Tuesday, 21 May 2019

సముద్రం నాకిష్టం

హైద్రాబాద్‌లో అన్నీ ఉన్నాయి. ఒక్క సముద్రం తప్ప.

ఆమధ్య కేసీఆర్ ఏపీనుంచి ఏదో పోర్ట్ ఎత్తుకొస్తారని విన్నాను.

ఆ పని చేస్తారో లేదో గాని, దానికి బదులు వైజాగ్ నుంచి సముద్రం ఎత్తుకొస్తే బాగుండునని నేను చాలాసార్లు అనుకొన్నాను. :)

సముద్రమంటే నాకు అంత ఇష్టం.

కట్ టూ వైజాగ్ - 

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.

తర్వాత చలం .. భీమ్‌లీ .. ఆ తర్వాత అరకు .. స్టీల్ ప్లాంట్ .. గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, అదే స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో మేమున్న నాలుగు రోజులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి.

1987లో అనుకుంటాను, నేను వైజాగ్ మొట్టమొదటిసారిగా వెళ్లాను...

తర్వాత మరికొన్నిసార్లు వైజాగ్ వెళ్లానుగానీ, ఎప్పుడు కూడా వైజాగ్‌ను అంత పెద్ద స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను.

వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తోంది.

ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను.

వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం.

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి.

ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు.

దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను.

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను.

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను.

సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను.

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్... 

Monday, 13 May 2019

ఒక నిర్ణయం విలువెంత?

నాకత్యంత ప్రియమైన ప్రపంచస్థాయి నవలారచయితల్లో బుచ్చిబాబు ఒకరు.

ఆయన రాసిన ఒకే ఒక్క నవల .. "చివరకు మిగిలేది".

"గడ్డిపోచ విలువెంత?" అన్న సింపుల్ వాక్యంతో ఆ నవల ప్రారంభమవుతుందని  నాకింకా గుర్తుంది. అదిక్కడ కోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నిర్ణయమో చివర్లో చూద్దాం.

కట్ టూ మన నిర్ణయాలు - 

జీవితంలోని ప్రతిదశలోనూ ఎప్పటికప్పుడు వందలాది నిర్ణయాలు తీసుకుంటూవుంటాం మనం.

ఇష్టమైన పెన్ కొనుక్కోవడం నుంచి, పెళ్లిదాకా.
ఏదో ఓ కోర్స్ చదివి, మరేదో ఉద్యోగంలో చేరేదాకా.
ఏదో ఓ లోపల్లోపలి అతిచిన్న గోల్‌తో మరేదో ఇష్టంలేని ప్రొఫెషన్‌లో చేరి, అందులోంచి బయటికి రావాలనుకొన్నా రాలేనంత 'పీకల లోతు' ఇరుక్కునేదాకా.

జీవితమంతా ఎన్నో నిర్ణయాలు.

చిన్నవీ, పెద్దవీ.

కానీ, మనం తీసుకొన్న ఒక నిర్ణయం తప్పని తర్వాత తెలిసినా .. వెంటనే దాన్ని సరిచేసుకొనే మరో కొత్త నిర్ణయం తీసుకోలేనప్పుడే అసలు చిక్కంతా!

కట్ బ్యాక్ టూ మన గడ్డిపోచ - 

ఎవరో ఏదో అనుకుంటారనో, అందరి దృష్టిలో బాగుండాలనో, ఇంకెవరిలాగానో ఉండాలనో .. ఇష్టం లేకపోయినా, ఈగో అడ్డొచ్చినా, ఎంత కష్టమయినా .. ముందు తీసుకున్న ఒకానొక నిర్ణయానికే కట్టుబడి ఉండటం అనేది ఓ పెద్ద తప్పుడు నిర్ణయం!

విషయం చిన్నది కావొచ్చు, పెద్దది కావొచ్చు. ఫలితాల్నిబట్టి ఎప్పటికప్పుడు తమ నిర్ణయాల్ని మార్చుకోలేనివారు ఎవరైనా సరే వారి జీవితంలో చాలా కోల్పోతారు. లేదా జీవఛ్చవంలా బ్రతుకుతుంటారు. పరోక్షంగా మరెందరి జీవితాలో ప్రభావితం కావడానికి కారణమవుతారు.
ఈలోగా జీవితం తెల్లారిపోతుంది.

ఇలా జీవితాల్ని తెల్లార్చుకొనేవారు సమాజంలో 99% ఉంటారు. మిగిలిన ఆ ఒక్క శాతం మంది మాత్రమే ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని మార్చుకొంటూ సిసలైన గట్స్‌తో ముందుకెళ్తుంటారు. అనుకున్న జీవితాన్ని అనుభవిస్తుంటారు.

అదీ తేడా.

ఈలెక్కన మనం తీసుకొనే ఒక నిర్ణయం విలువెంత?

ఒక గడ్డిపోచంత.     

Sunday, 12 May 2019

హాపీ బర్త్‌డే, ప్రియతమ్!

ఈ బ్లాగ్ రాయడం పూర్తిచేసి, పోస్ట్ చేసేటప్పటికి మా అపార్ట్‌మెంట్స్ ముందు ఈ అర్థరాత్రిపూట మస్త్ అల్లరి ఉంటుంది.

మా చిన్నబ్బాయి ప్రియతమ్ పుట్టినరోజు రేపు.

వాడి క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ అంతా వచ్చి వాన్ని కిందకు తీసుకెళ్తారు.

ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఈ అర్థరాత్రి "బర్త్‌డే బంప్స్" పేరుతో వాడి వీపు విమానం మోత మోగించటం వగైరా అంతా తెలిసిందే.

కట్ చేస్తే -

మా ఇద్దరబ్బాయిల్లో ప్రియతమ్ చిన్నోడు.

ఈసారి వాడి బర్త్‌డే రోజు నేను గుంటూరులో ఉన్నాను. ఈ బర్త్‌డేకు వాడికి ప్రామిస్ చేసినవాటిని సమయానికి సమకూర్చలేకపోయాను.

ఇందాకే ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను, "ఫైన్ కింద డబల్" ఇస్తానని.

సరే అన్నాడు.

సుమారు ఏడేళ్ళక్రితం ఒక యాక్సిడెంట్లో నేను తీవ్రంగా గాయపడ్డాను. ఒక ఎనిమిది నెలలపాటు బెడ్ పైనే రెస్ట్ తీసుకోవాల్సివచ్చింది.

ఫిజియోథెరపిస్ట్ ఇంటికొచ్చి సర్జరీ అయిన నా కాలుని వంచడానికి కొన్ని ఎక్సర్‌సైజులు చేయించేవాడు. ఆ ఫిజియోథెరపిస్ట్ చెప్పినట్టుగా ప్రియతమ్ మిగిలిన రెండుపూటలూ చాలా ఓపిగ్గా నాచేత ఎక్సర్‌సైజులు చేయించేవాడు.

అప్పుడు వాడి వయసు పన్నెండేళ్లే.

చిన్నప్పటినుంచీ నేనంటే వాడికి చాలా కన్సర్న్.

ఇప్పుడు పంతొమ్మిది దాటి, ఇరవైలోకి ప్రవేశిస్తున్నా వాడిలో నాపట్ల అదే కన్సర్న్, అదే ప్రేమ.

ఏం మారలేదు.

బహుశా దూరంగా ఉన్నాననేమో, వాడికి సంబంధించిన ఇంకెన్నో విషయాలతోపాటు, వాడి బర్త్‌డే రోజు, అప్పటి ఈ జ్ఞాపకం కూడా నెమరేసుకొంటున్నాను.

బర్త్‌డే గిఫ్ట్‌గా, ప్రియతమ్ కోసం ఈరోజే ఆన్‌లైన్‌లో నేనొక యాక్టివిటీ ప్రారంభించాను. దాన్ని పూర్తిస్థాయిలో సెటప్ చేసేసి, ఈ నెలాఖరుకి వాడికి అప్పగిస్తాను.

ఇంకో 90 రోజుల తర్వాతనుంచి నేను వాడికి పాకెట్ మనీ ఇవ్వాల్సిన పనుండదు. అవసరమైతే వాడే నాకెప్పుడయినా అడ్జస్ట్ చేయొచ్చు.

వాడి చదువుకి ఇది ఏమాత్రం అడ్దంకి కాదు. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వారానికో నాలుగు గంటల సమయం దీనికి కెటాయిస్తే చాలు.

తన ఇరవయ్యవ పుట్టినరోజునాటికే మా ప్రియతమ్ ఒక "ఇన్‌ఫొప్రెన్యూర్" అవుతుండటం నాకు ఆనందంగా ఉంది.              

హాపీ బర్త్‌డే చిన్నూ...