Sunday 16 May 2021

దర్బార్ హాల్ ఒక మంచి జ్ఞాపకం


ఫేస్‌బుక్‌లో కొన్ని ఫోటోలు చూసినప్పుడు కొన్ని గుర్తొస్తాయి. ఒకలాంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం...   

ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో - ఊరికే ఎప్పుడేమవుతుందా అని భయపడుతూనో, టెన్షన్ పడుతూనో, అదేపనిగా ఆలోచిస్తూనో ఆరోగ్యం, మనసూ పాడుచేసుకునేకంటే - కొన్ని అలాంటి నాస్తాల్జిక్ ముమెంట్స్‌ను గుర్తుతెచ్చుకోవడం ఎంతయినా మంచిదని నాకనిపించి ఈ బ్లాగ్ రాస్తున్నాను. 

చిన్నప్పుడు వరంగల్‌లో, మా ఇంటిదగ్గర బొడ్రాయిలో ఉన్న విజ్ఞానమందిర్ గ్రంథాలయంలో ఎప్పుడూ "సోవియట్ లాండ్", "స్పుత్నిక్" లాంటి రష్యన్ పత్రికలను అదేపనిగా చదివేవాణ్ణి. ఈ ఇష్టమే పెద్దయ్యాక నేను యూనివర్సిటీకెళ్ళినప్పుడు, అక్కడ మూడేళ్ళ (పార్ట్ టైమ్) రష్యన్ డిప్లొమాలో చేరి, అందులో కూడా యూనివర్సిటీ టాపర్ అవ్వడానికి ఒక ఇన్‌స్పైరింగ్  నేపథ్యమైంది.

నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన రెండు పీజీల్లో ఒకటి షెల్టరిచ్చింది, ఫుడ్ పెట్టింది. మంచి మిత్రులనిచ్చింది. ఇంకో పీజీ నాకు మంచి ఉద్యోగాలనిచ్చింది. కాని, ఈ రెండిటికంటే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది మాత్రం నా మూడేళ్ళ పార్ట్ టైమ్ రష్యన్ డిప్లొమానే!  

అది పూర్తిగా మరో లోకం. బోధనా పధ్ధతి ఒక అద్భుతం. క్లాస్‌లో ఎవ్వరు మాట్లాడినా... అయితే రష్యన్లో మాట్లాడాలి, లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. పూర్తిగా తెలుగు మీడియం నుంచి యూనివర్సిటీలోకి ప్రవేశించిన నాకు అంతో ఇంతో ఇంగ్లిష్ రావడానికి కారణం ఈ రష్యన్ డిప్లొమానే. 

ఇవన్నీ ఒక ఎత్తైతే - మా క్లాస్‌లో మొత్తం 20 మంది స్టుడెంట్స్ ఉంటే, అందులో 16 మంది అమ్మాయిలే! వాళ్లంతా సిటీ అమ్మాయిలు, మాట్లాడితే ఇంగ్లిష్!! అమ్మాయిలు మొదట్లో నన్ను కొంచెం టార్చర్ పెట్టినా - తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. రష్యన్ డిప్లొమా నాకు అంత బాగా నచ్చడానికి ఇది కూడా ఒక బిగ్ రీజన్ అని నేను ఒప్పుకొనితీరాలి.        

కట్ చేస్తే - 

1987-88 లో దాదాపు ఒక సంవత్సరంపాటు ఇండియాలో "సోవియట్ ఫెస్టివల్" జరిగింది. అప్పుడు ఎందరో రష్యన్ పాప్ సింగర్స్, ఆర్టిస్టులు, రచయితలు, బాలెరినాలు, జిమ్నాస్ట్‌లు, క్రీడాకారులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు అప్పటి USSR నుంచి ఇండియా వచ్చారు. 

రాజీవ్ గాంధీ, గోర్బచేవ్‌ల ఫోటోలు, స్పీచ్‌లు అప్పుడొక క్రేజ్.  

ఇండియాలో జరిగిన సోవియట్ ఫెస్టివల్‌లో భాగంగా - ఢిల్లీ, మద్రాసు, హైద్రాబాద్ వంటి దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రష్యన్ సాంస్కృతిక కార్యక్రమాలు, రష్యన్స్‌తో ఇంటరాక్టివ్ కార్యక్రమాలూ చాలా జరిగాయి. 

ఆ సందర్భంగానే - వందలాదిమంది నేటివ్ రష్యన్ డెలిగేట్స్ ముందు - కోఠీ వుమెన్స్ కాలేజీలో వున్న దర్బార్ హాల్‌లో, అప్పుడు మా ఓయూ రష్యన్ డిప్లొమా స్టుడెంట్స్ ఒక రష్యన్ నాటికను రష్యన్ భాషలోనే ప్రదర్శించాము. 

నాటిక చిన్నదే. కాని, ఆ సాయంత్రం, మా ముందు దర్బార్ హాల్లో వందల్లో ఆసీనులైన రష్యన్ డెలిగేట్స్ అందరూ మా ప్రదర్శనను మెచ్చుకొని చప్పట్లు కొట్టి అభినందించడం అనేది ఇప్పటికీ నాకు ఒళ్లు గగుర్పొడిచే ఒక మంచి జ్ఞాపకం.  

అయితే - ఇప్పట్లా అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి, ఫోటోలకోసం మేము ఆ కార్యక్రమానికి నిర్దేశించబడిన ఫోటోగ్రాఫర్స్ మీదనే పూర్తిగా ఆధారపడాల్సివచ్చిందనుకుంటాను. అయినా సరే, కొన్ని ఫోటోలు తప్పక ఉండాలి. అవి కూడా ఎప్పుడో ఒకసారి ఇలాగే తవ్వకాల్లో బయటపడతాయని నా నమ్మకం. 

No comments:

Post a Comment