Thursday 31 December 2015

2015 .. ఇప్పుడొక జ్ఞాపకం!

చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా మళ్లీ  ఒక సినిమా తీసి రిలీజ్ చేశాను. అదీ - ఇండియా, యు కె ల్లో.

స్విమ్మింగ్‌పూల్!

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్, శ్రీ శ్రీ ఇంటర్నేషనల్ అధినేత అరుణ్ కుమార్ గారి సంకల్పం, సహకారం నాకు ఈ విషయంలో బాగా తోడ్పడ్డాయి.

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ తేదీని 40 రోజులముందే ప్రకటించాను. మాకున్న పరిమిత రిసోర్సెస్‌తోనే - ఆ తేదీకే - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగానే రిలీజ్ చేశాను. ఇది చిన్న సినిమాల విషయంలో అంత ఈజీ కాదు. ఆమాటకొస్తే, కోట్లు పెట్టి తీసిన  సినిమాలు కూడా ఎన్నో అసలు రిలీజ్‌కు నోచుకోక ఇంకా అలా పడిఉన్నాయి. అది వేరే విషయం.

ఈ అనుభవంతో నా తర్వాతి సినిమా రిలీజ్ డేట్‌ను షూటింగ్ ప్రారంభం రోజే ప్రకటించగల ఆత్మవిశ్వాసం నాలో మరింతగా పెరిగింది.

సినిమా హిట్టా, ఫట్టా అన్నది ఓ పెద్ద సబ్జెక్టు. దాన్ని గురించి ఇక్కడ చర్చించడంలేదు. దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. ఎప్పుడూ ట్రాక్‌మీద లైవ్‌గా లైమ్‌లైట్‌లో ఉండటం అనేది చాలా ముఖ్యం. అది ఈ సినిమాతో నేను సాధించగలిగాను.

కట్ టూ ది అదర్ సైడ్ ఆఫ్ సినిమా - 

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా .. సమస్యలూ, సంఘర్షణ సమాంతరంగా 2015 అంతా వెంటాడాయి. షోబిజినెస్ కాబట్టి అంతా బాగున్నట్టే ఉండాలి. ఉన్నాను. దటీజ్ సినిమా! ఈ విషయంలో కొందరు స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించాను. సినీఫీల్డులో ఎప్పుడూ ఉండే అనిశ్చితి వల్లనే తప్ప ఇది కావాలని చేసింది కాదు అని వారికీ తెలుసు. అయినా - బాధ్యత బాధ్యతే.

జీవితంలో ఏ తప్పైనా చేయొచ్చు కానీ, అప్పు మాత్రం చేయకూడదన్న వాస్తవాన్ని 2015 లో మరింత బాగా అర్థం చేసుకోగలిగాను. కానీ, భారీ సక్సెస్‌లు ఇచ్చిన పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లకే ఇది తప్పలేదు. నేనెంత!

కట్ బ్యాక్ టూ సినిమా - 

స్విమ్మింగ్‌పూల్ సినిమా విషయంలో నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్, హీరో అఖిల్ కార్తీక్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా నాకు బాగా సహకరించారు.

ప్రదీప్‌చంద్రను స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చిన విషయం.

మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్, కామేశ్వర రావు, కె జె దశరథ్, శీను6ఫీట్, ఐశ్వర్య, బ్రాహ్మిణి లతోపాటు హీరోయిన్ ప్రియ వశిష్టను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశాను. రష్యన్ ఇంటర్నేషనల్ మోడల్ కాత్య ఐవజోవాను ఈ చిత్రం ద్వారా ఐటమ్ డాన్సర్‌గా పరిచయం చేశాను.

ఈ సినిమాలో నటించిన మిత్రుడు 'జబర్దస్త్' రచ్చ రవి, ఈ సినిమా రిలీజ్ తర్వాతవరకు కూడా ఇచ్చిన కోపరేషన్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం నా బాధ్యత.

అలాగే, యు ఎస్ లో నా ఆత్మీయ మిత్రుడు సదానందం భరత నా కోసం, ఈ సినిమాకోసం చాలా శ్రమ తీసుకోవడం మరో గొప్ప విశేషం.    

దాదాపు ఒక దశాబ్దం క్రితం నేను కోల్పోయిన క్రియేటివ్ ఫ్రీడమ్‌ను తిరిగి సంపాదించుకొనే క్రమంలో మొన్నటి స్విమ్మింగ్‌పూల్ సినిమా నా ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నాను. 2016 లో ఈ పరంపర ఇక మరింత వేగంగా కంటిన్యూ అవుతుంది.

అయితే - సినిమా ఒక్కటే జీవితం కాదు. సినిమా అవతల కూడా లైఫ్ ఉంది. ఆ లైఫ్ కూడా చాలా ముఖ్యం అన్న వాస్తవం ఎప్పుడూ వాస్తవమే. ఈ వాస్తవాన్ని నేను అశ్రధ్ధ చేయదల్చుకోలేదు. మర్చిపోదల్చుకోలేదు.  

1 comment:

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete