Sunday 22 August 2021

సినిమా ఎప్పుడు భయ్యా?!

(Film Nagar Diaries – 2)
“సండే మా ప్రొడ్యూసర్ వస్తున్నాడు. బెంగుళూరు నుంచి!… లాస్ట్ మీటింగ్ లోనే స్టోరీలైన్, బడ్జెట్ అదంతా ఓకే అయింది. ఇప్పుడు జస్ట్ మళ్ళొకసారి కాస్టింగ్, లొకేషన్స్, ప్రమోషన్, బిజినెస్… అన్నీ ఉంటాయి కదా… డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ ఫార్మాలిటీ. తర్వాత, అంతా ఓకే అనుకుంటే, మండే అడ్వాన్సు!… కట్ చేస్తే – ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్!”

“లాస్ట్ టైం, మనం మార్చిలో కల్సినప్పుడు కూడా కొంచెం అటుఇటుగా ఇదే చెప్పినట్టున్నావ్ భయ్యా..?!”

ఫిలింనగర్ పక్కనే ఉన్న అపోలో హాస్పిటల్‌కెళ్లే దారిలో, రోడ్డు పక్కనున్న చిన్న హోటల్లో టీ సిప్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ అభిమన్యు, ఇంకో చిన్న అప్‌కమింగ్ ఆర్టిస్టు అనీష్.
“లేదు తమ్ముడూ… ఆ ప్రొడ్యూసర్‌ వేరే. మనకు సెట్ అవ్వలేదు. నేనే వద్దన్నుకున్నాను”

“ఈ ప్రొడ్యూసర్ ఓకేనా భయ్యా?!”

“సూపర్ భయ్యా! మంచి టేస్ట్ ఉంది”

“అయితే ఎప్పుడుంటుంది భయ్యా షూటింగ్?”

“నెక్‌స్ట్ మంత్ తమ్ముడూ”

“అంటే… సెప్టెంబర్ అన్నమాట!”

అనీష్ బిల్ కట్టాడు.

“తమ్ముడూ నువ్వు లాగించెయ్యి. ఇంకో ఫ్రెండొస్తున్నాడు” అనీష్‌కు షేక్ హాండిస్తూ చెప్పాడు అభిమన్యు.

“కొంచెం గుర్తుపెట్టుకో భయ్యా. ఈసారి నాకు క్యారెక్టర్ ఇప్పించాలి”

“పక్కా తమ్ముడూ” అంటూ గట్టిగా భుజం మీద చరిచాడు అభిమన్యు.

సంతృప్తిగా గుండెలనిండా ఊపిరి పీల్చుకొంటూ హోటల్ బయటికి నడిచాడు అనీష్.

వెంటనే తను కూర్చొన్న చోటు నుంచి లేచి, కూల్‌గా అదే హోటల్లో ఇంకో మూలనున్న టేబుల్ దగ్గరికెళ్ళి కూర్చున్నాడు అభిమన్యు.

అక్కడ అభిమన్యు కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఇంకో కొత్త ఆర్టిస్ట్ రంగారెడ్డి అభిమన్యుని చూస్తూనే విష్ చేస్తూ షేక్ హాండిచ్చాడు.

“దో చాయ్ లారే” అభిమన్యు బాయ్ కేసి చూస్తూ కేకేశాడు. తర్వాత, “చూస్తున్నావ్ కదా… బిజీ” అంటూ నవ్వాడు.

“పర్లేదన్నా” అన్నాడా కొత్త ఆర్టిస్టు.

“చెప్పు రంగారెడ్డీ…”

“సినిమా ఇంకెప్పుడన్నా?!”

“నెక్‌స్ట్ మంత్ తమ్ముడూ”

ఎలాంటి చికాకు లేకుండా ఇందాకటి సంభాషణను మళ్ళీ రిపీట్ చేయడం మొదలెట్టాడు అసిస్టెంట్ డైరెక్టర్ అభిమన్యు.

పొద్దుటి నుంచి ఇది నాలుగోసారి.

పక్కనున్న టేబుల్ దగ్గర మూడో కాఫీ పూర్తిచేసిన 'చిన్న సినిమాల డైరెక్టర్' సిద్దూ ఇదంతా వినటం రెండో సారి.

అభిమన్యు చెప్తున్నదాంట్లో ఎలాంటి అబద్ధం ఉండకపోవచ్చు. ఉండదు. కాని, ఆ ప్రొడ్యూసర్ “అంతా ఓకే” అని ఎప్పుడు చెప్తాడో ఆ దేవుడికి కూడా తెలీదు అనుకున్నాడు సిద్దూ. 

పెద్ద హీరోలతో అప్పటికే నాలుగు సినిమాలు తీసిన ఒక డైరెక్టర్‌కు ఓకే చెప్పడానికే, ఓ సీనియర్ ప్రొడ్యూసర్ రెండేళ్ళు తీసుకున్నాడు!

లేచి నెమ్మదిగా బయటపడుతుండగా, “సార్, అభిమన్యు సార్… షూటింగ్ ఎప్పుడు సార్?!” అని బయటనుంచే అరుస్తూ ఇంకో కొత్త ఆర్టిస్టు లోపలికి ఉరికాడు.

“నెక్‌స్ట్ మంత్ నుంచి తమ్ముడూ” వెనుకనుంచి వినిపించింది.

ప్రతిసారీ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకోవడం బాగుండదని… కోర్టుబోనులో నిల్చున్న ముద్దాయిలా రెండు చేతులూ కట్టుకొని, హోటల్ మెట్లు దిగి, నెమ్మదిగా ఫిలించాంబర్ వైపు నడవసాగాడు సిద్దూ.

No comments:

Post a Comment