Tuesday 23 October 2012

కింగ్ ఆఫ్ రొమాన్స్


గత సెప్టెంబర్ 27 నాడు యశ్ చోప్రా చివరిసారిగా మీడియా ముందుకి వచ్చారు. అది చోప్రా పుట్టిన రోజు. అదే తన చివరి మీడియా మీట్ అవుతుందని బహుశా చోప్రా కూడా ఊహించి ఉండరుత్వరలో రాబోతున్న తన చిత్రం "జబ్ తక్ హై జాన్" (JTHJ) గురించి మాట్లాడుతూ - అదే తన చివరి చిత్రం గా చెప్పారు.  JTHJ రిలీజ్ తర్వాత కొన్నాళ్లు కాశ్మీర్ వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని కూడా చెప్పారు. కొత్త తరం దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, నటీనటులకు సహాయపడుతూ తన శేష జీవితం గడుపుతానని తన మనసులో మాట చెప్పారు

టీవీలో ప్రోగ్రాం చూశాకే - నేనూ, మా పెద్దబ్బాయి ప్రణయ్ జవహర్ నవోదయ విద్యాలయ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ కోసం గుంటూరు బయల్దేరాము. బహుశా అంతకు ఒక నెల రోజుల ముందు అనుకుంటాను .. సి ఎన్ ఎన్ లో షారుఖ్ ఖాన్ యష్ చోప్రాను ఇంటర్వ్యూ చేసిన అద్భుతమైన ప్రోగ్రాం (రిపీట్) ఒకటి చూశాను.  

యష్ చోప్రా తన చివరి చిత్రం JTHJ పూర్తి చేశారు. చిత్రం కోసం మళ్లీ ఆర్ రెహమాన్, గుల్జార్ లను చాలా కాలం తర్వాత ఒక్క దగ్గరికి చేర్చారు. కాని, నవంబర్ 13 దాని విడుదలను చూడకుండానే కన్ను మూశారు.

రాబోయే నవంబర్ 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లో యష్ చోప్రాకు ప్రత్యేకంగా సన్మానం చేయటానికి నిర్ణయించారు. ఇప్పుడు అదే IFFI లో యష్ చోప్రాకు ప్రత్యేకంగా సంతాపం ప్రకటించాల్సి రావటం అత్యంత బాధాకరం

దాగ్, కభీ కభీ, సిల్ సిలా, లమ్హే, డర్, చాందినీ, దిల్ తో పాగల్ హై వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన యష్ చోప్రాను "కింగ్ ఆఫ్ రొమాన్స్" ట్యాగ్ వరించటంలో ఆశ్చర్యం లేదు. అయితే - యష్ చోప్రా 'రొమాన్స్’ లోకి దిగక ముందు మతసహనం మీద "ధర్మపుత్ర" అనే చిత్రం నిర్మించి తన సత్తా చాటుకున్నారు. అదే విధంగా - బీహార్ బొగ్గు గనుల్లో సంభవించిన ఒక యదార్ధ గాథ నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఆయన తీసిన "కాలా పత్తర్" గురించి గానీ, ఆయన నిర్మించిన ఏకైక ప్రయోగాత్మక థ్రిల్లర్ "ఇత్తెఫాక్" గురించి గానీ చాలా మందికి తెలియకపోవచ్చు.

సుమారు 50 ఏళ్ల తన ఫిలిం కెరీర్లో దాదాపు 50 వరకు ఉత్తమ స్థాయి చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించిన యష్ చోప్రా - నాటి బ్రిటిష్ ఇండియా లోని లాహోర్ లో 1932 లో జన్మించారు. 80 ఏళ్ల వయసులో కూడా, ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా, చిరునవ్వుతో, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే రొమాంటిచ్ చిత్రాల రారాజు ఎవరూ ఊహించని విధంగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడి మరణించడం అత్యంత బాధాకరం.

May Yash ji’s soul rest in peace ..


Saturday 20 October 2012

సెలెక్టివ్ మెమొరీ

ప్రముఖ ఫ్రీలాన్స్ రైటర్ శోభా డే రాసిన రచనలన్నీ చదివాన్నేను. కాని, చలం పుస్తకాల్లా చాలా మందికి ఆమె రాతలు అసలు నచ్చవు. అది వేరే విషయం.

శోభాడే సాహిత్యం పాశ్చాత్య దేశాల్లోని కొన్ని యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలుగా చేర్చబడ్డాయి. ఎందరో విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆమె రచనల మీద రిసెర్చ్ చేశారు. అయినా మన  వాళ్లకి ఆమె రచనలు నచ్చవు. ఎందుకో వాళ్లకే తెలియాలి

పత్రికల్లో నిర్మొహమాటంగా శోభా డే రాసే 'కాలమ్' లన్నా, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తను రాయాలనుకున్నది రాసే తన బ్లాగ్ అన్నా నాకు మరీ ఇష్టం. భౌతికంగా ఆమె వయసు అరవై దాటింది. అస్సలు అలా కనిపించదు. జీవితం పట్ల, జీవన శైలి పట్ల మమకారం ఉన్నవారెవరూ అంత తొందరగా వృధ్ధులు కాలేరని చెప్పడానికి శోభా డే నే మంచి ఉదాహరణ.

అయినా ఇక్కడ ఆమె వయసుని చర్చించడం, గ్లామర్ని చర్చించడం నా ఉద్దేశ్యం కాదు. అరవై దాటినా ఆమె రచనలు, అలోచనలు ఇంకా నవ యవ్వనంగా, ఫేసినేటింగ్ గా ఉంటాయన్న నిజాన్ని చెప్పటమే నా ఉద్దేశ్యం.

శోభా డే రాసిన ఫిక్షన్ అంతా ఒక ఎత్తు అయితే, నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఆమె జీవిత చరిత్ర "సెలెక్టివ్ మెమొరీ" ఒక్కటే ఒక ఎత్తు. అసలా టైటిల్ చూడండి.. సెలెక్టివ్ మెమొరీ! తన జీవితంలోని ఎన్నెన్నో జ్ఞాపకాల్లో కొన్నిటిని మాత్రమే ఆమె ఎన్నిక చేసుకొంది. వాటినే తన పాఠకులతో షేర్ చేసుకోవాలనుకొంది. వాటినే ఒక అందమైన ప్యాక్ లో అందించింది. వెరీ ఇన్స్ పైరింగ్ బుక్.

నేనుసెలెక్టివ్ మెమొరీ’ ని బహుశా పదేళ్ల క్రితం చదివి ఉంటాను. పదేళ్లలొ కనీసం ఒక నాలుగు అయిదు సార్లయినా మళ్లీ తిరగేసి ఉంటాను. పెంగ్విన్ పబ్లిష్ చేసిన పుస్తకాన్ని ఇవాళ మళ్లీ ఒకసారి అలా అలా తిరగేశాను

ఒక దశాబ్ద కాలం .. అందులోనూ జీవితంలోని అత్యంత కీలకమైన దశలో.. ఎన్నో ఢక్కా మొక్కీలు తిన్నాను. దశాబ్ద కాలంలో నేను కలలో కూడా ఊహించని, ఆశించని తీయటి అనుభూతులున్నాయి. అత్యంత చేదు అనుభవాలున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో - ఇవాళ నేను మళ్లీ తిరగేసిన శోభా డే పుస్తకంసెలెక్టివ్ మెమొరీ’ నాకు మరింత ఆనందాన్నిచ్చింది.

నేను కోల్పోయిందేమిటో నాకు తెలిపింది. ఇప్పుడిప్పుడే నేను అలవర్చుకుంటున్న ఈ స్థితప్రజ్ఞత నాకెంత అవసరమో చెప్పింది. ఎప్పుడయినా గానీ, నేనునేను" గానే కరెక్టు అని ధైర్యం చెబుతూ నా భుజం తట్టింది

Wednesday 17 October 2012

ఎక్స్ ట్రార్డినరీ

సినీ ఫీల్డుకు సంబంధించి మధ్య రెండు ఆసక్తికరమైన వార్తలు చదివాను, చూశాను. రెండు వార్తలూ ఫీల్డులో హైరేంజ్ లో ఉన్న దర్శక నిర్మాతలకు సంబంధించింది కావటం మరింత ఆసక్తికరం. ఇలాంటి వార్తలు, ఇంత ఓపెన్ గా బయటికి రావటం ఫీల్డులో బహుశా ఇదే మొదటిసారి. వార్తలే అనుకుంటే, వార్తల్లోని అంకెలు కూడా కొంచెం ఎక్స్ ట్రార్డినరీ గానే ఉన్నాయి.

‘కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రానికి సంబంధించి నిర్మాత నుంచి తనకు ఇంకా 4.5 కోట్లు రెమ్యూనరేషన్ రావాలంటూ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ యూనియన్లో ఫిర్యాదు చేశాడు. రావల్సిన బ్యాలెన్సే నాలుగున్నర కోట్లు అంటే, మరి పూరి మొత్తం రెమ్యూనరేషన్ ఎంతయి ఉంటుంది? ఇది కనీసం కోటి రూపాయల ప్రశ్న!  

మరోవైపు, దర్శకుడు పూరి బడ్జెట్ ను బాగా పెంచేశాడనీ, అందువల్ల హీరోతో పాటు దర్శకుడు కూడా విషయంలో సర్దుకోక తప్పదని చిత్ర నిర్మాత అంటున్నాడు. చానెల్స్ లో, పత్రికల్లో వార్త ఇలా నలుగుతుండగానే, దర్శక నిర్మాతలిద్దరూ కల్సి సం యుక్తంగా ప్రెస్స్ మీట్ లో కూర్చుని తమ చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించటం విశేషం. బహుశా ఇష్యూ సెటిల్ అయిపోయి ఉంటుంది.  

ఇదిలా ఉంటే - మరోవైపు, వర్సటైల్ జీనియస్ రాఘవేంద్ర లారెన్స్ దర్శకత్వంలో రిలీజ్ అయినరెబెల్’ చిత్రం కూల్ గా నడుస్తోంది. కాకపోతే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పూరి జగన్నాథ్ నిర్మాత మీద కంప్లయింట్ ఇస్తే, రెబెల్ నిర్మాత చిత్ర దర్శకుడు లారెన్స్ మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కంప్లయింట్ ఇచ్చాడు. మొత్తం 22.5 కోట్లలోనే చిత్రం పూర్తి చేస్తానని చెప్పిన లారెన్స్ బడ్జెట్ ని  40 కోట్లకు పెంచేశాడని నిర్మాత గోల!

దీనికి రిటార్ట్ గా, ప్రొడ్యూసర్ తనకు చెప్పకుండా డబ్బింగ్, రీమేక్ రైట్స్ అమ్ముకున్నాడని లారెన్స్ ఎదురు కంప్లయింట్ ఇచ్చ్చాడు నిర్మాత మీద. ముందే అనుకున్న ఒప్పందం ప్రకారం డబ్బింగ్ రైట్స్ నిర్మాత లారెన్స్ కు ఇవ్వాలట! అదీ విషయం. వివాదం ఇంకా పరిష్కారం అయినట్టులేదు

పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా - ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రూపంలో గొడవలూ సమస్యలూ సినీ ఫీల్డులో సర్వ సాధారణం అనీ, అవి లేకుండా సినిమా పూర్తి కాదనీ తాజాగా రెండు వార్తల ద్వారా కూడా మనం గమనించవచ్చు

పై వార్తలతో ఎలాంటి సంబంధం లేని ఒక జ్ఞాపకం ఏంటంటే - లారెన్స్ మంచి స్నేహశీలిరాజా హీరో గా నా తొలి చిత్రం 'కల’ లో వేటూరి సుందర రామ మూర్తి గారు రాసినతకిట తకిట ధిమిరే’ అనే ఒక పాటలో రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోకుండా స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి, తన డాన్స్ తో పాటను ఒక ఊపు ఊపాడు లారెన్స్.

పద్మాలయ స్టూడియోలో షూటింగ్ జరిగిన రాత్రి నాకు ఇప్పటికీ  గుర్తుంది ..

కోణార్కలో కదిలిన శిల్పం

గత మే నెలలో అనుకుంటాను .. ర్యాండమ్ హౌజ్, ఎం ఎస్ ఎన్ కల్సి ఒక రైటింగ్ కాంపిటీషన్ ను ప్రకటించాయి. దేశంలోనే 12 మంది అత్యుత్తమ స్థాయి కథానికా రచయిత్రుల కోసం పోటీ! పోటీలో పాల్గొనడానికి రచయిత్రులకు వారిచ్చిన థీమ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి:

1. "Woman in the City": 'Frankly my dear, I don't give a damn' -- Gone With the Wind

2. "Growing up in India": 'Experience is the name every one gives to their mistakes' -- Oscar Wilde

3. "The Man in my Life": 'Being with him made her feel as though her soul had escaped from the narrow confines of her island country into the vast, extravagant spaces of his' -- The God of Small Things

ఒక కండిషన్ ఏంటంటే - అయా థీమ్స్ తో పాటు ఇచ్చిన కొటేషన్స్ ని కూడా పోటీదారులు వారి కథానికల్లో ఎక్కడో ఒక చోట ఉపయోగించాల్సి ఉంటుంది. కండిషన్ వెరైటీ గా ఉంది కదూ? తర్వాత, పోటీకి సుమారు 400 వరకు ఎంట్రీలు వచ్చాయని రాశారు. వాటిల్లో అత్యుత్తమమైన 12 కథానికలను మాత్రం ఎన్నిక చేసి ఒక కథా సంకలనం రూపంలో ఇటీవలే విడుదల చేశారు.

అనుకోకుండా, రోజు సాయంత్రం జూబ్లీ హిల్స్ లో ఒక సినీ ఆర్టిస్ట్ ని కలవడానికి వెళ్లినపుడు అక్కడ పుస్తకం కనిపించింది. ఆశ్చర్యపోయాను. ముందుగా నటి కి ఉన్న ఉత్తమ స్థాయి పుస్తక పఠనం అభిరుచికి కంగ్రాట్స్ చెప్పాను. తర్వాత, అహ్మదాబాద్ నుంచి శంతన పాఠక్ రాసిన "మిరేజ్" కథ అప్పటికప్పుడే చదివాను. చాలా బావుంది.  

మామూలుగా చదవడానికే కొద్దిరోజుల సమయం తీసుకొనే నవల చదివినట్టుగా కాకుండా, కథానిక చదవటం అంత కష్టం కాదు. ఇక ఇలాంటి ఆధునిక తరం కథానికలు చదవటం అంటే నాలాంటి వారికి సులభం, ఇష్టం కూడా.  ఆ ఇష్టం తోనే ఒక కథని అప్పటికప్పుడే చదవగలిగాను బహుశా!

మీటింగ్ అయిపోయాక లేచివస్తోంటే - మిగిలిన 11 కథలు కూడా చదివి తర్వాత ఇవ్వండి అని "షి రైట్స్" పుస్తకాన్ని నాతో తీసుకెళ్లమంది ఆర్టిస్టు. ఇప్పుడునాకున్న పనుల్లో అవన్నీ చదవటం వెంటనే కుదరకపోవచ్చునని సున్నితంగా "ఇప్పుడు కాదు" అని చెప్పి వచ్చేశాను.  

ఇంటికి వస్తోంటే, దారిలో అనుకోకుండా రెండు మూడు విషయాలు గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాను. నేనీ మధ్య అసలు కథానికలే ఏమీ చదవట్లేదు. సుమారు ఆరేళ్ల క్రితం అనుకుంటాను .. నేను చదివిన చివరి కథ - బుచ్చిబాబు రాసిన "నన్ను గురించి కథ రాయవూ". కథ ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదుఇక నేను రాసిన తొలి కథానిక "పెళ్లికి ముందు". బహుశా అది 1992 అనుకుంటాను. ఆంధ్ర భూమి వీక్లీలో అచ్చయింది. తర్వాత ఒక  రైటర్స్ మీట్ లో కల్సినపుడు అప్పటి ఆంధ్ర భూమి ఎడిటర్ సికరాజు గారు నన్ను బాగా మెచ్చుకోవటం నాకు ఇంకా గుర్తు. ఇక - నేను రాసిన చివరి కథానిక, నాకు గుర్తున్నంతవరకు, 2006 లో వార్త దినపత్రిక ఆదివారం బుక్ లో అచ్చయ్యింది కథ పేరు - "కోణార్కలో కదిలిన శిల్పం." 

ఉన్నట్టుండి చాలా యేళ్ల తర్వాత ఇప్పుడు మల్లీ ఒక కథ రాయాలనిపిస్తోంది. ఎప్పుడు రాస్తానో, అసలు రాస్తానో లేదో తెలియదు కానీ, కోరిక మళ్లీ నాలో పుట్టడానికి కారణమైన సాయంత్రానికీ, నటికీ థాంక్స్ చెప్పక తప్పదు