Monday 30 August 2021

మనూ టైమ్!

చలం "మ్యూజింగ్స్" పుస్తకం చదివినప్పటి నుంచి నాకు మ్యూజింగ్స్ అన్న పదం తెలుసు. సుమారు 90 ఏళ్ళ క్రితం ఈ పుస్తకం రాశారు చలం గారు. 

యూట్యూబ్‌లో వీడియో షోల కంటే కూడా - ఆడియో పాడ్‌కాస్ట్‌లకే ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యం, విలువ ఉంది.

అమెరికా వంటి దేశాల్లో పాడ్‌కాస్ట్‌కు ఎక్కువ విలువిస్తారు. 

వీడియో అయితే చూస్తూ వినాలి. పాడ్‌కాస్ట్ అయితే డ్రైవింగ్ చేస్తూ, సైక్లింగ్ చేస్తూ, రన్నింగ్ చేస్తూ, నడుస్తూ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని...  చివరికి అలా పడుకొని కూడా వినొచ్చు. అదీ దీని ప్రధాన సౌలభ్యం.  

కట్ చేస్తే -

నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి నా మనసు పాడ్‌కాస్ట్ మీద పడింది. "ఫిలింనగర్ డైరీస్" పేరుతో ఒక 3 పైలట్ ఎపిసోడ్స్ చేశాను. రెస్పాన్స్ బాగానే ఉంది. 

అయితే - నా పాడ్‌కాస్ట్‌ను కేవలం సినిమాలకే పరిమితం చేయడం ఇష్టం లేదు. క్రియేటివిటీ, లైఫ్‌కు సంబంధించిన అన్ని ఎఫెక్టివ్ టాపిక్స్ మీద కూడా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్స్ చేయాలనుకుంటున్నాను. 

సో, ఇప్పుడు పాడ్‌కాస్ట్ పేరు మార్చాలి... 

"మనూటైమ్ మూవీ మిషన్" పేరుతో నాకు ప్రొడ్యూసర్‌గా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో లైఫ్ మెంబర్‌షిప్ ఉంది. అంతకు ముందు నేను ప్రచురించిన నా పుస్తకాలు కూడా "మనూటైమ్ కమ్యూనికేషన్స్" అనే నా ప్రొప్రయిటరీ ఫర్మ్ ద్వారా ప్రచురించాను.  

సో, ఇప్పుడు నా పాడ్‌కాస్ట్ టైటిల్ చిన్నగా, క్యాచీగా ఉండాలి కాబట్టి, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఇదే - "మనూ టైమ్". 

"మనోహర్ మ్యూజింగ్స్" అని పెడదామా అనుకున్నాను. అయితే - మ్యూజింగ్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. పూరి మ్యూజింగ్స్, రోజా మ్యూజింగ్స్, ఎట్సెట్రా చాలా మ్యూజింగ్స్ ఉన్నాయి ఇప్పటికే.

చలం మ్యూజింగ్స్ నేపథ్యంలో, మ్యూజింగ్స్ అనే పదం నాకు చాలా ఇష్టమే అయినా, ఇప్పటికే ఉన్న ఎన్నో మ్యూజింగ్స్‌లో నాదొకటి కలిసిపోకూడదని నా పాడ్‌కాస్ట్‌కు ఈ పేరు పెట్టాను -

MANU TIME! 

పేరుదేముంది... అసలు పాడ్‌కాస్ట్‌లో విషయముంటే ఏ పేరయినా పాపులర్ అవుద్ది. 

సో, నా ఫోకస్ అంతా కంటెంట్ మీదే ఇక. 

Friday 27 August 2021

ఫిలింనగర్ డైరీస్!

మొత్తానికి ఇవ్వాళ నా పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్ అప్‌లోడ్ చేశాను. 

టిమ్ ఫెర్రిస్ పాడ్‌కాస్ట్ వింటున్నప్పటి నుంచి అనుకొంటూనే ఉన్నాను, నేనూ ఓ పాడ్‌కాస్ట్ చెయ్యాలని. సుమారు నాలుగేళ్లయినా ఆ పనిచేయలేకపోయాను. 

పాడ్‌కాస్ట్, షోలు చాలా అవసరమని చెప్తూ ఆ మధ్యనే ఒక బ్లాగ్ రాశాను. కాని, పాడ్‌కాస్ట్ మాత్రం ప్రారంభించలేకపోయాను.

రెండు రోజుల క్రితం మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర ఉన్నట్టుండి ఒక మెసేజ్ పెట్టాడు... మీరు పాడ్‌కాస్ట్ స్టార్ట్ చెయ్యండి అని. 


ముందు సగంలో ఉన్న మన సినిమా డీల్స్ సంగతి తేలనీ  అన్నాను. తర్వాత, "చేద్దాంలే... ఇప్పటికిప్పుడు దానివల్ల మనకు జాక్‌పాట్ ఏదన్నా వచ్చేదుందా" అన్నట్టు మాట్లాడాను. 

"జాక్‌పాట్ ఏం రాదు గాని, ఆ బ్లాగ్‌లో రాసేదేదో పాడ్‌కాస్ట్‌లో చెప్పండి" అన్నాడు ప్రదీప్. 

పాయింటే! 

కీబోర్డ్ బాగానే రిఫ్రెష్ అయ్యిందనుకున్నాను.😊 

కాని, అది ప్రదీప్ చెప్పినంత ఈజీ కాదు. మొబైల్‌లో చెయ్యాలా? లాపీలో చెయ్యాలా? ఏది ఈజీ? ఆర్ట్ వర్క్ నాకు పెద్ద కష్టం కాదు. నేను చెయ్యగలను. కాని, ఎడిటింగ్ అవన్నీ ఎట్లా... ఇదంతా ఇప్పుడు కష్టంలే అనుకున్నాను.  

ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది. 

కట్ చేస్తే - 

థాంక్స్ టు జేమ్స్ ఆల్టుచర్ - ఎవరు ఈ ఫీల్డులో ఉన్నా, ఏ పనిచేస్తున్నా... పనిచేసేవాడైనా, పనిదొంగయినా... కనీసం ఒక అయిదేళ్లకోసారి "రీ-ఇన్వెంట్" అవ్వాలి అంటాడతను.    

నిన్న రాత్రి గట్టిగా అనుకున్నాను... ఈమాత్రం దానికి ఇన్నేళ్ళుగా వాయిదా వేస్తూరావడం నాకే నచ్చలేదు. అంతకుముందెప్పుడో బ్లాగ్‌లో పెట్టడానికి కాన్వాలో చేసుకున్న డిజైన్ తీసి డెస్క్‌టాప్ మీద రెడీగా పెట్టుకున్నాను. పాడ్‌కాస్ట్ ఎలా చేయాలి, ఏంటి అనేది ఓ గంటసేపు స్టడీ చేసి పడుకున్నాను. 

ఇవ్వాళ మధ్యాహ్నం మా బాల్కనీవైపున్న బెడ్రూంలోకెళ్ళి తలుపులేసుకున్నాను. నా మొట్టమొదటి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ సింగిల్ టేక్‌లో రికార్డ్ చేశాను. 

మొదటిసారి కాబట్టి అనుకుంటాను, కొంచెం డల్‌గా ఉంది. అక్కడక్కడా తడబాట్లున్నాయి. సరైన మాడ్యులేషన్ లేదు. వాయిస్‌లో ఉండాల్సినంత కాన్‌ఫిడెన్స్ లేదు. అయినాసరే, అదే సేవ్ చేశాను. ఎడిటింగ్ అదీ లేకుండానే "రా" ఆడియో ఫైల్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మిక్స్ చేసి అప్‌లోడ్ చేసేశాను.  

ముందు బండి కదలటం ముఖ్యం. పర్‌ఫెక్షన్ తర్వాత. 

Wednesday 25 August 2021

గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది!

నిజంగా ఇంత అందంగా ఈ హోం గార్డినింగ్ చెయ్యటానికి చాలా ఓపిక కావాలి. ఇది కూడా ఒక మంచి క్రియేటివ్ టాలెంటే. 

గార్డెనింగ్ అనేది మనకిష్టమైన రంగులతో సృష్టించుకొనే ఆర్ట్, పెయింటింగ్ లాంటి మరొక కళారూపం. ప్రపంచంలో ఉన్న ఎన్నెన్నో హాబీల్లో స్వచ్ఛతను, సంతోషాన్ని సమపాళ్లలో ఇచ్చే హాబీ ఇదొక్కటే.  

ప్యూర్ ప్లెజర్‌ అన్నమాట. 

ఇది నేర్చుకొంటే వచ్చే అభిరుచి కాదు. ఎంతో ఆసక్తి, ప్యాషన్ సహజంగా ఉండాలి. ఒకసారి దీనికి ఎడిక్ట్ అయితే చాలు, చివరి క్షణం వరకూ మానుకోలేరు. ప్రపంచంలోని ఏ డ్రగ్ కూడా దీన్ని మించిన 'హై' ఇవ్వలేదు.

అయితే - ఇది సిగరెట్స్, మందు, డ్రగ్స్ లాంటి నెగెటివ్ ఎడిక్షన్ కాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పాజిటివ్ ఎడిక్షన్.  

ఇంకో కోణంలో మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే - ఈ అభిరుచి ఉన్నవాళ్ళు మానసికంగా చాలా మెచ్యూర్డ్‌గా, కామ్‌గా ఉంటారు. లోపల ఇంకేమైనా అసంతృప్తి, బాధలు, కష్టాలు ఉన్నా సరే... కామ్‌గా, కంటెంటెడ్‌గా సులభంగా ఉండగలుగుతారు. ఈ హాబీ ఉన్నవాళ్ళలో వయస్సు కూడా అంత త్వరగా దగ్గరికి రాదు. కనీసం ఒక పదేళ్ళు తక్కువగా కనిపిస్తారు.  

గార్డెనింగ్‌ను "గ్రాండ్ టీచర్" అని కూడా అంటారు. ఎలాంటి క్లాసులు తీసుకోకుండానే ఎన్నో నేర్పిస్తుంది. వాటిల్లో చాలా ముఖ్యమైనది - ఓపిక. ఈ గ్రాండ్ టీచరే నేర్పించే ఇంకెన్నో ముఖ్యమైన విషయాల్లో ఒకటి - నమ్మకం.  

హోం గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం. హైద్రాబాద్‌లోని బిజీ జీవితం, ఎప్పుడూ వెంటాడే ఏదో ఒక స్ట్రెస్ నన్ను దీన్నుంచి చాలా దూరంగా విసిరేశాయి. అయితే, చెప్పుకోడానికి ఇదొక సాకు మాత్రమే. నిజంగా చేయాలనుకొంటే ఏదీ దీనికి అడ్డు కాదు. 

ఏదేమైనా, ఈ ప్యాషన్ ఉన్నవాళ్ళంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. నేను చేయలేకపోతున్నానే అని ఏ మూలో చిన్న బాధ.   

కట్ చేస్తే - 

నాకున్న లిమిటెడ్ సర్కిల్లో ఇంతమంచి హాబీని మారిషస్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో, అక్కడ ఒక నేటివ్ తెలుగువారింట్లో చూశాను. మళ్ళీ అంతకంటే ఫాంటాబ్యులస్ స్థాయిలో ఈ హోమ్ గార్డెనింగ్ ప్యాషన్‌ను ఈమధ్యే ఒక చోట చూశాను. 

ఈ ప్యాషనేట్ గార్డెనర్ నా స్టుడెంట్ కావడం నేను గర్వంగా ఫీలవుతాను.          

I like gardening. It’s a place where I find myself when I need to lose myself. 
– Alice Sebold in “Above and beyond”.

ఇంతకుముందు సినిమాలు వేరు, ఇప్పుడు వేరు!

Make Movies That Make Money…

మార్కెట్‌నూ బిజినెస్‌నూ బాగా స్టడీ చేసి, ఒక అవగాహనతో సినిమా నిర్మించినప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బులూ వస్తాయి. పేరూ వస్తుంది.

ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ హోదా వస్తుంది.

అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో, ఇదంతా ఇప్పుడు అతి సులభంగా సాధించవచ్చు.

కట్ చేస్తే –

లాక్‌డౌన్ సమయంలో – ఫిలిం ఇండస్ట్రీలో OTTలు, ATTల నేపథ్యంలో చాలా గమ్మత్తులు జరిగాయి.

OTT (Over-The-Top): film & tv content provider who’s going over the top of existing internet services. Ex: Netflix, Amazon Prime, Aha, Zee5, Sony Liv, ShreyasET, Urvasi, SparkOTT, etc.

ATT (Any-Time-Theater): advanced version of the OTTs.

కేవలం సినిమా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో మాత్రమే చూసినట్టైతే మాత్రం, ATT (Any Time Theater) అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్!

ఇండస్ట్రీ అంతా ఆందోళనతోనో, కన్‌ఫ్యూజన్‌తోనో అన్నీ మూసేసుకొని ఒకవైపు టెన్షన్‌పడిపోతోంటే – ఒక్క ఆర్జీవీ (రామ్ గోపాల్ వర్మ) మాత్రం దాదాపు ప్రతి రెండు వారాలకు ఒక సినిమా ఎనౌన్స్ చేస్తూ, తీస్తూ, చూపిస్తూపోయాడు!

100 రూపాయల టికెట్ పెట్టి, CLIMAX సినిమాకు కేవలం 24 గంటల్లో ఒక రెండున్నర కోట్లు సంపాదించుకున్నాడు. క్లైమాక్స్ ఇచ్చిన కిక్‌తో వెంటనే ఒక 22 నిమిషాల NAKED సినిమా తీసి దానికి 200 రూపాయల టికెట్ పెట్టి, ఇంకో అరకోటి సంపాదించుకున్నాడు.

చాలా పెద్ద గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు DIRTY HARI అనే టైటిల్‌తో ఒక హాట్ రొమాంటిక్ డ్రామా, తనే డైరెక్ట్ చేసి, ఏటీటీలో రిలీజ్ చేశారు. టికెట్ రేట్ 120 రూపాయలు. జస్ట్ 24 గంటల్లో 91 వేలమంది చూశారు. సుమారు కోటి పది లక్షల కలెక్షన్!

ఇదే ట్రాక్‌లో ఎం ఎస్ రాజు తాజాగా “6 Days, 7 Nights” అని ఇంకో సినిమా గోవాలో ఇటీవలే పూర్తిచేశారు.

“ఆర్జీవీ కాబట్టి అంత పబ్లిసిటీ వచ్చింది. వేరేవాళ్లకు అట్లా కలెక్షన్స్ రావు” అని ఒక లాజిక్. కాని, ఇప్పుడున్న సోషల్‌మీడియా పవర్ నేపథ్యంలో ఈ లాజిక్ నిలబడదు.

అంతేకాదు, ఏటీటీ కోసం తీసే సినిమాలు కూడా, అందరూ ఆర్జీవీని అనుకరించి అట్లాగే తీయాలనే రూల్ కూడా ఏంలేదు.

కలర్ ఫోటో, మెయిల్, సినిమా బండి వంటి సినిమాల్ని ఓటీటీలో ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు? వాటిల్లో బ్రాండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎవరున్నారు??

సో, మనం ఎంత ఎఫెక్టివ్‌గా సినిమా తీస్తాం… ఎంత ఎఫెక్టివ్‌గా ప్రమోట్ చేస్తాం అన్నదే ముఖ్యం.

ఏటీటీల్లో కూడా మొత్తం అడల్ట్ కంటెంట్‌తో రన్‌చేస్తేనే డబ్బులొస్తాయి అనుకోవడం కూడా కరెక్టు కాదు. బూతే చూడాలనుకొంటే ఇంటర్నెట్ నిండా ఒక మనిషి చూడ్డానికి జీవితకాలం కూడా సరిపోనంతటి పోర్న్ ఉంది. అదంతా వదులుకొని, ఇక్కడ 100 రూపాయల టికెట్ కొనుక్కొని ఈ సినిమాల్లో ఏదో రెండు హాట్ సీన్లు చూడ్డానికి ప్రేక్షకులు వస్తారనుకోవడం ఉట్టి భ్రమ.

ఇంతకుముందు సినిమాలు వేరు. ఇప్పుడు వేరు.

Content is the King.
Money is the ultimate Goal.

ఇప్పుడు ఊహించనంత అతి తక్కువ బడ్జెట్లో కొత్తవారితో సినిమాలు నిర్మించి, ATT ల్లో రిలీజ్ చేయవచ్చు. మనం చూస్తుండగానే... ఫ్యూచర్లో ప్రతి ఓటీటీ కూడా రిలీజ్ సినిమాలకు ఏటీటీ అవుతుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే – కోట్లు కొల్లగొట్టే కొత్త బిజినెస్ మాడల్ ఈ ATT!

మరోవైపు, OTTలు కూడా అవుట్‌రైట్ సేల్ పద్ధతిలో సినిమాలను కొంటున్నాయి. ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు.

ఈమధ్యే, చాలా తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన “ఏక్ మినీ కథ” సినిమాను అమెజాన్ ప్రైమ్ 9 కోట్లకు కొనుక్కొందని ఫిలిం ఇండస్ట్రీ బిజినెస్ వర్గాల్లో ఒక పెద్ద సంచలనం. కావాలంటే, ఈ వార్త కోసం గూగుల్ సెర్చ్ చేయండి. మీకే తెలుస్తుంది.

లేటెస్టుగా, 3 చిన్న సినిమాలను కలిపి హోల్‌సేల్‌గా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ 17 కోట్లకు కొనుక్కొంది. ఈ చిన్న సినిమాలు అన్నీ కూడా దాదాపు కోటి రూపాయల లోపు బడ్జెట్‌లో చేసేవే. బయటికి చెప్పేది మాత్రం దానికి డబుల్ ఉంటుంది. అది వేరే విషయం.

అయితే – ఏ లెక్కన చూసినా, సుమారు కోటి రూపాయల బడ్జెట్లో తీసిన ఒక్కో సినిమాకు ఒక 6 నెల్లల్లో కనీసం 4 కోట్లు లాభం వచ్చినట్టు! ఈ 17 కోట్ల ఆఫర్ న్యూస్ కూడా మీకు గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తుంది.

సినిమాల రిలీజ్‌కు లాక్‌డౌన్‌లు ఎలాంటి అడ్డంకి కావు అని ఇప్పటికే ఓటీటీలు నిరూపించాయి. నిజానికి ఇతర బిజినెస్‌లన్నీ ఆగిపోయినా… ఓటీటీ/ఏటీటీల్లో సినిమాల రిలీజ్‌లు, వాటి బిజినెస్ మాత్రం ఆగలేదు. మరింతగా పెరిగాయి. కొత్తగా ఇంకో అరడజన్ ఓటీటీలు మార్కెట్లోకి రాబోతున్నాయి.

సో… ఓటీటీలు, ఏటీటీలు ఇప్పుడు గోల్డ్ మైన్స్. 

లాక్‌డౌన్ ఉన్నా, లేకపోయినా, ఇకమీదట ఈ OTT/ATT బిజినెస్ మోడల్ అనేది ఒక ఎవర్‌గ్రీన్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మోడల్‌గా ఖచ్చితంగా కొనసాగుతుంది. 

మనం చూస్తుండగానే... ఫ్యూచర్లో ప్రతి ఓటీటీ కూడా రిలీజ్ సినిమాలకు ఏటీటీ అవుతుంది.

చిన్న బడ్జెట్ సినిమాల రిలీజ్ సమస్యకు కూడా ఈ ఓటీటీ, ఏటీటీలే శాశ్వత పరిష్కారం చూపాయి. ఇకనుంచీ, 90% చిన్న సినిమాల దర్శకనిర్మాతలు అసలు థియేటర్స్‌లో రిలీజ్ కోసం ఆలోచించరు! ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ప్యాషన్ ఉండి, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించే కొత్త ఇన్వెస్టర్స్, ఎంత చిన్న పెట్టుబడితోనయినా సరే ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!

బిజినెస్ పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ, సినిమా పట్ల ప్యాషన్ ఉన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ ఇదొక మంచి అవకాశం. ప్రారంభంలో ఉండే అత్యధిక స్థాయి బిజినెస్‌ను సులభంగా క్యాష్ చేసుకోవచ్చు.

ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా – ఒక ‘నంది అవార్డు’ రైటర్-డైరెక్టర్‌గా, కేవలం OTT/ATT లో రిలీజ్ కోసమే నేనొక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను న్యూ టాలెంట్‌తో ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు.

రెండు సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ జరుగుతోంది.

అంతకు ముందు థియేటర్స్‌లోనే సినిమాలు రిలీజ్ చేసిన అనుభవం ఉన్న మాకు… ఈ సినిమాల రిలీజ్, బిజినెస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండస్ట్రీ బిజినెస్ సర్కిల్స్ నుంచి ఈ విషయంలో, ఇప్పుడు అదనంగా మాకు మరింత సపోర్ట్ కూడా ఉంది.

ఈ నేపథ్యంలో… సినిమాలపైన ప్యాషన్, ఫిలిం ప్రొడక్షన్‌పైన ఆసక్తి ఉండి, వివిధ ఆప్షన్స్‌లో ఫండింగ్ చేయగల పార్ట్‌నర్స్ కోసం నేను చూస్తున్నాను:

1. సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్న పవర్‌ఫుల్ ఫండింగ్ పార్ట్‌నర్స్, కోప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ & ఇన్వెస్టింగ్ న్యూ హీరోస్.

2. అత్యంత సమర్థవంతంగా, వేగంగా ఫండింగ్ ఎక్జిక్యూట్ చేయగల మీడియేటర్స్.

మీ ఇన్వెస్ట్‌మెంట్స్, అగ్రిమెంట్స్ అన్నీ లీగల్ అడ్వైజర్స్ సలహాతో స్పష్టంగా పేపర్ మీద రాసుకొని, సంతకాలతో నోటరైజ్ చేయటం జరుగుతుంది.

ఫిలిం ఇన్వెస్ట్‌మెంట్, ఫిలిమ్స్ పట్ల నిజంగా సీరియస్‌నెస్, ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్ మిత్రులు/ఎన్నారై సోదరులు/ఫండర్స్/బిజినెస్‌మెన్/సమర్థులైన మీడియేటర్లు… ఎవరైనా సరే, ఎలాంటి బిజినెస్ ప్రపోజల్స్‌తో అయినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.

కొలాబొరేట్ అవుదాం,
కొత్త ప్రాజెక్టు ప్రారంభిద్దాం.
కలిసి పనిచేద్దాం,
కలిసి ఎదుగుదాం!

– మనోహర్ చిమ్మని
Film Director, Nandi Awardee Writer
WhatsApp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

PS: వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న తొలి ఇద్దరు ఇన్వెస్టర్స్ కోసం మీరు కాదనలేని ఆఫర్ ఉంది! దాని గురించి కలిసి మాట్లాడుకొందాం. 

"I'm going to make him an offer he can't refuse." 
- The Godfather

Tuesday 24 August 2021

పాడ్‌కాస్ట్‌లు, షోలు... మంచి ఆదాయ మార్గాలు!

నిజంగా సత్తా ఉంటే - సరైనవిధంగా ఉపయోగించుకోగలిగితే - ఫేస్‌బుక్ ఒక్కటి చాలు. మన ఓపికను బట్టి, మన సౌకర్యాన్ని బట్టి, మనం వెచ్చించగలిగే సమయాన్ని బట్టి... ఫేస్‌బుక్, ట్విట్టర్ రెండూ ఉపయోగించుకోవచ్చు.  

సోషల్‌మీడియాలో ఎన్నో ఉన్నాయి కదా ఫ్రీగా అని, అవన్నీ ఉపయోగించాలన్న రూలేం లేదు.  

సెలబ్రిటీలకు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ ఉపయోగం. అలాగని హీరోహీరోయిన్స్ అందరికీ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్స్ లేవు. కొందరు కేవలం ట్విట్టర్ వాడతారు, కొందరు ఫేస్‌బుక్ ఒక్కటే ఉపయోగిస్తారు.  

ఈ మధ్య ట్విట్టర్ స్పేసెస్, క్లబ్ హౌజ్ బాగా పాపులర్ అయ్యాయి. కనీసం నేను వాటికి కనెక్ట్ అవ్వలేకపోయాను. మార్కెటింగ్‌కి క్లబ్ హౌజ్ బాగానే ఉపయోగపడుతుంది. కాని, ఎందుకో కనెక్ట్ కాలేకపోయాను. అంత ఆసక్తి కలగలేదు. 

యూట్యూబ్ చానెల్ ఒకటి ప్రారంభించి, నా ఊహల్లో ఉన్న ఒక షో చెయ్యాలని ఆ మధ్య అనుకున్నాను. కాని, ఎందుకో చివరి నిముషంలో మానుకున్నాను. ఆడియో పాడ్‌కాస్ట్ కూడా చెయ్యాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను. 

నిజానికి ఈ రెండూ నేను బాగా చేయగలను. కొత్తదనంతో కూడిన కంటెంట్ క్రియేట్ చెయ్యటం నాకు పెద్ద సమస్య కాదు. కాని దానికి అనుబంధంగా మళ్ళీ నేనొక టీమ్ మెయింటేన్ చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నా వల్ల కాని పని. డబ్బు ఒక్కటే కాదు సమస్య. వారిని కో-ఆర్డినేట్ చెయ్యటం, లీడ్ చెయ్యటం... ఇదంతా చాలా సమయంతో కూడుకొన్న పని. 

కాని, నాకైతే ఆ ఆలోచన ఉంది. చెయ్యటం అవసరం కూడా.   

కట్ చేస్తే - 

జేమ్స్ ఆల్టుచర్, టిమ్ ఫెర్రిస్, మేరీ ఫోర్లియో వంటివారి షోలు, పాడ్‌కాస్ట్‌లు చూసినప్పుడు నాకూ ఆ స్థాయి షోలు, పాడ్‌కాస్ట్‌లు చెయ్యాలనిపిస్తుంది.    

ఏదైనా టీవీ చానెల్ నుంచి గాని, పాపులర్ యూట్యూబ్ చానెల్ నుంచి గాని - నేను అనుకుంటున్న స్థాయిలో ఏదైనా ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. అంత రిసెర్చ్ చెయ్యగలను, అంత బాగా చెయ్యగలను. 

ఇది ఓవర్ కాన్‌ఫిడెన్స్ కాదు. ప్యాషన్. ఇష్టం.  

ఓటీటీ కోసం కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో ఉన్నాను. ముందు ఆ ట్రాక్ త్వరగా కదలాలి. రీజనబుల్ టర్మ్స్‌లో ఒక లైక్-మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్ కోసం నా అన్వేషణ ఇంకా పూర్తికాలేదు. అదొక్కటి అయితే చాలు. తర్వాత ఇలాంటివన్నీ అవే కదుల్తాయి. 

ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రీలాన్సర్‌కు సగటున 7 ఆదాయ మార్గాలుంటాయట!

ఈ విషయంలో నేనింకా చాలా ఎదగాల్సి ఉంది.  

Sunday 22 August 2021

పక్కా ప్రొఫెషనల్!

ఇది 14 వ రోజు...

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, కూ, మనోహరమ్ మ్యాగజైన్, ఈ బ్లాగ్... మొట్టమొదటిసారిగా వీటన్నిటినీ వంద శాతం ప్రొఫెషనల్‌గా ఉపయోగిస్తున్నాను. 

బాటమ్‌లైన్ మాత్రం మారదు - అన్నీ కలిపి మొత్తం ఒక గంట కంటే ఎక్కువ టైమ్ తీసుకోలేను. 

క్లబ్ హౌజ్‌లోకి కూడా ఎంటరవ్వాలని ఉంది. కుదరట్లేదు. టార్గెటెడ్ కాంటాక్ట్స్ చాలా ముఖ్యం. ఈ కోణంలో క్లబ్ హౌజ్ కొంతవరకు ఉపయోగపడొచ్చని నా అంచనా. ఇంతవరకు ఎప్పుడూ పాల్గొనలేదు. పూర్తిగా దిగిపోయాను కాబట్టి, అది కూడా వన్ ఫైన్ నైట్ జరుగుతుంది. 

ఫిలింనగర్ డైరీస్ తృతీయ పురుషలో (థర్డ్ పర్సన్) రాయటం ప్రారంభించాను. కాని, నాకే నచ్చటం లేదు. తర్వాతి మైక్రో కథ నుంచి, అన్ని కథలూ ఉత్తమ పురుష (ఫస్ట్ పర్సన్) లో ఉంటాయి. 

కథలుగా అన్నీ కల్పితాలే. కాని, నిజాలు. 

సరిగా 9 ఏళ్లక్రితం ఈ బ్లాగ్ ప్రారంభించినప్పుడు ఏ థీమ్ అయితే ఉపయోగించానో, ఇప్పుడు మళ్ళీ అదే థీమ్‌కు మార్చాను. 

చాలా విషయాల్లో, ఈ ఆగస్టు నుంచి పూర్తిగా ఒక అప్‌సైడ్ డౌన్ మార్పు కోసం తీవ్రంగా పనిచేస్తున్నాను. ఫలితాలు ఆటోమాటిగ్గా ఫాలో అవుతాయి. 

కట్ చేస్తే -

ఎంత పెద్ద సినిమా చేస్తున్నామన్నది కాదు పాయింట్. అసలు సినిమా అంటూ చేస్తూ ఉండటం ముఖ్యం. ఎప్పుడూ పనిలో ఉండటం ముఖ్యం. లైమ్‌లైట్‌లో ఉండటం ముఖ్యం. ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నాను. 

YOU CAN MAKE MORE FRIENDS IN TWO MONTHS BY BECOMING INTERESTED IN OTHER PEOPLE THAN YOU CAN IN TWO YEARS BY TRYING TO GET OTHER PEOPLE INTERESTED IN YOU. 
~ DALE CARNEGIE

సినిమా ఎప్పుడు భయ్యా?!

(Film Nagar Diaries – 2)
“సండే మా ప్రొడ్యూసర్ వస్తున్నాడు. బెంగుళూరు నుంచి!… లాస్ట్ మీటింగ్ లోనే స్టోరీలైన్, బడ్జెట్ అదంతా ఓకే అయింది. ఇప్పుడు జస్ట్ మళ్ళొకసారి కాస్టింగ్, లొకేషన్స్, ప్రమోషన్, బిజినెస్… అన్నీ ఉంటాయి కదా… డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ ఫార్మాలిటీ. తర్వాత, అంతా ఓకే అనుకుంటే, మండే అడ్వాన్సు!… కట్ చేస్తే – ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్!”

“లాస్ట్ టైం, మనం మార్చిలో కల్సినప్పుడు కూడా కొంచెం అటుఇటుగా ఇదే చెప్పినట్టున్నావ్ భయ్యా..?!”

ఫిలింనగర్ పక్కనే ఉన్న అపోలో హాస్పిటల్‌కెళ్లే దారిలో, రోడ్డు పక్కనున్న చిన్న హోటల్లో టీ సిప్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ అభిమన్యు, ఇంకో చిన్న అప్‌కమింగ్ ఆర్టిస్టు అనీష్.
“లేదు తమ్ముడూ… ఆ ప్రొడ్యూసర్‌ వేరే. మనకు సెట్ అవ్వలేదు. నేనే వద్దన్నుకున్నాను”

“ఈ ప్రొడ్యూసర్ ఓకేనా భయ్యా?!”

“సూపర్ భయ్యా! మంచి టేస్ట్ ఉంది”

“అయితే ఎప్పుడుంటుంది భయ్యా షూటింగ్?”

“నెక్‌స్ట్ మంత్ తమ్ముడూ”

“అంటే… సెప్టెంబర్ అన్నమాట!”

అనీష్ బిల్ కట్టాడు.

“తమ్ముడూ నువ్వు లాగించెయ్యి. ఇంకో ఫ్రెండొస్తున్నాడు” అనీష్‌కు షేక్ హాండిస్తూ చెప్పాడు అభిమన్యు.

“కొంచెం గుర్తుపెట్టుకో భయ్యా. ఈసారి నాకు క్యారెక్టర్ ఇప్పించాలి”

“పక్కా తమ్ముడూ” అంటూ గట్టిగా భుజం మీద చరిచాడు అభిమన్యు.

సంతృప్తిగా గుండెలనిండా ఊపిరి పీల్చుకొంటూ హోటల్ బయటికి నడిచాడు అనీష్.

వెంటనే తను కూర్చొన్న చోటు నుంచి లేచి, కూల్‌గా అదే హోటల్లో ఇంకో మూలనున్న టేబుల్ దగ్గరికెళ్ళి కూర్చున్నాడు అభిమన్యు.

అక్కడ అభిమన్యు కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఇంకో కొత్త ఆర్టిస్ట్ రంగారెడ్డి అభిమన్యుని చూస్తూనే విష్ చేస్తూ షేక్ హాండిచ్చాడు.

“దో చాయ్ లారే” అభిమన్యు బాయ్ కేసి చూస్తూ కేకేశాడు. తర్వాత, “చూస్తున్నావ్ కదా… బిజీ” అంటూ నవ్వాడు.

“పర్లేదన్నా” అన్నాడా కొత్త ఆర్టిస్టు.

“చెప్పు రంగారెడ్డీ…”

“సినిమా ఇంకెప్పుడన్నా?!”

“నెక్‌స్ట్ మంత్ తమ్ముడూ”

ఎలాంటి చికాకు లేకుండా ఇందాకటి సంభాషణను మళ్ళీ రిపీట్ చేయడం మొదలెట్టాడు అసిస్టెంట్ డైరెక్టర్ అభిమన్యు.

పొద్దుటి నుంచి ఇది నాలుగోసారి.

పక్కనున్న టేబుల్ దగ్గర మూడో కాఫీ పూర్తిచేసిన 'చిన్న సినిమాల డైరెక్టర్' సిద్దూ ఇదంతా వినటం రెండో సారి.

అభిమన్యు చెప్తున్నదాంట్లో ఎలాంటి అబద్ధం ఉండకపోవచ్చు. ఉండదు. కాని, ఆ ప్రొడ్యూసర్ “అంతా ఓకే” అని ఎప్పుడు చెప్తాడో ఆ దేవుడికి కూడా తెలీదు అనుకున్నాడు సిద్దూ. 

పెద్ద హీరోలతో అప్పటికే నాలుగు సినిమాలు తీసిన ఒక డైరెక్టర్‌కు ఓకే చెప్పడానికే, ఓ సీనియర్ ప్రొడ్యూసర్ రెండేళ్ళు తీసుకున్నాడు!

లేచి నెమ్మదిగా బయటపడుతుండగా, “సార్, అభిమన్యు సార్… షూటింగ్ ఎప్పుడు సార్?!” అని బయటనుంచే అరుస్తూ ఇంకో కొత్త ఆర్టిస్టు లోపలికి ఉరికాడు.

“నెక్‌స్ట్ మంత్ నుంచి తమ్ముడూ” వెనుకనుంచి వినిపించింది.

ప్రతిసారీ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకోవడం బాగుండదని… కోర్టుబోనులో నిల్చున్న ముద్దాయిలా రెండు చేతులూ కట్టుకొని, హోటల్ మెట్లు దిగి, నెమ్మదిగా ఫిలించాంబర్ వైపు నడవసాగాడు సిద్దూ.

Saturday 21 August 2021

మనమే కారణం... టైమ్ కాదు!

ఫోన్ చెయ్యడానికి కూడా టైం లేదు అంటుంటారు కొందరు... 

ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, ఏదైనా సరే చెయ్యడానికి టైం దొరక్కపోవడమనేది ఉండదు. మనం రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, ఈలన్ మస్క్‌ల కంటే బిజీగా ఏం లేము. 

మనం వారికంటే బాగా ఏం సంపాదించడంలేదు. జీవితాన్ని కూడా వారికంటే బాగా ఏం ఎంజాయ్ చెయ్యటం లేదు. వారికంటే ఎక్కువగా పని కూడా ఏం చెయ్యటం లేదు మనం. 

మనం ఫోన్ చెయ్యాలనుకొంటే చేస్తాం. వద్దు అనుకుంటే చెయ్యం. అంతే. ఇంక మధ్యలో మిడిల్ గ్రౌండ్ ఏమీ ఉండదు. 

"అబ్బా... ఫోన్ చెయ్యడం మర్చిపోయాను" అంటుంటారు కొందరు. అది కూడా ఇంతే.

ప్రయారిటీలో మనముంటే అలా మర్చిపోవడం అనేది అసలుండదు. టైం అదే ఉరుక్కుంటూ వస్తుంది! That simple...

కట్ చేస్తే -

కొంతమంది మిత్రులు చెప్పే రీజన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. 

కొంతమంది మిత్రుల్లా నటించే అవకాశవాదుల దృష్టిలో అసలు మనమెక్కడున్నామో తెలుస్తుంది. ప్రయారిటీ లిస్టులో కాదుకదా... అసలు వారి దృష్టిలో మన ఉనికే ఉండదు. 

దీన్ని బట్టే, వారితో కనెక్ట్ అయి ఉన్న మన ఇతర అంచనాలు సరిచేసుకోవాలి. అవసరమైతే, అక్కడితో ముగించి, ఇక అంతే అని సరిపెట్టుకోవాలి. లేదంటే, తెలిసి తప్పుచెయ్యటమవుతుంది. జరిగే నష్టం కూడా తక్కువుండదు. 

ఎవరి గోల వారిది. ఎవరి సమస్యలు వారివి. 

అందరూ చెప్పేది కాని, వారి జీవితం కాని, ఖచ్చితంగా బయటికి కనిపించేలా మాత్రం ఉండదు. జీవితంతో వారెలాంటి యుధ్ధం చేస్తున్నారో మనకేం తెలుసు?  

“THE MOST IMPORTANT THING IN COMMUNICATION IS HEARING WHAT ISN’T SAID”
~ PETER DRUCKER

నారప్ప ఎక్కడ? నాని ఎక్కడ?

నిన్న సాయంత్రం యూట్యూబ్‌లో ఒక ప్రెస్ మీట్ చూశాను. అది ఫిలిం చాంబర్లో జరిగింది.

ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్. 

నిర్మాత సునీల్ నారంగ్ "లవ్ స్టోరీ" (శేఖర్ కమ్ముల) సెప్టెంబర్ 10 నాడు థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. నాని "టక్ జగదీశ్" అదే రోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజవుతోంది. 

ఆ మొత్తం ప్రెస్ మీట్ ఫోకస్ అంతా దీని గురించే! 

అక్టోబర్ వరకు సినిమాలను ఓటీటీలకు అమ్మకుండా ఉంచండి అని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రొడ్యూసర్స్‌ను అభ్యర్థించారు. కోవిడ్ కారణాలవల్ల, నిర్మాతల భయాల వల్ల తప్పనిసరి అయినవాళ్ళు ఓటీటీలకు అమ్మేసుకున్నారు... అమ్మేసుకుంటున్నారు. 

అది వారి ఇష్టం.

మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని గ్రాబ్ చేసుకొనే ఫ్రీడం ప్రొడ్యూసర్‌కు ఉంటుంది. రేపు థియేటర్‌లో రిలీజయ్యి, సినిమా ఫ్లాప్ అయిందనుకోండి. నిర్మాతకు డబ్బులెలా వస్తాయి? వీళ్లిస్తారా? 

ఓటీటీ అలా కాదు. నిర్మాతకు డబ్బులు ముందే వస్తాయి.

అలా "మీరు ఓటీటీలకు అమ్ముకోవద్దు, థియేటర్స్ ఓపెన్ చేసి, అవి ఫుల్స్ నడిచే సిచువేషన్ వచ్చేవరకు ఆగండి" అనే హక్కు ఎవరికీ ఉండదు. ముందు నిర్మాత సేఫ్ అవ్వాలి. 

అయితే - "టక్ జగదీష్" సినిమా విషయంలో ఇంకో గొడవ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో "టక్ జగదీష్"ను సెప్టెంబర్ 10 నాడే రిలీజ్ చేస్తున్నారట! 

ఒకేరోజు థియేటర్స్‌లో ఒక సినిమా, ఓటీటీలో ఇంకో సినిమా ఎవరికివారు రిలీజ్ చేసుకొంటే ఏమవుతుంది? 

థియేటర్లో సినిమా చూసొచ్చి, తీరిగ్గా ఏ రాత్రో ఇంట్లో ఆరామ్‌గా కూర్చిని, ఓటీటీలో ఇంకో సినిమా చూడొచ్చు. అలా ఓటీటీల్లో సినిమాలను ఎప్పుడయినా తీరిగ్గా చూసుకొనే వీలుంటుంది. అలాంటప్పుడు... ఓటీటీలో రిలీజయ్యే సినిమా, థియేటర్లో రిలీజయ్యే సినిమాకు అంత కాంపిటీషనిస్తుందా? ఎందుకంత భయం?

ఇలా అనుకుంటే - అసలు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేసుకోవడం ప్రతి వారం ఒక ఇష్యూ అవుతుంది. 

కట్ చేస్తే - 

"టక్ జగదీష్" సినిమాను ఓటీటీకి అమ్మినందుకు ఇప్పుడు నానీని అంతలా బెదిరిస్తున్నవాళ్ళు, అంతకుముందు ఇదే స్థాయిలో "నారప్ప"ను కూడా బెదిరించారా? బెదిరించగలిగారా?? 

సో, ఎంత సాధించినా సినిమా బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా అవసరమన్న మాట!       

We don’t make movies to make money, we make money to make more movies.
– Walt Disney       

Wednesday 18 August 2021

మతం ఎవరి సృష్టి?

ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందన్నది ప్రత్యేకంగా ఎవరూ ఎవరికి చెప్పనక్కర్లేదు. 

20 సంవత్సరాలు, బిలియన్ల డాలర్ల ఖర్చు, లక్షలాది అమాయక ప్రజలు, సైనికుల హత్యలు-మరణాలు... మారణహోమం...  

చివరికి సాధించింది ఏంటంటే... తాలిబాన్లను నిర్మూలించే ప్రయత్నంలో, తాలిబాన్లకే మరింత మంచి గెరిల్లా ట్రెయినింగ్ ఇచ్చి, మరింత అత్యాధునిక ఆయుధాలిచ్చి, వారు మరింత సంపద పెంచుకొనే అవకాశమిచ్చి... చివరికి మళ్ళీ అదే తాలిబాన్ల చేతికి ఆఫ్ఘనిస్తాన్‌ను చాలా సింపుల్‌గా అందజేయటం జరిగింది. 

ఈమాత్రం దానికి అమెరికా అంత ధనం ఎందుకు వెచ్చించింది? అంతమంది అమెరికన్ సైనికులను ఎందుకు కోల్పోయింది?

అసలు 20 ఏళ్ళుగా యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తున్నట్టు? 

ఒంటినిండా దుస్తులు కప్పుకునే ఉన్న ఒక 21+ ఆఫ్ఘన్ అమ్మాయిని, మరింకేవో దుస్తులు వారి మతం చెప్పినట్టు ధరించలేదన్న కారణంతో, నడి బజారులో, అంతమంది తాలిబాన్లు చుట్టూరా నిలబడి, అంత పైశాచికంగా పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్స్ దింపి చంపేస్తుంటే - ఇంక యునైటెడ్ నేషన్స్ అవసరం ఉందా? 

తాలిబాన్స్ పుణ్యమా అని, ఇది వాళ్ళు బయటకు రిలీజ్ చేసిన వీడియో!

బయటకు రాని, మనకు తెలియని పైశాచిక అకృత్యాలు ఇంకెన్నుంటాయో ఎవరైనా అతి సులభంగా ఊహించొచ్చు. 

ఇది జరిగింది ఏ ఆటవిక యుగంలోనో కాదు... 2021 లో... జస్ట్ నిన్ననే! 

కట్ చేస్తే -   

ఈ వీడియో చూసిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఏదో ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్‌కి ఒక స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోతుందా? అలా కాకుండా, వెంటనే స్పందించి తక్షణ చర్యలకు  ఉపక్రమిస్తుందా? ఆమాత్రం చేయలేని పక్షంలో... యునైటెడ్ నేషన్స్ అనేది జస్ట్ ఒక చిత్తు కాగితంతో సమానం.  

ఆఫ్ఘనిస్తాన్‌లో 99.7% పైగా అనుసరించే మతం ఇస్లాం.

మరి... ప్రపంచదేశాల్లోని ఎన్ని ఇస్లాం దేశాలు తాలిబాన్ల ఈ చర్యను ఖండించాయి ఇప్పటివరకు?

మన దేశంలోని ఎంతమంది ఇస్లాం మత పెద్దలు, ఎంతమంది ఇస్లాం మతస్థులు దీన్ని ఖండించారు?  ఎంతమంది ఇస్లాం మతస్థులు ఎన్ని చోట్ల, ఎన్ని క్యాండిల్స్ వెలిగించే ప్రదర్శనలు చేశారు ఇప్పటివరకు? ఎంతమంది ఇస్లాం మతస్థులు ఎన్ని వందల ఇన్‌టాలరెన్స్ ట్వీట్స్ పెట్టారు ఇప్పటివరకు? ఎన్ని కవితలు రాశారు? 

After all, religion is a man made thing...

Sunday 15 August 2021

కుక్కట్‌పల్లి రూమ్‌లో ఒక చాప కథ

(Film Nagar Diaries - 1)
"ఒరేయ్ నువ్వెన్నయినా చెప్పు... ఆర్టిస్టులు ఆర్టిస్టులే, డైరెక్టర్లు డైరెక్టర్లేరా" 

"కొలంబస్ అమెరికా కనుక్కున్నట్టు కొత్తగా చెప్తున్నావేంట్రా!... ఆర్టిస్టులు ఆర్టిస్టులే, డైరెక్టర్లు డైరెక్టర్లే! ఏంటి నీ ప్రాబ్లం?" 

షూటింగ్‌లో "స్మోక్" అని అరవగానే సెట్‌బాయ్స్ పొగవదిలినట్టు సిగరెట్ పొగ వదుల్తూ... కాఫే మిలాంజ్‌లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు మాట్లాడుకొంటున్నారు.

చింపిరి గడ్డంతో ఉన్న చిన్న సినిమాల డైరెక్టర్ సిద్దూ, వారి వెనకున్న కేన్ సోఫాలోంచి  వీరి మాటలు విని ఒకసారి వెనక్కి చూశాడు. క్షణంలో మళ్ళీ అటు తిరిగి తన మొబైల్‌లోకి మునిగిపోయాడు.

వెనకనుంచి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్స్ మాటలు వినిపించసాగాయి. 

"నీకు రెండు ఇన్సిడెంట్స్ చెప్తా విను"

"చెప్పు..."

"కట్ చేస్తే - అన్నపూర్ణ స్టుడియో. హాస్పిటల్ సెట్టు. కెమెరామన్ పిచ్చ లైటింగ్ పెట్టాడు. మాంచి ఫీల్ ఉన్న సీన్. హీరోహీరోయిన్లకు మా డైరెక్టర్ సీన్ మస్త్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు..." 

"..." 

"కట్ చేస్తే - హీరోహీరోయిన్లిద్దరూ ఇరగదీశారు! అన్నీ సింగిల్ టేక్‌లే!!... ఇద్దరూ బాగా ఏడ్చేశారు".

"గ్లిజరినేగా?!" 

"నో!! ... గ్లిజరిన్ ఇస్తే తీసి అవతల పడేశారు. అంత బాగా యాక్ట్ చేశారిద్దరూ! పెద్ద సీన్... నాలుగు గంటల్లో అయిపోయింది"

"నీ యంకమ్మ... దీన్లో ఇన్సిడెంట్ ఏంట్రా?!... వాళ్ళ పనే యాక్టింగ్! " 

"చెప్తా ఉండు... సీన్ అయిపోయాక, మా డైరెక్టర్ దగ్గరికొచ్చాడు హీరో. "డైరెక్టర్ గారూ, మీ తర్వాతి సినిమాకు కూడా నేను డేట్స్ ఇస్తాను. అయాం ఇంప్రెస్డ్! థాంక్యూ సో మచ్ అండీ... మీరు నిజంగా స్క్రిప్ట్ అద్భుతంగా రాశారు. చనిపోయిన మా అమ్మ గుర్తొచ్చింది ఈ సీన్ చేస్తున్నంత సేపూ" అని కళ్లల్లో నీళ్లతో చెప్పాడు హీరో. పాపం కొత్త డైరెక్టర్ కదా... మస్త్ ఫిదా అయిపోయాడు మా డైరెక్టర్" 

"తర్వాతి సినిమాక్కూడా డేట్స్ ఇస్తా అని హీరో అంటే ... ఏ డైరెక్టరయినా  ఫిదా అయిపోతాడు. ఇందులో కొత్త డైరెక్టర్ పాత డైరెక్టరని ఏం లేదు".

"ఉండు... చెప్తా" అంటూ, ఇదంతా చెప్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకో సిగరెట్ ఫ్రెష్‌గా వెలిగించి మళ్ళీ "స్మోక్ ఆన్" చేశాడు. 

వెనకున్న డైరెక్టర్ సిద్దూకు వద్దన్నా వీళ్ల మాటలు బాగా వినిపిస్తున్నాయి. 

అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ అందుకున్నాడు. 

"కట్ చేస్తే... ఆ సిన్మా ఫారిన్‌లో పదిరోజులు షూట్ చేశారు. వైజాగ్, రాజమండ్రి, ముంబాయి, ఢిల్లీ... అక్కడా ఇక్కడా బాగా ఖర్చుపెట్టి బ్రహ్మాండంగా ఫినిష్ చేశారు. కాపీ వచ్చింది. షో వేస్తే బయ్యర్స్ కూడా బాగా ఎగబడ్డారు. దెబ్బకు ప్రొడ్యూసర్ ఉబ్బిపోయి, సినిమా అమ్మకుండా ఓన్ రిలీజ్‌కెళ్ళాడు. బొక్కబోర్లా పడ్డాడు" 

"అయ్యో!!" 

"అయ్యో లేదు, కుయ్యో లేదు... ముందు చెప్పేది విను..."

"సరే  కానియ్"

"కట్ చేస్తే - మా సినిమా జరుగుతుండగా మేం గుప్పించిన పబ్లిసిటీతో ఆ హీరోకు ఇంకో చిన్న సినిమా ఆఫరొచ్చింది. సైన్ చేశాడు... తర్వాత అది పూర్తయింది, అతి కష్టం మీద రిలీజయింది. హిట్టయింది... రోజుకు నాలుగు ఇంటర్వ్యూలు ఇరగదీస్తున్నాడు హీరో ..."

"వెరీ గుడ్!" 

"గాడిద గుడ్దేం కాదూ.. ముందు విను..." 

"చెప్పు చెప్పు"

"ప్రతి ఇంటర్వ్యూలో తను పుట్టినప్పటినుంచి ఏ చెడ్డీలేసుకున్నాడో, ఏ సందులో ఎన్ని గోళీకాయలాడాడో... అన్నీ చెప్తున్నాడు హీరో. అంతకు ముందు తను చేసిన అట్టర్ ఫ్లాప్ సినిమాలన్నిటి గురించి కూడా చెప్తున్నాడు... కాని, మా డైరెక్టర్ గురించి కాని, అంత బాగా ఖర్చుపెట్టి అతన్ని ఒక రాజు లాగా ట్రీట్ చేసిన ఆ సినిమా ప్రొడ్యూసర్ గురించి కాని ఎక్కడా ఒక్క ముక్క చెప్పట్లేదు!"

"ఏం... మీ డైరెక్టర్‌కూ ఈ హీరోకీ ఏమైనా గొడవలయ్యాయా?!"

"గొడవా తొక్కా... ఆ సినిమా హిట్ అవ్వలేదు!"

"హిట్ అవ్వకపోతేనేం... మర్చిపోయాడేమో!" 

"మనం అలాగే అనుకుంటాం... వేస్ట్ గాళ్లం! ఒక రౌడీలాంటి జర్నలిస్ట్ మాత్రం వదల్లేదు. అడిగేశాడు... జస్ట్ మొన్నీమధ్యే రిలీజైన ఆ సినిమా గురించి చెప్పండి అని" 

"ఏమన్నాడు?"

“ఆ సినిమా గురించి మాట్లాడకపోవటమే బెటర్ అండీ... వెరీ పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్...  డైరెక్టర్ బాగా చేయలేకపోయాడు... స్క్రిప్ట్‌లో కూడా చాలా తప్పులున్నాయి… అన్నాడ్రా!”

"వార్నీ... అలా అన్నాడా!? ఈ హీరోనే కదరా... ఆరోజు ఏడుస్తూ డైరెక్టర్ని అంతలా మెచ్చుకొని ఇంకో సినిమాక్కూడా డేట్స్ ఇస్తా అన్నాడు!?" 

"మరదే... అందుకే అన్నాను... నువ్వేమో కొలంబస్సు, అమెరికా అంటూ సెటైరేశావ్!"

"అందరు హీరోలు ఇట్లా ఉండరులేరా..."

"అది నాక్కూడా తెల్సు" 

"అయినా... ఈ రెండు ఇన్సిడెంట్స్‌లో రియాలిటీ ఉంది గాని... కిక్కు లేదు బావా!" 

"చెప్తా విను... అంతకు ముందు ఆ హీరో యాక్ట్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయి, ఆఫర్స్ లేక ఎక్కడో కుక్కట్‌పల్లిలో ఫ్రెండ్ రూమ్‌లో చాప మీద పడుకుని పైన ఫ్యాన్‌ను చూస్తుంటే... మా డైరెక్టరే వెళ్ళి, కారులో తీసుకొచ్చి, అడ్వాన్స్ చేతిలోపెట్టి ఆఫరిచ్చాడు!... ఇప్పుడొచ్చిందా నీకు కిక్కు?" 

అప్పటిదాకా ఆర్కే లక్ష్మణ్ కార్టూన్‌లో కామన్ మ్యాన్‌లా, వెనుకనుంచి అంతా వింటున్న సిద్దూ ఒక్కసారిగా లేచి... జీన్స్ ప్యాంట్ రెండు జేబుల్లో చేతులుపెట్టుకొని... ఫిలింనగర్ దైవ సన్నిధానం వైపు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.  

Saturday 14 August 2021

మనోహరమ్ మ్యాగజైన్‌లో మైక్రో కథల సీరీస్!

సినిమా ఫీల్డు అంటే అందరికీ చిన్న చూపు ఉంటుంది. అందరూ తిడతారు, సెటైర్లు వేస్తారు, నానా చెత్త మాట్లాడతారు. కాని, ప్రపంచంలో ఏ ఫీల్డు అయినా సినిమా ఫీల్డు లాంటిదే.

ఇక్కడుండే అన్‌సర్టేనిటీ ప్రతి ఫీల్డులోనూ ఉంటుంది. ఇక్కడుండే లాభనష్టాలు కూడా అన్ని ఫీల్డుల్లో ఉండేవే. బయటి ఫీల్డుల్లో జరగని తప్పులు, రాజకీయాలేవీ ఇక్కడ జరగవు.

ఒప్పుకోడానికి ఇష్టం ఉండదు అంతే.

అందరూ ఈ ఫీల్డు మీద పడి అరవటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే – ఇక్కడ గ్లామర్ ఉంది. సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. అంతకంటే పెద్ద చీమలు బయట వంద గుటుక్కుమన్నా అసలు పట్టించుకోరు. ఇదొక్కటే తేడా. ఇంతకంటే ఏం లేదు.

కట్ చేస్తే –

ఫిలింనగర్ అంటేనే సినిమా. అదో మరో ప్రపంచం. ప్రతిరోజూ వందలాదిమంది ఈ ఫీల్డులో ప్రవేశించాలని, తెరమీద కనిపించాలని, తెరవెనుక నగిషీలు చెక్కాలని, సెలబ్రిటీలు కావాలని కలలు కంటూ ఎక్కడెక్కడినుంచో ఇక్కడికి వస్తుంటారు.

అన్ని ఫీల్డుల్లాగే – ఈ ఫీల్డులో కూడా అతి తక్కువమందిని మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఆకలి కేకలుంటాయి. అవమానాల గాయాలుంటాయి. అప్పుల బాధలుంటాయి. ఆత్మహత్యల గాథలుంటాయి.

అయినా సరే – అవన్నీ దిగమింగుకుంటూ రేపటి మీద ఆశతో నవ్వుతూ, తుళ్ళుతూ బ్రతుకుతుంటారు. తమ మీద తామే జోకులు వేసుకొంటూ ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అవుతుంటారు.

వీళ్లల్లో కొందరు మాత్రం రేపటి ఆర్టిస్టులు, స్టార్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లూ, అసిస్టెంట్లూ అవుతారు. మిగిలినవాళ్ళు ఎప్పటికయినా ఏదో ఒకటి అవుతామన్న అశతో – యూసుఫ్ గూడా బస్తీలో, గణపతి కాంప్లెక్స్ చుట్టూరా, శ్రీనగర్ కాలనీ- ఫిలింనగర్-జుబ్లీ హిల్స్ రోడ్లల్లో... ఎవర్నీ పట్టించుకోకుండా... కుంభమేళాలో నాగసాధువుల్లా వాళ్ల లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలో నేనొక లైటర్‌వీన్ మైక్రో కథల సీరీస్ రాస్తున్నాను.

ఫిలింనగర్ డైరీస్!

మనోహరమ్ మ్యాగజైన్‌లో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఈ మైక్రో కథలను నా బ్లాగ్‌తో పాటు, ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేస్తాను.

ఇవి ఎవర్నీ ఉద్దేశించి రాస్తున్నవి కాదు. అలాగని ఊహించి రాస్తున్నవి కూడా కాదు. జస్ట్ ఫర్ ఫన్. మనమీద మనమే జోకులేసుకోగల సత్తా కూడా మనకుందని గుర్తుకుతెచ్చుకోవడం. గౌరవ సీనియర్లూ, ప్రియమైన జూనియర్లూ-కొత్తవాళ్ళూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం. 

అలాగే, మీరు కూడా... 😊 

Sunday 8 August 2021

'ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్' హవా!

కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో, ఇటీవల బాగా పాపులరైపోయిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కారణంగా, ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని ప్రధానమార్పులు ఇలా ఉండబోతున్నాయని నేనూహిస్తునాను:

1. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, శ్రేయాస్ ఈటీ, స్పార్క్, ఊర్వశి, సోనీ లివ్… వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల సినిమాల రిలీజ్‌లకు ఇకమీదట ఎలాంటి సమస్య ఉండదు. ఒకేరోజు ఎన్ని సినిమాలైనా రిలీజ్ చేసుకోవచ్చు.

2. చిన్న సినిమాల నిర్మాత “మాకు థియేటర్స్ ఇవ్వట్లేదు, ఆ నలుగురు” అని ఎక్కడా చెప్పుకొనే అవకాశం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. సినిమాలో సత్తా ఉంటే ఓటీటీలో కూడా మంచి బిజినెస్ ఆఫర్ వస్తుంది.

3. సుమారు 18 నెలలుగా కొనసాగుతున్న ఈ లాక్‌డౌన్/కరోనా ఎఫెక్టు వల్ల ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవనశైలిలో, ఆలోచనావిధానంలో ఎన్నోమార్పులు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఇన్ని నెలలుగా థియేటర్‌కు వెళ్లకుండా ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకులు, రేపు థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు కూడా బయటకువెళ్లి థియేటర్లో సినిమా చూడటానికి ఆలోచిస్తారు. పెద్ద హీరోల ఫ్యాన్స్ మాత్రమే దీనికి మినహాయింపు. అదేదో భారీ ఆడియో విజువల్ వండర్ అయితే తప్ప, సినిమాను థియేటర్లోనే చూడాలన్న కరోనా ముందటి ఆలోచనావిధానానికి సగటు ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మంది గుడ్‌బై చెప్తారు.

4. పై భారీ మార్పు కారణంగా – అరుదుగా కొన్ని భారీ ‘మాగ్నం ఓపస్’ సినిమాల విషయంలో తప్ప – మామూలు మధ్యస్థాయి సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి. ఫలితంగా, ఈ స్థాయిలో మేకింగ్ బడ్జెట్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్ భారీగా తగ్గకతప్పదు. అయితే, భారీ సినిమాలు, భారీ హీరోల రెమ్యూనరేషన్స్ విషయంలో మాత్రం పెద్ద మార్పు ఉండదు. బడ్జెట్లు, రెమ్యూనరేషన్స్ ఇంకా పెరుగుతాయి.

5. చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాల గురించి – అంతకు ముందు, “మీ సినిమా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రిలీజయ్యిందా?” అని అడిగేవాళ్లు. ఇప్పుడు “మీ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్?” అని అడుగుతారు. చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు ఇక మీదట చాలావరకు ఓటీటీల్లోనే రిలీజవుతాయి. ఇప్పటికే ఆ ట్రెండ్ మనం చూస్తున్నాం.

6. ఆమధ్య తన “క్లైమాక్స్” రిలీజ్‌కి శ్రేయాస్ ఓటీటీ , తర్వాత మొన్న “డి కంపెనీ” రిలీజ్ అప్పుడు స్పార్క్ ఓటీటీ అని, ఏకంగా కొత్త ఓటీటీలనే ప్రారంభించాడు ఆర్జీవీ. ఇప్పుడు ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్తగా ఇంకో డజన్ మార్కెట్లోకి వస్తాయి.

7. చిన్న బడ్జెట్ సినిమా నిర్మాతలకు, దర్శకులకు ఇది నిజంగా ఒక గోల్డెన్ అపార్చునిటీ. కంటెంట్‌లో సత్తా ఉండే సినిమాలను, ప్రేక్షకులను ఓటీటీ దగ్గరికి రప్పించే సినిమాలను తీయగలిగే దర్శకులకు చేతినిండా పని ఉంటుంది.

8. లిటరల్లీ నెలా రెండు నెలలకు ఒక సినిమా తీసి రిలీజ్ చేయగలిగే సత్తా ఉన్న రేనగేడ్ ఫిలిం మేకర్స్‌కు ఓటీటీ నిజంగా ఒక గోల్డ్ మైన్. ఇది అసాధ్యమేం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది.

9. ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కొత్తగా లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుంది.

10. తక్కువ బడ్జెట్‌లో, టెక్నికల్‌గా క్వాలిటీతో, ప్రేక్షకులను ఆకట్టుకొనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీయగలిగే దర్శకులకు పెద్ద ప్రొడక్షన్ కంపెనీల నుంచి మంచి గిరాకీ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ దాదాపు పూర్తిగా ఒక కార్పోరేట్ బిజినెస్ అవుతుంది. ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది.

11. థియేటర్స్ ఎక్కడికీ పోవు, ఉంటాయి. త్వరలోనే 100 మంది, 50 మంది కేపాసిటీతో ఉండే మినీ థియేటర్స్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశముంది. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో కొత్తగా ఈ మినీ థియేటర్స్ రావచ్చు.

12. ATT (Any Time Theater) పేరుతో, ఓటీటీల్లోనే టికెట్ పెట్టి కొత్త సినిమాలను రిలీజ్ చేసే ట్రెండ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఇకముందు కూడా ఉంటుంది. బిజినెస్ పరంగా కొత్త కొత్త ఐడియాలతో ఈ పధ్ధతి కూడా కొనసాగుతుంది.

13. “సినిమా ఇలా తీయాలి… ఇలా తీస్తేనే బిజినెస్ అవుతుంది” వంటి ట్రెడిషనల్ రొటీన్ బ్రేక్ అవుతుంది. నెమ్మదిగా అంతర్జాతీయస్థాయి కంటెంట్‌తో తెలుగు సినిమాలు రూపొందటం ప్రారంభమవుతుంది. ఇలాంటి సినిమాలు తెలుగులో తీసినా, మరే ఇతర ప్రాంతీయ భాషల్లో తీసినా – ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో వీటిని ప్రపంచ ప్రేక్షకులంతా చూస్తారు. ఆరోజు కూడా త్వరలోనే వస్తుంది.

కట్ చేస్తే - 

సినిమా పుట్టినప్పటి నుంచీ 'ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్'  ఉన్నారు. కానీ, ఎంత గొప్ప సినిమా తీసినా - వాటి రిలీజ్ అనేది ఈ చిన్న సినిమాలకు ఓ పెద్ద సమస్యగా ఉండేది. 

ఇప్పుడలా కాదు. సినిమాలో సత్తా ఉంటే, ఓటీటీలు వెంటనే కొనుక్కుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళు సినిమా చూస్తారు. 

వాటికున్న క్రేజ్‌ను బట్టి - అవసరమయితే ఇవే సినిమాలను థియేటర్స్‌లో కూడా ఆడిస్తారు. 

సో, ఏ రకంగా చూసినా, ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్‌కు ఇది నిజంగా ఒక స్వర్ణయుగం. ఒక మంచి అపార్చునిటీ.    

ఈ నేపథ్యంలో - 

నంది అవార్డ్ విన్నింగ్ రైటర్-డైరెక్టర్‌గా నేనిప్పుడు కేవలం ఓటీటీల్లో రిలీజ్ కోసమే కొన్ని కమర్షియల్ సినిమాలను రూపొందిస్తున్నాను. ఈ ప్రాజెక్టుల్లో నాతో అసోసియేట్ అవ్వాలనుకొనే ఔత్సాహిక ఇన్వెస్టర్స్ నన్ను కాంటాక్ట్ అవచ్చు.   

నా ఈమెయిల్: mchimmani10x@gmail.com 
వాట్సాప్ నంబర్: +91 9989578125 

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం. 

నంది అవార్డు రచయిత-దర్శకుడు  

"I think, at the end of the day, filmmaking is a team. But eventually there's got to be a captain." 
- Ridley Scott

Friday 6 August 2021

ఎవరి వాల్ వారిది!

"ఏంటి సర్... మీరేమో ఎప్పుడూ యూత్‌ఫుల్‌గా ఉంటారు. పోను పోను మీ పోస్టులేంటి మరీ అంత చప్పగా ఉంటున్నాయి ఈ మధ్య?" 

మొన్నొకరోజు ఒక మీటింగ్‌లో కూర్చున్నప్పుడు ఒక మిత్రుడు ఈ మాటన్నాడు.

నా చుట్టూ 101 టెన్షన్స్, రకరకాల రూపాల్లో నన్ను బంధించివేసిన నిజం నా మిత్రునికి బాగా తెలుసు.

గత 18 నెలలుగా కోవిడ్ లాక్‌డౌన్, దానికి సంబంధించిన ఇతరత్రా భయాలు కూడా తోడయ్యాయి. 

నాకు కూడా కోవిడ్ వచ్చిందీ, పోయింది. పోస్ట్ కోవిడ్ సమస్యలు కూడా బాగానే ఇబ్బందిపెట్టాయి. మొత్తానికి ఓ పునర్జన్మలా ఇప్పటికి బయటపడ్డాం. 

నా సోషల్ మీడియా పోస్టుల గురించి ఆ క్షణం నా మిత్రుడు అన్నది సరదాగానే కాని, నేను మాత్రం కొంచెం సీరియస్‌గానే ఆలోచించాను దీని గురించి. ఆ మీటింగ్ జరుగుతుండగానే ఓ అయిదు నిమిషాలపాటు ఆలోచించాను. ఆ తర్వాత రోజు కూడా గుర్తుకొచ్చింది.

ఇదుగో, ఇప్పుడే అట్లీ తమిళ సినిమా ఒకటి చూడ్డం ముగించి, ఈ పోస్టు రాస్తున్నాను. 

కట్ చేస్తే - 

సోషల్ మీడియా అనేది నా దృష్టిలో ఒక మంచి మల్టిపర్పస్ టూల్. ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్ కూడా. దీన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారన్నది వారి వారి అవగాహన మీద, అవసరం మీద ఆధారపడి ఉంటుంది. 

పూర్తిగా వ్యక్తిగతం. 

ఎవరి గోల వారిది. ఎవరి వాల్ వారిది. 

ఇంకొకరిని వ్యక్తిగతంగా ఎఫెక్టు చేయనంతవరకు... ఆల్ ఓకే. 

నువ్విలాగే పోస్టులు పెట్టాలి అని కాని, నేను చూస్తున్నప్పుడు నాకిలాంటి పోస్టులే కనిపించాలనిగాని అనుకోవడం సోషల్‌మీడియాలో కుదరని పని. 

నా మటుకు నేను సోషల్ మీడియాలో రోజుకు ఒక 30-40 నిమిషాలు గడుపుతాను. అదీ ముక్కలు ముక్కలుగా! 

ఆ టైమ్‌లో, నా ఫీడ్‌లో కనిపించేవాటిల్లో నాకిష్టమైనవి చూస్తాను. లేదా, నేరుగా నాకిష్టమైన కొందరి టైమ్‌లైన్‌కు వెళ్ళిపోతాను. 

ఆ క్షణం నాకు ఏదైనా పోస్ట్ చేయాలనిపిస్తే చేస్తాను. బ్లాగ్ రాయాలనిపిస్తే రాస్తాను. ఇదంతా ఒక ప్లానింగ్ లేకుండా, ఏదో ఒక టైమ్‌లో చకచకా జరిగిపోయే పని. 

జీవితం చాలా చిన్నది. మన డొమెయిన్‌లో మన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు.

జీవితం చాలా చిన్నది. ఇలాగే బ్రతకాలన్న రూలేం లేదు. 

మన ఆలోచనల్లోనే వంద వైరుధ్యాలుంటాయి. ఒక గీత గీసినట్టు బ్రతకలేం. అలా బ్రతికేది జీవితం కాదు.  

సోషల్ మీడియా ఒక ఊహా ప్రపంచం. ఒక యుటోపియా.  ఒక మార్కెటింగ్ టూల్. 

ఇక్కడ కూడా మన పరిస్థితులు, మన మానసికస్థితి, మన సోషల్ స్టేటస్ ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. మన జీవితంలో జరుగుతున్న ప్రతివిషయాన్నీ ఇక్కడ లాగింగ్ చేసుకోవాల్సిన అవసరంలేదు. ఇలాంటి పోస్టులు పెడితే... ఇలాంటి బ్లాగులు రాస్తే ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించాల్సిన అవసరం కూడా అసలు లేదు. 

నచ్చినవాళ్లు చూస్తారు. నచ్చినవాళ్ళు జంప్ అయిపోవచ్చు. మరీ ఇబ్బందికరంగా అనిపిస్తే, ఇంకోసారి మన పోస్టులు కనిపించకుండా మనల్ని అన్‌ఫ్రెండ్ చెయ్యొచ్చు. అవసరమైతే బ్లాక్ చెయ్యొచ్చు. ఎవ్వరూ ఎవ్వర్ని ఫోర్స్ చెయ్యరు. 

కట్ చేస్తే - 

నా మిత్రుడు చెప్పింది నిజమే...

మన లైఫ్ లోని సీరియస్‌నెస్ అంతా మన పోస్టుల్లో రిఫ్లెక్ట్ కావల్సిన అవసరం లేదు... ఎవరో ఏదో అనుకుంటారని మన ఊహాలోకానికి కూడా మాస్క్ వేసుకోవాల్సిన అవసరంలేదు. దేని ట్రాక్ దానిదే.

సోషల్ మీడియా అనేది ముందు మన కోసం. మనల్ని ఇష్టపడే మన మిత్రులకోసం. మిగిలిన భయాలన్నీ ఉట్టి బుల్ షిట్.  

Everyone has three lives: a public life, a private life, and a secret life. 

Be Positive !!

మనం ఒకరికి సహాయం చేయకపోయినా ఫరవాలేదు. అది మన ఇష్టం. దాన్ని తప్పుపట్టడానికి లేదు. 

ఒక సింపుల్ "నో" చాలు. 

కాని - మన ఈగోతో, మన లాజిక్స్‌తో అవతలివారిని మాటలతో హర్ట్ చేయటం తప్పు. 

మన ఫౌండేషన్‌ను మనం మర్చిపోవద్దు. అది మనస్థాయిని తెలుపుతుంది. 

నా రూట్స్‌ను నేను మర్చిపోలేను. నా జీవితంలోని ప్రతి దశలోనూ, వివిధ విషయాల్లో నాకు తోడ్పడిన ప్రతి చిన్నా పెద్దా సహాయాన్ని, మోరల్ సపోర్ట్‌ను నేను మర్చిపోలేదు. ఆయా సందర్భాలపట్ల, ఆయా వ్యక్తుల పట్ల నా కృతజ్ఞతా భావం నా చివరి శ్వాసవరకూ ఎవర్‌గ్రీన్. 

వీరందరి పట్లా నా బాధ్యత కూడా అనుక్షణం నాకు గుర్తుంటుంది. 

నేను ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. అవసరమైనప్పుడు నేను వారికి సహాయం చేయలేకపోవచ్చు. లేదా, చేసే అవకాశం లేకపోవచ్చు. కాని, మాటలతో వారిని బాధపెట్టే శుష్కమైన పని మాత్రం నేను చేయను. చేయలేను. అది నా వ్యక్తిత్వం కాదు. 

కట్ చేస్తే - 

మనం చేసిన కొన్ని సహాయాలు కొందరు వ్యక్తుల జీవితాల్నే మార్చివేస్తాయి. దాని విలువ గుర్తించలేని వారిని, గుర్తించటం ఇష్టం లేనివారిని మనం పెద్దగా పట్టించుకోనవసరంలేదు. 

తిరిగి వారి నుంచి ఏదో ఆశించి కాదు, వారికి మనం అలాంటి సహాయం చెయ్యటం. 

అది మన వ్యక్తిత్వం.   

అలాంటి సహాయం అందుకున్నవారి వ్యక్తిత్వం కూడా మనం ఊహించిన  స్థాయిలో ఉండాలనుకోవటం మాత్రం మన తప్పు.  

And... Life never stops teaching. 

Sunday 1 August 2021

కొటేషన్స్ వేరు, జీవితం వేరు!

కొన్ని అనుభవం మీదే అర్థమవుతాయి...

చాలామంది "ఇదే నా లాస్ట్....", "ఇంక నేను సినిమాలు చేయను..." వంటి నిర్ణయాలను కొన్నిటిని చాలా ఖచ్చితంగా, కాన్‌ఫిడెంట్‌గా చెప్పిన తర్వాత కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండరు. 

ఎందుకిలా చేస్తారు... అసలా నిర్ణయం ఎందుకు... అని చాలాసార్లు అనిపించేది నాకు. 

ఎందుకో ఇప్పుడర్థమయింది నాకు.

అది వ్యక్తిగతం కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు... మనం తీసుకున్న ఒక నిర్ణయం తప్పు అని, ఇంక కుదరదు అని తెలియగానే - ఆ నిర్ణయాన్ని కరెక్ట్ చేసుకొంటూ మరొక నిర్ణయం వెంటనే తీసుకోవాలి.  

'ఈగో'తోనో, ఎవరేమనుకుంటారనో అనో... అనుకుంటే మాత్రం తర్వాత బాధపడక తప్పదు. 

చాలామంది జీవితాల్లో విషాదం ఇదే.

ఎమోషన్‌తో తీసుకొనే నిర్ణయాలు తప్పక మారతాయి. 

ఆలోచించి తీసుకొనే నిర్ణయాలు కూడా చాలా సందర్భాల్లో బ్రేక్ అవుతాయి. ఊహించని స్థాయిలో ఫెయిలవుతాయి.  

రకరకాల నేపథ్యాల్లో... ఎప్పటికప్పుడు... అప్పటి పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, మన ఆనందాన్ని బట్టి, మన జీవితాల్లో వచ్చే అనేక కష్టనష్టాలను బట్టి...  మనం తీసుకొన్న అన్ని నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండలేం. ఇది సహజం.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక నిజమైన ఫ్రెండ్ అవసరం తెలుస్తుంది. 

అందుకే - ఎలాంటి హిపోక్రసీ లేకుండా, భయం లేకుండా - మనసు విప్పి మాట్లాడుకోడానికి ప్రతి ఒక్కరికీ జీవితంలో కనీసం ఒక ఫ్రెండ్ అయినా ఉండాలి. ఉండితీరాలి. 

కట్ చేస్తే -

ఎంత అద్భుతమైన స్నేహాలయినా, ఎన్ని దశాబ్దాల స్నేహాలయినా, ఏ స్థాయికి చేరుకున్న స్నేహాలయినా... ఏదో ఒక సమయంలో... రెండే రెండు కారణాల వల్ల బ్రేకప్ అవుతాయి. 

ఒకటి ఈగో, రెండు డబ్బు. 

స్నేహంలో డబ్బు ప్రసక్తి ఎంటరయిందంటే చాలు. అప్పటివరకూ వినని మాటలు వినాల్సి వస్తుంది. అప్పటివరకూ ఉన్న పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఒకే ఒక్క నిమిషంలో నెగెటివ్‌గా మారిపోతాయి. అప్పటివరకూ లేనివిధంగా - ప్రతి కదలికా, ప్రతి మాటా తప్పుగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి.

అప్పటివే కాదు... వారి స్నేహం తొలిరోజులనుంచీ మాట్లాడిన ప్రతిమాటా, వేసిన ప్రతి అడుగులోనూ ఇప్పుడు వంద తప్పులు కనిపిస్తాయి.  

డబ్బుకు అంత శక్తి ఉంది. 

ఈగో కూడా అంతే. ఎక్కువగా ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తుంది. మరీ ఎక్కువగా ఇది ఆడ-మగ స్నేహాల్లో వస్తుంది. 

ఒకసారి ఈగో హర్ట్ అయ్యిందా... ప్రపంచంలో ఏ ఫెవికాల్, ఏ కెమికల్ కూడా విరిగిన ఆ మనసు ముక్కల్ని మళ్ళీ అతికించలేదు. 

స్నేహం బాగున్నప్పుడే ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి. కాని, అలా జరగదు.  అలా సాధ్యం కాదు. 

కట్ టు ఫినిషింగ్ టచ్ - 

ఒక  ప్రోగ్రామ్ వేదిక పైనుంచి - వందలాదిమంది ఆహూతుల సమక్షంలో - యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు స్నేహం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు.

'సక్సెస్ సైన్స్' నేపథ్యంలో - ఒక "రాగ్స్ టు రిచెస్ స్టోరీ"గా రామోజీరావు గారు ఒక ఐకాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఒకసారి స్నేహం విషయంలో బాలు గారితో ఒక మాట చెప్పారట:

"మీరు ఎవరైతోనైనా స్నేహం చేసేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక, ఆ వ్యక్తిలో మీకు చాలా తప్పులు కనిపించొచ్చు. వీలైతే సరిదిద్దండి. లేదంటే జన్మాంతం భరించండి" అని! 

ఇట్లా నేను ఒకరిని భరిస్తున్నాను. నన్ను ఒక నలుగురు భరిస్తున్నారు... 

హాపీ ఫ్రెండ్‌షిప్ డే!💐