Sunday 15 August 2021

కుక్కట్‌పల్లి రూమ్‌లో ఒక చాప కథ

(Film Nagar Diaries - 1)
"ఒరేయ్ నువ్వెన్నయినా చెప్పు... ఆర్టిస్టులు ఆర్టిస్టులే, డైరెక్టర్లు డైరెక్టర్లేరా" 

"కొలంబస్ అమెరికా కనుక్కున్నట్టు కొత్తగా చెప్తున్నావేంట్రా!... ఆర్టిస్టులు ఆర్టిస్టులే, డైరెక్టర్లు డైరెక్టర్లే! ఏంటి నీ ప్రాబ్లం?" 

షూటింగ్‌లో "స్మోక్" అని అరవగానే సెట్‌బాయ్స్ పొగవదిలినట్టు సిగరెట్ పొగ వదుల్తూ... కాఫే మిలాంజ్‌లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు మాట్లాడుకొంటున్నారు.

చింపిరి గడ్డంతో ఉన్న చిన్న సినిమాల డైరెక్టర్ సిద్దూ, వారి వెనకున్న కేన్ సోఫాలోంచి  వీరి మాటలు విని ఒకసారి వెనక్కి చూశాడు. క్షణంలో మళ్ళీ అటు తిరిగి తన మొబైల్‌లోకి మునిగిపోయాడు.

వెనకనుంచి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్స్ మాటలు వినిపించసాగాయి. 

"నీకు రెండు ఇన్సిడెంట్స్ చెప్తా విను"

"చెప్పు..."

"కట్ చేస్తే - అన్నపూర్ణ స్టుడియో. హాస్పిటల్ సెట్టు. కెమెరామన్ పిచ్చ లైటింగ్ పెట్టాడు. మాంచి ఫీల్ ఉన్న సీన్. హీరోహీరోయిన్లకు మా డైరెక్టర్ సీన్ మస్త్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు..." 

"..." 

"కట్ చేస్తే - హీరోహీరోయిన్లిద్దరూ ఇరగదీశారు! అన్నీ సింగిల్ టేక్‌లే!!... ఇద్దరూ బాగా ఏడ్చేశారు".

"గ్లిజరినేగా?!" 

"నో!! ... గ్లిజరిన్ ఇస్తే తీసి అవతల పడేశారు. అంత బాగా యాక్ట్ చేశారిద్దరూ! పెద్ద సీన్... నాలుగు గంటల్లో అయిపోయింది"

"నీ యంకమ్మ... దీన్లో ఇన్సిడెంట్ ఏంట్రా?!... వాళ్ళ పనే యాక్టింగ్! " 

"చెప్తా ఉండు... సీన్ అయిపోయాక, మా డైరెక్టర్ దగ్గరికొచ్చాడు హీరో. "డైరెక్టర్ గారూ, మీ తర్వాతి సినిమాకు కూడా నేను డేట్స్ ఇస్తాను. అయాం ఇంప్రెస్డ్! థాంక్యూ సో మచ్ అండీ... మీరు నిజంగా స్క్రిప్ట్ అద్భుతంగా రాశారు. చనిపోయిన మా అమ్మ గుర్తొచ్చింది ఈ సీన్ చేస్తున్నంత సేపూ" అని కళ్లల్లో నీళ్లతో చెప్పాడు హీరో. పాపం కొత్త డైరెక్టర్ కదా... మస్త్ ఫిదా అయిపోయాడు మా డైరెక్టర్" 

"తర్వాతి సినిమాక్కూడా డేట్స్ ఇస్తా అని హీరో అంటే ... ఏ డైరెక్టరయినా  ఫిదా అయిపోతాడు. ఇందులో కొత్త డైరెక్టర్ పాత డైరెక్టరని ఏం లేదు".

"ఉండు... చెప్తా" అంటూ, ఇదంతా చెప్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకో సిగరెట్ ఫ్రెష్‌గా వెలిగించి మళ్ళీ "స్మోక్ ఆన్" చేశాడు. 

వెనకున్న డైరెక్టర్ సిద్దూకు వద్దన్నా వీళ్ల మాటలు బాగా వినిపిస్తున్నాయి. 

అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ అందుకున్నాడు. 

"కట్ చేస్తే... ఆ సిన్మా ఫారిన్‌లో పదిరోజులు షూట్ చేశారు. వైజాగ్, రాజమండ్రి, ముంబాయి, ఢిల్లీ... అక్కడా ఇక్కడా బాగా ఖర్చుపెట్టి బ్రహ్మాండంగా ఫినిష్ చేశారు. కాపీ వచ్చింది. షో వేస్తే బయ్యర్స్ కూడా బాగా ఎగబడ్డారు. దెబ్బకు ప్రొడ్యూసర్ ఉబ్బిపోయి, సినిమా అమ్మకుండా ఓన్ రిలీజ్‌కెళ్ళాడు. బొక్కబోర్లా పడ్డాడు" 

"అయ్యో!!" 

"అయ్యో లేదు, కుయ్యో లేదు... ముందు చెప్పేది విను..."

"సరే  కానియ్"

"కట్ చేస్తే - మా సినిమా జరుగుతుండగా మేం గుప్పించిన పబ్లిసిటీతో ఆ హీరోకు ఇంకో చిన్న సినిమా ఆఫరొచ్చింది. సైన్ చేశాడు... తర్వాత అది పూర్తయింది, అతి కష్టం మీద రిలీజయింది. హిట్టయింది... రోజుకు నాలుగు ఇంటర్వ్యూలు ఇరగదీస్తున్నాడు హీరో ..."

"వెరీ గుడ్!" 

"గాడిద గుడ్దేం కాదూ.. ముందు విను..." 

"చెప్పు చెప్పు"

"ప్రతి ఇంటర్వ్యూలో తను పుట్టినప్పటినుంచి ఏ చెడ్డీలేసుకున్నాడో, ఏ సందులో ఎన్ని గోళీకాయలాడాడో... అన్నీ చెప్తున్నాడు హీరో. అంతకు ముందు తను చేసిన అట్టర్ ఫ్లాప్ సినిమాలన్నిటి గురించి కూడా చెప్తున్నాడు... కాని, మా డైరెక్టర్ గురించి కాని, అంత బాగా ఖర్చుపెట్టి అతన్ని ఒక రాజు లాగా ట్రీట్ చేసిన ఆ సినిమా ప్రొడ్యూసర్ గురించి కాని ఎక్కడా ఒక్క ముక్క చెప్పట్లేదు!"

"ఏం... మీ డైరెక్టర్‌కూ ఈ హీరోకీ ఏమైనా గొడవలయ్యాయా?!"

"గొడవా తొక్కా... ఆ సినిమా హిట్ అవ్వలేదు!"

"హిట్ అవ్వకపోతేనేం... మర్చిపోయాడేమో!" 

"మనం అలాగే అనుకుంటాం... వేస్ట్ గాళ్లం! ఒక రౌడీలాంటి జర్నలిస్ట్ మాత్రం వదల్లేదు. అడిగేశాడు... జస్ట్ మొన్నీమధ్యే రిలీజైన ఆ సినిమా గురించి చెప్పండి అని" 

"ఏమన్నాడు?"

“ఆ సినిమా గురించి మాట్లాడకపోవటమే బెటర్ అండీ... వెరీ పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్...  డైరెక్టర్ బాగా చేయలేకపోయాడు... స్క్రిప్ట్‌లో కూడా చాలా తప్పులున్నాయి… అన్నాడ్రా!”

"వార్నీ... అలా అన్నాడా!? ఈ హీరోనే కదరా... ఆరోజు ఏడుస్తూ డైరెక్టర్ని అంతలా మెచ్చుకొని ఇంకో సినిమాక్కూడా డేట్స్ ఇస్తా అన్నాడు!?" 

"మరదే... అందుకే అన్నాను... నువ్వేమో కొలంబస్సు, అమెరికా అంటూ సెటైరేశావ్!"

"అందరు హీరోలు ఇట్లా ఉండరులేరా..."

"అది నాక్కూడా తెల్సు" 

"అయినా... ఈ రెండు ఇన్సిడెంట్స్‌లో రియాలిటీ ఉంది గాని... కిక్కు లేదు బావా!" 

"చెప్తా విను... అంతకు ముందు ఆ హీరో యాక్ట్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయి, ఆఫర్స్ లేక ఎక్కడో కుక్కట్‌పల్లిలో ఫ్రెండ్ రూమ్‌లో చాప మీద పడుకుని పైన ఫ్యాన్‌ను చూస్తుంటే... మా డైరెక్టరే వెళ్ళి, కారులో తీసుకొచ్చి, అడ్వాన్స్ చేతిలోపెట్టి ఆఫరిచ్చాడు!... ఇప్పుడొచ్చిందా నీకు కిక్కు?" 

అప్పటిదాకా ఆర్కే లక్ష్మణ్ కార్టూన్‌లో కామన్ మ్యాన్‌లా, వెనుకనుంచి అంతా వింటున్న సిద్దూ ఒక్కసారిగా లేచి... జీన్స్ ప్యాంట్ రెండు జేబుల్లో చేతులుపెట్టుకొని... ఫిలింనగర్ దైవ సన్నిధానం వైపు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.  

10 comments:

  1. Replies
    1. Venkat garu, this is a story. Thank you for your comment. :-)

      Delete
  2. >> జీన్స్ ప్యాంట్ రెండు జేబుల్లో చేతులుపెట్టుకొని... ఫిలింనగర్ దైవ సన్నిధానం వైపు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు

    :)

    ReplyDelete
  3. ఆఖరి లైనులో ఉన్న పంచ్ ఓ హెన్రీ కధల్ని మించిపోయి ఉంది, అలాగంచెప్పి, "అంత కష్టపడి అన్ని లైన్ల ఖద రాస్తే అదొక్కటే నచ్చిందా - హ్మ్" అనుకునేరు, కధలోని ప్రతి లైనూ అదిరింది పొండి!

    ReplyDelete
    Replies


    1. ఇవి వాస్తవాలు నేపథ్యంగా రాస్తున్న కల్పిత కథలు. మీకు నచ్చినందుకు సంతోషం. మీ కామెంట్ కూడా మంచి ఉత్సాహాన్నిచ్చింది. థాంక్యూ సో మచ్ అండి! :-)

      Delete
  4. "చేతిలో అడ్వాన్స్ పడేంతవరకూ సినిమా నీ చేతిలో లేదు. అలా వచ్చేసిందని బంధువుల్లో, స్నేహితుల్లో చెప్పినందువల్ల చులకనకావడం తప్ప వేరే ఇంకేమీ ఉండదు." అని ఎంతో మంది డైరెక్టర్లకి చెప్పాను. విన్నవారు తమతమ పనులు చేసుకుంటూ.. ఫ్యామిలీకి ఇబ్బందిలేకుండానే సినిమాలలో ట్రై చేసుకుంటున్నారు. విననివారు అన్ని పనులూ మానుకోని, ఫిల్మ్ నగర్ లో తిరుగుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. అడ్వాన్స్ చేతిలో పడ్డ తర్వాత కూడా ఎన్నెన్నో టెన్షన్స్ ఉంటాయి. అదొక పెద్ద వైకుంఠపాళి. చాలా గట్స్ కావాలి.

      మీరు చెప్పింది కరెక్టు. విననివారు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

      Thanks for the comment. :-)

      Delete