Tuesday 27 October 2020

వెన్నెల జలతారు


సికింద్రాబాద్ నడిబొడ్డునే వున్నా తపోవనంలా వుంది బుక్ సెలెక్షన్ సెంటర్. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, చల్లగా…

విశాలమైన స్పేస్‌లో విశ్వవిజ్ఞానాన్ని మోస్తూ- గోడల నిండా, మధ్యలో బుక్ రాక్స్ ఠీవిగా నిల్చుని వున్నాయి. మాస్కులు ధరించిన పుస్తకప్రియులు అక్కడక్కడా మునుల్లా మౌనంగా రాక్స్ దగ్గర నిల్చుని, వాళ్లకు కావల్సిన పుస్తకాలను వెతుక్కొంటున్నారు.

ఎలిజబెత్ గిల్బర్ట్ కొత్త నవల “సిటీ ఆఫ్ గాళ్స్” పుస్తకాన్ని తిరగేస్తూ ఫిక్షన్ రాక్స్ దగ్గర నిల్చునివుంది మహేశ్వరి.

“హలోవ్”

తనకి బాగా పరిచయమైన గొంతు. ఆ సమయంలో అక్కడ తను వూహించని గొంతు. ఆశ్చర్యంతో వెనక్కి తిరిగిచూసింది మహేశ్వరి.

అతడే!

“వాటే సర్‌ప్రయిజ్!” ముక్కుమీదున్న మాస్కుని కిందకు లాక్కొంటూ అన్నాడతను.

“అవును. నాకూ ఆశ్చర్యంగానే వుంది. నిన్నిక్కడ చూస్తాననుకోలేదు” ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు మహేశ్వరి.

“నేను కూడా మిమ్మల్ని ఇక్కడ వూహించలేదు మేడమ్” అతని గొంతులో తొంగిచూసిన చిలిపితనానికి బ్లష్ అయిన ఆమె బుగ్గలను మాస్క్ చాలావరకు కప్పేసింది.

“నేనిక్కడ రెగ్యులర్ కస్టమర్‌ని. నెలకి రెండుసార్లయినా వస్తాను… న్యూ ఎరైవల్స్ చూడ్డానికి” మాస్క్‌ని కొద్దిగా కిందకి దించుతూ అంది మహేశ్వరి.

“మరి నేను కూడా ఇక్కడికి తరచూ వస్తుంటాను. మనం ఒక్కసారి కూడా ఎదురుపళ్లేదు చూడు!”

“దాందేముంది… ఇద్దరం ఒకేరోజు ఓకే సమయానికి రావాలని రూలేం లేదుగా!”

“అఫ్కోర్స్” ఒప్పుకొంటూ, తననే కన్నార్పకుండా చూస్తున్న అతని చేతిలో వున్న పుస్తకం వేపు చూపులు మరల్చింది మహేశ్వరి.

“టూల్స్ ఆఫ్ టైటాన్స్” హార్డ్ బౌండ్. టిమ్ ఫెర్రిస్ పుస్తకం.

అతనేదో మాట్లాడబోయాడు. పెదాలపై చూపుడు వేలు పెట్టుకొని, కళ్ళుపెద్దవిగా చేసి, మాట్లాడవద్దన్నట్టుగా సైగచేసింది మహేశ్వరి.

అక్కడి తపోవనం ప్రశాంతతను భగ్నం చేయకుండా, ఇద్దరూ కౌంటర్ వైపు కదిలారు. కౌంటర్ దగ్గర ఎవరి పుస్తకాలకు వారే బిల్ చెల్లించి బయటకొచ్చారు.

అయిదు నిమిషాల్లో వాళ్లిద్దరూ కూర్చొన్న కారు ప్యారడైజ్ ట్రాఫిక్‌లోంచి బయటపడి, రాణిగంజ్ మీదుగా, నెక్లెస్‌రోడ్‌లోకి ప్రవేశించింది.

చేతిలో వున్న మొబైల్లో టైమ్ చూసింది మహేశ్వరి. సాయంత్రం 4 అవుతోందప్పుడు…

డ్రయివింగ్ సీట్లో అతను, పక్కనే మహేశ్వరి. ఇద్దరికీ ఇదొక వూహించని కలయిక. మాస్కులు పూర్తిగా తొలగించిన ఇద్దరి ముఖాల్లోనూ ఏదో కొత్త మెరుపు.

నెక్లెస్ రోడ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ఒక పార్కింగ్ ప్లేస్‌లో చిన్న జెర్క్‌తో కారాపాడతను.

“ఎక్కడికెళ్దాం?” అడిగాడు.

“ఇక్కడే కాసేపు ఇలాగే కూర్చుందాం” అంది మహేశ్వరి.

బుక్ సెలక్షన్ సెంటర్‌లోని ప్రశాంతత, ఆ తర్వాత అతన్ని అలా వూహించని విధంగా కలిసిన సంభ్రమం ఆమెను ఇంకా వదల్లేదు. అతడు ఆమెనే చూస్తున్నాడు. ఆమె కూడా రెప్పవేయకుండా అతన్నే చూస్తోంది.

నిమిషం. రెండు నిమిషాలు. మూడు నిమిషాలు… పక్కపక్కనే, ఒకరి కళ్ళళ్ళోకి ఒకరు చూసుకొంటూ, లాక్‌డ్ కార్లో కూర్చున్న ఇద్దరి శ్వాసల వేగం పెరిగింది. గబుక్కున అతని చూపుల నుంచి తప్పించుకొంటూ, తలతిప్పి కారు అద్దంలోంచి ఎదురుగా బయటికి చూడసాగింది మహేశ్వరి.

ఆమె శ్వాసలో పెరిగిన వేగానికి, బిగుతుగా ఆమె ధరించిన తెల్లటి కుర్తీ పైభాగం కల్లోల సముద్రపు అలలా ఎగిసిపడుతోంది.

మహేశ్వరినే చూస్తూ, వొళ్ళో బిగిసిపెట్టుకొన్న ఆమె రెండుచేతుల మీద నెమ్మదిగా తన ఎడమచేయి వేశాడతను. అంతే. ఏం జరుగుతోందో తెలిసేలోపు, మహేశ్వరి రెండు చేతుల్లో అతని ముఖం ఉంది. తర్వాత కొన్ని నిమిషాలపాటు, పసిఫిక్ ఓషన్ అలల్లో చెలరేగి ఆడుకొనే జంటసర్ఫర్స్‌లా హద్దూ అదుపూ లేకుండా ఆడుకున్నాయి వారిద్దరి పెదాలు.

“బుజ్జీ, ఎక్కడికైనా లేపుకెళ్ళు నన్ను. ఒక్క 24 గంటలు… ఎట్ లీస్ట్ ఒక్క రాత్రి!”

తన రెండు చేతుల్లో వున్న అతని ముఖాన్ని విడిచిపెట్టకుండా అతని కళ్ళల్లోకే చూస్తూ, చిన్న గొంతుతో గుసగుసగా చెప్పింది మహేశ్వరి.

మహేశ్వరి వైపే కన్నార్పకుండా చూస్తూ, “ఆర్యూ ష్యూర్?”… తడిసిన పెదాలతో అడిగాననుకున్నాడతను, కాని శబ్దం బయటికి రాలేదు.

అతని మొహంలోకే చూస్తూ, “అవును” అని 48 ఫ్రేమ్స్‌లో రెప్పలు వాలుస్తూ కళ్లతోనే సమాధానం చెప్పింది మహేశ్వరి.

క్షణంలో కారు స్టార్ట్ చేశాడతను.

నెక్లెస్‌రోడ్ నుంచి, ఎన్‌టీఆర్ మార్గ్ మీదుగా దూసుకెళ్తూ టాంక్‌బండ్ ఎక్కింది కారు.

కాసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

“పెద్ద గొప్ప విషయమేం కాదనుకో… కాని, ఈరోజు మనమిలా కల్సుకోడం నిజంగా విచిత్రంగా ఉంది కదూ?” అతనివైపు చూస్తూ అంది మహేశ్వరి.

ఎదురుగా రోడ్డుమీదున్న ట్రాఫిక్‌ని చూస్తూ డ్రైవ్ చేస్తూనే, అవునన్నట్టుగా తలవూపాడతను.

ఇద్దరి మధ్యా మళ్ళీ కొన్ని నిమిషాలు మౌనం.

“ఎలావుంది లైఫ్, బుజ్జీ?” మళ్లీ మహేశ్వరే అడిగింది. 

ఊహించని ప్రశ్న.

“క్వయిట్… ఓకే” కొంచెం తడబాటుగా చెప్పాడతను.

“నాకయితే భరించలేనంత రొటీన్‌గా వుంది” ఎదురుగా కనిపిస్తున్న ట్రాఫిక్‌లోకి చూస్తూ అంది మహేశ్వరి.

అతడేం మాట్లాడలేదు.

బేగంపేట్ బ్రిడ్జ్ ఎక్కి, లైఫ్‌స్టయిల్ మీదుగా కిందకి దిగుతున్న వందలాది కార్లల్లో, వీళ్లిద్దరూ కూర్చొన్న బ్లూ వోక్స్‌వాగన్ కూడా ట్రాఫిక్‌లో కల్సిపోయి నెమ్మదిగా ముందుకు కదులుతోంది.

బయట చిన్నగా చినుకులు. లోపల చల్లటి ఏసీ. అయినా ఇద్దరి ముఖాలూ వెచ్చటి ఆవిరి పరదా కప్పేసినట్టు సన్నటి చమట చుక్కలతో తడిసిపోయాయి.

ఇరవై నిమిషాల తర్వాత, ఏవేవో మలుపులు తిరిగుతూ కంటోన్మెంట్ ఏరియాదాటి, ఒక ‘ఓయో’ ముందు ఆగింది కారు. వెనకసీట్లోంచి టూర్ల కోసం తన కార్లో ఎప్పుడూ వుండే ఒక బ్యాక్‌ప్యాక్, ఇంకో స్పేర్ క్యాజువల్స్ క్యారీబ్యాగ్ తీసుకొని కారు లాక్ చేశాడతను.

మహేశ్వరి లాబీలో కూర్చొన్న అయిదు నిమిషాల్లో రిసెప్షన్ దగ్గర పని ముగించేశాడతను. అయిదు నిమిషాల తర్వాత వారికి కెటాయించిన ఓయో ఎక్జిక్యూటివ్ సూట్ వైపు నడవసాగారిద్దరూ.

“నేను మా ఇంటికి కాల్ చేసి చెప్పాను, రావట్లేదని” నడుస్తూ అన్నాడతను, ఆమె వైపు చూడకుండానే.

“నేను కూడా ఏదో చెప్పాలే… మా అత్తగారు, మామగారున్నారు ఇంట్లో. బాబుని వాళ్లు బాగా చూసుకుంటారు” చెప్పింది మహేశ్వరి.

సూట్‌లోకి ప్రవేశిస్తూనే, డోర్ లాక్ చేసి వెనక్కి తిరుగుతూ భుజానికున్న బ్యాక్‌ప్యాక్‌నీ, చేతిలో వున్న క్యారీ బ్యాగ్‌నీ అలా కిందకి వదిలేసి, ఇప్పటికే ఆలస్యమైందన్నట్టుగా మహేశ్వరిని గట్టిగా దగ్గరికి లాకున్నాడతను. అంతకంటే వేగంగా అతని ముఖాన్ని తనవైపు వొంపుకొంది మహేశ్వరి.

* * *

కాఫీ ఒకసారి సిప్ చేసి, కప్పుని నెమ్మదిగా ముందున్న టీపాయ్ మీద పెట్టింది మహేశ్వరి. వెనక జుట్టుకి వున్న రబ్బర్ బాండ్‌ని తీసేసి, ఒక్కసారిగా తల విదిల్చింది. చిక్కటి కాఫీ కలర్‌లో వున్న వొత్తైన జుట్టు తెరలు తెరలుగా ఆమె ముఖాన్ని కప్పేస్తూ అందంగా జాలువారింది. మహేశ్వరినే చూస్తూ కాఫీ తాగుతున్నాడతను. 

జుట్టు వెనక్కి తోసుకొంటూ, పక్కన చెయిర్లో వున్న తన బ్యాగ్‌లోంచి ఏదో తీసి ముందున్న టీపాయ్ మీద పెట్టింది మహేశ్వరి.

మాల్బరో సిగరెట్ పెట్టె.

“ఇదెలా వచ్చింది?” ఆశ్చర్యంగా అడిగాడతను.

“నువ్వు బాత్రూమ్‌లో ఉన్నపుడు తెప్పించాను” 

“నీకింకా గుర్తుందా?!… అయినా నేను మరీ అంత చెయిన్ స్మోకర్‌ని కాదులే మహీ!” 

“నేనన్నానా?!” అంటూ బాక్స్‌ని అతనివైపుకి తోసింది మహేశ్వరి. 

“నాకు బాగా క్లోజ్ అయినవాళ్లతో, బాగా నచ్చినవాళ్లతో ఇలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు గానీ, బాల్కనీలో నిల్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు గానీ, ఆరుబయట మిద్దెమీద ఏ అర్థరాత్రో నేనొక్కన్నే నాతో నేనే మాట్లాడుకొంటూ తిరుగుతున్నప్పుడుగానీ, ఓ చల్లటి సాయత్రం నేనొక్కన్నే ఏ హైవే పక్కనో కారాపుకొని నిల్చున్నప్పుడు గానీ… ఒక సిగరెట్ అలా కాల్చాలనిపిస్తుంది” ఒక ట్రాన్స్‌లోలా చెప్తూ టక్కున ఆపేశాడతను. 

“వావ్… నీ సిగరెట్ పఫ్ వెనక ఇంత భావుకత్వం నేనెప్పుడూ విన్లేదు బుజ్జీ!… ఇదంతా మీ ఆవిడకు తెలీదనుకుంటాను?!” 

“తెలుసు. మా పెళ్లికి ముందూ, పెళ్లైన కొత్తలో కూడా చెప్పాను. తను వద్దంది. బాధపడతానంది. ఎప్పుడైనా ఒకటి కాలిస్తే, నోట్లో ఓ హాల్స్ చప్పరించి, గంట గ్యాప్ తీసుకొని వెళ్తా ఇంటికి” 

“తప్పులేదు. అదే తర్వాత చెయిన్ స్మోకింగ్‌కు దారితీయొచ్చని ఆమె భయమేమో!” 

“ఇప్పుడు నాకు 39… అదే నిజమైతే, నేనిప్పటికే చెయిన్ స్మోకరయిపోయి… జేబులో ఓ పెట్టె, లైటర్ మెయింటేన్ చేస్తుండాలి” 

“పెళ్లైన కొత్తలో కదా… అప్పటి భయాలు అలాంటివి కావచ్చు”

“కావచ్చు” ఒప్పుకున్నాడతను.

“అయినా ఇప్పుడేముందిలే… ఏ ‘బియాండ్ కాఫీ’ కెళ్ళినా, అమ్మాయిలు కూడా చాలా ఫ్రీగా స్మోక్ చేస్తున్నారు. ఎవరిష్టం వారిది. దాని ఎఫెక్ట్ కూడా కొంచెం స్పృహలో ఉంటే చాలు” 

రెండుచేతులూ పైకెత్తి జుట్టుని సర్దుకొంటున్న మహేశ్వరినే చూస్తూ సిగరెట్ వెలిగించాడతను. ఇద్దరూ నడుస్తూ, సూట్‌ని ఆనుకొని వున్న ఓపెన్ సిటౌట్‌లోకి వెళ్ళి నిల్చున్నారు. 

కింద పచ్చటి లాన్స్. వాటి అవతల దట్టంగా పచ్చటి చెట్లతో నిండిన గ్రీనరీ. దూరంగా ఏదో గ్రౌండ్. చిన్న శబ్దం కూడా లేదు. ఉన్నట్టుండి పక్కనే నిల్చున్న మహేశ్వరివైపు చూశాడతను. 

బ్యాగ్‌లో ఉన్న అతని తెల్లటి టీషర్టు, పైజామా వేసుకొని ఉందామె. 

“ఇందాకటి డ్రెస్‌లో కంటే, వీటిలో ఇంకా సెక్సీగా కనిపిస్తున్నావ్” అన్నాడతను, ఆమెనే చూస్తూ. 

“షటప్” అంది బ్లష్ అవుతూ మహేశ్వరి. అతనెక్కడ చూస్తూ ఆమాటన్నాడో ఆమెకు అర్థమైంది. 

రెండు పఫ్‌లు గట్టిగా లాగి, సిగరెట్‌ను అక్కడున్న యాష్ట్రేలోకి కుక్కేశాడు. 

“నీకిష్టమైన వైన్ కూడా తెప్పిద్దామనుకున్నాను. కాని, నువ్విప్పుడేం తీసుకొంటున్నావో నాకు తెలీదుగా!” నవ్వుతూ అతనిమీదకు వొరిగిపోతూ అంది మహేశ్వరి. 

“మంచి పని చేశావు. నేనొక్కన్నీ తాగను”

“నేనున్నాగా కంపెనీకి…” అంది కన్నుగీటుతూ, అల్లరిగా. 

“ఓ పదేళ్లక్రితం మా ఆవిడ కూడా ఇలాగే అంది. కాని, ఒకసారి సిప్ చేసి ‘యాక్ థూ, ఇంత వగరెట్లా తాగుతారు’ అంటూ పక్కనపెట్టేసింది” 

అతను చెప్పిన పద్ధతికి పడీ పడీ నవ్వసాగింది మహేశ్వరి. 

“సో... మొత్తానికి మీ ఆవిడతో కూడా వైన్ తాగించావన్నమాట!” 

“తాగలేదు. అదే మొదటిసారి, చివరిసారి” 

నడుముకి టర్కీ టవల్ చుట్టుకొని, పైన ఏమీ వేసుకోకుండా ఉన్నాడతను. ఎలాంటి ఆచ్ఛాదనలేకుండా ఉన్న అతని ఛాతీ వైపు చూస్తూ, “నీ ఎక్స్‌పోజింగ్ భరించలేకపోతున్నాబుజ్జీ” అంటూ మరింత దగ్గరగా జరిగి, గట్టిగా అతన్ని అళ్ళుకుపోతూ, అతని ఛాతీలో తన ముఖం దాచుకొంది మహేశ్వరి. 

అతని రెండు చేతులూ ఆమె నడుముని చుట్టేశాయి. 

ఆమెనలాగే హత్తుకొని మెల్లిగా వెనక్కి నడిపించుకొంటూ లోపలికి తీసుకెళ్లాడతను. 

* * *

లోపల వాళ్లిద్దరూ కప్పుకొన్న తెల్లటి బెడ్‌షీట్, బయట మబ్బులు కప్పేసుకున్న వెన్నెలా ఒక్కలానే కనిపిస్తున్నాయి. 

తన వక్షం మీద తలపెట్టి కళ్ళుమూసుకొని పడుకొన్న అతని జుట్టుని సున్నితంగా నిమరసాగింది మహేశ్వరి.

“చెప్పు బుజ్జీ … మీ ఆవిడ గురించి చెప్పు” 

“ఇప్పుడెందుకులే మహీ” అన్నాడతను కళ్ళు తెరవకుండానే. 

“లేదు, ఇప్పుడే కావాలి” స్థిరంగా అంది మహేశ్వరి. 

“ఏం చెప్పాలి… తన బోటిక్కే తన లోకం. చెప్పలేనంత పని. బోటిక్‌లో పదిమంది ఎంప్లాయీస్. అంత హెక్టిక్ పని వద్దు అంటే వినదు” 

“మా ఆయన కూడా అంతే. ముందు జాబ్, ఇప్పుడు బిజినెస్… పనులూ, టెన్షన్లూ. నేనూ, మా బాబు ఎవ్వరం పెద్దగా గుర్తుకురామనుకుంటాను. అతను అంత కష్టపడుతోంది మాగురించే అనుకో… కాని, మా ఇద్దరికే సమయం దొరకనివ్వని ఆ కష్టం ఏం చేస్కోడానికి?” 

“పాయింటే” అన్నాడతను.

“సేమ్… మా ఆవిడా అంతే. నాకోసం కూడా తనకి టైమ్ దొరకదు. మేం ఎప్పుడు ఫ్రీగా కలిసి కబుర్లు చెప్పుకొన్నామో, ఎప్పుడు కలిసి తిన్నామో, ఎప్పుడు ఇంత ఫ్రీగా ఉన్నామో నాకు నిజంగా గుర్తు రావట్లేదు” 

“నీకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు తను ఫ్రీగా ఉండాలిగా మరి?” 

“అవును, అందుకే ఏదో ఒక బుక్ చదువుకొంటూ గడిపేస్తాను.. నేను ఫ్రీగా ఉంటే” 

“నేనూ అంతే. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అతనింట్లో ఉండడు. నాక్కూడా బుక్స్ తప్ప ఇంకో తోడు లేదు” పక్కన లాంప్ షేడ్ కింద వున్న ఎలిజబెత్ గిల్బర్ట్ పుస్తకం కేసి చూస్తూ అంది మహేశ్వరి. 

“మీది లవ్ మ్యారేజ్ కదా?” అడిగాడతను. 

“అవును. మీ లవ్ మ్యారేజ్ లాగే” అతని జుట్టు పట్టుకొని అల్లరిగా లాగుతూ అంది మహేశ్వరి. 

“ఏదో చేయాలి…” తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడతను. 

“అవును, ఏదో చేయాలి!” స్థిరంగా అంది మహేశ్వరి. 

లేచి, ఆమె ముఖంలో ముఖం పెట్టి, ఆమె కళ్ళళ్ళోకే సూటిగా చూస్తున్నాడతను. అతని కళ్లల్లోకి అలాగే చూస్తూ, నెమ్మదిగా ముందుకి అతని పెదాలవైపు వొంగిందామె. 

* * * 

అర్థరాత్రి దాటింది.

బాల్కనీలో ఒక్కడే నిల్చుని ఉన్నాడతను. అతని చేతిలో సిగరెట్ కాలుతోంది. గట్టిగా ఒక పఫ్ లాగి, తలపైకెత్తి ఆకాశం వైపు చూశాడతను. అప్పటిదాకా కప్పేసిన మబ్బుల పరదాలు తొలగిపోయి, ఆకాశం నిండా వెండి వెన్నెల. 

ఎదురుగా చూశాడు. నియాన్ లైట్ వెళుతురులో అదే లాన్. అవే చెట్లు. దూరంగా అదే విశాలమైన గ్రౌండ్. నెమ్మదిగా అవన్నీ ఒక్కొక్కటీ ఫేడవుటవుతూ ఇప్పుడతని కళ్లముందు ఒకప్పటి ‘అతను’ కనిపిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు, అతని నేపథ్యం, అతని చదువులు, స్నేహితులు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, అవసరాలు, బిజినెస్, డబ్బు, స్టేటస్‌, డెడ్ రొటీన్‌గా మారిన జీవితం… స్లైడ్ ప్రొజెక్టర్‌లోంచి చూపిస్తున్నట్టుగా ఒక్కో దృశ్యం వరుసగా కనిపించసాగాయి. 

వీటన్నిటి మధ్య అతను బాగా ఇష్టపడే దృశ్యమేదో అతనికి కనిపించీ కంపించకుండా దోబూచులాడుతోంది. సిగరెట్ పఫ్ గట్టిగా లాగి, ఆఖరి ప్రయత్నంగా ఆ దృశ్యం కోసం మళ్లీ ఎదురుగా చూశాడు. అప్పటిదాకా అతనితో దోబూచులాడుతూ అతనికి కనిపించని ఆ దృశ్యం ఇప్పుడతని కళ్లముందు చాలా స్పష్టంగా కనిపించింది.

అది… అతను మర్చిపోయిన అతని జీవన విధానం. అతను కలలుగన్న అతని జీవితం.

సిగరెట్ యాష్ ట్రేలో కుక్కేసి వెనక్కి తిరిగాడతను.

ఎదురుగా మహేశ్వరి.

“నిద్రపోలేదా బుజ్జీ?” అడిగింది మహేశ్వరి.

“నిద్రరాలేదు మహీ” అన్నాడతను.

“ఏం?”

“ఆలోచిస్తున్నాను”

“దేని గురించి?”

“ఇలా… మనం ఇంకొన్ని గంటలేనా అని”

“అంతే అనుకుంటాను” నెమ్మదిగా చెప్పిందామె.

“నో… రేపూ, ఎల్లుండీ, ఆ తర్వాతా… ఎప్పుడూ మనం ఇంత బాగా ఉండగలిగితే బాగుండు”

“ఇంకా బాగా ఉండొచ్చు. కొన్ని వొదులుకొంటే”

“రాత్రే నేను నావైపు అన్నీ వొదిలేసుకున్నాను”

“నేను కూడా”

అస్పష్టంగా ఉన్న ఆ మసక వెళుతురులో అతని కళ్లల్లో మెరిసిన ఆనందాన్ని ఆ క్షణం స్పష్టంగా గుర్తించింది మహేశ్వరి. ఆమెను దగ్గరగా తీసుకొని గట్టిగా హత్తుకున్నాడతను.

అతడు… ఆమె భర్త.

అంత అర్థరాత్రి దాటిన తర్వాత, ఆ సమయంలో ఎక్కడో దూరంగా, ఎవరు ఏ పనిచేసుకొంటూ వింటున్నారోగాని, ఒక అద్భుతమయిన పాత హిందీ పాట మెల్లగా ఫేడిన్ అయి, బాగా వినిపించసాగింది.

ఆధా హై చంద్రమా రాత్ ఆధీ-

రహ్ న జాయే తేరీ మేరీ బాత్ ఆధీ, ములాఖాత్ ఆధీ…

*** *** ***

కథ వెనుక కథ:

వెన్నెల జలతారు… Very mystical. వెన్నెల signifies something that’s short, that’s fine, that’s romantic, that’s soothing… And a lot more. జలతారు is the jingle of it… That’s the temptation, lure and beauty. A series of memories, sweet nothings. Or cool volcanoes.

వెన్నెల జలతారు .. ఇంత భావుకత్వం నిండిన టైటిల్ నేనెప్పుడూ పెట్టలేదు. ఒక కథ రాస్తున్నాను, నాకు ఇలాంటి టైటిల్ కావాలని ఒక ఫ్రెండుని అడిగాను. ఆ ఫ్రెండు నాకిచ్చిన 5 టైటిల్స్‌లో నేను దీన్ని ఎంచుకున్నాను. 1997 లో పబ్లిష్ అయిన నా ఇంకో కథ “సౌందర్య లహరి” కి 2020 లో నేను చేసిన రీమిక్స్ ఇది. 

ఈ కథ చివర్లో, కేవలం ఒక 3 పదాలు-7 అక్షరాల వాక్యాన్ని తీసేస్తే అదింకో ముగింపు అవుతుంది. ‘డైరెక్టర్స్ కట్’ లాగా, రైటర్స్ కట్ అన్నమాట! ఎవరికిష్టమైన ముగింపుని వారు చదువుకోవచ్చు.

– మనోహర్ చిమ్మని 

2 comments:

  1. ఇలా రాయడం కొందరికే సాధ్యం అవుతుంది. ఫీల్ క్షణ క్షణం ఉంటూ నిర్మలమైన రొమాంటిక్ సరస్సులో కన్సీవ్ అయిన అందమైన భావం...నైస్ రైటింగ్...ఇప్పటికి ఇంతే మనోహరం💞🌹❤️

    ReplyDelete
    Replies
    1. Writer to writer! Thanks for the comment Geo Laxnam garu. 🙏❤️

      Delete