Friday 28 May 2021

జ్ఞానోదయమ్ - The Conclusion

ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యక్తినో, పరిస్థితినో ఎదుర్కొన్నాక "అబ్బ... ఈ దెబ్బతో జ్ఞానోదయం అయ్యింది" అనుకొంటాము. కాని అది నిజం కాదు. 

కట్ చేస్తే - 

ఆకాలంలో బుధ్ధుడికి బోధివృక్షం కింద కూర్చున్నప్పుడు 49 రోజుల్లో జ్ఞానోదయం అయిందని చదివాను.

మహానుభావుడు... 49 రోజుల్లోనే, ఒక్కసారికే, సర్వం ఒక అవగాహనకొచ్చింది ఆయనకు. కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అస్సలు కుదరదు.

"ఇంక ఇంతకు మించి మనం నేర్చుకొనేది ఏముంటుంది" అనుకుంటాం. కాని, దాని జేజమ్మలాంటి సిచువేషన్ కూడా వెంటనే వస్తుంది.

"ఈ వ్యక్తిని మించి మనల్ని బాధపెట్టేవారు ఇంక లైఫ్‌లో రారు... వచ్చే పరిస్థితికి మనం ఇంక చోటిచ్చే  ప్రసక్తే లేదు" అనుకొంటాం. కాని, తప్పక వస్తారు. మనం ఎదుర్కొంటాం.  

ఇవన్నీ అనుభవం మీదే తెలుస్తాయి.

కొంతమందికి మాత్రం ఈ జ్ఞానోదయం బై డిఫాల్ట్ అయి ఉంటుందనుకొంటాను. అదృష్టవంతులు. వీరి దరిదాపుల్లోకి ఏ నాన్సెన్స్ వ్యక్తులూ, పరిస్థితులూ రాలేవు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అంత గుడ్డిగా దేన్నీ నమ్మరు. క్షణాల్లో విషయాన్ని తేల్చేస్తారు. ఇలాంటివాళ్లంటే నాకు చాలా గౌరవం.

కొంచెం లిబరల్‌గా, మాస్‌గా చెప్పాలంటే - ఇదే లోకజ్ఞానం.

కరోనావైరస్ పుణ్యమా అని, సుమారు గత 15 నెలల లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా విషయాల్లో ఆత్మపరిశీలన చేసుకొని, బాగా ఆలోచించుకొనే అవకాశం అందరికీ దొరికింది.

ఈ కోణంలో - లాక్‌డౌన్‌ను మించిన బోధివృక్షం లేదు.   

నా విషయంలో మాత్రం - ఏదో బూడిదలోంచి లేచి దులుపుకొన్నట్టు కాకుండా... మస్తిష్కం నిజంగానే ఒక భారీ కుదుపుకు లోనయ్యింది. 

అయితే, ఈ 15 నెలలకాలంలో ఇంతకుముందు కూడా రెండు సార్లు ఇలాగే అనుకున్నాను. ఇది మూడోసారి, చివరిసారి అనుకుంటున్నాను. 

కొత్తగా ఏదో తెలుసుకోవడమో, నేర్చుకోవడమో అనేది జీవితంలో కొనసాగే ఒక నిరంతర ప్రక్రియ. దానికి ఫుల్‌స్టాప్ ఉండదు. అలా ఉంటుందనుకోవడం ఒక భ్రమ. 

కాని, వీటన్నిటినీ మించిన ఒక ఆలోచనాస్థాయికి చేరుకోవడం అనేది ఒకటుంటుంది. అది మాత్రం ఒక్కసారే వస్తుంది.  

ఏమైనా,  అయామ్ పాజిటివ్... 

ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. వ్యక్తిగతంగా నేను నాలో కోరుకొంటున్న మార్పు అదే. 

Thursday 27 May 2021

అవతలివారి ప్రాధాన్యతల లిస్టులో నువ్వెక్కడ?

కేస్ #1:

మనం ఒకరికి కాల్ చేస్తాం. అవతల ఫోన్ ఎత్తి, "ఒక్క 10 నిమిషాల్లో చేస్తా" అని పెట్టేస్తారు. ఆ 10 నిమిషాలు ఎన్నటికీ రాదు. వాళ్ళు చెయ్యరు. 

మళ్ళీ మనం చేసినప్పుడు, ఇదంతా మర్చిపోయి, మనం అప్పుడే ఫోన్ చేసినట్టు, "చెప్పండి" అంటారు!  

ఏదో బిజీలో ఉంటారు కదా అన్న ఉద్దేశ్యంతో వాట్సాప్ మెసేజ్ పెడ్తాం. రోజుకొకటి పెడుతూనే ఉంటాం. మనకక్కడ అతను ఆన్ లైన్లో ఉన్నట్టు తెలుస్తుంటుంది, లాస్ట్ ఎప్పుడు చూసిందీ తెలుస్తుంటుంది. 

వారి బిజీ వారిది. వారి సమస్యలు వారివి. మనమేం దీని గురించి అడగము. అయినా చెప్తారు: "4 రోజుల తర్వాత ఇప్పుడే ఫోన్ నా చేతికి వచ్చింది" అని! 

అసలు 4 రోజులు ఫోన్ లేకుండా - సిటీ నడిబొడ్డున - ఏ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తాడు?   

కేస్ #2:

నేను: "నీకు వీలయ్యే టైమే చెప్పు. ఆ టైమ్‌కు కాల్ చెయ్యి. ఒకవేళ నువ్వు ఆ టైమ్‌కు చెయ్యలేకపోతే, జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టు. నీ బిజీ పనుల్లో ఇది కూడా మర్చిపోయే అవకాశముంటుంది కాబట్టి - టైమ్ చెప్పు, నేనే కాల్ చేస్తా"

అతను: సమస్యే లేదు. నేను చేస్తా కదా... 10 - 11 మధ్య చేస్తా.

11 అయిపోతుంది. సాయంత్రం 7 కూడా అయిపోతుంది. కాల్ రాదు. "ఇప్పుడు చెయ్యలేను" అని చిన్న మెసేజ్ కూడా రాదు. 

మళ్ళీ నేను కాల్ చేస్తే, "మీటింగ్‌లో ఉన్నాను. అయిపోగానే చేస్తాను" అని ఒక మెసేజ్ వస్తుంది. 

ఆ మీటింగ్ ఎన్నటికీ అయిపోదు. నాకు కాల్ రాదు.   

కట్ చేస్తే - 

ఈ రెండు కేసుల్లో - ఇద్దరికీ వ్యక్తిగతంగా నేను అత్యధిక ప్రాధాన్యమిస్తాను. వాళ్ల కాల్ గాని, మెసేజ్ కాని వస్తే వెంటనే రెస్పాండ్ అవుతాను. అది నా అలవాటు. 

అలాగని, అందరూ నాలాగే ఉండాలని నేనెప్పుడూ అనుకోను. చాయిస్ వారికే ఇస్తాను. అయినా సరే, 90% ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది.  

ఇలాంటి ఉదాహరణల్లో ఎదుటివారిని తప్పుపట్టడానికి లేదు. అది వారి ఇష్టం. వారి బిజీ, వారి టెన్షన్స్, వారి తలనొప్పులు వారికుంటాయి. 

అయితే - "అవతలివారి ప్రయారిటీ లిస్టులో మనం ఎక్కడున్నాం" అన్న విషయాన్ని మాత్రం ఇలాంటివి మనకు బాగా స్పష్టం చేస్తాయి.  

Sunday 16 May 2021

దర్బార్ హాల్ ఒక మంచి జ్ఞాపకం


ఫేస్‌బుక్‌లో కొన్ని ఫోటోలు చూసినప్పుడు కొన్ని గుర్తొస్తాయి. ఒకలాంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం...   

ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో - ఊరికే ఎప్పుడేమవుతుందా అని భయపడుతూనో, టెన్షన్ పడుతూనో, అదేపనిగా ఆలోచిస్తూనో ఆరోగ్యం, మనసూ పాడుచేసుకునేకంటే - కొన్ని అలాంటి నాస్తాల్జిక్ ముమెంట్స్‌ను గుర్తుతెచ్చుకోవడం ఎంతయినా మంచిదని నాకనిపించి ఈ బ్లాగ్ రాస్తున్నాను. 

చిన్నప్పుడు వరంగల్‌లో, మా ఇంటిదగ్గర బొడ్రాయిలో ఉన్న విజ్ఞానమందిర్ గ్రంథాలయంలో ఎప్పుడూ "సోవియట్ లాండ్", "స్పుత్నిక్" లాంటి రష్యన్ పత్రికలను అదేపనిగా చదివేవాణ్ణి. ఈ ఇష్టమే పెద్దయ్యాక నేను యూనివర్సిటీకెళ్ళినప్పుడు, అక్కడ మూడేళ్ళ (పార్ట్ టైమ్) రష్యన్ డిప్లొమాలో చేరి, అందులో కూడా యూనివర్సిటీ టాపర్ అవ్వడానికి ఒక ఇన్‌స్పైరింగ్  నేపథ్యమైంది.

నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన రెండు పీజీల్లో ఒకటి షెల్టరిచ్చింది, ఫుడ్ పెట్టింది. మంచి మిత్రులనిచ్చింది. ఇంకో పీజీ నాకు మంచి ఉద్యోగాలనిచ్చింది. కాని, ఈ రెండిటికంటే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది మాత్రం నా మూడేళ్ళ పార్ట్ టైమ్ రష్యన్ డిప్లొమానే!  

అది పూర్తిగా మరో లోకం. బోధనా పధ్ధతి ఒక అద్భుతం. క్లాస్‌లో ఎవ్వరు మాట్లాడినా... అయితే రష్యన్లో మాట్లాడాలి, లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. పూర్తిగా తెలుగు మీడియం నుంచి యూనివర్సిటీలోకి ప్రవేశించిన నాకు అంతో ఇంతో ఇంగ్లిష్ రావడానికి కారణం ఈ రష్యన్ డిప్లొమానే. 

ఇవన్నీ ఒక ఎత్తైతే - మా క్లాస్‌లో మొత్తం 20 మంది స్టుడెంట్స్ ఉంటే, అందులో 16 మంది అమ్మాయిలే! వాళ్లంతా సిటీ అమ్మాయిలు, మాట్లాడితే ఇంగ్లిష్!! అమ్మాయిలు మొదట్లో నన్ను కొంచెం టార్చర్ పెట్టినా - తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. రష్యన్ డిప్లొమా నాకు అంత బాగా నచ్చడానికి ఇది కూడా ఒక బిగ్ రీజన్ అని నేను ఒప్పుకొనితీరాలి.        

కట్ చేస్తే - 

1987-88 లో దాదాపు ఒక సంవత్సరంపాటు ఇండియాలో "సోవియట్ ఫెస్టివల్" జరిగింది. అప్పుడు ఎందరో రష్యన్ పాప్ సింగర్స్, ఆర్టిస్టులు, రచయితలు, బాలెరినాలు, జిమ్నాస్ట్‌లు, క్రీడాకారులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు అప్పటి USSR నుంచి ఇండియా వచ్చారు. 

రాజీవ్ గాంధీ, గోర్బచేవ్‌ల ఫోటోలు, స్పీచ్‌లు అప్పుడొక క్రేజ్.  

ఇండియాలో జరిగిన సోవియట్ ఫెస్టివల్‌లో భాగంగా - ఢిల్లీ, మద్రాసు, హైద్రాబాద్ వంటి దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రష్యన్ సాంస్కృతిక కార్యక్రమాలు, రష్యన్స్‌తో ఇంటరాక్టివ్ కార్యక్రమాలూ చాలా జరిగాయి. 

ఆ సందర్భంగానే - వందలాదిమంది నేటివ్ రష్యన్ డెలిగేట్స్ ముందు - కోఠీ వుమెన్స్ కాలేజీలో వున్న దర్బార్ హాల్‌లో, అప్పుడు మా ఓయూ రష్యన్ డిప్లొమా స్టుడెంట్స్ ఒక రష్యన్ నాటికను రష్యన్ భాషలోనే ప్రదర్శించాము. 

నాటిక చిన్నదే. కాని, ఆ సాయంత్రం, మా ముందు దర్బార్ హాల్లో వందల్లో ఆసీనులైన రష్యన్ డెలిగేట్స్ అందరూ మా ప్రదర్శనను మెచ్చుకొని చప్పట్లు కొట్టి అభినందించడం అనేది ఇప్పటికీ నాకు ఒళ్లు గగుర్పొడిచే ఒక మంచి జ్ఞాపకం.  

అయితే - ఇప్పట్లా అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి, ఫోటోలకోసం మేము ఆ కార్యక్రమానికి నిర్దేశించబడిన ఫోటోగ్రాఫర్స్ మీదనే పూర్తిగా ఆధారపడాల్సివచ్చిందనుకుంటాను. అయినా సరే, కొన్ని ఫోటోలు తప్పక ఉండాలి. అవి కూడా ఎప్పుడో ఒకసారి ఇలాగే తవ్వకాల్లో బయటపడతాయని నా నమ్మకం. 

Sunday 9 May 2021

ఏ చిన్న చాన్స్ తీసుకోవద్దు!

ఇప్పటిదాకా మిమల్ని కరోనా తాకలేదంటే అర్థం మీరు అదృష్టవంతులు అని గాని, మీలో ఇమ్యూనిటీ బాగుందనీ కాదు. మీరు చాలా బాధ్యతగా ఉన్నారని అర్థం.

దయచేసి దాన్నలాగే కంటిన్యూ చేయండి...

కట్ చేస్తే - 

దాదాపు రెండువారాల క్రితం కోవిడ్19 నన్ను కౌగిలించుకొంది. మొత్తం ఇంటికే పరిమితం చేసుకొన్నాను. ఇప్పుడైతే తగ్గినట్టే ఉంది. మామూలుగానే ఉన్నాను. రుచి, వాసనే ఇంకా దారిలోకి రావాల్సి ఉంది. 

బహుశా ఇంకో వారం పడుతుందనుకుంటాను, నేను పూర్తిగా ఫిట్ అవ్వడానికి. 

అయితే - ఈ రెండువారాలు మానసికంగా నేను అనుభవించిన వ్యధ గురించి చెప్పలేను. ఇక్కడ విషయం నా ప్రాణం మీద భయం కాదు. కొన్ని రాయడానికి ఇది సమయం కూడా కాదు. రాయకూడదు కూడా. 

అదలా పక్కనపెడితే ... ఈ సెకండ్ వేవ్‌లో - నాకు తెలిసిన ఎందరో నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు కూడా - నేనెన్నడూ ఊహించని విధంగా ఈ కరోనా బారినపడి మళ్ళీ కోలుకోలేదు.

ఇప్పుడే తెలిసింది... మిత్రుడు, ప్రముఖ జర్నలిస్టు టీయెన్నార్ పరిస్థితి కూడా ప్రస్తుతం క్రిటికల్‌గా ఉందట. I wish all will be okay and he'll be alright. 

ఈ సందర్భంగా, మీ అందరికీ నా వ్యక్తిగత విన్నపం ఏంటంటే - ఇంకొన్నాళ్ళు ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న చాన్స్ తీసుకోవద్దు...

ప్రస్తుతం మనమందరం ఒక కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం. కాని, తప్పకుండా దీన్ని కూడా అధిగమిస్తాం. 

This too shall pass... 

కట్ బ్యాక్ టూ మై బ్లాగింగ్ - 

కరోనా మళ్ళీ నన్ను ఇటు లాక్కొచ్చింది. కొన్ని అలవాట్లు అంత ఈజీగా పోవు. నా బ్లాగింగ్ హాబీ అలాంటిదే. 

ఒక పాజిటివ్ ఎడిక్షన్.

గత రెండువారాల నా కోవిడ్ ఐసొలేషన్‌లో నన్ను కాపాడింది ఆ టాబ్లెట్స్ మాత్రమే కాదు. అంతో ఇంతో నాలో ఉన్న చదివే అలవాటు, ఇలా ఏదో ఒకటి రాసే అలవాటు. ఇందులో ఎలాంటి అతిశయోక్తిలేదు. 

నా బ్లాగింగ్‌కి ఎక్స్‌టెన్షన్... మనోహరమ్ వెబ్ మ్యాగజైన్ కోసం బోలెడన్ని ఆర్టికిల్స్ రాశాను. ఇవ్వాటినుంచీ మళ్లీ రెగ్యులర్‌గా మ్యాగజైన్‌లో అప్‌డేట్ చేస్తుంటాను.