Wednesday 31 January 2024

ది రియల్ యానిమల్స్ !!


సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. సద్గురు ఆశ్రమం కాదు సందేశాలివ్వడానికి. 

కట్ చేస్తే - 

మన దేశంలో సంవత్సరానికి 1500 నుంచి 2000 వరకు సినిమాల్ని, సుమారు 20 భాషల్లో నిర్మించి, రిలీజ్ చేస్తారు. 

వీటిలో 99% సినిమాల ప్రధాన లక్ష్యం: వినోదం, డబ్బు మాత్రమే. 

ఈ 99% సినిమాల్లో కేవలం 5 నుంచి 10% సినిమాలు మాత్రమే విజయం సాధిస్తాయి. లాభాల్ని తెచ్చిపెడతాయి. అది వేరే విషయం. 

ఇన్ని సినిమాల్లో అన్నీ అందరికీ నచ్చాలని రూలేం లేదు. 

మనం చూసిన ఒక సినిమా నచ్చనప్పుడు - మనల్ని మనం తిట్టుకోవచ్చు. ఎవ్వడూ మనల్ని గల్లా పట్టుకొని "నా సినిమా చూడు" అనటం లేదు. మెడ మీద కత్తిపెట్టడం లేదు. 

ఒక అడుగు ముందుకేసి, ఆ డైరెక్టర్‌ను కూడా నాలుగు మాటలు అనొచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ మనంత ఇంటలెక్చువల్ కాదు కాబట్టి... మన అంచనాల ప్రకారం, మన అతి తెలివి రేంజ్‌లో ఆ డైరెక్టర్ ఆ సినిమా తీయలేదు కాబట్టి. 

చలో... ఫుల్లీ జస్టిఫైడ్. 

కాని -

మనకు వ్యక్తిగతంగా నచ్చని ఒక సినిమా - అవతల ఇంకెవ్వరికీ నచ్చకూడదు అనుకోవడం ఒక అతి పెద్ద మానసిక వ్యాధి. 

ఇలాంటి వ్యాధిగ్రస్తులు సమాజంలో కొందరే ఉంటారు. 

అతి తక్కువ జనాభా. 

వీరి వల్ల కమర్షియల్ సినిమాల టికెట్స్ తెగవు... బ్లాక్‌బస్టర్ హిట్లు కావు... లాభాలు రావు. 

అందుకే వీరిని ఫిలిం మేకర్స్ అసలు పట్టించుకోరు. 

కాని, వీరు మాత్రం, వీరలెవెల్లో తమ సూడో-ఇంటలెక్చువాలిటీని కుమ్మరిస్తూ, ఫేస్‌బుక్ నిండా ఒక్కో సినిమా మీద నానా రాతలు రాస్తుంటారు... అక్కడక్కడా ఒక ఇంగ్లిష్ పదాన్ని అలా పడేస్తూ. 

అసలు వీళ్ళంతా చైనాకు పోయి ఇంగ్లిష్ ట్యూషన్స్ చెప్పుకోడానికే పనికొస్తారని సందీప్ వంగా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. అది వేరే విషయం.   

కట్ చేస్తే -    

ఇవ్వాళ ఉదయం ఫేస్‌బుక్‌లో - "యానిమల్" సినిమా మీద - ఒక సింగిల్ లైన్ పోస్టు చూశాను. 

ఆ పోస్టుని సమర్థిస్తూ, పోస్టు కింద షరా మామూలుగా కొన్ని అత్యుత్సాహపు కామెంట్స్ కూడా ఉన్నాయి. 

ఆ పోస్టు, ఆ కామెంట్స్ సారాంశం క్లుప్తంగా ఏంటంటే - 

> జంతువులు కూడా ఆ ఛండాలాన్ని చూడవు.
> ఆ సినిమాలో అసలు ప్లాట్ లేదు. 
> ఆ సినిమా ఒక షిట్.
> డైరెక్టర్ సందీప్ వంగా వెంటనే సైకియాట్రిస్టును కలవాలి.
> ఈ సినిమా చూసి దాన్ని సక్సెస్ చేసినవాళ్ళంతా వెధవలు.  

మొన్న జనవరి 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా 917 కోట్ల కలెక్షన్ చేసిన "యానిమల్" సినిమాను అంత ఈజీగా వీళ్ళు షిట్ అనుకున్నా, ఛండాలం అనుకున్నా ఆ డైరెక్టర్-ప్రొడ్యూసర్స్‌కు నష్టమేం లేదు. 

కాని, వీళ్ళకు నచ్చని సినిమా ఇంకెవ్వరికీ నచ్చకూడదా? 

ఈ సినిమా చూసినవాళ్ళంతా "వెధవలు" అనటం నిజంగా ఎంత వెధవతనం?  

అసలు - 
ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అంత భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టిన అన్ని కోట్ల మంది ప్రేక్షకులా వెధవలు? లేదంటే, ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత సినిమా చూసి ఇలాంటి రివ్యూలు రాసే సోకాల్డ్ ఇంటలెక్చువల్సా వెధవలు? 

ఇట్స్ రియల్లీ వెరీ ఛండాలమ్ ఈవెన్ టు థింక్ అబౌట్ దీజ్ గైజ్... యు నో...

- మనోహర్ చిమ్మని 

Friday 26 January 2024

"పద్మవిభూషణ్" మెగాస్టార్ చిరంజీవి !!


ఏదైనా సరే, ఒక రంగంలో అప్రతిహతంగా నాలుగు దశాబ్దాలుగా విజయపథంలో కొనసాగుతుండటం అంత సులభం కాదు. 

గొప్ప సంకల్పం, చెదరని ఏకాగ్రత, నిరంతర కృషి ఎంతో అవసరం. 

అది అందరివల్లా కాదు. అంత సులభం కాదు.    

సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో - ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి గారు సినీరంగంలో ఒక ఎవరెస్టు శిఖరం. నా స్కూలు స్థాయి నుంచి, నా కళ్ళముందు రూపొందిన, నేను చూసిన ఒక గొప్ప సక్సెస్ స్టోరీ.   

"పద్మవిభూషణ్" మెగాస్టార్ చిరంజీవి గారికి హార్దిక శుభాకాంక్షలు.

- మనోహర్ చిమ్మని   

Saturday 13 January 2024

జనవరి 13, ఒక జ్ఞాపకం!


సరిగ్గా 6 ఏళ్ళ క్రితం జనవరి 13 నాడు నేను వైజాగ్‌లో మొదటిసారిగా నా స్టుడెంట్ ఒకరి ఇంటికి వెళ్ళాను.

చాలా క్యాజువల్ విజిట్ అనుకొనే వెళ్ళాను. 

కాని, ఆ లొకేషన్ నన్ను చాలా ఆకట్టుకొంది. అసలు అలాంటి ఒక ప్లేస్‌లో, సిటీకి దూరంగా, ప్రకృతి మధ్య, జస్ట్ ఒక 15 మంది... ఎలా అంత అభిరుచితో అంత బాగా ఇళ్ళు కట్టుకొని ఉన్నారన్నది ఇప్పటికీ నాకు జవాబు దొరకని ప్రశ్నే. 

కాలనీ చుట్టూ కొండలు, చెట్లు. 

కనుచూపు మేరలో ఇంక వేరే ఇళ్ళు లేవు. 

బహుశా ఇప్పుడిప్పుడే మెల్లగా ఆ కాలనీ సిటీకి కనెక్ట్ అవుతున్నదేమో నాకు తెలీదు. ఒక 2 ఏళ్ళుగా ఈ మధ్య నేను మళ్ళీ అటు వెళ్ళలేదు. మధ్యలో వైజాగ్ వెళ్ళినా, నాకు అంత బాగా నచ్చిన ఆ "తపోవనం"కు మళ్ళీ వెళ్ళలేకపోయాను. 

కట్ చేస్తే - 

ఆ మధ్య నేను పబ్లిష్ చేసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం కోసం ఒక కాన్సెప్ట్ అనుకొని, రాయటం ప్రారంభించింది ఆ కాలనీలో మా స్టుడెంట్ ఇంట్లోని గెస్ట్ రూం నుంచే.

దాంతో పాటు ఒక ఫిలిం స్క్రిప్ట్ కూడా ఆ 2 రోజుల్లోనే ప్రారంభించి... హుక్, ప్లాట్ పాయింట్, కొన్ని కీ-సీన్స్ కూడా రాసుకున్నాను.

ఫ్యూచర్‌లో నేను సినిమా ఏదైనా చేస్తే, నాకు నచ్చిన ఈ తపోవనంలో కనీసం ఒక 2 రోజులు షూట్ చెయ్యాలని గట్టిగా అనుకున్నాను. 

ఇప్పుడా సమయం వచ్చింది. 

ఫిబ్రవరి-మార్చి అంతా షూటింగ్ షెడ్యూల్ అయి ఉంది.  

అక్కడ కాలనీలో ఉన్న దాదాపు ప్రతి ఇల్లు, ప్రతి చెట్టూ, ప్రతి మొక్కా, ప్రతి యాంగిల్ నాకింకా గుర్తున్నాయి. అక్కడున్న ఒక బుజ్జి బండరాయిని కూడా నేనింకా మర్చిపోలేదు. ఆ బండను కూడా చాలా అందంగా ఎలాగో ఫ్రేమ్‌లోకి తీసుకోవాలి. 

కాని, అసలక్కడ నేను షూటింగ్ చేస్తానా లేదా అన్నది ఇప్పుడు నాకో బిగ్ కొశ్చన్...

ఎందుకంటే - 

శుభ్రత, పరిశుభ్రత, మొక్కలు, గ్రీనరీ... ఇలాంటివాటికి పెట్టింది పేరు నా స్టుడెంట్ దంపతులు. డీసెన్సీ, డిగ్నిటీ వారి డీయన్యేలోనే ఇన్-బిల్ట్‌గా ఉందా అన్నట్టుగా ఉంటారిద్దరూ. మరి మన ఫిలిం షూటింగ్ అంటే కనీసం ఒక 60 మంది టీమ్ ఉంటారు. ఎంత సుకుమారంగా పనిచేసినా కూడా అక్కడ నానా కంగాళీ అవుతుంది. ప్రతిరోజూ ప్యాకప్ చెప్పేదాక ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా బోల్డన్ని ఉంటాయి. 

నా స్టుడెంట్ దంపతులు, వాళ్ళ నేబర్స్ ఇవన్నీ భరిస్తారా? 

లేదంటే, అక్కడ క్రియేట్ అయిన నాస్తాల్జియా కేవలం ఒక నాస్తాల్జియాగానే నాలో మిగిలిపోతుందా?    
    
What to do Raju garu... 

- మనోహర్ చిమ్మని 

Monday 8 January 2024

ఆఫీస్ ఎక్కడ?


"ఎక్కడ బావా, మీ ఆఫీసు?"

"ఎర్రగడ్డ బావా!"

మొన్నటిదాకా తెలంగాణ గవర్నమెంట్‌లో డిప్యూటీ సెక్రెటరీగా పనిచేసిన నా యూనివర్సిటీ ఫ్రెండ్ ప్రతాప్ ఇందాకే నాకు కాల్ చేశాడు. వాడి ప్రశ్నకు జవాబివ్వగానే 2 నిమిషాలు పడీపడీ నవ్వాడు. అనుబంధంగా మరికొన్ని జోక్స్ వేసుకుని నవ్వుకొన్నాము.  

కట్ చేస్తే - 

మా ఆఫీస్ అడ్రసుకు సంబంధించి పై సమాధానం విన్న ప్రతి పది మందిలో 9 మంది నవ్వుతారు. ఎందుకన్నది నేను వివరించి చెప్పాల్సిన పన్లేదు. 

జోక్స్ ఎలా ఉన్నా, ఇప్పుడు నేను ఎమ్‌డి గా పనిచేస్తున్న ఈ ఆఫీసు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు. నా మిత్రుడు పరమేశ్వర రెడ్డి గారిది. ఆయనకింకా 3 ఆఫీసులున్నాయి ఇదే కాంప్లెక్స్‌లో. ప్రమోషన్ విషయంలో తనకు సహాయంగా ఉంటానని నన్నొక కంపెనీకి ఎండిగా చేశారు. అది వేరే విషయం.  

దీన్నే నేనిప్పుడు నా ఫిలిం ప్రొడక్షన్ హౌజ్‌గా పూర్తి స్థాయిలో వాడుతున్నాను. 

ఆల్రెడీ 3 సినిమాలు, 2 వెబ్ సీరీస్‌లు, 2 మ్యూజిక్ వీడియోల నిర్మాణం కోసం ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఇదే ఆఫీసులో సీరియస్‌గా జరుగుతోంది. ఇతర క్రియేటివ్ & కంటెంట్ రైటింగ్ సర్విసెస్ కూడా ఇదే ఆఫీస్‌లో ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. కొన్ని ఈవెంట్స్ ప్లానింగ్‌లో కూడా బిజీగా ఉన్నాం.    

హాట్ న్యూస్ ఏంటంటే - ఈ నెలలోనే మా ఆఫీసుని సుచిత్ర వైపు షిఫ్ట్ చేస్తున్నాం. 

ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌజ్ లోకి. 

"ఫిలిం ఇండస్ట్రీకి దూరమవుతుంది" కదా అని కొందరు మిత్రులన్నారు. 12 కిలోమీటర్లు పెద్ద దూరం కాదన్నది నా అభిప్రాయం. 

ముంబైలో ఒక్కో ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసు సిటీకి ఒక్కో మూలన ఉంటుంది. 

కంఫర్ట్ ముఖ్యం. 

ముఖ్యంగా - సీరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా మన సౌలభ్యం మనకు ముఖ్యం. 

మనతో అవసరమున్నవాళ్ళు మన దగ్గరికొస్తారు. మనకు అవసరమున్నవాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. అవసరమైనప్పుడు, మధ్యలో ఎక్కడైనా హోటెల్లో కూడా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. 

ఆఫీసు ఫిలిమ్‌నగర్‌లో ఉన్నదా, ఎర్రగడ్డలో ఉన్నదా, సుచిత్రలో ఉందా అన్నది కాదు పాయింట్. 

ఏం చేస్తున్నాం, ఏం సాధించబోతున్నాం అన్నదే అసలు పాయింట్. 

- మనోహర్ చిమ్మని 

Friday 5 January 2024

ఒక యాక్సిడెంట్ జీవితాన్నే మార్చివేస్తుంది!


సరిగ్గా ఇదే సమయానికి, 12 ఏళ్ళక్రితం, బంజారాహిల్స్‌లోని పిజ్జా కార్నర్ ఎదురుగా జరిగిన యాక్సిడెంట్ నా మొత్తం జీవిత గమనాన్నే మార్చివేసింది. 

ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అర్థమవుతోంది ఏంటంటే... ఈ 12 ఏళ్ళు కూడా నా సమయాన్ని నిజంగా నేను వృధా చేసుకున్నాను. తలకి, ఛాతీకి, చేతులకి బాగా దెబ్బలు తగలటం... 17 ముక్కలైన నా ఎడమ కాలు నిండా నట్స్, బోల్ట్స్, రాడ్స్ ఉండటం పెద్ద విషయం కాదు. 12 ఏళ్ళ క్రితం నా జీవితానికి దొరికిన రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఇది వాస్తవం. 

Not too late... 
Life is f*cking beautiful now. 


కట్ చేస్తే -

అందుకే నాకు ఫేస్‌బుక్ అంటే ఎక్కడో ఓ మూల చాలా ప్రేమ. ఇలాంటివి అప్పుడప్పుడు గుర్తుచేస్తుంటుంది. మనల్ని మనం మరొక్కసారి విశ్లేషించుకొనేలా చేస్తుంది. 

బై ది వే... ఈ యాక్సిడెంట్ తర్వాత నేను బెడ్ రెస్ట్‌లో ఉన్న 8 నెలల్లోనే నా బ్లాగ్ మొదలెట్టాను. తెలుగు యునికోడ్ టైపింగ్ గురించి కూడా అప్పుడే తెలుసుకున్నాను!   

- మనోహర్ చిమ్మని 

Thursday 4 January 2024

హాట్‌చిప్స్ సేల్స్‌మన్ నుంచి ఫిలిం ఇండస్ట్రీలో కెమెరామన్ దాకా!


నేను బంజారా హిల్స్‌లో ఉన్నప్పుడు, పక్కనే ఒక హాట్ చిప్స్ షాప్ ఉండేది. 

అందులో అప్పుడప్పుడూ వెళ్ళి చిప్సూ అవీ కొనుక్కునేవాణ్ణి. 

దాంట్లో చిప్స్ తూకం వేసి ప్యాక్ చేసి ఇచ్చే ఒక తమిళియన్ బాయ్ నన్ను బాగా అబ్జర్వ్ చేసేవాడు. బాగా పలకరించేవాడు.

అక్కడున్న 5 నిమిషాల్లో నన్ను సినిమాలకు సంబంధించి ఏదో ఒకటి అడుగుతుండేవాడు. వాడి ఉత్సాహం చూసి, నేను కూడా ఓపిగ్గా చెప్పేవాన్ని.

కట్ చేస్తే - 

సుమారు 14 ఏళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఫేస్‌బుక్‌లో నాకు కనెక్ట్ అయ్యి "నేను ఫలానా" అని పరిచయం చేసుకున్నాడు అదే కుర్రాడు. 

"మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడిన తర్వాతే నేను సినిమాల్లోకి రావాలనుకున్నాను అప్పుడే. కాని, మీకు చెప్పలేకపోయాను. తర్వాత, చెన్నై వెళ్ళి ఫిలిం ఇండస్ట్రీలో చేరాను. ఇప్పుడు నేను కెమెరామెన్‌గా చేస్తున్నాను. మీరే నాకు ఇన్‌స్పిరేషన్... అంటూ చెప్పుకొచ్చాడు. 

నేను షాక్. 

నాకు తెలీకుండానే నావల్ల ఇంకొకడు ఈ పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడన్నమాట! :-)

అతని పేరు కూడా సెంథిలే కావడం ఇంకో గమ్మత్తు. 

(తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ డిఓపి సెంథిల్, నేను మొదటిసారిగా బ్లాక్‌బస్టర్ పబ్‌లో కలుసుకున్నాం. అప్పుడతను "ఆర్య" సినిమాకు పనిచేస్తున్నాడు. అది వేరే కథ.)  

- మనోహర్ చిమ్మని 

Wednesday 3 January 2024

బ్లాక్‌బస్టర్ కథ


"నా దగ్గర మంచి బ్లాక్‌బస్టర్ హిట్ స్టోరీ ఉంది సర్. మహేశ్‌బాబుకైనా, జూనియర్ ఎన్టీఆర్‌కైనా, అల్లు అర్జున్, రామ్‌చరణ్... ఎవరికైనా సూట్ అవుతుంది. మీరు తీస్తా అంటే స్టోరీ ఫ్రీగా ఇస్తా!" 

కొంచెం అటూఇటూగా ఇలాంటి డైలాగ్ గత కొన్నేళ్ళుగా వింటున్నాను. 

ఇలా చెప్పేవాళ్లంతా కొత్తగా రైటర్ కావాలనుకునేవాళ్ళు. లేదంటే అసలు సినిమాఫీల్డుతో సంబంధం లేనివాళ్ళు. 

రెండో కేటగిరీవాళ్ళను మనం పట్టించుకోనవసరం లేదు...

వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, సినిమాకు ఎవడైనా కథ రాయొచ్చు. అసలు రాసే అవసరం కూడా లేదు. నోటితో ఒక 5 నిమిషాలు చెప్తే సరిపోతుంది అని! 

వీళ్ళ ఫీల్డ్స్ వేరు, వీళ్ళు వేరు. ఎదుటివాడు సినిమావాడైతే చాలు... నానా ఉచిత సలహాలిస్తుంటారు. ఫేస్‌బుక్‌లో సినిమా కథ గురించి పోస్టులమీద పోస్టులు పెడుతుంటారు.  

ఇదంతా ఒక కేటగిరీ. వీళ్ళకు ప్రతి ఫీల్డులో ప్రతి విషయం తెలుసు అని ఫీలింగ్. క్వింటాళ్ళ కొద్దీ ఈగో. నిజంగా ఫీల్డు ఎలా ఉంటుందో, ప్రాక్టికాలిటీ ఏంటో వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు అనుకున్నదే ఫీల్డు. వాళ్ళు అనుకున్నదే కథ. వాళ్ళు చెప్పేలాగే సినిమా ఉండాలి.  

వీళ్ళని మనం పట్టించుకోనవసరం లేదు. ఇదొక సైకలాజికల్ డిజార్డర్. అంతకంటే ఏం లేదు. 

కట్ చేస్తే -

ఫిలిం రైటర్ కావాలనుకొని వచ్చేవాళ్ళ గురించే నా బాధంతా. 

ఫిలిం రైటర్ ప్రొఫెషన్ చాలా మంచి ప్రొఫెషన్. ఒక మంచి స్క్రిప్టు సక్సెస్ అయితే చాలు. డిమాండులో ఉంటారు. ఒక పెద్ద హీరోకి స్క్రిప్ట్ ఇవ్వగలిగిన రైటర్ పారితోషికం బ్రహ్మాండంగా ఉంటుంది. 

ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ కథారచయిత విజయేంద్రప్రసాద్ పారితోషికం నా దగ్గరున్న సమాచారం ప్రకారం సుమారు 3 నుంచి 5 కోట్లు. ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని నిజం. ఒక సినిమాను వందల కోట్లలో నిర్మిస్తున్నప్పుడు, ఆ సినిమాకు మూలమైన కథను సృష్టించిన రైటర్‌కు ఒక 5 కోట్ల పారితోషికం ఇవ్వటం గొప్ప విషయమేం కాదు. అలా ఇవ్వటం న్యాయం కూడా.  

ఇంత పవర్ ఉన్న ఫిలిం రైటింగ్ ప్రొఫెషన్‌లోకి రావాలకునే కొత్త రచయితలు ఎంత సీరియస్‌గా ఆ స్కిల్‌ను నేర్చుకోవాలి? అందులో సక్సెస్ కావడానికి ఎంత ప్లాన్ ఉండాలి? ఎంత కష్టపడాలి? 

కాని, ఇదంతా వద్దు. రైటర్ అయిపోవాలి. ఎలా సాధ్యం? 

"బ్లాక్‌బస్టర్ కథ ఉంది, చెప్తా" అంటారు. చెప్పలేరు. 

ఒక పూర్తి స్క్రిప్టు రాసింది ఏదైనా ఉందా... అంటే నో. 

సంవత్సరమైనా, రెండేళ్ళయినా మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఇదే పాట... "బ్లాక్‌బస్టర్ కథ ఉంది". ఫుల్ స్క్రిప్ట్ ఏదైనా రాశావా అంటే నో. 

మంచి రైటింగ్ స్కిల్స్ ఉండి, అంతకు ముందు పెద్ద పెద్ద రైటర్స్ దగ్గర అసిస్టెంట్స్‌గా కొన్నేళ్ళు పనిచేసి, సంవత్సరంలో 365 రోజులూ ఒక తపస్సులా పూర్తి స్క్రిప్టులు రాస్తూ తిరుగుతున్నవాళ్లకే అవకాశాలు అంత ఈజీగా దొరకటం లేదు. 

అలాంటిది...    

ఊరికే రొటీన్‌గా "కథ చెప్తా" అంటూ తిరుగుతూ, వాళ్ళ జీవితంలో ఎంత విలువైన సమయం వృధా చేసుకుంటున్నారో ఈ ఔత్సాహిక రచయితలు తెలుసుకోగలిగితే బాగుండు...

- మనోహర్ చిమ్మని 

Tuesday 2 January 2024

డిజిటల్ యుగంలో ఆఫీస్ అవసరమా?


కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీ డే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్
స్టూడియోలు, ల్యాబ్స్
ప్రివ్యూ థియేటర్లు, పబ్స్... 

ఈ డిజిటల్ సోషల్ మీడియా యుగంలో... చాలా వ్యాపారాలకు, వృత్తులకు అసలు ఆఫీస్ అవసరం లేదు. 

సినిమాలకు కూడా.

ట్రెడిషనల్ పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య కూర్చుని పని చేయడానికి ఇప్పుడు ఎవరూ ఇష్టపడటంలేదు. 

ముఖ్యంగా... లో అండ్ మిడ్ రేంజ్ సినిమాల విషయంలో ఇప్పుడు ఈ ట్రెండ్ పాక్షికంగానయినా అమలవుతుండటం ఒక మంచి పరిణామం. 

సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్‌ ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్, జూమ్... ఇలా ప్రతి ఆధునిక మీడియా సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా బాగా ఉపయోగపడుతోంది.

కట్ చేస్తే - 

నేను "లైక్‌మైండెడ్ టీమ్" అని ఎప్పుడూ నా ఆలోచనలకు సూటయ్యే టీమ్‌ను వెతుక్కుంటూ ఉండటం వెనకున్న కొన్ని అతిముఖ్యమైన కారణాల్లో ఇది ఒకటి. 

నాలుగు గోడల మధ్య కూర్చొని - వాడి గురించి వీడి గురించి సొల్లు మాట్లాడుకొంటూ టైమ్ వేస్ట్ చేసుకోవటం కంటే అసలు ఆఫీసు లేకపోవడం బెటర్. 

బడ్జెట్ చాలా మిగుల్తుంది. దాన్ని చివర్లో ఫిలిం ప్రమోషన్‌కు వాడుకోవచ్చు. 

"షో లేకపోతే ఎలా" అని ప్రొడ్యూసర్లు, ఇన్వెస్టర్లు ఇలాంటి బోల్డ్ స్టెప్‌కు ఒప్పుకోరు కాని, చిన్న బడ్జెట్ & మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలకు అసలు ఆఫీసు అవసరం లేదు.     

ఆఫీసు లేకుండానే మిలియనేర్లు, బిలియనేర్లు అయినవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అంతర్జాతీయంగా చాలా ప్రొఫెషన్స్‌లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.     

My dream is to dissolve my office altogether, go paperless, and basically only have my laptop as an office. 

I am almost on the verge of achieving this by the end of 2024. Not just for film production. But for any other creative activity and entrepreneurship. 

- మనోహర్ చిమ్మని 

Monday 1 January 2024

ఎవరు ఎక్కడి నుంచయినా ఫిలిం ప్రొడక్షన్ చేయొచ్చు!


సినిమా ఆఫీసు అంటే ఫిలిమ్‌నగర్ చుట్టుపక్కలే ఉండాలా? 

అసలు సినిమా తీయడానికి ఒక ఆఫీసనేది నిజంగా అవసరమా?   

కొత్తగా సినిమా తీయాలనుకొనేవాళ్ళందరికీ ఈ రెండూ చాలా ముఖ్యమైన ప్రశ్నలు. 

కట్ చేస్తే - 

ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసు అనేది ఫిలిమ్‌నగర్ చుట్టుపక్కలే ఉండాలని రూలేం లేదు. అలా ఆలోచించడం అనేది ఉట్టి ట్రెడిషనల్ థింకింగ్. 

ఇప్పుడా అవసరం లేదు.

ఎవరు ఎక్కడి నుంచయినా ఫిలిం ప్రొడక్షన్ చేయొచ్చు. 

ఉదా: శేఖర్ కమ్ముల తన ఆఫీసు పద్మారావు నగర్‌లోనే పెట్టుకొని హాయిగా బోల్డన్ని హిట్ సినిమాలు తీశాడు. 

మనకు సౌకర్యం అనిపించినచోట ఎక్కడైనా ఆఫీసు పెట్టుకోవచ్చు. మనతో అవసరం ఉన్నవాళ్ళు మనదగ్గరికొస్తారు. మనకు ఎవరితోనైనా అవసరముంటే మనం వాళ్లదగ్గరికి వెళ్తాం. దట్ సింపుల్.  

(అసలు సినిమా తీయడానికి నిజంగా ఆఫీసు అవసరమా అన్నదాని గురించి ఇంకో బ్లాగులో మాట్లాడుకుందాం.)     

- మనోహర్ చిమ్మని