Thursday 31 December 2015

2015 .. ఇప్పుడొక జ్ఞాపకం!

చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా మళ్లీ  ఒక సినిమా తీసి రిలీజ్ చేశాను. అదీ - ఇండియా, యు కె ల్లో.

స్విమ్మింగ్‌పూల్!

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్, శ్రీ శ్రీ ఇంటర్నేషనల్ అధినేత అరుణ్ కుమార్ గారి సంకల్పం, సహకారం నాకు ఈ విషయంలో బాగా తోడ్పడ్డాయి.

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ తేదీని 40 రోజులముందే ప్రకటించాను. మాకున్న పరిమిత రిసోర్సెస్‌తోనే - ఆ తేదీకే - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగానే రిలీజ్ చేశాను. ఇది చిన్న సినిమాల విషయంలో అంత ఈజీ కాదు. ఆమాటకొస్తే, కోట్లు పెట్టి తీసిన  సినిమాలు కూడా ఎన్నో అసలు రిలీజ్‌కు నోచుకోక ఇంకా అలా పడిఉన్నాయి. అది వేరే విషయం.

ఈ అనుభవంతో నా తర్వాతి సినిమా రిలీజ్ డేట్‌ను షూటింగ్ ప్రారంభం రోజే ప్రకటించగల ఆత్మవిశ్వాసం నాలో మరింతగా పెరిగింది.

సినిమా హిట్టా, ఫట్టా అన్నది ఓ పెద్ద సబ్జెక్టు. దాన్ని గురించి ఇక్కడ చర్చించడంలేదు. దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. ఎప్పుడూ ట్రాక్‌మీద లైవ్‌గా లైమ్‌లైట్‌లో ఉండటం అనేది చాలా ముఖ్యం. అది ఈ సినిమాతో నేను సాధించగలిగాను.

కట్ టూ ది అదర్ సైడ్ ఆఫ్ సినిమా - 

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా .. సమస్యలూ, సంఘర్షణ సమాంతరంగా 2015 అంతా వెంటాడాయి. షోబిజినెస్ కాబట్టి అంతా బాగున్నట్టే ఉండాలి. ఉన్నాను. దటీజ్ సినిమా! ఈ విషయంలో కొందరు స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించాను. సినీఫీల్డులో ఎప్పుడూ ఉండే అనిశ్చితి వల్లనే తప్ప ఇది కావాలని చేసింది కాదు అని వారికీ తెలుసు. అయినా - బాధ్యత బాధ్యతే.

జీవితంలో ఏ తప్పైనా చేయొచ్చు కానీ, అప్పు మాత్రం చేయకూడదన్న వాస్తవాన్ని 2015 లో మరింత బాగా అర్థం చేసుకోగలిగాను. కానీ, భారీ సక్సెస్‌లు ఇచ్చిన పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లకే ఇది తప్పలేదు. నేనెంత!

కట్ బ్యాక్ టూ సినిమా - 

స్విమ్మింగ్‌పూల్ సినిమా విషయంలో నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్, హీరో అఖిల్ కార్తీక్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా నాకు బాగా సహకరించారు.

ప్రదీప్‌చంద్రను స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చిన విషయం.

మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్, కామేశ్వర రావు, కె జె దశరథ్, శీను6ఫీట్, ఐశ్వర్య, బ్రాహ్మిణి లతోపాటు హీరోయిన్ ప్రియ వశిష్టను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశాను. రష్యన్ ఇంటర్నేషనల్ మోడల్ కాత్య ఐవజోవాను ఈ చిత్రం ద్వారా ఐటమ్ డాన్సర్‌గా పరిచయం చేశాను.

ఈ సినిమాలో నటించిన మిత్రుడు 'జబర్దస్త్' రచ్చ రవి, ఈ సినిమా రిలీజ్ తర్వాతవరకు కూడా ఇచ్చిన కోపరేషన్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం నా బాధ్యత.

అలాగే, యు ఎస్ లో నా ఆత్మీయ మిత్రుడు సదానందం భరత నా కోసం, ఈ సినిమాకోసం చాలా శ్రమ తీసుకోవడం మరో గొప్ప విశేషం.    

దాదాపు ఒక దశాబ్దం క్రితం నేను కోల్పోయిన క్రియేటివ్ ఫ్రీడమ్‌ను తిరిగి సంపాదించుకొనే క్రమంలో మొన్నటి స్విమ్మింగ్‌పూల్ సినిమా నా ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నాను. 2016 లో ఈ పరంపర ఇక మరింత వేగంగా కంటిన్యూ అవుతుంది.

అయితే - సినిమా ఒక్కటే జీవితం కాదు. సినిమా అవతల కూడా లైఫ్ ఉంది. ఆ లైఫ్ కూడా చాలా ముఖ్యం అన్న వాస్తవం ఎప్పుడూ వాస్తవమే. ఈ వాస్తవాన్ని నేను అశ్రధ్ధ చేయదల్చుకోలేదు. మర్చిపోదల్చుకోలేదు.  

Wednesday 23 December 2015

ఫేస్ లేని ఫేస్‌బుక్ ఫ్రెండ్స్!

జకెర్‌బర్గ్ పెట్టిన లిమిట్ 5000 టచ్ అయ్యాక గానీ తెలియలేదు .. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ ఎంత తక్కువుంటే అంత మంచిదని!

ఏదో .. యాడ్ రిక్వెస్ట్ పెట్టినవాళ్లెందరినీ ఏమాత్రం ఆలోచించకుండా, వారిని డిసప్పాయింట్ చెయ్యలేక, యాడ్ చేసుకున్నాను.

కానీ, చాలా చిత్రమైన ఎక్స్‌పీరియన్స్ అది.

కొన్ని ఫ్రెండ్ రెక్వెస్టులొస్తాయి. సమ్ సుబ్బారావ్ అని పేరుంటుంది. అక్కడ ప్రొఫైల్ ఫోటోలో, కవర్ ఫోటోలో మాత్రం ఏ ప్రభాసో, పవన్ కల్యాణో ఉంటాడు! కొందరి పేర్లు అసలు ఉండటమే చిత్రంగా ఉంటాయి. న్యూటన్, టింగ్ టాంగ్, టఫ్ గై, బులెట్ కిక్ .. ఇలా ఉంటాయి. ప్రొఫైల్ ఫోటోలో ఏ విప్లవకారుడో, ఇంకే అర్థంలేని ఫోటోనో, అసలు ఫేస్ కనిపించని ఫోటోనో ఉంటుంది.

ఇక కొందరు ఆడాళ్లు, అమ్మాయిల విషయం మరీ గమ్మత్తుగా ఉంటుంది. వీరిలో దాదాపు 90% పేర్లు నిజం కావనిపిస్తుంది. హరి హరిణి, సిని హాసిని, సుని సునీత, ఆ పండు, ఈ పండు .. ఇలా ఉంటాయి పేర్లు. ప్రొఫైల్ పిక్చర్లో సమంత, నందిత, రకుల్‌ప్రీత్ ఉంటారు!

తమ ఐడెంటిటీని ఓపెన్‌గా చెప్పుకోలేని ఇలాంటి ఎఫ్ బి ఫ్రెండ్స్ "ఎబౌట్"లో కూడా ఏముండదు. జస్ట్ శూన్యం!

ఎవరో ఏంటో తెలీని ఇలాంటి ఫోర్స్‌డ్ ఎడాలిసెంట్స్ అసలు మన ఫేస్‌బుక్‌లో అవసరమంటారా?

5000 టచ్ అయ్యాకగానీ ట్యూబ్‌లైట్ వెలగలేదు .. :) 

Saturday 19 December 2015

ఫాస్టెస్ట్ మూవీ!

అతి త్వరలో నేను ప్రారంభించబోతున్న సినిమా జోనర్‌ని యూత్ ఎంటర్‌టైనర్ లవ్‌స్టోరీగా ఫిక్స్ చేసేశాము.

ఆద్యంతం ప్రేక్షకులకు బోర్ కొట్టించని సన్నివేశాలతో, ముఖ్యంగా యూత్ వాళ్లని వాళ్లు ఐడెంటిఫై చేసుకొనే విధంగా కథ, కథనం ఉంటాయి.

పాటలతోసహా, మొత్తం షూటింగ్‌ను సుమారు 20 రోజుల్లోపే పూర్తి చేయాలనుకుంటున్నాను.

హీరోహీరోయిన్లతోసహా, దాదాపు అంతా కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులతోనే రూపొందిస్తున్న ఈ సినిమాకు సంగీతం ప్రదీప్‌చంద్ర అందిస్తున్నాడు. నా ఆత్మీయమిత్రుడు, ప్రముఖ కెమెరామన్ వీరేంద్రలలిత్ (ముంబై) దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నాడు.

మొన్నటి సెప్టెంబర్ 11 కు రిలీజైన నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్‌ను 40 రోజులముందే ప్రకటించి, అదే డేట్‌కు రిలీజ్ చేయగలిగిన విషయం ఇండస్ట్రీ మిత్రులందరికీ తెలిసిందే.

కట్ చేస్తే -  

ఇప్పుడు నా తాజా సినిమా ఓపెనింగ్ రోజునే, ఆ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఎనౌన్స్ చేయబోతున్నాను. ఈ సినిమాను కేవలం 45 రోజుల్లోనే పూర్తిచేసి రిలీజ్ చేయాలన్నది మా టీమ్ సంకల్పం! 

Selections for New ASSISTANT DIRECTORS

> Laptop n Byke are a must.

> Fluency in English; knowledge n optimum use of Internet and Social Media is most important.

> Writing n reading of Telugu will be an added advantage.

> Passion for films n filmmaking is a must. Basic knowledge on Script Writing will be again an added advantage n preferred.

> Must be in the age group of 18 - 26. Both Female n Male can apply.

> Email your full biodata along with your latest photo, address and mobile number to:
manutimemedia@gmail.com
> Last date to email your applications: 20 Dec 2015.

> Short listed candidates only will be intimated by mail n call for a direct interview.
(PLZ don't send any mails or messages on this after sending in your applications.)

All the best to aspiring candidates!!
Looking forward to work with you in my team very soon ..

కొత్త సింగర్స్‌కు సూపర్ అవకాశం!

అతి త్వరలో ప్రారంభం కానున్న నా రెండు కొత్త చిత్రాల ద్వారా 'కొత్త సింగర్స్' ను పరిచయం చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ చంద్ర.

ఆడిషన్స్ ఎవరికి?:

1. సింగర్స్ (ఫిమేల్)
2. సింగర్స్ (మేల్)

ఈ అవకాశం సుమారు 18-28 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్లకు మాత్రమే.

ఆడిషన్స్ కోసం మీరు ఈమెయిల్ చేయాల్సినవి:
1. మీ పూర్తి బయోడేటా. (అడ్రస్, మొబైల్ నంబర్ తప్పనిసరి)
2. మీ లేటెస్ట్ ఫొటోను బయోడేటా తో పాటు విధిగా పంపించాలి.
3. మీరు అంతకు ముందు పాడిన పాటలు ఏవైనా ఆన్ లైన్ లో ఉంటే ఆ లింక్స్ పంపండి. అలా లేనట్లయితే, కనీసం ఇప్పుడయినా మీరు పాడిన ఒక రెండు "ది బెస్ట్" పాటలను సౌండ్ క్లౌడ్ లోకి అప్ లోడ్ చేసి, ఆ లింక్ ను మాత్రం మాకు పంపించండి.
4. మీ బయోడేటా ను పరిశీలించి, మీ పాటలు విన్న తర్వాత, మా మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి, నేను నా టీమ్ మీలో కొందరిని ఫైనల్ ఆడిషన్ కోసం షార్ట్ లిస్టు చేస్తాము.
5. షార్ట్ లిస్టు చేసిన కొత్త సింగర్స్ అందరికీ ఆడిషన్ ఏ రోజు, ఎన్ని గంటలకు, ఎక్కడ మొదలైన అన్ని వివరాలు ఇమెయిల్, మొబైల్ ద్వారా తెలుపుతాము.
6. మీరు ఇమెయిల్ పంపించాల్సిన అడ్రస్: manutimemedia@gmail.com
7. చివరి తేది: 20.12.2015. ఈ తేదీ ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడి గించలేము.
8. ఒక సారి మీరు మాకు ఇమెయిల్ పంపించిన తర్వాత - షార్ట్ లిస్టు చేసినవాళ్ళకు మాత్రమే మా నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇంక దీని గురించి ఎలాంటి మెయిల్స్, మెసేజ్ లు మాకు పంపవద్దని సవినయ మనవి.

Best Wishes To All Aspiring New Singers!!
Looking forward to work with you soon ..

Monday 14 December 2015

నా కొత్త సినిమా ఆడిషన్స్!

> నా డైరెక్షన్‌లో, ప్రదీప్‌చంద్ర మ్యూజిక్‌తో .. దాదాపు అంతా కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో అతి త్వరలో ప్రారంభించబోతున్న నా రెండు కొత్త చిత్రాల కోసం ఈ ఆడిషన్స్.
> టైటిల్స్ రిజిస్ట్రేషన్‌లో ఉన్నాయి.
> సినిమా షూటింగ్ ఓపెనింగ్ రోజునే, రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తాను. తప్పకుండా ఆ రిలీజ్ డేట్‌కో, అంతకంటే ఓ వారం ముందో సినిమా తప్పక రిలీజ్ అవుతుంది. (నా లేటెస్ట్ సినిమా Swimming Pool రిలీజ్ డేట్ ను 40 రోజులముందే ప్రకటించి, ఆ డేట్ కే రిలీజ్ చేశాను.)
> ఫిలిం జోనర్స్: 1. యూత్ ఎంటర్‌టైనర్ లవ్ స్టోరీ. 2. కామెడీ హారర్.
> ఆడిషన్స్ పూర్తిగా అన్‌ట్రెడిషనల్/ఆధునిక పధ్ధతిలో జరుగుతాయి. క్రింద చెప్పినవిధంగా అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా ఆడిషన్స్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
> ప్రతి ఒక్క అప్లికేషన్‌ను మా టీమ్ బాగా స్టడీ చేసి, మా స్క్రిప్టులకు అవసరమైన ఆర్టిస్టులను
షార్ట్ లిస్ట్ చేస్తారు.
> అలా షార్ట్ లిస్ట్ చేసినవాళ్లకు వెంటనే ఈమెయిల్, మొబైల్ ద్వారా సమాచారం అందిస్తాము. వీరికి మాత్రమే ఫైనల్ ఆడిషన్ ప్రత్యక్షంగా ఇన్‌కెమెరాలో ఉంటుంది.
> ఇంక ఈ విషయమై ఎలాంటి కమ్యూనికేషన్‌కు తావులేదు. దయచేసి దీని గురించి ఎవరూ ఈమెయిల్స్, ఫేస్‌బుక్ మెసేజ్‌లు మొదలైనవాటితో నన్ను ఇబ్బంది పెట్టవద్దని సవినయ మనవి.
-------------------------------------------------
ఆర్టిస్టులు:
1. హీరోలు (21-28)
2. హీరోయిన్స్ (18-24)
3. హీరో ఫ్రెండ్స్ (21-30)
4. హీరోయిన్ ఫ్రెండ్స్ (18-24)
5. సపోర్టింగ్ ఆర్టిస్టులు (M/F) (25-45)
(చైల్డ్ ఆర్టిస్టులు అవసరం లేదు.)
అభ్యర్థులు ఈమెయిల్ చెయ్యాల్సినవి:
---------------------------------------------
1. పూర్తి బయోడేటా (అడ్రస్, మొబైల్ నంబర్ తప్పనిసరి).
2. మెయిల్‌లో ఎటాచ్ చెయ్యాల్సిన ఫోటోలు: (1) ఒక క్లోజప్ ఫోటో (2) ఒక ప్రొఫైల్ ఫోటో (3) ఒక ఫుల్ ఫోటో. (సాధ్యమైనంతవరకు ఫోటోలు మోడర్న్ గెటప్స్‌లోనే ఉంటే మంచిది.)
3. మీరిప్పటికే ఏవైనా షార్ట్ ఫిలింస్‌లో నటించి ఉన్నా, లేదంటే మీ వీడియో క్లిప్‌లు ఏవైనా ఆన్‌లైన్‌లో ఉన్నా .. వాటి యూట్యూబ్ లింకులను కూడా మాకు పంపించాలి.
4. యూట్యూబ్‌లో లేనివాళ్లు, సింపుల్‌గా మీ మొబైల్లోనే చిన్న చిన్న సెల్ఫీ వీడియో బిట్స్ (మిడ్ రేంజ్ & ఫుల్ రేంజ్) లు ఒకటి రెండు మాత్రం తీసి, మీ యూట్యూబ్ ఎకౌంట్‌లోకి అప్‌లోడ్ చేయండి. ఆ లింకులను మాత్రం మాకు పంపించండి.
5. మీ ఈమెయిల్స్ మాకు చేరాల్సిన చివరి తేదీ: "20 డిసెంబర్ 2015." ఈ లాస్ట్ డేట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించలేము.
6. మీరు పంపించాల్సిన ఈమెయిల్ అడ్రెస్: manutimemedia@gmail.com
MOST IMPORTANT:
-------------------------------
> మెయిల్ పంపించిన తర్వాత, "ప్లీజ్ ఒక్క చాన్స్ ఇవ్వండి! .. మేము సెలెక్టు అయ్యామా లేదా? .. షార్ట్ లిస్ట్ చేసినవాళ్లకు ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడ?" వంటి రిక్వెస్టులు, ఎంక్వైరీలతో దయచేసి ఎలాంటి మెయిల్స్/మెసేజ్‌లు పంపించవద్దని మరొక్కసారి సవినయ మనవి.
> షార్ట్ లిస్ట్ చేసినవాళ్లకు మా నుంచి తప్పనిసరిగా ఈమెయిల్, కాల్ వస్తాయి. ఫైనల్, ఇన్‌కెమెరా డైరెక్ట్ ఆడిషన్స్‌కు సంబంధించిన అన్ని వివరాలూ వాళ్లకు తెలుపుతాము.

All The Best Dear Aspiring Artists!
Looking forward to work with you soon .. :) (y)

Saturday 12 December 2015

తెలుగు ఇండస్ట్రీ, 2 స్కూళ్లు!

ఓ గుప్పెడు టాప్‌స్టార్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు .. వారి కుటుంబాలు, వారసులు. ఇదొక స్కూలు. ఈ స్ఖూల్లో ఎవరికి వాళ్లకే ఫిక్స్‌డ్‌గా లాబీలుంటాయి. ఆ లాబీలు దాటుకొని ఓ కొత్త డైరెక్టర్ ఈ స్కూళ్లోకి ప్రవేశించడం చాలా అరుదు. అసాధ్యం. ఈ స్కూల్‌తో సంబంధం లేకుండా బయట ఏదయినా పెద్ద హిట్ ఇచ్చినప్పుడే ఇక్కడ కొత్తవాళ్లకు ఎంట్రీ సాధ్యమౌతుంది.

ఇది పక్కా ట్రెడిషనల్ స్కూల్.

రెండో స్కూల్ పూర్తిగా ఇండిపెండెంట్ స్కూల్. ఆర్‌జివి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు ఈ కేటగిరీలోకొస్తారు. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాకుండా, అనుకున్నట్టుగా సినిమా తీస్తూ వీళ్లకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు.

ఇది పూర్తిగా ఒక అన్‌ట్రెడిషనల్ స్కూల్.

వీళ్లు క్రియేట్ చేసుకున్న బ్రాండ్‌ని బట్టి వీళ్లకు అప్పుడప్పుడూ ట్రెడిషనల్ స్కూల్లోని హీరోలు, నిర్మాతలతో సినిమాలు తీసే అవకాశముంటుంది.

కట్ టూ నా స్కూల్ -

హీరోలకోసం ప్రత్యేకంగా రాసుకొన్న బౌండెడ్ స్క్రిప్టులు చంకలో పెట్టుకొని, ఎలాంటి గ్యారంటీలేని ఈ ట్రెడిషనల్ స్కూళ్ల చుట్టూ ఏళ్లతరబడి తిరగడం నాకు కుదరని పని. ఎందుకంటే సినిమానే నా జీవితం కాదు. దాన్ని మించిన జీవితం బయట ఎంతో ఉంది.

సినిమాలపట్ల అమితమైన ప్యాషన్ ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలను నేనే క్రియేట్ చేసుకుంటాను. వారికోసం నా అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలా అన్నీ కుదిరినప్పుడే సినిమా తీస్తాను.

తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ షూటింగ్ డేస్‌లో సినిమా తీసి క్లిక్ కావడమే నాకిష్టం. చెప్పాలంటే - కొంచెం అంట్రెడిషనల్, కొంచెం అగ్రెసివ్ కూడా.

ఇదే నా స్కూల్ ..   

Friday 11 December 2015

9 మినిట్ బ్లాగింగ్!

ఇకనుంచీ నా బ్లాగ్‌పోస్టుల్లో అనవసరపు "ఇంట్రో"లుండవు. "కట్ టూ"లుండవు. ఉంటే గింటే ఒకే ఒక "కట్ టూ" ఉంటుంది. దాంతర్వాత ఒకే ఒక్క వాక్యంలో బ్లాగ్ పోస్ట్ ముగుస్తుంది. అంటే - ఓ రకంగా - అది "కట్ టూ ఫినిషింగ్" అన్నమాట!

అరుదుగా ఎప్పుడో ఒకసారి భారీ సైజులో నేనేదైనా బ్లాగ్ పోస్ట్ రాయొచ్చుగానీ, ఇకనుంచీ నా బ్లాగ్ పోస్టులన్నీ సుమారు 10-12 లైన్లలోనే  "టిడ్‌బిట్స్" సైజులో ఉంటాయి.

మినీ బ్లాగ్ పోస్టులన్నమాట!

నేను సినిమాల్లో ఉన్నంతకాలం, "నగ్నచిత్రం"లో పోస్టులన్నీ దాదాపు సినిమాలకు, క్రియేటివిటీకి సంబంధించినవే అయ్యుంటాయి.

ఈ 9 మినిట్ బ్లాగింగ్ గురించి అప్పట్లో అనుకున్నానుగానీ, కొనసాగించలేకపోయాను. కానీ, ఇప్పుడు నేనే దీన్ని తప్పనిసరి చేసుకుంటున్నాను.

ఏదో ఒకటి రాసే నాకత్యంత ప్రియమైన హాబీని నేనే కిల్ చేసుకోదల్చుకోలేదు.

రాయడం అనేది ఒక ఎడిక్షన్ నాకు. ఒక రిలాక్స్. ఒక రిలీఫ్. ఒక మెడిటేషన్. ఒక ఆనందం.

సో, బ్యాక్ టూ మై 9 మినిట్ బ్లాగింగ్ ..  

Saturday 21 November 2015

2017 లో ఫేస్‌బుక్ కొలాప్స్ కానుందా?

ప్రముఖ రచయిత్రి శోభా డే ట్వీట్ ద్వారా ఇందాకే తెలిసింది నాకు, మన పక్కనే ఉన్న ఢాకా లో కూడా ఫేస్‌బుక్ లేదని!

అయినా వాళ్లు బ్రతగ్గలుగుతున్నారని!!  

ఒక్క బంగ్లాదేశ్ ఏంటి.. ఆ మాటకొస్తే - చైనా, మారిషస్, ఇరాన్, నార్త్ కొరియా, సిరియా, ఈజిప్ట్, క్యూబా లాంటి ఇంకో 10 దేశాల్లో కూడా ఫేస్‌బుక్ కు ఎంట్రీ దొరకలేదు. అది వేరే విషయం.

అయితే - అంతకుముందున్న ఎన్నో హేమాహేమీల్లాంటి సోషల్ మీడియా సైట్స్‌ను కనుమరుగయ్యేలా చేసి, ఒక వైరస్‌లా ప్రపంచమంతా విస్తరించిన ఈ ఫేస్‌బుక్ కూడా 2017 లో కనుమరుగు కానుందని ఒక లేటెస్ట్ అంచనా.

నమ్మశక్యం కాదుగానీ, 2017 లో కనీసం ఒక 80% యూజర్స్‌ను కోల్పోనుంది ఫేస్‌బుక్!  

నల్లమోతు శ్రీధర్ అనుకుంటాను .. ఫేస్‌బుక్ మీద ఆమధ్య ఒక అద్భుతమైన ఆర్టికిల్ రాశారు. అది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ, దాని సారాంశం ఇది: ప్రపంచాన్నంతా కలిపేస్తున్న ఈ ఫేస్‌బుక్, మరోవైపు  కుటుంబాల విఛ్ఛిన్నానికి కారణమౌతోందని.

ఎంత నిజం!

ఇంట్లో ఉండే నలుగురూ నాలుగు చోట్ల కూర్చుని ఎవరికివారు ఫేస్‌బుక్‌లో ఇంకెవరితోనో చాట్ చేస్తుంటారు. ఏదేదో పోస్ట్ చేస్తుంటారు. లేదా ఇంకేదో చూస్తుంటారు. లేదా ఇంకేదో చదువుతుంటారు.

ఫేస్‌బుక్ లేకపోతే లైఫే లేదు అన్నట్టుగా అయిపోయింది చివరికి.

కుటుంబ సభ్యులే అలా అపరిచితులయిపోతున్నారు!

కట్ టూ జరగబోయే రియాలిటీ -  

మరోవైపు - ప్రొఫెషనల్‌గా కానీ, వ్యాపారపరంగా కానీ, రాజకీయ ప్రచారాలకు గానీ సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ చెప్పలేనంతగా ఉపయోగపడింది. ఇంకా ఆ పవర్, ఆ హవా కొనసాగుతోంది.

ఈ మూడు విషయాల్లో తప్ప - ఇకమీదట ఫేస్‌బుక్ ఉపయోగం పూర్తిగా తగ్గిపోనుంది. ఆల్రెడీ ఆ ట్రెండ్ ప్రారంభమైందని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.

నాకూ నిజమే అనిపిస్తోంది.

నేను ప్రస్తుతం సినిమాల్లో ఉన్నాను కాబట్టి,  నా ప్రొఫెషనల్ అవసరాల కోసం ఫేస్‌బుక్ మీద మొన్నటివరకూ రోజుకు ఒక అరగంటో గంటో స్పెండ్ చేశాను. కానీ, ఇప్పుడు నాకు కూడా ఫేస్‌బుక్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం లేదు.

ఫేస్‌బుక్‌తో నా అవసరం ప్రొఫెషనల్ కోణంలోనే అయినప్పటికీ!

సింపుల్‌గా ట్విట్టర్‌లో ఒకే ఒక్క నిమిషంలో ఒక ట్వీట్ పెట్టేసి ఊరుకుంటున్నాను. నా ట్విట్టర్‌ను ఫేస్‌బుక్ కి కనెక్ట్ చేసాను. ఆటోమాటిగ్గా అది ఫేస్‌బుక్ లోనూ కనిపిస్తోంది. ఇంకేం కావాలి?

యూత్ కూడా ఇంతకుముందులా ఫేస్‌బుక్ వాడ్డం లేదు. చాలా తగ్గిపోయింది. వాళ్లకు మొబైల్లోనూ, బయటా ఫేస్‌బుక్ ను మించినవి ఇంకెన్నో ఉన్నాయి.

ట్విట్టర్‌ను అలా పక్కన పెడితే - ఫేస్‌బుక్‌ని మించి ఇప్పుడు ఎక్కువగా వాట్సాప్‌ను వాడుతున్నారందరూ. కొత్తగా ఇంకెన్నో రావొచ్చు. లేదా, పడిపోతున్న ఫేస్‌బుక్ ట్రెండ్స్‌ను చూసి, మార్క్ జకెర్‌బర్గ్ కొత్తగా ఇంకేదో మార్కెట్లోకి తేవొచ్చు. అలాంటి లక్షణాలున్నది ఇంకేదో ఇప్పటికే మార్కెట్లో ఉన్నట్టైతే, దాన్నే జకెర్‌బర్గ్ కొనేసి ఇంకా డెవలప్ చెయ్యొచ్చు.

ఏదైనా సాధ్యమే.

కానీ, ఫేస్‌బుక్ మాత్రం 2017 నుంచి అత్యంత వేగంగా కనుమరుగు కానుందని స్టడీస్ చెబుతున్నాయి. నాకూ నిజమే అనిపిస్తోంది.

ఈలోగానే .. ఎవరైనా, ఏ పాజిటివ్ యాంగిల్లోనైనా .. దాన్ని వాడుకున్నంత వాడుకోవచ్చు. 

Wednesday 11 November 2015

నా బ్లాగింగ్ ఎందుకు స్లో అయ్యింది?

ఏదో కొంచెం స్లో అవుతుందనుకున్నాను కానీ, మరీ ఇంతలా నెలకు కేవలం ఓ 5, 6 పోస్టుల స్థాయికి పడిపోతుందనుకోలేదు!

నా కొత్త సినిమాల ప్లానింగ్, మీటింగ్స్, అగ్రిమెంట్లు, కమిట్‌మెంట్లు వంటి అన్నో అతిముఖ్యమైన పనుల్లో పూర్తిగా మునిగిపోయి పిచ్చి బిజీగా ఉంది లైఫ్.

కట్ టూ నాణేనికి మరోవైపు - 

పైన చెప్పిన బిజీ షెడ్యూల్ కారణంగానే నిజంగా ఏమీ రాయలేకపోతున్నానా? నాకెంతో ఇష్టమైన ఒక హాబీని, థెరపీని నిర్లక్ష్యం చేస్తున్నానా?

దీన్ని కేవలం ఒక 10 శాతం కారణంగానే నేను ఒప్పుకుంటాను.

ఎన్ని వ్యక్తిగతమైన, ఆర్థిక, వృత్తిపరమైన వత్తిళ్లు ఉన్నా - ఒక మెడిటేషన్ ప్రక్రియలా కనీసం ఓ పది నిమిషాలు ఏదో ఒకటి రాయగల శక్తి, ఓపిక, ఇష్టం నాకున్నాయి.

అయినా ఆ పని చేయటంలేదు, చేయలేకపోతున్నాను అంటే ఇంకేదో కారణం ఉండాలి.

ఉంది.  

2016 చివరివరకు, ఎన్ని వీలైతే అన్ని ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను. వచ్చే 365 రోజులూ చాలా చాలా బిజీగా ఉండేట్టు చూసుకుంటున్నాను.

ఈ స్టేజ్‌లో ఇప్పుడిది చాలా అవసరం నాకు.

నాకున్న అతికొద్దిమంది ఆత్మీయ మిత్రులలో ఒకరిద్దరితో నాకున్న ఒకటిరెండు కమిట్‌మెంట్‌లు, నా కుటుంబం, నా బాధ్యతలు, నా వ్యక్తిగత క్రియేటివ్ ఫ్రీడమ్ - ఇప్పుడు ప్రతి క్షణం నా ఫోకస్ అంతా ఇదే.

వీటి మీదే.

ఇదే ఆర్డర్‌లో.

ఈ ఫోకస్‌ను పక్కనపెట్టి ఒక పది నిమిషాలు బ్లాగ్ రాసినా, దానికొక ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం నా ఫోకస్‌తో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఈ మధ్య నేను బ్లాగ్ రాయడం చాలా స్లో అయ్యింది.

నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో చాలా కొటేషన్లు, పోస్ట్‌లు నాకోసం నేను పోస్ట్ చేసుకున్నట్తే .. ఈ బ్లాగ్ పోస్ట్ కూడా నాకోసం నేను రాసుకున్నది.

ఇది సంజాయిషీ కాదు. స్వీయ అంతరంగ విశ్లేషణ.  

Thursday 29 October 2015

ఆడిషన్స్ క్లారిటీ! చివరిసారిగా ..

ఒక మైక్రో బడ్జెట్ సినిమా అంటే దానికి 101 లిమిట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ ఖర్చులపరంగా, క్రియేటివిటీపరంగా కూడా.

భారీ మనీ వగైరా అన్నీ టైమ్‌కు సమకూర్చుకోవడం అన్న భారీ టెన్షన్‌ల గురించి అసలింక చెప్పలేం.

అదో మాయ.

ఇలాంటి చిన్న సినిమాల జోనర్ ఏదయినా కావచ్చు - ప్రేమకథ, యూత్ ఎంటర్‌టైనర్, కామెడీ, హారర్ .. ఏదైనా కానీండి. ఒక సినిమాలో హీరో హీరోయిన్లు, ఇతర ప్రధానపాత్రలు అన్నీ కలిపి కేవలం ఒక 10-12 కు మించి ఉండే అవకాశం లేదు. కొన్ని సీన్లలో ఇంకో రెండో మూడో చిన్నా చితకా కేరెక్టర్స్ కూడా ఉండే అవకాశముంటుంది.

అంటే - ఈ సినిమాలో మొత్తం కలిపి ఒక 15 కేరెక్టర్లను మించి ఉండే అవకాశం లేదు. ఉండదు.

ఈ 15 కేరెక్టర్లలో కనీసం 50% కొద్దిగా తెలిసిన ఫేస్ లున్న అప్‌కమింగ్ ఆర్టిస్టులను, మిగిలిన 50% పూర్తిగా కొత్తవాళ్లను తీసుకోనే ప్రయత్నం చేస్తాము. మార్కెట్ అవసరాల దృష్ట్యా ఇది మాకు తప్పనిసరి.

ఈ లెక్కన - కేవలం ఒక 6 లేదా 7 కేరక్టర్లకోసం మాత్రమే ఆడిషన్స్ ఉంటాయి. ఇది మీరంతా గమనించి అర్థం చేసుకోవాల్సిన వాస్తవం.

కట్ టూ అసలు పాయింట్ - 

"నాకు చాన్స్ ఇవ్వండి," "ఇంకా ఆడిషన్స్ ఎప్పుడు", "నాకు చాలా కష్టాలున్నాయి మీరెలాగయినా చాన్సివ్వాలి" .. వంటి నానా రకాల మెసేజ్‌లు నా ఫేస్‌బుక్ లో రోజుకి కనీసం 100 కి పైగా వస్తున్నాయి. ఇలా పెట్టవద్దని నేను ఇంతకుముందు ఎన్నిసార్లు విన్నవించినా ఇదే జరుగుతోంది.

అసలు తప్పంతా నాదేనని అర్థమయ్యిందిప్పుడు. "కొత్తవాళ్లను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము..ఆడిషన్స్ ఉంటాయి" అని ఒక్కసారి చెప్పడం పొరపాటయిపోయింది.

సినిమా చిన్నది కావొచ్చు. పెద్దది కావొచ్చు. అందులో ఒక చిన్న పాత్ర వేయడానికయినా "చాన్స్ దొరకడం" అన్నది మాత్రం అంత చిన్న విషయం కాదు. పైన చెప్పిన ఎన్నో తలనొప్పులు, టెన్షన్స్ మాకుంటాయి. ఔత్సాహికులకు ఎంతో కాంపిటిషన్ ఉంటుంది.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే - ఇక మీరు ఆడిషన్స్ విషయం పూర్తిగా మర్చిపోండి. దానికి సంబంధించి ఎలాంటి మెసేజ్‌లు నాకు పెట్టకండి. దీనికి సంబంధించి నేను స్వయంగా ఏదయినా యాడ్ పోస్ట్ చేసినప్పుడే ఆడిషన్స్ ఉన్నట్టు లెక్క. అప్పుడు ఆ యాడ్ ను ఫాలో కండి. అన్ని వివరాలూ అందులోనే ఉంటాయి.

కట్ టూ మరో ముఖ్యమైన పాయింట్ - 

నాకు మెసేజ్ లు పెట్టినంత మాత్రాన మీరు సెలెక్ట్ అవరు. స్క్రిప్ట్ లో ఉన్న పాత్రకు మీరు బాగా సరిపోవాలి. ఆ రేంజ్ టాలెంట్ మీలో ఉండాలి.

అంతే.

మిగిలిన ఏ విషయాలూ కౌంట్ కావు. ఇదే వాస్తవం.

సో, ఇంక మెసేజ్ లు పెట్టడం పూర్తిగా మర్చిపోండి. దీనివల్ల ముఖ్యమైన నా మెసేజ్‌లెన్నిటినో నేను మిస్ అయిపోతున్నాను. చాలా సమయం వృధా అయిపోతోంది.

అయినా అలాగే పంపిస్తే, నాకున్నది ఒక్కటే దారి.

జస్ట్ అన్‌ఫ్రెండ్ చెయ్యడం! 

Thursday 22 October 2015

కొత్త సినిమా గురూ!

చాలా ఏళ్ల క్రితం నేనో ఇంటర్వ్యూ చదివాను. అది తమ్మారెడ్డి భరద్వాజ గారిది. ఆ ఇంటర్వ్యూలో నేను చదివిన ఒక ఆసక్తికరమైన విషయం నాకిప్పటికీ గుర్తుంది.

"తెల్లవారితే సినిమా ఓపెనింగ్. జేబులో వంద కాగితం మాత్రమే ఉంది!"

నమ్ముతారా?

నమ్మితీరాలి.

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా భరద్వాజ గారు సుమారు 30 సినిమాలు తీశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సార్లు ఎన్నో పదవుల్ని చేపట్టారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటారు.

ఇంతకూ ఏమయింది? తెల్లవారిందా మరి??

తెల్లవారింది. అన్నీ వాటంతటవే సమకూరాయి. ఆ సినిమా ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది.

సినిమా పేరు నాకు గుర్తులేదు. బహుశా అది హిట్ కూడా అయ్యే ఉంటుంది.

మరో ఇంటర్వ్యూలో సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.

మొన్నీమధ్యే లేటెస్టుగా దీన్ని కోట్ చేసినప్పుడు .. నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, కాబోయే డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అని.

ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే - "సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.

భరద్వాజ గారి సంకల్పమే ఆరోజు వారి సినిమా ఓపెనింగ్ సాఫీగా జరిగేట్టు చేసిందన్నది నా వ్యక్తిగత నమ్మకం.

సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా .. అది చిన్న పనైనా, పెద్ద పనైనా .. సంకల్పం అనేది చాలా ముఖ్యం.

కట్ టూ నా కొత్త సినిమా - 

> నా తర్వాతి సినిమా పూర్తిగా కొత్తవాళ్లు/అప్‌కమింగ్ ఆర్టిస్టులతోనే తీస్తున్నాను.
> ఆడిషన్లు త్వరలోనే ఉంటాయి. ఆ వివరాలు నా టైమ్‌లైన్ మీద పోస్ట్ చేస్తాను. ఇతర ఎఫ్ బి గ్రూపుల్లో, ఫిలిం మేగజైన్స్‌లో కూడా దీనికి సంబంధించిన యాడ్ వస్తుంది.
> ఔత్సాహికులు ఆ యాడ్ ను ఫాలో కండి. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడ, నాకు చాన్స్ ఇవ్వండీ అంటూ ప్రతిరోజూ దయచేసి నాకు ఎలాంటి మెసేజ్‌లు పెట్టొద్దని మనవి.
> చీఫ్ టెక్నీషియన్లు చాలావరకు మొన్నటి నా "స్విమ్మింగ్‌పూల్" సినిమాకు పనిచేసినవాళ్లే ఉంటారు.
> నవంబర్ చివరివారంలో గోవా IFFI లో కనీసం ఓ నాలుగురోజులయినా ఎంజాయ్ చేసొచ్చాక - డిసెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ ఉంటుంది.
> బ్యానర్ రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాక, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో మళ్ళీకలుస్తాను. అప్పటిదాకా ట్విట్టర్‌లో మీతో టచ్‌లో ఉంటాను. నా ట్వీట్స్ ఫేస్‌బుక్‌లో కూడా ఆటొమాటిగ్గా మీకు కనిపిస్తాయి.

కట్ టూ సంకల్పం - 

అప్పుడప్పుడూ ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా - నేనిప్పటివరకూ ఓ నాలుగు సినిమాలు చేశాను. ఇకనుంచి మాత్రం రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను. ఈ దిశలోనే ఇకమీదట అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోతుంటాయి.

నా ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఒక్కటే. లేటెస్ట్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయొచ్చు. ఊహించనంత వేగంగా కూడా సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయొచ్చు.

ఇంతకుముందే ఒకసారి చెప్పినట్టుగా -  కనీసం ఓ రెండేళ్లపాటు ఇక సినిమాలే నా ప్రధాన ప్యాషన్, వృత్తి, వ్యాపకం, హాబీ, అవసరం .. అన్నీ కూడా.  

Saturday 17 October 2015

కొన్నాళ్లు కామా!

> నా కొత్త సినిమా ప్లానింగ్, ఏర్పాట్లు, అగ్రిమెంట్లు, ఎనౌన్స్‌మెంట్ వంటి ముఖ్యమైన పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఈ మధ్య అసలు టైమ్ దొరకటం లేదు. టైమ్ ఉన్నప్పుడు ఏమీ రాయలేకపోతున్నాను.

> నిజానికి, ఈ రెంటికీ నేను కెటాయించే సమయం రోజంతా కలిపి ఒక 45 నిమిషాలకంటే ఉండదు. అయినా ఫ్రీ మైండ్‌తో వీటికోసం కూర్చోలేకపోతున్నాను.

> సో, కొన్నాళ్లపాటు నాకెంతో ప్రియమైన ఈ రెండు హాబీలకు కామా పెడుతున్నాను.

> బట్ .. నో ప్రాబ్లమ్. నేను నా ఎఫ్ బి మిత్రులతో ట్విట్టర్ ద్వారా టచ్‌లోనే ఉంటాను. అలా వెళ్తూ కూడా మొబైల్ లో ట్వీట్ చేయడం ఈజీ కాబట్టి.

> నా ట్వీట్స్ అన్నీ ఆటొమాటిక్‌గా ఫేస్‌బుక్ లో కనిపిస్తాయి. ఎప్పుడయినా అవసరం అనుకున్నపుడు మాత్రమే ఏదో ఓ కామెంట్ కోసం ఎఫ్ బి లోకి నేను తొంగిచూస్తుంటాను. గత కొద్ది రోజులనుంచి నేను అదే చేస్తున్నాను.

> కనీసం ఓ రెండేళ్లపాటు ఇక సినిమాలే నా ప్రధాన ప్యాషన్, వృత్తి, వ్యాపకం, హాబీ, అవసరం .. అన్నీ కూడా. 

> హలో, హాయ్, టిఫిన్ చేసారా, ఆడిషన్స్, అవకాశం .. అంటూ దయచేసి ఎఫ్ బి లో మెసేజ్‌లు పెట్టవద్దని మరోసారి రిక్వెస్ట్. ఇలా వచ్చే వందలాది మెసేజ్‌ల వల్ల నేను చూసుకోవాల్సిన అతి ముఖ్యమైన కొన్ని మెసేజ్‌లు మిస్ అవుతున్నాను.

> ఆడిషన్స్ కోసం స్పెషల్‌గా పోస్ట్ చేస్తాను. ఎప్పుడు, ఎక్కడ, ఏంటి, ఎలా .. అవన్నీ అప్పుడే డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. థాంక్ యూ.

Tuesday 6 October 2015

కొత్త సినిమా ఎప్పుడు?

> రాబోయే విజయ దశమికి నా తర్వాతి సినిమా ఎనౌన్స్ చెయ్యబోతున్నాను.

> నవంబర్ చివరి వారం నుంచి ఏకధాటిగా 20 రోజుల షూటింగ్ ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ షరా మామూలే.

> అక్టోబర్ చివరివారంలో కేవలం కొత్తవారికోసం ఆడిషన్స్/సెలెక్షన్స్ ఉండే అవకాశముంది ..
ఈ కేటగిరీల్లో: 1. ఆర్టిస్టులు, 2. సింగర్స్, 3. అసిస్టెంట్ డైరెక్టర్స్, 4. స్క్రిప్ట్ రైటర్స్.

> ఆడిషన్స్/సెలెక్షన్స్ కోసం నా ఫేస్‌బుక్ లో, ప్లస్, ఇంకా చాలా చోట్ల, అన్ని వివరాలతో ప్రకటన ఇస్తాను. అప్పటిదాకా దయచేసి దీని గురించి ఏ ప్రశ్నలూ సమాధానాలూ వద్దని మనవి.

> నా ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్ కు పదే పదే మెసేజ్ లు పెడుతున్నారు. దీనివల్ల నాకు చాలా ముఖ్యమైన మెసేజ్ లను చూసుకోవడం కష్టమౌతోంది. కొన్ని ముఖ్యమైనవి మిస్ అవుతున్నాను కూడా. అర్థం చేసుకుని - ఇకనుంచి నన్ను ఇబ్బంది పెట్టరని ఆశిస్తున్నాను. అయినా అలాగే చేస్తే, నాకు మరో దారి లేదు. "అన్‌ఫ్రెండ్" చేయడం తప్ప.    

> నాకు అవసరమైన ఇతర కొత్త టెక్నీషియన్స్ గురించి కూడా విడిగా ఎప్పటికప్పుడు పోస్టులు/ట్వీట్లు పెడుతుంటాను.

> కొత్త సినిమా స్టార్ట్ అయ్యాకే మళ్లీ నా ఎఫ్ బి యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ట్వీట్స్ మాత్రం ఉంటాయి. నా ట్వీట్స్ అన్నీ ఆటొమాటిక్ గా ఫేస్‌బుక్ లో కూడా కనిపిస్తాయి.

థాంక్ యూ ఆల్..  

Sunday 4 October 2015

చివరాఖరికి స్పిరిచువాలిటీ!

నిన్న సాయంత్రం ఓ 20 నిమిషాలపాటు ప్రముఖ రచయిత, కవి .. కొనకంచి గారితో ఫోన్లో మాట్లాడాను.

హిపోక్రసీ లేని ఆయన "ఎ కె 47 టైప్" రైటింగన్నా, టాకింగన్నా నాకిష్టం.

నిన్న మా ఫోన్ టాక్ సబ్జెక్ట్: స్పిరిచువాలిటీ!  

1926 లో చలం "మైదానం" రాశాడు. నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2015 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

అలాంటి చలం .. ఆరోజుల్లోనే .. ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పటి మన హిపోక్రసీ నేపథ్య సమాజంలో కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.

ఇలాంటి ఉదాహరణలు కనీసం ఒక వంద ఇవ్వగలను నేను.

లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొష్చన్!  

దానికి కొనకంచి గారిచ్చిన సమాధానం నాకు బాగా నచ్చింది. అదేంటన్నది ఇక్కడ బ్లాగ్ లో రాయడం కొంచెం కష్టం.

అయితే, కొనకంచి గారు ఈ మధ్యే, ఇదే టాపిక్ పైన తన ఫేస్‌బుక్ లో ఏదో పోస్ట్ చేశారట. వీలయితే చూడండి. నేనూ చూస్తాను. షేర్ చేస్తాను.

కట్ టూ 1001 ఉదాహరణ -

ఇప్పటిదాకా అనుకున్న ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.

ఈ లెక్కన నేనిందాక న్నట్టు 100 ఉదాహరణలు కాదు. 1000 ఉదాహరణలు కూడా ఇవ్వగలను. వెయ్యిన్నొక్క ఉదాహరణ కూడా నాదగ్గర రెడీగా ఉంది.

అది ఎవరని మాత్రం ఇప్పుడే నన్నడక్కండి ప్లీజ్ ..

Sunday 27 September 2015

ఆడిషన్స్ అక్టోబర్‌లో!

కొత్త హీరోహీరోయిన్‌లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, సింగర్స్ కోసం ఆడిషన్స్ వచ్చే నెలలో ఉంటాయి.

ఈ ఆడిషన్స్ నేను ప్రారంభించబోతున్న తాజా ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రం కోసం.

ఈ ఆడిషన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ప్రకటనను నా ఫేస్‌బుక్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయటంతోపాటు, కొన్ని వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్ లో కూడా త్వరలోనే ఇస్తున్నాను.

ఆర్టిస్టులు, సింగర్స్ సెలెక్షన్స్ హైద్రాబాద్‌తో పాటు - వైజాగ్, గుంటూరు లలో కూడా ఉండే అవకాశముంది.

"కొత్త లిరిక్ రైటర్స్‌ను పరిచయం చెయ్యరా?" అని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నా తర్వాతి చిత్రంకోసం లిరిక్ రైటర్స్ ఎన్నిక దాదాపు జరిగిపోయింది. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ఇప్పుడేమీ చెప్పలేను. కాని, అవసరమనిపిస్తే, అప్పటికప్పుడు లిరిక్ రైటర్స్ కోసం కూడా సెలెక్షన్స్ ఉంటాయి. అయితే - ఈ సెలెక్షన్స్ కొత్త ఆర్టిస్టులు, సింగర్స్ ఆడిషన్స్ తర్వాతే ఉంటాయి.  

ఇవి కాకుండా, టెక్నీషియన్స్ లో - కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్, మొదలైన వాటికోసం ఎప్పటికప్పుడు విడివిడిగా ప్రకటనలు, సెలెక్షన్లు జరుగుతుంటాయి.

ఆడిషన్స్ కు అప్లై చేసుకొనే అభ్యర్థుల్లో - సినిమా పట్ల ప్యాషన్, టాలెంట్ .. ఈ రెండే నాకు ముఖ్యం. వీటి ప్రాతిపదికగానే నాకు అవసరమైన "లైక్‌మైండెడ్ టీమ్" ఎన్నిక జరుగుతుంది.

బెస్ట్ విషెస్ .. 

Friday 25 September 2015

కొత్త స్క్రిప్ట్ రైటర్స్‌కి ఆహ్వానం!

> ఖచ్చితంగా కొత్తవాళ్ళు, అప్‌కమింగ్ రచయితలకు మాత్రమే ఈ అవకాశం.

> సినిమా స్క్రిప్ట్ ఎలా రాస్తారో విధిగా తెలిసి ఉండాలి.

> కథలు చెప్పడం కాదు. పూర్తి స్క్రిప్ట్ రాసి ఉండాలి.

> ముందు స్టోరీలైన్  మాత్రమే చూస్తాను. అది ఒకే అనుకున్నప్పుడే స్క్రిప్ట్ చూస్తాను.

> నేను ఎలాంటి ట్రెండీ కథల గురించి చూస్తున్నానో ఇంతకు ముందు పోస్ట్‌లో పెట్టాను. మళ్లీ చెప్తున్నాను: డెల్లీ బెల్లీ, శుధ్ధ్ దేశీ రొమాన్స్, ప్యార్ కా పంచ్‌నామా, యే జవానీ హై దివానీ, జిందగీ నా మిలేగీ దోబారా .. వంటి ట్రెండీ డైనమిక్ కథలకు ప్రాధాన్యం.

> ప్రతి సీనూ ఎంటర్టైనింగ్‌గా ఉండాలి. టార్గెట్ ఆడియెన్స్ యూత్ అన్నది మర్చిపోవద్దు.

> నేను కేవలం మైక్రో బడ్జెట్ సినిమాలనే తీస్తాను. కొత్తవాళ్లతోనే తీస్తాను. ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

> "ఇంపార్టెంట్":
దయచేసి మీ పూర్తి వివరాలు, మీ స్క్రిప్త్ స్టోరీలైన్, మొబైల్ నంబర్, మీ లేటెస్ట్ ఫోటోతో నాకు ఈమెయిల్ మాత్రమే చెయ్యాలి. నా ఫేస్‌బుక్ కి మెసేజ్‌లు దయచేసి పెట్టొద్దని మనవి. వాటికి రిప్లై ఇవ్వలేను.

> ఈమెయిల్: manutimemedia@gmail.com

ఆల్ ది బెస్ట్!  

Tuesday 22 September 2015

ఒక సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా?

అవును. చేయొచ్చు అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు.

అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే!

అలాగని ఏదో చుట్టచుట్టి అవతపడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు.

స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే!

ఇంకో విశేషం ఏంటంటే - ఈ 15 సినిమాల్లో 2 హిందీ సినిమాలు కూడా ఉన్నాయి!

జ్యోతి బనే జ్వాల, యే కైసా ఇన్సాఫ్.

నిజంగా గురువుగారికి వందనం .. అభివందనం!

ఆయన రికార్డుల గురించి, ఆయన గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

కట్ టూ 2015 - 

ఫిలిం నెగెటివ్ తో సినిమాలు చేసిన ఆ రోజుల్లో - ఎడిటింగ్ నుంచి, ప్రతి ఒక్క శాఖలో పని చాలా ఎక్కువే. ఒక్కొక్క ఫిలిం ముక్క చేత్తో పట్టుకొని చూస్తూ, అతికించాల్సిన రోజులవి. ప్రతి చిన్న ట్రాన్సిషన్స్‌కు కూడా గంటలకి గంటలు, రోజులకి రోజులు మాన్యువల్‌గా పని చేసిన రోజులవి.

అలాంటి రోజుల్లోనే, నెలకో సినిమా చేసి రిలీజ్ చేయగలిగినప్పుడు .. ఇంత అడ్వాన్స్‌డ్ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ఒక్కో సినిమాకు సంవత్సరాలు పడుతుండటం నిజంగా విచారకరం.

గ్రాఫిక్ వర్క్‌లతో తీసే మాగ్నమ్ ఓపస్ ల గురించి నేను మాట్లాడ్డం లేదు. మామూలు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతున్నాను.

అదంతే. దీనికి వంద రీజన్స్ చెప్తారు.

ఈ పాయింటాఫ్ వ్యూలో .. నాకు తెలిసినంతవరకు, ఇప్పటి తెలుగు దర్శకుల్లో టెక్నికల్‌గా మంచి క్వాలిటీతో, వెరైటీ సబ్జెక్ట్స్‌తో, సూపర్ టైటిల్స్‌తో, ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న దర్శకులు ఇద్దరే ఇద్దరు.

పూరి జగన్నాధ్. ఆర్ జి వి.

హిట్లూ, ఫ్లాపులూ అందరికీ ఉంటాయి. టెక్నాలజీతోపాటు మనం ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నామన్నదే ఇక్కడ పాయింట్.   

Monday 21 September 2015

క్రాస్‌రోడ్స్‌లో సినిమా పడితేనే సినిమానా?

"..మన చిన్న సినిమాల దౌర్భాగ్యం ఎమిటంటే మనకింతకంటే మంచి థియేటర్లు రెగ్యులర్ షోస్ కి దొరకవు. అందుకని చిన్న సినిమాలు రెగ్యులర్ షోస్ కాన్సెప్ట్ మానుకోవాలి. మల్టిఫ్లెక్స్ లల్లొ ఒక షొ దొరికినా చాలు, వీలైనన్ని ఎక్కువ మల్టిఫ్లెక్స్ లల్లో విడుదల చేసుకోవడం మంచిది!" -- రామ్‌కుమార్ భరతం

"అసలు క్యూబ్ వాళ్లు ఏం చేస్తున్నట్టు?" అని మొన్న నేను రాసిన ఒక బ్లాగ్ కి కామెంట్ చేస్తూ - ఫిల్మ్ లవర్, ఫిల్మ్ క్రిటిక్ రామ్‌కుమార్ గారు రాసిన కామెంట్‌లోని చివరి ముక్కనే కోట్ చేస్తూ ఇది రాస్తున్నాను.

దాదాపు ఓ రెండువారాల క్రితం అనుకుంటాను. ఇదే పాయింట్ మీద నేనూ, మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ చాలాసేపు మాట్లాడుకున్నాము.

క్రాస్‌రోడ్స్‌లో థియేటర్ దొరకటం లేదు అనో, రెంట్లు కట్టలేమనో బాధపడుతూ చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేయడం వృధా. వీలైనన్ని ఎక్కువ సెలెక్టెడ్ సెంటర్లలోని మల్టిప్లెక్స్‌లలో కేవలం రోజుకి ఒక్క షో చొప్పున ఏర్పాటుచేసుకొని సినిమా రిలీజ్ చేసుకున్నా చాలు అన్నది నా ఉద్దేశ్యం.

ఈ పని చేయడం కోసం ప్రత్యేక దళారులో, తలారులో ఎవ్వరూ అవసరం లేదు. ఎవ్వరి మాయమాటలకో తెలిసీ లొంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ స్వయంగా మల్టిప్లెక్స్‌లను కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు. అంత సింపుల్.

941 సీట్ల పురాతన కాలపు గోడౌన్ థియేటర్లకంటే ఇవి చాలా చాలా బెటర్.

ప్రేక్షకులకు లేటెస్ట్ టెక్నాలజీ సినిమా అనుభూతినివ్వొచ్చు. ఆ తర్వాత, సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. థియేటర్లు అవే పెరుగుతాయి. పైగా, ఇలా చేయడం ద్వారా చిన్న సినిమాల అతి ప్రధాన సమస్య ఒకటి సులభంగా పరిష్కారమవుతుంది.

మార్కెట్‌లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొనేవరకూ ఏ చిన్న సినిమా ప్రొడ్యూసర్‌కయినా, డైరెక్టర్‌కయినా ఈ శ్రమ తప్పదు.

రామ్‌కుమార్ గారి లాంటి సీనియర్‌లు ఇంత మోడర్న్‌గా ఆలోచిస్తోంటే, యూత్ అనుకున్నవాళ్లు మాత్రం ఇంకా పాత కాలపు ఆలోచనలకే అతుక్కుపోయి ఉండటం నిజంగా బాధాకరం.  

Wednesday 16 September 2015

అసలు క్యూబ్ వాళ్లు ఏం చేస్తున్నట్టు?

నా సినిమా థియేటర్లో నడుస్తుండగా ఈ టాపిక్ పైన బ్లాగ్ రాస్తానని అసలు నేను అనుకోలేదు.

కానీ రాయక తప్పడం లేదు.

ఈ సమస్య వల్ల నేరుగా సఫర్ అయినవాణ్ణయి ఉండీ .. నేను దీని గురించి రాయకపోతే .. అంతకంటే ఫూలిష్‌నెస్ ఇంకోటి ఉండదు. అందుకే రాస్తున్నాను.

కనీసం, దీన్ని చదివిన మా సినిమావాళ్లు కొందరయినా ముందు ముందు జాగ్రత్తపడతారనీ, పడాలనీ నా ఉద్దేశ్యం.

డిజిటల్ ఫిలిం మేకింగ్ వచ్చాక, సినిమా థియేటర్లకు ఫిల్మ్ రీళ్ల డబ్బాలు వెళ్లే పాతరాతియుగానికి తెరపడింది. అయినా - మనవాళ్ళు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. ఆ వాసనలు వదళ్లేదు. అప్పటి పధ్ధతిలోనే పని చేస్తున్నారు. లేదా, అప్పటి పధ్ధతిలోనే పని తప్పించుకుంటున్నారు.

కోట్లు కుమ్మరించి సినిమాలు తీసి, తమ సినిమాలను థియేటర్లకు  పంపుతున్న నిర్మాతల, డైరెక్టర్ల, ఆర్టిస్టుల జీవితాలతో ఆడుకుంటున్నారు!

కట్ టూ క్యూబ్ -

డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ పధ్ధతి వచ్చాక, ఇప్పుడు థియేటర్లకు ఫిలిం రీళ్ల డబ్బాలు వెళ్లవు. క్యూబ్, యు ఎఫ్ వో, పి ఎక్స్ డి, స్క్రాబుల్ వంటి డిజిటల్ ఫార్మాట్స్ ద్వారా సినిమా హాల్స్‌లో సినిమాలు ఆడతాయి. వీటిగురించి ఇంతకంటే వివరంగా చెప్పడం అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్న టాపిక్ కు అనవసరం. సో, డైరెక్టుగా పాయింటుకొస్తున్నాను.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఉన్న థియేటర్లలో ఎక్కువ భాగం క్యూబ్, యు ఎఫ్ వో సిస్టమ్‌ల ద్వారానే నడుస్తున్నాయి.

మొన్న మేము రిలీజ్ చేసిన స్విమ్మింగ్‌పూల్ చిత్రం నడుస్తున్న మెయిన్ థియేటర్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో ఉన్న శ్రీ మయూరి. అలాగే - సిటీలో, ఉప్పల్ లో ఉన్న సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ లో కూడా స్విమ్మింగ్‌పూల్ రిలీజయింది. ఈ రెండు థియేటర్లలోనూ ఉపయోగిస్తున్న ప్రొజెక్టర్ సిస్టమ్ ఒక్కటే.

క్యూబ్.

శ్రీ మయూరిలో సినిమా కనీసం ఒక 30% డిమ్‌గా కనిపిస్తుంది. డిటిఎస్ సిస్టమ్ కూడా పరమ చెత్తగా కేవలం ఒక్కవైపే పనిచేస్తోంది. ఇందులో ఎంత కొత్త సినిమా వేసినా - దాన్ని చూస్తున్న ప్రేక్షకులకు "ఇది ఏ కాలం నాటి సినిమారా బాబూ" అనిపిస్తుంది.

మరోవైపు, అదే క్యూబ్ సిస్టమ్ ద్వారా నడుస్తున్న ఉప్పల్ లోని సినీ స్క్వేర్ మల్టిప్లెక్స్ లో మాత్రం - సినిమా ఒక ఆడియోవిజువల్ ట్రీట్ లా అద్భుతంగా ఉంటుంది!

స్విమ్మింగ్‌పూల్ సినిమాను పై రెండు థియేటర్లలో చూసిన తర్వాత - సదరు క్యూబ్ కంపనీ వాళ్లను మా కలరిస్ట్ ఇంజినీర్ రత్నాకర్ రెడ్డి "ఎందుకిలా?" అని కారణం అడిగారు.

అక్కడా ఇక్కడా, రెండుచోట్లా మా ప్రొజెక్టరే పనిచేస్తోంది. ఇంకా చెప్పాలంటే - శ్రీ మయూరిలో ఇంకా మంచి ప్రొజెక్టర్ ఉంది అన్నారు.

"మరెందుకిలా గుడ్డి గుడ్డిగా సినిమా కనిపిస్తోంది?" అన్న మా హంబుల్ కొశ్చన్‌కు క్యూబ్ వాళ్ల సమాధానం విని షాకయ్యాం.

"సినీస్క్వేర్ లో వాళ్లు మేము ఇచ్చిన స్టాండర్డ్ బల్బులు వాడుతున్నారు. వీళ్లు చైనా బల్బులు వాడుతున్నారు!"

ఇదెంతవరకు నిజమోగానీ, ఇదేగాని నిజమయితే, ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు.

ఇలా ఎన్నిచోట్ల జరుగుతోందో?! 

ఇలాంటి ఘోరాలు జరుగుతోంటే - కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతల మండలులు, దర్శకుల సంఘాలు ఏం చేస్తున్నట్టు? అసలు తమ కంపనీ ప్రమాణాలు పాటించనందుకు ఇలాంటి థియేటర్లను క్యూబ్ వాళ్లు ఎందుకని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు?

సినీ ఫీల్డు ఇనుప తెర వెనుక మీకు కనిపించని నగ్నసత్యాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కేవలం ఒకే ఒక్క ఉదాహరణ.

జస్ట్ మీతో షేర్ చేసుకుందామని.

అంతే.  

Sunday 13 September 2015

వాటీజ్ దిస్ #SwimmingPoolChallenge ?

కేవలం 12 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి నిర్మించిన మా స్విమ్మింగ్‌పూల్ చిత్రాన్ని 11 సెప్టెంబర్ 2015 నాడు రిలీజ్ చేస్తామని కనీసం ఒక 40 రోజులముందే ప్రకటించాను.

ఎలాంటి మార్పులేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సుమారు 20 ప్లస్ థియేటర్లలో రిలీజ్ చేశాము.

యు కె లో రిలీజ్ చేశాము. కొన్ని సాంకేతిక కారణాలవల్ల కొంచెం ఆలస్యంగా జర్మనీ, యు ఎస్ లలో కూడా రిలీజ్ చేయబోతున్నాము.

బాహుబలి, రుద్రమదేవి వంటి "మాగ్నమ్ ఓపస్"లే ఈ పని చేయలేకపోయాయి. వాటి నేపథ్యం వేరు. వాటికుండే సమస్యలు వేరు.

అలాంటప్పుడు కూడా - "అంతా పూర్తయ్యాకే వాళ్లు డేట్ ప్రకటించొచ్చుకదా" అన్నది నా హంబుల్ కొశ్చన్.

ఈ కొశ్చన్ ఎందుకంటే - ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లలో పదే పదే మార్పు అనేది చిన్న సినిమాలెన్నిటి ప్రాణాలనో నిర్దాక్షిణ్యంగా తీసేసింది!

ఈ నిజం ఇండస్ట్రీకి తెలుసు.

కట్ టూ మరికొన్ని సినిమా ఆలస్యాలు -  

3 కోట్లనుంచి, 30 కోట్లదాకా బడ్జెట్ ఖర్చుపెట్టి, సినిమా అన్నివిధాలుగా పూర్తిచేసి, సెన్సార్ అయిపోయి, రిలీజ్‌కు అన్నివిధాలా రెడీ అయిన మరికొన్ని సినిమాలు కూడా వాటి రిలీజ్ డేట్ విషయంలో ఇలాగే చాలా గందరగోళాన్ని సృష్టించాయి.

ఈ లిస్టులో మా స్విమ్మింగ్‌పూల్ హీరో అఖిల్ కార్తీక్ నటించిన "క్రిమినల్స్" కూడా ఉండటం విశేషం. పైగా ఆ సినిమా, మా స్విమ్మింగ్‌పూల్ సినిమా షూటింగ్ ప్రారంభించేనాటికే పూర్తయ్యింది!

నాకు తెలుసు. వీటన్నిటి ఆలస్యాల వెనుక ఎన్నో సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన కారణాలుంటాయి. ఆర్థికపరమైన లిటిగేషన్సే ఎక్కువగా ఉంటాయన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.

ఇదంతా నేను ఒక పాజిటివ్ కోణంలోనే చెప్తున్నానన్న విషయం మీరు గమనించాలి.

బట్, నా బాధ ఒక్కటే.

అంతా పూర్తిగా క్లియర్ కాకుండా, ఆదరాబాదరా డేట్ ఎనౌన్స్ చేసి, ఎన్నో చిన్న సినిమాల రిలీజ్‌ను గందరగోళంలో పడేసి, వాటి ప్రాణం తీసే పాపం మూటకట్టుకోవడం ఎందుకూ అని..

కట్ టూ మా కష్టాలు - 

అవడానికి మైక్రో బడ్జెట్ సినిమానే అయినా - మా స్థాయిలో మాకూ 101 కారణాలు, కష్టాలున్నాయి. సినిమా వాయిదా వేయడానికీ, అసలు రిలీజ్‌నే ఆపేసుకోడానికి!

అయినా - మేం అడుగు ముందుకే వేశాం. చెప్పిన తేదీకే రిలీజ్ చేశాం. చేయగలిగాం.

అదే రోజు రిలీజయిన మరో భారీ చిత్రంతో హోరాహోరీగా పోటీపడి, దానికంటే మంచి కలెక్షన్లు, మంచి టాక్ తెచ్చుకోగలిగాం. సాధించుకోగలిగాం.

ఇదంతా, అసలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా!

అదే మా  #SwimmingPoolChallenge! 

Monday 31 August 2015

అసలు స్విమ్మింగ్‌పూల్ ఎందుకు చూడాలి?

1. ఈ సినిమా కేవలం 12 రోజుల్లో షూట్ చేశాము. అలాగని, ఏదో చుట్ట చుట్టి అవతల పడేయలేదు. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాలేదు. అలా ఎలా సాధ్యమైందన్న క్యూరియాసిటీతో మీరీ సినిమా చూడొచ్చు.

2. ఈ 12 రోజుల షూటింగ్‌లోనే ఒక ఐటమ్ సాంగ్, ఒక మెలొడీ సాంగ్ కూడా షూట్ చేశాము. ఎలా చేశామో అదీ చూడొచ్చు.

3. అంతే కాదు. సినిమాలో కొంత భాగం అమెరికాలోని హారిస్‌బర్గ్ లో కూడా షూట్ చేశాము. మాకున్న మైక్రో బడ్జెట్‌లో ఇదెలా సాధ్యమైందన్నది కూడా మీరు గమనించవచ్చు.

4. ఇంతకు ముందు, ఈ మధ్య కూడా బోల్డన్ని హారర్ సినిమాలు వచ్చాయి. బట్ .. ఇది మాత్రం ఒక "హాట్ రొమాంటిక్ హారర్!" ఆ డిఫరెన్స్ చూడండి. ఎంత హాట్‌గా ఉందో కూడా చూడండి.

5. నా బెస్ట్ ఫ్రెండ్, డి ఓ పి వీరేంద్రలలిత్; ఇంకో మిత్రుడు, స్టడీకామ్ ఆపరేటర్ సురేష్ బాబు .. వీళ్లిద్దరూ రెడ్ ఎమెక్స్ కెమెరాతో ఒక ఆట ఆడుకుంటూ, అంత స్పీడ్ రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్‌లో కూడా క్రియేట్ చేసి ఇచ్చిన ఈ 'విజువల్ ట్రీట్'ని మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు.

6. హారర్ కాబట్టి సినిమాలో రెండు కంటే ఎక్కువ పాటల్ని పెట్టలేకపోయాను. ఆ రెండు పాటల్నీ .. ప్లస్ .. అవసరమైన ప్రతిచోటా అదరగొట్టిన ప్రదీప్‌చంద్ర రీరికార్డింగ్‌నీ మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు.

7. హారర్ సినిమా అన్నప్పుడు కనీసం ఓ రెండయినా గ్రాఫిక్ షాట్స్ ఉంటాయి. అవేవీ లేకుండానే నేనీ సినిమా తీశాను. మైక్రో బడ్జెట్‌లో అదెలా సాధ్యమయ్యిందో కూడా మీరు చూడొచ్చు.

8. మా హీరో అఖిల్ కార్తీక్ ఈ సినిమాలో ఒక్క హీరోగానే కాదు. మేకింగ్ పరంగా నా స్ట్రాటెజీకి అన్‌కండిషనల్‌గా చాలా సపోర్ట్ ఇచ్చాడు. షూటింగ్ ఆగిపోయే లాంటి ఊహించని ఎన్నో సిచువేషన్స్‌లో కూడా నాతోపాటు కూల్‌గా కూర్చొని "డిస్కస్" చేశాడు. అఖిల్ కార్తీక్ నుంచి, లైట్ బాయ్ శివమణి వరకు, ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్ నాకోసం, ప్రాజెక్ట్ కోసం పనిచేశారు తప్ప, కాల్‌షీట్స్ లెక్కలతో చేయలేదు. మోస్ట్ అన్‌ట్రెడిషనల్ పధ్ధతిలో తీసిన ఈ సినిమా చూడడం ద్వారా మా టీమ్ అందరి శ్రమకు గుర్తింపునిచ్చిన క్రెడిట్ మీకే దక్కుతుంది.

9. మా ప్రొడ్యూసర్ అరుణ్‌కుమార్ ముప్పన, శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన తొలి చిత్రం ఇది. ఒక ప్రేక్షకుడిగా, ఒక ప్రొడ్యూసర్‌గా ఫైనల్ ప్రొడక్ట్ ఆయనకు బాగా నచ్చింది. మీరూ చూస్తే ఆయన డబ్బులు ఆయనకొస్తాయి. భయం లేకుండా ఇంకో సినిమా వెంటనే ప్రారంభిస్తాడు.

10. నేను చాలా సెల్ఫిష్. నా సినిమా ఎలాగయినా హిట్ కావాలని కోరుకుంటాను. అయితే ఈ సెల్ఫిష్‌నెస్ నా ఒక్కడి కోసం కాదు. నా ద్వారా మరో 100 మంది కొత్తవారికి పని కల్పించే అవకాశం నాకు మళ్లీ రావాలని! అదే నా స్వార్థం!! నా ఈ స్వార్థం సఫలం కావాలంటే, మీరీ సినిమాను చూడాలి. హిట్ చేయాలి.  

Sunday 30 August 2015

12 రోజుల్లో సినిమా తీయొచ్చా?

నేను తీశాను.

దీని గురించి చెప్పేముందు - ఇక్కడ రెండు ఉదాహరణలు చాలా అవసరం. చెప్పాలి.

అమితాబ్ బచ్చన్ రేంజ్ ఆర్టిస్టుతో కేవలం 20 రోజుల్లో "నిశ్శబ్ద్" తీశాడు రామ్‌గోపాల్‌వర్మ. ఇదే వర్మ, రవితేజ, ఛార్మిలతో ఆ మధ్య 5 రోజుల్లో "దొంగల ముఠా" సినిమా తీశాడు.

గట్స్!

పైన చెప్పిన రెండు సినిమాలూ పక్కా మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలే. అయితే - దొంగల ముఠా మాత్రం - ఫిలిం మేకింగ్‌లో కొత్తగా వచ్చిన డిజిటల్ కెమెరాలను పరిచయం చేస్తూ తీసిన ఎక్స్‌పరిమెంటల్ సినిమా.

అయితే ఏంటట?

అమితాబ్, వర్మ బ్రాండెడ్ పర్సనాలిటీలు. రవితేజ, ఛార్మి ఆల్రెడీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకున్న హీరోహీరోయిన్లు.

వాళ్లు ఏ ఆట ఆడినా నడుస్తుంది. లేదా ఇండస్ట్రీలో చెల్లుతుంది.

కట్ టూ మన పాయింట్ - 

ఇంతవరకూ ఇండస్ట్రీలో ఎలాంటి బ్రాండ్ లేని అప్‌కమింగ్/కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో నేను 12 రోజుల్లో ఒక రొమాంటిక్ హారర్ సినిమా తీశాను.

అదే స్విమ్మింగ్‌పూల్.

ఒక మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా తీయాలంటే యావరేజ్‌న కనీసం 40 రోజుల షూటింగ్ అవసరం. నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ కూడా ఒక కమర్షియల్ సినిమానే. పైగా, రొమాంటిక్ హారర్! దీని సబ్జెక్టునుబట్టి చూస్తే, కనీసం ఓ 40 రోజులయినా షూటింగ్ చేయాలి.

కాని, నేను 12 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తిచేశాను.

అది కూడా .. ఒక మెలొడీ సాంగ్, ఒక ఐటెమ్ సాంగ్‌తో కలిపి!

ఎలాంటి ప్యాచ్ వర్క్, గ్రాఫిక్ వర్క్ లేకుండా.  

ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే .. నేను చెప్పే కారణాలు రెండే రెండు: ఒకటి అవసరం. రెండోది లేటెస్ట్ టెక్నాలజీ.

మైక్రో బడ్జెట్ కాబట్టి, మనం అనుకున్నన్ని రోజులు లీజర్‌గా సినిమాతీసే అవకాశం అసలుండదు. బట్ .. ఫిలిం మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ముందు ఇదసలు సమస్యే కాదు.

సో .. అదన్నమాట.

12 రోజుల్లో నేను షూట్ చేసిన స్విమ్మింగ్‌పూల్ సినిమా - వచ్చే 11 సెప్టెంబర్ నాడు యు కె, యు ఎస్ ఏ ల్లో కూడా రిలీజవుతోంది.

ఇంక చెప్పేదేముంది? చిన్న బడ్జెట్ సినిమాలకు అవసరమైనంత ప్రమోషన్ ఉండదు. సరైన థియేటర్స్ కూడా దొరకవు. అదలా పక్కనపెడితే - ఈ సినిమాలకు ఓపెనింగ్స్ మరో పెద్ద సమస్య. ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగితే చాలు. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా మన రూటే సెపరేట్ అయిపోతుంది.

దానికోసమే ఇదంతా ..  

Sunday 23 August 2015

డబ్‌స్మాష్ .. అంత ఈజీ కాదు!

డబ్‌స్మాష్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. చెప్పాలంటే - అసలు ఆ కాన్‌సెప్టే ఓ పెద్ద ఫన్నీ ఐడియా. డబ్‌స్మాష్ వీడియోల్ని చూసిన ఆ కొన్ని సెకన్లు, లేదా ఒకటి రెండు నిమిషాలు అవి పిచ్చిగా నవ్విస్తాయి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తాయి.

ఓ కోణంలో ఆలోచిస్తే - లైఫ్‌లో అసలు ఫన్ అనేది చాలా మిస్ అయిపోతున్నాం మనం. కారణాలు యేమయినా, ఇది నిజం. ఈ లోటుని ఇలాంటి చిన్న చిన్న యాప్స్ ఇలా పూరిస్తున్నాయి. భారీ రేంజ్‌లో సక్సెస్ అవుతున్నాయి.

పాయింట్ ఏంటంటే - ఇప్పుడు సోషల్ మీడియా ప్రభుత్వాలనే కూల్చేస్తోంది. ప్రతి రంగంలోనూ, పర్సనల్ లైఫ్‌లోనూ మన ప్రపంచాన్నే తల్లకిందులు చేస్తోంది.

దటీజ్ సోషల్ మీడియా పవర్!

ఈ విషయంలో డబ్‌స్మాష్ కూడా తక్కువేం కాదు. సరిగ్గా ఉపయోగించుకొంటే ఇది కూడా ఫస్ట్ క్లాస్ ప్రమోషనల్ టూల్ అవుతుంది. నో డౌట్!

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ చాలెంజ్ - 

మొన్నరాత్రి మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర చాలా ఉత్సాహంగా ఓ డబ్‌స్మాష్ వీడియో క్రియేట్ చేసి, #SwimmingPoolChallenge హాష్ ట్యాగ్‌తో మా టీమ్‌లో, నాతో కలిపి ఓ ఐదుగురికి సరదాగా సవాల్ విసిరాడు. ప్రదీప్ విసిరిన ఆ సవాల్‌ను మేం స్వీకరించామా లేదా అన్నది వేరే విషయం అనుకోండి.

పైన టైటిల్ లో చెప్పినట్టు .. అదంత ఈజీ కాదు.

కానీ, అప్పుడు నాకు బాలీవుడ్ డబ్‌స్మాష్ క్వీన్ సోనాక్షి గుర్తొచ్చింది. సల్మాన్ ఖాన్ గుర్తొచ్చాడు. డబ్‌స్మాష్‌తో ఒక ఆటాడుకున్న ఇంకెందరో టాప్ సెలెబ్రిటీలు గుర్తొచ్చారు.

నేనెప్పుడూ డబ్‌స్మాష్ ట్రై చెయ్యలేదు కాబట్టి వెంటనే ఈ విషయంలో రియాక్ట్ అవలేకపోయాను. బట్ .. అవుతాను. మరో రెండు మూడు రోజుల్లో.

బికాజ్ .. ఇట్స్ రియల్లీ ఫన్నీ.

బికాజ్, లైఫ్‌లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఎన్నో మిస్ అయిపోతున్నాం మనం.

Sunday 16 August 2015

స్విమ్మింగ్‌పూల్ లో జ్యోతిష్కుడు!

కామేశ్వరరావు దామరాజు తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి పి హెచ్ డి పట్టా అందుకున్న డాక్టర్. మంచి భావుకత్వం ఉన్న కవి, రచయిత, సాహితీ విమర్శకుడు కూడా.

చిక్కడపల్లి అరోరా డిగ్రీ కాలేజ్ లో లాంగ్వేజెస్ డిపార్ట్‌మెంట్ హెడ్. అదొక్కటే కాదు. అరోరా కాలేజ్‌కు సంబంధించిన ఏ సాంస్కృతిక కార్యక్రమమో, ఈవెంటో జరగాలన్నా మన కామేశ్వరరావు లేకపోతే నడవదు.  

కట్ టూ సినిమారంగం - 

కామేశ్వరరావు మంచి స్క్రిప్ట్ రచయిత కూడా. అయితే - దానిమీద ఏకాగ్రత చూపించి, ఏదయినా సాధించే అవకాశాన్ని మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయాడు.

నాకు తెలిసి ఇలా చాలామంది విషయంలో జరుగుతుంది. ముందు బ్రెడ్ అండ్ బట్టర్. తర్వాతే .. ఏ క్రియేటివిటీ అయినా.

సినిమా ఫీల్డు పూర్తిగా వేరే.

ఎవరయినా .. ఏ చిన్న అవకాశం అయినా ఇస్తూ .. పనికోసం పిలుస్తున్నారూ అంటే .. ఎక్కడున్నా వెంటనే వచ్చి వాలిపోవాల్సి ఉంటుంది.

ఎట్‌లీస్ట్ దానికంటూ కొంత సమయం విధిగా కెటాయించాల్సి ఉంటుంది. కెటాయించి తీరాలి. ఏ పనుల్లో ఉన్నా, ఎలా ఉన్నా.

ఫీల్డులో పరిస్థితులు అలా ఉంటాయి.

అయితే, అలాంటి అవకాశం కామేశ్వరరావుకు లేకపోవడంవల్ల స్క్రిప్ట్ రచయితగా ఇప్పటివరకయితే అంతగా ప్రయత్నించలేదు. రాణించలేదు. కానీ, రాయగల సత్తా అతనిలో చాలా ఉంది.

కామేశ్వరరావు మంచి పాటల రచయిత కూడా. పైన చెప్పిన కారణం వల్లనే, లిరిక్ రైటర్‌గా కూడా పూర్తిస్థాయిలో ఏమీచేయలేకపోయాడు. "ముద్దు" అనే ఒక సినిమాకు మాత్రం మొత్తం పాటలు రాశాడు. ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌స్‌కు రాశాడు.

ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎమ్ ఏ క్లాస్‌మేట్ కూడా అయిన ఈ "కాముడు"కి, చాలా గ్యాప్ తర్వాత, నా రెండో చిత్రం "అలా"లో పాటలు రాసే అవకాశం నేనిచ్చాను. ఈ చిత్రంలో .. రష్యన్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో ఉండే ఒక్క ర్యాప్ టైటిల్ సాంగ్ మాత్రం నేను రాశాను. "అలా" చిత్రంలోని మిగిలిన అన్ని పాటలూ మా కాముడు చాలా బాగా రాశాడు.

"అలా" చిత్రం కోసం కామేశ్వరరావు రాసిన పాటలన్నీ యూట్యూబ్‌లో చూడొచ్చు.

వాటన్నిటిలోకీ, "బాడీ చూస్తే బ్రాడీపేట" అనే ఐటమ్ సాంగ్ పిచ్చి హైలైట్ అనుకోండి. అది వేరే విషయం.

కట్ టూ యాక్టర్ కామేశ్ - 

కామేశ్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడని నాకు బాగా తెలుసు. రచయితగా, పాటల రచయితగా కంటే .. నటుడిగానే కామేశ్ వెండితెరమీద బాగా సక్సెస్ అవుతాడని చాలా రోజులనుంచి నా గట్టి నమ్మకం.

కట్ చేస్తే - 

మొన్న స్విమ్మింగ్‌పూల్ లో .. ఒకే ఒక్క సీన్‌లో ఫ్లాష్‌లా కనిపించే ఒక జ్యోతిష్కుని పాత్రలో కామేశ్‌ను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేశాను.

ఇంక చెప్పేదేముంది. సూపర్ యాక్టింగ్!

స్విమ్మింగ్‌పూల్ తర్వాత వెంటనే ఒక అగ్రదర్శకుని చిత్రంలో మరో చిన్న క్యారెక్టర్ వేసే అవకాశం వచ్చింది. వేసేశాడు.

ఇక ఇప్పుడు నెమ్మదిగా .. ఒక యాక్టర్‌గా .. ఆ వైపు బిజీ అవుతున్నాడు.

అతనికిప్పుడు తను పనిచేస్తున్న అరోరా కాలేజ్ యజమాన్యం, ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టుడెంట్స్ అందరి నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది.

జస్ట్ ఒక్క బ్రేక్ చాలు. తెలుగులో ఓ మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నిలబడిపోయే సత్తా ఉన్న నటుడు కామేశ్. అతి త్వరలోనే నా మిత్రుడు కామేశ్‌కు ఆ బ్రేక్ కూడా రావాలని ఆశిస్తున్నాను. వస్తుందని నా నమ్మకం.   

Friday 14 August 2015

ఆన్నా వెట్టిక్కాడ్, అన్నపూర్ణ సుంకర ఏం సాధించారు?

పొగడ్తలో, తిట్లో, బూతులో .. మొత్తానికి వెట్టిక్కాడ్, సుంకర అనుకున్నది సాధించారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

బాహుబలిలో ప్రభాస్, తమన్నాల మధ్య ఆ రొమాంటిక్ ఎపిసోడ్‌ను ఒక "రేప్"గా అభివర్ణిస్తూ వెట్టిక్కాడ్ రాసిన ఆర్టికల్ ఒక సూడో సంచలనం టార్గెట్‌గా రాసింది. ఈ బిస్కట్‌కి చానెళ్లు, పేపర్లు, మేగజైన్లు, సోషల్ మీడియా మొత్తం పడిపోయాయి. వెట్టిక్కాడ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పోటీపడి మరీ మస్త్‌గా సహకరించాయి.

"రేప్" అన్న ఒక్క మాట ఉపయోగించి, వెట్టిక్కాడ్ తను అనుకున్న టార్గెట్‌ను అతి సునాయాసంగా రీచ్ అయింది.

మొన్నటిదాకా ఎవరికీ తెలియని ఆన్నా వెట్టిక్కాడ్ అంటే ఇప్పుడు దాదాపు సోషల్ మీడియాలో ప్రతి అడ్డమైన పోస్ట్‌కు లైక్‌లు కొట్టే ప్రతివాడికీ తెల్సు!

సో, వెట్టిక్కాడ్ ఈజ్ ఎ విన్నర్ ..

కట్ టూ అన్నపూర్ణ సుంకర - 

వెట్టిక్కాడ్ వ్యాసంలోని "రేప్" పదం బేస్‌గా పట్టుకొని అన్నపూర్ణ సుంకర ఒక పూర్తి స్క్రిప్ట్ రాసుకొంది. సెల్ఫీలో చెడా మడా వాగుతూ చెలరేగిపోయింది.

వెంటనే గోడకి కొట్టిన బంతిలా కనీసం ఓ 100 మంది ఊహించని రేంజ్‌లో రిటార్టయ్యారు ఆమె మీద. సుంకరకు కావల్సింది కూడా అదే!

ఓవర్‌నైట్ ఫేమ్ ...

మిషన్ ఎకమ్‌ప్లిష్‌డ్!!

ఈ ఇద్దరి విషయంలో - ఇక్కడ బఫూన్‌లెవరు? ఇంటలిజెంట్స్ ఎవరు??

కట్ టూ మనలో మాట - 

నాకర్థం కానిదొక్కటే. ఆన్నా వెట్టిక్కాడ్, అన్నపూర్ణ సుంకర గానీ .. వీళ్లిద్దరి డిక్షనరీ ప్రకారం అసలు "రేప్" అంటే అర్థం ఏంటి? .. మీలో ఎవరికయినా తెలిస్తే చెప్పండి దయచేసి. థాంక్స్ ఎ మిలియన్ ఇన్ అడ్వాన్స్!

వీళ్లిద్దరి లెక్క ప్రకారం సిన్మాలో హీరోహీరోయిన్‌లు దగ్గినా, తుమ్మినా రేపే అవుతుంది. రాజమౌళి నుంచి, రేపు కొత్తగా సినిమా ప్రారంభించే ఫ్రెష్ డైరెక్టర్ దాకా .. అందరూ ఇంక వీళ్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోవాలేమో!

ఇంక సెన్సార్ ఎందుకు మధ్యలో.. దండగ?! పీకి అవతల పడేస్తే గవర్నమెంటుకు జీతాలయినా మిగుల్తాయి!!

అంతా సూడో పబ్లిసిటీ స్టంట్.

ఇదొక మానసిక వ్యాధి. దీనికి శాస్త్రీయనామం కూడా ఒకటుంది. తెలిసి కొందరు, తెలియక కొందరు .. ఈ వ్యాధి బారినపడిన చాలామంది మేధావులమని అనుకొనేవారు కూడా నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఎవరి పిచ్చి వారికానందం. ఎవరి జీవితం వారిది. ఆ విషయం అలా వదిలేద్దాం.

కట్ బ్యాక్ టూ మన టాపిక్ - 

యూట్యూబ్ లోని ఒక స్పూఫ్‌లో ఎవరో అన్నారు. "సినిమాల గురించి ఇంత బాగా తెలిసిన ఈ సుంకరలు, వెట్టిక్కాడ్‌లు వాళ్ల అద్భుతమైన ఆదర్శాలు, ఆలోచనలతో 'ఇదిగో, సినిమా అంటే ఇలా ఉండాలి!' అని ఒక మాంచి సినిమా ఎందుకు తీయకూడదు? అంతా ఫాలో అవుతాం గా .." అని.

ఇది వాళ్లు తప్పక వినే ఉంటారు. అయితే - సినిమా తీస్తారో లేదో మాత్రం చూడాలి మరి ..

ఇదంతా ఎలా ఉన్నా ..  వీళ్లిద్దరూ కల్సి నా "స్విమ్మింగ్‌పూల్" సినిమా తప్పక చూడాలన్నది నా కోరిక. ఎంచక్కా ఒకరు మస్త్ వ్యాసం రాస్తారు. ఇంకోరు జబర్దస్త్ సెల్ఫీ వీడియో పెడతారు!

అది చాలు .. 

Tuesday 11 August 2015

జీవితం ఒక్కటే .. ఒక్కసారే !

హాయ్ ..
హాయ్ బ్రో! ..
హవ్ ఆర్యూ? ..
ఏం టిఫిన్ తిన్నారు? ..
లంచ్ అయిందా? ..
హావ్ ఎ గుడ్ డే !! ..

ఇలాంటి చాట్ లు దయచేసి నా ఫేస్‌బుక్ లో వద్దు.

నా ఫేస్‌బుక్ మిత్రుల్లో ఉన్న అందరితో ఈ ఫార్మాలిటీస్ చాట్ చేస్తూ కూర్చోడం అన్నది అస్సలు కుదరని పని. అసాధ్యం కూడా. మీకూ, నాకూ ఎన్నో పనులుంటాయి. ఎన్నో టార్గెట్‌లుంటాయి.

నాకు వ్యక్తిగతంగా కొన్ని చిన్న చిన్న కమిట్‌మెంట్‌లున్నాయి. భారీ టార్గెట్‌లున్నాయి. వాటికోసమే ప్రస్తుతం నేను ఈ ఫీల్డులో పనిచేస్తున్నాను. అసలు సినీఫీల్డు కాకుండా కూడా నా రెగ్యులర్ పనులు వేరే ఉన్నాయి. అలాంటప్పుడు నా మొత్తం సమయం దీనికే కెటాయించలేను.

నిజంగా ఏదయినా అర్జెంట్, ఇంపార్టెంట్ అంటూ .. ఉంటే డైరెక్టుగా దానిగురించే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తప్పక నేను రిప్లై ఇస్తాను. అవసరమైతే ఫోన్ చేస్తాను.

కట్ టూ కొత్త సినిమా ఛాన్స్ - 

నా కొత్త సినిమాల వివరాల గురించి కూడా నేనే మర్చిపోకుండా ఫేస్‌బుక్ లో వివరంగా ఎనౌన్స్ చేస్తాను. ఆ వివరాలు కూడా దయచేసి  పదే పదే మెసేజ్‌లద్వారా, కామెంట్స్ ద్వారా అడగొద్దని మనవి.

సింగర్స్ గురించి గానీ, ఆర్టిస్టుల గురించిగానీ, అసిస్టెంట్ డైరెక్టర్‌ల గురించిగానీ .. నా ఫేస్‌బుక్‌లో, బయట ఫిల్మ్ మాగ్స్‌లో, ఫిల్మ్ వెబ్‌సైట్స్‌లో నేను పోస్ట్ చేసినప్పుడు .. అప్పుడు మాత్రమే అప్ప్లై చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆడిషన్స్ కు పిలుస్తాను. టాలెంట్ ఉన్నవాళ్లు తప్పక ఎన్నికవుతారు.

మళ్లీ మన పాయింట్‌కొస్తే, వందలాదిమందికి చాటింగ్ లో సింపుల్‌గా "హాయ్" చెప్పడం కూడ కష్టమే. ఈ విషయం మీరూ ఒప్పుకుంటారనుకుంటాను. నన్ను తప్పుగా అనుకోరని భావిస్తాను. ఈ విషయంలో అడ్వాన్స్‌గా మీకు థాంక్ యూ సో మచ్!

కట్ టూ ఒక రియాలిటీ - 

ఇది మనలో మాట.

మనం గుడ్ మార్నింగ్ అనుకున్నంత మాత్రాన ఆ రోజు ఉదయం ఏదయినా ఊహించని గుడ్ మనకు జరుగుతుందంటారా? ఎదుటివారికయినా, మనకయినా ఒక మంచి జరగాలని పాజిటివ్ కోణంలో ఆశించడంలో తప్పులేదు. కానీ ఊరికే ఆశించి కూర్చుంటే పనులు కావు. ఏ పని అయినా ముందు మనం చెయ్యాలి. చేస్తేనే అవుతుంది.

ఊరికే ఆశించి కూర్చుంటేనో, దండంపెట్టుకొని కూర్చుంటేనో పనులు వాటికవే కావు.

సో .. మనం పని చేసుకుందాం. పనిలో ఒకరికొకరం సహకరించుకుందాం. అందరం ఎదుగుదాం. కలిసినప్పుడు తప్పక హాయ్ .. హలో అని పలకరించుకుందాం. కష్టసుఖాలు, మంచీ చెడు పంచుకుందాం.

అంతే తప్ప .. ఫేస్‌బుక్కే జీవితం కాదు. సినిమానే జీవితం కాదు.

వీటికి అవతల కూడా లైఫ్ ఉంది. దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం.

ఎందుకంటే .. జీవితం ఒక్కటే. ఒక్కసారే.

దాన్ని గౌరవిద్దాం. అనుక్షణం అనుభవిద్దాం.    

Monday 10 August 2015

సెప్టెంబర్ 11 విడుదల!

ఎన్నోరకాల ఆలస్యాలు, సాంకేతిక సమస్యల మధ్య .. ఎట్‌లాస్ట్ ..

మొన్నరాత్రి, నాతో ఫోన్‌లో మాట్లాడ్డం అయిపోతూనే, మా ప్రొడ్యూసర్ అరుణ్ ముప్పన తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో పోస్ట్ చేయడంద్వారా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు.

ప్రస్తుతం మాముందున్న టార్గెట్ ఒక్కటే.

చేతిలో ఉన్న అత్యంత పరిమితమైన రిసోర్సెస్‌తోనే స్విమ్మింగ్‌పూల్ చిత్రాన్ని వీలయినంత బాగా రిలీజ్ చేయగలగాలి. ఒక రకంగా - ఇది నాకూ, మా టీమ్‌కూ ఓ పెద్ద ఛాలెంజ్. బట్, ఇక్కడివరకూ చేయగలిగిన మాకు .. ఇది పెద్ద లెక్కేం కాదు అన్న  నమ్మకం నాకుంది.

కట్ టూ ది బిగ్ డిఫరెన్స్ - 

ఆల్‌రెడీ ఒక బ్రాండున్న పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద బ్యానర్‌ల సినిమాలకు మామూలుగానే ఒక అంచనా, ఒక హైప్ ఉంటాయి. మార్కెట్‌లో ఒక రేట్ కూడా ఉంటుంది.

ఆ సినిమాల రిలీజ్‌కు ఓపెనింగ్స్ అంటూ ఉంటాయి .. ఒక రేంజ్‌లో.    

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఇదంతా ఏం ఉండదు. కోరుకున్న థియేటర్‌లు దొరకవు. చివరి నిమిషంలో కూడా చాలా మంది, చాలా రకాలుగా హాండిస్తారు.

ఒక 100 చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైతే, వాటిలో కేవలం ఒక 5% చిత్రాలకే మార్కెట్‌లో ఒక అంచనా ఉంటుంది. ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇలాంటివాటికి మాత్రం ఎంతోకొంత ఓపెనింగ్స్ అంటూ ఉంటాయి. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా, మంచి టాక్ వస్తుంది.

మౌత్ టాక్ ఒక్కటే చిన్న సినిమాలకు ఊపిరి. "సినిమా బాగుంది" అన్న టాక్ వస్తే చాలు. ఒక్కసారిగా సీన్ మారిపోతుంది.

సో, ఏరకంగా చూసినా .. చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ చాలా చాలా ముఖ్యం.  

ఇక స్విమ్మింగ్‌పూల్ విషయానికొస్తే - పైన చెప్పిన 5% సినిమాల కేటగిరీలోకి మా స్విమ్మింగ్‌పూల్ వస్తుందని నేననుకొంటున్నాను. 

Tuesday 4 August 2015

కొత్త సింగర్‌లు ఎందుకు?

స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను పరిచయం చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఇష్టానికి కారణమైన అంశాలు రెండు.

అతని టాలెంట్. అతని వ్యక్తిత్వం.

విషయమేంటంటే - ప్రదీప్‌చంద్ర వయసులో నా కంటే చాలా చిన్నవాడు. కేవలం ఇండస్ట్రీకి కొత్త అనే కాకుండా, ఈ పాయింటాఫ్ వ్యూలో కూడా .. ప్రదీప్‌చంద్రకు నేను అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తూ విసిగిస్తుంటాను.

కట్ టూ మన కొత్త సింగర్‌ల టాపిక్ - 

స్విమ్మింగ్‌పూల్ మ్యూజిక్ సిట్టింగ్స్ 'డే వన్' నుంచి నేను ప్రదీప్‌చంద్రకు ఒక విషయం చెబుతూ వస్తున్నాను ..

"మన సినిమాలో పాటలకోసమని నువ్వు ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌తోనే పాడించాలని పొరపాటున కూడా అనుకోకు. నాకలాంటి భ్రమలు లేవు.

అలా .. టాప్ సింగర్స్ పేర్లు నీ సీడీలో ఉంటేనే నీకు పేరొస్తుందనీ, మ్యూజిక్ కంపెనీలవాళ్లు ఆడియో రైట్స్ కొనుక్కోడానికి ఎగబడతారనీ అనుకోకు.

ఏ క్యాబ్ వాడో తప్ప, ఇప్పుడు ఆడియో సీడీలు ఫ్రీగా ఇచ్చినా ఎవ్వడు తీసుకోడంలేదు. ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు ఆడియో రిలీజ్ కంటే ముందే ఆ సాంగ్స్ ఇంటర్‌నెట్‌లో లీకయిపోతున్నాయి.

సో, మన పాటలు కూడా బాగుంటే వద్దన్నా పబ్లిక్‌లోకి వెళ్లిపోతాయి. వినాలనుకున్నవాడు డౌన్‌లోడ్ పెట్టుకుంటాడు."

కాబట్టి -

"నువ్వు కొత్త సింగర్స్‌ను పరిచయం చేసి, వాళ్లను నీ ద్వారా టాప్ సింగర్స్‌ను చెయ్యి!" అని కూడా ప్రదీప్‌చంద్రకు చెప్పాను.

ఇలా నేను చెప్పడానికి చాలా కారణాలున్నాయి ..

వెనకటి రోజుల్లో గాయనీగాయకుల్లాగా ఏ ఒకరిద్దరో మాత్రమే పాడుతూ .. 'దశాబ్దాలకొద్దీ గాన సామ్రాజ్యాల్ని ఏలాలి' అనుకొనే రోజులు కావివి. అప్పుడంటే అలా నడిచింది. ఇప్పుడలా నడవదు గాక నడవదు. ఇప్పటి ప్రేక్షకులు, శ్రోతలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్త గొంతులు వినాలనుకొంటున్నారు. విని ఆనందిస్తున్నారు.

ఈ కోణంలో ఆలోచించినప్పుడు - టాలెంట్ బాగా ఉండి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం.

అలాగే - ఇప్పటికే పరిచయమైనా, రకరకాల కారణాలవల్ల, టాలెంట్ ఉండీ పైకి రాలేకపోతున్న అప్‌కమింగ్ సింగర్స్‌ను కూడా వీలయినంత ఎంకరేజ్ చెయ్యాలన్నది నా ఇంకో ఆలోచన.

కట్ టూ క్లయిమాక్స్ - 

పైనంతా ఏదో చెప్పానని .. ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్ మీద నాకేదో ఇష్టం లేదని కాదు. ఆ రేంజ్‌కు రావడం కోసం వాళ్లంతా ఏ రేంజ్‌లో శ్రమపడి ఉంటారో నాకు బాగా తెలుసు.

పైగా వాళ్ల రేంజ్‌నుబట్టి - వాళ్లకు ఎప్పుడూ ఏవేవో స్టేజ్ షోలు ఉంటాయి. అలాంటప్పుడు .. వాళ్ళు మన సినిమాలో పాడినప్పటికీ, రేపు మన ఆడియో లాంచ్‌కు డబ్బులిచ్చిరమ్మన్నా రాలేని పరిస్థితులుంటాయి వాళ్లకు.  

అక్కడ షోలకెళ్తే లక్షలొస్తాయి. ఇక్కడ ఆడియో లాంచ్‌కొస్తే మనం బోడి ఏ ఐదు వేలో, పది వేలో ఇస్తాం.

ఎలా కుదురుతుంది?

ఏదయినా సరే, రియలిస్టిక్‌గా ఆలోచించాలన్నది నా పాయింటు.

కాకపోతే - దీనికో మినహాయింపు కూడా ఉంది.

చిన్న సినిమాల ఆడియో లాంచ్‌లను రకరకాల కారణాలతో లైట్ తీసుకోనే ఇదే సింగర్స్ .. పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్‌ల సినిమాల ఆడియో లాంచ్‌లకు మాత్రం స్లీవ్‌లెస్‌ల్లో అటెండవుతారు.

అక్కడ తప్పదు. అది వేరే విషయం.

ఎవర్నీ తప్పుపట్టడానికిలేదు. ఎవరి రీజన్స్ వారివి. ఎవరి బాధ వారిది.

సో, మై డియర్ ప్రదీప్! ఇప్పుడయినా కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యి. ఆడిషన్స్ పెట్టు. మన కొత్త సినిమా కోసం ..

Monday 3 August 2015

ఇక ముందుకే!

అయితే లెఫ్ట్ .. లేదంటే రైట్. అంతే గాని, లెఫ్ట్, రైట్ రెండూ కావాలంటే చాలా కష్టం. అది జరగనిపని.

అవ్వో, బువ్వో ఏదో ఒక్కటే!

తాడిచెట్టు కిందకెళ్లి పాలు తాగుతానంటే కుదర్దు. అక్కడ కల్లే తాగాలి.

ఒకదానికొకటి పొంతనలేని ఈ రాతలన్నీ పిచ్చెక్కిస్తున్నాయి కదూ? నాకూ అంతే. పిచ్చెక్కిపోతోంది.

అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకొంటే ఫలితాలు కొత్తగా ఉండవు. జిరాక్స్ కాపీలా మళ్ళీ ఆ పాత ఫలితాల్నే చూడాల్సి వస్తుంది. 

ఆర్టిస్టులే మారతారు. క్యారెక్టర్స్ మాత్రం అవే.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ -

ఈ మధ్యకాలంలో ఒక్క చిన్న సినిమా కూడా హిట్ కాలేదు. ఆ పనేదో స్విమ్మింగ్‌పూల్ చేస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకం నిజం కావడానికి మాత్రం మేం చాలా చేయాల్సి ఉంది. చేసి తీరాలి.

అవును. ఒక్క హిట్ జీవితాన్నే మార్చేస్తుంది. 

Saturday 1 August 2015

స్టడీకామ్ సురేష్ @ స్విమ్మింగ్‌పూల్

అసలు తెలుగులో స్టడీకామ్ టెక్నిక్‌ను బాగా ఉపయోగించి, దానికి బాగా పాపులారిటీ తెచ్చింది రామ్‌గోపాల్‌వర్మ. తర్వాత అందరూ అవసరమున్నా, లేకపోయినా .. అయినదానికీ, కానిదానికీ .. ఎడా పెడా .. ఈ టెక్నిక్‌నే ఉపయోగిస్తున్నారనుకోండి. అది వేరే విషయం.

కట్ టూ సురేష్ - 

తెలుగు ఇండస్ట్రీలో - సురేష్‌తో కలిపి, మంచి స్టడీకామ్ ఆపరేటర్‌లు ఒక ఆరుగురికంటే ఎక్కువ ఉండే అవకాశం లేదనుకుంటున్నాన్నేను.

తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ ఇండస్ట్రీల్లోని దాదాపు అందరు ప్రముఖ హీరోలు, డైరెక్టర్లతో కలిసి పనిచేసిన రికార్డ్ సురేష్‌కు ఉంది. హిందీలో కూడా వాంటెడ్, బద్మాష్ కంపనీ సినిమాలకు పనిచేశాడు సురేష్.

2006 లో నా రెండో చిత్రం "అలా" కు ఫోకస్‌పుల్లర్ గా పనిచేసిన సురేష్, ఇప్పుడు నా లేటెస్ట్ సినిమా "స్విమ్మింగ్‌పూల్" కు కూడా పనిచేశాడు. కాకపోతే, ఇప్పుడు స్టడీకామ్ ఆపరేటర్‌గా.

కట్ టూ సురేష్ ఫిలిం ఎంట్రీ - 

సురేష్ పుట్టింది కడపలో.

డిగ్రీ అయిపోయాక, వెబ్ డిజైనింగ్ పేరుతో హైద్రాబాడ్‌లో అడుగుపెట్టాడు సురేష్. ఒకటి రెండు ట్విస్టుల తర్వాత - వెబ్ డిజైనింగ్ కాస్తా పబ్లిసిటీ డిజైనింగ్ వైపు రూటు మార్చింది. పబ్లిసిటీ డిజైనర్ కళాభాస్కర్ "నువ్వు చెయ్యాల్సింది ఇది కాదు. ఏదయినా టెక్నికల్ సైడ్ వెళితే బాగుంటుంది" అని సలహా ఇచ్చారు.

కట్ చేస్తే -

స్టడీకామ్ శ్రీధర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిలో చేరిపోయాడు సురేష్. ఆ తర్వాత - స్టడీకామ్ పార్తీపన్ దగ్గర శిష్యుడిగా చేరాడు. పార్తీపన్‌కు మొదటి శిష్యుడు, చివరి శిష్యుడూ కూడా సురేషే కావడం విశేషం.

స్టడీకామ్ షాట్స్ తెరపైన చూడ్డానికి చాలా బాగుంటాయి. అయితే ఆ షాట్స్ అంత బాగా రావడం వెనుక స్టడీకామ్ ఆపరేటర్ కష్టం చాలా ఉంటుంది.

యావరేజ్‌న సుమారు 40 కిలోలకు తక్కువకాని కెమెరా ఇక్విప్‌మెంట్ బరువునంతా తన శరీరం పైన మోస్తూ - డైరెక్టర్ చెప్పిన ఎఫెక్ట్ రావడం కోసం - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ షాట్స్ తీయాల్సి ఉంటుంది.

షాట్‌ను, లొకేషన్‌ను బట్టి - ఏ చిన్న పొరపాటు జరిగినా లైఫ్ రిస్క్ కాచుకొని ఉంటుంది. అలాంటి ఒక రిస్కీ షాట్ తీసిన అనుభవం కూడా సురేష్‌కు ఉంది.

మళయాళంలో మోహన్‌లాల్ సినిమా షికార్ కోసం కొడైకెనాల్ లోని గుణ కేవ్స్ లో ప్రాణాలకు తెగించి షూట్ చేశాడు సురేష్.

మొన్నటి బాహుబలి కోసం కూడా మహారాష్ట్రలోని పంచ్‌గనిలో - బురదలో కూడా కష్టపడి షూట్ చేశాడు సురేష్.

అంతేకాదు. తమిళంలో సిరుత్తై సినిమాలో ఒక మొత్తం ఫైట్ ను సింగిల్ షాట్‌లో స్టడీకామ్‌లో షూట్ చేశాడు సురేష్. అలాగే - టార్గెట్ సినిమా కోసం, శివబాలాజీ, శ్రధ్ధాదాస్‌ల మీద పూర్తి పాటను స్టడీకామ్‌లో షూట్ చేసిన రికార్డ్ సురేష్‌కు ఉంది.

ఎన్ని చేసినా - తెలుగులో రాజమౌళి మాగ్నమ్ ఓపస్ బాహుబలి కి పనిచేయడం మాత్రం ఒక మర్చిపోలేని గొప్ప అనుభవంగా చెప్తాడు సురేష్.

ఇదంతా సురేష్‌కు స్టడీకామ్‌ ఆపరేషన్ పట్ల, సినిమాటోగ్రఫీ పట్ల ఉన్న అమితమైన ప్యాషన్‌ను తెలుపుతుంది.

కట్ టూ మా స్నేహం - 

2006 లో నా రెండో చిత్రం "అలా" కు ఫోకస్‌పుల్లర్‌గా పనిచేసినప్పుడు ఎలా ఉన్నాడో, సురేష్ ఇప్పుడూ అలాగే ఉన్నాడు.

అదే చిరునవ్వు. అదే పలకరింపు. అదే ఫ్రెండ్లీ నేచర్. అదే ప్యాషన్.

ఈ ప్యాషన్‌తోనే - స్టడీకామ్ ఆపరేటర్ స్థాయి నుంచి, ఇన్‌డిపెండెంట్‌గా డి ఓ పి (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ) స్థాయికి త్వరలోనే వెళ్లనున్నాడు సురేష్. నా అంచనా ప్రకారం అది ఈ 2015 లోనే జరగొచ్చు!

సురేష్, యూ రాక్ ..  

Tuesday 28 July 2015

ఒక దేశభక్తుని 4 కొటేషన్లు

> నిద్రలో కలలు కనడం కాదు. నీ కల నిన్ను నిద్రపోనివ్వకూడదు.

> సక్సెస్ స్టోరీలు చదవొద్దు. అవి కేవలం ఒక సందేశాన్నే ఇస్తాయి. ఫెయిల్యూర్ స్టోరీలు చదవండి. అవి, నువ్వు సక్సెస్ సాధించడానికి అవసరమైన ఎన్నో ఐడియాలనిస్తాయి.

> కష్టాలనేవి నిన్ను నాశనం చేయడానికి రావు. నీలో దాగి ఉన్న శక్తుల్ని బయటకుతీయడంలో సహకరించడానికి  వస్తాయి. నీ కష్టాలకు తెలియజేయి .. నువ్వే ఓ పెద్ద కష్టమని!

> ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం. కాని, ఓ మంచి స్నేహితుడు ఓ గ్రంథాలయంతో సమానం.

***

పేపర్ బాయ్ నుంచి మిసైల్ మ్యాన్ దాకా ఎదిగిన అబ్దుల్ కలాం జీవితమే ఒక సక్సెస్ సైన్స్. ఆయన చెప్పిన ఎన్నో మాటల్లో ఈ నాలుగు కొటేషన్‌లు నాకు బాగా గుర్తున్న కొటేషన్‌లు. నాకు బాగా నచ్చిన కొటేషన్‌లు.

అబ్దుల్ కలాం తను చనిపోతే ఒక రోజు సెలవు ఇవ్వద్దు. ఒకరోజు ఎక్కువ పనిచేయండి అన్నారు. నేనీరోజు సెలవు తీసుకోకుండా ఇంకో గంట ఎక్కువ పనిచేస్తున్నాను. ఇది మాత్రమే ఆయనకు ఈరోజు నేనివ్వగలిగిన అత్యుత్తమ నివాళి అనుకుంటున్నాను. 

Thursday 23 July 2015

స్విమ్మింగ్‌పూల్ లో రచ్చ రవి!

జబర్దస్త్ చూసేవాళ్లకు రచ్చ రవిని ప్రత్యేకంగా పరిచయంచేసే అవసరం లేదనుకుంటాను. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తోపాటే, ఎన్నో సినిమాల్లో కూడా నటించిన రచ్చ రవి .. స్టేజ్ షోల్లో కూడా పిచ్చి బిజీనే!

సినీ ఫీల్డులో ఎప్పుడు, ఎవరు, ఎవరితో పరిచయమై, ఎంత తొందరగా బాగా క్లోజ్ అయిపోతారన్నది చెప్పలేరు. కొన్ని పరిచయాలు అలా అనుకోకుండా జరిగిపోతాయి.  

రచ్చ రవితో నా పరిచయం కూడా అలాంటిదే!

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ -

కొన్ని కారణాలవల్ల ఆరోజు ఒక ఆర్టిస్టుకు ముందే ప్రోగ్రాం కాల్ వెళ్లలేదు. షూటింగ్ స్పాట్ నుంచి అప్పటికప్పుడు ఫోన్ చేసేటప్పటికి, ఆ ఆర్టిస్ట్ అప్పటికే వేరొక చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాడు. షూటింగ్‌కు రావడం అనేది అసాధ్యం.

"ఇంకా సినిమాలో ఎంటర్ అవని క్యారెక్టర్ కదా - షూటింగ్ మర్నాడు పెట్టుకుందాంలే" అని అనుకోడానికిలేదు. ఆరోజు ఆ రెండు సీన్‌లూ ఆ లొకేషన్‌లో పూర్తిచేసితీరాలి. ఆరోజుతో మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుంది!

నిజానికి అది చాలా పెద్ద టెన్షన్.

కానీ .. కూల్‌గా నేనూ, కార్తీక్ కూర్చుని ఆలోచించాము.

కట్ చేస్తే - 

హీరో అఖిల్ కార్తీక్ ఇనిషియేషన్‌తో రచ్చ రవి స్విమ్మింగ్‌పూల్ లోకి ఎంటరయ్యాడు .. హీరో ఫ్రెండ్‌గా. ఆరోజు రవి ఫ్రీగా ఉండటం నిజంగా లక్కీ!

ఇక, రవిది ఎంత మంచి మనసు అంటే - సమస్యను అవతలివారి కోణంలోంచికూడా అలోచిస్తాడు. ఒక్క నిమిషం వృధా కానివ్వడు.

'విషయం ఇదీ' అని చెప్పాక - వెంటనే చేస్తానని ఒప్పేసుకున్నాడు రవి. "కారు పంపిస్తాం పికప్‌కి" అన్నప్పుడు ఒక్కటే మాటన్నాడు.

"అన్నా! మీ కారు సికింద్రాబాద్ నుంచి మణికొండ వచ్చి, దాన్ని నేను ఎక్కి, మళ్ళీ మీ సికింద్రాబాద్ షూటింగ్ లొకేషన్‌కు వచ్చేటప్పటికి హాఫ్ డే అయిపోద్ది అనవసరంగా. నేనే బైక్ మీద డైరెక్ట్‌గా వస్తాలే!" అని, అడ్రస్ తీసుకున్నాడు.

సరిగ్గా 45 నిమిషాల్లో లొకేషన్‌కు వచ్చేసాడు!

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి కోపరేషన్ చాలా అరుదు.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ - 

"అన్నా! ఎంత బిజీగా ఉన్నా సరే, నేను మన సినిమా ఆడియో ఫంక్షన్‌కు వస్తాను. కాకపోతే, నాకు ఒక రెండ్రోజుల ముందు చెప్పండి!" అని నాకూ, కార్తీక్‌కూ మాట ఇచ్చినట్లుగానే - మొన్న జరిగిన మా ఆడియో ఫంక్షన్‌కు సరిగ్గా టైమ్‌కు వచ్చాడు రవి.

తప్పకుండా వస్తామన్న పెద్ద గెస్ట్‌లు పెద్ద హాండిచ్చారు. అది వేరే విషయం.

బ్యాక్ టూ రచ్చ రవి - 

ఆడియో ఫంక్షన్‌కు ఏదో గెస్ట్‌లా ఊరికే అలా రావడం, పోవడం కాకుండా - స్టేజ్ మీద  రవి  సోలోగానూ, గాలిపటం సుధాకర్‌తో కలిసి కంబైండ్ గానూ .. తన కామెడీతో రచ్చ రచ్చ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా!

ఆ చిరునవ్వు, ఆ పలకరింపు, ఆ చొరవ, ఆ ఆత్మీయత .. సింప్లీ హాట్సాఫ్ టూ రవి!

షూటింగ్‌లో కూడా అంతే. హీరో అఖిల్ కార్తీక్, హీరోయిన్ ప్రియ వశిష్ట కాంబినేషన్లో తను నటించిన రెండు సీన్‌లను దడదడలాడించేస్తూ అద్భుతంగా నటించాడు రవి.  

టీవీ, స్టేజ్ ప్రొగ్రామ్‌లతో పాటు సినిమాల్లోనూ రచ్చ రవి ఇంకా బాగా పైకి రావాలని నా కోరిక. వస్తాడని నా నమ్మకం.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

ఇది షూటింగ్ అయ్యాక ఏదో మాటల సందర్భంలో తెల్సిన విషయం.

"మీది తెనాలి .. మాది తెనాలి" లాగా - రచ్చ రవి పుట్టిందీ, పెరిగిందీ వరంగల్ కావడం విశేషం. నేను పుట్టిన ఊరు కూడా అదే! 

Wednesday 22 July 2015

ఫిల్మ్ మేకింగ్ మేడ్ ఈజీ!

బాహుబలి, రుద్రమదేవి వంటి మాగ్నమ్ ఓపస్ లను పక్కన పెట్టండి. టాప్ స్టార్‌ల 30-40 కోట్ల సినిమాలను పక్కన పెట్టండి. ఇవన్నీ సాధ్యం కావడానికి వెనక చాలా కృషి ఉంటుంది. మనకు తెలియని మతలబులు, నేపథ్యం కూడా చాలా ఉంటుంది.

లేదా ఒక డైరెక్టర్ తన ఖాతాలో అప్పుడే ఒక అద్భుతమయిన సూపర్ హిట్ ఇచ్చి ఉండాలి. లేదంటే .. ఒక బలమైన సినిమా కుటుంబ నేపథ్యం ఉండాలి. అలా లేనప్పుడు, ఆ లాబీల కాంపౌండుల్లోకి కూడా ఎంటర్ కాలేరెవ్వరూ.

ఇదంతా నాణేనికి ఒకవైపు. ఇప్పుడు నేను చర్చిస్తున్నది నాణేనికి మరోవైపు.  

ఇంతకు ముందొకసారి ఈ టాపిక్ పైన, ఇదే బ్లాగ్‌లో రాశాను. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ రాస్తున్నాను.

కట్ టూ మన డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ -  

ఇప్పుడు సినిమా యెవరైనా తీయొచ్చు. దానికి 30,40 కోట్లు లేదా 300 కోట్లు అవసరం లేదు. ఒకటి, రెండు కోట్లు చాలు.
తక్కువలో తక్కువ కొన్ని లక్షలు చాలు.

24 యూనియన్‌లు కూడా అక్కర్లేదు. కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. అర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అదే టీమ్!

టీమ్ ఫోకస్ అంతా ఉండాల్సింది కాల్ షీట్ టైమింగ్స్, బేటాలు, డబుల్ బేటాలూ, యూనియన్ రూల్స్ పైన కాదు. సినిమా, సినిమా మీద తమకున్న ప్యాషన్ పైన.

అప్పుడు మాత్రమే .. మంచి సినిమా - అనుకున్న కథతో - అనుకున్న విధంగా తీయవచ్చు. రిలీజ్ చేయవచ్చు.

అవును. నమ్మటం కష్టం. కానీ నిజం. ఇప్పుడంతా డిజిటల్ యుగం.  ల్యాబ్ లూ, స్టూడియోలూ, ఫిల్మ్ నెగెటివ్ లూ, ప్రాసెసింగ్ లూ, పడిగాపులూ ... ఆ రోజులు పోయాయి.

మినిమమ్ 30 లక్షలు ఉంటే చాలు.  కేవలం 45 రొజుల్లో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చు. ఇంకో 45 రోజుల్లో .. మరొక 20 లక్షల ప్రమోషన్‌తో .. ఆ సినిమాని యే టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు.

మంచి కథతో, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి.

కోటి నుంచి 2 కోట్లవరకు బడ్జెట్ ఉంటే  మరీ మంచిది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే అవసరం అస్సలు రాదు.

ఏదయినా .. పిండికొద్దీ రొట్టె! బడ్జెట్ పెరిగినా కొద్దీ సినిమా రేంజ్ వేరేగా ఉంటుంది.  

నిజంగా ఒక చిన్న సినిమా ఆడిందంటే చాలు. ఓవర్‌నైట్‌లో థియేటర్‌ల సంఖ్య పెరిగిపోతుంది. బయ్యర్‌లు పోటీపడి సినిమా కొనుక్కుంటారు.  లాభం ఊహించనంతగా ఉంటుంది. కనీసం 100 మంది కొత్తవాళ్లకు బ్రతకడానికి పని దొరుకుతుంది. మరిన్ని మంచి అవకాశాలొస్తాయి.

మార్కెట్‌ను బాగా స్టడీ చేయడం, కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్‌తో .. ముందు ప్లాన్ చేసుకున్న విధంగా, అనుకున్న బడ్జెట్‌లోనే  .. సినిమా తీయడం ముఖ్యం. కృష్ణా నగర్, గణపతి కాంప్లెక్సుల్లో పనిలేక తిరిగే పరాన్నజీవులు చెప్పే పనికిరాని మాటలు విని, ప్లాన్ నుంచి ఏ కొంచెం పక్కదారి పట్టినా అంతే సంగతులు.

అయితే - ఈ వాస్తవం ఎవరికైనా కేవలం అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.

కట్ టూ ఒక సంచలనం -       

2007 లో వచ్చిన 'పేరానార్మల్ యాక్టివిటీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది!

అప్పటి నుంచీ, మనవాళ్లకు యెన్ని రకాలుగా చెప్పినా - యెన్ని వుదాహరణలతో చూపించినా - వినలేదు యెవరూ. చివరికి ఒక పేరున్న దర్శకుడు చేసి చూపించాకగానీ మనవాళ్లకు విషయం అర్థం కాలేదు.

ఇక ఇప్పుడంతా అదే దారి. డిజిటల్ ఫిలిం మేకింగ్ .. డిఎస్సెల్లార్  ఫిలిం మేకింగ్.

సో .. ఇప్పుడింక ఫిల్మ్ నెగెటివ్ అన్నదే లేదు. బాహుబలి అయినా సరే, బస్టాప్ అయినా సరే - ఫిల్మ్ మేకింగ్ అంతా డిజిటల్ లోనే! టెక్నాలజీ మొత్తం ఇప్పుడు డిజిటల్‌మయమైపోయింది.

కట్ టూ ఫిల్మ్ ఫాక్టరీ -

అంతా కొత్తవాళ్లు లేదా అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లతో ఇప్పుడు నేను ఒక సీరీస్ ఆఫ్ సినిమాలను మైక్రో బడ్జెట్‌లో ప్లాన్ చేస్తున్నాను.

ఇదొక ప్యాషనేట్ ప్రాజెక్ట్.

ఒక్కో సినిమా బడ్జెట్ రేంజ్ 50 లక్షల నుంచి కోటి రూపాయలు మినిమమ్.

నిజంగా .. సినిమాల పైన, సినిమా బిజినెస్ పైన .. మొత్తంగా ఈ ఫీల్డు పైన ఆసక్తి, ప్యాషన్ ఉన్న .. కొత్త ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లు / మైక్రో ఇన్వెస్టర్లు మీ ఫోన్ నంబర్ ఇస్తూ, ఈమెయిల్ ద్వారా  నన్ను సంప్రదించవచ్చు. లేదా, మీ ఫోన్ నంబర్ తో నా ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. లేదా నేనే ఫోన్ చేస్తాను.

ఇన్వెస్టర్-హీరోలు/హీరోయిన్లు/సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా నన్నుసంప్రదించవచ్చు. హీరో/హీరోయిన్/సపోర్టింగ్ ఆర్టిస్టు కావాలన్న మీ కల ఇలా కూడా నిజం అవుతుంది. మీ ఇన్వెస్ట్ మెంట్ కి బిజినెస్ లో షేర్ కూడా ఉంటుంది.

అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే - ఈ ప్రాజెక్ట్‌లో నాతో అసోసియేట్ కావడం ద్వారా, సినిమా బిజినెస్‌ను మీరు డైరెక్ట్‌గా తెలుసుకోవచ్చు.  ఇది అంతటా, అంత ట్రాన్స్‌పరెంట్‌గా సాధ్యమయ్యే పని కాదు. మరెన్నో లాభాలూ, కనీసం ఒక 20 చానెళ్లు కవర్ చేసే ప్రెస్ మీట్‌లు, ఊహించని ఓవర్ నైట్ ఫేమ్, పెద్ద రేంజ్ నెట్‌వర్క్, లైమ్ లైట్‌లో హడావిడీ .. ఇంకెన్నెన్నో ఉంటాయి.

ఇదొక షో బిజినెస్.

ఈ వైపు ఇష్టం ఉన్నవాళ్లు మాత్రమే ఇటు రావాలి. బిజినెస్ గా అయినా సరే, క్రియేటివ్ బిజినెస్ గా అయినా సరే. ప్యాషన్ ముఖ్యం. అనుకున్నది ఏదయినా సరే చేయాలన్న గట్స్ ముఖ్యం.

ఫేమ్, డబ్బూ .. వద్దన్నా అవే ఫాలో అవుతాయి ..

email: manutimemedia@gmail.com

Wednesday 15 July 2015

స్విమ్మింగ్‌పూల్ లో సత్తెన్న ఎలా మిస్ అయ్యాడు?

స్విమ్మింగ్‌పూల్‌లో - రెండు సీన్‌లలో - హీరోహీరోయిన్లతో కనెక్ట్ అయ్యే ఒక ముఖ్యమయిన పాత్రకు  సత్తెన్నను అనుకున్నాం.

అన్న ఆఫీస్‌కు వచ్చాడు.

హాయిగా మాట్లాడుకున్నాం. అంతా ఓకే అనుకున్నాం. షూటింగ్‌కు ఒక్క రోజు ముందు మాత్రం చెప్తాను. రావాలని చెప్పాను. సత్తెన్న ఓకే అన్నాడు.

కానీ ఆ తర్వాత పొరపాటు నావైపునుంచే జరిగింది. సత్తెన్న విషయంలో.

మా ప్రాజెక్ట్ అసలే ఒక మైక్రో బడ్జెట్ ఫిలిమ్. షూటింగ్ అంతా ఒక మాదిరి గెరిల్లా ఫిలిం మేకింగ్‌లా జరిగింది. ఒక టైమ్ అంటూ లేదు. మొత్తం 40 రోజుల షూటింగ్‌ను - డే అండ్ నైట్ కష్టపడి - కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాం. ఎలాంటి ప్యాచ్ వర్క్ కూడా బ్యాలెన్స్ లేకుండా!

అంత 'అన్‌ట్రెడిషనల్‌' గా వెళ్లాం .. ఫిలిం మేకింగ్ కు సంబంధించి. కాల్‌షీట్స్, హాలిడేస్ .. అవన్నీ ఏం లేవు. మొత్తం 24 క్రాఫ్ట్స్ అనబడే వాటిల్లో సగానికిపైగా అన్నీ మేమే చేసేసుకున్నాం.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే - చివరికి మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా అంతా కొత్తవాళ్లే. నేను వాళ్లకు ఏదయినా చెప్పి చేయించుకోవాలితప్ప, వాళ్లు నాకు ఏదయినా గుర్తు చేసి, అలర్ట్ చేసే అనుభవం వారికి లేదు.

బాయ్-టూ-అసిస్టెంట్ డైరెక్టర్-టూ-ప్రొడక్షన్ మేనేజర్-టూ-డైరెక్టర్ .. అన్నీ నేనే.

ప్రొడ్యూసర్ అరుణ్ గారు కూడా ఫీల్డుకి కొత్త కాబట్టి, పూర్తి స్థాయిలో ఇండియాలో ఉండరు కాబట్టి .. ఆయనవైపు చాలా చాలా పనులు కూడా నేనే ఫాలో అప్ చేసుకోవాల్సి వచ్చేది.

ఇలాంటి సిచువేషన్‌లో .. అది చివరి రోజు షూటింగ్ .. ఒక లొకేషన్‌లో.

అక్కడ, ఆరోజు .. సత్తెన్న రావాలి.

ముందురోజే ప్రోగ్రాం చెప్పాల్సింది. మర్చిపోయాం.

ఆ రోజు కాల్ చేస్తే - అప్పటికే అన్న వేరే చాలా చాలా ముఖ్యమయిన పర్సనల్ పనిలో బిజీ అయిపోయి ఉన్నాడు. రావడానికి ఏమాత్రం వీలు లేదు.

సారీ చెప్పాను. తర్వాత ఇంకో మైక్రో బడ్జెట్ ప్రాజెక్టు వెంటనే ఉంది. ఈ సారి ఇలాంటి పొరపాటు జరగదు అని చెప్పాను. అన్న "నో ఇష్యూస్" అంటూ అర్థం చేసుకున్నాడు. మంచి మనసుతో మొన్నటి మా ఆడియో లాంచ్ ఫంక్షన్‌కు కూడా వచ్చాడు.

దటీజ్ సత్తెన్న!

Saturday 11 July 2015

ఇక రుద్రమదేవి!

బాహుబలి హడావిడి అయిపోయింది.

ఇప్పటివరకూ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ, ఏ సినిమాకూ లేని స్థాయిలో - దాదాపు ఒక మాఫియా రేంజ్‌లో - బ్లాక్ టికెట్‌ల మార్కెటింగ్ రికార్డులు తిరగరాసిందీ సినిమా.

వాట్ నెక్స్‌ట్?

రుద్రమదేవి.

13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన ఈ రాణి రుద్రమదేవి కథను ఎప్పుడో తను చిన్నప్పుడు నాన్-డిటైల్‌డ్ పుస్తకంలో చదివిన ఇన్‌స్పిరేషన్‌తో ఈ మహా యజ్ఞాన్ని గుణశేఖర్ తలపెట్టాడంటే .. ఆయనకు రియల్లీ హాట్సాఫ్!

ఆర్థికంగా ఎంతో రిస్క్ తీసుకొని, తానే ప్రొడ్యూసర్ కూడా అయి, కేవలం తన ప్యాషన్ కోసం, రుద్రమదేవి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు గుణశేఖర్. ఈ సినిమా ఆడియోను కూడా వరంగల్‌లో అత్యంత భారీగా జరిపాడు. అయితే - బాహుబలికి ముందే రిలీజ్ కావల్సిన రుద్రమదేవి చిత్రం ఏవో సాంకేతిక కారణాలవల్ల వాయిదా పడింది.

కట్ టూ స్పాట్ - 

"అంతా మనమంచికే" అన్నది అన్నిసార్లూ నిజం కాదు. కాని, రుద్రమదేవి విషయంలో అది నిజమే అనిపిస్తుంది.

ఆలస్యం అయితే అయింది. తీసుకోవల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని, రుద్రమదేవి రిలీజ్ కోసం - ఓ మంచి డేట్‌కు గుణశేఖర్ ఇప్పుడు స్పాట్ పెట్టొచ్చు. పెట్టిన ఆ స్పాట్ మళ్లీ మారకుండా ఉండటం చాలా ముఖ్యం.

సుమారు 80 కోట్ల బడ్జెట్‌తో - దర్శక నిర్మాతగా కత్తిమీద సాము చేస్తూ - అనుష్క హీరోయిన్‌గా గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి ఆయనకు భారీ సక్సెస్‌ను సాధించిపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.