Monday 28 September 2020

ఈ బ్లాగ్ ఇంకొన్నాళ్లేనా?

ఇప్పటికి ఎన్నోసార్లు బ్లాగింగ్ మానెయ్యాలనుకొన్నాను. కాని, అలా చెయ్యలేకపోయాను. 

కాని, ఇప్పుడు నేను పెట్టుకొన్న ఆన్‌లైన్ మ్యాగజైన్ పని చూస్తుంటే... అసలు ఈవైపు చూసే అవకాశమే దొరికేటట్టులేదు! 

కట్ చేస్తే - 

ఈ 10వ తేదీకి నా ఆన్‌లైన్ మ్యాగజైన్ ప్రారంభిస్తున్నాను. ఎవరు లాంచ్ చేసేదీ ఇంకా నిర్ణయించలేదు.

కాని, అక్టోబర్ 10 నాడు నా మ్యాగజైన్ లాంచ్ పక్కా.             

సరిగా 11 రోజులుంది. ఇంకా కంటెంట్ క్రియేషన్ ఒకవైపు, సినిమా పనులు ఇంకోవైపు, ఇతర 101 తలనొప్పులు ఇంకోవైపు... అన్నిటితో సర్కస్ బ్యాలెన్స్‌లా నడుస్తోంది ప్రస్తుతం లైఫ్. 

ఇంత బిజీలో, పని వత్తిడిలో, మ్యాగజైన్ లాంచ్ తర్వాత ఇలా బ్లాగ్ రాసుకోగలనా అన్నది పెద్ద ప్రశ్నే! అన్నీ మ్యాగజైన్లో రాసుకుంటాం కదా, అంత పెద్ద ప్లాట్‌ఫామ్ ఉంది కదా అనుకుంటున్నాను

కాని, అది వేరు, ఇది వేరు. 

ఎన్నోసార్లు ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు... నాకు సంబంధించినంతవరకు, బ్లాగింగ్ అనేది జస్ట్ ఏదో అలా రాసుకోవడం కాదు.

ఒక స్ట్రెస్ బస్టర్. ఒక థెరపీ. ఒక మెడిటేషన్. 

Blogging is my breath.

నా శ్వాసను నేనెలా మర్చిపోతానో చూడాలి...      

Sunday 27 September 2020

ఒక పుస్తకం, ఒక సినిమా

తెలుగు కావచ్చు, ఇంగ్లిష్ కావచ్చు, ఇంకేదైనా ఫారిన్ లాంగ్వేజ్ కావచ్చు... మీకు బాగా నచ్చిన ఒక వెరీ ఇన్‌స్పైరింగ్ పుస్తకాన్ని గురించి, సినిమా గురించి మీరు చెప్పగలరా?

సూటిగా, క్లుప్తంగా ఒక పేజీలో రాయగలరా? 

ఆ పుస్తకాన్ని చదవటం ద్వారా, ఆ సినిమాను చూడటం ద్వారా మీరనుభవించిన ఆనందం, మీరు ఫీలైన ఎడ్రినలిన్ అందరూ ఫీలవ్వాలన్న ఆసక్తి మీలో ఉంటే మీరా పని ఖచ్చితంగా చేయొచ్చు. చేయగలరు. 

కట్ చేస్తే - 

అతి త్వరలో నేనొక లైఫ్‌స్టైల్ మ్యాగజైన్‌ను, తెలుగులో, ఆన్‌లైన్లో ప్రారంభిస్తున్నాను. దానికోసం పై టాపిక్‌ల మీద రాయగలిగిన మిత్రులు, శ్రేయోభిలాషులు ఇన్‌బాక్స్‌లో నన్ను కాంటాక్ట్ చేయండి. 

కోవిడ్‌కు సమయంలో గాని, కోవిడ్‌కు ముందుగాని మీరు సందర్శించిన ఒక మర్చిపోలేని యాత్రాస్థలం గురించిన విశేషాలను అందంగా ఒక పేజీ రాయగలరా? వాటికి సంబంధించిన ఫోటోలు మీదగ్గరున్నాయా? 

పై మూడిట్లో ఏ ఒక్కటి మీరు రాయాలనుకొన్నా - ఇన్‌బాక్స్‌లో నన్ను వెంటనే కాంటాక్ట్ చేయండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. 

Wednesday 23 September 2020

లోన్ వుల్ఫ్ కొత్త ఉత్సాహం!

ఒక కొత్త ప్రాజెక్ట్... సినిమా కాదు... ఎవ్వరూ అనుకోనిదీ, అసలు నేనే ఎప్పుడూ అనుకోనిది... నిన్న రాత్రి వాష్‌రూమ్‌లో ఉండగా ఒక్క సెకన్లో అలా ఫ్లాష్ అయ్యింది.

బయటికివచ్చి వెంటనే పెన్నూ, పేపర్ తీసుకొని పని ప్రారంభించాను. రిసెర్చి, ప్లానింగ్, ఫండ్స్, టెక్నికల్ సపోర్ట్, షెడ్యూలు... అన్నీ జస్ట్ 24 గంటల్లో చకచకా అయిపోయాయి. 

ఇది కదా నా వర్కింగ్ స్టయిల్... ఇది కదా ఎప్పుడూ నేనుగా పనిచేసుకున్న పధ్ధతి! 

ఒక్కసారిగా చాలా బాధనిపించింది. ఎవరెవరినో నమ్మి, వాళ్ళు చెప్పే నానా చెత్తా విని, మోసపోయి, మాటలుపడి, అత్యంత దారుణంగా నష్టపోయి, మళ్లీ ఈ మహాశయులచేతనే మాటలు పడి... అసలేం జరిగిందో, ఎంత విలువైన సమయం జీవితంలో కోల్పోయానో... అదంతా గుర్తొచ్చి చాలా బాధేసింది. 

అడగ్గానే క్షణాల్లో నాకు లక్షల్లో సహాయం చేసినవాళ్లు కూడా నన్నెప్పుడూ ఒక్క మాట అనలేదు. వీళ్లకు నేను సహాయం చేసి, చాన్స్ ఇచ్చి, వీళ్లచేత మాటలు అనిపించుకోవడం కంటే సిగ్గుచేటు ఇంకోటిలేదు. 

పైగా వీళ్లేదో నాకు చాన్స్ ఇస్తున్నట్టు, వీళ్ల మెసేజ్‌ల కోసం, కాల్స్ కోసం నేను పదే పదే అడుక్కోవాలి. మీదనుంచి వీళ్లే నాకేదో బెనిఫిట్ చేస్తున్నట్టు పెద్ద బిల్దప్పులు! ... బయట ఎవరెవరితో ఇంకేం కోతలుకోస్తున్నారో!! 

మళ్ళీ నిమిషాల్లోనే సర్దుకున్నాను.

ఆ నెగెటివిటీ వద్దే వద్దు. చాలా పాఠాలు నేర్చుకున్నాను.

పరోక్షంగా వాళ్లంతా నాకు గురువులు. వాళ్లపట్ల ఇప్పటికీ నాకు అదే గౌరవం. 

యస్... నిజంగా ఎంతో జరిగినా, వాళ్లపట్ల నాకు ఎలాంటి వ్యతిరేకభావం లేదు. వాళ్ల వెర్షన్లు వాళ్లకుంటాయి. బయటికి ఏం మాట్లాడినా, ఏం చేసినా, జరిగిన వాస్తవాలు వాళ్ల హృదయానికి తెలుసు. దానికి మాస్క్ వెయ్యలేరు. అది వాళ్ళు రియలైజ్ అయితే చాలు. అవకపోయినా నాకు సమస్యలేదు. 

వారికెప్పుడూ జీవితంలో మంచే జరగాలనీ, ఇలాంటి సంఘటనలు మళ్లీ ఇంకొకరి దగ్గర పునరావృతం కావద్దనీ, కానియ్యరనీ... మనస్పూర్తిగా నమ్ముతున్నాను. 

కట్ చేస్తే - 

చాలా గ్యాప్ తర్వాత, ఇప్పుడు వచ్చే దసరాని ఈసారి నా కుటుంబంతో చాలా బాగా జరుపుకోవాలనుకొంటున్నాను. 

ఈ 25 అక్టోబర్ నుంచి ఇక అన్ని పనులూ ఒక్కసారిగా ముందుకు సాగేలా ప్లాన్ చేస్తున్నాను. అంత బాగా పనిచేస్తున్నాను. నా హ్యాండిక్యాప్ నన్ను ఎంత ఇబ్బందిపెడుతున్నా... ఎంత బాధపెడుతున్నా కూడా, ఇంకా బాగా పనిచేస్తున్నాను. చెయ్యాలి. ఇదేం గొప్ప విషయం కాదు. 

నేనెప్పుడూ అనుకున్నది అనుకున్నట్టే చేశాను. అనుకున్న ప్రతి ఒక్కటీ చేశాను. అవతలి వ్యక్తుల హామీలమీద, మాటల మీద నమ్మకం పెట్టిన ప్రతిసారీ మోసపోయాను, నష్టపోయాను, ఫెయిలయ్యాను. నేను బాధపడ్డాను. నాకుటుంబాన్ని బాధపెట్టాను. 

లోన్ వుల్ఫ్... ఒక్కన్ని చాలు. 

నిజంగా నాతో కలిసి పనిచేసేవాళ్లకు నేను ఎలాగూ చేయగలిగినంత చేస్తాను. ఎక్కువే సహాయం చేస్తాను. ఇంతకుముందు చేశాను కూడా.

పరోక్షంగా నైనా, ఇకమీదట నావల్ల ఒక్కరు కూడా బాధపడకూడదు. నెవర్. 

So much to do. So little time... 

Tuesday 22 September 2020

Scribbling My feelings

అప్పుడప్పుడూ
కొంచెం అతిగా స్పందిస్తుంటాను.
స్క్రిబ్లింగ్.
స్టఫ్.
నాన్సెన్స్.
వెరసి... పిచ్చిరాతలు.
వేదిక సోషల్ మీడియా... 

ఈమధ్యే ఒక ఆలోచన వచ్చింది.
అన్నిటినీ ఒకే  హాష్‌ట్యాగ్‌తో
ఒక్కదగ్గరికి తేవచ్చని.
ఎట్ లీస్ట్ ఇకనుంచయినా
వాటిని నేను మిస్ కాకుండా,
మళ్ళీ వెతుక్కొనే పనిలేకుండా.

ఇంకో నియమం పెట్టుకున్నాను...
ఏ చిన్న స్క్రిబ్లింగ్ చెక్కినా,
దాన్ని ఎక్కడ పోస్ట్ చేసినా,
హాష్ ట్యాగ్ పెట్టాలనీ, 
ప్లస్, దాన్ని వెంటనే
బ్లాగ్‌లో కూడా పోస్ట్ చెయ్యాలనీ. 

ఇది బెటర్.. అన్నీ ఒక్క దగ్గరే చూసుకోడానికి.
అవసరమైనప్పుడు మళ్లీ అలా ఫీలవ్వడానికి. 

కట్ చేస్తే - 

చెప్పలేమ్...
కరోనానుంచీ, కష్టాలనుంచీ 
కొంచెం ఊపిరిపీల్చుకొన్నాక,
నా అంతరంగంలో
పడిపడి ఆడుకొనే 
పదహారణాల పిచ్చిఊహల 
"కవితామనోహరమ్" కు
ఈ పోస్టే ఓ చిన్న ప్రొలోగ్ కావచ్చు.
- #మనోహర్‌చిమ్మని 

Monday 21 September 2020

హలో అండీ, హౌ ఆర్ యూ...

అరుణ్‌కుమార్ లో నాకు బాగా నచ్చిన మొదటి అంశం ఆయన పలకరింపు.

" హలో అండీ,  హౌ ఆర్ యూ...?"

అప్పుడు 2015 లో అంతే. అర్థ దశాబ్దం దాటినా, ఇప్పుడు 2020 లో కూడా అదే పధ్ధతి, అదే పలకరింపు.

అసలే కరోనా కాలం. ఏదో అత్యవసరం ఉంటే తప్ప, అసలు పలకరింపులనేవే లేకుండాపోయిన రోజులివి. అలాంటిది... ఎక్కడో యు కె నుంచి, అనవసరపు మాస్కులు లేని ఇలాంటి పలకరింపు ఈ రోజుల్లో దాదాపు మృగ్యం. నా దృష్టిలో చాలా గొప్ప విషయం.   

అదే ఇప్పుడు ఉన్నట్టుండి ఏదన్నా సినిమా ఎనౌన్స్ చేశామనుకోండి. మొత్తం మంది ఎక్కడలేని అభిమానం చూపిస్తూ ఫోన్లూ, వాట్సాపులూ, కలవటాలు... ఒక్కసారిగా ఊపందుకొంటాయి. 

అదొక వెరైటీ కేటగిరీ... వాళ్ల స్టయిలే వేరు. 

సినిమా ఉంటేనే పలకరింపు అనుకుంటే... అసలలాంటి పలకరింపులు, ఫ్రెండ్‌షిప్పులే శుధ్ధ దండగ. 

కట్ చేస్తే - 

అరుణ్‌కుమార్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇవ్వాళ పలకరించారు. చాలా హాప్పీగా ఫీలయ్యాను. 

మధ్యలో కూడా మా మధ్య మెయిల్స్, చిన్న చిన్న చాట్స్ బాగానే అయ్యాయి. తర్వాత ఎవరి బిజీలో వాళ్లం అలా కంటిన్యూ అయిపోయాం. 

ఇదిగో మళ్లీ ఇప్పుడే... కొంచెం గ్యాప్ తర్వాత అరుణ్‌కుమార్ పలకరింపు. అందుకే చాలా హాప్పీగా ఫీలయ్యాను. 

ఇద్దరం కలిసి, మేం అనుకున్న ఒక చిన్న బడ్జెట్‌లో ఒక మంచి ప్రాజెక్టు జస్ట్ 12 రోజుల రికార్డ్ టైమ్‌లో షూటింగ్ పూర్తిచేశాం. 

కనీసం ఒక నెల ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. ఆ డేట్ ఒక్కసారి కూడా మార్చకుండానే మా సినిమా రిలీజ్ చేశాం. అదేరోజు  విడుదలైన ఇంకో పెద్ద డైరెక్టర్ పెద్ద సినిమా కలెక్షన్ల కంటే మా కలెక్షన్లే ఎక్కువ అని ఫిలిం ట్రేడ్ గైడ్స్‌లో రికార్డ్ చూపించాం!

ఇన్నిరకాలుగా మేం గెలిచాము.

హిట్టా ఫట్టా పక్కనపెడితే, అరుణ్‌కుమార్ ప్రొడ్యూసర్‌గా, ఒక సినిమా నిర్మించి సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్‌చేయగలిగారు. 

ఒక ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌కు నిజంగా ఇది పెద్ద విజయమే. 

స్విమ్మింగ్‌పూల్ తర్వాత, అరుణ్‌కుమార్ ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు. 

ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా, ఒక ప్రొడ్యూసర్‌గా, సినిమాకే సంబంధించిన ఇంకోరంగంలో కూడా అరుణ్‌కుమార్ తప్పకుండా ఒక టాప్ పొజిషన్‌కు ఎదుగుతారు. ఆరోజు కూడా త్వరలోనే వస్తుంది. 

I wish him The Best always... 

Sunday 20 September 2020

మా మురుంకర్ సర్ కెలీడోస్కోప్!


మొన్న సెప్టెంబర్ 14 నాడు మా రష్యన్ ప్రొఫసర్ మురుంకర్ సర్ "కెలీడోస్కోప్" పుస్తకావిష్కరణ సభకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా నాకో కొత్త అనుభవం ఎదురైంది.

చివర్లో ఒక్క "వోట్ ఆఫ్ థాంక్స్" తప్ప, సమావేశం మొత్తం మరాఠీలోనే జరిగింది. సమావేశం వ్యాఖ్యాత, వక్తలు అందరూ మరాఠీలోనే మాట్లాడారు. 

నాకు మరాఠీ అస్సలు రాదు! 

అయినాసరే, వక్తలు మాట్లాడినదాంట్లో ఒక 50% నాకు కొద్దికొద్దిగా అర్థమైంది. ఇంకో 50% అస్సలు అర్థం కాలేదు. కాని, ఆ సమావేశాన్ని నేను 100% ఎంజాయ్ చేశాను!   

ఓయూలో నేను రష్యన్ డిప్లొమా చేస్తున్నప్పుడు, నాకూ ఇంకో స్టుడెంట్‌కు మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు మధ్యలో అటుగా వెళ్తున్న మా మురుంకర్ సర్ వచ్చారు. మా గొడవంతా విని, తన ఫినిషింగ్ టచ్ ఒకటి కూల్‌గా ఇచ్చేసి వెళ్ళిపోయారు. 

దాని సారాంశం ఏంటంటే - కొత్తగా ఒక భాష నేర్చుకొనేటప్పుడు, ముందు ఆ కొత్త భాషలోని తిట్లు, పొగడ్తలు నేర్చుకోవాలన్న కుతూహలం ఎవరికైనా సహజంగానే కలుగుతుందిట! "అలాంటి క్యూరియాసిటీ ఉండటంలో తప్పేం లేదు" అని చెప్పేసి వెళ్ళిపోయారు సర్. అప్పటి ఆ సీన్ నాకింకా గుర్తుంది. 


మరాఠీ నేర్చుకొనే అవసరం నాకెప్పుడూ రాలేదు. కాని, మరాఠీలో నాకు తెలిసిన ఒక మూడు మాటలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయి:   

1. నేను హెచ్ఎంటీలో మెషినిష్ట్‌గా పనిచేస్తున్నప్పుడు, ఔరంగాబాద్‌నుంచి వచ్చి చేరిన ముగ్గురు మరాఠీ మిత్రులుండేవారు. నేనెప్పుడయినా ఒక 5 నిమిషాలు కనిపించకపోతే, తిరిగి రాగానే "కుటె గేలా?" అని ఎంక్వయిరీ చేసేవాళ్ళు. సుమారు 30 ఏళ్లు గడిచినా, నాకా మాట ఇంకా గుర్తుంది. 

2. నా 7వ తరగతిలో అనుకుంటాను... తెలుగు నాన్‌డీటైల్ పుస్తకంలో మరాఠా యోధుడు తానాజీ మీద ఒక పాఠం ఉంది. ఆ పాఠం చివరి లైన్‌గా, తానాజీ గురించి మహారాజా శివాజీ చెప్పిన ఒక మాట ఉంటుంది: "గఢ్ ఆయా, పర్ సింహ్ గయా!" అని. ఇప్పటికీ నేను మర్చిపోలేని డైలాగ్ అది. 

3. ఓయూలోనే నేను పీజీ చేస్తున్నప్పుడు ఒక మరాఠీ అమ్మాయికి "నువ్వు అందంగా ఉన్నావు" అని మరాఠీలో చెప్పాలనుకున్నాను. దానికోసం, ఇంకో మరాఠీ అమ్మాయిని కనుక్కొని చెప్పాల్సి వచ్చింది: " తూ సుందర్ ఆహెస్!" అని.  

కట్ చేస్తే - 

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మా మురుంకర్ సర్ ఇన్విటేషన్ పంపగానే చాలా హాప్పీగా ఫీలయ్యాను. ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకొన్నాను. పుస్తకం మరాఠీలో అనగానే కొంచెం నిరుత్సాహపడ్డాను. వెంటనే చదవలేకపోతాను కదా అన్నది నా బాధ! 

సరే, ఎవరో ఒక కొత్త మరాఠీ ఫ్రెండ్‌ను వెతుక్కోవచ్చులే అని సరిపెట్టుకున్నాను. 

జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి హెచ్చార్డీ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేటప్పటికి కొంచెం ఆలస్యమైంది. మా మురుంకర్ సర్ మాట్లాడ్డం అప్పుడే ప్రారంభమైంది.   

"హమ్మయ్య... సర్ స్పీచ్ మిస్ కానందుకు సేఫ్!" అనుకున్నాను. 

సమావేశం పూర్తవ్వగానే ముందుకు వెళ్ళి జ్యోత్స్నా మేడమ్‌కు, మురుంకర్ సర్‌కు విష్‌చేసి బయటపడ్డాను.


నాకోసమే వైజాగ్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన ఫ్రెండ్ కూడా అప్పుడు నాతో ఉన్నారు. మేమిద్దరం వెళ్ళాల్సిన ఇంకో మీటింగ్‌కి టైమ్ ఎప్పుడో అయిపోయింది. 

తర్వాత సర్‌ని ఇంటిదగ్గర కలిసి పుస్తకం తీసుకొనే అవకాశం ఎలాగూ ఉంది కాబట్టి వెంటనే నేనూ నా ఫ్రెండూ అక్కడనుంచి బయటపడ్డాము. 

కట్ చేస్తే - 

అసలు నేనీ సమావేశానికి వెళ్ళడానికి మొదటి కారణం - నాకు మా మురుంకర్ సర్ మీద ఉన్న అభిమానం. పైగా, సర్ పుస్తకం ఆవిష్కరణ! ఎలా మిస్ అవుతాను? 

ఇక రెండో కారణం కూడా ఒకటి చాలా బలమైందే ఉంది... ఆ సమావేశానికి వస్తున్న ముఖ్య అథితుల్లో ఒకరు రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, ఐపీఎస్! 

ఆయనే సర్ పుస్తకం "కెలీడోస్కోప్" ఆవిష్కర్త. 

మహేశ్ భగవత్ గురించి నేను చాలా చదివాను, విన్నాను. సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలో అవుతుంటాను. అవుటాఫ్ ద బాక్స్... ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ అన్నీ నాకు చాలా ఇష్టం. 

మహేశ్ భగవత్ చేసిన ఎన్నో మంచిపనుల్లో ఒక్కదాని గురించి మాత్రం ఇక్కడ చెప్తాను: 

తను ఆదిలాబాద్ ఎస్పీగా చేస్తున్నప్పుడు ఒక లొంగిపోయిన నక్సలైట్ చేత, అతని కోరిక ప్రకారం, అతను మధ్యలో వదిలేసిన ఇంజినీరింగ్‌ని జె ఎన్ టి యూ లో పూర్తిచేయించారు భగవత్. ఇప్పుడా వ్యక్తి ఒక ప్రముఖ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.  

ఇది సినిమా కాదు. రియాలిటీ! రియల్లీ హాట్సాఫ్ టూ మహేశ్ భగవత్ జీ... 

అలాంటి మహేశ్ భగవత్ స్పీచ్ కూడా వినొచ్చు అని నా ఉద్దేశ్యం. 

మహేశ్ భగవత్ కూడా తన ఉపన్యాసం మరాఠీలోనే ఇచ్చారు. అయితే, నిజం చెప్పాలంటే, మొత్తం సమావేశంలో మాట్లాడిన అందరికంటే ఎక్కువ హుషారుగా మాట్లాడిందీ, అందర్నీ బాగా నవ్వించిందీ మహేశ్ భగవత్ గారే!


మురుంకర్ సర్ 'వెరీ యాక్టివ్' ఫేస్‌బుక్ యాక్టివిటీ గురించి, నా స్విమ్మింగ్‌పూల్ సినిమాలో సర్ యాక్టింగ్ గురించి, స్నేహ చికెన్ వంటల కాంపిటీషన్‌లో సర్ ప్రైజ్ కొట్టేయటం వంటి వాటన్నింటి గురించీ... అందర్నీ నవ్విస్తూ, హుషారెత్తిస్తూ చాలా విషయాల్ని మహేశ్ భగవత్ తన స్పీచ్‌లో చెప్పడం పెద్ద విశేషం. 

కట్ బ్యాక్ టూ మురుంకర్ సర్ - 

మురుంకర్ సర్ సీఫెల్ అనుభవాలు, జే ఎన్ యూ అనుభవాలు, రష్యా అనుభవాలు చదవాలని నాకు చాలా ఇష్టం. కాని సర్ పుస్తకం మరాఠీలో ఉండి కాబట్టి ఇప్పుడు నేనో ఇంటరెస్టింగ్ ఇంటర్‌ప్రీటర్‌ను హంట్ చేసి పట్టుకోవాలి. తప్పదు.   

అలాగే సర్ స్వయంగా "There is one chapter on you... We have translated the blog you wrote about me a couple of years back..." అని కూడా  చెప్పారు.

వాటే గ్రేట్ హానర్! సర్ కెలీడోస్కోప్‌లో నేనున్నాను. అంతకంటే ఏం కావాలి? ఫుల్ హాపీస్...

కాకపోతే, ఇప్పుడు వీలైనంత తొందర్లో సర్ దగ్గర్నుంచి బుక్ తెచ్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఒక మరాఠీ ఫ్రెండును పట్టుకోవాలి! 

ఇక... కెలీడోస్కోప్ పుస్తకం కంటెంట్‌ను మురుంకర్ సర్ డిక్టాఫోన్లో చెప్తుంటే రికార్డ్ చేసుకొని సురేంద్రపాటిల్ గారు రాసినట్టు తెలుసుకున్నాను. అయితే, వీరిద్దరి పరిచయ నేపథ్యం ఏంటన్నది మాత్రం నేను తెలుసుకోలేకపోయాను.

మా మురుంకర్ సర్ గురించి ఇంత శ్రమ తీసుకొని ఈ కెలీడోస్కోప్‌ని రూపొందించిన రైటర్ సురేంద్రపాటిల్ గారికి నా అభివందనాలు. 


ఇంకా... ఈ కెలీడోస్కోప్‌లో జ్యోత్స్న మేడమ్, వాళ్లబ్బాయి అమిత్ మురుంకర్, అమ్మాయి నీలిమ కులకర్ణి రాసిన చాప్టర్లు కూడా ఉన్నాయని తెలిసింది. అన్నీ ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఎదురుచూస్తున్నాను. 

కట్ చేస్తే - 

ఈ బ్లాగ్ ద్వారా మా మురుంకర్ సర్‌కి రెండు రిక్వెస్ట్‌లు: 

1. ఈ కెలీడోస్కోప్‌ను మీరు వెంటనే ఇంగ్లిష్‌లోకి అనువదింపజేసి పబ్లిష్ చేయాలి. మీ అనుభవాలు-జ్ఞాపకాలు నాలాంటివాళ్ళు ఇంకెందరో కూడా చదవాలి కాబట్టి.  

2. మీరు రోజూ ఒక 10 నిమిషాలు కెటాయించి, మీ "రాండమ్ మెమొరీస్"‌ను ఇంగ్లిష్‌లో ఒక 100 పదాల్లో రాస్తే చాలు. కావాలంటే దీనికోసం "స్పీచ్ టూ టెక్‌స్ట్" లాంటివి ఎన్నో ఉన్నాయి, మీరు టైప్ చేసే అవసరం కూడా లేకుండా! సంవత్సరం తిరిగేటప్పటికి అది 36500 పదాల పుస్తకం అవుతుంది. అప్పుడు పబ్లిష్ చెయ్యొచ్చు. ఒక సీరియల్ నంబర్ వేస్తూ రోజూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినా సరిపోతుంది.

రాండమ్‌గా సర్ షేర్ చేసుకొనే ఈ అనుభవాలు-జ్ఞాపకాలు ఏవయినా కావొచ్చు. పరోక్షంగానయినా, నాలాంటి అభిమానులకి అవి ఎంతో కొంత నేర్చుకొనే పాఠాలుగా ఉపయోగపడతాయన్నది నా ఉద్దేశ్యం. 

బికాజ్... ఇప్పటివరకు నేను చూసిన అతి కొద్దిమంది "100% కంప్లీట్ మెన్"లో సర్ ప్రథమ స్థానంలో ఉంటారు. 

Saturday 19 September 2020

ఒక్క కంగనా, 100 పునాదులు!


People’s perception that top film industry in India is Hindi film Industry is wrong. Telugu film industry has ascended itself to the top position and now catering films to pan India in multiple languages, many Hindi films being shot in Ramoji, Hyderabad.  

I applaud this announcement by @myogiadityanath ji. We need many reforms in the film industry first of all we need one big film industry called Indian film industry we are divided based on many factors, Hollywood films get advantage of this. One industry but many Film Cities.

Best of dubbed regional films don’t get pan India release but dubbed Hollywood films get mainstream release it’s alarming. Reason is the atrocious quality of most Hindi films and their monopoly over theatre screens also media created aspirational imagine for Hollywood films.

We need to save the industry from various terrorists:
1) Nepotism terrorism
2) Drug Mafia terrorism
3) Sexism terrorism
4) religious and regional terrorism
5) Foreign films terrorism
6) Piracy terrorism
7) Laborer’s exploitation terrorism
8) Talent exploitation terrorism
-- Kangana Ranaut Tweets

నాలుగే నాలుగు ట్వీట్స్‌తో సోకాల్డ్ బాలీవుడ్ బట్టలిప్పి బాంద్రా సెంటర్లో నిలబెట్టింది కంగనా రనౌత్.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే హిందీ ఫిలిం ఇండస్ట్రీ... లేదా సోకాల్డ్ బాలీవుడ్ ఒక్కటే కాదు అని గట్సీగా చెప్పింది కంగనా. దాన్ని మించిన పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దేశంలోనే టాప్ పొజిషన్‌కు ఎదిగింది అని చెప్పగలిగిన అవగాహన కూడా ఉంది కంగనాకు. 


చాలా కారణాలవల్ల మన భారతీయ చలనచిత్ర పరిశ్రమ విభజించబడింది. దీన్ని అడ్వాంటేజిగా తీసుకొన్న హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కోట్లు కొల్లగొడుతున్నాయి. మన దేశంలోని ఎన్నో గొప్ప గొప్ప రీజనల్ డబ్బింగ్ సినిమాలకు మాత్రం మనదగ్గరే దిక్కులేకుండాపోయింది అని చెప్పగలిగిన వ్యాపార పరిశీలన కూడా ఉంది కంగనాలో. 

పైరసీ, సెక్సిజమ్, డ్రగ్ మాఫియా, రీజనలిజమ్ వంటి... ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్న సుమారు 10 రకాల టెర్రరిజమ్‌ల గురించి ఒక లిస్టునే ట్వీట్ చెయ్యగలిగిన మొట్టమొదటి  దమ్మున్న ఫిమేల్ ఆర్టిస్టు కంగనా. 

కట్ చేస్తే - 

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న టౌన్ భాంబ్లా నుంచి ముంబై వచ్చిన కంగానా రనౌత్ 2006లో గ్యాంగ్‌స్టర్ సినిమాతో తెరంగేట్రం చేసింది.  ఇప్పటివరకు 33 సినిమాలు చేసింది. తమిళంలో ఒక సినిమా, 2009లో పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ఏక్ నిరంజన్ అని తెలుగులో కూడా ఒక సినిమా ప్రభాస్ పక్కన చేసింది కంగనా. 

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమా హీరోయిన్‌గా రికార్డు కంగనాకొక్కదానికి మాత్రమే హిందీ ఇండస్ట్రీలో ఉంది. క్వీన్ సినిమాకు డైలాగులు కూడా రాసి, బెస్ట్ డైలాగ్ రైటర్‌గా నామినేట్ కూడా చేయబడిన కంగనాలో ఒక మంచి రైటర్ కూడా ఉంది. చారిత్రాత్మక చిత్రం మణికర్ణికలో రాణీ లక్ష్మీబాయిగా నటించటమే కాదు, ఆ సినిమా కొంత భాగం డైరెక్షన్ కూడా చేసింది కంగనా. 

ఈ 14 ఏళ్ల సినీకెరీర్‌లో హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్-డైరెక్టర్ స్థాయికి కూడా కంగనా ఎదగడం అన్నది చిన్న విషయమేం కాదు. అదీ బాలీవుడ్‌లో! 

పద్మశ్రీ అవార్డుతో పాటు, 3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా గెల్చుకొన్న కంగానాను, జస్ట్ ఒక "అందాలు ఆరబోసే రొటీన్ గ్లామర్ డాల్" అంత ఈజీగా తీసుకోడానికిలేదు. ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె వృత్తిజీవితం కూడా అనేక చాలెంజ్‌లతో కొనసాగుతూ వస్తోంది. 


కరణ్‌జోహార్ లాంటి బాలీవుడ్ మొఘల్స్‌తో ఢీ అంటే ఎంత పెద్ద విషయమో కంగనాకు తెలియక కాదు. "తుఝే క్యా లగ్తాహై ఉధ్ధవ్ థాకరే..." అని సాక్షాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రినే ఏకవచనంలో సంభోధిస్తూ, సవాల్ విసురుతూ ఒక వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిందంటే ఆషామాషీ విషయం కాదు. కంగనా ఈ ఫైర్ వెనుక ఎంత దారుణమైన వేధింపులు ఉండి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 

"మణికర్ణిక ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్" పేరుతో ముంబైలోని శాంతాక్రూజ్ వెస్ట్‌లో కంగనా నిర్మించుకొన్న తన ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసు విలువ సుమారు 60 కోట్లు అంటే ఆమె "థింక్ బిగ్" స్థాయిని ఇట్టే ఊహించుకోవచ్చు. అంత విలువైన ఆఫీసు కట్టుకొనేటప్పుడు రూల్స్‌ని అతిక్రమిస్తూ తర్వాత కూలగొట్టుకొనేంత పిచ్చి నిర్ణయాలైతే ఎవ్వరూ తీసుకోరు. కంగానా ఎలాంటి రూల్స్ అతిక్రమించలేదని హైకోర్ట్ చెప్పేసింది కూడా.

సో, ఆమె ఆఫీస్ బిల్డింగ్‌ను కూల్చేయడం అనేది కంగనామీద ద్వేషంతో తప్ప మరొకటి కాదని చాలా స్పష్టంగా ప్రపంచం మొత్తానికి తెల్సిపోయింది. "అసలు నువ్వేమనుకుంటున్నావ్ ఉధ్ధవ్ థాకరే" అని కంగనా అగ్ని వర్షం కురిపించడంలో ఎలాంటి అతి గాని, అతిశయోక్తిగాని లేదు. ఉధ్ధవ్ ఈ విషయంలో నిజంగా చాలా చిల్లరగా ప్రవర్తించి మరింతగా తన పేరు పోగొట్టుకున్నాడు. 

అప్పుడు నోరెత్తని జయాబచ్చన్‌లూ, ఊర్మిలా మటోండ్కర్లూ ఇప్పుడు కంగానా బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా మీద ఫైర్ అవుతుంటే మాత్రం "బాలీవుడ్ ఇమేజ్ కాపాడ్డానికి" ముందుకురావడం నిజంగా సిగ్గుచేటు. 


ఇదంతా ఒకెత్తయితే... ఒక అద్భుత సపోర్టింగ్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్ చాలా చిల్లర మీమ్‌తో కంగనామీద ట్వీట్ చేయడం ఒక్కసారిగా అతని స్థాయిని అతనే పాతాళానికి తొక్కేసుకున్నట్టయింది. "If one film makes Kangana thinks that she is Rani Laxmi Bai... then..." అంటూ - దీపిక పద్మావత్ పాత్ర పోషించిందనీ, షారుఖ్ అశోకుని పాత్ర పోషించాడనీ, హృతిక్ అక్బర్ పాత్ర పోషించాడనీ, అజయ్ దేవ్‌గన్ భగత్‌సింగ్ పాత్ర పోషిచాడనీ, అమీర్‌ఖాన్ మంగల్ పాండే పాత్ర పోషించాడనీ... వాళ్లంతా ఎంత చెయ్యాలన్నది ప్రకాశ్‌రాజ్ పాయింట్. 

నిజానికి ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌లోనే జవాబు కూడా ఉంది. వాళ్లంతా ఏం చెయ్యలేకపోయారన్నది కళ్ళముందే కనిపిస్తున్న సత్యం. ఒక సీనియర్ ఆర్టిస్టుగా ప్రకాశ్‌రాజ్ చెయ్యాల్సిన కామెంట్ కాదిది. 

మరోవైపు... 60 కోట్లతో కట్టుకొన్న తన ప్రొడక్షన్ ఆఫీసులో కంగనా తన తర్వాతి భారీ చిత్రాలు ప్లాన్ చేస్తుంది, నిర్మిస్తుంది. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ చేత రేపు దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ కట్టించడానికి ఉత్ప్రేరకం అవుతుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న బాలీవుడ్ పునాదులు కదిలిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలోని రకరకాల టెర్రరిజమ్‌లను ఎండగడుతూనే ఉంటుంది. ఎన్నో ప్రతీకార చర్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. 

బికాజ్... కంగానా ఒక ఫైటర్. 

ఆ ఫైటర్ పోరాటం వెనుక తన 14 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది.

Thursday 17 September 2020

మనకు నచ్చిన నంబర్ వన్ సిటీలకే వెల్తే పోలా?!

"World’s No1 city to live in!" అని హైద్రాబాద్‌ను ఎగతాళి చేస్తూ రాత్రి ఒక ట్వీట్ చూశాను.

దానికో త్రెడ్ కూడా! 

కింద ఇంకో రెండు డజన్ల వత్తాసు కామెంట్లు. 

వాళ్లందరి బాధల్లా ఒక్కటే... "వరల్డ్ నంబర్ వన్ సిటీ" సెలబ్రేషన్స్ ఈ నీళ్లల్లో చేసుకుంటారా అంటూ.   

ఎవరైనా కావొచ్చు. వారు నాకు వ్యక్తిగతంగా తెలియదు. వ్యక్తిగతంగా వారిమీద నాకు ఎలాంటి ఇతర ఉద్దేశ్యాలు లేవు. ఉండవు కూడా. 

కట్ చేస్తే - 

న్యూయార్క్ లాంటి మహానగరాల్లో, ప్రపంచంలోని ఇంతకంటే నంబర్ 1 సిటీల్లో లెక్కకు మించిన భారీ వర్షాలు పడినప్పుడు ఆ నగరాలు అతలాకుతలం కాలేదా? ఆ ఫోటోలు, వీడియోలు, వార్తలు వీళ్లు చూళ్లేదా? వీళ్లకి కనిపించవా? 

ఎంతసేపూ అంతర్లీనంగా ఉన్న ఆ లోలోపలి భావనను, బాధను ఇంకా వదిలిపెట్టలేరా? 

హోటళ్లు, పబ్బులు, మాల్స్, షాపింగ్ సెంటర్స్, ఐమాక్స్‌లు... ఇవన్నీ ఓకే. రెండు గంటలు కష్టం వస్తే తట్టుకోలేరా? విషం చిమ్మాల్సిందేనా?!  

అంత కష్టంగా ఉన్నప్పుడు, ఈ నగరం నచ్చనప్పుడు, ఇంతకంటే గొప్పగా ఉన్న ఎన్నో మీకు తెలిసిన "నంబర్ ఏక్" నగరాలకు పోయి హాయిగా బ్రతకడం మంచిది కదా? 

ప్రభుత్వ పనితీరులోని లోపాలను దర్జాగా ఎత్తి చూపొచ్చు. నిర్మాణాత్మకంగా మీకు చేతనయినంత విమర్శించవచ్చు. మీలో ఇంకేవైనా పనికొచ్చే తెలివితేటలు ఉంటే సలహాలు కూడా ఇవ్వొచ్చు. తప్పులేదు. 

కాని, మనం బ్రతుకుతున్న నగరంపైన ఎగతాళిగా ట్వీట్లు పెట్టడం, కామెంట్లు పెట్టడం మంచి పధ్ధతి కాదు.

మళ్లీ తెల్లారితే మీరూ, నేనూ ఇదే హైద్రాబాద్ రోడ్లమీద మన పనులకు పోవాలి. పని చేసుకోవాలి, బ్రతకాలి. 

అన్నం పెడుతున్న హైద్రాబాద్‌ను ఎలా ఎగతాళి చేస్తారు?   

Wednesday 9 September 2020

క్రౌడ్‌ఫండింగ్ ఫర్ ఏటీటీ సినిమా

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన "క్రౌడ్ ఫండింగ్" అనే ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా  విషయం పూర్తిగా అర్థమైపోతుంది.

2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో తయారైన తొలి కన్నడ సినిమా.  50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు.

ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. హిందీలో , తెలుగులో  కూడా ఈ పధ్ధతిలో కొన్ని సినిమాల నిర్మాణం జరిగింది.

ఇప్పుడున్న లాక్‌డౌన్ నేపథ్యంలో, మీరు ఊహించనంత అతి తక్కువ బడ్జెట్లో కొత్తవారితో సినిమాలు నిర్మించి, ATT ల్లో రిలీజ్ చేయవచ్చు. మంచి లాభం కూడా గ్యారంటీ.

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించేవారికి క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి ఒక మంచి అవకాశం. ఎంత చిన్న పెట్టుబడితోనయినా మీరు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!

ఈ బిజినెస్ మోడెల్‌కు ఇదే సరైన సమయం అని ఆర్జీవీ సినిమాలమీద సినిమాలు నిర్మిస్తూ, ATT ల్లో రిలీజ్ చేస్తున్నది మీరు గమనించేవుంటారు. ఆర్జీవీ రిలీజ్ చేసిన ఒక సినిమాకు కొన్ని గంటల్లో 2.6 కోట్లు కలెక్ట్ అయ్యింది! దీన్నిబట్టి ఏటీటీలో సినిమా బిజినెస్ ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే క్రమంలో, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే నేను ప్లాన్ చేస్తున్న సీరీస్ ఆఫ్ మైక్రోబడ్జెట్ సినిమాల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకొంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు.

ఆసక్తి ఉన్నవారు, మీలోనే ఒక్కరు బాధ్యత తీసుకొని క్రౌడ్ ఫండింగ్ సక్సెస్ చేయవచ్చు. అనుభవం ఉండి, సమర్థులైన మీడియేటర్లకు కూడా ఇదో మంచి బిజినెస్ అవకాశం.

ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్ మిత్రులు/మీడియేటర్లు ఎలాంటి డీల్‌కైనా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు:  WhatsApp: +91 9989578125, Email: mchimmani10x@gmail.com 

Tuesday 8 September 2020

జ్ఞానోదయం 2.0

ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యక్తినో, పరిస్థితినో ఎదుర్కొన్నాక "అబ్బ... ఈ దెబ్బతో జ్ఞానోదయం అయ్యింది" అనుకొంటాము.

కాని అది అబద్దం.

ఆకాలంలో బుధ్ధుడికి బోధివృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయిందని చదివాను. మాహానుభావుడు... ఒక్కసారికే సర్వం ఒక అవగాహనకొచ్చింది ఆయనకు. కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అస్సలు కుదరదు.

"ఇంక ఇంతకు మించి మనం నేర్చుకొనేది ఏముంటుంది" అనుకుంటాం. కాని, దాని జేజమ్మలాంటి సిచువేషన్ కూడా వెంటనే వస్తుంది.

"ఈ వ్యక్తిని మించి మనల్ని బాధపెట్టేవాడు ఇంక లైఫ్‌లో రాడు... వచ్చే పరిస్థితికి మనం ఇంక చోటిచ్చే  ప్రసక్తే లేదు" అనుకొంటాం. అతని తాతలకు తాతలాంటోడొస్తాడు.

ఇవన్నీ అనుభవం మీదే తెలుస్తాయి.

కొంతమందికి మాత్రం ఈ జ్ఞానోదయం బై డిఫాల్ట్ అయి ఉంటుందనుకొంటాను. అదృష్టవంతులు. వీరి దరిదాపుల్లోకి ఏ నాన్సెన్స్ వ్యక్తులూ, పరిస్థితులూ రాలేవు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అంత గుడ్డిగా దేన్నీ నమ్మరు. క్షణాల్లో విషయాన్ని తేల్చేస్తారు. ఇలాంటివాళ్లంటే నాకు చాలా గౌరవం.

కొంచెం లిబరల్‌గా, మాస్‌గా చెప్పాలంటే - ఇదే లోకజ్ఞానం.

కరోనావైరస్ పుణ్యమా అని, సుమారు గత 6 నెలల లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా విషయాల్లో ఆత్మపరిశీలన చేసుకొని, బాగా ఆలోచించుకొనే అవకాశం అందరికీ దొరికింది.

లాక్‌డౌన్‌ను మించిన బోధివృక్షం లేదు. ఈసారిమాత్రం ఏదో బూడిదలోంచి లేచి దులుపుకొన్నట్టు కాకుండా... మస్తిష్కం నిజంగానే ఒక భారీ కుదుపుకు లోనయ్యింది. 

ఇది మార్పే కావచ్చు, మహాజ్ఞానోదయమే కావొచ్చు. ఖచ్చితంగా ఇంతకుముందులా మాత్రం ఉండటం జరగదు. వ్యక్తిగతంగా నేను నాలో కోరుకొంటున్న మార్పు అదే.

అయామ్ పాజిటివ్...

ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. ఎందుకంటే, ఇంతకుముందు నేను చాలా బలహీనున్ని.  

మనోహర్ చిమ్మని గురించి


మనోహర్ చిమ్మని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలోనూ, లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్సెస్‌లోనూ  పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పీజీ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. జర్నలిజం, అడ్వర్టయిజింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమా చేశారు. రష్యన్ భాషలో మూడేళ్ల అడ్వాన్స్‌డ్ డిప్లొమా చేశారు. 

మనోహర్ చిమ్మని పేరుతోనూ, వివిధ కలం పేర్లతోనూ వీరు రాసిన వ్యాసాలు, ఫీచర్లు, కథలు, సీరియల్స్ మొదలైనవి దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో అచ్చయ్యాయి. రేడియోలో కూడా ప్రసారం అయ్యాయి.  రష్యన్ భాష నుంచి నేరుగా తెలుగులోకి అనువదించిన వీరి అనువాద కథలు కూడా పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

మనోహర్ చిమ్మని రాసిన “ఆధునిక జర్నలిజం” పుస్తకం కాకతీయ యూనివర్సిటీలో పీజీ స్థాయిలో రికమెండెడ్ బుక్స్ లిస్ట్‌లో ఉంది.  వీరు రాసిన "సినిమాస్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం 'సినిమారంగంలో ఉత్తమ పుస్తకం'గా నంది అవార్డు గెల్చుకొంది. 

గతంలో  - హెచ్ ఎం టి, నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో వంటి మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సుమారు పదిహేనేళ్లపాటు పనిచేశారు మనోహర్ చిమ్మని. ఫిలిం డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్‌లతోపాటు - ఫ్రీలాన్స్ రైటింగ్, యాడ్ ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ వీడియో మేకింగ్, బ్లాగింగ్, సోషల్‌మీడియా ప్రమోషన్... వీరి ఇతర ప్రొఫెషనల్ ఆసక్తులు.

దర్శకరచయితగా మనోహర్ చిమ్మని ఇప్పటివరకు కల, అలా, వెల్‌కమ్, స్విమ్మింగ్‌పూల్... అని నాలుగు సినిమాలు చేశారు. ప్రస్తుతం రిస్క్-ఫ్రీ బిజినెస్ మోడెల్‌లో, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే, ఒక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేసి, ఆ సినిమాల ప్రిప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు మనోహర్ చిమ్మని. 

email: mchimmani10x@gmail.com
WhatsApp: +91 9989578125


ఏటీటీ ఫిలిం ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆహ్వానం!

సినిమా ప్యూర్‌లీ ఒక బిగ్  బిజినెస్.
దాని బేస్ క్రియేటివిటీ కావచ్చు.
కాని, టార్గెట్ మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే!

తెలుగు సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. చూస్తుండగానే 30 కోట్ల నుంచి 100 కోట్లకు, 300 కోట్ల నుంచి 1000 కోట్లను అందుకొనే దాకా వెళ్ళింది తెలుగు సినిమా బిజెనెస్! 

కట్ చేస్తే -

కరోనావైరస్ దెబ్బకు సినిమా బిజినెస్ చిన్నబోయింది. చిన్నబోవడం కూడా కాదు, పూర్తిగా చిన్నదైపోయింది!

దాదాపు 6నెలలనుంచి థియేటర్స్ లేవు, సినిమా షూటింగ్స్ లేవు. షూటింగ్స్ కోసం ప్రభుత్వాల వెంటపడి పర్మిషన్ తీసుకున్నారు. కాని, షూటింగ్ చెయ్యాలంటే వణికిపోతున్నారు స్టార్స్. కొన్ని నిబంధనలకు లోబడి, థియేటర్స్ కూడా తెరవడానికి ఓకే అనిపించుకొన్నారు. కాని, ఓపెన్ చెయ్యాలంటే 101 టెన్షన్స్. ఓపెన్ చేసినా అంత ఈజీ కాదు. ప్రేక్షకులు ఇంతకుముందులా థియేటర్లకు రారు. 

ఈ నేపథ్యంలో - అంతకు ముందటి  OTT ప్లాట్‌ఫామ్సే ఇప్పుడొక చిన్న ట్విస్ట్‌తో  ATT లయిపోయాయి. ATT లంటే  Any Time Theater లన్నమాట! "Pay Per View" పధ్ధతిలో పాపులర్ అయిపోయిన ఈ ఏటీటీ ల్లో  ఇప్పుడు వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్క సినిమా 10 భాషల్లో కూడా రిలీజవుతోంది! కేవలం గంటల్లో లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు!!

ఇవన్నీ మైక్రో బడ్జెట్ సినిమాలు. వందల కోట్లు, స్టార్స్ అక్కర్లేదు. చిన్న బడ్జెట్, కొత్త టాలెంట్ చాలు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం గ్యారంటీ.

"శ్రేయాస్ ఈటీ" అని గూగుల్లో కొట్టండి. శ్రేయాస్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ కూడా చూడండి. యూట్యూబ్‌లో ఉంటుంది. మొత్తం బిజినెస్ అర్థమైపోతుంది.  ఇలాంటి ఏటీటీలు ఇంకొన్ని రావడానికి లైన్లో ఉన్నాయి.

అందరూ హాట్ సినిమాలనే తీయాలన్న రూలేంలేదు. క్లాసిక్ కథలకు కూడా కొద్దిగా రొమాంటిక్ టచ్ ఇచ్చి హాటెస్ట్‌గా  కూడా తీయొచ్చు. ఆడియన్స్‌ను అంతకంటే ఎక్కువగా ఆకట్టుకోవచ్చు. ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఇంకెన్నో జోనర్స్‌లో కూడా సినిమాలు తీయొచ్చు. క్రియేటివిటీకి, బిజినెస్‌కు ఆకాశమే హద్దు.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు. మంచి రిస్క్ ఫ్రీ బిజినెస్ మోడల్ కూడా!

ఈ బిజినెస్ మోడల్‌లో ఒక్క డబ్బే కాదు, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా!
దటీజ్ న్యూ బిగ్ బిజినెస్!!

ఇంకో 3 నెలల తర్వాత థియేటర్స్ పూర్తిస్థాయిలో  తెరచినా ఈ ATT/OTTల హవా ఏమాత్రం తగ్గిపోదు. ప్రేక్షకుల జీవనశైలి, ఆలోచనా విధానం లాక్‌డౌన్ తర్వాత పూర్తిగా మారిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 

అన్ని వ్యాపారాలు మూలబడిపోయిన ఈ సమయంలో, ఒక అద్భుతమైన బిజినెస్ మాడల్ ఇది. కేవలం ఏటీటీలో  రిలీజ్ కోసమే, ఒక సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను నేను ప్లాన్ చేసి, పని ప్రారంభించాను.

ఈవైపు నిజంగా, సీరియస్‌గా ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ మాత్రమే నన్ను వెంటనే సంప్రదించొచ్చు.

కలిసి పనిచేద్దాం! కలిసి ఎదుగుదాం!!

మనోహర్ చిమ్మని 

email: mchimmani10x@gmail.com
WhatsApp: +91 9989578125Saturday 5 September 2020

"గ్లామర్" e-book ఫ్రీగా ఎందుకు? ఎవరికోసం?

ఈ e-book కేవలం సినిమాల్లోకి రావాలనుకొనే ఔత్సాహికులకు మాత్రమే. ఏమైనా సరే, సినిమాల్లోకి దూకాల్సిందే అనుకొనే "గో గెటిట్" టైప్ రెనగేడ్స్‌కు మాత్రమే. 

కట్ చేస్తే -

సినిమా ఫీల్డులో అవకాశం దొరకటమే చాలా చాలా కష్టం. ఇక డబ్బులు రావటం అనేది... మీరు ఏదో ఒక స్థాయిలో గుర్తింపబడి నిలదొక్కుకొనేవరకు దాదాపు జీరో. 

ఇది చాలామంది కొత్తవాళ్లకు తెలియని విషయం.

సినిమాలో చాన్స్ దొరికితే చాలు, లక్షల్లో డబ్బు వస్తుంది అనుకొంటారు. నిజానికి చాలా సందర్భాల్లో అలాంటి చిన్న చాన్స్ దొరకడానికే చాలా డబ్బు ఖర్చుపెట్టుకోవాల్సి ఉంటుంది. హీరో స్థాయి పాత్రలకయితే బడ్జెట్‌లో కొంతభాగం పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 

ఇది కూడా చాలామంది కొత్తవాళ్లకు తెలియని విషయం.

సినిమాలో చాన్స్ దొరకగ్గానే సరిపోదు. అది హిట్ కావాలి. మీరు గుర్తింపబడాలి. అప్పుడుమాత్రమే మీకు వేరే సినిమాల్లో మళ్లీ అవకాశాలొస్తాయి. లేదంటే, బ్యాక్ టూ సేమ్ పొజిషన్!

మళ్ళీ మొదటినుంచి "ఒక్క చాన్స్" కోసం  వెతుక్కోవాల్సిందే. 

సాధారణంగా పెద్ద బ్యానర్స్ కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వవు. చిన్న బడ్జెట్‌ సినిమా నిర్మాతలు, దర్శకులు మాత్రమే కొత్తవాళ్లను తీసుకుంటారు. వాళ్లకున్న బడ్జెట్ పరిమితుల్లో కొత్త ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ వాస్తవాన్ని కొత్తవాళ్లు గుర్తించకుండా, మరోవిధంగా అనుకుంటారు: "మాతో పనిచేయించుకుంటున్నారు, కాని, డబ్బులివ్వట్లేదు" అని!


ఇంకొందరు కొత్తవాళ్లు అనే మాటలు మరీ జోక్‌గా, చైల్డిష్‌గా ఉంటాయి: "నాకు డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు సార్, ఫ్రీగా చేస్తాను మీకు... చాన్స్ ఇవ్వండి చాలు" అని!!

ఇక దీన్ని బట్టి మీరే బాగా అర్థంచేసుకోవచ్చు. వాస్తవానికి దూరంగా ఇలా ఆలోచించేవాళ్లకు అసలు చాన్స్ ఎప్పటికైనా వస్తుందా?! 

వీళ్లంతా చదువుకున్నవాళ్ళు… ఫీల్డుతో అసలు సంబంధంలేనివాళ్ళు. కాని, ఫీల్డులో ఉన్నవాళ్లకంటే ఎక్కువ విషయాలు చెప్తారు ఫీల్డు గురించి!  

ఫీల్డుతో అంతో ఇంతో టచ్‌లో  ఉన్నవాళ్లకే జెర్క్ ఇచ్చేలా ఉంటాయి వీళ్ల మాటలు. 

"ఫీల్డులో నేను లేను... నేనే గాని ఉంటే చూపించేవాన్ని అసలు సినిమా అంటే ఎలా ఉండాలో!"

ఈరేంజ్‌లో ఉంటాయి వీళ్ల మాటలు.

అసలు దిగితే కదా తెలిసేది?


కొంతమంది ఎలాగో దిగిపోతారు.
బొమ్మ కనిపిస్తుంది.
నానా కష్టాలు పడతారు.
సగం జీవితం సంకనాకిపోతుంది.
కొంతమంది విషయంలో మొత్తం పోతుంది. 

ఫీల్డు బయట ఉండి, ఫీల్డు గురించి ఏదేదో ఊహించుకొని, ఒక ప్లానింగ్ లేకుండా వచ్చేసి ఇబ్బందిపడే కొత్తవాళ్లు, ముందు ఫీల్డు గురించి కొన్నయినా బేసిక్స్ తెలుసుకోవడం అవసరం. 

కట్ చేస్తే -

ఫిలిం ఇండస్ట్రీ గురించి, ఫిలిం మేకింగ్ గురించీ... ఫీల్డులో ఉన్నవాళ్లకంటే, బయటివాళ్లే ఎక్కువగా కథలు కథలుగా చెప్పే రోజులివి. 

ఇండస్ట్రీలోకి రావాలనుకొనే కొత్తవాళ్ళు ఇలాంటివాటి ప్రభావాలకు పడిపోకూడదు. మిస్‌గైడ్ కాకూడదు. అవగాహనాలోపంతో ఇండస్ట్రీలోకొచ్చి అనవసరంగా ఇబ్బందులు పడకూడదు. డబ్బూ, సమయం వృధా చేసుకోకూడదు. 

ఈ పాయింటాఫ్ వ్య్యూలోనే నేనొక చిన్న ఈబుక్ రాశాను.

చాలా క్లుప్తంగా, కావల్సినంత క్లారిటీతో, మరీ సీరియస్‌గా కాకుండా, ఒక లైటర్‌వీన్ టోన్‌లో రాశాను. 

సినిమా కష్టాలూ సుఖాలూ రెండూ ఈ e-book లో చెప్పాను. సరైన ప్లానింగ్‌తో ఎంటరైతే ఒక్క కష్టం కూడా మీ జోలికి రాదు. ఏముందిలే అని కేర్‌లెస్‌గా దూకేస్తే మాత్రం మీరూహించని కష్టాలు తప్పవు. 


పుస్తకాన్ని 20 నిమిషాల్లో చదివేసెయ్యొచ్చు.

తర్వాత ఒక 24 గంటలు సమయం తీసుకోండి. అప్పుడు ఆలోచించండి. ఫైనల్‌గా ఒక నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం ఏదైనా సరే, మీరు తప్పక గెలుస్తారు. 

ఈ FREE e-book కేవలం సినిమాల్లోకి రావాలనుకొనే ఔత్సాహికులకు మాత్రమే. ఏమైనా సరే, సినిమాల్లోకి దూకాల్సిందే అనుకొనే "గో గెటిట్" టైప్ రెనగేడ్స్‌కు మాత్రమే. 

పుస్తకం పేరు...

గ్లామర్ -
సినీఫీల్డులోకి ఎందుకు వెళ్లకూడదు?
ఎందుకు వెళ్ళితీరాలి? 

Price: FREE

ఈ FREE e-book కావాలనుకొనే ఔత్సాహికులు - మీ పూర్తిపేరు, ఊరు తెలుపుతూ నాకు ఈమెయిల్ లేదా వాట్సాప్ చెయ్యండి. 24 గంటల్లో నేనే స్వయంగా మీకు ఈ ఫ్రీ ఈబుక్‌ను పంపిస్తాను.  

ఆల్ ద బెస్ట్.

My email: mchimmani10x@gmail.com
WhatsApp: +91 9989578125 

Thursday 3 September 2020

బ్లాగింగ్ నిజంగానే తగ్గిందా?


నేను ఫాలో అవుతున్న టిమ్ ఫెర్రిస్, జేమ్స్ ఆల్టుచర్ వంటి హార్డ్‌కోర్ బ్లాగర్ల విషయంలో అలాంటిదేం కనిపించలేదు నాకు. ఇలాంటి చాలామంది బ్లాగింగ్‌లో ఇంకా ఇంకా కొత్తపుంతలు తొక్కుతూ, ముందుకే దూసుకెళ్తున్నారు. 

తెలుగు బ్లాగుల విషయంలో నాకు తగినంత అవగాహన లేదు అని చెప్పుకోడానికి కొంత ఇబ్బందిగానే ఉన్నా, మాలిక ద్వారా అప్పుడపుడూ చూస్తూనే ఉన్నాను. చాలా మంది తెలుగు బ్లాగర్ల పోస్టులు దాదాపు రెగ్యులర్‌గా ఉంటున్నాయి.   

లైటర్వీన్/ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో ఎవరైనా ఒకటి రెండు తెలుగు బ్లాగులు నాకు సూచించగలరా? ... థాంక్స్ ఇన్ అడ్వాన్స్! 

కట్ చేస్తే -

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాక, సినిమారంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో, లాక్‌డౌన్‌లో ఇంకాస్త రిలీఫ్ వచ్చాక, టాప్ ప్రయారిటీలో వరుసగా సినిమాలు చేయాలనుకొంటున్నాను. అది కూడా కేవలం ఏటీటీలకే. 

ఇకనించీ నా బ్లాగులో సినిమాలకు సంబంధించిన పోస్టులు మరింత ఎక్కువగా ఉంటాయి. మధ్యలో అప్పుడప్పుడూ సెల్ఫ్ మోటివేషన్ కోసం కొన్ని పర్సనల్ డెవలప్‌మెంట్ పోస్టులు కూడా ఉండొచ్చు. 

ఆమధ్య ఒక యూట్యూబ్ టాక్‌షో కూడా ప్రారంభించాలని అనుకున్నాను కాని, వాయిదావేసుకున్నాను. 

చదివే అలవాటు మనలో పోకుండా ఉండాలన్నది నా కోరిక. రాయడం, చదవటంలో ఉన్న ఆనందం యూట్యూబుల్లో వీడియోలు చూస్తే నాకు రాదు. 

డిజిటల్‌గా ఎన్ని డెవలప్‌మెంట్స్ వచ్చినా... రాయటం, చదవటం, ఫిజికల్ పుస్తకాల ప్రచురణ/వాటికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని లేటెస్ట్ అంకెలు చెబుతున్నాయి. ఇదిలాగే కొనసాగుతుందని నా నమ్మకం.