Wednesday 28 July 2021

నిర్ణయం ముఖ్యం!

ఆ మధ్య నా బర్త్ డే నాడు, నాకు అత్యంత ప్రియమైన ఫ్రెండ్ ఒకరు ఒక ప్రశ్న అడగటం జరిగింది. "ఈ బర్త్ డే కి స్పెషల్ గా నువ్వు ఏదయినా కొత్త నిర్ణయం తీసుకుంటున్నావా?" అని. 

నిజానికి నాకు అలాంటి నమ్మకాలు లేవు.

ఒక మనిషి నిజంగా ఏదయినా మానేయాలనుకొన్నా, లేదంటే, కొత్తగా ఏదయినా ప్రారంభించాలనుకొన్నా - దానికి ప్రత్యేకంగా న్యూ యియర్లు, బర్త్ డేలు, మరేవో స్పెషల్ డేలూ, ముహూర్తాలూ అవసరం లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.   అదే విషయం నా ఫ్రెండ్ తో చెప్పాను. 

నిర్ణయాలు ఏ క్షణంలో అయినా తీసుకోవచ్చు. ఒక చిన్న సంఘటన చాలు. మన ఆలోచనా విధానాన్నీ, మన జీవన పథాన్నీ సంపూర్ణంగా మార్చివేయగల ఒక నిర్ణయం తీసుకోడానికి.

కట్ చేస్తే - 

మొన్నీ మధ్యే, కేవలం రెండు రోజుల వ్యవధిలో - మా పెద్దబ్బాయి ప్రణయ్, చిన్నబ్బాయి ప్రియతమ్ నాతో ఏకాంతంగా ఉన్నప్పుడు చెరొక ప్రశ్న చాలా క్యాజువల్ గా అడిగారు. 

మా అబ్బాయిలిద్దరి రెండు ప్రశ్నలూ నన్ను కనీసం ఒక వారం పాటు ఒక సంపూర్ణ అంతర్ముఖుడ్ని చేశాయి. చివరకు, ఒకే ఒక్క గంట స్వీయ విశ్లేషణ తర్వాత నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాను.

ఇప్పటివరకూ నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిలోకెల్లా అత్యుత్తమమయిన నిర్ణయం అది. 

అలాగని నిన్న ఎలాంటి ప్రత్యేకమయిన రోజు కాదు. కానీ, నిన్న నేను తీసుకున్న నిర్ణయం ఫలితాలను, ఇంకో నాలుగు నెలల్లో రాబోతున్న నా పుట్టినరోజు నాటికి పూర్తిగా అందుకోవాలి, పూర్తిగా ఫ్రీ అయిపోవాలి అని గట్టిగా అనుకున్నాను.  

సో, రివర్స్ ఇంజినీరింగ్ లో, నా పుట్టినరోజు అలా పనికొచ్చిందన్నమాట! 

నేను ప్రయత్నించని నా ఒక్క ఛాన్స్!

అది 1997 అనుకుంటాను. 

అప్పుడు నేను ఆలిండియా రేడియో (ఎఫ్ ఎమ్), కర్నూలులో పనిచేస్తున్నాను. 

చిన్నప్పటి నుంచీ చదివే అలవాటు ఉన్నా కూడా, ఆలిండియా రేడియోలో పనిచేసినప్పుడే నేను బాగా చదవడానికి ఎడిక్టయ్యాను. తెలుగు సాహిత్యంతో పాటు, ప్రపంచ సాహిత్యానికి కూడా బాగా కనెక్ట్ అయ్యాను. 

థాంక్స్ టూ ఎస్ పి గోవర్ధన్ గారు... అప్పటి మా స్టేషన్ డైరెక్టర్... ఆయనకు కూడా బాగా చదివే అలవాటుండేది. వొరేషియస్ రీడర్. దాదాపు ప్రతి రెండు నెలలకొకసారి మా లైబ్రరీకి కొత్త బుక్స్ ఆర్డర్ పెడుతుండేవారు. 

మిలన్ కుందేరా, నీషే, ఐన్ రాండ్, కుష్వంత్ సింగ్, శోభా డే, విక్రమ్ సేఠ్, సాల్మన్ రష్దీ, జెఫ్రీ ఆర్చర్, మారియో పుజో, డేనియల్ స్టీల్, రాబర్ట్ లడ్‌లమ్, ఫ్రెడ్రిక్ ఫోర్సిత్, జాకీ కాలిన్స్, అరుంధతి రాయ్, జేన్ ఆస్టిన్, నాన్సీ ఫ్రైడే... ఇలా రాసుకుంటూ పోతే - ఆలిండియా రేడియోలో ఉండగా -  నేను చదివిన కనీసం ఇంకో 100 మంది రచయితల పేర్లు ఈజీగా రాయగలను.   

తెలుగులో కూడా సినారె పుస్తకాలు, ఆరుద్ర సాహిత్య సంపుటాలు, తిలక్, వీరేంద్రనాథ్, మల్లాది, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సులోచన, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, రావిశాస్త్రి, రారా, కొకు, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, చలం... ఇలా ఎందరివో బుక్స్ ప్రతి రెండో నెలలో ఆర్డర్ పెట్టేవారు.  

సికింద్రాబాద్ "బుక్ సెలక్షన్ సెంటర్" నుంచి మాకు రెగ్యులర్‌గా "న్యూ అరైవల్స్" క్యాటలాగ్స్ వచ్చేవి. మా స్టేషన్ డైరెక్టర్ గారు నన్ను కూడా సెలక్ట్ చెయ్యమనేవారు. 

స్వయంగా నేనే ఎన్ని బుక్స్ సెలక్టు చేశానో, ఎన్ని చదివానో చెప్పలేను. 

మా ఫార్మ్ రేడియో ఆఫీసర్ లక్ష్మిరెడ్డి గారు, మా స్టెనోగ్రాఫర్ లక్ష్మి, ఎనౌన్సర్ శాస్త్రి కూడా బాగా చదివేవారని నాకిప్పటికీ గుర్తుంది.     

ఇలాంటి సమయంలోనే - అసలు ఈ పుస్తకాల స్థాయికీ, అక్కడ పనిచేస్తున్న నా నేపథ్యానికీ సంబంధం లేకుండా - ఒకరోజు ఆంధ్రభూమి వీక్లీలో "హారర్ స్టోరీస్ పోటీ" ఒకటి ఆ పత్రిక ఎడిటర్ సికరాజు గారు ప్రకటించింది చూశాను.   

ఒక ప్రైజ్ నాకు పక్కా అనుకొంటూ, మాంచి జోష్‌లో ఒక హారర్ కథ రాసి పంపించాను. దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. నా ఫోటో వేసి, నా గురించి చిన్న ఇంట్రో బాక్స్ వేసి ప్రచురించారు. 2,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా చెక్కు ద్వారా వచ్చింది. 

పత్రికలకు కథలు రాయడం ద్వారా నేను అందుకున్న అతి తక్కువ పారితోషికం 150 రూపాయలు కాగా, అత్యధిక పారితోషికం మాత్రం ఇదే. 

నాకు ప్రైజ్ తెచ్చిపెట్టిన ఆ  కథ పేరు - "ఆమె". 

ప్రస్తుతం "ఆమె" నా దగ్గర ఫైల్స్‌లో అటకమీద కార్టన్ డబ్బాల్లో ఉంది. 

కట్ చేస్తే -   

ఒకరోజు ఉదయం మా స్టేషన్ డైరెక్టర్ ఇంటర్‌కమ్‌లో పిలిచారు - "మనోహర్, నీకోసం ఎవరో చెన్నై నుంచి కాల్..." అంటూ. 

పైకి వెళ్లాను. కాల్ మాట్లాడాను. 

నాతో మాట్లాడింది... అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌లిస్తున్న ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్న సీనియర్ కో-డైరెక్టర్. 

అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఇంకా పాపులర్ కాలేదు. నాకు కూడా అప్పటికి ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోనేం లేదు. సో, ఆ డీటెయిల్స్ వీక్లీలో లేవు కాబట్టి, డైరెక్టుగా ఆంధ్రభూమి ఆఫీస్‌కే ఫోన్ చేసి నా వివరాలు తీసుకొని, ఆలిండియా రేడియోకి ఫోన్ చేసినట్టు తర్వాత ఆ కో-డైరెక్టర్ చెప్పారు. 

ఒక వారం గ్యాప్‌లోనే - ఇంకో కో-డైరెక్టర్ నుంచి పోస్టులో ఇంకో లెటర్ వచ్చింది. ఆయన రైటింగ్ అందంగా, అద్భుతంగా ఉంటుంది. 

కట్ చేస్తే - 

ఒక నాలుగు రోజుల తర్వాత బస్‌లో చెన్నై బయల్దేరాను. 

అదీ ప్రారంభం. 

కథా చర్చలు. ట్రీట్‌మెంట్స్ రాయడం, వెర్షన్స్ రాయడం. చెన్నై వెళ్ళినప్పుడల్లా - ఆలిండియా రేడియోలో నా నెల జీతాన్ని మించిన పారితోషికం తీసుకోవడం...

నాకు బాగా పరిచయమైన, నాకిష్టమైన ఒకరిద్దరు కో-డైరెక్టర్స్‌తో కలిసి చెన్నై వీధులు, మెరీనా బీచ్ తిరగటం, వర్షంలో ఓ రెండు సాయంత్రాలు కారులోనే కూర్చొని సరదాగా మందు సిప్ చేయడం... అలా అలా ప్రారంభంలో ఆలిండియా రేడియోలో నా జాబ్ నేను చేసుకొంటూనే సినిమాకు కనెక్టయ్యాను. 

తర్వాత - నేను కర్నూలు నుంచి హైద్రాబాద్ వచ్చాక కూడా కొన్ని అవకాశాలు నన్ను వెతుక్కొంటూ వచ్చాయి. ఆ సమయంలోనే నాకు కొందరు మంచి మిత్రులు ఇండస్ట్రీలో పరిచయమయ్యారు. వారితో స్నేహం నాకిప్పటికీ ఉంది.  

ఈ నేపథ్యమే తర్వాత ఒక రచయితగా నేను నంది అవార్డు సాధించడానికీ, ఆ తర్వాత ఫైనల్‌గా నేనొక రైటర్-డైరెక్టర్ అవడానికీ దారితీసింది. అయితే ఆ దారిలో వెళ్ళాల్సిన పధ్ధతిలో నేనిప్పటికీ వెళ్లలేకపోయాను. వెళ్లలేను కూడా. అది పూర్తిగా వేరే విషయం.

నా ఉద్యోగం, నాకున్న ఎన్నో ఇతర పరిమితుల కారణంగా అలా మొదట్లో నన్ను వెతుక్కొంటూ వచ్చిన ఛాన్స్‌ను, ఆ తర్వాత వచ్చిన ఇంకొన్ని మంచి అవకాశాలను కూడా అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు అనేది ఇక్కడ నేను కన్‌ఫెస్ కావల్సిన బాటమ్‌లైన్. 

కట్ టు కోవిడ్ లాక్‌డౌన్ అండ్ ఆఫ్టర్ - 

కరోనా లాక్‌డౌన్‌లో వచ్చిన సంపూర్ణ జ్ఞానోదయం తర్వాత - ఒక్క దెబ్బకు అన్ని మత్తులు, ముసుగులు, పరిమితులు ఎగిరిపోయాయి. 

కరోనాకు ముందు సినిమాలు వేరు, కరోనా తర్వాత సినిమాలు వేరు. 

Content is the king. Money is the ultimate goal.

నేనూ, నా మిత్రుడు వీరేంద్ర లలిత్ (DOP, Mumbai), నేను ఇంట్రొడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కోంబోలో - ఓటీటీ కోసం మేం ప్లాన్ చేస్తున్న రెండు సినిమాలు ఇప్పుడు ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి. 

"Cinema can fill in the empty spaces of your life and your loneliness."
- Pedro Almodovar 

Tuesday 27 July 2021

ఎవరైనా చదివితే ఏమనుకుంటారు?

ఈ పోస్టులో నేను చర్చిస్తున్నది ప్రొఫెషనల్, టెక్నికల్ బ్లాగుల గురించి కాదు. అది పూర్తిగా వేరే లోకం. 

కట్ చేస్తే - 


బ్లాగ్ అంటేనే వ్యక్తిగతం. పర్సనల్. 

ఎంత వద్దనుకొన్నా - చాలాసార్లు మనం రాసుకోకూడని, రాసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగతమైన కొన్ని సెన్సిటివ్ ఆలోచనలు కూడా మన బ్లాగ్ పోస్టుల్లో బాహాటంగా వచ్చేస్తుంటాయి. 

తర్వాతెప్పుడో ఒక 2, 3 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు - నేను ఇలా రాశానా? అసలు ఇదెందుకు రాశాను? ఇది రాయాల్సింది కాదు... ఇలా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని బ్లాగుల విషయంలో మరీ సిల్లీగా అనిపిస్తుంది. 

కాని - అదంతే. 

ఏం తప్పుకాదు. బ్లాగ్ ఇలాగే రాయాలని కాని, బ్లాగ్‌లో ఇవి మాత్రమే రాయాలని కాని ఎలాంటి రూల్స్ లేవు. 

మనవాళ్ళు ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? బయటివారైనా సరే, చదివి ఏమనుకుంటారో... అనే ఇలాంటి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. 

"అసలు అలాంటి ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను అసలు ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్. 

కట్ చేస్తే - 

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన టూ మచ్ పర్సనల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని మరీ ఓపెన్ సెల్ఫ్ ప్రమోషన్స్!

అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మన జీవితంలోని మంచి, చెడుల గురించి... సుఖ సంతోషాల గురించీ మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చాలా ఉంటుంది. 

ఇలాంటి ఫ్లో రైటింగ్ వల్ల శాస్త్రీయంగా చాలా లాభాలున్నాయి.  

ఈ లాభాలు పొందటం కోసం మనకు దొరికిన ఒక అద్భుత సాధనం - బ్లాగింగ్. 

నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనకు ఆరోగ్యాన్నిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉండనిస్తుంది. 

అన్నట్టు, నా తర్వాతి బ్లాగ్ పోస్టులో నేను రాయబోతున్న అంశం ఏంటో తెలుసా? 

నా ఫస్ట్ ** గురించి...    

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.”
- James Altucher

Saturday 24 July 2021

డైనమిజమ్ అన్‌లిమిటెడ్!

సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో రామోజీరావు ఒక ఐకాన్. 

దేశంలోనే ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్‌గా, ఒక మీడియా మొఘుల్‌గా ఆయన ఎందరో మన దేశ ప్రధానమంత్రులను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూశారు. పాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎన్నో సందర్భాల్లో ఎన్నోరకాలుగా ప్రభావితం చేయగలిగారు.  

కట్ చేస్తే - 

రామోజీరావు గారు... రాష్ట్ర మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 45 వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ  ఒక లేఖ పంపారు. 

అందులో ఆయన రాసిన ప్రతి పదం, ప్రతి వాక్యం ఆచితూచి రాసినవే...

"యువతరం నాయకులు" అని ప్రారంభంలో సంబోధించారు. తర్వాత - "అరుదైన నాయకత్వ లక్షణాలు, అసాధారణ సంభాషణ నైపుణ్యం, అన్నిటినీ మించిన రాజకీయ చతురతతో అనతికాలంలోనే పరిణత నాయకునిగా ఎదిగిన" కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆశీస్సులందజేశారు. 

అక్కడితో ఆగిపోలేదు. ఒక ఉన్నతశ్రేణి నాయకునికి ఉండాల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన కేటీఆర్ గురించిన మరెన్నో లక్షణాలను గురించి కూడా చెబుతూ, ఆయన పనితీరును, ఆయన సామర్థ్యాన్ని మెచ్చుకొన్నారు. 

కేటీఆర్ సాధించిన పురోగతిని చూసి గర్విస్తున్నానన్నారు రామోజీరావు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కేటీఆర్ చేస్తున్న నిరంతర కృషిని చూసి తండ్రిగా కేసీఆర్ తప్పక ఆనందిస్తూ వుంటారని చెప్పారు. 

"మీవంటి చైతన్యశీలిని పుత్రునిగా పొందిన ఆయన ధన్యులు" అని కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్నారు. 

ట్విట్టర్ వేదికగా, వేగంగా స్పందిస్తూ కేటీఆర్ చేస్తున్న అనేకరకాల సహాయక చర్యలు అతనిలోని మానవతా దృక్పథాన్ని తెలుపుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 

కార్యకుశలతలో కేటీఆర్‌కు సాటిరాగల యువనాయకులు ఇప్పుడు దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదన్నారు. దేశానికి మీలాంటి యువతరం నాయకులు అవసరం అన్నారు. 

చివరగా - "ఇంతింతై మీరు దేశానికే నాయకత్వం వహించే ధృవతార(క రాముని)గా ఎదగాలని" ఈ పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తున్నట్టు తెలిపారు రామోజీరావు. 

కట్ చేస్తే - 

రామోజీరావు గారు తన గ్రీటింగ్స్‌లో కేటీఆర్ సామర్థ్యం గురించి చెప్పిన ప్రతి అక్షరం సత్యం. చివరి వాక్యంలో, కేటీఆర్ లక్ష్యం ఏ స్థాయిలో ఉండాలో ఆయన పరోక్షంగా సూచించారని నేననుకొంటున్నాను.

రెట్టించిన ఉత్సాహంతో, తనలోని నాయకత్వ లక్షణాలకు, తన సామర్థ్యానికీ మరిన్ని మెరుగులు దిద్దుకొంటూ, దూసుకొంటూ, ఆ దిశలో ముందుకు వెళ్లటమే ఇప్పుడు కేటీఆర్ చేయాల్సింది!  

With that said -

రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయస్థాయిలో కూడా తన ఊహే హద్దుగా ఎంత ఎత్తుకయినా ఎదిగే  అవకాశాలు పుష్కలంగా ఉన్న Hon Min KTR గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 
💐🎂💐

Sunday 18 July 2021

Renegade Filmmaking Made Easy!

నేనూ, నా మిత్రుడు వీరేంద్ర లలిత్ (డిఓపి, ముంబై), నా చిన్నతమ్ముడు ప్రదీప్‌చంద్ర (నేను ఇంట్రొడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్) కోంబోలో - మేం ప్లాన్ చేస్తున్న రెండు సినిమాలు ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి. 

టెక్నికల్‌గా మా సౌలభ్యం కోసం, ఈ రెండు సినిమాలను కలిపి ఒక్కటే ప్రాజెక్టుగా మేం భావిస్తున్నాం. వీటిని పూర్తిచేసి, రిలీజ్ చేయడానికి మేం పెట్టుకొన్న టైమ్‌ఫ్రేమ్ కూడా చాలా తక్కువ. 

నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలనూ (శాటిలైట్ రైట్స్ ఎట్సెట్రా) బిజినెస్ చేసి మరీ థియేటర్లోనే రిలీజ్ చేశాము. చివరి సినిమా 'స్విమ్మింగ్‌పూల్' యూకేలో కూడా రిలీజ్ చేశాము. ఇప్పుడు రూపొందిచబోయే ఈ రెండు సినిమాలను ఓటీటీ టార్గెట్‌గా చేస్తున్నాము. అప్పటి బిజినెస్, పరిస్థితిని బట్టి థియేటర్స్‌లో కూడా రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు.

కాని, మా ప్రయారిటీ మాత్రం ఓటీటీనే.  

కరోనాకు ముందు సినిమాలు వేరు, కరోనా తర్వాత సినిమాలు వేరు. 

Content is the king. Money is the ultimate goal. 

ఈ నేపథ్యంలో - మా కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు నేను ఇవ్వగలిగిన ప్రాథమిక సమాచారం:  

> ఆర్టిస్టులు అంతా న్యూ టాలెంట్, అప్‌కమింగ్ టాలెంటే ఉంటారు.
> టెక్నికల్ టీమ్ అంతా సెట్ అయిపోయింది.  
> ప్రి-ప్రొడక్షన్ ఆల్రెడీ ప్రారంభమైంది.
> రెండు సినిమాల్లో ఒకటి పూర్తిగా వైజాగ్‌లో షూట్ చేస్తాము. ఇంకొకటి తెలంగాణలోని విభిన్న లొకేషన్స్‌లో షూట్ చేస్తాము.
> అంతకు ముందు థియేటర్స్‌లోనే సినిమాలు రిలీజ్ చేసిన మాకు... ఈ సినిమాల రిలీజ్, బిజినెస్ విషయంలో ఎలాంటి  ఇబ్బంది లేదు. ఇండస్ట్రీ నుంచి ఈ విషయంలో, ఇప్పుడు అదనంగా మాకు తగినంత సపోర్ట్, ఆశీస్సులు కూడా ఉన్నాయి.
> రెండూ పక్కా కమర్షియల్ సినిమాలే. మాకూ బాధ్యతలు, కమిట్‌మెంట్లు ఉన్నాయి. మేము బ్రతకాలి, మా టీమ్‌ను బ్రతికించాలి కాబట్టి... బిజినెస్ ఈజ్ బిజినెస్. మేధావి మిత్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని సవినయ మనవి. మీరు చీల్చి చెండాడడానికి కావలసినంత సరుకు ఈ సినిమాల్లో ఉంటుంది. సో, నో వర్రీస్!  😊

కట్ చేస్తే –

ఈ ప్రాజెక్ట్‌లో మాతోపాటు టీమ్‌లో పనిచేయాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్స్ – మీ పూర్తి బయోడేటా, (ఉంటే) షో రీల్స్, 3 లేటెస్ట్ ఫోటోలు (క్లోజ్అప్, ప్రొఫైల్, ఫుల్) ఈమెయిల్ చేయొచ్చు. ఆడిషన్/ఇంటర్వ్యూ కోసం ఎవరినయినా ఎన్నిక చేసుకుంటే ఆ ఆర్టిస్ట్‌కు, ఆ టెక్నీషియన్‌కు పర్సనల్‌గా తెలుపుతాం. దీని మీద ఎలాంటి మెసేజ్‌లు, కాల్స్ దయచేసి చేయవద్దు. Email: mchimmani10x@gmail.com

మా ప్రాజెక్ట్‌లో అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా ప్రొడక్షన్ వైపు మాతో కొలాబొరేట్ అవ్వాలనుకొనే ఇన్వెస్టర్స్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీ టైమ్, నంబర్ మాకు వాట్సాప్ చేయండి. డైరెక్ట్‌గా మేమే మీకు కాల్ చేస్తాం. Whatsapp: +91 9989578125

“Cinema is a matter of what's in the frame and what's out”
― Martin Scorsese

కథామనోహరమ్

నేను స్టుడెంట్‌గా ఉన్నప్పుడు ఆంధ్రభూమి వీక్లీలో అప్పటి ఎడిటర్ సికరాజు గారు "సింగిల్ పేజీ కథలు" అని ఒక శీర్షిక పెట్టారు. అంటే - ఒకే ఒక్క పేజీలో కథ రాసి పంపించాలి. నచ్చితే ప్రచురిస్తారు. 

ఆ ప్రకటన చూసి, అప్పటికప్పుడు "టేకిట్ ఈజీ" అన్న టైటిల్‌తో నేనొక కథ రాసి పంపించాను. అది ఆంధ్రభూమిలో అచ్చయ్యింది.

150 రూపాయల పారితోషికం అప్పుడు నేనుంటున్న ఓయూ - ఏ హాస్టల్, రూం నంబర్ 6 కు నాకు మనీయార్డర్ ద్వారా వచ్చింది.   

అదే నేను రాసిన మొదటి కథ. 

తర్వాత చాలా రాశాను. అన్నీ అచ్చయ్యాయి. దాదాపు అన్ని దిన, వార, మాస పత్రికల్లో నా కథలు అచ్చయ్యాయి. 

ఎక్కువగా ఆంధ్రభూమి, స్వాతి వీక్లీలకు, విపులకు పంపేవాన్ని. వాళ్ళు మాత్రమే తప్పకుండా పారితోషికం పంపిస్తారని నాకు తెలుసు కాబట్టి. పాకెట్ మనీకి పనికొస్తాయి కాబట్టి. 

విపుల మంత్లీ, ఆంధ్రజ్యోతి వీక్లీల్లో నా రష్యన్ అనువాద కథలు కూడా అచ్చయ్యాయి. 

ఆంధ్రభూమి వీక్లీలోనే ఒక చెయిన్ సీరియల్ రాసే అవకాశాన్ని కూడా పిలిచి నాకు ఇచ్చారు సికరాజు గారు. ఆ సీరియల్ పేరు "రెప్పచాటు స్వప్నం".

మాట్రిమోనియల్‌ని మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేట్ బిజినెస్ స్థాయికి తీసుకెళ్ళగలిగిన ఏకైక బిజినెస్ వుమన్ వనజారావు గారు కూడా ఆ చెయిన్ సీరియల్‌కు నాతోపాటు రాసిన కొందరు రైటర్స్‌లో ఒకరు కావడం విశేషం. 

ఆహ్వానం మాసపత్రికకు నేను రాసిన సీరియస్ కథల్లో ఒకటి, అప్పట్లో నాకు సీరియస్ వార్నింగ్స్‌ని ఇప్పించింది. అదొక అనుభవం. 

నేను రాసిన మొదటి సరసమైన కథ (ఆంధ్రభూమిలో 'సెంటర్ సెన్సేషన్' కథ), నా ఎంగేజ్‌మెంట్ అయిన మర్నాడే అచ్చయింది. ఎర్రమంజిల్‌ హైద్రాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ అయ్యాక, మర్నాడు ఎవరి ఊళ్లకు వారు వెళ్తున్న మా బంధువులంతా - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో, గౌలిగూడ బస్టాండ్‌లో ఆంధ్రభూమి వీక్లీ ఆ వారం కాపీలను తాజాగా కొనుక్కొని మరీ వెళ్లారు. రెండువైపులా బంధువులూ, మిత్రులూ అందరూ చదివారు.

ఆ కథలో నేను రాసిన శృంగారం చదివాక తప్పకుండా నా పెళ్ళి కాన్సిల్ అయిపోతుందనుకొన్నాను. కాని, అలా కాకపోవడం విచిత్రం. 

ఆ కథ పేరు "ధీరసమీరే".        

నేను రాసిన ఇంకెన్నో కథలు, సుదూరతీరాల నుంచి నాకిష్టమైన ఎందరో కొత్త మిత్రుల్ని, మిత్రురాళ్ళను పరిచయం చేశాయి. 

నేను ఆలిండియా రేడియో, కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు... ఒక వీక్లీ ప్రకటించిన హారర్ కథల పోటీలో బహుమతి పొందిన నా కథ ఒకటి చెన్నైలో ఉన్న ఒక పెద్ద ఫిలిం డైరెక్టర్ దృష్టిలో పడి, ఆ పత్రిక ఆఫీసుకి ఫోన్ చేసి, నా అడ్రెస్ కనుక్కొనేలా చేసింది. అలా నేను సినిమారంగానికి కనెక్ట్ అయ్యి, సినీ కథాచర్చల్లో పాల్గొనటానికీ, ఘోస్ట్ రైటర్ కావడానికీ, రైటర్ కావడానికీ, సినిమాల్లో నా సంపాదన ప్రారంభానికీ కారణమైంది. 

తర్వాత ఈ నేపథ్యంలోనే ఒక రచయితగా నంది అవార్డు సాధించడానికీ, ఫైనల్‌గా నేనొక రైటర్-డైరెక్టర్ అవడానికీ దారితీసింది. అయితే ఆ దారిలో వెళ్ళాల్సిన పధ్ధతిలో నేనిప్పటికీ వెళ్లలేకపోయాను. వెళ్లలేను కూడా. అది వేరే విషయం.     

కట్ చేస్తే - 

చాలా గ్యాప్ తర్వాత... చాలా యాక్సిడెంటల్‌గా... రాయాలని అనుకొనే, ఒకరాత్రి సింగిల్ సిట్టింగ్‌లో  "మిస్టర్ ఎక్స్" పేరుతో ఒక పెద్దకథ 'పాలపిట్ట' మాసపత్రిక కోసం ఆమధ్య (జూన్ 2020) రాశాను. అచ్చయింది.

మళ్ళీ షరా మామూలే. సంవత్సరమయ్యింది, ఇంతవరకూ ఏం రాయలేదు.       

నాకెంతో ఇష్టమైన ఈ హాబీని ఎందుకనో నేను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అలాగని నేను రాసినవన్నీ గొప్ప కథలని నేననుకోను. అయితే - ఆయా సందర్భాల్లో, అప్పటి నా ఆలోచనా స్థాయిని, నా మూడ్‌ను బట్టి రాయాలనుకున్న ప్రతిదీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అలాగే రాశాను.  అన్నీ అలాగే అచ్చయ్యాయి.

కొన్ని కథల్ని సరదాగా నా ఫ్రెండ్స్‌కు ముందే చెప్పి మరీ రాసేవాన్ని. అచ్చయ్యాక చూపించేవాన్ని. ఇప్పుడు అవన్నీ నాకే నచ్చకపోవచ్చు. కొన్ని సిల్లీగానూ అనిపించవచ్చు. కాని, ప్రతి కథకూ ఒక నేపథ్యం ఉంటుంది. ఒక విభిన్నమైన ఫ్రాగ్రెన్సీ ఉంటుంది.  

ఇంత మంచి హాబీని నేనెందుకు ఇంత అర్థరహితంగా నిర్లక్ష్యం చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. సమర్థించుకోడానికి వెతుక్కుంటే కారణాలు వెయ్యి కనిపిస్తాయి... 

కాని, అవేవీ నా లాజిక్‌కు నిలబడే కారణాలు కావు.  

If writers stopped writing about what happened to them, then there would be a lot of empty pages.
- Elaine Liner

Saturday 17 July 2021

ఒక అంతశ్శోధన

మన నిర్ణయాలనుబట్టే కొన్ని కలిసిరావడమో, కలిసిరాకపోవడమో జరుగుతుంది. ఇది నా వ్యక్తిగత నమ్మకం. చాలా సందర్భాల్లో నా అనుభవం కూడా. 

అలాగే - తలరాత, విధిరాత, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది .. వంటి మాటలను కూడా నేను నమ్మలేను. నమ్మను. మన కృషినిబట్టే ఫలితం ఉంటుందన్నది నేను గట్టిగా నమ్ముతాను. నా అనుభవం కూడా. 

అయితే - వీటన్నిటికి అతీతంగా, చాలా అరుదుగా, జీవితంలో కొన్ని ఊహించనివి కూడా జరుగుతుంటాయి. అపుడే అర్థమవుతుంది. సంథింగ్ ఇంకేదో అద్భుత శక్తి ఉందని!  

అప్పుడే బాగా ఆలోచనలో పడిపోతాం. నిజంగా ఆలోచిస్తాం.  

కట్ చేస్తే - 

పొద్దున లేవగానే మనకు కనిపించే సూర్యుడు, మనం పీల్చే గాలి, మన క్రియేటివిటీకి అందనన్ని అద్భుతాలతో ఎప్పటికప్పుడు మన చుట్టూ మనకు కొత్తగా కనిపించే ప్రకృతి... ఇవన్నీ నిజమే అయినప్పుడు, వీటన్నిటినీ సృష్టించిన ఆ అద్భుత శక్తి ఏదో కూడా నిజమే అని నా నమ్మకం. 

ఆ అద్భుత శక్తికే మనం దేవుడు-లేదా-దేవత అని పేరు పెట్టుకొని పిలుస్తున్నాం.  

ఈ అనంత విశ్వంలో ఉన్న ఎన్నో కోట్ల జీవరాశుల్లో, భూమ్మీది మనిషి కూడా ఒక జీవి అనుకుంటే... ఇన్ని కోట్లమంది మనుషుల్లో, ప్రతి ఒక్కరి మంచి చెడ్దల జమాఖర్చులు చూసుకొంటూ గడిపేంత లీజర్‌గా ఆ దేవుడు ఉండకపోవచ్చని నేననుకుంటాను. మన పాపపుణ్యాలనో, మన పూర్వజన్మ సుకృతాలనో దుష్కృతాలనో నేపథ్యంగా తీసుకొని, మనిషి జీవితంలో ఇన్ని బాధల్ని సృష్టించేంత శాడిస్టు కూడా కాదని నేను మరింత గట్టిగా నమ్ముతాను.

“పైవాడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది” అంటూ, దీనికి కూడా ఆ శక్తినే, ఆ దేవున్నే బాధ్యున్ని చేయడం అనేది హాస్యాస్పదమైన మూర్ఖత్వం. 

కాని, మన ఈ నమ్మకాలన్నిటికీ అతీతంగా కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ తప్పక చేసే ఉంటాడు దేవుడు అని కూడా అనుకోకతప్పదు. ఆయన ప్రోగ్రామింగ్‌ ప్రకారం కాకుండా మరో విధంగా మన జీవితం నడుస్తున్నప్పుడే మనం ఊహించని సంఘటనలు కొన్ని మన జీవితంలో జరుగుతాయి.  

అది మనకు బాగుంటే ఆ దారిలోనే నడవమనీ, అది మనల్ని బాధపెడితే మన నుంచి ఆయన ఆశించింది వేరనీ, మరింకేదో ప్రయోజనం మన జీవితానికుందనీ మనం అర్థం చేసుకోవాల్సిన రిమైండర్ అది. 

ఈగో వదిలేసి, దీన్ని ఫీలైన వాళ్ళు జీవితంలో సుఖంగా ఉంటారు. మిగిలినవాళ్ళు జీవిత పర్యంతం నానా సంఘర్షణలతోనే ముగిసిపోతారని నాకనిపిస్తుంది.   

సో, ఆయన చేయాలనుకొన్న పని ఆయన చేశాడు. మనం చేయాల్సింది మనం చేయాలి. అది కూడా అందంగా చేయాలి, ఆనందంగా వుండాలి. 

అప్పుడు మాత్రమే ఆయనకు... ఆ అద్భుతశక్తికి ఆనందంగా వుంటుంది. 

ఈమాత్రం అంతర్విశ్లేషణ చాలామందిలో యాభై దాటాక గాని రాకపోవడమన్నదే జీవితంలో అతి పెద్ద దుఖం.  

“Spirituality is more smiling, less worrying. More compassion, less judgment. More blessed, less stressed. More love, less hate.”
― Roy T. Bennett

Thursday 15 July 2021

Russian Connection

ప్రపంచపు మొట్టమొదటి కరోనా వాక్సీన్ 'Sputnik V' రిజిస్టరై బయటికి రాగానే, నేను అదే వేసుకోవాలనుకొన్నాను. కాని, మన దేశానికి అది వెంటనే రాలేదు. 

ఈలోగా - కోవీషీల్డ్, కోవాక్సీన్‌లు వ్చచాయి. అదా ఇదా అని నేను అనుకుంటూ, నా పనుల మీద అటూఇటూ తిరుగుతూ వాక్సినేషన్ విషయంలో కొంత ఆలస్యం చేశాను.

తర్వాత నాకు కరోనా రావటం, పోవటం... ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ టెన్షన్స్ కొన్ని... మొత్తం మీద ఆలస్యం బాగానే అయ్యింది. 

నా పనుల టెన్షన్స్‌లో ఉన్నప్పుడు మధ్యలో ఒకరిద్దరు నా శ్రేయోభిలాషులు "వాక్సీన్ వేయించుకున్నావా" అని అడిగినప్పుడు "వేయించుకున్నాను" అని అబద్ధం చెప్పాను. 

"ఇంకా వేయించుకోలేదా" అని వాళ్ళు 'హాశ్చర్యంగా' మొదలెట్టే క్లాసుల నుంచి ఆ పర్టిక్యులర్ సమయంలో తప్పించుకోవడం నా ఉద్దేశ్యం.  

అయితే - ఈ ఆలస్యమంతా జరిగింది చివరికి నేను స్పుత్నిక్ వాక్సీన్ వేసుకోవడానికే అని ఇవ్వాళ నాకర్థమయ్యింది. 

స్పుత్నిక్ ఇప్పుడు హైద్రాబాద్‌లో అందుబాటులో ఉంది. అనుకోకుండా ఇవ్వాళ మధ్యాహ్నం హాస్పిటల్‌కు వెళ్ళి ఆ పని కానిచ్చేశాను. 

వాక్సినేషన్ చేయించుకోవడంలో ఆలస్యం అయితే నిజంగానే అయ్యింది. కాని, నాకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వాక్సినేషన్‌కు ఇంత గ్యాప్ అవసరం కాబట్టి, టెక్నికల్‌గా సరైన సమయానికే నేను వాక్సినేషన్ చేయించుకున్నాననుకుంటున్నాను. 

సో... యూనివర్సిటీ రోజులనాటి నా మూడేళ్ళ రష్యన్ డిప్లొమా, నా రష్యన్ ఫ్రెండ్స్, రష్యన్ అనువాదాలు, అనుబంధాలు ఎట్సెట్రాల నేపథ్యంగా... నాకున్న రష్యన్ ఇంక్లినేషన్‌తో...  మొత్తానికి నేను కోరుకొన్న రష్యన్ వాక్సీన్ స్పుత్నిక్ 'ఫస్ట్ షాట్' అయిపోయింది. ఇంకో నెల రోజుల్లో రెండో షాట్ కూడా అయిపోతుంది.   

కట్ చేస్తే -     

త్వరలోనే చేతినిండా పనితో పూర్తిగా బిజీ అవ్వబోతున్నాను. వచ్చే 30 రోజుల్లోపలే, కరోనా లాక్‌డౌన్ తర్వాత నా మొదటి సినిమాకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఉంటాయి. ఆ వెంటనే షూటింగ్ కూడా ఉంటుంది.  

“All we can know is that we know nothing. And that's the height of human wisdom.”
― Leo Tolstoy

Tuesday 13 July 2021

ఎంతైనా వైజాగ్ అందమే వేరు!

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. 

ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. 

దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను. 

ఈ పని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటున్నాను. ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద కూడా వైజాగ్‌కే ఎక్కువసార్లు వెళ్లాల్సిరావడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. లేటెస్ట్‌గా మొన్న ఏప్రిల్‌లో కూడా వెళ్ళాను.  

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.  

తర్వాత చలం .. భీమ్‌లీ .. ఆ తర్వాత అరకు .. స్టీల్ ప్లాంట్ .. పోర్ట్ .. గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, అదే స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో మా టీమ్‌తో నేనున్న నాలుగు రోజులూ .. ఆర్కే బీచ్, అక్కడి కాఫీడే .. రిషికొండ బీచ్, అక్కడి రిసార్ట్స్ .. రియోబీచ్, నొవాటెల్ హోటళ్ళూ .. ఎయిర్‌పోర్టూ, బస్‌స్టాండూ .. లలితా జ్యువెల్లరీస్ దగ్గర్లో ఫుట్‌పాత్ మీద బొకేలమ్మే చిన్న షాపూ .. కొంచెం దూరంలో గాజువాకలోని సినిమా హాళ్ళూ .. గ్రీన్ యాపిల్ హోటల్ .. వైజాగ్ సిటీలోనూ, స్టీల్‌ప్లాంట్ చుట్టుపక్కలా వున్న నా ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులూ .. ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి. 

1987లో అనుకుంటాను, మా ఎమ్మే క్లాస్‌మేట్స్‌తో నేను మొట్టమొదటిసారిగా వైజాగ్ వెళ్ళాను. అదికూడా, ఒరిస్సాలోని కోణార్క్, భువనేశ్వర్‌ల నుంచి మా తిరుగు ప్రయాణంలో.  

సుమారు పదేళ్ళ క్రితం... నా మొదటి సినిమా షూటింగ్ కోసం కూడా, నా టీమ్‌తో ఓ నాలుగయిదు రోజులున్నాను వైజాగ్‌లో. కేవలం ఒక మంచి లొకేషన్‌గా తప్ప అప్పుడు కూడా వైజాగ్ అంటే మరీ అంత ప్రత్యేకమైన ఫీలింగేమీ లేదు నాకు. తర్వాత మరికొన్నిసార్లు వైజాగ్ వెళ్లాను గానీ, ఎప్పుడు కూడా వైజాగ్‌ను అంత పెద్ద స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు. 

గత మూడు నాలుగేళ్ళుగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా వైజాగ్ నాకు అత్యంత ఇష్టమైన విజిటింగ్ ప్లేస్ అయింది... 

పాండిచ్చేరి, గోవాలు వైజాగ్ తర్వాతే కదా అనిపించసాగింది. వాటి ప్రత్యేకతలు వాటికున్నా, 'వైజాగ్ అందమే వేరు' అని నేను పూర్తిగా ఫిక్స్ అయిపోయాను. 

గొప్ప గొప్ప రచయితలు, కవులకు, వారి రచనలకూ పుట్టిల్లుగా వైజాగ్ సాహితీ సాంస్కృతిక నేపథ్యం నాకు ముందే తెలుసు. అయితే - వైజాగ్ నన్ను ఇంత బాగా ఆకర్షించడానికి ఇదొక్కటే కారణం ఎంత మాత్రం కాదు. 

కొన్నిటికి కారణాలుండవు. లాజిక్కులుండవు. అలా జరిగిపోతాయంతే. 

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్‌లా అనిపిస్తుంది నాకు.

అసలేంటీ... ఒక ప్రదేశంపైన అంత ఈజీగా నిర్వచించలేని ఈ ప్రేమ .. కాదల్ .. ఇష్క్ .. మొహబ్బత్ .. ల్యుబోఫ్ .. లవ్... ?!  

లవ్ అనగానే కూడా నాకు ముందు గుర్తొచ్చేది వైజాగే. బాలచందర్ అపూర్వ సృష్టి 'మరోచరిత్ర' .. బాలు-స్వప్న-భీమిలి .. కమలహాసన్-సరిత-'పదహారేళ్ళకూ' పాట... 

ఐ థింక్... 

నా లవ్ కూడా అక్కడే ఉంది, వైజాగ్‌లో. 

వైజాగ్‌లో ఉన్న నా లవ్, నా ప్రేయసి, నా వాలెంటైన్ మరెవరో కాదు... సముద్రం.  

'కాని సముద్రం ఇంకా చాలా చోట్ల ఉంది కదా' అంటే, ఉండొచ్చు. ఇది వేరే. 

'అదెలా' అంటే చెప్పడానికి నాదగ్గర కారణాల్లేవు. 

ఏదో స్పిరిచువల్ కనెక్షన్. అంతే.  

It's not a question of 
being in love with 
some one or something. 
It's a question of being love. 

Friday 9 July 2021

అడవి - టాటూ - ఓ పాడ్‌కాస్ట్!

అనుకోకుండా నిన్న రాత్రి యూట్యూబ్‌లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అది పూర్తయిన వెంటనే యూట్యూబ్ సజెస్ట్ చేసిన తర్వాతి వీడియో కూడా చూశాను. అది డైరెక్టర్ వి వి వినాయక్ ఇంటర్వ్యూ.    

కొంతమంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కొంతమంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు ఆడియో రిలీజ్, ప్రి-రిలీజ్ ఫంక్షన్స్‌లా పరమ రొటీన్‌గా ఉంటాయి. రాత్రి నేను చూసిన రెండు ఇంటర్వ్యూలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 

వినాయక్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు బాగా చెప్పారు. అసలు ఆయన అంత బాగా, అంత క్లారిటీతో, అంత ఈజ్‌గా నవ్వుతూ అలా మాట్లాడ్డం నేనూహించలేదు. (సుమోల ఎఫెక్ట్!) 🙂

ఇంటర్వ్యూలో వినాయక్ పూరి గురించి ఒక మాటన్నారు:

"మళ్ళీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలి" అని.

ఈ ఒక్క మాట చాలనుకుంటాను... పూరి లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో ఎవరికివారే ఊహించుకోడానికి. 

బిందాస్...

కట్ చేస్తే -      

మొదటి ఇంటర్వ్యూలో పూరి తన చేతిమీదున్న చైనీస్ టాటూలు చూపిస్తూ, వాటి అర్థం చెప్పారు. ఒకటి - "లెవెంత్ మైల్" అనుకుంటాను. పది మైళ్ళు ఎలాగూ ఎవడైనా నడుస్తాడు. నువ్వు ఇంకో మైలు ఎక్కువ నడిస్తేనే ఏదైనా సాధిస్తావు అని దానర్థం. రెండోది - "నథింగ్ ఈజ్ పర్మనెంట్". జీవితంలో ఏదీ పర్మనెంట్ కాదు. అంటే, ఇప్పుడు నువ్వున్న సిచువేషన్, నువ్వు పడుతున్న కష్టాలు, ఇప్పటి నీ ఫెయిల్యూర్స్... ఏదీ శాశ్వతం కాదు, నీ టైమ్ మారుతుంది అని చెప్పటం. 

పట్టాయా వెళ్ళినప్పుడు వేయించుకున్న పచ్చబొట్లలో కూడా ఎంత పాజిటివ్ థింకింగ్ కదా అనిపించింది.  

అదే ఇంటర్వ్యూలో ఇంకో సందర్భంలో పూరి ఇంకో అద్భుతమైన విషయాన్ని చాలా సింపుల్‌గా చెప్పారు: 

"మనం ఎప్పుడూ అడవిలో ఉన్నాం అనుకోవాలి. అడవిలో ఏవైపు నుంచి ఏ జంతువు వచ్చి మనల్ని ఏ రూపంలో ఎటాక్ చేస్తుందో మనకు తెలీదు. అంత అలర్ట్‌గా ఉంటే తప్ప మనం ఈ భూమ్మీద బ్రతకలేం!" 

ఎంత నిజం! 

కట్ చేస్తే - 

"పూరి మ్యూజింగ్స్" పేరుతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక ఆడియో పాడ్‌కాస్ట్ చేస్తారని, అది ఇంత ఎఫెక్ట్ ఇస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. వాటిల్లో అన్నీ పచ్చి వాస్తవాలు. "దీనెమ్మ, నిజమే కదా" అని పిచ్చెక్కించే ఫిలాసఫీ!

కాని... ఒప్పుకోడానికి, మెచ్చుకోడానికి చాలా మందికి హిపోక్రసీ అడ్డొస్తుంది. అది వేరే విషయం.   

ఇప్పటివరకు పూరి అప్‌లోడ్ చేసిన సుమారు 200+ పాడ్‌కాస్టుల్లో దేనికదే ఒక జెమ్, ఒక బుల్లెట్. "ఫ్లాప్ మూవీస్", "లైఫ్ యాంథెమ్" వంటివి నిజంగా అల్టిమేట్.

చెప్పాలంటే -  పాడ్‌కాస్ట్‌లోని ఒక్కో ఎపిసోడ్ మీద ఒక్కో బ్లాగ్ రాయొచ్చు. 

అసలు పూరిలో ఒక ఆడియో పాడ్‌కాస్ట్ చెయ్యాలన్న ఈ ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చిందో గాని, ఇది నిజంగా ఒక బ్లాక్‌బస్టర్!  

Now... waiting eagerly for the next episode of the podcast... #PuriMusings.   

Tuesday 6 July 2021

సోషల్ మీడియా అంటే జస్ట్ సూక్తి ముక్తావళేనా?

సోషల్ మీడియాలో సగానికిపైగా కొటేషన్లు, సూక్తులే కనిపిస్తాయి. మిగిలిన సగం రాజకీయాలు, సినిమాలు, ఫ్యాన్స్ ట్రోల్స్, ఇతర స్టఫ్ ఉంటుంది.

వీటన్నిటి మధ్య - అరుదుగా - అక్కడక్కడా - నిజంగా మనల్ని ఇన్‌స్పైర్ చేసే విషయాలు, 'సాధ్యమే కదా' అనిపించే విజయాలు కనిపిస్తాయి. 

సెల్ఫ్ మోటివేషన్ కోసం అప్పుడప్పుడూ నేను కూడా నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్, నాకు ఆ సమయంలో, ఆ మూడ్‌లో తోచిన కొన్ని మాటలు ఏవేవో నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేస్తుంటాను. 

వీటన్నిటిలోనూ - నాకు తెలిసిన తేడా ఒక్కటే...

ఎడాలిసెంట్ వయస్సులో పెట్టే కొటేషన్స్, రాసే రాతలు వేరు. జీవితంలో ఎదుర్కొన్న, ఎంజాయ్ చేసిన చాలా అనుభవాల నేపథ్యంలో రాసే రాతలు, పోస్ట్ చేసే కొటేషన్స్ వేరు. 

ఇవన్నీ కూడా సమాజంలో మన చుట్టూ ఉన్న వివిధరకాల వ్యక్తుల, వ్యక్తిత్వాల నేపథ్యంలో ఉంటాయి. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలన్న రూలేమీ లేదు. 

అయితే - ఏది మనకు నిజంగా ఉపయోగపడుతుందన్నది మన విచక్షణా జ్ఞానం పైన, మన వ్యక్తిత్వం, మన జీవనశైలి పైన, జీవితాన్ని మనం చూసే దృక్పథం పైన ఆధారపడి ఉంటుంది. 

ఒడ్డున ఉండి సలహాలు, సూచనలు ఇవ్వడం... సామెతలు, కొటేషన్స్ పోస్ట్ చేయడం చాలా సులభం. కాని, దిగినప్పుడే తెలుస్తుంది అసలు లోతెంతో.

కట్ చేస్తే -      

సోషల్ మీడియాలో కొంత సెల్ఫ్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. మన వాయిస్‌ను, మన బ్రాండ్‌ను, మన వృత్తిపరమైన అవసరాలను ఒక స్థాయిలో ప్రచారం చేసుకొనే అవకాశం సోషల్ మీడియా మనకు ఉచితంగా ఇస్తుంది. 

అంతే కాదు - ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కేవలం ఈ సోషల్‌మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకొంటూ మిలియన్లు సంపాదించుకొంటున్నారు.    

ప్రొఫెషనల్‌గా నాకూ అవసరం కాబట్టి నేను కూడా కొన్నిసార్లు ఈ సెల్ఫ్ మార్కెటింగ్ అనబడే 'సొంత డబ్బా' పోస్టులు, ఫోటోలు పెడుతుంటాను. ఈ ఒక్క విషయంలో సోషల్ మీడియా అంటే నాకు ఎక్కడలేని అభిమానం, ప్రేమ, అన్నీ. 

సోషల్ మీడియా ఇంకో అద్భుతమైన గొప్పతనం ఏంటంటే - ఎప్పుడో దశాబ్దాల క్రితం మనకు దూరమైన మన స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను, మనకు అంతకుముందు ఎప్పుడూ పరిచయం లేని లైక్-మైండెడ్ మిత్రులనూ దగ్గర చేస్తుంది. ఫేస్‌బుక్ అయితే, మనం మర్చిపోయే అవకాశం ఉన్న ఎన్నో జ్ఞాపకాలను ప్రతిరోజూ మెమొరీస్ రూపంలో గుర్తుచేస్తుంది. ఈ విషయంలో కూడా సోషల్ మీడియా అంటే నాకు పిచ్చి ఇష్టం. 

పాజిటివ్ యాంగిల్‌లో చూడగలిగితే, ఉపయోగించుకోగలిగితే - సోషల్ మీడియా వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే దీన్ని మనం ఎలా ఉపయోగించుకొంటాం అన్నది నిజంగా మనకి మనం వేసుకోవాల్సిన ఒక మిలియన్ డాలర్ కొశ్చన్.   

“Think about what people are doing on Facebook today. They’re keeping up with their friends and family, but they’re also building an image and identity for themselves, which in a sense is their brand. They’re connecting with the audience that they want to connect to. It’s almost a disadvantage if you’re not on it now.” --- Mark Zuckerberg       

Friday 2 July 2021

Waiting sucks!

మార్చి చివర్లో, 'మే 6 నుంచి మంచి రోజులు' అన్నారు. అప్పటిదాకా ఆగుదాం అన్నారు. ఆ ఏముందిలే ఈ కొద్దిరోజులు అనుకున్నాము, నేనూ నా టీమ్. 

తర్వాత ఏప్రిల్ మూడోవారంలో అనుకుంటాను... సెకండ్ వేవ్  వచ్చి విశ్వరూపం చూపించింది. తర్వాత నాకు కోవిడ్ వచ్చింది. రాకూడనివాళ్లకు కూడా వచ్చింది. అందరికీ తగ్గేలోపు, అప్పటిదాకా మేం ఎదురుచూస్తూవున్న 'మే 6' ఎక్కడికో కొట్టుకు పోయింది.

ఇప్పుడు అందరం ఓకే. అన్నీ ఓకే. కాని మంచిరోజులు ఇప్పుడు లేవు!

ఆగస్టు 9 తర్వాత నుంచి ఏది చేసినా బాగుంటుందట. పట్టిందల్లా బంగారమేనట. సో, మేం ప్రారంభించబోయే పనులు కూడా బంగారం అవ్వాలని, ఆగస్టు 9 తర్వాత పెట్టే ముహూర్తం కోసం అందరం ఎదురుచూస్తున్నాం. 

కట్ చేస్తే -

వీటన్నిటితో సంబంధం లేకుండా - ఈ డేట్స్ చెబుతున్నవాళ్ళూ, వింటున్నవాళ్ళూ అందరం  తింటున్నాం, తిరుగుతున్నాం, మిగతా ఏ పనులూ ఆగటం లేదు. 


ఇంతకుముందులా గుడ్డిగా ఏదో ఒక్క సోర్స్ మీదే నమ్మకం పెట్టుకొని లేదు నా టీమ్. ఈ ఒక్క విషయంలో వారు నాకు అప్పుడప్పుడూ మంచి క్లాస్ పీకుతుంటారు. అది అవసరం కూడా.     

A story should have a beginning, a middle, and an end… but not necessarily in that order.
– Jean-Luc Godard 

నువ్వొక్కడివే ఏదైనా సాధించాలనుకొంటే...

ఓటీటీ నేపథ్యంలో ఒక రెండేళ్లు పూర్తిగా సినిమాలు చేద్దామనుకొంటున్నాను. 

ఇంతకుముందులా ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా, ఎప్పుడో ఒక సినిమా అని కాకుండా, ఒక రెండేళ్ళపాటు రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలని డిసైడయిపోయాను. ఓటీటీ కోసం కాబట్టి, ఈజీగా ఒక నాలుగైదు సినిమాలు చెయ్యొచ్చు. ఆల్రెడీ ప్రిప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. ఎక్కడికక్కడ టీమ్ మెంబర్స్ అంతా వారి వారి పనుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్స్‌లో బిజీగా ఉన్నారు.  

లాక్‌డౌన్‌లు బాగానే కష్టపెట్టాయి. మంచి జ్ఞానోదయాన్నిచ్చాయి కూడా. 

థాంక్స్ టు కరోనా... లాక్‌డౌన్ తర్వాత సినిమాలే చెయ్యి, ఇంకేం చెయ్యకు అని చాలా గట్టిగా చెప్పింది. అందుకే నేను కూడా కొంచెం గట్టిగానే ఈ డెసిషన్ తీసుకొన్నాను.

ప్యాషన్ కోసమని కాదు. ఫ్రీడం కోసం!  

కట్ చేస్తే - 

గ్రాంట్ కార్డన్ ఒక మాటన్నాడు... "నువ్వొక్కడివే ఏదైనా సాధించాలనుకొంటే టైమ్ పడుతుంది. కొలాబొరేట్ అవ్వు, వేగంగా సాధిస్తావు" అని. అయితే, ఇది మిగతా అన్ని ప్రొఫెషన్స్‌లో పనిచేస్తుందేమో గాని, 99.9% సినిమాల్లో కష్టం. చాలా అరుదుగా మాత్రమే కొంతమంది కనెక్ట్ అవుతారు. 

ఈ కొలాబొరేషన్స్, అసోసియేషన్స్ విషయంలో, నా టీమ్ విషయంలో... నాకు ఒక జీవితానికి సరిపడా అనుభవాలున్నాయి.  

చిన్న బడ్గెట్ సినిమాలు కాబట్టి - ఏదో విధంగా, ఏదో ఓ కోణంలో కొందరితో అసోసియేట్ అవ్వక తప్పదు. ఈసారి కూడా అవుతాను. కాని, టచ్ మి నాట్. అంతే. మరీ ఎక్కువగా పూసుకొని పీకలమీదకి మాత్రం తెచ్చుకోను. 

పూరి జగన్నాథ్‌కే తప్పలేదు. భారీ సినిమాలు చేస్తున్న సమయంలోనే భారీగా దెబ్బతిన్నాడు. నేనెంత!

ఆగస్టు 9 తర్వాత శ్రావణ మాసమట. చాలా విషయాల్లో కదలిక కోసం ఎదురుచూస్తున్నాను.  ఈలోపు ఇంకో వేవ్ ఏదీ రాదని చాలా నమ్మకంగా ఉన్నాను.  

I think, at the end of the day, filmmaking is a team, but eventually there's got to be a captain. 
- Ridley Scott