాను. 

ఫిబ్రవరి సంచిక నుంచి "మనోహరమ్" తెలుగులో ఒక పూర్తిస్థాయి ఎలైట్ వెబ్ మ్యాగజైన్ రూపం సంతరించుకొంటోంది. రెగ్యులర్‌గా ప్రతి నెలా 1వ తేదీ నాడు 00.10 గంటలకు పబ్లిష్ అవుతుంది. 

కట్ చేస్తే - 

ప్యాషన్, పాజిటివ్ దృక్పథమే ప్రధానంగా - నా బ్లాగింగ్‌ హాబీకి పూర్తిస్థాయి ఎక్స్‌టెన్షన్ ఈ మ్యాగజైన్.

ఇంతకుముందు కూడా ఒక పోస్టులో చెప్పినట్టు... సక్సెస్ సైన్స్-సినిమాలు-సరదాలు (Mindset-Movies-Masti)... ఈ మూడే ప్రధాన విభాగాలుగా నేను ప్లాన్ చేసిన ఈ మ్యాగజైన్ పూర్తిగా ఒక బిందాస్ పాజిటివ్ మ్యాగజైన్.

పాలిటిక్స్, హేట్రెడ్‌కు ఇందులో స్థానం లేదు. 

ఏ రంగంలోంచి ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినా-లేదా- అతడు/ఆమె గురించి ఒక స్టోరీ రాసినా, అది సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలోనే ఉంటుంది. 

కథలు, కవితలు కూడా ఇలాగే ఉండాలన్న రూల్ లేదు. క్రియేటివిటీ అనేది ఎలాంటి తూనికలకు లొంగాల్సిన అవసరంలేదు. ఇంకొక వ్యక్తినో, వర్గాన్నో బాధపెట్టకుండా ఉంటే చాలు.

జీవితం పట్ల, జీవనశైలిపట్ల పాజిటివ్ దృక్పథమే ప్రధానం. 

ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న ప్లానింగ్స్, రీప్లానింగ్స్ అన్నీ దాటుకొని - మ్యాగజైన్‌ను ఒక ఫైనల్ వెర్షన్‌కు తీసుకురాగలిగాను.

ఫైనల్ వెర్షన్ రూపం జనవరి 28 నాడు లాంచ్ చేస్తున్న మనోహరమ్ ఫిబ్రవరి సంచిక నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు. 

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు... మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలం. అందరికీ నా వందనాలు.  

Friday 8 January 2021

2021 లో మొదటి 8 రోజులు

"ఒకసారి పబ్లిక్‌లోకి వచ్చాక పర్సనల్ అంటూ ఏమీ ఉండదు!"

ఇలా అని గతంలో పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ గురించి అంటుండేవాళ్ళు.

కాని, సోషల్ మీడియా వచ్చాక, ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోయింది! 

మరీ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యాండ్రాయిడ్ వాడే ప్రతి సగటు మనిషి జీవితాన్ని ఒక రచ్చబండ చేసేశాయి. 

బయటివాడెవడో అస్సలు తనకు సంబంధం లేనివాని పర్సనల్ విషయాల్ని గెలకటం ఒక టైపు రచ్చ. కాగా, ఎవరికివారే వాళ్ల కుటుంబ విషయాల్ని, ఇతర పర్సనల్ విషయాల్ని ఓపెన్‌గా వాల్స్ పైన పెట్టుకోవడం ఇంకో టైపు రచ్చ. పైగా, వీటికి లైక్ కొట్టి కామెంట్ చెయ్యలేదని అలకలూ, నిష్టురాలూ... కొండొకచో ఆ విషయం మీద కూడా పోస్టులు, ట్వీట్లు! 

కట్ చేస్తే - 

9 నెలల పాండెమిక్-లాక్‌డౌన్ ప్రభావమైనా మనలో కనీసం ఒక్క శాతం మార్పునైనా తీసుకురాలేదంటే - మనలో ఏదో లోపం ఉన్నట్టే! ముందు దానిగురించి ఆలోచించాలి. 


జర్నలింగ్-లేదా-డైరీ రాసుకోవడంలో తప్పులేదు. ఒక మంచి అలవాటు కూడా! దానివల్ల అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి 24 గంటలకు ఒకసారి మనకి మనం చూసుకుంటాం. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతాయుతంగా ముందుకెళ్తుంటాం.

చాలావరకు బ్లాగింగ్ కూడా ఇలాంటిదే. ఎన్నో దురలవాట్లకంటే ఈ ఎడిక్షన్ చాలా బెటర్. బ్లాగింగ్‌లో రిఫ్లెక్ట్ అయ్యే మన ఆలోచనా విధానం, మన మైండ్‌సెట్ ఎటుపోతున్నాయో మనకు తెలుస్తుంటుంది. మనం ఎటుపోతున్నామో కూడా మనకు తెలుస్తుంది.

బ్లాగింగ్ మంచి స్ట్రెస్‌బస్టర్ కూడా. 

వ్యక్తిగతంగా అయినా, వృత్తిపరంగా అయినా - సోషల్‌మీడియాను నిజంగా బాగా ఉపయోగించుకోగలిగితే చాలా విషయాల్లో అదొక గోల్డ్ మైన్ అంటే అతిశయోక్తికాదు. 

సోషల్‌మీడియాకు సంబంధించినంతవరకూ... 2021లో నేను పూర్తిగా ఆ దిశలోనే వెళ్తున్నాను. మిగిలిన అన్ని విషయాల్లో 10 రెట్లు వేగం పెంచాను. 

సమయం చాలా విలువైంది. అది ఎవ్వరికోసం ఆగదు. 

జీవితం ఒక్కటే. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. 

Friday 1 January 2021

Happy New Year !!

న్యూ ఇయర్ అయినా, ఉగాది అయినా... కొత్త సంవత్సరం అని నాకు ప్రత్యేకంగా సెంటిమెంట్లు ఎప్పుడూ లేవు. కాని, పెద్దలు ఇలాంటివి ఊరికే పెట్టలేదు అనేది మాత్రం చాలా గట్టిగా నమ్ముతాను. 

ఇలాంటిదేదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప మనం కొన్ని  నిమిషాలయినా ఆగి, అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాను, ఎన్ని బాధ్యతలున్నాయి, టైమ్ చూసుకుంటున్నామా అసలు... అనే యాంగిల్‌లో ఫోకస్‌డ్‌గా  ఆలోచించము. ఈ కోణంలో నాకు ఉగాది చాలా ముఖ్యమైంది. అలాగే న్యూ ఇయర్ కూడా. 

కట్ చేస్తే - 

రాత్రి నుంచి ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రతి గ్రీటింగ్,  ప్రతి మెసేజ్‌కూ రిప్లై ఇచ్చాను. నేనుగా ఒకరిద్దరు పెద్దవాళ్లకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. 

2021 లో కనీసం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. 2 పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాను.  

ఇవి ప్రత్యేకంగా గోల్స్ లాంటివి కాదు. ప్రొఫెషనల్‌గా నా పనిలో భాగం. చేస్తున్నాను. అంతే.