Sunday 18 July 2021

కథామనోహరమ్

నేను స్టుడెంట్‌గా ఉన్నప్పుడు ఆంధ్రభూమి వీక్లీలో అప్పటి ఎడిటర్ సికరాజు గారు "సింగిల్ పేజీ కథలు" అని ఒక శీర్షిక పెట్టారు. అంటే - ఒకే ఒక్క పేజీలో కథ రాసి పంపించాలి. నచ్చితే ప్రచురిస్తారు. 

ఆ ప్రకటన చూసి, అప్పటికప్పుడు "టేకిట్ ఈజీ" అన్న టైటిల్‌తో నేనొక కథ రాసి పంపించాను. అది ఆంధ్రభూమిలో అచ్చయ్యింది.

150 రూపాయల పారితోషికం అప్పుడు నేనుంటున్న ఓయూ - ఏ హాస్టల్, రూం నంబర్ 6 కు నాకు మనీయార్డర్ ద్వారా వచ్చింది.   

అదే నేను రాసిన మొదటి కథ. 

తర్వాత చాలా రాశాను. అన్నీ అచ్చయ్యాయి. దాదాపు అన్ని దిన, వార, మాస పత్రికల్లో నా కథలు అచ్చయ్యాయి. 

ఎక్కువగా ఆంధ్రభూమి, స్వాతి వీక్లీలకు, విపులకు పంపేవాన్ని. వాళ్ళు మాత్రమే తప్పకుండా పారితోషికం పంపిస్తారని నాకు తెలుసు కాబట్టి. పాకెట్ మనీకి పనికొస్తాయి కాబట్టి. 

విపుల మంత్లీ, ఆంధ్రజ్యోతి వీక్లీల్లో నా రష్యన్ అనువాద కథలు కూడా అచ్చయ్యాయి. 

ఆంధ్రభూమి వీక్లీలోనే ఒక చెయిన్ సీరియల్ రాసే అవకాశాన్ని కూడా పిలిచి నాకు ఇచ్చారు సికరాజు గారు. ఆ సీరియల్ పేరు "రెప్పచాటు స్వప్నం".

మాట్రిమోనియల్‌ని మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేట్ బిజినెస్ స్థాయికి తీసుకెళ్ళగలిగిన ఏకైక బిజినెస్ వుమన్ వనజారావు గారు కూడా ఆ చెయిన్ సీరియల్‌కు నాతోపాటు రాసిన కొందరు రైటర్స్‌లో ఒకరు కావడం విశేషం. 

ఆహ్వానం మాసపత్రికకు నేను రాసిన సీరియస్ కథల్లో ఒకటి, అప్పట్లో నాకు సీరియస్ వార్నింగ్స్‌ని ఇప్పించింది. అదొక అనుభవం. 

నేను రాసిన మొదటి సరసమైన కథ (ఆంధ్రభూమిలో 'సెంటర్ సెన్సేషన్' కథ), నా ఎంగేజ్‌మెంట్ అయిన మర్నాడే అచ్చయింది. ఎర్రమంజిల్‌ హైద్రాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ అయ్యాక, మర్నాడు ఎవరి ఊళ్లకు వారు వెళ్తున్న మా బంధువులంతా - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో, గౌలిగూడ బస్టాండ్‌లో ఆంధ్రభూమి వీక్లీ ఆ వారం కాపీలను తాజాగా కొనుక్కొని మరీ వెళ్లారు. రెండువైపులా బంధువులూ, మిత్రులూ అందరూ చదివారు.

ఆ కథలో నేను రాసిన శృంగారం చదివాక తప్పకుండా నా పెళ్ళి కాన్సిల్ అయిపోతుందనుకొన్నాను. కాని, అలా కాకపోవడం విచిత్రం. 

ఆ కథ పేరు "ధీరసమీరే".        

నేను రాసిన ఇంకెన్నో కథలు, సుదూరతీరాల నుంచి నాకిష్టమైన ఎందరో కొత్త మిత్రుల్ని, మిత్రురాళ్ళను పరిచయం చేశాయి. 

నేను ఆలిండియా రేడియో, కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు... ఒక వీక్లీ ప్రకటించిన హారర్ కథల పోటీలో బహుమతి పొందిన నా కథ ఒకటి చెన్నైలో ఉన్న ఒక పెద్ద ఫిలిం డైరెక్టర్ దృష్టిలో పడి, ఆ పత్రిక ఆఫీసుకి ఫోన్ చేసి, నా అడ్రెస్ కనుక్కొనేలా చేసింది. అలా నేను సినిమారంగానికి కనెక్ట్ అయ్యి, సినీ కథాచర్చల్లో పాల్గొనటానికీ, ఘోస్ట్ రైటర్ కావడానికీ, రైటర్ కావడానికీ, సినిమాల్లో నా సంపాదన ప్రారంభానికీ కారణమైంది. 

తర్వాత ఈ నేపథ్యంలోనే ఒక రచయితగా నంది అవార్డు సాధించడానికీ, ఫైనల్‌గా నేనొక రైటర్-డైరెక్టర్ అవడానికీ దారితీసింది. అయితే ఆ దారిలో వెళ్ళాల్సిన పధ్ధతిలో నేనిప్పటికీ వెళ్లలేకపోయాను. వెళ్లలేను కూడా. అది వేరే విషయం.     

కట్ చేస్తే - 

చాలా గ్యాప్ తర్వాత... చాలా యాక్సిడెంటల్‌గా... రాయాలని అనుకొనే, ఒకరాత్రి సింగిల్ సిట్టింగ్‌లో  "మిస్టర్ ఎక్స్" పేరుతో ఒక పెద్దకథ 'పాలపిట్ట' మాసపత్రిక కోసం ఆమధ్య (జూన్ 2020) రాశాను. అచ్చయింది.

మళ్ళీ షరా మామూలే. సంవత్సరమయ్యింది, ఇంతవరకూ ఏం రాయలేదు.       

నాకెంతో ఇష్టమైన ఈ హాబీని ఎందుకనో నేను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అలాగని నేను రాసినవన్నీ గొప్ప కథలని నేననుకోను. అయితే - ఆయా సందర్భాల్లో, అప్పటి నా ఆలోచనా స్థాయిని, నా మూడ్‌ను బట్టి రాయాలనుకున్న ప్రతిదీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అలాగే రాశాను.  అన్నీ అలాగే అచ్చయ్యాయి.

కొన్ని కథల్ని సరదాగా నా ఫ్రెండ్స్‌కు ముందే చెప్పి మరీ రాసేవాన్ని. అచ్చయ్యాక చూపించేవాన్ని. ఇప్పుడు అవన్నీ నాకే నచ్చకపోవచ్చు. కొన్ని సిల్లీగానూ అనిపించవచ్చు. కాని, ప్రతి కథకూ ఒక నేపథ్యం ఉంటుంది. ఒక విభిన్నమైన ఫ్రాగ్రెన్సీ ఉంటుంది.  

ఇంత మంచి హాబీని నేనెందుకు ఇంత అర్థరహితంగా నిర్లక్ష్యం చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. సమర్థించుకోడానికి వెతుక్కుంటే కారణాలు వెయ్యి కనిపిస్తాయి... 

కాని, అవేవీ నా లాజిక్‌కు నిలబడే కారణాలు కావు.  

If writers stopped writing about what happened to them, then there would be a lot of empty pages.
- Elaine Liner

2 comments:

 1. ధీరసమీరే కథను కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. సత్యనారాయణ గారు,
   It was in 1993... అప్పుడు డిజిటల్ కాపీల్లేవ్. ఇప్పుడు చేయాల్సి ఉంది. నా కథలు అచ్చయిన వీక్లీలు, ఇతర పత్రికలు నాదగ్గరున్నాయి. వాటిని స్కాన్ చేసి పెట్టినా, అంత క్లారిటీ ఉండకపోవచ్చు. చదవడానికి ఇబ్బంది అవుతుంది. So, I can't share it right immediately. But there's some idea to do something in next few months. మీ ఆసక్తికి ధన్యవాదాలు!

   Delete