Thursday 29 January 2015

అసలేంటీ కెమిస్ట్రీ!

హారర్ కథలన్నీ సాధారణంగా ఓ రెండు మూడు ఫార్ములాల్లో నడుస్తాయి.

ఫార్ములా ఏదయినా, అన్నింటి అంతిమ లక్ష్యం - ప్రేక్షకుల్ని భయపెట్టడమే.

ఎట్‌లీస్ట్ కొన్ని సన్నివేశాల్లోనయినా.

ఫార్ములా విషయం ఎలాఉన్నా, "స్విమ్మింగ్ పూల్" లో తెలుగులో నేనొక కొత్త ఎలిమెంట్ పరిచయం చేస్తున్నాను.

అది నాకు వ్యక్తిగతంగా బాగ పరిచయం ఉన్న ఎలిమెంట్ కావడం వల్ల, స్క్రీన్‌ప్లే విషయంలో నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేకపోయింది.

"స్విమ్మింగ్‌పూల్" .. ఓ హారర్ సినిమా.

రొమాంటిక్ హారర్.

ఇంకా చెప్పాలంటే, 'హాట్' రొమాంటిక్ హారర్.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల రొమాన్స్ ఓ డోస్ ఎక్కువగానే ఉంటుందని దర్శకునిగా నేనే చెప్తున్నాను. బట్ .. ఏదయినా, అంతా క్లాసిక్‌గానే ఉంటుంది. చర్చించాలంటే ఇదే ఓ పెద్ద టాపిక్ అవుతుంది. దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం.

కట్ టూ కెమిస్ట్రీ -

ఇలాంటి హాట్ రొమాంటిక్ సినిమాలో ప్రియ వశిష్ట లాంటి కొత్త అమ్మాయిని పరిచయం చేయడం అనేది పెద్ద రిస్క్. అయినా చేశాను.

నా నమ్మకం.

గట్స్.

కొత్త నటి అయినా ప్రియ వశిష్ట చాలా బాగా చేసింది. బోల్డ్‌గా చేసింది. ఇది, ఏదో రొటీన్‌గా చెప్పడం కాదు. నిజంగా బాగా చేసింది.

ప్రియ ఎంత బాగా నటించిందంటే - పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎడిటింగ్ స్టేజ్ నుంచి, డబ్బింగ్ వరకు - పని చేస్తూ, సీన్స్ చూసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఒకటే మాట.

"అఖిల్ కార్తీక్, ప్రియ వశిష్ట ల కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది!" అని.

ప్రియకు డబ్బింగ్ చెప్పిన మహతి అనే అమ్మాయయితే ఇంకో మాటంది:

"నాకెందుకో ఈ సినిమా షూటింగ్ తర్వాత కూడా వీళ్లిద్దరూ రొమాన్స్ కంటిన్యూ చేస్తుంటారనిపిస్తోంది!" అని.

సో, అదన్నమాట కెమిస్ట్రీ అంటే!

అఖిల్ కార్తీక్ మంచి వర్సటైల్ యాక్టర్. బాగా చేయగలడు. చాలా బాగా చేశాడు కూడా. కానీ, డెబ్యూ ఆర్టిస్ట్ అయిన హీరోయిన్ ప్రియ విషయంలో ఇదో పెద్ద కాంప్లిమెంట్ అని నా ఫీలింగ్.

ఏమయినా, "స్విమ్మింగ్‌పూల్" లో అఖిల్ కార్తీక్, ప్రియ వశిష్ట పూర్తిగా వారి పాత్రల్లో జీవించారు.

రేపు ప్రేక్షకులూ ఇదే చెప్తారు.

సిల్వర్ స్క్రీన్‌పై చూశాక. 

Friday 23 January 2015

అసలు సిసలు న్యూవేవ్ సినిమా!

1980 లో దాసరి నారయణ రావు గారు 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. రిలీజ్ చేశారు. 

అంటే, సగటున నెలకి ఒకటి కంటే ఎక్కువ!

అప్పుడు అంతా ఫిలిమే. ఇప్పటి డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ తో పోలిస్తే ఎంతో ఎంతో పని.  అయినా - దాసరి గారు అప్పుడే 12 నెలల్లో 15 సినిమాలు తీశారు. అలాగని - అవన్నీ ఏదో చుట్టి అవతల పడేశారు అని చెప్పలేం.

ఎందుకంటే - వాటిల్లో కనీసం 50% కంటే ఎక్కువ 100 రోజుల చిత్రాలు!

సో, ఆ రోజుల్లో కూడా సినిమా అంటే కేవలం డబ్బులు, ప్లస్ ..టైమ్‌కి తిన్నామా, పన్నామా, అన్నీ అందాయా ..  'మోకా చూసి ఇంకెంత వసూలు చేయొచ్చు'  కాదు!

"న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ" అని రాంగోపాల్‌వర్మ అన్నాడంటే తప్పులేదు. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజంతోనే కేవలం 20 రోజుల్లో సినిమా తీసిన రికార్డ్ ఆయనకుంది.

కట్ టూ 2015 - 

ఇక్కడ నేను బాహుబలి, రుద్రమదేవి లాంటి మాగ్నమ్ ఓపస్ ల గురించి మాట్లాడ్దం లేదు ..

టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా - కేవలం ఒక 60 రోజుల్లో ఒక సినిమా తీసి రిలీజ్ చేయొచ్చు. చెప్పాలంటే 30 రోజుల్లో కూడా ఇది సాధ్యమే.

కానీ దీనికి కావల్సింది ట్రెడిషనల్ ఫిలిమ్‌మేకింగ్ సెటప్, టీమ్‌లు కాదు.

సినిమా పట్ల ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇన్వెస్టర్లు.

ప్రొడ్యూసర్‌ని పీల్చి పిప్పిచేసి పీడించటం, లేవకుండా చేయటం కాదు.

కాపాడుకోవటం ముఖ్యం.

దీనికి వ్యతిరేకంగా ఆలోచించే, ప్రవర్తించే ఏ ఆర్టిస్టూ, ఏ టెక్నీషియనూ ఎన్నటికీ ఎదగలేడు. ఇది దశాబ్దాలుగా నిరూపితమయిన సత్యం.  

ఈ నిజం తెలిసిన కొందరు మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్ మిత్రులు ఇప్పటికే నాతో ఉన్నారు. అతి త్వరలో నేను ప్రారంభించబోతున్న ఫిలిమ్ ఫాక్టరీకోసం ఇలాంటి మరికొందరు పాత, కొత్త ప్యాషనేట్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇన్వెస్టర్‌లను వెతుక్కొనే క్రమంలో ఉన్నాను.

అన్వేషణ ఆల్రెడీ ప్రారంభమయింది.   

Monday 19 January 2015

"అలా"నాటి అఖిల్ కార్తీక్!

2006 జూన్‌కు, 2015 ప్రారంభానికి మధ్యలో దాదాపు ఎనిమిదేళ్లు గడిచాయి.

ఎనిమిదేళ్లంటే అంత తక్కువ సమయమేం కాదు. ఈ మధ్యలో ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనిషి ఎన్నోరకాలుగా మారిపోతాడు.

నిజానికి, మన అనుభవాలు మనల్ని అలా మారుస్తాయి.

అలాంటి ఎన్నో మార్పులు జరగటానికి కారణమైన సంఘటనలు ఈ ఎనిమిదేళ్లలో నా జీవితంలో చాలా జరిగాయి. బహుశా అఖిల్ కార్తీక్ జీవితంలోనూ ఎన్నో జరిగుంటాయి.

ఇది సహజం.

కట్ టూ మా ఫేవరేట్ "అలా" - 

అప్పట్లో నేనూ, నా మిత్రులు కొందరు డబ్బులు మోబిలైజ్ చేసి తీసిన చిత్రం "అలా".

ఈ అనఫీషియల్ విషయాన్ని ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే - "అలా" చిత్రానికి అఫీషియల్‌గా నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ని కూడా కాబట్టి!

ఆ విషయం అలా వదిలేద్దాం ..

"అలా"లో నేను పరిచయం చేసిన హీరోయిన్ విదిశ శ్రీవాస్తవ సొంత చెల్లెలే ఇప్పటి రైజింగ్ సౌత్ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ (వర్మ "రౌడీ" ఫేమ్).

ట్రెడిషనల్‌గా చెప్పాలంటే - "అలా" హీరో హీరోయిన్లు రోహన్, విదిశ శ్రీవాస్తవ. కథలో వీరిదో సెపరేట్ ట్రాక్. అంతే.

కానీ - కథాపరంగా అయితే, "అలా" లో అసలు హీరో కార్తీక్.

మరో ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉన్నా కూడా .. మొత్తంగా కథంతా కార్తీక్ పాత్ర చుట్టూ జరిగేదే.

ఒక సినిమా నిడివి ఎలా రెండున్నర గంటలో .. "అలా" చిత్రంలో కథ జరిగే సమయం కూడా రెండున్నర గంటలే.
ఆ విధంగా చూసినప్పుడు "అలా" సినిమా ఒక రియల్ టైమ్ స్టోరీ అన్నమాట!

ముంబై హైవేలో ఉన్న ఇస్నాపూర్ ఫిల్లింగ్ స్టేషన్‌లోనే దాదాపు అత్యధికభాగం చిత్రీకరించిన ఆ సినిమా అంటే వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం.

కార్తీక్ కి కూడా.

కర్ణుడి చావుకి ఎన్నో కారణాలున్నాయంటారుగానీ, "అలా" నడవకుండాపోవడానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి: కనకపు సిమ్‌హాసనమిచ్చి ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మటం. రెండోది:  తనమీద పెట్టిన ఆ నమ్మకాన్ని ఆ వ్యక్తి కనీసం ఒక మనిషిగానైనా నిలుపుకోలేకపోవడం.

సినీ ఫీల్డులో ఇది చాలా సర్వసహజమయిన విషయం అని తర్వాత అనుభవం మీద గ్రహించాను. అలాంటి చెత్త నిర్ణయాలు ఇకమీదట నావైపు నుంచి జరక్కుండా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

దీనర్ధం .. ఫీల్డులో అలాంటి షార్క్స్ ఎప్పుడూ ఉంటాయన్నమాట!  

మొన్నీమధ్య ఒక పార్టీలో కలిసినప్పుడు - "అలా" నడవకపోడానికి కార్తీక్ కూడా రెండే రెండు కారణాలు చెప్పాడు. ఒకటి ప్రమోషన్, రెండోది రిలీజ్ అని.

పైన నేనుచెప్పిన కారణాలకు, కార్తీక్ చెప్పిన ఈ కారణాలు కేవలం పర్యాయపదాలు మాత్రమే. సేమ్ టు సేమ్!

అప్పటి ట్రెండ్‌లో ఒక "ఐతే" లా బ్రహ్మాండంగా నడిచే స్టఫ్ ఉన్న మా "అలా" సినిమాని, కేవలం వ్యక్తిగతమైన శుష్క, స్వార్థ, నీచ, మనీ కక్కుర్తి ప్రయోజనాలకోసం కావాలని అలా జరక్కుండా చేశారు.

ఇలాంటివే మరికొన్ని నాదృష్టికి రాని కొన్ని సంఘటనలు, అవమానాలు కూడా జరిగాయని ఇటీవలే కార్తీక్ ద్వారా విని నేను నిజంగా షాకయ్యాను. బాధపడ్డాను కూడా.

అ యి నా .. 

"అలా" నాటి అఖిల్ కార్తీక్‌కీ, ఇప్పటి "స్విమ్మింగ్‌పూల్" అఖిల్ కార్తీక్‌కీ - మనోహర్ చిమ్మనితో స్నేహంలో, అనుబంధంలో ఎలాంటి మార్పులేదు.

దటీజ్ అఖిల్ కార్తీక్!  

Friday 16 January 2015

స్విమ్మింగ్‌పూల్ నిజంగా ఎంత HOT?

"ఏ మాయ చేసావె"లో నాగచైతన్య సమంతతో అంటాడు.

"యూ ఆర్ సో హాట్!" అని.

చురుగ్గా చూస్తుంది సమంత. "ఐ మీన్ క్లైమేట్ చాలా హాట్‌గా ఉందీ అంటున్నాను" అని మళ్లీ సర్ది చెబుతాడు నాగచైతన్య. తను ఏమనుకుంటుందోనని.

కానీ, సమంత పెద్ద సీరియస్‌గా తీసుకోదు. ఒక కాంప్లిమెంట్‌గా తీసుకొని తనలో తను నవ్వుకుంటుంది.

"హాట్" లాంటి కొన్ని మాటలు, విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడ్డం, చర్చించడం ఇంకా మనదగ్గర ఓ పనికిరాని టాబూగానే ఉండటం నేనింకా నమ్మలేకపోతున్నాను. కానీ, నిజం అదే.

అసలేందీ హాట్?

సినిమాల విషయానికొస్తే - కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న రొమాన్స్ ని "హాట్ రొమాన్స్" అనవచ్చునేమో!

మరో అర్థంలో -  ఎవరయినా ఒక అమ్మాయో, అబ్బాయో చూడగానే కత్తిలా కనిపించినా, వారు 'ఒక' మూడ్‌లో ఉన్న విషయం గమనించినా చాలు. ఏ మాత్రం కొంచెం చనువున్న ఫ్రెండయినా (బాయ్/గాళ్) ఆ అమ్మాయినో, అబ్బాయినో ఉద్దేశించి ఈ 'హాట్' పదం వాడొచ్చు.

ఇదంతా రొమాన్స్ కు సంబంధించిన 'హాట్' చర్చ.

రొమాన్స్‌కు, తత్ సంబంధమయిన మూడ్‌కూ అసలు సంబంధం లేకుండా - "వాడివాళ చాలా హాట్ హాట్ గా ఉన్నాడు" అని కోపం అర్థంలో కూడా ఈ హాట్ పదాన్ని వాడొచ్చు.  

ఈ థియరీ అంతా కాసేపు పక్కనపెడితే - అసలు "హారర్" పదం కంటే "హాట్" పదమే మన జనాలని ఎక్కువగా భయపెడుతున్నట్టుంది చూస్తోంటే!  

కట్ టూ మన "హాట్" స్విమ్మింగ్‌పూల్ - 

"స్విమ్మింగ్‌పూల్" సినిమా ఓ మంచి రొమాంటిక్ హారర్. ఈ రొమాన్స్ కూడా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఓ మోతాదులో ఉంది అని డైరెక్టర్‌గా నేనే చెప్తున్నాను.

ఈ కోణంలో ఆలోచించినపుడు, పోస్టర్ మీద 'హాట్ రొమాంటిక్ హారర్' అనే ముద్ర వేయడం నాకేమంత పెద్ద విషయంగా అనిపించలేదు.

అలాగని - జంటగా కానీ, ఒంటరిగా కానీ చూడలేనంత ఇబ్బందికరమైన చిత్రీకరణ కూడా ఇందులో ఏమీలేదు. ఇదేం బి గ్రేడ్ సినిమా కాదు.

పోనీ .. స్క్రిప్ట్ డిమాండ్ చేసిందనీ, ఏదో చూపించాలనీ మేమెన్ని బిజినెస్ జిమ్మిక్కులు చేసినా చివరికి సెన్సార్ అంటూ ఒకటి ఉండనే ఉంది! ఏమాత్రం తేడా వచ్చినా - అక్కడ మా పరిస్థితి రొంబ హాట్ హాట్ గా ఉంటుంది. అది వేరే విషయం.

ఈ విషయంలో నాకు నచ్చిన ఒకే ఒక్క డీసెంట్ లాజిక్ ఏంటంటే - "హాట్ అనేది బయట చెప్పడం దేనికి? సినిమాకు వచ్చేవాళ్లు కొందరు ఆ పదం చూసే ఇబ్బందిపడి రాకపోవచ్చు. సో, ఆ హాట్ ఏదో సినిమా లోపల చూపించండి. బయట వద్దు!" అని.

చాలా అర్థవంతమయిన ఈ లాజిక్ వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చింది. మా టీమ్ అందరికీ కూడా నచ్చి తీరాలి మరి. చూద్దాం.

ఇదంతా ఎలా ఉన్నా - సినిమాలో ఏముందన్నది కాదు ప్రశ్న. ఆ సినిమాను ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఎంత ఎట్రాక్టివ్‌గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నదే అసలు ప్రశ్న.

దీన్నే మార్కెటింగ్ అంటారు, బహుశా!

ఈ మార్కెటింగే రేపు మాకు బిజినెస్ తెచ్చేదీ, ఇచ్చేదీ. దీనికోసం నానా బిజినెస్ జిమ్మిక్స్ తప్పవు. ప్రస్తుతం మా టీమంతా ఈ ప్రాసెస్ లో యమ 'హాట్' గా ఉన్నాం.

ఫినిషింగ్ టచ్ ఏమిటంటే - పోస్టర్ మీదున్న ఈ "హాట్ రొమాంటిక్ హారర్" ముద్రనూ, అందులో ఉన్న "హాట్"నీ, మా అసలు టార్గెట్ ఆడియెన్స్ చూడరనీ, చూసినా పెద్దగా పట్టించుకోరనీ .. మా బిజినెస్ వర్గాల మిలియన్ డాలర్ అభిప్రాయం!  

Thursday 15 January 2015

రష్యన్ ప్రొఫెసర్‌కు మా 'స్విమ్మింగ్‌పూల్' లో ఏం పని?

వయస్సులో అమితాబ్ బచ్చన్ కంటే సరిగ్గా 28 రోజులు పెద్దవారు మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్.

ఉస్మానియా యూనివర్సిటీలోని రష్యన్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గా ఉన్నప్పుడు
ఓ మూడేళ్లపాటు పార్ట్ టైమ్‌గా రష్యన్ చదివాను నేను.

ఇప్పటికీ - నా చదువు మొత్తంలో నాకు బాగా నచ్చిన, మజా ఇచ్చిన చదువు ఏది అంటే - నేను ఠక్కున చెప్పే సమాధానం .. "ఓయూ లో 3 ఏళ్ల నా రష్యన్ డిప్లొమా!" అని.  

ఒక విదేశీ భాషను ఎంత బాగా, ఎంత అందంగా, ఎంత సులభంగా నేర్పవచ్చో - మా మురుంకర్ సర్, కల్పన మేడమ్ ల తర్వాతే బహుశా ఎవరయినా అని నేనిప్పటికీ అనుకొంటూ ఉంటాను.

ఆ మూడేళ్ల రష్యన్ డిప్లొమాలో నేనే యూనివర్సిటీ టాపర్. ఆ విషయం అలా వదిలేద్దాం.

కట్ టూ "స్విమ్మింగ్‌పూల్"లో మా ప్రొఫెసర్ -  

థాంక్స్ టూ ఫేస్‌బుక్ .. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ నేను మా ప్రొఫెసర్‌ను కలిశాను. నా రష్యన్ క్లాస్‌మేట్ స్వరూపతో కలిసి. ఆ తర్వాతే మాటల సందర్భంలో మా మురుంకర్ సర్ నోట నేనొక మాట విన్నాను.

"సినిమాలో యాక్ట్ చేయటమొక్కటే నా జీవితంలో ఇప్పటికీ నాకో తీరని కోరికగా మిగిలిపోయింది!" అని.

అంతే. ఫిక్స్ అయిపోయాను. నా తర్వాతి సినిమాలో సర్ కి ఓ మంచి రోల్ తప్పదు అని. "ఇకనుంచీ అది మీ తీరని కోరిక కాదు. అదింక నా కోరిక!" అని చెప్పాను సర్ కి.

అదీ ఫేస్‌బుక్ ద్వారానే!

కట్ చేస్తే .. ఇప్పుడు "స్విమ్మింగ్ పూల్" సినిమాలో ప్రొఫెసర్ ఆఫ్ డెమనాలజీ కేరెక్టర్ ఆయనకోసమే పుట్టింది.

ఆయన వచ్చారు. యాక్ట్ చేశారు. కొద్దిరోజుల్లో తెరమీద కనిపించబోతున్నారు.

72 వ ఏట, తన డెబ్యూ సినిమాలో! 

Sunday 11 January 2015

తెలుగులో మొట్టమొదటి "కార్బన్ న్యూట్రల్" సినిమా

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అరుణ్‌కుమార్ ముప్పన నిర్మాతగా నేను రూపొందిస్తున్న "స్విమ్మింగ్‌పూల్" సినిమా, పర్యావరణ పరిరక్షణ స్పృహతో తెలుగులో రూపొందుతున్న మొట్టమొదటి సినిమా. 

మనం సినిమా తీయాలి అనుకున్నప్పటి నుంచి - ప్రిప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వంటి వివిధ దశలు పూర్తయ్యి - సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆయా దశల్లో .. మనం ఉపయోగించే ఎలెక్ట్రిసిటీ, వాహనాలు, పెట్రోల్, డీజెల్, జెనెరేటర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్ మొదలైన ఎన్నో రూపాల్లో మన చుట్టూ ఉన్న పర్యావరణంలోకి ఎంతో కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతుంది.

మరెన్నో కార్బన్ సంబంధిత రసాయనాలు పర్యావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.  
మన చిత్ర నిర్మాణం ద్వారా పర్యావరణంలోకి విడుదలయ్యే ఈ కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ సంబంధిత రసాయనాలు, వాయువులను న్యూట్రల్ చెయ్యడం కోసం, తగిన పరిణామంలో కొన్ని వందల చెట్లని మనం నాటాల్సి ఉంటుంది. 

ముంబైలో ఉన్న "సెంటర్ ఫర్ ఎన్వైరన్‌మెంట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్" (CERE) అనే ఒక అంతర్జాతీయ స్థాయి ఎన్ జి ఓ సంస్థ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పని మొట్టమొదటిసారిగా మేము మా "స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా చేస్తున్నాము.

ఈ సినిమా అనుకున్న కాన్‌సెప్ట్ స్టేజ్ నుంచి, ఈ సినిమా రిలీజయ్యేవరకు, మేము అందిచే డేటాను విశ్లేషించి,
సి ఇ ఆర్ ఇ ఒక నివేదిక మాకు ఇస్తుంది. దాని ప్రకారం కొన్ని వందల చెట్లను శ్రీ శ్రీ క్రియేషన్స్ తరపున మేము నాటాల్సి ఉంటుంది.

ఈ పనిని మేము అప్పుడే ప్రారంభించాము కూడా.

ఈ విషయంలో సి ఎ ఆర్ ఇ కి మేము చెల్లించే (కొన్ని లక్షల) ఫీజుతో ఆ సంస్థ కేవలం మొక్కలను నాటడం ఒక్కటే కాకుండా, మరెన్నో సామాజికంగా నిజంగా ఉపయోగకరమైన పనులు చేస్తుంది.

ఆ విధంగా మా "స్విమ్మింగ్‌పూల్" చిత్రం తెలుగులో (బహుశా మన దేశంలో కూడా) - పర్యావరణ స్పృహతో రూపొందిస్తున్న మొట్టమొదటి "కార్బన్ న్యూట్రల్" చిత్రం అని చెప్పుకోడానికి నిజంగా సంతోషంగా ఉంది.  
కట్ టూ మా సినిమా "యు ఎస్ పి" -


"హాట్ రొమాంటిక్ హారర్" అనేది మా "స్విమ్మింగ్‌పూల్" సినిమాకు బిజినెస్ పరంగా మేము క్రియేట్ చేసుకున్న యూ ఎస్ పి (యునిక్ సెల్లింగ్ ప్రపొజిషన్). 


నిజానికి "తెలుగులో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సినిమా" అన్నదే మా నిజమైన యు ఎస్ పి అని
 చెప్పుకోవడం వ్యక్తిగతంగా నాకిష్టం. అదే మా వీరేంద్ర లలిత్, అరుణ్‌కుమార్ ల అభిప్రాయం కూడా. 
మా టీమ్‌కు కూడా అదే ఇష్టం.     

Saturday 10 January 2015

ఓషో "మంత్ర" తులసీరామ్ ..

మా "స్విమ్మింగ్‌పూల్" సినిమా టైటిల్ లోగో లాంచ్ ఎవరితో చేయిస్తే బాగుంటుందా అనుకున్నప్పుడు చాలా పేర్లు మా చర్చల్లో వచ్చాయి.

కాని, చివరికి నేను ఒకే ఒక్క క్షణంలో నిర్ణయం తీసేసుకున్నాను.

అది .. ఓషో తులసీరామ్ గారయితే బాగుంటుందని.

దీనికి కారణాలు రెండు: ఒకటి "మంత్ర" లాంటి అద్భుతమయిన సినిమా రూపొందించిన డైరెక్టర్ ఆయన. రెండవది. తులసీరామ్ గారు తన పేరుకు ముందు "ఓషో" అన్న పేరు పెట్టుకోవడం! 

ఓషో రజనీష్ పుస్తకాలు కనీసం ఓ డజన్ అయినా చదివినవాణ్ణి మరి.. :)

అదే విషయాన్ని అప్పుడు లండన్ నుంచి ఫ్లయిట్‌లో ప్రయాణంలో ఉన్న మా ప్రొడ్యూసర్ అరుణ్ గారికి చెప్పాను. ఇక్కడ కార్తీక్ తో నేను అనుకుంటున్న విషయం చెప్పి, ఆ బాధ్యతను కార్తీక్‌కే అప్పగించాను.

గతంలో "మంత్ర", "మంగళ" వంటి మంచి హారర్/థ్రిల్లర్ సినిమాలు రూపొందించిన డైరెక్టర్ ఓషో తులసీరామ్ గారు వచ్చి మా రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్" టైటిల్ లోగో ను ఆవిష్కరిచడం నాకు పూర్తి సంతృప్తినిచ్చింది.

థాంక్ యూ, ఓషో తులసీరామ్ గారూ!

నా గురించి, మా గురించీ, మా టీమ్ గురించీ మీరు చెప్పిన నాలుగు మాటలు నాకెంతో ఎనర్జీనిచ్చాయి. ఇప్పుడు మీరు రూపొందిస్తున్న "క్రిమినల్స్", మొన్నటి "మంత్ర" ను మించి సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను.

కట్ టూ ప్రెస్‌మీట్ -

దాదాపు ఒక అర్థ దశాబ్దం తర్వాత అనుకుంటాను. నేను ప్రెస్ ముందుకు వచ్చాను. అదీ ఒక పూరిస్థాయి ప్రెస్‌మీట్‌లో!

దాదాపు ప్రెస్‌వాళ్లు అందరూ నన్ను గుర్తుపట్టారు. ఆత్మీయంగా పలకరించారు.

నెర్వస్‌నెస్ ఏమీ లేదు. అంతా నావాళ్ల ముందు, నా మిత్రులముందు మాట్లాడుతున్నట్టే ఉంది తప్ప .. మరో విధంగా లేదు.

ఒకరకంగా సినిమాల్లో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. ఈ ఇన్నింగ్స్ సక్సెస్‌లో సోషల్ మీడియాతో పాటు, ప్రెస్ మీడియా కూడా నాకు బాగా సహకరిస్తుందని నా నమ్మకం.     

Friday 9 January 2015

ప్రెస్ మీట్, చాలా గ్యాప్ తర్వాత!

ఇంకో 24 గంటల్లో, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు నా కొత్త టీమ్‌తో మళ్లీ ప్రెస్ ముందుకు రాబోతున్నాను. ఇదొక తప్పనిసరి రొటీన్ కాబట్టి పెద్ద ఎక్జయిటింగ్‌గా ఏం లేదు.

కాకపోతే .. ఈ ప్రెస్‌మీట్‌కు, ఇది పెట్టడానికి కారణమయిన ఈ సినిమాకు కొన్ని చిన్న చిన్న ప్రత్యేకతలున్నాయి.

అవన్నీ ప్రెస్‌మీట్ లోనే మొదటిసారిగా చెప్పాల్సి ఉంది కాబట్టి ఇక్కడ, ఈ టైమ్‌లో రాయలేకపోతున్నాను.  

సుమారు 26 టీవీ చానెళ్లు, ఒక డజన్ వెబ్‌సైట్లు, మరో పది ఫిలిమ్ మ్యాగజైన్లు, ఇంకో ఎనిమిది డైలీ న్యూస్‌పేపర్లు .. ఈ ప్రెస్‌మీట్‌ను కవర్ చేస్తాయి. రేపు రాత్రినుంచి, ఓ రెండు రోజులవరకు, దీనికి సంబంధించిన ఫుటేజ్ రకరకాలుగా ఆయా చానెళ్లలో వస్తుంది.

ముందే చెప్పినట్టు, ఇదొక తప్పనిసరి అయిన రొటీన్. 

కట్ టూ టైటిల్ లోగో లాంచ్ - 

మొన్నటిదాకా ఎలాగూ మా సినిమా టైటిల్ ప్రకటించలేదు కాబట్టి, పనిలో పనిగా, ఈ ప్రెస్‌మీట్ లోనే "స్విమ్మింగ్‌పూల్" టైటిల్ లోగో కూడా విడుదల చేస్తున్నాము.

మంత్ర, మంగళ వంటి మంచి హారర్/థ్రిల్లర్స్ ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు ఓషో తులసీరామ్ టైటిల్ లోగోను ఆవిష్కరిస్తారు.

ఈ సందర్భంగా .. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కొంతమంది నా ఆత్మీయ ప్రెస్ మిత్రులను, మొత్తంగా ప్రెస్ ఫ్రాటర్నిటీని, చాలా గ్యాప్ తర్వాత రేపు మళ్లీ కలవబోతున్నందుకు ఆనందంగా ఉంది.   

Friday 2 January 2015

బ్లాగింగ్ ది మేకింగ్!

ఇప్పుడు నేను చేస్తున్న రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్" రిలీజ్ వరకూ, ఆ తర్వాతా .. దాదాపు రోజూ ఎంతో కొంత ఈ సినిమా గురించీ, దీని మేకింగ్ గురించీ బ్లాగ్ చేయాలనుకున్నాను.

అయితే - ఇది అనుకున్నంత ఈజీ కాదని ప్రాక్టికల్‌గా అర్థమయింది. కాకపోతే, "అసాధ్యం కాదు" అన్న విషయం కూడా నాకు తెలుసు కాబట్టి .. నేను ముందు అనుకున్నట్టుగానే "స్విమ్మింగ్‌పూల్" మీద నా బ్లాగింగ్ కంటిన్యూ చేయాలని ఇవాళ మరింతగా డిసైడ్ అయ్యాను.

అయితే, ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒక్కటే. ఈ బ్లాగింగ్ స్పాంటేనియస్‌గా రోజూ ఒక పది పదిహేను నిమిషాల్లో పూర్తిచేసే అంశం. దీన్లో కంటెంట్ ఏంటన్నదే ప్రధానం తప్ప ఇంకేవో సాహితీ ప్రమాణాలు కావు.

కట్ టూ ఒక చిన్న గమనిక - 

ఈ గమనిక నా బ్లాగ్ పాఠకులకోసం కాదు. ముఖ్యంగా, ఇది నా టీమ్‌లోని ఒకరిద్దరు ఆర్టిస్టుల గురించి.

మామూలుగా ఒక సినిమా అంటే - ఆ సినిమాలోని హీరో హీరోయిన్ల గురించి రాయడం అనేది ఒక సర్వసాధారణమైన రొటీన్ విషయం. అలాగే, బిజినెస్‌పరంగా చాలా అవసరమైన విషయం కూడా.  

హీరో హీరోయిన్ల తర్వాత .. ఇంకొందరు సపోర్టింగ్ ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్ల గురించీ రాయాల్సి ఉంటుంది. అలాగే - మేకింగ్ సమయంలోని కొన్ని విశేషాల గురించీ, జ్ఞాపకాల గురించీ ఎలాగూ రాస్తాను.

ఇదంతా ఈ బ్లాగింగ్‌లో ఒకటి తర్వాత ఒకటి ఎలాగూ జరిగేదే. మామూలుగా చూస్తే, దీనికి ఒక క్రమం ఉన్నట్టుగా కనిపించదు. కానీ దీని వెనక ఒక ఆలోచన మాత్రం తప్పక ఉంటుంది.  

ఇక్కడ చర్చించే పాయింట్ ఏంటంటే - ఈ సినిమాలోని ఒకరో లేక ఇద్దరో ఆర్టిస్టుల గురించి రాస్తే, సినిమాకు సంబంధించిన మరికొంత విషయం పాఠకులకు తేలికగా తెల్సిపోతుంది. అది ఈ స్టేజ్‌లో జరగాల్సింది కాదు కాబట్టి .. ఒక కిక్ కోసం, నేను ఆ ఒకరో ఇద్దరో ఆర్టిస్టుల గురించి ఇప్పటికిప్పుడు (అంటే ఈ ప్రారంభంలో) రాయడం లేదు. కావాలనే!

ఒక స్ట్రాటజీ ప్రకారం, ఆ తర్వాత, ఎప్పుడు ఎలా రాయాలో వాళ్ల గురించి అప్పుడు రాస్తాను. లేదంటే, ఇంకొన్ని పోస్టుల తర్వాత, ఆ ఒకరో ఇద్దరో ఆర్టిస్టుల గురించి, కథకు సంబంధం లేని ఏవో విషయాలు చెబుతూ, ఏదో రాయొచ్చు.

ఇందాకే చెప్పినట్టు ఇదంతా ఒక క్రమం. ఒక క్రియేటివ్ స్ట్రాటజీ.

దీన్ని ఆయా ఆర్టిస్టులు అర్థంచేసుకుంటారనే అనుకుంటున్నాను.

వాళ్లే కాదు - మా గురించి రాయడం లేదే అని టీమ్‌లో ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి గురించీ బ్లాగ్‌లో ఏదో ఒకటి తప్పక రాస్తాను. ప్రతి ఒక్కరూ కవర్ అవుతారు.

సో, ఈ విషయంలో నా టీమ్ నన్ను నమ్ముతుందనే నా నమ్మకం.

నో వర్రీస్. స్విమ్మింగ్‌పూల్ టీమ్ విల్ రాక్!  

Thursday 1 January 2015

జాక్ జుకెర్‌మ్యాన్ ఎవరు?

ప్రతి ఒక్క మార్క్ జకెర్‌బర్గ్‌కూ ఓ మిలియన్ జాక్ జుకెర్‌మ్యాన్‌లుంటారు.

మధ్యలో ఈ జాక్ జుకెర్‌మ్యాన్ ఎవరు?

ఏమో నాకూ అంత ఖచ్చితంగా తెలియదు.

ఎన్నెన్నో సాధించాలనుకుని కలలు కంటూ, ఏదీ సాధించలేక, ప్రతి చిన్న అపజయానికీ కారణాలు వెతుక్కుంటూ, అధైర్యపడుతూ, అసంతృప్తిలో కూడా అట్టడుగు స్థాయిలో మిగిలిపోవడానికి ఇష్టపడే వాళ్లంతా జాక్ జుకెర్‌మ్యాన్‌లనే నా ఉద్దేశ్యం.

లక్ష్యం ముఖ్యం.

అది గైడెడ్ మిసైల్ లా ఉండాలి.  

ఊహించని అవాంతరాలు, ఊపిరి పీల్చుకోనీయని టెన్షన్లు వేధిస్తున్నా, వెంటాడుతున్నా దృష్టంతా లక్ష్యం మీదనే ఉండాలి. ఆ దిశలో పని చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉండాలి.

అలా చేయగలిగినపుడే అన్ని అవాంతరాలూ వాటంతటవే తొలగిపోతాయి. అన్ని టెన్షన్‌లూ కనుమరుగైపోతాయి. లక్ష్యం చేరుకోడానికి మార్గం దానంతట అదే సుగమమైపోతుంది. లక్ష్యం చేరుకుంటాము.

కట్ టూ "కాజ్ అండ్ ఎఫెక్ట్" -   

నాకిలా ఉంటే అది చేసేవాణ్ణి. అలా ఉంటే ఇది చేసేవాణ్ణి .. వంటి కారణాలు ఉట్టి మూర్ఖత్వం. సాకు, సోది.

ఈ ప్రపంచంలో అన్నీ అనుకూలంగా, అనుకున్నట్టుగా ఉండే రోజు ఎవ్వరికీ ఎన్నటికీ రాదు. ఈ నిజాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

ఈ అనంత విశ్వం, మన చుట్టూ కనిపిస్తున్న ఈ ప్రకృతి, మన జీవితం, జీవితంలోని సంఘటనలు, మన జయాలు, అపజయాలు, సుఖం, సంతోషం, కష్టాలు,నష్టాలు, వివాదాలు, అనుబంధాలు .. అన్నీ ఒకే ఒక్క సింపుల్ సూత్రంపైన ఆధారపడి నడుస్తున్నాయి.

కాజ్ అండ్ ఎఫెక్ట్!

మిగిందంతా ఉట్టి భ్రమ.

ఈ వాస్తవాన్ని గుర్తించిన నేపథ్యంలో ప్రారంభమయిందే నా ఈ లేటెస్ట్ రొమాంటిక్ హారర్ చిత్రం "స్విమ్మింగ్‌పూల్".

ఎవరో ఏదో చేస్తారని నేను కూర్చున్నా, అన్నీ అనుకూలంగా సమకూరినప్పుడే చేద్దామని అరుణ్ గారు కూర్చున్నా ఏదీ ఇంచ్ కదిలేది కాదు. మాఇద్దరికీ లక్ష్యమే ముఖ్యం కాబట్టి షూటింగ్ మొత్తం చకచకా పూర్తయిపోయింది.

అదీ రికార్డ్ టైమ్‌లో !

హీరో అఖిల్ కార్తీక్, గౌతమ్‌తో పాటు .. మిగిలిన టీమ్ అంతా ఈ సినిమా విషయంలో ఎవరి స్థాయిలో వాళ్లు నాకు బాగా సహకరించారు.

బెస్ట్ విషెస్ టూ ఆల్.

పక్కా సినిమా భాషలో చెప్పాలంటే .. 2015 లో ఒక టీమ్‌గా మనమంతా పిచ్చపిచ్చగా రెచ్చిపోవాలి.

అంతే.