Sunday 27 March 2016

రెండోవారం ఏదీ?

రాత్రి ఒక ఇంటర్వ్యూ చూశాను. అది గురువుగారు దాసరి నారాయణరావు గారిది.

"స్వర్గం నరకం" జైహింద్ థియేటర్లో రిలీజయినప్పుడు, దాని ప్రారంభపు కలెక్షన్ కేవలం 200 రూపాయలట!

అలా 200 రూపాయల కలెక్షన్లతో ప్రారంభమైన అదే సినిమా, నెమ్మదిగా రెండోవారంలో పుంజుకొని, ఆ తర్వాత మూడోవారంలో సన్‌డే నాటికి 4 ఆటలూ హౌజ్‌ఫుల్ అయ్యిందట! ఆ తర్వాతంతా చరిత్రే.

గురువుగారి తొలిచిత్రం "తాత మనవడు" విషయంలోనూ ఇదే జరిగిందని విన్నాను.

కట్ టూ 2016 - 

కొత్తవాళ్లతోనూ, అప్‌కమింగ్‌వాళ్లతోనూ తీసే సినిమాలకు భారీ రేంజ్‌లో ప్రమోషన్ ఉంటే తప్ప అసలు ఓపెనింగ్స్ ఉండవు. అంతే కాదు. ఆ సినిమాకు ఎందుకు వెళ్లాలి అన్న ప్రశ్నకు ఠక్కున సమాధానం చెప్పే 'యుఎస్‌పి' కూడా ఒకటి ఆ సినిమాకు ఉండితీరాలి. ఇవి లేనప్పుడు, సినిమా ఎంత బాగున్నా జనం దృష్టిలోకి వెళ్లదు. ప్రేక్షకులు రారు.

ఇదంతా ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా వర్తిస్తుంది.

ఒక సినిమా బాగుంది అని మౌత్ టాక్, రివ్యూలు వచ్చి - అది రెండో వారంలోనో, మూడోవారం లోనో పికప్ అయ్యేదాకా ఆగే పరిస్థితి ఇప్పుడు లేదు. అలాగే - ఓపెనింగ్ కలెక్షన్లు బాగా రాని సినిమా చిన్నదా, పెద్దదా అన్న ప్రశ్న కూడా లేదు. ఓపెనింగ్స్ బాగా వచ్చి సినిమా నడిచిందా .. ఓకే. లేదంటే, ఆ ఒక్కవారం లోనే సినిమా ఎత్తేస్తున్నారు.

ఇదీ ఇప్పటి ఇండస్ట్రీ సిస్టమ్.

ఈ పరిస్థితే గనుక అప్పుడున్నట్లైతే, దర్శకరత్న దాసరితోపాటు ఇంకెంతమందో పెద్ద దర్శకులు అసలు ఫీల్డులో ఉండేవారేకాదు అని స్వయంగా గురువుగారే అన్నారు ఆ ఇంటర్వ్యూలో.

ఈ ఒక్క కారణంగా - ప్రస్తుతం ఎంతోమంది టాలెంట్ ఉన్న కొత్త దర్శకులు ఫీల్డులో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఈ మాటకూడా వారే చెప్పారు.

ఎంత నిజం?  

Monday 14 March 2016

మైండ్‌సెట్ మేటర్స్!

'నాగురించి ఎవరేమనుకుంటున్నారో' అని అస్సలు ఆలోచించవద్దు. అలా అనుకున్నవారెవరూ అడుగు ముందుకేయలేరు.

సినీఫీల్డులో ఉన్నవాళ్లకయితే ఇది మరీ ముఖ్యం. ఇక్కడ సిచువేషన్ అలా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే - ఒక దట్టమైన అడవిలో ఉన్నామనుకోవాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎటునుంచి ఏదైనా, ఎప్పుడైనా, ఏరూపంలోనైనా ఎటాక్ చేయొచ్చు.

ఈ బేసిక్ సూత్రం ఫీల్డులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్లనుంచి .. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన న్యూ టాలెంట్ దాకా .. అందరికీ వర్తిస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సవరణలు లేవు.

కట్ టూ రియాలిటీ -

ఎంత బిజీ పనుల్లో మునిగి ఉన్నా, ఎక్కడ తిరుగుతున్నా .. గత రెండు మూడు రోజులనుంచి మనసెందుకో చాలా మూడీగా ఉంది. ఈ మూడీనెస్‌కు కారణం ఏంటీ అంటే, దాని మీద ఒక పుస్తకమే రాయొచ్చు. కాని, దానికి చాలా టైముంది. ఆ పని తర్వాతెప్పుడైనా చేసుకోవచ్చు. అది వేరే విషయం.

ఒక స్ప్లిట్ ఆఫ్ ది సెకండ్‌లో, ముందూ వెనకా ఆలోచించకుండా మనం తీసుకొనే కొన్ని ఫూలిష్ నిర్ణయాల ప్రభావం అలా ఉంటుంది మరి. తప్పదు.

ఇప్పుడంతా కళ్లముందున్న టార్గెట్స్, టైమ్ ఫాక్టర్.

వేరే ఆలోచించడం లేదు.

అయినా సరే - అనుక్షణం ఏవేవో నా ఆలోచనల్లోకి చొచ్చుకొని వస్తున్నాయి. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేను మాత్రం ఎక్కడా ఆగటం లేదు. పట్టించుకోవడంలేదు. ఒకరకంగా ఇది నాకు నేనే వేసుకున్న పనిష్‌మెంట్. కాని, ఈ పనిష్‌మెంట్ ఇప్పుడు నాకు చాలా అవసరం.

ఎట్ లీస్ట్, నా కొత్త ప్రాజెక్టును అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసేదాకా. 

Sunday 6 March 2016

చార్లీ చాప్లిన్ విజయరహస్యం!

తలరాత, విధిరాత, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది .. వంటి శాస్త్రాలను నేను నమ్మలేను. నమ్మను.

మన కృషినిబట్టే ఫలితం ఉంటుంది. మన నిర్ణయాలనుబట్టే కొన్ని కలిసిరావడమో, లేదా కలిసిరాకపోవడమో జరుగుతుంది. ఇది నా వ్యక్తిగత నమ్మకం. చాలా సందర్భాల్లో నా అనుభవం కూడా.  

కట్ టూ చార్లీ చాప్లిన్ -

తన జీవితకాలంలో సుమారు 80 సినిమాల్లో నటించి, 3 అకాడమీ అవార్డుల్ని అందుకున్న చార్లీ చాప్లిన్ అంటే కేవలం ఒక్క నటుడుగానే అందరికి తెలుసు. కానీ - అతనొక మంచి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, బిజినెస్‌మేన్ అన్న విషయం చాలామందికి తెలియదు.

మేరీ పిక్‌ఫోర్డ్, డగ్లస్ ఫెయిర్‌బాంక్స్, డి డబ్ల్యూ గ్రిఫిత్ లనే మరో ముగ్గురు ఆర్టిస్టులతో కలిసి చాప్లిన్ పూనుకోకపోతే, 1919 లో "యునైటెడ్ ఆర్టిస్ట్స్" అనే ప్రొడక్షన్ కంపెనీ అసలు హాలీవుడ్‌లో ఏర్పడేదే కాదు.

హాలీవుడ్ చరిత్రలో కేవలం ఆర్టిస్టులు మాత్రమే స్థాపించిన మొట్టమొదటి స్టూడియో అదే!    

చార్లీ చాప్లిన్ చెప్పిన ఒక మూడు కొటేషన్లను రికార్డ్ చేసుకోవడం కోసం, మరో కోణంలో స్వీయ విమర్శ కోసం మాత్రమే నేనీ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను:

“Nothing is permanent in this world, not even our troubles.”

“I like walking in the rain, because nobody can see my tears.”

“The most wasted day in life is the day in which we had not laughed.”

చాప్లిన్ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తాన్ని, ఆయన జీవితాదర్శాన్నీ ఈ మూడు కొటేషన్లలో మనం చూడొచ్చు. అలాంటి చార్లీ చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకున్నట్టు .. చాప్లిన్ విజయరహస్యం ఏ విధిరాతో కానే కాదు.

క్రియేటివ్ ఫ్రీడమ్!

ఈ క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కుల్ని ప్రారంభంలోనే గుర్తించకపోవడం, లేదా అలాంటి చిక్కుల్ని  కొనితెచ్చుకోవడం ఎంత తెలివితక్కువతనమో - వాటిల్లోంచి వెంటనే బయటపడకపోవడం అంతకంటే పెద్ద మూర్ఖత్వం.

ఈ చిక్కులు వ్యక్తిగతమైనవి కావొచ్చు, సాంఘికమైనవి కావొచ్చు, ఆర్ధికమైనవి కావొచ్చు. అడుగడుగునా మాత్రం అడ్డుపడతాయి. జీవితాన్ని అనుకున్నట్టుగా ముందుకు సాగనీయవు. జీవితంలో అసలు ఎన్నడూ ఊహించని అల్లకల్లోలం సృష్టిస్తాయి.    

ఈ లాజిక్ ఒక్క క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికే కాదు, అందరికీ వర్తిస్తుంది.

ఈ నిజాన్ని ముందే గ్రహించగలిగాడు కాబట్టే - చాప్లిన్ తన క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కులకు ముందే చెక్ పెట్టుకున్నాడు. 1919 లోనే హాలీవుడ్‌లో యునైటెడ్ ఆర్టిస్ట్స్ స్థాపించాడు. తను కోరుకున్న క్రియేటివ్ ఫ్రీడమ్‌ను సాధించుకొన్నాడు.

"చార్లీ చాప్లిన్" అనగానే పెదాలపైన నవ్వు వికసించేలా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో నిల్చిపోయాడు.