Sunday 31 December 2023

100 రోజులు, 100 బ్లాగ్ పోస్టులు


నా రైటింగ్ హాబీని లైవ్‌లో ఉంచుకోవడం కోసం ఇదొక చిన్న చిట్కా లాంటిది నాపై నేనే ప్రయోగించుకున్నాను.

రోజుకు కనీసం ఒక 10 లైన్లయినా రాస్తాను. 

మిస్ కాకుండా 100 రోజులు, ఏదో ఒకటి, ఏదో ఒక టైంలో రాయాలన్నది దీని ద్వారా నేను పాటిస్తున్న ఒక రిచువల్.  

ఒక్క రోజు కూడా మిస్ కావద్దు. అయితే తర్వాతి రోజుల్లో బ్యాలెన్స్ చెయ్యాలి. 

రోజుకి 3, 4 బ్లాగ్స్ కూడా రాయొచ్చు. మొత్తానికి 100 రోజుల్లోపల 100 బ్లాగ్ పోస్టులు రాయాలి. అదీ నా రిచువల్. అదీ నా ఫోకస్. 

దీని వెనుక ఇంకో వ్యక్తిగత కారణం కూడా ఉంది. ఈ 100 రోజుల్లో ఒక ముఖ్యమైన పని నేను పూర్తిచేయబోతున్నాను. సో, దీని గురించి కూడా ఎప్పటికప్పుడు నన్ను నేను అలర్ట్ చేసుకోడానికి ఇదొక రిమైండర్ నాకు.   

కట్ చేస్తే - 

ఏదో ఒకటి రాయడం కంటే... 

ఇప్పుడెలాగూ మళ్ళీ సినిమాల్లో పడ్డాను కాబట్టి, ఆ నేపథ్యమే తీసుకొని చిన్న చిన్న టిడ్‌బిట్సో, నా అనుభవాలో రాయాలనుకున్నాను. 

రాత్రే ఇంకో ఆలోచన వచ్చింది....

ఇదే సినీ నేపథ్యం తీసుకొని, నా అనుభవాలను, నాకు తెలిసిన విషయాలను చిన్న చిన్న మైక్రో కథల రూపంలో రాస్తేనో?!    

- మనోహర్ చిమ్మని 

Thank you, 2023


రాయడం ఒక థెరపీ. 
ఒక యోగా. 
ఒక ఆనందం. 
ఒక కళ. 
ఒక గిఫ్ట్.
ఇది అందరకీ రాదు. 
అందరివల్లా కాదు.

ఎంతో కొంత...
ఈ అదృష్టం నన్ను వరించింది.

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం, సద్వినియోగించుకోకపోవడం... నిజంగా నేరమే.

అలాంటి నేరస్థునిగా మిగిలిపోవడం నాకిష్టం లేదు.   

థాంక్యూ 2023, ఈ సంవత్సరం చివర్లో నాలో ఈ జ్ఞానోదయం కలిగించావు! Love you... 

- మనోహర్ చిమ్మని 

Saturday 30 December 2023

ఏ రెండిట్లో నువ్వు ఎక్స్‌పర్ట్?


టాలెంట్ ఒక్కటే కాదు... ఇంక చాలా ఉంది!

ఫిలిం ఇండస్ట్రీ మంచిదే. కాని దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు. 

ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి.

వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి:

లాబీయింగ్.
మనీ.
మానిప్యులేషన్స్.

పైన చెప్పిన మూడింటిలో కనీసం ఏ రెండింటిలోనయినా ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ బతికి బట్టకడతాడు. సక్సెస్ సాధిస్తాడు. 

Now check it...

ఏ రెండిట్లో నువ్వు ఎక్స్‌పర్ట్? 

ఇదే ప్రశ్న నన్ను అడక్కండి. 

అది... ట్రేడ్ సీక్రెట్! 

- మనోహర్ చిమ్మని 

సిస్టమ్ ఎప్పుడూ మంచిదే


హాలీవుడ్‌ను 'Land of Dreams' అంటారు. 

అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా వస్తారు.

ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ.

వాళ్లల్లో కేవలం 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.

ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'Land of Broken Dreams' అని తిట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు.  

పైనచెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.

మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే.

ఇకముందు కూడా అంతే.

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 శాతం లోపే.

ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే లైమ్‌లైట్‌లో-అనే-సక్సెస్‌లో ఉంటారు.  

ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ.

మిగిలినవాళ్లంతా ఏదో విధంగా ఫేడ్ అవ్వాల్సిందే. 

ఈ వాస్తవాన్ని గ్రహించినవాళ్లు జాగ్రత్తపడతారు. భ్రమలో బతికేవాళ్లు మాత్రం అలాగే సినిమాకష్టాలుపడుతూ కొనసాగుతుంటారు. 

కట్ చేస్తే -

అంత నిరాశపడనవసరం లేదు... 

సినిమాను ఒక సీరియస్ కెరీర్‌గా, ఒక బిగ్ బిజినెస్‌గా తీసుకున్నవాళ్ళెవ్వరినీ ఫిలిం ఇండస్ట్రీ నిరాశపర్చదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో విధంగా సినిమా వారికి మంచే చేస్తుంది. డబ్బునిస్తుంది. పేరునిస్తుంది. సెలెబ్రిటీ హోదానిస్తుంది. 

సినిమా ప్లాట్‌ఫామ్ అనేది మనం ఇంకెన్నో ఇతర రంగాల్లో ఈజీగా కనెక్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. 

తిరిగి ఇలాంటి కాంటాక్ట్స్ ద్వారానే కొత్త లీడ్స్, ప్రపోజల్స్, డీల్స్ పూర్తవుతుంటాయి.

సో, సిస్టమ్ ఎప్పుడూ మంచిదే. 

కాని, ఆ సిస్టమ్‌ను మనం ఎలా ఉపయోగించుకొంటామన్నదే మన సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను డిసైడ్ చేస్తుంది.     

2% లో ఉండటం అంత కష్టం కాదు... నిజంగా ఫోకస్ పెడితే.              

- మనోహర్ చిమ్మని 

Thursday 28 December 2023

ఓవర్‌నైట్ సక్సెస్ అనేది అసలుందా?


"ఓవర్ నైట్ సక్సెస్" అనే మాట మనం తరచూ వింటుంటాం.

అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట.

ఒక పచ్చి అబద్ధం. 
అసలు అలాంటిది లేదు.  
ఉండదు. 

ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్ లో - పూరి జగన్నాథ్ ఫోటోతో పాటు కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది.

“It took 15 years to get overnight success!”  అని.

ఇదే కొటేషన్‌ను సుమారు ఓ 20 ఏళ్ళ క్రితం ఓ స్పిరిచువల్ మార్కెటింగ్ గురు Joe Vitale పుస్తకంలో చదివాను.

సినిమా ఇండస్ట్రీలో ఓవర్‌నైట్ సక్సెస్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. కాని, ఆ ఓవర్ నైట్ సక్సెస్‌ల వెనుక ఎన్నో ఏళ్ల కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు. ఇన్‌స్టంట్‌గా వారికి కనిపించేది రెండే రెండు విషయాలు.  

సక్సెస్, ఫెయిల్యూర్. 

- మనోహర్ చిమ్మని 

Wednesday 27 December 2023

Life is f*cking beautiful


ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది... "Mind changes like weather!" అని.

ఇప్పుడు నేను మళ్లీ ఒక రెండేళ్ళో, మూడేళ్ళో వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. వాటిలో మొదటిది కొన్ని వారాల్లో ప్రారంభం కాబోతోంది.

ఇది సినిమాల మీద ప్యాషన్ కాదు...

బిగ్ బిజినెస్ మీద ప్యాషన్. లైఫ్‌స్టయిల్ మీద ప్యాషన్.   

ఈ విషయంలో ఇదొక్కటే ఇప్పుడు నాకు బాగా ఉపయోగపడే ప్లాట్‌ఫామ్. ఇదొక్కటే అంత ఎఫెక్టివ్ అండ్ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్.  

అనుకోని ఒక చిన్న సెట్‌బ్యాక్‌తో అనవసరంగా ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను చాలా ఏళ్ళుగా అశ్రధ్ధ చేశాను. అసలు పట్టించుకోలేదు.    

ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకోవడం ఉట్టి అవివేకం. దేని దారి దానిదే. 

మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్.

ఈ యాంగిల్లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నాం అన్నమాట!

అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్. 

మర్చిపో.  

ఎవరైనా, ఎన్ని పనులైనా, ఏకకాలంలో చేయొచ్చు. అది ఆయా వ్యక్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచస్థాయిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ అంతా ఏకకాలంలో ఎన్నోరకాల పనుల్లో, వృత్తుల్లో, వ్యాపకాల్లో, వ్యాపారాల్లో మునిగితేలుతున్నవాళ్లే!  

మన ప్రయారిటీలనుబట్టి, ఏయే పనులు ఎప్పుడు చేయాలో, అప్పుడు అలా వాటికవే జరుగుతూపోతుంటాయి. అలా చేయడానికి మనం అతి సహజంగా అలవాటుపడిపోతాం.

ఇప్పుడు నేనొక అరడజన్ పనుల్ని అత్యంత వేగంగా, విజయవంతంగా చేయగలుగుతున్నాను. నేను చేస్తున్న ఏ పనీ నా మరోపనికి అడ్డురావడంలేదు. విచిత్రంగా అన్ని పనులూ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. 

ఇప్పటివరకు నాకు కనెక్ట్ అయి ఉన్న అన్ని పనికిరాని యావగేషన్స్‌కు, ఆబ్లిగేషన్స్‌కు గుడ్ బై చెప్పేశాను. అసలు పని అనే మాట నుంచే పూర్తిగా రిటైరయ్యాను.  

Just started having fun in filmmaking.    

Life is f*cking beautiful.

- మనోహర్ చిమ్మని 

Tuesday 26 December 2023

ఫిలిం ఇండస్ట్రీ, 2 స్కూళ్ళు!


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెయిన్‌గా 2 స్కూళ్ళున్నాయి...

ఓ గుప్పెడు టాప్‌స్టార్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు... వారి కుటుంబాలు, వారసులు. ఇదొక స్కూలు. ఈ స్ఖూల్లో ఎవరికి వాళ్లకే ఫిక్స్‌డ్‌గా లాబీలుంటాయి. ఆ లాబీలు దాటుకొని ఓ కొత్త డైరెక్టర్ ఈ స్కూళ్లోకి ప్రవేశించడం చాలా అరుదు. అసాధ్యం. ఈ స్కూల్‌తో సంబంధం లేకుండా బయట ఏదయినా పెద్ద హిట్ ఇచ్చినప్పుడే ఇక్కడ కొత్తవాళ్లకు ఎంట్రీ సాధ్యమౌతుంది. 

ఇది పక్కా ట్రెడిషనల్ స్కూల్. ఒక కంచుకోట. ఇంకో వందేళ్ళ తర్వాతయినా ఈ ట్రెడిషనల్ స్కూల్ ఇలాగే రన్ అవుతుంటుంది. ఇందులో ఎలాంటి తప్పు లేదు.  

రెండో స్కూల్ పూర్తిగా ఇండిపెండెంట్ స్కూల్. ఆర్జీవీ, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు ఈ కేటగిరీలోకొస్తారు. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాకుండా, అనుకున్నట్టుగా సినిమా తీస్తూ వీళ్లకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. 
ఇది పూర్తిగా ఒక అన్‌ట్రెడిషనల్ స్కూల్. 

వీళ్లు క్రియేట్ చేసుకున్న బ్రాండ్‌ని బట్టి వీళ్లకు అప్పుడప్పుడూ ట్రెడిషనల్ స్కూల్లోని హీరోలు, నిర్మాతలతో సినిమాలు తీసే అవకాశముంటుంది. అడపాదడపా పెద్ద హీరోలతో హీరోయిన్స్‌తో కూడా సినిమాలు చేస్తుంటారు. కాని, వీరికి అది ముఖ్యం కాదు.    

కట్ టూ నా స్కూల్ -

హీరోలకోసం ప్రత్యేకంగా రాసుకొన్న బౌండెడ్ స్క్రిప్టులు చంకలో పెట్టుకొని, ఎలాంటి గ్యారంటీలేని ఈ ట్రెడిషనల్ స్కూళ్ల చుట్టూ ఏళ్లతరబడి తిరగడం నాకు కుదరని పని. ఎందుకంటే సినిమానే నా జీవితం కాదు. దాన్ని మించిన జీవితం బయట ఎంతో ఉంది.

సినిమాలపట్ల అమితమైన ప్యాషన్ ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలను నేనే క్రియేట్ చేసుకుంటాను. వారికోసం నా అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలా అన్నీ కుదిరినప్పుడే సినిమా తీస్తాను.

తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ షూటింగ్ డేస్‌లో సినిమా తీసి క్లిక్ కావడమే నాకిష్టం. చెప్పాలంటే - కొంచెం అన్‌ట్రెడిషనల్, కొంచెం అగ్రెసివ్ కూడా. 

రెనగేడ్ ఫిలిం మేకింగ్. 

ఇదే నా స్కూల్. 

నాలాంటివాళ్ళు చాలామంది ఉంటారు. రికార్డెడ్ రేషియోనుబట్టి వీరిలో క్లిక్ అయ్యే అవకాశం అతి కొద్దిమందికే ఉంటుంది. నాకు మాత్రం ఇప్పుడా అవకాశం గన్‌షాట్‌గా ఉంది.

ఎందుకో తర్వాత తెలుస్తుంది.  

మారిన ప్యానిండియా ఫిలిం బిజినెస్ నేపథ్యంలో ఫిలిం మేకర్స్‌కు చాలా మంచి రోజులు వచ్చాయి. ప్రేక్షకుల అభిరుచి, అవేర్‌నెస్ పూర్తిగా మారిపోయింది. బిజినెస్ ట్రెండ్స్ బాగా మారాయి.  

మేకర్స్ నేపథ్యంతో అసలు సంబంధమే లేదు. కంటెంట్ అద్భుతంగా ఉంటే చాలు. ఏ హీరో ఉన్నాడు అన్నది కూడా అవసరం లేదు. చిన్న బడ్జెట్ సినిమాలు వంద కోట్లు రీచ్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు వెయ్యి కోట్ల అంకెను టచ్ చేస్తున్నాయి. 
 
సో, ఇప్పుడు నీ గోల్ ఏంటి?           

- మనోహర్ చిమ్మని  

Monday 25 December 2023

ఫ్రీడమ్ లైఫ్ అంటే...


"నాకు అంటూ ఏ బాధ్యత లేదు. డబ్బుకోసం ఆరాటపడవలసిన అవసరం లేదు. నా టైం మొత్తం నా అధీనంలోనే ఉంటుంది."

ఒక గంట క్రితం నా ఫ్రెండ్ ఒకరు ఈ మాట అన్నారు. 

ఇది అంత ఈజీ విషయం కాదు. వ్యక్తిగత క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ఒక స్థాయిలో నిలకడగా పాటించగలిగేవారికి మాత్రమే ఇది సాధ్యం.  

నా ఫ్రెండ్ సాధించినదానికి నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను. 

నా ఫ్రెండ్‌కు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ మంచి ప్రొఫెషన్స్‌లో స్థిరపడ్డారు. వాళ్ల సంపాదన మీద ఆధారపడాల్సిన అవసరం నా ఫ్రెండుకు లేదు. బోల్డన్ని ఆస్తులున్నాయి. డబ్బూ ఉంది. వయస్సులో నాకంటే చిన్నవాడు.          

ఇంకేం కావాలి? 

నా ఫ్రెండ్ అయినా, ఇంకొకరయినా... ఇలాంటి ఫ్రీడం సంపాదించుకొనే స్థాయికి ఎదగడానికి ఇంకొక అతి ముఖ్యమైన అంశం అవసరమని నా ఉద్దేశ్యం. 

వ్యక్తిగత స్వేచ్ఛ. లేదా, పెళ్లయి వుంటే మన ప్రొఫెషనల్ నిర్ణయాల్లో జీవిత భాగస్వామి జోక్యం లేకపోవడం.  

అయితే, ఇలాంటి స్వేచ్ఛను కూడా అందరూ పాజిటివ్‌గా ఉపయోగించుకోగలుగుతారా అన్నది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. 

ఒక్క ఆర్జీవీ తప్ప.

కట్ చేస్తే - 

ఈ ఫ్రెండ్ నా మొదటి సినిమా అప్పుడు పరిచయమై ఉంటే బాగుండేది. నా ఆర్థిక క్రమశిక్షణను గాడిలో పెట్టుకోడానికి ఒక మంచి ఇన్‌స్పిరేషన్‌గా నా కళ్ళముందో, నా క్లోజ్ సర్కిల్లోనో ఉండేవాడు. 

ఎప్పటికప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గరగా పెట్టుకునేవాడిని. నిర్ణయాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకొనే వాడిని. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకునేవాడ్ని. 

ఇప్పుడు వీడి దగ్గర శిష్యరికం చెయ్యాలని ఉంది... 

- మనోహర్ చిమ్మని  

Sunday 24 December 2023

శాడిస్టులు, సినిక్స్, రివ్యూయర్స్!


"Reviewers are irrelevant" అని అనడం ఇందాకే ఒక ఇంటర్వ్యూలో చూశాను. 

అసలు రివ్యూస్ అనేవి అసంబద్ధం. అనవసరం కూడా. 

ఒక సినిమాపైనో, ఒక డైరెక్టర్ పైనో, ఒక హీరో పైనో...  తమ వ్యక్తిగతమైన అభిప్రాయాలను, అసూయను, వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తీకరించడానికి... (రివ్యూలు రాయడమనేది) సోకాల్డ్ రివ్యూయర్స్‌కు ఒక మంచి అవకాశం.  

ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసే వ్యక్తిగత దాడి.

సబ్జెక్టివ్ ఎటాక్.      

రివ్యూయర్స్‌లో సినిక్స్, శాడిస్టులే ఎక్కువ అనిపిస్తుంది.    

అరుదుగా కొందరు రివ్యూయర్స్ మాత్రం స్టాండర్డ్‌గా రాస్తారు. రివ్యూ రైటింగ్‌కు సంబంధించిన కొన్ని బేసిక్స్ పాటిస్తారు. రివ్యూల వల్ల ఏదైనా ప్రయోజనం ఉంది అనుకుంటే, ఇలాంటివాళ్ళ రివ్యూల వల్ల అంతో ఇంతో ఉంటుంది. 

శాడిస్టులు, సినిక్స్ రాసే రివ్యూల వల్ల మాత్రం నష్టమే ఎక్కువ. 

కొంచెం బాగా ఆడే అవకాశం ఉన్న చిన్న సినిమాలను, మిడ్-రేంజ్ బడ్జెట్ సినిమాలను ఇలాంటి శాడిస్టులు రాసే రివ్యూలు నిజంగానే కిల్ చేస్తాయి. 

కాని, "యానిమల్" లాంటి సినిమాల ప్రభంజనాన్ని ఏ నెగెటివ్ రివ్యూలు అసలు టచ్ చేయలేవు.

కట్ చేస్తే -

మొన్న "యానిమల్" సినిమాపైన బాలీవుడ్‌లో చాలా మంది సోకాల్డ్ పాపులర్ రివ్యూయర్స్ రాసిన రివ్యూలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిజంగా దారుణం. 

అవన్నీ ఒక సినిమా పైన రివ్యూల్లా లేవు. దర్శకుడు సందీప్ వంగా పైన డైరెక్ట్‌గా చేసిన దాడిలా ఉన్నాయి.  

అనుపమా చోప్రా, సుచరితా త్యాగి, రాజీవ్ మసంద్, ధ్రువ్ రాథీ... వీళ్లందరికీ "కబీర్ సింగ్" నుంచే సందీప్ వంగా అంటే ఎందుకో నచ్చదు. ఇష్టం లేదు.  

ఎందుకింత అయిష్టం? వ్యతిరేకత?

సందీప్ వంగా, ఆయన సినిమాలూ వాళ్లకు మామూలుగా అలవాటైన బాలీవుడ్ తరహా డైరెక్టర్లూ, సినిమాల్లా ఒక కంఫర్ట్ జోన్‌లో లేకపోవటం మొదటి కారణం.

తెలుగు నుంచి బాలీవుడ్‌కు వచ్చి, సందీప్ వంగా అక్కడ ఇంత దుమ్ము లేపుతుండటం రెండో కారణం. బహుశా ఇదే అసలైన కారణం కావచ్చు.  

- మనోహర్ చిమ్మని  

Friday 22 December 2023

కొందరి నుంచి మినిమమ్ మ్యానర్స్ కూడా ఊహించలేం అన్నమాట!


ఓ మూడు నెలల క్రితం అనుకుంటాను... నేను వైజాగ్, రాజమండ్రి వెళ్ళాను. 

అక్కడికి దగ్గర్లో "యూత్ ఐకాన్" బిల్డప్ ఇచ్చుకున్న ఓ మినీ ఎంట్రప్రెన్యూర్‌తో ఒక మీటింగ్ అయింది. స్టోరీలైన్, ప్రాజెక్ట్ డిజైన్, బిజినెస్ స్ట్రాటెజి గట్రా... అన్నీ ఒక 3 గంటలపాటు ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. 

"మనం కల్సి చేద్దాం" అన్నాడు ఐకాన్.  

ఇదంతా ఇప్పుడు నేను చేస్తున్న ఒక సినిమాకి జస్ట్ ఒక 10% ఇన్వెస్ట్‌మెంట్ కోసం!   

మీటింగ్‌లో మేం అగ్రీ అయిన దాని ప్రకారం - రెండు రోజుల్లో మన యూత్ ఐకాన్, ఆయన్ని కనెక్ట్ చేసిన నా ఇంకో ప్రియ మిత్రుడు హైద్రాబాద్ వచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలి. కాని, ఈ లోగా ఉబ్బు ఆగని మన బిల్డప్ ఐకాన్... ఫిలిం నగర్, క్రిష్ణానగర్, గణపతి కాంప్లెక్స్ గల్లీల్లో తిరిగే ఫస్ట్రేటెడ్ బ్యాచ్‌లను కొందరిని అమాయకంగా కెలికాడు. 

ఖతం... యూత్ ఐకాన్ మైండ్ గాన్! 

కట్ చేస్తే - 

మన యూత్ ఐకాన్‌కు రోజుకు నాలుగు కొత్త డౌట్స్ పుట్టుకొచ్చి, అసలు పని చెట్టెక్కింది. 

ఏదో అప్పటికప్పుడు కోటిరూపాయలిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నట్టు పెద్ద బిల్డప్‌తో నా పాన్ కార్డు, ఆధార్ కార్డు, నా కంపెనీ లెటర్ హెడ్స్ ఓ పది తీసేసుకుని... ఇక బ్యాంక్ వర్క్ అని, అగ్రిమెంట్ టైపింగ్ అని వెళ్ళారు.   

అలా వెళ్ళినవాళ్ళు అటే వెళ్ళారు. 

నేను, నా అసిస్టెంట్ హైద్రాబాద్ వచ్చేశాం. 

మూడు నెలలు దాటి ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇంకా టైపింగ్ వర్క్ నుంచి, బ్యాంక్ నుంచి రాలేదు!

నా లెటర్ హెడ్స్ తిప్పి పంపండి, కొరియర్ చార్జెస్ నేనే ఇస్తా అని కనీసం ఒక పది సార్లు మెసేజెస్ పెట్టాను, కాల్స్ చేశాను. మినిమమ్ రెస్పాన్స్ లేదు, కర్టెసీ లేదు. 

ఏ క్రిష్ణానగర్ బ్యాచ్‌కో వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ బైపాస్ అయ్యుంటుంది. అందులో డౌట్ లేదు. అది మనకు అనవసరం కూడా.    

థాంక్స్ టు ఆర్జీవీ అండ్ రాజమౌళి... ఇక జన్మలో నేను ఏ విషయాన్ని కూడా సోకాల్డ్ జెన్యూన్‌గా, సోకాల్డ్ రియాలిటీ ఫ్రేమ్‌లో మాట్లాడబోనని, నమ్మబోనని గట్టిగా అనుకున్నాను.   

అలా అయితేనే అంతా బాగుంటుంది. అన్ని పనులూ వాటికవే కదుల్తాయి. 

- మనోహర్ చిమ్మని 

Thursday 21 December 2023

ఆర్జీవీ SAAREE


ఆమధ్య ఒక కేరళైట్ ఫోటోగ్రాఫర్ ఒక మళయాళీ మోడల్‌తో శారీలో ఫోటోస్, రీల్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.  

ఆర్జీవీ దృష్టిలో ఆ అమ్మాయి, శారీలో ఆ అమ్మాయి అందాలు, ఆ ఫోటోగ్రాఫర్ పడ్డారు.   

ఒక 10 ఇన్‌స్టా పోస్టులు, ట్వీట్స్ వాళ్ళిద్దరి మీద పెట్టాడు ఆర్జీవీ. 

కట్ చేస్తే -  

ఇవ్వాళ ఇంటర్నేషనల్ శారీ డే.

ఆర్జీవీ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. ఆ కేరళ మోడల్ హీరోయిన్. ఆ ఫోటోగ్రాఫర్ డైరెక్టర్.  

సినిమా పేరు... SAAREE. 

- మనోహర్ చిమ్మని  

ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే...

 

"శివ" ప్రాజెక్టు ఓకే అవ్వడం కోసం ఆర్జీవీ ఎందరినో మేనిప్యులేట్ చేశాట్ట. తనకు అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం ఒకరిదగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఇంకోలాగా మాట్లాడి, చివరికి శివ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాట్ట. ఈ విషయం ఆర్జీవీనే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. 

ఆమధ్య ఒక కాలేజి ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ, యస్ యస్ రాజమౌళి కూడా దాదాపు ఇలాంటిదే ఒక విషయం చెప్పాడు: "ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అబద్ధాలాడాల్సి ఉంటుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. నీ ప్రొఫెషన్ కోసం అవన్నీ చెయ్యి. కాని, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోకు... నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు" అని.

ఇంకొక ఇంటర్వ్యూలో - ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథారచయిత విజయేంద్రప్రసాద్ గారు ఒక ప్రశ్నకు సమాధానంగా, "ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే మీరు అబద్ధాలు బాగా చెప్పగలగాలి" అన్నారు.  

కట్ చేస్తే - 

ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి బిజినెస్‌కు, ప్రతి ప్రొఫెషన్‌కు ఆయా చోట్ల సక్సెస్ సాధించడానికి, నిలదొక్కుకోడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒక వ్యవహారశైలి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ప్రిన్సిపుల్స్ ఉన్నా, ఇక్కడ మాత్రం ఈ బేసిక్ సూత్రాలకు ఎవరి శైలిలో వారు ఎడాప్ట్ అవక తప్పదు. అలా కాగలిగినవారే ఎక్కడైనా సక్సెస్ సాధిస్తారు.  

సింపుల్‌గా చెప్పాలంటే - తాడిచెట్టుకిందకి వెళ్ళినప్పుడు మనం కల్లే త్రాగాలి. కల్లు మండువాలో కూర్చొని నేను కాఫీ త్రాగుతాను అంటే కుదరదు. 

ఈ సంఘర్షణలోనే కొంతమందికి జీవితం అయిపోతుంది. కొంతమంది మాత్రం నిమిషాల్లో మౌల్డ్ అయిపోతారు. 

కట్ చేస్తే - 

పైన చెప్పిన ఉదాహరణల్లో ఆర్జీవీ, రాజమౌళి, విజయేంద్రప్రసాద్ గారు చెప్పింది కూడా ఇదే. వారు చెప్పిన అబద్ధాలు, మేనిప్యులేషన్స్ అంటే ఇంకేదో కాదు. ఇండస్ట్రీలో పనులు ముందుకు కదిలేలా ఎదుటివారిని కన్విన్స్ చెయ్యగలగటం. మనలో ఏ మూలో ఉన్న కాస్తంత ఈగోని కాసేపు పక్కనపెట్టగలగటం. ఒక హాయ్, రెండు షేక్ హాండ్స్, నాలుగు థాంక్యూలు. 

దట్సిట్. 

యు ఆర్ ఆన్ ద ట్రాక్.

తర్వాతంతా నీ సత్తా. 

- మనోహర్ చిమ్మని  

Wednesday 20 December 2023

స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను భయపెట్టిన సినిమా!


ప్రపంచస్థాయి ఫిలిమ్‌మేకర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ మొదటిసారి ఒక సినిమా చూసి భయపడ్దాడు. మధ్యలోనే చూడ్డం ఆపేసి డివీడిని ప్యాక్ చేశాడు. తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని - ఇంటికెళ్లి తన బెడ్‌రూమ్ తలుపుకు ఉన్న లాక్‌ని పర్‌ఫెక్ట్‌గా సెట్ చేయించడం!

ఆ సినిమా పేరు -
పారానార్మల్ యాక్టివిటీ (2007).

అప్పటివరకూ ఉన్న హారర్ చిత్రాల మూసను ఛేదించిన ఓ కొత్త తరహా హారర్ చిత్రం. 

రిలీజ్ కోసం కష్టాలుపడుతున్న సమయంలో అనుకోకుండా స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఈ చిత్రాన్ని చూడ్డం జరిగింది. ఆ తర్వాత స్పీల్‌బర్గ్ చొరవతో పారానార్మల్ యాక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. ఒక్క అమెరికాలోనే విడుదలకాని 100 సెంటర్ల నుంచి "మా ఏరియాలో కూడా వెంటనే రిలీజ్ చేయండి" అని ప్రేక్షకులనుంచి డిమాండ్ తెప్పించుకుంది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీల్లోని ఫిలిం స్టడీస్‌లోని వివిధ శాఖల్లో చాలామంది విద్యార్థులు ఈ చిత్రం పైన రిసెర్చ్ కూడా చేశారు.    

మికా, కేటి లీడ్ పెయిర్ గా నటించిన ఈ హారర్ చిత్రానికి  రచయిత, దర్శకుడు, నిర్మాత, కెమెరామాన్ అన్నీ ఒక్కడే - ఒరెన్ పేలి. 

విచిత్రమేంటంటే - తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోడానికి కొన్నాళ్ళపాటు "డెమనాలజీ" చదివాడు పేలి. ఆ తర్వాత అతనికి వచ్చిన ఆలోచనే అప్పట్లో ప్రపంచాన్ని భయపెట్టిన ఈ వెరైటీ హారర్ చిత్రం!

కేవలం రెండే రెండు ప్రధానపాత్రలతో .. దాదాపు "నో-బడ్జెట్"లో తీసిన ఈ చిత్రం క్రియేట్ చేసిన థ్రిల్ లేదా ఛిల్ .. ఈ చిత్రానికి 560,000 రెట్లు లాభాల్ని అందించింది. ఇది ఇప్పటికీ రికార్డే! 

తర్వాత ఈ సీరీస్‌లో ఎన్నో సినిమాలొచ్చాయి. పారానార్మల్ యాక్టివిటీ చిత్రం ఇన్స్‌పిరేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అన్ని భాషల్లో ఒకటి/రెండు/మూడు మాత్రమే ప్రధాన పాత్రలుగా లెక్కలేనన్ని హారర్ సినిమాలు వచ్చాయి. ఆమధ్య వచ్చిన రామ్‌గోపాల్‌వర్మ "ఐస్‌క్రీమ్" కూడా అలాంటిదే.  

కట్ చేస్తే -  

ఒక కమిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తే నష్టాలుండవు. కావల్సినంత బజ్ క్రియేట్ చెయ్యొచ్చు, బాక్సాఫీస్ హిట్ చెయ్యొచ్చు. సరైన మార్కెట్ స్టడీ, సక్సెస్ మైండ్‌సెట్ చాలా ముఖ్యం.  

మంచి లైక్‌మైండెడ్ టీమ్ సెట్ చేసుకోవడం వీటన్నిటికంటే చాలా ముఖ్యం.         

- మనోహర్ చిమ్మని 

Tuesday 19 December 2023

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" ఎలా తీశారు?


"సినిమా తీయాలన్న కమిట్‌మెంట్ ఉంటే చాలు. 
డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు." 
- సత్యజిత్ రే! 

ఎలా కాదనగలం? 

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. 

సత్యజిత్ రే అలా తీసిన "పథేర్ పాంచాలి" సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు. 

విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం. 

అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్న పని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండటం. ఏది ఎలా ఉన్నా, దానిమీదే దృష్టిపెట్టి ఆ పనిని పూర్తి చేసెయ్యటం.

అలాంటి ఫోకస్‌తో కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించగలిగారు. వాళ్లు అనుకున్నది సాధించగలిగారు. 

- మనోహర్ చిమ్మని    

Monday 18 December 2023

ఇది రాయొద్దనుకున్నాను...


బాల్యంలో నాకెన్నో అద్భుత జ్ఞాపకాలనందించిన నా వరంగల్‌కు నేనెప్పుడు వెళ్ళినా నాకు బాధగానే ఉంటుంది. 

నన్ను అమితంగా ప్రేమించిన మా అమ్మా నాన్న ఇప్పుడు లేరు. 

పదో తరగతితోనే చదువు మానేసి, మెషినిస్టుగా ఎక్కడో ఫాక్టరీలో పనిచేసుకుంటూ బతకాల్సిన నేను - మళ్ళీ చదువుకోడానికి, డైరెక్టుగా యూనివర్సిటీలోకే ప్రవేశించి పీజీలు, గోల్డ్ మెడల్స్ సాధించడానికీ కారణమైన ఇన్‌స్పిరేషన్‌ను తన ఒకే ఒక్క మాటతో నాకు అందించిన మా అన్న దయానంద్ ఇప్పుడు లేడు.    

నేను కనిపించగానే నవ్వుతూ పలుకరించే నాకెంతో ప్రియమైన నా చిన్న తమ్ముడు వాసు ఇప్పుడు లేడు లేడు. 

నా చిన్ననాటి జిగ్రీ దోస్త్ ఓంప్రకాశ్ లేడు. 

ఎందరికో ఆశ్రయమిచ్చి, ఊళ్ళో ఎందరి పెళ్ళిళ్ళకో వేదికై, మాకెన్నో అద్భుత జ్ఞాపకాలనిచ్చిన అప్పటి మా విశాలమైన 14 దర్వాజాల ఇల్లు ఇప్పుడు లేదు. 

కన్నీళ్ళు తన్నుకుంటూ వచ్చే ఇలాంటి జ్ఞాపకాల్ని తట్టి లేపటం ఇష్టం లేకే నేను వరంగల్ వెళ్లడానికి ఎప్పుడూ తప్పించుకొంటుంటాను.

అయినా సరే, కొన్నిసార్లు తప్పదు. ఇలా పొద్దున బయల్దేరి వెళ్లి, రాత్రికి వచ్చేస్తుంటాను.  

ఒకసారి... ఫ్రీగా ఒక వారం రోజులు... మా వరంగల్లో అడ్డా వెయ్యాలని ఉంది. 

అక్కడే ఉన్న నా ఇద్దరు తమ్ముళ్ళు శ్రీధర్, రమేశ్‌లతో కలిసి నాకిష్టమైన అప్పటి జ్ఞాపకాలన్నిటినీ కళ్ళారా చూస్తూ, మనసారా స్పృశిస్తూ తిరగాలని ఉంది. 

కొత్తగా నన్ను నేను పరిచయం చేసుకుంటూ, అప్పటి నా బంధుమిత్రులందరినీ కలిసి పలకరించాలని ఉంది.  

ఎప్పుడో ఒకసారి ఆపని తప్పక చేస్తాను. కనీసం ఒక సంవత్సరం తర్వాతైనా... ఆపని తప్పక చేస్తాను.

ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఆ ప్రేమ పోదు.  

ఇక్కడితో ఈ బ్లాగ్ ముగించాలని ఎంత గట్టిగా అనుకున్నా, అలా ముగించలేకపోతున్నాను...  


నా చిన్న తమ్ముడు వాసు మమ్మల్ని వదిలి వెళ్ళి ఇవ్వాళ్టికి సరిగ్గా 5 సంవత్సరాలు. 

ఎందుకు వాసూ, ఇలా చేశావు?

నీ జీవితాన్ని ఒక పాఠంగా మార్చి నువ్వు నిష్క్రమిస్తే తప్ప మాకు తెలియలేదు మానవసంబంధాల విలువేంటో.   

"అన్నా" అని ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడిన నీ జ్ఞాపకాలూ, ఆవెంటనే వచ్చే కన్నీళ్ళే కదా ఇప్పుడు మిగిలింది?

మానవసంబంధాలు చాలా ముఖ్యం. మనసువిప్పి మాట్లాడుకోడానికి ఒక మనిషి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండూ ఉన్నప్పుడే మిగిలినవి ఏవైనా సరే బాగుంటాయి. 

శ్రీనివాస్ చిమ్మని... నా చిన్న తమ్ముడు లేడు అన్న నిజాన్ని నేనింకా నమ్మడానికి ఒప్పుకోలేకపోతున్నా. కాని, నిజాన్ని ఎలా కాదనగలను? 

నీ ఫోన్ కాల్ ఏది? 
మొన్న నేను వరంగల్ వచ్చినపుడు నువ్వు లేవే? 
మనిద్దరం కలిసి తిరగలేదే? 
కలిసి చాయ్ మీద చాయ్ త్రాగలేదే? 
నేను తిరిగివెళ్ళేటప్పుడు, ఎప్పట్లా మనిద్దరం కలిసి బస్టాండ్ వెనకున్న చిన్న హోటల్లో టిఫిన్ చేస్తూ మాట్లాడుకోలేదే? 
కనుమరుగయ్యేదాకా నీ నవ్వు ముఖంతో ఎప్పట్లా నాకు "బాయ్ అన్నా" అంటూ చెయ్యి ఊపలేదే? 
ఎప్పుడూ శ్రీధర్, నేనే కలుస్తున్నాం తప్ప నువ్వు లేవేంటి వాసూ?
నిన్న శ్రీధర్ నాకు కాల్ చేసి "రేపు వస్తున్నావా అన్నా" అడిగినప్పుడు నా దగ్గర సమాధానం ఏది? 
తర్వాత ఫోన్లో 20 నిమిషాలపాటు మేం మాట్లాడుకున్న మాటల్లో అంతా నువ్వే కదా? నీ విషాదమే కదా?

ఎంత మెటీరియలిస్టిక్‌గా ఆలోచించినా... 
నువ్వు లేవు, ఇంక తిరిగిరావు అన్న నిజాన్ని 
ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 
ఆ దుఖాన్ని ఆపుకోలేకపోతున్నాను.           

మిస్ యూ వాసూ...       

Tuesday 12 December 2023

And... She is none other than...


She's outstanding in the film "Geetha Govindam."

She has delivered a terrific performance in the film "Dear Comrade."

She might have done equally well in many other films. However, this particular film, "Animal," left me speechless.

What a performance! What ease! What a look! How fascinatingly beautiful she is in the film—simply terrific.

All SIIMA, IIFA, Filmfare, and National Awards should go to this wonderful actress this year. That's my feeling.

And she is none other than Rashmika Mandanna. 

Reviews are Just BS


రివ్యూలు ఏవైనా సరే, వ్యక్తిగతం. 

ఒక సినిమా గురించి, ఆ సినిమా రూపొందించిన డైరెక్టర్ గురించి, అందులో నటించిన యాక్టర్స్ గురించి, పని చేసిన టెక్నీషియన్స్ గురించి, మొత్తంగా ఆ ఫిలిం ప్రాజెక్ట్ గురించి ఆ సమయానికి ఆ వ్యక్తి ఆలోచనలే... రివ్యూ. 

ఈ ఆలోచనల్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇండియాలోనైతే కులం, మతం, ప్రాంతం, వర్గం, భావజాలం, అభిమానం, ఎట్సెట్రా. 

మనోహర్‌కు బాగా నచ్చిన సినిమా ప్రదీప్‌కు నచ్చకపోవచ్చు. ప్రదీప్ సూపర్ ఉంది అన్న సినిమా మనోహర్‌కు అస్సలు నచ్చకపోవచ్చు. 

వ్యక్తిగతంగా మన వ్యూస్ చెప్పడం వేరు. 

మన సొంత తరాజులో మనకిష్టమైన బాట్లు వేసి ప్రపంచం కోసం జోకటం వేరు. 

కట్ చేస్తే -

ప్రతి శుక్రవారం రిలీజయ్యే ఒక్కో సినిమాకు 101 రివ్యూలు! 

1.5 స్టార్స్, 2 స్టార్స్, 3 స్టార్స్, 3.5 స్టార్స్... 

అసలీ స్టార్స్ ఇచ్చేవాళ్లకు ఉన్న అర్హతలేంటి? 

సోషల్ మీడియాలో ఒక రివ్యూ పోస్టుకు జస్ట్ వంద రూపాయల ఫీజు పెడితే ఎంతమంది రివ్యూలు పెడతారు? 

జస్ట్ ఎ డౌట్...  

Saturday 2 December 2023

టోటల్ సినిమా!


సరిగ్గా ఒక సంవత్సరం టార్గెట్స్ పెట్టుకున్నాను. 

సినిమాలు. క్రియేటివిటీ. 

మరొకటి లేదు. 

రేపు 3 వ తేదీ ఈ ఎన్నికల అధ్యాయం చివరి ఘట్టం గురించి నాకు ముందే తెలుసు. నా బాధ్యతగా నేను ఫీలయ్యిందీ, చేయగలిగిందీ చేశాను. That chapter is over now. 

సో, ఈ క్షణం నుంచే నా టార్గెట్స్‌కు ఏ రకంగానూ సంబంధం లేని విషయాల మీద నా సమయాన్ని వెచ్చించటం మానుకుంటున్నాను. ఆల్రెడీ మానుకున్నాను. 

ఇక నుంచీ సోషల్ మీడియాలో కూడా నా ఫోకస్, కంటెంట్ ఎక్కువగా సినిమాల మీదే ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నాను. ఇలా ఉండటం కూడా నా టార్గెట్స్‌కు ఉపయోగపడటానికే. 

బ్లాగ్ కూడా ఎక్కువగా రాయలేకపోవచ్చు. నా ప్రొఫెషనల్ ప్రోగ్రెస్‌కు సమబంచించిన అప్‌డేట్స్ కోసం తప్ప బ్లాగ్ వైపు బహుశా రాకపోవచ్చు.  

కట్ చేస్తే -

సెంటిమెంట్స్, నాస్తాల్జియా లాంటివి ఇంక ఏం లేవు. ఉండవు. 

26-11-2024. ఇంకో 361 రోజులు. 

దీన్ని 26-11-2025, 2026 వరకు కూడా పొడిగించొచ్చు.  

సినిమాలు. క్రియేటివిటీ. డబ్బు. వ్యక్తిగత జీవితం. కంప్లీట్ ఫిట్‌నెస్. 

అంతే.

When in Rome, do as the Romans do. 

100% Professional. 

Rock solid. Renegade. 

I know it's very hard. But I am gonna rock and make it happen. 

- Manu