Monday 28 December 2020

బుక్ పబ్లిషింగ్ 'స్పాన్సర్స్' ‌కి ఆహ్వానం!

నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఘోస్ట్ రైటర్‌గా అప్పట్లో కొంతమంది ప్రముఖ దర్శకులకు పనిచేసిన అనుభవంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రిప్ట్ రైటింగ్ పైన నేనొక పుస్తకం రాశాను. 

పుస్తకం పేరు "సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం". 

అప్పట్లో అదొక బెస్ట్ సెల్లర్ పుస్తకం. రెండు ప్రింట్లు వేశాను. హాట్‌కేక్స్‌లా 5 వేల కాపీలు సేలయ్యాయి.

తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఆ రెండు సినిమాల అనుభవాన్ని కూడా చేర్చి, పుస్తకం కొంత రివైజ్ చేసి ప్రింట్ చేద్దామనుకొన్నాను. నా రెగ్యులర్ ఉద్యోగం, ఇతరత్రా కారణాలవల్ల ఆ పని అలా అలా పెండింగ్‌లో పడిపోయింది.

విశాలాంధ్ర, నవోదయ వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను ఈ పుస్తకం రీప్రింట్ చెయ్యలేకపోయాను.

ఈ పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రముఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు వాళ్ల స్టుడెంట్స్‌కు సిలబస్‌లో భాగంగా ఇచ్చేవారు. కాపీలు మార్కెట్లో దొరక్క, ఫిలిం నగర్‌లోని ఒక జిరాక్స్ సెంటర్లో ఈ పుస్తకం జిరాక్స్ కాపీలు స్పైరల్ బైండ్ చేసి అమ్ముతున్నట్టు విని నేనొకసారి అక్కడికి వెళ్ళాను. అనామకుడుగా నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను. అదొక విచిత్రమైన ఫీలింగ్!

కట్ చేస్తే –

కరోనా లాక్‌డౌన్ నాలో, నా ఆలోచనాపరిధిలో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. ఎన్నెన్నో విషయాల్లో ఎంతో అంతర్మథనానికి తెరలేపింది. ఎంత రియలిస్టిక్ కండిషన్స్‌లో అయినా సరే, కొన్ని రిస్కీ నిర్ణయాలు తీసుకొనే ముందు ఎందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించాలో కళ్ళముందు సినిమావేసి చూపించినట్టు తెలిసేలా చేసింది. మొత్తంగా ఈ లాక్‌డౌన్ నాలో ఒక మహాజ్ఞానోదయానికి కారణమైంది.

ఈ నేపథ్యంలో – ఇంతకుముందు నేను చాలా తేలికగా, అసలు పట్టించుకోకుండా ఏ రెండు ముఖ్యమైన అంశాలనైతే బాగా లైట్ తీసుకొన్నానో, అవే నాకు చాలా ముఖ్యమైనవి అని తెలుసుకున్నాను.

ఆ రెంటిలో ఒకటి నా రైటింగ్.

నేను రాసిన “సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం” పుస్తకం Best Book on Films కేటగిరీలో నాకు నంది అవార్డు సాధించిపెట్టింది. నేను రాసిన “ఆధునిక జర్నలిజం” పుస్తకం, కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మే స్థాయిలో రిఫరెన్స్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. ఈ విషయం, అదే యూనివర్సిటీలో నేను PhD ఇంటవ్యూకెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో నాకు చెప్పారు!

నేను రాసి, పబ్లిష్ చేసి, బాగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ 2 పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో లేవు. ఎంతోమంది నుంచి నాకు డైరెక్టుగా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. కర్టెసీ – సోషల్ మీడియా!

నవోదయ అధినేతలు, విశాలాంధ్ర వాళ్ళు ఇంక నాకు చెప్పడం మానేశారు.

ఇప్పుడు నేను ఈ 2 పుస్తకాలు రీప్రింట్ చేస్తున్నాను. ఈవైపు ఆసక్తి ఉండి, నన్ను ప్రోత్సహిస్తూ “Sponsors” గా సహకరించాలనుకొనే మిత్రులు, శ్రేయోభిలాషులు, పుస్తకాభిమానులు ఎవరైనా నాకు ఈమెయిల్-లేదా-వాట్సాప్ చేయగలిగితే సంతోషిస్తాను.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్.

నా ఈమెయిల్: mchimmani10x@gmail.com
వాట్సాప్ నంబర్: +91 9989578125    

Friday 25 December 2020

"మనోహరమ్" బేటా-టు-కంప్లీట్ వెర్షన్!

అల్ఫా, బేటా స్థాయిలను దాటేసిన మనోహరమ్ వెబ్ మ్యాగజైన్ ఈ నెల 31 అర్థరాత్రి దాటాక తన కంప్లీట్ వెర్షన్ లుక్‌తో ప్రారంభం కాబోతోంది. 

అంటే - జనవరి 1, 2021 నుంచి మనోహరమ్ ఎలైట్ వెబ్ మ్యాగజైన్‌ను దాని పూర్తిస్థాయిలో ఇకనుంచీ మీరు చూడబోతున్నారన్నమాట!

న్యూ ఇయర్ ప్రారంభం నుంచి - ఆర్టికిల్స్ విషయంలో రెగ్యులర్‌గా అప్‌డేట్ ఉంటుంది. ఇంటర్వ్యూలు, సక్సెస్ స్టోరీలు వంటివి ప్రతి వీకెండ్‌కి అప్‌డేట్ అవుతాయి.    

సక్సెస్ సైన్స్-సినిమాలు-సరదాలు (Mindset-Movies-Masti)... ఈ మూడే ప్రధాన విభాగాలుగా నేను ప్లాన్ చేసిన ఈ మ్యాగజైన్ పూర్తిగా ఒక బిందాస్ పాజిటివ్ మ్యాగజైన్. పాలిటిక్స్, హేట్రెడ్ ఇందులో మచ్చుకైనా ఉండవు. 

ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్ కంటెంట్‌లో సక్సెస్ సైన్స్ తర్వాత స్థానం సినిమాదే. 

సినిమారంగానికి సంబంధించినంతవరకు ‘మనోహరమ్‌’లో వంద శాతం పాజిటివ్ రైటప్‌లే వుంటాయి. ఎలాంటి సందర్భంలో అయినా వంద శాతం సినీఫీల్డువైపే పాజిటివ్‌గా వుంటుంది మనోహరమ్.

'మనోహరమ్‌’లో సినిమా రివ్యూలకోసం ప్రత్యేకంగా కాలమ్ లేదు. కాని, రివ్యూలు కూడా వుంటాయి. మళ్లీ వెనుకటి సినిమారంగం, విజయచిత్ర పత్రికల రోజులు గుర్తుకువచ్చేలా .. మనోహరమ్‌లో సినిమా రివ్యూలు పూర్తి విభిన్నంగా, నిర్మాణాత్మకంగా వుంటాయి. అలాగే - మనోహరమ్’లో హీరోహీరోయిన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, వారి గురించి రైటప్స్ కూడా ఉంటాయి.  

ఏ రంగంలోంచి ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినా-లేదా- అతడు/ఆమె గురించి ఒక స్టోరీ రాసినా, అది సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలోనే ఉంటుంది.  


కథలు, కవితలు కూడా ఇలాగే ఉండాలన్న రూల్ లేదు. క్రియేటివిటీ అనేది ఎలాంటి తూనికలకు లొంగాల్సిన అవసరంలేదు. ఇంకొక వ్యక్తినో, వర్గాన్నో బాధపెట్టకుండా ఉంటే చాలు. జీవితం పట్ల, జీవనశైలిపట్ల పాజిటివ్ దృక్పథమే ప్రధానం. 

కట్ చేస్తే - 

నా బ్లాగింగ్ ప్యాషన్‌కు ఎక్స్‌టెన్షనే మనోహరమ్ మ్యాగజైన్. నా వర్కింగ్ టైమ్‌లో సగం సమయం మ్యాగజైన్‌కే కెటాయిస్తున్నాను. మిగిలిన సగం సమయం నా ఇతర వ్యాపకాలకు కెటాయిస్తున్నాను. 

ప్రారంభం కాబట్టి తప్పటడుగులుంటాయి. మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే నాకు కొండంత బలం. ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు!  

Saturday 19 December 2020

2021 కి కౌంట్ డౌన్ షురూ...

కొత్త సంవత్సరం అనేది ఒక మైలు రాయి. ప్రతి మనిషి జీవితంలో ఒక కొత్త అధ్యాయం. అది ఇంగ్లిష్ న్యూ ఇయర్ కావచ్చు. తెలుగు ఉగాది కావచ్చు. 

ఇలాంటి సందర్భాలే కావాలా అనే ఒక లాజిక్ వస్తుంది. కాని తప్పక కావాలి, ఆ అవసరం ఉంది అని బాగా ఆలోచించే మనవాళ్ళు ఇవి క్రియేట్ చేశారని నాకనిపిస్తోంది. 

కనీసం ఇలా అయినా కొన్ని నిమిషాలో, కొన్ని గంటలో మొత్తం అసలేం జరుగుతోంది అన్నది రివ్యూ చేసుకొంటారు. వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మనిషి జీవనయానంలోని ఇంకో అరడజను ప్రధాన అంశాల్లో కావచ్చు. ఈ స్వీయ విశ్లేషణ చాలా అవసరం. 

కట్ చేస్తే - 

మానవజాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా - ప్రపంచం మొత్త ఒక ఆరు నెలలపాటు మూసుకొనేలా చేసిన కోవిడ్19 ఎటాక్ నేపథ్యంలో, 2020 మనకు నేర్పిన ఎన్నో పాఠాల్ని కొన్ని నిమిషాలైనా గుర్తుకుతెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. 

2020లో మనం ఊహించని ఎన్నో అనుభవాల నేపథ్యంలో ఇకనుంచీ మన జీవనశైలిలో, మన ఆలోచనల్లో, మనం చేసే పనుల్లో ఎంత మార్పు అవసరమో కూడా ఒక ఖచ్చితమైన రివ్యూ అవసరం అని నాకనిపిస్తోంది.

ఇంకో 12 రోజుల్లో 2021 రాబోతోంది. మనం మర్చిపోయిన పెన్నూ, పేపర్ తీసుకొని ఒక అరగంటయినా దీనికోసం కెటాయిస్తే ఎలావుంటుంది?         

Thursday 17 December 2020

కౌంట్‌డౌన్ టు కరోనా, 2020!

ఇందాకే చదివిన ఒక పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది...

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట! అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు...

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా కొన్ని వేల రోజులున్నాయి. కాని, ఏంటి గ్యారంటీ?

ఏ ట్రాఫిక్ లేని సమయంలో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాకయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు. 

గ్యారెంటీ ఏదీ కాదు. దేనికీ లేదు.

ఆ అంకెలు, ఆ లెక్క... కళ్లముందే కనిపిస్తున్నాయి నాకు.    

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం. కాని, చూస్తోంటే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి. నేను అసలు ఊహించని ఎందరో నా కళ్ళముందే పోయారు. 

కరోనా గురించి ఎవరైనా కలగన్నారా? దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రపంచాన్నే వణికిస్తోంది. లక్షలమంది చచ్చారు. లక్షలమంది చావు అంచులవరకు వెళ్ళొచ్చారు. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. 

ఇప్పుడా కరోనా కూడా క్లయిమాక్సుకు చేరింది.

ఎందరో తిట్టుకొన్న 2020 - తన తప్పేం లేకపోయినా...  గిల్టీగా, నిశ్శబ్దంగా నిష్క్రమిస్తోంది. 

నేను పూర్తిచేయాల్సిన పనులు, బాధ్యతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నేను మాత్రం 2020 కి చాలా థాంక్స్ చెప్తున్నాను. లాక్‌డౌన్లో ఒక కొత్త జీవనశైలిని నాకు అలవాటు చేసింది. నాలో ఎన్నెన్నో కొత్త ఆలోచనలకు తెరలేపింది. మొత్తంగా ఒక మహా జ్ఞానోదయానికి కారణమైంది. 

థాంక్యూ 2020, నేను ఆల్రెడీ 10X స్పీడ్‌లో వున్నాను. 2021 లో. 

Wednesday 16 December 2020

నువ్వు లేకుండా అప్పుడే రెండేళ్ళు!

బ్రతికుండటానికి కూడా చాలా శక్తి, చాలా విల్‌పవర్ కావాలని నువ్వు వెళ్ళిపోతూ మా అందరికి తెలియజెప్పాకే తెలిసింది. 

నేను కొంచెం చొరవతీసుకున్నా, నువ్వు "అన్నా, మా సమస్యను పరిష్కరించు" అని నాతో ఒక్క ముక్క గట్టిగా చెప్పినా ఇవ్వాళ నేనిది రాసుకొంటూ ఇలా బాధపడేవాణ్ణి కాదు. మానవసంబంధాల విలువ ఏంటో కూడా నువ్వు వెళ్ళిపోతూ చెప్పావు. 

సమాజంలో ప్రతి వ్యవస్థ కూడా కాలగమనంలో ఎంతో మారిపోతూవస్తోంది. నువ్వూ మారాల్సింది. సమస్యను ఏవైపునుంచయినా పరిష్కరించుకోవాల్సింది. సమస్యే మూలం కాని, సమస్యకు నువ్వు మూలం కాదు అన్న చిన్న ఆలోచన చెయ్యలేకపోయావు. నేను బాగుంటే నువ్వు బ్రతికుండేవాడివి. అన్నగా ఏం చేయలేకపోయాననే బాధ నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నన్ను ఏడిపిస్తుంది. నీ పదేళ్ళ కొడుకు కార్తీక్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా కళ్ళుచెమ్మగిల్లుతాయి. వాడిని కలిసి హత్తుకున్నప్పుడు వదిలిపెట్టలేనంత దుఃఖం. 

నువ్వొక్కడివే స్నేహితుడిగా, తమ్ముడిగా, నీతోనే పెరిగిన శ్రీధర్‌కు ఇప్పుడు వరంగల్‌లో ఎవ్వరున్నారు మనసు విప్పి మాట్లాడుకోడానికి? వాడెంత నీకోసం తపనపడ్డాడు? వాడితోనైనా గట్టిగా చెప్పాల్సింది కదా - అన్నతో చెప్పి, నువ్వూ అన్నా కలిసి నా సమస్యను వెంటనే ఇప్పుడే పరిష్కరించండి అని.  

నీ చివరిరోజుల్లో నువ్వు నన్ను కలిసిన ప్రతిసారీ, నీ జీవితం ఎలాపోతోందో తెలుసుకోవడం ద్వారానైనా నేను చాలా తెలుసుకోవాల్సింది. ఇలాంటి ముగింపు నేనూహించలేదు. నేనెలా ఉన్నా సరే, అన్నగా నేను పూనుకోవాలన్న ఆలోచన ఆ మూడేళ్ళలో ఒక్కసారి నాకు వచ్చినా ఇవ్వాళ నాకింత బాధ వుండేదికాదు. 

ఇప్పుడు శ్రీధర్, నేనూ ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకొన్నా నీ గురించే. చెట్టుకు, పుట్టకు ఒక్కొక్కరై మర్చిపోయిన మానవసంబంధాలగురించే. నీ జీవితాన్ని ఒక పాఠంగా మార్చి నువ్వు నిష్క్రమిస్తే తప్ప మాకు తెలియలేదు మానవసంబంధాల విలువేంటో.  

ఎందుకు వాసూ, ఇలా చేశావు? "అన్నా" అని ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడిన నీ జ్ఞాపకాలూ, ఆవెంటనే వచ్చే కన్నీళ్ళే కదా ఇప్పుడు నాకు మిగిలింది?

మానవసంబంధాలు చాలా ముఖ్యం. మనసువిప్పి మాట్లాడుకోడానికి ఒక మనిషి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండూ ఉన్నప్పుడే మిగిలినవి ఏవైనా సరే బాగుంటాయి. 

నా చిన్న తమ్ముడు వాసు లేడు అన్న నిజాన్ని నేనింకా నమ్మడానికి ఒప్పుకోలేకపోతున్నా. కాని, నిజాన్ని ఎలా కాదనగలను? నీ ఫోన్ కాల్ ఏది? మొన్న వరంగల్ వచ్చినపుడు నువ్వు లేవే? 

మిస్ యూ వాసూ... 

Tuesday 15 December 2020

బాపుగారి బొమ్మ

బాపుగారి బొమ్మ అంటే మామూలుగా అయితే రెండర్థాలు స్పురిస్తాయి: బాపు గీసిన బొమ్మ, బాపు సినిమా.

ఈ రెండూ కాకుండా, సుమారు 15 ఏళ్ళక్రితం చెన్నైలోని వారి ఇంట్లో బాపుగారిని కలిసినప్పటి సంగతులు ఇప్పుడు నేను రాస్తున్నాను.

అప్పట్లో నేను రాయదల్చుకున్న ఒక పుస్తకం కోసం కొంతమంది నేను ఎన్నికచేసుకొన్న దర్శకులను కలవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఒక మధ్యాహ్నం వారి టైమ్ తీసుకొని బాపుగారి ఇంటికి వెళ్లాను. నాతోపాటు నా మిత్రుడు, కోడైరెక్టర్ వేణుగోపాల్ కూడా వచ్చాడు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి, సాయంత్రం 7 మధ్యలో – సుమారు 3 గంటలపాటు బాపుగారితో మాట్లాడుతూ, వారి ఇంటర్వ్యూను ఆడియో రికార్డు చేశాను.

అసలు బాపుగారితో పక్కపక్కనే ఒకే సోఫా మీద కూర్చొని, వారితో అన్ని గంటలపాటు ముచ్చటించటం, వారి ఇంటర్వ్యూని రికార్డ్ చేయటం అనేది నిజంగా అదొక గొప్ప అనుభవం.

బాపుగారు కేవలం ఒక చలనచిత్ర దర్శకుడే కాదు… ఒక అంతర్జాతీయ స్థాయి పెయింటర్, ఇల్లస్ట్రేటర్, కార్టూనిస్ట్, స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఆర్టిస్ట్, డిజైనర్ కూడా.

1964 లోనే యునెస్కో స్పాన్సర్ చేసిన ఒక అంతర్జాతీయ సెమినార్లో చిల్డ్రెన్స్ బుక్స్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన మేధావి. వాల్టర్ థామ్సన్, ఎఫిషియెంట్ పబ్లిసిటీస్, ఎఫ్ డి స్టీవార్ట్స్ వంటి అంతర్జాతీయ స్థాయి యాడ్ ఏజెన్సీలకు గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న బహుముఖప్రజ్ఞాశాలి. 1960 ల్లోనే ఫోర్డ్ ఫౌండేషన్‌ తరపున ది సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కు ఆర్ట్ కన్సల్టెంట్‌గా పనిచేశారాయన. అదంతా కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వంటివి లేని కాలం అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి.

అప్పట్లో పబ్లిష్ అయిన ప్రతి తెలుగు నవలమీద, ప్రతి కథా సంకలనం మీద, వీక్లీల కవర్లపైన, మ్యాగజైన్ల వార్షిక సంచికలమీద… బాపు గారి ముఖచిత్రం మాత్రమే ఎక్కువగా ఉండేది. అలాంటి ముఖచిత్రాలు ఎన్ని వందల పుస్తకాలకు వేశారన్నది చెప్పటం కష్టం. బహుశా ఆ సంఖ్య వేలల్లోనే ఉండొచ్చు.

దర్శకుడిగా బాపు చేసిన దాదాపు 48 సినిమాల్లో 10 హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా కూడా ఉంది. వారి సినిమాలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. అవార్డులు, రివార్డులు గెల్చుకొన్నాయి.

బాపు గారికి కూడా 2013లో పద్మశ్రీ అవార్డుతో పాటు అంతకు ముందే ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఒక దశలో హిందీలో ఒక టాప్ హీరోగా వెలిగిన అనిల్ కపూర్‌ను, తెలుగులో వంశవృక్షం చిత్రం ద్వారా మొట్టమొదటగా వెండితెరకు పరిచయం చేసింది బాపుగారే అవటం ఒక గమ్మత్తైన విశేషం.


బాపుగారు షూటింగ్‌కు ముందే తాను తీయబోయే ప్రతి షాట్‌నూ స్టోరీబోర్డ్ రూపంలో గీసుకుంటారు. సినిమాల్లో వారి ఫ్రేమ్స్ అన్నీ వారు గీసిన స్టోరీబోర్డులో బొమ్మల్లాగే ఉండటంలో ఎలాటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా వారి సినిమాల్లో హీరోయిన్స్… వారి కళ్ళు, క్లోజప్స్, చీరెకట్టు, నడుము వొంపులు, వాలు జడ, కాళ్ళు, పాదాలు…

వారి చాలా సినిమాల స్టోరీబోర్డులను వారి ఇంట్లోనే స్వయంగా చూసిన అతికొద్దిమందిలో నేనూ ఒకన్ని.

అప్పట్లో తెలుగు కాస్త బాగా రాయగలిగిన దాదాపు ప్రతి యువకుడూ, ప్రతి కవీ, ప్రతి రచయితా తమ చేతి వ్రాతను బాపుగారి స్టయిల్లో రాసే ప్రయత్నం చేసేవారంటే అతిశయోక్తికాదు. బాపు రైటింగ్ శైలి ప్రభావం నామీద కూడా బోలెడంత వుంది. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ వెబ్ మ్యాగజైన్ “మనోహరమ్” లోగో బ్రష్‌స్ట్రోక్‌లో నేను రాసిందే. కర్టెసీ… బాపుగారి శైలి ప్రభావం!

కట్ చేస్తే –

నేను బాపుగారింటికి వెళ్ళినరోజు ఇంట్లో ఎవరూ లేరనుకొంటాను. ఒకసారి వాళ్ల అబ్బాయి, మరొకసారి స్వయంగా బాపుగారే అందించిన కాఫీ త్రాగటం మర్చిపోలేని జ్ఞాపకం.

వారి ఇంట్లో కూర్చున్న ఆ 5 గంటలూ నన్ను “మీరు” అని, “మనోహర్ గారు” అని పిలవటం నేను చాలా ఇబ్బందిపడిన విషయం. నాకు తెలిసి, బాపుగారు వారి అసిస్టెంట్స్‌ను కూడా “మీరు” అనే పిలుస్తారట.


ఇంటర్వ్యూ నడుస్తుండగా, 90 నిమిషాల ఆడియో క్యాసెట్ సరిపోదన్న విషయం ముందే గుర్తించిన నా మిత్రుడు వేణుగోపాల్ బయటకెళ్ళి వేగంగా ఇంకో క్యాసెట్ కొనుక్కొచ్చిన విషయం నాకింకా గుర్తుంది.

వీటన్నిటినీ మించి బాపుగారికి సంబంధించి నేను చెప్పదల్చుకొన్న మరొక అద్భుత విషయాన్ని గురించి ఇప్పుడు చివరగా చెప్తున్నాను. అది… బాపుగారి “వర్క్‌రూమ్-కమ్-స్టడీరూమ్.”

బాపు గారి వర్క్‌రూమ్ ఒక పెద్ద హాల్ సైజులో ఉంటుంది. దానికి రెండువైపులా ద్వారాలుంటాయి. చుట్టూ వున్న నాలుగు గోడలు పూర్తిగా నిలువెత్తు ర్యాక్స్‌తో ఫిక్స్‌చేసివుంటాయి. వందలాది పుస్తకాలు.

హాల్ మధ్యలో వేర్వేరుచోట్ల కూర్చొని పనిచేసుకోడానికి అక్కడక్కడా రెండు బీన్ బ్యాగులు, చిన్న చిన్న పీటల్లాంటి కుషన్లు. ఎక్కడ కూర్చొంటే అక్కడే ఆర్ట్, రైటింగ్ సెటప్… బ్రష్షులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇంకులు, రంగులు, ప్యాలెట్లు…

అంటే – ఆయన ఎక్కడ కూర్చోవాలనుకొంటే అక్కడే కూర్చొని ఆర్ట్ వేయటమో, రాసుకోవడమో, చదవటమో చేస్తారన్నమాట!

నేనొక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, ఒక 30 నిమిషాలపాటు స్పెల్‌బౌండ్ అయి చూసిన బాపుగారి వర్క్‌రూమ్-కమ్-స్టడీని ఇప్పటికీ అడుగు అడుగూ వర్ణించగలను!

సృజనశీలి అయిన ఒక అద్భుత వ్యక్తికి అంతకు మించిన ఆస్తి ఏముంటుంది?

వెళ్తూ వెళ్తూ ప్రచురణకోసం వారి ఫోటో అడిగాను. తర్వాత మనసు మార్చుకొని – సిగార్‌తో వున్నదీ, ఆయనే స్వయంగా వేసుకొన్న ‘బాపుగారి బొమ్మ’ కావాలన్నాను. “నేను మీకోసం కొత్తగా ఒకటి వేసి మీకు పోస్ట్ చేస్తాను” అని నా అడ్రెస్ తీసుకొన్నారు. మాట ఇచ్చినట్టే సరిగా వారం రోజుల్లో బాపుగారినుంచి పోస్టులో ‘సిగార్‌తో బాపుగారి బొమ్మ’ వచ్చింది!

ఆ బొమ్మ, ప్లస్, వారిదగ్గర నేను అడిగి తీసుకొన్న ‘పెళ్ళిపుస్తకం’ సినిమాలోని ఒక సీన్‌కు వారు వేసుకొన్న మొత్తం స్టోరీబోర్డు కాపీ ఇప్పటికీ ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెలో నాదగ్గర భద్రంగా ఉన్నాయి.

వారికి సెలవు చెప్పి బయటికి వస్తోంటే ఇంటిముందు విశాలమైన ఆవరణలో ఒక ఊయల. ఎదురుగానే హీరో మమ్ముట్టి ఇల్లు. గేట్ దాటి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగిచూస్తే – ఇంకా బయటే మాకు చేయి ఊపుతూ బాపు గారు!

ఇన్ని అద్భుత జ్ఞాపకాలనిచ్చిన బాపుగారికి వారి జయంతి సందర్భంగా ఇదే నా వినమ్ర నివాళి.

^^^^^
Read this and more articles on 'Manoharam' Elite Web Magazine:
https://manoharam.in/movies/bapu-gari-bomma 

Saturday 12 December 2020

నా ట్విట్టర్ "లాక్"‌ అయిన వేళ!

గత కొన్నేళ్ళుగా ఫేస్‌బుక్‌ను తిట్టుకొంటూ, ట్విట్టర్‌ను మెచ్చుకొంటూ ఉండేవాన్ని. రెండురోజుల క్రితం  జరిగిన ఒకే ఒక్క సంఘటనతో నేను మళ్ళీ ఫేస్‌బుక్ మూలపురుషుడు మార్క్ జకెర్‌బర్గ్ ఫ్యాన్ అయిపోయాను. 

సోషల్‌మీడియాలో వెరిఫికేషన్‌కోసం మధ్యలో అప్పుడప్పుడూ మన ఈమెయిలూ, మన మొబైల్ నంబరూ అడుగుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. 

పొరపాటున మనం ఫోన్ నంబర్ మార్చుకొన్నపుడు, సెట్టింగ్స్‌కు వెళ్ళి అది వెంటనే అప్‌డేట్ చేసు కోవాలి. లేదంటే - ఏదో ఒకరోజు ఈ చిన్నపొరపాటుతో లాక్ అయిపోవాల్సివస్తుంది.  

ఫేస్‌బుక్ అయితే ఇంక చాలా అడుగుతుంది: పుట్టిన ఊరు, అమ్మమ్మ పేరు, చిన్నప్పటి ఫ్రెండు, నాన్న పుట్టిన ఊరు... ఎట్సెట్రా. అయితే, ఏదో చేసి మొత్తానికి ఫేస్‌బుక్ వాడు తన యూసర్‌ని నిలబెట్టుకొంటాడు తప్ప వదులుకోడు. 

ట్విట్టర్ అలా కాదట! ఫోరమ్స్‌లో చదివాను: 

బై మిస్టేక్... మన మారిన మొబైల్ నంబర్ మార్చకుండా - వెరిఫికేషన్ సమయంలో "సెండ్ కోడ్ టు మై మొబైల్ నంబర్" నొక్కామా... కథ కంచికే! 

ఆ కోడ్ మనం తెచ్చుకోలేం, ట్విట్టరోడు మనల్ని పట్టించుకోడు. ఎన్ని సార్లు లాగిన్ అయినా "ఎంటర్ కోడ్" అనే వస్తుంది తప్ప, అసలు ఎంటర్ కానీడు! సపోర్ట్‌కు మెయిల్ పంపినా ఏం లాభం ఉండదు. ఏదో ముందే సెట్ చేసిన చెత్త ఆన్సర్ ఏదో వస్తుంది - కొన్ని రోజుల్లో చెప్తాం అని. 

ఫేస్‌బుక్ అలా కాదు. అప్పటికప్పుడు 101 ఆప్షన్స్ ఇస్తుంది. సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. 

సోషల్ మీడియాలో ట్విట్టర్ టాప్‌కు రీచ్ కాలేదు అంటే ఎలా అవుద్ది?!

కట్ చేస్తే - 

ఎవరైనా ట్విట్టర్ ఎక్స్‌పర్ట్ మిత్రులు సొల్యూషన్ తెలిస్తే చెప్పగలరు అని మనవి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్! :-) 

ట్విట్టర్ వాడుతున్నవాళ్ళు... ఒకవేళ మీ నంబర్ మారినట్లైతే ముందు సెట్టింగ్స్‌కు వెళ్ళి నంబర్ అప్‌డేట్ చేసుకోండి. లేదంటే ఏదో ఒక టైమ్‌లో ఇరుక్కుపోతారు! ఇది చెప్పడానికే ఈ పోస్టు.   

Monday 7 December 2020

నా బ్లాగింగ్‌కి కొనసాగింపే... మ్యాగజైన్!

‘మనోహరమ్’ డిజిటల్ మ్యాగజైన్ నా రైటింగ్, బ్లాగింగ్ ప్యాషన్‌లో భాగమే.

ఈ లాక్‌డౌన్ ఇంకాస్త రిలీఫ్ ఇచ్చాక, డైరెక్టర్‌గా కూడా ఇకనుంచీ గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. అన్నీ అనుకున్నట్టు సెట్ చేసుకోగలిగితే, బహుశా జనవరి చివరి వారంలో నా కొత్త సినిమా ప్రారంభం వుంటుంది. 

కట్ చేస్తే –

సక్సెస్ సైన్స్, సినిమాలు, సరదాలే (Mindset, Movies, Masti) ప్రధానంగా – ‘మనోహరమ్’ ఒక బిందాస్ పాజిటివ్ డిజిటల్ మ్యాగజైన్. ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్ కంటెంట్‌లో సక్సెస్ సైన్స్ తర్వాత స్థానం సినిమాదే. ఈ నేపథ్యంలో… సినీ జర్నలిస్టులు, పీఆర్వో మిత్రులతో వ్యక్తిగతంగా క్రింది విషయాలను షేర్ చేసుకోడానికి సంతోషిస్తున్నాను:

1. సినిమారంగానికి సంబంధించినంతవరకు ‘మనోహరమ్‌’లో వంద శాతం పాజిటివ్ రైటప్‌లే వుంటాయి. ఎలాంటి సందర్భంలో అయినా వంద శాతం సినీఫీల్డువైపే పాజిటివ్‌గా వుంటుంది మనోహరమ్.

2. 'మనోహరమ్‌’లో సినిమా రివ్యూలకోసం ప్రత్యేకంగా కాలమ్ లేదు. కాని, రివ్యూలు కూడా వుంటాయి. మళ్లీ వెనుకటి సినిమారంగం, విజయచిత్ర పత్రికల రోజులు గుర్తుకువచ్చేలా .. మనోహరమ్‌లో సినిమా రివ్యూలు పూర్తి విభిన్నంగా, నిర్మాణాత్మకంగా ఉండేలా రాయాలన్నది నా ఆలోచన. ఈ సౌకర్యాన్ని దర్శకనిర్మాతలు వినియోగించుకొనేలా చేయగలరని సవినయ మనవి.

3. అలాగే – చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలవరకు… కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, పోస్ట్ రిలీజ్ దాకా – ‘మనోహరమ్’ మ్యాగజైన్‌లో విభిన్నమైన Conceptual and Customized Promotion Plans పరిచయం చేసే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్-డైరెక్టర్లు ఈ సౌకర్యం కూడా వినియోగించుకొనేలా చేయగలరని సవినయ మనవి. ఈ విషయంలో మీ అమూల్యమైన సలహాలు, సూచనలకు స్వాగతం.

4. 'మనోహరమ్’లో హీరోహీరోయిన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, వారి గురించి రైటప్స్ కూడా ఉంటాయి. ఈ విషయంలో ఫిలిం జర్నోస్, పీఆర్వో మిత్రులు నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. 

థాంక్యూ సో మచ్! 

My whatsapp: 9989578125
My email: mchimmani10x@gmail.com

“ఈ ప్రపంచంలో
అత్యంత అసాధ్యమైన పని ఒక్కటే.
మనం ఎన్నటికీ ప్రారంభించని పని!”

Wednesday 2 December 2020

లిరిక్ రైటర్ 'లోరా'

సుమారు 7 ఏళ్ల క్రితం అనుకుంటాను... ఒక యువ లిరిక్ రైటర్ నా బేగంపేట ఆఫీసుకొచ్చాడు. తాను రాసిన పాటలు చూపించాడు. ఒక సిచువేషన్ ఇస్తే, దానికి ఓ గంటసేపట్లో ఆఫీసులోనే కూర్చుని పాటరాసి చూపించాడు. 

అంతా బాగానే ఉంది. కొత్త రైటర్ కాబట్టి ప్రొఫెషనల్ రైటింగ్, సినిమా లిరిక్స్ రైటింగ్‌కు సంబంధించిన కొన్ని బేసిక్స్ ఇంకా పూర్తిగా తెలియదని అర్థమైంది. తర్వాత, నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ టైమ్‌లో కూడా నా ఆఫీసుకొచ్చాడు. షరా మామూలే. రాసి వున్న పాటలు చూపించాడు. అప్పటికప్పుడు ఒక సిచువేషన్‌కు రాసి చూపించాడు. కొంచెం గైడెన్స్‌తో బాగా రాయగలడు. అయితే, హీరో నేపథ్యంలో వున్న ఒక ఆబ్లిగేషన్ కారణంగా మొత్తానికి ఆ కొత్త లిరిక్ రైటర్‌ను పరిచయం చెయ్యలేకపోయాను. 

కట్ చేస్తే - 

ఈమధ్య ఈ లిరిక్ రైటర్‌కు, నాకు మధ్య కొంచెం కమ్యూనికేషన్ పెరిగింది. చాలా విషయాలు తెలిశాయి అతని గురించి...

> ఒక వెబ్‌పోర్టల్ నిర్వహించాడు.
> యూట్యూబ్ చానెలుంది.
> మ్యూజిక్ వీడియోలు చేస్తుంటాడు.
> కొన్ని షార్ట్ ఫిల్మ్స్/మ్యూజిక్ వీడియోల్లో యాక్ట్ కూడా చేశాడు.
> స్క్రిప్ట్/డైలాగ్ రైటింగ్‌మీద కూడా ఆసక్తి వుంది.
> ఈమధ్య కొత్తగా మీమ్స్ చేస్తున్నాడు.
> ఒక షార్ట్ ఫిల్మ్ రచించి డైరెక్ట్ చేశాడు. (నేను చూసింది ట్రయలర్.) 
> ఒకటి రెండు సినిమాలకు కూడా లిరిక్స్ రాశాడు కాని, అవి ట్రాక్ ఎక్కలేదు.  

వైజాగ్‌లో ఉద్యోగం చేస్తూనే, ఇలా చాలావాటిల్లో తన స్కిల్ నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నాడీ యువకుడు. 

జాక్ ఆఫ్ ఆల్...
కాని, మాస్టర్ ఆఫ్ నన్ కాకూడదు.  

మంచి కమ్యూనికేషన్, చొచ్చుకుపోయే గుణం సినిమా ఫీల్డులోనే కాదు, మరే ఫీల్డులోనైనా చాలా ముఖ్యం. తన స్కిల్స్‌తో పాటు ఈ యువకుడు ఈ రెండు చిన్న విషయాల్లో కూడా కొంత శ్రధ్ధపెడితే చాలు... తన లక్ష్యం చాలా సులభంగా చేరుకోగలుగుతాడు. 

2021 ప్రారంభంలో నా కొత్త చిత్రం ద్వారా ఈ యువకున్ని నేను లిరిక్ రైటర్‌గా పరిచయం చేస్తున్నాను. ఈలోపే, ఇంకో సినిమా ద్వారా ఇంకెవరైనా డైరెక్టర్ పరిచయం చేసినా ఆశ్చర్యం లేదు.

రాజేశ్ లోకనాథం అతని పేరు. 'లోరా' ఎంటర్‌టైన్‌మెంట్ అతని యూట్యూబ్ చానెల్ పేరు. 

ఐ విష్ హిమ్ బెస్టాఫ్ లక్. 

Tuesday 24 November 2020

సినీ ఫీల్డులోకి ప్రవేశించడం ఎలా? (FREE e-book)

యాక్టర్‌గా కావచ్చు, స్క్రిప్ట్ రైటర్‌గా కావచ్చు, డైరెక్టర్‌గా కావచ్చు... ఇప్పుడెవరైనా సులభంగా సినీఫీల్డులోకి ప్రవేశించవచ్చు. 

ఇంతకుముందు సినిమా ఫీల్డు వేరు. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక సినిమా ఫీల్డు వేరు. 

ఐఫోన్‌తోనే మొత్తం సినిమా షూట్ చేసి, అదే ఐఫోన్‌లో ఎడిటింగ్‌తో సహా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఆ సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో పోటీకి పంపిస్తున్న రోజులివి. ఒకవైపు వందల కోట్లల్లో బడ్జెట్లు ఎలా పెరిగిపోతున్నాయో, మరోవైపు అసలు బడ్జెట్టే అవసరంలేనివిధంగా నో బడ్జెట్ రెనగేడ్ సినిమాలు రూపొందుతున్న రోజులివి. 

కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కమాండ్ వుంటే చాలు, సోషల్ మీడియా ద్వారానే ఎందరో సెలబ్రిటీలతో డైరెక్ట్‌గా   కనెక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు. 


డైరెక్టర్ కావడానికి గతంలో లాగా ఒక పదేళ్ళపాటు 10 సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నిజంగా మీలో ఆ క్రియేటివిటీ వుంటే డైరెక్ట్‌గా డైరెక్టర్ అయిపోవచ్చు. రైటర్ విషయంలో కూడా అంతే. ఒక సెన్సేషనల్ స్క్రిప్టు రాసే సత్తా మీలో నిజంగా వుంటే ఇంకెవ్వరిదగ్గరా ఓ పదేళ్ళపాటు అసిస్టెంట్‌గా పనిచెయ్యాల్సిన అవసరంలేదు. 

అలాగే, ఇంతకుముందులాగా హీరో-లేదా-హీరోయిన్ అంటే ఇలాగే వుండాలన్న రూల్స్ ఇప్పటి సినిమాలకు లేవు. ఎవరైనా సరే, నటుడు కావచ్చు, నటి కావచ్చు. హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. 

ఒక 4 ఏళ్ల క్రితం ఇండస్ట్రీతో పోలిస్తే, ఇప్పుడు మీరు సినిమాల్లో చాన్స్ సంపాదించుకోవడం చాలా ఈజీ.  


కాని - ఔత్సాహికులైన కొత్తవాళ్ళు తెలుసుకోవల్సిన బేసిక్స్ అంటూ కొన్నుంటాయి. ఫిలిం ఇండస్ట్రీ అసలు ఎలా పనిచేస్తుంది? ఎలా చాన్సులు దొరుకుతాయు? అసలు కొత్తవాళ్లలో ఇండస్ట్రీకి ఏం కావాలి? కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వారిలో ఉన్న స్కిల్స్‌ను ఎలా ఇండస్ట్రీ కోరుకొనే విధంగా మౌల్డ్ చేసుకోవాలి... వంటి కొన్ని అతి ముఖ్యమైన విషయాల్లో అవగాహన అవసరం. 

ఈ ప్రాథమిక అవగాహన లేకుండా చేసే ప్రయత్నాలేవీ ఫలించవు. మీ అత్యంత విలువైన సమయం, డబ్బూ వృధా అయిపోతాయి. 

ఈ నేపథ్యంలో కొత్తవాళ్లకోసం, వారు తీసుకోవాల్సిన శిక్షణ గురించి, తెలుసుకోవాల్సిన బేసిక్స్ గురించి ఒక చిన్న ఈ-బుక్ రాశాన్నేను.

ఈ ఈ-బుక్ ఉచితం. 

ఒక కెరీర్‌గా సినీఫీల్డు పట్ల ప్యాషన్, సీరియస్‌నెస్ బాగా ఉన్న ఔత్సాహికులు మీ పేరు, ఊరు తెలుపుతూ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 24 గంటల్లో ఈ ఫ్రీ ఈ-బుక్‌ను మీకు నేనే స్వయంగా పంపిస్తాను. ఈ ఈ-బుక్ చదివిన తర్వాత మీరు తీసుకోబోయే నిర్ణయం మిమ్మల్ని సినీఫీల్డులోకి అతి సులభంగా ప్రవేశించేలా చేస్తుంది. మీరూ సెలెబ్రిటీ అవుతారు.  

నా వాట్సాప్: 9989578125. 

బెస్ట్ విషెస్.
-మనోహర్ చిమ్మని  

Friday 20 November 2020

నా బ్లాగింగ్, నా మనోహరమ్

ఒక్క ముక్కలో చెప్పాలంటే - నా బ్లాగ్ 'నగ్నచిత్రం'కు పొడిగింపే మనోహరమ్ డిజిటల్ మ్యాగజైన్. 

అందుకే మ్యాగజైన్లో ఏది రాసినా నేను ఫీలైన విధంగానే, ఒక బ్లాగ్ రాసినట్టే రాస్తున్నాను తప్ప, మరొక రొటీన్ ఆన్‌లైన్ మ్యాగజైన్లో రాసినట్టు రాయడం లేదు. మ్యాగజైన్ కంట్రిబ్యూటర్స్ విషయంలో కూడా ఇదే పాలసీ పాటిస్తున్నాను.

నా సూచనలతో వాళ్ళూ నా పధ్ధతిలోనే రాస్తున్నారు. బాగా రాస్తున్నారు కూడా. అవసరమైన చోట్ల మాత్రం స్వల్పంగా ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాను. అది తప్పదు. 

కట్ చేస్తే - 

నా బ్లాగ్ 'నగ్నచిత్రం'కు పాథకులు వేళల్లో వున్నారు. వారంతా మ్యాగజైన్‌ను కూడా చదవాలన్నది నా కోరిక. రెండు మూడు రోజులకు ఒకసారి నా బ్లాగ్ చదివే నా పాఠకమిత్రులకు మనోహరమ్ మ్యాగజైన్ ఒక విందు భోజనం లాంటిది.

మనోహరమ్ డిజిటల్ మ్యాగజైన్ చదవండి. మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి. 

థాంక్స్ ఇన్ అడ్వాన్స్...     

Tuesday 17 November 2020

ఆనందో బ్రహ్మ! 🙏


మన నిర్ణయాలకు మనకు కనిపించని ఇంకెవ్వరినో బాధ్యున్ని చేయడం నాకు ఇష్టం వుండదు. 

ఆ ఇంకెవరు మరెవరో కాదు... దేవుడు.

నేను దేవుడు లేడు అనను. వున్నాడు అని చెప్పడానికి నాదగ్గర ఆధారాలేమీ లేవు. 

మన చుట్టూ ఇంత అద్భుతమైన క్రియేషన్ వెనుక తప్పక ఏదో ఒక శక్తి వుండే వుంటుందన్నది మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. అయితే ఆ శక్తికి ఇన్ని పేర్లుండటం, ఇన్ని ఊహాత్మక రూపాలుండటం అనేది చాలా ఆశ్చర్యకరంగా  అనిపిస్తుంది నాకు.

అయితే - ఇంకొకర్ని బాధపెట్టనంతవరకూ అన్ని రూపాలూ అద్బుతమే. 

ఈ రూపాలన్నిటిలో నాకు బాగా నచ్చిన రూపం శివుడు. నాకు బాగా నచ్చిన తత్వం శివతత్వం. అంతే బాగా నాకు నచ్చిన ఇంకో రూపం కృష్ణుడు, ఇంకో తత్వం కృష్ణతత్వం. రెండూ వైరుధ్యంగా అనిపించవచ్చు. కానీ, నాకు మాత్రం రెండూ ఒక్కలాగే అనిపిస్తాయి. 

కట్ చేస్తే - 

మతం అనేది పూర్తిగా మానవ సృష్టి. ఎవ్వరూ ఇంతవరకు చూడని, ఎవ్వరికీ తెలియని ఆ శక్తిని ఎవరికి వారు ఎన్నెన్నో రూపాలతో, ఎన్నెన్నో పేర్లతో వారి వారి మతాలకు మూలం చేసుకోవడం కూడా నాకు మరింత విచిత్రంగా అనిపిస్తుంది. పైగా, మనిషే సృష్టించుకొన్న ఈ మతాలు నేపథ్యంగా ఇన్ని రాజకీయాలు, ఇన్ని గొడవలేంటి? 

పెద్ద నాన్సెన్స్ కదా... 

ఈ నాసెన్స్‌నంతా దేవుడనే ఆ శక్తి చూస్తూ ఊరికే వుండలేడని నేననుకుంటాను. అతనికి అంత తీరిక వుండదు. ఇంతకంటే బ్రహ్మాండమైన అద్భుతాలను ఇంకేవైనా సృష్టించే పనిలో చాలా బిజీగా వుండుంటాడాయన. 

అలా కాకుండా - మన పాపపుణ్యాలనో, మన పూర్వజన్మ సుకృతాలనో-దుష్కృతాలనో లెక్కలు వేసుకొంటూ ఒక్కొక్కరి జమాఖర్చులు చూసేంత పనికిమాలిన పని చేస్తూ తన సమయం వృధా చేసుకోడని నా గట్టి నమ్మకం. 

అన్నిటినీ మించి, భూమ్మీద ఇన్ని బాధల్ని సృష్టించేంత శాడిస్టు మాత్రం అసలు కాడన్నది నేను గట్టిగా నమ్మే ఇంకో నిజం. 

ఆయన చేయాలనుకొన్న పని ఆయన చేశాడు. మనం చేయాల్సింది మనం చేయాలి. అది కూడా అందంగా చేయాలి, ఆనందంగా వుండాలి.    

అప్పుడు మాత్రమే ఆయనకు ఆనందంగా వుంటుంది... 

ఈమాత్రం అంతర్విశ్లేషణకు ఇంత కాలం పట్టడం అనేదే జీవితంలో అతి పెద్ద దుఖం. నేను చూడని, నాకు తెలియని ఆ శక్తిని దీనికి బాధ్యున్ని చేయడమంత మూర్ఖత్వం ఇంకోటి వుండదు. 

God, I'm sorry. Please forgive me. Thank you. I love you.        

Sunday 15 November 2020

పూరి మ్యూజింగ్స్ వూరికే పుట్టలేదు!

మనమేంటో మన కమ్యూనికేషనే చెప్తుంది అనుకొంటాం. తప్పు. 

మనం ఏం కాదో, మనం ఏం కాలేమో మన కమ్యూనికేషన్ చెప్తుంది. ఇది నిజం.

దీనికి నేను చెప్పదల్చుకొన్న ఉదాహరణలు ఒక వంద వున్నాయి. కాని, కేవలం ఇటీవలి రెండు ఉదాహరణలు మాత్రమే చెప్తాను. 

కట్ చేస్తే - 

ఈ మధ్యనే నేను ప్రారంభించిన ఒక డిజిటల్ మ్యాగజైన్‌కు సంబంధించి ఒక చిన్న అంశంపైన కంటెంట్ కోసం తనకు తెలిసినవాళ్ళు ఎవరైనా వుంటే చెప్పమని ఒక డీటెయిల్డ్ మెసేజ్ పెట్టానొకరికి.    

తను మెసేజ్ చూసుకొన్నాడు. ఆన్‌లైన్‌లో వున్నాడు. వుంటున్నాడు. ఫేస్‌బుక్ పోస్టులు పెడుతున్నాడు. కాని, 10 రోజులు అవుతున్నా నాకు మాత్రం కనీసం ఒక సింగిల్ లైన్ రిప్లై కూడా లేదు. యస్, నో... ఏదో ఒక రిప్లై ఇవ్వొచ్చు. కాని, అలాంటిదేం లేదు.

సో, అతను రిప్లై ఇచ్చే స్థాయిలో బహుశా ఇప్పుడు నేను లేకపోవచ్చు. లేదా, అతని రిప్లైల ప్రయారిటీ లిస్టులో నేను లేను. ఏదైనా దాదాపు రెండూ ఒకటే అనుకుంటాను. 

నా వెంటబడి ఎప్పుడూ తిరగక పోయినా, సుమారు ఓ దశాబ్దం క్రితం, ఇదే వ్యక్తిని నేను పిలిచి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశాను!   


ఇంకో ఉదాహరణ - 

నా దృష్టికి తెచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీని ఈ మధ్యే నా బ్లాగులోనో, మ్యాగజైన్లోనో రాశాను. అప్పుడు థాంక్స్ చెప్పాడు, లైఫ్‌టైమ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు అన్నాడు. తర్వాత... నేను కాల్ చేసినప్పుడు అతని ఫోన్ ఎంగేజ్ వుంటుంది. నాకు మాత్రం నో కాల్ బ్యాక్. నా మెసేజ్ చూసుకున్నట్టు బ్లూ టిక్ వస్తుంది. నాకు మాత్రం నో రిప్లై! 

ఈ ఉదాహరణలో కూడా నీతి సేమ్ టూ సేమ్... అతని కమ్యూనికేషన్ ప్రయారిటీ లిస్టులో నేను లేను. దట్ సింపుల్. వేరే ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ కూడా ఈ కేర్‌లెస్‌నెస్‌ను సమర్థించలేవు.

కట్ చేస్తే - 

ఇలాంటి కమ్యూనికేషన్ లెవల్స్ పాటించేవాళ్లే సమాజంలో ఎలాంటి కష్టాల్లేకుండా హాయిగా ఎదుగుతారన్నది మన కళ్ళముందు మనం చూస్తున్న రియాలిటీ.            

ఈ రెండు లేటెస్టు ఉదాహరణల ద్వారా నేను నేర్చుకున్న కొత్త పాఠం ఏంటంటే... ఫిలిం ఇండస్ట్రీలోగాని, సమాజంలోగాని కొంతమంది అనుభవజ్ఞులు పదే పదే చెప్పే పాత పాఠాలు తుచ తప్పకుండా ఖచ్చితంగా పాటించాలని. సో... తప్పు ఎక్కడోలేదు. నాలోనే వుంది. నన్ను నేనే కరెక్ట్ చేసుకోవాలి.  

నేను తెలుసుకొన్న ఇంకో లేటెస్ట్ నిజం ఏంటంటే, పూరి మ్యూజింగ్స్ వూరికే పుట్టలేదని.

Saturday 14 November 2020

మనోహరమ్ సినీఫీల్డువైపే!

'మనోహరమ్' ప్రధానంగా ఒక కులాసా పాజిటివ్ డిజిటల్ మ్యాగజైన్. సక్సెస్ సైన్స్, సినిమాలు, సరదాలే (Mindset, Movies, Masti) ప్రధానంగా వివిధ అంశాలమీద కంటెంట్ వుంటుంది. వీటిలో సక్సెస్ సైన్స్ తర్వాత స్థానం సినిమాదే.

సినిమాఫీల్డులో వ్యక్తులు, సంస్థల ఉనికి గాలిబుడగలాంటిది. ఎప్పుడు ఏ బుడగ టప్‌మని ఎలా ఎందుకు పగిలిపోతుందో ఎవ్వరికీ తెలియదు. చాలా విషయాల్లో అన్‌సర్టేనిటీ అనుక్షణం వెన్నాడుతుంటుంది. వుట్టుట్టి గాసిప్స్ తప్ప, ఫీల్డులోని కష్టనష్టాలు బయట తెలియవు. ఈ నేపథ్యంలో – సినిమారంగానికి సంబంధించినంతవరకు మనోహరమ్‌లో వంద శాతం పాజిటివ్ రైటప్‌లే వుంటాయి. ఎలాంటి సందర్భంలో అయినా వంద శాతం సినీఫీల్డువైపే పాజిటివ్‌గా వుంటుంది మనోహరమ్.

మనోహరమ్‌లో సినిమా రివ్యూలకోసం ప్రత్యేకంగా కాలమ్ లేదు. కాని, రివ్యూలు కూడా వుంటాయి. మళ్లీ వెనుకటి సినిమారంగం, విజయచిత్ర పత్రికల రోజులు గుర్తుకువచ్చేలా .. మనోహరమ్‌లో సినిమా రివ్యూలు పూర్తి విభిన్నంగా, నిర్మాణాత్మకంగా వుంటాయి. అలాగే – చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలవరకు… కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, పోస్ట్ రిలీజ్ దాకా – మనోహరమ్ మ్యాగజైన్‌లో విభిన్నమైన Conceptual and Customized Promotion Plans పరిచయం చేస్తున్నాను. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఈ సౌకర్యాల్ని వినియోగించుకొంటారని ఆశిస్తున్నాను. 

ఈ సౌకర్యాల్ని దర్శకనిర్మాతలు వినియోగించుకొనేలా చేస్తే బాగుంటుందని పీఆర్వో మిత్రులకు నా ప్రత్యేక మనవి. అలాగే – ‘మనోహరమ్’ లో హీరోహీరోయిన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ఇంటర్వ్యూలు, రైటప్స్ కోసం కూడా ఫిలిం జర్నలిస్టులు, పీఆర్వో మిత్రులు నన్ను నేరుగా  కాంటాక్ట్ చేయవచ్చు. నా ఈమెయిల్ అడ్రస్: mchimmani10x@gmail.com,వాట్సాప్ నంబర్: +91 9989578125

దీపావళి శుభాకాంక్షలతో...
మీ,
మనోహర్ చిమ్మని 

రచన, దర్శకత్వం... మనోహర్ చిమ్మని

సినిమాలూ, రైటింగ్... నా పూర్తిసమయాన్ని ఈరోజు నుంచీ ఈ రెండింటికే వినియోగిస్తున్నాను. 

మనోహరమ్ మ్యాగజైన్ నా రైటింగ్ ప్యాషన్‌లో భాగమే.

ఈమధ్య యూట్యూబ్ చానెల్ అనీ, పాడ్‌కాస్ట్ అనీ, ఫేస్‌బుక్ గ్రూప్ అనీ... వాటిని  స్టార్ట్ చెయ్యడానికి ఒకటి రెండుసార్లు కొంచెం టెంప్ట్ అయ్యాను.

కాని, ఇప్పుడు ఆ అవసరం లేదు. అంత సమయం లేదు.  

సినిమా, సినిమా, సినిమా.
రైటింగ్ ఫాలోస్.
అంతే.

గత కొన్ని నెలలుగా కూడా సినిమాల మీద నా దృష్టి పూర్తిస్థాయిలోనే వుంది. కాని, మార్చి నుంచి లాక్‌డౌన్ నా ప్రయత్నాలను, అప్పటివరకు నేను చేసుకున్న పనులను పడుకోబెట్టేసింది. ఇది చాలా పెద్ద దెబ్బ. అయినా సరే, ఇకనుంచీ, ఎలాంటి ఆటంకం వచ్చినా ముందుకే కదుల్తుండాలి తప్ప, ఇలా ఒక్క చోటే ఆగిపోకూడదని నిర్ణయించుకొన్నాను.

అందుకే ఈ పోస్టు. నాకోసం, నా రికార్డ్ కోసం.    

కట్ చేస్తే -  

జనవరి 18 నాటికి నా కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలన్న నిర్ణయం మీద గట్టిగా వున్నాను. అప్పటికి నేను పెట్టుకొన్న ప్రతి చిన్న గోల్ కూడా నేను వంద శాతం సాధిస్తాను. ఎవరి సహాయం వున్నా, లేకపోయినా. 

ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భ్రమల్లోనే ఇటీవల జీవితంలో చాలా ముఖ్యమైన సమయం చాలా సిగ్గుచేటైనవిధంగా వృధా అయిపోయింది. ఇంక అలాంటి భ్రమల్లో లేను నేను. అసలు అలాంటి జీవనశైలి కాదు నాది. అనవసరంగా నాకు కుదరని మార్గంలో వెళ్ళి కోలుకోలేని దెబ్బ తిన్నాను. ఎప్పుడైనా నా పనులు నేను చేసుకొన్నప్పుడే సక్సెస్ అయ్యాను. వేరొకరి మాటలు నమ్మిన ప్రతిసారీ మోసపోయాను. బాధపడ్డాను. ఆ అధ్యాయం ముగిసింది.     

నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. మధ్యలో నన్ను ఆవహించిన ఆ బలహీన మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడ్డాను. ఇప్పుడు నేను నేనే. నా దారిలో నేను హాయిగా పనులు చేసుకొంటూ వెళ్తున్నాను. అన్ని పనులూ అవుతున్నాయి. అవుతాయి. వరుసగా సినిమాలు చేస్తున్నాను. వరుసగా నా బుక్స్ పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడా పనిలోనే బిజీగా వున్నాను.

నా ఈ జర్నీలో ఒకరిద్దరు మిత్రులు, శ్రేయోభిలాషులు నావల్ల కొంత ఇబ్బందికి గురయ్యారు. వారు నాకు అందించిన సహకారానికి మరొక్కసారి నా హృదయపూర్వక అభివందనాలు. 

వారితోపాటు - నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు.  

Friday 6 November 2020

ఇట్స్ మీ, లావణ్య !!

హీరోయిన్ అంటే చాలు .. బయట చాలా చిన్నచూపు, చిల్లర చూపు ఉంటుంది. వాళ్ల కుటుంబ నేపథ్యం, వాళ్ల చదువులు, వాళ్ళ ఆదర్శాలు, ఆలోచనలు.. ఇవేవీ ఎవరికీ పట్టవు. హీరోయిన్ అంటే – జస్ట్ ఒక గ్లామర్ డాల్ అనుకుంటారు. ఇండస్ట్రీలో అందరితో “ఈజీ గోయింగ్” అనుకుంటారు. నటించిన ప్రతి సినిమాలో డైరెక్టర్‌తోనో, హీరోతోనో కనెక్ట్ చేస్తారు

అంతకంటే ఏం చేయగలరు? వాళ్ళ స్థాయి అది. అంతే.

కట్ చేస్తే –

నాగ్ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లోని “ఏమండోయ్ సారూ, మీరేనా మీరూ” అనే ఒక మంచి పాటలో ఈ అమ్మాయిని చూపిస్తూ ‘లావణ్య త్రిపాఠి’ అని నాకు మొట్టమొదటిసారిగా పరిచయం చేసిందొక ఫ్రెండు.

కొంతమంది హీరోయిన్స్ వేరే.
లావణ్య కూడా అంతే.
వేరే.

“Become addicted to constant and never-ending self-improvement” ~ Anthony J D’Anjelo

“To look is easy, to see is difficult!” ~ Mehmet Murat Ildan

మొదటి కొటేషన్ ఆమె ట్విట్టర్ కవర్ పేజి పైన చూడొచ్చు. అదొక అమెరికన్ రచయిత, కాలేజియేట్ ఎంపవర్‌మెంట్ ఫౌండర్‌ది. రెండోది ఇవ్వాళే లావణ్య పెట్టిన ట్వీట్. ఒక టర్కిష్ నాటక రచయిత కొటేషన్.

హీరోయిన్స్ గురించి ఏదో ఒకటి వాగేవాళ్ళల్లో కనీసం 1% అయినా ఈ రచయితల పేర్లు వినుంటారా?

బెస్ట్ విషెస్, లావణ్యా ..

Thursday 5 November 2020

మహారాష్ట్రలో రేపటినుంచే థియేటర్స్ ఓపెన్

మొన్ననే ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి. మహారాష్ట్రలో రేపు శుక్రవారం నుంచి అన్ని సినిమాథియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది.

50% ఆక్యుపెన్సీతో మాత్రమే నడపాలి. మిగిలిన అన్ని శానిటరీ జాగ్రత్తలు మామూలే.

కట్ చేస్తే -

ఏపీలో పర్మిషన్ ఇచ్చినా కూడా ఇంకా థియేటర్స్ ఓపెన్ కావల్సి వుంది. ఎక్కడో కేవలం 3, 4 చోట్ల మాత్రం ఇండిపెండెంట్‌గా కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసినా పెద్ద కలెక్షన్స్ లేవు. ఫీడింగ్‌కి కొత్త సినిమాల్లేవు. 

తెలంగాణలో మొన్న నవంబర్ 1 కి ఆర్డర్స్ ఇస్తారేమో అనుకున్నారంతా. కాని, అది జరగలేదు. ఒక ఇంటర్నల్ న్యూస్ ప్రకారం డిసెంబర్ మొదటివారం నుంచి గాని, డిసెంబర్ 11 నుంచి గాని ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని. 

ఆ తర్వాత - క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి వరుసగా వస్తాయి కాబట్టి - సంక్రాంతికంతా ప్రేక్షకులు అలవాటు పడిపోతారనీ, కరోణా ఎఫెక్టు ఇంకా తగ్గి, 50% నుంచు 100% ఆక్యుపెన్సీ సంక్రాంతికి తెచ్చుకోవచ్చనీ అంచనా. సంక్రాంతి నుంచి పెద్ద సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీ అయిపోయుంటాయి కాబట్టి థియేటర్స్ ఫీడింగ్‌కు కూడా సమస్య వుండదు. 

కరోనా వైరస్ నుంచి ఎలాంటి లాస్ట్ మినట్ జెర్క్‌లు లేవప్పుడే పై అంచనాలన్నీ సాధ్యం అని ఆయా థియేటర్స్ చెయిన్స్ యజమానులందరికీ తెలుసు. 

మనం ఎన్నో అనుకుంటాం కాని... థియేటర్స్ ఓపెన్ అయ్యి, థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మాస్ ప్రేక్షకులతోనే సినిమాలు నిజంగా సక్సెస్ అయ్యేది. కలెక్షన్ల వర్షం కురిసేది.     

ఇక యూట్యూబ్ చానల్!

ఏ మనిషి కూడా కేవలం ఒకే అభిరుచికి పరిమితమై ఉండలేడు. ఏ మనిషీ పర్‌ఫెక్ట్‌గా కూడా ఎన్నటికీ ఉండలేడు. అందుకే అతను లేదా ఆమె మనిషి అయ్యారు. 

చాలామందిలో చాలా విషయాల పట్ల ఆసక్తి వుంటుంది. ప్రవేశం కూడా వుంటుంది. కానీ, మనం ప్రభావితమైన కొన్ని సోకాల్డ్ రూల్స్ వల్ల, భయాలవల్ల 90 శాతం మనుషులు వారిలోని భిన్న అభిరుచుల్ని వారి మనసులోనే పాతిపెట్టేస్తారు. అవి ఎన్నటికీ పైకిరావు.

ఎప్పుడో అరవయ్యో, డెబ్బయ్యో దాటాక బాధపడతారు.

అంతకంటే విషాదం లేదు.

కట్ చేస్తే - 

అతి త్వరలో నా యూట్యూబ్ చానల్ ఒకటి ప్రారంభించబోతున్నాను. 

వ్యూస్ మీద వచ్చే డబ్బులకోసం కాదు. నేను చేయాలనుకున్నవన్నీ ఒక్కోటీ చేసెయ్యటంలో భాగంగా చేస్తున్నాను. అలాగని, వుట్టి టైమ్ పాస్ కోసం కూడా కాదు. పరోక్షంగా దాని ప్రయోజనం దానికుంటుంది. 

రెండు కెమెరాలు, మూడు సెటప్పులు, మేకప్‌లు, ఎడిటింగ్‌లు, థంబ్‌నెయిల్ డిజైన్స్ వగైరా ... ఇవేవీ వుండవు. 

కంప్లీట్ 'రా!'

మరిన్ని వివరాలు త్వరలోనే. 

Tuesday 3 November 2020

మనోహరమ్ మ్యాగజైన్ లైవ్!

అనుకున్నట్టుగా విజయదశమికి మనోహరమ్ మ్యాగజైన్‌ను లాంచ్ చేశాను. 

ఎడిటర్‌గా ఒక పత్రిక నడపడంలో ఉన్న ఆనందం నిజంగా అద్భుతం. అదిప్పుడు నేను అనుభవిస్తున్నాను... ఇన్ని లాక్‌డౌన్ వొత్తిళ్ల మధ్య, కొన్ని ప్రొఫెషనల్, పర్సనల్ వొత్తిళ్ళ మధ్య కూడా! 

కట్ చేస్తే - 

ఒక పత్రిక నడపడం అంత ఈజీ కాదు. పెద్ద బాధ్యత. అది వీక్లీ అయినప్పుడు ఇంకెంతో పనుంటుంది. చూస్తుండగానే వారం వచ్చేస్తుంది. 

పత్రిక ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అన్నది ఇక్కడ సమస్య కానే కాదు. పని ఎంత పర్‌ఫెక్ట్‌గా సమయానికి జరుగుతుందన్నదే ముఖ్యం. ఈ విషయంలో నేను అనుకున్నదానికంటే, ప్లాన్ చేసుకున్నదానికంటే బాగా పనిచేయగలుగుతున్నాను. 

ఈ పత్రిక ద్వారా నేను అనుకున్న ప్రయోజనాలను, లక్ష్యాలను ఒక్కొక్కటిగా తప్పక నెరవేర్చుకోగలనన్న నమ్మకం నాకు పత్రిక ప్రారంభానికి ముందే వంద శాతం ఉంది. అదిప్పుడు ఇంకా పెరిగింది. 

ఈరోజు నుంచీ.. ప్రతిరోజూ నా పని సమయంలో 50% పత్రికకోసం కెటాయిస్తున్నాను. మిగిలిన 50% లోనే నా సినిమా పనులు, రైటింగ్ పనులు, ఇతర అన్ని పనులూ జరుగేట్టు ప్లాన్ చేసుకున్నాను. 

తర్వాతి లక్ష్యం దీనికి సంబంధించి: మనోహరమ్‌ను ఒక బ్రాండ్‌గా ఎస్టాబ్లిష్ చేయడం. నా ఇతర యాక్టివిటీస్‌కు ఇది సపోర్ట్ అయ్యేలా దీన్ని తీర్చిదిద్దటం. 

ఈ విషయంలో నాకు సహకరిస్తున్న నా ఇంటర్నల్ టీమ్‌కు బిగ్ థాంక్స్. 

బెస్ట్ విషెస్ టు మి...  

Tuesday 27 October 2020

వెన్నెల జలతారు


సికింద్రాబాద్ నడిబొడ్డునే వున్నా తపోవనంలా వుంది బుక్ సెలెక్షన్ సెంటర్. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, చల్లగా…

విశాలమైన స్పేస్‌లో విశ్వవిజ్ఞానాన్ని మోస్తూ- గోడల నిండా, మధ్యలో బుక్ రాక్స్ ఠీవిగా నిల్చుని వున్నాయి. మాస్కులు ధరించిన పుస్తకప్రియులు అక్కడక్కడా మునుల్లా మౌనంగా రాక్స్ దగ్గర నిల్చుని, వాళ్లకు కావల్సిన పుస్తకాలను వెతుక్కొంటున్నారు.

ఎలిజబెత్ గిల్బర్ట్ కొత్త నవల “సిటీ ఆఫ్ గాళ్స్” పుస్తకాన్ని తిరగేస్తూ ఫిక్షన్ రాక్స్ దగ్గర నిల్చునివుంది మహేశ్వరి.

“హలోవ్”

తనకి బాగా పరిచయమైన గొంతు. ఆ సమయంలో అక్కడ తను వూహించని గొంతు. ఆశ్చర్యంతో వెనక్కి తిరిగిచూసింది మహేశ్వరి.

అతడే!

“వాటే సర్‌ప్రయిజ్!” ముక్కుమీదున్న మాస్కుని కిందకు లాక్కొంటూ అన్నాడతను.

“అవును. నాకూ ఆశ్చర్యంగానే వుంది. నిన్నిక్కడ చూస్తాననుకోలేదు” ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు మహేశ్వరి.

“నేను కూడా మిమ్మల్ని ఇక్కడ వూహించలేదు మేడమ్” అతని గొంతులో తొంగిచూసిన చిలిపితనానికి బ్లష్ అయిన ఆమె బుగ్గలను మాస్క్ చాలావరకు కప్పేసింది.

“నేనిక్కడ రెగ్యులర్ కస్టమర్‌ని. నెలకి రెండుసార్లయినా వస్తాను… న్యూ ఎరైవల్స్ చూడ్డానికి” మాస్క్‌ని కొద్దిగా కిందకి దించుతూ అంది మహేశ్వరి.

“మరి నేను కూడా ఇక్కడికి తరచూ వస్తుంటాను. మనం ఒక్కసారి కూడా ఎదురుపళ్లేదు చూడు!”

“దాందేముంది… ఇద్దరం ఒకేరోజు ఓకే సమయానికి రావాలని రూలేం లేదుగా!”

“అఫ్కోర్స్” ఒప్పుకొంటూ, తననే కన్నార్పకుండా చూస్తున్న అతని చేతిలో వున్న పుస్తకం వేపు చూపులు మరల్చింది మహేశ్వరి.

“టూల్స్ ఆఫ్ టైటాన్స్” హార్డ్ బౌండ్. టిమ్ ఫెర్రిస్ పుస్తకం.

అతనేదో మాట్లాడబోయాడు. పెదాలపై చూపుడు వేలు పెట్టుకొని, కళ్ళుపెద్దవిగా చేసి, మాట్లాడవద్దన్నట్టుగా సైగచేసింది మహేశ్వరి.

అక్కడి తపోవనం ప్రశాంతతను భగ్నం చేయకుండా, ఇద్దరూ కౌంటర్ వైపు కదిలారు. కౌంటర్ దగ్గర ఎవరి పుస్తకాలకు వారే బిల్ చెల్లించి బయటకొచ్చారు.

అయిదు నిమిషాల్లో వాళ్లిద్దరూ కూర్చొన్న కారు ప్యారడైజ్ ట్రాఫిక్‌లోంచి బయటపడి, రాణిగంజ్ మీదుగా, నెక్లెస్‌రోడ్‌లోకి ప్రవేశించింది.

చేతిలో వున్న మొబైల్లో టైమ్ చూసింది మహేశ్వరి. సాయంత్రం 4 అవుతోందప్పుడు…

డ్రయివింగ్ సీట్లో అతను, పక్కనే మహేశ్వరి. ఇద్దరికీ ఇదొక వూహించని కలయిక. మాస్కులు పూర్తిగా తొలగించిన ఇద్దరి ముఖాల్లోనూ ఏదో కొత్త మెరుపు.

నెక్లెస్ రోడ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ఒక పార్కింగ్ ప్లేస్‌లో చిన్న జెర్క్‌తో కారాపాడతను.

“ఎక్కడికెళ్దాం?” అడిగాడు.

“ఇక్కడే కాసేపు ఇలాగే కూర్చుందాం” అంది మహేశ్వరి.

బుక్ సెలక్షన్ సెంటర్‌లోని ప్రశాంతత, ఆ తర్వాత అతన్ని అలా వూహించని విధంగా కలిసిన సంభ్రమం ఆమెను ఇంకా వదల్లేదు. అతడు ఆమెనే చూస్తున్నాడు. ఆమె కూడా రెప్పవేయకుండా అతన్నే చూస్తోంది.

నిమిషం. రెండు నిమిషాలు. మూడు నిమిషాలు… పక్కపక్కనే, ఒకరి కళ్ళళ్ళోకి ఒకరు చూసుకొంటూ, లాక్‌డ్ కార్లో కూర్చున్న ఇద్దరి శ్వాసల వేగం పెరిగింది. గబుక్కున అతని చూపుల నుంచి తప్పించుకొంటూ, తలతిప్పి కారు అద్దంలోంచి ఎదురుగా బయటికి చూడసాగింది మహేశ్వరి.

ఆమె శ్వాసలో పెరిగిన వేగానికి, బిగుతుగా ఆమె ధరించిన తెల్లటి కుర్తీ పైభాగం కల్లోల సముద్రపు అలలా ఎగిసిపడుతోంది.

మహేశ్వరినే చూస్తూ, వొళ్ళో బిగిసిపెట్టుకొన్న ఆమె రెండుచేతుల మీద నెమ్మదిగా తన ఎడమచేయి వేశాడతను. అంతే. ఏం జరుగుతోందో తెలిసేలోపు, మహేశ్వరి రెండు చేతుల్లో అతని ముఖం ఉంది. తర్వాత కొన్ని నిమిషాలపాటు, పసిఫిక్ ఓషన్ అలల్లో చెలరేగి ఆడుకొనే జంటసర్ఫర్స్‌లా హద్దూ అదుపూ లేకుండా ఆడుకున్నాయి వారిద్దరి పెదాలు.

“బుజ్జీ, ఎక్కడికైనా లేపుకెళ్ళు నన్ను. ఒక్క 24 గంటలు… ఎట్ లీస్ట్ ఒక్క రాత్రి!”

తన రెండు చేతుల్లో వున్న అతని ముఖాన్ని విడిచిపెట్టకుండా అతని కళ్ళల్లోకే చూస్తూ, చిన్న గొంతుతో గుసగుసగా చెప్పింది మహేశ్వరి.

మహేశ్వరి వైపే కన్నార్పకుండా చూస్తూ, “ఆర్యూ ష్యూర్?”… తడిసిన పెదాలతో అడిగాననుకున్నాడతను, కాని శబ్దం బయటికి రాలేదు.

అతని మొహంలోకే చూస్తూ, “అవును” అని 48 ఫ్రేమ్స్‌లో రెప్పలు వాలుస్తూ కళ్లతోనే సమాధానం చెప్పింది మహేశ్వరి.

క్షణంలో కారు స్టార్ట్ చేశాడతను.

నెక్లెస్‌రోడ్ నుంచి, ఎన్‌టీఆర్ మార్గ్ మీదుగా దూసుకెళ్తూ టాంక్‌బండ్ ఎక్కింది కారు.

కాసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

“పెద్ద గొప్ప విషయమేం కాదనుకో… కాని, ఈరోజు మనమిలా కల్సుకోడం నిజంగా విచిత్రంగా ఉంది కదూ?” అతనివైపు చూస్తూ అంది మహేశ్వరి.

ఎదురుగా రోడ్డుమీదున్న ట్రాఫిక్‌ని చూస్తూ డ్రైవ్ చేస్తూనే, అవునన్నట్టుగా తలవూపాడతను.

ఇద్దరి మధ్యా మళ్ళీ కొన్ని నిమిషాలు మౌనం.

“ఎలావుంది లైఫ్, బుజ్జీ?” మళ్లీ మహేశ్వరే అడిగింది. 

ఊహించని ప్రశ్న.

“క్వయిట్… ఓకే” కొంచెం తడబాటుగా చెప్పాడతను.

“నాకయితే భరించలేనంత రొటీన్‌గా వుంది” ఎదురుగా కనిపిస్తున్న ట్రాఫిక్‌లోకి చూస్తూ అంది మహేశ్వరి.

అతడేం మాట్లాడలేదు.

బేగంపేట్ బ్రిడ్జ్ ఎక్కి, లైఫ్‌స్టయిల్ మీదుగా కిందకి దిగుతున్న వందలాది కార్లల్లో, వీళ్లిద్దరూ కూర్చొన్న బ్లూ వోక్స్‌వాగన్ కూడా ట్రాఫిక్‌లో కల్సిపోయి నెమ్మదిగా ముందుకు కదులుతోంది.

బయట చిన్నగా చినుకులు. లోపల చల్లటి ఏసీ. అయినా ఇద్దరి ముఖాలూ వెచ్చటి ఆవిరి పరదా కప్పేసినట్టు సన్నటి చమట చుక్కలతో తడిసిపోయాయి.

ఇరవై నిమిషాల తర్వాత, ఏవేవో మలుపులు తిరిగుతూ కంటోన్మెంట్ ఏరియాదాటి, ఒక ‘ఓయో’ ముందు ఆగింది కారు. వెనకసీట్లోంచి టూర్ల కోసం తన కార్లో ఎప్పుడూ వుండే ఒక బ్యాక్‌ప్యాక్, ఇంకో స్పేర్ క్యాజువల్స్ క్యారీబ్యాగ్ తీసుకొని కారు లాక్ చేశాడతను.

మహేశ్వరి లాబీలో కూర్చొన్న అయిదు నిమిషాల్లో రిసెప్షన్ దగ్గర పని ముగించేశాడతను. అయిదు నిమిషాల తర్వాత వారికి కెటాయించిన ఓయో ఎక్జిక్యూటివ్ సూట్ వైపు నడవసాగారిద్దరూ.

“నేను మా ఇంటికి కాల్ చేసి చెప్పాను, రావట్లేదని” నడుస్తూ అన్నాడతను, ఆమె వైపు చూడకుండానే.

“నేను కూడా ఏదో చెప్పాలే… మా అత్తగారు, మామగారున్నారు ఇంట్లో. బాబుని వాళ్లు బాగా చూసుకుంటారు” చెప్పింది మహేశ్వరి.

సూట్‌లోకి ప్రవేశిస్తూనే, డోర్ లాక్ చేసి వెనక్కి తిరుగుతూ భుజానికున్న బ్యాక్‌ప్యాక్‌నీ, చేతిలో వున్న క్యారీ బ్యాగ్‌నీ అలా కిందకి వదిలేసి, ఇప్పటికే ఆలస్యమైందన్నట్టుగా మహేశ్వరిని గట్టిగా దగ్గరికి లాకున్నాడతను. అంతకంటే వేగంగా అతని ముఖాన్ని తనవైపు వొంపుకొంది మహేశ్వరి.

* * *

కాఫీ ఒకసారి సిప్ చేసి, కప్పుని నెమ్మదిగా ముందున్న టీపాయ్ మీద పెట్టింది మహేశ్వరి. వెనక జుట్టుకి వున్న రబ్బర్ బాండ్‌ని తీసేసి, ఒక్కసారిగా తల విదిల్చింది. చిక్కటి కాఫీ కలర్‌లో వున్న వొత్తైన జుట్టు తెరలు తెరలుగా ఆమె ముఖాన్ని కప్పేస్తూ అందంగా జాలువారింది. మహేశ్వరినే చూస్తూ కాఫీ తాగుతున్నాడతను. 

జుట్టు వెనక్కి తోసుకొంటూ, పక్కన చెయిర్లో వున్న తన బ్యాగ్‌లోంచి ఏదో తీసి ముందున్న టీపాయ్ మీద పెట్టింది మహేశ్వరి.

మాల్బరో సిగరెట్ పెట్టె.

“ఇదెలా వచ్చింది?” ఆశ్చర్యంగా అడిగాడతను.

“నువ్వు బాత్రూమ్‌లో ఉన్నపుడు తెప్పించాను” 

“నీకింకా గుర్తుందా?!… అయినా నేను మరీ అంత చెయిన్ స్మోకర్‌ని కాదులే మహీ!” 

“నేనన్నానా?!” అంటూ బాక్స్‌ని అతనివైపుకి తోసింది మహేశ్వరి. 

“నాకు బాగా క్లోజ్ అయినవాళ్లతో, బాగా నచ్చినవాళ్లతో ఇలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు గానీ, బాల్కనీలో నిల్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు గానీ, ఆరుబయట మిద్దెమీద ఏ అర్థరాత్రో నేనొక్కన్నే నాతో నేనే మాట్లాడుకొంటూ తిరుగుతున్నప్పుడుగానీ, ఓ చల్లటి సాయత్రం నేనొక్కన్నే ఏ హైవే పక్కనో కారాపుకొని నిల్చున్నప్పుడు గానీ… ఒక సిగరెట్ అలా కాల్చాలనిపిస్తుంది” ఒక ట్రాన్స్‌లోలా చెప్తూ టక్కున ఆపేశాడతను. 

“వావ్… నీ సిగరెట్ పఫ్ వెనక ఇంత భావుకత్వం నేనెప్పుడూ విన్లేదు బుజ్జీ!… ఇదంతా మీ ఆవిడకు తెలీదనుకుంటాను?!” 

“తెలుసు. మా పెళ్లికి ముందూ, పెళ్లైన కొత్తలో కూడా చెప్పాను. తను వద్దంది. బాధపడతానంది. ఎప్పుడైనా ఒకటి కాలిస్తే, నోట్లో ఓ హాల్స్ చప్పరించి, గంట గ్యాప్ తీసుకొని వెళ్తా ఇంటికి” 

“తప్పులేదు. అదే తర్వాత చెయిన్ స్మోకింగ్‌కు దారితీయొచ్చని ఆమె భయమేమో!” 

“ఇప్పుడు నాకు 39… అదే నిజమైతే, నేనిప్పటికే చెయిన్ స్మోకరయిపోయి… జేబులో ఓ పెట్టె, లైటర్ మెయింటేన్ చేస్తుండాలి” 

“పెళ్లైన కొత్తలో కదా… అప్పటి భయాలు అలాంటివి కావచ్చు”

“కావచ్చు” ఒప్పుకున్నాడతను.

“అయినా ఇప్పుడేముందిలే… ఏ ‘బియాండ్ కాఫీ’ కెళ్ళినా, అమ్మాయిలు కూడా చాలా ఫ్రీగా స్మోక్ చేస్తున్నారు. ఎవరిష్టం వారిది. దాని ఎఫెక్ట్ కూడా కొంచెం స్పృహలో ఉంటే చాలు” 

రెండుచేతులూ పైకెత్తి జుట్టుని సర్దుకొంటున్న మహేశ్వరినే చూస్తూ సిగరెట్ వెలిగించాడతను. ఇద్దరూ నడుస్తూ, సూట్‌ని ఆనుకొని వున్న ఓపెన్ సిటౌట్‌లోకి వెళ్ళి నిల్చున్నారు. 

కింద పచ్చటి లాన్స్. వాటి అవతల దట్టంగా పచ్చటి చెట్లతో నిండిన గ్రీనరీ. దూరంగా ఏదో గ్రౌండ్. చిన్న శబ్దం కూడా లేదు. ఉన్నట్టుండి పక్కనే నిల్చున్న మహేశ్వరివైపు చూశాడతను. 

బ్యాగ్‌లో ఉన్న అతని తెల్లటి టీషర్టు, పైజామా వేసుకొని ఉందామె. 

“ఇందాకటి డ్రెస్‌లో కంటే, వీటిలో ఇంకా సెక్సీగా కనిపిస్తున్నావ్” అన్నాడతను, ఆమెనే చూస్తూ. 

“షటప్” అంది బ్లష్ అవుతూ మహేశ్వరి. అతనెక్కడ చూస్తూ ఆమాటన్నాడో ఆమెకు అర్థమైంది. 

రెండు పఫ్‌లు గట్టిగా లాగి, సిగరెట్‌ను అక్కడున్న యాష్ట్రేలోకి కుక్కేశాడు. 

“నీకిష్టమైన వైన్ కూడా తెప్పిద్దామనుకున్నాను. కాని, నువ్విప్పుడేం తీసుకొంటున్నావో నాకు తెలీదుగా!” నవ్వుతూ అతనిమీదకు వొరిగిపోతూ అంది మహేశ్వరి. 

“మంచి పని చేశావు. నేనొక్కన్నీ తాగను”

“నేనున్నాగా కంపెనీకి…” అంది కన్నుగీటుతూ, అల్లరిగా. 

“ఓ పదేళ్లక్రితం మా ఆవిడ కూడా ఇలాగే అంది. కాని, ఒకసారి సిప్ చేసి ‘యాక్ థూ, ఇంత వగరెట్లా తాగుతారు’ అంటూ పక్కనపెట్టేసింది” 

అతను చెప్పిన పద్ధతికి పడీ పడీ నవ్వసాగింది మహేశ్వరి. 

“సో... మొత్తానికి మీ ఆవిడతో కూడా వైన్ తాగించావన్నమాట!” 

“తాగలేదు. అదే మొదటిసారి, చివరిసారి” 

నడుముకి టర్కీ టవల్ చుట్టుకొని, పైన ఏమీ వేసుకోకుండా ఉన్నాడతను. ఎలాంటి ఆచ్ఛాదనలేకుండా ఉన్న అతని ఛాతీ వైపు చూస్తూ, “నీ ఎక్స్‌పోజింగ్ భరించలేకపోతున్నాబుజ్జీ” అంటూ మరింత దగ్గరగా జరిగి, గట్టిగా అతన్ని అళ్ళుకుపోతూ, అతని ఛాతీలో తన ముఖం దాచుకొంది మహేశ్వరి. 

అతని రెండు చేతులూ ఆమె నడుముని చుట్టేశాయి. 

ఆమెనలాగే హత్తుకొని మెల్లిగా వెనక్కి నడిపించుకొంటూ లోపలికి తీసుకెళ్లాడతను. 

* * *

లోపల వాళ్లిద్దరూ కప్పుకొన్న తెల్లటి బెడ్‌షీట్, బయట మబ్బులు కప్పేసుకున్న వెన్నెలా ఒక్కలానే కనిపిస్తున్నాయి. 

తన వక్షం మీద తలపెట్టి కళ్ళుమూసుకొని పడుకొన్న అతని జుట్టుని సున్నితంగా నిమరసాగింది మహేశ్వరి.

“చెప్పు బుజ్జీ … మీ ఆవిడ గురించి చెప్పు” 

“ఇప్పుడెందుకులే మహీ” అన్నాడతను కళ్ళు తెరవకుండానే. 

“లేదు, ఇప్పుడే కావాలి” స్థిరంగా అంది మహేశ్వరి. 

“ఏం చెప్పాలి… తన బోటిక్కే తన లోకం. చెప్పలేనంత పని. బోటిక్‌లో పదిమంది ఎంప్లాయీస్. అంత హెక్టిక్ పని వద్దు అంటే వినదు” 

“మా ఆయన కూడా అంతే. ముందు జాబ్, ఇప్పుడు బిజినెస్… పనులూ, టెన్షన్లూ. నేనూ, మా బాబు ఎవ్వరం పెద్దగా గుర్తుకురామనుకుంటాను. అతను అంత కష్టపడుతోంది మాగురించే అనుకో… కాని, మా ఇద్దరికే సమయం దొరకనివ్వని ఆ కష్టం ఏం చేస్కోడానికి?” 

“పాయింటే” అన్నాడతను.

“సేమ్… మా ఆవిడా అంతే. నాకోసం కూడా తనకి టైమ్ దొరకదు. మేం ఎప్పుడు ఫ్రీగా కలిసి కబుర్లు చెప్పుకొన్నామో, ఎప్పుడు కలిసి తిన్నామో, ఎప్పుడు ఇంత ఫ్రీగా ఉన్నామో నాకు నిజంగా గుర్తు రావట్లేదు” 

“నీకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు తను ఫ్రీగా ఉండాలిగా మరి?” 

“అవును, అందుకే ఏదో ఒక బుక్ చదువుకొంటూ గడిపేస్తాను.. నేను ఫ్రీగా ఉంటే” 

“నేనూ అంతే. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అతనింట్లో ఉండడు. నాక్కూడా బుక్స్ తప్ప ఇంకో తోడు లేదు” పక్కన లాంప్ షేడ్ కింద వున్న ఎలిజబెత్ గిల్బర్ట్ పుస్తకం కేసి చూస్తూ అంది మహేశ్వరి. 

“మీది లవ్ మ్యారేజ్ కదా?” అడిగాడతను. 

“అవును. మీ లవ్ మ్యారేజ్ లాగే” అతని జుట్టు పట్టుకొని అల్లరిగా లాగుతూ అంది మహేశ్వరి. 

“ఏదో చేయాలి…” తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడతను. 

“అవును, ఏదో చేయాలి!” స్థిరంగా అంది మహేశ్వరి. 

లేచి, ఆమె ముఖంలో ముఖం పెట్టి, ఆమె కళ్ళళ్ళోకే సూటిగా చూస్తున్నాడతను. అతని కళ్లల్లోకి అలాగే చూస్తూ, నెమ్మదిగా ముందుకి అతని పెదాలవైపు వొంగిందామె. 

* * * 

అర్థరాత్రి దాటింది.

బాల్కనీలో ఒక్కడే నిల్చుని ఉన్నాడతను. అతని చేతిలో సిగరెట్ కాలుతోంది. గట్టిగా ఒక పఫ్ లాగి, తలపైకెత్తి ఆకాశం వైపు చూశాడతను. అప్పటిదాకా కప్పేసిన మబ్బుల పరదాలు తొలగిపోయి, ఆకాశం నిండా వెండి వెన్నెల. 

ఎదురుగా చూశాడు. నియాన్ లైట్ వెళుతురులో అదే లాన్. అవే చెట్లు. దూరంగా అదే విశాలమైన గ్రౌండ్. నెమ్మదిగా అవన్నీ ఒక్కొక్కటీ ఫేడవుటవుతూ ఇప్పుడతని కళ్లముందు ఒకప్పటి ‘అతను’ కనిపిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు, అతని నేపథ్యం, అతని చదువులు, స్నేహితులు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, అవసరాలు, బిజినెస్, డబ్బు, స్టేటస్‌, డెడ్ రొటీన్‌గా మారిన జీవితం… స్లైడ్ ప్రొజెక్టర్‌లోంచి చూపిస్తున్నట్టుగా ఒక్కో దృశ్యం వరుసగా కనిపించసాగాయి. 

వీటన్నిటి మధ్య అతను బాగా ఇష్టపడే దృశ్యమేదో అతనికి కనిపించీ కంపించకుండా దోబూచులాడుతోంది. సిగరెట్ పఫ్ గట్టిగా లాగి, ఆఖరి ప్రయత్నంగా ఆ దృశ్యం కోసం మళ్లీ ఎదురుగా చూశాడు. అప్పటిదాకా అతనితో దోబూచులాడుతూ అతనికి కనిపించని ఆ దృశ్యం ఇప్పుడతని కళ్లముందు చాలా స్పష్టంగా కనిపించింది.

అది… అతను మర్చిపోయిన అతని జీవన విధానం. అతను కలలుగన్న అతని జీవితం.

సిగరెట్ యాష్ ట్రేలో కుక్కేసి వెనక్కి తిరిగాడతను.

ఎదురుగా మహేశ్వరి.

“నిద్రపోలేదా బుజ్జీ?” అడిగింది మహేశ్వరి.

“నిద్రరాలేదు మహీ” అన్నాడతను.

“ఏం?”

“ఆలోచిస్తున్నాను”

“దేని గురించి?”

“ఇలా… మనం ఇంకొన్ని గంటలేనా అని”

“అంతే అనుకుంటాను” నెమ్మదిగా చెప్పిందామె.

“నో… రేపూ, ఎల్లుండీ, ఆ తర్వాతా… ఎప్పుడూ మనం ఇంత బాగా ఉండగలిగితే బాగుండు”

“ఇంకా బాగా ఉండొచ్చు. కొన్ని వొదులుకొంటే”

“రాత్రే నేను నావైపు అన్నీ వొదిలేసుకున్నాను”

“నేను కూడా”

అస్పష్టంగా ఉన్న ఆ మసక వెళుతురులో అతని కళ్లల్లో మెరిసిన ఆనందాన్ని ఆ క్షణం స్పష్టంగా గుర్తించింది మహేశ్వరి. ఆమెను దగ్గరగా తీసుకొని గట్టిగా హత్తుకున్నాడతను.

అతడు… ఆమె భర్త.

అంత అర్థరాత్రి దాటిన తర్వాత, ఆ సమయంలో ఎక్కడో దూరంగా, ఎవరు ఏ పనిచేసుకొంటూ వింటున్నారోగాని, ఒక అద్భుతమయిన పాత హిందీ పాట మెల్లగా ఫేడిన్ అయి, బాగా వినిపించసాగింది.

ఆధా హై చంద్రమా రాత్ ఆధీ-

రహ్ న జాయే తేరీ మేరీ బాత్ ఆధీ, ములాఖాత్ ఆధీ…

*** *** ***

కథ వెనుక కథ:

వెన్నెల జలతారు… Very mystical. వెన్నెల signifies something that’s short, that’s fine, that’s romantic, that’s soothing… And a lot more. జలతారు is the jingle of it… That’s the temptation, lure and beauty. A series of memories, sweet nothings. Or cool volcanoes.

వెన్నెల జలతారు .. ఇంత భావుకత్వం నిండిన టైటిల్ నేనెప్పుడూ పెట్టలేదు. ఒక కథ రాస్తున్నాను, నాకు ఇలాంటి టైటిల్ కావాలని ఒక ఫ్రెండుని అడిగాను. ఆ ఫ్రెండు నాకిచ్చిన 5 టైటిల్స్‌లో నేను దీన్ని ఎంచుకున్నాను. 1997 లో పబ్లిష్ అయిన నా ఇంకో కథ “సౌందర్య లహరి” కి 2020 లో నేను చేసిన రీమిక్స్ ఇది. 

ఈ కథ చివర్లో, కేవలం ఒక 3 పదాలు-7 అక్షరాల వాక్యాన్ని తీసేస్తే అదింకో ముగింపు అవుతుంది. ‘డైరెక్టర్స్ కట్’ లాగా, రైటర్స్ కట్ అన్నమాట! ఎవరికిష్టమైన ముగింపుని వారు చదువుకోవచ్చు.

– మనోహర్ చిమ్మని 

Monday 26 October 2020

వారం వారం ఇక 'మనోహరమ్!'


కేవలం ఒక రెండు వారాల ముందు వాష్‌రూమ్‌లో ఉండగా నాకీ ఆలోచన వచ్చింది. బయటికి వస్తూనే పెన్నూ పేపర్ తీసుకున్నాను. అరగంటలో పేపర్ మీద మొత్తం ప్లానింగ్ అయిపోయింది. వెంటనే సంబంధించిన ఫాలో అప్ పనులమీద పడిపోయాను. 

అలా మొదలైంది నా ఆన్‌లైన్ మ్యాగజైన్ "మనోహరమ్" ఆలోచన, ఎక్జిక్యూషన్. 

సినిమా అవసరాలకు సంబంధించి అంతకు కొద్దిసేపటి క్రితమే నా ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక పోస్టు పెట్టాను - ఫోటోషాప్ తెలిసిన ఒక కొత్త అప్రెంటిస్/అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి, నా టీమ్‌లో పనిచేయడానికి అని. మెసేజ్‌లు, కాల్స్ వస్తున్నాయి. కాని, ఆ పనులన్నీ పక్కనపెట్టి పూర్తిగా ఆన్‌లైన్ మ్యాగజైన్ పని ఒక్కదానిమీదే ఫోకస్ పెట్టాను.    

కట్ చేస్తే - 

ముందు ఒక తేదీ అనుకున్నాను మ్యాగజైన్ లాంచ్‌కి. కాని, కొందరు పెద్దలు వద్దన్నారు. కొద్దిరోజుల్లో విజయదశమి ఉంది, ఆరోజు లాంచ్ చెయ్యి అని గట్టిగానే చెప్పారు. వారి మాట విన్నాను. 

మొత్తం ప్లానింగ్ నుంచి, కంటెంట్ క్రియేషన్ నుంచి, లాంచ్ వరకు... అంతా ఒంటరి పోరాటమే. ప్రతిరోజూ కౌంట్‌డౌనే. మొత్తానికి నేను వేసుకున్న మ్యాగజైన్ డిజైన్ ప్రకారం కంటెంట్ పూర్తిచేశాను. 

సైట్ బిల్డింగ్‌కు సంబంధించి నాకు అవసరమైన టెక్నికల్ హెల్ప్ రత్నాకర్ చేశాడు. అదే సమయంలో అతనికి ఆఫీస్‌లో ఎన్ని వత్తిళ్ళు ఉన్నా కూడా నా కోసం దాదాపు ప్రతిరోజూ రాత్రి 12 తర్వాత ఆన్‌లైన్లో కొన్ని గంటలు కెటాయించాడు. నేనే ఒకపట్టాన కాంప్రమైజ్ కాను అంటే, రత్నాకర్ నాకు తాత ఆ విషయంలో. అండ్... మొత్తం పని, నా డౌట్స్, క్లారిఫికేషన్స్, కరెక్షన్స్ అన్నీ ఆన్‌లైన్లోనే! సో, మొత్తానికి ఎలాగయితేనేం... నేను అనుకున్నట్టుగా వర్డ్‌ప్రెస్‌లో మ్యాగజైన్ సెటప్ బాగా వచ్చింది. బిగ్ థాంక్స్ టూ రత్నాకర్. 

మొబైల్ వ్యూకి సంబంధించి ఇంకాస్త ట్వీకింగ్ వుంది. కొన్ని చిన్న చిన్న మార్పులున్నాయి. అదంతా వచ్చే వారం ఎడిషన్ నాటికి సెట్ చేస్తాను.   

అనుకున్నట్టుగా విజయదశమికి మ్యాగజైన్ లాంచ్ చేశాను. ఇక దీన్ని విజయవంతంగా నడిపిస్తూనే, నా ఇతర పనులు కూడా చేసుకోవాలి. తర్వాత నేను రాసిన కేసీఆర్ బుక్ రిలీజ్, ఆ తర్వాత నా కొత్త సినిమా లాంచ్, ఆ తర్వాత ఇంగ్లిష్ మ్యూజిక్ వీడియో, ఆ తర్వాత వైజాగ్‌లో నా ఫిలిం షూట్ ... అన్నీ వరుసనే వున్నాయి. ఇంక ఇప్పట్నించీ ఒక్కోటి కదుల్తాయి. 

కట్ చేస్తే - 

ఈ మ్యాగజైన్ ప్రారంభం వెనుక నాకు కొన్ని సీరియస్ లక్ష్యాలున్నాయి. ఏదో పొద్దుబోక చేసిన పని మాత్రం కాదిది. చాలా వుంది కథ. 

Saturday 17 October 2020

Make Films That Make Money!

మీకు తెలుసా... ఇప్పుడింక సినిమాలు ఎవరయినా ఎలాంటి భయం లేకుండా తీయవచ్చు! కొంత ఇన్వెస్ట్‌మెంట్, కొద్దిమంది లైక్‌మైండెడ్‌లతో కూడిన చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అదే టీమ్!

మంచి కమర్షియల్ సినిమా... అనుకున్న కాన్‌సెప్ట్‌తో, అనుకున్న విధంగా తీయవచ్చు.

"చిన్న సినిమాలకు థియేటర్స్ లేవు, ఇవ్వం" అనే సమస్య ఇప్పుడు లేదు. అసలు థియేటర్స్ ఉనికికే ఎసరొచ్చే టైమ్ వచ్చింది! 

ఏవో కొన్ని ఆడియో విజువల్ వండర్స్ లాంటి అత్యంత అరుదైన భారీ సినిమాల విషయంలో తప్ప, అసలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకొనే సంస్కృతే ప్రపంచమంతా క్రమంగా కనుమరుగు కాబోతోందని అధ్యయనాలు చెప్తున్నాయి.  

సో... ఇప్పుడు థియేటర్లకు రెంట్స్, పోస్టర్స్, పబ్లిసిటీ, క్యూబులూ  వంటి రిలీజ్ ఖర్చులు కూడా లేకుండా, సినిమాలను ఎప్పుడంటే అప్పుడు, హాయిగా ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు, ఏటీటీల్లో కూడా! 

నేను చెబుతున్నది వందలకోట్ల హైప్‌లు క్రియేట్‌చేసే భారీ సినిమాల గురించి కాదు. అదంతా పెద్ద గ్యాంబ్లింగ్. అది మన సబ్జెక్ట్ కాదు. దానికోసం అతిరథమహారథులు, హేమాహేమీలు చాలామంది ఉన్నారు. మనకు అంత బడ్జెట్స్ వద్దు. అంత సమయం కూడా కెటాయించలేం. మహా బోర్...

నేను చెబుతున్నది కేవలం చిన్న బడ్జెట్ కమర్షియల్ సినిమాల గురించి... ఆ భారీ సినిమాలతో పోలిస్తే, దాదాపు పూర్తిగా రిస్క్-ఫ్రీ సినిమాల గురించి...

అంతా కొత్త టాలెంటు, కొత్త కథలు, కొత్త తరహా రనగేడ్ ఫిలిం మకింగ్... వేరసి, ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనే ట్రెండీ కమర్షియల్ సినిమాలు! ... సబ్జక్ట్ ఏదైనా కావచ్చు. ప్రేక్షకున్ని ఆ 110 నిమిషాలో, 120 నిమిషాలో కట్టిపడేసే సత్తా మేకింగ్‌లో ఉండాలి. టీజర్‌తో టికెట్ బుక్ చేయించగలగాలి. 

నిజంగా నెలకో సినిమాతో కోట్లు సంపాదించవచ్చు. ఇందులో ఎలాంటి అతిశయోక్తిలేదు. మొన్న కొన్ని గంటల్లోనే, ఓటీటీలో సుమారు 2 కోట్లు కొల్లగొట్టి చూపించాడు ఆర్జీవీ. తాజాగా ఈ ప్రూఫ్ చాలు!

ఇకనుంచీ ఇదే రియాలిటీ. కంటెంట్ క్రియేటర్‌కు లాభాలు తెచ్చే ఇంకెన్నో టెక్నాజికల్ డెవలప్‌మెంట్స్ కూడా ఈ బిజినెస్‌లో రాబోతున్నాయి.

కట్ చేస్తే -

లాక్‌డౌన్ నుంచి ఇంకాస్త రిలీఫ్ తర్వాత  వరుసగా నా సీరీస్ ఆఫ్ సినిమాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రీప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోడానికి ఇప్పుడెలాంటి అడ్డంకులు లేవు. కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ, ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అన్ని పనులూ హాయిగా చేసుకోవచ్చు.   

నిజంగా ఆసక్తి ఉండి, తక్కువస్థాయిలోనయినా సరే... వెంటనే ఇన్వెస్ట్ చేయగల లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్లు, మైక్రో ఇన్వెస్టర్లు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 

హీరోగా/ఆర్టిస్టుగా తెరమీద పరిచయం కావాలనుకొనే ఇన్వెస్టర్-ఆర్టిస్టులు కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు బిజినెస్ లో షేర్ ఉంటుంది.

వెంటనే ఇన్వెస్ట్ చేయగల ఆసక్తి, స్థోమత, సీరియస్‌నెస్ ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే మీ పేరు, వివరాలు, ఫోన్ నంబర్ తెలుపుతూ వాట్సాప్ చేయండి.

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం. 

బెస్ట్ విషెస్...

WhatsApp: +91 9989578125

ఒక నిర్ణయం విలువెంత? .. 2.0


నాకత్యంత ప్రియమైన ప్రపంచస్థాయి నవలారచయితల్లో బుచ్చిబాబు ఒకరు. ఆయన రాసిన ఒకే ఒక్క నవల .. "చివరకు మిగిలేది".

"గడ్డిపోచ విలువెంత?" అన్న సింపుల్ వాక్యంతో ఆ నవల ప్రారంభమవుతుందని నాకింకా గుర్తుంది. అదిక్కడ కోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నిర్ణయమో చివర్లో చూద్దాం.

కట్ టూ మన నిర్ణయాలు - 

జీవితంలోని ప్రతిదశలోనూ ఎప్పటికప్పుడు వందలాది నిర్ణయాలు తీసుకుంటూవుంటాం మనం.

ఇష్టమైన పెన్ కొనుక్కోవడం నుంచి, పెళ్లిదాకా.
ఏదో ఓ కోర్స్ చదివి, మరేదో ఉద్యోగంలో చేరేదాకా.
ఏదో ఓ లోపల్లోపలి అతిచిన్న గోల్‌తో మరేదో ఇష్టంలేని ప్రొఫెషన్‌లో చేరి,
అందులోంచి బయటికి రావాలనుకొన్నా రాలేనంత 'పీకల లోతు' ఇరుక్కునేదాకా.

జీవితమంతా ఎన్నో నిర్ణయాలు.

చిన్నవీ, పెద్దవీ.

కానీ, మనం తీసుకొన్న ఒక నిర్ణయం తప్పని తర్వాత తెలిసినా .. వెంటనే దాన్ని సరిచేసుకొనే మరో కొత్త నిర్ణయం తీసుకోలేనప్పుడే అసలు చిక్కంతా!

కట్ బ్యాక్ టూ మన గడ్డిపోచ - 

ఎవరో ఏదో అనుకుంటారనో, అందరి దృష్టిలో బాగుండాలనో, ఇంకెవరిలాగానో ఉండాలనో .. ఇష్టం లేకపోయినా, ఈగో అడ్డొచ్చినా, ఎంత కష్టమయినా .. ముందు తీసుకున్న ఒకానొక నిర్ణయానికే కట్టుబడి ఉండటం అనేది ఓ పెద్ద తప్పుడు నిర్ణయం!

విషయం చిన్నది కావొచ్చు, పెద్దది కావొచ్చు. ఫలితాల్నిబట్టి ఎప్పటికప్పుడు తమ నిర్ణయాల్ని మార్చుకోలేనివారు ఎవరైనా సరే వారి జీవితంలో చాలా కోల్పోతారు. లేదా జీవఛ్చవంలా బ్రతుకుతుంటారు. పరోక్షంగా మరెందరి జీవితాలో ప్రభావితం కావడానికి కారణమవుతారు.

ఈలోగా జీవితం తెల్లారిపోతుంది.

ఇలా జీవితాల్ని తెల్లార్చుకొనేవారు సమాజంలో 99% ఉంటారు. మిగిలిన ఆ ఒక్క శాతం మంది మాత్రమే ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని మార్చుకొంటూ సిసలైన గట్స్‌తో ముందుకెళ్తుంటారు. అనుకున్న జీవితాన్ని అనుభవిస్తుంటారు.

అదీ తేడా.

ఈలెక్కన మనం తీసుకొనే ఒక నిర్ణయం విలువెంత?

ఒక గడ్డిపోచంత.  

కట్ చేస్తే -

ఈ దసరాకు నేను లాంచ్ చేస్తున్న నా కొత్త ఆనా్‌లైన్ మ్యాగజైన్ ఇటీవలి కాలంలో నేను తీసుకొన్న ఒక మంచి నిర్ణయం. కరోనా లాక్‌డౌన్ దాదాపు 2020ని మింగేసింది. ఎన్నో ప్లాన్లు ఉల్టా పుల్టా అయ్యాయి. నమ్మశక్యం కాని విధంగా, నావి కూడా ఎన్నో ప్లాన్లూ, పనులూ చూస్తుండగానే ఈ 7  నెలల్లో ఇట్టే ఆవిరైపోయాయి. 

సినిమాలు తప్పకుండా చేస్తాను. ఇంతకుముందులా, ఎప్పుడో ఒకసారి స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినట్టు కాకుండా, రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను. నాకు బోర్ కొట్టేవరకూ చేస్తాను. దానికింకా టైముంది. 

ఇప్పుడీ అక్టోబర్ 25 లాగే, బహుశా వచ్చే జనవరి 18 (2021) సినిమాలకు సంబంధించి నా జీవితంలో ఒక అతి ముఖ్యమైన లాండ్‌మార్క్ డే అయ్యే అవకాశముంది.    

అప్పటిదాకా ఈ ఆన్‌లైన్ మ్యాగజైనే నాకు పని, ప్యాషన్ కూడా. దీని ట్రాక్ దీనిదే. సినిమాలు సినిమాలే. ఏదీ ఆగదు. ఆగడానికి వీళ్లేదు.           

Thursday 15 October 2020

కౌంట్ డౌన్ 9, 8, 7...

సరిగ్గా 9 రోజులుంది. వచ్చే 25 వ తేదీ నాడు, విజయదశమి రోజున, నా కొత్త మ్యాగజైన్ ప్రారంభిస్తున్నాను. 

ఇదో కొత్త అనుభవం. నా రెగ్యులర్ బ్లాగింగ్‌కు కనీసం 10 రెట్లు ఎక్కువ పని! అయినా సరే, కావాలనే ఈ ప్యాషన్‌ను ఎన్నుకున్నాను. ఎలా సక్సెస్ చేస్తానో అన్న భయం లేదు. అలాంటి ఆలోచనా పధ్ధతి ఇప్పుడు అసలు లేదు. ఎందుకు సక్సెస్ చెయ్యలేను?... ఇదే ఇప్పుడు నా కాన్‌ఫిడెన్సు. 

కట్ చేస్తే - 

రెగ్యులర్ రైటింగ్స్ కోసం, కనీసం ఒక 10 మంది కంట్రిబ్యూటర్స్‌ను ఎన్నుకోవాలి. వాళ్లు వాలంటరీ రైటర్స్ అయ్యుండాలి. నేనేదో పెద్ద పత్రికాధినేత, ఇప్పటికిప్పుడే బాగా రెమ్యూనరేషన్స్ ఇస్తాను అనుకుంటే కష్టం! ఆ మాటకొస్తే, ఇప్పటివరకు నేను ఎన్నో దినపత్రికలకు, మ్యాగజైన్స్‌కు కథలు, కాలమ్స్, ఎడిట్ పేజీ ఆర్టికిల్స్ రాశాను. స్వాతి, ఆంధ్రభూమి వీక్లీలు తప్ప నాకు ఏ ఒక్క పెద్ద దినపత్రిక నుంచీ డబ్బులు రాలేదు. 

మ్యాగజైన్ టెక్నికల్ వర్క్ కొంత మిగిలుంది ఇంకా. ఆ ఫైన్ ట్యూనింగ్ త్వరగా పూర్తిచేయాలి. చూస్తుంటే 15 వ తేదీ కూడా వచ్చేసింది. ఇంక దేన్నీ ఈజీగా తీసుకొనే వీళ్లేదు. టీజర్ కట్ చేయాల్సి ఉంది, మ్యాగజైన్ కోసం! రెండో వారం, మూడోవారం కంటెంట్ ఫైల్స్ కూడా ఓపెన్ చెయ్యాలి. పని కూడా స్టార్ట్ అవ్వాలి.  

మ్యాగజైన్ పని ఒక్కటే కాదు, ఈ రోజునుంచీ, ప్రతి ఒక్క పనీ 10X స్పీడ్‌లో జరగాలి. జరిగేలా చెయ్యాలి. సినిమాలూ, పుస్తకాలూ, మ్యూజిక్ వీడియోలూ, ఇంకెన్నో...  ప్రతి ఒక్కటి ఇంక కదుల్తూనే ఉండాలి... ఒకదాని తర్వాత ఒకటి...  

ఎన్నో పనులున్నాయి. సమయం చాలా తక్కువగా ఉంది...  

Saturday 10 October 2020

విజయదశమికి విడుదల!

"ప్రపంచంలోని అతి పెద్ద అబద్ధం ఏది," అని శాంటియాగో అడిగినప్పుడు, మారు వేషంలో వున్న రాజు అంటాడు...
"ఏదో ఒక దగ్గర, జీవితంలో మనపై మనం నియంత్రణ కోల్పోయినప్పుడు, విధి మన జీవితాన్ని నియంత్రణ లోనికి తీసుకుంటుంది... అన్నది ప్రపంచపు అతి గొప్ప అబద్ధం."
- పావ్‌లో కోయెల్యూ, ది ఆల్కెమిస్ట్ 

కట్ చేస్తే - 

రెండు వారాల క్రితమే నేను అనుకొన్న ఒక తెలుగు ఆన్‌లైన్ మ్యాగజైన్‌ ఆలోచనను వెంటనే అమలుచేసి ఈ విజయదశమికి లాంచ్ చేస్తున్నాను, మీ అందరి ఆశీస్సులతో. 

ఇప్పటికే వెబ్‌లో ఉన్న ఓ వంద పైచిలుకు తెలుగు న్యూస్‌పోర్టల్స్, ఫిలిం వెబ్‌సైట్స్, ఎట్సెట్రా... వాటి ఇలాకాలో అవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేను ప్రారంభిస్తున్న మ్యాగజైన్ పూర్తిగా ఒక ఫీచర్స్ మ్యాగజైన్. సినిమా కంటెంట్ కూడా కొంత ఉంటుంది గాని, అది పూర్తిగా నా బ్లాగింగ్  శైలిలో ఉంటుంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఉండదు. యాడ్స్ ఉంటాయి.

ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్‌కు సంబంధించిన పూర్తివివరాలు ఒక చిన్న టీజర్ రూపంలో త్వరలోనే మీరు చూస్తారు. 

నా బ్లాగ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వగైరా అన్నీ కలిపి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో ఒక 100,000+ పాఠకులకు ఈ మ్యాగజైన్‌ రీచ్ ఉంటుంది. ఆసక్తి ఉన్న రైటర్ మిత్రులు, కంట్రిబ్యూటర్స్ నన్ను ఇన్‌బాక్స్‌లో కలవ్వొచ్చు. విజయదశమి లాంచింగ్ సంచిక కోసం యాడ్స్ ఇవ్వదలిచిన/ఇవ్వగలిగిన మిత్రులు, శ్రేయోభిలాషులు, యాడ్ ఎక్జిక్యూటివ్స్ కూడా నన్ను ఇన్‌బాక్స్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. యాడ్ ఎక్జిక్యూటివ్స్‌కు మంచి రాయాల్టీ, ఆకర్షణీయమైన ఇన్‌సెంటివ్స్ ఉన్నాయి. 

థాంక్స్ టూ లాక్‌డౌన్... అంతకు ముందు కొన్నిసార్లు ఈ ఆలోచన వచ్చినా, ఇప్పుడు మాత్రమే ఇంత వేగంగా అమలు చేయగలిగాను. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. సదా మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ... మీ, మనోహర్ చిమ్మని.  🙏🙏🙏 

అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ తెరిచాక ఏం జరగనుంది?

సుమారు 6 నెలల తర్వాత, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్స్ తెరవటానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాని, ఇండస్ట్రీలో వినిపిస్తున్న కొందరి అభిప్రాయాల ప్రకారం నిజంగా పరిస్థితి ఎలా ఉందబోతోందన్నది ఒకసారి చూద్దాం:

50 శాతం ఆక్యుపెన్సీతో ఎవ్వరికీ లాభం ఉండదు. పెద్దసినిమాలకు వర్కవుట్ కాదు. నిజాని విడుదలచేయడానికి పెద్ద సినిమాలేమీ పెద్దగా లేవు. అందరూ 2021 ప్రారంభంలోనే రిలీజ్‌కు ప్లాన్ చేసుకొంటున్నారు. ఇక ఏదన్నా వర్కవుట్ అవుతుందనుకొంటే, అది కేవలం చిన్న సినిమాలకు మాత్రమే. కాని, లాక్‌డౌన్లో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాక, ఇప్పుడున్న పరిస్థితులో, చిన్న సినిమాల నిర్మాతలు మళ్లీ రిలీజ్ కోసం పబ్లిసిటీకని, క్యూబులకోసం అనీ, థియేటర్ రెంట్లకనీ పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అలాగని, అవన్నీ పెట్టుకొని చిన్న సినిమాలను కొనే రిస్క్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ చేయలేడు. 

ఇలాంటి పరిస్థితుల్లో రేపు 15 వతేదేనాడు, ఏదో ఒక బిజినెస్ డీల్‌తో చివరికి చిన్న సినిమాలే రిలీజయ్యే చాన్స్ ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప, ఎంత గొప్ప చిన్న సినిమాకయినా డబ్బులు వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. 

థియేటర్ రెంట్లు, పబ్లిసిటీ, క్యూబ్ చార్జెస్, డిస్ట్రిబ్యూటర్ పర్సెంటేజీ, టక్సులు వగైరా అన్నీ పోగా, చిన్న సినిమాల నిర్మాతలకు ఏదైనా ఇంక మిగుల్తుందనుకోవడం జస్ట్ భ్రమ మాత్రమే. ఈ నేపథ్యంలో - చిన్న సినిమాల రిలీజ్‌కు కొత్తగా వచ్చిన ఏటీటీనే ఇకనుంచీ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అవుతుంది. 

రిలయన్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌వాళ్ళు ఈమధ్య ఇచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ఇప్పుడున్న ఓటీటీలు కూడా ఇక నుంచీ, కొత్త సినిమాలు రిలీజ్ చేసినప్పుడు, "వాటికి టికెట్ పెట్టడం తప్పనిసరి కానుంది" అనడం విశేషం! సో, ఓటీటీలన్నీ ఇక ముంచీ ఏటీటీలు కానున్నాయని అర్థమవుతోంది. అంటే... కొత్త సినిమాల రిలీజ్ విషయంలో వాటి రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్ పనికిరాదన్నమాట. ఈ నేపథ్యంలో కూడా చిన్న సినిమాల రిలీజ్‌కు ఓటీటీలు, ఏటీటీలే పనికొస్తాయి. 

100 శాతం ఆక్యుపెన్సీ వచ్చేదాకా పెద్ద సినిమాల రిలీజ్ థియేటర్లలో ఉండే అవకాశం లేదు. 2021 ప్రారంభం నుంచే పెద్ద సినిమాలను థియేటర్స్‌లో మనం చూసే అవకాశం ఉంది. అసలు ఆయా పెద్ద హీరోల సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోడానికే ఆమాత్రం సమయం ఈజీగా పడుతుంది. 

ఇదంతా ఎలా ఉన్నా, కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రేక్షకులందరి ఆలోచనావిధానంలోను, జీవనవిధానంలో కూడా ఊహించని ఎన్నో మార్పులు వచ్చాయి. సగటు ప్రేక్షకులైనా సరే, హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయినా సరే... ఇంతకు ముందులా థియేట్ర్లకు మాత్రమే వెళ్ళి సినిమా చూడాలనుకొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుందని అధ్యయనాలు చెప్తున్నాయి. 

లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా, పదే పదే తన సినిమా రిలీజ్ వాయిదాపడి ఎంతో నష్టపోయిన ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ వాపోయినదాని ప్రకారం - "ఇది ఇలాగే ఇంకొన్నాళ్ళు కొనసాగితే మాత్రం... క్రమంగా అసలు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూసే సంస్కృతే అదృశ్యమైపోతుంది" అనటం ఎన్నెన్నో ఆలోచనలకు దారితీసింది. 

ఒకప్పుడు మ్యూజిక్‌కు రైట్స్ రూపంలో ఆడియో కంపెనీల నుంచి డబ్బులు బాగా వచ్చేవి. ఇప్పుడసలు మ్యూజిక్ రైట్స్ అనేదే లేకుండాపోయింది. టెక్నాలజికల్‌గా ఊహించని స్థాయిలో వచ్చిన అభివృధ్ధివల్ల, మ్యూజిక్‌ను ఒక ఓపెన్ సోర్స్‌గా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితే క్రమంగా సినిమాకు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడు సినిమాకు పెట్టిన ఈ పెట్టుబడి అంతా ఎలా వెనక్కివస్తుంది? లాభాల సంగతేంటి? వీటన్నిటికీ సమాధానాలు కూడా టెక్నాలజీ ద్వారానే దొరుకుతాయి. అయితే, ఇది అంత త్వరగా జరిగేది కాదు, కాని జరగడానికిమాత్రం చాలా అవకాశముంది.    

ఈ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ విషయంలో ఊహించని మార్పులెన్నో ఉండే  అవకాశముంది. మార్పులు చేర్పులు ఏవైనా గాని, అంతిమంగా వాటి ప్రభావం సగటు ప్రేక్షకుని వాలెట్ పైనే పడుతుందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.  

Friday 9 October 2020

సమయం ఎప్పుడూ సమస్య కాదు!

రేపు నేను ప్రారంభించాలి అని అనుకున్న నా ఆన్‌లైన్ తెలుగు ఫీచర్స్ మ్యాగజైన్‌ను ఈ 16కు గాని, 25 నాడుగాని ప్రారంభిస్తాను. వాయిదావెయ్యక తప్పలేదు. 

అనుకున్నవిధంగా చెయ్యటం ముఖ్యం. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇంత పెద్ద పని పెట్టుకొన్నానో, అది తప్పక జరిగేలా నా ప్రయత్నం ఉండటం ముఖ్యం. 

25 దసరా అవుతోంది. 90 శాతం అదే కావచ్చు. ఈలోపు కూల్‌గా మిగిలిన ముఖ్యమైన పనులు కూడా చేసుకొనే వీలుంటుంది. 

ఈరోజునుంచీ నా పనివేళల్లో సగం సమయం మ్యాగజైన్ కోసం, మిగిలిన సగం నా సినిమాలు, ఇతర పనులకోసం వెచ్చించాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాను. 

ఆన్‌లైన్ మ్యాగజైన్లో నా బ్లాగ్ లింక్ కూడా ఇచ్చేశాను కాబట్టి, బ్లాగింగ్ కూడా కొనసాగుతుంది. 

పనిచేసేవాడికి 24 గంటలు చాలా ఎక్కువ. సమయం ఎప్పుడూ సమస్య కాదు. సరైన నిర్ణయాలు, మనం అసోసియేట్ అయ్యే వ్యక్తులు మాత్రమే సమస్య. ఈ ఒక్క విషయంలోనే నేను సిగ్గుపడాల్సిన విధంగా విఫలమయింది, ఎన్నో ఏళ్ల సమయం పోగొట్టుకొంది. సో, జాగ్రత్త తప్పనిసరి. 

కట్ చేస్తే -      

మనిషన్న తర్వాత, వాడి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కష్టం చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది. అది ఆర్థికమే కానక్కర్లేదు, ఇంకేదైనా కూడా కావచ్చు. కానీ, జీవితంలోని ఒక అతి ముఖ్యమైన మజిలీలో, అన్ని రకాల కష్టాలూ, లేదా అగ్ని పరీక్షలు ఒకేసారి రావడం అనేది ఎంత స్థితప్రజ్ఞుడినైనా కొంతైనా జర్క్ తినేలా చేస్తుంది.

అలాంటి పరిస్థితిలో ఉన్నపుడే నిజమైన హితులు, నామ్‌కేవాస్తే స్నేహితులు ఎవరన్నది పాలు, నీళ్ళలా తెలిసిపోతుంది. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిపోతుంది. జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తెలిసిపోతుంది. అప్పుడు గాని మన కళ్ళు పూర్తిగా తెర్చుకోవు. అప్పుడుగాని మన మెదడును పూర్తిగా ఉపయోగించుకోము. 

అప్పుడే మనకు నిజంగా ఏం కావాలో తెల్సుకుంటాము. అప్పుడే మనం నిజంగా ఏం చేయాలో అది చేయటం ప్రారంభిస్తాము. అప్పుడే మన నిజజీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నిశ్చలంగా ఎదుర్కొంటాము. రెట్టించిన కసితో, వందరెట్ల శక్తితో.

ఎవరి జీవితంలోనైనా సిసలైన టర్నింగ్ పాయిట్ అదే.

అప్పటినుంచి మాత్రమే, అంతకుముందటి ఏ లాజిక్కులకు చిక్కని ఎన్నో పనులు చేస్తుంటాము. నమ్మశక్యంకాని ఎన్నెన్నో ఫలితాలు చూస్తుంటాము.

అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది... 

Tuesday 6 October 2020

కోట్లు కొల్లగొట్టే కొత్త బిజినెస్ మోడల్ - ఏటీటీ సినిమా!

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన "క్రౌడ్ ఫండింగ్" అనే ఈ 'ఫండ్ రైజింగ్ ప్రాసెస్' ని అమలు చేయటం కోసం అమెరికాలో, ప్లస్ అంతర్జాతీయంగా కూడా కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి వెబ్ సైట్లు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా  విషయం పూర్తిగా అర్థమైపోతుంది. అయితే, ఆ సైట్లు మన తెలుగు కమర్షియల్ సినిమాల విషయంలో ఉపయోగపడవు. ఇండియాలో కూడా ఒకటి రెండు ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్లు వచ్చాయి కానీ, ఏవో కొన్ని స్టార్టప్స్, చారిటీల వంటివాటికి తప్ప వాటి సెటప్ మన సినిమాలకు పనికిరాదు. 

2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో  ఇండిపెండెంట్‌గా తయారైన తొలి కన్నడ సినిమా.  50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు. ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. హిందీలో , తెలుగులో  కూడా ఈ పధ్ధతిలో కొన్ని సినిమాల నిర్మాణం జరిగింది కాని, వీటి గురించి పెద్దగా ప్రచారం లేదు. 

లాక్‌డౌన్ సమయంలో - ఓటీటీలు, ఏటీటీల నేపథ్యంలో చాలా గమ్మత్తులు జరిగాయి. కేవలం సినిమా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో మాత్రమే చూసినట్టైతే మాత్రం, ఏటీటీ అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో శ్రేయాస్ మీడియాను, ఆర్జీవీని మెచ్చుకోకతప్పదు. 

ఇండస్ట్రీ అంతా ఆందోళనతోనో, కన్‌ఫ్యూజన్‌తోనో అన్నీ మూసేసుకొని ఒకవైపు టెన్షన్‌పడిపోతోంటే - ఒక్క ఆర్జీవీ మాత్రం దాదాపు ప్రతి రెండు వారాలకు ఒక సినిమా ఎనౌన్స్ చేస్తూ, తీస్తూ, చూపిస్తూపోయాడు! 100 రూపాయల టికెట్ పెట్టి, క్లైమాక్స్ సినిమాకు కేవలం 24 గంటల్లో ఒక రెండున్నర కోట్లు సంపాదించుకున్నాడు. క్లైమాక్స్ ఇచ్చిన కిక్‌తో వెంటనే ఒక 22 నిమిషాల నేకెడ్ సినిమా తీసి దానికి 200 రూపాయల టికెట్ పెట్టి, ఇంకో అరకోటి సంపాదించుకున్నాడు. తర్వాతి సినిమాల కలెక్షన్లు అటు ట్విట్టర్లో గాని, ఇటు వార్తల్లోగాని రాలేదు. టాక్స్ ఎఫెక్ట్ అనుకుంటాను. అలాకాకుండా, ఒకవేళ తక్కువ కలెక్షన్స్ వచ్చినా బాధపడాల్సిందేమీ లేదు. ఒక మంచి బిజినెస్ మాడల్ ప్రూవ్ అయ్యింది. 

ఆర్జీవీ కాబట్టి అంత ప్రచారం జరిగి పబ్లిసిటీ వచ్చింది. వేరేవాళ్లకు అట్లా కలెక్షన్స్ రావు అని ఒక లాజిక్. కాని, ఇప్పుడున్న సోషల్‌మీడియా పవర్ నేపథ్యంలో ఈ లాజిక్ నిలబడదు. అంతేకాదు, ఏటీటీ కోసం తీసే సినిమాలు కూడా, అందరూ ఆర్జీవీని అనుకరించి, అట్లాగే తీయాలనే రూల్ కూడా ఏంలేదు.      

ఈ నేపథ్యంలో, ఊహించనంత అతి తక్కువ బడ్జెట్లో కొత్తవారితో సినిమాలు నిర్మించి, ATT (Any Time Theater)ల్లో రిలీజ్ చేయవచ్చు. మంచి లాభం కూడా గ్యారంటీ. సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించేవారికి క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి ఒక మంచి అవకాశం. ఎంత చిన్న పెట్టుబడితోనయినా ఆసక్తి ఉన్న కొత్త ఇన్వెస్టర్స్ ఫీల్డులోకి ప్రవేశించవచ్చు! 

లాక్‌డౌన్ ఉన్నా, లేకపోయినా, ఈ ఏటీటీ బిజినెస్ మోడల్ అనేది ఒక ఎవర్‌గ్రీన్ బిజినెస్ మోడల్‌గా కొనసాగుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే క్రమంలో, నంది అవార్డ్ పొందిన ఒక రైటర్-డైరెక్టర్‌గా, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే నేనొక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను న్యూ టాలెంట్‌తో ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు.  

ఈ నేపథ్యంలో నేను 2 రకాల ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం చూస్తున్నాను: 

1. ఇంతకుముందే ఇతర బిజినెస్‌లలో స్థిరపడి ఉండి, ఈవైపు ఆసక్తి ఉన్న పవర్‌ఫుల్ ఫండర్స్ సపోర్ట్. 

2. సమర్థవంతంగా భారీ స్థాయిలో క్రౌడ్‌ఫండింగ్ ఎక్జిక్యూట్ చేయగల వర్కింగ్ పార్టనర్స్ సపోర్ట్. 

ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్ మిత్రులు/ఎన్నారై సోదరులు/ఫండర్స్/బిజినెస్‌మెన్/సమర్థులైన మీడియేటర్లు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు: WhatsApp: +91 9989578125, Email: mchimmani10x@gmail.com 

Thursday 1 October 2020

తెలుగుని ఎందుకు ఎక్కువగా ఉపయోగించకూడదు?

ఏదో ఒకటి  పోస్ట్ చేస్తున్నా గాని, అంత ఫోకస్ లేదు. యాక్టివ్‌గా ఉన్నానని నాకు నేను అనుకోవడం కోసమే ఈ పోస్టింగ్! 

నిజానికి నా కొత్త ప్రాజెక్ట్, నా మొట్టమొదటి  'ప్రాజెక్ట్ 10X' పనుల్లో చాలా పనివత్తిడిలో ఉన్నాను. ఎల్లుండి... 3 వ తేదీకి వంద శాతం పూర్తిచేయాలనుకొన్న పని, ఇంకా చాలా మిగిలే ఉంది. 

నా ఆన్‌లైన్ మ్యాగజైన్ ఈ అక్టోబర్ 10కి రిలీజవుతోంది. 

ఒకవైపు కంటెంట్ క్రియేషన్, మరోవైపు యాడ్స్ హంట్, అన్నిటికంటే ముఖ్యంగా సైట్ బిల్డింగ్ తుదిమెరుగులు... అన్నీ ఒక్కసారిగా నడుస్తున్నాయి.

కట్ చేస్తే - 

అసలు తెలుగుని ఎందుకు ఎక్కువగా ఉపయోగించకూడదు అన్నది ప్రస్తుతం నన్ను బాగా వేధిస్తున్న ప్రశ్న. 

మొన్న రాత్రి నుంచి కొత్తగా వచ్చిన "కూ" లో చేరాను. అక్కడ కూలో మొత్తం తెలుగే. అదొక మజా. ఒక కొత్త అనుభూతి. అప్పుడే కూ గురించి పరిచయం చేస్తూ ఒక ఆర్టికిల్ రాశాను. అది రేపు రాబోయే నా ఆన్‌లైన్ మ్యాగజైన్ ప్రారంభ సంచికలో రాబోతోంది.    

ఇవ్వాటినుంచీ ఇన్స్‌టాగ్రామ్‌లో  కూడా తెలుగునే ఎక్కువగా రాస్తాను. ఫేస్‌బుక్, ట్విటర్‌లలో కూడా ఇప్పుడు ఎక్కువగా తెలుగే వాడాలి. ఇప్పటికిప్పుడు అనుకున్నానిది. ఇంకో ఇన్స్‌స్టంట్ ఫ్లాష్ ఏంటంటే, నా మ్యాగజైన్‌కోసం ప్రత్యేకంగా ఇంకో ఇన్‌స్టాగ్రామ్, ఇంకో ట్విట్టర్, ఇంకో ఫేస్‌బుక్ పేజి క్రియేట్ చెయ్యబోవటం లేదు. నా పర్సనల్ సొషల్‌మీడియా లింకులే అక్కడ నా ఆన్‌లైన్ మ్యాగజైన్‌కి కనెక్టవుతాయి. ⚡️🙂

వీటన్నిటి ఉద్దేశ్యం వెరీ సింపుల్. పని తగ్గించుకోవడమే. 

Law of least effort. Less complexity, more fun.  

Monday 28 September 2020

ఈ బ్లాగ్ ఇంకొన్నాళ్లేనా?

ఇప్పటికి ఎన్నోసార్లు బ్లాగింగ్ మానెయ్యాలనుకొన్నాను. కాని, అలా చెయ్యలేకపోయాను. 

కాని, ఇప్పుడు నేను పెట్టుకొన్న ఆన్‌లైన్ మ్యాగజైన్ పని చూస్తుంటే... అసలు ఈవైపు చూసే అవకాశమే దొరికేటట్టులేదు! 

కట్ చేస్తే - 

ఈ 10వ తేదీకి నా ఆన్‌లైన్ మ్యాగజైన్ ప్రారంభిస్తున్నాను. ఎవరు లాంచ్ చేసేదీ ఇంకా నిర్ణయించలేదు.

కాని, అక్టోబర్ 10 నాడు నా మ్యాగజైన్ లాంచ్ పక్కా.             

సరిగా 11 రోజులుంది. ఇంకా కంటెంట్ క్రియేషన్ ఒకవైపు, సినిమా పనులు ఇంకోవైపు, ఇతర 101 తలనొప్పులు ఇంకోవైపు... అన్నిటితో సర్కస్ బ్యాలెన్స్‌లా నడుస్తోంది ప్రస్తుతం లైఫ్. 

ఇంత బిజీలో, పని వత్తిడిలో, మ్యాగజైన్ లాంచ్ తర్వాత ఇలా బ్లాగ్ రాసుకోగలనా అన్నది పెద్ద ప్రశ్నే! అన్నీ మ్యాగజైన్లో రాసుకుంటాం కదా, అంత పెద్ద ప్లాట్‌ఫామ్ ఉంది కదా అనుకుంటున్నాను

కాని, అది వేరు, ఇది వేరు. 

ఎన్నోసార్లు ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు... నాకు సంబంధించినంతవరకు, బ్లాగింగ్ అనేది జస్ట్ ఏదో అలా రాసుకోవడం కాదు.

ఒక స్ట్రెస్ బస్టర్. ఒక థెరపీ. ఒక మెడిటేషన్. 

Blogging is my breath.

నా శ్వాసను నేనెలా మర్చిపోతానో చూడాలి...