Tuesday 31 December 2013

మహా జ్ఞానోదయమ్!

కొన్ని నిజాలు ఒప్పుకోడానికి గట్స్ ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే, నిజాయితీ ఉండాలి. ఈ రెంటితో కలగలిసిన నా అనుభవాలే ఈ పోస్టు. 2013 చివరి రోజున ఓ చిన్న స్వీయ విశ్లేషణ, విమర్శ, సమీక్ష.

13 అంకె మంచిది కాదు అని ఓ మూఢ నమ్మకం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలా స్టార్ హోటెల్స్‌లోని గదులకు అసలు 13 నెంబర్ ఉండదు. రూమ్ నెంబర్ 2012 తర్వాత 2014 మాత్రమే ఉంటుంది. 2013 ఉండదు!

దాదాపు ప్రపంచమంతా 13 సంఖ్యను ఎన్నోచోట్ల అలా వదిలేస్తారన్నమాట ..

అలా అని మనం 2013 సంవత్సరాన్నే వొదిలేయలేదుకదా!

కట్ టూ నా 2013 - 

ఏ విధంగా చూసినా, 2013 కు నేను చాలా చాలా థాంక్స్ చెప్పాలి. చెప్పక తప్పదు. అది నా బాధ్యత. కృతజ్ఞత.

2012 తో పోల్చిచూస్తే.. 2013 నాకు ఎంతో మేలు చేసింది. నా వ్యక్తిగత జీవితంలో, ఆలోచనల్లో ఎన్నో ఊహించని మార్పులకు కారణమయింది.

2012 జనవరి 4 అర్థరాత్రి బంజారాహిల్స్‌లో నాకు జరిగిన ఓ భారీ యాక్సిడెంట్ తర్వాత.. సుమారు ఒక సంవత్సరం నేను బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాదాపు ఒక సంవత్సరంపాటు బయటికి అస్సలు రాలేకపోయాను. ఒక్క శారీరకంగానేకాదు.. మానసికంగా, ఆర్థికంగా, సాంఘికంగా కూడా దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు.

2012లో నేను ఎదుర్కొన్న అలాంటి దయనీయ స్థితి నుంచి నన్ను బయటికి తీసుకువచ్చిన సంవత్సరం 2013.

నా వ్యక్తిగత, వృత్తిగత, ఆర్థిక జీవితంలోని ఎన్నో తలనొప్పుల్ని ఒక్కొక్కటిగా వొదిలించుకొనేలా చేయగలిగింది 2013. మిగిలిన అతి కొన్ని చిక్కుల్ని సాధ్యమయినంత త్వరగా తొలగించుకోడానికి నాకు మార్గం సుగమం చేసింది 2013. ఇంకా చెప్పాలంటే, ఈ విషయంలో నాకో రెడ్ కార్పెట్ వేసింది 2013.

డిసెంబర్ 18 కి నేను నిర్దేశించుకొన్న నా క్రియేటివ్ ఫ్రీడమ్ లక్ష్యాన్ని 100 శాతం చేరుకోడానికి నాకెంతో ఉపకరించింది 2013.

అన్నిటినీ మించి - ఈ బ్లాగ్ ద్వారా, నన్ను నేను అనుక్షణం.. లేదా, అనుకున్నప్పుడల్లా విశ్లేషించుకునేలా చేసింది 2013. అది కూడా .. ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్లు లేకుండా!

ఈ బ్లాగ్ ద్వారానే, ఎన్నో ఏళ్ల క్రితం నేను మర్చిపోయిన నా అత్యంత ప్రియమైన హాబీ "రైటింగ్"తో మళ్లీ నన్ను కలిపింది 2013. ఇంక భవిష్యత్తులో ఎన్నడూ విడిపోలేనంతగా!

కట్ టూ నా ఫిలిమ్‌మేకింగ్ అనబడే ఓ మాస్క్ -  

నాకత్యంత ప్రియమైన హాబీల్లో సినిమా కూడా ఒకటి. అంతేకానీ, సినిమానే నాకు సర్వస్వం కాదు. ఎప్పుడూ దాన్నలా తీసుకోలేదు నేను. దానికంత సమయం కూడా నేను కెటాయించలేదు.

నాదికాని ఈ ప్రొఫెషన్‌లో నేను ఎంత ప్రయత్నించినా, నానా రకాల లెక్కలు, సమీకరణలు నన్ను అడుగడుగునా ఆపివేశాయి. నేను పెట్టుకున్న కొన్ని నైతిక నియమాలు నన్ను అడుగు ముందుకు వేయనీయలేదు. దీన్ని నేను నెగెటివ్‌గా తీసుకోవటం లేదు. ఎందుకంటె, 2013 నాకు కలిగించిన మహా జ్ఞానోదయమ్ ఇదే!

సినీఫీల్డులో ఒక విడదీయరాని భాగమైన "యూజ్ అండ్ త్రో" కల్చర్‌ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అంతులేని మేనిప్యులేషన్స్‌తో కూడిన ఈ ఫీల్డులోనే మనకు కావలసినవన్నీ ఉన్నాయన్న నిజాన్ని కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

ఇలాంటి ఈ మాయానగర్‌లోనే, ఈ ప్రొఫెషన్‌ను అపరిమితంగా ఎంజాయ్ చేస్తూ.. 2014 చివరివరకూ.. నేను కోరుకున్నట్టు ముందుకుసాగేలా నన్ను నిలబెట్టింది 2013. అందుకు అవసరమయిన ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని నాకు అందించింది 2013.

ఇప్పుడిక్కడ నా లక్ష్యం గొప్ప సినిమాలూ, అవార్డులూ, రివార్డులూ కాదు. నన్ను నమ్మి ముందుకు వచ్చిన నా ఇన్వెస్టర్స్‌కి నాలుగు డబ్బులు సంపాదించిపెడుతూ, నేనూ నాలుగు డబ్బులు రొటేషన్ చేసుకోవడం. అంతే.

వెళ్తూ వెళ్తూ, నాకింకో పెద్ద సహాయం చేసింది 2013..

అది.. నేను ఎంతో ప్రియంగా ఎన్నుకొని, పునాదులు వేసుకొని.. ఓ కొత్త స్పిరిచువల్ సామ్రాజ్యాన్ని నాకోసం నేను నిర్మించుకొనేలా చేసింది.

నేను, నా జీవనశైలి, నా జీవిత వాస్తవం ఏంటో.. నేను తెలుసుకునేలా చేసింది.

కట్ టూ కొన్ని అసలు కొసమెరుపులు  -     

ఇంటర్‌నెట్, నా ఫేస్‌బుక్ పేజ్ లు .. నేను కలలో కూడా ఊహించనివిధంగా, కొంతమంది ప్రపంచస్థాయి "బెస్ట్ సెల్లర్" రచయితలతో, ఇతర సృజనాత్మకరంగాల వ్యక్తులతో నేరుగా పరిచయాల్ని పెంచుకునేలా చేసింది. 2013 లో ఇదొక గొప్ప అనుభవం నాకు.

చదువుకూ, సంస్కారానికీ ఎలాగయితే సంబంధం లేదో.. చదువుకూ, మన సంపాదనకూ ఎలాంటి సంబంధంలేదు. అలాగే, మనం చదివిన చదువులకూ మనం చేస్తున్న పనులకూ కూడా ఎలాంటి సంబంధం లేదు. నాకు తెలిసిన ఈ వాస్తవాలనే నాకు మళ్లీ గుర్తు చేసింది 2013.  

"డబ్బుతప్ప మరొకటేదీ లేదు మన మధ్య" అని నా ఆత్మీయులే చాలా నిస్సంకోచంగా, నేరుగా నా ముఖం మీదే చెప్పగలిగిన సంఘటనల్ని నా జీవితంలో సృష్టించింది 2013.

ఆ రకంగా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న నగ్నసత్యాన్ని మళ్లీ నేను నమ్మేలా చేసింది.. 2013.

ఇంతకు మించిన అనుభవాలు ఒక సంవత్సరకాలంలో ఇంకేం కావాలి? ఇంతకు మించిన మహా జ్ఞానోదయమ్ నాకు ఇంకేముంటుంది? అయామ్ రియల్లీ బ్లెస్‌డ్..

థాంక్యూ సో మచ్ , 2013!

ఇంక శెలవ్..  

2013 కు ఫినిషింగ్ టచ్ ఇచ్చిన కత్రినా!

బాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానంలో పోటాపోటీగా ఉన్న దీపికా పడుకొనే, కత్రినా కైఫ్‌ల్లో .. దీపిక 4 వరుస సూపర్ డూపర్ హిట్స్‌తో 2013 ను దాదాపు ఏలేసింది. హిట్ అయిన ఆ 4 చిత్రాలూ (రేస్ 2, యే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్-లీల) 100 కోట్ల క్లబ్‌ని క్రాస్ చేసినవే కావడం విశేషం!

ఈ కోణంలో చూస్తే, 2013లో కత్రినా నటించిన చిత్రం కేవలం ఒకే ఒక్కటి విడుదలయింది. ఆ ఒక్క చిత్రం కోసం కత్రినా చాలా కష్టపడిందనే చెప్పవచ్చు. ఆమె కష్టం ఫలించింది.

సినిమాలో ఓ మెరుపుతీగలా "వావ్!" అనిపిస్తూ తళుక్కుమంది.

ఆ చిత్రం ఇపుడు ఏకంగా బాలీవుడ్ చరిత్రలోనే 300 కోట్ల కలెక్షన్ను దాటి 400 కోట్ల ఫిగర్‌ని తాకబోతోంది!

అదే "ధూమ్ 3" ..

మేకింగ్‌లో కొత్త టెక్నాలజీ, అమీర్ ఖాన్, బైక్‌ల మాయాజాలం తప్ప మరొకదాని గురించి అంతగా చెప్పుకోడానికి ఏమీలేని "ధూమ్ 3" సాధిస్తున్న విజయం అందరికన్నా కత్రినాకే బాగా ప్లస్ అయింది. (అమీర్ ఖాన్ కు కొత్తగా ఏం కావాలి?) బాలీవుడ్ టాప్ రేంజ్‌లో ఆమె స్థానం మళ్లీ మరింత పదిలమయిపోయింది. కొత్తగా కత్రినాకు మరింత క్రేజ్ సంపాదించిపెట్టింది.

కట్ టూ రెండు పాయింట్స్ -

కనిపించినంతసేపూ కళ్లుచెదిరేలా కనిపించినా - "ధూమ్ 3" చిత్రం మొత్తంలో కత్రినా కనిపించింది కేవలం ఓ 15 నిమిషాలే! ఈ కోణంలో చూస్తే - భిన్న చిత్రాల్లో, వైవిధ్యమైన ఛాయలున్న అద్భుత పాత్రల్ని పోషించి మెప్పించే అవకాశం 2013లో దీపికకే దక్కింది.

మరోవైపు, బికినీలో రణబీర్ కపూర్‌తో స్పెయిన్‌లో పర్సనల్ హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తూ దొరికిపోయిన పిక్స్ ఇంటర్నెట్లో వీరవిహారం చేయటం కూడా కత్రినాకు 2013లో ఎక్కడలేని ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.

"ధూమ్ 3" భారీ హిట్టే కానీ, అది కేవలం కత్రినా ఒక్కదాని మాయాజాలం కాదు. అలాగే, పర్సనల్ పాపరాజీ ఫోటోలు తెచ్చే పాప్యులారిటీ కూడా ఏ స్టార్‌నీ ఎంతోకాలం నిలబెట్టదు.

కానీ, ఈ రెండే 2013లో కత్రినాకు బాలీవుడ్‌లో మరింత భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి!

"షో బిజినెస్" అంటే ఇదే .. 

Sunday 29 December 2013

2013 బాలీవుడ్ అసలు హీరో దీపికా?

అవుననే చెప్తున్నాయి లెక్కలు, క్రిటిక్స్ రాతలు ..

కొందరయితే ఏకంగా 2013 సంవత్సరాన్ని బాలీవుడ్‌కి సంబంధించి "దీపిక నామ సంవత్సరం"గా చెప్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి, "2013 బాలీవుడ్ సిసలైన హీరో"గా దీపికని అభివర్ణిస్తున్నారు.

విచిత్రం ఏంటంటే - దీపిక ఎంటరయిన "ఓం శాంతి ఓం" నాటి తొలిరొజుల్లో నుంచి ఇటీవలివరకూ, ఆమెను ఒక "వుడెన్ ఫేస్"గా కొట్టిపడేసిందీ వీళ్లే!

2013 లో ఎఫ్ హెచ్ ఎం, ఇండియన్ మాక్సిమ్, ఈస్టర్న్ ఐస్, ఫిలిమ్‌ఫేర్ వంటి సంస్థలు, అనేక వెబ్‌సైట్స్ నిర్వహించిన వోటింగ్‌లో "వర్ల్‌డ్స్ సెక్సీయెస్ట్ వుమన్", "మోస్ట్ డిజైరబుల్ ఫేస్", "మోస్ట్ ఫేవరేబుల్ స్టార్" వంటి ఎన్నో టైటిల్స్‌ని ఎగరేసుకుపోయింది దీపిక.

కట్ టూ ది క్రియేటర్ -

ఈ పోస్టుని కేవలం ఒక హీరోయిన్‌గా దీపికని ఫోకస్ చేస్తూ రాస్తున్నానే తప్ప.. దీన్నే సర్వస్వంగా తీసుకోరాదు. ఒక హీరో అయినా, హీరోయిన్ అయినా విజయం సాధించారంటే అది ఖచ్చితంగా వారి శ్రమే. కానీ.. వాళ్ల ఆ శ్రమ వెనుక, వాళ్ల ఆ విజాయాల వెనుక ఉండే అసలైన కారకుడు, క్రియేటర్ మాత్రం ఖచ్చితంగా దర్శకుడే అన్న సత్యం ఎప్పటికీ యెవరూ కాదనలేని నిజం.

కట్ టూ మళ్లీ దీపిక -  

2013 లో దీపికా పడుకొనే మొత్తం 5 సినిమాల్లో నటించింది. వాటిలో "బాంబే టాకీస్" పెద్దగా లెక్కలోకి రాదు. ఆ సినిమా కొన్ని కథల సమాహారం. వాటిల్లో ఒక కథలో, దీపిక కేవలం ఒక స్పెషల్ అపియరెన్స్ తరహాలో కనిపించిందనుకోవచ్చు.

"బాంబే టాకీస్"ను పక్కనపెడితే - 2013లో దీపిక నటించిన 4 సినిమాలూ 100 కోట్ల మైలురాయిని దాటిన సూపర్ డూపర్ హిట్లే!

ఇండస్ట్రీ లెక్కల ప్రకారం హీరోయిన్‌గా దీపిక నటించిన "రేస్ 2" 162 కోట్లు, "యే జవానీ హై దివానీ" 302 కోట్లు, "చెన్నై ఎక్స్‌ప్రెస్" 305 కోట్లు, "రామ్-లీలా" 210 కోట్లు ఇప్పటివరకు సంపాదించాయి.

ఈ లెక్కలు చాలు..  దీపిక 2013లో బాలీవుడ్‌ను ఎంతగా ఏలేసిందో చెప్పడానికి!

ఈ లెక్కలు చాలు.. కేవలం ఒక ప్రచారకర్తగా దీపిక తమ కంపెనీకి సంతకం చేసినందుకు కళ్లుమూసుకొని 6 కోట్లు చెల్లించడానికి!!  

Saturday 28 December 2013

"నెట్టు"లేని బ్రతుకొక నరకం!

WTF!! .. ఇప్పుడు అసలు "మనసు" ఎవరికుంది? ఉన్నా దాన్నెవరు అంతగా పట్టించుకుంటున్నారు? పోనీ, అలా పట్టించుకునేవాళ్లు ఎవరైనా ఉన్నారనుకున్నా.. వారి మాటల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ... 

అంతా భ్రమ. కొంచెం ఇదిగా చెప్పాలంటే.. బుల్‌షిట్!

ఏది లేకపోయినా బ్రతకగలుగుతున్నాం.. బ్రతుకుతున్నాం.. కానీ, ఇంటర్‌నెట్ లేకుండా క్షణం బ్రతకలేక పోతున్నాం మనం.

క్రమం తప్పకుండా, నెలనెలా నా ఫోటాన్+ డేటాకార్డ్ బిల్లు కడుతూనే ఉన్నాన్నేను. అయినా, నిన్న ఉదయం నుంచి రాత్రివరకు ఎందుకో నా డేటకార్డ్ కనెక్షన్ కట్ చేశారు!

రాత్రివరకు నరకం అనుభవించి, చివరికి, విధిలేని పరిస్థితిలో కాల్‌సెంటర్‌కి ఫోన్ చేశాను. ఒకటి నొక్కీ, రెండు నొక్కీ.. మొత్తానికి ఎవర్ని నొక్కాలో వాళ్లని ఫోన్లో బాగా నొక్కి.. తిరిగి నా నెట్‌ని రి-యాక్టివేట్ చేసుకోగలిగాను! 

ఇంటర్‌నెట్టూ, యాండ్రాయిడ్ ఫోన్ల జీవనశైలికి అలవాటుపడని వాళ్లకి మాత్రం ఇదంతా చాలా రబ్బిష్‌గా అనిపిస్తుందనుకోండి. అది వేరే విషయం.

వాస్తవం మాత్రం ఇదే. ఏ బిల్లులయినా పెండింగ్ పెడ్తున్నాం కానీ, నెట్ బిల్ విషయంలో మాత్రం చాలా ప్రాంప్ట్‌గా ఉంటున్నాం.

కట్ టూ "వర్డ్ థెరపీ" -

నాకు 101 టెన్షన్లున్నాయి. అయినా.. ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, స్పిరిచువల్‌గా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ - నాకున్న కొన్నేకొన్ని అతి చిన్న లక్ష్యాలవైపు ఒక్కొక్క అడుగే వేసుకుంటూ ముందుకు వెళ్లగలుగుతున్నాను అంటే.. ఆ క్రెడిట్ పూర్తిగా రెండు విషయాలకు చెందుతుంది.  

మొదటిది - నేను నమ్ముకున్న నాలోని స్పిరిచువాలిటీ.

నన్నొక ఆత్మీయ స్నేహితునిలా భావించి, నాకేంకావాలో అందిస్తూ, నన్ను సజీవ జీవనశైలిలో ముందుకునడిపిస్తున్నవి నా ఫేస్‌బుక్, నా బ్లాగ్‌లు. వీటికి నన్ను చేరువ చేసిన ఇంటర్‌నెట్ రెండోది.      

నా మనసూ, గినసూ అన్నీ వీటితర్వాతే. లేదా, వీటిలోనే ఉన్నాయి.. ప్రస్తుతానికి.

ఈ నేపథ్యాన్నంతా "వర్డ్ థెరపీ" అంటారు. దానిగురించి మరోసారి, మరో బ్లాగ్‌పోస్టులో కలుసుకుందాం. 

కట్ టూ నా నెట్ జీవనశైలి -  

రోజుకి ఒక 20 నించి 40 నిమిషాలు నేను నా ఫేస్‌బుక్, బ్లాగ్‌ల కోసం కెటాయిస్తాను. మరో 30 నిమిషాలు నా ఈమెయిల్స్ చూసుకోడంకోసం అవుతుంది. ఇంకో అరగంట నాకిష్టమైన అతికొద్ది బ్లాగుల్ని చదువుతాను.

మొత్తం మీద నేను ఈ నెట్‌కి కెటాయించే గంటన్నర (రోజుకి) ఒకే సారి కావొచ్చు. పది సార్లు కావొచ్చు. కానీ, నెట్ కనెక్షన్ అనేది లేకపోతేమాత్రం నా ఒకరోజులో అత్యంత విలువైన.. నిజంగానే ఎన్నో కోణాల్లో నాకెంతో విలువైన ఆ గంటన్నర సమయాన్ని నేను కోల్పోతాను. 

ఆ గంటన్నర లేకుండా - నా దినచర్యలోని మిగిలిన 22న్నర గంటలకు అసలు ఎలాంటి ప్రాముఖ్యం లేదని నా ఉద్దేశ్యం. చదవడానికి మీకు కొంచెం అతిగా అనిపించినా, ఇప్పుడు నేనున్న నా వ్యక్తిగత పరిస్థితుల్లో మాత్రం ఇదే నిజం.

Sunday 22 December 2013

ఫిలాసఫీ "30/30/40" మీకు తెలుసా?

అమెరికన్ బీచ్ వాలీబాల్ స్టార్, ఫ్యాషన్ మోడల్, నటి, స్పోర్ట్స్ ఎనౌన్సర్, టీవీ హోస్ట్, ప్రేయసి, తల్లి, భార్య, (క్రమం అదే!) అథ్లెట్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, బెస్ట్ సెల్లర్ రైటర్, మొత్తంగా ప్రపంచం మెచ్చిన ఒక సెలబ్రిటీ ..

ఇవన్నీ కలిస్తే ఒక గాబ్రియెలె రీస్!

ఫ్లారిడా స్టేట్‌కు వాలీబాల్ ఆడుతున్నప్పుడే రీస్ లుక్స్‌కి పడిపోయి ఫాషన్ మోడలింగ్ ఆమెని ఆహ్వానించింది. తర్వాత, "సెరెండిపిటీ" వంటి చిత్రాల్లో నటిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తర్వాత స్పోర్ట్స్ అనౌన్సర్‌గా, టీవీ హోస్ట్‌గా  ESPN, NBT, MTV Sports, Fit TV/Discovery వంటి పాప్యులర్ చానెల్స్‌లో వద్దంటే అవకాశాలు.

తర్వాత.. తనకు నచ్చిన స్నేహితునితో సహజీవనం చేసింది. ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయింది. ఆ తర్వాతే తన సహజీవన నేస్తాన్ని పెళ్లి చేసుకొని భార్య అయింది. తర్వాత అథ్లెట్ అయింది. ఫిట్‌నెస్ ట్రైనర్ అయింది. మధ్యలో గోల్ఫ్‌ని కూడా వదల్లేదు. రెండు పుస్తకాలు రాసి బెస్ట్ సెల్లర్ రైటర్ కూడా అయింది రీస్.

ఇవి చాలవూ.. రీస్ ప్రపంచస్థాయి సెలెబ్రిటీగా పాప్యులర్ కావడానికి?

ఇవి చాలవూ.. నైక్ లాంటి సంస్థ రీస్‌ని తన "గాళ్ పవర్" కేంపెయిన్‌కు "ఐకాన్"గా కాంట్రాక్టుమీద సంతకం పెట్టించుకొని మిలియన్ల డాలర్లివ్వడానికి?

దటీజ్ గాబ్రియెలె రీస్ ..

తను ఎన్నుకున్న ప్రతిరంగంలోనూ సక్సెస్ సాధించింది. తన మనస్సాక్షినే నమ్మింది. తను అనుకున్నది చేసుకుంటూపోయింది. తను కోరుకున్న జీవనశైలినే ఎంజాయ్ చేస్తూ హాయిగా సంతృప్తిగా జీవిస్తోంది రీస్.

మనకు తెలిసి, మనకున్న ఈ ఒక్క జీవితానికి అంతకన్నా ఏం కావాలి?

కట్ టూ రీస్ ఇంటర్వ్యూ -

ఈ మధ్యే రీస్ గురించి ఒక పాప్యులర్ అమెరికన్ యోగా గురు చెప్తే విన్నాను. తర్వాత ఆమే (యోగా గురు) పంపిస్తే రీస్ ఇంటర్వ్యూ ఒకటి విన్నాను. ఆ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట ఇది:

"మన జీవితంలోని ఏ దశలోనైనా, మన చుట్టూ ఉన్నవారిలో..  30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు. 30 శాతం మంది మనల్ని ద్వేషిస్తారు. మిగిలిన 40 శాతం మంది అసలు మన గురించి పట్టించుకోరు!"

రీస్ విజయాలు, విజయాల పరంపర వెనకున్న అసలు ఫిలాసఫీ ఇదన్నమాట!

సమాజంతో ముడిపడ్డ, సమాజంపట్ల మన "మైండ్‌సెట్"తో ముడిపడ్ద (మనం వెంటనే ఒప్పుకోడానికి ఇష్టపడని) ఒక గొప్ప జీవితసత్యాన్ని చాలా సింపుల్‌గా చెప్పింది రీస్.

ఈ సత్యం - ప్రపంచంపట్ల నా దృక్పథాన్నే సంపూర్ణంగా మార్చివేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. కానీ నిజం.

ఇప్పుడు చెప్పండి ..

మీరు మీ కలలు, లక్ష్యాల గురించి ఆలోచిస్తారా? లేదంటే రీస్ చెప్పిన "30/30/40" ల గురించే అలోచిస్తూ మీ జీవితపర్యంతం ఇంక వాటినే పట్టించుకుంటారా?

నిర్ణయం మీదే.

ఆ నిర్ణయంమీదే మీ భవిష్యత్తు, మీ సంతోషం, మీ సంతృప్తి ఆధారపడి ఉంటాయి.

ఏమంటారు?  

Friday 20 December 2013

కింగ్‌ఫిషర్ కేలెండర్లో తెలుగు మెరుపు!

యూబీ గ్రూప్ అధిపతి విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ కేలెండర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతర్జాతీయస్థాయి క్రేజ్ అది. ఒక కేలెండర్‌కు ఆ రేంజ్ బ్రాండ్‌ని క్రియేట్ చేయగలిగింది బహుశా, నాకు తెలిసి, విజయ్ మాల్యా ఒక్కడే! 

కింగ్‌ఫిషర్ కేలెండర్‌ కోసం మోడల్‌గా ఎంపిక కావడమనేది కూడా ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దానికోసం జరిగే స్క్రీన్‌టెస్టులు, సెలెక్షన్లు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయి.

కేవలం మనవాళ్లేకాదు, ఎందరో అంతర్జాతీయస్థాయి మోడళ్లు కూడా ఈ కేలెండర్లో కనిపించడంకోసం పోటీ పడతారు.

ఎవరైనా ఒక అమ్మాయి, ఒక్కసారి కింగ్‌ఫిషర్ కేలెండర్లో మోడల్‌గా కనిపించిందంటే చాలు. జన్మ ధన్యం అయినట్టే. ఇంక ఆ అమ్మాయి కొత్తగా సాధించాల్సింది ఏమీ ఉండదంటే అతిశయోక్తికాదు. ఇంక అక్కడనుంచి "రా..రమ్మంటూ" ఎన్నో ఇతర క్రియేటివ్ రంగాలనుంచి రెడ్‌కార్పెట్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

ఓవర్‌నైట్‌లో టాప్‌రేంజ్ సెలెబ్రిటీలయిపోతారు.

మన బాలీవుడ్ హీరోయిన్లలో కూడా కొందరు ఈ కింగ్‌ఫిషర్ ప్లాట్‌ఫామ్ ద్వారానే బాలీవుడ్‌లోకి ఎంటరయి, అత్యున్నత స్థాయికి చేరుకోగలిగారంటే నమ్మగలరా?

ఈ మధ్య వరుసగా 5 హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించి, బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న దీపికా పడుకొనే కూడా కింగ్‌ఫిషర్ కేలెండర్లో మోడల్‌గానే ఈ రంగులప్రపంచంలోకి ఎంటరయిందన్న విషయం చాలామందికి తెలియని నిజం.

ఇంకా - కత్రినా కైఫ్, యానా గుప్తా, ఉజ్వల రావత్, నర్గిస్ ఫక్రి, లిసా హేడెన్, కరిష్మ కొటాక్ మొదలైన వాళ్లంతా కూడా ఈ కింగ్‌ఫిషర్ కేలెండర్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే.  

కట్ టూ తెలుగు శోభిత - 

2014 కింగ్‌ఫిషర్ కేలెండర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు మోడల్ (ఫ్రమ్ తెనాలి!)   కింగ్‌ఫిషర్ కేలెండర్‌కి మోడల్‌గా ఎంపికయింది. ఒక రకంగా ఇది సంచలనమే.

ఈ సంచలనం పేరు శోభిత ధూళిపాళ .. మిస్ ఇండియా ఎర్త్ 2013.

శోభిత మోడలింగ్‌తో కూడిన కింగ్‌ఫిషర్ 2014 కేలెండర్ ప్రపంచమంతా మరికొద్ది గంటల్లో (21 డిసెంబర్) రిలీజవబోతోంది. లెటజ్ ఆల్ విష్ శోభిత.. ఎ వెరీ ఫేసినేటింగ్ ఫ్యూచర్! 

శఠగోపాన్ని దొంగిలించిన జీవితం!

ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పీ పట్నాయక్, పాటల రచయిత కులశేఖర్ కాంబినేషన్లో అద్భుతమైన మ్యూజిక్ ట్రెండు ఒక ఊపు ఊపింది. అది కొంతకాలమే కావొచ్చు.

కానీ, అప్పటి ఆ ట్రెండుని అంత సులభంగా  మనం మర్చిపోలేం.

క్రమంగా ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని పక్కనపెట్టాడు. డైరెక్టరయ్యాడు. యాక్టరయ్యాడు. ఈ మధ్యే డైరెక్టర్‌గా ఒక ఇంగ్లిష్ సినిమా కూడా చేస్తున్నట్టు ఎక్కడో చదివాను. బహుశా అది కూడా ఇప్పటికి అయిపోయే ఉంటుంది. నేను నిజంగా ఆర్పీ పట్నాయక్‌ని అభినందిస్తున్నాను. తన అభిరుచి, ఆశయాలమేరకు.. తన ఇష్టానుసారం జీవితంలో ముందుకు వెళ్తున్నాడు.

కానీ, ఇక్కడ విషయం అది కాదు ..

కులశేఖర్ ఎందుకోమరి.. లిరిక్ రైటర్‌గా కూడా క్రమంగా తెరమరుగైపోయాడు. తర్వాత ఆయన కూడా దర్శకుడయ్యాడు.

కులశేఖర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం "ప్రేమలేఖ రాశా" ఫ్లెక్సీని బేగంపేట్ లైఫ్‌స్టైల్ బిల్డింగ్ పైన కనీసం ఓ సంవత్సరంపాటు చూశాన్నేను. ఫ్లైఓవర్ పైన కార్లో వెళ్తున్నపుడు.. దాదాపు ప్రతిసారీ, ఎదురుగా అంత ఎత్తున కనిపించే ఆ ఫ్లెక్షీపైనే నా దృష్టి పడేది. తర్వాత ఆ ఫ్లెక్సీ కూడా కనుమరుగైపోయింది.

కట్ టూ శఠగోపం -

ఉన్నట్టుండి నిన్నటి "ఈనాడు" పేపర్లో కులశేఖర్ గురించి ఒక వార్త చదివాను. ఏదో గుళ్లో శఠగోపం దొంగిలించాడన్న నేరం నిర్ధారణ అయి, కులశేఖర్‌కు 6 నెలలు జైలు శిక్షపడిందని!

వెంటనే ఫోన్లద్వారా, ఇండస్ట్రీ మిత్రులద్వారా ఎంక్వయిరీ చేశాను. ఇది నిజం అయ్యుండదు అని నా ఉద్దేశ్యం. నిజం కాకూడదని కూడా.

కానీ ఇది నిజం. నేర నిర్ధారణ అయి, ప్రస్తుతం కులశేఖర్ జైల్లో ఉన్నాడు.

కానీ, దీన్ని మించిన బాధాకరమైన వార్త ఇంకొకటి తెలిసింది. సుమారు 100 కు పైగా సినిమాల్లో పాటలు రాసిన కులశేఖర్ ప్రస్తుతం అల్జీమర్స్ తరహా వ్యాధితో బాధపడుతున్నాడనీ, మనుషులను గుర్తుపట్టడం లేదనీ!

ఇంక నేనేం రాయలేకపోతున్నాను .. 

Wednesday 18 December 2013

"1" హచ్ డాగ్ పోస్టర్!

ట్విట్టరంటే నాకు చాలా ఇష్టం. ఫేస్‌బుక్ కంటే కొన్ని విషయాల్లో దీనికే రెస్పాన్స్ రేట్ ఎక్కువ. కాకపోతే, ట్విట్టర్‌ని సరిగ్గా (లేదా చెత్తగా!) ఉపయోగించుకోగల సత్తా మాత్రం నేను కొందర్లోనే చూశాను.

ఉదాహరణకి - ఆర్‌జీవీ, అమితాబ్ బచ్చన్, ఎన్‌డీటీవీ సోనియా, నరేంద్ర మోడీ, వగైర వగైరా. ఈ మధ్య నారా లోకేష్, దిగ్విజయ్ సింగ్‌ల ట్వీట్ల గురించి కూడా చానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్‌లు చాలా చూశాం.

కట్ టూ సమంత ట్వీట్ -

ఈ మధ్యే విడుదలైన ఓ తెలుగు సినిమా పోస్టర్ ఆడవాళ్ల స్థాయిని దిగజార్చేవిధంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. దీని మీద మరెన్నో టీట్లు, న్యూస్ ఐటమ్‌లు, ఆన్‌లైన్ టిట్‌బిట్స్ చాలా వచ్చాయి.

నేను చదివిన వార్తల ఆధారంగా, నాకర్థమైంది ఏంటంటే - అందరూ గోల పెడుతున్న ఆ సమంత ట్వీట్ సుకుమార్-మహేష్‌ల "1" (నేనొక్కడినే) చిత్రం పోస్టర్‌పైనే!

నేనూ చూశాను ఆ పోస్టర్‌ని. సముద్రం ఒడ్డున చెప్పులు చేత్తో పట్టుకొని ముందు మహేష్‌బాబు నడుస్తోంటే, వెనకాల మోకాళ్లమీద, చేతులమీద పాకుతూ అతన్ని ఫాలో అవుతోంది హీరోయిన్ కృతి సనన్!  

నా అంచనా ప్రకారం - ఆ షాట్, ఆ చిత్రంలోని ఏదో ఓ పాటలో చక్‌మని అలా ఫ్లాష్‌లా వచ్చిపోయే ఒక చిన్న షాట్ అయి ఉంటుంది. వాళ్లు దాన్నిలా పోస్టర్‌గా రిలీజ్ చేయడమే సమంత ట్వీట్‌కి కారణమై ఉంటుంది బహుశా!

ఒక క్రియేటివ్ పర్సన్‌గా నేనా షాట్‌ని తప్పు పట్టడం లేదు. కానీ, క్రియేటివ్ ఫ్రీడమ్ (ఉండాల్సిన విధంగా) లేని మన సొసైటీలో, దాన్నొక పోస్టర్‌గా రిలీజ్ చేయటం మాత్రం అంత కరెక్టు కాదు. చెప్పాలంటే, ఒక పెద్ద రిస్క్!

ఇంకా చెప్పాలంటే - లేని నెగెటివిటీని కోరి ఆహ్వానించడమే అవుతుంది. తర్వాత ఏ మహిళా సంఘాలో ధర్నాలు చేయొచ్చు. పోస్టర్లూ చించేయొచ్చు. అదంతా చివరికి ఇంకెక్కడికో దారి తీయవచ్చు ..

కోట్లతో కూడిన మన హెవీ గ్యాంబ్లింగ్‌ను దృష్టిలో పెట్టుకొంటే - ఇంతకంటే ఇంకెంతో బెటర్ పోస్టర్స్‌ని ఎన్నయినా సృష్టించగల సత్తా సుకుమార్‌కు ఉందనే నా ఉద్దేశ్యం.        

కట్ టూ మళ్లీ సమంత -

మనసులో అనిపించింది ఎలాంటి హిపోక్రసీ లేకుండా ట్వీట్ చేసినందుకు హార్టీ కంగ్రాట్స్ టూ సమంత! అయితే, ఒక టాప్ రేంజ్ హీరోయిన్ స్థానంలో ఉండీ - సినిమా చూస్తేగాని తెలీని ఒక అంశంపైన నువ్వు మరీ అంతలా రియాక్ట్ అవకపోతేనే మంచిదేమో సమంతా!

టేక్ కేర్ అండ్ హప్పీ ట్వీటింగ్ ..   

Monday 16 December 2013

విభజన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది?

ఇండస్ట్రీలోని చాలామంది మనస్సుల్ని తొలుస్తున్న ఏకైక ప్రశ్న ఇదే. ఈ ప్రశ్నతో సతమతమౌతున్నవారిలో తెలంగాణ, సీమాంధ్ర వాళ్లు ఇద్దరూ ఉన్నారు.

ఇది నూటికి నూరుపాళ్లూ ఒక వ్యాపారపరమైన ప్రశ్న.

మొన్నామధ్య మా ఆఫీసుకి ఓ ఔత్సాహిక నిర్మాత వచ్చాడు. 101 డౌట్స్‌తొ చంపేశాడు. తర్వాత తోక ముడిచాడనుకోండి. అది వేరే విషయం. ఎంతసేపూ అతని ప్రశ్న ఒక్కటే.

"ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి సినిమా తీస్తాం. అది పూర్తయ్యి, రిలీజ్‌కి వచ్చేటప్పటికి  ఒకవేళ రెండు రాష్ట్రాలు ఏర్పడిపోతే .. ఏంటి మన పరిస్థితి?"

నా ఉద్దేశ్యం ప్రకారం - ఇందులో తల బద్దలు కొట్టుకోవాల్సినంత సీన్ ఏమీ లేదు.

అప్పట్లాగే ఇప్పుడు కూడా మన తెలుగు సినిమాలు - తెలంగాణ, సీమాంధ్ర తేడా లేకుండా - రెండుచోట్లా విడుదలవుతాయి మామూలుగానే. అప్పుడు డీల్ చేసిన వాళ్లే ఇప్పుడూ డీల్ చేస్తారు. అవే పధ్ధతులు, అదే రొటీన్ కంటిన్యూ అవుతుంది దాదాపు.

ఒక్క విషయంలో మాత్రం మార్పు ఉంటుంది. ఇప్పటి వరకూ ఒక్క (సమైక్య) ఆంధ్రప్రదేశ్‌కు  మాత్రమే పోయే మన టాక్స్‌లు, విభజన తర్వాత (నవ్య) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలకూ వెళతాయి. ఎక్కడి టాక్సులు అక్కడే అన్నమాట! 

ఈరూపంలో నిర్మాతలకు అదనంగా ఇంకొంచెం భారం పడొచ్చు. 

అంతకు మించి ఇండస్ట్రీలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. దీనికి కారణాలు అనేకం. వాటిగురించి మరోసారి... మరో బ్లాగ్ పోస్ట్‌లో.  

Sunday 15 December 2013

నందితా దాస్ బాలీవుడ్ డాన్స్!

జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో గెల్చుకొన్న సీరియస్ సినిమాల నటి, దర్శకురాలు నందితా దాస్ తొలిసారిగా ఒక ఫక్తు బాలీవుడ్ డాన్స్ చేయబోతోంది! కాకపోతే, అది హిందీ సినిమా కాదు. స్పానిష్ సినిమా.

"ఫైర్" చిత్రం కోసం షబనా అజ్మీని ముద్దుపెట్టుకొనే హాట్ సీన్లో నటించి సంచలనం సృష్టించిన నందిత - ఎర్త్, బవందర్, బిఫోర్ ది రెయిన్ వంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో అవార్డుల్ని పొందింది.

2008 లో "ఫిరాక్" చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం కూడా వహించి, పలు అంతర్జాతీయ అవార్డుల్నీ రివార్డుల్నీ కొల్లగొట్టింది నందిత.

కట్ టూ నందిత బాలీవుడ్ డాన్స్ -

ఇప్పటివరకు 10 భాషల్లో, 30 సినిమాల్లో నటించిన నందిత - తొలిసారిగా ఓ స్పానిష్ సినిమాలో నటిస్తోంది. అంతవరకూ ఓకే. కానీ, ఈ సినిమాలో తన పాత్ర డిమాండు మేరకు, ఓ పక్కా బాలీవుడ్ ఐటమ్ తరహా పాటలో నందిత నర్తించాల్సి వస్తోంది.

మరియా రిపోల్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పానిష్ చిత్రానికి అంతా "విమెన్ క్రూ"నే పని చేస్తూండటం మరొక విశేషం. అంటే, మొత్తం టీమ్ అంతా ఆడాళ్లేనన్నమాట!

తన 17 ఏళ్ల కెరీర్లో, ఎప్పుడూ సీరియస్ తరహా సినిమాల్లోనే నటించిన నందితకు అసలు డాన్స్ చేయాల్సిన అవసరం రాలేదు. ఈ స్పానిష్ సినిమా కూడా సీరియస్ తరహా సినిమానే. కానీ, కథాపరంగా ఇందులో ఆమె ఓ పక్కా బాలీవుడ్ డాన్స్ చేయాల్సివస్తోంది.

మరో విశేషం ఏంటంటే, నందిత చేయబోతున్న ఈ బాలీవుడ్ సాంగ్‌కి కోరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్! ఇంక పాటలో నందిత ఊపులు, విరుపులూ ఏ రేంజ్‌లో ఉంటాయో ఒక్కసారి అలా.. ఇమాజినేషన్లోకి వెళదామా ..

Saturday 14 December 2013

దస్విదానియా .. బాలీవుడ్‌లో మరో జంట మఠాష్!

ఆ మధ్య సయీఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్‌లు.. ఇప్పుడు హృతిక్ రోషన్! అంతకు ముందు ఇలా ఇంకెందరో సెలబ్రిటీలు, సెలబ్రిటీ జంటలు. విఛ్ఛిన్నమయిన వారి వివాహాలు, వెక్కిరిస్తున్న వ్యవస్థలు ..

నాఉద్దేశ్యంలో - వివాహ వ్యవస్థకు వీడ్కోలు చెప్పకుండా ఆర్‌జీవీ సినీఫీల్డులో ఒక ఐకాన్ అయివుండేవాడు కాడు. ఒక్క సినీ ఫీల్డులోనే కాదు. క్రియేటివిటీకి సంబంధించిన ఏ ఫీల్డులోనయినా అప్పుడప్పుడూ, అక్కడక్కడా ఇది తప్పదు.

అంతా ఓకే అనుకుంటే ఓకే. రాజీ పడ్డారా ఇంక జీవితం లేదు.  

ఇదంతా మామూలే. ముఖ్యంగా సినీఫీల్డులో. ఇంకా చెప్పాలంటే, క్రియేటివిటీకి సంబంధించిన మరే ఇతర ఫీల్డులకు చెందిన వ్యక్తుల జీవితాల్లోనయినా , జంటల్లోనయినా ఇలాంటి ఊహంచని పరిణామాలు, ముగింపులు మామూలే.

క్రియేటివిటీకి చెందినవాళ్లు ఏ బంధనాల చట్రాల్లోనూ ఇమడలేరు. అంతే!

దీనికి వంద కారణాలుంటాయి. లేదంటే, అసలు కారణాలే ఉండవు. "ఎందుకిలా?" అని శోధించడంకన్నా తెలివితక్కువతనం మరొకటి ఉండదు.

ఇదంతా కేవలం తాత్కాలిక వ్యామోహాలు, ఆకర్షణలు, సెక్స్ కోసమే అనుకోవడానికి లేదు. అలా అనుకోవడం కన్నా మూర్ఖత్వం లేదు. ఇంకేదో ఉంది.      

మగ అయినా, ఆడ అయినా - ఎదుటి వ్యక్తిలోని క్రియేటివిటీని, దాన్ని పెంపొందించుకొని ఏదో సాధించాలనుకొనే ఆ వ్యక్తిలోని తపనని.. అర్థం చేసుకొని, అప్రిషియేట్ చేయగల శక్తిలేని జీవిత భాగస్వామివల్ల - ఆ రెండు జీవితాలూ దారుణంగా నష్టపోతాయి. ఏమీ మిగలదు. ఎవరూ సంతోషంగా ఉండలేరు. పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి.

దానికన్నా, ఒక అవగాహనతో.. స్నేహంగానే విడిపోయి, సంతోషంగా బ్రతకడమే ఎంతో మంచిది. అదే మన వివాహ వ్యవస్థకి మనం ఇచ్చే నిజమైన గౌరవం.

కారణాలు ఏవయినా కావొచ్చు. హృతిక్-సుసానే ల 17 ఏళ్ల ప్రేమబంధం చెదిరిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే - ఆ ఇద్దరికీ మన వివాహ వ్యవస్థమీద ఎంతో నమ్మకం.. ఎంతో గౌరవం. విడిపోతున్నప్పుడూ అదే చెప్పారు!   

Thursday 12 December 2013

రెస్ట్ ఇన్ పీస్!

మొన్న శ్రీహరి, నిన్న ఏవీయస్, ఇవాళ ధర్మవరపు సుబ్రహ్మణ్యం...

ముగ్గురూ దాదాపు ఒకే విధమైన అనారోగ్యంతో, ఒకటి రెండు నెలల వ్యవధిలోనే స్వర్గస్తులయ్యారు. అదీ విచిత్రం!

శ్రీహరి గారితో కలిసి పని చేసే అవకాశం నాకు రాలేదు. కానీ చాలా సార్లు ఆయనతో మాట్లాడాను.

నా మొదటి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రసాద్ ల్యాబ్‌లో జరుగుతున్నప్పుడు, శ్రీహరి గారి సినిమా ఒకటి కూడా అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది అప్పుడు. రెండూ పక్క పక్క ఎడిట్ సూట్లే. మధ్య మధ్య టీ బ్రేక్ కోసం బయటకు వచ్చినపుడల్లా బాగా మాట్లాడుకొనేవాళ్లం. "ఇంక చెప్పు బ్రదర్.." అంటూ, అప్పుడు ఆయన ఒకటి తర్వాత ఒకటి నోట్లో వేసుకొనే పొట్లాలు గుట్కాలు అన్న విషయం అప్పుడు నాకు తెలియదు!

కట్ టూ ఏవీయస్ -

ఏవీయస్ గారితో నా తొలి చిత్రంలో కలిసి పనిచేశాను. ఇటీవలి చిత్రం "వెల్‌కమ్"లో కూడా ఆయన నటించారు. ("వెల్‌కమ్" నిజానికి కథ, దర్శకత్వం నాది కాదు. ఆ సమయంలో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయినా, నా పేరుతోనే ఆ సినిమా పూర్తయ్యింది, మార్కెట్ అయ్యింది. అది వేరే విషయం.)

ఏవీయస్ గారు ఎర్రమంజిల్లో ఉన్నప్పుడు.. మా అన్న గారి ఫ్లాట్, ఆయన ఫ్లాట్ పక్క పక్కనే ఉండేవి. నాకు అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా స్క్రిప్ట్ పుస్తకం కూడా ఒక పది కాపీలు అడిగి మరీ తీసుకున్నరాయన. పుస్తకాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఎప్పుడు ఎదురైనా, "మనోహర్ గారూ!" అని ఎంతో బాగా పలకరించేవారు. నేను ఎప్పుడూ జేబులో చేయిపెట్టుకొని ఉండటాన్ని, ఒక్కోసారి ఒక్కో రకంగా, సరదాగా జోక్ చేసేవారు. ఆ జోకులు నాకు ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంటాయి.

కట్ టూ ధర్మవరపు -

నా తొలి చిత్రం కోసం నానక్‌రామ్‌గూడ లోని రామానాయుడు స్టూడియోలో షూట్ చేస్తున్నాము. నైట్ షూట్. ఒక ఇన్స్‌పెక్టర్ రోల్ కోసం ధర్మవరపు గారిని తీసుకున్నాము.

ఒక్కటే కాల్ షీట్. రావటం రావటమే నేరుగా నా దగ్గరికి వచ్చారు ధర్మవరపు. "డైరెక్టర్ గారూ! నేను నైట్ షిఫ్ట్‌లు చేయటం లేదు. చక చక లాగించేసి. నన్ను 9, 9 న్నరకల్లా పంపించేయండి. అంతకంటే మించి నేను ఉండలేను. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో.. చూసుకోండి" అని చెప్పేసి మేకప్ వేసుకోడానికి వెళ్లారు.

ఇక మా మేనేజర్, కోడైరెక్టర్ నన్ను తెగ టెన్షన్ పెట్టేయటం మొదలెట్టారు. నాకు ధర్మవరపు గారు చెప్పినదానికంటే ముందు వీళ్ల టెన్షన్ ఎక్కువైపోయింది!

మా కెమెరామన్ శంకర్ గారు, నేను మాట్లాడుకున్నాం. అంత పెద్ద సీన్‌ని ఎంత తొందరగా, ఎలా చేయాలా అన్నది మా చర్చ. ఏదో ప్లాన్ చేసేసుకున్నాం. కానీ, మా డౌట్లు మావి..

మేకప్ పూర్తి చేసుకొని రాగానే - ధర్మవరపు గారికి సీన్ వివరించాను. పూర్తిగా సీన్లోకి వెళ్లిపోయారాయన. సీన్‌ని యమ యెంజాయ్ చేయసాగారు. (పైన వర్కింగ్ స్టిల్ అదే!)

ఆయన రోల్ ఇన్స్‌పెక్టర్ రోలే అయినా - అది, బాలకృష్ణ "లక్ష్మీనరసిం హ" కు పేరడీలా ఉంటుంది.. డైలాగులూ అవీ, రీ రికార్డింగుతో సహా!

అంతే.. "9 గంటలకి వెళ్లిపోతాను" అన్నవాడల్లా.. ఆ రోల్‌ని పిచ్చ యెంజాయ్ చేస్తూ, తెల్లవారుజామున 2 గంటలవరకూ కూల్‌గా చేసేసి, హాప్పీగా వెళ్లారు. వెళ్తూ వెళ్తూ, "డైరెక్టర్ గారూ! బాగుందయ్యా, భలే డిజైన్ చేశారు కారెక్టర్ని! అసలెలా వచ్చింది ఈ ఐడియా మీకు?.." అంటూ బాగా నవ్వుకుంటూ వెళ్లారు.

ఇప్పుడు ఈ ముగ్గురూ "ఇక లేరు".. అంటే నమ్మటం కొంచెం కష్టంగా ఉంది. నిజం కాదు అనిపిస్తోంది. కానీ, నిజం. ఆ నిజమే జీవితం. 

Thursday 5 December 2013

ఇరోస్ గ్యాంబ్లింగ్ 72 కోట్లు!

సుకుమార్-మహేష్‌బాబుల ప్రతిష్టాత్మక చిత్రం "1" (నేనొక్కడినే) డిస్ట్రిబ్యూషన్/మార్కెట్ హక్కుల్ని ప్రముఖ మీడియా కార్పొరేట్ సంస్థ ఇరోస్ అక్షరాలా 72 కోట్లకు కొనుక్కున్నట్టు సమాచారం.

ఇదే నిజమయితే - మహేష్‌బాబు "1" చిత్రం .. ఇటీవల బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన త్రివిక్రమ్-పవన్ ల చిత్రం "అత్తారింటికి దారేది" కలెక్షన్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది. మహేష్‌బాబు ఎంత టాప్ హీరో అయినప్పటికీ, అదంత సులభం కాదని నా ఉద్దేశ్యం. చిత్రం పైన "సూపర్ డూపర్ హిట్" టాక్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు.

ఏ మాత్రం అటూఇటూ అయినా ఇరోస్ చతికిలపడిపోవాల్సి వస్తుంది. 72 కోట్లు మఠాష్ అవక తప్పదు. అందుకే ఇది హెవీ గ్యాంబ్లింగ్ ఒకరకంగా.

సుకుమార్-మహేష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంగా "1" పైన ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో కూడా. మరోవైపు, మహేష్ కి దేవిశ్రీప్రసాద్ మొదటిసారిగా సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే కావడం ఇంకో విశేషం. అంతే కాదు. మహేష్ కుమారుడు గౌతమ్ కూడా ఈ చిత్రం ద్వారా తొలిసారిగా తెరమీద కనిపించబోతున్నాడు!

వీటన్నిటి నేపథ్యంలో, మహేష్ అభిమానుల భారీ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో కూడా ఇట్టే ఊహించవచ్చు.  

ఇప్పటికే తెలుగు, ఇతర సౌత్ చానెల్స్ నుంచి "1" చిత్రానికి శాటిలైట్ రైట్స్ 12 కోట్లు వచ్చిందని మార్కెట్లో సమాచారముంది.

ఇక ఏరియావైజ్ సేల్స్ విషయానికొస్తే - తెలంగాణ నుంచి సుమారు 14 కోట్లు, ఆంధ్ర నుంచి 20 కోట్లు, సీడెడ్ నుంచి
8 కోట్ల బిజినెస్ అంచనా వేస్తున్న ఇరోస్‌కు, మిగిలిన ఎన్ని సోర్స్‌ల ద్వారా లెక్కించినా, కనీసం ఓ 10 కోట్ల రిస్క్ ఉంది.

అదీ హిట్ అయితేనే. అదికూడా ..బ్రేక్ ఈవెన్ కోసమే!

"పెట్టిన డబ్బు రావడం కోసమే ఇంత గ్యాంబ్లింగ్ ఆడటం దేనికి?" అని మనకు అనిపించడం సహజం. కార్పొరేట్ ఆటలు ఇలాగే ఉంటాయి. ముందు సౌత్ మార్కెట్లో బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకోవడం వాళ్లకి ముఖ్యం. తర్వాత ఎంత డబ్బయినా సంపాదించుకొనే ప్లాన్లు వాళ్లదగ్గర బోలెడన్ని ఉంటాయి.

ఈ కోణంలో చూస్తే మాత్రం - ఇరోస్ ఆడుతున్నది ఏమంత పెద్ద గ్యాంబ్లింగ్ కాదు.

Wednesday 4 December 2013

అంతా దీపిక లీల!

విమర్శకుల ప్రశంసలతోపాటు, బాక్సాఫీసు కనక వర్షం కుపిస్తున్న భన్సాలి "రామ్-లీల" చిత్రం కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ దీపిక కాదు. కరీనా కపూర్! నమ్మగలరా?

ఇంకో విచిత్రం ఏంటంటే, "గోరి తేరా ప్యార్ మే" అనే ఒక మామూలు రొటీన్ చిత్రం చేయడం కోసం రామ్-లీల చిత్రాన్ని వదులుకుంది కరీనా!

ఇది కరీనా కపూర్ తీసుకొన్న మరో అనాలోచిత నిర్ణయం. ఇంతకు ముందు కూడా - "కహోనా ప్యార్ హై", "కల్ హో న హో", "చెన్నై ఎక్స్‌ప్రెస్" వంటి సినిమాలను వదులుకున్న నేపథ్యం కరీనాకుంది. "అవును, సినిమాల ఎన్నిక విషయంలో నేను పొరపాట్లు చేశాను. నేను పిచ్చ్చిదాన్ని!" అని ఇప్పుడు రియలైజ్ అయింది కరీనా.

"ఖామోషి", "హమ్ దిల్ దే చుకే సనమ్", "బ్లాక్", "దేవదాస్" వంటి చిత్రాను రూపొందించిన భన్సాలీ వంటి అగ్రశ్రేణి దర్శకుని మరో భారీ సినిమా రామ్-లీల. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌నూ దేనికదే ఒక "ఆర్ట్" పీస్‌గా ఉపయోగించుకోవచ్చ్చు.

సబ్జెక్ట్ ఏదయినా కానీ, ప్రతి ఫ్రేమ్ కూడా ఒక విజువల్ ట్రీట్‌లా ఇవ్వటం భన్సాలీ అలవాటు. ఈ ప్యాషన్ భన్సాలీ ప్రతి చిత్రంలోనూ మనం చూడవచ్చు.

శేఖర్ కపూర్ ఈ సినిమా చూసి దీపికను ప్రశంసలతో ముంచెత్తాడు.

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను 3 సార్లు చూశాట్ట! భన్సాలీకి, రణ్‌వీర్‌కు, దీపికకు తన అభినందనలు చెప్పాడు. దీపిక నటనకు మతిపోయిందన్నాడు. ఒక్క అమితాబ్ మాత్రమే కాదు, నా ఫేస్‌బుక్/ట్విట్టర్ మిత్రులు చాలామంది "మూడోసారి రామ్-లీలా చూస్తున్నాను!" అని పోస్ట్ చేశారు.

"కాక్‌టెయిల్", "రేస్ 2", "యే జవానీ హై దీవానీ", "చెన్నై ఎక్స్‌ప్రెస్" తర్వాత.. దీపికకు ఇది వరుసగా 5 వ హిట్టు!

తన మొదటి చిత్రం "ఓం శాంతి ఓం" నాటి దీపిక నటనాపరంగా ఎంతో మెచ్యూర్ అయింది. ఆమె విజయ రహస్యం ఒక్కటే. "తను చేస్తున్న పనిని 100% మనసు పెట్టి చెయ్యటం!". అంతకు మించి ఏమీ లేదంటుంది దీపిక.

భన్సాలీ రచన-సంగీతం-దర్శకత్వం, రణ్‌వీర్‌ సింగ్ పోటాపోటీ నటన, భారీ చిత్రీకరణ, అందమైన ఫ్రేమింగ్.. ఇవన్నీ ఎన్నయినా ఉండనీయండి. తన పాత్రలో పూర్తిగా లీనమయిపోయిన దీపికా పడుకొనే అత్యంత సహజమైన నటనే ఈ చిత్రానికి కేంద్ర బిందువు. ఆ పాత్రలో దీపికను తప్ప మరొకరిని ఊహించలేం. ఇంకొకరు ఎవరు ఆ పాత్రను చేసినా సినిమా ఫలితం మరోలా ఉండేది. ఒకరకంగా, కరీనా తప్పుకొని భన్సాలీని బ్రతికించింది.

ఈ రామ్-లీల.. నిజానికి దీపిక లీల! 

Sunday 1 December 2013

"వర్ణ"నాతీతం .. అనుష్క!

ఒక నంది అవార్డు, రెండు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, మరో రెండు సినీ'మా' అవార్డులు అందుకొన్న ఈ 5 అడుగుల 6 అంగుళాల 'మంగుళూరు సైరెన్' అనుష్క, 2013 ఆరంభం నుంచి కొత్తగా ఏ సినిమాలకు సైన్ చేయలేదంటే నమ్మలేం. కానీ నిజం.
 
అయితే ఇలా సైన్ చేయకపోవటం హీరోయిన్ ఆఫర్లు లేక, రాక కాదు. ప్రస్తుతం అనుష్క దగ్గర డేట్లు లేవు! రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో యమ బిజీగా ఉంది. అవి పూర్తయ్యేవరకూ డేట్స్ ఇవ్వటం కుదరదు ..

కట్ టూ సూపర్ ఎంట్రీ -

2005 లో పూరి జగన్నాథ్ "సూపర్" తో నాగార్జున సరసన సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయమైన ఈ నిలువెత్తు అందం, 2006 లో "విక్రమార్కుడు" హిట్‌తో ఒక్కసారిగా టాప్ రేంజ్ హీరోయిన్ అయిపోయింది. అదే, హీరోయిన్‌గా అనుష్కకు తొలి కమర్షియల్ సక్సెస్. ఈ సక్సెస్.. అదే సంవత్సరం అనుష్క తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ కావడానికి తోడ్పడింది.

ఆ మధ్య జరిగిన "వర్ణ" ఆడియో ఫంక్షన్‌లో అనుష్కని పొగడ్తలతో ముంచెత్తారు అందరూ. ఆ పొగడ్తల్లోకల్లా ముఖ్యమైన పొగడ్త ఏంటంటే.. అనుష్కతో ప్రొడ్యూసర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని. ప్రొడ్యూసర్-ఫ్రెండ్లీ అని. హీరోయిన్‌గా తన పని పట్ల అంకిత భావం, కమిట్‌మెంట్ తప్ప వేరే తలనొప్పులు ఆమెతో ఉండవు అన్నది ఆ ఫంక్షన్ వేదికపై నుంచి దాదాపు అంతా చెప్పారు.

ఒక టాప్ రేంజ్ హీరోయిన్ కావడానికి ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు. అందం, అభినయం అనేవి ఏ హీరోయిన్‌కయినా మామూలుగా ఉండేవే. కాని, తను చేస్తున్న పని పట్ల "ఇంకా ఏదో చెయ్యాలి.. ఇంకా బాగా నటించాలి" అన్న తపన అనుష్కలో ఎక్కువ అని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లు చెబుతారు.

ఆ తపనే ఓ "అరుంధతి" నీ, ఓ "వేదం" నీ ఆమెకు అందించాయి. అయితే, అరుంధతి తర్వాత అనుష్కకి ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే వచ్చాయి. లేదా, అనుష్క అలా సినిమాలను ఎన్నుకోవడం జరిగింది.

అది పెద్ద పొరపాటు అని అనుష్క ఈ మధ్యే గ్రహించినట్టుంది. ఇక మీదట తను ఎక్కువగా గ్లామర్ రోల్స్‌నే చేయాలనుకుంటున్నట్టు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. హీరోయిన్-సెంట్రిక్ మూసలో చిక్కుకుపోయిన ఏ హీరోయిన్ అయినా రిస్కులో పడిపోయిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చేద్దామన్నా, అంతకు ముందులా గ్లామర్ రోల్స్ రావు గాక రావు!       

ప్రభాస్ సరసన నటించిన "బిల్లా"లో ఎలాంటి అరమరికలు లేకుండా అందాలని ఆరబోసిన అనుష్క, తమిళంలో కూడా "సింగం" వన్, టూ లతో అక్కడ కూడా టాప్ రేంజ్ పేరు తెచ్చుకుంది.

కట్ టూ "వర్ణ" -

"7 జి బృందావన్ కాలనీ", "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి హిట్ సినిమాలనిచ్చిన దర్శకుడు శ్రీ రాఘవ "వర్ణ" మాత్రం అనుష్క కెరీర్‌కు చాలా పెద్ద దెబ్బ అనక తప్పదు. అయితే, ఒక్క "వర్ణ" ఫెయిల్యూర్ వల్ల అనుష్కకు వచ్చే నష్టమేమీ లేదు పెద్దగా.  

లక్కీగా ఇప్పటికే పీరియడ్ డ్రామా "రుద్రమదేవి", 100 కోట్ల ద్విభాషా చిత్రం "బాహుబలి" చిత్రాల్లో నటిస్తూ బిజీగాఉంది అనుష్క. ఇవి పూర్తయ్యేవరకూ డేట్స్ లేకే కొత్త సినిమాలేవీ సైన్ చెయ్యలేదు. ఏ కోణంలో చూసినా, ఈ రెండు చిత్రాలూ హీరోయిన్‌గా అనుష్క ఇమేజ్‌ని మరింతగా పెంచేవే.

ఇప్పుడు తాజాగా 16 వ శతాబ్దం నేపథ్యంగా సాగే చారిత్రాత్మక ప్రేమకథా చిత్రం "భాగమతి" లో కూడా నటించడానికి అనుష్క ఒప్పుకున్నట్టు తెలిసింది. అదే నిజమైతే, ఒక విధంగా చెప్పాలంటే, ఈ భాగమతి పాత్రకూడా అనుష్కకు బాగా పేరు తెచ్చేదే.

అయితే, వీటి తర్వాత మాత్రం,  ఈ 32 సంవత్సరాల అందాలరాశి  అనుష్క .. ఖచ్చితంగా రెగ్యులర్ గ్లామర్ చిత్రాలే ఎక్కువగా చేస్తుంది. చేయక తప్పదు. ఎందుకో మీకు బాగా తెలుసు. 

Friday 29 November 2013

ఒక ఆర్టిస్టు డైరీ

టైటిల్ వెరైటీగా ఉంది కదూ?

మరిసా గురించి ఇప్పుడే చదివాను. తనొక రచయిత్రి, ఆర్టిస్టు, టెక్స్‌టైల్ డిజైనర్. ఇంకా ఎన్నో కళల్లో ప్రవేశముంది. మొత్తంగా, మరిసా.. ఒక క్రియేటివ్ వుమన్.

మొదట్లో మామూలుగా అందర్లాగే 9-5 ఉద్యోగం చేస్తుండేది మరిసా. ఇలా జాబ్ చేస్తున్న సమయంలో, తనలోని క్రియేటివిటీని ఏ విధంగానూ బయటకు తెచ్చుకొనే అవకాశం దొరికేదికాదు మరిసాకి. ఈ రోటీన్ లైఫ్‌స్టైల్ ఇలాగే కొనసాగితే, తనలోని సృజనాత్మకత పూర్తిగా అదృశ్యమయిపోయే ప్రమాదముందన్న విషయాన్ని గ్రహించింది మరిసా.

9-5 జాబ్ ఓకే. బ్రతకాలి కాబట్టి. కానీ, తనలోని క్రియేటివిటీ విషయమేంటి?

వన్ ఫైన్ మార్నింగ్ మరిసాకి ఓ ఆలోచన వచ్చింది. దాదాపుగా వారం మధ్యలో వచ్చే గురువారాన్ని (థర్స్‌డే) సంపూర్ణంగా తనలోని క్రియేటివిటీ కోసమే కెటాయించాలని నిర్ణయం తీసుకొంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా తన జాబ్‌లోని పనిదినాల్ని, మిగిలిన ఇంటివిషయాల్ని అడ్జస్ట్ చేసుకొంది.

కట్ టూ క్రియేటివ్ థర్స్‌డే -

గురువారం. ఆ రోజు తను ఏ పని చేసినా అది తనలోని క్రియేటివిటీని ప్రదర్శించేది అయిఉండాలి. అది ఆర్ట్ కావొచ్చు. రచన కావొచ్చు. టెక్స్‌టైల్ డిజైన్ కావొచ్చు. వారంలో ఒక రోజు.. ఆ గురువారం మాత్రం పూర్తిగా క్రియేటివిటీనే.

మరిసా జీవితంలో ఆ నిర్ణయం ఒక అందమైన మలుపు..

ఇది జరిగింది సుమారు ఆరేళ్ల క్రితం. అప్పుడు తను తీసుకొన్న ఆ ఖచ్చితమైన నిర్ణయం తన జీవన శైలినే మార్చివేసింది. క్రమంగా తన రొటీన్ 9-5 జాబ్‌ను కూడా వదిలేసింది.

ఇప్పుడంతా మరిసా ఇష్టం. ప్రతిరోజూ థర్స్‌డేనే. ఒక థర్స్‌డేతో ప్రారంభించిన తన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు ఫుల్‌టైమ్ బిజినెస్ అయింది! కావల్సినంత ఆదాయం. చెప్పలేనంత సంతృప్తి. ఇంకేం కావాలి?

ఇది చదువుతోంటే మీ మైండ్‌లో కూడా ఏవో కొత్త ఆలోచనలు వస్తూ ఉండాలి ఇప్పటికే. కదూ?  

తన ఈ చిన్ని క్రియేటివ్ జర్నీని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడానికి ఓ వెబ్‌సైట్‌ని కూడా రూపొందించుకొంది మరిసా. ఆ వెబ్‌సైట్ పేరు ఏమయిఉంటుందో వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను.

క్రియేటివ్ థర్స్‌డే! 

Tuesday 26 November 2013

"1" వారం, 50 కోట్లు!

ఇప్పుడే తెలిసింది..

మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "1" (నేనొక్కడినే!) బడ్జెట్ అంచనాలకు మించి చేయిదాటిపోయిందని.

అది ఏ రేంజ్‌లో చేయిదాటిపోయిందంటే - దాన్ని కవరప్ చేయటం కోసం "1" నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్‌కు మరో చిత్రం చేయడానికి మహేష్ ఒప్పుకున్నాడని! ఇది నిజం అని నమ్మలేకపోతున్నాను. కానీ, ఇంటర్‌నెట్టంతా, ఇండస్ట్రీ అంతా ఇదే న్యూస్ ఫ్లోట్ అవుతున్నప్పుడు.. కొంచెం కష్టంగానైనా నమ్మక తప్పడం లేదు.

ఒకవైపు కేవలం లక్షల్లోనే యూత్ ఎంటర్‌టయినర్ సినిమాలు తీస్తూ, 12-20 కోట్ల లాభాల్ని తెచ్చిపెడుతున్నారు కొత్త దర్శకులు. దర్శకుడు మారుతి క్యాంపు నుంచి ఇదే పధ్ధతిన ఏకంగా 7 సినిమాలు తయారవుతున్నాయి ఇప్పుడు! సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది.

మరోవైపు పెద్ద సినిమాల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. లెక్కల విషయంలో.      

కట్ టూ బ్రేక్ ఈవెన్ -

మహేష్-సుకుమార్ ల "1" కోసం పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగి రావాలన్నా (బ్రేక్ ఈవెన్), ఆ చిత్రం కనీసం 70 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా! ఇది జరగాలంటే - రిలీజయిన మొదటి వారంలోనే, ఈ చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది!! అది జరిగినప్పుడే, మిగిలిన 20 కోట్లు (బ్రేక్ ఈవెన్ కోసం) కూడా వచ్చే అవకాశం ఉంటుంది.      

ఈ మధ్య కలెక్షన్ల వర్షం కురిపించి, వసూళ్ల సంచలనం సృష్టించిన పవన్-త్రివిక్రమ్ ల "అత్తారింటికి దారేది" సినిమా తొలివారంలో 40 కోట్లు సంపాదించింది. మహేష్-సుకుమార్ ల "1" మీద కూడా భారీ అంచనాలున్నాయి. సెన్సేషనల్ సక్సెస్ అవొచ్చు అని నేనూ నమ్ముతున్నాను. అయితే - "హిట్" టాక్ వచ్చిందంటే ఫరవాలేదు. కానీ.. ఏమాత్రం కిందా మీదా అయినా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.

హెవీ గ్యాంబ్లింగ్ అంటే ఇదే!

మార్కెట్ రేంజ్‌ని పట్టించుకోకుండా ఖర్చుపెట్టి, చివరికి బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా అని ఎదురుచూడ్డం ఒక్క సినీ ఫీల్డులోనే సాధ్యం.  

Friday 22 November 2013

రన్.. 2013 అయిపోవస్తోంది!

మన పెద్దలు చాలా తెలివయినవాళ్లు. ఒకవైపు "నిదానమే ప్రదానం" అన్నారు. మరోవైపు, "ఆలస్యమ్ అమృతమ్ విషమ్" అని కూడా అన్నారు!

దేన్ని ఫాలో కావాలి?

అవసరాన్నిబట్టి, సందర్భాన్ని బట్టి.. ఈ రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ డెసిషన్ మాత్రం మనదే. ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన సమయంలో తీసుకొన్నవాడే విజేత. ఎందులోనయినా.

దీన్నే ఇంగ్లిష్‌లో "డెసిషన్ మేకింగ్" అంటారు అందంగా. రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ తీసుకొన్నవాడే కింగ్! విషయం ఏదయినా కావొచ్చు. ఫీల్డు ఏదయినా కావొచ్చు. ఆ విజయం కోసమే అందరి తపన.

కట్ టూ 'సెల్ఫ్ మోటివేషన్' -

నేను బ్లాగ్ పోస్ట్ రాసి కనీసం 6 రోజులయింది. ఇంతకంటే నిదానం ఉండదనుకుంటా! అలాగని, ఇక్కడి ఈ ఆలస్యం వల్ల ఎక్కడా ఏ అమృతం విషమయిపోదు. కాని, దీని ప్రభావం మాత్రం ఇండైరెక్టుగా నేను చేసే చాలా పనులమీద తప్పక ఉంటుంది.

కారణాలు ఏవైనా కావొచ్చు. ఇదే అలసత్వం, ఇదే ఉదాసీనత, ఇదే నిదానం.. నేను చేయాల్సి ఉన్న ఎన్నో ఇతర ముఖ్యమైన పనులమీద కూడా తప్పక ప్రభావం చూపుతుంది. ఈ 6 రోజుల్లో, కొంతయినా చూపించేవుంటుంది.

సో, ఈ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా నాకోసం నేను రాసుకుంటున్నాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను ఈ బ్లాగ్ రాయడం ద్వారా.

కట్ బ్యాక్ టూ డెసిషన్ మేకింగ్ -

ఒక స్టడీ ప్రకారం - ఖచ్చితంగా, ప్రతి ముగ్గురిలో ఇద్దరు  "చెత్త నిర్ణయాలు తీసుకోవటం"లో స్పెషలిస్టులుట! దీన్నే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు.. మంచి నిర్ణయాన్ని చెత్త సందర్భంలో తీసుకొంటారు. లేదా, చెత్త నిర్ణయాన్ని మంచి సందర్భంలో తీసుకుంటారు. లేదా, పరమ చెత్త నిర్ణయాన్ని అత్యంత చెత్త టైమ్‌లో తీసుకుంటారు! ఫలితం ఎవరైనా ఊహించవచ్చు. ఏమీ జరగదు. లేదా, జరగాల్సినంత నష్టం జరుగుతుంది!

కట్ టూ కౌంట్ డౌన్ -

ఇందాకే చదివిన ఇంకో పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది..

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట! అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు..

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా చాలా వేల రోజులున్నాయి. కాని, ఏంటి గ్యారంటీ?  

ఏ ట్రాఫిక్ లేని సమయంలో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాకయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు.

గ్యారెంటీ ఏదీ లేదు. దేనికీ లేదు.

ఆ అంకెలు, ఆ లెక్క.. కళ్లముందే కనిపిస్తోంది నాకు.    

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం. కాని, చూస్తోంటే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి.

సో, ఇప్పుడు మీకూ అర్థమయ్యే ఉంటుంది. నా భయం నా చావు గురించి కాదు. చచ్చేలోపు నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలను, పనులను ఎక్కడ అసంపూర్ణంగా వదిలిపెడ్తానోనని! అదీ నా భయం..

ఇంకా ఏం చదువుతున్నారు?

మీరూ, నేనూ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం తొందరపడకపోతే, నిజంగా ఆలస్యమ్ అమృతమ్ విషమే..  

Saturday 16 November 2013

లివింగ్ మై ట్రూత్!

సినిమాల్లోకి నేనెప్పుడూ పూర్తి స్థాయిలో దిగలేదు. అంతకంటే ముందు - అసలీ ఫీల్డులోకి రావాలని కూడా నేనెప్పుడూ అనుకోలేదు.

నేను సినిమాల్లోకి రావడం చాలా యాదృఛ్ఛికంగా జరిగింది. అప్పుడు కూడా సినిమాల్లోకి నేను వచ్చిన ఉద్దేశ్యం వేరు. తర్వాత జరిగిందీ, జరుగుతోందీ వేరు.

ఇప్పుడు కూడా నేనేదో మణిరత్నం, భన్సాలీ కావాలనుకోవడం లేదు..

జస్ట్ కొన్నాళ్లు.. ఒక తాత్కాలిక ప్లాట్‌ఫాం. కొంత మనీ రొటేషన్.. నాకూ, ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్‌కీ. అంతే. అంతకు మించి సినీ ఫీల్డు గురించి నేను ఎక్కువగా ఆలోచించడం లేదు. అంత ఆసక్తి లేదు. ఆ అవసరం లేదు.

వందమంది నిర్ణయాలు. క్రియేటివిటీతో ఏ మాత్రం సంబంధం లేని మరో వందమంది లోపలి వ్యక్తుల, బయటి శక్తుల దయాదాక్షిణ్యాలు. అడ్డంకులు. వీటికోసం మన పడిగాపులు..

వీటన్నిటితో పనిలేని, ఏ మేనిప్యులేషన్స్ అవసరం లేని సిసలైన క్రియేటివిటీ ఫీల్డు బయట ఇంక చాలా ఉంది. నా చూపు, నా ఆలోచన, నా అతి చిన్న లక్ష్యం అదే.

నా స్వేఛ్ఛకు ఎలాంటి అడ్దంకులు, ఆంక్షలు ఉండని ఆ "క్రియేటివిటీ" పైనే నా దృష్టంతా. ఆ స్వేఛ్ఛ కోసమే ఈ కష్టమంతా.  

కట్ టూ మై ట్రూత్ -

నాకిష్టమైన అంశాల్లో ప్రధానమైంది క్రియేటివిటీ. చదవటం, రాయటం, ఆర్ట్, సినిమాలు.. ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ క్రియేటివిటీతో ముడిపడినవే. ఈ మధ్యకాలంలో నన్ను బాగా ఆలోచింపజేస్తున్న మరో ప్రధాన అంశం, నేను ఎక్కువ సమయాన్ని కెటాయిస్తున్న అంశం.. స్పిరిచువాలిటీ!

ప్యాషనే అనుకోండి.. ఎట్రాక్షనే అనుకోండి. ఈ రెండు అంశాలే ఇప్పుడు నాకెంతో ప్రియమైన అంశాలు. నన్ను కట్టిపడేస్తున్న అంశాలు. నా జీవిత వాస్తవాలు.

ఈ వాస్తవాల్ని కాదనే మరింకేవో స్వల్పమయిన ప్రయోజనాల మీద నాకు ఆసక్తి లేదు. నాకు సంబంధించని, నా వ్యక్తిత్వానికి సరిపడని అవాస్తవాల్ని వాస్తవాలుగా "మాస్కు" వేసుకోవటం పట్ల కూడా నాకు ఆసక్తి లేదు.

ఒక్కముక్కలో చెప్పాలంటే.. "అంత సీన్ లేదు!"

^^^

ఈ పోస్టు నిన్నటి పోస్టుకి కొనసాగింపు అన్న విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, మరొక్కసారి.. నా మిత్రులూ, శ్రేయోభిలాషులూ.. థాంక్ యూ వన్ అండ్ ఆల్!

Friday 15 November 2013

సారీ, ప్రభుత్వం కోమాలో ఉంది!

ఈ టైటిల్‌తో రాత్రి ఒక బ్లాగ్‌పోస్ట్‌ని రాశాను. టాపిక్ "పాలిటిక్స్" అని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.

"నాకస్సలు ఇష్టం లేదు" అని నేనెప్పుడూ అనుకునే పాలిటిక్స్ పైన కూడా ఏమంత కష్టపడకుండానే, చాలా ఈజీగా రాశాను. రాయగలిగాను.

హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా రాసే నిజం ఏదయినా సులభంగా రాయవచ్చు, బాగా రాయవచ్చు అని నా వ్యక్తిగత నమ్మకం.

ఇంతకుముందు కూడా, ఒకటీ అరా, పాలిటిక్స్‌ని టచ్ చేస్తూ బ్లాగ్‌లో రాశాను. కానీ, ఇంత సీరియస్‌గా రాయటం మాత్రం ఇదే మొదటిసారి.

సో, పై టైటిల్‌తో నా మొట్టమొదటి సిసలైన రాజకీయ వ్యాసాన్ని (బ్లాగ్ పోస్ట్) ఇలా అనుకోగానే అలా రాసేశాను. వ్యాసాన్ని మొదలెట్టడం మామూలుగా లైటర్‌వీన్‌లోనే మొదలెట్టాను. పూర్తయ్యేటప్పటికి మాత్రం.. వ్యాసంలో చర్చించిన అంశాల తీవ్రత ఎంత శిఖరాగ్రం చేరిందంటే.. ఈ ఒక్క పోస్టుతోనే నా బ్లాగ్‌మీదున్న "విజిట్ మీటర్" ఈజీగా లక్షను దాటేయవచ్చుననిపించింది.

ఈ స్టేట్‌మెంట్‌లో అతిశయోక్తి ఒక్క శాతం కూడా లేదు..

కట్ టూ అసలు నేపథ్యం -

నిన్న రాత్రే రాయటం పూర్తి చేసిన ఈ పోస్ట్‌ని బ్లాగ్‌లో పబ్లిష్ చేయలేదు. ఇవాళ పబ్లిష్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో పెట్టాను (వయా ట్విట్టర్!).

రెండ్రోజులముందు, "ఏదయినా పొలిటికల్ పార్టీలోకి అఫీషియల్‌గా చేరాలనుకుంటున్నాను!" అని కూడా ఓ టీజర్ ఇచ్చాను సరదాగా.

ఫేస్‌బుక్‌లో - బయట కొన్ని లైక్‌లు, కొన్ని కామెంట్లు (చాలా తక్కువ) వచ్చాయి. పర్సనల్‌గా మాత్రం 41 మెసేజ్‌లు వచ్చాయి! నిజంగానే షాకయ్యాను నేను.

వాటిల్లో కొన్ని మెసేజ్‌లని బాహాటంగా, బయట కామెంట్స్‌లో పోస్ట్ చేసినట్లయితే నేను కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యేవాడ్ని. నా ఫీలింగ్స్ తెలిసినవాళ్లు కాబట్టి మెసేజ్‌లు పెట్టి బ్రతికించారు! బ్లాగ్ ముఖంగా వారికి నా ధన్యవాదాలు..

ఇంతకీ ఆ మెసేజ్‌ల మెజారిటీ సారాంశం ఇది:

"ఇప్పటికే నీ శాల్తీకి పడని ఊబి లాంటి ఓ ఫీల్డులోకి దూకేసి, లోపల ఉండలేక .. బయటికి రాలేక గింజుకుంటున్నావు. కొత్తగా ఈ రొచ్చులోకి ఎందుకు బాబూ!?"

అదీ విషయం..

నిన్న రాసిన పొలిటికల్ బ్లాగ్ పోస్ట్‌ని వెంటనే "షిఫ్ట్ డిలీట్" చేసేశాను. వాళ్లంతా చెప్పారని కాదు. నా ఉద్దేశ్యం కూడా అదే. (దీని గురించి మరింత వివరంగా రేపు ఇంకో పోస్టులో రాస్తాను.)

ఫేస్‌బుక్, నా బ్లాగ్ - నా ఆలోచనల్ని షేర్ చేసుకొనే నా ఆంతరంగిక మిత్రులుగానే కాకుండా.. నా ప్రయోగశాలలుగా, "సర్వే మంకీ"లుగా కూడా నాకు బాగానే సహకరిస్తున్నాయన్నమాట!

నా మిత్రులు, శ్రేయోభిలాషులు.. థాంక్ యూ వన్ అండ్ ఆల్.. 

Thursday 14 November 2013

రెండే దారులు - 2

టు డూ ఆర్ నాట్ టు డూ, చెయ్యటమా వద్దా.. ఏదయినా సాధిద్దామా, అలా వదిలేద్దామా.. జీవితాన్ని అనుక్షణం అనుభవించడమా, లేదంటే.. "ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది" అనుకొని చేతులెత్తెయ్యడమా?

రెండూ వేర్వేరు దారులు. ఏది బెటర్?

జీవితం ఎప్పుడూ మనల్ని నడిపించే అవకాశం ఇవ్వకూడదు. మనమే మన అభిరుచికి, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా మన జీవితాన్ని నడిపించాలి. ఒకటి అన్నీ గాలికి వదిలేసే మొదటి దారి. ఇంకోటి స్టీరింగ్ మన చేతుల్లోకి తీసుకొన్న రెండో దారి. ఏది బెటర్? 

ఓకే. రెండో దారిని ఎంచుకోడానికి మీకేదయినా అడ్డు తగులుతోందా? మరేదయినా సమస్య ఉందా? అంత వర్రీ కావల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు తక్కువలో తక్కువ ఒక నాలుగు పరిష్కారాలుంటాయి. కావల్సిందల్లా.. సమస్యను భూతద్దంలో చూడకుండా, దాని పరిష్కారం గురించి కొన్ని క్షణాలు ఆలోచించడం.

సంస్యలకు భయపడకూడదు. వాటిని మించి మనం ఎదగాలి.    

ఉదాహరణకు - 1 నుంచి 10 వరకు ఉన్న "స్కేలు"లో మీ మీ సామర్థ్య స్థాయి 2 దగ్గర ఉందనుకుందాం. అదే స్కేలులో మీకు ఎదురయిన సమస్య 5 దగ్గర ఉంది. అంటే మీ సమస్య మీ కంటే కొంచెం పెద్దది. మీరు ఇంకొంచెం కష్టపడి మీ వ్యక్తిగత విలువను, సామర్థ్య స్థాయిని 10 వరకు తెచ్చుకున్నారనుకోండి. ఇందాక మనం చెప్పుకున్న లెవెల్ 5 సమస్య ఇప్పుడు మీ ముందు చాలా చిన్నదయిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. మీ ముందు అదసలు సమస్య కానే కాదు.   

 ఎప్పుడయినా, మీకేదయినా "అతి పెద్ద సమస్య ఎదురయింది" అన్న ఫీలింగ్ వచ్చిందనుకోండి. అలాంటి పరిస్థితిలో కుంగిపోకూడదు. "నేనీ సమస్యని ఎదుర్కోగలను. సమస్యలెప్పుడూ నా ముందు చిన్నవే" అని కాన్‌ఫిడెంట్‌గా అనుకోవాలి. ఆలోచించాలి. పరిష్కారమార్గాల్ని అన్వేషించి ముందుకు కదలాలి.

ఎందుకంటే - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో - చాలావరకు మన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యల అసలు క్రియేటర్స్ మనమే!   

మనలోని క్రియేటివిటీ మన సమస్యల పరిష్కారం కోసం కూడా ఉపయోగపడాలి.  ఉపయోగపడేలా చేసుకోవాలి. ఇది నా వ్యక్తిగత అనుభవంతో నేర్చుకున్నది. నేర్చుకుంటూ ఆచరిస్తున్నదీ.

Tuesday 12 November 2013

రెండే దారులు - 1

ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా .. వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే - ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు.

"నా దారి రహదారి!" అని రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్టు - "నాది ఈ దారి" అన్న ఎంపిక కొంతమంది విషయంలో తెలిసి జరగొచ్చు. కొంతమంది విషయంలో తెలియక జరగొచ్చు.

ఎలా జరిగినా, ఉన్న ఆ రెండే రెండు దారుల్లో ఏదో ఒకదానిలోనే ఎవరైనా వెళ్లగలిగేది. వారు ఎన్నుకున్న ఆ ఒక్క దారే .. అతడు/ఆమె "ఎవరు" అన్నది నిర్వచిస్తుంది.

ఇంతకీ ఆ రెండు దారులేంటో ఊహించగలరా?

మొదటి దారి - మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని "ఏదో అలా" అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం.

రెండో దారి - మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని జీవితంగా అనుక్షణం ఎంజాయ్ చేయడం.

కట్ టూ మొదటి దారి -

మొదటి దారిలో - మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఎదో ఒక ప్రత్యేకత, లేదంటే ఎంతో కొంత 'విషయం' ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము.  

"నాకు రాదు", "నాకు లేదు", "ఇలా వుంటే చేసేవాణ్ణి", "అలాగయితే సాధించేదాణ్ణి" .. వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. తక్కువపని చేయటం, తక్కువ సంపాదించటం, సంతృప్తి లేకపోయినా ఉన్నామన్న భ్రమలో బ్రతకటం, ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రయత్నించకపోవడం, వ్యక్తి వికాసానికి సంబంధించి గానీ, హాబీగా గానీ ఏమీ చదవకపోవడం, అసలు ఆలోచించకపోవడం  .. ఇదీ మొదటి దారిని ఎంచుకున్నవాళ్ల బతుకుబాట.

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. దీనికి కారణాలు అనేకం.

కట్ టూ రెండో దారి -

ఈ దారిలో .. ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. "ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?" అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి "తలతిక్క"గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం .. ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

అంతేకాదు. ఎప్పుడూ పని రాక్షసుల్లా కాకుండా, కుటుంబంతో, స్నేహితులతో తగినంత సమయం గడుపుతూ, ఆ సమయానికి ఒక గొప్ప విలువని తీసుకురావడం; చిన్నవి పెద్దవి ఎన్నో లక్ష్యాల్ని సాధించడం, బాగా సంపాదించడం, (అప్పుడప్పుడూ బాగా కోల్పోవడం కూడా!) ప్రతిక్షణం సంపూర్ణ జీవితాన్ని గడపడం .. ఇవన్నీ కూడా ఈ రెండవ దారిని ఎంచుకొన్న వాళ్ల జీవనశైలిలో ఒక భాగం.

ఇంతకీ మనది ఏ దారి?  

Friday 8 November 2013

ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్, ఒక 500 నోటు!

ఇవాళ సాయంత్రం టీవీలో సీనియర్ హీరోయిన్ జయసుధ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్‌వ్యూలో తను చెప్పాలనుకున్న చాలా విషయాల్ని ఆమె చెప్పలేకపోయింది. చెప్పిన ఆ కొన్ని విషయాల్ని కూడా ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా చెప్పడానికి చాలా ఇబ్బంది పడింది. ఎంతో చెప్పాలనుకున్నా, చెప్పలేకపోతున్న ఆమె ఇబ్బంది చూస్తుంటే నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది.

అదొక రాజకీయ ఇంటర్‌వ్యూ. ఒక పొలిటీషియన్‌గా ఆమె నుంచి కొన్ని పచ్చి నిజాలు రాబట్టిన ఇంటర్వ్యూ అది.

ఒక "శివరంజని", ఒక "మేఘసందేశం" చాలు ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోడానికి. సహజనటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుని, సుమారు 40 ఏళ్లుగా సినీ ఫీల్డులో చాలా డిగ్నిఫైడ్‌గా ఉందా నటి. తన పేరు చెడగొట్టుకొనే ఎలాంటి వివాదాలు దాదాపు ఆమెకు తెలియవు.

కొన్నేళ్లక్రితం తన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక అనుభవాలవల్ల, ఆసక్తివల్ల ఎలాంటి సంకోచం లేకుండా మతం కూడా మారిందామె. ఆ విషయాన్ని కూడా ఎన్నోసార్లు, ఎన్నో ఇంటర్వ్యూల్లో చాలా డిగ్నిఫైడ్‌గా చెప్పుకోగలిగిందామె. అది ఎవరికీ అభ్యంతరం ఉండకూడని విషయం.

నిజానికి మతం అనేది మానవసృష్టి. నా దృష్టిలో అది పూర్తిగా వ్యక్తిగతం.

వ్యక్తిగతమైన ఈ విషయాన్ని కూడా చాలా మంది పిచ్చి రాజకీయం చేస్తారు. అలాంటి రాజకీయం, కామెంట్లు జయసుధ మీద చేయలేకపోయారెవ్వరూ. అదీ జయసుధ సంపాదించుకున్న పేరు.

అలాంటి జయసుధ.. బై మిస్టేక్.. రాజకీయాల్లోకి ఎంటరయింది. కాదు, వైయెస్సార్ రప్పించాడు. "ఏదో ప్రజలకు సేవ చేయొచ్చు కదా" అని అమాయకంగా అనుకుని ఉంటుంది జయసుధ. ఆమె చేసిన పెద్ద తప్పు అదే, బహుశా.

"ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు" అని ఇవాళ తనే చెప్పింది. జయసుధ చెప్పింది వంద శాతం నిజం.

భాష, ప్రవర్తన, కనీస మర్యాద, చాలా సందర్భాల్లో కనీస మానవత్వం .. ఇవన్నీ ఏవీ  తెలియని, తెలుసుకోవడం అవసరం లేని.. 'బాగా డబ్బు, బలగం ఉన్న వ్యక్తుల  మెజారిటీ'నే నేటి రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ  అని చాలా ఇబ్బంది పడుతూ చెప్పింది జయసుధ.

"ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్, ఒక 500 నోటు.. ఇదే నేటి రాజకీయం! ఈ కల్చర్ పోవాలి రాజకీయాల్లో".. అందామె ఎంతో బాధగా. ఇంతకంటే సింపుల్‌గా, స్పష్టంగా ఇంకా ఏం చెప్పాలి?

వ్యక్తిగత ఎజెండాలు, ప్రతిదాన్లోనూ పర్సనల్ ఐడెంటిటీ కోసం కుట్రలు, ఎంత ఖర్చు పెట్టాం.. ఎంత లూటీ చేద్దాం.. ఇదే ప్రస్తుతం మనదేశంలో ఉన్న రాజకీయం.

ఈ రాజకీయం ఇప్పటిది కాదు. స్వతంత్రం వచ్చిన ఆరంభంలోనే ఈ కల్చర్‌కు పునాదులు పడ్దాయి. ఆ పునాదులమీదే 66 ఏళ్లుగా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి.

సహజ నటి జయసుధ ఊహించిన రాజకీయాలు ఇవికావు, బహుశా. చివరికి, ఈ దేశంలోని రాజకీయాలు చూస్తుంటే "అసలు దేశమే వదిలి వెళ్లిపోవాలనిపిస్తోంది" అంది జయసుధ.

వద్దని జయసుధని ఆపగలమా? ఆపడానికి మనదగ్గర ఏ లాజిక్స్ ఉన్నాయి? ఇవాళ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన చేదు నిజాల్ని అబద్దం అని ఎలా చెప్పగలం? అన్నీ నిజాలే ..      

Thursday 7 November 2013

సినిమా అంతిమ లక్ష్యం డబ్బే!

నేను ఆర్ట్ సినిమాల గురించి మాట్లాడ్డం లేదు. వాటి ఉద్దేశ్యం, దారి వేరు. డబ్బు గురించి మర్చిపోతే చాలు. శాశ్వతంగా చరిత్రలో నిల్చిపోయే కళాఖండాలు ఎన్నయినా తీయవచ్చు. ఈ సెక్షన్ గురించి, దీన్లోనూ ఉండే నానా రాజకీయాల గురించీ మరోసారి, మరో బ్లాగ్ పోస్ట్ రాస్తాను.

ఫీల్డు గురించి, దాన్లో మునిగి తేలుతున్నవాళ్లు అనుభవించే అప్స్ అండ్ డౌన్స్ గురించి తెల్సినవాళ్లు మాత్రం "సినిమా అంతిమ లక్ష్యం" డబ్బు తప్ప మరొకటి కాదు అన్న నిజాన్ని ఒప్పుకుంటారు. సెలెబ్రిటీ హోదా, ఫేమ్, ఇతర ఆకర్షణలు వగైరా.. ఈ సిస్టమ్‌లో ఒక చిన్న భాగం మాత్రమే.

ఇదంతా తెలియనివాళ్లు, తెలిసినా పట్టించుకోనివాళ్ళు - యథాప్రకారం ఏవో నీతి సూత్రాలు చెప్తుంటారు. "ఇలా ఉండాలి.. అలా తీయాలి" అని. ఈ చెత్తంతా ప్రాక్టికల్స్‌కి పనిచేయని థియరీ లాంటిదన్నమాట. దాన్నలా వదిలేద్దాం.
 
కట్ టూ "టు బి ఆర్ నాట్ టు బి" -

నిన్ననే ఒక గుడ్ న్యూస్ తెలిసింది. నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్ర లలిత్ (ముంబై) దర్శకుడయ్యాడు. తనే కెమెరామన్‌గా, దర్శకుడుగా ఒక హిందీ-ఇంగ్లిష్ బైలింగువల్ చిత్రం అతి త్వరలో ఫ్లోర్స్ మీదకి వెళ్లబోతోంది. డిల్లీ, ఇంకా హర్యానాలోని మోర్నీ హిల్స్‌లో షూటింగ్. "టు బి ఆర్ నాట్ టు బి" ఆ చిత్రం వర్కింగ్ టైటిల్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్.

సుమారు మూడేళ్లక్రితం లలిత్, నేను పార్ట్‌నర్స్‌గా ఒక ఇంగ్లిష్ చిత్రం చేయాలనుకున్నాం. హిమాలయ అడవులు బ్యాక్‌డ్రాప్‌గా కథాగమనం ఉంటుంది. ఒక మిస్టిక్ థ్రిల్లర్. నటీనటులు కూడా దాదాపు ఎక్కువ భాగం అమెరికా, ఇంకా ఇతర యూరోపియన్ దేశాల వాళ్లే.

అయితే, నా వ్యక్తిగత వ్యవహారాలు, కమిట్‌మెంట్ల కారణంగా ఆ ఆలోచన అలా సా..గిపోతూ ఇంకా ఆలోచన స్టేజిలోనే ఉంది. కాకపోతే ఆ స్క్రిప్టు మీద, ఆ చిత్రం ప్రమోషన్, మార్కెటింగ్‌లమీద నాతోపాటు మరో నాలుగు దేశాల క్రియేటివ్ టెక్నీషియన్లు/ఆర్టిస్టు మిత్రులు గత కొద్ది నెలలుగా పనిచేస్తున్నాం. 2014 చివర్లో ఆ చిత్రం ఉంటుంది.  

కట్ టూ ఇప్పటి నా తెలుగు చిత్రాల నేపథ్యం -

ఇప్పుడు నేను పని చేస్తున్న ప్రాజెక్టు - ఒక మూడు మైక్రో బడ్జెట్ చిత్రాల సీరీస్. ఈ సీరీస్ కౌంట్ డౌన్ డిసెంబర్ చివర్లోనే ప్రారంభం కాబోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రతి అడుగూ వేయాల్సివస్తోంది. దీన్ని ఇంకా సాగదీసే అవకాశం లేదు. ఎందుకంటే, దీనికోసం నేను పెట్టుకొన్న నా వ్యక్తిగత డెడ్‌లైన్ కూడా చాలా దగ్గర్లో ఉంది. 

ఈ మూడు చిత్రాలూ పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే, ఒక రకమైన "నట్స్ అండ్ బోల్ట్స్" సిస్టమ్‌లో రూపొందిస్తున్నవి. శాటిలైట్ రైట్స్ వాళ్లు, అవుట్‌రైట్ బయ్యర్స్, ఫైనాన్సియర్స్.. ఇలా ఒక్కొక్కరి వ్యాపార దృక్పథాల్ని, సలహాల్ని బట్టి ఒక్కో నట్టూ, బోల్టూ ఫిట్ చేసుకుంటూ కథలు అల్లాల్సిఉంటుంది. పైగా ఆర్టిస్టులంతా కొత్తవాళ్లు!  

కాదన్నామా - రాత్రికి రాత్రే దర్శకుడు మనోహర్ స్థానంలో ఎవరో "మల్లన్న" వచ్చేస్తాడు! ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అంత రిస్క్ అవసరం లేదన్న నిజాన్ని మీరూ ఒప్పుకుంటారనుకుంటాను.

ఈ యాంగిల్ పక్కన పెడితే - ఏ కొంచెం రిస్కు తీసుకున్నా, నన్ను నమ్మి డబ్బు పెట్టినవాళ్లు కష్టాలపాలవుతారు. వారి సేఫ్టీ, వారి లాభాల గురించి కూడా ఆలోచిస్తూ, "ఇక్కడ ఇంతే" అనుకొని ముందుకు వెళ్లాల్సిందే. నాలుగు డబ్బులు రొటేషన్ చేసుకొని బయట పడాల్సిందే.

ఇప్పడు నేను చేస్తున్నది అదే.
^^^
(My direct email for aspiring Investors : mfamax2015@gmail.com)

Sunday 3 November 2013

ఇప్పుడు సినిమా అంటే ఒక కార్పొరేట్ బిజినెస్!

నిన్న మొన్నటివరకూ సినిమా అంటే ఒక పెద్ద జూదం. హెవీ గ్యాంబ్లింగ్.

ఈ కారణంగానే - ఎవరైనా సరే, సినీ ఫీల్డులో పెట్టుబడి అంటే తెగ భయపడేవారు. పక్కవాళ్లు ఎవరైనా ఫీల్డులో పెట్టుబడి పెడుతున్నారన్నా "వద్దురా బాబూ" అని వారించేవారు.

ఇప్పుడు సీన్ మారింది.

ఇంతకు ముందులా, సినిమా వ్యాపారం అంటే గుప్పిట్లో మూసిన రహస్యం కాదు. ఫిలిం మేకింగ్‌లో - కాన్‌సెప్ట్ స్టేజ్ నుంచి, సినిమా రిలీజ్ అయి, డబ్బుల లెక్కలు పూర్తయ్యే వరకు.. ప్రతి  స్టేజిలోనూ జరిగే వ్యవహారం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలుసు. అంతా "ఓపెన్" అయిపోయింది.

ఇప్పటిదాకా - ఎవరో "కొందరు" మాత్రమే సినిమాలు తీయగలరు.. కొందరివల్ల మాత్రమే అవుతుంది ఈ వ్యాపారం అన్న అపోహ ఇప్పుడు హుష్ కాకి అయిపోయింది. అన్ని వ్యాపారాల్లాగే ఈ వ్యాపారం కూడా అన్న ఆత్మవిశ్వాసం, అవగాహన ఇప్పుడు దాదాపు అందర్లోనూ వచ్చింది.

అంతే కాదు. సినిమా రంగంలో వచ్చే సెలెబ్రిటీ హోదా ఎన్నో చోట్ల ఎంతగానో పనికొస్తుంది. చాలాచోట్ల రెడ్‌కార్పెట్ వెల్‌కమ్ లభిస్తుంది. మరెన్నో ఉపయోగాలున్నాయి. 

ఇదివరకులాగా సినిమా అంటే కోట్లు పెట్టి, భారీ హీరోలతోనే తీయాలన్న రూల్స్‌కి కూడా కాలం చెల్లింది. 30 నుంచి 60 కోట్లు పెట్టి భారీ హీరోలతో అత్యంత భారీగా తీసిన సినిమాలు ఎంత లాభాల్ని అయితే సంపాదించిపెడుతున్నాయో.. కేవలం 40-50 లక్షల్లో, అంతా కొత్తవాళ్లతో తీసిన సినిమాలూ అంతే లాభాల్ని తెచ్చిపెడుతున్నాయి.

ఇదంతా కూడా అందరూ గుర్తిస్తున్నారు.

సినిమా రంగంలో ఉన్నట్టుండి ఇంత భారీ మార్పు రావడానికి ప్రధాన కారణాలు రెండు: మొదటిది.. ఫిలిం మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ. రెండోది.. ఏ ఫీల్డులోనయినా, ప్రతి లేటెస్ట్ సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండకుండా దాచిపెట్టగలిగే కాలం కనుమరుగు కావటం. "థాంక్స్ టూ ఇంటర్‌నెట్!" అన్నమాట ..

ఈ బిజినెస్‌లో ఉన్న 'ప్లస్' ఏంటో గుర్తించారు కాబట్టే, ఇప్పుడు రిలయెన్స్ వంటి కార్పొరేట్ కంపనీలు కూడా ఈ రంగంలోకి ఎంటరయి, భారీ సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్నాయి.

కట్ టూ కొత్త ప్రొడ్యూసర్స్ -

అతి చిన్న పెట్టుబడితో కూడా మీరు సినీ ఫీల్డులోకి ఎంటర్ కావొచ్చు. కో-ప్రొడ్యూసర్ హోదాలో నేరుగా ఫిలిం మేకింగ్‌లోని ప్రతి స్థాయిలోనూ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పాల్గొంటూ తెలుసుకోవచ్చు.

మీరంతా నమ్మలేని ఫినిషింగ్ టచ్ ఏంటంటే - మీ పెట్టుబడి ఎంతయినా కానీ, అది 100% రిస్క్-ఫ్రీ!

ఈ గ్యారంటీ భారీ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రం నిల్! ఇది మీరంతా గమనించాల్సిన నిజం. ఇంక ఆలస్యం దేనికి?

రండి, సినిమా తీద్దాం!

ప్రొడ్యూసర్‌గా/కో-ప్రొడ్యూసర్‌గా "రాత్రికి రాత్రే సెలెబ్రిటీ హోదాతోపాటు - డబ్బుకి డబ్బు, మరెన్నో ఆకర్షణలు .. ఒక్క సినీ ఫీల్డులోనే సాధ్యం" అన్న విషయం మీరే ప్రత్యక్షంగా తెలుసుకోండి..
^^^

నిజంగా, సీరియస్‌గా .. ఫీల్డులోకి ఎంటరవ్వాలన్న ఆసక్తి ఉన్న ఔత్సాహిక / కొత్త ఇన్వెస్టర్లు, కో-ప్రొడ్యూసర్లు, యువ బిజినెస్ మాగ్నెట్లు (మీ ఫోన్ నంబర్‌తో) నన్ను నేరుగా సంప్రదించవచ్చు:  mfamax2015@gmail.com

Saturday 2 November 2013

ఈ గోల్డెన్ లెగ్ రెమ్యూనరేషన్ 2 కోట్లు!

"అత్తారింటికి దారేది" సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆ టీమ్‌లో పనిచేసిన చీఫ్ టెక్నీషియన్లకు, ముఖ్యమయిన ఆర్టిస్టులకూ ఒక్కసారిగా రెమ్యూనరేషన్లు పెరిగిపోయాయి. ఇది సహజం. ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులొస్తాయి. డిమాండ్ లేకపోతే అంతే. నువ్వెవరో నేనెవరో!

అందుకే ఇక్కడందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటారు.  అలా యెవరైనా జాగ్రత్త పడలేదంటే తర్వాత బ్రతుకు బస్టాండే ..

ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు చాలా విలువిస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ (మూఢ) నమ్మకాన్ని ఎక్కువగా పాటిస్తారు.

ఉదాహరణకి మొదట్లో శృతిహాసన్‌కు హిట్లు లేవు. ఐరన్ లెగ్ అన్నారు. హీరోయిన్‌గా ఆమె గ్రాఫ్ పాతాళానికెళ్లింది. తర్వాత "గబ్బర్ సింగ్" హిట్టయ్యింది. సెంటిమెంట్ ఠక్కున తల్లకిందులైపోయింది. గ్రాఫ్ పైపైకి ఎగిసింది. బోలెడన్ని సినిమాలు ఇప్పుడామెకి. ఒక్క తెలుగులోనే కాదు. హిందీలో కూడా. ఇప్పుడు ఏ ఐరన్ లెగ్గూ గుర్తుకురాదు..

సేమ్ టు సేమ్ విత్ ప్రణీత. ఐరన్ లెగ్ అని ఆమెని అస్సలు ఎవ్వరూ  పట్టించుకోలేదు ఈ మధ్య. సపోర్టింగ్ కంటే కాస్తంత ఎక్కువగా ఉండే పాత్రలో "అత్తారింటికి దారేది" చిత్రంలో తనని ఎలాగో ధైర్యం చేసి తీసుకున్నారు. (సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా తీసుకునే సాహసం చేసేవాళ్లు కాదు!).

సినిమా హిట్టు. కట్ చేస్తే ఒక అరడజన్ సినిమాలు ఆమె బుట్టలో పడిపోయాయి. రెమ్యూనరేషన్ చెప్పనక్కర్లేదు. ఆమె డిమాండ్ మేరకు.. ఆమె ఎంత చెప్తే అంత! ఇప్పుడు ఐరన్ లెగ్ అసలు గుర్తుకు రాదు..

కట్ టూ మన గోల్డెన్ లెగ్ -

"ఏ మాయ చేసావె" నుంచి ఇప్పటి వరకూ సమంత సినిమాలన్నీ హిట్లే. ఏదో ఒకటీ అరా తక్కువ రేంజ్‌లో నడవ్వొచ్చు. కానీ మొత్తంగా చూస్తే సమంత సినిమాలన్నీ హిట్లనే చెప్పొచ్చు. ఇంకేముంది.. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా ఎస్టాబ్లిష్ అయిపోయింది.

ఎక్కువమంది భారీ హీరోలందరితో నటించిన ఈ స్టార్ హీరోయిన్‌కు లేటెస్టుగా వచ్చిన భారీ హిట్టు "అత్తారింటికి దారేది." దీంతో ఒక్కసారిగా టాప్ రేంజ్‌కు చేరిన ఈ గోల్డెన్ లెగ్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ అక్షరాలా 2 కోట్లని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

"ఏంటి.. అంతనా!?" అనుకోకండి. అదీ ఇండస్ట్రీ.

స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అందులో లిప్‌లాక్ సీన్లు కూడా ఉన్నట్టు వినికిడి. ఆ లెక్కన సమంతకిస్తున్న 2 కోట్ల రెమ్యూనరేషన్ పెద్ద ఎక్కువేం కాదు.

సో, బి రెడీ ఫర్ ది నెక్‌స్ట్ స్పైసీ లిప్‌లాక్ సీన్ ఆఫ్ సమంత ఆన్ స్క్రీన్ ..  

Friday 1 November 2013

స్మార్ట్ ఫోనే సర్వస్వం!

ఇప్పుడంతా ఫేస్‌బుక్కులూ ట్విట్టర్ల యుగం. అది కూడా, షార్ట్‌కట్‌లో రెండు వాక్యాలు. కుదిరితే ఒక బొమ్మ. అంతకు మించి ఎవరికీ ఏదీ పోస్ట్ చేసే ఓపికల్లేవు. చదివే ఓపికలు అసల్లేవ్!

ప్రాణ స్నేహితులయినా సరే, అతి దగ్గరి ఆత్మీయులయినా సరే.. వ్యక్తిగతంగా కలవటాలు, ఫోన్ చేసుకోవటాలు పూర్తిగా తగ్గిపోయాయి. అంత టైమ్ అసలు ఉండట్లేదు ఎవ్వరికీ! ఫేస్‌బుక్కుల్లో లైక్ చేసి, కామెంట్లు చేయడానికి మాత్రం మస్త్ టైమ్ ఉంటోంది ..

ఈ మధ్యే ఓ హిందీ సినిమా చూశాను. బ్యాచ్‌లర్ రూమ్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ ఇలా ఉంది:

"నా అండర్‌వేర్ ఎక్కడయినా కనిపించిందిరా?"
"గూగుల్ సెర్చ్ చెయ్ .. దొరుకుద్ది!"

అదీ పరిస్థితి!

గూగుల్ సెర్చ్ అనగానే సుమారు రెండేళ్లకిందటి ఇంకో సంఘటన కూడా నాకిప్పుడు గుర్తొస్తోంది..

కట్ టూ హైద్రాబాద్‌లోని చిలకలగూడాలో ఓ సందు -

అతనొక ఛోటా పొలిటికల్ గల్లీ లీడర్. ఏదో పనిమీద నేను కొన్ని నిమిషాలు అక్కడ ముళ్లమీద కూర్చున్నట్టుగా వెయిట్ చేయాల్సి వచ్చింది.

అప్పుడు వాళ్లేదో రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. సడెన్‌గా ఉన్నట్టుండి వాళ్ల చర్చల్లో తమిళనాడులోని ఏదో ఒక ఏరియా పేరు ముందుకొచ్చింది.

అనుచరులు "అక్కడ .. ఇక్కడ" అని చెప్తున్నారు. వినీ వినీ, ఆ లీడర్ ఒక్కటే మాట అన్నాడు:

"అరే .. ఆ "గొల్ల" కొట్రా బై.. ఒక్క సెకన్ల తెలుస్తది!"

ముందు ఈ "గొల్ల" కొట్టడమేంటో నాకర్థం కాలేదు. తర్వాత తెలిసింది. ఆ లీడర్ ఉద్దేశ్యం: "గూగుల్లో కొట్టు" అని!

కట్ టూ స్మార్ట్ ఫోన్ -

ఏది లేకపోయినా బ్రతకొచ్చుగానీ, స్మార్ట్ ఫోన్ లేని బ్రతుకు అసలు బ్రతుకు కాకుండా పోయింది.

డెస్క్‌టాప్‌లూ, ల్యాప్‌టాప్‌లు వాడ్డం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గరా ఇవే ఫోన్లు! ఈమెయిళ్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్.. అన్నీ దాన్లోనే చూసుకుంటున్నారు. అన్నీ దాన్లోనే చేసేసుకుంటున్నారు. 'అంతా' దాంట్లోనే అయిపోతోంది. ఇంతకు మించి విడమర్చి చెప్పాల్సిన అవసరముందంటారా?

నామటుకు నాకు.. సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఇంటర్‌నెట్ లేకుండా - కేవలం ఒక్కటంటే ఒక్క రోజు చాలా ప్రశాంతంగా ఎక్కడయినా గడపాలని ఉంది.

కానీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. 

Thursday 31 October 2013

ఏం రాస్తున్నానన్నది కాదు నాకు ముఖ్యం!

ఇవాళ ఉదయమే ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశాను. రతన్ టాటా కొటేషన్ అది. "జీవితం అన్నాక ఛాలెంజెస్ తప్పవు. ఆ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ లేని జీవితాన్ని జీవించడంలో అసలు మజా ఏముంటుంది?" అందుకే ఆయన "రతన్ టాటా" అయ్యారు.

సినిమా నా ప్రధాన వ్యాపకం కాదు.

నా మొదటి చిత్రం "కల" తర్వాత, సంఖ్యాపరంగా, ఇప్పటికే ఎన్నో సినిమాలు చేయగల అవకాశం ఉన్నా - నా వ్యక్తిగత సమస్యలు, పరిమితుల కారణంగా ఆ పని చేయలేకపోయాను. ఇప్పుడు కూడా నేను మళ్లీ సినిమాలు చేయాలనుకొంటోంది (నా ప్లానింగులు, అవసరాల దృష్ట్యా)  కేవలం కొన్నాళ్ల కోసమే.

అది 2014 చివరి వరకు అని ఇటీవలే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ లోపే అయితే అంతకంటే ఆనందం లేదు! ఇది నేను సినిమాల మీద ఇష్టం లేకనో, ఇక్కడ ఉండే ఇన్‌సెక్యూరిటీకి భయపడో కాదు చెప్తోంది. సినిమాను మించిన ప్రెఫరెన్సెస్ నాకున్నాయి. వాటికి తొందర కూడా ఉంది.

ఈ బ్లాగ్‌ను ముందు ప్రారంభించింది ఒక ఉద్దేశ్యంతో. అనుకోకుండా జరిగిందది. ఆ తర్వాత దీన్ని కేవలం సినిమాల టిట్‌బిట్స్‌కే పరిమితం చేయాలనుకున్నాను. ఆ తర్వాత, ఇందులో మళ్లీ నాకు తోచిన ప్రతి చెత్తా రాయాలనుకున్నాను. మళ్లీ ఈ మధ్యే - నేను సినిమాల్లో పనిచేసినంత కాలం నగ్నచిత్రంలో కేవలం సినిమా కబుర్లే రాయాలనుకొని "టోటల్ సినిమా!" అంటూ సబ్ టైటిల్ కూడా మార్చాను. ఇప్పుడు మళ్లీ ..

ఎంతసేపూ.. అయితే సినిమా, లేదంటే మనిషి జీవితంలోని నాకు నచ్చిన ఇతర విషయాలు. ఇలా ఊగిసలాడాను. ఏదో రాశాను. రాస్తున్నాను.

ఇలా పదే పదే ఊగిసలాడ్డం నా నిలకడలేనితనం కాదు. అది నా అంతస్సంఘర్షణ.

అయితే - ఈ సంఘర్షణ ఏదో ఓ రూపంలో ఎప్పుడూ ఉండేదే. రతన్ టాటా చెప్పినట్టు.. జీవితం అంటేనే ఛాలెంజెస్.

సంఘర్షణలు, ఛాలెంజెస్ అనేవి మనిషి జీవితంలో ఒక విడదీయరాని భాగం. వాటినుంచి ఆదరా బాదరా బయటపడాలన్న అవివేకంతో నాకెంతో ఇష్టమయిన పనుల్ని, హాబీల్ని కూడా ఇలా నా ఇష్టానికి వ్యతిరేకంగా చేయడం .. నాకు అస్సలు నచ్చడం లేదు.  ఇది నేను చేస్తున్న మరో తాజా తప్పులా అనిపిస్తోంది.

ఆ తప్పు చేయాల్సిన అవసరం నాకు ఏ మాత్రం లేదు.

సో, ఇకనుంచీ "నగ్నచిత్రం" కేవలం సినిమాకే పరిమితం కాదు. సినిమా పోస్టులు 'కూడా' ఉంటాయి. నా ఇష్టాన్నే ఫాలో అవుతూ కూడా ఈ బ్లాగ్ విజిట్స్ అంకెను ఎంతయినా పెంచుకోవచ్చు. ఇతర లక్ష్యాల్ని కూడా చేరుకోవచ్చు.

మీరేమంటారు?

ఏం రాస్తున్నానన్నది కాదు నాకు ముఖ్యం. నేను మళ్ళీ రాయడం ప్రారంభించాను. అదే నాకు ముఖ్యం. ఇప్పుడు -  ఏం రాసినా కూడా.. అది నా ఇష్టంతోనే రాయాలనుకుంటున్నాను. 

Monday 28 October 2013

మొత్తానికి పట్టేశాడు!

పాకిస్తానీ సినిమా "వార్" మీద రెండు రోజుల క్రితం నేనో బ్లాగ్ రాశాను. రామ్‌గోపాల్‌వర్మ ఆ సినిమా చూసి (పైరేటెడ్ సీడీలో!) ఎంతగా ఇంప్రెస్ అయిపోయిందీ రాశాను.

కట్ టూ ఒక 40 గంటల తర్వాత -

"Just had a long telephonic chat with Bilal Lashari ..am as impressed with his humbleness as much as I was with his film Waar."
గంట క్రితం వర్మ చేసిన ట్వీట్ అది. దట్ ఈజ్ రామ్‌గోపాల్‌వర్మ! జస్ట్ సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయి ఇంక ఆ విషయం మర్చిపోలేదు. పాకిస్తాన్‌లో ఉన్న "వార్" చిత్ర దర్శకుణ్ణి పట్టేశాడు. మాట్లాడేశాడు. మామూలుగా ఇదంత గొప్ప విషయంగా కనిపించకపోవచ్చు. నా ఉద్దేశ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇది గొప్ప విషయమే. పనికిరాని హిపోక్రసీలు, ఈగోలు పక్కనపెట్టి - తనను ఇంప్రెస్ చేసిన ఒక డెబ్యూ దర్శకుడు పాకిస్తాన్‌లో ఉన్నా, ట్రేస్ చేసి పట్టుకుని మాట్లాడాకా ఆయన వదల్లేదు. అదీ ప్యాషన్. సినిమా మీద తనకు అంత మమకారం ఉంది కాబట్టే ఆయన ఆ రేంజ్‌కి వెళ్లగలిగాడు. ముంబైలో జెండా పాతి, హిట్లయినా ఫట్లయినా తను అనుకున్న చిత్రాలనే తీస్తూ, తనకంటూ ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకోగలిగాడు. కొన్నేళ్ల క్రితం ఒక ఇంగ్లిష్ ఆర్టికిల్లో ఎవరో రాసినట్టు - హిందీలో "ప్యారలల్ ఇండస్ట్రీ"ని నడిపిస్తున్నాడు.
ఇంక బ్యాక్ టూ మన వాళ్లు - పక్క దేశం మాట అలా ఉంచండి. పక్కనే ఉన్న ఇంకో దర్శకుని సినిమాను అప్రిషియేట్ చేయటానికి కూడా మనవాళ్లు ఓ తెగ ఫీలయిపోతారు. ఇదంతా నేనేదో ఆయన వీరాభిమానిగా రాయటం లేదు. అతని మీద జెలసీతో రాస్తున్నాను. ఎలాంటి హిపోక్రసీ లేని అతనిలోని క్రియేటివిటీకి ఇంప్రెస్ అయి రాస్తున్నాను. వర్మ సినిమా ఒక్కటే కావాలనుకున్నాడు. సినిమానే ప్రేమిస్తున్నాడు. సినిమా కోసమే బ్రతుకుతున్నాడు. రేపు సినిమా కోసమే చావొచ్చు కూడా! ఆ ఫ్రీడమ్.. అందరూ క్రియేట్ చేసుకోలేరు. దానికి ఎంతో దమ్ముండాలి.
అవ్వా బువ్వా రెండూ కావాలనుకుంటే కుదరదు. అయితే అట్టర్ ఫ్లాప్ అయినా అవుతారు. లేదంటే ఒక రొటీన్‌లోపడి అలా కొట్టుకుపోతుంటారు. అందుకు నేను మినహాయింపేమీ కాదు..

Saturday 26 October 2013

పాకిస్తానీ సినిమా "వార్" దేనిపైన?

మొన్నటి ఈద్ రోజు పాకిస్తాన్‌లో ఒక భారీ బడ్జెట్ సినిమా రిలీజయింది. దాని పేరు "వార్". ఇది ఇంగ్లిష్ వార్ కాదు. ఉర్దూ వార్. The Strike.

ఇంగ్లిష్‌లో తీసిన ఈ యాక్షన్ సినిమా దర్శకుని పేరు బిలాల్ లషరి. లషరీకి ఇది మొదటి సినిమా. దీని రచయిత, నిర్మాత - హసన్ వకాస్ రానా. ఈ సినిమా నిర్మాణం పూర్తికావడానికి మూడేళ్లు పట్టింది.

పేరుకే హసన్ నిర్మాత కానీ, వెనకనుంచి బడ్జెట్ అంతా సమకూర్చింది పాకిస్తాన్ ఆర్మీ మీడియా వింగ్ అయిన "ఇంటర్ సర్విసెస్ పబ్లిక్ రిలేషన్స్" అని చాలాచోట్ల, చాలా రివ్యూల్లో చదివాను.

కొన్ని రివ్యూల్ని చదివాక యెలాగయినా ఈ సినిమాను చూడాలనిపించింది. కొన్ని రివ్యూల్లో మాత్రం "ఇది ఉట్టి సాదా సీదా పాకిస్తానీ న్యూవేవ్" సినిమా అని రాశారు.

"రివ్యూలు చదివి సినిమాలకెళ్తారా?" అని బ్లాగ్ నేనే రాసి, నేనే ఇలా రివ్యూలమీద ఆధారపడటం ఏంటని నాకే అనిపించింది. కానీ తప్పదు. ఇది ఇక్కడి సినిమా కాదు. పాకిస్తానీ సినిమా! విషయం కొంచెమయినా తెలుసుకోవాలంటే రివ్యూలే ఆధారం.

పాకిస్తాన్‌లో రిలీజ్ రోజు మన "చెన్నై ఎక్స్‌ప్రెస్" 90 లక్షలు (పాకిస్తానీ రూపాయలు) వసూలు చేస్తే, "వార్" 1 కోటి 14 లక్షలు వసూలు చేసింది. అయితే, మొదటి మూడు రోజుల్లోనే మన "చెన్నై ఎక్స్‌ప్రెస్" 4.26 కోట్లు వసూలు చేయగా, "వార్" మాత్రం మొత్తం ఒక పూర్తివారంలో 9.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

వసూళ్ల సంగతి అలా వదిలేద్దాం. ఇంతకీ ఈ పాకిస్తానీ సినిమా "వార్" దేనిపైన?

ఇక్కడ మనవాళ్లు యాంటీ పాకిస్తానీ/యాంటీ టెర్రరిస్టు సినిమాలు ఎలా తీస్తారో, సేమ్ టు సేమ్ అక్కడ వాళ్లు తీసిన ఈ యాక్షన్ సినిమా "యాంటీ ఇండియా" సినిమా!

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

కొన్ని నిమిషాల క్రితమే మన ఆర్జీవీ ఒకటి ట్వీటాడు. ఏంటంటే, ఈ సినిమా చూశాక వర్మకి దర్శకత్వం వదిలేసెయ్యాలన్నంతగా మతిపోయిందిట. పాకిస్తాన్ వెళ్లి అక్కడ బిలాల్ లషరికి అసిస్టెంట్‌గా పనిచేయాలనిపిస్తోందిట!

ఓ ఈ సినిమాని తెగ పొగుడుతూ, మన డైరెక్టర్స్‌ని వెళ్లి పాకిస్తానీ సినిమాలు చూడండి అంటూ మరిన్ని ట్వీట్లు పెట్టాడు వర్మ. అంతేకాదు. డైరెక్ట్‌గా లషరికి, ఆయన క్రాఫ్ట్‌కి కంగ్రాట్స్‌తో పాటు "సెల్యూట్" కూడా ట్వీట్ చేశాడు వర్మ! లషరీని తెలిసిన ఎవరయినా పాకిస్తాన్‌వాళ్లుంటే లషరీకి తన కంగ్రాట్స్, రిగార్డ్స్ చెప్పమన్నాడు.

ఇప్పుడు సహజంగానే మనకు ఆ సినిమా చూడాలనిపిస్తుంది. కదూ? 

Thursday 24 October 2013

ఫిలిమ్ చాన్స్ కావాలా?

కొత్త హీరోహీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, స్క్రిప్టు రచయితలు, పాటల రచయితలు, గాయనీ గాయకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇంకా.. ఫిలిమ్ మేకింగ్‌లోని వివిధ డిపార్ట్‌మెంట్లకు చెందిన కొత్త టెక్నీషియన్ల టాలెంట్ సెర్చ్‌లో భాగంగా - ఒక చిన్న ప్రయత్నంగా - ఇవాళ ఉదయమే ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌ని క్రియేట్ చేశాను.  

గ్రూప్ డైరెక్ట్ లింక్: https://www.facebook.com/groups/filmchancemeetups/

సినీ ఫీల్డుపట్ల ఇష్టం ఉండి, ఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరైనా ఈ గ్రూపులో చేరవచ్చు.

సాధారణంగా కొత్తవాళ్లకోసం మేము న్యూస్ పేపర్స్, మేగజైన్స్‌లో యాడ్స్ ఇస్తాము. ఈ మధ్యనే - ఆన్‌లైన్‌లో క్విక్కర్ లాంటి కొన్ని వెబ్‌సైట్స్‌లో యాడ్స్ పోస్ట్ చేయడం, టీవీ చానెల్స్‌లో స్క్రోలింగ్ ఇవ్వటం కూడా ఎక్కువగా చేస్తున్నాము.

వీటన్నిటి రెస్పాన్స్ ద్వారా వచ్చే ఎంతోమంది కొత్తవారిలో, మా సినిమాకు/సినిమాలకు అవసరమయ్యే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లను సెలక్టు చేసుకోవటం జరుగుతుంది. కొంతమందిని నేరుగా మా ఆర్టిస్టు కో-ఆర్డినేటర్లే తీసుకు వస్తారు. ఇదంతా కూడా ఇప్పుడు పాతచింతకాయ పచ్చడి అయిందని నా ఉద్దేశ్యం.

ఫిలిమ్ మేకింగ్‌లో సాంకేతికంగా ఎన్నో ఊహించని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కనీసం కోటి రూపాయలు లేకుండా కొత్తవారితో కూడా సినిమా చెయ్యడం అనేది ఊహించని పరిస్థితి. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కొన్ని లక్షల్లోనే ఒక మంచి సినిమా తీయవచ్చు.

ఈ నేపథ్యంలో, కొంతమంది లైక్-మైండెడ్ మిత్రులతో కలిసి నేను చేస్తున్న మైక్రోబడ్జెట్ చిత్రాల సీరీస్ కోసం - చాలా మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్ల అవసరం ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, నాకంటూ ఒక చిన్న "న్యూ టాలెంట్" గ్రూప్‌ని క్రియేట్ చేసుకోవటం బావుంటుందనిపించింది.

ఈ గ్రూప్‌లోని మెంబర్స్‌ను కేవలం నేను పరిచయం చెయ్యటమే కాకుండా, బయటివారి సినిమాల్లో కూడా అవకాశాలు పొందేలా అవసరమైన గైడెన్స్‌ను నేను ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.  

ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో, ఉట్టి రొటీన్ పోస్టింగులు కాకుండా - ఒక గోల్‌తో, అవసరమైన విషయాలను మాత్రమే చర్చించడం ముఖ్యం.

నా చిత్రాల్లో, నా టీమ్‌లో సూటవుతారు అనుకున్నవాళ్లను బాగా దగ్గరగా స్టడీ చేసి తీసుకోవడానికి ఈ గ్రూప్ బాగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఆడిషన్, ఇంటర్వ్యూలు ఎలాగూ ఉంటాయి. కానీ, మామూలు ఆడిషన్ పధ్ధతికంటే ఇది కొంచెం అడ్వాన్స్‌డ్ అనుకోవచ్చు.

ఇదే వైస్-వెర్సాగా కూడా అనుకోవచ్చు. అంటే.. అసలు నేనెవరు, నాతో కలిసి పని చేయవచ్చా లేదా కూడా అవతలి ఔత్సాహికులకి తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్లకు ఇష్టమయితేనే  నాతో కలిసి సినిమాలో పని చేయవచ్చు. లేదా, పూర్తిగా గ్రూప్ నుంచే తప్పుకోవచ్చు.  

కట్ టూ మీటప్స్ -

మీటప్ డాట్ కామ్ లాగా, గ్రూప్‌లోని వాళ్లు తరచూ వ్యక్తిగతంగా కూడా కలుస్తూ ఉండటం అనేది కూడా ప్లాన్ చేస్తున్నాను. దీనివల్ల ప్రొఫెషనల్ "బ్రెయిన్ స్టార్మింగ్" సాధ్యమౌతుంది. మెంబర్స్‌కి నెట్‌వర్క్ పెరుగుతుంది. పరిచయాలు, అవకాశాలు కూడా పెరుగుతాయి.

కేవలం టైమ్‌పాస్ కోసం కాకుండా - నిజంగా సినీ ఫీల్డులోకి ఎంటర్ అవాలనుకొనే లైక్-మైండెడ్, ప్యాషనేట్ "న్యూ టాలెంట్" కోసమే ఈ గ్రూప్. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నా నమ్మకం.

ఈ ఫిలిమ్ చాన్స్ గ్రూప్ లింక్‌ని, ఇప్పుడు మీరు చదువుతున్నఈ బ్లాగ్ పోస్ట్ లింక్‌నీ - మీ ఫేస్‌బుక్‌లోనో, బ్లాగుల్లోనో లింక్ చేయడం/ప్రస్తావిచడం ద్వారా మీరు నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మరింత విజయవంతం చేయవచ్చు.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్..